Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 6 allows students to familiarize themselves with different question patterns.
AP Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions
Time : 3 Hours
Max. Marks : 100
గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.
I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)
I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి.
1. ఇట నస్పృశ్యత ……………….. ధర్మం బిందుఁ గారాడెడిన్,
జవాబు:
ఇట నస్పృశ్యత సంచరించుటకుఁ దావే లేదు, విశ్వంభరా
నటనంబున్ గబళించి, గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేఁక నొఁక ప్రక్కన్ జేర్చి జోకొట్టి, యూ
అంటఁ గల్పించునభేద భావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్.
భావం : ఈ శ్మశానంలో అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో, ప్రాణాలు తీసి భూగర్భంలో (మట్టిలో) కలిసిపోయేట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్విక మేకను పక్కప్రక్కనే చేర్చి జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుల వంటి భేద భావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.
2. అన్నకుఁ దండ్రికిన్ ……………….. కృతార్థుఁ డెయ్యెడన్.
జవాబు:
అన్నకుఁ దండ్రికిన్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁ గ
నొన్న మహోగ్రపాతక మగున్ దనువస్థిరమృత్యు వెప్పుడున్
సన్నిహిత స్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశంబటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుఁ డెయ్యెడన్.
భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ఎవ్వరైతే కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి భయంకరమైన పాపము కలుగుతుంది. ఈ శరీరము అస్థిరము మరణము వెనువెంట పొంచి ఉంటుంది. కలిమి పూర్వకతము వలన సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ మనసులో తలచుకొని ధర్మమార్గమున అనుసరించు వాడే కృతార్థుడు, ధన్యుడు.
II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. తిన్నని చూసి బోయలు ఏవిధంగా దుఃఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.
నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దుఃఖిస్తారు.
వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూమూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.
ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు. మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.
అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా దు:ఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి నూ మనస్సు అంగీకరించడం లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగిరాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప దనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.
ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.
నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దు:ఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.
2. వేములపల్లి శ్రీకృష్ణ ఏవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్నాడు ?
జవాబు:
విజయనగర రాజులు పాలించిన రతనాలకు నిలయమైన ఈ రాయలసీమ ప్రాంతంపై కక్షగట్టిన శత్రువులు కత్తి దూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించరా సీమకు చెందినోడా, నాటి రాయల పాలనా కాలంలోని వైభవాన్ని తిరిగి సాధించడానికి అంకితమవుదాం. తన ప్రవాహంతో ఎగిసిపడే గౌతమీ గోదావరితల్లి, వరదలతో ఉప్పొంగే కృష్ణవేణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి ప్రవహిస్తే చాలు. ధాన్యరాసులు పండే ఈ ప్రాంతాలలో కూడు, గుడ్డకు కొరత ఉండదు.
నీ తెలుగు ప్రాంతము బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుపోయారయ్యా తెలుగోడా. ఆ మోసాన్ని గ్రహించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.
తెలుగువారి మధ్య ప్రాంత భేదభావాలు పోయి ఉత్తంంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతముతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మనలను ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులమవ్వాలి.
మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మనకి గౌరవం, పేరుప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగు బిడ్డ మనందరికీ తల్లి ఒకటే. మనం తెలుగుజాతి వారము సవతితల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమనే హోరుగాలి ఉధృతంగా వచ్చింది. క్రమంగా ఆ హోరు తగ్గిపోయింది. ఉద్యమం నీరసించింది. తెలుగుజాతి అనే నావ కష్టాలు అనే సముద్రం మధ్యన దిశానిర్దేశం చేసేవారు లేక నిలుచుండిపోయింది. ఆ ఉద్యమం అనే నావ చుక్కాని బట్టి ఒడ్డుకు చేర్చరా మొనగాడా, తెలుగు వీరుడా.
ఈ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని కవి ఆకాంక్షించాడు.
III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పూర్ణ గాయకుడు వివరించండి.
జవాబు:
చిన్నవయసులో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీలంటారు. గానం, గణితం, చిత్రలేఖనం. కవనం మొదలైన విద్యలలో ప్రాడిజీలు కన్పిస్తారు. అయితే ఈ ప్రాడిజీలు యుక్తవయస్కులయ్యేసరికి వాళ్ళు శక్తులన్నీ కోల్పోయి, చాలా మామూలుగా తయారవుతారు. కాని, బాలమురళి ఈ రకం ప్రాడిజీ కాదు. అందుకే తన నలభయ్యో ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నారు.
బాలమురళి తండ్రి పట్టాభిరామయ్య సుసర్ల దక్షిణామూర్తిగారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూట్ వాయించటం సాధనచేసి బెజవాడ చేరి సంగీత పాఠాలు చెప్పారు. తల్లి సూర్యకాంతమ్మ కూడ భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని, చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు. పట్టాభిరామయ్య దగ్గర నూకల చిన సత్యనారాయణ వంటి అనేక మంది శిష్యులు సంగీత పాఠాలు నేర్చుకున్నారు. బాలమురళి ఆ పాఠాలు విని పట్టుకున్నాడు. ఏడవ యేటనే అతనికి అనేక గీతాలు, వర్ణాలూ, కొన్ని కీర్తనలూ వచ్చు. అందువల్ల బాలమురళి మొదట గురువు ఆయన తండ్రిగారే.
