AP Inter 1st Year Telugu Question Paper March 2019

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers and AP Inter 1st Year Telugu Question Paper March 2019 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Question Paper March 2019

Time : 3 Hours
Max. Marks : 100

సూచన : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. తోడంబుట్టువు లందఱుం ………………. కావింపవే
జవాబు:
తోడంబుట్టువులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం
పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా
ర్దోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్ల నా
తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే
ప్రతిపదార్థం :
తోడంబుట్టువులు = తోడబుట్టిన వారు (సోదరులు)
అందఱుం = అందరూ
పడిన = చనిపోగా
ఆ దుఃఖంబు = ఆ బాధ
చిత్తంబు = మనసును
సంపీడనం బెట్టెడు = కలిచివేస్తోంది
డప్పింగూలెన్ = అలసి దాహంతో కూలిపోయింది
సౌకుమార్యవతి = సుకుమారి
పాంచాలి = ద్రౌపది
కూలెన్ = మరణించింది
వార్డోడై (వారు + తోడై) = వారందరూ నాతో బయలుదేరి వచ్చారు.
వారు లేక = వారంతా లేకుండా
ఇట = ఇక
మీతో రాను = మీతో రాలేను
వారెల్ల = వారందరూ
నా తోడం = నాతో
కూడగ = కలిసి
వచ్చునట్లుగన్ = వచ్చేట్లుగా
కృప = దయ
ధుర్యాత్మ = మనసంతా నిండినవాడా
కావింపవే = అనుమతించు

భావము : అంతట ధర్మరాజు ఇంద్రునితో మహాత్మా ! నా తోబుట్టువులందరూ మరణించారు. సుకుమారి ద్రౌపది అలసి దప్పికతో చనిపోయింది. ఆ దుఃఖం నా మనసును కలచివేస్తోంది. వారందరూ నాతో బయలుదేరి వచ్చారు. వారు లేకుండా నేను రాలేను. కనుక వారు కూడా నాతో వచ్చేట్లుగా తాము నాపై దయతో అనుమతింతురు గాక అని ధర్మరాజు అన్నాడు.

2. ఎన్నో యేండ్లు ……………….. పాషాణముల్
జవాబు:
ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశాన స్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుఁ డొంకడైనన్ లేచిరాఁ డక్కటా
యెన్నాళ్ళీ చలనంబు లేని శయనం బే తల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్.
ప్రతిపదార్థం :
అక్కటా = అయ్యో
ఎన్నో యేండ్లు = ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం)
గతించిపోయినవి = గడిచిపోయాయి
ఈ శ్మశానస్థలిన్ = ఈ శ్మశానవాటికలో
కన్నుల్ మోడ్చిన = ప్రాణాలు కోల్పోయిన
మందభాగ్యుఁడు = దురదృష్టవంతుడు
ఒకడైనన్ = ఒక్కడంటే ఒక్కడైనా
లేచిరాఁడు = తిరిగి లేచివచ్చాడా
ఎన్నాళ్ళు = ఎంత కాలము
చలనంబు లేని = నిశ్చలమైన
శయనంబు = శాశ్వత నిద్ర
ఏ తల్లులు = ఎందరు తల్లులు
అల్లాడిరో = గర్భశోకంతో శోకించారో
నిక్కం = నిజం
పాషాణములు = కఠిన శిలలు
కన్నీటంబడి = కన్నీటిలో
క్రాఁగిపోయినవి = కరిగిపోయినవి

భావము : అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ! ఎంత కాలం నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భశోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయినవి. ఇది నిజం.

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెలపండి.
జవాబు:
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనెడి కవచంతో కూడిన శరీరం కలవాడై ఆనందం వలన కలిగిన కన్నీరు హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి సమీపించాడు.

ఓ సామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన, నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయములు తెచ్చియిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా !

కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు. పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు ? ఓ శివ లింగమా ! నాకు మరొకమాట ఎదురుచెప్పక ఉడుమూరుకి రమ్ము.

ఓ శివలింగమా ! ఆలకించు అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునకై నివ్వరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను (జుంటితేనె), తొఱ్ఱతేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి, పొడుములాగా రాలే నింజెట్లు అనే జాతి దుంపలు కలవు.

నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మిబరివెంక, చిటముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వేలఁగ, పుల్లవెలఁగ, మోవి; అంకెన, బలుసు బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలిసి మెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య.

