Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Pdf పద్యభాగం 1st Poem చారుచర్య Questions and Answers Summary.
Inter 2nd Year Telugu చారుచర్య Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న1.
దంతధావన, స్నాన పుష్పధారణ పద్ధతులను వివరించండి.
జవాబు:
దంతధావన పద్ధతి :
తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఆలస్యం చేయకుండా పళ్ళు తోముకోవాలి. శ్రేష్ఠమైన, ఆరోగ్యకరమైన వనమూలికల పుల్లలతో (వేప, కానుగ మొదలైనవి) మౌనంగా ఉంటూ దంతధావనం ముగించాలి. చండ్ర, మర్రి, కానుగ, జిల్లేడు, వేప, మద్ది, జువ్వి వృక్షాల పుల్లలకు వగరు, చేదు, కారం రుచులు ఉంటాయి. వీటిని నీటితో తడిపి పళ్ళు తోముకోవడానికి ఉపయోగించాలి.
దంతధావనానికి (పళ్ళు తోముకోవడానికి) ఉపయోగించే వివిధ చెట్ల పుల్లల యొక్క విశిష్టతను తెలియజేశారు.
మద్ది పుల్ల : ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
మామిడి పుల్ల : ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.
మాదీఫలం పుల్ల సమస్త గ్రహపీడలను, కష్టాలను పోగొడుతుంది.
కానుగపుల్ల : విజయాలను (రణజయం) చేకూరుస్తుంది.
మారేడు పుల్ల : ధన లాభాన్ని ఇస్తుంది.
ఉత్తరేణి పుల్ల : జ్ఞాపకశక్తిని, అమితమైన తెలివితేటలను (ప్రజ్ఞను) పెంచుతుంది.
చండ్రపుల్ల : నోటి అరుచిని, శరీర రోగాలను హరిస్తుంది.
జువ్విపు : మాట్లాడే నేర్పును, అద్భుతమైన వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది.
జాజి, దానిమ్మ, దిరిసెన, గొడిసె మరియు ఊడుగ (అంకోల) చెట్ల పుల్లలతో దంతధావనం చేయడం వలన శ్రేష్ఠమైన సిరిసంపదలు లభించును. వావిలి చెట్టు పుల్లతో దంతధావనం చేయడం వల్ల రాత్రిపూట కీడును కలిగించే దుస్వప్నాలు (పీడకలలు) దరిచేరవు.
ప్రతిరోజు దంతధావనం చేయడం వలన నోటికి కమ్మని రుచి వస్తుంది. ఇది శరీరంలోని కఫ, పైత్య, దోషాలను హరిస్తుంది. వినికిడి నాడులు శుద్ధి చేయబడతాయి. కంటి చూపుకు ఎంతో మేలు కలుగుతుంది.
విశేషం :
కేవలం నోటి శుభ్రత కోసమే కాకుండా, మన ఐదు జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైన కళ్ళు, చెవులు మరియు మనసు యొక్క ఆరోగ్యానికి కూడా దంతధావనం పునాది వంటిది. శరీరానికి నూనె పట్టించి మర్దనా (అభ్యంగన స్నానం) చేసినప్పుడు, ఆ తర్వాత స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని (ఉష్ణవారి) ఉపయోగించడం, స్నానం చేసిన తరువాత తలజుట్టును చక్కగా ఆరబెట్టుకుని ముడివేసుకోవాలి. శరీరానికి తగిన సుగంధ ద్రవ్యాలను (కస్తూరి వంటివి) పూసుకుంటే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
సువాసన గల పూలను ధరించడం వలన ఎండవేడిమి తెలియదు. ఒంటికి పట్టిన చెమట దుర్వాసన తొలగిపోతుంది. మనస్సు తేలికపడి బుద్ధి వికసిస్తుంది. కళ్ళకు ఎంతో చలువ, ఉపశమనం లభిస్తాయి.
భోగశీలురు (సుఖవంతులు) మొగలి పువ్వు, గన్నేరు, మొల్లలు, పొగడ, జాజి, కలిగొట్లు, సంపెంగ, తామర వంటి సువాసలు వెదజల్లే రకరకాల పుష్పాలను ధరిస్తారు. వీటితో పాటు శ్రేష్ఠమైన జవాది, కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలను శరీరానికి పూసుకుని, మానసిక ఉల్లాసాన్ని, శరీర సౌఖ్యాన్ని పొందుతారు.
వేసవికాలం రాత్రివేళల్లో మొల్లలు, జాజులు, తాజా పూలమాలలు, గన్నేరుపూలు, తెల్లని సుగంధ పుష్పాలు మరియు వట్టివేళ్ళను శరీరానికి సహజమైన చల్లదన్నాన్ని ఇస్తాయి మరియు వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తాయి. అంతేకాకుండా, శరీరంపై పన్నీరు చల్లుకొని ఈ పూలను ఇష్టంగా ధరించడం వల్ల వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది) పొందుతారు.
ప్రశ్న2.
వస్త్రధారణ, భోజన, తాంబూల సేవన పద్ధతులను వివరించండి.
జవాబు:
వస్త్రధారణ పద్ధతి :
చలికాలం నందు శరీరాన్ని వెచ్చగా ఉంచే పట్టువస్త్రాలను, మాంజిష్ఠ (గోధుమ లేదా ముదురు ఎరుపు) రంగు దుస్తులను ధరించాలి. చలికాలంలో వచ్చే వాతము మరియు కఫము వంటి శారీరక దోషాలను రాకుండా నివారిస్తాయి. వేసవికాలంలో మనస్సుకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించే సన్నని లేత ఎరుపు (చెంగావి) రంగు వస్త్రాలను ధరించాలి. ఇవి శరీరంలోని అధిక వేడిని మరియు పైత్య దోషాన్ని హరించి మేలు చేస్తాయి.
వర్షాకాల సమయంలో స్వచ్ఛమైన తెల్లని కాంతి గల వస్త్రాలను ధరించాలి. ఇవి శరీరంలో తలెత్తే వాత, పిత్త, కఫములనెడి మూడు శారీరక దోషాలను (త్రిదోషాలను సమస్థితిలో ఉంచి నివారిస్తాయి.
కాలిన లేదా చిరిగిన వస్త్రాలను ధరించడం వల్ల ఆయువు, ఐశ్వర్యం నశిస్తాయి.
భోజన పద్ధతి :
ఉదయాన్నే నిత్యకృత్యాలు ముగించుకున్నాక, అర్హులకు దానధర్మాలు చేయాలి. ప్రశాంతమైన, పవిత్రమైన మనస్సుతో దేవతలను, పితృ దేవతలను భక్తితో పూజించాలి. తర్వాత మాత్రమే మనిషి భోజనానికి ఉపక్రమించాలి.
ఎక్కువ మంది కలిసి తినే అవకాశము లేకపోయినా, కనీసం ఇద్దరు లేదా ముగ్గురయినా కలిసి కూర్చుని పంక్తి భోజనం చేయాలి. ఒంటరిగా కూర్చుని తినడం చాలా పెద్ద తప్పు అని ఉత్తమ చరిత్ర గల పెద్దలు చెప్పారు. తోటివారితో కలిసి భోజనం చేయడం వలన కోరుకున్న పనులు సిద్ధించి శుభం కలుగుతుంది. మనస్సుకు ఎంతో తృప్తి, సంతోషం లభిస్తాయి.
తినేటప్పుడు మనశ్శాంతి లేకుండా, మనస్సులో వేరే ఆలోచనలతో లేదా తీవ్రమైన కోపంతో ఉంటే, ఆ తిన్న అన్నం ఒంటికి పట్టదు అది భయంకరమైన విషంతో సమానంగా మారి శరీరానికి హాని చేస్తుంది.
అమితమైన తీపి ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. మిక్కిలి చేదు, పులుపు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన త్వరగా ముసలితనం వస్తుంది.
భోజనం ముందు నీళ్ళు తాగితే జీర్ణశక్తి తగ్గి శరీరం శుష్కించిపోతుంది. భోజనం మధ్యలో కొద్దిగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. భోజనం పూర్తి కాగానే వెంటనే ఎక్కువగా నీరు త్రాగకుండా ఉండటం అన్నిటికంటే పెద్దమేలు చేస్తుంది (జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.)
సగం కడుపును మాత్రమే ఘనపదార్ధాలతో నింపడం వలన జీర్ణరసాలు ఆహారంతో బాగా కలుస్తాయి. దీనివల్ల గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి ఉదరసంబంధిత సమస్యలు రావు.
అన్నం తిన్న వెంటనే పడుకుంటే పొట్ట పెరుగుతుంది తిన్న తర్వాత ఎటుకదలకుండా ఒకే చోట కూర్చుంటే సుఖంగా ఉన్నట్లు అనిపించినా శరీరం లావెక్కుతుంది. భోజనం తదుపరి మెల్లగా నడిస్తే ఆయుష్షు పెరుగుతుంది. నడిచే అలవాటు ఉన్నవారి దరిదాపుల్లోకి అకాల మృత్యువు రాదు.
ఎల్లప్పుడూ మితంగా (సమంగా) తినడం వల్ల ఎటువంటి వ్యాధులు లేకుండా శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉంటుంది.
తాంబూల సేవన పద్ధతి :
తాంబూలంలో వాడే మేలిమి వక్కకు మూడు ప్రధాన గుణాలున్నాయి. అది శరీరంలో పైత్యాన్ని పెరగకుండా ఆపుతుంది. మందగించిన ఆకలిని మెల్లగా పెంచుతుంది. విపరీతమైన దాహాన్ని కూడా వేగంగా తగ్గించే నేర్పు పోకచెక్కకు ఉంది.
ఆలోచనా శక్తిని నాశనం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన తాంబూలం కోసం ఈమూడింటిని (తొడిమ, చిగురు, ఈనె) పూర్తిగా వదిలేసి, కేవలం శుభ్రమైన ఆకు భాగాన్ని మాత్రమే ఉపయోగించాలి. తాంబూలంలో వాడే సున్నం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులోని, క్రిములను చంపుతుంది, ఆకలి పుట్టించి ఒంటికి తేజస్సు ఇస్తుంది. ఇందులో రాతి సున్నము శరీరంలోని పైత్య, వాత దోషాలను తగ్గిస్తుంది. శంఖ భస్మంతో చేసిన సున్నము కఫాన్ని, పైత్యాన్ని పూర్తిగా హరిస్తుంది.
చిప్పల సున్నం శరీరంలోని కఫ దోషాలను హరిస్తుంది. గుల్ల సున్నం వాతదోషాలను, నొప్పులను తగ్గిస్తుంది. ముత్యపు సున్నం చురుకుదనాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
సున్నం ఆరోగ్యానికి మంచిని చేకూర్చునదే అయినప్పటికినీ తమలపాకుకు సున్నాన్ని మితిమీరి రాసి తింటే ఆయుష్షుకు భంగం కలుగుతుంది.

