TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 9 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

 1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
 2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

1. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

ఆ|| వారి తండ్రిపాలు వారికి నిచ్చి నీ
పాలు నీవుఁ బుత్ర పౌత్ర చేయము
ననుభవించి సఖులరై యుండుఁ డిది బంధు
మిత్ర సుజనకోటి మెచ్చు తెఱఁగు
జవాబు:
ప్రతిపదార్థం :

వారి తండ్రిపాలు = పాండవుల తండ్రి భాగం
వారికిన్ + ఇచ్చి = పాండవులకు ఇచ్చి
నీ పాలు = నీ రాజ్య భాగం
నీవున్ = నీవు
పుత్రపౌత్ర చయమున్ = నీ కొడుకుల, మనుమల సమూహం.
అనుభవించిన = అనుభవించి
సుఖులురు+ఐ+ఉండుఁడు = హాయిగా జీవించండి.
ఇది = ఇట్లా ఉండటం,
బంధుమిత్ర సుజనకోటి = చుట్టముల, స్నేహితులు, సత్పురుషుల యొక్క సముదాయం
మెచ్చుతెఱగు = కొనియాడు విధమై ఉన్నది

తాత్పర్యం: రాజా! పాండవుల తండ్రి భాగం పాండవుల కిచ్చి, నీ రాజ్యభాగం, నీ కుమారులు, నీ మనుమళ్ళూ హాయిగా అనుభవిస్తూ ఉంటే చుట్టాలూ, స్నేహితులూ, సత్పురుషులు అందరు . మిమ్ములను కొనియాడుతారు.

2. మ.కో॥ నీ తపంబున కేను మెచ్చితి నిర్జరోదక వాహినిన్
నా తలన్ ధరియించెదన్ జననాథ! లెమ్మని పల్క ను
ర్వీతలేశుఁడు హృష్టుఁడై కనువిచ్చి శంకరుఁ జూచి సం
ప్రీతి మ్రొక్కి నుతించి తన్ గృతకృత్యుఁగాఁ దలఁచెన్ మదిన్.
జవాబు:
ప్రతిపదార్థం:

జననాథ ! = ఓ రాజా
లెమ్ము + అని = లేవుమని
నీ = నీ
తపంబునకున్ = తపస్సుకు
ఏను = నేను
మెచ్చితి = సంతోషించాను
నిర్జర = దేవలోకంలోని
ఉదక = నీటి
వాహినిన్ = ప్రవాహాన్ని (నదిని)
నా తలన్ = నా తలపై
ధరించెదన్ = ధరిస్తాను
పల్కన్ = చెప్పగా
ఉర్వీతలేశుఁడు = రాజు (భగీరథుడు)
హృష్టుడై = సంతోషించి
కనువిచ్చి = కన్నులు తెరిచి
శంకరుఁన్ + చూచి = శంకరుణ్ణి చూసి
సంప్రీతి మ్రొక్కి = మనస్ఫూర్తిగా మొక్కి
నుతించి = కీర్తించి

తాత్పర్యం : ఓ రాజా నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై ధరిస్తాను. అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
సిద్ధప్ప జ్ఞానబోధలోని నీతులు వివరించండి.
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్దప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధలో నీతులను వివరించాడు. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడు, కొన్ని సారెమీద, కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పగలగా కొన్ని మాత్రమే మంచిగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి.

అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిపై మోక్షాన్ని పొందుతారు.. కోపంతో మానవత్వం పోతుంది. కోపం నష్టపరుస్తుంది, పాపం పెరిగేలా చేస్తుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని చెప్పాడు.

డబ్బు ఉన్నవారిని గౌరవిస్తారు. కాని పేదవారి గుర్తించరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. నేనే, బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చలిచీమలు కూడా పామును చంపుతాయి. కాబట్టి ఎదుటి వారి ముందు గొప్పలు చెప్పుకోవద్దు. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు.

చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్తులు, కులం, అధికారం, సంసారం – ఇలా అనేక విషయాలపై మోహంతో భక్తి లేక ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

వేదాలు తెలిసిన వేమన తాతలాంటి వాడు. సురలను ఆనందింపచేసే సుమతి శతక కర్త బద్దెన పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం తండ్రి లాంటి వారు. ఈశ్వరమ్మ అక్క లాంటిది. సిద్ధప్ప అన్న వంటి వాడు. కాళిదాసు. మా చిన్నన్న. అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు.

వారిలాగా లోక కళ్యాణం కోసం జీవించాలి. నాలుక తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు, ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు.

చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు.

వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుందని సిద్ధప్ప నీతులను చెప్పాడు.

ప్రశ్న 2.
‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి.
జవాబు:
దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది. తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.

దుందుభి అధికమైన కరుణతో పేడల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది. రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయగానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది. కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి `ను, ప్రసృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని

కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.

తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలపై ప్రవహిస్తున్నది. అందంగా ప్రవహించే ఓ దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట. గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి.

దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం . చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

ప్రశ్న 2.
సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.
జవాబు:
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది.

సృజనాత్మకత వివిధ కోణాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి.

మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.

పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రిని తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు. విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు.

తరువాత L.L.B. చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు.

మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్ లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం.ఇడి లేదా పి. హెచ్ఐల్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే
తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు. ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్క పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు. ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని

రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ?
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డబ్బులను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సికి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్ లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు.

దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు. దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు.

దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

ప్రశ్న 1.
ఐక్యమయ్యేదరు నిటులు అవని విడిచి
జవాబు:
కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.
సందర్భం : కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సారెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : దైవంలో ఐక్యమవుతారని అర్థం
వివరణ : కుమ్మరి చేసిన కుండలన్నీ ఉపయోగపడనట్లే మానవులందరూ మోక్షాన్ని పొందలేరని భావం.

ప్రశ్న 2.
మముబెంచు తల్లివై పూ పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.
వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

ప్రశ్న 3.
నీ గళమే ఒక మధుర కవితల క్యాసెట్
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా!! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : నీ గొంతు మధురమైన కవితలతో కూడిన క్యాసెట్ వంటిది అని అర్థం.
వ్యాఖ్య : కోకిల ప్రతీ కూతలో కొత్త భావాలు వస్తున్నాయని భావం.

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

ప్రశ్న 4.
ఏ లెక్క జూసినా నువు జేసె కష్టమే ఎక్కువాయే
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడ పిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికమని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఏ లెక్క ప్రకారం చూసినా స్త్రీలు చేసే పని విలువనే అధికం అని అర్థం.
వ్యాఖ్య : స్త్రీలు చేసే పనివిలువ ఎక్కువ అయినా స్త్రీలకు తక్కువ కూలి ఇస్తారని భావం.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.

ప్రశ్న 1.
వివాహం విద్యానాశాయ
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.
వ్యాఖ్య : గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

ప్రశ్న 2.
ప్రధమ ప్రయత్నం విఫలమయింది
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది.. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్. కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు. సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.
వ్యాఖ్య : దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో, ‘మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 3.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.
వ్యాఖ్య : 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

ప్రశ్న 4.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్దిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.
అర్థం : : ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని.
వ్యాఖ్య : వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
భరతవంశం గొప్పతనం తెలుపండి.
జవాబు:
భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం అనే ఆరు గుణాలకు ప్రసిద్ధి. ఆ భరత వంశంలో పుట్టిన వారందరూ పై సద్గుణాలు గలిగి కీర్తి పొందారు. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ సద్గుణాలయందు శ్రేష్టులు అనడంలో పాండురాజు ఔన్నత్యం తెలపడంతోపాటు ధృతరాష్ట్రుని ముందు కాళ్ళకి బంధం వేయడం కనిపిస్తుంది. నీ కుమారులు కూడా కీర్తి భారం వహించ జాలినవారు అవడం వల్ల యుద్ధం చేసి చెడ్డపేరు పొందకూడదు అనే సూచనా కనిపిస్తుంది.

