TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 3 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

1. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. సీ॥ జిహ్వయే మాతండ్రి జీవేశ్వరుడు మాకు
కాళ్ళు మా కల్లుండ్రు గానవినుడి
హస్తంబులును రెండు నాత్మబంధువులైరి
కడుపు నా పెదతండ్రి, కొడుకు నరయ
నయనంబులును రెండు నా మాతృ ననుజులు
చెవులు సోదరులును తవణపరులు
ముక్కు నా ప్రియురాలు ముఖము నా మేనత్త
నడుము నా పెదమామ నడిపికొడుకు
తే.గీ॥ పండ్లు మా యింటి చుట్టాలు భక్తవరులు
నాలుకయు మాకు నిలవేల్పు నాదిశక్తి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
జవాబు:
ప్రతిపదార్థం :

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
జిహ్వయే = నాలుకయే
మాతండ్రి = మా తండ్రి లాంటి
జీవేశ్వరుడు = జీవానికి ఆధారం అయిన దైవం
మాకు కాళ్ళు = మా కాళ్ళు
మాకు + అల్లుండ్రు = అల్లుళ్ల వంటివి
గానవినుడి = కావున వినండి
హస్తంబులును రెండు = రెండు చేతులు
ఆత్మ బంధువులైరి = ఆత్మ బంధువుల వంటివి
కడుపు = కడుపు
నా పెదతండ్రి కొడుకు = పెద్దనాన్న కొడుకు
అరయ = చూడగా
నయనంబులును రెండు = రెండు కళ్ళు
నా మాతృ అనుజులు = నా కన్నా తల్లి అన్నతమ్ములు (మేన మామలు)
శ్రవణ పరులు చెవులు = వినడానికి ఉపయోగపడే చెవులేమో
సోదరులును = అన్నదమ్ములు
ముక్కు నా ప్రియురాలు = ముక్కు ప్రియురాలు
ముఖము నా మేనత్త = ముఖం మేనత్త (తండ్రి సోదరి)
నడుము = నడుమేమో
నా పెదమామ నడిపికొడుకు = పెద్దమామ నడిమి కొడుకు
పండ్లు మా యింటి చుట్టాలు = పండ్లేమో చుట్టాలు
భక్తవరులు = భక్తులు
నాలుకయు మాకున్ = నాకున్న నాలుక
ఇలవేల్పు = ఇంటి దేవత
ఆదిశక్తి = ఆదిశక్తి

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. నాలుక నాకు తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. (జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం)

2. తే.గీ॥ ఆర్ష జీవిత పద్ధతులంతరింప
నవనవోన్మేష పాశ్చాత్య నాగరకత
పెల్లుగ గమించి తుది కొక పొల్లునైతి
భారతాంబ సహింపని బరువుగానొ.
జవాబు:
ప్రతిపదార్థం :

ఆర్ష = ఋషుల ద్వారా తెలుపబడిన జీవన విలువలు
జీవిత పద్ధతులు = జీవన విలువలు
అంతరింప = నశించగా
నవనవ + ఉన్మేష = కొత్తగా వికసించిన
పాశ్చాత్య = పశ్చిమ దేశాల
నాగరకత = నాగరికతను
పెల్లగన్ = ఎక్కువగా
గమించి = వెంట నడిచి, ఆచరించి
తుదికి + ఒక = చివరికి ఒక
పొల్లును + ఐతి = పొల్లు గింజగా పనికి రాకుండా పోతిని
భారత + అంబ = భారతమాతకు
సహింపని = భరించలేని
బరువు = బరువుగా మారాను కదా

తాత్పర్యం : ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా !

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘ఆడపిల్లలంటెనే’ పాటలో కవి చిత్రించిన స్త్రీల శ్రమతత్త్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే లోకానికి చులకన భావం ఏర్పడిందని కవి నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని తెలపడం ప్రారంభించాడు. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడగమని స్త్రీలకు సూచించాడు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు.

మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి – మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.

పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డా, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించినా, ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోసి ముసలితనం పొందితే దూరంగా ఉంచుతారని చెప్పాడు.

వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావని చెప్తూ స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాల తేనెతుట్టె లాంటి వారని అన్నాడు. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతారని, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని విశ్లేషించాడు.

ప్రశ్న 2.
కోకిల స్వభావాన్ని వర్ణించండి.
జవాబు:
కోకిల గానం భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండె కరిగింది.

ఎంతో హడావిడిగా ఉండే ఈ కోరీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు కవి వంటి వాడికి తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతుంది. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసిన ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం పాడుతున్నావు. సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా? అని కవి కోకిలను అడిగాడు.

నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని కూడా అన్నాడు. చిలకల్లా, హంనల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న వారిని సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం కవికి తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతుంది. కాని మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని కోకిల సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు కోకిల అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది.

అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన. దీనిలో కోకిల స్వభావాన్ని కవి కనపర్తి రామచంద్రాచార్యులు వర్ణించారు.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవను తెలియజేయండి.
జవాబు:
తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతులపై జరుగుతున్న దాడిని గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి.

వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు. లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందించారు. ‘ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది.

లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా

యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు. తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు.

ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు. వారిలో ముఖ్యులు ముగ్గురు. వారు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి. వీరు ముగ్గురూ తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశారు.

ప్రశ్న 2.
కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి.
జవాబు:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది.

ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి నక్క ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది. అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను.

నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు.

వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోసపోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదోఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు.

నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఉపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి. కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను.

నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రిని తిట్టేవారు.

ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు. విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B. చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు.

ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సీ నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం.ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు.

కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం. చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు. తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు.

కానీ ఆయన ఐదు వందలు మాత్రమే జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు. ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్ డబ్బు వేశాడు.. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్క చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.

దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి. రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి.

ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు. రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ.. చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు.

అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం. చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది. ఈ విషయాన్ని సురేశ్ బాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

ప్రశ్న 1.
ఏ దేవుళ్లు నిన్ను వాహనం చేసుకొంటారు ?
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయం తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ‘ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు అని సమాధానం చెప్పుకున్నాడు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని, చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను ఏ దేవుడు వాహనంగా అగీకరిస్తాదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్య అర్థం.
వ్యాఖ్య : వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం అని భావం.

ప్రశ్న 2.
పారెదవు తాత్వికత నిశివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరిహరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని అర్థం.
వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులనీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరీ హరాద్వైతాన్ని పాటించిందని భావం.

ప్రశ్న 3.
నాలుకయు మాకు నిలవేల్పునాది శక్తి
జవాబు:
కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.
సందర్భం : నాలుక తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : నాలుక మాకు ఇంటి దేవత అయిన ఆదిశక్తితో సమానం అని అర్థం.
వివరణ : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం.

ప్రశ్న 4.
దురితంబొనరించిట్ల తుదిఁ గీడు సుమీ
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి తన బాధ్యతను గుర్తుచేస్తున్న సందర్భంలోనిది. అర్థం : జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు మీకే కీడు కలుగుతుంది.
వివరణ : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.
వ్యాఖ్య : సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.

ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో
జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.
వ్యాఖ్య : గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

ప్రశ్న 3.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్దిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.
అర్థం : ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.
వ్యాఖ్య : వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన . తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న. అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

ప్రశ్న 4.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.
వ్యాఖ్య : ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
గంగకు ‘జాహ్నవి’ అనే పేరు ఎందుకు వచ్చింది ?
జవాబు:
భగీరథుని తపస్సుకు మెచ్చి శివుడు తన తలపై గంగను నిలిపాడు. దేవతల కోరికపై శివుడు తన జటాజూటం నుండి గంగను విడిచాడు. గంగ ఏడు పాయలుగా ప్రవహించింది. అందులో ఒకటి భగీరథుని వెంట వెళుతూ జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో “ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి. -గర్వాన్ని అణచావు. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి పుట్టింది కావున జాహ్నవి అనే పేరుతో భూలోకంలో గంగ పిలువబడుతుంది.