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న1.
భూషణ ధారణ పద్ధతిని వివరించండి.
జవాబు:
శరీరానికి మేలైన నవరత్న ఆభరణాలను, స్వర్ణాభరణాలను ధరించడం ఎంతో
శ్రేష్ఠం. కేవలం పైపై మెరుగుల కోసం లక్క ఎక్కువగా ఉన్నవి, తక్కువ రకం రాగి నగల వంటి చౌకబారు ఆభరణాలను ధరించడం ఆరోగ్యరీత్యా, శాస్త్రరీత్యా
మంచిది కాదు.
ప్రశ్న2.
వ్యవహార పద్ధతిని వివరించండి.
జవాబు:
ఎవరైతే గొప్ప ఓర్పును కలిగి ఉండి ఇతరుల కష్టాలను తీరుస్తాడో, ప్రశాంతమైన స్వభావంతో పాటు పవిత్రమైన నిర్మల మనస్సు కలిగి ఉంటాడో, అవసరమైనప్పుడు వెనుకాడకుండా సాహసపనులు చేయడానికి సిద్ధపడతాడో, హృదయంలో దయ కలిగి నిరంతరం పరోపకారం చేస్తూ ధన గర్వంతో ఉబ్బిపోకుండా ఉంటాడో… అటువంటి సద్గుణాలు కలిగిన వ్యక్తి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అతడు సిరిసంపదలతో తులతూగుతాడు.

III. ఏకవాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న1.
నూత్న సత్కళాభోజునిగా వినుతికెక్కినదెవరు ?
జవాబు:
అప్పనమంత్రి.
ప్రశ్న2.
దంతధావనంలో ఉపయోగించే చెట్ల పుల్లల పేర్లు వ్రాయండి ?
జవాబు:
వేప, కానుగ, చండ్ర, మద్ది, మామిడి, ఉత్తరేణి, మారేడు, జావ్వి, జాజి, వావి
ప్రశ్న 3.
శీతాకాలంలో ఎలాంటి వస్త్రాలు ధరించాలి ?
జవాబు:
పట్టువస్త్రాలు, గోధుమ లేదా ముదురు ఎరుపురంగు (మాంజిష్ఠం) గల దుస్తులను ధరించాలి.
ప్రశ్న4.
మధురమైన పదార్థాలు అతిగా తింటే వచ్చే నష్టమేమిటి ?
జవాబు:
ఆకలిశక్తి తగ్గుతుంది.
ప్రశ్న 5.
మనకు ఆకలిని పుట్టించి, దప్పికను హరించేటట్లు చేసేవి ఏవి ?
జవాబు:
ఘన పదార్థాలు తమలపాకు, వక్క (పోకచెక్క)
ప్రశ్న6.
సంపదలు ఎవరిని వెతుక్కుంటూ వస్తాయి ?
జవాబు:
హృదయంలో దయకలిగి ఉండి నిరంతరం పరోపకారం చేస్తూ, నిగర్విగా ఉండే వారిని సంపదలు వెతుక్కుంటూ వస్తాయి.
ప్రశ్న7.
అప్పనమంత్రి ఏ కాలంనాటి వాడని పండితులు అంచనా వేశారు ?
జవాబు:
13వ శతాబ్దం.

IV. సందర్భసహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
సింధువారంబునను రావు – చెడ్డకలలు
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 13వ శతాబ్దికి చెందిన అప్పనమంత్రిచే రచించబడిన ‘చారుచర్య’ అనెడి కావ్యం నుండి గ్రహింపబడినది.
సందర్భం : దంతధావన పద్ధతిని గూర్చి తెలియేస్తూ కవి పలికిన సందర్భంలోనిది, ఈ వాక్యము.
భావం : వావిలి చెట్టు పుల్లతో దంతధావనము చేసిన యెడల దుస్వప్నములు
రావని కవి తెలిపెనని భావము.
ప్రశ్న 2.
స్పష్టముగాఁజేయునేని బహుజనములతోన్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 13వ శతాబ్దికి చెందిన అప్పనమంత్రిచే రచించబడిన ‘చారుచర్య’ అనెడి కావ్యం నుండి గ్రహింపబడినది. సందర్భం : భోజన పద్ధతిని శాస్త్ర విధాన వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది, ఈ వాక్యము.
భావం : మంచి మనసున్న వారితోనూ, అనేకులతోను కలిసి భుజించుటవలన మానసిక ఉల్లాసము కలుగుటయేగాక, కోరుకున్న పనులు సిద్ధించి శుభములు చేకూరునని వాక్య భావము.
ప్రశ్న 3.
వాయు చలనకు నొకపాలు వలయు నెడము
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 13వ శతాబ్దికి చెందిన అప్పనమంత్రిచే రచించబడిన ‘చారుచర్య’ అనెడి కావ్యం నుండి గ్రహింపబడినది. సందర్భం: భోజన పద్ధతిని శాస్త్ర విధాన వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది, ఈ వాక్యము.
భావం : ఆహారాన్ని భుజించేటప్పుడు మన ఉదరాన్ని నాలుగు భాగాలుగా ఊహించుకుని 25 భాగాన్ని గాలి ఆడటానికి, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవడానికి వీలుగా పూర్తిగా ఖాళీగా ఉంచవలెనని వాక్య భావము.
ప్రశ్న 4.
వేగమె దాహంబు నణఁచు విన్నాణంబున్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 13వ శతాబ్దికి చెందిన అప్పనమంత్రిచే రచించబడిన ‘చారుచర్య’ అనెడి కావ్యం నుండి గ్రహింపబడినది.
సందర్భం: తాంబూల సేవన పద్ధతిని గూర్చి కవి వివరించిన సందర్భంలోనిది, ఈ వాక్యము.
భావం : తాంబూలంలో వాడే వక్కకు మందగించిన ఆకలిని మెల్లగా పెంచే గుణం ఉంటుంది. అదేవిధంగా దాహాన్ని వేగంగా తగ్గించే నేర్పు పోకచెక్కకు కలదని వాక్యభావం.

విశేషాంశాలు
1. భోజమహారాజు : సాధారణ శక సంవత్సరం 1010-1055 సంవత్సరాల మధ్య పరమార వంశానికి చెందిన భోజమహారాజు మధ్యభారతదేశంలో ధారా నగరం రాజధానిగా మాళవ రాజ్యాన్ని పాలించాడు. ఈయన కవి, పండిత పోషకుడు. వేదశాస్త్ర అధ్యయనం కోసం భోజుడు నిర్మించిన భోజశాల, అతిపెద్ద శివలింగం ఉన్న భోజేశ్వరాలయం నేటికి నిలిచి ఉన్నాయి. ఈయన 84 గ్రంథాలు వ్రాశాడని ప్రతీతి. అందులో కొన్ని: శృంగార ప్రకాశం, సరస్వతీకంఠాభరణం (వ్యాకరణ గ్రంథం), చంపూరామాయణం, నామమాలిక (నిఘంటువు), గోవిందవిలాస కావ్యం, 83 అధ్యాయాలు గల సమరాంగణ సూత్రధారము (వాస్తుశాస్త్రం), 136 శ్లోకాలు గల చారుచర్య మొదలైన సంస్కృత గ్రంథాలు ఉన్నాయి.
2. పంచశౌచాలు :
- సత్యశౌచం
- మనఃశౌచం
- ఇంద్రియనిగ్రహశౌచం
- సర్వభూతదయాశౌచం
- జలశౌచం.
3. నాలుగు గడియల స్నానం : గడియ = 24 నిమిషాలు, 4 గడియలు అంటే 96 నిమిషాలు సమయం, సౌలభ్యం ఉన్నవారు శరీరానికి నఖ, శిఖ పర్యంతం తైలమర్దనం చేసుకున్న తర్వాత నలుగు, కుంకుడురసంతో అభ్యంగన స్నానం చేయడానికి అంత సమయం పట్టేది. ఇంత సమయం పాటు నిత్యం స్నానం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాగని హడావిడిగా నాలుగు చెంబుల నీళ్ళు ఒంటిమీద దిమ్మరించుకోవడం స్నానం అనిపించుకోదు అన్న భావాన్ని గ్రహించాలి.
4. జవ్వాది : పునుగుకు సైదోడుగా ఉండే సుగంధ ద్రవ్యం జవ్వాది. మంచి గంధంతో మూలికలు కలిపి తయారుచేసే మంగళ ప్రదమైన పదార్థం ఇది. ఇందులో కలిపే ఓషధులు లభించే ప్రాంతాన్ని తమిళనాడులో “జవ్వాదిమలై” అని పిలుస్తారు.
5. దశదానాలు :
- గోదానం,
- భూదానం,
- తిలదానం,
- హిరణ్యదానం,
- నెయ్యి,
- వస్త్రాలు,
- ధ్యానం,
- బెల్లం,
- శర్కర/మధుర పదార్థాలు
- జలం/జలపాత్ర.

6. పంచయజ్ఞాలు : గృహస్థు ఆచరించవలసిన నిత్యకర్మలు
- బ్రహ్మయజ్ఞం (వేదాధ్యయనం / విద్యాభ్యాసం)
- పితృయజ్ఞం (గతించిన పెద్దలకు తర్పణాలివ్వడం)
- దేవయజ్ఞం (అర్చన, అగ్నికార్యం, నివేదన)
- భూతయజ్ఞం (సర్వప్రాణులను ఆదరించడం),
- మానుష్యయజ్ఞం (అతిథి సత్కారం).
7. ఉత్తరేణి : ఔషధ విలువలు ఉన్న ఈ మొక్కను సంస్కృతంలో “అపామార్గ” అంటారు. ఈ మొక్క యొక్క ఆకు, కాండం, వేర్లు కూడా ఔషధాలలో వినియోగిస్తారు. దంతధావనానికి ఉత్తమమైన ఉత్తరేణిని, వేప, కానుగ పుల్లలతోపాటు నేటికి ఆంధ్రదేశమంతటా వినియోగిస్తారు. అట్ల తదియనాడు వాయినాల నోము తీర్చుకునే స్త్రీలు ఉత్తరేణి పుల్లతో దంతధానవం చేసి 11 పసుపు ముద్దలతో స్నానం చేసిన తర్వాత గౌరీపూజ చేయడం, లక్షవత్తుల నోము చేసేనాడు కూడా మహిళలు ఉత్తరేణి పుల్లతో పళ్ళుతోముకోవడం తీరాంధ్రదేశంలో సంప్రదాయంగా వస్తున్నది.
8. శ్వేతార్కం : తెలుగులో తెల్లజిల్లేడు అంటారు. తెలుపు, నలుపు ఏరకం జిల్లేడైనా వాటి పాలు కంటికి చాలా ప్రమాదం కలిగిస్తాయి. పిప్పి పంటికి తెల్లజిల్లేడు పాలు ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. వైద్యుల సలహాతో మాత్రమే వినియోగించాలి.
9. త్రిదోషాలు : మానవ శరీరంలో 1. వాత, 2. పిత్త, 3.శ్లేష్మాలు గతి తప్పకుండా అదుపులో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుది. వీటిల్లో ఏ ఒక్కటి ప్రకోపించినా శరీరం రోగగ్రస్తమవుతుంది.

