AP Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 3 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 3 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. జనులు నుతింపగా ……………… నుతుండగు నీకు నర్హమీ !
జవాబు:
జనులు నుతింపఁగా సుకృత సంపదఁజేసి యమర్త్య భావముం
గనియును జెందకిట్లునికి కార్యమె ద్రౌపది భీమసేను న
ర్జునుఁ గవలం ద్యజించుటకు సువ్రత చాలితి చాల వయ్యె దీ
శునకము విడ్వ నిత్తెఱఁగు సూరి నుతుం డగు నీకు నర్హమే.
భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభారాన్ని పొందనున్నావు. అటువంటిది ఇలా కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు ఇది ఏమంత మంచి పని. ద్రౌపదిని, భీమార్జునులను, నకుల, సహదేవులను కూడా వదులుకున్న సువ్రతుడవే ! కానీ కుక్కను మాత్రం వదలనంటున్నావు. బుద్ధిమంతులచే స్తుతించబడే నీకు పంతగించటం తగునా అన్నాడు.

2. కడు గోపించు ……………… వాడడ చెనంభోబాణ వేగంబునన్.
జవాబు:
కడుఁ గోపించి దశాననుం డతని వక్షః పీఠమున్ జొచ్చి పో
యెడునట్లుగ్ర శరంబు వేయుటయు యక్షేశుండు ధీరత్వ మే
ర్పడఁ గోదండ గుణారవంబఖిల దిగ్భాగంబులన్ నిండ న
ప్పుడు వహ్న్యస్త్రము వైవ వా ఁ డడఁచెనంభోబాణ వేగంబునన్.
భావం : రావణాసురుడు మిక్కిలి కోపముతో కుబేరుని వక్షస్థలము చీలి పోవునట్లుగ వాడియైన బాణములు వేయగా కుబేరుడు ధీరత్వముతో వింటినారి ధ్వని అన్ని దిక్కులా ప్రతిధ్వనింపచేయుచూ ఆగ్నేయాస్త్రము వేసెను. దానిని రావణుడు వారుణాస్త్రముతో వెంటనే అణచివేసెను.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. కుబేరుడు రావణునికి చేసిన హితబోధను వివరించండి.
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసం
నుండి గ్రహించబడింది. బ్రహ్మ వలన వరాలను పొందిన రావణుడు బల గర్వముతో జైత్రయాత్రలు చేశాడు. అన్ని లోకముల వారిని బాధలకు గురిచేస్తుండగా వాని దురాగతాలను చూసి రావణుని అన్న అయిన కుబేరుడు దూతను పంపి నీతిని బోధింపమన్నాడు. రావణుడు ఆ దూతను చంపి అలకాపురిపై అంటే కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు. అపుడు కుబెరుడు రావణునకు హితమును బోధించాడు.

నాకు తమ్ముడవుకదా అని దూతను పంపి మంచిమాటలు చెప్పించాను. నామాటలు లెక్కచేయక నా దూతను చంపావు. నన్ను జయించుటకు రాక్షసమూకలతో వచ్చావు. నీకు బుద్ధులు చెప్పాలని తలచిన నన్ను నేను నిందించుకోవాలి. రోగము వచ్చిన వానికి ఆహార పదార్థములు రోగమును పెంచినట్లు, కోపముతో ఉన్న నీవంటి వానికి మంచిమాటలు కోపమును మరింత పెంచాయి. ఈ మాటలు మృత్యువు నీ సమీపమునకు వచ్చినపుడుగాని గుర్తుకు రావులే అన్నాడు. అన్నకు తండ్రికి గురువుకు హాని ఎవరు చేస్తారో, అటువంటి వానిని చూసిన వానికి మహా పాపము చుట్టుకుంటుంది. తనువు అస్థిరము. మృత్యువు ఎపుడూ మనకు దగ్గరగానే తిరుగుతుంటుంది. సంపదలు పుణ్యము చేయుట వలన మనకు దక్కుతాయి. ఈ విషయాలను గ్రహించి మసలుకొనేవాడు కృతార్థుడవుతాడు. మానవులు చంచల మనస్సుతో చేసిన వానిని దేవతలు మెచ్చుకుంటారు. అపుడు ఆ మానవునకు సంపద, ఆరోగ్యము లభించి సుఖాలను అనుభవిస్తాడు.

ధనము, మణులు వస్తు వాహనములు, స్త్రీలు, ప్రజలు బలమని ధర్మమును ఆచరించకుండిన, దేవతలందరూ నా శత్రువులని తలచిన నిన్ను చూడటం వలన నాకు నరకము వస్తుంది. అని కుబేరుడు రావణునకు హితబోధ చేశాడు.

2. శ్మశానవాటి పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
శ్మశానవాటి జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు స్వాగతించే మహాప్రస్థానం.
అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ? ఎంతకాలము నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భశోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయాయి. ఇది నిజం.

ఆకాశంలో నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు, దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేటట్లు ఘోషిస్తున్నాయి. గాలి వీచడం లేదు. ఆకులు కూడా కదలడం లేదు. సుఖం ఇక్కడ ఆనందిస్తూ ఆటలాడుకుంటుంది కదా.

ఈ శ్మశానవాటిలోనే గొప్ప కవి యొక్క మధురమైన రచనలు నిప్పులతో కలిసిపోయాయి. ఇక్కడే దేశాలను పాలించే రాజశ్రేష్ఠుల రాజచిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు మాంగల్య సౌభాగ్యం నీటిలో కలిసిపోయింది. ఇక్కడే ప్రసిద్ధికెక్కిన చిత్రకారుని కుంచె నశించిపోయింది. ఈ శ్మశానం దెయ్యాలతో శివుడు గజ్జెకట్టి నర్తించి ఆడే రంగస్థలం. ఈ శ్మశానం యమదూతల కఠిన చూపులతో సమస్త భూమండలాన్ని పరిపాలించే భస్మ సింహాసనం.