తరవాత బాలమురళిని పారుపల్లి రామకృష్ణయ్యగారి దగ్గర సంగీత శిక్షణ కోసం చేర్చారు. బాలమురళికి అప్పటికే కొంత సంగీత జ్ఞానం ఉందని ఈ గురువు గారికి తెలియదు.
బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి వారి ఉత్సవాల కార్యక్రమంలో పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ ఉంది. ఆరోజు బాలమురళి తొమ్మిదో పుట్టినరోజు తొలిఏకాదశి ఉదయం 8 నుంచి ఓ గంటసేపు బాలమురళిని పాడనివ్వవచ్చు అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటల సేపు ఆలాపన, కీర్తన, స్వరకల్పనలతో పూర్తిస్థాయి కచేరీ చేయటం చూసి పండితుల మతులు పోయాయి.
గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య ఆనందాశ్రువులు రాల్చి తమగురుత్వాన్ని కొనసాగించారు. బాలమురళి పాట కచేరీలు చేస్తూనే, పారుపల్లి వారి శిష్యరికంలో కీర్తనలు నేర్చుకున్నాడు.
ఈ విధంగా అణుబాంబు పేల్చినట్లు మొదటి పాట కచ్చేరీ చేసినప్పుడు కుర్తాలం స్వాములవారు ఉన్నారు. ఆయన మూలంగా బందరు బుట్టాయి పేటలో బాలమురళి రెండవ కచేరీ జరిగింది. ప్రసిద్ధ విద్వాంసులందరినీ ఆహ్వానించారు. వాగ్గేయకారక హరి నాగభూషణంగారు కూడ కచేరీకి వచ్చారు. ఆయన కొంచెం సేపు విని, మధ్యలో లేచివెళ్ళి తన భార్యను, పిల్లలను వెంట బెట్టుకుని వచ్చారట.
1942లో తిరువాయూరులో త్యాగరాజ ఉత్సవాలకు రామకృష్ణయ్య పంతులు గారు బాలమురళిని వెంట తీసుకువెళ్ళాడు. గురువుగారికి అస్వస్థత కలిగి ఆయన పాడవలసిన సందర్భంలో బాలమురళికి అవకాశం ఇచ్చారట. అన్ని వేలమంది ప్రజలలో, అంతమంది విద్వాంసుల మధ్య బాలమురళి పాట అద్భుత సంచలనం కలిగించిందట.
అన్ని విధాలా ప్రతిభావంతుడైన వ్యక్తిని పూర్ణ పురుషుడు అంటారు. ఆ మాటకు అందరూ తగరు. ఒకటి రెండు అంశాలలో పరాకాష్ఠ అందుకున్నంత మాత్రాన మనిషి పూర్ణ పురుషుడు కాజాలడు.
బాలమురళికి స్వరమూ, రాగమూ, లయా బానిసలలా ఉంటాయి. వాటిపై అతను చూపే అధికారం అనన్యమైనది అతని సంగీతం అగాధమనిపిస్తుంది. అతడు సంగీతంలో వామన మూర్తిలా ఇంకా ఇంకా పెరిగిపోయాడు.
బాలమురళిని పూర్ణ గాయకుడు అనవచ్చు. ఆ మాట అతనికి పూర్తిగా అతుకుతుంది.
2. ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు రాయలకాలం స్వర్ణయుగం వివరించండి.
జవాబు:
శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగం ! కవి పండిత పోషకుడైన రాయలవారి కాలంలో సాహిత్యం పల్లకి ఎక్కింది. కవులకు అత్యున్నత గౌరవం లభించింది. ఈ కాలంలో ప్రబంధ ప్రక్రియ వికసించి ఎన్నో కావ్య కుసుమాలను పూయించింది.
కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలం మత సామరస్యానికే కాక, కళలకూ, కవులకూ నిలయం.
రాయలు స్వయంగా కవి సంస్కృతంలో నాటకాలను రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. కవులలోని విద్వత్తును గ్రహించి వారికి ఎన్నో అగ్రహారాలను, భూములను దానంగా, బహుమతిగా ఇచ్చాడు.
పెద్దనగారి మను చరిత్రను రాయలవారు అందుకునే స్వీకార మహోత్సవానికి అన్ని ప్రాంతాల కవులు, పండితులు తరలివచ్చారు. భాషా బేధాలు మత బేధాలు లేని సామరస్య భావన అక్కడ నెలకొని వుంది. రాయలవారి కాలంలో కవులు సుఖ, సంతోషాలతో వుండేవారు. రాయలు పెక్కు ప్రబంధాలు క్షుణ్ణంగా చదివి కవుల గుణ సంపదకు విలువ కట్టిన కవి వతంసుడు.
రాయలవారు పెద్దనగారి మను చరిత్రను స్వీకరిస్తున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది.
ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతాలనుంచి కవులు, విద్వాంసులు ఆ వేడుక చూడటానికి ఉత్సాహంగా వచ్చారు. అటు కళింగం నుంచి, గౌతమీ తీరాన్నుంచి, ఇటు కావేరి నుంచి, మధుర నుంచి, కవీశ్వరులు, గాయకులు, విద్వాంసులు, ఎక్కడెక్కడివారు కొన్ని రోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోను, ప్రదోష కాలంలోను, తుంగభద్రా తీరంలోను, విఠల స్వాముల కళ్యాణ మండపంలోను వీరందరి గోష్ఠులు ఎంతో సందడి చేశాయి.