చారుచర్య Summary in Telugu
కవి పరిచయం
అప్పనమంత్రి రచించిన “చారుచర్య” అనే శాస్త్రగ్రంథం నుండి గ్రహించబడింది. సంస్కృతంలో భోజమహారాజు 136 శ్లోకాలలో “చారుచర్య” అనే కావ్యాన్ని రచించారు. దానిని అదే పేరుతో అప్పనమంత్రి తెలుగులో స్వేచ్ఛానువాదం చేశారు.
అప్పనమంత్రి భారద్వాజ గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు. నాగమాంబ, గోవిందార్యుడు ఈయన తల్లిదండ్రులు. సోమయాజులలో శ్రేష్ఠుడైన సింగనామాత్యునికి అప్పనమంత్రి మేనల్లుడు. హరిభక్తుడైన అప్పనమంత్రి సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పగల దిట్ట.
“నూత్న సత్కళాభోజుని” గా వినుతికెక్కిన అప్పనమంత్రి చారుచర్యలోని “గొనకొని కొండముచ్చులు చకోరములన్ శుకశారికావళిన్” అన్న పద్యాన్ని మడికి సింగన తన సకలనీతి సమ్మతంలో ఉదాహరించాడు. అప్పనమంత్రి 13వ శతాబ్దానికి చెందినవాడని, పోతనకు కాస్త ముందు వాడని పండితులు అంచనా వేశారు.
వ్యాధులు – చికిత్సా విధానాలు – ఔషధాల గురించి తెలిపే “బసవ రాజీయం” (18వ శతాబ్ది) లాంటి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. మానవులు క్రమశిక్షణాయుత జీవనవిధానాలను అలవరచుకోవడానికి పాటించాల్సిన నియమాలను, పద్ధతులను వివరించే గ్రంథాలలో “చారుచర్య” నాయకమణి లాంటి రచనగా భావించవచ్చు.

పాఠ్యభాగ ఉద్దేశ్యం
సమాజంలో నూటికి సగంమందికి పైగా “భాగ్యవంతులు” కనిపిస్తున్నారు గానీ, “మహాభాగ్యవంతులు” మాత్రం నూటికి పదిపాళ్ళకు మించడం లేదు. ధర్మసాధనాలన్నింటిలోనూ దేహమే మొదటిది. దేహాలయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లో, చేతల్లో ఉంది. అందుకే, విద్యార్థులకు వ్యవహారజ్ఞానం, మంచి ఆహారపు అలవాట్లు నేర్పడంతో పాటు ఆరోగ్యవిషయాలపై తెలుగువారికున్న శ్రద్ధాసక్తులను, ఒకప్పటి శౌచ, అలంకార పద్ధతులను తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.
పాఠ్యభాగ నేపథ్యం
మొత్తం 76 పద్యాలున్న లఘకృతి చారుచర్య. అవతారికతో మొదలై వరుసగా దతధావన, స్నాన, పుష్పధారణ, లేపన, వస్త్రధారణ, భూషణధారణ… ఇలా మొత్తం 12 పద్ధతుల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి.
పాఠ్యభాగ సంగ్రహం
ప్రతిరోజూ ప్రాతఃకాలంలోనే నిద్ర నుండి మేల్కొనాలి. ఆలస్యం చేయకుండా దంతధావనం చెయ్యాలి. అందుకోసం వేప, కానుగ, చండ్ర, మద్ది మొదలైన ఔషధ విలువలు కలిగిన పుల్లలను ఉపయోగించాలి. వివిధ వృక్ష జాతులకు సంబంధించిన పుల్లలను దంత ధావనానికి ఉపయోగించడం వలన వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వాటిని తెలుసుకొని వినియోగించుకోవాలి. శుభ్రంగా దంతధావనం చేయడం వలన కఫం, పైత్యం హరించుకుపోయి, నాడీమండలం శుద్ధి అవుతుంది. ఆపై చక్కగా గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన శరీరం కాంతివంతంగా తయారై రోజంతా ఉత్తేజంగా ఉంటారు.
స్నానానంతరం చక్కగా తల దువ్వుకొని కాలానికి తగిన లేపనాలను పూసుకోవాలి. సువాసనను, ఆరోగ్యాన్ని ప్రసాదించే గేదగి, గన్నేరు, మొల్ల, పొగడ, సంపెంగల వంటి పుష్పాలను ధరించాలి. ఇవి ధరించడం వలన స్త్రీ పురుషులకు త్రిదోషాలు హరించుకుపోతాయి. చలువ చేస్తుంది. ఋతువులననుసరించి మనం వస్త్రధారణ చెయ్యాలి. కాలిపోయినవి, కన్నాలు పడినవి అయిన వస్త్రాలు ధరించరాదు. ఎవరి తాహతుకు తగినట్లుగా వారు ఆయా వారాలలో ఆయా రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించాలి. న్నంతలో దాన ధర్మాలు చేయాలి. మన చుట్టూ ఉన్నవారికి పెట్టాకే మనం భుజించాలి. సాధ్యమైనంత వరకు భోజనం ఒంటరిగా కాకుండా పదిమందితో కలిసి తినాలి. భోజన సమయంలో భోక్తగాని, దాతగాని కోపావేశాలకు లోనయితే ఆ ఆహారం విషంతో సమానమవుతుంది. మధురంగా ఉన్నాయని పదార్ధాలు అతిగా తినకూడదు.
భోజనం మధ్యలో అతిగా నీరు త్రాగకూడదు. అన్నం తినడానికి, నీరు త్రాగడానికి క్రమపద్ధతిని పాటించాలి. భోజనానంతరం కొద్ది దూరమైనా నడవాలి. అలా నడిచాక పైత్యాంతకమైన తాంబూలాన్ని సేవించాలి. తాంబూల సేవనం వలన ఒనగూరే ప్రయోజనాలు అనేకం. తాంబూలంలో వేసుకునే సున్నం త్రిదోషాలను హరిస్తుంది. మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. ఇతరులకు మేలు చేస్తూ ఓర్పు, సహనం కలిగి ఉన్న వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ధైర్యం, ఉత్సాహం, ఉన్నవారిని సంపదలు అవే వెతుక్కుంటూ వస్తాయి. పగలు నిద్రపోకూడదు, పరకాంతను కోరుకోకూడదు. భక్ష్యయోగ్యంగాని పదార్థాల మీద వ్యామోహం వదిలేయాలి. కరుకుగా మాట్లాడకూడదు. ఆత్మస్తుతికి దూరంగా ఉండాలి. క్రమశిక్షణ కలిగిన జీవితం గడుపుతూ పదుగురి మేలు కోరుకునే మానవునికి ఎల్లప్పుడూ అభ్యుదయమే కలుగుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
దంతధావన పద్ధతి
1. కం. రేపకడ మేలుకొని యఘ
నాపకమతి దంతధావనవిధిజ్ఞుం డై
తాపుణ్య కాష్ఠమున మౌ
నోపేతుం డగుచు వలయు నొనరింపంగన్
ప్రతిపదార్థము :
రేపకడన్ = తెల్లవారుజామునే, (వేకువజామున)
మేలుకొని = నిద్రనుండి లేచి
అఘనాపకమతి = పాపములను నశింపజేసే బుద్ధి కలవాడై / ఆలస్యం చేయకుండా
దంతధావనవిధిజ్ఞుండు + ఐ = పళ్ళుతోముకునే నియమములు తెలిసినవాడై
తాన్ = తాను
పుణ్య కాష్ఠమున్ = శ్రేష్ఠమైన చెట్టుపుల్లతో
మౌనో పేతుండు + అగుచున్ = మౌనముతో కూడినవాడై (మాట్లాడకుండా)
ఒనరింపంగన్ వలయున్ = దంతధావనము చేయవలెను
తాత్పర్యము : తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఆలస్యం చేయకుండా పళ్ళు తోముకోవాలి. శ్రేష్ఠమైన, ఆరోగ్యకరమైన వనమూలికల పుల్లలతో (వేప, కానుగ మొదలైనవి) ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ దంతధావనం ముగించాలి.
2. ఆ. ఖదిరమును వటమును గానుఁగ జిల్లేడు
వేము మద్ది జువ్వి వీనియందు
నొగరు చేఁదు కార మొనరిన చెక్కలం
దడిపి తోమవలయు దంతములకు
ప్రతిపదార్థము :
ఖదిరమును = చండ్ర చెట్టు
వటమును = మర్రి చెట్టు
గానుగ = కానుగ
జిల్లేడు = జిల్లేడు చెట్టు
వేము = వేప చెట్టు
మద్ది = మద్ది చెట్టు
జువ్వి = జువ్వి చెట్టు
వీనియందున్ = ఈ వృక్షములలో
వగరు, చేదు, కారము = వగరు, చేదు, కారం అనే రుచులు
ఒనరి = కలిగియున్న
చెక్కలన్ = పుల్లలను / పొడులను
తడిపి = నీటితో తడిపి
దంతములకున్ = పళ్ళకు (ను)
తోమవలయున్ = తోమవలయును
తాత్పర్యము : చండ్ర, మర్రి, కానుగ, జిల్లేడు, వేప, మద్ది, జువ్వి వృక్షాల పుల్లలకు వగరు, చేదు, కారం రుచులు ఉంటాయి. వీటిని నీటితో తడిపి పళ్ళు తోముకోవడానికి ఉపయోగించాలి.

