AP Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 4 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. కపివదనుండనైన …………….. యడంగెడు రాక్షసాధమా.
జవాబు:
కపివదనుండనైన ననుఁ గల్గిని నీవ మాన దృష్టితో
నిపుడు హసించినాఁడ ‘విట నీ దృశవక్త్రముఖుల్ నఖాయుధుల్
కపు లిఁక నీ కులం బడపఁ గల్గెద రంతటఁ గండగర్వమున్
దపమునఁ బుట్టు బెట్టిదముఁ దామె యడంగెడు రాక్షసాధమా
భావం : ఓ రాక్షసాధమా ! రావణా ! కోతిముఖము కలిగినవాడనైన నన్ను చూసి అవమానించావు. ఇదే విధమైన ముఖములు కలిగిన కోతులు తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ కులమును, కండబలముచే తపఃఫలముచే వచ్చిన గర్వము అణచివేస్తారు.

2. ఇల్లో, ముంగిలియో …………………. కటువిచ్చేయంగదే లింగమా !
జవాబు:
ఇల్లో, ముంగిలియో, యనుంగుఁజెలులో, యీడైన చుట్టంబులో,
యిల్లాలో, కొడుకో, ధరింప వశమే, యే పోఁడుముల్లేక? మా
పల్లెంగోరిన వెల్లనుం గలవు తెప్పల్గాఁగ, నీకిచ్చెదన్
జెల్లంబో ! యిట నొంటి నుండ కటువిచ్చేయంగదే లింగమా !
భావం : ఇల్లా ? వాకిలా ? ఇష్టమైన స్నేహితులా ? వయసులో ఉన్నా బంధువులా ? యిల్లాలా ? కొడుకా ఎవరున్నారు (ఎవరు లేరు), ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా (కాదు అనుట) ? మా బోయ పల్లెలో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా ! మా బోయపల్లెకు విచ్చేయుమా అని తిన్నడు కోరాడు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నని చూసి బోయలు ఏవిధంగా దుఃఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.

నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దుఃఖిస్తారు.

వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూమూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.

ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు.

మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.
అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మరచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా దు:ఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి మా మనస్సు అంగీకరించడం లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగి రాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప దనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.

ఎంత దుఃఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.

నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దు:ఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.

2. కపాలమోక్షం సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకుని వేదములలో చెప్పబడిన వాడైన ఆదిశంకరుడు ధ్యానంలో గాఢంగా లీనమై ఉండగా ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది. సమస్త ప్రకృతిలోని చరాచరములు కంపించిపోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టనట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.

ఆకాశగంగలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడసాగింది. ఆదిశేషువు పడగల మీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి. పూదోటలు వికసించలేదు. వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు. అనంతకోటి జీవరాశులు గగ్గోలు పెట్టాయి. హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.

మహిమాన్వితుడైన ఆ శివుని మనసులో సానుభూతి కలిగింది. అపుడు కనులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు. అగ్ని నేత్రుడైన శివుడు ఉగ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.

శివుని ఆగ్రహాన్ని చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతిచేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు. భూలోకంలోని మహమ్మదీయ, క్రైస్తవ సమాధులలోని, హిందూ శ్మశానవాటికలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.

హిమాలయ పర్వత శిఖరాగ్రాన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుడు ధరించిన శివుని వీర్యాన్ని దాచిఉంచిన బంగారపు కుండ కదిలింది. సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు. గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైంది. సింధు, గంగానదుల గర్భంలో, సముద్రపు లోతుల్లో బడబాగ్ని అనే శివుని నేత్రాగ్ని సర్దార్ భగత్సింగ్ రూపంలో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించిపోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.

శివుని నేత్రాగ్నియే తానై జన్మించిన భగత్సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేసాడు. ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు.

తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్య్ర సాధనకు తన శిరస్సును అర్పించినవాడై ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన భగ్న గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి, ఆ పరమ శివభక్తుడు (భగత్సింగ్ నాస్తికుడైనప్పటికీ అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో కవి పోల్చాడు). మోక్షాన్ని పొందాడు. వీరుడైన భగత్సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటనున్న మూడవ నేత్రం కంపించింది. అండపిండ బ్రహ్మాండం ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.

భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఈ భూమిపై ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఈ -పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ, కపాలమోక్షం అందరికీ లభించదు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. మాటతీరు ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
మానవ స్నేహ సంబంధాలు చిరకాలం కొనసాగటానికి మాట్లాడే విధానం ఎంతో ముఖ్యం. మన మాట తీరును బట్టే. ఇతరులు మనతో స్నేహం చేస్తారు. బద్ధశత్రువునైనా మన మాటతీరుతో ఆప్తులుగా చేసుకోవచ్చు. మాటతీరుకు ఉండే శక్తి అది.