ప్రశ్న 2.
స్త్రీ త్యాగనిరతిని తెలుపండి.
జవాబు:
పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి ఆశలు ఎండిపోయి, పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్ల జాలి చూపాడు. స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని స్త్రీల త్యాగ నిరతిని నిసార్ తెలియచేశాడు.

ప్రశ్న 3.
సభలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు ?
జవాబు:
ధృతరాష్ట్రుని సభలో శ్రీకృష్ణుని కంఠస్వరం మేఘ గర్జన లాగా గంభీరంగా, హృదయంగమంగా ఉంది. ఆయన దంతాల కాంతులు మెరుపులవలె ప్రకాశిస్తున్నాయి. వర్షాకాల ప్రకృతి రమణీయతతో శ్రీకృష్ణుణ్ణి తిక్కన పోల్చి ఉపమాలంకారంతో చెప్పాడు. గంభీరమైన సన్నివేశాన్ని గంభీరంగా తిక్కన చిత్రించాడు.

ప్రశ్న 4.
సిద్ధప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు ?
జవాబు:
వరకవి సిద్ధప్ప వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన . పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు .మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ.. బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు అని చెప్పాడు. వీరందరూ వరకవి సిద్ధప్పకు ఆదర్శప్రాయులని సూచించాడు.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
‘పురానపుల్’ నిర్మించుటకు గల కారణాలు ఏవి ?
జవాబు:
భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడు, యువరాజు మహమ్మదు ఖులీ కుతుబ్షా “పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో దాటి ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాడం మళ్ళీ రాకూడదని మూసీనదిపై ఆ రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచి ఉంది. భాగ్యమతి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 2.
‘సృజనాత్మకత’ ఎలా పెంపొందుతుంది ?
జవాబు:
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం అవసరం. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్త విషయాలపట్ల ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లోని భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

ప్రశ్న 3.
భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ?
జవాబు:
చిందు భాగవత ప్రదర్శనకు అవసరమైన ఆభరణాలను పొనికి కట్టెతో తయారుచేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారుచేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం.

ప్రశ్న 4.
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ?
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్రను రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే.

ప్రాచీన సాహిత్యం తెలంగాణాలో వర్ధిల్లింది. తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది. కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదని తెలుస్తుంది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
తిక్కన సోమయాజ మహాభారతం ఎవరికి వినిపించాడు ?
జవాబు:
హరి హర నాథునికి

ప్రశ్న 2.
భగీరథుడిని ఎవరు ఆశీర్వదించారు ?
జవాబు:
బ్రహ్మ

ప్రశ్న 3.
చేప దేనిని మింగుతుంది ?
జవాబు:
గాలాన్ని

ప్రశ్న 4.
జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 5.
ధవళ పారావతం అంటే ఏమిటి ?
జవాబు:
తెల్లని పావురం

ప్రశ్న 6.
నిసార్ తల్లిదండ్రులెవరు ?
జవాబు:
హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్

ప్రశ్న 7.
సగరుల భస్మం ఏ లోకంలో ఉంది ?
జవాబు:
పాతాళం

ప్రశ్న 8.
హనుమచ్ఛర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి ?
జవాబు:
గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
ఎల్లమ్మ ఏ వయసులో రంగస్థల ప్రవేశం చేసింది ?
జవాబు:
నాలుగేళ్ల వయసులో.

ప్రశ్న 2.
‘సృజనాత్మకత’ ఎక్కడి నుండి ప్రభవిస్తుంది ?
జవాబు:
సుందర హృదయాల నుండి.

ప్రశ్న 3.
నీతిచంద్రికకు ఆధార గ్రంథాలేవి ?
జవాబు:
విష్ణుశర్మ పంచతంత్రం, నారాయణ పండితుని హితోపదేశం.

