Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 4 allows students to familiarize themselves with different question patterns.
TS Inter 2nd Year Telugu Model Paper Set 4 with Solutions
Time : 3 Hours
Max. Marks : 100
సూచనలు :
- ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
- ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.
I. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)
1. అని యీ సభ్యులకుం జెప్పుమనిరి; నీవును సభాసదులైన రాజులు నేమనియెద రనుం; డేను ధర్మంబును నీయుఁ జుట్టఱికంబును మున్నిడుకొని మనోవాక్ప ప్రకారంబు లేక రూపంబైన సత్యంబకాఁజెప్పితి, నిత్తెఱంగు మీకు మేలు క్రోధమాన మత్సరంబులు విడిచి యిట్లు సేయుండు
జవాబు:
ప్రతిపదార్థం :
అని = చెప్పి
ఈ సభ్యులకున్ = సభలోని పెద్దలకు
చెప్పుము + అనిరి = చెప్పవలసినదిగా పాండవులు నన్ను కోరారు
నీవును = నీవు
సభాసదులు + ఐనరాజులు = సభలో ఉన్న దొరలు
ఏమి+అనియెదరు+అనుండు = ఏమిచెపుతారో చెప్పండి
ఏను = నేను
ధర్మంబును = న్యాయమును
నీతియును = రాజనీతిని
చుట్టరికంబును = బాంధవ్యమును
మున్ను + ఇడుకొని = ముందుంచుకొని
మనఃవాక్ + ప్రకారంబులు = మనసు యొక్క వాక్కు యొక్క వైఖరులు
ఏకరూపంబున = ఒకే విధముగ ఉండునట్లు
సత్యంబకాన్ = సత్యమునే
చెప్పితిన్ = చెప్పాను
ఈ తెఱంగుల = ఈ పద్ధతి
మీకున్ = మీకు
మేలు = మంచిని కలిగిస్తుంది.
క్రోధమానమత్సరంబులు = కోపం, గర్వం, ద్వేషం
విడిచి = వదిలి
ఇట్లు + చేయుండు = నేను చెప్పిన రీతిని ఆచరించండి
తాత్పర్యం : పాండవులు సభలోని పెద్దలకు నన్ను చెప్పుమని కోరిన మాటలు చెప్పాను. మహారాజా ! నీవూ, సభలోని రాజులూ ఇందుకు బదులేమి చెపుతారో చెప్పండి. నేను నీతి, ధర్మాలనూ, బాంధవ్యాన్ని ముందుంచుకొని మనో వాక్కులు ఏకరూపంగా (త్రికణ శుద్ధిగా) ఉన్న సత్యమునే చెప్పాను. నేను చెప్పిన పద్ధతి మీకు మేలు గలిగిస్తుంది. కోపం, గర్వం, ద్వేషం వదలి నేను చెప్పినట్లు చేయండి.
2. తే.గీ॥ ఆర్ష జీవిత పద్ధతులంతరింప
నవనవోన్మేష పాశ్చాత్య నాగరకత
పెల్లుగ గమించి తుది కొక పొల్లునైతి
భారతాంబ సహింపని బరువుగానొ.
జవాబు:
ప్రతిపదార్థం:
ఆర్ష = ఋషుల ద్వారా తెలుపబడిన
జీవిత పద్ధతులు = జీవన విలువలు
అంతరింప = నశించగా
నవనవ + ఉన్మేష = కొత్తగా వికసించిన
పాశ్చాత్య = పశ్చిమ దేశాల
నాగరకత = నాగరికతను
పెల్లుగన్ = ఎక్కువగా
గమించి = వెంట నడిచి, ఆచరించి
తుదికి + ఒక = చివరికి ఒక
పొల్లును + ఐతి = పొల్లు గింజగా పనికి రాకుండా పోతిని
భారత + అంబ = భారతమాతకు
సహింపని = భరించలేని
బరువుగానో = బరువుగా మారాను కదా
తాత్పర్యం : ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా !
II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
ప్రశ్న 1.
‘గంగా ప్రవాహం’ ఎలా కొనసాగిందో తెలుపండి..