3. సీ ఆయురారోగ్యంబులగు మద్ది మామిడి
కణమున శ్రీలక్ష్మి గలుగు మిగులఁ
బీడ లెల్లనుఁ బాయు బీజపూరంబున
రణయం బొదవుఁ గరంజకమున
విత్తలాభము సంభవించును మారేడు
నొదవు ఘనప్రజ్ఞ యుత్తరేణి
నరుచిహరము జాడ్యహరము జేయును జండ్ర
సిద్ధించు నతుల వాక్సిద్ధి జువ్వి
తే. జాజి దాడింబమున దిరిసమున గొడిసె
మొదల నంకోలమునఁ గల్గు మోక్షలక్ష్మి
సింధువారంబునను రావు చెడ్డకలలు
దంతధావనకర్షంబు లింతవట్టు
ప్రతిపదార్ధము :
మద్ది = మద్ది చెట్టుపుల్లతో తోమితే
ఆయురారోగ్యంబులు + అగు = ఆయుష్షు, ఆరోగ్యం లభిస్తాయి
మామిడి కణమున = పుల్ల(ల)(వలన) లతోటి దంతధావనం చేసిన
కణమున = క్షణకాలంలోనే
మిగుల = మిక్కిలి
శ్రీలక్ష్మి = లక్ష్మీకటాక్షం
కలుగు = కలుగుతుంది
బీజాపూరంబున = మాదీఫలం / దబ్బ చెట్టు పుల్లతో దంతధావనం చేసిన
పీడలెల్లను = సమస్తపీడలు
పాయు = తొలగిపోతాయి
కరంజకమున = కానుగ చెట్టు పుల్లతో తోముట వలన
రణజయంబు + ఒదవు = యుద్దాలలో లేదా పోటీలలో విజయం లభిస్తుంది.
మారేడు = బిల్వ వృక్షపు పుల్లతో తోమితే
విత్తలాభము = ధనలాభము
సంభవించును = కలుగును
ఉత్తరేణి = ఉత్తరేణి పుల్లతో తోమితే
ఘనప్రజ్ఞ = గొప్ప బుద్ధికుశలత
ఒదవు = లభిస్తుంది
చండ్ర = చండ్ర చెట్టు పుల్లతో తోమితే
అరుచిహరము = నోటి రుచిని పోగొడుతుంది
జాడ్యహరము + చేయును = శరీరబద్ధకాన్ని / రోగాలను నివారిస్తుంది
జువ్వి = జువ్వి చెట్టు పుల్లతో తోమితే
అతుల వాక్సిద్ధి = సాటిలేని వాక్చాతుర్యం
సిద్దించును = కలుగును
జాజి = జాజి చెట్టు పుల్లతోను
దాడింబమునన్ = దానిమ్మ చెట్టుపుల్లతోను
దరిసమునన్ = దిరిసెన చెట్టు పుల్లతోను
గొడిసె = గొడిసె చెట్టుపుల్లతోను
మొదల = ముఖ్యంగా
అంకోలమునన్ = ఊడుగ (అంకోల) చెట్టు పుల్లతోను దంతాధావనం చేసిన
మోక్షలక్ష్మి = శ్రేష్ఠమైన సంపద
కల్గున్ = సిద్ధించును
సింధువారంబునను = వావిలి (సింధు వార) చెట్టు పుల్లతో తోముకుంటే
చెడ్డకలలు = పీడకలలు (దుస్వప్నాలు)
రావు = సంభవించవు
ఇంత + పట్టు = ఈ విధంగా తెలియజేయబడిన వృక్షాలు
దంతధావనకున్ = పళ్ళుతోముకోవడానికి
అర్షంబులు = శాస్త్రరీత్యా అత్యంత యోగ్య మైనవి (శ్రేష్ఠమైనవి)
తాత్పర్యము : మన పూర్వీకులు దంతధావనానికి (పళ్ళు తోముకోవడానికి) ఉపయోగించే వివిధ చెట్ల పుల్లల యొక్క విశిష్టతను తెలియజేశారు.
మద్ది పుల్ల : ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఇస్తుంది
మామిడి పుల్ల : ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.
మాదీఫలం పుల్ల : సమస్త గ్రహపీడలను, కష్టాలను పోగొడుతుంది.
కానుగపుల్ల : విజయాలను (రణజయం) చేకూరుస్తుంది పెంచుతుంది.
మారేడు పుల్ల : ధన లాభాన్ని ఇస్తుంది.
ఉత్తరేణి పుల్ల : జ్ఞాపకశక్తిని, అమితమైన తెలివితేటలను (ప్రజ్ఞను)
చండ్రపుల్ల : నోటి అరుచిని, శరీర రోగాలను హరిస్తుంది.
జువ్విపుల్ల : మాట్లాడే నేర్పును, అద్భుతమైన వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది.
జాజి, దానిమ్మ, దిరిసెన, గొడిసె మరియు ఊడుగ (అంకోల) చెట్ల పుల్లలతో ఉదయాన్నే దంతధావనం చేయడం వలన శ్రేష్ఠమైన సిరిసంపదలు లభించును. వావిలి చెట్టు పుల్లతో దంతధావనం చేయడం వల్ల రాత్రిపూట కీడును కలిగించే దుస్వప్నాలు (పీడకలలు) దరిచేరవు.
4. కం. ప్రియరుచ్యము కఫపైత్య
క్షయకారి మనఃప్రసన్న కారణము శ్రుతి
ద్వయనాడి శుద్ధికరమును
నయనహితము దంతధావనము మనుజులకున్
ప్రతిపదార్థము :
మనుజులకున్ = మానవులకు
దంతధావనము = (శాస్త్రోక్తంగా) పళ్ళుతోముకోవడం అనేది
ప్రియరుచ్యము = నోటికి మంచి రుచిని, ఆహారంపై ఇష్టాన్ని కలిగిస్తుంది
కఫపైత్య క్షయకారి = శరీరంలోని కఫాన్ని, పైత్యాన్ని నశింపజేస్తుంది.
మనఃప్రసన్నకారణము = మనసు ప్రశాంతంగా ఉండటానికి కారణమవుతుంది.
శ్రుతిద్వయ నాడి = రెండు చెవులకు సంబంధించిన నాడులను
శుద్దికరమును = శుద్ధిచేసి, వినికిడి శక్తి మెరుగుపరుస్తుంది
నయన హితము = కంటి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది
తాత్పర్యము : మానవులు ప్రతిరోజు దంతధావనం చేయడం వలన నోటికి కమ్మని రుచి వస్తుంది. ఇది శరీరంలోని కఫ, పైత్య, దోషాలను హరిస్తుంది. అంతేకాకుండా, దీనివల్ల మనసు నిర్మలంగా ఉంటుంది. వినికిడి నాడులు శుద్ధి చేయబడతాయి. కంటి చూపుకు ఎంతో మేలు కలుగుతుంది.

స్నాన పద్ధతి
5. ఉ. అంగసుఖంబు, దుర్గుణము లారయఁ బొందని మందు, మేనికిన్
రంగు సుపోషణంబు సుకరంబునఁ బ్రాయము మళ్లివచ్చు న
భ్యంగన మాచరించుటకు నర్షవిధం బగు నుష్టవారిజే
యం గడునొప్పు నాల్గు గడియల్ జలకంబు యథావిధిజ్ఞుఁ డై
ప్రతిపదార్థము :
యధావిధిజ్ఞుడై = స్నాన శాస్త్రనియమాలు పూర్తిగా తెలిసినవాడై
నాల్గుగడియల్ = సూర్యోదయానికి ముందు ఉండే నాలుగు గడియల కాలంలో (సుమారు గంటన్నర)
జలకంబు = స్నానము ఆచరించిన
అంగ సుఖంబు = శరీరానికి సౌఖ్యము కలుగును
దుర్గుణము = దుర్గంధము, శరీరదుర్వాసన (ఆరయన్ + పొందని)
ఆరయన్ = విచారించి చూస్తే
పొందని = ఒంటికి చేరకుండా చేసేటటువంటి
మందు = ఒక గొప్ప ఔషధం
మేనికిన్ = శరీరానికి
రంగు = మంచి వన్నెను
సుపోషణంబు = చక్కని ఆరోగ్యం, అవయవ పుష్టి
సుకరంబునన్ = సులభముగా చేకూరును
ప్రాయము = యవ్వనము / వయస్సు
మళ్ళివచ్చు = ముసలితనపు ఛాయలు తొలగి యవ్వన కాంతితో శరీరం ప్రకాశించును
అభ్యంగనము = ఒంటికి, నూనె రాసుకుని మర్దనాచేసుకునే ప్రక్రియను
ఆచరించుటకున్ = అలవరచుకోవడానికి
అర్హవిధంబు + అగు = తగిన పద్ధతి కలిగినటువంటి
ఉష్ణవారి = వేడినీరు (గోరువెచ్చని నీరు)
చేయంట = ఉపయోగించుట
కడున్ + ఒప్పున్ = ఎంతో శ్రేష్ఠముగా నుండును
తాత్పర్యము : శరీరానికి నూనె పట్టించి మర్దనా (అభ్యంగన స్నానం) చేసినప్పుడు, ఆ తర్వాత స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని (ఉష్ణవారి) ఉపయోగించడం అత్యంత అర్హమైన పద్ధతి మరియు శ్రేష్ఠమైనది.
6. కం. ఆచారానన్తరమునఁ
బ్రాచి ముడువవలయుఁ గేశపాశంబులఁ గా
లోచితజలముల గరగర
రాచిన కస్తూరి పూయ రమణీయ మగున్
ప్రతిపదార్థము :
ఆచార = శాస్త్రోక్తమైన నిత్యకృత్యాలు, ప్రాత: స్నానాది విధులు
అనన్తరమునన్ = ముగిసిన పిమ్మట
ప్రాచి = చిక్కులు లేకుండా చక్కగా దువ్వి
కేశ పాశంబులన్ = తలవెంట్రుకల సమూహాన్ని
ముడవవలయున్ = ముడివేసుకోవాలి
కాల + ఉచిత జలముల = ఆయా కాలములకు తగినట్లుగా ఉండే జలములతో (నీటితో)
గరగర రాచిన = సానరాయిపై గరగరమంటూ మెత్తగా
కస్తూరి పూయన్ = కస్తూరి వంటి సుగంధద్రవ్యాన్ని అరగదీసిన
శరీరానికి (పూసుకుంటే) = రాసుకుంటే / ధరిస్తే
రమణీయము + అగున్ = చూడటానికి ఎంతో మనోహరంగా / శ్రేష్ఠంగా ఉంటుంది.
తాత్పర్యము : స్నానం చేసిన తరువాత తలజుట్టును చక్కగా ఆరబెట్టుకుని ముడివేసుకోవాలి. ఆపై శరీరానికి తగిన సుగంధ ద్రవ్యాలను (కస్తూరి వంటివి) పూసుకుంటే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

