TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 10 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

 1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
 2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

1. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. కం॥ తనుఁ దాన పోలుగా కే
మనవచ్చు ? నజాతశత్రు నతిశాంతతయున్
వినయుము సత్యము మున్నే
జనపతులకుఁ గలవు సెపుమ ? సౌజన్యనిధీ !
జవాబు:
ప్రతిపదార్ధం :

సౌజన్యనిధీ = మంచితనానికి స్థానమైనవాఁడా!
తనున్+తాను+అ+పోలున్+కాక = అతడికి అతడే సాటి అగును
ఏమి + అనన్ వచ్చున్ ? = అతడిని ఎంతని కొనియాడగలము ?
అజాతశత్రు = ధర్మజుడి యొక్క
అతి = ఎక్కువైనా
శాంతతయున్ = శాంతస్వభావమూ,
వినయమున్ = అణకువా
సత్యమున్ = సత్యమూ
మున్ను = పూర్వం
ఏ జనపతులకున్+కలవు = ఏ రాజులకున్నాయో
చెపుము + అ = చెప్పుము

తాత్పర్యం : ధర్మపుత్రుడికి సాటి ధర్మపుత్రుడే. అతడిని ఎంతని కొనియాడగలం ? ఆయన శాంతస్వభావం, అణకువ, సత్యనిష్ఠ ఇంతకు మునుపు ఏరాజులకున్నవో చెప్పు.

2. శా॥ ఈరీతిన్ జగదీశు మస్తకముపై నేపారి యగ్గంగ దు
ర్వారప్రక్రియ వ్రాలియున్ వెడలిపోవన్ లేక తన్మాయచే
వారింపంబడి తజ్జటాటవి భ్రమింపం జొచ్చెం బెక్కేండ్లుగా
సారోదార పయోదమండల చరత్ సౌదామనీ తుల్యయై.
జవాబు:
ప్రతిపదార్థం :

ఈరీతిన్ = ఈ విధంగా
జగదీశ = శివుని
మస్తకముపైన్ + ఏపారి = తలపై పడి
ఆ + గంగ = ఆ గంగా
దుర్వార = నివారింపలేని
ప్రక్రియ = విధంగా
వ్రాలియున్ = పడి
వెడలిపోవన్ లేక = వెళ్ళలేక
తత్ + మాయచే = శివుని మాయచే
వారింపంబడి = నిలుపబడి
తత్ + జటాటవి = ఆ శివుని జడలనే అడవిలో
సార + ఉదార = గొప్ప
పయోదమండల = మబ్బులలో
చరత్ సౌదామనీ = కదులుతున్న మెరుపు
తుల్యమై = లాగ
భ్రమింపన్ చొచ్చెన్ = తిరిగింది

తాత్పర్యం : ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి.
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధను రచించాడు. దీనిలో మానవులకు కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. కుమ్మరి చేసిన కుండలన్ని ఎలా అయితే పనికిరావో అలానే మానవులు అందరూ మోక్షాన్ని పొందలేరని చెప్పాడు. కేవలం మర్యాదతో మంచి పనులు చేసినవారే మోక్షాన్ని పొందుతారు. కోపం వల్ల డబ్బు, పరువు, ఆరోగ్యం అన్ని నశిస్తాయి.

కోపం కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని హితవు పలికాడు. ఏళ్ల కాలం ఒక్క తీరుగా గడవదు. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోకూడదనే సందేశాన్ని ఇచ్చాడు.

కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది.

ఆస్థులు శాశ్వతమని భావించరాదు. ప్రజలు సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ గర్వాన్ని ప్రదర్శిస్తారు. అలా ఉంటే ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారని హెచ్చరించాడు.

వేమన, బద్దెన, వీరబ్రహ్మంగారు, ఈశ్వరమ్మ, సిద్ధప్ప, కాళిదాసు, అమరసింహుడు, యాగంటి మొదలైన మహానుభావులు కవికి ఆత్మ బంధువుల వంటివారని చెప్పడం ద్వారా వారిలాగా ప్రజల మేలు కొరకు జీవించాలని సూచించాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు.

జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు. ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి. సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును

మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారని సందేశాన్ని ఇచ్చాడు.

ప్రశ్న 2.
‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి.
జవాబు:
దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది. తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.

దుందుభి అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది. రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది.

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.

తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నది.

అందంగా ప్రవహించే దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి. దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు.

భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి’ అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

ప్రశ్న 2.
సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.
జవాబు:
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది.

సృజనాత్మకత వివిధ కోణాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయో గించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి.

అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం.

మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రిని తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు. విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు.

తరువాత L.L.B. చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని . సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు, అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం.ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం,

యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు.

ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి.

అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు. ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి. ఇంకో జామీను తీసుకున్నాడు.

రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్క పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు.

ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం,పెట్టించాడు. ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ?
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డబ్బులను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు – తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సీకి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు.

దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు. దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు.

దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

ప్రశ్న 1.
కష్టాల కొలిమిలో ఇంకెంత కాలమేడుస్తవమ్మా
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది. ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : కష్టాలనే కొలిమిలో ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారని అర్థం. వ్యాఖ్య : స్త్రీలు వారి జీవితాన్ని వారి కుటుంబంకోసం త్యాగం చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఆ బాధలను భరిస్తారు ఎదిరించాలని భావం.

ప్రశ్న 2.
ఏ దేవుళ్లు నిన్ను వాహనం చేసుకొంటారు ?
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు. సందర్భం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయం తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. అని సమాధానం చెప్పుకున్నాడు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని, చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను ఏ దేవుడు వాహనంగా అగీకరిస్తాదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్య అర్థం.
వ్యాఖ్య : వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం అని భావం.

ప్రశ్న 3.
పారెదవు తాత్వికత న్శివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని
వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

ప్రశ్న 4.
నాలుకయు మాకు నిలవేల్పునాది శక్తి
జవాబు:
కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.
సందర్భం : నాలుక తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : నాలుక మాకు ఇంటి దేవత అయిన ఆదిశక్తితో సమానం అని అర్థం.
వివరణ : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.
వ్యాఖ్య : రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని
భావ

ప్రశ్న 2.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.
వ్యాఖ్య : తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

ప్రశ్న 3.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు ‘ వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.
వ్యాఖ్య : ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

ప్రశ్న 4.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫ్ను చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.
వ్యాఖ్య : ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

VII. కింది వాటిలో రెండింటికీ సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది ?
జవాబు:
సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు. భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సున్నతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజునునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు. ఆ మాంసపు ముద్దను ముక్కలు చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు జన్మించారు. వీరు పెరిగి ప్రజలను కష్టపెట్టసాగారు.

వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో పాతాళానికి వెళ్ళారు. అక్కడ తమ యాగాశ్వాన్ని చూశారు. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న కపిలమహర్షిని చూశారు. ఆ మహర్షి తమ యాగాశ్వాన్ని అక్కడ దాచిపెట్టాడని అతని తపస్సును భగ్నం చేయ ప్రయత్నించారు. అలా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు.