జవాబు:
భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను, శివున్ని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను తన తలపై భరిస్తానని శివుడు ఇచ్చిన మాట గంగకు కోపం తెప్పించింది. తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని గంగ భావించింది. గంగ గర్వాన్ని తొలగించాలని శివుడు అనుకున్నాడు. ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది.
ఈ విధంగా శివుని తలపై పడి శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న ‘మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. తమరు అనుగ్రహిస్తే ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి.
మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్ప మేలు కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు గంగానదిని సముద్రంలోకి వదిలాడు; శివుని జడలనుండి విడువబడిన గంగానది భాసురహ్లాడినీ, పావనీ, నందినీ, సీతా, సుచక్షు, సింధు, అనే ఆరుపాయలు తూర్పు, పడమరలకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి పాతాళానికి కదిలాడు.
అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆనదిలో స్నానం చేశారు.
జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము.
నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అని అనగానే జహ్నుమహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. గంగ భగీరథుని రథం వెంబడి సముద్రం వైపు వెళ్ళింది.
ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి, సగరపుత్రుల బూడిదకుప్పలు తడిసేవిధంగా ప్రవహించింది. దానితో సాగరులకు పాపములు పోయి దివ్యరూపాలు వచ్చాయి. వారు దేవతలలాగా విమానాలలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. అప్పటి నుండి గంగానది జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని; భగీరథుని కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ఈ భూమిపై ప్రవహిస్తుంది.
ప్రశ్న 2.
కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని సమాజానికి కలిగిస్తుంది. పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోరీ సెంటర్ లో ఎవరో కోటిమందిలో ఒకడు తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ?. ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం, ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి.
ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.
కోకిల నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. కోకిల శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు.
కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.
కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదనే విషయం నాకు తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది.
మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిలకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తుంది.
కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు.
అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు. పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో కోకిలతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.
నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్ధాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.
ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన. ఇలా కోకిలకు సమాజానికి సంబంధం ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు వివరించాడు.
III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
ప్రశ్న 1.
ముసలి గద్ద, మార్జాల వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
భాగీరథీ నదీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్గవము అనే గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతో జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి,పక్షిపిల్లలు భయపడి అరిచాయి.
ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించిన గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఎలా తప్పించుకోవాలని ఆలోచించి, అయ్యేదేదో అవుతుంది రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాలని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకుంది. గద్ద దగ్గరికి వెళ్లి అయ్యా! నమస్కారము అనగానే గద్ద నీవెవరని అడిగింది. నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు అన్నది.
అలా అనగానే గద్ద కోపంతో నువ్వు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని అన్నది. ముందు నామాట వినండి. ఆ తరువాత నేను చంపదగిన వాడనా, కాదా నిర్ణయించండి. లక్షణాలను పరిశీలించి వీడు గౌరవించదగినవాడు వీడు శిక్షించదగిన వాడు అని నిర్ణయించాలి కాని పుట్టిన జాతిని చూసి కాదు అని పిల్లి చెప్పింది.
ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గడ్డ అడగగా పిల్లి తనగురించి చెప్పింది. ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని,
బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నాను. మిమ్మల్ని ధర్మజ్ఞులని, మంచివారని యిక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటే విన్నాను. చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. అది ఇన్ని రోజులకు ఫలించింది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీ నుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు.
గృహస్థులు ఇలా చేయవచ్చా ? శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని అంటారు. ఇంటికి వచ్చిన వారు నిరాశతో పోకూడదు. అది మహా పాపం కదా అని పిల్లి అనగానే, పిల్లులు మాంసాహారులు. ఇక్కడ నా పక్షిపిల్లలున్నాయి.