లేపన పద్ధతి
7. కం. జలకంబు దీర్చినప్పుడె
వలయున్ దడియొత్తఁ గాంతివచ్చును బిటికా
దులు వొందకుండు గండువు
గలుగదు మఱి దాన నునుపు గాత్రమున కగున్
ప్రతిపదార్ధము :
జలకంబు + తీర్చిన + అప్పుడె = స్నానము ముగించిన వెంటనే
వలయున్ = తప్పకుండా చేయవలసినది
తడి + ఒత్తన్ = శరీరానికి ఉన్న నీటితడిని (మెత్తని వస్త్రంతో) తుడుచుకోవాలి
కాంతివచ్చును = ఆ విధంగా తుడుచుకోవడం వలన కాంతి వస్తుంది
బిటికాదులు = పిటికలు, (సెగగడ్డలు) కురుపులు, చెమటకాయలు మొదలైనవి
పొందకుండు = శరీరానికి రాకుండా ఉంటాయి
కండువు = చర్మం కందిపోవుట, దురద
కలుగదు = సంభవించదు
మఱి + దానన్ = అంతేగాక, ఆవిధంగా తడి ఒత్తడం వలన
గాత్రమునకున్ = శరీరానికి
నునుపు + అగున్ = మృదుత్వం చేకూరుతుంది
తాత్పర్యము : స్నానం పూర్తి చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా శరీరానికి ఉన్న తడిని వస్త్రంతో చక్కగా తుడుచుకోవాలి. అలా చేయడం వలన చర్మం ప్రకాశిస్తుంది. శరీరానికి సెగగడ్డలు, కురుపులు, చర్మం కందిపోవడం (దురదలు) వంటివి రావు. శరీరం ఎంతో మృదువుగా మారుతుంది.
8. కం. పరిమళము గల్గుపూవులు
ధరియింపఁగ దాన చుండ్రు తలఁబట్టదు చె
చ్చెరఁ జెమటకంపు తొలఁగును
నరులకు మతి దెలియు ననువు నయనముల కగున్
ప్రతిపదార్థము :
పరిమళము + కల్గు = మంచి సువాసనలు వెదజల్లే
పూవులు = పుష్పములు
ధరియింపగన్ = శరీరం లేదా తలపై ధరించడం వల్ల
దానన్ = ఆ సువాసనల ప్రభావంచేత
చుండ్రు = సూర్యుని తాపం
తలన్ + పట్టదు = మనస్సు గుర్తించదు (శరీరానికి ఎండవేడి తెలియదు)
చెచ్చెరన్ = చాలావేగముగా
చెమటకంప = ఒంటి నుండి వచ్చే దుర్వాసన
తొలగును = నశిస్తుంది
నరులకున్ = మనుషులకు
మతి = బుద్ధి
తెలియున్ = వికసిస్తుంది.
నయనములకు = కళ్ళకు
అనువు = అనుకూలము / చలువను
అగున్ = కలుగుతుంది
తాత్పర్యము : సువాసన గల పూలను ధరించడం వలన ఎండవేడిమి లేదా అలసట యొక్క ప్రభావం మనసుకు తెలియదు. ఒంటికి పట్టిన చెమట దుర్వాసన త్వరగా తొలగిపోతుంది. మనుషుల మనస్సు తేలికపడి బుద్ధి వికసిస్తుంది. కళ్ళకు ఎంతో చలువ, ఉపశమనం లభిస్తాయి.

ధారణ పద్ధతి
9. ఉ. గేదఁగిపువ్వు దాలిచి సుఖింతురు మేలు జవాది పూసి హృ
న్మోదముగాఁగఁ గన్నెరులు మొల్లలతో వకుళ ప్రసూనముల్
జాదులు పాటలంబులును సంపెఁగలున్ శతపత్రకంబులున్
శ్రీదనరారు భోగులు ధరింతురు కస్తూరిఁ గూర్చి వేడుకన్
ప్రతిపదార్థము :
గేదగి పువ్వు = మొగలి పువ్వును
తాలిచి = ధరించి
మేలు = శ్రేష్ఠమైన
జవాది పూసి = జవాది (సుగంధ పచ్చాకు పూత) వంటి సుగంధ ద్రవ్యాన్ని రాసుకుని
సుఖింతురు = ఆనందాన్ని అనుభవిస్తారు
హృత్ + మోదముగాఁగన్ = మనస్సుకు ఎంతో సంతోషం కలిగేలా.
కన్నేరులు = గన్నేరు పూలు
మొల్లలతో = మొల్ల పూలతో పాటు
వకుళ ప్రసూనముల్ = పొగడ పూలను
జాదులు = జాజిపూలు
పాటలంబులును = కలిగొట్టు పూలు
సంపెంగలున్ = సంపెంగపూలు
శతపత్రకంబులున్ = తామరపూలు
భోగులు = విలాసవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే సుఖవంతులు
శ్రీ + తనరారు = సంపదలు, వైభవాలు ఉట్టిపడేలా ప్రకాశించే (ప్రకాశిస్తారు)
వేసవి రాత్రులన్ + ఎప్పుడున్ = వేసవి కాలపు రాత్రి వేళలందు
అర్ధిమెయిన్ = ఇష్టపూర్వకంగా
ధరింతురు = ధరిస్తారు
తాత్పర్యము : వేసవికాలం రాత్రివేళల్లో మొల్లలు, జాజులు, తాజా పూలమాలలు, గన్నేరు పూలు, తెల్లని సుగంధ పుష్పాలు మరియు వట్టివేళ్ళను ధరిస్తారు ఇవన్నీ శరీరానికి సహజమైన చల్లదన్నాన్ని ఇస్తాయి. మరియు వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తాయి. అంతేకాకుండా, శరీరంపై పన్నీరు చల్లుకొని ఈ పూలను ఇష్టంగా ధరించడం వల్ల వేసవి తాపం నుండి ఉపశమనం (లభిస్తుంది) పొందుతారు.

వస్త్రధారణ పద్ధతి
11. సీతుం గందువఁ బట్టుచీరలును మాంజిష్ఠంబులున్ దోఁపులున్
వాతశ్లేష్మ నివృత్తి హేతువులు, దుర్వారోష్ణ కాలంబునన్
జేతోమోదము పైత్యహానియుఁ గడుం జేకూరుఁ జెంగావులన్
శ్వేతచ్ఛాయపటంబు లభ్రపట లీవేళన్ ద్రిదోషఘ్నముల్
ప్రతిపదార్థము :
సీతుం = చలికాలము నందలి (చలికాలపు)
కందువన్ = ఋతువులో (ఋతువు వచ్చినప్పుడు)
పట్టు చీరలును = పట్టునూలుతో చేసిన, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే వస్త్రాలను
మాంజిష్ఠంబులన్ = గోధుమ లేదా ముదురు ఎరుపు రంగు వేయబడిన వస్త్రములు
తోపులన్ = మేలైన వన్నెదుస్తులు
వాత = వాత దోషము యొక్క
శ్లేష్మ = కఫ దోషము యొక్క
నివృత్తి = తొలగింపునకు
హేతువులు = కారణములగును
దుర్వా = నివారింపశక్యముకాని, (మిక్కిలి తీవ్రమైన)
12. కం. కాలినచీర ధరించిన
మేలు దొలంగుటయె కాదు మిక్కిలి కీడై
కాలునివశమగుఁ గావున
వాలాయము దానిఁ బాఱవైవఁగవలయున్
ప్రతిపదార్ధము :
కాలిన చీర = అగ్ని తగిలి కాలిన లేదా / చిరిగిన / మలినమైన వస్త్రాలు
ధరించినన్ = ధరిస్తే
మేలు + తొలంగుటమె కాదు = శుభం దూరమవ్వడమే కాకుండా
మిక్కిలి కీడై = ఎంతో అనారోగ్యము
కాలుని వశమగున్ = యముని వశం అవుతారు (ఆయువు క్షీణిస్తుంది)
కావున = అందువలన
వాలాయము = తప్పనిసరిగా
దానిన్ = అటువంటి కాలిన లేదా చిరిగిన వస్త్రాలను
పాఱవైవగ వలయున్ = దూరంగా పారవేయాలి
తాత్పర్యము : కాలిన లేదా చిరిగిన వస్త్రాలను ధరించడం వల్ల ఆయువు, ఐశ్వర్యం నశిస్తాయి. కాబట్టి వాటిని వెంటనే విసర్జించాలి.

భూషధారణ పద్ధతి
13. చం. తెవులులు, సెందనోడు నధిదేవత లిత్తురు మెచ్చి సంతతో
త్సవములు రత్నభూషణవితానము దాల్పఁగ నట్లు లేనినాఁ
డవయవశుద్ధి హేతు రుచిరాభరణంబులు దాల్సఁగాఁదగున్
రవణముపొంటె లక్కయును రాగియు నిడ్డవిగావు దాల్పఁగన్
ప్రతిపదార్థము :
రత్నభూషణ వితానము = నవరత్నాలతో కూడిన ఆభరణాల సమూహాన్ని
దాల్పగన్ = శరీరంపై ధరించినప్పుడు
అధిదేవతలు = ఆయా రత్నాలకు అధిపతులైన దేవతలు
మెచ్చి = ప్రసన్నులై
సంతత + ఉత్సవములు = సంతోషమును, ఉల్లాసాన్ని
ఇరు = ఇచ్చెదరు
తెవులులు = శరీరానికి వచ్చే వివిధ రోగాలు
చెంద + ఓడున్ = దరి చేరుటకు భయపడును
అట్లులేనివాడు = ఒకవేళ (ఆర్ధికస్తోమత లేకపోవడం వల్ల కానీ, మరే ఇతర కారణం వల్ల కానీ) రత్నాభరణాలు ధరిండం సాధ్యం కానప్పుడు
అవయవ శుద్ధి = శరీర అవయవముల యొక్క ఆరోగ్యము మరియు కాంతి శుద్ధి కొరకు
హేతు = కారణమైనటువంటి
రుచిర + ఆభరంణబులు = ప్రకాశవంతమైన బంగారు నగలను
దాల్చగాన్ + తగన్ = యోగ్యమైన పద్ధతిలో ధరించాలి
రవణము పొంటె = కేవలం అలంకారం కోసమని
లక్కయును = లక్కతో చేసినవి
రాగియును = రాగితో చేసిన చౌకబారు నగలను
దాల్పగన్ = అలాంటి వాటిని ధరించడం
ఇడ్డవి గావు = శ్రేష్ఠం కాదు
తాత్పర్యము : శరీరానికి మేలైన నవరత్న ఆభరణాలను, స్వర్ణాభరణాలను ధరించడం ఎంతో శ్రేష్ఠం. ఆయా రత్నాలకు అధిపతులైన గ్రహదేవతలు సంతోషించి, మనకు మానసిక ఆనందాన్ని ఇస్తారు. ఈ భూషణాల వల్ల శరీరానికి ఎటువంటి వ్యాధులు (తెవులులు) దరిచేరవు. చక్కని నగల ధారణ అవయవాలకు కాంతిని, శుద్ధిని ఇస్తుంది. అయితే కేవలం పైపై మెరుగుల కోసం లక్క ఎక్కువగా ఉన్నవి, తక్కువ రకం రాగి నగల వంటి చౌకబారు ఆభరణాలను ధరించడం ఆరోగ్యరీత్యా, శాస్త్రరీత్యా మంచిది కాదు.
అర్చా పద్ధతి
14. కం. దానములు చేసి యట స
న్మానంబున దేవపితృసమభ్యర్చనముల్
పూని యొనరించి పిమ్మటం
గాని చనఁగవలదు భుక్తి కార్యంబునకున్
ప్రతిపదార్థము :
దానములు చేసి = శక్తి కొలది ఇతరులకు దానధర్మాలు ఆచరించి
అట = ఆ తర్వాత
సత్ + మానంబున (సన్మానంబున) = పవిత్రమైన మనస్సుతో
దేవ = దేవతలకు
పితృ = పితృదేవతలకు
సమభ్యర్చనముల్ = చక్కటి పూజలు, తర్పణములు
పూని = నియమ నిష్ఠలతో కూడిన సంకల్పం పట్టి
ఒనరించి = పూర్తిచేసి
పిమ్మటగాని = ఆ తర్వాతనే తప్ప
భుక్తి కార్యంబునకున్ = భోజనం చేసేపనులకు
చనగవలదు = వెళ్ళకూడదు
తాత్పర్యము : ఉదయాన్నే నిత్యకృత్యాలు ముగించుకున్నాక, అర్హులకు దానధర్మాలు చేయాలి. ఆ పిమ్మట ప్రశాంతమైన, పవిత్రమైన మనస్సుతో దేవతలను, పితృ దేవతలను భక్తితో పూజించాలి. తర్వాత మాత్రమే మనిషి భోజనానికి ఉపక్రమించాలి. పూజలు చేయకుండా నేరుగా ఆహారం తీసుకోకూడదని భావం.

