TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 8 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. సీ॥ వేమన్న మా తాత వేదవేద్యులు మాకు
సుమతి మా పెదతల్లి సురవినోది
వీరబ్రహ్మముగారు వినుడి నా జనకుండు
నింపుగా మాయక్క ఈశ్వరమ్మ.
ననువుగా సిద్ధప్ప నన్న గావలె నాకు
కడగొట్టు మాయన్న కాళిదాసు
అమరసింహుడు మాకు నాత్మబంధువులోను
యాగంటివారు మాయన్న గారు

తే.గీ॥ ఆత్మబంధువులండి మా కంత వీరు
చచ్చిన బ్రతికియున్నారు జగతి యందు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
జవాబు:
ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప సిద్దప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
వేదవేద్యులు = వేదాలు తెలిసిన
వేమన్న = వేమన శతకకర్త
మా తాత = మాకు తాత వంటి వాడు
సురవినోది = సురలకు వినోదాన్ని కలిగించే వాడు
సుమతి = సుమతి శతకకర్త బద్దెన
మా పెదతల్లి = మా పెద్ద అమ్మ వంటి వాడు
వీరబ్రహ్మమగారు = కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మం గారు
వినుడి = వినండి
నా జనకుండును = నాకు తండ్రి వంటి వారు
ఇంపుగా = ఇష్టంతో
మా + అక్క = అక్కలాంటిది
ఈశ్వరమ్మ = ఈశ్వరమ్మ
అనువుగా = అనుకూలంగా
సిద్ధప్ప = బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధప్ప
అన్న గావలె నాకు = అన్న లాంటి వాడు
కడగొట్టు = చిన్న
మా + అన్న = మా అన్న
కాళిదాసు = సంస్కృత కవి కాళిదాసు
అమరసింహుడు మాకున్ = అమర కోశం రాసిన అమర సింహుడు మాకు
ఆత్మ బంధువులౌను = ఆత్మ బంధువుల వంటి వారు
యాగంటివారు = యాగంటి అనే గొప్ప వారు
మా + అన్న గారు = అన్న వంటి వారు
మాకు అంత = వీరందరూ మాకు
ఆత్మబంధువులండి = ఆత్మ బంధువులు
వీరు = పైన చెప్పిన వారందరూ
చచ్చిన = చనిపోయి కూడా
జగతి యందు = ఈ భూమిపై
బ్రతికియున్నారు = (ప్రజల హృదయాలలో) జీవించే ఉన్నారు.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్దప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది.

బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. (వీరందరూ వరకవి సిద్ధప్పకు ఆదర్శప్రాయులని అర్థం)

2. మాయురె దుందుభీ! ప్రబల మైన కృపాధిషణన్ దరిద్రనా
రాయణ పక్షమై ధన పరత్వము రోయుచు ‘జమ్ము’ ‘తుంగ’ ల
త్యాయతవృత్తి బెంచి నిలయమ్ముగ బాకను గూర్చి స్వాదుపా
నీయము నిచ్చి త్రావగ జనించిన ప్రేమను చిందె దీగతిన్,
జవాబు:
ప్రతిపదార్థం :

మాయురె దుందుభీ ! = ఆహా దుందుభి !
ప్రబలమైన = బలమైన, అధికమైన
కృపాధిషణ = కరుణతో
దరిద్రనారాయణ పక్షమై = పేదల వైపు ఉండి
ధన పరత్వము = ధనమే ప్రధానమనే గుణాన్ని
రోయుచు = అసహ్యించుకుంటూ
జమ్ము, తుంగ ల = జనుమును, తుంగ అనే గడ్డిని
అతి + ఆయత వృత్తి = చాలా పొడుగ్గా
బెంచి = పెంచి
నిలయమ్ముగ = నివాసం
పాకను గూర్చి = గుడిసెను కట్టి
స్వాదు పానీయమును = తీయటి నీటిని
త్రావగ ఇచ్చి = తాగడానికి ఇచ్చి
జనించిన = పుట్టిన
ప్రేమను = ప్రేమతో
చిందు ఈ గతిన్ = ఈ విధంగా గంతులు వేస్తున్నావు

తాత్పర్యం : ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టి ఇచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని సమాజానికి కలిగిస్తుంది. పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో
కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్ లో ఎవరో కోటిమందిలో ఒకడు తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ. మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం. ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు.

అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే . తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. కోకిల శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు కోకిలను అడిగాడు.

నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదనే విషయం నాకు తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది.

మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిలకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తుంది.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు.

అందరూ సమానము అని చెప్పే కోకిల నుంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు. పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో కోకిలతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన. ఇలా కోకిలకు సమాజానికి సంబంధం ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు వివరించాడు.

ప్రశ్న 2.
‘ఆడపిల్లలంటెనే’ పాటలో కవి చిత్రించిన స్త్రీల శ్రమతత్త్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే లోకానికి చులకన భావం ఏర్పడిందని కవి నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని తెలపడం ప్రారంభించాడు. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడగమని స్త్రీలకు సూచించాడు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం′′ పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.

పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డా, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించినా, ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోసి ముసలితనం పొందితే దూరంగా ఉంచుతారని చెప్పాడు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావని చెప్తూ స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాల తేనెతుట్టె లాంటి వారని అన్నాడు. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతారని, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని విశ్లేషించాడు.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి.
జవాబు:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది.

ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి నక్క ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది. అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది . ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను.

నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు.

ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అననానికి ఇదే నిదర్శనం.

ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదోఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఉపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి. కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను.

సమయం చూసి నేను అరుస్తాను. నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 2.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కర రామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే.

తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు.

మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా. ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు: గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని.

కవిసమ్మేళనాలు, సారస్వత సభలను `నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు.

ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన “ ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.) అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు. తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాస్ ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు.

కాని ఆయన ఐదు వందలు మాత్రమే జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు. ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్క చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు.. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.

దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి. రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

ప్రశ్న 2.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ?
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు. అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు ‘తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

ప్రశ్న 3.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు.

ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్ మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు. రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు.

డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది – నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.

మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.

రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్డెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు. రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు.

పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది.

ఈ విషయాన్ని సురేశ్ బాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లో ని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

ప్రశ్న 1.
పారెదవు తాత్వికత నిశివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని
వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

ప్రశ్న 2.
ఎవరికుందే నీ పాట వినే తీరిక
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి
రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో . ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? అని కవి కోకిలను అడిగిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : నీ కమ్మని పాట వినే తీరిక ఎవరికి ఉంది ? అని అర్థం.
వ్యాఖ్య : ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

ప్రశ్న 3.
వొళ్లెంత వొంచిన పని వొడవదోయమ్మా
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఉడయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదని నిసార్ చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని పూర్తి కాదని అర్థం.
వ్యాఖ్య : స్త్రీలు ఒళ్ళు హూనం చేసుకునేలా పని చేసినా వారికి తీరిక లభించదు అని భావం.

TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 4.
దురితంబొనరించిట్ల తుదిఁ గీడు సుమీ
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి తన బాధ్యతను గుర్తుచేస్తున్న సందర్భంలోనిది. అర్థం : జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు మీకే కీడు కలుగుతుంది.
వివరణ : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.
వ్యాఖ్య : ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

ప్రశ్న 2.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫ్ను చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం : : ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.
వ్యాఖ్య : ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

ప్రశ్న 3.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో ‘ షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్ధించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.
వ్యాఖ్య : పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.

