AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 2 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. సతియును గుణవతియుఁ బ్రజా
వతియు ననువ్రతయునైన వనిత నవజ్ఞ..
న్వితదృష్టిఁ జూచునతి దు
ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁబరికింపన్.
జవాబు:
ప్రతిపదార్థం :
మతిన్ = బుద్ధితో
పరికింపన్ = ఆలోచించగా
సతియును = పతివ్రతా
గుణవతియున్ = గుణవంతురాలూ
ప్రజావతియున్ = సంతానవతీ
అనుప్రతియున్ + ఐన = అనుకూలవతీ అయిన
వనితన్ = భార్య
అవజ్ఞా + అన్విత దృష్టిన్ = తిరస్కార భావంతో
చూచు = చూసే
అతి దుర్మతికిన్ = మిక్కిలి దుర్మార్గుడికి
ఇహమున్ + పరమున్ = ఈ లోకంలోనూ, పరలోకంలోనూ
కలదు + ఎ = సుఖం ఉంటుందా ? (ఉండదని భావం).

తాత్పర్యం : ఓ రాజా ! బాగా ఆలోచిస్తే – పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టుడికి ఇహపరసుఖాలు ఉంటాయా ? (ఉండవని భావం) అటువంటి దుర్మార్గుడు బ్రతికి ఉన్నా, చచ్చినా సుఖపడలేడని తాత్పర్యం.

2. తమ్ముని గూడి పుణ్య గుణ ధాముఁడు, రాముఁడు వచ్చి మాల్యవం
తమ్మున సైన్య సంఘము ముదంబునఁ గొల్వఁగ నుండి, భూమిపై
మిమ్ములఁజూచి రండనుచు మేటి కపీంద్రులఁ బుచ్చి, యందు మొ
త్తమ్ముగ మమ్ముఁ గొందఱను దక్షిణ భాగము చూడఁ బంపుచున్.
జవాబు:
ప్రతిపదార్థము :
తమ్ముని = సోదరుడైన లక్ష్మణునితో
కూడి = కలిసి
పుణ్యగుణధాముడు = పుణ్యగుణములకు నిలయమైన
రాముడు = శ్రీరాముడు
వచ్చి = చేరి
మాల్యవంతమ్మున = మాల్యవంతము అను పర్వతముపై
సైన్య సంఘము = భటుల సమూహం
ముదంబునన్
కొల్వఁగన్ = సేవిస్తూ
ఉండి = ఉండగా
భూమిపై = భూభాగముపై
మిమ్ములన్ = మిమ్మల్ని
చూచి = వెదకి
రండ + అనుచు = రమ్మని
మేటి = వీరులైన
కపీంద్రులన్ = వానర శ్రేష్ఠులను
పుచ్చి = పంపి
యందు = ఆ వానరముల
మొత్తమ్ముగ = సమూహము లోని
మమ్మున్ = మా వంటి వారిని
కొందఱను = కొందరిని
దక్షిణ భాగము = దక్షిణ దిక్కు వెంబడి
చూడన్ = వెదకుటకు
పంపుచున్ = = పంపుతూ (ఇలా పలికాడు)

తాత్పర్యము : -ఓ సీతాదేవీ ! సోదరుడైన లక్ష్మణునితో కలిసి పుణ్యగుణములు కలిగిన శ్రీరాముడు, మాల్యవంతము అనే పర్వతంపై తనను, సైన్యము సంతోషంతో సేవిస్తూ ఉండగా, నిన్ను ఇక్కడి భూభాగములో వెదికి చూచి రండని, శ్రేష్ఠులైన వానరములలో కొందరిని మావంటి వారిని ఈ దక్షిణ దిక్కు వైపు పంపుతూ ఇలా పలికాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. భట్టు రాయబారానికి వచ్చిన కారణాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ క్రీ.శ. 12వ శతాబ్దంలో జరిగిన ఒక చారిత్రక గాథ. ‘ఫల్నాటి వీరచరిత్ర’ నుంచి గ్రహించిన ప్రస్తుత పాఠ్యభాగం ‘శాంతి కాంక్ష’లో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు భట్టు రాయబారిగా వెళ్ళి సంధికోసం చేసిన చివరి ప్రయత్నం వర్ణించబడ్డది.

అనుగురాజు : అనుగురాజు గురజాలను రాజధానిగా చేసుకొని పల్నాటి రాజ్యాన్ని. పాలించేవాడు. అతనికి మైలమాదేవి, విద్యలదేవి, భూరమాదేవి అని ముగ్గురు భార్యలు. అనుగురాజు వల్ల మైలమాదేవికి నలగాముడు, విద్యలదేవికి పెదమలిదేవుడు, పిన మలిదేవుడు, బాల మలిదేవుడు అనే ముగ్గురు, భూరమాదేవికి కామరాజు, నరసింగరాజు, ఘట్టిరాజు, పెరుమాళ్ళరాజు అనే నలుగురు కుమారులు జన్మించారు. ఈ ఎన మండుగురిలో నలగామరాజు పెద్దవాడు.

బ్రహ్మదేవుడు : అనుగురాజు మంత్రియైన దొడ్డనాయని కుమారుడే బ్రహ్మనాయుడు. అనుగురాజు పెద్దవాడైన నలగామునికి పట్టాభిషేకం చేశాడు. ఎనిమిది మంది అన్న దమ్ములూ ఐకమత్యంతో కలిసిమెలసి ఉండేటట్లు చూసే బాధ్యతను అనుగురాజు బ్రహ్మనాయనికి అప్పజెప్పాడు.

నలగామరాజు, మలిదేవరాజు : అనుగురాజు చేరదీసిన నాగమ్మ అనే స్త్రీ రాజ్య విషయాలలో జోక్యం చేసుకుంటూ నాయకురాలుగా ఎదిగింది. తనను లెక్కచేయని బ్రహ్మనాయుడి మీద ఆమె పగ పెంచుకుంది. నలగామునికి ప్రధానిగా బ్రహ్మనాయుడి వైభవాన్ని ఆమె సహించలేకపోయింది. నలగామునికి లేనిపోనివి నూరిపోసింది. నాగమ్మ చెప్పుడు మాటలు నమ్మి నలగామరాజు తమ్ములైన మలిదేవాదులను చెరలో బంధించాడు. కుటుంబ కలహాలను నివారించటానికి మధ్యవర్తిత్వం చేసి రాజ్యాన్ని రెండుగా విభజించాడు. నలగాముని భాగానికి గురజాల రాజధాని, మలిదేవుని భాగానికి మాచర్ల రాజధాని.

