Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 8 allows students to familiarize themselves with different question patterns.
AP Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions
గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.
I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)
1. నుతజల పూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత .
వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్రతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
సూనృతవ్రత ! = సత్యం మాట్లాడటమే నియమంగా కలిగిన ఓ రాజా !
నుతజల పూరితంబులగు –
నుతజల = మంచినీటి చేత
పూరితంబులు + అగు = నిండినవైన
నూతులు = చేదుడు బావులు
నూఱిటికంటెన్ = వంద కంటే
ఒక బావి = ఒక దిగుడు బావి
మేలు = ఉత్తమమైనది
మఱి = అంతేకాక
బావులు = దిగుడుబావులు
నటి కంటెన్ = వంద కంటే
ఒక్క = ఒక
సత్ + క్రతువు + అది = మంచి యజ్ఞం
మేలు = ఉత్తమమైనది
తత్ + క్రతుశతంబున
కంటెన్ = అటువంటి నూరు యజ్ఞల కంటే
సుతుండు = ఒక్క కొడుకు
మేలు = మేలు
తత్, సుతశతకంబుకంటెన్ = అటువంటి కొడుకులు వందమంది కంటే
చూడఁగన్ = పరిశీలించగా
ఒక = ఒక
సూనృత వాక్యము = సత్యవాక్యం
మేలు = ఉత్తమమైనది
తాత్పర్యం : సత్య వాక్పాలనమే వ్రతంగా కలిగిన ఓ రాజా ! మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరింటికంటే ఒక దిగుడుబావి మేలు. అంతేకాక నూరు దిగుడుబావులకంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి నూరు, యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమందికంటే ఒక సత్యవాక్యం మేలైనది అని తాత్పర్యం.
2. ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁడిదె కపులఁగూడి, యురుగతి రానై
యున్నాడు, నిన్ను గొని పో
నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీతనయా !
జవాబు:
ప్రతిపదార్థము :
ఉర్వీ తనయా = ఓ సీతాదేవీ !
ఉన్నాడు లెస్స = క్షేమంగా ఉన్నాడు
రాఘవుడు = శ్రీ రాముడు
ఇ కుల + కూడి = వానరములతో కలసి
ఉరుగతి = వేగంగా
రానై యున్నాడు = రావటానికి సిద్ధంగా ఉన్నాడు.
నిన్నున్ + కొని = నిన్ను తీసుకొని వెళ్ళటానికి
ఉన్నాడు = రానున్నాడు.
ఇది = ఇలా జరుగుట
నిజము = సత్యము
నమ్ము = విశ్వసించు
తాత్పర్యము : ఓ సీతాదేవీ ! శ్రీరామచంద్రుడు వానరసేనతో కలిసి నిన్ను రక్షించటానికి ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడి నుండి నిన్ను తీసుకొని వెళ్ళడం నిజము. నా మాటలను నమ్ము తల్లీ !
II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. ‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే కావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు రాయబారిగా వెళ్ళిన భట్టు పలికిన శాంతి వచనాలను వర్ణించబడ్డాయి. కలిసి ఉంటే కలిగే మేలు, యుద్ధం వల్ల కలిగే కీడులను కవి హృద్యంగా వర్ణించాడు.
నలగామరాజుకు ప్రశంస: భట్టు గుర్రం మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజును ఇట్లా ప్రశంసించాడు. ఓ రాజా ! నీవు రాజులలో కెల్లా గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజవేశ్యలను రంజింప జేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. ధైర్యంలో మేరు పర్వతాన్ని జయించినవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు, వైభవంలో దేవేంద్రుడవు.
యుద్ధానికి సిద్ధం: రాయబారం కోసం మలిదేవరాజు మీ దగ్గరకు పంపించిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. తన తమ్ములు, బంధువులు, వీరులు అయిన నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణులు మొదలైన రాక్షసులు సంహరించబడిన శ్రీశైల ప్రాంతంలో గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు.
రాజనీతి : ఓ రాజా ! అలరాజుతోపాటే వీరమరణం పొందాలని వీరులైన నాయకులు ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే దుష్టులేకానీ అణచివేసే నిపుణులు ఈ భూమిమీద లేరు, కనుక మీ తమ్ముడైన నరసింహరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒక్కటై ఈ పగను నశింపజేయండి. పల్నాడు మొత్తాన్ని ఎదురులేకుండా కలిసిమెలసి ఏలండి. కనుక మలిదేవునితో సఖ్యత కోసం నరసింగరాజును పంపించు అని భట్టు రాజుకు సూచించాడు.
పోరునష్టం : భూమిమీద ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం మంచిది కాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతోమంది ప్రజలు మరణిస్తారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది. సైన్యానికి కూడా యుద్ధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురు తిరుగుతారు. తమ జీతపు బకాయిల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు, సేవకులు చెప్పిన మాట వినరు.
అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించజూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టడం కష్టమౌతుంది. మీలో మీరే కొట్లాడుకుంటే చూసేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ. రహస్యాలను పసిగడతారు. దుష్టులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచి పోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. కీర్తి, పరాక్రమం కూడా నశిస్తాయి. రాజ్యం సర్వనాశనమౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
పారతంత్ర్యం : యుద్ధం వల్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దుల వాడు ముకుతాడు పొడిచి పొగరు అణఛిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.
బానిస బతుకు : మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మొదటిదైన మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రువుల పాలనలో మాట (వాక్కు) శరీరం (కాయం) – రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఉండదు. ప్రయోజనం లేని జీవనం కన్నా మరణమే మేలు. మంచి పనులు చేయకపోతే క్రిమి కీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్ని సార్లు పుట్టి ఎంతో పుణ్యం వల్ల లేకలేక పొందిన కష్టసాధ్యమైన మానవజన్మ నిందలపాలౌతుంది. కనుక ఓ రాజా ! ఇటువంటి బానిస బతుకు పగవారికి కూడా వద్దు.
