AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 7 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. సతియును గుణవతియుఁ బ్రజా
వతియు ననువ్రతయునైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁ జూచునతి దు
ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁబరికింషన్.
జవాబు:
ప్రతిపదార్థం :
మతిన్ = బుద్ధితో
పరికింపన్ = ఆలోచించగా
సతియును = పతివ్రతా
గుణవతియున్ = గుణవంతురాలూ
ప్రజావతియున్ = సంతానవతీ
అనుప్రతియున్ + ఐన = అనుకూలవతీ అయిన
వనీతన్ = భార్య
అవజ్ఞా + అన్విత దృష్టి = తిరస్కార భావంతో
చూచు = చూసే
అతి దుర్మతికిన్ = మిక్కిలి దుర్మార్గుడికి
ఇహమున్ + పరమున్ = ఈ లోకంలోనూ, పరలోకంలోనూ
కలదు + ఎ = సుఖం ఉంటుందా ? (ఉండదని భావం)

తాత్పర్యం : ఓ రాజా ! బాగా ఆలోచిస్తే – పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టుడికి ఇహపరసుఖాలు ఉంటాయా ? (ఉండవని భావం) అటువంటి దుర్మార్గుడు బ్రతికి ఉన్నా, చచ్చినా సుఖపడలేడని తాత్పర్యం.

2. తమ్ముని గూడి పుణ్య గుణ ధాముఁడు, రాముఁడు వచ్చి మాల్యవం
తమ్మున సైన్య సంఘము ముదంబునఁ గొల్వఁగ నుండి, భూమిపై
మిమ్ములఁజూచి రండనుచు మేటి కపీంద్రులఁ బుచ్చి, యందు మొ
త్తమ్ముగ మమ్ముఁ గొందఱను దక్షిణ భాగము చూడఁ బంపుచున్.
జవాబు:
ప్రతిపదార్థము :
తమ్ముని = సోదరుడైన లక్ష్మణునితో
కూడి = కలిసి
పుణ్యగుణధాముడు = పుణ్యగుణములకు నిలయమైన
రాముడు = శ్రీరాముడు
వచ్చి = చేరి
మాల్యవంతమ్మున = మాల్యవంతము అను పర్వతముపై
సైన్య సంఘము = భటుల సమూహం
ముదంబునన్ = ఆనందంతో
కొల్వఁగన్ = సేవిస్తూ
ఉండి = ఉండగా
భూమిపై = భూభాగముపై
మిమ్ములన్ = మిమ్మల్ని
చూచి = వెదకి
రండ + అనుచు = రమ్మని
మేటి = వీరులైన
కపీంద్రులన్ = వానర శ్రేష్ఠులను
పుచ్చి = పంపి
అందు = ఆ వానరముల
మొత్తముగ = సమూహములోని
మమ్మున్ = మా వంటి వారిని
కొందఱను = కొందరిని
దక్షిణ భాగము = దక్షిణ దిక్కు వెంబడి
చూడన్ = వెదకుటకు
పంపుచున్ = పంపుతూ (ఇలా పలికాడు)

తాత్పర్యము : ఓ సీతాదేవీ ! సోదరుడైన లక్ష్మణునితో కలిసి పుణ్యగుణములు కలిగిన శ్రీరాముడు, మాల్యవంతము అనే పర్వతంపై తనను, సైన్యము సంతోషంతో సేవిస్తూ ఉండగా, నిన్ను ఇక్కడి భూభాగములో వెదికి చూచి రండని, శ్రేష్ఠులైన వానరములలో కొందరిని మావంటి వారిని ఈ దక్షిణ దిక్కు వైపు పంపుతూ ఇలా పలికాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. భట్టు రాయబారానికి వచ్చిన కారణాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ క్రీ.శ. 12వ శతాబ్దంలో జరిగిన ఒక చారిత్రక గాథ. ‘పల్నాటి వీరచరిత్ర’ నుంచి గ్రహించిన ప్రస్తుత పాఠ్యభాగం ‘శాంతి కాంక్ష’లో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు భట్టు రాయబారిగా వెళ్ళి సంధికోసం చేసిన చివరి ప్రయత్నం వర్ణించబడ్డది.

అనుగురాజు : అనుగురాజు గురజాలను రాజధానిగా చేసుకొని పల్నాటి రాజ్యాన్ని పాలించేవాడు. అతనికి మైలమాదేవి, విద్యలదేవి, భూరమాదేవి అని ముగ్గురు భార్యలు. అనుగురాజు వల్ల మైలమాదేవికి నలగాముడు, విద్యలదేవికి పెద్దమలిదేవుడు, పిన మలిదేవుడు, బాల మలిదేవుడు అనే ముగ్గురు, భూరమాదేవికి కామరాజు, నరసింగరాజు, ఘట్టిరాజు, పెరుమాళ్ళరాజు అనే నలుగురు కుమారులు జన్మించారు. ఈ ఎన మండుగురిలో నలగామరాజు పెద్దవాడు.

బ్రహ్మదేవుడు : అనుగురాజు మంత్రియైన దొడ్డనాయని కుమారుడే బ్రహ్మనాయుడు. అనుగురాజు పెద్దవాడైన నలగామునికి పట్టాభిషేకం చేశాడు. ఎనిమిది మంది అన్న దమ్ములూ ఐకమత్యంతో కలిసిమెలసి ఉండేటట్లు చూసే బాధ్యతను అనుగురాజు బ్రహ్మనాయనికి అప్పజెప్పాడు.

నలగామరాజు, మలిదేవరాజు : అనుగురాజు చేరదీసిన నాగమ్మ అనే స్త్రీ రాజ్య విషయాలలో జోక్యం చేసుకుంటూ నాయకురాలుగా ఎదిగింది. తనను లెక్కచేయని బ్రహ్మనాయుడి మీద ఆమె పగ పెంచుకుంది. నలగామునికి ప్రధానిగా బ్రహ్మనాయుడి వైభవాన్ని ఆమె సహించ లేకపోయింది. నలగామునికి లేనిపోనివి నూరిపోసింది. నాగమ్మ చెప్పుడు మాటలు నమ్మి నలగామరాజు తమ్ములైన మలిదేవాదులను చెరలో బంధించాడు. కుటుంబ కలహాలను నివారించటానికి మధ్యవర్తిత్వం చేసి రాజ్యాన్ని రెండుగా విభజించాడు. నలగాముని భాగానికి గురజాల రాజధాని, మలిదేవుని భాగానికి మాచర్ల రాజధాని.

