AP Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 9 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. జనులు నుతింపగా ………………….. నుతుం డగు నీకు నర్హమే.
జవాబు:
జనులు నుతింపఁగా సుకృత సంపదఁజేసి యమర్త్య భావముం
గనియును జెందకిట్లునికి కార్యమె ద్రౌపది భీమసేను న
ర్జునుఁ గవలం ద్యజించుటకు సువ్రత చాలితి చాల వయ్యె దీ
శునకము విడ్వ నిత్తెఱఁగు సూరి నుతుం డగు నీకు నర్హమే.

భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభారాన్ని పొందనున్నావు. అటువంటిది ఇలా కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు ఇది ఏమంత మంచి పని. ద్రౌపదిని, భీమార్జునులను, నకుల, సహదేవులను కూడా వదులుకున్న సువ్రతుడవే ! కానీ కుక్కను మాత్రం వదలనంటున్నావు. బుద్ధిమంతులచే స్తుతించబడే నీకు పంతగించటం తగునా అన్నాడు.

2. అన్నకుఁ దండ్రికిన్ ……………… కృతార్థుఁ డెయ్యెడన్
జవాబు:
అన్నకుఁ దండ్రికిన్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁ గ
నొన్న మహోగ్రపాతక మగున్ దనువస్థిరమృత్యు వెప్పుడున్
సన్నిహిత స్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశంబటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుఁ డెయ్యెడన్.

భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ఎవ్వరైతే కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి భయంకరమైన పాపము కలుగుతుంది. ఈ శరీరము అస్థిరము మరణము వెనువెంట పొంచి ఉంటుంది. కలిమి పూర్వకతము వలన సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ మనసులో తలచుకొని ధర్మమార్గమున అనుసరించు వాడే కృతార్థుడు, ధన్యుడు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ధర్మరాజునికి – ఇంద్రునికి శునకం విషయంగా జరిగిన చర్చను విశ్లేషించండి.
జవాబు:
ధర్మరాజును స్వర్గలోకానికి ఆహ్వానించాడు ఇంద్రుడు. స్వయంగా విచ్చేసి ధర్మరాజుని ఆహ్వానించగా తన సోదరులను గురించి దుఃఖించాడు. వారిని స్వర్గంలో చూస్తావు, నీవు సశీరంగా రావలసింది అని ఆహ్వానించాడు. అలాగైతే ఈ కుక్క నేను హస్తినాపురం విడిచింది మొదలుగా ఎంతో భక్తిగా నన్ను వెంబడించి వస్తోంది. అయినపుడు ఇది కూడా నాతో రావాలి గదా ! దానికి అనుమతించు, ఏమంటావు, కాఠిన్యం వహించటానికి నాకు మనసు రాదు. దయాత్ములు, దానిని నాతో రావడానికి అనుమతించండి అని కోరాడు.

దానికి ఇంద్రుడు చిరునవ్వుతో ధర్మరాజా ! నీవు ఇలా అనడం బాగుందా ! అది ధర్మం కాదు. ఎందుకంటే కుక్కకు దైవత్వం ఎలా అబ్బుతుంది. నీవు అన్నట్టుగా చేయడం అసాధ్యం. దీనిని విడిచి రావటం కాఠిన్యమెలా అవుతుంది. కనుక దానిని వదిలేసి ఆలస్యం చేయక రథం ఎక్కు, వెళదాము అన్నాడు. దానికి ధర్మరాజు ఆయనతో మహాత్మా ! నీవన్నది నిజమే కావచ్చు, నేను అడిగింది చేయతగినదీ, కష్టమైనది కావచ్చు, కానీ పూజ్యుడవు సర్వప్రభువు అయిన మీరు ఆశ్రయించిన వారి కోరిక తీర్చాలి. నన్ను నమ్మిన కుక్కను వదిలివేస్తే వచ్చే సౌఖ్యాలు నాకు ఎలాంటి ఆనందాన్నిస్తాయి. కావున నా కోరిక నెరవేర్చు అని ప్రార్థించాడు.

అపుడు ఇంద్రుడు ధర్మరాజా ! పంతం వీడు, అలా పంతంపడితే అది ధర్మాన్ని హరించి వేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు వదులుట కాఠిన్యం వహించినట్లు కాదు. దానికోసం పట్టుదల వద్దు. శుభం కలిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా అన్నాడు.