పొందులాభం : మల్లెపూలు, తెల్లతామర, చంద్రుడు, తారలు, నురుగు, మంచు, చందనం, రాజహంస మొదలైన వాటి కాంతులను మించే గొప్పకీర్తి సైతం పగ వల్ల వేగంగా నశిస్తుంది. లోకంలో అపకీర్తి పెరిగిపోతుంది. రెండు పక్షాలవారూ ఒక్క టైతే అన్ని కార్యాలు సమకూర్చుకోవచ్చు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. . రెండు పక్షాల వారూ కలసిమెలసి సంపదలు పెంచుతూ ఉంటే సేవకులంతా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారు. బలం పెరగటం వల్ల శత్రురాజ్యాలపై దండెత్తి అమిత ధనరాశులను సాధించవచ్చు. ఆ ధనంతో ధర్మబద్ధ పాలన సాగించవచ్చు. అప్పుడు మీ కీర్తి లోకంలో శాశ్వతమై నిలుస్తుంది.
ముగింపు: ఓ రాజా ! కలహం వల్ల పూర్వం కౌరవులు నాశనమై పడిన కష్టాల గురించి విన్నాం కదా ! కనుక పగ పెరిగేటట్లు చేయటం భావ్యం కాదు. మీ రెండు పక్షాలవారూ అన్నదమ్ములే కనుక పరిష్కార మార్గం చెప్పాను. నామాట వినండి అంటూ మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు సంధికోసం శాంతివచనాలు వినిపించాడు.
2. రాజును కన్యక ప్రతిఘటించిన విధానాన్ని వివరించండి ?
జవాబు:
పరిచయం : ‘కన్యక’ అనే కవితాఖండికలో గురజాడ అప్పారావు ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టటానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు వర్ణించ బడ్డాయి.
రాజు దౌర్జన్యం : సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఆమె ఒకసారి బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి, నుదుటున కుంకుమ పెట్టుకొని పూజ కోసం గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది. చుక్కల్లో చంద్రుని లాగా వెలుగుతున్న ఆమెవంటి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు. ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరు పొందాలని భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించ ‘బోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది. సెట్టి ఎన్ని రకాలుగా వేడుకున్నా రాజు తన అహంకారాన్ని వీడలేదు. పైగా తాను కూడా ఆలయానికి బయలుదేరాడు.
కన్యక ప్రాణత్యాగం : గుడిలో కన్యక దుర్గాదేవిని పూజించింది. తన నగలు అన్నీ దుర్గాదేవికి సమర్పించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలను ఉద్దేశించి రాజులకే రాజులుగా బతకాలని హితబోధ చేసింది. తర్వాత కన్యక రాజు ముందుకు నడిచింది. పట్టపగలు, నడివీధిలో విటులు, దొంగలు అయినా స్త్రీలను పట్టుకోరు కదా ! నువ్వు మాత్రం పట్టణానికి రాజువై ఉండి కూడా ఒక స్త్రీని నడివీధిలో పట్టబోయావు. నువ్వు ఒక రాజువేనా ! అధికార మదంతో నువ్వు చేసిన ఈ దౌర్జన్యాన్ని చూసిన దేవుడు నిన్ను దండించకుండా ఉండడు. ఇదిగో ! మా కులం పెద్దలు వచ్చారు. వివాహానికి సాక్షిగా అగ్ని ఉన్నది. నువ్వు కన్నేసిన కన్యను నేను నీ ఎదురుగానే ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు ? నువ్వు నిజంగా రాజువే అయితే నన్ను పట్టుకో ! అంటూ రాజుతో పలికి కన్యక అగ్నిగుండంలో దూకింది.
రాజుకు అపకీర్తి : కన్యక ప్రాణత్యాగంతో రాజు గర్వం నశించింది. అతని అధికారం మట్టిలో కలిసిపోయింది. కోటమేడలు కూలిపోయి, నక్కలకు నిలయమయ్యాయి. ‘కన్యక ఆత్మాహుతి చేసుకున్న చోట ఒక పెద్ద మేడ వెలసింది. ఈ ఘటనలో రాజుకు మాత్రం శాశ్వతంగా అపకీర్తి మిగిలిపోయింది.
ముగింపు : ఈ విధంగా కన్యక రాజును ప్రతిఘటించింది.
III. వ్యాసరూప సమాధానాలు (గద్యభాగం) :
1. రావూరి భరద్వాజ రచనా వ్యాసాంగాన్ని వివరించండి ?
జవాబు:
‘నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరధ్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తరూపం.
తాడిత, పీడిత జన జీవన సమరాన్ని తన అక్షరాలలో ఆవిష్కరించిన రచయిత డా॥రావూరి భరద్వాజ. చదువులో అంతగా రాణించక పోయినప్పటికి జీవిత పాఠాలు బాగా నేర్చినవాడు. భరద్వాజ పెద్దల సహకారంతో గ్రంథాలయంలోని పుస్తకాలను చదవటం ద్వారా సాహిత్యం వంటబట్టింది. ముందుగా ఆయన పద్యరచనకు సాహసించాడు. అందులో గణ, యతి ప్రాసలు తప్ప కవిత్వం కనపడదు. తరువాత జీషన్ ప్రభాత్ ప్రోత్సాహంతో కొవ్వలి వారి నవలలు, చలంగారి పుస్తకాలు, కొడవటి గంటి కుటుంబరావు, గోపీచంద్ రచనలు చదివాడు. కథలు వ్రాయటం ప్రారంభించాడు. భరద్వాజ రచించిన తొలికథ ‘విమల’ ఆగష్టు- 26, 1946న ‘ప్రజామిత్ర’ వార పత్రికలో అచ్చయింది. జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, యువ పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఆయన రచనలోని మెరుపులకు దారితీసింది.
1947లో ‘సుప్రభాతం’ అన్న పుస్తకాన్ని వీధి వీధి తిరిగి అమ్మారు. ఆయన తొలికథ 1946లో అచ్చవగా తొలిపుస్తకం ‘రాగిణి’ 1950లో అచ్చయింది. భరద్వాజ రెండవ పుస్తకం కూడా 1950లోనే అచ్చయింది. అది “కొత్త చిగుళ్ళు”. దీనిని చలంగారికి అంకితం చేశాడు. వీరి పుస్తకాలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ భాషలలోనికి అనువదించబడ్డాయి. వీరి నవల “పాకుడు రాళ్ళు” జ్ఞానపీఠ అవార్డు అందుకున్నది. 1956లో వీరి ‘రచనకు ‘జ్యోతి’ పాఠకుల నుండి స్వర్ణపతకాన్ని అందుకున్నది. ‘వీరి విజయ విలాసం’ అన్న కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1983లో ‘జీవన సమరం’ పుస్తకం కేంద్రరాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నది. విద్యాగంధం అంతగా లేకపోయినా గ్రంథ పఠనం ద్వారా భరద్వాజ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారంటే అతిశయోక్తి లేదు.