ప్రశ్న 2.
సారపు ధర్మం ఎలాంటిది ?
జవాబు:
ధర్మం ఎప్పుడూ సారవంతమైనది. శక్తివంతమైనదే, సత్యం ఎల్లప్పుడూ కల్మషం లేనిదే, నిర్మలమైనదే, స్వచ్ఛమైనదే. అవి రెండు స్వయం సమర్థములైనవే. అయితే వాటిని వ్యతిరేకించేవీ, కలతపెట్టేవీ, నశింపజేయ యత్నించేవి పాపం, అసత్యం. సత్యధర్మాలు ఫలవంతమయ్యే తరుణంలో పాపం, అబద్ధాలు అడ్డుపడి చెడగొట్టే యత్నాలు చేస్తాయి. కాని, అవి చెడిపోవు. ధర్మాన్ని రక్షించేవారు దానికొరకు తమ శక్తిని ధారపోయాలి. సత్యాన్ని రక్షించేవారు సత్యాచరణంలో త్రికరణశుద్ధిని ప్రదర్శించాలి. అప్పుడు ధర్మసత్యాలు తమ సార నిర్మలత్వాలను రక్షించుకో గలుగుతాయి. దీనిని తెలిసిన విజ్ఞులు తమ బాధ్యతను తెలుసుకొని వాటిని రక్షించి తమను తాము రక్షించుకోవాలి. ఆ విషయంలో ఉపేక్ష చేస్తే వారి చరిత్రలకు ధర్మసత్య కవచాలు తొలగిపోయి బలహీనులై పాపాలకూ, అసత్యాలకూ బలి అయిపోతారు. దక్షులై కూడా తమ ధర్మాన్ని నిజాయితీతో నిర్వహించని వారికి చేటు రాకతప్పదని ఈ సందేశం.

ప్రశ్న 3.
కుటుంబ ప్రగతిలో స్త్రీ పాత్రను వివరించండి.
జవాబు:
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. ఇలా కుటుంబ ప్రగతిలో స్త్రీపాత్ర కీలకం అని నిసార్ తెలిపాడు.

ప్రశ్న 4.
కోకిల ఎక్కడ ఉంది ? దాని పాటకు స్పందన ఎలా ఉంది ?
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమనలాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే కోఠీ సెంటర్ లో ఎవరో కోటి మందిలో ఒకడికి తప్ప కోకిల పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని అందుకే స్పందన తక్కువగా ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్పాడు.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నంచేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

ప్రశ్న 2.
గృహస్థుని ధర్మమేమిటి ?
జవాబు:
భాగీరథి తీరంలోని జువ్వి చెట్టుపై ఉన్న గద్దతో కపట స్నేహం చేయాలని వచ్చిన పిల్లిని ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడిగింది. పిల్లి తనగురించి చెప్తూ ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నానని అన్నది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా? అని ప్రశ్నించింది. అంటే గృహస్థులు ఇంటికి వచ్చిన వారిని చంపకూడదని చెప్పింది.

ఇంకా శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలతో అయినా తృప్తిపరచాలని అన్నది. ఇంటికి వచ్చిన వారిని నిరాశతో పంపకూడదని అలాపంపడం మహా పాపం అని పిల్లి గద్దకు చెప్పింది.

ప్రశ్న 3.
తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది. సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది.

ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనేపత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి. తరువాత 1945లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి. ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

ప్రశ్న 4.
ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు సంస్కృతంలో కృషిచేసిన తెలుగు వారి గురించి ప్రపంచానికి తెలిపారు. కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీ పరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు. ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదార భాణం, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులను పరిష్కరించి సాహిత్య చరిత్రలో వారి పేర్లకు చిరస్థాయి నందించారు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
నిసార్ జన్మస్థలం ఏది ?
జవాబు:
నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం

ప్రశ్న 2.
కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి ?
జవాబు:
వచన కవితా ప్రవీణ

ప్రశ్న 3.
జాతి వికాసానికి జీవగఱ్ఱు ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 4.
ఒక్కరీతిగా నడవనిది ఏది ?
జవాబు:
కాలం

ప్రశ్న 5.
‘నాకము’ అనగానేమి ?
జవాబు:
స్వర్గ

ప్రశ్న 6.
శాంతశూరులు ఎవరు ?
జవాబు:
పాండవులు

ప్రశ్న 7.
బ్రతుకు పండేది ఎప్పుడు ?
జవాబు:
ఆడ, మగ ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటే బ్రతుకు పండుతుంది.

ప్రశ్న 8.
కోకిలకు వేదిక ఏది ?
జవాబు:
పచ్చని చెట్టు

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
చిన్నయసూరి జన్మస్థలమేది ?
జవాబు:
శ్రీ పెరంబుదూరు

ప్రశ్న 2.
రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?
జవాబు:
శోభ

ప్రశ్న 3.
పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసిన సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు.