నాగమ్మ : నలగామునికి నాగమ్మ మంత్రి, మలిదేవునికి బ్రహ్మనాయుడు మంత్రి. బ్రహ్మనాయుడికీ నాగమ్మకూ మధ్య పుట్టిన ఈర్ష్య అసూయలే పల్నాటి మత ద్వేషానికీ, యుద్ధానికీ దారితీశాయి. బ్రహ్మనాయుడి మంత్రిత్వంలో సిరిసంపదలతో తులతూగే మలిదేవుడి రాజ్యాన్ని చూసి నాగమ్మ ఓర్వలేకపోయింది. ఆమె ప్రేరణతోనే నలగామరాజు మలిదేవాదులను కోడిపందేల కోసం గురజాల పిలిపించాడు.

కోడిపందెం : బ్రహ్మనాయుడికీ, నాగమ్మకూ మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది. పందెంలో ఓడిపోయినవారు ఐదు సంవత్సరాలు వనవాసం చేయాలి. ఒప్పందం ప్రకారం మలిదేవాదులు వనవాసానికి వెళ్ళారు.

అలరాజు రాయబారం : ఇక రెండేళ్ళలో వనవాసం పూర్తికావస్తోంది. కనుక మలిదేవాదులు రాజ్యభాగం కోసం అలరాజును నలగామరాజు దగ్గరకు రామబారిగా పంపారు. రాయబారిగా వెళ్ళిన అలరాజు చంపబడ్డాడు.
భట్టు రాయబారం : అల్లుడైన అలరాజు చంపబడటంతో మలిదేవాదులు అగ్రహోద గ్రులయి యుద్ధానికి సిద్ధమయ్యారు. కార్యమపూడి (కారెంపూడి) యుద్ధభూమికి సైన్యంతో చేరుకున్నారు. సంధికోసం చివరి ప్రయత్నంగా నలగామరాజు దగ్గరకు భట్టును రాయబారిగా పంపించారు.

ముగింపు : ఇట్లా మలిదేవాదుల తరపున రాయబారిగా నలగామరాజు కొలువుకు వచ్చిన భట్టు యుద్ధం ఆపటం కోసం, సంధి కోసం ఎంతో ప్రయత్నించాడు. –

2. రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు ?
జవాబు:
పరిచయం : గురజాడ అప్పారావు రచించిన ‘కన్యక’ అనే కవితాఖండికలో ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టడానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు వర్ణించబడ్డాయి.

రాజు దౌర్జన్యం : ఒక సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఒకసారి ఆమె బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి నుదుటున కుంకుమ పెట్టుకొని పూజ కోసం గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పాలు, పండ్లు, పూలు మొదలైన పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది. చుక్కల్లో చంద్రునిలాగా వెలుగుతున్న ఆమెవంటి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు. ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరుపొందాలని భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించబోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది.

సెట్టి వేడుకోలు : రాజు దౌర్జన్యాన్ని గమనించిన కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు. “రాజా! నువ్వు నా కూతుర్ని బలవంతం చేయవలసిన పనిలేదు. నువ్వు ఈ దేశానికి రాజువు. కనుక ఈ కన్యక కూడా నీ సొత్తే. నా కూతుర్ని నువ్వు కోరుకోవటం కంటే నాకు అదృష్టం ఏముంటుంది ? నువ్వు దయతో మా మనవి ఆలకించాలి. మా కులం వారికి ఒక ధర్మం ఉన్నది. నువ్వు ఆ ధర్మాన్ని గౌరవించాలి. అగ్నిసాక్షిగా నా కూతుర్ని పెళ్ళి చేసుకో. నీకు కావలసినన్ని కానుకలు సమర్పించుకుంటాను. మా జాతి ధర్మాన్ని కాపాడు” అని సెట్టి రాజును వేడుకున్నాడు.

రాజు అహంకారం : సెట్టి మాటలు విని రాజు ఎగతాళిగా నవ్వి ఇట్లా అన్నాడు. “రాజ్యాన్ని పాలించే రాజుకు ధర్మశాస్త్రాన్ని ఒక సెట్టి నేర్పించడమా ? అసలు రాజు అనుకున్నదే ధర్మం. రాజు చెప్పినదే శాస్త్రం. గాంధర్వం అనే వివాహ పద్ధతి రాజకుమారులకు ఆమోద యోగ్యమైనదేననే’ విషయం తెలియదా ? కనుక ఆలస్యం వద్దు. బాధపడనూ వద్దు. ఇవాళ, రేపు అంటూ గడువులు పెట్టవద్దు. నీకు ఇష్టమైతే నీ కూతుర్ని ఇవ్వు. లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ తాను పట్టిన పిట్టను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా నీ కూతుర్ని విడిచిపెట్టను. ఆమె ఇక నీ ఇంటికి తిరిగిరాదు. నువ్వు ఇస్తానన్న కానుకలను ఇక్కడికే తీసుకొని రా! నువ్వు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను” అని రాజు తన అహంకారాన్ని ప్రదర్శించారు. అపుడు సెట్టి “రాజు పనికంటే దేవుని పూజ ముఖ్యమైనది కదా ! మీరు దయచూపితే నేను మా కులదైవమైన వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళి పూజ పూర్తిచేసుకొని వస్తాను” అని రాజును అనుమతి కోరాడు. అపుడు “మేము కూడా నీతోపాటు గుడికి వస్తాం” అక్కడే అగ్నిసాక్షిగా కన్యకను స్వీకరిస్తాం” అంటూ రాజు కూడా గుడికి బయలుదేరాడు.

ముగింపు : ఈ విధంగా రాజు కన్యకను చెరపట్టడానికి ప్రయత్నించాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. పూర్వకాలంలోని వేడుకలు, వినోదాలను గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. తెలుగు సంస్కృతిలో భాగాలైన వివిధ రకాల ఆటలు, వేడుకలను ఈ వ్యాసం ద్వారా యువతకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్పవేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరము లకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలం నుండి మంచి ప్రాచుర్యం వచ్చింది. ఇక వసంతోత్సవం తరువాత చెప్పదగిన వేడుక శరదుత్సవం. దీనిని మహా లక్ష్మీపండుగలని, దేవీ నవరాత్రులని పిలిచేవారు. మన పండుగలు, వేడుకలు మత సంబంధమైనవే! గ్రామాలలోని దేవుని కళ్యాణం, గ్రామదేవతల జాతరలు దీనికి ఉదాహరణలు. మనకున్న పండుగలలో వసంతోత్సవం శరదుత్సవాలతోపాటుగా మకర సంక్రమణం (సంక్రాంతి) పండుగ కూడా ఒకటి. దీనిని ‘పెద్ద పండుగ’ అని పేరు.