2. పూర్వకాలంలో వేడుకలు వినోదాలను గురించి వివరించండి ?
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. తెలుగు సంస్కృతిలో భాగాలైన వివిధ రకాల ఆటలు, వేడుకలను ఈ వ్యాసం ద్వారా యువతకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.
తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం · గొప్పవేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరము లకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలం నుండి మంచి ప్రాచుర్యం వచ్చింది. ఇక వసంతోత్సవం తరువాత చెప్పదగిన వేడుక శరదుత్సవం. దీనిని మహా లక్ష్మీపండుగలని, దేవీ నవరాత్రులని పిలిచేవారు. మన పండుగలు, వేడుకలు మత సంబంధమైనవే! గ్రామాలలోని దేవుని కళ్యాణం, గ్రామదేవతల జాతరలు దీనికి ఉదాహరణలు. మనకున్న పండుగలలో వసంతోత్సవం శరదుత్సవాలతోపాటుగా మకర సంక్రమణం (సంక్రాంతి) పండుగ కూడా ఒకటి. దీనిని ‘పెద్ద పండుగ’ అని పేరు.
సంక్రాంతి పండుగ దినాలలో జరుపుకొనే వేడుకలలో కోడిపందెములు ఒకటి, కోడి పందాలు వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వపు సంస్థానాధీశులకు కోడిపందాలు ఒక వేడుకగా ఉండేవి. పల్నాటి యుద్ధమునకు కారణం ఈ కోడి పందాలేనని చరిత్ర వలన తెలుస్తుంది. పూర్వ గ్రంథాలైన క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథాల వలన తెలుగు నేలపై వృషభపోరు, మేష యుద్ధము, దున్నపోతుల పోరు, గజయుద్ధము, పొట్టేళ్ళ పోరు మొదలగు ప్రజావినోదపు వేడుకలున్నట్లు తెలుస్తుంది. కుంతలదేశరాజైన సోమేశ్వర భూపతి తాను రచించిన ‘అభిలషితార్థ చింతామణి’ అను మారు పేరుతో ఉన్న ‘మానసోల్లాసం’ అనే విజ్ఞానకోశంలో ఈ వినోదవర్ణలకు ఒక ప్రకరణాన్నే వ్రాశాడు. దానిలో మల్లయుద్ధము, గజయుద్ధము, అశ్వయుద్ధాలు, ఆబోతుల దున్నపోతుల పోరాటములు, పొట్టేళ్ళ, కోళ్ళ పోరాటాలను వర్ణించాడు. పూర్వకాలంలో ‘వేట’ కూడా ఒక క్రీడవేడుక వలె ఉండేది. దీనిలో పాదివేట, విడివేట, తెరవేట, దామెనవేట అని పలు రకములు ఉండేవి. పూర్వకాలమున ఈ వేడుకలు వినోదములు నేడు చాలా వరకు అంతరించిపోయాయి.
IV. వ్యాసరూప సమాధానాలు (ఉపవాచకం) :
1. ‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెల్పండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి ‘దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు.
న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా? చచ్చినట్లా ? అని తన ఆవేదనను సందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు. ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించ మని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.
2. తెరచిన కళ్ళు నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని, తెలుపండి ?
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళులేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు. కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్బారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లోపడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.
తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్ డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.
విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను.
భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు సత్యాన్ని సుదర్శన్.
3. ‘ఆశ ఖరీదు అణా’ నాటిక పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
జ.
మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రదేశం అది. దాదాపు 22 కుటుంబాలున్న ఆ లోగిలిలో అందరికి సమస్యలు. ఎవరి సమస్యలు వారివి. ఉద్యోగ విరమణ చేసిన తాతగారు గంపెడు సంసారంతో బాధపడుతుంటాడు. కొత్తగా అద్దెకు దిగిన యువకుడు నిరుద్యోగి, అవివాహితుడు. ఏవో బొమ్మలు గీస్తూ తన మనోభావాలను వాటి ద్వారా బహిర్గతం చేస్తుంటాడు. ఇందిర, ఆనందలక్ష్మి అక్కాచెల్లెళ్ళు. క్రింది వాటాలో ఉంటారు. జబ్బుతో మంచానపడిన తల్లి, అకారణంగా జైలుకెళ్ళిన తండ్రి, నిరుద్యోగి అయిన అన్నయ్య పైగా అమాయకంతో తల్లిదండ్రుల గూర్చి బాధపడుతుంటాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ తల్లినీ, అన్నయ్యను అభిమానంగా చూసుకుంటుంది. ఆత్మన్యూనతా భావంతో అన్నయ్య ఎప్పుడూ కృష్ణవేణితో గొడవపడుతుంటాడు. తనకు ఒక ఉద్యోగం వస్తే చెల్లెల్ని ఉద్యోగం మానిపించేయాలనుకుంటూ ఉంటాడు.
కృష్ణమూర్తి అనే ఆయన బ్యాంకు ఉద్యోగి. తనవరకు తాను అన్నట్లు చిన్న ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన యువకునితో పరిచయం చేసుకుంటూ మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఉంటే ఏ బ్యాంకు అని ఆరాలు తీస్తాడు. దానికి సమాధానంగా నా ఎకౌంటు నా జేబులోనే ఉంది అయినా ఖాళీగానే ఉందని అంటాడు. బహుశా బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు నచ్చరేమో అని తనలో తాను అనుకుంటాడా యువకుడు. పైన ఉండే ఆడపిల్లలను చులకన చేసి మాట్లాడటం ఆ యువకునికి నచ్చలేదు.