అందువల్ల నేను అలా అన్నానని గద్ద చెప్పగానే పిల్లి రెండు చెవులు మూసికొని కృష్ణ కృష్ణ! ఎంతపాపముచేసి ఈ పిల్లిజన్మ -ఎత్తానో ? అది చాలదని ఈపాపం కూడా చేయాలా ? ఎంత మాట వినవలసివచ్చింది. ధర్మశాస్త్రము విని, నిష్కాముఁడనై చాంద్రాయణ వ్రతము చేస్తున్న నేను ఈ పాపం. చేస్తానా? ధర్మశాస్త్రములు అన్ని అహింసా పరమో ధర్మః అని ఏక కంఠంతో బోధిస్తున్నాయి. ఏ హింస చేయకుండా అన్ని ప్రాణులను దయతో చూసేవారికి స్వర్గము సులభంగా అందుతుంది.
భూతదయ గలవాఁడు అన్ని ధర్మాలు చేసిన వాడితో సమానం. అది లేనివాఁడు ఎన్ని దానధర్మాలు చేసినా చేయనివాడితో సమానం. చివరకు తాను చేసిన ధర్మాలే తనకు సహాయం చేస్తాయి. కాని మిగిలినవేవి తోడురావు. తెలియక చెడిపోయిన కాలము పోని, తెలిసి ఇంకా ఎందుకు చెడిపోవాలి ? అడవిలో స్వచ్ఛందంగా మొలచిన ఏ ఆకులతోనో, దుంపలతోనో ఆకలి తీర్చుకోవచ్చు. కాని ఈపాడు పొట్టకోసం ఇంత పాపం ఎవరైనా చేస్తారా ? ఆహా ! యెంతమాట అన్నారు. అని అనగా గద్దవిని కోపం తెచ్చుకోకండి. కొత్తగా వచ్చిన వారిస్వభావం ఎలా తెలుస్తుంది ? అప్పుడు తెలియక అన్న మాటను తప్పుగా అనుకోకు.
పోయినమాట పోని, నీవు ఇకపై ఇష్టం వచ్చినట్లు రావచ్చు, పోవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పింది. . తరువాత పిల్లి గద్దతో చాలా స్నేహంగా ఉంటూ, ఆ చెట్టు తొర్రలో నివసించేది. ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత పిల్లి ప్రతి రోజు అర్థరాత్రి చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికితెచ్చి తొర్రలో పెట్టుకొని తినేది.
అక్కడి పక్షులు తమపిల్లలు కనిపించకపోవడంతో చాలా బాధ పడి వెతకడం ప్రారంభించాయి. ‘అది తెలుసుకున్న పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆపక్షులు వెతుకుతూ ఆ ముసలి గద్ద ఉండే తొర్రలో తమ పిల్లల ఎముకలు, ఈకలు ఉండటం చూసి ఈ గద్దయే తమ పిల్లలను తిన్నదని భావించి దానిని గోళ్లతో రక్కి, ముక్కులతో పొడిచి చంపాయి.
ప్రశ్న 2.
జానపద గేయాలు సేకరించడంలో బిరుదురాజు అనుభవాలు ఎలాంటివి ?
జవాబు:
జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.
ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెన్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు.
జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు.
స్త్రీలకు రవిక ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు. ఆ నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటిగంట దాకా కోలాటాలు వేయించారు. ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమార్పణ చెప్పి డబ్బులిచ్చాడు.
అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డాడు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫోటోలు తీయనిచ్చేవారు కాదు. ఫోటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన.
వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు.
రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ బండిలో నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ-శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.
IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)
ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు.
ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.
అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు.
ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు. ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.
ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ?
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్గా మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డబ్బులను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.
ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సీకి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు.
అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ. మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు.
వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.
దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.
చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను,. థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. `మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.
ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు. తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాస్ ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమే జమ అయినాయని
అంతకంటే కావని చెప్పాడు. ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా. అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.
నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్కు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.
దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి. రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.
ప్రశ్న 4.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ?
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.
కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.
ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టవు అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత
పది పౌన్లు చెల్లిస్తామన్నారు. దానిని వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు. చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్ ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.
V. కింది వాటిలో రెండింటికి సందర్శసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)
ప్రశ్న 1.