వారిలో ఆంధ్ర కవులున్నారు, తమిళ కవులున్నారు, కర్ణాట కవులున్నారు.
పింగళి సూరన, ధూర్జటి, నంది తిమ్మన, రామభద్రకవి, రామలింగకవి, రాధామాధవ కవి, భట్టుమూర్తి వంటి ఉద్దండులైన తెలుగు కవులున్నారు.
రాయలు రచించిన సంస్కృత నాటకం ‘జాంబవతీ కళ్యాణం’ ప్రదర్శించటానికి నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యగారు వచ్చారు.
గీర్వాణ కావ్యకర్తలు దైవజ్ఞ విలాస కావ్యకర్తలు కొండవీటి విద్వత్కవి సార్వభౌములు లక్ష్మీధరుల వారున్నారు. వ్యాస తీర్థులు, రాజనాధ డిండిముడు, ఇరుసమయి విళక్కన్ రచించిన తమిళ కవిరాజున్నాడు. చాటు విఠలనాధుడు కర్ణాటక కవి. ఇంకా పురందర దాసు, కనకదాసులు, కర్ణాటక కవిరాజులు గుబ్బి మల్లనార్యుడు, నంజుడయ్య లింగమంత్రి ఇత్వాది పండితులున్నారు.
ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగమది. దక్షిణా పథం అంతా ఒక సుందర సంస్కార బంధం కట్టిపెట్టిన రోజులవి. అవి కవులకు గొప్పరోజులు. కవి పండితులకన్న రాయలకు ఇష్టులెవరూ లేరు.
సంస్కృతాంధ్ర, కర్ణాట, తమిళ భాషా పండితులను ఆదరించి ఆంధ్ర సాహిత్యంపై విశేష గౌరవం చూపి, ఆంధ్ర భోజుడని పేరు పొందిన రాజు కృష్ణదేవరాయలు. సాహిత్య, కళా పోషకులలో అగ్రగణ్యునిగా పేరు పొందిన కవి, రాజు కృష్ణదేవరాయలు.
IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)
1. ‘దహేజ్’ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.
ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండపం పైకి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.
పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు. వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు. దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు.
ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.
2. ఊతకర్ర కథలో రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవితంలో అందరూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో వారితో ఇమడలేక తన ఇంట్లో ఒంటరి బ్రతుకు బ్రతుకున్న వ్యక్తి. జీవన పోరాటంలో తన బిడ్డల కోసం తాపత్రయంతో బ్రతికాడాయన. ఎవరైనా తన బిడ్డల గురించి ఆలోచిస్తారే కాని వారు ఒకరికి బిడ్డలమేనన్న స్పృహ ఉండదు. అందుకే తనవంటి అభాగ్యులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనిలా మిగిలిపోతున్నారు.
ఇలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్న అతను ఒకరోజు బయటకు వచ్చాడు. ఎంతదూరం నడిచాడో అతనికి తెలియదు. ఒంట్లో ఓపిక లేదు. బాట ప్రక్కన ఒక పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ చెట్టు నీడన సేదతీరాలని చేరబడ్డాడు ఆ వృద్ధుడు. ఇంతలో అతనికి కొంతదూరంలో ఓ దృశ్యం కంటపడింది. తనను అది బాగా ఆకట్టుకుందని రచయిత భావించాడు.
అక్కడకు కనుచూపుమేరలో ఒక పల్లె అంత ఎండలో అంతదూరం ఎలా వెళ్ళాడో అతనికే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు చేరాలంటే గుండె గుభేలుమన్నది. కాసేపు అక్కడే కూర్చునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ చెట్టు పక్కనే బాట. ఆ బాటకు కాస్త దగ్గరలో కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇల్లు దూలాల మధ్య ఎండుగడ్డితో కప్పుతున్నాడు ఓ వ్యక్తి. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు ధారాపాతంగా కారుతున్నా పనిలో నిమగ్నమయ్యాడు. అది ఆ వ్యక్తి తండ్రి చూశాడు. కన్నపేగు మెలిపడింది. ముసలాడు ఊతకట్టెపై ఆనుకొని తలపైకెత్తి చూశాడు. సూర్యకాంతికి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తూ పొద్దు తిరిగాక కట్టవచ్చు కదా ! ఇప్పుడు కాస్త అన్నం తిని పడుకోరాదు అని అన్నాడు. పని అయిపోతుంది కాస్తంత కోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి అంటూ తండ్రి మాటను పెడచెవిని పెట్టాడు.
కన్నతండ్రి మాటను పెడచెవిని పెట్టినందుకు మనసు చివుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళి మూడేళ్ళ పసివాడిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి. పాలుగారే పసివాడి పాదాలు చుర్రుమనగానే కెవ్వుమన్నాడు. ఇంటి పైకప్పు పని చేస్తున్న తండ్రి చెవుల్లో పడిందా కేక. అయ్యయ్యో ! పసివాణ్ణి ఇలా వదిలేసారేమిటని గబగబా దిగాడు. బిడ్డను తెలుగు ఎత్తుకున్నాడు. ఇదే విషయాన్ని రచయిత చెప్పాలనుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లే కదా ! ఈ సంగతి ఎవరూ గుర్తించరేమని రచయిత అభిప్రాయం. ఈ తండ్రీబిడ్డల సంఘటన అనుబంధానికి ఒక చక్కని నిదర్శనం. ఈ సంఘటనే ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధునికి ఉపదేశ వాక్యమయ్యింది. ఈ ఘటన ద్వారా రచయిత తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించారు.