ఇందిరా, ఆనందలక్ష్మిలను గూర్చి ఆలోచిస్తాడు. పరిచయమైన అమ్మాయి పేరు ఏమిటో అని అనుకుంటాడు. ఇంతలో కృష్ణవేణి లక్ష్మీ దగ్గరకు వచ్చి తన అన్నయ్య గురించి తన బాధను చెప్తుంది. ఉద్యోగం కోసం వెళ్ళిన అన్నయ్య ఎప్పటికీ రాకపోయేసరికి ఇందిర, లక్ష్మీలు. కంగారుపడతారు. ఆకలితో యువకునికి నిద్ర పట్టదు. సమస్యలతో తాతగారు పచార్లు చేస్తుంటాడు. తొమ్మిదిమంది సంతానం. వచ్చే పింఛను చాలీచాలదు. పెళ్ళి చేసిన ఇద్దరి కొడుకులకు ఉద్యోగాలు లేవు. పెద్ద కోడలి ప్రస్తవం. ఇన్ని సమస్యలతో నిద్రరాక బయట తిరుగుతుంటాడు. యువకుడు ఒంటరిగా తిండిలేక తిరుగుతుంటాడు. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లలో పడి మాట్లాడుకుంటూ ఉండగా బ్యాంకు ఉద్యోగి తన భార్యకు తుమ్ములు ఆగటం లేదని మందుల దుకాణం తెరిచి ఉంటుందా అని కంగారుగా వస్తాడు.
అన్నయ్య మాటలు పడలేక కృష్ణవేణి ఇందిర, లక్ష్మిల దగ్గరకు వస్తుంది. బ్రతుకంటే విరక్తి చెందిన వ్యక్తి కృష్ణవేణి. ఉద్యోగ వేటలో ఎక్కడో తిరుగుతున్న ఇందిర, లక్ష్మీల అన్నయ్య ఇంకా రాలేదని కంగారుపడతారు. ఎవరూ లేని ఒంటరి జీవితం ఎందుకనుకొని యువకుడు ప్రాణత్యాగం చేయాలనుకుంటూ రోడ్డుమీదకు వస్తాడు. ఇంతలో కారుప్రక్కగా పడిన నీడలా కనిపించిన వ్యక్తిని చూస్తారు లక్ష్మీ, ఇందిరలు. అన్నయ్యా అంటూ అరుస్తారు. తాతగారు దగ్గరగా వెళ్ళి చూసి లేవదీస్తాడు. కారుక్రింద పడి చనిపోదాం అనుకున్నది అంతా చెడిపోయిందని బాధపడతాడు. వెంటనే తాతగారు మీరంతా దగాపడ్డ తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూను చావడానికి లక్ష కారణాలుంటే, బ్రతకటానికి కోటి కారణాలుంటాయి.
నా సమస్యల ముందు మీ సమస్యలే మాత్రం. బ్రతకటంలో ఉండే మాధుర్యం మీకు తెలియదు. ముందు మీరందరూ ధైర్యంతో బ్రతకండి. ఏ కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉంది. అంతమాత్రాన మనల్ని మనమే . అసహ్యించుకోకూడదు. జీవితంలో ఆనందాన్ని పోల్చుకోండి. దేనికి భయపడకండి. మీకందరికి బ్రతకడం నేర్పిస్తానని అంటాడు తాతగారు. ఇంతలో లాంతరు వెలుగులో కాఫీ తలా ఓ గ్లాసు తాగమంటాడు తాతగారు. వారందరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. గ్లాసు కాఫీ అణా. అలాగే వారందరిలో ఆశ ఖరీదు అణాగా పాత జ్ఞాపకాలు, ఆశలు చిగురిస్తాయి. అందరూ తాతగారి గొప్పతనానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
4. తెరచిన కళ్ళు నాటిక ద్వారా రచయిత అందించిన సందేశం వివరించండి ?
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.
విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.
ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్ తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయపడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడ తాడు. ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ‘పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్క. విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.
చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొందమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవి స్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే నాకీ అవస్థ వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.
భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే డాక్టర్కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినందించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు. డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.
V. సందర్భసహిత వ్యాఖ్యలు (పద్యభాగం) :
1. చెప్పంగ నలవియే శివునకునైన.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు పారతంత్ర్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వివరించడం శివుడి తరం కూడా కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! యుద్ధం వల్ల అన్నీ అనర్థాలే. బలం, ధనం నశిస్తాయి. కీర్తి పరాక్రమాలు నాశనమౌతాయి. రాజ్యం శత్రురాజుల అధీనంలోకి వెడుతుంది. శత్రువుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వర్ణించటం శివుడి తరం కూడా కాదు అంటూ కలహం వల్ల కలిగే కష్టాలను గురించి రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు వివరించాడు.
2. సౌమిత్రికి చెప్పవయ్య సాహసివర్యా !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : లక్ష్మణుని నేను అవివేకంతో అనరాని మాటలు అన్నాను. వాటిని మనసులో పెట్టుకోనకుండా నా గౌరవమును కాపాడుమని లక్ష్మణునికి తెలియజేయమని సీత హనుమంతునితో పలికిన పలుకులివి.
భావం : “నేను అన్న మాటలు మనసులో ఉంచుకోవద్దని, నా గౌరవమును కాపాడుమని సుమిత్రాదేవి కొడుకైన శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణునితో చెప్పవయ్యా ! గొప్ప సాహసివయిన ఓ హనుమా !” అని సీత పలికినదని భావము.
3. కోకిలమేధం సాగుతున్నది.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము : అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న కవి ఈ గేయం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భంలోనిది.
భావము : ఆడదానికంటే అడవిలో మానుకే విలువనిస్తున్న సమాజం మనది. కట్నం కోసం కోడలి బ్రతుకును నాశనం చేసిన అత్తమామలు రాక్షసులా? పిశాచాలా? ఆకలి తీర్చుకోవటానికి లేళ్ళను చంపే పులులున్న ఈ దేశంలో, కట్నం కోసం కోకిలల వంటి కోడళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారని ఇందలి భావం.
4. నా ముందు నిలబడ్డాడు కొత్త మానవుడు.
జవాబు:
కవి పరిచయం :. ఈ వాక్యము డా|| అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగుదనం యొక్క నిలకడ కోసం సముద్రమంత కన్నీటితో వున్న ఆధునిక మానవుని స్థితిని కవి చెప్పిన సందర్భంలోనిది.