చిక్కని చీకటిలో, కొత్తగా కట్టిన ఒక సమాధి గూటిలో ప్రమిదలో ఆముదం అయిపోయినా, ఆరిపోక మిణుగురు పురుగులాగా వొత్తి కాలుతూనే ఉంది. దానిని దీపం అందామా ? చనిపోయిన కుమారుని శ్మశానంలో పెట్టి ఏడుస్తూ పోయిన ఒక దురదృష్టవంతురాలైన తల్లి హృదయమందామా ?

ఈ శ్మశానంలో ఎందరో కవులు, గాయకులు ధూళిగా మారి నడిచేవారి కాళ్ళతో తొక్కబడుతున్నాయి. ఒకానొకనాడు ప్రసిద్ధికెక్కిన కాళిదాసు, భారవుల వంటి మహాకవుల శరీరాలు ప్రకృతి అనే ఈ రంగస్థలంలో చిన్న ధూళికణాలుగా మారి ఏ కుమ్మరివాని చక్రంపైనున్న మట్టిలో కలిసాయో కదా !

ఈ పిల్లల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడిపోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి. ఇక్కడ అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో ప్రాణాలు తీసి మట్టిలో కలిసిపోయేటట్లు చేసి, మదించిన ‘క్రూరమైన పులిని, బలహీనమైన సాత్వికమైన మేకను పక్కపక్కనే చేర్చి, జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుడు వంటి భేదభావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం, ఏ ఆకలి బాధతో దుఃఖించి, నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిదో కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు. ఈ విధంగా మానవుడి అంతిమ గమ్యస్థానం గురించి జాషువా తాత్వికంగా వర్ణించాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. బాలమురళీకృష్ణ సంగీతానికి చేసిన సేవ ఏమిటి ?
జవాబు:
బాలమురళి ఏడవ యేటనే తండ్రి దగ్గర కొన్ని గీతాలు, వర్ణాలు, కీర్తనలూ నేర్చుకున్నారు. తరవాత పారుపల్లి రామకృష్ణయ్యగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. తన తొమ్మిదవ యేట మొదటి పాట కచేరీ చేసిన ఆయన జీవిత పర్యంతమూ ఎన్నో వేల కచేరీలు చేశారు.

సాధారణంగా గానం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు కొంత అభివృద్ధిలోకి వచ్చాక ఇంక పైకి పోవటం అసాధ్యమనుకుని విశ్రాంతిలో పడతారు. మూలధనం మీద వడ్డీతో బతికే వాళ్ళలాగ, తము సాధించుకున్న శక్తి యుక్తులతోనే జీవిత శేషమంతా తమ వృత్తిని కొనసాగిస్తారు.

బాలమురళిలో ఆ విశ్రాంతి ధోరణి కన్పించదు. అతను రోజురోజుకు, నెలనెలకు పెరుగుతున్నట్లే అన్పిస్తుంది. వామన మూర్తిలా పెరిగిపోయాడు. ఈ పెరగటం డబ్బుకోసమైతే కాదు. ‘ఈ పాట కచేరీలు కాక జరుగుబాటు కావటానికి ఇంకా ఏ మార్గం వున్నా బాగుండును. సంగీతాన్ని అమ్ముకోవటం బాధగా ఉంది’. అన్నారట ఒకసారి.

గాయకుడిగా బాలమురళికి అద్భుతమైన శరీరం ఉంది. అతని సంగీతం అగాధం రాగము, స్వరమూ, లయ అతనికి బానిసల్లా ఉంటాయి. వాటిపైన ఆయన చూపే అధికారం అనన్యమనిపిస్తుంది.
బాలమురళి 72 మేళకర్తల మీద కీర్తనలు రాశాడు. ఇంకా అనేక కీర్తనలు, పదాలు, గీతాలు, వర్ణాలు, తిల్లానాలు రాశాడు. అనేక రాగాల మీద ఇతని రచనలు, అవే రాగాల మీద పూర్వం ఉన్న రచనలకన్న మంచి కాంపోజిషనులని, మోహన, చారుకేశి, షణ్ముఖప్రియ రాగాలతో వున్న ఇతని గేయాలు సర్వోత్తమమైనవని అనిపిస్తాయి.

బాలమురళి తిల్లానాలు విన్నాక, మిగిలిన వాళ్ళ తిల్లానాలు విని ఆనందించటం దాదాపు అసంభవం.
బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం ఉంది. బాలమురళి గాయకుడూ, వాగ్గేయకారుడే కాదు, నటుడు కూడ: అతడు స్టేజిమీద త్యాగయ్య వేషమూ, ‘ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి వేషం వేశారు. అతని సంగీతంలో నటన, అభినయం ఉంది. సంగీతం అంటే అచ్చంగా పాడటమే కాదు, మాటల ద్వారా భావాలను ప్రేరేపించాలి. అది ముఖంతో అభినయించటం కాదు. గొంతుతో అభినయించాలి. ఈ విద్యలో బాలమురళికి మిగిలిన వాళ్ళు ఎన్నోమైళ్ళ దూరంలో ఉన్నారు.

కీర్తన పాడటంలోనే కాదు ఆలాపనలో కూడ అభినయం చూపగలడు బాలమురళి అతని స్వర కల్పనలో చిత్రలేఖన సూత్రాలు – చిన్న చిన్న ముగ్గులు కాదు, క్లిష్టమైన కాంపోజిషన్లు కనిపిస్తాయి.
మన పెద్ద గాయకులందరూ బాలమురళి వద్ద గానాభినయం నేర్చుకోవలసి ఉంది.