సంక్రాంతి పండుగ దినాలలో జరుపుకొనే వేడుకలలో కోడిపందెములు ఒకటి. కోడిపందాలు వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వపు సంస్థానాధీశులకు కోడిపందాలు ఒక వేడుకగా ఉండేవి. పల్నాటి యుద్ధమునకు కారణం ఈ కోడి పందాలేనని చరిత్ర వలన తెలుస్తుంది. పూర్వ గ్రంథాలైన . క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథాల వలన తెలుగు నేలపై వృషభపోరు, మేషయుద్ధము, దున్నపోతుల పోరు, గజయుద్ధము, పొట్టేళ్ళ పోరు మొదలగు ప్రజావినోదపు వేడుకలున్నట్లు తెలుస్తుంది. కుంతలదేశరాజైన సోమేశ్వర భూపతి తాను రచించిన ‘అభిలషితార్థ చింతామణి’ అను మారు పేరుతో ఉన్న ‘మానసోల్లాసం’ అనే విజ్ఞానకోశంలో ఈ వినోదవర్ణలకు ఒక ప్రకరణాన్నే వ్రాశాడు. దానిలో మల్లయుద్ధము, గజయుద్ధము, అశ్వయుద్ధాలు, ఆబోతుల దున్నపోతుల పోరాటములు, పొట్టేళ్ళ, కోళ్ళ పోరాటాలను వర్ణించాడు. పూర్వకాలంలో ‘వేట’ కూడా ఒక క్రీడవేడుక వలె ఉండేది. దీనిలో పొదివేట, విడివేట, తెరవేట, దామెనవేట అని పలు రకములు ఉండేవి. పూర్వకాలమున ఈ వేడుకలు వినోదములు నేడు చాలా వరకు అంతరించిపోయాయి.

2. చాటు పద్యాలలో ప్రజా జీవనాన్ని వివరించండి..
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటిలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.

చాటువు అంటే ప్రియమైన మాట అని అర్థం. కవులు సరదాగా చెప్పుకునే పద్యాలు. ఒక భోగిచేత సీత్కరింపబడినపుడో, ఒక లోభిచేత సత్కరింపబడినప్పుడో, అందమైన దృశ్యం కనిపించినపుడో, మనసు గాయపడినపుడో, హాస్యం లాస్యం చేసినపుడో ఇలా పలు సందర్భాలలో మనసు నుండి ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకు వచ్చే పద్యరూపం చాటువు.

చాటుపద్యాలలో ప్రజా జీవనానిదే ప్రథమస్థానం. ప్రజా జీవనాన్ని చాటువులలో చిత్రించిన మొనగాడు శ్రీనాథుడు. ఈయన ప్రౌఢదేవరాయలను దర్శించటానికి కన్నడ దేశానికి వెళ్ళాడు. ఆ ప్రభువు దర్శనం ఆలస్యమయినందుకు కన్నడ రాజ్యలక్ష్మిని

“కుల్లా యుంచితి కోక చుట్టితి దయలేదా నేను శ్రీనాథుడన్” అని తల్లి దయ కోసం ఈ చాటువును చెప్పాడు. దీనిలో ఆనాటి కన్నడ దేశాన ప్రజల వేషంతో పాటు భోజన విశేషం కూడా వ్రాయబడింది. అలాగే శ్రీనాథుడు పల్నాడు సందర్శనానికి వెళ్ళినపుడు అక్కడి ప్రజల జీవనశైలిని, ఆహార అలవాట్లను వర్ణించాడు. “జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, – జొన్నపిసరు తప్ప సన్నన్నము సున్న” అని చెప్పాడు. పల్నాడు ప్రజలకు వరియన్నం తెలియదని దీనివలన తెలుస్తుంది. పల్నాటికి ‘రంభ’ వెళ్ళినా ఏకులే వడుకుతుందని, మన్మథుడు వెళ్ళినా జొన్నకూడు తినక తప్పదని తెలిపాడు. అలానే సామాన్య గ్రామ పురోహితుని ఇంటి పరిస్థితిని

“దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మాసిన కుండలున్” అని వర్ణించాడు. పడమటి సీమ వ్యాపారుల వస్త్రాలను, మసి బుర్రలను, కలములను, చింతంబళులను, చెమటపట్టిన నీరావులను, భయంకరమైన గడ్డాల వర్ణించటమే కాకుండా “వస్తూ చూస్తిమి రోస్తిమి అంటూ ఆ భావాలకు యాసను కూడా కూర్చాడు.

శ్రీనాథుడు తాను దర్శించిన ప్రాంతాలలోని ఒక్కొక్క ప్రాంతపు వనితలను వారి సొగసును కులాసాగా వర్ణించాడు. చివరకు తమిళ స్త్రీలను వర్ణించిన చాటువులు కూడా మనకు లభిస్తున్నాయి.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. ‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెల్పండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు.

న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పోరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు ని ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా? చచ్చినట్లా? అని తన ఆవేదనను సందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు.

ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించ మని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని తెలియజేయండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళులేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు. కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్బారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లోపడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.

తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్ డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.

విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను. భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు సత్యాన్ని సుదర్శన్.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

3. ‘ఆశ ఖరీదు అణా’లో తాత పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
ఆశ ఖరీదు అణాలో తాత ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి. 33 సంవత్సరాలు సర్కారీ నౌకరీ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఏదో చాలీచాలని పింఛను వస్తుంది. సంసారం చూస్తే గంపెడు. తొమ్మిదిమంది పిల్లలు. వారిలో ఇద్దరి అబ్బాయిలకు వివాహాలు అయినా నిరుద్యోగులుగా ఉంటారు. నలుగురు వివాహానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పిల్లల చదువులకు స్తోమత లేదు. కాలక్షేపంగా కొత్తగా వచ్చిన యువకునితో బాతాఖానీ వేస్తాడు. తాతగార్ని చూస్తే ఒక రకంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా ఏవో సమస్యలు ఉంటాయి. సమస్యలతో నిద్రరాక మేడపైకి వెడతాడు. ఇంకా నిద్రపోలేదా తాతగారు అని అడగ్గానే నువ్వు ఎందుకు నిద్రపోలేదు నిద్రలో హాయిగా ఉంటుంది మెలకువలోనే భయాలు, బెంగలూ అని తనకున్న దిగుళ్ళను తెలియజేస్తాడు.