తెలుగు భాషలో ఎన్నో నుడికారాలు, జాతీయాలు, సామెతలు ఉన్నాయి. ఇవి మన భాషా సంపద. వీటి అర్థం తెలుసుకొని సందర్భోచితంగా, మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తే మన భాషలోని సౌందర్యం, సంస్కృతి, విశిష్టత, చక్కగా వ్యక్తమవుతుంది. భాషా వికాసము జరుగుతుంది. ఈ పదసంపదను ఉపయోగించకపోతే మరుగున పడిపోతాయి. విద్యార్థిలోకానికి మంచి మాటతీరును నేర్పించటం అత్యావశక్యము.
సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు బలమైన అంశం.

సమాచారాల చేరవేతలో, మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవటంలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ ఉంటాం. వాటిలో కొన్ని పదాలు పెద్ద పెద్ద పండితులకు కూడ అంతుపట్టకుండా ఉంటాయి. అయినా, మన వ్యవహారంలో సంలీనమై ఉంటాయి. అందువల్ల వాటిని మనం విడిగా గుర్తించం. ఈ పదాలు మన సామాజిక, సాంస్కృతిక చారిత్రక – ఆర్థిక అంశాలతో అవి ముడిపడి ఉంటాయి. వాటి విశేషాలు మనకు తెలిసినపుడు తెలుగు భాష ఎంత గొప్పదో, ఎంత మాధుర్యవంతమైనదో విశదమౌతుంది.

అయితే, ఏ పదాన్నైనా దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకుని ఉపయోగించినప్పుడే దాని సౌందర్యం ఇనుమడిస్తుంది. లేకపోతే, అర్థం మారిపోయి ఆక్షేపణకు గురి అవుతాము.
ఎవరికైనా కావలసినది అనాయాసంగా లభిస్తే వాడికేమి వాడికది కొంగు బంగారం అంటూ ఉంటారు కాని, విషయం తెలిస్తే పురుషుల పరంగా ఈ పదబంధాన్ని వాడరు. ఇది వివాహిత స్త్రీల విషయంలో వాడే పదబంధం. ప్రథమ సమాగమ వేళ వరుడు వధువు కొంగుకు కట్టే బంగారు కాసు ఇది. ఇది వరుడు, వధువుకు చెల్లించే కట్నం. దీని వెనుక గల నేపథ్యం తెలుసుకుని ఉపయోగిస్తే అర్థవంతంగా ఉంటుంది.

అలాగే ‘పేద సాదల పట్ల మన్నన కలిగి ఉండాలి’ అంటూ ఉంటాము. ఆర్థిక శక్తి లోపించిన వారు పేదలు. దీనికి జోడించిన శబ్దం ‘సాద’ ఇది సంస్కృత శబ్దం ‘సాధు’ నుండి వచ్చినది. వీరి జీవనం సంఘపు వితరణపై ఆధారపడి ఉంది. కనుక పేద సాదల పట్ల ఆదరణ చూపాలి అనే మాట వాడుకలోకి వచ్చింది.

అయితే తిక్కన విరాటపర్వంలో సాదురేగెనేనివ్వను……… అన్న మాటలో సాదు’ శబ్దానికి శాంత స్వభావమని అర్థం చెప్పటం జరిగింది. నిజానికి అక్కడ ఉన్నది ‘సాదు’ కాదు సాతు మాత్రమే. ‘సాతు’ అనేది ఒక రకం కలుపుమొక్క. అది చేలో పడితే దాన్ని నివారింప శక్యం కాదు.
కాబట్టి పదాల అర్థం తెలుసుకుని ఉపయోగిస్తే మాటతీరుకు మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యముంటుంది. మాటతీరు మానవ మనుగడకు భాష మనుగడకు కూడ ఎంతో దోహదం చేస్తుంది.

2. రాయలువారు పెద్దన రాసిన మనుచరిత్రను అందుకున్న తీరును వివరించండి.
జవాబు:
ఆ సంవత్సరం మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మను చరిత్ర అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఎక్కడెక్కడి విద్వాంసులు, గాయకులు కొన్నిరోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి యింట్లోనే దిగారు.

ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజీ పెద్దన్న గారింటికి వస్తారు. రాయలవారు అక్కడికి వస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం పెద్దన్నగారింటి నుండి కొలువు కూటందాకా సాగుతుందని అప్పాజి అక్కడ వున్న మహా కవులందరితో చెపుతాడు. కొంచెంసేపట్లో విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినబడతాయి. రాయలవారు అల్లసానివారి గృహంగణానికి మంత్రులతో, సామంతులతో వస్తారు. ముందు అప్పాజీ, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకుని వచ్చి, బంగారపుటడ్డల పల్లకిలో పెద్దనగారు కూర్చుంటారు.

శ్రీకృష్ణ దేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకి బొంగులకు భుజాలు తగిలిస్తారు. భోజరాజేనా ఇలా చేశాడని విన్నామా ! మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుందని రాయలను ప్రశంసిస్తూ నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.

ముందు వందలకొద్దీ రౌతులు తరవాత చల్లగా సాగే తంజావూరు సన్నాయి కూటం. భట్టు కవుల స్తుతి పాఠాలు, ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదిక బృందం, కంచి నుంచి వచ్చిన కామ సుందరి మేళం. ఆ వెంటనే మంత్రులతో సామంతులతో, దండనాధులతో, కవులతో, పండితులతో, గాయకులతో శ్రీకృష్ణదేవరాయలు. ఊరేగింపు విజయనగర రాజు వీధులలో సాగుతుంటే తోవలో రాయలవారికి, మహాకవికి ప్రజలు హారతులు ఇచ్చారు. శఠకోపయతుల మఠం దగ్గర రాయలు, పెద్దన పల్లకి దిగి గురువుగారి పాదాలపై శిరస్సులు ఉంచారు. రాయలవారి నిండు సభలో, మను చరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడనెవ్వరీడు పేర్కొన నీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై చదవలేకపోయారు. పఠనానంతరం కవి పండితులందరూ మను చరిత్రలో, ఆంధ్ర కవిత్వ. చరిత్రలో నవయుగం ప్రారంభమైనదని కీర్తించారు.
ఇంత కన్నుల పండుగగా రాయలవారు మను చరిత్రను అందుకున్నారు.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. అంపకాలు పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటి నుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.

పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు. పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ? తన ప్రాణంలో. ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు. బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు. శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరుపెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురుమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ఆనుకొని ఉంది పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ధి కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధపడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.

ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు కాని ముద్ద గొంతులో దిగలేదు దుఃఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.

2. ఊతకర్ర ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
జవాబు:
ఏ మనిషికైనా అరవైయేండ్లు పైబడటమంటే ఊతకర్ర చేతికి రావటమనే అర్థం. జీవిత చరమాంకంలో అడుగుపెట్టినట్లే. ఆ సమయంలో వారికి ఆలనాపాలనా కరువైతే జీవితం దుర్లభం. ప్రేమానురాగాలు కరువైతే ఒంటరితనం ఒక నరకం. నిస్సహాయత, నిస్సత్తువ దెయ్యంలా పీడిస్తుంటే దినదిన గండమే. అటువంటి వారి జీవితం ఏటికి ఎదురీదుతున్నట్లే.

ఓ తండ్రి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. సుదూర తీరాల్లో పిల్లలు, భార్య కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు వారికి పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఆ తండ్రి ఒంటరివాడిగా జీవితాన్ని గడుపుతాడు. తనకంటూ ఓ ఇల్లు ఉంది. భద్రతకు, వంటావార్పుకు సదుపాయాలున్నాయి. అన్నింటికి వేర్వేరు గదులున్నాయి. కాని అవి అన్నీ దుమ్ముతో నిండి పీడ కళ కనబడుతోంది.

గుండె అట్టడుగు పొరల్లోని పుట్టేభావం అది అక్కడే ఆగిపోదు. గొంతుదాటి రాదు. అందరిలాగే ఆ తండ్రి కూడా ఈ దేశంలో మేధావిగా పుట్టడం ఒక శాపం అనుకున్నాడు. తన లాగా తన పిల్లలగతి కారాదని తలచాడు. బాగా చదివించాడు కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు. ఆ తండ్రి ఆశయం నెరవేరిందని సంతోషించాడు. కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా తలచాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కోరిక మేరకు అమెరికా వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసింది దూరపు కొండలు నునుపని. వాళ్ళు అక్కడ కేవలం యంత్రాలుగా మిగిలిపోయారు. డబ్బు – పని ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.