3. ‘అంపకం’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటి నుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.
పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ‘ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు. పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ? తన ప్రాణంలో ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు.
బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు. శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరు పెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురుమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ఆనుకొని ఉంది పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ధి కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధ పడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.
ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు కాని ముద్ద గొంతులో దిగలేదు దుఃఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.
4. కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించుకుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.
పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.
కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.
V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)
1. ప్రమథ వర్యులకిపి గచ్చపట్టు లేమొ.
జవాబు:
కవి పరిచయం : ఈ క్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : కైలాస శిఖర సమూహములను కవి వర్ణించిన సందర్భంలోనిది.
భావము : కైలాస పర్వత సమూహాలు మొక్కల గుబురులతోను, కలువపూల కొలనుల తోను, కల్పవృక్షములతోను, బిల్వ రుద్రాక్ష వృక్షములతోను నిండియున్నాయి. శివుడు ఇక్కడ తాండవం ఆడతాడు. ఈ ప్రాంతం ప్రమథ గణాలకు నెలవులు అని ఇందలి భావం.
2. తల్లియు తండ్రియు న్మఱుగరే యుల్లంబులో.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : శివలింగం వద్ద తన్మయుడై ఉన్న తిన్నడిని వెతుకుతూ వచ్చిన చెంచులు తిన్నడితో ఇంటికి తిరిగి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.
అర్థం : తల్లి, తండ్రి మనసులో దు:ఖించరా !
భావము : నాయనా నిన్ను అలసిపోయేలా చేసి ఇక్కడ వరకు వచ్చేలా చేసిన ఆ అడవి పంది ఎటుపోయింది. మమ్ములను చు’సి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంటే మేము ఏమి పలికినను, ఏమి కారణమో తిరిగి పలుక.. అయ్యో వేటాడుటకు వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనసులో ఎంతో దుఃఖిస్తారు అని బోయలు పలికారని భావము.
3. ఇత్తెఱగు సూరి నుతుండగు నీకు నర్హమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రుడు ధర్మరాజుతో పండితులతో కీర్తింపబడే నీవు కుక్క కోసం పంతం పట్టుట సమంజసమా అన్న సందర్భంలోనిది.
అర్థం : ఈ విధంగా పండితులతో స్తుతింపబడే నీకు ఇలా చేయుట తగునా.
భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేస్తావు. కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు. ఇది మంచిపనా ? ద్రౌపదిని, సోదరులను వదలుకున్నావు. సువ్రతుడవు, కుక్కను మాత్రం వదలనంటున్నావు. పండితులచే స్తుతించబడే ధర్మరాజా నీవు ఇలా పంతం పట్టుట తగునా అని అన్నాడు.
4. కార్యశూరులు నేడు కావాలోయ్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగువారు అభివృద్ధి పధంలోకి పయనించాలి అని చెప్పే సందర్భంలోనిది.
అర్థం : కార్యసాధకులు నేటి కాలానికి అవసరం.
భావము : రాజ్యం వీరులు పరాక్రమంతో సంపాదించుకునేది అని చెప్పిన మహాకవి తిక్కన వాక్కులు వీరులకు మార్గంపంటిది. మన పూర్వీకుల పరాక్రమాన్ని తెలుసుకుని ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి. నేడు మనకి వట్టి మాటలు చెప్పేవారు కాకుండా పనిచేసి చూపే కార్యసాధకులు కావాలి అని భావం.
VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)
1. సహదేవుడెట్టి వాడు ?
జవాబు:
సహదేవుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన సంతానం. పాండవులందరిలో చివరివాడు. సహదేవునికి అహంకారమనేది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడని భీముడు కూడా స్తుతించాడు. తన అన్నగారైన ధర్మరాజును తండ్రితో సమానంగా భక్తి ప్రపత్తులతో సేవించేవాడు. భీముడు సహదేవుని మరణ కారణం అడుగగా, సహదేవుడు లోకంలో తనకంటే ప్రాజ్ఞుడు ఎవడూ లేడని భావిస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. అందుకే ఈ దురవస్థ సంభవించింది అని ధర్మరాజు సహదేవుని గురించి చెప్పాడు.
2. పుష్పక విమాన విశేషాలేమిటి ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. పుష్పక విమానమును బ్రహ్మదేవుడు కుబేరునకు కానుకగా ఇచ్చాడు. ఆ విమానమును రావణుడు కుబేరుని యుద్ధములో జయించి తాను పొందాడు. అది వేలవేల బంగారు స్తంభములు కలిగి ఉన్నది. వైడూర్య తోరణముల సమూహములతో ముత్యాలతో చాందినీలు కలిగి ఉన్నది. చంద్రకాంత శిలలతో వేదికలు, వజ్రాల సోపానాలు ఉన్నాయి. కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షములున్నాయి. మనోవేగాన్ని మించిన వేగం పుష్పక విమానానికున్నది. దానికి కోరిన చోటికి తీసుకుపోగల మహిమ ఉన్నది. కామరూపాన్ని ధరించి, మహిమ గల కాంతితో వెండి రంగులో ప్రకాశవంతంగా పుష్పక విమానమున్నది. ఎంతమంది ఎక్కినా, మరొకరికి చోటు ఉంటుందని పెద్దలన్నారు.
3. శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.
నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.
4. ఐకమత్యాన్ని ఏ విధంగా సాధించాలని వేములపల్లి కోరాడు ?
జవాబు:
తెలుగు వారి మధ్య ప్రాంతీయ భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతంతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మన తెలుగు వారిని ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులం కావాలి అన్నాడు. దీనిని తెలుగు ప్రాంతాల మధ్య పరస్పర ప్రేమ, అభిమానం, స్నేహ భావాలతోనే సాధించగలుగుతాము.
VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)
1. అసహజత్వం వల్ల కలిగే హాస్యాన్ని గురించి తెల్పండి.
జవాబు:
ఒక విషయంలో ఉండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. ఒక పరమ సత్యాన్ని, ఒక సామాన్య విషయాన్ని విపరీత విషయంగా పరామర్శ చేస్తే, ఆ కథనం అసహజమై హాస్య జనకం అవుతుంది.
మనిషి ఒంటికాలు మీద నడవటం అసహజం. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తలకింద పెట్టి, కాళ్ళు పైకెత్తినా చూసే వాళ్ళకు నవ్వు వస్తుంది. మనుషులు గుఱ్ఱాలు ఎక్కటం సహజం. కాని గుఱ్ఱం మనుషుల పైకెక్కటం అసహజం. ఇది నవ్వు పుట్టిస్తుంది.
మన సంఘంలో పత్నికి పతి దైవ సమానం అన్నమాట బహుజన నమ్మకం అయిపోయింది. పత్నియే పతికి దైవం అంటే నవ్వు ఉదయిస్తుంది. ఇది అసహజం కాబట్టి.
‘అర్థరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు’ అన్నది సామాన్య విషయం. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. అయినా ఒకడు అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట దొంగలు! ఇలా అంటుంటే ఆ మనిషి ఆశ్చర్యాన్ని చూసి నవ్వు వస్తుంది.
సహజమైన విషయాన్ని అసహజమైన వృత్తాంతంగా ప్రదర్శించటంలో రచయిత ప్రతిభ కనబడుతుంది. చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటివాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, ఇంకా పానుగంటి వారి ‘బధిర విధవా ప్రహసనము’ ఇత్యాదులలో హాస్యం ఆ సంభాషణలలో అసహజత్వం వల్ల వచ్చినదే!
2. రాయలు వ్రాసిన మనుచరిత్ర అందుకున్న తీరును వివరించండి.
జవాబు:
ఆ సంవత్సరం మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మను చరిత్ర అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఎక్కడెక్కడి విద్వాంసులు, గాయకులు కొన్నిరోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి యింట్లోనే దిగారు.
ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజీ పెద్దన్న గారింటికి వస్తారు. రాయలవారు అక్కడికి వస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం పెద్దన్నగారింటి నుండి కొలువు కూటందాకా సాగుతుందని అప్పాజి అక్కడ వున్న మహా కవులందరితో చెపుతాడు. కొంచెంసేపట్లో విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినబడతాయి. రాయలవారు అల్లసానివారి గృహంగణానికి మంత్రులతో, సామంతులతో వస్తారు. ముందు అప్పాజి, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకుని వచ్చి, బంగారపుటడ్డల పల్లకిలో పెద్దనగారు కూర్చుంటారు.
శ్రీకృష్ణ దేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకి బొంగులకు భుజాలు తగిలిస్తారు. భోజరాజేనా ఇలా చేశాడని విన్నామా ! మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుందని రాయలను ప్రశంసిస్తూ నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.
ముందు వందలకొద్దీ రౌతులు తరవాత చల్లగా సాగే తంజావూరు సన్నాయి కూటం. భట్టు కవుల స్తుతి పాఠాలు, ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదిక బృందం, కంచి నుంచి వచ్చిన కామ సుందరి మేళం. ఆ వెంటనే మంత్రులతో సామంతులతో, దండనాధులతో, కవులతో, పండితులతో, గాయకులతో శ్రీకృష్ణదేవరాయలు. ఊరేగింపు విజయనగర రాజు వీధులలో సాగుతుంటే తోవలో రాయలవారికి, మహాకవికి ప్రజలు హారతులు ఇచ్చారు. శఠకోపయతుల మఠం దగ్గర రాయలు, పెద్దన పల్లకి దిగి గురువుగారి పాదాలపై శిరస్సులు ఉంచారు. రాయలవారి నిండు సభలో, మను చరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడనెవ్వరీడు పేర్కొన నీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై చదవలేకపోయారు. పఠనానంతరం కవి పండితులందరూ మను చరిత్రలో, ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం ప్రారంభమైనదని కీర్తించారు.
ఇంత కన్నుల పండుగగా రాయలవారు మను చరిత్రను అందుకున్నారు.
3. మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని తనకు తాను గర్వంగా ప్రకటించుకున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఈమె ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నేతగాను ప్రసిద్ధి కెక్కారు. ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఈమె చురుకుగా పాల్గొన్నారు. సారాను నిషేధించే వరకూ వీరు విశ్రమించలేదు. ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ ను స్థాపించి ఆమె తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ఆ ట్రస్టుకు రాసిచ్చారు.
సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే వివాహం జరిగిన మల్లాది సుబ్బమ్మ అటువంటి వాతావరణం నుంచి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తనను తాను మలచుకోవటం విశేషం తన ఆస్తినంతా సామాజిక సేవకు అంకితం చేశారు.
మల్లాది సుబ్బమ్మగారికెప్పుడైనా మనస్తాపం కలిగితే వీరేశలింగంగారి ఆత్మకథ చదువుతారట. ఒంటరివాడు, అనారోగ్యవంతుడు, కేవలం బడి పంతులు ఒక్కడు అన్ని ఘనకార్యాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడంటే మనం ఇలా ఇన్ని సౌకర్యాలుండి ఇలా వ్యధ చెందటం ఎందుకు ? అని అడుగు ముందుకేస్తారట. వీరేశలింగం సంస్కరణల స్ఫూర్తితో వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
4. కలవారికోడలు కలికి కామాక్షిలోని అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేయండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షిలోని అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఆదర్శవంతం స్ఫూర్తివంతం.
కామాక్షి అన్నయ్య గుమ్మం దాటి లోపలికి వచ్చేదాకా కామాక్షి చూడనేలేదు. ఆమె పప్పు కడుగుతోంది. అన్నను చూసీ చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. గబగబ వచ్చి అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. ఆమెకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అన్నకు కనబడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది అన్న చెల్లెలిని గమనించాడు.
ఆ కన్నీళ్ళలో ఎన్ని భావాలు దాగివున్నాయో మన ఊహకందవు. తాను బిడ్డ నెత్తుకు అత్తవారింటికి వచ్చి ఇన్ని నెలలైనా వచ్చి చూడలేదేమనే నిష్ఠూరము ఆ కన్నీళ్ళలో ఉంది. ఇంత కాలానికైనా వచ్చాడనే నిస్సహాయమైన తృప్తి కూడ కన్నీళ్ళలో ఉంది. ఏడాది లోపల పురిటి మంచం చూడాలి. కాబట్టి తననిప్పుడు తీసుకువెళ్ళటానికి వచ్చాడు కాని లేకపోతే ఇప్పుడు వస్తాడా అనే కోపం కళ్ళలో ఉంది. ఏవో పనులుండి నాన్న రాలేకపోయినా చిన్నన్నయ్యలను పంపించకుండా పెద్దన్నయ్యను పంపించటంలోని గౌరవమూ, నిండుతనమూ, అర్థం చేసుకోవటం వల్ల కలిగిన సంతోషమూ కన్నీళ్ళుగా మారింది. ఆ కన్నీటికి కొన్ని అర్థాలున్నాయి.
చెల్లెలి కంటతడి చూసి అన్న గుండె కరిగింది. పేద ఇంటి పిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతున్నదో అని ఆరాటపడుతూ చెల్లెల్ని దగ్గరకు తీసుకుని తన ఉత్తరీయపు కొంగుతో కన్నీళ్ళు తుడిచాడు. ఓదార్చి పుట్టింటికి ప్రయాణం అవమన్నాడు. పల్లకి తెచ్చాడు.
VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)
1. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.
తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.
2. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.
3. కొడవటిగంటి కుటుంబరావు గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల్యం జరిగింది. స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్థిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.
కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్నఅంశాలకు సంబంధించిరాశారు కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.
4. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటి పేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.
IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)
1. దూరదర్శన్ వలన లాభనష్టాలను వివరిస్తూ సోదరికి లేఖ.
జవాబు:
కాకినాడ,
3-3-2008.
ప్రియమైన సోదరి స్వాతికి,
మీ అన్న వ్రాయునది. నేను క్షేమముగా ఉన్నాను. నీవు క్షేమమని తలుస్తాను. మా కాలేజీలో ఇటీవలే టెలివిజన్ ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకొనే ఏర్పాటు కల్పించారు. 1925లో బ్రిటీష్ శాస్త్రజ్ఞులు బయర్డ్, జెన్కిన్స్ అనువారు టెలివిజన్ను కనిపెట్టిరి. అప్పటి నుండి ఈనాటి వరకు టెలివిజన్ బహుముఖముగా అభివృద్ధి చెంది, ప్రధాన ప్రసార సాధనముగా, విజ్ఞాన వరప్రసాదినిగా ఉపయోగపడుతున్నది. క్రీడలు, కళలు, వ్యాపారము, వార్తలు, వ్యవసాయము, శాస్త్ర సంబంధమైన విషయములెన్నియో బుల్లి తెరమీద చూచి విజ్ఞాన వినోదములను ప్రజలు పొందగలుగుతున్నారు. కానీ, అదే పనిగా టి.వి.ని చూడటం వలన కంటి చూపు దెబ్బతినే ప్రమాదము ఉంది. ఏమైనను దూరదర్శన్ విజ్ఞాన శాస్త్రజ్ఞుల అపూర్వ సృష్టి. శక్తివంతమైన ప్రచారసాధనమని చెప్పక తప్పదు.