యువకుని ఉద్యోగ వివరాలు అడిగి ఉద్యోగం చేయకపోవడమే మంచిదని తెలియజేస్తాడు. ఈ మాయాలోకంలో ఉద్యోగం లేకుండా ఉంటేనే నయం. ఏ పనైనా కష్టపడితే ఫలితం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల లేని బ్రతుకు. చాలీచాలని జీతం అని తన అనుభవాలను తెలియజేస్తాడు. ఇప్పుడు విచారిస్తున్నారా ? అని యువకుడు అడిగితే తన జీవితంలో విచారం అనే పదం లేదని జరిగిన అనుభవాన్ని చెప్పానని అంటాడు తాత. లాటరీ వేశాం ఓడిపోయాం అని ఆలోచనతోనే ఉంటాడు తాత.

ఏదో ఒక సమస్యతో జీవితంపై ఆశలు పోగొట్టుకున్న కృష్ణవేణి, యువకుడు, ఇందిరా, లక్ష్మీల అన్నయ్యలను చూసి బ్రతుకులో ఉండే ఆనందాన్ని చూడమని ధైర్యం చెప్తాడు. లోకంలో ఉండే మంచినీ, మమతల్నీ చిత్రాలుగా గీయమంటాడు. బ్రతుకులో మాధుర్యాన్ని పొందమని వాళ్ళలో నూతన చైతన్యం కలిగిస్తాడు. ఎవరికి వారే జీవితాన్ని చాలించాలని రోడ్డుమీదకు వచ్చిన వారందరిలో ఆశలు కలిగించి నూతన జీవితాలను ప్రారంభించమని తన అనుభవాలను జతచేసిన వారిలో ధైర్యాన్ని కలిగిస్తాడు. అందరికి తలా ఓ గ్లాసు కాఫీ తాగించి వారిలో నూతనోత్సాహం కలిగిస్తాడు తాత.

4. ‘తెరచిన కళ్ళు’ నాటిక సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
కళ్ళులేని బిచ్చగాడు పాట పాడుకుంటూ బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. ఆసుపత్రిలో ఒక స్త్రీ బిడ్డను ప్రసవిస్తుంది. మగపిల్లాడు బాగున్నాడు కాని కళ్ళు లేవని నర్సు చెప్తుంది. పుట్టుకతోనే అంధుడైన బిడ్డ పుట్టాడని తెలిసి తల్లి దుఃఖిస్తుంది. కళ్ళారా నన్ను చూసి అమ్మా అని పిలిచే భాగ్యం లేకుండా చేసాడు ఆ భగవంతుడని తల్లి తల్లడిల్లిపోయింది.

సన్నాయి మేళం పెళ్ళి సంబరం ఊరేగింపులో హడావిడి అంతలోనే బాణాసంచా మందు కళ్ళలో పడి పెళ్ళికొడుకు గావుకేక పెట్టాడు. బంధువులంతా పాపం’ అని జాలిపడ్డారు. చిలకా గోరింకల్లా ఉంటారనుకున్న అమ్మాయికి బ్రతుకు అడవి గాచిన వెన్నెలే అని బాధపడ్డారు. అందమైన అమ్మాయి ఆదర్శ దాంపత్య జీవితం ఆనందంగా గడపాలని ఎన్నో కలలు కన్న వరుడికి అంధకారమే మిగిలింది. విధి వారి పట్ల వైరం పూనింది. కళ్ళులేని నా జీవితం ఎలాగూ అంధకారమే. నీ జీవితాన్ని అయినా ఆనందంగా మలచుకోమని పెళ్ళికొడుకు అనగానే మీరే నా సర్వస్వం అనుకున్నాను. మీకు కళ్ళు లేకపోయినా మిమ్మల్ని తప్ప వేరొక ఆలోచన నాకు రాదు అని స్థిరంగా అంటుంది ఆ అమ్మాయి. డాక్టర్ సుదర్శన్ కళ్ళులేని వాళ్ళకి ఆపరేషన్ చేసి నయం చేస్తున్నాడట మనమూ వెళదాం అంటుంది భార్య. నిజంగా నాకు కళ్ళు వస్తాయా అనే సంశయంతోనే డాక్టర్ని కలుస్తారు. ఇంతలో అక్కడికి కళ్ళులేని పాపాయిని తీసుకొని వస్తుంది ఓ తల్లి. పుట్టుగుడ్డికి కళ్ళు ఎలా వస్తాయి ? నీ పిచ్చిగాని అంటాడు ఆమె భర్త. మన అదృష్టం ఎలా ఉందో ఒకసారి డాక్టర్కి చూపిద్దామంటుంది తల్లి. సరేనంటాడు భర్త.

డాక్టర్ సుదర్శన్ ఇల్లు చేరుకుంటాడు. సత్యం అనే చిన్న డాక్టర్ వాళ్ళని కూర్చోమంటాడు. డాక్టర్ ఆ పాపాయిని పరీక్షించడానికి లోనికి రమ్మంటాడు. పుట్టడమే అంధుడిగా పుట్టాడని” వివరాలడిగి తెలుసుకుంటాడు. నెక్స్ట్ అని మరొక పేషెంటుని పిలుస్తాడు. గుడ్డివాడైన భర్తను తీసుకుని వెళుతుంది ఆ అమ్మాయి. ఇలా కళ్ళులేని వాడినే పెళ్ళి చేసుకున్నావా ? అనగానే పెళ్ళినాడే కళ్ళు పోయిన పరిస్థితి వివరించి చెప్పింది ఆమె. వాళ్ళిద్దరికి మరునాడు ఆపరేషన్ సిద్ధం చేయమంటాడు అసిస్టెంట్ సత్యంతో డాక్టర్ సుదర్శన్. ఇంటికొచ్చిన డాక్టర్ ఆ రోజు తాను చూసిన పేషెంట్లను గురించి భార్యతో చెప్తూ రేపు వారికి ఆపరేషన్ చేయాలనుకున్నాను. భగవంతుని మీద భారం వేసి వాళ్ళకి వైద్యం చేస్తున్నానని అంటాడు. కళ్ళకు కట్లు విప్పే సమయంలో ఇటు పసిపిల్ల తల్లి, అటు కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్య ఆందోళనతో తప్పక చూపు వస్తుందా అని సత్యాన్ని ప్రశ్నిస్తారు. అంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని సమాధానమిస్తాడు సత్యం. భగవంతుడు కరుణించి చూపునిచ్చిన ఆ డాక్టర్ వాళ్ళకు దైవంలా అనిపిస్తాడు. ప్రత్యక్ష దైవంగా వాళ్ళు నమస్కరిస్తారు. ఆజన్మాంతం మీకు ఋణపడి ఉంటాం అని భార్య భర్త కూడా సంతోషిస్తారు.