బాలమురళికి తమిళసోదరులు ఎన్నో సన్మానాలు చేశారు. సంగీతానికి మంగళంపల్లి బాలమురళి చేసిన సేవ అనన్య సామాన్యమైనది. అనితర సాధ్యమైనది. ఆయనను ఎన్నెన్నో పురస్కారాలు వరించాయి. గౌరవ డాక్టరేట్లు, డి.లిట్. పట్టాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, యునెస్కో అవార్డు – ఇలా ఇన్ని బిరుదులు, పదవులు, పురస్కారాలు ఆయనను అలంకారించాయి అనటం కంటే ఆ గౌరవాలకే ఆయన అలంకారమయ్యారు. అనటం సముచితం.
ఈ స్వర సామ్రాట్ తనకు ఎన్ని పురస్కారాలు వచ్చినా వాటికంటే ఒకమెట్టు పైనే ఉండేవారు.

‘అపరత్యాగయ్య’ ‘అభినవ అన్నమయ్య’గా ప్రస్తుతించబడిన బాలమురళి తెలుగు వాడు కావటం మనకు గర్వకారణం ఆయన జీవితం సంగీత జీవులందరికీ ఆదర్శప్రాయం.

2. స్త్రీ జనోధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెల్పండి.
జవాబు:
కందుకూరి వారి సంఘ సంస్కరణ కార్యకలాపాలన్నీ స్త్రీల సమస్యలతో ముడిపడి వున్నవే. తన వనరులను శక్తి యుక్తులను అంటే మానసిక భౌతిక శక్తులను, ద్రవ్యాన్ని చివరకు ప్రాణాన్ని సైతం స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని వారు సత్యవాది పత్రికలో ప్రకటించారు. బాల వితంతువుల దీన స్థితి, అవిద్య, మూఢ విశ్వాసాల నిర్మూలన, స్త్రీలు సభలలోకి రాకూడదు వంటి సాంఘిక నియమాలు లాంటి సమస్యలను పరిష్కరించటానికి ఆయన పూనుకున్నారు.

కందుకూరి సంస్కరణల్లో శాశ్వత చరిత్ర గలది స్త్రీ జనోద్ధరణ. అందుకే వారిని మహిళోద్యమ జనకులు, మహిళాభ్యుదయ పితామహుడు అని అభినందించటం అతిశయోక్తి కాదు. వారు కన్యాశుల్కాన్ని వ్యతిరేకించారు. ఆనాడు అతినిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను బలపరచారు. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలోను బాలికా. పాఠశాలలను స్థాపించారు. ముందుగా తన భార్యకు విద్య నేర్పి ఆమెనొక ఉపాధ్యాయినిగా తయారు చేశాడు. ఆచరించి ప్రబోధం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

శాస్త్రాల ఆధారంతో బాల్య వివాహాలను నిరసించాడు. బాల్య వివాహ నిషేధ శాసనం కావాలని ఆందోళన జరిపించాడు. కందుకూరి వితంతువులకు వివాహాలు చేయటానికి అయిదుగురు అనుచరులతో 1879లో రాజమండ్రిలో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు ఆశ్రమాలు నెలకొల్పాడు. పునర్వివాహితులకు పురుళ్ళు పోశాడు.

వీరు, 11-12-1880 సం॥లో రాజమండ్రిలో అర్ధరాత్రి వధువును రహస్యంగా తెచ్చి ప్రథమ వితంతు వివాహాన్ని జరిపించారు. సనాతనులు కందుకూరిని బహిష్కరించారు. పీఠాధిపతులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో, మద్రాసులో వితంతు వివాహ వ్యతిరేక సంఘాలు వెలిశాయి. అయినా మొక్కవోని ధైర్యంతో కందుకూరి వారు పైడా రామకృష్ణయ్య ఆర్థిక తోడ్పాటుతో 1884 నాటికి 10పెళ్ళిళ్ళు చేశారు.
భోగం మేళాల నిషేధానికి కందుకూరి ఎన్నో పాట్లు పడి మార్గ దర్శకులయ్యారు. సంస్కృతి పేరుతో భోగం మేళాలను, భోగపు స్త్రీలను ఆదరించిన పెద్దలపై తన హాస్యాన్ని కుమ్మరిస్తూ ఎగతాళి చేశారు.

19వ శతాబ్దంలో మహిళా ఉద్యమం స్త్రీలకు న్యాయం కావాలనే భావంతో ఉదయించింది. కందుకూరి కృషితో బాల వితంతువుల పట్ల జాలి, కరుణ, స్త్రీ విద్య పట్ల అభిమానం ఆనాడు వెల్లివిరిశాయి. ఆ కాలంలో ప్రజల మానసిక క్షేత్రాలలో ఈ భావాల విత్తనాలు నాటిన మహనీయుడు. మహిళోద్యమ జనకుడు కందుకూరి వీరేశలింగం.

ఈనాడు సభలలో – స్త్రీ పురుషుల సభలలో మహిళలు పాల్గొంటున్నారంటే దానికి కారణ భూతుడు కందుకూరి. తను ఏర్పాటు చేసిన సభలలో పురుషులు తమ సతీమణులతో, తల్లులతో, అక్కచెల్లెళ్ళతో రావాలని నియమం పెట్టారు. అది ఆనాటికి గొప్ప విప్లవ చర్య. ఆయన మాటననుసరించి పురుషులు అలాగే స్త్రీలతో వచ్చేవారట. కందుకూరి స్త్రీ జనోద్ధరణ కాలం పందొమ్మిదో శతాబ్దం అని గుర్తు పెట్టుకుంటే గాని దాని ప్రాముఖ్యం గోచరించదు.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించుకుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి . రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.

పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.

కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్పు తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.

2. అంపకం ఆధారంగా తండ్రి, కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జ.
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటినుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు.

‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

3. సౌందర్యం కథ ద్వారా మనుష్యుల స్వభావాలను వివరించండి.
జవాబు:
బస్సులో పుట్టింటికి ప్రయాణమౌతుంది రేఖ భర్తతో సహ, తన ఐదేళ్ళ కొడుకుని తీసుకొద్దామని బస్సులో ముగ్గురు కూర్చొనే సీటులో రేఖ తన భర్త సుందర్రావు ఉండగా చంద్రం అనే వ్యక్తి ఆ సీటులోకి వస్తాడు. సుందర్రావు రేఖ సర్దుకుంటారు. చంద్రం కూర్చుంటాడు. బస్సు బయలుదేరగానే నిద్రలోకి జారుకుంటాడు సుందర్రావు. నిద్రపట్టగానే తెలియకుండానే గురక పెడతాడు. బస్సులో అది అందరికి ఇబ్బందిగా ఉంటుందేమోనని రేఖ సిగ్గు పడుతుంది. బస్సు ఎక్కగానే ఈ నిద్ర ఏమిటి ? అంటుంది. ప్రక్కనే ఉన్న చంద్రాన్ని చూసి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో నని ఆలోచిస్తుంది. ఇది సాధారణంగా అందరిలో ఉండే సహజగుణమే. తమను చూసి ఎదుటివారు ఏమనుకుంటారోనని మన సహజత్వాన్ని దాచిపెట్టి కృత్రిమ స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. చాల మందిలో ఈ రకమైన స్వభావమే ఉంటుంది.

ఈ కథలో రేఖ తన భర్తని చూసి చంద్రం ఏమనుకుంటాడోనని ఆలోచిస్తుంది. అలాగే భర్తను కిటికీ వైపు కూర్చోమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా చూసినా ప్రక్కనున్న చంద్రం భార్య అనుకుంటారని తృప్తిపడుతుంది. దీనిని బట్టి భర్త అందంగా లేడని బాధ పడే మనుషులు ఈ సమాజంలో ఉన్నారని రచయిత్రి అభిప్రాయం. పెళ్ళి సమయానికి సుందర్రావుకు బట్టతల లేదు. తర్వాత సంపాదన కోసం ఎండనక వాననక కష్టపడి నల్లగా లావుగా బట్టతలతో మార్పులు వస్తాయి. ఆ మార్పుని కూడా అంగీకరించలేని మనుషులు చాలా మంది ఉంటారని ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.

బస్సులో నిద్రపోయే సుందర్రావును విసుక్కుంటుంది రేఖ. గురక పెట్టే వ్యక్తిని సహించలేకపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఇలా తన మానసిక భావాలతో సంఘర్షణ పడుతుంది. బస్సులో అరటి పళ్ళు తినడం పాన్ వేసుకోవడాన్ని ఇష్టపడదు. అది ఒక అనాగరికుల అలవాటు అనుకునే వారు ఉంటారు. ఎవరికి నచ్చినట్లు వారు తినడం కూడ నచ్చదు. అరటి పళ్ళన్నీ తిన్న సుందర్రావును చూసిన రేఖ అసహ్యించుకుంటుంది. నిద్రపోతూ గురక పెట్టిన భర్త ఎలుగు బంటిలా కనబడతాడు. ముందు సీట్లో చిన్న పిల్లవాడు సుందర్రావును చూసినప్పుడు జూలో జంతువులను చూసిన కొడుకును గుర్తుచేసుకుంటుంది. రేఖ అవస్తను గ్రహిస్తూ ఉంటాడు చంద్రం.

బస్సులో ముందు సీటులో భార్య భర్త 5 ఏళ్ళ ఒక పిల్లవాడు కూర్చుంటారు. ఆ భర్త అందంగానే ఉన్నాడు. భార్య ఓ మోస్తరుగా ఉంటుంది. ఆమెను బస్సు ఎక్కినప్పటి నుండి సతాయిస్తూనే ఉంటాడు. ఆమె తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఒక యాస్ప్రిన్ మాత్ర తెమ్మంటే క్రూరంగా నవ్వి నీకు కాఫీలు మోయాలా ? ఇంటికెళ్ళాక తాగవచ్చులే అని అంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటుంది రేఖ. రేఖ భర్త కాఫీ, టిఫెన్ తెచ్చి తినమని ప్రాధేయపడితే విసుక్కుంటుంది. అప్పుడు ముందు సీటులో ఉన్న ఆమె రేఖను చూసి నీవు చాలా అదృష్టవంతురాలవి. తినమని చెప్పే భర్తలు ఎంతమందికి దొరుకుతారు ? భార్యను ప్రేమగా చూసే భర్త దొరకడం నీ అదృష్టం అని అంటుంది. దూరంగా చిన్న బుచ్చుకున్న మొహంతో వస్తున్న సుందర్రావుని చూసి జాలి పడుతుంది. తన భర్త ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. అమృత హృదయుడు అమాయకుడు ఇటువంటి భర్తను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడుతుంది రేఖ. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వికృతంగా అనిపించింది రేఖకు. భార్య ప్రశాంతంగా ఉండటం చూసి సంతోషించాడు సుందర్రావు. ఇప్పుడు సుందర్రావు గురక అసహ్యమనిపించలేదు రేఖకు. దీనిని బట్టి బట్టతల నల్లగాఉన్న వ్యక్తి పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా భర్త అందంగా లేడని బస్సులో నిద్రపోతాడని ఆ నిద్రలో గురక పెడుతుండడం వల్ల చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచించేవాళ్ళు చాల మందే ఉంటారు.