దానికి బదులు ధర్మరాజు ఆయనతో తనపట్ల విశ్వాసం గలవానిని విడిచిపెట్టుట బ్రహ్మహత్యా పాతకంతో సమానమని పెద్దలు చెబుతారు. అన్ని ధర్మాలు తెలిసిన మహాత్ముడవు నీవు. అలాంటిది ధర్మం గురించి నేను చెప్పేవాడినా ! ఏమైనప్పటికీ స్వర్గసౌఖ్యం కొరకు పాపానికి ఒడికట్టుకోలేను అన్నాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజా! నియమపరుడైన వాడు కుక్కను ముట్టుకున్నంత మాత్రానే అతడి పుణ్యమంతా కొట్టుకు పోతుంది గదా ! మరి నీవు ఎంతటి నియమపరుడవు. కాని దానికై పంతం పట్టడం బాగుందా ! కనుక ఈ కుక్కను వదిలెయ్యి అలా చేస్తే స్వర్గలోక సుఖం లభిస్తుంది.

లోకం మెచ్చేలా ఎన్నో పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభావాన్ని పొంద నున్నావు అలాంటిది కుక్క కొరకు దానిని వదులుకుంటానన్నావు. ద్రౌపది, భీమార్జున, నకుల సహదేవులను కూడా వదులుకున్నావు. కానీ కుక్కను వదలనంటున్నావు. నీవు బుద్ధిమంతుడవు. ఇలా పంతం పట్టుట సరైన పనా అని ఇంద్రుడు అన్నాడు.

దానికి ధర్మరాజు మహేంద్రా ! అఖిలలోకానికి, ధర్మానికి నీవే ప్రభువువి. అటువంటి నీతో ధర్మాన్ని గురించి చెప్పటానికి నేనెంత వాడిని. అదీగాక మహాత్ములతో వాదం చేయవచ్చునా ! అయినా మనవి చేయవలసిన విషయాన్ని మనవి చేయటం దోషం కాదనే ఉద్దేశంతో విన్నవిస్తున్నాను. ద్రౌపది, భీముడు, ఇతర సోదరులు మరణించారు. వారిని విడువకుండా శోకిస్తుంటే తిరిగి నాతో కలిసి వస్తారా ! రారు కదా. నాతో వచ్చి వారి వలె చావని కుక్కను విడిచిపెట్టనని అనుట దోషమవుతుందా అన్నాడు.

ఇంకా శరణు కోరిన వారిని రక్షింపకుండుట, మిత్రునికి నమ్మక ద్రోహం చేయుట, స్త్రీని వధించుట, వేదజ్ఞానం గలవాని ధనాన్ని హరించుట అనే దోషాలు కూడా భక్తుడినీ, నిరపరాదినీ వదులుకొనే దోషంతో పోల్చలేము అన్నాడు. కావున దేవా ! నాకు స్వర్గలోక ప్రాప్తి అలా ఉండనివ్వండి. నామాట మీద మనసు పెట్టండి. నాపై తమకు గల దయతో కుక్కని వదలలేని నా అశక్తతను తప్పుగా భావించకుండా నాకు వరాన్ని గ్రహించండి. తాము వెళ్ళిరండి. నేను ఈ అడవిలోనే వానప్రస్థంలో వుండి తపస్సు చేసుకుంటూ తమనే సేవిస్తూ ఉంటాను అని నిర్మొహమాటంగా, నిశ్చయంగా ధర్మరాజు పలికాడు.

2. కపాలమోక్షం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకుని వేదములలో చెప్పబడిన వాడైన ఆదిశంకరుడు ధ్యానంలో గాఢంగా లీనమై ఉండగా ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది. సమస్త ప్రకృతిలోని చరాచరములు కంపించిపోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టనట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.

ఆకాశగంగలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడసాగింది. ఆదిశేషువు పడగల మీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి. పూదోటలు వికసించలేదు. వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు. అనంతకోటి జీవరాశులు గగ్గోలు పెట్టాయి. హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.

మహిమాన్వితుడైన ఆ శివుని మనసులో సానుభూతి కలిగింది. అపుడు కనులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు. అగ్ని నేత్రుడైన శివుడు ఉగ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.

శివుని ఆగ్రహాన్ని చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతిచేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు. భూలోకంలోని మహమ్మదీయ, క్రైస్తవ సమాధులలోని, హిందూ శ్మశానవాటికలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.

హిమాలయ పర్వత శిఖరాగ్రాన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుడు ధరించిన శివుని వీర్యాన్ని దాచిఉంచిన బంగారపు కుండ కదిలింది. సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు. గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైంది. సింధు, గంగానదుల గర్భంలో, సముద్రపు లోతుల్లో బడబాగ్ని అనే శివుని నేత్రాగ్ని సర్దార్ భగత్సింగ్ రూపంలో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించి పోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.

శివుని నేత్రాగ్నియే తానై జన్మించిన భగత్సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేసాడు. ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు.

తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్ర్య సాధనకు తన శిరస్సును అర్పించినవాడై ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన భగ్న గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి, ఆ పరమ శివభక్తుడు (భగత్సింగ్ నాస్తికుడైనప్పటికీ అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో కవి పోల్చాడు). మోక్షాన్ని పొందాడు. వీరుడైన భగత్ సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటనున్న మూడవ నేత్రం కంపించింది. అండపిండ బ్రహ్మాండం ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.

భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఈ భూమిపై ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఈ పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ, కపాలమోక్షం అందరికీ లభించదు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
హాసమునకు కారణ భూతమైనది హాస్యం, నవ్వించేది హాస్యం. సహృదయుడు, ఆరోగ్య వంతుడు, నాగరికుడు అయిన – వానిని నవ్వించేది ఉత్తమ హాస్యం. అయితే, అనాగరికులను నవ్వించే విషయాలు కూడ ఉన్నాయి.
ఉదాహరణకు:
మనిషికి సహజంగా కుంటితనము, గుడ్డితనము, అనాకారితనము, ముక్కు వంకర, మూతివంకర వంటి అంగవైకల్యాలు ఉంటాయి. వీటిని చూసి నవ్వటం సభ్యత అనిపించుకోదు. అది నాగరిక లక్షణం కాదు. అయితే, కుంటిగా నడవాలని చూసే నటుణ్ణి చూసి నవ్వవచ్చు. కాలు జారి పడ్డ వాణ్ణి చూసి నవ్వటం సభ్యత కాదు. కడుపు నొప్పితో బాధపడుతూ ముఖం వికృతంగా పెట్టిన వాణ్ణి చూసి నవ్వేవాడు సంస్కారి కాడు.

ఒక విషయంలో వుండే అసహజత్వం నవ్వుకు కారణమవుతుంది. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా విరగబడి నవ్వాలనిపిస్తుంది.
పత్నియే పతికి దైవం అంటే అందులోని అసహజత్వానికి తప్పక నవ్వువస్తుంది.

అర్ధరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు అనే సామాన్య విషయానికి అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట! దొంగలు! అందులో కన్నంలో నుంచి! అని ఒక మనిషి అంటే అతని అత్యాశ్చర్యాన్ని చూసి నవ్వుతాము.

ఒక కథకు ముగింపు మనం ఒక విధంగా ఊహిస్తే, దానికి భిన్నంగా ఆశ్చర్య కరంగా వేరే ముగింపు వుంటే ఆ ఆశ్చర్యంలో నుంచి హాస్యం పుడుతుంది. అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా గొప్పగా పాఠం చెప్పి చివరకు, ‘ఆయన ఏం చేశారంటే’ అని ఒక్కక్షణం ఆగిపోతే విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్పపని చేసివుంటాడని ఆశ్చర్యంతో చూస్తూ వుంటే అధ్యాపకుడు ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ఢాం అని చచ్చాడు’ అని చెప్పేటప్పటికి క్లాసంతా గొల్లుమంది హాస్యం పుట్టించే పద్ధతుల్లో ఇది ఒకటి.

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా ‘అంటే దూడకు పచ్చగడ్డి కోసం’ అంటే వెంటనే నవ్వువస్తుంది. శుభంగా పెళ్ళి జరుగుతున్న సమయంలో వచ్చిపోయెడివారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణమేడ్వ వంటి అవాకులు, చవాకులూ వింటే నవ్వు రాకుండా ఉండదు. సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడటం వల్ల ఇలా హాస్యం పుడుతుంది.

తన ఊళ్ళో భూకంపాలు తరచుగా వస్తున్నప్పుడు, ఒక ఆసామి పిల్లలను మరోగ్రామంలోని స్నేహితుని ఇంటికి పంపాడు. నాలుగు రోజుల తరవాత ఆ స్నేహితుడు నీ పిల్లలను పంపిస్తున్నాను. భూకంపాలను మా ఊరు తోలేసెయ్యి, అని టెలిగ్రాం ఇచ్చాడట. ఇందులోని హాస్యం మనకు స్పష్టమే! పిల్లలను భరించటం కన్న భూకంపాలను భరించటం నయమని ఉద్దేశం. ఎంతో అప్రియమైన విషయాన్ని సున్నితంగా చెప్పాడా స్నేహితుడు.

‘ఒకామె నల్లని నలుపు. ఎంత నలుపంటే ఆమెకు చెమట పోసినపుడు గుడ్డతో అద్ది గాజు బుడ్డిలో పిండి కావలసినంత సిరా తయారు చేసుకోవచ్చునట’ ఇది అతిశయోక్తి. అభూతకల్పన, విషయం అతిశయోక్తి అయితే హాస్యం పుడుతుంది. నవ్వు వస్తుంది. ఇవి హాస్యానికి కొన్ని ఉదాహరణలు.

