TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 1 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. క్షీరోదక గతిఁ బాండవ
కౌరవు లొడఁగూడి మనికి కార్యం బది నీ
వారసి నడపుము వా రన
నీ రనఁ గురుముఖ్య ! నీకు వేఱుంగలదే ?
జవాబు:
ప్రతిపదార్థం :

కురుముఖ్య ! = కురువంశంలో ప్రధానమైనవాడా!
క్షీర + ఉదక గతిన్ = పాలూ, నీరు లాగ
పాండవ కౌరవులు = పాండవులు, కౌరవులు
ఒడన్ + కూడి = కలిసి మెలిసి
మనికి = జీవించటం
కార్యంబు = చేయదగ్గ పని
అది = దానిని
నీవు = నీవు
ఆరసి = పరిశీలించి
నడపుము = సాగించుము
నీకున్ = నీకు
వారు + అనన్ = పాండవులన
వీరు + అనన్ = కౌరవులు అనగా
వేఱుం + కలదే = భేదమున్నదా ? (లేదని అర్థం)

తాత్పర్యం : కురునాథా ! పాండవ కౌరవులు పాలూ నీరూ వలె కలసిమెలసి జీవించటం మంచిపని. వారు అట్లా ఒద్దికతో ఉండేటట్లు నీవు వారిని నడపించవలసి ఉంది. పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదభావన నీకు లేదు కదా !

2. సీ॥ నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప
బతుకమ్మవలె నీళ్ళబడును యెపుడొ
యుర్విలో నున్నాళ్ళు ఉయ్యాలలును బాడి
పొయ్యెద రొకరోజు శయ్యమీద
తల్లి యెవ్వరు తండ్రి తన బాంధవులెవరు
మళ్ళి జూడక నరుల్ మరుతురయ్య
వెళ్ళిపోయెడినాడు వెంట రాదొక కాసు
కల్ల సంసారంబు గానలేక

తే.గీ॥ పప్పు దినబోయి చిక్కాన బడిన యెలుక
విధము నర్ధంబు చేకూర్చు వివిధ గతుల
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్పు
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
జవాబు:
ప్రతిపదార్థం:

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటి
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
నమ్మరాదు +ఈ ఘటము = కుండ వంటి ఈ శరీరాన్ని నమ్మరాదు
నవరంధ్రముల కొంప = తొమ్మిది రంధ్రాలతో ఉన్న ఇల్లు
బతుకమ్మవలె = బతుకమ్మ లాగ
యెపుడొ = ఎప్పుడైనా
నీళ్ళబడును = నీటిలో పడుతుంది
యుర్విలోన్ + ఉన్నాళ్ళు = భూమిపై జీవించినంతకాలం
ఉయ్యాలలును బాడి = ఊయల పాటలు పాడి’
శయ్యమీద = మరణ శయ్యపై, పాడెపై
పొయ్యెదరు + ఒకరోజు = ఒకరోజు వెళ్లిపోతారు
తల్లి = కన్నతల్లి
తండ్రి = కన్నతండ్రి
యెవ్వరు = ఎవరు కూడా
తన బాంధవులెవరు = బంధువులు, చుట్టాలు ఎవరూ
మళ్ళి జూడక = తిరిగి చూడరు
నరుల్ = మనుషులు
మరుతురయ్య = మర్చిపోతారు
వెళ్ళిపోయెడినాడు = కాటికి వెళ్ళే రోజు
ఒక కాసు = ఒక్క కాసు కూడా
వెంట రాదు = తన వెంబడి రాదు
కల్ల సంసారంబు = సంసారం అంతా అబద్ధమని
గానలేక = తెలియక
పప్పు దినబోయి = పప్పును తినడానికి వెళ్లి
చిక్కాన బడిన = బోనులో చిక్కిన
యెలుక విధమున్ = ఎలుక లాగ
వివిధ గతుల = అనేక రకాలుగా
అర్ధంబు చేకూర్చు = (ఈ శరీరం) డబ్బును సంపాదిస్తుంది.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాని భూమిపై ఉన్నంతకాలం ఊయల పాటలు పాడి ఏదో ఒకరోజు మరణశయ్యపై వెళ్ళిపోతుంది. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసు కూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘గంగా ప్రవాహం’ ఎలా కొనసాగిందో తెలుపండి.
జవాబు:
భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను, శివున్ని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను తన తలపై భరిస్తానని శివుడు ఇచ్చిన మాట గంగకు కోపం తెప్పించింది. తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని గంగ భావించింది. గంగ గర్వాన్ని తొలగించాలని శివుడు అనుకున్నాడు. ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఈ విధంగా శివుని తలపై పడి శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. తమరు అనుగ్రహిస్తే ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్ప మేలు కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు గంగానదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది భాసురహ్లాదినీ, పావనీ, నందినీ, సీతా, సుచక్షు, సింధు, అనే ఆరుపాయలు తూర్పు, పడమరలకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి పాతాళానికి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అని అనగానే జహ్నుమహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. గంగ భగీరథుని రథం వెంబడి సముద్రం వైపు వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి, సగరపుత్రుల బూడిదకుప్పలు తడిసేవిధంగా ప్రవహించింది. దానితో సాగరులకు పాపములు పోయి దివ్యరూపాలు వచ్చాయి. వారు దేవతలలాగా విమానాలలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. అప్పటి నుండి గంగానది జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అనీ, భగీరథుని కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ఈ భూమిపై ప్రవహిస్తుంది.