దురితంబొనరించిట్ల తుదిఁ గీడు సుమీ
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి తన బాధ్యతను గుర్తుచేస్తున్న సందర్భంలోనిది.
అర్థం : జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు మీకే కీడు కలుగుతుంది.
వివరణ : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.
ప్రశ్న 2.
విమలభాస్వద్రూప శైవాలినీ
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.
వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.
ప్రశ్న 3.
ఎవరికుందే నీ పాట వినే తీరిక
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన వైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోరీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? అని కవి కోకిలను అడిగిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : నీ కమ్మని పాట వినే తీరిక ఎవరికి ఉంది ? అని అర్థం.
వ్యాఖ్య : ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.
ప్రశ్న 4.
కట్నకానుకల పంటవయి నిండాలె
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : కట్నం అనే పంటతో ఇల్లంతా నింపాలని అర్థం.
వ్యాఖ్య : ఆడపిల్లలు ఎంత కట్నం తెచ్చినా ఇంకా కావాలని వేధిస్తారని భావం.
VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)
ప్రశ్న 1.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం..
సందర్భం : రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం : ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.
వ్యాఖ్య : పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.
ప్రశ్న 2.
వారి ఉచ్ఛారణ, నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగారు. ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళాడు. పదకొండు సంవత్సరాల ఆంగ్ల ఉపాధ్యాయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడి వారితో ఎప్పుడూ మాట్లాడని కారణంగా వారి భాష, యాస రామకృష్ణయ్యకు కొత్తగా అనిపించిందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఆంగ్లేయుల ఉచ్ఛారణ వారి వాడుక పదాలు తెలియవు అని అర్థం.
వ్యాఖ్య : ప్రతీ భాషకు స్వంత యాస ఉంటుంది అలానే పలుకుబళ్ళు ఉంటాయి. వాటిని మాతృభాష అయిన వారి లాగా మాట్లాడటం కష్టం అని భావం.
ప్రశ్న 3.
నా జాతికి నావలన పాడుమాట రానివ్వను
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : యుద్ధ కాలంలో తిండికి బట్టలకు రేషన్ ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండుకు కొత్తగా వెళ్ళాడు కాబట్టి రామకృష్ణయ్యకు బట్టల కూపన్లు ఎక్కువ అందినాయి. కాని కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆ కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల భారతీయులు కూపన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారనే చెడ్డపేరు వస్తుందని, అలా దేశానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని తాను చేయనని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : నా భారత జాతికి నా ప్రవర్తన వల్ల చెడ్డపేరు రానివ్వను అని అర్థం
వ్యాఖ్య : బట్టలకోసం దొరికిన కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం తప్పు అని అలా అమ్మితే దేశ వాసులందరికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి పని తాను చేయడని భావం.
ప్రశ్న 4.
తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : చదువుకోసం ఇంగ్లాండు వచ్చి లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఎడ్. లో చేరాడు. చదువుతో పాటు వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. చివరికి ‘లండన్ బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ లీడ్స్కు రోజు వెళ్ళడం సాధ్యం కాదని, వారంలో ఒకరోజు వచ్చి పది గంటలు వింటానని, తన కోసం కొంత శ్రమ తీసుకోవాలని వారి ప్రొఫెసర్ను కోరాడు. దానికి ప్రొఫెసర్ ఫ్రాంక్ అంగీకరించాడని, ప్రేమతో సలహాలు ఇచ్చేవాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ప్రొఫెసర్ ప్రేమగా సలహాలు ఇచ్చారని అర్థం.
వ్యాఖ్య : కష్టపడి చదివే వారికి అందరూ సహకరిస్తారని, అలానే తన ప్రొఫెసర్ కూడా ప్రేమగా సలహాలు ఇచ్చారని భావం.
VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)
ప్రశ్న 1.
దుందుభిని తలచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి ?
జవాబు:
తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చిందని గంగాపురం హనుమచ్ఛర్మ భావించాడు. తమ కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచిందని, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చడమే నిజమైన ప్రసిద్ధి అవుతుందని అనుకున్నాడు.