2. కలవారి కోడలు కలికి కామాక్షిలోని సారాంశాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి ఒక జానపదగేయం. ఉమ్మడి కుటుంబంలోని కట్టుబాట్లు నమ్మకాలు, ఆచారాలు అలవాట్లు ఈ పాటలో చక్కగా ప్రతిబింబించాయి.
కామాక్షి కలవారి కోడలు అనటంలో ఆమె పుట్టింటి వారు పేదవారై వుంటారని సులభంగానే అర్థమవుతుంది. కామాక్షి అత్తగారువాళ్ళు చాలా సంస్కార వంతులు. లేనింటి పిల్ల అని తక్కువగా చూడలేదు. ఆమె అందాన్ని చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని, ఆస్తులు, అంతస్తులు చూసి కాదు.
కామాక్షికి వాడిన కలికి అనే విశేషణం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తోంది.

పురిటి మంచం చూడటానికి, కామాక్షి పెద్దన్నయ్య ఆమెను పుట్టింటికి తీసుకు వెళ్ళటానికి వస్తాడు. అప్పుడు కామాక్షి పప్పు కడుగుతోంది. గబగబా చేతులు కడుక్కుని అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. నీళ్ళిస్తుంటే ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి అన్న గమనించాడు. ఆ కన్నీళ్ళకెన్నో అర్థాలు.

‘చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండె కరిగింది. పేద యింటిపిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. తన ఉత్తరీయపు కొంగుతో కళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకి తెచ్చాడు. ఇంట్లో అందరూ తలో విధంగా కామాక్షి అన్నను పలకరించారు. వియ్యంకుడు అంటే కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.

కామాక్షి అన్న తను వచ్చిన పని చెప్తాడు. ఆచారాన్ని పాటించటం కోసం అతను రావటం చూసి అందరూ సంతోషించారు.
కామాక్షి వినయంగా అత్తగారిని తన అన్న వచ్చాడు పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. ఆమె మనసులో మురిసిపోతూ మామగారిని అడగమంది అలా అనటంలో ఆమె అనుమతి, అంగీకారం కామాక్షికి ఆనందాన్ని కలిగించాయి.

కామాక్షి మామగారిని అడిగింది. ఆయన బావగారిని అడగమన్నాడు. అంటే మామగారి అనుమతి లభించినట్లే! కామాక్షి బావగారిని అడిగింది. అడుగుతున్నప్పుడు తల్లిలాంటి తోటికోడలు గుర్తు వచ్చి గొంతు గద్గదమైంది. ఆమె, కామాక్షి చేసిన చిన్న చిన్న పొరపాట్లు కప్పి పుచ్చి, రహస్యంగా తనకు బుద్ధులు చెప్పిన తల్లి. ఆమె కామాక్షితో నీ భర్త నడుగమంటుంది. స్నేహితుల మధ్యలో ఉన్న భర్తను సైగ చేసి పిలిచి అడిగింది. అతడు చాలా సరదా మనిషి. నగలు పెట్టుకుని, సుఖంగా పుట్టింటికి వెళ్ళుమంటాడు. కామాక్షి పల్లకిలో వెళుతుంటే ఎల్లుండీ పాటికి నేను మీ పుట్టింట్లో
ఉంటాను ఎందుకు బెంగ అని కూడ అనుంటాడు.
ఈ పాటలో చెప్పిన విషయాలెన్నో వున్నాయి. చెప్పకుండా మన ఊహకు వదిలినవీ ఉన్నాయి. చెప్పినవి క్లుప్తంగా, అందంగా చెప్పటమూ ఉంది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూపిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిస్తున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడిపోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

2. ‘రేఖ’ పాత్ర ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు. దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది. బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు. చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

నార్కేటుపల్లిలో అరటిపళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది. ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసు కొంటుంది. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందని పించింది రేఖకు. దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

3. ‘దహేజ్’ కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
సుల్తానా-రెహమాన్ల వివాహం జరిగింది. రాత్రికి శోభనం. వివాహానికి వచ్చిన బంధువులంతా హడావిడిగా ఉంటారు. కొంతమంది పూర్వకాలం వారు వారి కాలంలో జరిగే పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్వం ఏడు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవని వారి భావన. కాలం మారిపోయింది. ఒక్కరోజులోనే పెళ్ళి శోభనం కాపురానికి పంపించడం సహజమైపోయింది ఈ రోజుల్లో.