ప్రశ్న 4.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

ప్రశ్న 5.
ఎక్కడినుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ?
జవాబు:
నిజామాబాద్ నుండి బోధన్ వరకు ఉన్న రహదారిని.

ప్రశ్న 6.
సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
జవాబు:
నూతన ఆలోచనలకు.

ప్రశ్న 7.
లోకమే కుటుంబమని భావించు వారెవరు ?
జవాబు:
మహాత్ములు

ప్రశ్న 8.
బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?
జవాబు:
ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి.

1. ఉత్పలమాల
జవాబు:
ఉత్పలమాల లక్షణము :

 1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
 2. ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
 3. ప్రతి పాదంలో, 10వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
 4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
 5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

TS Inter 2nd Year Te Model Paper Set 10 with Solutions 2

2. కందం
జవాబు:
కందం లక్షణము :

 1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
 2. ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి.
  మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
 3. కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
 4. బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
 5. ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
 6. 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
 7. రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
 8. ప్రాసనియమం ఉండాలి.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 10 with Solutions 1
యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పంబ’ లకు యతిమైత్రి చెల్లింది.

3. మత్తేభము
జవాబు:
మత్తేభం లక్షణము

 1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
 2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
 3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
 4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
 5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

TS Inter 2nd Year Te Model Paper Set 10 with Solutions 3

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 2.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 3.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 4.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

ప్రశ్న 5.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 6.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 7.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.

ప్రశ్న 8.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. వృత్త్యనుప్రాస
జవాబు:
వృత్త్యనుప్రాస : ఒకటిగాని, అంతకంటే ఎక్కువ హల్లులుగాని అనేకసార్లు ఆవృత్తి (మరల మరల రావడం) అయినట్లైతే దానిని వృత్త్యనుప్రాస అంటారు.

ఉదాహరణలు :

 1. చిటపట చినుకులు పటపట్ల కురిసెను.
 2. జలజల కాలువలు గలగల పారెను.

గమనిక : మొదటి ఉదాహరణలో ‘ట’ కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. రెండవ ఉదాహరణలో ‘ల’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది.

2. ఉపమాలంకార లక్షణము
జవాబు:
ఉపమాలంకార లక్షణము : ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”.ఇందులో

 1. “ఉపమేయం” (వర్ణించే వస్తువు),
 2. “ఉపమానం” (పోల్చు వస్తువు),
 3. సమాన ధర్మం,
 4. ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి.

ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది. దీనిలో,

 1. ఉపమేయం : “రాజుకీర్తి”
 2. ఉపమానం : ‘హంస’
 3. సమాన ధర్మం : “ఓలలాడటం”
 4. ఉపమావాచకం : ‘వలె’

3. రూపకాలంకార లక్షణము
జవాబు:
రూపకాలంకార లక్షణము : ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది
‘రూపకాలంకారం’.
ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్” వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘యమకం’ అనగానేమి ?
జవాబు:
అక్షర సముదాయంతో, అర్థభేదంతో, పునరావృతమైనచో, దాన్ని, ‘యమ కాలంకార మంటారు.

ప్రశ్న 2.
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)

ప్రశ్న 3.
‘ఉపమేయం’ అనగానేమి ?
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : రాజు కీర్తి’)

ప్రశ్న 4.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 5.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి. ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

ప్రశ్న 6.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

ప్రశ్న 7.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

ప్రశ్న 8.
ఉపమావాచకాలు ఏవి ?
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది.

ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం : హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించాను.

TS Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

XVI.

(అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో వివరించే సంభాషణను రాయండి. (1 × 5 = 5)
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని : నమస్తే సర్ ! ప్రిన్సిపాల్
ప్రిన్సిపాల్ : నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని : సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్ : దరఖాస్తు తెచ్చావా ! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని : దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్ : ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని : నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్ : అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని : అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్ : మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని : అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 2.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

ప్రశ్న 3.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 4.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 5.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ?
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

Leave a Comment