ఇంకా బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవని గంగాపురం హనుమచ్ఛర్మ అనుభూతిని పొందాడు.
ప్రశ్న 2.
కోకిల మార్గము, సంస్కారము ఎలాంటిది ?
జవాబు:
కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేడు. కోకిలకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని కనపర్తి రామ చంద్రాచార్యులు చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.
కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.
ప్రశ్న 3.
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ?
జవాబు:
కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. ‘కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.
ప్రశ్న 4.
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను తెలియజేయండి.
జవాబు:
పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ స్త్రీలపట్ల ఉన్న వివక్షను ఎత్తి చూపాడు.
VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
గృహస్థుని ధర్మమేమిటి?
జవాబు:
భాగీరథి తీరంలోని జువ్వి చెట్టుపై ఉన్న గద్దతో కపట స్నేహం చేయాలని వచ్చిన పిల్లిని ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడిగింది. పిల్లి తనగురించి చెప్తూ ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నానని అన్నది.
మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? అని ప్రశ్నించింది. అంటే గృహస్థులు ఇంటికి వచ్చిన వారిని చంపకూడదని చెప్పింది. ఇంకా శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలతో అయినా తృప్తిపరచాలని అన్నది. ఇంటికి వచ్చిన వారిని నిరాశతో పంపకూడదని అలాపంపడం మహా పాపం అని పిల్లి గద్దకు చెప్పింది.
ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి.
రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.
ప్రశ్న 3.
భాగోతం ఆడిన తరువాత వాటాలు ఎలా పంచుకునేవారు ?
జవాబు:
భాగోతం ఆడిన తరువాత హారతి పళ్ళెంలో వేసిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. ప్రదర్శనలో పాల్గొన్న భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలయితే మూడు భాగాలు ఇస్తారు.
ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు. అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చనిపోయినా ఆయనకు వాటా ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.
ప్రశ్న 4.
ఆర్ద్రకృష్ణ ఊహించిందేమిటి ?
జవాబు:
పదమూడేళ్ల ఆర్ద్రకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహారించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది. అప్పుడు అంగారక గ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమ మీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణు శర పరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురునిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. ఆర్ద్రకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.
IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
ప్రశ్న 1.
ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ?
జవాబు:
ఆడవారు, స్త్రీలు
ప్రశ్న 2.
విజయపురిని ఏలిన వారెవరు ?
జవాబు:
ఇక్ష్వాకులు
ప్రశ్న 3.
ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మం అయ్యారు ?
జవాబు:
కపిల మహర్షి
ప్రశ్న 4.
ప్రతిభకు ఏది ఉండదు ?
జవాబు:
వర్ణ భేదం
ప్రశ్న 5.
కుండలను చేసేది ఎవరు ?
జవాబు:
కుమ్మరి
ప్రశ్న 6.
తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
తిక్కన నెల్లూరు మండలాన్ని పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థానకవి.
ప్రశ్న 7.
తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?
జవాబు:
సీతాఫలాలను
ప్రశ్న 8.
‘ఆడపిల్లలంటేనే’ పాఠ్యభాగం ఏ సంపుటి లోనిది ?
జవాబు:
నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి
X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
ప్రశ్న 1.
ఎక్కడినుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ?
జవాబు:
నిజామాబాద్ నుండి బోధన్ వరకు ఉన్న రహదారిని.
ప్రశ్న 2.
బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?
జవాబు:
ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !
ప్రశ్న 3.
ధర్మశాస్త్రములు ఏమని బోధిస్తున్నవి ?
జవాబు:
అహింసా పరమోధర్మః
ప్రశ్న 4.
“అనారోగ్యం గురించి ఆలోచించకు” కవిత రాసిందెవరు ?
జవాబు:
రష్యాకు చెందిన పన్నెండేళ్ళ అన్నా సిన్య కోవ.
ప్రశ్న 5.
‘డబుల్ డోల పద్ధతి’లో ఎవరి సమాధి నిర్మించారు ?