ప్రశ్న2.
కోకిల స్వభావాన్ని వర్ణించండి.
జవాబు:
కోకిల గానం భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండె కరిగింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు కవి వంటి వాడికి తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతుంది. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసిన ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం పాడుతున్నావు. సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా? అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని కూడా అన్నాడు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న వారిని సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం కవికి తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతుంది. కాని మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని కోకిల సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు కోకిల అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన. దీనిలో కోకిల స్వభావాన్ని కవి కనపర్తి రామచంద్రాచార్యులు వర్ణించారు.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి.
జవాబు:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది. ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి నక్క ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది. అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను. నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదోఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఉపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి. కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను. నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో ! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.

ప్రశ్న2.
బిరుదురాజు రామరాజు సాహిత్య పరిశోధనలను తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు. బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభారక శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో

పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు నూరు మొదటి సారి సాహిత్య ప్రపంచానికి తెలియపరిచారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాలు ఈ కోవకు చెందినవే.

సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి : సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు. ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదారభాణం, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం (ఉ.వి. సంస్కృత అకాడమీ పక్షాన అర్యేంద్రశర్మగారి పేరుతో ప్రకటితం) పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు. తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి, సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు. ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు. ఇంటర్ దాకా చదివిన ఉర్దూ సార్ధకమయ్యే విధంగా ఉర్దూ తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు నుంచి, హిందీ నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్, పిహెచ్. పట్టాలు సంపాదించుకున్నారు.

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న1.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం.ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, ‘యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ?
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు: లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డబ్బులను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు. ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా. ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సీకి వెళ్ళాడు.

అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే. శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు. దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు. తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసు పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమే జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు. ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్క చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు. దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి. రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

ప్రశ్న 4.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ?
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు. కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు. చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభ మైనది.

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
దురితంబొనరించిట్ల తుదిఁ గీడు సుమీ
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయా శ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి తన బాధ్యతను గుర్తుచేస్తున్న సందర్భంలోనిది.
అర్థం : జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు మీకే కీడు కలుగుతుంది.
వివరణ : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

ప్రశ్న 2.
మముబెంచు తల్లివై మా పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం. అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.
వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

ప్రశ్న 3.
ఏ దేవుళ్లు నిన్ను వాహనం చేసుకొంటారు ?
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయం తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. అని సమాధానం చెప్పుకున్నాడు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని, చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను ఏ దేవుడు వాహనంగా అగీకరిస్తాదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్య అర్థం. వ్యాఖ్య : వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం అని భావం.