భోజన పద్ధతి
15. కం. పెక్కండ్రు లేకయున్నను
నొక్కఁ డిరువురైనఁ బంక్తి నొగిఁ గుడువక తా
నొక్కండ భుక్తి గొనుటది
యెక్కడునింద్యమనిచెప్పి రిద్ధచరిత్రుల్
ప్రతిపదార్థము :
ఇద్ద చరిత్రుల్ = పవిత్రమైన / గొప్ప చరిత్ర కలిగిన పెద్దలు
పెక్కండ్రు = ఎక్కువ మంది జనాలు
లేకయున్నను = లేకపోయినప్పటికీ
ఒక్కడు = ఒకడు
ఇరువురు ఐనన్ = కనీసం ఇదరైనా కలిసి
పంక్తిన్ = ఒక వరుసలో కూర్చుని
ఒగిన్ = క్రమముగా
కుడువక = తినకుండా
తాన్ = తానుమాత్రం
ఒక్కండ = ఒక్కడే ఒంటరిగా
భుక్తి గొనుట అది = ఆహారాన్ని భుజించడం అనేది
ఎక్కుడు = మిక్కిలి
నింద్యము అని = నిందించదగినది (తప్పు) అని
చెప్పిరి = చెప్పారు
తాత్పర్యము : ఎక్కువ మంది కలిసి తినే అవకాశము లేకపోయినా, కనీసం ఇద్దరు లేదా ముగ్గురయినా కలిసి కూర్చుని పంక్తి భోజనం చేయాలి. అలా కాకుండా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా కూర్చుని తినడం చాలా పెద్ద తప్పు అని పెద్దలు చెప్పారు.
16. కం. ఇష్టఫల సిద్ధి చేకుఱుఁ
దుష్టియునుం గలుగుపేర్మి దొరయును సుజనో
త్కృష్టుఁడగు భోజనము వి
స్పష్టముగాఁ జేయునేని బహుజనములతోన్
ప్రతిపదార్థము :
బహుజనములతోన్ = ఎక్కువమంది వ్యక్తులతో (నలుగురితో) కలిసి
విస్పష్టముగా = స్పష్టముగా
సుజన = మంచిజనులకు
ఉత్కృష్టుడు + అగు = శ్రేష్ఠుడగును
భోజనము = ఆహారమును
చేయునేని = భుజించినట్లయితే
ఇష్టఫలసిద్ధి = కోరుకున్న ఫలితాలు
చేకూరున్ = లభిస్తాయి
తుష్ఠియనున్ = మానసిక తృప్తికూడా
కలుగున్ = కలుగుతుంది
పేర్మి = పరస్పర ప్రేమాభిమానాలు
దొరయును = లభించును
తాత్పర్యము : మంచి మనసున్న వారితో మరియు తోటివారితో కలిసి భోజనం చేయడం వలన కోరుకున్న పనులు సిద్ధించి శుభం కలుగుతుంది. మనస్సుకు ఎంతో తృప్తి, సంతోషం లభిస్తాయి. అందరి మధ్య ప్రేమాభిమానాలు కూడా పెంపొందుతాయి.
17. కం. కుడుచు నతం డైనను బె
ట్టెడు నాతం డైననపుడు డెందము
కడుఁ గోపముతో నుండినఁ
గుడిచినయన్నంబు కాలకూటముఁ బోలున్
ప్రతిపదార్థము :
కుడుచునతండు ఐనను = అన్నం తినేవాడైనా సరే ఉండినన్
పెట్టెడు నాతండు ఐనను = అన్న వడ్డించే వాడైనా సరే
అప్పుడు = ఆ సమయంలో
డెందము = మనస్సు
రెండై = చంచలమై
కడున్ = మిక్కిలి
కోపముతో ను + ఉండినన్ = కోపముతో ఉన్నట్లయితే
కుడిచిన = తిన్నటువంటి
అన్నంబు = ఆ ఆహారము
కాలకూటమున్ = కాలకూట విషముతో
పోలున్ = సమానమవుతుంది
తాత్పర్యము : తినేటప్పుడు మనశ్శాంతి లేకుండా, మనస్సులో వేరే ఆలోచనలతో లేదా తీవ్రమైన కోపంతో ఉంటే, ఆ తిన్న అన్న ఒంటికి పట్టదు సరికదా, అది విషంతో సమానంగా మారి శరీరానికి హాని చేస్తుంది.

18. కం. అతిమధురమదీపనకర
మతిలవణము నయనకాంతిహర మాహారం
బతితికామ్లము ముదిమికి
నతిశయహేతు వని చెప్పి రాయుర్వేదుల్
ప్రతిపదార్థము :
ఆయుర్వేదుల్ = ఆయుర్వేద శాస్త్రజ్ఞులు (వైద్యులు)
ఆహారంబు = మనం తినే ఆహారంలో
అతిమధురము = అమితమైన తీపిపదార్ధాలు తినడం
అదీపనకరము = జఠరాగ్నిని (ఆకలిని) మందగించేలా చేస్తుంది
అతిలవణము = మిక్కిలి ఉప్పుపదార్థములు తినడం
నయన కాంతిహరము = కంటిచూపును (నేత్రతేజస్సును) హరిస్తుంది
అతి తిక్త ఆమ్లము = మిక్కిలి చేదు, పులుపు పదార్ధాలు తినడం
ముదిమికిన్ = ముసలితనానికి (త్వరగా వృద్ధాప్యం రావడానికి)
అతిశయ హేతువు = ప్రధానమైన కారణం
అని చెప్పిరి = అని చెప్పారు
తాత్పర్యము : అమితమైన తీపి ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. మిక్కిలి చేదు, పులుపు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన త్వరగా ముసలితనం వస్తుంది.
19. తే. కుడువఁ దొణఁగుచు నీళ్లను గ్రోలెనేని
దీపనము చెడుఁ దద్దయు దేహ మఱుగు
భుక్తి మధ్యోదకము కొంత పుష్టిజేయుఁ
బిదపఁ బానీయ మానుట పెద్ద మేలు ter
ప్రతిపదార్థము :
కుడువన్ + తొణగుచున్ = భోజనం తినే ప్రారంభ సమయంలోనే
నీళ్ళను గ్రోలెనేని = నీళ్ళను ఎక్కువగా త్రాగినట్లయితే
దీపనము చెడున్ = ఆకలి (జీర్ణశక్తి) నశిస్తుంది
తద్దయు = దానివల్ల మిక్కిలిగా
దేహము + అఱుగు = శరీరం కృశించిపోతుంది
భుక్తి మధ్య + ఉదకము = భోజనం చేస్తున్న మధ్యలో నీరు త్రాగడం
కొంత పుష్టిజేయున్ = శరీరానికి కొంతపుష్టిని ఇస్తుంది.
పిదపన్ = భోజనం ముగిసిన వెంటనే
పానీయము = నీరు
(ఆనుట = త్రాగుట / స్వీకరించుట)
మానుట = నీరు త్రాగడం మానివేయడం
పెద్దమేలు = శరీరానికి ఎంతోశ్రేష్ఠం
తాత్పర్యము : భోజనం మొదలుపెట్టే ముందు నీళ్ళు తాగితే జీర్ణశక్తి తగ్గి శరీరం శుష్కించిపోతుంది. భోజనం మధ్యలో కొద్దిగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. భోజనం పూర్తి కాగానే వెంటనే ఎక్కువగా నీరు త్రాగకుండా ఉండటం అన్నిటికంటే పెద్దమేలు చేస్తుంది (జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.)
20. తే. కడుపు నాలుగుపాళ్లనుగా నెఱింగి
రెండుపాళ్ళన్నమునను బూరింపవలయుఁ
బానమున నింపఁగా నొకపాలువలయు
వాయుచలనకు నొకపాలు వలయు నెడము
ప్రతిపదార్థము :
కడుపు = ఉదరమును
నాలుగుపాళ్ళనుగాను = నాలుగుభాగాలుగా
నెఱింగి (ఎఱింగి) = తెలుసుకొని
రెండు పాళ్ళన్నమును = అందులో రెండుభాగాలును (సగం కడుపును) అన్నము మరియు కూరలు మొదలగు ఘనాహారముతో
పూరింపవలయున్ = నింపవలెను
పానమునన్ = నీరు మొదలైన ద్రవపదార్ధాలకు
నింపగాన్ = నింపుటకు
ఒకపాలు = ఒక భాగమును (నాల్గవ వంతు)
వలయును = కేటాయింపవలెను
వాయుచలనకున్ = గాలి తిరగడానికి (జీర్ణక్రియ సజావుగా సాగడానికి)
ఒకపాలు = మిగిలిన ఒక భాగమును
నెడము (ఎడము) వలయున్ = ఖాళీగా వదిలి పెట్టాలి
తాత్పర్యము : మన కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకుంటే :
- రెండు భాగాలు (50%): అన్నం, కూరలు, వంటి ఘనాహారంతో నింపాలి.
- ఒక భాగం (25%) నీరు లేదా మజ్జిగ వంటి ద్రవపదార్థాలకు కేటాయించాలి.
- చివరి ఒక భాగం (25%) గాలి ఆడటానికి, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవడానికి వీలుగా పూర్తిగా ఖాళీగా ఉంచాలి.
సగం కడుపును మాత్రమే ఘనపదార్థాలతో నింపడం వలన జీర్ణరసాలు ఆహారంతో బాగా కలుస్తాయి. దీనివల్ల గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి ఉ దరసంబధిత సమస్యలు రావు.

