TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 7 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. నడిచేటి చెట్టువమ్మా వో తల్లి త్యాగాల తెట్టెవమ్మా
ఆకు రాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా.
కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తవమ్మా
ఈ బష్టుగాళ్ళ తరుమ లేచిరా ముందుకు ఆలస్యమెందుకమ్మ – ” ఆడ ”
జవాబు:
ప్రతిపదార్థం:
అర్ధములు :

ఓ తల్లి = ఓ అమ్మా
నడిచేటి చెట్టువమ్మా = నీవు నడుస్తున్న చెట్టువు
త్యాగాల తెట్టెవమ్మా = త్యాగాలు అనే తేనె తెట్టెవు అమ్మ
ఆకు రాల్చినట్టు = ఆకులను రాల్చేసినట్టు
కష్టాలు మరిచేవు = కష్టాలను మరిచిపోతావు
ప్రేమలే పంచేవు + అమ్మా = ప్రేమలను పంచుతావు
కష్టాల కొలిమిలోనా = కష్టాలు అనే కొలిమిలో
ఇంక + ఎంత కాలము = ఇంకా ఎన్ని రోజులు
ఏడుస్తవమ్మా = ఏడుస్తూ ఉంటావమ్మ
ఈ బష్టుగాళ్ళ తరుమ = ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి
లేచిరా ముందుకు = లేచి ముందుకు రా
ఆలస్యము + ఎందుకమ్మ = ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావు

తాత్పర్యం : ఓ అమ్మా ! నీవు నడిచే చెట్టులాంటి దానివి. త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి దానివి. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతావు. తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతావు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటావమ్మ. ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలి అని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు మార్గదర్శనం చేశాడు.

2. జేనెడు పొట్టకై పరుల సేవకు కాయము నమ్మి నైచ్యసం
ధానపు జీవితమ్మున వ్యథం గొని చాల కృశించు వ్యక్తి, సం
ఘానికి జాతికౌ నొక విఘాతము మాన్పగలేడు ఎట్టిదౌ
పూనికతోడ కొల్వునకుఁ బోయిన స్వేచ్ఛ నశించు దుందుభీ !
జవాబు:
ప్రతిపదార్ధం :

దుందుభీ! = ఓ దుందుభి!
జానెడు పొట్టకై = జానెడు ఉన్న కడుపు కోసం
పరుల సేవకు = ఇతరులకు సేవచేయడానికి
కాయమును + అమ్మి = శరీరాన్ని అమ్మి
నైచ్య సంధానపు = నీచత్వంతో కూడిన
జీవితమ్మున = జీవితంలో
వ్యథన్ + కొని = దుఃఖాన్ని పొంది
చాల కృశించు = చాల బాధపడే
వ్యక్తి = మనిషి
సంఘానికి = సమాజానికి
జాతికి ఔ = జాతికి కూడా
నొక = ఒక
విఘాతము = చేటును
మాన్పగలేడు = పోగొట్టలేడు.
ఎట్టిది + ఔ = ఎటువంటిది అయినా
పూనికతోడ = ప్రయత్నముతో
కొల్వునకున్ = సేవకు, ఉద్యోగానికి
పోయిన = వెళ్ళినా, వెళ్తే
స్వేచ్ఛ నశించు = స్వేచ్ఛ నశిస్తుంది.

తాత్పర్యం : ఓ దుందుబి ! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్టలేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6).