ప్రశ్న 4.
కట్నకానుకల పంటవయి నిండాలె
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : కట్నం అనే పంటతో ఇల్లంతా నింపాలని అర్థం.
వ్యాఖ్య : ఆడపిల్లలు ఎంత కట్నం తెచ్చినా ఇంకా కావాలని వేధిస్తారని భావం.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు. సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.
వ్యాఖ్య : దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 2.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.
వ్యాఖ్య : 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

ప్రశ్న 3.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం. వ్యాఖ్య : రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

ప్రశ్న 4.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు.
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : : బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం. వ్యాఖ్య : తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?
జవాబు:
కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

ప్రశ్న 2.
కోకిల పాట ఎలా అనిపిస్తుంది ? అది ఏం చేస్తున్నట్టుంది ?
జవాబు:
కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసే ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సంవత్సరం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు అనిపించిందని కోకిలను అడిగాడు.

ప్రశ్న 3.
సిద్దప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు ?
జవాబు:
వరకవి సిద్ధప్ప వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు అని చెప్పాడు. వీరందరూ వరకవి సిద్ధప్పకు ఆదర్శప్రాయులని సూచించాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 4.
కుటుంబ ప్రగతిలో స్త్రీ పాత్రను వివరించండి.
జవాబు:
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరిఎగిరి పడతాడు. తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. ఇలా కుటుంబ ప్రగతిలో స్త్రీపాత్ర కీలకం అని నిసార్ తెలిపాడు.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4))

ప్రశ్న 1.
ముసలి గద్దను చూసి బిడాలము ఏమనుకుంది ?
జవాబు:
భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్గవము అనే ఒక గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది “రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాల”ని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది.

ప్రశ్న 2.
తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.
జవాబు:
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు. అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

ప్రశ్న 3.
చిందుల ఎల్లమ్మ ప్రదర్శనలు, పురస్కారాలు తెలుపండి.
జవాబు:
చిందు ఎల్లమ్మ ఇచ్చిన ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో కొన్ని వేల ప్రదర్శనలిచ్చింది. ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది. 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్ జాతీయ ప్రదర్శన ఇచ్చింది.

ఎల్లమ్మ పొందిన అవార్డులు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో ‘కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది. 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది. 2004లో అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

ప్రశ్న 4.
బలమైన సంకల్పంతో చేసే కృషి ఎలాంటి ఫలితమిస్తుంది ?
జవాబు:
ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద. ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగరాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి. ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు (ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన నమ్మకాలకు) నిస్సందేహంగా ఎదురీదగలమని కలాం ప్రబోధించాడు.

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
కనుమరుగవుతున్న కళారూపాలపై నిసార్ రాసిన పాట ఏది ?
జవాబు:
“చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా
గానం చేశాడు.

ప్రశ్న 2.
దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?
జవాబు:
చందమామ

ప్రశ్న 3.
భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు ?
జవాబు:
గోకర్ణంలో

ప్రశ్న 4.
కోకిలను ఎవరు తరిమి కొడతారు ?
జవాబు:
తనను పెంచిన వారు, కాకులు

ప్రశ్న 5.
వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు ?
జవాబు:
జూలై 9, 1903

ప్రశ్న 6.
శాంతశూరులు ఎవరు ?
జవాబు:
పాండవులు

ప్రశ్న 7.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో

ప్రశ్న 8.
బ్రతుకు పండేది ఎప్పుడు ?
జవాబు:
ఆడ, మగ ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటే బ్రతుకు పండుతుంది.

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
1999లో ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది ?
జవాబు:
హంస పురస్కారం

ప్రశ్న 2.
బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?
జవాబు:
ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !

ప్రశ్న 3.
సుదర్శన మహారాజు ఏ పట్టణాన్ని పరిపాలించాడు ?
జవాబు:
పాటలీపుత్రం

ప్రశ్న 4.
ఎ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి ?
జవాబు:
అవుల్ ఫకీర్ జైనులాబ్లీన్ అబ్దుల్ కలాం.