ప్రశ్న 4.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం : ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.
వ్యాఖ్య : పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
భరతవంశం గొప్పతనం తెలుపండి.
జవాబు:
భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం అనే ఆరు గుణాలకు ప్రసిద్ధి. ఆ భరత వంశంలో పుట్టిన వారందరూ పై సద్గుణాలు గలిగి కీర్తి పొందారు. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ సద్గుణాలయందు శ్రేష్టులు అనడంలో పాండురాజు ఔన్నత్యం తెలపడంతోపాటు ధృతరాష్ట్రుని ముందు కాళ్ళకి బంధం వేయడం కనిపిస్తుంది. నీ కుమారులు కూడా కీర్తి భారం వహించ జాలినవారు అవడం వల్ల యుద్ధం చేసి చెడ్డపేరు పొందకూడదు అనే సూచనా కనిపిస్తుంది.

ప్రశ్న 2.
పండరీనాథుడి గురించి రాయండి.
జవాబు:
భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం నాటివాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల. నియోగిశాఖకు చెందినవాడు. పండరీనాథరావు తల్లిదండ్రులు వేంకటాబిన్, గోపాలరావు.

శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే ఆయన గ్రంథాన్ని 1810, మే ఏడవ తేదీన శంకర జయంతి రోజు శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. కాని అది అలభ్యం. శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

ప్రశ్న 3.
బుద్ధిమంతులు ఎలా ఉంటారు ?
జవాబు:
డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్క పీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబట్టి బుద్ధిమంతులు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

ప్రశ్న 4.
జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?
జవాబు:
కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకలు, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు త్రాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఎలాంటి వారి సాంగత్యము వెంటనే మానుకోవాలి ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒక పొలం చూపించి యజమాని పన్నిన వలలో చిక్కుకునేల చేసింది. రక్షించమని వేడుకున్నా రక్షించలేదు. సాయంకాలమైనా తన మిత్రుడు ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ వచ్చి వలలో ఉన్న జింకను చూసింది. నేను ముందే హెచ్చరించినా నామాట వినక పోతివి. మంచివారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చేవాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు.

మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అని చెప్పింది. అది విన్న జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల.. సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోసపోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని నేను ఉహించలేదని చెప్పింది.

ప్రశ్న 2.
జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు ముద్ర ఎట్టిది ?
జవాబు:
బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి . పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో “తెలుగు జానపదగేయ సాహిత్యము” అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథం. ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు.

తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు.

ప్రశ్న 3.
‘సృజనాత్మకత’ ఎలా పెంపొందుతుంది ?
జవాబు:
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం అవసరం. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్త విషయాలపట్ల ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లోని భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

ప్రశ్న 4.
ఖజానా బిల్డింగ్లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.
జవాబు:
గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి.

ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
సుఖదుఃఖాలను ఒకే విధంగా చూసేదెవరు ?
జవాబు:
సుజ్ఞానులు

ప్రశ్న 2.
గంగను శిరస్సుపై ఎవరు ధరించారు ?
జవాబు:
శివుడు

ప్రశ్న 3.
తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?
జవాబు:
సీతాఫలాలను

ప్రశ్న 4.
కోకిల ఎలాంటి ఉత్తేజాన్నిస్తుంది ?
జవాబు:
జాతీయ గీతం వంటి

ప్రశ్న 5.
‘ఆడపిల్లలంటేనే’ పాఠ్యభాగం ఏ సంపుటి లోనిది ?
జవాబు:
నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి

ప్రశ్న 6.
తిక్కన రచనలు తెలుపండి.
జవాబు:
తిక్కన, ఆంధ్ర మహాభారతంలో విరాటపర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకూ ఆంధ్రీకరించాడు. ఇదికాక

  1. నిర్వచనోత్తర రామాయణం
  2. కృష్ణశతకం
  3. విజయసేనం
  4. కవివాగ్బంధం-మొదలైన రచనలు చేశాడు.

ప్రశ్న 7.
సగరుల భస్మం ఏ లోకంలో ఉంది ?
జవాబు:
పాతాళం

ప్రశ్న 8.
కుండలను చేసేది ఎవరు ?
జవాబు:
కుమ్మరి

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 2.
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది ?
జవాబు:
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఇచ్చింది.

ప్రశ్న 3.
సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
జవాబు:
నూతన ఆలోచనలకు.