ఈనాడు దేశమునందు పలు ప్రాంతాలలో దూరదర్శన్ కేంద్రములు స్థాపించి యున్నారు. వీలయినంత వరకు టెలివిజన్లు ప్రజలకు చౌక ధరలో అందించుటకు ప్రభుత్వం కృషి చేయుచున్నది. నీవు కూడా దూరదర్శన్ సాయమున విజ్ఞానాభివృద్ధి చేసుకోగలవని ఆశించుచున్నాను.
ఇట్లు,
మీ అన్నయ్య,
XXXXXX.
చిరునామా :
ఎ. శ్రీలత,
సీనియర్ ఇంటర్ (ఎం.పి.సి.),
మేరీస్ స్టెల్లా కళాశాల,
విజయవాడ.
2. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వివరిస్తూ నీ మిత్రునికి లేఖ.
జవాబు:
కాకినాడ,
20-8-2013.
ప్రియమైన మిత్రునకు,
నీ స్నేహితుడు వ్రాయునది. మా కళాశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉత్తరము వ్రాయుచున్నాను. వ్యాపార నిమిత్తమై మన దేశములో ప్రవేశించిన ఆంగ్లేయులు, మన దేశస్థుల అనైక్యతను సాధనముగా చేసికొని క్రమముగా యావద్భారత దేశమును ఆక్రమించుకొన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమును ఎదిరించుటకు, భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించుటకు స్వాతంత్ర్య సమర యోధులెందరో రక్త తర్పణలు గావించిరి. చివరకు గాంధీ మహాత్ముని స్వాతంత్ర్య శాంతి సమర శంఖారావానికి బ్రిటీష్ సింహాసనము కదిలింది. 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్ర్యమునిచ్చి ఆంగ్లేయులు వదలిపోయిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశములో కన్నుల పండుగగా జరుపుకొంటున్నాము.
మా కళాశాలలో కూడా స్వాతంత్య్ర దినోత్సవము బాగుగా జరిగినది. దేశ ప్రగతికి యువత నడుం బిగించి, కృషి చేయాలని మా ప్రిన్సిపల్గారు తమ సందేశములో పేర్కొన్నారు. మన నాయకులు సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్ర్య ఫలమును కాపాడుకొనవలసిన బాధ్యత ముఖ్యముగా మన విద్యార్ధుల పైన ఆధారపడియున్నదని నా అభిప్రాయము.
ఇట్లు,
నీ మిత్రుడు,
XXXXXX.
చిరునామా :
కె. చంద్రశేఖర్ (హెచ్.ఇ.సి,),
గవర్నమెంటు జూనియర్ కళాశాల,
కడప 541 621.
X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)
1. మునీంద్ర
2. ఆద్యనిమిషులు
3. సూడిదవెట్టిన
4. హితోక్తులు
5. చేరబోయి
6. వేడుకెల్ల
7. ఇట్లనియె
8. రోదసియెల్ల
జవాబు:
1. మునీంద్ర – ముని + ఇంద్ర – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవరములు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
2. ఆద్యనిమిషులు ఆది + అనిమిషులు – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు, పరమైనపుడు క్రమముగా య, వ, ర లు ఏకాదేశమగును.
3. సూడిదవెట్టిన – సూడిద + పెట్టిన – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద,వ లు బహుళముగానగు.
4. హితోక్తులు – హితా + ఉక్తులు – గుణసంధి.
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశముగా వచ్చును.
5. చేరబోయి – చేరన్ + పోయి – సరళాదేశ సంధి.
సూత్రం : 1. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు విందు సంశ్లేషలు విభాషనగు.
6. వేడుకెల్ల – వేడుక + ఎల్ల – అత్త్వసంధి.
సూత్రం : అత్తునకు సంధి బహుళము
7. ఇట్లనియె – ఇట్లు + అనియె ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధిఅగు.
8. రోదసియెల్ల – రోదసి + ఎల్ల – ఇత్త్వసంధి.
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము.
XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)
1. నడిరేయి
2. పుష్పవర్షం
3. పూజాపుష్పం
4. దొంగ భయం
5. మృగశ్రేణి
6. అసత్యము
7. రౌరవ బాధలు
8. చిగురుకేలు
జవాబు:
1. నడిరేయి : రేయి యొక్క మధ్య భాగము – ప్రథమ తత్పురుష సమాసం.
2. పుష్పవర్షము : పుష్పములతో వర్షం – తృతీయ తత్పురుష సమాసం.
3. పూజా పుష్పం : పూజ కొరకు పుష్పం – చతుర్ధి తత్పురుష సమాసం.
4. దొంగ భయం : దొంగ వలన భయం – పంచమీ తత్పురుష సమాసం.
5. మృగశ్రేణి : మృగముల యొక్క శ్రేణి – షష్ఠీ తత్పురుష సమాసం.
6. అసత్యము : సత్యము కానిది · నష్ తత్పురుష సమాసం.
7. రౌరవ బాధలు : గౌరవము నందలి బాధలు – సప్తమీ తత్పురుష సమాసం.
8. చిగురుకేలు : చిగురు వంటి కేలు – ఉపమాన పూర్వపదకర్మధారయ సమాసం.
XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)
1. కర్మధారయం
2. లేక
3. మితృడు
4. ద్రుశ్యం
5. వుడు
6. భాధ
7. బాష
8. ప్రబందం
9. బోదన
10. ధ్రువీకరణ
జవాబు:
1. కర్మదారయం – కర్మధారయం
2. లేక – లేఖ
3. మితృడు – మిత్రుడు
4. ద్రుశ్యం – దృశ్యం
5. సివుడు – శివుడు
6. భాధ – బాధ
7. బాష – భాష
8. ప్రబందం – ప్రబంధం
9. బోదన – బోధన
10. ధ్రువీకరణ – ధృవీకరణ
XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)
1. White revolution has increased the milk production.
జవాబు:
శ్వేత విప్లవం పాత ఉత్పత్తిని పెంచింది.
2. The Ramayana consists of 24,000 stanzas.
జవాబు:
రామాయణములో ఇరవైనాలుగు వేల శ్లోకములు ఉన్నాయి.
3. The Ganges is a sacred river.
జవాబు:
గంగానది పవిత్రమైన నది.
4. Health is the basis of success.
జవాబు:
ఆరోగ్యమే విజయానికి మూలం.
5. Take care of your health.
జవాబు:
నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో.
XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)
అన్నమయ్య కడపజిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. నారాయణమూర్తి, లక్కమాంబ దంపతులకు 9-5-1408న ఆయన జన్మించాడని భావిస్తున్నారు. తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడైన అన్నమయ్య 16వ ఏటనే వెంకటేశ్వరస్వామి సాక్షాత్కారం పొందిన “పదకవితా పితామహుడు”. మొత్తం 32వేల కీర్తనలు రచించినా, 12 వేల కీర్తనలు మాత్రమే దొరుకుతున్నాయి. వీటిని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి మొదలైనవారు పరిష్కరించి స్వరపరిచారు. అన్నమయ్య శృంగారమంజరి, వెంకటేశ్వర శతకం కూడా రచించినట్లు తెలుస్తోంది.
“అదిగో అల్లదిగో శ్రీహరివాసము”, “కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు”. “బ్రహ్మకడిగిన పాదము” వంటి భక్తి సంకీర్తనలు నేటికీ తన్మయత్వంతో పాడబడుతున్నాయి. అన్నమయ్య పరమభక్తాగ్రేసరుడు. ప్రహ్లాదునికి హరిభక్తిలాగా అన్నమయ్యకు నిరంతరం వేంకటేశుని చింతనే ! వేంకటేశుని తలపులే ! ఆయన భక్తి జీవనతత్త్వాన్ని వివరించే భక్తి !!
ప్రశ్నలు :
1. అన్నమయ్య ఎవరు ?
జవాబు:
తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు.
2. అన్నమయ్య బిరుదు ఏమిటి ?
జవాబు:
పదకవితా పితామహుడు.
3. వేంకటేశ్వరస్వామిని గురించి అన్నమయ్య రచించిన కీర్తనలు ఎన్ని ?
జవాబు:
32 వేల కీర్తనలు.
4. అన్నమయ్య కీర్తనలను పరిష్కరించి స్వరపరిచినవారు ఎవరు ?
జవాబు:
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి.
5. భక్తి తత్వానికి నిదర్శమైన 2 కీర్తనల పేర్లను తెలపండి.
జవాబు:
అదివో అల్లదివో శ్రీహరివాసము, బ్రహ్మ కడిగిన.
XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)
1. తిక్కన భారతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు:
మనుమ సిద్ధి.
2. రుధిరజ్యోతి సంపుటి ఎవరి నేతృత్వంలో వెలువడింది ?
జవాబు:
ఆరుద్ర.
3. ధర్మ పరీక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
తిక్కన.
4. తిన్నని గ్రామం పేరేమిటి ?
జవాబు:
ఉడుమూరు.
5. కపాలమోక్షం పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు.
6. పాపరాజు తన రచనలను ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు:
మదన గోపాల స్వామి.
7. పౌలస్త్యుడు ఎవరు ?
జవాబు:
రావణాసురుడు.
8. సత్కవీంద్రుని కమ్మని కలము ఎక్కడ కరిగింది ?
జవాబు:
శ్మశానం.
XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)
1. కామాక్షి బావగారు చదువుతున్న గ్రంధం ఏమిటి ?
జవాబు:
భారతం.
2. మానవ సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి ?
జవాబు:
మాటతీరుపై.
3. రాయలవారు వ్రాసిన నాటకం పేరేమిటి ?
జవాబు:
జాంబవతి కళ్యాణం.
4. కాంతకథలు రాసిందెవరు ?
జవాబు:
మునిమాణిక్యం నరసింహరావు.
5. కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
రాజ్యలక్ష్మి.
6. మొత్తం లోకాలు ఎన్ని ?
జవాబు:
14 లోకాలు.
7. ప్రాడిజీ అంటే ఏమిటి ?
జవాబు:
చిన్న వయస్సులో అసాధారణ ప్రజ్ఞ పాఠవాలను ప్రదర్శించే వారిని ప్రాడిజీలంటారు.
8. కలవారి కోడలు పేరేమిటి ?
జవాబు:
కామాక్షి.