పదేళ్ళుగా డాక్టర్ సుదర్శన్ దగ్గర పనిచేసే సత్యం జూనియర్ డాక్టర్ గానే మిగిలిపోయాడు. తనకు చిన్న చిన్న ఆపరేషన్ మెళకువలు నేర్పమని అడుగుతాడు. డాక్టర్ తన వంశం వారికే తప్ప ఇతరులకు నేర్పలేనని అంటాడు. వ్యక్తి శాశ్వతం కాదు విద్యే శాశ్వతం. ఈ విద్య మీ తోనే అందరించకూడదని ఎంతగా ప్రాధేయపడినా అంగీకరించలేకపోతాడు సుదర్శన్. ఇంతలో జయపురం రాజావారికి వారి దర్బారులోనే ఆపరేషన్ చేయాలని కబురు వచ్చింది. సత్యాన్ని తీసుకుని బయలుదేరాడు సుదర్శన్. రైలులో కిటికీలు తీసి కూర్చున్న సుదర్శనం కళ్ళలో నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి. సత్యం డాక్టర్కి ధైర్యం చెప్పి ఆపరేషన్ చేస్తాడు. తర్వాత సత్యాన్ని అడగగా తాను సుదర్శనికి తెలియకుండా ఆపరేషన్ విద్యను నేర్చుకున్నట్లు అలా చేసినందుకు మన్నించమని క్షమాపణ కోరుతాడు.

డాక్టర్ సుదర్శన్ “నా అహంభావానికి, అహంకారానికి భగవంతుడు నన్ను ఇలా శిక్షించాడు. విద్య. నా సొత్తు అని విర్రవీగాను. కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. నాకు కళ్ళు తెరిపించావు సత్యం” అంటూ ఆనందించాడు. “నా పేరు నిలబెట్టావు. ప్రపంచానికి చూపునిచ్చిన డాక్టర్కే చూపునిచ్చావు. ఆ గౌరవం నీదే సత్యం” అంటూ సత్యాన్ని మెచ్చుకున్నాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.

1. ఒక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది. సందర్భం : ఈ మాటలు సత్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భంలోనిది.
భావం : నూరుగురు కుమారుల కంటే ఒక్క సత్యవాక్యము మేలైనది అని భావం.
వ్యాఖ్య : : నూరు చేదుడు బావులు కంటే ఒక దిగుడు బావి మేలు. అటువంటి నూరు దిగుడు బావులకన్నా ఒక్క గొప్ప యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకన్నా గుణవంతుడైన ఒక్క కుమారుడు మేలు. అటువంటి నూరుగురు కుమారులు కన్నా ఒక్క సత్యవాక్యం మేలైనది.

2. చెప్పంగ నలవియే శివునకునైన.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు పారతంత్ర్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వివరించడం శివుడి తరం కూడా కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! యుద్ధం వల్ల అన్నీ అనర్థాలే. బలం, ధనం నశిస్తాయి. కీర్తి పరాక్రమాలు నాశనమౌతాయి. రాజ్యం శత్రురాజుల అధీనంలోకి వెడుతుంది. శత్రువుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వర్ణించటం శివుడి తరం కూడా కాదు అంటూ కలహం వల్ల కలిగే కష్టాలను గురించి రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు వివరించాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

3. సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసి వర్యా !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : లక్ష్మణుని నేను అవివేకంతో అనరాని మాటలు అన్నాను. వాటిని మనసులో పెట్టుకొనకుండా నా గౌరవమును కాపాడుమని లక్ష్మణునికి తెలియజేయమని సీత హనుమంతునితో పలికిన పలుకులివి.
భావం : “నేను అన్న మాటలు మనసులో ఉంచుకోవద్దని, నా గౌరవమును కాపాడుమని సుమిత్రాదేవి కొడుకైన శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణునితో చెప్పవయ్యా !. గొప్ప సాహసివయిన. ఓ హనుమా !” అని సీత పలికినదని భావము.

4. మానవత్వమే మంట గలిసెనా !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! అనే పాట నుండి గ్రహించబడింది.
సందర్భము : ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే పేరుగల నవవధువు పాదాల పారాణి ఆరకముందే వరకట్నానికి బలి అయింది. ఆ సంఘటనను వివరించు సందర్భంలో కవి వ్రాసిన వాక్యమిది.
భావము : మానవత్వం మంట కలిసినదా ? మమతాను బంధాలకు అర్థం లేకుండా పోయిందా ? వివాహంలో చదివిన వేదమంత్రాలకు విలువ లేకుండా పోయిందా? పెళ్లి ప్రమాణాలు ఎగతాళి చేశాయా ? ప్రేమ బంధంగా కట్టిన తాళి ఉరితాడయ్యిందా? పాదాల పారాణి ఆరకముందే శవంగా మారావా ? అని ఇందలి భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

1. పురుషుని కార్యాలను ఎల్లప్పుడు చూసేవి ఏవి ?
జవాబు:
ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే వేదాలు; నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలు; ధర్మం; ఉదయం, సాయంత్రం అనే రెండు సంధ్యలూ, హృదయం; యముడు; చంద్రుడు; సూర్యుడూ; రాత్రీ; పగలూ అనే మహాపదార్థాలు పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాయి.

2. శ్రీనాథుని గురించి వ్రాయండి.
జవాబు:
15వ శతాబ్దంలో జీవించిన శ్రీనాథుడు కొండవీడును పరిపాలించిన రెడ్డిరాజుల ఆస్థానకవి, విద్యాధికారి. శ్రీనాథుని తల్లి భీమాంబిక, తండ్రి మారయ. ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పురాణయుగానికీ ప్రబంధయుగానికీ వారధిగా నిలచిన మహాకవి.

శ్రీనాథుడు సకల శాస్త్రాలలో పండితుడు. కవితా సృష్టిలో బ్రహ్మవరం పొందినవాడు. నిత్యం పరమేశ్వరుణ్ణి పూజించే పరమభక్తుడు. పిన్న వయసులోనే ‘మరుత్తరాట్చరిత్ర’ అనే కావ్యాన్ని రచించాడు. ఇంకా శ్రీనాథుడు రచించిన శాలివాహన సప్తశతి, శృంగార నైషథం, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీరచరిత్ర అనే కావ్యాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.

శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును వాదంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులగొట్టించాడు. అక్కడి ముత్యాల శాలలో కనకాభిషేక గౌరవం పొందాడు.