ప్రశ్న 5.
భాగ్యనగర నిర్మాత ఎవరు ?
జవాబు:
మహమ్మదు ఖుతుబ్ షా

ప్రశ్న 6.
రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?
జవాబు:
శోభ

ప్రశ్న 7.
లోకమే కుటుంబమని భావించు వారెవరు ?
జవాబు:
మహాత్ములు

ప్రశ్న 8.
బిరుదురాజు రామరాజు ఎవరి పరిశోధనలను ఆదర్శంగా పెట్టుకున్నాడు ?
జవాబు:
మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ.

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
చంపకమాల
జవాబు:
1) ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
2) ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
3) ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
4) నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
5) నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 1 with Solutions 1
యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.
గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో’ యతి.

ప్రశ్న 2.
కందం
జవాబు:
1) ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2) ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
3) కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
4) బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
5) ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
6) 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
7) రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
8) ప్రాసనియమం ఉండాలి.
ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 1 with Solutions 2
యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.

ప్రశ్న 3.
మత్తేభం
జవాబు:
1) ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
2) ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
3) ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
4) నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
5) నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 1 with Solutions 3

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 2.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

ప్రశ్న 3.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 4.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 5.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో పాదములోని మొదటి అక్షరమునకు, 11వ యతిస్థానం.

ప్రశ్న 6.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

ప్రశ్న 7.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 8.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
లాటానుప్రాస
జవాబు:
లాటానుప్రాస : ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే, అది ‘లాటానుప్రాస’ అలంకారం అవుతుంది.
ఉదా : కమలాక్షు నర్చించు కరములు కరములు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, ‘కరములు’ అనే మొదటి పదానికి, సామాన్యమైన చేతులు అనీ, రెండవ ‘కరములు’ అనేదానికి శ్రేష్ఠమైన చేతులు అనీ, తాత్పర్య భేదము ఉంది. ‘కరములు” అనే పదాలు, రెండింటికీ “చేతులు” అనే అర్థం. కాని, రెండవ కరములు అనే పదానికి, శ్రేష్ఠమైన చేతులు అనే తాత్పర్యము, భేదంగా ఉంది. కాబట్టి ఇది “లాటానుప్రాస” అలంకారము.

ప్రశ్న 2.
ఉపమాలంకారం
జవాబు:
ఉపమాలంకార లక్షణము : ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”. ఇందులో
(1) “ఉపమేయం” (వర్ణించే వస్తువు),
(2) “ఉపమానం”. (పోల్చు వస్తువు),
(3) సమాన ధర్మం,
(4) ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి.
ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది.
దీనిలో,
1) ఉపమేయం : “రాజుకీర్తి”
2) ఉపమానం : ‘హంస’
3) సమాన ధర్మం : “ఓలలాడటం”
4) ఉపమావాచకం’ : ‘వలె’

ప్రశ్న 3.
స్వభావోక్తి
జవాబు:
స్వభావోక్తి లక్షణము : జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి?. – ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా,. కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి శబ్దాలంకారాలు’.

ప్రశ్న 2.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస అలంకారము.

ప్రశ్న 3.
ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు ?
జవాబు:
దీనిని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.

ప్రశ్న 4.
‘యమకం’ అనగానేమి ?
జవాబు:
అక్షర సముదాయంతో, అర్థభేదంతో, పునరావృతమైనచో, దాన్ని, ‘యమకాలంకార‘ మంటారు.

ప్రశ్న 5.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 6.
ఉపమాన, ఉపమేయములకు రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏ అలంకారం ?
జవాబు:
రూపకాలంకారము.

ప్రశ్న 7.
‘ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

ప్రశ్న 8.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము

మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్ లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం : హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించాను.

XVI. (అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా చేసుకుని ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ రాయండి. (1 × 5 = 5)

(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు – తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి : తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి: నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి : ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి : దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?
విద్యార్థి : ఉన్నాయి సర్! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి : ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి : ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి : మంచిది! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి : అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?.
అధికారి : రెండు రోజుల్లో.
విద్యార్థి : ధన్యవాదాలు సర్ !

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

TS Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 2.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

ప్రశ్న 3.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 4.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 5.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

Leave a Comment