4. “దహేజ్” కథాసారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
సుల్తానా-రెహమాన్ల వివాహం జరిగింది. రాత్రికి శోభనం. వివాహానికి వచ్చిన బంధువులంతా హడావిడిగా ఉంటారు. కొంతమంది పూర్వకాలం వారు వారి కాలంలో జరిగే పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్వం ఏడు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవని వారి భావన. కాలం మారిపోయింది. ఒక్కరోజులోనే పెళ్ళి శోభనం కాపురానికి పంపించడం సహజమైపోయింది ఈ రోజుల్లో.

కళ్యాణ మండపం పూలతోను రంగురంగుల కాగితాలతోను రంగుల దోమ తెరలతో మండపం ఆకర్షణీయంగా ఉంటుంది. పూల మంచానికి ఒకవైపు ముసుగులో పెళ్ళి కూతురు. మరొక వైపు ఆడపడుచుల మధ్య పెళ్ళి కొడుకు ఉంటారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళి కూతుర్ని చూడమంటారు. అలాగే చేస్తాడు రెహమాన్. మొదటి సారి చూసినందుకు శుభసూచకంగా ఉంగరం తొడుగుతాడు వరుడు. ఆడపడచులు కలకండ ఇచ్చి సగం కొరికి వధువుకి ఇవ్వమంటారు. అలాగే చేస్తాడు వరుడు. పెళ్ళి కూతుర్ని భుజాన వేసుకోమంటారు. కొంత తటపటాయించి ఒక్కసారిగా భుజాన వేసుకుంటాడు వరుడు. అనగా జీవితంలో బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు దానర్థం. గడపకు అరచేతులతో గంధం ముద్రలు వేయిస్తారు. ఇదంతా పెళ్ళిళ్ళ పేరమ్మ చేయిస్తుంది. ఇక దహేజ్ అనగా కాపురానికి కావలసిన సామాగ్రీని చూడమని చెప్తుంది. అందరూ దహేజ్ను చూస్తారు. ఇంతలో వరుని తల్లి పెద్ద పెద్దగా అరుస్తూ భర్తను పిలుస్తుంది. అంతవరకు వధువు తండ్రి సులేమాన్. వరుని తండ్రి ఫకర్డీన్ భాయికి తన కూతుర్ని అప్పగిస్తూ బాధపడతాడు. సులేమాన్ని ఓదారుస్తూ ఉంటాడు ఫకరీనా ్భయ్ దహేజ్లో ఉన్న సామాన్లు చూసి అందరూ సంతోషిస్తారు. అమ్మాయి తండ్రి బాగానే పెట్టాడనుకుంటారు కాని వరుని తల్లి రుబియాబీ భర్తను ఉద్దేశించి మన పరువు ఏమయిపోవాలి అని అంటుంది. సంబంధం కుదిర్చిన జులేఖాను పిలిచి కలర్ టి.వి లేకుండా ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వస్తుందా? అని ప్రశ్నిస్తుంది. కలర్ టి.వి ముందుగా మాట్లాడుకోలేదు. అయినా వియ్యంకులు వారు వద్దన్నారని అంటాడు సులేమాన్. కాని రుబియాబీ ఒప్పుకోలేదు. రాత్రి అయినా వెళ్ళి షాపు తెరిపించి టి.వి తెచ్చిస్తాడు సులేమాన్. దానితో శాంత పడుతుంది వరుని తల్లి.

అయినా దహేజ్లో ముఖ్యమైనది మరిచిపోయారంటు కఫన్ గుడ్డలు రెండు. ఒకటి ఎర్రని గుడ్డ రెండవది తెల్లని గుడ్డ తీసుకొచ్చి దహేజ్లో ఉంచుతాడు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఈ కఫన్ గుడ్డ మరచి పోకూడదని అంటాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. దీనికిట్టి దురవస్థ వాటిల్లే నీడ్య చరితా.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ద్రౌపది ఎందుకు నేలకూలింది అని భీముడు అడిగితే ధర్మరాజు బదులిచ్చిన సందర్భంలోనిది.
అర్థం : ద్రౌపదికి అందుకే ఇటువంటి దురవస్థ వాటిల్లింది.
భావ పాండవులు, ద్రౌపది, కుక్క అలా వేగంగా వెళుతుండగా ద్రౌపది నేలకూలింది. అది చూసిన భీముడు అన్నగారితో ద్రౌపది వలన ఏనాడూ కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనగా ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం. అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. ఓడగట్టిన దూలంబై లంకెనుండ జేసితి.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : పల్లెకు తిరిగిరమ్మని బోయలు కోరినపుడు తిన్నడు వారితో రాలేనని చెప్పిన సందర్భంలోనిది. అర్థం : ఒడకు ఆధారంగా ఉండే దూలంలా ముడివేసాను.
భావము : ఈ శివలింగములో నా ప్రాణమును మరణించేవరకు, ఓడ నడుచుటకు కట్టిన దూలంవలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధపడవద్దు. మీరు గూడెమునకు వెళ్ళండి అని తిన్నడు పలికాడు.