ఎంతో వైభవంగా జీవించిన శ్రీనాథుడు చివరి దశలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆదరించే రాజులు లేకపోవటంతో వేరే దారి లేక వ్యవసాయం చేశాడు. కృష్ణాతీరంలోని బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయాడు. శిస్తు కూడా చెల్లించలేక అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

తెలుగుజాతి శౌర్యపరాక్రమాల చరిత్రను అజరామరంగా నిలబెట్టాలనే సంకల్పంతో శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను దేశీయమైన మంజరీ ద్విపద చంధస్సులో రచించాడు. ఈ కావ్యాన్ని మాచర్లలో కొలువై ఉన్న చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు.

3. సీతాదేవి హనుమంతుని ఏమని దీవించింది ?
జవాబు:
సీతాదేవికి నమ్మకము కలిగించుట కొరకు హనుమ తన నిజ స్వరూపమును చూపించి, మరల సూక్ష్మరూపము ధరించి నమస్కరించి నిలబడగా, సీతాదేవి హనుమంతునికి తన శిరోరత్నమును ఇచ్చి ఇలా దీవెనలు పలికినది.
సూర్యవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు శ్రీరాముని యోగక్షేమాలను నీ వలన తెలుసుకొన్నాను.

నేను అనేక విధాలుగా ఇక్కడ పడుతున్న కష్టాలను నీ ద్వారా ఆయనకు తెలుపుకో గలిగాను. నీ సహాయానికి తగిన విధంగా నేను ఏమి ఇవ్వగలను ? నీవు ఈ భూమండలము నందు బ్రహ్మకల్పముల పర్యంతము చిరంజీవిగా వర్ధిల్లు ! అని దీవించెను.

4. కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి ?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్చే రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.

ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులు పోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయేమోనన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి బావితరాలకుండకూడదనీ, స్త్రీ జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. గెలుపెద్దుల మాన్యమును గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది.

తెలుగుదేశం వ్యవసాయం ప్రధానవృత్తిగా అనుసరించటం వలన ప్రజల జీవనం పాడిపంటలపై, పశుసంపదపై ఆధారపడింది. వ్యవసాయమునకు బలిష్ఠమైన ఎద్దుల అవసరం ఉన్నది. అందుకు మేలుజాతి ఎద్దులను తయారుచేయుటకు గ్రామస్థులు ఒక మాన్యమును ఏర్పాటు చేసుకునేవారు. దీనినే గెలుపెద్దుల మాన్యం అంటారు. కనుమపండుగనాడు పశుప్రదర్శన ఎడ్ల పందెములు జరిగేవి. ఆ పందెములో ఎవరి ఎద్దు గెలుస్తుందో ఈ గెలుపెద్దుల మాన్యం ఆ ఏడాది ఆయన ఆధీనంలో ఉంటుంది. ఇది ఈనాటి ‘రోలింగ్ కప్’ వంటిది. అలా అని అన్ని గ్రామాలలోనూ గెలుపెద్దుల మాన్యాలుండవు. కనుమనాడు పశువులతో వేడుకలను జరుపుకొనుట మాత్రం ప్రతి గ్రామంలో ఉండేవి.

2. అర్థ విపరిణామంలో అర్థ సంకోచాన్ని వివరించండి.
జవాబు:
భాషకు రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం, రెండు అర్థం ఈ రెండింటియందు కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. పదాలలోని అర్థాలలో వచ్చే మార్పులను ‘అర్థవిపరిణామం’ అంటాము. భాషాశాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలుగా సూచించింది.
1. అర్థ సంకోచం, 2. అర్థ వ్యాకోచం, 3. గ్రామ్యత్వం, 4. సౌమ్యత్వం, 5. సంకేతం.

1. అర్థ సంకోచం : పదాలలోని అర్థం సంకోచం చెందటమే అర్థసంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒకపదం కొంతకాలం తరువాత కుంచితార్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే దానిని అర్థసంకోచం అంటారు.
ఉదా : పూర్వం ‘చీర’ అనే పదం ‘వస్త్రము’ అన్న విస్తృతార్థంలో వాడబడింది. అది ఇపుడు సంకుచితమై ‘స్త్రీలు’ ధరించే వస్త్రంగా మాత్రమే వ్యవహరింపబడుతుంది. “సీతా రాములిర్వురును నార చీరలు ధరించిరి” ఇక్కడ చీరలన్నది విస్తృతార్థమే కదా !

అలాగే పూర్వము ‘వ్యవసాయమంటే’ పని అనే విస్తృతార్థం. ఇపుడది ‘సేద్యమన్న’ ఒక్క పనికే వాడబడుతున్నది. ‘ఉద్యోగమన్న పదం’ పూర్వం ‘ప్రయత్నం’ అన్న విస్తృతార్థంలో వాడబడినది. అది ఇపుడు ఆంగ్ల భాషా పదమైన ‘Job’ కు తోడై ‘ఉద్యోగ పర్వము’ లోని అర్థాన్ని ఇవ్వటం లేదు. ఇలా పూర్వము విస్తృతార్థంలో ఉండి సంకుతార్థాన్ని పొందిన ఎడల దానిని అర్థసంకోచమంటాము.

3. వేములవాడ భీమకవిని గురించి తెలపండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.

చాటుపద్యాలు చెప్పిన ప్రాచీనాంధ్ర కవులలో భీమకవి ఒకరు. వేములవాడ భీమకవి తెలుగు సాహిత్యంలో కేవలం చాటువుల వలననే ఇప్పటికీ బతికి ఉన్నాడు. ఇతడి పేర చలామణిలో ఉన్న చాటువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చారిత్రక వృత్తానికి ఒక గుప్త సత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.

“గడియ లోపల తాడి గడగి ….. వేములవాడ భీమకవిని అన్న పద్యంలో తిట్టుకవుల పట్టిక ఉంది. మేధావి భట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడభాగ్ని భట్టు ఈ నలుగురూ ఒకరిని మించిన వారింకొకరు. భీమకవి ఇతర చాటువులలో పేర్కొన్న సాగి పోతరాజు, మైలమ భీముడు, కళింగ గంగు లాంటి వ్యక్తులు కూడా చారిత్రక పరిశోధనాంశాలుగా మిగిల్చాడు.

4. అహింసను గురించి వేమన అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసము నకు సంక్షిప్తరూపము.

అహింస వేమనకు ఆరో ప్రాణం. ఒక జీవిని మరొక జీవి చంపటం ధర్మం కాదన్నాడు.

జీవి జీవిఁజంప శివుని జంపుటె యగు
జీవుఁడరసి తెలియ శివుఁ కాఁ అంటాడు.