21. తే. కుడిచినప్పుడఁ శయనింపఁ గడుపు పెరుగు
కదల కెచ్చోటఁ గూర్చున్నఁ గలుగుసుఖము
అల్ల నడయాడ నాయువు నగ్గలించు
దూరమరిగిన మృత్యువు దోన యరుగు
ప్రతిపదార్దము :
కుడిచిన + అప్పుడు + అ = భోజనము చేసిన తక్షణమే
శయనింపన్ = పడుకుంటే
కడుపు పెరుగున్ = పొట్ట పెరుగుతుంది
కదలక = శరీరాన్ని ఎటు కదల్చకుండా
ఎచ్చోటన్ + కూర్చున్నన్ = ఒకే చోట కూర్చుండిపోతే
సుఖము + కలుగున్ = అప్పటికి హాయిగానే ఉంటుంది (కానీ ఊబకాయానికి దారి తీస్తుంది)
ಅಲ್ಲ = మెల్లగా
నడయాడన్ = అడుగులు వేస్తూ నడిస్తే
ఆయువున్ = ఆయుష్షు
అగ్గలించున్ = అతిశయిస్తుంది
దూరము + అరిగినన్ = కొంచెం ఎక్కువ దూరం నడిచినట్లయితే
మృత్యువు = అకాల మరణం
తోన = దరిచేరకుండా
అరుగున్ = వెనక్కి వెళ్ళిపోవును
తాత్పర్యము : తిన్న వెంటనే పడుకుంటే పొట్ట పెరుగుతుంది. అన్నం తిన్న తర్వాత ఎటుకదలకుండా ఒకే చోట కూర్చుంటే తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్లు అనిపించినా శరీరం లావెక్కుతుంది. భోజనం ముగిసిన తదుపరి మెల్లగా నడిస్తే ఆయుష్షు పెరుగుతుంది. మరింత దూరం నడిచే అలవాటు ఉన్నవారి దరిదాపుల్లోకి అకాల మృత్యువు రాదు.
22. కం. కడుపు కడుఁబిక్కటిల్లి నఁ
బొడమును మఱిదప్పి హీనభోజనుఁ డైనన్
బడుగగుఁ గావున సమమగు
కుడుపున నేతెవులు లేక కొలఁదియొడ లగున్
ప్రతిపదార్థము :
కడుపు = ఉదరము
కడున్ + పిక్కటిల్లినన్ = మిక్కిలి (పట్టనంతగా) నిండిపోతే
మఱి = ఎక్కువగా
దప్పి = దాహం పొడమును కలుగుతుంది.
హీన భోజనుడు + ఐనన్ = పరిమితి కంటే చాలా తక్కువగా తినేవాడైతే
బడుగు + అగున్ (బడుగగున్) = శరీరం చిక్కిపోయి బలహీనుడగును
కావునన్ = కాబట్టి
సమము + అగు (సమమగును) = సమతుల్యమైన (సమానమైన)
కడుపునను = భోజన నియమం వలనను
ఏ తెవులున్ + లేక = ఎటువంటి రోగాలు లేక
కొలదియు + ఒడన్ + అగున్ = శరీరం సరైన కొలతలతో (ఆరోగ్యంగా) ఉంటుంది
తాత్పర్యము : కడుపు నిండా పట్టనంతగా తింటే విపరీతమైన దాహం, అజీర్తి కలిగి రోగాలు వస్తాయి. అలాగని చాలా తక్కువగా తింటే శరీరం బలహీనపడుతుంది. కాబట్టి, ఎల్లప్పుడూ మితంగా (సమంగా) తినడం వల్ల ఎటువంటి వ్యాధులు లేకుండా శరీరం నిత్యం ఆరోగ్యంగా మరియు
నాజూకుగా ఉంటుంది.
తాంబూల పద్ధతి
23. కం. పూగమునకు గుణములు పై
త్యాగమముం జెఱుచుటయును నాఁకలి మృదులీ
లాగతిఁ బుట్టించుటయును
వేగమె దాహంబు నణఁచు విన్నాణంబున్
ప్రతిపదార్థము :
పూగమునకున్ = పోకచెక్కకు (వక్కకు)
గుణములు = సహజసిద్ధమైన లక్షణాలు ఏవనగా
పైత్త్యాగమముం = (పైత్య + ఆగమమున్) పైత్యం పెరగడాన్ని
(జె) చెఱుచుటయును = పోగొట్టడం (నివారించుట)
ఆకలి(న్) = ఆకలిని
మృదులీలాగతిన్ = మెల్లమెల్లగా (సహజమైన రీతిలో)
పుట్టించుటయును = రేకెత్తించడం
వేగమె = త్వరగానే
దాహంబున్ = దప్పికను
అణచు = అణచివేసేటటువంటి
విన్నాణంబున్ = నేర్పు కలిగియుండును
తాత్పర్యము : తాంబూలంలో వాడే మేలిమి వక్కకు మూడు ప్రధాన గుణాలు శరీరంలో పైత్యాన్ని పెరగకుండా ఆపుతుంది. మందగించిన ఆకలిని మెల్లగా పెంచుతుంది. విపరీతమైన దాహాన్ని కూడా వేగంగా తగ్గించే నేర్పు పోకచెక్కకు ఉంది.

24. సీ. లఘకారి క్రిమిదోష విఘటనసంధాయి
దీపననిర్దోష దీప్తికరము
పాషాణచూర్ణంబు పైత్య వాతళఘ్నంబు
శంఖచూర్ణము పైత్య వాతఘ్నంబు
చిప్పల సున్నంబు శ్లేష్మంబు హరియించు
గుల్లసున్నము వాత గుణముఁ జెఱుచుఁ
దెలివిచ్చుఁ జాల ముత్తియపు సున్నము చూర్ణ
పర్ణ మాయువునకు బాధకంబు
తే. పత్రమూలంబునను రోగపటల ముండు
నగ్ర మది పాపముల కెల్ల నాశ్రయంబు
నడిమి యీనియబుద్ధి వినాశకరము
వీని వర్ణించి తగఁ జేయు వీడియంబు
ప్రతిపదార్థము :
లఘకారి = తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసేది
క్రిమిదోష = కడుపులోని పురుగుల (క్రిముల) సమస్యను
విఘటన సంధాయి = నాశనం చేసేది
దీపన = జఠరాగ్నిని
నిర్దోష = ఎలాంటి దోషాలు లేనిది
దీప్తికరము = శరీరానికి కాంతిని ఇచ్చేది
పాషాణ చూర్ణంబు = రాతి సున్నము
పైత్య వాతఘ్నంబు = పైత్యాన్ని, వాతాన్ని హరించేది
శంఖ చూర్ణము = శంఖములతో చేసిన సున్నము
పైత్య శైత్య హరము = కఫాన్ని, పైత్యాన్ని పోగొట్టేది
చిప్పల సున్నంబు = నత్తగుల్లల చిప్పలతో తయారుచేసిన సున్నము
శ్లేష్మంబున్ = కఫాన్ని
హరియించున్ = పోగొడుతుంది
గుల్లసున్నము = గుల్లలతో కాల్చబడిన సున్నము
వాతగుణమున్ = వాత సంబంధమైన దోషాలను
చెఱుచున్ = నశింపజేయును
ముత్తియపు సున్నము = ముత్యాల భస్మంతో చేసిన అత్యంత శ్రేష్ఠమైన సున్నము
చాలన్ = మిక్కిలిగా
తెలివి + ఇచ్చున్ = బుద్ధికి చురుకుదనాన్ని యిస్తుంది
చూర్ణపర్ణము = సున్నం అతిగాపూసిన తమలపాకు (లేదా) కేవలం (వ)ఒట్టి సున్నాన్ని ఎక్కువగా నమలడం)
ఆయువునకున్ = మనిషి యొక్క ఆయుష్షుకు
బాధకంబు = హానికరము
పత్రమూలంబును = తమలపాకు యొక్క మొదలు భాగము
రోగపటలము + ఉండున్ = వ్యాధుల సమూహానికి నిలయమై ఉంటుంది
అగ్రము + అది = ఆ ఆకు యొక్క చివరి భాగము
పాపముల + కెల్లన్ = సమస్త దోషములకు
ఆశ్రయంబు = నివాసస్థానము
నడిమి = ఆకు మధ్యలో ఉండే
యీనియ (ఈనె) = లావు పాటి ఈనె భాగము
బుద్ధి = ఆలోచనాశక్తికి
వినాశకరము = నాశనము కలిగించేది
వీనిన్ = ఈ భాగాలన్నింటిని
వర్జించి = పూర్తిగా తొలగించి
తగన్ = యోగ్యమైన రీతిలో
వీడియంబు + చేయున్ = తాంబూలము వేసుకోవాలి.
తాత్పర్యము : తాంబూలంలో వాడే సున్నం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులోని, క్రిములను చంపుతుంది, ఆకలిపుట్టించి ఒంటికి తేజస్సు ఇస్తుంది. ఇందులో రాతి సున్నము శరీరంలోని పైత్య, వాత దోషాలను తగ్గిస్తుంది. శంఖ భస్మంతో చేసిన సున్నము కఫాన్ని, పైత్యాన్ని పూర్తిగా హరిస్తుంది.
చిప్పల సున్నం శరీరంలోని కఫ దోషాలను హరిస్తుంది. గుల్ల సున్నం వాతదోషాలను, నొప్పులను తగ్గిస్తుంది. ముత్యపు సున్నం చురుకుదనాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
సున్నం ఆరోగ్యానికి మంచిని చేకూర్చునదే అయినప్పటికినీ తమలపాకుకు సున్నాన్ని మితిమీరి రాసి తింటే ఆయుష్షుకు భంగం కలుగుతుంది.
తమలపాకు మొదలు (తొడిమ) రోగాల సమూహాన్ని కలిగిస్తుంది. ఆకు యొక్క చిగురుమొన సమస్త దోషాలకు ఆశ్రయంగా ఉంటుంది. ఆకుల మధ్యలో ఉండే లావు పాటి ఈనె మనిషి యొక్క బుద్ధిని, ఆలోచనా శక్తిని నాశనం చేస్తుంది. కేవలం శుభ్రమైన ఆకు భాగాన్ని మాత్రమే ఉపయోగించాలి.
25. ఉ. తాలిమిగల్గి తాఁ బరులదైన్యము వాపుచు శాంతిగల్గి సం
క్షాళితచిత్తుఁడయ్యుఁ దగ సాహసకార్యము సేయ మైకొనం
జాలి పరోపకారియయి సంపద కుబ్బని యాతఁ డెప్పుడున్
శ్రీలలనాకటాక్ష సరసీరుహధాముఁడు మంత్రి శేఖరా !
ప్రతిపదార్థము :
మంత్రిశేఖరా ! = ఓ శ్రేష్ఠుడైన మంత్రివర్యుడా !
తామిలిగల్గి = నిశ్చలమైన ఓర్పు కలిగి ఉండి
తాన్ = తాను
పరులదైన్యము = తోటివారి యొక్క దీనస్థితిని
వాపుచున్ = పోగొడుతూ
శాంతిగల్గ = ప్రశాంతమైన గుణాన్ని కలిగి ఉండి
సంక్షాళిత చిత్తుడు + అయ్యున్ = జ్ఞానము చక్కగా కడగబడిన లేదా పవిత్రమైన మనస్సు కలవాడైనప్పటికీ
తగన్ = సమయానుకూలంగా, యోగ్యమైనరీతిలో
సాహస కార్యము = పరాక్రమంతో కూడిని సాహస పనులను
చేయన్ = చేయడానికి
మైకొనన్ = సిద్దపడేవాడు
జాలి = లోకంపై దయా హృదయం కలిగి
పరోపకారి అయి = నిరంతరం ఇతరులకు మేలు చేసేవాడై
సంపదకున్ + ఉబ్బని = ఎంతటి ఐశ్వర్యం కలిసివచ్చినా అహంకారంతో పొంగిపోని
అతడు = అటువంటి ఉత్తమ పురుషుడు
ఎప్పుడున్ = ఎల్లవేళలా
శ్రీలలనా కటాక్ష = లక్ష్మీదేవి యొక్క కరుణా వీక్షణములకు
సరసీరుహ ధాముడు = తామరపువ్వు వంటి నివాస స్థానము (ఆశ్రయుడు) అవుతాడు
తాత్పర్యము : ఎవడైతే గొప్ప ఓర్పును కలిగి ఉండి హృదయంలో దయ కలిగి నిరంతరం పరోపకారం చేస్తూ ధన గర్వంతో ఉబ్బిపోకుండా ఉంటాడో… అటువంటి సద్గుణాలు కలిగిన వ్యక్తి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అతడు సిరిసంపదలతో తులతూగుతాడు.
26. కం. కారణము దైవ మనుచును
బ్రారంభం బుడుగఁ జనదు ప్రభువుల కెందున్
ఊరక తిలలను దైలం
బేరీతిని బడయవచ్చు నిద్ధచరిత్రా
ప్రతిపదార్దము:
నిద్దరచరిత్రా ! = నిరుపమైన (గొప్ప) చరిత్ర కలిగిన ఓ మంత్రి వర్యుడా !
కారణము = ఏ పని జరగడానికైనా మూలకారణం
దైవము + అనుచును = దైవబలమే (అదృష్టమే) అని అనుకుంటూ
ప్రభువులకున్ = పాలకులకు లేదా సాధారణ మనుషులకు
ఎందున్ = ఏ విషయమునందైనా
ప్రారంభంబు = చేయవలసిన పనిని మొదలు పెట్టే ప్రయత్నాన్ని
ఉడుగన్ + చనదు = వదిలిపెట్టడం తగదు
ఊరక = ఏ శ్రమ లేదా ప్రయత్నం చేయకుండా కేవలం ఖాళీగా కూర్చుంటే
తిలలను = నువ్వుల నుండి
తైలంబు = నూనెను
ఏ రీతిని = ఏ విధంగా మాత్రం
పడయవచ్చున్ = పొందగలరు ? (పొందలేరు కదా !)
తాత్పర్యము : ఏ కార్యమైనా సిద్ధించడానికి అదృష్టమో లేదా దైవానుగ్రహమో కారణం అని సాకుగా చెప్తూ, ప్రయత్నాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎందుకుంటే నువ్వులను తెచ్చి గానుగలో వేసి నూరే శ్రమ (ప్రయత్నం) చేయకుండా, కేవలం ఊరికే కూర్చుంటే నువ్వుల నుండి నూనె ఏ విధంగానూ బయటకు రాదు. దైవం ఉన్నా మానవ ప్రయత్నం ఉంటేనే అనుకున్న పని పూర్తవుతుంది.