3. అధికార ముద్రికలు అంతరించే.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం: కవి శ్మశానం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించే సందర్భంలోనిది.
అర్థం : రాజముద్రలు (అధికారం) అంతరించిపోయాయి.
భావం : ఈ శ్మశానంలోనే గొప్ప కవి యొక్క కలం నిప్పులలో కరిగిపోయింది. ఇక్కడే దేశాన్నేలే రాజు యొక్క అధికార దర్పం, అధికార చిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు యొక్క మాంగల్యం నీట కలిసిపోయింది. ఇక్కడే ప్రఖ్యాత చిత్రకారుడి కుంచె నశించింది అంటూ శ్మశాన గొప్పతనాన్ని కవి చాటాడు.

4. మోసాన్ని గుర్తెరిగి కాపాడవోయ్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు జాతికి పరులతో జరుగుతున్న అన్యాయాన్ని గురించి కవి తెలుపుతున్న సందర్భంలోనిది. అర్థం : మోసాన్ని గుర్తించి కాపాడవయ్యా.
భావము : మన తెలుగు ప్రాంతం బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుని పోయారయ్యా. ఆ మోసాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం)

1. పార్ధుని మరణానికి కారణాలేమిటి ?
జవాబు:
ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

2. ఇంటికి రమ్మని పిలిచిన బోయలకు తిన్నడిచ్చిన సమాధానాన్ని తెలపండి.
జవాబు:
ఈ శివలింగానికి నా ప్రాణాన్ని మరణించేవరకు ఓడ నడచుటకు కట్టిన దూలం వలె పెనవేశాను. మీరు బాధపడవద్దు. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి ఇపుడు నేను వస్తాను. లేనిచో శివుడే దిక్కులో ఉన్నాడో ఆ స్థలంలోనే అనుక్షణం అతనిని అంటిపెట్టుకొని నివసిస్తాను. నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దేవుడే.
మీరు ఈ అడవిలో కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఒత్తిడి చేసినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను ఇది నిజం అని తిన్నడు పలికాడు.

3. వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలపండి.
జవాబు:
మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య, ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే. వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపరచాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన బొబ్బిలి పాలకుడి ధర్మపత్ని వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి. రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసికూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల. వీరంతా మన తోడబుట్టిన వీర సోదర, సోదరీమణులు వీరి పరాక్రమ . గాధలను కథలు కథలుగా చెప్పారు.

4. సౌఖ్యంబెంత క్రీడించునో అని జాషువా ఎందుకన్నాడు ?
జవాబు:
ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, గుడ్లగూబలు, దయ్యాలు ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ శ్మశానంలో ఆకు కూడా కదలడం లేదు అని జాషువా గారు వర్ణిస్తారు. ఇవన్నీ మానవుడి నిత్యజీవితంలో కష్టాలని, పోరాటాలని కవి ఇలా పోల్చాడు. మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా అనుభవిస్తుంటాడు. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండదు. అక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది అని జాషువా అన్నారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. సందర్భ శుద్ధి లేకపోవటం వల్ల కలిగే హాస్యం గురించి తెలపండి.
జవాబు:
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (impropriety) హాస్యానికి కారణమవుతుంది.
‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా’ అంటే దూడ గడ్డి కోసం అన్నాడుట’. ఇక్కడ సందర్భ శుద్ధి లేదు. ప్రశ్నకు సమాధానానికి పొంతన లేదు. ఇది వింటే తప్పక నవ్వువస్తుంది.
శుభమైన పెళ్ళి జరుగుతున్న సమయంలో ‘వచ్చిపోయెడు వారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణంబు ఏడ్వ’ వంటి సందర్భ శుద్ధి లేని అవాకులు, చవాకులు వింటే నవ్వువస్తుంది.
ఈ నవ్వు నిర్మలము కాదు. అయినా అదీ హాస్యమే. సందర్భ శుద్ధి లేకపోవటం, అసందర్భంగా మాట్లాడటం ఇక్కడ హాస్యానికి కారణం.

2. బొడ్డుచర్ల తిమ్మన గురించి వివరించండి.
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన రాయలకాలం నాటి కవి. కవీశ్వర్ దిగ్దంతులనిపించుకున్న కృష్ణరాయల వారితో చదరంగం ఆడుతూ ఉండేవాడు. చదరంగం ఆటలో నేర్పరి ఈ కవి. పెద్దనగారి మను చరిత్రను రాయలు అంకితంగా అందుకుంటున్న మహోత్సవానికి కవులందరితో వస్తూ, వారికి కొంచెం దూరంగా నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతూ ఈ కవి వచ్చాడు. రాయలు ఇతని నైపుణ్యానికి చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా రాసి ఇచ్చాడు.

3. కందుకూరి సంస్కరణలను పేర్కొనండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.

కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.

కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధిని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.

4. సూర్యకాంతమ్మ గారిని గురించి తెలపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసుగారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు.. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో వివాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు. సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.
ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు).: (2 × 3 = 6)

1. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

2. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.
ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

3. కందుకూరి రచనలను తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొనిపోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.
కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధిని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.
తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్యతిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.

4. మునిమాణిక్యం నరసింహారావును గురించి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావు గారు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్యరచయిత. వీరి ‘కాంతం కథలు’ తెలుగు సాహిత్యంలో ఒక మణిహారం.
వీరు గుంటూరుజిల్లా తెనాలి దగ్గర వున్న సంగం జాగర్లమూడిలో 15-03-1898 లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణలు. ఇంటరు విద్య తెనాలిలో చదివారు. డిగ్రీ, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి సహాయంతో చదివారు. ఉపాధ్యాయుడుగాను, ఆకాశవాణిలోను ఉద్యోగాలు చేశారు.
దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, తెలుగుహాస్యం, రుక్కుతల్లి, తిరుమాళిగ, కాంతం కైఫీయత్తు వంటివి వీరి రచనలు. ‘టీ కప్పులో తుఫాను’ వీరి మొదటి నవల.
కాంతం కథలకు వీరి భార్యే స్ఫూర్తి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ఆధారంగా రచించిన ‘కాంతం కథలు’ నేటికీ నిత్య నూతనంగా ఉన్నాయి. నిత్యజీవితంలో హాస్యం అవసరాన్ని వీరు తమ రచనలలో హృద్యంగా చెప్పారు.
ముని మాణిక్యం నరసింహారావుగారు 4.2.1973లో కీర్తిశేషులయ్యారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి.