అదే జీవిత మన సంస్కృతికి వారి సంస్కృతి చుక్కెదురు. అక్కడ తెల్లవారిన దగ్గర నుండి కాలంతో పోటీపడుతూ పరుగుల జీవితం జీవించాలి. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది. పిల్లల దారి పిల్లలది. సాయంత్రం వాడిన ముఖాలతో ఇల్లు చేరడం, విశ్రాంతి తీసుకోవడం ఎవరికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు భోజనం చేయడం. ఇదంతా చూసిన ఆ తండ్రి అక్కడ జైలు జీవితాన్ని. ఇష్టపడలేదు. ఇరుగూ లేదు పొరుగూ లేదు. ఇటు అటు తిరగడానికి లేదు. మాట మంతీ లేదు. గది ఒక బందిఖానా. ఇలా ఎంతకాలం అని భార్య రానని అన్నా ఇక్కడ గాలికోసం, స్వేచ్ఛ కోసం, ఈ మట్టి కోసం ‘వెనుదిరిగి వచ్చేశాడు. ఒక ఏడాదికి పైగా ఏటికి ఎదురీది బాగా అలసిపోయాడు. ఇక ఈదడం తన వల్ల కాని పని అని ఆలోచిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. వంట మనిషి వచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి వెళుతుంది.

వ్యాయామానికి రోజు రెండు కిలోమీటర్లు నడుస్తాడు, ఆయన దినపత్రిక చదువుతాడు. కాలకృత్యాలు తీర్చుకొనేసరికి ఆకలి వేస్తుంది. ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించుకుంటాడు. కనీసం లోట మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని బాధపడతాడు. అందరూ ఉన్నా ఏకాకి జీవితం. అందులోనూ అరవై నిండిన వృద్ధాప్యం. మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై .నలిగిపోతుంటాడు. పుట్టిన రోజు కానుకగా తన బిడ్డలు పంపించిన ‘ఊతకర్ర’ ను చూసి ఆనందించాడు. ఆ కర్ర చేతపట్టుకొని మనసులేని మనుషులు పంపించిన ఈ కట్టెలో ఆత్మీయతలు అనుబంధాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఇంకెన్నాళ్లో ఈ కట్టె అని అనుకుంటూ ఓ కన్నీటి చుక్క రాల్చాడు. అది ఆ ఊతకర్రపై పడి జారిపోయింది.

3. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూసిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిస్తున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడి పోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

4. రేఖ పాత్ర ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు. దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది. బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు. చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

నార్కేటుపల్లిలో’ అరటిపళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది. ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసు కొంటుంది. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందని పించింది రేఖకు దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. వత్స ! భూలోకమున నిట్టివారు గలరె.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ధర్మదేవత నిజ స్వరూపం దాల్చి తన కుమారుడు ధర్మరాజుతో పలికిన సందర్భంలోనిది.
అర్థం : : కుమారా ! భూలోకంలో నీవంటి వారు గలరా ? (లేరు)
భావం : ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి రాను అని నిశ్చయంగా చెప్పిన వెంటనే కుక్క ధర్మదేవతగా మారి తన కుమారుడైన ధర్మరాజుతో ఈ సర్వ భూలోకంలో నీవంటి వాడు మరొకడు లేడు. ఇంతకు పూర్వం కూడా ద్వైతవనంలోను లోపరహితమైన నీ మనస్సును పరీక్షించాను అన్నాడు.

2. కూడునీళ్ళే సుట్టంబులు దెచ్చిపెట్టెదరు.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ద భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : తిన్నడు శివునితో (శివలింగం) అడవిలో నివశించుట ఎందుకని, తనతో పాటు ఉడుమూరికి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.
అర్థం : : ఆహార, పానీయాలు ఏ బంధువులు తెచ్చియిస్తారు.
భావము : ఓ స్వామీ ! యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టె భయంకరమైన నట్టడివిలో, రావిచెట్టు నీడన, నదిఒడ్డున, ఏ కోరికతో గుడి నిర్మించావు. నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్న పానీయాలు తెచ్చి యిస్తారు ? (ఇవ్వరు అని భావం). నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా అని తిన్నడు పలికాడని భావము.

3. కటతటమదరగా నిట్టులనియె.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : నందీశ్వరుని చూసి రావణుడు పకపక నవ్విన సందర్భంలోనిది.
భావము : తనని చూసి నవ్వుతున్న రావణుని చూసి అపర శివునివలే ఉన్న నందీశ్వరుడు కనురెప్పలదరగా కోపంతో శపించ పూనుకున్నాడని ఇందలి భావం.