27. మ. గిరులెవ్వారలు ప్రోచి పెంచి రిటు నింగిన్ ముట్టఁగా నేరులె
వ్వరు వాటంబులుగాఁగఁ ద్రవ్విరి ? మృగవ్రతంబు సేవింపఁ గే
సరికం బట్టముగట్టి రెవ్వరు ? మహైశ్వర్యంబు లుత్సాహులై
తిరుగన్ గల్గును మంత్రియప్ప నుతకీర్తీ ! నాగమాంబాసుతా !
ప్రతిపదార్థము :
నాగమాంబా సుతా ! = నాగమాంబ కుమారుడా !
నుతకీర్తీ ! = కొనియాడదగిన వాడా !
మంత్రియప = అప్పనమంత్రివర్యుడా !
గిరులున్ (ఖగములు / గరుడుడు) = పక్షులరాజు అయిన గరుత్మంతుడిని
ఎవ్వారలు = ఎవరు మాత్రం
ప్రోచి = రక్షించి
పెంచిరి = పెంచి పెద్దచేశారు ?
ఇటు = ఈ విధంగా
నింగిన్ ముట్టగాను = ఆకాశాన్ని తాకేలా ఎగరడాన్ని (ఎవరు నేర్పారు)
ఏరులు = ప్రవహించే నదులను
ఎవ్వరు = ఎవరు
వాటంబలు గాగన్ = తమకు అనుకూలమైన మార్గాలలో (సముద్రం వైపుకు) సాగిపోయేలా
ద్రవ్విరి ? = త్రవ్వారు ? (ఎవ్వరూ త్రవ్వలేదు కాదా ! అని భావం)
మృగవ్రతంబు = జంతువుల సమూహమంతా
సేవింపన్ = తన్ను కొలిచేటట్లుగా
కేసరికిన్ (సింహానికి) = మృగరాజైన సింహానికి
ఎవ్వరు = ఎవరు
పట్టము + కట్టిరి = రాజుగా పట్టాభిషేకం చేశారు ? (ఎవరూ చేయలేదు కదా ! అని భావం) (పట్టము గట్టిరెవ్వరు)
ఉత్సాహులై = ఎల్లప్పుడూ నిరంతర ఉత్సాహంతో
తిరుగన్ = ప్రయత్నిస్తూ శ్రమిస్తే
మహా + ఐశ్వర్యంబులు = గొప్ప సిరిసంపదలు (మహైశ్వర్యంబులు)
కల్గును = దానంతటవే సిద్ధించును
తాత్పర్యము : ఆకాశాన్ని తాకేలా ఎగిరే గరుత్మంతుడిని ఎవరు పెంచి పెద్దచేసి అంత ఎత్తుకు ఎగరడం నేర్పారు ? నదులు సముద్రం వైపు వాలుగా ప్రవహించడానికి ఆమార్గాలను ఎవరు తవ్వారు ? అడవిలోని జంతువులన్నీ లొంగి ఉండేలా సింహానికి అడవికి రాజుగా ఎవరు పట్టాభిషేకం చేశారు ?
అలాగే, మనుషులు కూడా ఇతరులపై ఆధారపడకుండా, నిరంతరం ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో తమ కర్తవ్య సాధనలో శ్రమిస్తూ ఉంటే….. లక్ష్మీదేవి కటాక్షం కలిగి మహైశ్వర్యాలు దానంతటవే వారిని వరిస్తాయి. మానవ ప్రయత్నానికి ఉత్సాహమే మూలమని భావం.
28. సీ. పగలు నిద్రింపక పరకాంతఁ గోరక
పరదూషణములేక పరుల కెపుడుఁ
గీడు చింతింపక కినుకయుఁ గపటంబు
గలుగక చవి యెంత గలిగెనేని
పథ్యంబు శుచియును భక్ష్యంబుగాని ప
దార్థంబుమీఁదఁ దత్పరత లేక
బుడుబుడులాడుచుఁ బడఁతులు మొగముల
వెడమాయమాటలు వినఁగఁబోక
తే. పలుకుతఱి జడివెట్టక పరుసగాక
బొంకులాడక తన్నుఁదా బొగడుకొనక
కెలనివారికి మేలైన నెలమిఁ బొందు
మనుజునకు నభ్యుదయ మొందు మంత్రియప్ప
ప్రతిపదార్థము :
మంత్రియప్ప = అప్పనమంత్రి వర్యుడా !
పగలు నిద్రింపక = పగటిపూట నిద్రపోకుండా (ఆరోగ్యసూత్రం)
పరకాంతన్ + కోరక = పరాయి స్త్రీలను మోహించకుండా
పరదూషణములేక = ఇతర వ్యక్తులను నిందించే గుణము లేకుండా
పరులకున్ + ఎపుడున్ = తోటివారికి ఎల్లప్పుడూ
కీడు + చింతింపక = చెడు లేదా అపకారం చేయాలని తలచకుండా
కినుకయున్ = కోపమును
కపటంబునన్ = మోసపూరితమైన ఆలోచనలు
కలుగక = దరిచేరనీయకుండా
చవి + ఎంత + కలిగెను + ఏని = ఎంతటి రుచికరమైన పదార్ధం అయినప్పటికిని
పథ్యంబు = శరీరానికి హితవు చేసేది
శుచియును = పరిశుభ్రమైనది
భక్ష్యంబు + కాని = తినదగినది కాని
పదార్ధంబు మీదన్ = వస్తువుల (ఆహారము) పట్ల
తత్పరత + లేక = మితిమీరిన ఆసక్తి చూపకుండా
బుడుబుడులాగుచున్ = అనవసరంగా మాట్లాడుతూ
పడతుల మొగముల = చంచల స్వభావం కల స్త్రీల ముఖముల చాటున దాగి ఉన్న
వెడమాయమాటలు = మోసపూరితమైన అసత్యపు మాటలను
వినగన్ + పోక = వినుటకు ఇష్టపడక
పలుకుతఱిన్ = సమాజంలో ఇతరులతో మాట్లాడే సమయంలో
జడి పెట్టక = అవతలి వారిని భయపెట్టేలా మాట్లాడకుండా
పరుస + కాక = కఠినమైన పదాలను వాడకుండా
బొంకులు + ఆడక = అబద్ధాలు చెప్పకుండా
తన్నున్ + తాను = తననుతాను
బొగడుకొనక = ఆత్మస్తుతి చేసుకోకుండా
తాత్పర్యము : పగటి పూట నిద్రించకూడదు. (ఇది జఠరాగ్నిని మందగింప జేస్తుంది). పరాయి స్త్రీలను కామించకూడదు. మనస్సులో కోపతాపాలు, కపటబుద్ధి ఉంచుకోరాదు. ఎంతరుచిగా ఉన్నప్పటికీ తినకూడదని చెప్పిన ఆహార పదార్థాల వైపు మనస్సును మళ్ళించకూడదు.
అర్ధంలేని వ్యర్ధ ప్రసంగాలు (వాగుడు) చేయకూడదు. వంచనతో కూడిని కబుర్లను అసలు నమ్మకూడదు. సమాజంలో గౌరవం, ఉన్నతస్థానం (అభ్యుదయం) పొందగోరే ప్రతి మనిషి వాక్సుద్ధిని, నిగ్రహాన్ని కలిగి ఉండాలి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు గద్దించినట్లుగా, భయపెట్టినట్లుగా మాట్లాడకూడదు. ఎప్పుడూ అసత్యాలు పలుకకూడదు మరియు తనను తాను గొప్పగా పొగడుకోకూడదు.
పెద్దలకు, వివేకవంతులకు నిరంతరం మేలు చేస్తూ వారితో స్నేహ పూర్వకంగా మెలగాలి. ఇటువంటి ఉత్తమ సత్ప్రవర్తన కలిగిన మనిషికి జీవితంలో ఎల్లప్పుడూ అభ్యుదయం, సకలశుభాలు కలుగుతాయని భావము.