కళ్యాణ మండపం పూలతోను రంగురంగుల కాగితాలతోను రంగుల దోమ తెరలతో మండపం ఆకర్షణీయంగా ఉంటుంది. పూల మంచానికి ఒకవైపు ముసుగులో పెళ్ళి కూతురు. మరొక వైపు ఆడపడుచుల మధ్య పెళ్ళి కొడుకు ఉంటారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళి కూతుర్ని చూడమంటారు. అలాగే చేస్తాడు రెహమాన్. మొదటిసారి చూసినందుకు శుభసూచకంగా ఉంగరం తొడుగుతాడు వరుడు. ఆడపడచులు కలకండ ఇచ్చి సగం కొరికి వధువుకి ఇవ్వమంటారు. అలాగే చేస్తాడు వరుడు. పెళ్ళి కూతుర్ని భుజాన వేసుకోమంటారు. కొంత తటపటాయించి ఒక్కసారిగా భుజాన వేసుకుంటాడు వరుడు. అనగా జీవితంలో బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు దానర్థం. గడపకు అరచేతులతో గంధం ముద్రలు వేయిస్తారు. ఇదంతా పెళ్ళిళ్ళ పేరమ్మ చేయిస్తుంది. ఇక దహేజ్ అనగా కాపురానికి కావలసిన సామాగ్రీని చూడమని చెప్తుంది. అందరూ దహేజ్ను చూస్తారు. ఇంతలో వరుని తల్లి పెద్ద పెద్దగా అరుస్తూ భర్తను పిలుస్తుంది. అంతవరకు వధువు తండ్రి సులేమాన్, వరుని తండ్రి ఫకరీన్ భాయికి తన కూతుర్ని అప్పగిస్తూ బాధపడతాడు. సులేమాన్ని ఓదారుస్తూ ఉంటాడు ఫకరీనా ్భయ్ దహేజ్లో ఉన్న సామాన్లు చూసి అందరూ సంతోషిస్తారు. అమ్మాయి తండ్రి బాగానే పెట్టాడనుకుంటారు కాని వరుని తల్లి రుబియాబీ భర్తను ఉద్దేశించి మన పరువు ఏమయిపోవాలి అని అంటుంది. సంబంధం కుదిర్చిన జులేఖాను పిలిచి కలర్ టి.వి లేకుండా ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వస్తుందా? అని ప్రశ్నిస్తుంది. కలర్ టి.వి ముందుగా మాట్లాడుకోలేదు. అయినా వియ్యంకులు వారు వద్దన్నారని అంటాడు సులేమాన్.

కాని రుబియాబీ ఒప్పుకోలేదు. రాత్రి అయినా వెళ్ళి షాపు తెరిపించి టి.వి తెచ్చిస్తాడు సులేమాన్. దానితో శాంత పడుతుంది వరుని తల్లి.
అయినా దహేజ్లో ముఖ్యమైనది మరిచిపోయారంటు కఫన్ గుడ్డలు రెండు. ఒకటి ఎర్రని గుడ్డ రెండవది తెల్లని గుడ్డ తీసుకొచ్చి దహేజ్లో ఉంచుతాడు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఈ కఫన్ గుడ్డ మరచిపోకూడదని అంటాడు.

4. కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించుకుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.

పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.

కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. ఇద్దరిద్దరయి శౌర్య స్ఫూర్తి బోరాడగన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణ కుబేరులు యుద్ధమును కవి వర్ణించిన సందర్భంలోనిది.
భావము : రావణ కుబేరులు ఒకరినొకరు ఎదుర్కొని యుద్ధము చేయునపుడు వింటినారి ధ్వనులు వ్యాపించాయి. రెండు సింహములు పోరాడుతున్నట్లు ఇద్దరికిద్దరే అన్నట్లు శౌర్యముతో పోరాడారని ఇందలి భావం.

2. ఓడగట్టిన దూలంబై లంకెనుండజేసితి.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : పల్లెకు తిరిగిరమ్మని బోయలు కోరినపుడు తిన్నడు వారితో రాలేనని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : ఓడకు ఆధారంగా ఉండే దులంలా ముడివేసాను.
భావము : ఈ శివలింగములో నా ప్రాణమును మరణించేవరకు, ఓడ నడుచుటకు కట్టిన దూలంవలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధపడవద్దు. మీరు గూడెమునకు వెళ్ళండి అని తిన్నడు పలికాడు.

3. ఇత్తెఱుగు సూరి నుతుండగు నీకు నర్హమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రుడు ధర్మరాజుతో పండితులతో కీర్తింపబడే నీవు కుక్క కోసం పంతం పట్టుట సమంజసమా అన్న సందర్భంలోనిది.
అర్థం : : ఈ విధంగా పండితులతో స్తుతింపబడే నీకు ఇలా చేయుట తగునా.
భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేస్తావు. కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు. ఇది మంచిపనా ? ద్రౌపదిని, సోదరులను వదలుకున్నావు. సువ్రతుడవు, కుక్కను మాత్రం వదలనంటున్నావు. పండితులచే స్తుతించబడే ధర్మరాజా నీవు ఇలా పంతం పట్టుట తగునా అని అన్నాడు.