4. వానికై వగవడొక్కడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : శ్మశానంలో పొరలుతున్న పేదవాని ప్రేతాత్మను గురించి వర్ణించే సందర్భంలోనిది.
అర్థం : అతనికై ఎవరూ దుఃఖించరు.
భావము : చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం ఏ ఆకలి బాధతో దుఃఖించి నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిది అయ్యుంటుంది కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. నకులుని గుణగణాలను పేర్కొనండి.
జవాబు:
నకులుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన కవల సంతానం. సహదేవునికి అన్న. తన సోదరుడి మరణం చూసి ధైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. శౌర్యం, ధైర్యం, సుజనత్వం మున్నగు విషయములలో మేటి. ఎంతో అందగాడు. మన కురువంశంలోనే కాక, లోకంలోనే ఇంతటి గుణశ్రేష్ఠుడు లేడు అని భీముడు నకులుని గురించి పేర్కొనగా, దానికి ధర్మరాజు లోకంలో తనని మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ గుణం వలనే అతకి దురవస్థ కలిగిందని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. రావణుడు ఏవిధంగా కైలాసానికి వెళ్ళాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము, నుండి గ్రహించబడింది. బ్రహ్మ నుండి వరాలను పొందిన రావణుడు గర్వముతో లోకములలోని వారినందరిని బాధించసాగాడు. అపుడు రావణుని అన్న కుబేరుడు అతనికి నీతిని చెప్పమని దూతను పంపాడు. రావణుడు ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధం చేసి కుబేరుని ఓడించి అలకాపురం చేరి అక్కడున్న పుష్పకము తీసుకున్నాడు. రావణుడు ఆ పుష్పక విమానము ఎక్కి తన మంత్రి సామంతులైన మారీచ, దూమ్రాక్ష, ప్రవాస్త, శుక మొదలగు వారిని దానిలో ఎక్కించుకొని కైలాస పర్వతమును చేరుకున్నాడు. కైలాసమున ప్రవేశింపబోగా ఆ పుష్పకము కైలాస వాకిట పొగడచెట్టు నీడలో ఆగిపోయినది. కారణము తెలియక శివుని నిందించి నందీశ్వరునిచే శాపము పొందాడు.

3. ఐకమత్యాన్ని ఏవిధంగా సాధించాలని వేములపల్లి కోరాడు ?
జవాబు:
తెలుగు వారి మధ్య ప్రాంతీయ భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతంతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మన తెలుగు వారిని ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులం కావాలి అన్నాడు. దీనిని తెలుగు ప్రాంతాల మధ్య పరస్పర ప్రేమ, అభిమానం, స్నేహ భావాలతోనే సాధించగలుగుతాము.

4. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3, 1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్ర్య వీరుడు భగత్ సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవుతున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6. తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్థ్వలోకములు.
1) అతల 2) వితల 3) సుతలు 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు. ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతలమయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

2. సూర్యకాంతమ్మ గారిని గురించి తెలపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసుగారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా శేవారు. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో ..వాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు. సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.
ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

3. ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయండి.
జవాబు:
ద్విపద తెలుగువారి చిరంతనమైన ఆస్తి. తెలుగువారి పల్లెపదాలూ, స్త్రీల పదాల వంటివి ద్విపద గణాలను అటూ ఇటూ మారిస్తేనో, ముందూ వెనకా కొన్నిటిని కత్తిరిస్తేనో, మరికొన్ని చేరిస్తేనో పుట్టేవే. దేశి కవితకు ఒరవడి దిద్దటంలో పాల్కురికి సోమనాథుడు ద్విపదనే అపురూపంగా ఎన్నుకున్నాడు. ద్విపద సామాన్యులకు కూడ సులభంగా అర్థమయ్యే చక్కని ఛందస్సు. చిరకాలంగా తెలుగువారు తమ సంతోషాలు, కష్టాలు, ఆనందాలు కన్నీళ్ళు ద్విపదలోనే చెప్పుకున్నారు. కలవారి కోడలు కలికి కామాక్షి పాటలో కూడ ద్విపద ఛందస్సే ఉంది.

4. పెద్దన భార్యను గురించి రాయండి.
జవాబు:
పెన్షనగారి భార్య అణకువ, గర్వము మూర్తీభవించినట్లుండే ఇల్లాలు. తన భర్తకు రాయలవారి నుండి లభిస్తున్న గౌరవ్ దరాలను చూస్తుంటే ఆమెకు అమితమైన సంతోషము. రాయలవారు నిండు సభలో మను చరిత్ర నందుకున్నప్పటి విశేషాలన్నీ ఆ సాయంకాలం పెద్దన్నగారింట్లో కూర్చున్నవారందరికీ పింగళి సూరన మరీమరీ వివరించి చెపుతుంటే, ఆ ఇల్లాలు అటు ఇటు తిరుగుతూ, ఆగుతూ ఆనందంగా వింటుంది.