ప్రశ్న 1.
యుద్ధం వల్ల జరిగే నష్టాల్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించాడు ?
జవాబు:
యుద్ధం జరిగితే అక్కడున్న భీమార్జునులను యుద్ధరంగంలో ఎదిరించేవారు ఇక్కడెందరున్నారు ? ఇక్కడున్న ద్రోణ, భీష్ముల పరాక్రమాన్ని ఎదుర్కొనగలవారు అక్కడ ఎందరున్నారు ? ఇట్లా ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావటం కన్న నీ బలగాలై కలసి మెలసి వర్తించటం మంచిది అని హితము పలికాడు. కురు పాండవులలో ఎవరికి మరణం సంప్రాప్తించినా, ఎవరికీ బాధలు కలిగినా ధృతరాష్ట్రునికే దుఃఖం కలుగుతుందని తెలిపాడు. కౌరవులూ, పాండవులూ మంచి చదువరులు, పరాక్రమవంతులు, భుజదర్పం గలవారు గనుక ఎవ్వరూ వీరి నడ్డగించలేరు. ఇట్లాంటివారు తమలో తమకేర్పడిన యుద్ధంలో మరణించటానికి సిద్ధపడుతుండగా అడ్డుపడక చూస్తూ ఊరకుండటం నీ వంటి వారికి తగిన పని కాదు. ఎంతో కోమలమైన వారి శరీరాల నుండి మొనలుదేలిన బాణాలు దూసుకొని వెళ్ళేటట్లు గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటం సరైనది కాదు.

రాజా ! నీ గొప్పతనమును రాజనీతినీ, శాంతిని సమస్త ప్రజలు మెచ్చుకొనేటట్లు కురుపాండవులు సంగ్రామంలో నశించకుండా సంరక్షించుకొనుము అని శ్రీకృష్ణుడు చెప్పడంలో భవిష్యత్ కాలంలో జరిగే అనర్థాలు స్ఫురిస్తాయి. యుద్ధమైతే అందరికీ మహాపద కలుగుతుంది. దాన్ని లెక్కలోనికి తీసుకోవాలన్నాడు.

కౌరవ, పాండవ యుద్ధంలో యాదవ కుటుంబ సభ్యులు కొందరైనాపోవటం శ్రీకృష్ణుడికేర్పడే ఆపద. కొడుకులందరూ మరణించి తర్పణాలు ఇవ్వటానికి కూడా ఎవ్వరూ మిగలని మహాపద ధృతరాష్ట్రుడిది. కౌరవులందరూ నశించటం వంశజుల కేర్పడే మహాపద. యుద్ధంలో సహాయపడే రాజులు కోల్పోతారు.

దానివలన భూమి వీరులను కోల్పోతుంది. రక్తంతో తడుస్తుంది. జననాశం ఏర్పడుతుంది. వితంతువుల విషాదం పెల్లుబికుతుంది. ఇవన్నీ లోకానికేర్పడే ఆపదలు, వీటిని పరిగణించి తప్పక సంధి చేయుమని హితవు చెప్పి హెచ్చరించాడు శ్రీకృష్ణుడు.

ప్రశ్న 2.
సిద్ధప్ప జ్ఞానబోధలోని నీతులు వివరించండి.
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధలో నీతులను వివరించాడు. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడు, కొన్ని సారెమీద, కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పగలగా కొన్ని మాత్రమే మంచిగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి.

అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిపై మోక్షాన్ని పొందుతారు. కోపంతో మానవత్వం పోతుంది. కోపం నష్టపరుస్తుంది, పాపం పెరిగేలా చేస్తుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని చెప్పాడు.

డబ్బు ఉన్నవారిని గౌరవిస్తారు. కాని పేదవారి గుర్తించరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చలిచీమలు కూడా పామును చంపుతాయి. కాబట్టి ఎదుటి వారి ముందు గొప్పలు చెప్పుకోవద్దు. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు.

సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్తులు, కులం, అధికారం, సంసారం ఇలా అనేక విషయాలపై మోహంతో భక్తి లేక ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

వేదాలు తెలిసిన వేమన తాతలాంటి వాడు. సురలను ఆనందింపచేసే సుమతి శతక కర్త బద్దెన పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం తండ్రి లాంటి వారు. ఈశ్వరమ్మ అక్క లాంటిది. సిద్ధప్ప అన్న వంటి వాడు. కాళిదాసు మా చిన్నన్న. అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. వారిలాగా లోక కళ్యాణం కోసం జీవించాలి. నాలుక తండ్రి పరమాత్మ వంటిది.

కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు.

చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు.

గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుందని సిద్ధప్ప నీతులను చెప్పాడు.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించఁ
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ `పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే.

తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని.

కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో ‘ పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు.

ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.) అందువల్ల భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 2.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి. దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు.

భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ?
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్గా మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డబ్బులను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు.. మొదట బ్రిటీష్ రెసిడెన్సీకి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు.

వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.

దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు. తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు.

అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమె జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు. ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీదకు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు. దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది.

రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి. రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

ప్రశ్న 3.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ?
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

ప్రశ్న 4.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు.

ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు. రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు.

డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.

మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

ప్రశ్న 1.
దురితంబొనరించిట్ల తుదిఁ గీడు సుమీ
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు,
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి తన బాధ్యతను గుర్తుచేస్తున్న సందర్భంలోనిది.
అర్థం : జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు మీకే కీడు కలుగుతుంది.
వివరణ : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

ప్రశ్న 2.
శంభుమస్తకముపైఁ బడియె గడు నద్భుతంబుగాన్
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
అర్థం : శంకరుని తలపై అందంగా పడింది.
సందర్భం : శివునిపై కోపంతో శివున్ని పాతాళానికి తొక్కి వేయాలని దేవలోకంలో ప్రవహించే గంగానది హిమాలయ
పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడిన సందర్భంలోనిది.
వ్యాఖ్య : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. దానికి గంగ శివునిపై కోపం పెంచుకుంది. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడి శివుని జటాజూటంలో చిక్కుకున్నది.

ప్రశ్న 3.
కోపము నరుని సాంతము కూల్చునిలను
జవాబు:
కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.
సందర్భం : కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని వరకవి చెప్పిన సందర్భంలోనిది. (కాబట్టి)
అర్థం : కోపం మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని అర్థం.
వివరణ : కోపానికి దూరం ఉండాలని భావం.

ప్రశ్న 4.
మముబెంచు తల్లివై మా పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.
వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.
వ్యాఖ్య : సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.

ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా . ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.
వ్యాఖ్య : గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

ప్రశ్న 3.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు. సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.
వ్యాఖ్య : దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 4.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.
వ్యాఖ్య : 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
పట్టణంలో విహరిస్తూ కోకిల ఏం చేస్తుంది ?
జవాబు:
కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు అని కవి అంటున్నాడు.

కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

ప్రశ్న 2.
నిసార్ కవి పరిచయం రాయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠాన్ని ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనుండి గ్రహించారు. దీని రచయిత నిసార్. ఈయన పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహమద్. నిస్సార్ డిసెంబర్ 16, 1964 న జన్మించాడు. జూలై 8, 2020 న కరోనా కారణంగా చనిపోయాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం. తల్లిదండ్రులు హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్.

సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు. దూర విద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు. తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం। నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను అర్ధంగా గానం చేశాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 3.
భరతవంశం గొప్పతనం తెలుపండి.
జవాబు:
భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం అనే ఆరు గుణాలకు ప్రసిద్ధి. ఆ భరత వంశంలో పుట్టిన వారందరూ పై సద్గుణాలు గలిగి కీర్తి పొందారు. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ సద్గుణాలయందు శ్రేష్టులు అనడంలో పాండురాజు ఔన్నత్యం తెలపడంతోపాటు ధృతరాష్ట్రుని ముందు కాళ్ళకి బంధం వేయడం కనిపిస్తుంది. నీ కుమారులు కూడా కీర్తి భారం వహించ జాలినవారు అవడం వల్ల యుద్ధం చేసి చెడ్డపేరు పొందకూడదు అనే సూచనా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
గంగ ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ?
జవాబు:
శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను.

ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ ‘గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదిని, పావనీ, నందినీ అనే మూడు పేర్లుగల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని’ వద్దకు బయలుదేరింది.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదురాజు రామరాజు సేవ ఎలాంటిది ?
జవాబు:
బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడు వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగుశాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేశారు. అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు.

ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగుశాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వత్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు. వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళాడు. అక్కడ నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.

ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవచక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం. శాసనం తీసే విధానం ప్రాక్టికల్గాగా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్జ్ ఫోటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు.

ప్రశ్న 2.
గోల్కొండ కోటలోని నీటి ఏర్పాట్లను తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది. మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి.

కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి. మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాల లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ప్రశ్న 3.
భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ?
జవాబు:
చిందు భాగవత ప్రదర్శనకు అవసరమైన ఆభరణాలను పొనికి కట్టెతో తయారుచేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారుచేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం.

ప్రశ్న 4.
ముసలి గద్దను చూసి బిడాలము ఏమనుకుంది ?
జవాబు:
భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే ఒక గుడ్డి, ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది.

దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది “రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాల”ని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది.

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
నిసార్ జన్మస్థలం ఏది ?
జవాబు:
నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం

ప్రశ్న 2.
తిక్కన రచనలు తెలుపండి.
జవాబు:
తిక్కన, ఆంధ్ర మహాభారతంలో విరాటపర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకూ ఆంధ్రీకరించాడు. ఇదికాక

ఎ) నిర్వచనోత్తర రామాయణం
బి) కృష్ణశతకం
సి) విజయసేనం
డి) కవివాగ్బంధం-మొదలైన రచనలు చేశాడు.

ప్రశ్న 3.
కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి ?
జవాబు:
వచన కవితా ప్రవీణ

ప్రశ్న 4.
‘భగీరథ ప్రయత్నం’ ఏ కావ్యం లోనిది ?
జవాబు:
శ్రీమత్ పండరీనాథ రామాయణం

ప్రశ్న 5.
వెళ్ళిపోయేనాడు వెంటరానిది ఏమిటి ?
జవాబు:
ఒక కాసు కూడా రాదు

ప్రశ్న 6.
జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 7.
కోకిలకు వేదిక ఏది ?
జవాబు:
పచ్చని చెట్టు

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 8.
‘నాకము’ అనగానేమి ?
జవాబు:
స్వర్గం

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
“నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
జవాబు:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.

ప్రశ్న 2.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 3.
‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

ప్రశ్న 4.
బిరుదురాజు రామరాజు పిహెచ్ డి గ్రంథం పేరేమి ?
జవాబు:
తెలుగు జానపద గేయ సాహిత్యం.

ప్రశ్న 5.
దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది ?
జవాబు:
వరంగల్లు జిల్లా దేశాయిపేట.

ప్రశ్న 6.
నీతిచంద్రికకు ఆధార గ్రంథాలేవి ?
జవాబు:
విష్ణుశర్మ పంచతంత్రం, నారాయణ పండితుని హితోపదేశం.

ప్రశ్న 7.
‘సృజనాత్మకత’ ఎక్కడి నుండి ప్రభవిస్తుంది ?
జవాబు:
సుందర హృదయాల నుండి.

ప్రశ్న 8.
‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం ఏ పుస్తకం లోనిది ?
జవాబు:
మహామంత్రి మాదన్న

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
శార్దూలం
జవాబు:
శార్దూలం లక్షణము :

  1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.

TS Inter 2nd Year Te Model Paper Set 7 with Solutions 1

ప్రశ్న 2.
సీసం
జవాబు:
సీసం లక్షణము :

  1. సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. పఠన సౌలభ్యం కోసం సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు.
  4. ప్రతి అర్ధపాదంలోనూ 1-3, 5-7 గణాల మొదటి అక్షరాలకు, యతిమైత్రి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం ఉండదు. కాని ప్రాసయతి ఉంటుంది.
  6. సీస పద్యానికి, అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని చేర్చాలి.

