AP Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 7 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. ఓ సామీ ! ……………….. నీ కిందిటికే లింగమా !
జవాబు:
ఓసామీ ! యిటువంటి కొండ దరిలో నొంటిం బులుల్ సింగముల్
గాసింబెట్టెడి కుట్ర నట్టడవిలోఁ, గల్గువ్వి క్రీనీడ, నే
యాసంగట్టితి వేటిగడ్డ నిలు ? నీ వాఁకొన్నచో కూడు నీ
ళ్ళేసుట్టంబులు దెచ్చిపెట్టెదరు ? నీకిందేటికే లింగమా !

భావం : ఓ స్వామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన నది ఒడ్డున, ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్న పానీయములు తెచ్చి యిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా అని భావం.
‘తిన్నడి ప్రశ్నలలో అతనిలోని నిర్మలత్వం, అమాయకత్వం అతనిలోని ముగ్ధ భక్తిని తెలియజేస్తున్నాయి.

2. కడుఁ గోపించి ………………. వాఁడడఁచెనంభోబాణ వేగంబునన్.
జవాబు:
కడుఁ గోపించి దశాననుం డతని వక్షః పీఠమున్ జొచ్చి పో
యెడునట్లుగ్ర శరంబు వేయుటయు యక్షేశుండు ధీరత్వ మే
ర్పడఁ గోదండ గుణారవంబఖిల దిగ్భాగంబులన్ నిండ న
ప్పుడు వహ్న్యస్త్రము వైవ వాఁ డడఁచెనంభోబాణ వేగంబునన్.

భావం : రావణాసురుడు మిక్కిలి కోపముతో కుబేరుని వక్షస్థలము చీలి పోవునట్లుగ వాడియైన బాణములు వేయగా కుబేరుడు ధీరత్వముతో వింటినారి ధ్వని అన్ని దిక్కులా ప్రతిధ్వనింపచేయుచూ ఆగ్నేయాస్త్రము వేసెను. దానిని రావణుడు వారుణాస్త్రముతో వెంటనే అణచివేసెను.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నడు శివలింగమును తన ఊరికి రమ్మని పిలచిన తీరును తెలపండి.
జవాబు:
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనెడి కవచంతో కూడిన శరీరం కలవాడై ఆనందం వలన కలిగిన కన్నీరు హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి సమీపించాడు.
ఓ సామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన, నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయములు తెచ్చియిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా !

కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు. పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు ? ఓ శివ లింగమా ! నాకు మరొకమాట ఎదురుచెప్పక ఉడుమూరుకి రమ్ము.

ఓ శివలింగమా ! ఆలకించు అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునకై నివ్వరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను (జుంటితేనె), తొఱ్ఱతేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి, పొడుములాగా రాలే నింజెట్లు అనే జాతి దుంపలు కలవు.

నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మిబరివెంక, చిటముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలిసి మెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య.

ఇల్లా ? వాకిలా ? ఇష్టమయిన స్నేహితులా ? వయసులో ఉన్న బంధువులా ? యిల్లాలా ? కొడుకా ? ఎవరున్నారు ? (ఎవరు లేరు), ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా ? (కాదు) ; మా బోయపల్లెలో నీకు కావలసిన వన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా మా బోయపల్లెకు విచ్చేయుమా.

శివుని మూడవ కంటిచూపుకు దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంతో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను. నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమై నపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు శివునితో పలికి శివభక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

2. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు ‘తెలుగోడి’ వైభవాన్ని వివరించండి.
జవాబు:
మహోన్నతమైన చరిత్ర గల తెలుగోడా ! నీ జాతి ఔన్నత్యానికి చేయెత్తి జైకొట్టు. సమవుజ్జీయే లేని జాతి, జయించడానికి సాధ్యం కాని కోటలు కలిగి ఓటమిని అంగీకరించని జాతి నేడు తన పూర్వీకుల పౌరుషాన్ని, శౌర్యాన్ని మరచిపోయి నివురుగప్పిన నిప్పులాగా నిద్రాణ స్థితిలో ఉంది. అట్టి జాతిని తట్టి లేపగల ఘనచరిత్ర గలిగిన తెలుగోడా. మన వీరుల రక్తపు ధారలు కొరత లేకుండా మాతృభూమికి అర్పించిన పలనాడు, వెలనాడు ప్రాంతాలు నీవే కదా. ఆ త్యాగస్ఫూర్తి, ఆ వీరత్వానికి నీవే కదా వారసుడివి. మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే.

వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపర చాణక్య మేధాసంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలి కోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బొబ్బిలి పాలకుడు రాజారంగారావు ధర్మపత్ని, వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తన కవితా ప్రావీణ్యంతో రామాయణాన్ని రచించి ప్రసిద్ధి చెందిన కవయిత్రి మొల్ల యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసి కూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల వీరంతా నీ తోడపుట్టిన సోదర, సోదరీమణులే కదా. ఈ తెలుగు నేల ఎందరో వీరనారీమణులకు కన్నతల్లి. ఎందరో వీరులను కన్న మాతృమూర్తులకు జనని ఈ తెలుగుతల్లి.

గతకాలాలలోని మన ధైర్య, శౌర్య పరాక్రమాలను కథలు, కథలుగా చెప్పారు. మన పూర్వకులలోని ఆ సత్తువ ఎక్కడ దాచావు తెలుగోడా ? ఈ భారత భూమిలో మన ఉనికే లేకపోయింది. అనగా ఒక ప్రత్యేక జాతిగా మన అస్తిత్వాన్నే కోల్పోయాము. ఘనచరిత్ర గల ఆంధ్రులు నేడు బ్రతుకే ఎంతో భారంగా గడుపుతున్నాడు. వంద రకాలుగా పోరాడైనా సరే అన్ని రంగాలలో మొదటి స్థానంలో మనం నిలవాలి.

ఎన్నో చారిత్రక విషయాలు తెలియజెప్పే నాగార్జున కొండ, అమరావతీ స్థూపాలపై ఉన్నా శిల్పాలలో సజీవ చైతన్యం. నింపావు. అవి శిల్పాలా సజీవ మూర్తులా అన్నట్లుగా మలచిన ఘనఖ్యాతి మనది. మేమెవరికీ తక్కువకాము. అని మన ఆంధ్ర శిల్పులు తమ ఖ్యాతిని చాటారు. ఇది కదా శిల్పకళ అని దేశదేశాలవారు మన శిల్పకళా సంపదను ప్రస్తుతించారు. లండన్ మ్యూజియానికి తరలించబడిన అమరావతీ శిల్పాలు మన ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి.

రాజ్యం వీరులు పౌరుష, పరాక్రమాలతో సంపాదించుకునేది అని చాటి చెప్పిన తిక్కన మహాకవి వాక్కు సదా ఆచరణీయం. మన పూర్వీకుల పరాక్రమ గాధలను తెలుసుకుని, ఆ స్ఫూర్తితో అభివృద్ధి పథంలోకి సాగాలి.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. రాయలవారు పెద్దన రాసిన మను చరిత్రను అందుకున్న తీరును వివరించండి.
జవాబు:
ఆ సంవత్సరం మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మను చరిత్ర అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఎక్కడెక్కడి విద్వాంసులు, గాయకులు కొన్నిరోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి యింట్లోనే దిగారు.

ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజీ పెద్దన్న గారింటికి వస్తారు. రాయలవారు అక్కడికి వస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం పెద్దన్నగారింటి నుండి కొలువు కూటందాకా సాగుతుందని అప్పాజి అక్కడ వున్న మహా కవులందరితో చెపుతాడు. కొంచెంసేపట్లో విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినబడతాయి. రాయలవారు అల్లసానివారి గృహంగణానికి మంత్రులతో, సామంతులతో వస్తారు. ముందు అప్పాజి, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకుని వచ్చి, బంగారపుటడ్డల పల్లకిలో పెద్దనగారు కూర్చుంటారు.

శ్రీకృష్ణ దేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకి ‘బొంగులకు భుజాలు తగిలిస్తారు. భోజరాజేనా ఇలా చేశాడని విన్నామా ! మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుందని రాయలను ప్రశంసిస్తూ నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.