1. దొంగిలించబడిన సైకిల్ను గూర్చి సంబంధిత అధికారికి ఫిర్యాదు.
జవాబు:

విజయవాడ,
7.2.2018.

X X X X X X,
ఇంటి నెం. 7-8-47,
పూలబావిసందు, విజయవాడ – 1
మహారాజశ్రీ వన్డేన్ క్రైమ్ పోలీసు సబ్ ఇన్స్పెక్టరు గారికి,
అయ్యా,
నేను విజయవాడ పూలబావి సందులో 7-8-47 నెంబరు గల ఇంటిలో నివశించుచున్నాను. నేటి ఉదయం మా ఇంటి ఆవరణలో ఉంచిన నా సైకిల్ దొంగిలింపబడినది. సైకిల్ కొత్తది. ఆకుపచ్చ రంగు కలది. హీరో కంపెనీకి చెందినది. సైకిల్ నెం. M 2244. ఎరుపు రంగు సీటుతో కూడినది. సైకిల్ హేండిల్ పైన నా పేరు ఉన్నది. దొంగిలింపబడిన నా సైకిల్ను వెదికించి వీలయినంత త్వరగా నాకు అందజేయవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.

ఇట్లు, విధేయుడు,
X X X X X,

చిరునామా :
మహారాజశ్రీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టరు గారికి,
విజయవాడ – 520 001.

2. నీ చదువును గూర్చి తల్లిదండ్రులకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాదు,
13.9.2018.

పూజ్యులైన అమ్మకూ, నాన్నకూ,
నమస్కారాలు. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. చెల్లెలు, తమ్ముడూ రోజూ బడికి వెళ్తున్నారు గదా ! తాతగారికి, నాయనమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.
మా కళాశాల అన్ని విషయాలలోనూ నాకు బాగా నచ్చింది. నేను శ్రద్ధగా చదువుకుంటున్నాను. మొన్న జరిగిన త్రైమాసిక పరీక్షల్లో నాకు మూడవ స్థానం లభించింది. మొదటి స్థానంలో నిల్వడానికి నేను కష్టపడుతున్నాను. మా కళాశాలలో గ్రంథాలయం చాలా పెద్దది. రోజూ మూడు గంటలు గ్రంథాలయంలో కూర్చొని అనేక కొత్త అంశాలను నేర్చుకుంటున్నాను. నిన్న బాబాయి వాళ్ళింటికి వెళ్ళివచ్చాను. వాళ్ళు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళని సెలవుల్లో మనింటికి రమ్మని చెప్పాను. ఇక్కడ వాతావరణం చాలా చలిగా ఉంది. మన పొలాలు ఎలా ఉన్నాయి ? వర్షాలు పడుతున్నాయా ? మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
నాకు వాసు, భరత్, సునీల్ అనేవాళ్ళు స్నేహితులయ్యారు. సంక్రాంతి సెలవులకు వారు కూడా నాతో మన ఊరికి వస్తామన్నారు. నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. మీరు ఒకసారి రావచ్చుగదా ! మన ఊళ్ళో నా స్నేహితులయిన రాజు, రవి, విజయ్లను అడిగానని, సెలవుల్లో వస్తానని చెప్పండి.

మీ కుమారుడు
సంతోష్ కుమార్

చిరునామా :
శ్రీధర్,
X X X X X.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. శోకమేల
2. దేహోద్ధతి
3. మహాత్మ
4. కదలించియాడు
5. వారసుడవీవు
6. ఆద్యనిమిషులు
7. నుడువదగునే
8. తారాద్రి
జవాబు:
1. శోకమేల – శోకము + ఏల – ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అగు.

2. దేహోద్ధతి – దేహా + ఉద్ధతి – గుణసంధి.
సూత్రం : ‘అ’ కారమునకు, ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ అనునవి ఏకాదేశమగును.

3. మహాత్మ – మహ + ఆత్మ – సవర్ణదీర్ఘ సంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

4. కదలించియాడు – కదలించి + ఆడు – యడాగమసంధి.
సూత్రం : సంధిలేని చోట స్వరంబునకంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

5. వారసుడవీవు – వారసుడవు + ఈవు – ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

6. ఆద్యనిమిషులు – ఆది + అనిమిషులు – యణాదేశసంధి.
సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య, వ, ర లు ఏకాదేశమగు.

7. నుడువదగునే నుడవన్ + తగునే – సరళాదేశసంధి.
సూత్రము : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములుగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు, బిందు, సంశ్లేషలు విభాషనగు.