మరునాడు అల్లసాని పెద్దన ఇంట్లో కవులందరికీ విందు. పెద్దన భార్య అనుకూలవతి. ఆమెను చూసి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ముద్దియౌ నతని గృహిణి’ అని ఆమె అతిథి మర్యాదను తెనాలి రామకృష్ణకవి ప్రశంసిస్తాడు. అక్క అని ఆమెను సంబోధిస్తాడు. ఆ అక్కగారు మను చరిత్రలో ప్రవరుని గృహిణి వంటిదని’ ప్రశంసిస్తాడు. అవునా’ అన్నట్లు పెద్దన ఆమెవైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తూనే ఉంటుంది. ఆదర్శ గృహిణి పెద్దన్న గారి భార్య !

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటిపేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

2. శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.
నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.

3. మునిమాణిక్యం నరసింహారావును గురించి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావు గారు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్యరచయిత. వీరి ‘కాంతం కథలు’ తెలుగు సాహిత్యంలో ఒక మణిహారం.
వీరు గుంటూరుజిల్లా తెనాలి దగ్గర వున్న సంగం జాగర్లమూడిలో 15-03-1898 లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణలు. ఇంటరు విద్య తెనాలిలో చదివారు. డిగ్రీ, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి సహాయంతో చదివారు. ఉపాధ్యాయుడుగాను, ఆకాశవాణిలోను ఉద్యోగాలు చేశారు.
దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, తెలుగుహాస్యం, రుక్కుతల్లి, తిరుమాళిగ, కాంతం కైఫీయత్తు వంటివి వీరి రచనలు. ‘టీ కప్పులో తుఫాను’ వీరి మొదటి నవల.
కాంతం కథలకు వీరి భార్యే స్ఫూర్తి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ఆధారంగా రచించిన ‘కాంతం’ కథలు’ నేటికీ నిత్య నూతనంగా ఉన్నాయి. నిత్యజీవితంలో హాస్యం అవసరాన్ని వీరు తమ రచనలలో హృద్యంగా చెప్పారు.
ముని మాణిక్యం నరసింహారావుగారు 4.2.1973లో కీర్తిశేషులయ్యారు.

4. కందుకూరి రచనలను తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొనిపోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.
కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.

తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్యతిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. అధికార తెలుగు భాష అమలుకై లేఖ.
జవాబు:
విజయవాడ,
26.5.2018.

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
ఆర్యా!
నమస్కారములు,
భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న రెండవ భాషగా తెలుగు భాషకు ప్రఖ్యాతి ఉంది. కానీ, మన రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషు భాషలోనే జరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సహాయాలు, సరాసరి ప్రజలకు చేరటం లేదు. తెలుగును అధికార భాషగా చేసి, అభివృద్ధి సాధించాలన్న దృష్టితో ఏర్పాటు చేసిన అధికార భాషా సంఘానికి సరైన సహకారం లభించడం లేదు. కనుక ‘అధికార భాషగా తెలుగును అమలు చేయటానికి తగు చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇట్లు,
భవదీయులు,
X X X X X,
X X X X X,
X X X X X.
ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం.

చిరునామా :
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
సచివాలయం,
హైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్.

2. రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వవలసినదిగా కోరుతూ అధికారికి లేఖ.
జవాబు:

పోరంకి,
23.2.2018.

X X X X X,
పోరంకి,
పెనమలూరు మండలం,
కృష్ణాజిల్లా.
మహారాజశ్రీ మండల రెవిన్యూ అధికారి గారికి,
రైతులకు అనేక ప్రయోజనాలను చేకూర్చే పాస్ పుస్తకాలను గ్రామాల్లో ఉన్న రైతులకు పంపిణీ చేయటానికి ప్రభుత్వం నిశ్చయించింది. దీనికి తగినట్లుగానే వివరాలు అన్నీ సేకరించటం జరిగిందని వార్తల ద్వారా తెలుసుకున్నాం. రైతుల కోసం కర్షక పరిషత్ కూడా స్థాపించబడింది. అయితే ఎందువలనో దానిని రద్దు చేశారు. మాకు కావలసిన ఋణాలు, ఎరువులు, సబ్సిడీ, పంటల భీమా పథకం, పొలం విస్తీర్ణం మొదలగు వివరాలన్నీ ఈ పాస్ పుస్తకాలలో ఉంటాయి. దీనిని చూపించి మాకు అవసరమైనవి పొందగలిగే అవకాశముంటుంది. కనుక మీరు సాధ్యమైనంత త్వరగా మాకు పాస్ పుస్తకాలు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.