నాగమ్మ : నలగామునికి నాగమ్మ మంత్రి, మలిదేవునికి బ్రహ్మనాయుడు మంత్రి. బ్రహ్మనాయుడికీ నాగమ్మకూ మధ్య పుట్టిన ఈర్ష్య అసూయలే పల్నాటి మత ద్వేషానికీ, యుద్ధానికీ దారితీశాయి. బ్రహ్మనాయుడి మంత్రిత్వంలో సిరిసంపదలతో తులతూగే మలిదేవుడి రాజ్యాన్ని చూసి నాగమ్మ ఓర్వలేకపోయింది. ఆమె ప్రేరణతోనే నలగామరాజు మలిదేవాదులను కోడిపందేల కోసం గురజాల పిలిపించాడు.

కోడిపందెం : బ్రహ్మనాయుడికీ, నాగమ్మకూ మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది. పందెంలో ఓడిపోయినవారు ఐదు సంవత్సరాలు వనవాసం చేయాలి. ఒప్పందం ప్రకారం మలిదేవాదులు వనవాసానికి వెళ్ళారు.

అలరాజు రాయబారం : ఇక రెండేళ్ళలో వనవాసం పూర్తికావస్తోంది. కనుక మలిదేవాదులు రాజ్యభాగం కోసం అలరాజును నలగామరాజు దగ్గరకు రామబారిగా పంపారు. రాయబారిగా వెళ్ళిన అలరాజు చంపబడ్డాడు.

భట్టు రాయబారం : అల్లుడైన అలరాజు చంపబడటంతో మలిదేవాదులు అగ్రహోద గ్రులయి యుద్ధానికి సిద్ధమయ్యారు. కార్యమపూడి (కారెంపూడి) యుద్ధభూమికి సైన్యంతో చేరుకున్నారు. సంధికోసం చివరి ప్రయత్నంగా నలగామరాజు దగ్గరకు భట్టును రాయబారిగా పంపించారు.

ముగింపు : ఇట్లా మలిదేవాదుల తరపున రాయబారిగా నలగామరాజు కొలువుకు వచ్చిన భట్టు యుద్ధం ఆపటం కోసం, సంధి కోసం ఎంతో ప్రయత్నించాడు.

2. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! పాఠం ద్వారా కవి వివరించిన వరకట్న దురాచారాన్ని
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ చే వ్రాయబడింది. ఇది మహిళలపై జరుగుతున్న గృహహింసలు, స్త్రీల వరకట్నపు చావులపై స్పందన. ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే కొత్త పెళ్ళికూతురు వరకట్న దురాచారానికి బలి అయింది. ఆ విషాద సంఘటనే ఈ పాటకు ప్రేరణ అయింది.

దేశంలో ఆడదాని కన్నా అడవిలో చెట్టుకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఆడ పిల్లలకు పెళ్ళి చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. వరకట్న దురాచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. కట్న పిశాచాలు జీవనం సాగిస్తున్న ఈ నరకంలాంటి సంఘంలో రాక్షసత్వం రాజ్యమేలుతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారుతున్నది. అడిగినంత కట్నం ఇవ్వలేదని, ఇచ్చినా లాంఛనాలు, అదనపు కట్నాలు ఆశించి అత్తింటివారు సాధింపులు పెడుతున్నారు. కొందరు దుర్భుద్ధితో కట్నం కోసం ఇంటికి వచ్చిన నవవధువులను కడతేర్చి ఇంకో పెళ్ళికి సిద్ధం చేస్తున్నారు. అత్త ఒకింటి కోడలే నన్న జ్ఞానం లేకుండా ఆడపిల్లలతో ఆటలాడుకుంటున్నారు.

పిశాచాల వంటి అత్తమామల ఆనందం కోసం నవ వధువులు ఆత్మ బలిదానాలు చేయవలసివస్తుంది. స్త్రీల జీవననాదం ఆర్తనాదమయ్యింది. వారి కళ్ళలో నీరు సెలయేరులై పారుతున్నాయి. స్త్రీలంతా ఈ వరకట్న దురాచారంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయాలి. ‘ స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు. మంచి మనసుతో ఆలోచన చేసి నవ వధువుల ఆత్మహత్యలను
ఆపవలసి వుంది.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. చాటుపద్యాలలో ప్రజా జీవనాన్ని వివరించండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటిలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.

చాటువు అంటే ప్రియమైన మాట అని అర్థం. కవులు సరదాగా చెప్పుకునే పద్యాలు. ఒక భోగిచేత సీత్కరింపబడినపుడో, ఒక లోభిచేత సత్కరింపబడినప్పుడో, అందమైన దృశ్యం కనిపించినపుడో, మనసు గాయపడినపుడో, హాస్యం లాస్యం చేసినపుడో ఇలా పలు సందర్భాలలో మనసు నుండి ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకు వచ్చే పద్యరూపం చాటువు.

చాటుపద్యాలలో ప్రజా జీవనానిదే ప్రథమస్థానం. ప్రజా జీవనాన్ని చాటువులలో చిత్రించిన మొనగాడు శ్రీనాథుడు. ఈయన ప్రౌఢదేవరాయలను దర్శించటానికి కన్నడ దేశానికి వెళ్ళాడు. ఆ ప్రభువు దర్శనం ఆలస్యమయినందుకు కన్నడ రాజ్యలక్ష్మిని
“కుల్లా యుంచితి కోక చుట్టితి దయలేదా నేను శ్రీనాథుడన్” అని తల్లి దయ కోసం ఈ చాటువును చెప్పాడు. దీనిలో ఆనాటి కన్నడ దేశాన ప్రజల వేషంతో పాటు భోజన విశేషం కూడా వ్రాయబడింది. అలాగే శ్రీనాథుడు పల్నాడు సందర్శనానికి వెళ్ళినపుడు అక్కడి -ప్రజల జీవనశైలిని, ఆహార అలవాట్లను వర్ణించాడు. “జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు తప్ప సన్నన్నము సున్న” అని చెప్పాడు.