4. ఏ ముద్దు నిద్రించెనో.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : తమ చిన్నారులను కోల్పోయిన మాతృమూర్తుల గర్భశోకాన్ని కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది.
అర్థం : ఏ ముద్దు ముచ్చట్లు నిదురిస్తున్నాయో !
భావము : తమ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో. ఎందరు తల్లులు గర్భశోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా జీవిస్తున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఎన్ని విద్యలు అల్లాడిపోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగిపోయాయి అని భావము.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. ఐక మత్యాన్ని ఏ విధంగా సాధించాలని వేములపల్లి కోరాడు ?
జవాబు:
తెలుగు వారి మధ్య ప్రాంతీయ భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతంతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మన తెలుగు వారిని ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులం కావాలి అన్నాడు. దీనిని తెలుగు ప్రాంతాల మధ్య పరస్పర ప్రేమ, అభిమానం, స్నేహ భావాలతోనే సాధించగలుగుతాము.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
జవాబు:
ధూర్జటి అడవులలో దొరికే అనేక రకాల ఫలాల వివరాలను మనకందించాడు. నేరేడు, నెలయూటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి బరివెంక, చిటిముట్టి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు, బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి ఫలములను తిన్నడు శివునకిస్తానన్నాడు.

4. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సంగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్య్రం వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. బొడ్డుచర్ల తిమ్మన గురించి వివరించండి.
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన రాయలకాలం నాటి కవి. కవీశ్వర్ దిగ్దంతులనిపించుకున్న కృష్ణరాయల వారితో చదరంగం ఆడుతూ ఉండేవాడు. చదరంగం ఆటలో నేర్పరి ఈ కవి. పెద్దనగారి మను చరిత్రను రాయలు అంకితంగా అందుకుంటున్న మహోత్సవానికి కవులందరితో వస్తూ, వారికి కొంచెం దూరంగా నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతూ ఈ కవి వచ్చాడు. రాయలు ఇతని నైపుణ్యానికి చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా రాసి ఇచ్చాడు.

2. మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని తనకు తాను గర్వంగా ప్రకటించుకున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఈమె ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నేతగాను ప్రసిద్ధి కెక్కారు. ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఈమె చురుకుగా పాల్గొన్నారు. సారాను నిషేధించే వరకూ వీరు విశ్రమించలేదు. ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ ను స్థాపించి ఆమె తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ఆ ట్రస్టుకు రాసిచ్చారు.

సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే వివాహం జరిగిన మల్లాది సుబ్బమ్మ అటువంటి వాతావరణం నుంచి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తనను తాను మలచుకోవటం విశేషం తన ఆస్తినంతా సామాజిక సేవకు అంకితం చేశారు.

మల్లాది సుబ్బమ్మగారికెప్పుడైనా మనస్తాపం కలిగితే వీరేశలింగంగారి ఆత్మకథ చదువుతారట. ఒంటరివాడు, అనారోగ్యవంతుడు, కేవలం బడి పంతులు ఒక్కడు అన్ని ఘనకార్యాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడంటే మనం ఇలా ఇన్ని సౌకర్యాలుండి ఇలా వ్యధ చెందటం ఎందుకు ? అని అడుగు ముందుకేస్తారట. వీరేశలింగం సంస్కరణల స్ఫూర్తితో వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

3. బాలమురళి మొదటి సంగీత కచేరీ గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి ఉత్సవాలు జరపటానికి నిశ్చయమయింది. కార్యక్రమానికి పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ చేర్చారు.
ఆ రోజు తొలి ఏకాదశి బాలమురళి తొమ్మిదవ పుట్టినరోజు. ఉదయం 8 నుంచి బాలమురళి ఏ గంట సేపో పాడనిచ్చి, తరవాత భోజనాల వేళ దాకా ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికథా కాలక్షేపం అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటలసేపు పక్కా పాటకచేరీ చేసాడు. ఆలాపనా, కీర్తనా, స్వరకల్పనా సమస్త హంగులతో పాడాడు. వింటున్న పండితులకు మతులు పోయాయి.

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఆనందాశ్రువులు రాల్చి తన గురుత్వాన్ని కొనసాగించారు. తన దగ్గర సంగీతం నేర్చుకున్న పిల్లవాడు తనతో సమానంగా కచేరీ చేస్తే మరొక గురువైతే ఆగ్రహించటానికి ఎన్ని కారణాలైనా ఉండవచ్చు. కాని, పారుపల్లివారి గొప్ప మనసును మెచ్చుకోవాలి. బాలమురళి ఒక వంకపాట కచేరీలు చేస్తూ, శిష్యరికం చేసి కీర్తనలు నేర్చుకున్నాడు. మా గురువు లాంటి గురువు ‘నభూతో నభవిష్యతి’ అంటాడు బాలమురళి.

ఈ విధంగా అణుబాంబు పేల్చినట్టు బాలమురళి మొదటి పాట కచేరీ చేసినపుడు కుర్తాలం స్వాములవారు విన్నారు.

4. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6. తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్ధ్వలోకములు.
1) అతల 2) వితల 3) సుతలు 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు.
ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతలమయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటిపేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు ‘రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

2. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

3. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

4. యస్వీ భుజంగ రాయశర్మ జీవిత విశేషాలను తెలపండి ?
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి.ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోను విద్యనభ్య సించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.
తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతికి సంబంధించి వీరు అనేక వ్యాసాలు, కవితలు, నృత్య నాటికలు రచించారు. వీరు 7-8-1997న కన్ను మూశారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. పుస్తకాల కోసం పబ్లిషర్కు లేఖ.
జవాబు:
స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

XXXXXX,
జూనియర్ ఇంటర్ (బై.పి.సి)
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
రాజమండ్రి.
విక్రమ్ బుక్ లింక్స్,
దుర్గా అగ్రహారం,
విజయవాడ

ఆర్యా!
ఈ క్రింది పుస్తకములను రైల్వే పార్సీల్సు ద్వారా నాకు పంపవలసినదిగా కోరుతున్నాను. రైల్వే రసీదు ( ) గా నాకు
పంప ప్రార్థిస్తున్నాను.
జూనియర్ ఇంటర్ ఫిజికు టెక్స్ట్ – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ టెక్స్ట్ – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ బోటనీ టెక్స్ట్ – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ తెలుగు గైడ్లు – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ ఇంగ్లీషు గైడ్లు – 10 కాపీలు

ఇట్లు,
భవదీయ,
XXXXXX.
తరగతి నాయకుడు

చిరునామా :
విక్రమ్ బుక్ లింక్స్
దుర్గా అగ్రహారం,
విజయవాడ

2. ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ పత్రికా సంపాదకునికి లేఖ.
జవాబు:
స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ‘ఈనాడు’ సంపాదకులకు,
హైదరాబాదు.
ఇటీవల మనదేశములో ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. కొందరు స్వార్థపరులు, సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులుగా పేరు పెట్టుకొని, ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణములకు భద్రత కరువైనది. గాంధీవంటి మహనీయులు పుట్టిన ఈ భారతదేశంలో ఈ విధమైన పరిస్థితి నెలకొనడం మిక్కిలి విచారకరం. ఇకనైనా ఉగ్రవాదులు కళ్ళు తెరచి అహింసా మార్గాన్ని ఎన్నుకొని ప్రజా జీవన స్రవంతిలో కలిసిపోగలరని ఆశించుచున్నాను. ఈ ఉగ్రవాదం మీద మీ పత్రికలో నడుపుతున్న శీర్షికలు, ప్రచురిస్తున్న విషయాలు ఎంతో విలువైనవి. ఉగ్రవాదులకు ఇది కనువిప్పు కావాలని కోరుకొంటున్నాను.

ఇట్లు
విధేయుడు,
XXXXXX.

చిరునామా :
XXXXXXX,
XXXXXX,
XXXXX.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. నగరంబు సొచ్చి
2. కవీంద్రుడు
3. వేడుకెల్ల
4. ముడివోయిన
5. పారవేయబడి
6. కంచుకోదంచిత
7. తూలినయట్లు
8. చరాచరమ్ములు
జవాబు:
1. నగరంబు సొచ్చి – నగరంబు + చొచ్చి – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమ మీద పరుషములకు గ, స, డ, ద, లు బహుళంబుగానగు.

2. కవీంద్రుడు – కవి + ఇంద్రుడు – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

3. వేడుకెల్ల – వేడుక + ఎల్ల – అత్వసంధి.
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

4. ముడివోయిన ముడి + పోయిన – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

5. పారవేయబడి పారవేయన్ + పడి – సరళాదేశసంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

6. కంచుకోదంచిత్ – కంచుక + కుదంచిత్ – గుణసంధి.
సూత్రము : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఆదేశమగును.

7. తూలినయట్లు తూలిన + అట్లు – యడాగమసంధి.
సూత్రము : సంధిలేని చోట స్వరంబున కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