భావము : తెలుగు నేలపై సంప్రదాయము, ఆధునికత, సంస్కారము అనే మూడింటిని కలగలిపిన కషాయాన్ని జీర్ణించుకోలేక చక్కని తెలుగుదనాన్ని ఆస్వాదించలేక సముద్రమంత కన్నీటితో నా ముందు కొత్త మానవుడు నిలబడ్డాడని ఇందలి భావం.
VI. సంక్షిప్త సమాధానాలు (పద్యభాగం) :
1. శకుంతల బాధపడిన విధమెట్టిది ?
జవాబు:
తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుకు శకుంతల గార్హస్థ్య ధర్మ వైశిష్ట్యాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని వివరించింది. అయినప్పటికి దుష్యంతుడు ఆమెను అంగీకరించలేదు. పైగా ఆమె మాటలన్నీ అసత్యాలని తిరిగి ఆశ్రమానికి వెళ్ళి పొమ్మని చెప్పాడు. దుష్యంతుని కాఠిన్య శకుంతలను ఎంతో బాధించింది.
నేను పుట్టిననాడే తల్లిదండ్రులచేత విడువబడ్డాను. ఇప్పుడు భర్తచేత కూడా విడువబడ తాను కాబోలు. పూర్వం నేను నోచిన నోముల ఫలితం ఇంతే కాబోలు అనుకొంటూదుఃఖిస్తూ, ఆశలు వదలుకొని, కన్నీరు తుడుచుకుంటూ తనకు ఇక దైవమే దిక్కని భావించింది, శకుంతల కొడుకుని వెంటబెట్టుకొని తిరిగి వెళ్ళిపోబోతున్న సమయంలో ఆకాశం నుంచి దివ్యవాణి శకుంతల పతివ్రత అనీ ప్రకటించింది.
2. శ్రీనాథుని గురించి వ్రాయండి ?
జవాబు:
15వ శతాబ్దంలో జీవించిన శ్రీనాథుడు కొండవీడును పరిపాలించిన రెడ్డిరాజుల ఆస్థానకవి, విద్యాధికారి. శ్రీనాథుని తల్లి భీమాంబిక, తండ్రి మారయ. ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు ‘తెలుగు సాహిత్యంలో పురాణయుగానికీ ప్రబంధయుగానికీ వారధిగా నిలచిన మహాకవి.
శ్రీనాథుడు సకల శాస్త్రాలలో పండితుడు. కవితా సృష్టిలో బ్రహ్మవరం పొందినవాడు. నిత్యం పరమేశ్వరుణ్ణి పూజించే పరమభక్తుడు. పిన్న వయసులోనే ‘మరుత్తరాట్చరిత్ర’ అనే కావ్యాన్ని రచించాడు. ఇంకా శ్రీనాథుడు రచించిన శాలివాహన సప్తశతి, శృంగార నైషథం, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీరచరిత్ర కావ్యాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును వాదంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులగొట్టించాడు. అక్కడి ముత్యాల శాలలో కనకాభిషేక గౌరవం పొందాడు. ఎంతో వైభవంగా జీవించిన శ్రీనాథుడు చివరి దశలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆదరించే రాజులు లేకపోవటంతో వేరే దారి లేక వ్యవసాయం చేశాడు. కృష్ణాతీరంలోని బొడ్డుపల్లె.అనే గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయాడు. శిస్తు కూడా చెల్లించలేక అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.
తెలుగుజాతి శౌర్యపరాక్రమాల చరిత్రను అజరామరంగా నిలబెట్టాలనే సంకల్పంతో శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను దేశీయమైన మంజరీ ద్విపద చంధస్సులో రచించాడు. ఈ కావ్యాన్ని మాచర్లలో కొలువై ఉన్న చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు.
3. మనిషి జీవితం గురించి అద్దేపల్లి భావనను తెలియజేయండి ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహన్రావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సాహిత్య సంచార యోధుడిగా ముద్ర వేసుకున్న అద్దేపల్లి సాటి మనిషి జీవితాన్ని గురించి మదనపడ్డాడు. నేటి మానవుడు సంప్రదాయం, ఆధునికత, సంస్కారమనే వాటిని కలగలపుకొని పంచకోల కషాయాన్ని తాగుతున్నాడు. తన అస్తిత్వాన్ని సంప్రదాయాన్ని వదులుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతర్జాతీయ వ్యాపారంలో తన సొంత ముద్రను పోగొట్టుకొని కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నాడు. తనకు అవసరం ఉన్నా లేకపోయినా హోదాకోసం, తన స్థాయిని పెంచుకోవటం కోసం విదేశీ వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. ఇలా వస్తువుల కోసం తన జీవితాన్నే తాకట్టు పెడుతున్నాడు.
అద్దేపల్లి మనిషి జీవితం ఎటు వెళ్తుందోనని ఆవేదన పడుతున్నాడు. భవిష్యత్తులో ప్రకృతిని కంప్యూటర్లోకి తీసుకువచ్చి ప్రపంచం మీదకు దాడికి పంపిస్తాడేమో !కాలు కదపకుండా ప్రపంచమంతా తిరిగివస్తాడు కాని మానవత్వం పరిస్థితి ఏమిటని కవి ప్రశ్నించాడు.
4. కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి ?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.
ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన ‘నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులు పోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయే మోనన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి బావితరాలకుండకూడదని, స్త్రీ జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.
VII. సంక్షిప్త సమాధానాలు (గద్యభాగం) :
1. చదరంగం గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు’ సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వములు అను సంపుటం నుండి గ్రహించబడింది.
చదరంగం భారత జాతీయ క్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించినది. భారతదేశమే ! పూర్వం దీనిని అష్టాపదమని పిలిచేవారు. మనదేశం నుండి ఈ ఆట పర్షియా, అరేబియా, తూర్పు చైనా దేశాలకు వ్యాపించింది. 10వ శతాబ్దం చివరిలో అరబ్బులు ఈ ఆటను స్పెయిన్ దేశానికి తీసుకుపోయారు. 11వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం అయింది. ఈ ఆటను పూర్వం ఉన్నత కులాలవారు మాత్రమే ఆడేవారు. విజయనగర ప్రభువు కృష్ణదేవ రాయలు ఈ ఆటను అమితంగా ప్రేమించారు. ఆయన బొడ్డుచర్ల తిమ్మనతో ప్రతిరోజూ ఆడేవారట. రాయల తరపున ఎందరు ఆడినా ఒక్కడే ఉండి తిమ్మన విజయం సాధించేవాడట. పూర్వం యుద్ధమునకు వెళ్ళే సమయాన ఈ ఆటను ఆడి ఎత్తులకు పై ఎత్తులు వేసేవారని చరిత్ర తెలియజేస్తుంది. ఈనాడు చదరంగం ప్రపంచ క్రీడలలో చేరింది. ఇప్పటికి కూడా ముందుగానే చెప్పి ఆట కట్టించగల క్రీడాకారులు తెలుగుదేశాన ఎందరో ఉన్నారు.