ప్రశ్న 2.
గంగ ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ?
జవాబు:
శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను.

ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లుగల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది.

ప్రశ్న 3.
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ?
జవాబు:
కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.

ప్రశ్న 4.
దుందుభితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి.
జవాబు:
కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. అతని దుందుభి స్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలుగా ప్రవహిస్తున్నదని చెప్పడం ద్వారా దుందుభికి కవులకు ఉన్న సంబంధాన్ని గంగాపురం హనుమచ్ఛర్మ వివరించాడు.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
ఎలాంటి వారి సాంగత్యము వెంటనే మానుకోవాలి ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒక పొలం చూపించి యజమాని పన్నిన వలలో చిక్కుకునేల చేసింది. రక్షించమని వేడుకున్నా రక్షించలేదు. సాయంకాలమైనా తన మిత్రుడు ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ వచ్చి వలలో ఉన్న జింకను చూసింది. నేను ముందే హెచ్చరించినా నామాట వినక పోతివి. మంచివారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చేవాసనను గుర్తించలేరు.

అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు. మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అని చెప్పింది. అది విన్న జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోసపోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని నేను ఉహించలేదని చెప్పింది.

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి.

రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.

ప్రశ్న 3.
ఖజానా బిల్డింగ్ లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.
జవాబు:
గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు జాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు “ప్పించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణం నిలుస్తుంది. అ వస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషేరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీ. సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

ప్రశ్న 4.
బిరుదురాజు మల్లినాధసూరి తాళపత్ర గ్రంథాలు ఎట్లా సంపాదించాడు ?
జవాబు:
తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వగ్రామం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడు తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసి వెళ్లి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. అంతటితో సంతృప్తి పడక వారి పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇవ్వబోయారు. కాని అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పి వారు ఇవ్వలేదు. తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ, ఆ భూమి తమ జీవ నాధారమనీ కంటతడి పెట్టడం చూసి తన మిత్రుడు కొండయ్య సహకారంతో ఆ భూస్వామిని ఒప్పించి, భూమిని పురోహితునికి ఇప్పించారు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలను బిరుదురాజు రామరాజుకు ఇచ్చాడు.

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో

ప్రశ్న 2.
ధవళ పారావతం అంటే ఏమిటి ?
జవాబు:
తెల్లని పావురం

ప్రశ్న 3.
నిసార్ ఏ సంవత్సరం నుంచి పాటలు రాస్తున్నాడు ?
జవాబు:
1986 నుండి

ప్రశ్న 4.
కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు ?
జవాబు:
శ్రీకృష్ణుడు

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

ప్రశ్న 5.
‘పండరీనాథ రామాయణం’ ఎవరికి అంకితం ఇచ్చారు ?
జవాబు:
శ్రీరామచంద్రునికి

ప్రశ్న 6.
కుండలను చేసేది ఎవరు ?
జవాబు:
కుమ్మరి

ప్రశ్న 7.
కనుమరుగవుతున్న కళారూపాలపై నిసార్ రాసిన పాట ఏది ?
జవాబు:
“చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా
గానం చేశాడు.

ప్రశ్న 8.
తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
తిక్కన నెల్లూరు మండలాన్ని పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థానకవి.

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది ?
జవాబు:
మానవుని మేధ.

ప్రశ్న 2.
1999లో ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది ?
జవాబు:
హంస పురస్కారం

ప్రశ్న 3.
‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం పుస్తకం లోనిది ?
జవాబు:
మహామంత్రి మాదన్న

ప్రశ్న 4.
బిరుదురాజు రామరాజు పిహెచ్.డి గ్రంథం పేరేమి ?
జవాబు:
తెలుగు జానపద గేయ సాహిత్యం.

ప్రశ్న 5.
చిన్నయసూరి జన్మస్థలమేది ?
జవాబు:
శ్రీ పెరంబుదూరు

ప్రశ్న 6.
మున్షీ ప్రేమ్చంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు ?
జవాబు:
మాడపాటి హనుమంతరావు.