ఇల్లా ? వాకిలా ? ఇష్టమయిన స్నేహితులా ? వయసులో ఉన్నా బంధువులా ? యిల్లాలా ? కొడుకా ? ఎవరున్నారు ? (ఎవరు లేరు), ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా ? (కాదు) ; మా బోయపల్లెలో నీకు కావలసిన వన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా మా బోయపల్లెకు విచ్చేయుమా.

శివుని మూడవ కంటిచూపుకు దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంతో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను. నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమై నపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు శివునితో పలికి శివభక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

2. కపాలమోక్షం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకుని వేదములలో చెప్పబడిన వాడైన ఆదిశంకరుడు ధ్యానంలో – గాఢంగా లీనమై ఉండగా ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది. సమస్త ప్రకృతిలోని చరాచరములు కంపించిపోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టనట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.

ఆకాశగంగలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడసాగింది. ఆదిశేషువు పడగల మీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి. పూదోటలు వికసించలేదు. వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు. అనంతకోటి జీవరాశులు గగ్గోలు పెట్టాయి. హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.

మహిమాన్వితుడైన ఆ శివుని మనసులో సానుభూతి కలిగింది. అపుడు కనులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు. అగ్ని నేత్రుడైన శివుడు ఉగ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో · జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.

శివుని ఆగ్రహాన్ని చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతిచేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు. భూలోకంలోని మహమ్మదీయ, క్రైస్తవ సమాధులలోని, హిందూ శ్మశానవాటికలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.

హిమాలయ పర్వత శిఖరాగ్రాన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుడు ధరించిన శివుని వీర్యాన్ని దాచిఉంచిన బంగారపు కుండ కదిలింది. సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు. గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైంది. సింధు, గంగానదుల గర్భంలో, సముద్రపు లోతుల్లో బడబాగ్ని అనే శివుని నేత్రాగ్ని సర్దార్ భగత్సింగ్ రూపంలో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించి పోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.

శివుని నేత్రాగ్నియే తానై జన్మించిన భగత్సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేసాడు. ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు.

తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్ర్య సాధనకు తన శిరస్సును అర్పించినవాడై ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన భగ్న గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి, ఆ పరమ శివభక్తుడు (భగత్సింగ్ నాస్తికుడైనప్పటికీ అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో కవి పోల్చాడు). మోక్షాన్ని పొందాడు. వీరుడైన భగత్సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటనున్న మూడవ నేత్రం కంపించింది. అండపిండ బ్రహ్మాండం ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.

భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఈ భూమిపై ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఈ పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ, కపాలమోక్షం అందరికీ లభించదు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హస్యం యొక్క లక్షణాలను తెలుపండి.
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలిసిన సహృదయునికి నవ్వు పుట్టించేది నిజమైన హాస్యం. హాస్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి :
అసహజత్వం :
ఒక విషయంలో వుండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజము. ఒంటికాలుతో నడవటం అసహజం. మనుషులు గుఱ్ఱాలను ఎక్కితే బాగుంటుంది. కాని, గుఱ్ఱం మనుషులపైకెక్కితే విపరీతంగా నవ్వువస్తుంది. పత్నికి పతి దైవ సమానం అనే మాట సహజం. పత్నియే పతికి దైవం అంటే నవ్వుకు కారణమవుతుంది.
ఇలాంటివే చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటి వాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, పానుగంటి వారి బధిర విధవా ప్రహసనం అసహజత్వ హాస్యానికి ఉదాహరణలు.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.

ఆశ్చర్యము (Surprise) :
ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా వుంటుంది అని మనం ఊహిస్తే, అందుకు భిన్నంగా వేరేగా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తద్వారా హాస్యం పుడుతుంది. స్వల్ప విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరొక అర్థాన్ని స్ఫురింపజేస్తూ మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సృష్టించటం అసహజ హాస్యం లోకే వస్తుంది.

అసందర్భ శుద్ధి లేకపోవటం :
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (Impropriety) నవ్వు తెప్పిస్తుంది. ఆ నవ్వు నిర్మలంగా ఉండదు. అయినా అదీ హాస్యమే.

అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్ని మెత్తని మాటలతో చెప్పటం వల్ల హాస్యం పుడుతుంది. అసత్యాన్ని సత్యంగాను, దుఃఖాన్ని సుఖంగాను, సుఖాన్ని దుఃఖంగాను, అప్రియ విషయాన్ని ప్రియమైన దానిగాను మలచటం, నేర్పుతో హాస్యాన్ని సృష్టించట మవుతుంది. దీన్ని distortion అంటారు.

అతిశయోక్తి :
అతిశయోక్తి (Exaggaration) కూడ ఒక ముఖ్య హాస్య లక్షణం. అయితే విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస జనకం అవుతుంది. పరమ సత్యం” అయితే నవ్వురాదు. అతిశయోక్తుల్లా కనపడేవి నిజంగా అతిశయోక్తులా సత్యమైన గాథలా అని నిశిత దృష్టితో పరీక్షించాలి.
అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది. ఇవి ముఖ్యమైన హాస్యలక్షణాలు.

2. ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని సారాంశాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి ఒక జానపదగేయం. ఉమ్మడి కుటుంబంలోని కట్టుబాట్లు నమ్మకాలు, ఆచారాలు అలవాట్లు ఈ పాటలో చక్కగా ప్రతిబింబించాయి.
కామాక్షి కలవారి కోడలు అనటంలో ఆమె పుట్టింటి వారు పేదవారై వుంటారని సులభంగానే అర్థమవుతుంది. కామాక్షి అత్తగారువాళ్ళు చాలా సంస్కార వంతులు. లేనింటి పిల్ల అని తక్కువగా చూడలేదు. ఆమె అందాన్ని చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని, ఆస్తులు, అంతస్తులు చూసి కాదు.

కామాక్షికి వాడిన కలికి అనే విశేషణం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తోంది.
పురిటి మంచం చూడటానికి, కామాక్షి పెద్దన్నయ్య ఆమెను పుట్టింటికి తీసుకు వెళ్ళటానికి వస్తాడు. అప్పుడు కామాక్షి పప్పు కడుగుతోంది. గబగబా చేతులు కడుక్కుని అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. నీళ్ళిస్తుంటే ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి అన్న గమనించాడు. ఆ కన్నీళ్ళకెన్నో అర్థాలు.

చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండె కరిగింది. పేద యింటిపిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. తన ఉత్తరీయపు కొంగుతో కళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకి తెచ్చాడు.

ఇంట్లో అందరూ తలో విధంగా కామాక్షి అన్నను పలకరించారు. వియ్యంకుడు అంటే కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.
కామాక్షి అన్న తను వచ్చిన పని చెప్తాడు. ఆచారాన్ని పాటించటం కోసం అతను రావటం చూసి అందరూ సంతోషించారు. కామాక్షి వినయంగా అత్తగారిని తన అన్న వచ్చాడు పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. ఆమె మనసులో మురిసిపోతూ మామగారిని అడగమంది అలా అనటంలో ఆమె అనుమతి, అంగీకారం కామాక్షికి ఆనందాన్ని కలిగించాయి.

కామాక్షి మామగారిని అడిగింది. ఆయన బావగారిని అడగమన్నాడు. అంటే మామగారి అనుమతి లభించినట్లే! కామాక్షి బావగారిని అడిగింది. అడుగుతున్నప్పుడు తల్లిలాంటి తోటికోడలు గుర్తు వచ్చి గొంతు గద్గదమైంది. ఆమె, కామాక్షి చేసిన చిన్న చిన్న పొరపాట్లు కప్పి పుచ్చి, రహస్యంగా తనకు బుద్ధులు చెప్పిన తల్లి. ఆమె కామాక్షితో నీ భర్త నడుగమంటుంది. స్నేహితుల మధ్యలో ఉన్న భర్తను సైగ చేసి పిలిచి అడిగింది. అతడు చాలా సరదా మనిషి. నగలు పెట్టుకుని, సుఖంగా పుట్టింటికి వెళ్ళుమంటాడు. కామాక్షి పల్లకిలో వెళుతుంటే ఎల్లుండీ పాటికి నేను మీ పుట్టింట్లో ఉంటాను ఎందుకు బెంగ అని కూడ అనుంటాడు.