2. అర్థవిపరిణామంలో అర్థసంకోచమును గురించి వ్రాయండి ?
జవాబు:
భాషకు రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం, రెండు అర్థం ఈ రెండింటియందు కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. పదాలలోని అర్థాలలో వచ్చే మార్పులను ‘అర్థవిపరిణామం’ అంటాము. భాషాశాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలుగా సూచించింది. 1. అర్థ సంకోచం, 2. అర్థ వ్యాకోచం, 3. గ్రామ్యత్వం, 4. సౌమ్యత్వం, 5. సంకేతం.
1. అర్థ సంకోచం : పదాలలోని అర్థం సంకోచం చెందటమే అర్థసంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒకపదం కొంతకాలం తరువాత కుంచితార్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే దానిని అర్థసంకోచం అంటారు.
ఉదా :` పూర్వం ‘చీర’ అనే పదం ‘వస్త్రము’ అన్న విస్తృతార్థంలో వాడబడింది. అది – ఇపుడు సంకుచితమై ‘స్త్రీలు’ ధరించే వస్త్రంగా మాత్రమే వ్యవహరింపబడుతుంది. “సీతారాము లిర్వురును నార చీరలు ధరించిరి” ఇక్కడ చీరలన్నది విస్తృతార్థమే కదా!
అలాగే పూర్వము ‘వ్యవసాయమంటే’ పని అనే విస్తృతార్థం. ఇపుడది ‘సేద్యమన్న’ ఒక్క పనికే వాడబడుతున్నది. ‘ఉద్యోగమన్న పదం’ పూర్వం ‘ప్రయత్నం’ అన్న విస్తృతార్థంలో వాడబడినది. అది ఇపుడు ఆంగ్ల భాషా పదమైన ‘Job’ కు తోడై ‘ఉద్యోగ పర్వము’ లోని అర్థాన్ని ఇవ్వటం లేదు. ఇలా పూర్వము విస్తృతార్థంలో ఉండి సంకుతార్థాన్ని పొందిన ఎడల దానిని అర్థసంకోచమంటాము.
3. రావూరి భరద్వాజకు చదువుపట్ల ఆసక్తిని కలిగించిన సంఘటనను తెల్పండి.
జవాబు:
నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్త రూపం.
రావూరి భరద్వాజ 8వ తరగతిలోనే చదువు మానేశారు. దానికి ఒక కారణం స్కూలు హెడ్మాస్టారైతే రెండవ కారణం ఆ కుటుంబాన్ని ముసిరిన దరిద్రం. స్కూలు ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చిన రోజు చిరిగిన దుస్తులు ధరించినందుకు మాష్టారు చితక బాదాడు. దానితో చదువుకు . స్వస్తి చెప్పాడు. తరువాత రావూరికి జరిగిన అవమానం ఆయనలో చదువు పట్ల ఆసక్తిని కలిగించింది. ఆయనకన్నా చిన్నవాడు ఒకడు మనుచరిత్ర పద్యాన్ని అప్పగించాడు. అందరూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు. భరద్వాజ నాన్నగారి స్నేహితుడు శేషయ్య ఆ కుర్రాడితో పోలుస్తూ ఆయనను తిట్టాడు. నాటినుండి పగలంతా కూలి పని చేసుకొని రాత్రిపూట శివాలయంలోని ప్రమిద దగ్గర చదువు కొనేవాడు. ఈయనకు గ్రంథాలయంలో పుస్తకాలు చదవటానికి సహాయ పడిన వారు కొల్లూరి వెంకటేశ్వరరావు గారు.
4. గరిమెళ్ళ సత్యనారాయణ ప్రజలలో ఎలా స్వాతంత్య్ర చైతన్యాన్ని కలిగించారు ?
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం’ అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
గురజాడ నుండి 1947 వరకు జాతీయోద్యమ సాహిత్యమే తెలుగు సాహిత్య ప్రధాన చరిత్ర. 1947 తరువాత కూడా జాతీయోద్యమ దశలను తీసుకొని తెలుగు సాహిత్యం వచ్చింది అలా వ్రాసిన వారిలో గరిమెళ్ళ సత్యనారాయణ ఒకరు. ఆయన “మా కొద్దీ తెల్లదొరతనం” అన్న గేయం ప్రజల హృదయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రౌలట్ చట్టం మీద, ఖిలాపత్ ఉద్యమం మీద, రాశుల కొద్దీ కవిత్వాన్ని కవులు ఆవేశంగా వ్రాశారు. రాట్నం మీద, విదేశీ వస్తు బహిష్కరణమీద, మద్యపాన నిషేధం మీద ఎందరో కవులు తమ కలాలను ఝళిపించారు. జైళ్ళ మీద భయాన్ని పోగొట్టారు.
“దయ్యమునకు నిముడు
అలడయ్యరను నధముడు
ఆంగ్లసీమ కెల్ల వాడయ్యెను
ప్రియతముడు ……………..
జనరల్ డయ్యరు జలియన్ వాలాబాగ్ కిరాతకుడు. అతడు దయ్యంతో సమానుడు. ఆంగ్లేయులకు వాడు ఎంతో ప్రియతముడని గరిమెళ్ళ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించాడు.
VIII. ఏకవాక్య సమాధానాలు (పద్యభాగం) :
1. నన్నయ రచించిన వ్యాకరణగ్రంథం పేరేమిటి ?
జవాబు:
ఆంధ్ర శబ్ద చింతామణి.
2. రాయబారానికి వచ్చి వధించబడినది ఎవరు ?
జవాబు:
అలరాజు.
3. మొల్ల రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చింది ?
జవాబు:
శ్రీరామచంద్రునికి.
4. కలేకూరి ప్రసాద్ కలంపేర్లేమిటి ?