ప్రశ్న 4.
రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి ?
జవాబు:
పచ్చతోరణం.

ప్రశ్న 5.
భూపాలరావు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు ?
జవాబు:
దేవాలయ చరిత్ర

ప్రశ్న 6.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 7.
చిన్నయసూరి జన్మస్థలమేది ?
జవాబు:
శ్రీ పెరంబుదూరు

ప్రశ్న 8.
కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జవాబు:
క్రీ. శ. 1900

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. చంపకమాల
జవాబు:

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 3 with Solutions 1
యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.
గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో’ యతి.

2. ఆటవెలది
జవాబు:

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి..
  2. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
  4. ప్రాసయతిని పాటింపవచ్చును.
  5. ప్రాసనియమం ఉండదు.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 3 with Solutions 2
యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘క-గా’ లకు, ‘పు-వు’ లకు యతిమైత్రి.

3. ఉత్పలమాల
జవాబు:

  1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో, 10వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 3 with Solutions 3
యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, ట్రా‘ లకు యతిమైత్రి చెల్లుతుంది.

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 2.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ?
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.

ప్రశ్న 3.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

ప్రశ్న 4.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

  1. హ గణము (గలము)
  2. న గణము అనేవి.

ప్రశ్న 5.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
తేటగీతీ పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 6.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 7.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 8.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

TS Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఛేకానుప్రాస
జవాబు:
ఛేకానుప్రాస : రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థ భేదంతో మళ్ళీ వచ్చినట్లయితే అది ‘ఛేకానుప్రాస’ అలంకారము.
ఉదా : పాప సంహరుడు హరుడు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, మొదటి ‘హరుడు’ అనగా, హరించేవాడు అని, రెండవ ‘హరుడు’ అనే పదానికి, ‘శివుడు’ అని అర్థం. మొత్తం వాక్యానికి “పాపాలను హరించేవాడు శివుడు” అని అర్థం. ఈ విధంగా ఒకే పదం, అనగా ‘హరుడు’ అనే పదం, అర్థభేదంతో వెంటవెంటనే వచ్చింది. కాబట్టి ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.

2. అతిశయోక్తి
జవాబు:
అతిశయోక్తి అలంకార లక్షణము : గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’. ఉన్నదాని కంటే అతిశయం చేసి చెప్పడమే, అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ : ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి.
ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం ‘అతిశయోక్తి’.

3. రూపక
జవాబు:
రూపకాలంకార లక్షణము : ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది
రూపకాలంకారం’.
ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్”
వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘యమకం’ అనగానేమి ?
జవాబు:
అక్షర సముదాయంతో, అర్థభేదంతో, పునరావృతమైనచో, దాన్ని, ‘యమకాలంకార’ మంటారు.

ప్రశ్న 2.
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)

ప్రశ్న 3.
‘ఉపమేయం’ అనగానేమి ?
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’)

ప్రశ్న 4.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్ధం ఏమిటి ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 5.
ఉపమాన, ఉపమేయములకు రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏ అలంకారం ?
జవాబు:
రూపకాలంకారము.

ప్రశ్న 6.
‘అతిశయోక్తి’ అనగానేమి ?
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.

ప్రశ్న 7.
‘ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

ప్రశ్న 8.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.
జవాబు:
సంక్షిప్తరూపం : ప్రకృతిసిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.

XVI.

(అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా చేసుకుని విద్యార్థి ప్రిన్సిపాల్ల మధ్య సంభాషణను రాయండి. (1 × 5 = 5)
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ.
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని : నమస్తే సర్ !
ప్రిన్సిపాల్ : నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని : సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్ : దరఖాస్తు తెచ్చావా ! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని : దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్ : ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని : నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్ : అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని : అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్ : మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని : అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 2.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

ప్రశ్న 3.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

ప్రశ్న 4.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 5.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

Leave a Comment