అలాగే పూర్వం యజ్ఞయాగాదుల యందు జరుగు బలులు హింస కాదని సమాజంలోకి ఎక్కించారు. అది హింస కాక మరి ఏమౌతుందని వేమన వాదన. వేమనకు హింస మాత్రమే కాదు తన శత్రువును హింసించటానికి కూడా ఇష్టపడడు.
చంపఁదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
చంపదగిన శత్రువు మనచేతికి చిక్కినా వానికి కీడు చేయకూడదు. మనకు చేతనైన సహాయం చేసి వదిలిపెట్టటం కన్నా మేలు ధర్మములు ఏమీ ఉండవని వేమన భావన.

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. నన్నయ రచించిన వ్యాకరణ గ్రంథం పేరేమిటి ?
జవాబు:
ఆంధ్ర శబ్ద చింతామణి.

2. అన్ని జన్మలలో దుర్లభమైనది ఏది ?
జవాబు:
మానవ జన్మ.

3. అర్క సంభవుడు ఎవరు ?
జవాబు:
సుగ్రీవుడు.

4. పట్టమేలే రాజు గర్వం ఏమైంది ?
జవాబు:
మట్టిలో కలిసిపోయింది.

5. బియ్యంలో రాళ్ళలా కనిపించిన వేవి ?
జవాబు:
తెలుగు భాషలో కలిసిన ఆంగ్ల పదాలు.

6. ఖర దూషణాదులు హతమైన చోటేది ?
జవాబు:
గరిమెళ్ళ సత్యనారాయణ.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 =6)

1. హంస వింశతి గ్రంథాన్ని ఎవరు వ్రాశారు ?
జవాబు:
అయ్యలరాజు నారాయణామాత్యులు.

2. భారవి రచించిన గ్రంథం పేరేమిటి ?
జవాబు:
కిరాతార్జునీయం.

3. పూసపాటి విజయ రామరాజు ఆస్థానకవి పేరేమిటి ?
జవాబు:
అడిదము సూరకవి.

4. రాళ్ళపల్లి ఎవరి సంకీర్తనలను స్వరపరచారు ?
జవాబు:
అన్నమాచార్యుల సంకీర్తనలు.

5. రావూరి భరద్వాజ రచించిన మొదటి కథ ఏది ?
జవాబు:
‘విమల’ రావూరి భరద్వాజ తొలి కథ.

6. మా కొద్దీ తెల్లదొరతనం గీత రచయిత ఎవరు ?
జవాబు:
గరిమెళ్ళ సత్య నారాయణ.

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. తెలుగులో భాషాభాగాలు ఎన్ని ?
జవాబు:
తెలుగులోని భాషాభాగాలు 5. అవి : నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ అవ్యయం.

2. గులాబి అందమైన పువ్వు – దీనిలో విశేషణం ఏది ?
జవాబు:
అందమైన.

3. యథా, తథా అనేవి ఏ భాషాభాగాలు ?
జవాబు:
అవ్యయాలు.

4. సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామానికి బదులుగా వాడబడేది సర్వనామం.

5. క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని సూచించే పదం క్రియాపదం.

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు. – ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.

2. ఆకాంక్ష అంటే ఏమిటి ?
జవాబు:
ఇండియా క్రికెట్ మ్యాచ్లో ……… అని చెప్పి వదిలేస్తే గెలిచిందా ? ఓడిందా ? అనే సందేహం కలుగుతుంది. అలా సందేహం కలగడాన్ని ఆకాంక్ష అంటాం.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

3. వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
అర్థవంతమైన పదముల సమూహం.

4. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ.
జవాబు:
అతడు పెద్ద ఉద్యోగి.

5. సామాన్య వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే సమాపక క్రియను కలిగి ఉన్న వాక్యము.

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఉత్పలమాల
జవాబు:
ఉత్పలమాల అంటే కలువపూల మాల అని అర్థం. ఈ పద్యం నడక అంత సుకుమారంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు.
లక్షణాలు : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటె ఎక్కువ పాదాలు రాస్తే దానిని ‘ఉత్పలమాలిక’ అంటారు). ప్రతి పాదంలోను వరుసగా ‘భ, ర,. న, భ, భ, ర, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 10వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే నాలుగు పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions 1
యతి మైత్రి : 1 – 10 అక్షరాలైన ‘వి – వి’ లకు యతి పాటించబడింది.
ప్రాసాక్షరం : ‘ద్య’ అనే సంయుక్తాక్షరం ప్రాసగా ఉంది.

2. ఆటవెలది
జవాబు:
ఆటవెలది ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను 1 4 గణాల ‘మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమం లేదు. ప్రాసయతిని పాటించవచ్చును.
AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions 2
పై ఉదాహరణలో మొదటి పాదంలో మొదట 3 సూర్య గణాలూ, తరువాత రెండు ఇంద్ర గణాలూ వచ్చాయి. రెండో పాదంలో ఐదూ సూర్య గణాతలు వచ్చాయి. కాబట్టి ఇది ఆటవెలది పద్యం.
యతి మైత్రి మొదటి పాదంలో ‘ఉ’ అనే అచ్చుకు, నాలుగో గణం మొదటి అక్షరం “నొ” లో గల ‘ఒ’ అనే అచ్చుకు చెల్లింది. రెండో పాదంలో 1-4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లలేదు. కాబట్టి ప్రాసయతిని కవి పాటించాడు. 1వ గణం ప్రాసాక్షరమైన ‘డ’, నాలుగో గణం ప్రాసాక్షరమైన ‘డ’ లకు ప్రాసయతి సరిపోయింది. (చూడ – జాడ)

3. ద్విపద
జవాబు:
ద్విపద ఛందస్సు దేశి కవిత్వానికి చెందినది. ‘ద్వి – పద’ అంటే రెండు పాదాలు అని అర్థం. అంటే దీనిలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. ప్రతి పాదంలో మూడు ఇంద్ర గణాలు, తరువాత ఒక సూర్యగణం ఉంటాయి. 1-3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీద్విపద అని. అంటారు. శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను ‘మంజరీ ద్విపద’లో రాశాడు.
AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions 3
యతి మైత్రి : మొదటి పాదంలో ‘తు – దు’ లకు పాటించబడింది.
రెండో పాదంలో ‘వ-‘వా’ లకు పాటించబడింది.

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. శార్దూలంలోని గణాలు ఏవి ?
జవాబు:
మ, స, జ, స, త, త, గ.

2. సూర్య గణాలేవి ?
జవాబు:
నగణము, హగణము.