ప్రశ్న 4.
బిరుదురాజు రామరాజు స్వగ్రామమేది ?.
జవాబు:
వరంగ్ జిల్లా దేవునూరు.

ప్రశ్న 5.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 6.
చిన్నయసూరి రాసిన లక్షణ గ్రంథమేది ?
జవాబు:
శబ్ద లక్షణ సంగ్రహం

ప్రశ్న 7.
“నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
జవాబు:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.

ప్రశ్న 8.
మొహర్రం పదవరోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి ?
జవాబు:
బీబీకా ఆలం, ఏనుగు అంబార్తీ లంగరు ఉత్సవాలు.

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి.

1. చంపకమాల
జవాబు:

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 8 with Solutions 1

2. ఆటవెలది
జవాబు:

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి..
  2. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
  4. ప్రాసయతిని పాటింపవచ్చును.
  5. ప్రాసనియమం ఉండదు.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 8 with Solutions 2
TS Inter 2nd Year Te Model Paper Set 8 with Solutions 3

3. శార్దూలము
జవాబు:

  1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.

TS Inter 2nd Year Te Model Paper Set 8 with Solutions 4

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 2.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ?.
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.

ప్రశ్న 3.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

  1. హ గణము (గలము)
  2. న గణము అనేవి.

ప్రశ్న 4.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 5.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

ప్రశ్న 6.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

ప్రశ్న 7.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ?
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

  1. వృత్తాలు
  2. జాతులు
  3. ఉపజాతులు.

ప్రశ్న 8.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. అంత్యానుప్రాస
జవాబు:
అంత్యానుప్రాస : ఒకే హల్లుగానీ, ఒకే పదంగానీ పాదం యొక్క అంతంలో గాని, పదం యొక్క అంతంలో గానీ, వాక్యం చివరలో గానీ వచ్చినట్లయితే దాన్ని ‘అంత్యానుప్రాస’ అంటారు.

ఉదాహరణలు :

1) బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదిలింది హరిణాలుగా
వివరణ : ఇందులో ‘గా’ అనే హల్లు, నాలుగు పాదాల చివర వచ్చింది. కాబట్టి, ఇది ‘అంత్యానుప్రాస’.

2) భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో.
ఇందులో, పై పాదాల చివరలో ‘న్నో’ అనే పదం, పునరావృతమయింది. (తిరిగి వచ్చింది)

2. అతిశయోక్తి అలంకార
జవాబు:
అతిశయోక్తి అలంకార లక్షణము : గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’. ఉన్నదాని కంటె అతిశయం చేసి చెప్పడమే, అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ : ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి.
ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం ‘అతిశయోక్తి’.

3. రూపకాలంకార
జవాబు:
రూపకాలంకార లక్షణము : ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది
‘రూపకాలంకారం’.
ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్” వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘ఉపమేయం’ అనగానేమి ?
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’)

TS Inter 2nd Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 2.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 3.
ఉపమాన, ఉపమేయములకు రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏ అలంకారం?
జవాబు:
రూపకాలంకారము.

ప్రశ్న 4.
‘అతిశయోక్తి’ అనగానేమి ?
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.

ప్రశ్న 5.
‘ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

ప్రశ్న 6.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

ప్రశ్న 7.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

ప్రశ్న 8.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

XV. ఈ కింది విషయాన్ని 3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్య లోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్ లోర్ గ్రంథాలు ప్రకటించినాను..
జవాబు:
సంక్షిప్తరూపం : హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించాను.

XVI.
(అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ. (1 × 5 = 5)
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని : నమస్తే సర్!
ప్రిన్సిపాల్ : నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని : సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్ : దరఖాస్తు తెచ్చావా ! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని : దరఖాస్తు ఇదిగో సర్! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్ : ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ? విద్యార్థిని : నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం. ప్రిన్సిపాల్ : అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని : అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి. ప్రిన్సిపాల్ : మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని : అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 2.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ?
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 3.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 4.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 5.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

Leave a Comment