జవాబు:
యువక, శబరి, సంఘమిత్ర, నవత.
5. ప్రపంచీకరణపై అక్షర ఆయుధాన్ని సంధించిందెవరు ?
జవాబు:
అద్దేపల్లి రామమోహనరావు
6. పట్టమేలేరాజు గర్వం ఏమైంది ?
జవాబు:
మట్టిలో కలిసిపోయింది.
IX. ఏకవాక్య సమాధానాలు (గద్యభాగం) :
1. కోడిపందాల పోరువలన జరిగిన యుద్ధమేది ?
జవాబు:
పల్నాటి యుద్ధం.
2. నేడు వ్యవసాయమంటే ఏమిటి ?
జవాబు:
సేద్యము.
3. విద్వదౌషధంగా పేరుపొందిన శ్రీనాథుని గ్రంథమేది ?
జవాబు:
శృంగార నైషధం.
4. ప్రాచీన నాటకాలలో హాస్యపాత్ర ఏది ?
జవాబు:
విదూషకుడు.
5. పాకుడు రాళ్ళు రచయిత ఎవరు ?
జవాబు:
రావూరి భరద్వాజ.
6. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించిందెవరు ?
జవాబు:
ఎ.ఓ. హ్యూమ్.
X. ఏకవాక్య సమాధానాలు (వ్యాకరణం) :
1. అవ్యయం అంటే ఏమిటి ?
జవాబు:
లింగ, వచన, విభక్తులు లేని పదాలు.
2. తిరుపతి గొప్ప యాత్రాస్థలం – విశేషణాన్ని గుర్తించండి.?
జవాబు:
ఇందులో విశేషణం “గొప్ప”.
3. దేవదత్తుడు వంట చేశాడు – దీనిలో క్రియ ఏది ?
జవాబు:
ఇందులో క్రియ చేశాడు.
4. నామవాచకం అంటే ఏమిటి ?
జవాబు:
పేర్లను తెలియజేసే పదాలు.
5. మీరు మంచి విద్యార్థులు దీనిలో సర్వనామమేది ?
జవాబు:
దీనిలో సర్వనామం “మీరు”.
6. క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని సూచించే పదాన్ని క్రియ అంటారు.
XI. ఏకవాక్య సమాధానాలు (వాక్య విజ్ఞానం)
1. వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు ?
జవాబు:
వాక్యాలు 3 రకాలు. 1. సామాన్య వాక్యం, 2. సంక్లిష్ట వాక్యం, 3. సంయుక్త వాక్యం.
2. సామాన్య వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే సమాపక క్రియ కలిగియున్న వాక్యం.
3. అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు. ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.
4. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ వ్రాయండి ?
జవాబు:
అతడు పెద్ద ఉద్యోగి.
5. రెండు సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం.
జవాబు:
సంయుక్త వాక్యం.
6. వాక్యానికి ఉండే లక్షణాలు.
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి.
XII. పద్య లక్షణములు :
1. మత్తేభము
జవాబు:
మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా అంటారు. మత్తేభం అంటే మదించిన ఏనుగు అని అర్థం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1-14 అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
యతి మైత్రి : 1వ అక్షరమైన ‘క’ లోని అ కు 14వ అక్షరమైన ‘క్ష’ లోని క కు యతి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘డ’ కారం ప్రాసగా ఉంది.
2. ద్విపద
జ. ద్విపద ఛందస్సు దేశి కవిత్వానికి చెందినది. ‘ద్వి-పద’, అంటే రెండు.. పాదాలు అని అర్థం. అంటే. దీనిలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. ప్రతి పాదంలో మూడు ఇంద్ర గణాలు, తరువాత ఒక సూర్యగణం ఉంటాయి. 1-3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీద్విపద అని అంటారు. శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను ‘మంజరీ ద్విపద’లో రాశాడు.
యతి మైత్రి : మొదటి పాదంలో ‘తు-దు’ లకు పాటించబడింది.
రెండో పాదంలో ‘వ ‘- వా’ లకు పాటించబడింది.
3. ముత్యాల సరాలు
జవాబు:
గురజాడ అప్పారావు 1910లో ముత్యాలసరాలు అనే ఖండికను ‘ముత్యాల సరాలు’ అనే ఛందస్సులో రాశాడు. ఒక ఫారసీ గజల్ విని స్ఫూర్తిపొంది ముత్యాలసరాలు ఛందస్సును కూర్చినట్టు గురజాడ చెప్పుకున్నారు. వృషభగతి రగడ, భామినీ షట్పది వంటి ఛందస్సులలోనూ ముత్యాలసరాలకు మూలాలు కన్పిస్తున్నాయి. ముత్యాల సరాలు మాత్రా ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ.
లక్షణాలు :
1. ఇది మాత్రా గణాలతో ఏర్పడుతుంది.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలోనూ 3 + 4; 3. + 4 క్రమంలో మొత్తం 14 మాత్రలుంటాయి.
4. 4వ పాదంలో మాత్రం 7 నుంచి 14 మాత్రలు దాకా ఉండవచ్చు.
5. నాల్గవ పాదంతో భావం పూర్తి కావాలి.
6. నాలుగు పాదాలలో భావం పూర్తికానపుడు ఒకొక్కసారి ఐదవ పాదం దాకా పెరుగుతుంది.
దీనిని ‘తోక ‘ముత్యాల సరము’ అని వ్యవహరిస్తారు. ‘కన్యక’ ఖండికలోనూ ఈ తోక ముత్యాలసరాలు కొన్ని ఉన్నాయి. గమనించవచ్చు.
ఉదాహరణ :
ముత్యాల సరం
ఉదాహరణ : తోక ముత్యాల సరం
XIII. ఒక్క వాక్య సమాధానాలు (ఛందస్సు) :
1. ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపే శాస్త్రం.
2. కంద పద్యాలలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ?
జవాబు:
‘జ’గణముండకూడదు.
XIII. ఒక్క వాక్య సమాధానాలు (ఛందస్సు) :
1. ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపే శాస్త్రం.
2. కంద పద్యాలలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ?
జవాబు:
‘జ’గణముండకూడదు.
3. ప్రాస అంటే ఏమిటి ?
జ.
పద్యపాదంలోని రెండవ అక్షరము.
4. శార్దూలంలో గణాలు ఏవి ?