ముందు వందలకొద్దీ రౌతులు తరవాత చల్లగా సాగే తంజావూరు సన్నాయి కూటం. భట్టు కవుల స్తుతి పాఠాలు, ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదిక బృందం, కంచి నుంచి వచ్చిన కామ సుందరి మేళం. ఆ వెంటనే మంత్రులతో సామంతులతో, దండనాధులతో, కవులతో, పండితులతో, గాయకులతో శ్రీకృష్ణదేవరాయలు. ఊరేగింపు విజయనగర రాజు వీధులలో సాగుతుంటే తోవలో రాయలవారికి, మహాకవికి ప్రజలు హారతులు ఇచ్చారు. శఠకోపయతుల మఠం దగ్గర రాయలు, పెద్దన పల్లకి దిగి గురువుగారి పాదాలపై శిరస్సులు ఉంచారు. రాయలవారి నిండు సభలో, మను చరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడనెవ్వరీడు పేర్కొన నీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై చదవలేకపోయారు. పఠనానంతరం కవి పండితులందరూ మను చరిత్రలో, ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం ప్రారంభమైనదని కీర్తించారు.
ఇంత కన్నుల పండుగగా రాయలవారు మను చరిత్రను అందుకున్నారు.

2. యార్లగడ్డ తెలియజేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి.
జవాబు:
యార్లగడ్డ వారి ‘మాటతీరు’ గ్రంథంలో 200 పదాలకు శాస్త్రీయ విశ్లేషణ ఉంది. అందులో నుంచి స్వీకరించిన ఈ పాఠ్యభాగంలో నాలుగు ముఖ్యమైన పదాలు :
ఏరువాక పున్నమి :
జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అంటారు. ఏరు వాక పదాల కలయిక ఏరువాక. ఏరు అంటే నది. వాక అంటే వాగు. వర్షాలు పడడం వలన జ్యేష్ఠ పౌర్ణమి నాటికి ఏరులు, వాగులు ప్రవహిస్తాయి. ఇదే తొలకరి. తొలికారు అంటే వ్యవసాయ సంబంధంగా మొదటి ఋతువు. ఈ పౌర్ణమికి రైతులు కవుళ్ళు నిర్థారించుకోవటం, పాలేర్లను నియమించుకోవటం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల వారికి తొలకరి శ్రావణ పౌర్ణమి. శాసనాల్లో దీనిని పేరామణి పున్నమి అంటారు. ‘పేర్’ అంటే విత్తులు విత్తటం. ఆమణి అన్నది శ్రావణం నుంచి వచ్చింది. ఇరాంబరము అంటే వడగల్లు. తొలకరి వర్షాలప్పుడే వడగళ్ళు పడతాయి.

కొంగు బంగారం :
అనాయాసంగా కావలసింది లభిస్తే ఈ పదబంధాన్ని వాడతారు. వివాహిత స్త్రీల విషయంలో మాత్రమే వాడే పదబంధమిది. ప్రథమ సమాగమం సమయంలో వరుడు వధువు కొంగుకు ఒక కాసు బంగారు నాణాన్ని కడతాడు. అది వరుడు వధువుకు చెల్లించే కట్నం. దానిని వాడుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉంటుంది. దానిని తిరిగి ఆమె తన కోడలుకు కట్టటానికి కుమారునికి ఇస్తుంది. అలా అది పరంపరగా వెళుతుంది. కుమారులు ఒకరికన్న ఎక్కువుంటే, వేరే కొని ఇస్తారు. ఆచారం ఇంత కఠినంగా ఉన్నా, ఒక్కొక్కప్పుడు విధిలేని స్థితిలో ఆమెకు ఆర్థికావసరం కలుగవచ్చును. అప్పుడు ఇబ్బంది పడకుండా ఉపయోగించుకొవటానికి వీలవుతుంది. అందుబాటులో ఉన్న ధనంగా కొంగు బంగారమనే మాట వాడుకలోకి వచ్చింది.
ఇప్పుడు పురుషుల విషయంలో కూడ కొంగు బంగారమనే మాట రెడీ మనీ అనే భావనలో వాడుకలోకి వచ్చింది.

పులిహోర :
పుల్లని ఆహారాన్ని పులిహోర అన్నారు. రాయలసీమలో దీన్నే చిత్రాన్నమంటారు. కన్నడంలో పులియోదర. ఆహారానికి వికృతి ఓగిరం.‘గ’ కారం దకారమై పులిఓదర అయింది. ఇది నిజానికి ప్రత్యేకమైన వంట కాదు. రుచిని బట్టి ప్రత్యేకతను సంతరించు కుంది.మిగిలిపోయిన అన్నాన్ని చెడిపోకుండా నిలువ చేసుకోవటానికి చింతపండు పులుసు కలిపాము. దాని వలన కలిగే దోషాన్ని నివారించటానికి పసుపు వినియోగించాము. రుచికొరకు తాలింపు. పులిహోర సిద్ధమైంది.