పల్నాడు ప్రజలకు వరియన్నం తెలియదని దీనివలన తెలుస్తుంది. పల్నాటికి ‘రంభ’ వెళ్ళినా ఏకులే వడుకుతుందని, మన్మథుడు వెళ్ళినా జొన్నకూడు తినక తప్పదని తెలిపాడు. అలానే సామాన్య గ్రామ పురోహితుని ఇంటి పరిస్థితిని “దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మాసిన కుండలున్” అని వర్ణించాడు. పడమటి సీమ వ్యాపారుల వస్త్రాలను, మసి బుర్రలను, కలములను, చింతంబళులను, చెమట పట్టిన నీర్కావులను, భయంకరమైన గడ్డాల వర్ణించటమే కాకుండా “వస్తూ చూస్తిమి రోస్తిమి అంటూ ఆ భావాలకు యాసను కూడా కూర్చాడు.
శ్రీనాథుడు తాను దర్శించిన ప్రాంతాలలోని ఒక్కొక్క ప్రాంతపు వనితలను వారి సొగసును కులాసాగా వర్ణించాడు. చివరకు తమిళ స్త్రీలను వర్ణించిన చాటువులు కూడా మనకు లభిస్తున్నాయి.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

2. జాతీయోద్యమం అనగానేమి ? ఇది భారతదేశంలో ఏ విధంగా వ్యాపించింది ?
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటాము. ఆధునిక ప్రపంచ చరిత్రలో సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటాలు అనేక రూపాలలో జరిగాయి. సామ్రాజ్య వాదము జాతీయ వాదము అను ఈ రెండూ ఆధునిక భావాలే! 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆంగ్లేయులు సంస్థానాధీశుల అధికారాలను రద్దు చేశారు. సిక్కుల రాజ్యాన్ని .బలవంతంగా కలుపుకున్నారు. సైనికులలో చాలా తక్కువ స్థాయి ఉద్యోగాలలో భారతీయులు నియమించబడ్డారు. ఆవు కొవ్వును పంది కొవ్వును తూటాలకు వినియోగించారు. సిపాయిల తిరుగుబాటుకు బర్హంపూరు, బారకప్పూరు, మీరట్, ఢిల్లీ, కాన్పూరులు వేదికలయ్యాయి.

భారతదేశాన్ని ఒక మార్కెట్గా చేసే క్రమంలో ముడిపదార్థాలను కొల్లగొట్టటానికి సామ్రాజ్యవాదులు చేసిన ఆధునికీకరణంతో దేశంలో జాతీయ భావం వ్యాపించింది. ఉద్యోగాలు, పారిశ్రామిక సౌకర్యాలు, నీటి పారుదల సౌకర్యాలను కల్పించటం సామ్రాజ్య వాదుల ప్రయోజనాలు భారతీయ మేధావులను కలవరపరచాయి. గ్రామీణ ప్రాంతంలో దారిద్ర్యం తారాస్థాయికి చేరింది. కరువు కాటకాలు విజృంభించాయి. సంస్కరణ వాదులైన మరాఠీ బెంగాలీ మేధావులు బ్రిటీషువారి విధానాలను బాహాటంగా విమర్శించటం చేశారు. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్లు ‘ఇండియన్ అసోసియేషన్’ ను స్థాపించారు. ప్రభుత్వ చట్టాల మీద దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సయోధ్యను కుదర్చటానికి ఎ.ఓ. హ్యూమ్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించాడు. ఈ వేదికే చివరకు జాతీయోద్యమానికి కేంద్రంగా పనిచేసింది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. ‘గవేషణ’ నాటిక సారాంశాన్ని తెలపండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతన్ని యమలోకం తీసుకొని వెళుతుంటారు. మానవుడు తానింకా బ్రతికే ఉన్నానని ఎంత వాదించినా వినకుండా మృత్యుదూతలు న్యాయమూర్తికి అప్పగిస్తారు. న్యాయమూర్తి అతని జీవితపు కాగితాన్ని పరిశీలించి ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహిస్తాడు. తిరిగి భూలోకం వెళ్ళిపో ఇంకా 5 సంవత్సరాల ఆయష్షు ఉందని చెప్తాడు ధర్మమూర్తి. తిరిగి భూలోకం చేరుకున్న మానవునికి తన శరీరం కనబడలేదు. అప్పటికే బంధువులు కళేబరాన్ని దహనం చేశారు. ఈ శరీరం లేని ఆత్మతో ఎలా జీవించాలో అర్థంకాక తిరిగి ధర్మమూర్తి దగ్గరకు వెళదామని నిర్ణయించుకుంటాడు. తిరిగి మరో ప్రపంచపు సొరంగాల దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక నవ్వు వినబడుతుంది. ఎవరు ఎందుకు నవ్వుతున్నావని మానవుడు ఆ నవ్విన వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఎందుకొచ్చావని తిరిగి మానవుణ్ణి నవ్విన వ్యక్తి ప్రశ్నించగా తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు.

నవ్విన వ్యక్తి సానుభూతితో మానవునికి సహాయం చేయాలనుకుంటాడు. న్యాయమూర్తి దర్శనం కలిగిస్తాడు. ధర్మదేవత తిరిగి వచ్చిన మానవునికి పూర్ణ ఆయుర్ధాయం కలిగేలా వరం ఇస్తుంది. జన్మరాహిత్యాన్ని ఇవ్వలేను. కాని తిరిగి ఏదైనా శరీరంలో ప్రవేశించి బ్రతకమంటుంది. కాని మానవుడు తన 35 ఏళ్ళ జీవితంలో ఎలా ఉన్నాడో అలా ఉండే శరీరం ఎక్కడ లభిస్తుంది అని బాధపడతాడు. దేవతల మీద నమ్మకం లేకపోయినా ఫర్వాలేదు కాని మానవత్వం పై నమ్మకాన్ని వదులుకోవద్దని అయినా దేవతల వల్ల జరిగిన పొరపాటుని నేనే ధర్మదేవతను క్షమించమని కోరుతున్నానని మానవుని చేతులు పట్టుకుంటుంది.