ఇట్లు,
భవదీయుడు,
X X X X X.

చిరునామా :
మహారాజశ్రీ మండల రెవిన్యూ అధికారి గారికి,
పెనమలూరు మండలం,
కృష్ణాజిల్లా.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. ధుర్యాత్మ
2. వేడుకెల్ల
3. నగరంబుసొచ్చి
4. తోడబుట్టిన
5. నయనేంద్రియం
6. వ్యాపకానంత
7. హితోక్తులు
8. కృతార్థుడు
జవాబు:
1. ధుర్యాత్మ – ధురి + ఆత్మ – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య, వ, ర లు ఏకాదేశమగును.

2. వేడుకెల్లా – వేడుక + ఎల్ల – ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అగు.

3. నగరంబుసొచ్చి – నగరంబు + చొచ్చి – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

4. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన సరళాదేశసంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు, బిందు సంశ్లేషలు విభాషనగు.

5. నయనేంద్రియం – నయన + ఇంద్రియం – గుణసంధి.
సూత్రం : ‘అ’ కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు, క్రమంగా ఎ, ‘ఓ, అర్ అనునవి ఏకాదేశమగును.

6. వ్యాపకానంత – వ్యాపక + అనంత – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.

7. హితోక్తులు – హితా + ఉక్తులు – గుణసంధి.
సూత్రం : ‘అ’ కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఎ, ఓ, అర్ అనునవి ఏకాదేశమగును.

8. కృతార్ధుడు – కృత + అర్ధుడు – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. హిమాచలము
2. తల్లిదండ్రులు
3. పాపఫలము
4. కార్యశూరులు
5. అగ్నివీణ
6. పెనుగాలి
7. మృగశ్రేణి
8. భక్తియుక్తుడు
జవాబు:
1. హిమాచలము : హిమ అను పేరుగల అచలము – సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం.
2. తల్లిదండ్రులు : తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసం.
3. పాపఫలము : పాపము యొక్క ఫలము – షష్ఠి తత్పురుష సమాసం.
4. కార్యసూరులు : కార్యము నందు సూరులు – సప్తమీ తత్పురుష సమాసం.
5. అగ్నివీణ : అగ్ని అనెడి వీణ – రూపక సమాసం.
6. పెనుగాలి : పెద్దదైన గాలి – విశేషణా పూర్వపదకర్మధారయ సమాసం.
7. మృగశ్రేణి : మృగముల యొక్క శ్రేణి – షష్ఠి తత్పురుష సమాసం.
8. భక్తియుక్తుడు : భక్తి చేత యుక్తుడు – తృతీయా తత్పురుష సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. శోబ
2. మేదావి
3. సిక్షణ
4. సాదన
5. వీన
6. వైబవం
7. సంసించు
8. ఇనాయకుడు
9. ఉచ్ఛారణ
10. బోదన
జవాబు:
1. శోబ – శోభ
2. మేదావి – మేధావి
3. సిక్షణ – శిక్షణ
4. సాదన – సాధన
5. వీన – వీణ
6. వైబవం – వైభవం
7. ప్రసంసించు – ప్రశంసించ
8. ఇనాయకుడు – వినాయకుడు
9. ఉచ్ఛారణ – ఉచ్ఛరణ
10. బోదన – బోధన

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. Kalidasa is a great Dramatist.
జవాబు:
కాళిదాసు ఒక గొప్ప నాటక కర్త.

2. The sun rises in the east.
జవాబు:
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

3. Our college is affiliated to Krishna University.
జవాబు:
మా కళాశాల కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల.

4. Our college library is on the second floor.
జవాబు:
మా కళాశాల గ్రంథాలయము రెండవ అంతస్తులో ఉంది.

5. Some students came late to the class.
జవాబు:
కొందరు విద్యార్ధులు తరగతి గదికి ఆలస్యంగా వచ్చారు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