ప్రశ్న 7.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 8.
భాగ్యనగర నిర్మాత ఎవరు ?
జవాబు:
మహమ్మదు ఖుతుబ్ షా

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (6 × 1 = 6)

1. మత్తేభం
జవాబు:

 1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
 2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
 3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
 4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
 5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

TS Inter 2nd Year Te Model Paper Set 9 with Solutions 1

2. తేటగీతి
జవాబు:

 1. తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
 2. ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
 3. ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
 4. ప్రాసయతిని పాటింపవచ్చు.
 5. ప్రాస నియమం ఉండదు.

TS Inter 2nd Year Te Model Paper Set 9 with Solutions 2
యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పా – ఫ’ లకు యతిమైత్రి చెల్లింది.

3. శార్దూలము
జవాబు:

 1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
 2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
 3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
 4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
 5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.

TS Inter 2nd Year Te Model Paper Set 9 with Solutions 3

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

 1. హ గణము (గలము)
 2. న గణము అనేవి.

ప్రశ్న 2.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 3.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

ప్రశ్న 4.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.

ప్రశ్న 5.
‘గురువు’ అనగానేమి ?
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.

ప్రశ్న 6.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 7.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 8.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. యమకం
జవాబు:
అక్షర సముదాయం అర్థభేదంతో పునరావృతమైనచో దాన్ని ‘యమకాలంకార’ మంటారు.
ఉదాహరణ : లేమా! దనుజుల గెలవగ
లేమా ! నీవేల కడగి లేచితి విటులన్
లే, మాను ! మాన వేనియు
లే మా విల్లందు కొనుము లీలిన్ గేలన్.

వివరణ : పై పద్యంలో మొదటి ‘లేమా’ అనేది, స్త్రీ సంబోధన వాచకం. రెండవ ‘లేమా’ అనేది, గెలువలేక పోతామా ? అనే అర్థాన్ని ఇచ్చేది. మూడవచోట, “లే” కు, లెమ్మని, మానుకొమ్మని అర్థం. నాలుగో చోట, లేచి మా విల్లు అందుకొమ్మని ప్రేరేపించటం. అందువల్ల ఇది యమకాలంకారం.

2. స్వభావోక్తి లక్షణము
జవాబు:
స్వభావోక్తి లక్షణము : జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి’. ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.

3. ఉపమాలంకార లక్షణము
జవాబు:
ఉపమాలంకార లక్షణము : ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”, ఇందులో

 1. “ఉపమేయం” (వర్ణించే వస్తువు),
 2. “ఉపమానం” (పోల్చు వస్తువు),
 3. సమాన ధర్మం,
 4. ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన -భాగాలుగా ఉంటాయి.

ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది. దీనిలో,

 1. ఉపమేయం : “రాజుకీర్తి”
 2. ఉపమానం : ‘హంస’
 3. సమాన ధర్మం : “ఓలలాడటం”
 4. ఉపమావాచకం : ‘వలె’

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.

ప్రశ్న 2.
ఒకే హల్లు అనేకసార్లు ఆవృతి అయితే అది ఏ అలంకారం ?
జవాబు:
ఒకే హల్లు, అనేకసార్లు ఆవృతి అయితే, అది ‘వృత్త్యనుప్రాస అలంకారం.

ప్రశ్న 3.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.

ప్రశ్న 4.
ఉపమావాచకాలు ఏవి ?
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

ప్రశ్న 5.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

ప్రశ్న 6.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

ప్రశ్న 7.
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)

ప్రశ్న 8.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం : తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

XVI. (అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణను రాయండి. (1 × 5 = 5)
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం – ముఖ్య అతిథి ఉపన్యాసం ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన : నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ : నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన : అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ : ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా!
వందన : నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ : అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన : మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ : బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా !
వందన వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ : ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన : ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ : తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన : ధన్యవాదాలు సర్ !

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ?
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 2.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 3.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 4.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

ప్రశ్న 5.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

Leave a Comment