ఈ పాటలో చెప్పిన విషయాలెన్నో వున్నాయి. చెప్పకుండా మన ఊహకు వదిలినవీ ఉన్నాయి. చెప్పినవి క్లుప్తంగా, అందంగా చెప్పటమూ ఉంది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. కుంకుడాకు’ కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
పారమ్మ, గవిరి ఇద్దరూ ఒకే వయసున్న పల్లెటూరి పిల్లలు. పారమ్మ అప్పలనాయుడు కూతురు. గవిరి చినదేముడు కూతురు. అప్పలనాయుడు పలుకుబడిగల మోతుబరి రైతు. చినదేవుడు కూలి పని చేసుకునేవాడు. వారి మధ్య అంతరమే వాళ్ళ పిల్లల మధ్య ఉంటుంది. పారమ్మ ఊరగాయ రుచిగా ఉందని అనగానే గవిరి రొయ్యలు తిన్నానని అబద్ధం ఆడుతుంది. మీరు రాత్రి వండుకోలేదని పారమ్మ ఎత్తిపొడుస్తుంది.

గవిరి తండ్రి కూలి చేసి ఏమైనా తెస్తేనే వారికి ఆపూట గంజి అయినా తాగి కడుపు నింపుకుంటారు ఆ కుటుంబం. తల్లిదండ్రి గవిరి కష్టపడితే గాని తిండికి కూడా గడవని ఇల్లు అది. ప్రతిరోజు కోనేటికి పోయి ఇంటికి సరిపడా నీళ్ళు. మొయ్యాలి. కర్రా కంపా, ఆకు అలము ఏరి పొయ్యిలోకి వంట చెరకు తేవాలి ఇదీ గవిరి పరిస్థితి. పారమ్మ బడికి పోతానన్నప్పుడు కూలీచేసే వాళ్ళకి చదువెందుకని గవిరి నిరాశగా అంటుంది. గవిరితోపాటు పొలాల్లోకి వెళ్ళి పారమ్మ పొలాల్లో దొరికే పెసరకాయలు చింతకాయలు ధైర్యంగా తీసుకొని తింటుంది. గవిరి కడుపు కాలుతున్నా సాహసం చేయలేదు. పేదరికం వల్ల ధైర్యం చాలదు గవిరికి డబ్బులేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరమౌతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తే అది కప్పిపుచ్చుకోగలరు. అందుకే పారమ్మకు నిర్భయం. ఎవరైనా చూస్తే మాడు పగులుతుందని గవిరి హెచ్చరిస్తే “నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారు” ? అని తిరిగి సమాధానం ఇస్తుంది.

తట్టనిండా కుంకుడాకులు ఏరుకొని కాంభుక్త గారి కళ్ళం వైపు నడుస్తారు ఇద్దరూ. అక్కడ చింతకాయలు చూసి పారమ్మ రాయితో కొడుతుంది. మూడు కాయలు పడతాయి. తీసి పరికిణిలో దోపుకొని తింటూ ఉంటుంది. గవిరి ఒక కాయ అడిగినా ఇవ్వదు. కావాలంటే నువ్వూ రాయితో కొట్టు అని అంటుంది. గవిరి ఒక రాయి తీసి వేస్తుంది. క్రింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక రాయివేస్తే కొమ్మ విరిగి పడుతుంది. పొయ్యిలోకి చాలా మంచి సాధనం అని చితుకులు తట్టలో వేసుకుంటుంది. ఎదురుగా కాంభుక్తగారు ఎవరది అని గద్దిస్తాడు. కోపంగా ఉన్న కాంభుక్తని చూసి గవిరి భయపడిపోతూ పొయ్యిలోకి చితుకులు అని అంటుంది. కాంభుక్త కోపంగా తట్టని ఒక తన్నుతంతాడు. ఆకులన్నీ చెల్లాచెదురైపోతాయి. వాటిని పోగు చేసుకోవాలనుకున్న గవిరి నడుంమీద చేతికర్రతో ఒక్క దెబ్బవేసాడు. అంతేకాదు ఆ తుప్పవార ఏందాచావంటూ దొంగతనం అంటగట్టాడు. తాను దొంగ కాదు కాబట్టి ధైర్యంగా నేనేమి దాచలేదు అంటూ ఎదురు తిరిగింది గవిరి. నిజం చెప్పినా కొట్టడానికి వచ్చిన భుక్త గారిని బూతులు తిట్టింది గవిరి. అది సహించలేని భుక్తగారు పాంకోడు విసిరాడు. గవిరి కాలికి తగిలి క్రిందపడింది. ఏడ్చిఏడ్చి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయ్యింది. ఆ చింత కంప తనకి అక్కరలేదని అక్కడే వదిలేసి కుంకుడాకులు తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. కాలు నొప్పితో మంటగా ఉన్నది. కాలు దెబ్బని చూసుకొంది. బొప్పికట్టి ఎర్రబడింది. తన నిస్సహాయతకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.

2. అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటి నుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దుఃఖం ఆగలేదు శివయ్యకు. ‘ కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు.

“నాకు కూతుర్ని ఇచ్చి ‘ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం ఛేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

3. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూసిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిసున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడి పోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

4. ‘దహేజ్’ కథ లోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు

ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” ౦తో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో లగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండ పైకి వచ్చి వధూవరుర్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు. వధూవరుల

మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు.

ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటాడు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్ అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

V. క్రింది వాటిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీడ్య చరిత!
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ద్రౌపది ఎందుకు నేలకూలింది అని భీముడు అడిగితే ధర్మరాజు బదులిచ్చిన సందర్భంలోనిది.
అర్థం : ద్రౌపదికి అందుకే ఇటువంటి దురవస్థ వాటిల్లింది.
భావం : పాండవులు, ద్రౌపది, కుక్క అలా వేగంగా వెళుతుండగా ద్రౌపది నేలకూలింది. అది చూసిన భీముడు అన్నగారితో ద్రౌపది వలన ఏనాడూ కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనగా ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం. అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. ధర్మము వహించు జనుండు కృతార్థుఁడెయ్యెడన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : కుబేరుడు రావణునకు నీతులు చెప్తున్న సందర్భంలోనిది.
భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ద్రోహము చేసిన వాని ముఖము చూసిన మహా పాపములు వస్తాయి. శరీరము అశాశ్వతము. సంపదలు పుణ్యముల వలన వస్తాయి. కావున ధర్మమును ఆచరించువాడు కృతార్థుడని ఇందలి భావం.

3. అధికార ముద్రికలంతరించె.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : కవి శ్మశానం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించే సందర్భంలోనిది.
అర్థం : రాజముద్రలు (అధికారం) అంతరించిపోయాయి.
భావం : ఈ శ్మశానంలోనే గొప్ప కవి యొక్క కలం నిప్పులలో కరిగిపోయింది. ఇక్కడే దేశాన్నేలే రాజు యొక్క అధికార దర్పం, అధికార చిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు యొక్క మాంగల్యం నీట’ కలిసిపోయింది. ఇక్కడే ప్రఖ్యాత చిత్రకారుడి కుంచె నశించింది అంటూ శ్మశాన గొప్పతనాన్ని కవి చాటాడు.

4. సవతి బిడ్డల పోరు మనకేలా.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు ప్రాంతాల మధ్య ఐకమత్యం ఉంటే అభివృద్ధి సాధిస్తామని, మనలో మనకు గొడవలేమిటని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : సవతి తల్లి బిడ్డలలా ఈ గొడవలు మనకెందుకు.
భావము : మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలలో మనకు గౌరవం, పేరు, ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగోడా మనందరికీ తల్లి ఒక్కటే. మనము తెలుగుజాతి వారము. సవతి తల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము అని భావము.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానములు రాయండి. (2 × 3 = 6)

1. నకులుని గుణాలను పేర్కొనండి.
జవాబు:
నకులుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన కవల సంతానం. సహదేవునికి అన్న. తన సోదరుడి మరణం చూసి ధైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. శౌర్యం, ధైర్యం, సుజనత్వం మున్నగు విషయములలో మేటి. ఎంతో అందగాడు. మన కురువంశంలోనే కాక, లోకంలోనే ఇంతటి గుణశ్రేష్ఠుడు లేడు అని భీముడు నకులుని గురించి పేర్కొనగా, దానికి ధర్మరాజు లోకంలో తనని మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ గుణం వలనే అతకి దురవస్థ కలిగిందని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

4. వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలుపండి.
జవాబు:
మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య, ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే. వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపరచాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన బొబ్బిలి పాలకుడి ధర్మపత్ని వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి. రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసికూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల. వీరంతా మన తోడబుట్టిన వీర సోదర, సోదరీమణులు వీరి పరాక్రమ గాధలను కథలు కథలుగా చెప్పారు.