ఈ అల్ప మానవులు దేవతలను క్షమించటమా అంతమాట అనవద్దని మానవుడు తిరిగి భూలోకానికి వెళ్ళిపోతానని సెలవు తీసుకుంటాడు. తనకు తనలాగా బ్రతికే అవకాశం లేనప్పుడు ఏ బ్రతుకైతేనేం ? అని కొత్త జీవితాన్ని ప్రారంభించాలను కుంటాడు. తనని ఓ అమ్మ కడుపులో పడేయమని ప్రార్థిస్తాడు. నేను తిరిగి సృష్టించలేనని ధర్మదేవత భూలోకంలో ఇప్పుడే ఒక అమ్మాయి ప్రసవించింది. శిశువు మృతుడయ్యాడు. ఆ శిశువులో నీ ఆత్మని ప్రవేశపెట్టుకో. నీకు పూర్ణ ఆయుర్ధాయం ఇస్తున్నానని చెప్పింది. మానవుడు ఆ వైద్యశాల చేరుకొని శిశువు శరీరంలో ప్రవేశించాడు. అంతవరకు అష్టకష్టాలు పడ్డ వైద్యులు శిశువు క్యారు మనడంతో ఊపిరి పీల్చుకున్నారు. మృత శిశువని ఏడ్చిన తల్లి ఆనందంతో బిడ్డను చూసుకుంది.

2. ‘తెరచిన కళ్ళు’ నాటిక ద్వారా రచయిత అందించిన సందేశం వివరించండి.
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.

విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు.. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.

ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయపడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన ‘విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు . అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధ పడతాడు. ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్కి. విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.

చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొందమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. · విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే ‘నాకీ అవస్థ వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.

“భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే డాక్టర్కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినందించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు. డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.

3. ‘ఆశ ఖరీదు అణా’ లో కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
కృష్ణవేణి ఈ నాటికలో మధ్యతరగతి అమ్మాయి. ఇంటిని పోషించడం కోసం ఉద్యోగం చేస్తుంటుంది. తల్లి, అన్నయ్యలను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది. తెల్లారి లేస్తూనే ఇంట్లో చాకిరీ, తరువాత ఆఫీసులో పని, తిరిగి ఇంటికి వచ్చాక వంట మొదలైన పనులతో నిరంతరం విసుగు లేకుండా పనిచేస్తూ ఉంటుంది.
ధైర్య సాహసాలు గల వ్యక్తిగా కనబడినా ఎక్కడో ఆడపిల్లనని గుర్తుచేసే సందర్భాల వల్ల కొంత బెరుకుతనం గల స్త్రీమూర్తి.

మేడమీద అద్దెకు దిగిన వ్యక్తి మీరేనా అంటూ పరిచయం చేసుకుంటుంది. గోడకు మేకులు కొట్టి మాకు నిద్రాభంగం కలిగించారని నిర్మొహమాటంగా చెప్తుంది. ఇంటిగలాయన మేకులు కొడితే ఊరుకోడు. బంగారు గోడలు పాడయిపోతాయని బాధ పడతాడని అంటుంది. చల్లగాలికి ఆహ్లాదంగా సినిమాకు వెళ్ళితే బాగుంటుందని మనసులో మాట బయటకే అనేస్తుంది. పాటలంటే మీకు ఇష్టమా ? అయితే మా ఇందిర బాగా పాడుతుందని యువకునితో అంటుంది. గల్లీలో ఎవరో పోయిన సందర్భంలో శవాలంటే భయం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పేరు అడగలేదని యువకుడు అనుకుంటూ అంత ధైర్యంలోనూ పిరికితనం ఇదే మానవ నైజం అని అనుకుంటాడు.

పై గదిలో అద్దెకు వచ్చిన అబ్బాయి పేరేమిటని అన్నయ్యను అడుగుతుంది. అందుకు అన్నయ్య విసుక్కుంటాడు. పనిపాట లేక వాళ్ళ పేరేమిటి ? వీళ్ళ పేరేమిటి అని ఇటువంటి ఆలోచనలు ఎందుకు. తనకే గనక ఉద్యోగం దొరికితే ముందు చెల్లెల్ని ఉద్యోగం మానిపించేస్తానని అంటాడు. అందుకు చాలా బాధపడుతుంది.

నా ఉద్యోగం మానిపించేంత వరకు నీకు మనశ్శాంతి ఉండదా ? ఏం మనుషులో ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నా సహించలేరు. అదంతా అభిమానమే అనుకుంటారు. అంత ప్రేమలేక పోయినా కాస్త సుఖపడేదాన్ని అని బాధపడుతుంది కృష్ణవేణి. నిద్రపట్టక కృష్ణవేణి ఇందిర, ఆనందలక్ష్మిల ఇంటికి వస్తుంది. ఇంత రాత్రివేళ వచ్చావేంటి అంటుంది ఇందిర. పగలంతా ఆఫీసులో పని. ఇంట్లో మళ్ళీ వండి వార్చినా నీకు నిద్ర రాకపోవటం ఏమిటి అని లక్ష్మీ అడుగుతుంది. మా అన్నయ్య రెండు వందల ఏళ్ళ క్రిందట పుట్టవలసినవాడు. వాడికి ఉద్యోగం దొరకటం లేదన్న కసితో నా ఉద్యోగాన్ని మానిపించేయాలని అంటూ ఉంటాడు. నా జీతం మీద ప్రేమే మళ్ళీ. ఎంత అభిమానంగా చేసినా ఈ మాటలు పడలేకపోతున్నాను. ఎంతకాలం మాటలు పడను చెప్పు. ఎవరి కోసం, ఎందుకోసం. ఈ త్యాగం అని స్నేహితురాళ్ళతో తన బాధనంతటినీ చెప్పుకుంటుంది. జీవితంపై విరక్తిని పెంచుకొని నిరాశలో బ్రతుకుతుంది. చివరకు తాతగారి ఉపదేశం వల్ల మళ్లీ కొత్త ఆశలతో ధైర్యంగా తన పని ఏదో తాను చేసుకోగలుగుతుంది కృష్ణవేణి.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

4. ‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను వివరించండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు.