8. తారాద్రి – తార + అద్రి – సవర్ణదీర్ఘసంధి.
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 x 2 = 8)

1. కోదండధరుడు
5. నల్లపూసలు
2. ధైర్యలత
6. అభాగ్యము
3. నలుదిక్కులు
4. వేటకుక్కలు
7. ఉగ్రశరంబు
8. దశాననుండు
జవాబు:
1. కోదండధరుడు : కోదండమును ధరించినవాడు – ద్వితీయ తత్పురుష సమాసం.
2. ధైర్యలత : ధైర్యమనెడి లత – రూపక సమాసం.
3. నలుదిక్కులు : నాలుగైన దిక్కులు – ద్విగు సమాసం
4. వేటకుక్కలు : వేట కొరకు కుక్కలు – చతుర్ధి తత్పురుష సమాసం.
5. నల్లపూసలు : నల్లనివైన పూసలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
6. అభాగ్యం : భాగ్యం కానిది · నష్ తత్పురుష సమాసం.
7. ఉగ్రశరంబు : ఉగ్రమైన శరంబు – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం.
8. దశాననుండు : పది ముఖములు కలవాడు (రావణుడు) – బహువ్రీహి సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. ఎచ్చరిక
2. బావము
3. సూలం
4. బక్తి
5. షేఖరుడు
6. సందేసం
7. సివుడు
8. వూరు
9. ఎంకమ్మ
10. బోధన
జవాబు:
1. ఎచ్చరిక – హెచ్చరిక
2. బావము – భావము
3. సూలం – శూలం
4. బక్తి – భక్తి
5. షేఖరుడు – శేఖరుడు
6. సందేసం – సందేశం
7. సివుడు – శివుడు
8. వూరు – ఊరు
9. ఎంకమ్మ- వెంకమ్మ
10. బోదన – బోధన

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. New Delhi is the Capital of India.
జవాబు:
భారతదేశపు రాజధాని ఢిల్లీ నగరము.

2. A friend in need is a friend in deed.
జవాబు:
అవసర సమయములో అండగా నిలిచినవాడే నిజమైన స్నేహితుడు.

3. Honesty is the best policy.
జవాబు:
నిజాయితీగా ఉండుట మంచి లక్షణం.

4. Earth revolves around the Sun.
జవాబు:
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.

5. All that glitters is not gold.
జవాబు:
మెరిసేదంతా బంగారం కాదు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

గోండులు అతి ప్రాచీన ద్రావిడ తెగకు చెందినవారు. వీరి సంస్కృతి, నాగరికత విశిష్టమైనవి. గోండులు పరిపాలించిన ప్రాంతమును ‘గోండ్వానా’ అంటారు. ఇది ముప్పయి ఆరు కోటలతో కూడిన ప్రాంతం. మహారాణి దుర్గావతి ఈ తెగకు చెందిన వీరనారీమణి. గోండు రాజులు నృత్య సంగీత ప్రియులు. గోండ్వానా తెలుగు ప్రాంతానికి అనుకొని ఉన్న ప్రాంతం. చాందా, సిరువంచ, బస్తరు మొదలైన సంస్థానముల ప్రభువులు గోండ్వానా రాజవంశీయులే. వీరి ఆస్థానములలో ప్రదర్శించే ‘కేళిక’ నృత్యము ‘గోండ్లి’ అని చెప్పవచ్చు. ‘గోండ్లి’ నర్తనమును జాయపసేనాని తన ‘నృత్త రత్నావళి’లో పేర్కొన్నాడు.

ప్రశ్నలు :
1. గోండులు ఏ ప్రాచీన తెగకు చెందినవారు ?
జవాబు:
గోండులు ప్రాచీన ద్రావిడ తెగకు చెందినవారు.

2. గోండులు పరిపాలించిన ప్రాంతాన్ని ఏమంటారు ?
జవాబు:
గోండులు పరిపాలించిన ప్రాంతాన్ని “గోండ్వానా” అంటారు.

3. గోండులు తెగకు చెందిన వీరనారి ఎవరు ?
జవాబు:
మహారాణి దుర్గావతి.

4. గోండ్వానా రాజవంశీయులు ఏ ప్రాంతాలు పరిపాలించారు ?
జవాబు:
చాందా, సిరువంచ, బస్తరా మొదలైన ప్రాంతాలను గోండ్వానా రాజవంశీయులు పరిపాలించారు.

5. నృత్త రత్నావళి గ్రంథాన్ని రాసినవారెవరు ?
జవాబు:
జాయపసేనాని ‘నృత్త రత్నావళి’ గ్రంథాన్ని రచించాడు.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. శ్మశానవాటి పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
జాషువా.

2. కాళము అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
పాము.

3. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గేయం ఏ చిత్రంలో ఉంది ?
జవాబు:
పల్లెటూరు.

4. త్రివిష్టపం అంటే ఏమిటి ?
జవాబు:
స్వర్గం.

5. ధూర్జటి అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
శివుడు.

6. సత్కవీంద్రుని కమ్మని కలము ఎక్కడ కరిగింది ?
జవాబు:
శ్మశానం.

7. స్వాహ వల్లభుడు ఎవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.

8. శ్రీకాళహస్తి మహత్య్మం కావ్యానికి మూలమేది ?
జవాబు:
స్కంధ పురాణం.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద/ వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. రామాయణంలో సంజీవ పర్వతాన్ని తెచ్చినది ఎవరు ?
జవాబు:
ఆంజనేయుడు.

2. రాయలతో చదరంగం ఆడినది ఎవరు ?
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన.

3. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

4. బాలమురళి తల్లిదండ్రుల పేరేమిటి ?
జవాబు:
సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య.

5. త్యాగరాజస్వామి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి ?
జవాబు:
తిరువాయురు.

6. కుర్చిపీట మీద కూర్చున్నదెవరు ?
జవాబు:
కామాక్షి అత్తగారు.

7. నేను ఫెమినిస్టుని, హ్యూమనిస్టుని అని ప్రకటించుకున్నది ఎవరు ?
జవాబు:
మల్లాది సుబ్బమ్య.

8. కలవారు అంటే అర్థమేమిటి ?
జవాబు:
పంట సిరి ఉన్నవారు.

Leave a Comment