సూర్యోపాసన ప్రపంచంలోని చాలా దేశాలలో విభిన్న రూపాలలో జరుగుతూ ఉంది. నైలునదీ తీరంలోని ‘హేలియా వెలిస్’, మరికొన్ని ఇతర ప్రాంతాలలోని దేవాలయాలలో ఈజిప్టు దేశస్తులు ‘రా-ఆటోస్’ అనే పేరుతో సూర్యుని ఆరాధిస్తారు. లండను సమీపంలోని ‘స్టోన్హెంజ్’ ప్రాంతంలో సూర్యోపాసనా కేంద్రం ఉండేది. దక్షిణ అమెరికా, చైనా దేశాల్లో సూర్యదేవాలయ శిథిలాలు కనిపిస్తాయి. జపాన్ చక్రవర్తులు తాము సూర్యుని ప్రతినిధులమని పేర్కొంటారు. పారసీకులు సూర్యారాధకులు. భారతదేశంలో వేదకాలం నుండి సూర్యారాధన జరుగుతున్నది. ఋగ్వేదంలో సూర్యుడు ఆదిత్య, సవితృ, విష్ణు, మిత్ర మొదలైన పేర్లతో కనిపిస్తాడు. మనదేశంలో ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం సుప్రసిద్ధ సూర్యదేవాలయం. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయాన్ని వేగంగా వెళుతున్న సప్తాశ్వాలు లాగుతున్నట్లు నిర్మించారు. మహాబలిపురంలో కూడా పెక్కుసూర్యుని ఆకృతులు ఉన్నాయి. తిరుపతికి సమీపంలోని గుడిమల్లంలో పరశురామేశ్వరాలయంలో గుర్రాలు లేని సూర్య విగ్రహం ఉంది.

ప్రశ్నలు :
1. ఈజిప్టువారు ఏ పేరుతో సూర్యుని ఆరాధిస్తారు ?
జవాబు:
ఈజిప్టు దేశస్థులు “రా-ఆటోస్” అనే పేరుతో సూర్యుని ఆరాధిస్తారు.

2. తాము సూర్యుని ప్రతినిధులమని ఎవరు అంటారు ?
జవాబు:
జపాన్ చక్రవర్తులు తాము సూర్యుని ప్రతినిధులమని చెప్పుకుంటారు.

3. సాళువ నరసింహరాయల కాలంలో త్రవ్వించిన తటాకమేది ?
జవాబు:
సాళువ నరసింహరాయల కాలంలో త్రవ్వించిన తటాకం “నరసాంబుధి”.

4. నాగలాపురం తటాకం ఎవరి సాయంతో త్రవ్వించారు ?
జవాబు:
పోర్చుగీసు వారి ఇంజనీర్లు సాయంతో నాగలాపురం తటాకం త్రవ్వించారు.

5. ఏయే వస్తువులు చవకగా లభించేవి ?
జవాబు:
జామ, మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి కాయలు, తమలపాకులు చవకగా లభించేవి.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. స్వాహ వల్లభుడెవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.

2. కపాలమోక్షం ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడినది ?
జవాబు:
రుధిరజ్యోతి.

3. జాషువా బిరుదులు ఏవి ?
జవాబు:
కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ.

4. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

5. పాపరాజు వ్రాసిన యక్షగానం పేరేమిటి ?
జవాబు:
విష్ణుమాయా విలాసము.

6. అస్పృశ్యత సంచరించుటకు తావులేని స్థలమేది ?
జవాబు:
శ్మశానం.

7. పాంచాలరాజు కుమార్తె ఎవరు ?
జవాబు:
ద్రౌపది.

8. ఉత్తర రామాయణం ఎన్ని ఆశ్వాసాల కావ్యం.
జవాబు:
ఎనిమిది ఆశ్వాసాల గ్రంథం.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏకపద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. మంగళంపల్లి బాలమురళి తల్లిదండ్రులు ఎవరు ?
జవాబు:
సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య బాలమురళి తల్లిదండ్రులు.

2. పురుడు పోసుకున్న ఆడపడుచు ఏడాదిలోపల మళ్ళీ దేన్ని చూడాలి ?
జవాబు:
పురిటి మంచాన్ని చూడాలి.

3. హాసము, హాస్యము పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావు.

4. ఆంధ్రషెల్లీ అని ఎవరిని అంటారు ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి.

5. కందుకూరి వితంతు వివాహ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు ?
జవాబు:
1879లో రాజమండ్రిలో కందుకూరి వితంతు వివాహ సంఘాన్ని స్థాపించారు.

6. బాలమురళి ఎన్ని మేళకర్తల మీద కీర్తనలు రాసారు ?
జవాబు:
బాలమురళి 72 మేళకర్తల మీద కీర్తనలు రాశారు.

7. దేశి కవితకు ఒరవడి దిద్దిందెవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు.

8. కందుకూరి స్థాపించిన ప్రతిక పేరేమి ?
జవాబు:
వివేక వర్ధిని.

Leave a Comment