న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా? చచ్చినట్లా ? అని తన ఆవేదనను సందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు.

శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు. ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించ మని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. జీవులకు హృద్యంబె కడున్ శీతమే!
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది. సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంతుడికి కుమారుని కౌగిలిలోని అనురాగాన్ని ఆస్వాదించమని చెబుతూ శకుంతల పలికిన సందర్భంలోనిది.
భావం : పుత్రుణ్ణి కౌగిలిలోని ఆనందంకంటే మనుషులకు మనోహరం, చల్లదనం ఏమి ఉంటుందని భావం.
వ్యాఖ్య : తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుకు శకుంతల ఎన్నో ధర్మాలను వివరించింది. ఒక్కసారి పుత్రుణ్ణి కౌగిలించుకొని అందులోని ఆనందాన్ని ఆస్వాదించమని కోరింది. కొడుకు కౌగిలిని మించి మనుషులకు మనోహరమైనది, చల్లదనాన్ని ఇచ్చేది మరొకటి లేదని శకుంతల వివరించింది.

2. చెప్పంగ నలవియే శివునకునైన.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు పారతంత్ర్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వివరించడం శివుడి తరం కూడా కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! యుద్ధం వల్ల అన్నీ అనర్థాలే. బలం, ధనం నశిస్తాయి. కీర్తి పరాక్రమాలు నాశనమౌతాయి. రాజ్యం శత్రురాజుల అధీనంలోకి వెడుతుంది. శత్రువులు పాలనలో ప్రజలు పడే కష్టాలను వర్ణించటం శివుడి తరం కూడా కాదు అంటూ కలహం వల్ల కలిగే కష్టాలను గురించి రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు వివరించాడు.

3. వసుధాస్థలి వర్థిల్లు బ్రహ్మకల్పమున్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : హనుమంతుడు తనకు చేసిన ఉపకారానికి బదులుగా, సీత హనుమంతుడిని చిరంజీవిగా వర్థిల్లమని ఆశీర్వదించి దీవిస్తూ హనుమంతునితో పలికిన పలుకులివి.
భావం : శ్రీరాముని యోగక్షేమాలను తెలియజేస్తూ, భర్త శ్రీరాముని రత్నపుటుంగరాన్ని తెచ్చి యిచ్చిన హనుమంతుడిని వాత్సల్యంతో ఈ భూమి మీద మరణం లేకుండా చిరకాలం బ్రహ్మకల్పముల పర్యంతము జీవించుమని సీత దీవెనలిచ్చినదని భావం.

4. నీ వొక పట్టమేలే రాజువట.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి- నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు గుడిలో రాజును నిలదీస్తూ కన్యక పలికిన సందర్భంలోవి.
భావం : రక్షించవలసిన నీవే చెరపట్టాలనుకున్నావు. నువ్వూ ఒక రాజువేనా ! అని
వ్యాఖ్య : కన్యక గుడిలో దుర్గామాతను పూజించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసింది. రాజును ఇట్లా నిలదీసింది. విటులు, దొంగలు కూడా పట్టపగలు నడివీధిలో ఒక స్త్రీని పట్టుకోరు కదా ! అటువంటిది నువ్వు చెరపట్టటానికి ప్రయత్నించావు. నువ్వూ ఒక రాజువేనా ! అని కన్యక రాజును నిలదీసింది.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. సత్య వాక్యం వేటికంటే గొప్పది ?
జవాబు:
నూరు మంచినీటి బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమంది కంటే ఒక సత్యవాక్యం మేలైనది. అంతేకాక ఒక త్రాసులో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉంచి తూచగా ముల్లు సత్యంవైపే మొగ్గుచూపుతుంది. తీర్థాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటంకానీ సత్యవ్రతానికి సాటిరావు. అందువల్లనే ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

2. సీతాదేవి హనుమంతుని ఏమని దీవించింది ?
జవాబు:
సీతాదేవికి నమ్మకము కలిగించుట కొరకు హనుమ తన నిజ స్వరూపమును చూపించి, మరల సూక్ష్మరూపము ధరించి నమస్కరించి నిలబడగా, సీతాదేవి హనుమంతునికి తన. శిరోరత్నమును ఇచ్చి ఇలా దీవెనలు పలికినది.
సూర్యవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు శ్రీరాముని యోగక్షేమాలను నీ వలన తెలుసుకొన్నాను.
నేను అనేక విధాలుగా ఇక్కడ పడుతున్న కష్టాలను నీ ద్వారా ఆయనకు తెలుపుకో గలిగాను. నీ సహాయానికి తగిన విధంగా నేను ఏమి ఇవ్వగలను ? నీవు ఈ భూమండలము నందు బ్రహ్మకల్పముల పర్యంతము చిరంజీవిగా వర్థిల్లు ! అని దీవించెను.

3. మనిషి జీవితం వస్తువులా ఎలా మారిపోయింది ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడకు పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. నేటి కాలంలో మనిషి జీవితం ఒక వస్తువులా మారిపోయిందని అద్దేపల్లి వారు ఆవేదన చెందారు.

ప్రపంచదేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. ప్రతి రోజూ ఎన్నో వస్తువులు విదేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. వీటి వలన మన సంస్కృతి సంపద, సొంతముద్రలు చెరిగిపోతున్నాయి. మనం స్వదేశీ ఉత్పత్తులను వదిలేసి విదేశీ వస్తువుల మోజులో టి.వి., ఏ.సి. మొదలగు వస్తువులపై శ్రద్ధపెడుతున్నాము. విదేశీ వస్తువులను ఆదరించినట్లుగా స్వదేశీ వస్తువులను ఆదరించటం లేదు. పూర్వం మనవారు అవసరమైన వస్తువులనే కొనేవారు. ఇప్పుడు తన స్థాయిని సంఘంలో పెంచుకోవాలన్న తాపత్రయంతో విదేశీ వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా హోదా కోసం కొంటున్నారు. ఆ వస్తువులు తమ ఇంట్లో లేకపోతే పరువుపోతుందన్న భావనతో నేటి మనిషి ఉంటున్నాడు. ఇలా మనిషి జీవితం వస్తువులా మారిపోయే ప్రమాదం ఉందని అద్దేపల్లి వారు భావించారు.

4. కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి ?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.

ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులు పోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయేమోనన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి భావితరాలకుండకూడదని, జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. గ్రామ సమూహ మాన్యమును వివరించండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడింది. ఇది ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వము అను సంపుటం నుండి గ్రహించబడింది.
పూర్వము తెలుగుదేశంలో ప్రతి గ్రామములోను ‘గ్రామ సమూహ మాన్యం’ అని ఒక మాన్యం ఉండేది. అది గ్రామంలోని వారందరి సొత్తు. దానిమీద వచ్చు ఆదాయం గ్రామంలోని వారందరి ప్రయోజనాల కోసం వినియోగించేవారు. గ్రామానికి వచ్చి పోయే కళాకారులకు, భాగవత మేళాలకు, తోలుబొమ్మల వారికి వేడుకలను వినోదాలను అందించే కళాకారులకు పంచేవారు. అలా పంచటాన్ని ‘వర్తన’ అని’ అనేవారు. అదే చివరకు ‘వతన’గా మారింది. విద్యావంతులకు ఆటపాటలవారికి ఈ వతనను ‘గ్రామ సమూహ మాన్యము’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచటం ఒక రివాజుగా మారింది.

2. శ్రీనాథుని చాటుపద్య చమత్కృతిని వివరించండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటుపద్యాలను చెప్పిన ప్రాచీనాంధ్ర కవులలో వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ, అడిదము సూరకవి ప్రముఖులు. చాటుపద్యాలలో ప్రజా జీవనాన్ని మూడుమూర్తుల చిత్రించిన మొనగాడు శ్రీనాథుడు. విజయనగర సామ్రాజ్యాధినేత ప్రౌఢ దేవరాయలను దర్శించటానికి వెళ్ళినపుడు శ్రీనాథునకు రాజదర్శనం ఆలస్య మైంది. అపుడు “కుల్లాయుంచితి కోక చుట్టితి దయలేదా నేను శ్రీనాథుడన్” అని ఒక చాటువును చెప్పాడు. దీనిలో కన్నడ దేశ ప్రజల వేషభాషలతో పాటు భోజన విశేషాలను కూడా వ్రాశాడు.

పల్నాడు వెళ్ళినపుడు అక్కడి ప్రజల ఆహార విశేషాలను తన చాటువు ద్వారా తెలియ జేశాడు. ‘జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు తప్ప సన్నన్నము సున్న’ అని స్పష్టంగా చెప్పాడు. ఆ పలనాడు సీమకు ‘రంభ’ వెళ్ళినా ఏకులే వడుకుతుంది, మన్మథుడు వెళ్ళినా జొన్నకూడే తినక తప్పదని వాస్తవాలను చక్కగా తన చాటువుల ద్వారా తెలియజేశాడు. నాటి ప్రజా జీవనశైలిని, ఆచార వ్యవహారాలను, బహు చమత్కారంతో వర్ణించాడు. అంతటితో ఆగక కులానికి ఒక స్త్రీని తీసుకొని కులాసాగా వర్ణించాడు. శ్రీనాథుని చాటువులు సాహితీపరులకు విందునిచ్చాయి.

3. అహింసను గురించి వేమన అభిప్రాయమేమిటి ?
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసము నకు సంక్షిప్తరూపము.
అహింస వేమనకు ఆరో ప్రాణం. ఒక జీవిని మరొక జీవి చంపటం ధర్మం కాదన్నాడు.
జీవి జీవిఁజంప శివుని జంంపుటె యగు
తెలియ శివుఁడె కాఁడె అంటాడు.

అలాగే పూర్వం యజ్ఞయాగాదుల యందు జరుగు బలులు హింస కాదని సమాజంలోకి ఎక్కించారు. అది హింస కాక మరి ఏమౌతుందని వేమన వాదన. వేమనకు హింస మాత్రమే కాదు తన శత్రువును హింసించటానికి కూడా ఇష్టపడడు.
చంపఁదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
చంపదగిన శత్రువు మనచేతికి చిక్కినా వానికి కీడు చేయకూడదు. మనకు చేతనైన సహాయం చేసి వదిలిపెట్టటం కన్నా మేలు ధర్మములు ఏమీ ఉండవని వేమన భావన.

4. చిలకమర్తి తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించిబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. బ్రిటీషువారు భారతీయులను ఎలా దోపిడీ చేస్తున్నారో “భరత ఖండంబు చక్కని పాడియావు” అన్న పద్యం ద్వారా వివరించారు. బ్రిటీషు ప్రభుత్వం ప్రజలపై విధించే వివిధ పన్నులను గురించి కూడా వివరించారు.

నేల దున్నటానికి జాలతరము పన్ను, నీటికోసం నీటి పన్ను, వ్యాపారం చేస్తే రాబడి మీద పన్ను, సరుకులు అమ్ముకుంటే సంత పన్ను, కట్టెలు అమ్ముకుంటే దానిపై మరొక పన్ను, పట్టణాలలో మునిసిపాలిటీ పన్ను, పారిపోదామంటే బండి హాసీల్పన్ను, ఇంటిని అమ్ముకుందామంటే స్టాంపు పన్ను, తృప్తిగా తిందామంటే ఉప్పు పన్ను ఇలా ఎన్నో విధాలుగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలను పన్నుల బాధతో పీడించేదని చిలకమర్తి వారు వివరించారు.

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. నన్నయకు గల బిరుదులేవి ?
జవాబు:
ఆదికవి, శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు.