8. చరాచరమ్ములు – చర్ + అచరమ్ములు – సవర్ణదీర్ఘసంధి.
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. హిమాచలము
2. వేటకుక్కలు
3. క్రొత్తనెత్తురు
4. ధర్మహాని
5. విగతాసుడు
6. ధైర్యలత
7. తోబుట్టువుల
8. ముక్కోటి
జవాబు:
1. హిమాచలము : హిమ అను పేరు గల అచలము – సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం.
2. వేటకుక్కలు : వేట కొఱకు కుక్కలు – చతుర్థీ తత్పురుష సమాసం.
3. క్రొత్తనెత్తురు : క్రొత్తదైన, నెత్తురు – విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం.
4. ధర్మహాని : ధర్మమునకు హాని – షష్ఠీ తత్పురుష సమాసం.
5. విగతాసుడు : విగతమైన అసువులు కలవాడు – బహువ్రీహి సమాసం.
6. ధైర్యలత : ధైర్యమనెడి లత – రూపకసమాసం.
7. తోబుట్టువులు : తోడైన పుట్టుక కలవారు – బహవ్రీహి సమాసం.
8. ముక్కోటి : మూడైన కోట్లు – ద్విగు సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. వున్నది
2. ఎనక
3. బోదన
4. బేదం
5. భాషణం
6. దృతం
7. జంభుకం
8. స్మశానం
9. ప్రగాడం
10. వూరు
జవాబు:
1. వున్నది – ఉన్నది
2. ఎనక – వెనక
3. బోదన – బోధన
4. బేదం – భేదం
5. భాషణం – భాషణం
6. దృతం – ద్రుతం
7. జంభుకం – జంబుకం
8. స్మశానం – శ్మశానం
9. ప్రగాడం – ప్రగాఢం
10. వూరు – ఊరు

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Kalidasa is a great Dramatist.
జవాబు:
కాళిదాసు గొప్ప నాటకకర్త.

2. Smoking is injuriours to health.
జవాబు:
పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరము.

3. He is an expert in. T.V. Mechanism.
జవాబు:
అతడు టి.వి లు బాగుచేయడంలో దిట్ట.

4. I met my best friend yesterday.
జవాబు:
నేను నా ప్రాణ స్నేహితుణ్ణి నిన్న కలిసాను.

5. The voluntears decorated the flowers beautifully.
జవాబు:
కార్యకర్తలు చాలా బాగా అలంకరించారు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

విజయనగర సామ్రాజ్యంలోని ప్రజలలో అధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ముఖ్యవృత్తి. రాజులు, వారి ఉద్యోగులు తటాకాలు, కాల్వలు తవ్వించి నీటి సౌకర్యాలు కల్పించారు. బుక్కరాయలు కాలంలో పెనుగొండ దగ్గర శిరువేరు తటాకం, సాళువ నరసింహుని కాలంలో అనంతపురం వద్ద నరసాంబుధి అనే తటాకం ఏర్పడింది. శ్రీకృష్ణ దేవరాయలు పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో నాగలాపుర తటాకం నిర్మించి కొన్ని సంవత్సరాలు పాటు పన్నులు వసూలు చేయకుండా వ్యవసాయోభివృద్ధిని ప్రోత్సహించాడు. జామ, మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, తమలపాకు తోటలు విస్తారంగా ఉండి చవకగా లభించేవి.

ప్రశ్నలు :
1. తటాకాలు కాల్వలు ఎవరు నిర్మించేవారు ?
జవాబు:
విజయనగర రాజులు.

2. పెనుగొండ సమీపంలోని తటాకం పేరేమిటి ?
జవాబు:
శిరువేరు.

3. సాళువ నరసింహరాయల కాలంలో త్రవ్వించిన తటాకమేది ?
జవాబు:
నరసాంబుధి.

4. నాగులాపురం తటాకం ఎవరి సాయంలో త్రవ్వించారు ?
జవాబు:
పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో.

5. ఏ ఏ వస్తువులు చౌకగా లభించేవి ?
జవాబు:
జామ, మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, తమలపాకులు.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. విరోధి అనగా ఎవరు ?
జవాబు:
భీముడు.

2. నిటాలేక్షణుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

3. శ్రీ కాళహస్తి మహాత్మ్యం కావ్యానికి మూలమేది ?
జవాబు:
స్కంధ పురాణం.

4. కాంతం కథలు రాసిందెవరు ?
జవాబు:
మునిమానిక్యం నరసింహారావు.

5. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

6. పౌలస్త్యుడు ఎవరు ?
జవాబు:
రావణాసురుడు.

7. తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
మనుమసిద్ధి.

8. స్వాహా వల్లభుడెవరు ?
జవాబు:
అగ్ని దేవుడు.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద/ వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. ప్రాడిజి అంటే ఏమిటి ?
జవాబు:
చిన్నవయసులో అసాధారణ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించేవారిని ప్రాడిజీలంటారు.

2. దేశికవితకు ఒరవడి దిద్దింది ఎవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాధుడు.

3. కలవారి కోడలు పేరేమిటి ?
జవాబు:
కామాక్షి.

4. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

5. సప్తసముద్రాలను ఆపోసన పట్టినదెవరు ?
జవాబు:
అగస్త్యుడు.

6. ఎవరి కాలాన్ని ఆంధ్ర, కర్ణాట, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగం అని అంటారు ?
జవాబు:
శ్రీ కృష్ణదేవరాయల కాలాన్ని.

7. కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
రాజ్యలక్ష్మి.

8. ‘ఆంధ్రాషెల్లీ’ అని ఎవరిని అంటారు ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి.

Leave a Comment