జవాబు:
అబ్దుల్లా కుతుబ్షా
ప్రశ్న 6.
‘మీజాన్’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ?
జవాబు:
అడవి బాపిరాజు.
ప్రశ్న 7.
దయాళువులకు కరస్థమైనది ఏది ?
జవాబు:
స్వర్గం
ప్రశ్న 8.
తెలుగుజాతికి గర్వకారణమైన తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు ?
జవాబు:
శ్రీ కోలాచలం మల్లినాథ సూరి.
XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)
1. శార్దూలం
జవాబు:
- ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
- ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
- అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
- నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.
ఉదా :
2. కందం
జవాబు:
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
- కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
- బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
- ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
- 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
- రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
- ప్రాసనియమం ఉండాలి.
ఉదా :
యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.
3.ఉత్పలమాల
జవాబు:
- ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
- ప్రతి పాదంలో, 10వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
- నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
- నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
ఉదా :
యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, టా‘ లకు యతిమైత్రి చెల్లుతుంది.
XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
ప్రశ్న 1.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I). గుర్తుతో సూచిస్తారు.
ప్రశ్న 2.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1–3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.
ప్రశ్న 3.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
ప్రశ్న 4.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.
ప్రశ్న 5.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.
ప్రశ్న 6.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.
ప్రశ్న 7.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ?
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.
ప్రశ్న 8.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :
- హ గణము (గలము)
- న గణము అనేవి.
XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)
1. అంత్యానుప్రాస
జవాబు:
అంత్యానుప్రాస : ఒకే హల్లుగానీ, ఒకే పదంగానీ పాదం యొక్క అంతంలో గాని, పదం యొక్క అంతంలో గానీ, వాక్యం చివరలో గానీ వచ్చినట్లయితే దాన్ని ‘అంత్యానుప్రాస’ అంటారు.
ఉదాహరణలు :
1) బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదిలింది హరిణాలుగా
వివరణ : ఇందులో ‘గా’ అనే హల్లు, నాలుగు పాదాల చివర వచ్చింది. కాబట్టి, ఇది ‘అంత్యానుప్రాస.
2) భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఇందులో, పై పాదాల చివరలో ‘న్నో’ అనే పదం, పునరావృతమయింది.. (తిరిగి వచ్చింది)
2. స్వభావోక్తి
జవాబు:
స్వభావోక్తి లక్షణము : జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి’. ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.
3. ఉపమ
జవాబు:
ఉపమాలంకార లక్షణము : ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”. ఇందులో
- “ఉపమేయం” (వర్ణించే వస్తువు),
- “ఉపమానం” (పోల్చు వస్తువు),
- సమాన ధర్మం,
- ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి.
ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది. దీనిలో,
- ఉపమేయం : “రాజుకీర్తి”
- ఉపమానం : ‘హంస’
- సమాన ధర్మం : “ఓలలాడటం”
- ఉపమావాచకం : ‘వలె’
XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6).
ప్రశ్న 1.
‘ఉపమేయం’ అనగానేమి ?
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’)
ప్రశ్న 2.
‘అతిశయోక్తి’ అనగానేమి ?
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.
ప్రశ్న 3.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.
ప్రశ్న 4.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.
ప్రశ్న 5.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.
ప్రశ్న 6.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస అలంకారము.
ప్రశ్న 7.
ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు ?
జవాబు:
దీనిని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ప్రశ్న 8.
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)
XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)
తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులు న్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్ర్య ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం : తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.
XVI.
(అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా చేసుకుని విద్యార్థి ప్రిన్సిపాల్ల మధ్య సంభాషణను రాయండి. (1 × 5 = 5)
పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ. (కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం – ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన : నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ : నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన : అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ : ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా!
వందన : నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ : అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన : మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ : బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా !
వందన : వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ : ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన : ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను
సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ : తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన : ధన్యవాదాలు సర్ !
(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)
ప్రశ్న 1.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.
ప్రశ్న 2.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.
ప్రశ్న 3.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.
ప్రశ్న 4.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.
ప్రశ్న 5.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ?
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.