3. యతి అంటే ఏమిటి ?
జవాబు:
పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటాము.

4. మత్తేభంలో యతిస్థానం ఏది ?
జవాబు:
14వ అక్షరము.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

5. చంపకమాలలో ఎన్ని అక్షరాలుంటాయి ?
జవాబు:
21 అక్షరాలు.

6. కంద పద్యంలో ఆరవ గణంగా ఏ గణం వస్తుంది ?
జవాబు:
జగణం గాని ‘నల’ గాని వస్తుంది.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఉత్ప్రేక్ష
జవాబు:
ఉత్ప్రేక్ష
జవాబు:
ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లైతే. అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ :
1. ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను. ఇక్కడ చీకటి నలుపు. దృష్టి నిరోధకం. పొగ నలుపు. దృష్టి నిరోధకం. కాబట్టి ఈ సమాన ధర్మాలవల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకొన్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
2. ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది.
3. ఆమె ముఖము పద్మమేమో – అను వాటిల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.

2. లాటానుప్రాస
జవాబు:
లాటానుప్రాస
అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదం కలిగిన పదాలు వెనువెంటనే వస్తే అది లాటాను ప్రాసాలంకారం. అర్థం అంటే పదానికి ఉన్న సామాన్యమైన అర్థం. తాత్పర్యం అంటే ఆ పదానికి సందర్భానుసారంగా మనం విశేషంగా తీసుకొనే అర్థం. ఈ క్రింది ఉదాహరణలను చూడండి.
‘అమ్మ చూపించే ప్రేమ ప్రేమ
మొదటి వాక్యంలో ‘ప్రేమ’ అనే మాట రెండు సార్లు వచ్చినప్పటికీ, మొదటిసారి వచ్చిన ప్రేమ అనే మాటకు ‘ప్రేమ, వాత్సల్యం’ అని అర్థాలు. అదే పదం వెనువెంటనే వచ్చినప్పటికీ, దాన్ని మనం ‘నిజమైన ప్రేమ’ అనే తాత్పర్యాన్ని తీసుకుంటాం. ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థం వేరు, తాత్పర్యం వేరు. దీన్నే మనం లాటానుప్రాసం అని పిలుస్తున్నాం. మరికొన్ని ఉదాహరణలు :
కమలాక్షు నర్చించు కరములు కరములు శ
్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
………. ……… ………. ………..
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి ! హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి !

3. అతిశయోక్తి
జవాబు:
అతిశయోక్తి
ఒక వస్తువు యొక్క స్థితిని, గుణాన్ని లేదా స్వభావాన్ని ఉన్నదాని కంటే ఎక్కువగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం.

ఉదాహరణ : ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగంలో కవయిత్రి మొల్ల ఒక చక్కని అతిశయోక్తిని ప్రయోగించింది. సీతాదేవి కోరిక మేరకు హనుమంతుడు తన చిన్న వానర దేహాన్ని విపరీతంగా పెంచిన సందర్భంలోనిది ఈ పద్యం.

చుక్కలు తలపూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదమునొందె నాత్మ స్థితికిన్
నక్షత్రాలే తన `తలపూవులగునట్లుగా, ఆకాశవీధిలో ఆశ్చర్యంగొలిపే విధంగా తన శరీరాన్ని పెద్దది చేసి సీతాదేవికి ఆనందం కలుగజేశాడు హనుమంతుడు. ఇది అతిశయోక్తి అలంకారం.
1. ఆలయగోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
2. మా వీధిలో ఒకాయన తాటిచెట్టంత పొడవు.

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. ఉపమానం అంటే ఏమిటి ?
జవాబు:
ఉపమేయాన్ని పోల్చటానికి తీసుకొనే వస్తువు ఉపమానము.

2. వృత్త్యనుప్రాసకు ఒక ఉదాహరణను వ్రాయండి.
జవాబు:
చిటపట చినుకులు పటపట కురిసెను.

3. ఊహ ప్రధానంగా ఉండే అలంకారమేది ?
జవాబు:
ఉత్ప్రేక్ష.

AP Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

4. సంసార సాగరం – దీనిలో అలంకారమేది ?
జవాబు:
రూపకాలంకారము.

5. అలంకారాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
అలంకారాలు రెండు రకాలు.
అవి :
1) అర్థాలంకారాలు
2) శబ్దాలంకారాలు.

6. అర్థాలంకారమంటే ఏమిటి ?
జవాబు:
అర్థం ప్రాధాన్యం గల అలంకారాన్ని అర్థాలంకారం అంటారు.

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ఆదిమ కాలం నుంచి తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ ఆదిమ సంస్కృతిని పాటించేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరలు, జాతాపులు, చెంచులు, తొదలు, భగతలు మొదలైన వారు మన దేశంలో నివసిస్తున్న కొన్ని గిరిజన సమూహాలు. గిరులపై జీవిస్తున్నందు వల్ల వీరిని గిరిజనులు అని పిలుస్తారు. వీరీని హిందీలో ‘ఆదివాసి’ లేదా ‘జన్ జాతి’ అనీ, ‘ఆంగ్లంలో ‘ట్రైబ్’ అని పిలుస్తారు. సాధారణంగా వీరు నాగరికులకు దూరంగా నివసిస్తుంటారు. లిపిలేని భాషను మాట్లాడుతారు. వీరు పోడు వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తుల్ని సేకరించి జీవనాన్ని సాగిస్తారు. ఆదివాసీల జీవితంలో మరొక ప్రధాన వృత్తి వేట. గిరిజనుల ‘ జీవన విధానంలో నమ్మకాలు, జంతుబలులు ప్రధానపాత్ర వహిస్తాయి. ఆటలు, పాటలు, సామూహిక నృత్యాలు వీరి జీవితంలో ఒక భాగం.
జవాబు:
కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ తమ సంస్కృతిని రక్షించుకునేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరలు మొదలగు గిరిజన సమూహాలవారు మనదేశంలో ఉన్నారు. కొండలపై నివసించటం చేత గిరిజనులన్నారు. వీరిని హిందీలో ఆదివాసి, ఆంగ్లంలో ‘ట్రైబ్స్’ అని పీలుస్తారు. నాగరికులకు దూరంగా ఉండి లిపి లేని భాషను మాట్లాడతారు. వీరి ప్రధాన వృత్తి వేట. పోడు వ్యవసాయం చేస్తుంటారు. వీరి జీవనంలో జంతుబలులు ప్రధానపాత్రను పోషిస్తాయి. ఆటలు ‘పాటలు’ సామూహిక నృత్యాలు వీరికి తెలుసు.

Leave a Comment