జవాబు:
మ, స, జ, స, త, త, గ.
5. చంపకమాలలో యతి అక్షరం ఎన్నవది ?
జవాబు:
11వ అక్షరము.
6. ఉపజాతులలో ఏ నియమం ఉండదు ?
జవాబు:
ప్రాసనియమం.
XIV. అలంకారాలు :
1. ఛేకానుప్రాస
జవాబు:
రెండు హల్లులు లేదా హల్లుల జంట వెంట వెంటనే వస్తూ అర్థభేదం కలిగి ఉంటే దాన్ని ఛేకానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
‘కందర్ప దర్ప హర సుందర దరహాస రుచులు’
ఇందులో ‘దర్ప’ అనే హల్లుల జంట, ‘దర’ అనే హల్లుల జంట అవ్యవధానంగా, అంటే వెంట వెంటనే వచ్చాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాస.
ఉదాహరణ :
1. సర్వదా విచారింపని పని చేయరాదు.
2. నందనందన నీకు వంద వందనాలు.
2. ఉత్ప్రేక్ష
జవాబు:
ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లైతే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ :
1. `ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను. ఇక్కడ చీకటి నలుపు. దృష్టి నిరోధకం. పొగ నలుపు. దృష్టి నిరోధకం. కాబట్టి ఈ ‘సమాన ధర్మాలవల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకొన్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
2. ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది.
3. ఆమె ముఖము పద్మమేమో అను వాటిల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
3. అర్థాంతరన్యాసం
జవాబు:
సామాన్యాన్ని విశేషంతో గాని, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పినట్లయితే అదీ అర్థాంతరన్యాసాలంకారం.
ఉదాహరణకు
‘హనుమంతుడు. సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదు’ ఈ వాక్యాన్ని పరిశీలించండి.
హనుమంతుడు సహజంగా వానరం. అతడు సముద్రాన్ని లంఘించడం ఆశ్చర్యం గొలిపే విషయం. కాబట్టి ఇది విశేషం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు. – ఈ వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇది సామాన్యం.
పైన తెలిపిన విశేషాన్ని సామాన్య వాక్యం చేత సమర్థిస్తే అది అర్థాంతర న్యాసాలంకారం. మరో ఉదాహరణ చూద్దాం.
ఈ పాఠ్య పుస్తకంలోని నన్నయ పాఠ్యభాగంలో క్రింది పద్యాన్ని గమనించండి.
ఏల యెఱుకలేని యితరుల యట్ల నీ
వెఱుగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేనకాని దీని నెఱుఁగరిన్ దొరులని
తప్పఁ బలుకనగునె ధార్మికులకు
శకుంతల దుష్యంతునితో అంటున్నదీ – ‘అన్నీ బాగా తెలిసి కూడా నేనెవరో తెలియదని ఇతరుల వలె ఎందుకు మాట్లాడుతావు ? ఇతరులకు తెలియదనే మిషతో ధర్మాత్ములైనవారు అసత్యం పలుకవచ్చునా ?’ ఇక్కడ గొప్పవాడైన దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియదని అబద్ధమాడడం విశేషం. ధర్మాత్ములు అబద్ధాలు ఆడకూడదు అనేది సాధారణ లోక ధర్మం. ఇది సామాన్యం.
XV. ఏకవాక్య సమాధానములు (అలంకారములు) :
1. చుక్కలు తలపూవులుగా – ఈ పద్యంలోని అలంకారమేది ?
జవాబు:
అతిశయోక్తి అలంకారం.
2. ఉపమేయం అంటే ఏమిటి ?
జవాబు:
వర్ణించబడే వస్తువు.
3. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ – ఇందులో అలంకారమేది ?
జవాబు:
లాటానుప్రాస.
4. శబ్దాలంకారమంటే ఏమిటి ?
జవాబు:
శబ్ద ప్రాథాన్యం గల అలంకారం.
5. విష్ణురోచిష్ణుజిష్ణుసహిష్ణు కృష్ణులో అలంకారం ఏది ?
జవాబు:
వృత్యాను ప్రాసాలంకారము.
6. సంసార సాగరం – అలంకారమేది ?
జవాబు:
రూపకాలంకారము.
XVI. సంక్షిప్తీకరణ :
ఆదిమ కాలం నుంచి తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ ఆదిమ సంస్కృతిని పాటించేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరలు, జాతాపులు, చెంచులు, తొదలు, భగతలు మొదలైన వారు మన దేశంలో నివసిస్తున్న కొన్ని గిరిజన సమూహాలు. గిరులపై జీవిస్తున్నందు వల్ల వీరిని గిరిజనులు అని పిలుస్తారు. వీరిని హిందీలో ‘ఆదివాసి’ లేదా ‘జన్ జాతి’ అనీ, ఆంగ్లంలో ‘ట్రైబ్’ అని పిలుస్తారు. సాధారణంగా వీరు నాగరికులకు దూరంగా నివసిస్తుంటారు. లిపిలేని భాషను మాట్లాడుతారు. వీరు పోడు వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తుల్ని సేకరించి జీవనాన్ని సాగిస్తారు. ఆదివాసీల జీవితంలో మరొక ప్రధాన వృత్తి వేట. గిరిజనుల జీవన విధానంలో నమ్మకాలు, జంతుబలులు ప్రధానపాత్ర వహిస్తాయి. ఆటలు, పాటలు, సామూహిక నృత్యాలు వీరి జీవితంలో ఒక భాగం.
జవాబు:
కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ తమ సంస్కృతిని రక్షించుకునేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరలు మొదలగు గిరిజన సమూహాలనారు మనదేశంలో ఉన్నారు. కొండలపై నివసించటం చేత గిరిజనులన్నారు. వీరిని హిందీలో ఆదివాసి, ఆంగ్లంలో ‘ట్రైబ్స్’ అని పిలుస్తారు. నాగరికులకు దూరంగా ఉండి లిపి లేని భాషను మాట్లాడతారు. వీరి ప్రధాన `వృత్తి వేట. పోడు వ్యవసాయం చేస్తుంటారు. వీరి జీవనంలో జంతుబలులు ప్రధానపాత్రను పొషిస్తాయి. ఆటలు ‘పాటలు’ సామూహిక నృత్యాలు వీరికి తెలుసు.