VII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. బొడ్డుచర్ల తిమ్మన గురించి వివరించండి.
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన రాయలకాలం నాటి కవి. కవీశ్వర్ దిగ్దంతులనిపించుకున్న కృష్ణరాయల వారితో చదరంగం ఆడుతూ ఉండేవాడు. చదరంగం ఆటలో నేర్పరి ఈ కవి. పెద్దనగారి మను చరిత్రను రాయలు అంకితంగా అందుకుంటున్న మహోత్సవానికి కవులందరితో వస్తూ, వారికి కొంచెం దూరంగా నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతూ ఈ కవి వచ్చాడు. రాయలు ఇతని నైపుణ్యానికి చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా రాసి ఇచ్చాడు.

2. కందుకూరి సంస్కరణలను వివరించండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.

కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.

కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.

3. సూర్యకాంతమ్మగారిని గురించి తెలుపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసు గారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో వివాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు. సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.
ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

4. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6.తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్ధ్వలోకములు. ‘
1) అతల 2) వితల 3) సుతలు 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు. ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతల మయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు /రచయితలు) (2 × 3 = 6)

1. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

2. వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా తెలపండి.
జవాబు:
వేములపల్లి శ్రీకృష్ణ గిరీశం, సాక్షి అనే కలం పేర్లతో కాగడా, నగారా పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’, ‘జాయేంగే కయ్యూరు’, ‘చెంచుపాట’, ‘రెడ్ ఆర్మీ’, ‘రండీ దేశసేవకు’, ‘అన్నాచెల్లెలు’, ‘రావోయి’ అనే గీతాలు శ్రీకృష్ణ రచించారు. ఇవన్నీ అరుణ గీతాలు అనే సంకలనంలో ఉన్నాయి.
వీరు బాపట్ల (1952), మంగళగిరి (1962, 1972) నియోజక వర్గాల నుండి మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సమర్ధుడైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు.

3. దేవులపల్లి కృష్ణశాస్త్రిని గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ భావకవి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర వున్న రామచంద్రపాలెంలో 1-11- 1897న జన్మించారు. సీతమ్మ, తమ్మన్నశాస్త్రి వీరి తల్లిదండ్రులు.
వీరి విద్యాభ్యాసం పిఠాపురంలోను, విజయనగరంలోను జరిగింది. కొంతకాలం రవీంద్రుని శాంతినికేతన్లో గడిపారు. వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు. రఘుపతి వెంకయ్యనాయుడు ప్రోత్సాహంతో సంఘసంస్కరణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. సంఘసంస్కరణాభిలాషి. హరిజనాభ్యుదయ గీతాలను ప్రచారం చేశారు. 1930లో పిఠాపురంలో వేశ్యావివాహ సంస్థను స్థాపించారు. కొందరు వేశ్యలకు వివాహాలు కూడా జరిపించారు.

కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి వంటి అనేక ఖండకావ్యాలను దేవులపల్లి రచించారు. కొన్ని యక్షగానాలను, భక్తి నాటకాలను ఇంకొన్ని గేయ నాటికలను కూడా కృష్ణశాస్త్రిగారు రచించారు. కేవలం కవిగానే గాక, విమర్శా వ్యాసాలను రచించి విమర్శకునిగా కూడా ప్రసిద్ధిపొందారు.
దేవులపల్లివారు సినిమా కవి కూడా. వారు రచించిన ఎన్నో సినిమా పాటలు బహుళప్రచారం పొందాయి. తెలుగు వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయాయి.
వీరు ఆంధ్రా షెల్లీగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, బిరుదునూ, భారతప్రభుత్వం పద్మభూషణ్న ఇచ్చి ఈ కవిని సత్కరించాయి.
భావకవిత్వానికి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి 24-2-1980లో పరమపదించారు.

4. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.
తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

IX. క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. కళాశాల ప్రధానాచార్యులకు బదిలీ పత్రం (టి.సి) కోరుతూ లేఖ రాయండి.
జవాబు:

కళాశాల ప్రధానాచార్యులు గారికి లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
…………………
విశాఖపట్నం.
మహోదయులకు !
విషయం : బదిలీ పత్రం (టి.సి.) గురించి విజ్ఞప్తి.

నేను ఈ కళాశాలలో బైపిసి గ్రూపులో 2016-’18 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేశాను. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. విశాఖపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘బియస్సీ’లో ప్రవేశానికి అనుమతినిస్తూ ప్రధానాచార్యుల నుండి ఉత్తరం వచ్చింది. కావున డిగ్రీలో చేరుతున్నందున బదిలీ పత్రం ఇవ్వవలసిందిగా ప్రార్థన.
ధన్యవాదాలు,

భవదీయుడు
XXXXXX.