ఉదా:

TS Inter 2nd Year Te Model Paper Set 7 with Solutions 2

ప్రశ్న 3.
మత్తేభం
జవాబు:
మత్తేభం లక్షణము :

  1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

TS Inter 2nd Year Te Model Paper Set 7 with Solutions 3

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ?
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

  1. వృత్తాలు
  2. జాతులు
  3. ఉపజాతులు.

ప్రశ్న 2.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

ప్రశ్న 3.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.

ప్రశ్న 4.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 5.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 6.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 7.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 8.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. లాటానుప్రాస
జవాబు:
లాటానుప్రాస : ఒకే అర్ధమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే, అది ‘లాట ‘స’ అలంకారం అవుతుంది.
ఉదా : కమలాక్షు కన్పించు కరములు కరములు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, ‘కరములు’ అనే మొదటి పదానికి, సామాన్యమైన చేతులు అనీ, రెండవ ‘కరములు’ అనేదానికి శ్రేష్ఠమైన చేతులు అనీ, తాత్పర్య భేదము ఉంది. ‘కరములు’ అనే పదాలు, రెండింటికీ “చేతులు” అనే అర్థం. కాని, రెండవ కరములు అనే పదానికి, శ్రేష్ఠమైన చేతులు అనే తాత్పర్యము, భేదంగా ఉంది. కాబట్టి ఇది “లాటానుప్రాస” అలంకారము.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

2. అర్థాంతరన్యాసాలంకార
జవాబు:
అర్ధాంతరన్యాసాలంకార లక్షణము : సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ, సమర్థించి చెప్పినట్లయితే ‘అర్ధాంతరన్యాసా
లంకారము’.
ఉదాహరణ : గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాడు.
మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !
వివరణ : భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం, విశేష విషయము. దాన్ని ‘మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా !’ అనే సామాన్య వాక్యంతో సమర్థించడం వల్ల ఇది ‘అర్ధాంతరన్యాసాలంకారం’.

3. ఉత్ప్రేక్షాలంకార
జవాబు:
ఉత్ప్రేక్షాలంకార లక్షణము : ‘ఉత్ప్రేక్ష’ అంటే ఊహించడం అని అర్థం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.

ఉదాహరణలు :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి.
  2. గాంధీ మహాత్ముని హత్య వల్ల భారతజాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు.

వివరణ : పై రెండు ఉదాహరణలలోనూ, ఊహ ప్రధానంగా ఉన్నది. మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు, దుఃఖం చూడలేకనే సూర్యుడు అస్తమించాడా అన్నట్లు, అనే రెండు చోట్లనూ ఊహలే ఉన్నాయి. అందువల్ల, ఇవి ‘ఉత్ప్రేక్షలకు ఉదాహరణలు.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

ప్రశ్న 2.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

ప్రశ్న 3.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

ప్రశ్న 4.
ఉపమావాచకాలు ఏవి ?
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

ప్రశ్న 5.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.

ప్రశ్న 6.
ఒకే హల్లు అనేకసార్లు ఆవృతి అయితే అది ఏ అలంకారం ?
జవాబు:
ఒకే హల్లు, అనేకసార్లు ఆవృత్తి అయితే, అది ‘వృత్త్యనుప్రాస అలంకారం.

ప్రశ్న 7.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.

TS Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 8.
‘కమలాక్షు నర్చించు కరములు కరములు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘లాటానుప్రాస’ అలంకారము.

XV. ఈ కింది విషయాన్ని ‘3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం : తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

XVI.

(అ) ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ. (1 × 5 = 5)
(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి : తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి : నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి : ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి : దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?.
విద్యార్థి : ఉన్నాయి సర్ ! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి : ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి : ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి : మంచిది ! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి : అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?
అధికారి : రెండు రోజుల్లో.
విద్యార్థి . : ధన్యవాదాలు సర్ !

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 2.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 3.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

ప్రశ్న 4.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 5.
“అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

Leave a Comment