2. నాయకురాలిగా ప్రసిద్ధి పొందింది ఎవరు ?
జవాబు:
నాగమ్మ.

3. శ్రీరాముడు ఉన్న పర్వతం పేరేమిటి ?
జవాబు:
మాల్యవంతము.

4. గురజాడ వ్రాసిన కొత్త ఛందస్సు పేరేమిటి ? –
జవాబు:
ముత్యాల సరాలు.

5. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో కలేకూరి ప్రసాద్ వ్రాసిన పాట ఏది ?
జవాబు:
భూమికి పచ్చాని రంగేసినట్టు.

6. బియ్యంలో రాళ్ళలా కన్పించేవి ఏవి ?
జవాబు:
తెలుగు భాషలో కలిసిన ఆంగ్ల పదాలు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. గుర్రపు స్వారీలో ఉద్దండుడైన వీరభద్రారెడ్డి సోదరుడు ఎవరు ?
జవాబు:
దొడ్డారెడ్డి.

2. అగస్త్య భ్రాత అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
మూర్ఖుడని అర్థం.

3. చాటువు అంటే ఏమిటి ?
జవాబు:
ప్రియమైన మాట.

4. రఘువంశాన్ని సంస్కృతంలో ఎవరు వ్రాశారు ?
జవాబు:
కాళిదాసు.

5. కాంతం కథల రచయిత ఎవరు ?
జవాబు:
ముని మాణిక్యం నరసింహారావు.

6. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది ?
జవాబు:
1905లో జరిగింది.

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి బదులుగా వాడబడు పదాన్ని సర్వనామం అంటారు.

2. విశేషణానికి ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
నలుపు, పొట్టి, గొప్ప

3. అవ్యయానికి ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
ఆహా, ఓహో..

4. క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని సూచించే పదాన్ని క్రియ అంటారు.

5. నైలునది ప్రపంచంలో పొడవైన నది. నామవాచకాన్ని వ్రాయండి.
జవాబు:
నైలునది.

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. వాక్యానికి ఉండే లక్షణాలేమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి..

2. సామాన్య వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే సమాపక క్రియ కలిగియున్న వాక్యము.

3. నేను ఉదయాన్నే లేచి ఒక గంట సేపు చదువుతాను – ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.

4. వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
అర్థవంతమైన పదముల సమూహం.

5. ‘వాడు మంటల్ని నిప్పు చేత ఆర్పుతున్నాడు’ – దీనిలో దోషమేమిటి ?
జవాబు:యోగ్యత లోపించటం. నీటిచేత మంటలను ఆర్పుతాం కాని నిప్పుచేత కాదు కదా !

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. తేటగీతి
జవాబు:
తేటగీతి: తేటగీతి ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు ఉండాలి. ప్రతి పాదంలోను 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రాసనియమం లేదు. ప్రాసయతి పాటింపవచ్చును.
AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions 1
యతి మైత్రి : 1 – 4 గణాలు మొదటి అక్షరాలైన ‘ప’, ‘బా’ లకు సరిపోయింది.

2. శార్దూలం
జవాబు:
శార్దూలం: శార్దూలాన్ని ‘శార్దూల విక్రీడితం’ అని కూడా అంటారు. శార్దూలం అంటే పెద్దపులి అని అర్థం. ఈ ఛందస్సు నడక పెద్ద పులి అరుపులాగా రౌద్రంగా ఉంటుంది. అందువల్ల .దీనికాపేరు పెట్టారు. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి. ప్రతిపాదంలో మొత్తం 19 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1 – 13 అక్షరాలకు ఉంటుంది. ప్రాసనియమం ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions 2
యతి మైత్రి : 1వ అక్షరం ‘ఎ’ అనే అచ్చుకు, 13వ అక్షరం ‘నీ’ లో గల ‘ఈ’ అనే` అచ్చుకు చెల్లింది. దీనిని స్వరమైత్రి అంటారు.
ప్రాసాక్షరం : ‘న్న’ అనే అక్షరం. ద్విత్వ నకారం ప్రాసగా ఉంది.

3. చంపకమాల
జవాబు:
చంపకమాల అంటే సంపెంగ పూలమాల అని అర్థం. ఈ పద్యం అంత హృదయంగమంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు.
లక్షణాలు : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటే ఎక్కువ పాదాలు రాస్తే దానిని చంపకమాలిక అంటారు) ప్రతి పాదంలోను వరుసగా ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. · ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే అన్ని పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions 3
యతి మైత్రి : 1-11 అక్షరాలైన ‘జ’ లోని అ కు ‘స’ లోని అ కు యతి పాటించారు.
ప్రాసాక్షరం : ‘న’ అనే హల్లు ప్రాసగా ఉంటుంది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 7 with Solutions

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. ఉత్పలమాలలో గణాలు ఏవి ?
జవాబు:
భ, ర, న, భ, భ, ర, వ.
2. మత్తేభంలో యతిస్థానం ఎంత ?
జవాబు:
14వ అక్షరం.

3. ఉపజాతులలో ఏ నియమం ఉండదు ?
జవాబు:
ప్రాస నియమం ఉండదు.

4. ఇంద్రగణములేవి ?
జవాబు:
నల, నగ, సల, భ, ర, త.

5. కందపద్యంలో వాడే గణాలేవి ?
జవాబు:
గగ, భ, జ, స, నల.

6. సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యాలు వ్రాస్తారు ?
జవాబు:
ఆటవెలది, తేటగీతి.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. వృత్త్యనుప్రాస
జవాబు:
ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం. ఇలా ఒకే హల్లు పలుమార్లు రావడాన్ని ‘ఆవృత్తి’ అంటారు. ఉదాహరణ : ‘విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు’
ఇందులో ‘ష్ణు’ అనే సంయుక్తాక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాస..
అలాగే
ఉదాహరణలు :
1) ‘కాలువలన్నియు గలగల పారెను’ (ల అనే హల్లు ఆవృత్తి అయ్యింది).
2) ‘చిటపట చినుకులు పటపట కురిసెను’! – ‘ట’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

2. ఉపమ
జవాబు:
ఉపమాలంకారాన్ని ఉపమానాలంకారం అని కూడా అంటారు. ఉపమ అంటే సామ్యం లేదా పోలిక అని అర్థం. ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైన పోలిక చెపితే అది ఉపమాలంకారం. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చడం. ఇందులో
నాలుగు భాగాలుంటాయి.
1. ఉపమేయం : మనం దేన్నయితే వర్ణిద్దామనుకుంటామో ఆ వస్తువు. అంటే. వర్ణింపబడే వస్తువు.
2. ఉపమానం : ఉపమేయాన్ని వర్ణించడానికి దేన్నయితే పోలికగా తీసుకొస్తామో అది ఉపమానం.
3. సమానధర్మం : పై రెండింటిలో అంటే ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మం లేదా గుణం సమాన ధర్మం.
4. ఉపమావాచకం : ఉపమేయ ఉపమానాల ధర్మ సామ్యాన్ని కలిపే అవ్యయ పదం.
ఉదాహరణ : వలె, పోలె, పట్టె, కైవడి, కరణి, భంగి, చూపె,
క్రియన్, లా/లాగ మొదలైనవి.
‘మా అమ్మ భూదేవిలా గొప్ప సహనవంతురాలు’

ఈ వాక్యంలో అమ్మ గురించి చెపుతున్నాం కాబట్టి అమ్మ ఉపమేయం. అమ్మని భూదేవితో పోలుస్తున్నాం కాబట్టి భూదేవి ఉపమానం. సహనం అనే విషయంలో చెప్తున్నాం కాబట్టి అది సమాన ధర్మం. (అమ్మలోనూ, భూదేవిలోనూ- ఇద్దరిలోనూ సహనం ఉంది కాబట్టి). ఉపమేయాన్ని, ఉపమానాన్ని అనుసంధానించడానికి వాడిన పదం – లా, ఇది ఉపమావాచకం. కాబట్టి ఇది ఉపమాలంకారం.
ఉంది.
ఈ పాఠ్యపుస్తకంలోని సత్య ప్రాశస్త్యములో ఈ క్రింది పద్యాలలో ఉపమాలంకారం
1. ‘విను గార్హపత్యమను నయ్యనలము ……….’
2. ‘తాన తననీడ నీళ్ళలో నేర్పడఁ జూచునట్లు ……….’

3. అతిశయోక్తి
జవాబు:
ఒక వస్తువు యొక్క స్థితిని, గుణాన్ని లేదా స్వభావాన్ని ఉన్నదాని కంటే ఎక్కువగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం. ఉదాహరణ : ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగంలో కవయిత్రి మొల్ల ఒక చక్కని అతిశయోక్తిని ప్రయోగించింది. సీతాదేవి కోరిక మేరకు హనుమంతుడు తన చిన్న వానర దేహాన్ని విపరీతంగా పెంచిన సందర్భంలోనిది ఈ పద్యం.
చుక్కలు తలపూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదమునొందె నాత్మ స్థితికిన్
నక్షత్రాలే తన తలపూవులగునట్లుగా, ఆకాశవీధిలో ఆశ్చర్యంగొలిపే విధంగా తన శరీరాన్ని పెద్దది చేసి సీతాదేవికి ఆనందం కలుగజేశాడు హనుమంతుడు. ఇది అతిశయోక్తి అలంకారం.
1) ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
2) మా వీధిలో ఒకాయన తాటిచెట్టంత పొడవు.

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. అలంకారాలు ఎన్ని రకాలు ?
జవాబు:
అర్థాలంకారాలు – శబ్దాలంకారాలు.

2. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ – ఇందులోని అలంకారమేది ?
జవాబు:
లాటానుప్రాసాలంకారము.

3. అంత్యానుప్రాసకు ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
పొలాల సన్నీ
హలాల దున్ని
ఇలా తలంలో హేమం పిండగ
జగాని కంతా సౌఖ్యం నిండగ.

4. సంసార సాగరం దీనిలో అలంకారమేది ?
జవాబు:
రూపకాలంకారం.

5. ఊహ ప్రధానంగా ఉండే అలంకారమేది ?
జవాబు:
ఉత్ప్రేక్షాలంకారం.

6. ఉపమేయం అంటే ఏమిటి ?
జవాబు:
వర్ణించబడే వస్తువు.

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ఆధునిక ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. .ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి కావలసిన హక్కును ప్రతి ప్రజాస్వామ్య దేశం తన పౌరులకు కల్పిస్తున్నది. ఈ హక్కునే ‘ఓటు హక్కు’ అంటారు. మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కావలసిన కనీస వయస్సు 18 సం.లు. మద్యము, కులము, మతము, ప్రాంతము వంటి వైయక్తిక అంశాలకూ, డబ్బు, బహుమానాలు లాంటి ఎన్నికల తాయిలాలకు లొంగిపోయి తన ఓటును అమ్ముకోకూడదు. సమర్థుడు, నీతిమంతుడు, కుల మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉన్న అభ్యర్థిని గెలిపించడానికి తమ అమూల్యమైన ఓటును వినియోగించు కోవాలి. ఒకవేళ అభ్యర్థు లెవరూ నచ్చకపోతే ‘నోటా’ మీటను నొక్కి రావాలి. అంతేగాని ఎన్నికల ప్రక్రియకు మన దేశ పౌరులు దూరంగా ఉండరాదు.
జవాబు:
నేడు ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఇష్టపడుతున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్య మనుగడకు కీలకం. ప్రజాస్వామ్యంలో పాలకులను ఎన్నుకోవటానికి ఓటు హక్కును కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు వేసే హక్కు ఉంటుంది. కుల, మత, ప్రాంత, డబ్బు, బహుమతులను లెక్కచేయకుండా ఓటు వెయ్యాలి. నీతిమంతుడిని, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిని, సమర్ధుణ్ణి ఎన్నుకోవాలి. అలాంటివారు లేకపోతే ఓటు వేసేటప్పుడు ‘నోటా’ మీటను నొక్కాలేగాని ఎన్నికలను బహిష్కరించరాదు.

Leave a Comment