2. మీ విద్యాభ్యాసాన్ని గురించి తెలియజేస్తూ తల్లిదండ్రులకు లేఖ రాయండి.
జవాబు:

తల్లిదండ్రులకు లేఖ

స్థలం : XXXXX
తేది : XXXXXX

పూజ్యులైన అమ్మకీ, నాన్నకీ,

నమస్కారాలు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగా. చదువుకుంటున్నాను. చెల్లెలు ఎలా చదువుతుంది ?
మా గురువులు చెప్పే పాఠాలు క్షుణ్ణంగా చదువుకుంటున్నాను. ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్ళి దినపత్రికలు చూసిన తరువాత, అక్కడే కూర్చొని మూడు గంటల పాటు తరగతి పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తున్నాను. మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఎక్కువసేపు కష్టపడుతున్నాను. నాకు మిమ్మల్ని చూడాలనుంది. పరీక్షలు ప్రారంభమయ్యేలోపు మీరు తప్పకుండా రావాలి. నాయనమ్మ, తాతయ్యలకు నా నమస్కారాలు తెలియజేయగలరు. నా స్నేహితులు రాజు, కస్తూరిలను అడిగినట్లు చెప్పగలరు. మీ రాకకోసం ఎదురు చూస్తుంటారు.
నమస్సులతో

మీ కుమారుడు,
XXXXXX.

చిరునామా :
XXXXXXXX,
XXXXXX,
XXXXX,
XXXX.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి సంధి పేరు, సూత్రము వ్రాయండి. (4 × 3 = 12)

1. రూపాతిశయము
2. ఆత్మైక
3. వహ్న్యస్త్రము
4. పేరెన్నిక
5. తోడబుట్టిన
6. అమరేంద్రుడు
7. వేసరవోయినవి
8. వేడుకెల్ల
జవాబు:
1. రూపాతిశయము – రూప + అతిశయం = సవర్ణదీర్ఘ సంధి
సవర్ణదీర్ఘ సంధి : “అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును.” సవర్ణము అనగా అదే వర్ణము.
ఉదా : ‘అ’ కు అ, ఆ; ‘ఇ’కి ఇ, ఈ లు సవర్ణాలు.

2. ఆత్మైక – ఆత్మ + ఏక = వృద్ధిసంధి
వృద్ధి సంధి : ‘అ’కారమునకు, ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారము, ఓ, ఔలు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశంగా వస్తాయి.

3. వహ్యస్త్రము – వహ్న + అస్త్రము = యణాదేశసంధి
యణాదేశ సంధి : ఇ, ఉ, ఋలకు అవసరములైన అచ్చులు పరమైతే క్రమంగా య, ర, వ, లు వచ్చును.

4. పేరెన్నిక – పేరు + ఎన్నిక = ఉకారసంధి
ఉకార సంధి : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగును.

5. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన = సరళాదేశసంధి
సరళాదేశ సంధి : ద్రుతము మీద పరుషములను సరళములగు.

6. అమరేంద్రుడు – అమర + ఇంద్రుడు = గుణసంధి
గుణ సంధి : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఎ, ఓ, ఆర్ అనునవి ఏకాదేశమగును.

7. వేసరవోయినవి – వేసర + పోయినవి = గసడదవదేశసంధి
గసడదవదేశ సంధి : ప్రధముమీద పరుషములకు గసడదవలు బహుళముగును.

8. వేడుకెల్ల – వేడుక + ఎల్ల = ఉత్త్వసంధి
ఉత్త్వ సంధి : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అగు.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహ వాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 2)

1. దివ్యస్యందనము
2. వేటకుక్కలు
3. రజనీచరులు
4. అసత్యము
5. కాళిదాస భారవులు
6. తుంగభద్రా నది
7. స్వాహావల్లభుడు
8. నలుదిక్కులు
జవాబు:
1. దివ్యస్యందనము : దివ్యమైన స్యందనము – విశేషణ పూర్వపద కర్మధారయం
2. వేటకుక్కలు : వేట కొరకు కుక్కలు – చతుర్థీ తత్పురుష సమాసం
3. రజనీచరులు : రాత్రియందు చరించేవారు – సప్తమీ తత్పురుష సమాసం
4. అసత్యము : సత్యము కానిది – న తత్పురుష సమాసం
5. కాళిదాస భారవులు : కాళిదాసు మరియు భారవి – ద్వంద సమాసం
6. తుంగభద్రా నది : తుంగభద్ర అను పేరు గల నది – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
7. స్వాహావల్లభుడు : స్వాహా యొక్క వల్లభుడు – షష్ఠీ తత్పురుష సమాసం
8. నలుదిక్కులు : నాలుగు అను సంఖ్యగల దిక్కులు – ద్విగు సమాసం

XII. క్రింది పదాలలో ఐదింటికి పద దోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. వూరు
2. ఇనాయక
3. స్మశానం
4. బాష
5. ద్రుశ్యం
6. భాద
7. దృతం
8. బోదన
9. సనివారం
10. యెలుక
జవాబు:
1. వూరు – ఊరు
2. ఇనాయక – వినాయక
3. స్మశానం – శ్మశానం
4. బాష – భాష
5. ద్రుశ్యం – దృశ్యం
6. భాద – బాధ
7. దృతం – ద్రుతం
8. బోదన – బోధన
9. సనివారం – శనివారం
10. యెలుక – ఎలుక

XIII. క్రింది ఆంగ్ల వాక్యములను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Health is wealth.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం.

2. New Delhi is the capital of India.
జవాబు:
భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ.

3. Ramayana was written by Valmiki.
జవాబు:
రామాయణాన్ని వాల్మీకి రచించారు.

4. A friend in need is a friend indeed.
జవాబు:
కష్టాలలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు,

5. The Earth revolves around the Sun.
జవాబు:
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.

XIV. స్థూల అవగాహన (వ్యాకరణాంశాలు) :

1. తోలు బొమ్మలాటలో ఏ కథలు ఎక్కువ ప్రదర్శిస్తారు ?
జవాబు:
భారతం, రామాయణం.

2. తోలు బొమ్మలాటలు ఎప్పటి నుండి ప్రచారంలో ఉన్నాయి ?
జవాబు:
క్రీ.పూ. 3వ శతాబ్దం.

3. విదేశాలలోని ఛాయా ప్రదర్శనకు మూలమేది ?
జవాబు:
తోలుబొమ్మలాట.

4. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి ?
జవాబు:
వినోదాన్ని, విజ్ఞానాన్ని కుపడడం మన కర్తవ్యం.

5. తోలు బొమ్మలాట లోని హస్య పాత్రలేవి ?
జవాబు:
అల్లాటప్పగాడు, బంగారక్క, జుట్టు పోలుగాడు, కేతిగాడు.

XV.: ఏకవాక్య సమాధానాలు (పద్యభాగం) :

1. సారమేయరూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత

2. తిన్నని గ్రామ పేరేమిటి ?
జవాబు:
ఉడుమూరు

3. పౌలస్త్యుడు ఎవరు ?
జవాబు:
రావణాసురుడు

4. జాషువా జన్మస్థలమేది ?
జవాబు:
వినుకొండ

5. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు

6. శ్రీరంగం నారాయణబాబుకు శ్రీశ్రీ ఏమవుతాడు ?
జవాబు:
తమ్ముడు వరస

7. పాపరాజు రాసిన యక్షగానం పేరేమిటి ?
జవాబు:
విష్ణు మాయావిలాసం

8. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయం ఏ చిత్రంలో ఉంది ?
జవాబు:
1952లోని విడుదలైన “పల్లెటూరు” చిత్రంలోనిది.

XVI. ఏకవాక్య సమాధానాలు (గద్యభాగం) :

1. నారదుని వీణ పేరు ఏమిటి ?
జవాబు:
మహతి

2. రాయలవారు రాసిన నాటకం పేరేమిటి ?
జవాబు:
జాంబవతీ కళ్యాణము

3. కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
జవాబు:
వివేకవర్థని

4. కలవారి కోడలు పేరేమి ?
జవాబు:
కామాక్షి

5. ప్రాడిజీ అంటే ఏమిటి ?
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞాపాలవాలు ప్రదర్శించే వానిని.

6. మానవ సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి ?
జవాబు:
మాటతీరుపై

7. చేమకూర వేంకట కవి రచించిన కావ్యం ఏది ?
జవాబు:
విజయ విలాసం

8. హాసము అనగా ఏమిటి ?
జవాబు:
నవ్వు.

Leave a Comment