అన్నం వృధా చేయకూడదని పెద్దల భావన. నిలువ చేయడం వలన రోగకారకం కారాదు. అందుకని పసుపు, నూనెలు వినియోగించారు. పుల్లని ఆహారం పులిహార వ్యవహారంలో పులిహోర అయింది.

పేదా సాదా :
పేదసాదల పట్ల మన్నన కలిగి ఉండాలి అని పెద్దలు చెపుతారు. సాధారణంగా ఆర్థికశక్తి లోపించిన వారిని పేదలంటారు. ఈ పదబంధం ఈ అర్థంలోనే వాడుతున్నాము ‘పేద’ అనే పదానికి ఇంకా చాలా అర్థాలున్నాయి. వాటికి ఈ పదబంధంతో సంబంధం లేదు. తమిళంలో పదేళ్ళలోపు ఆడపిల్లలను కూడ పేద శబ్దంతో చెపుతారు.
ఇక్కడ మాత్రం ‘పేదశబ్దం’ ఆర్థిక సంబంధమే ! దీనితో జోడించిన శబ్దం ‘సాద’. ఇది సంస్కృత శబ్దం ‘సాధు’ నుంచి వచ్చింది. వీరి జీవితం సంఘం వితరణపై ఆధారపడి ఉంది. కాబట్టి సాధు శబ్దానికి శాంతము అని కూడ అర్థం ఉంది. సాధు “జంతువు అన్నప్పుడు క్రూర స్వభావం కానిది అని చెపుతాము. వాడు పరమ సాధువు అంటే కోపం రాని, లేని వ్యక్తి అన్నమాట.

తిక్కనగారి విరాదిపర్వంలో సాధు శబ్దానికి శాంతమనే అర్థం చెప్పడం జరిగింది. నిజానికక్కడ ఉన్నది ‘సాతు’ అనే పదం. సాతు అనేది ఒక రకం కలుపుమొక్క కనుక పదాల అర్థాల విషయంలో చాలా మెలకువ వహించాలి.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూసిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిసున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడి పోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

2. ‘రేఖ’ పాత్ర ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు. దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది. బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు. చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

నార్కేటుపల్లిలో అరటిపళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది. ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసుకొంటుంది. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందనిపించింది రేఖకు దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

3. ఊతకర్ర కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
జవాబు:
ఏ మనిషికైనా అరవైయేండ్లు పై బడటమంటే ఊతకర్ర చేతికి రావటమనే అర్థం. జీవిత చరమాంకంలో అడుగుపెట్టినట్లే. ఆ సమయంలో వారికి ఆలనాపాలనా కరువైతే జీవితం దుర్లభం. ప్రేమానురాగాలు కరువైతే ఒంటరితనం ఒక నరకం. నిస్సహాయత, నిస్సత్తువ దెయ్యంలా పీడిస్తుంటే దినదిన గండమే. అటువంటి వారి జీవితం ఏటికి ఎదురీదుతున్నట్లే.

ఓ తండ్రి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. సుదూర తీరాల్లో పిల్లలు, భార్య కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు వారికి పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఆ తండ్రి ఒంటరివాడిగా జీవితాన్ని గడుపుతాడు. తనకంటూ ఓ ఇల్లు ఉంది. భద్రతకు, వంటావార్పుకు సదుపాయాలున్నాయి. అన్నింటికి వేర్వేరు గదులున్నాయి. కాని అవి అన్నీ దుమ్ముతో నిండి పీడ కళ కనబడుతోంది.

గుండె అట్టడుగు పొరల్లోని పుట్టేభావం అది అక్కడే ఆగిపోదు. గొంతుదాటి రాదు. అందరిలాగే ఆ తండ్రి కూడా ఈ దేశంలో మేధావిగా పుట్టడం ఒక శాపం అనుకున్నాడు. తన లాగా తన పిల్లలగతి కారాదని తలచాడు. బాగా చదివించాడు కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు. ఆ తండ్రి ఆశయం నెరవేరిందని సంతోషించాడు. కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా తలచాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కోరిక మేరకు అమెరికా వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసింది దూరపు కొండలు నునుపని. వాళ్ళు అక్కడ కేవలం యంత్రాలుగా మిగిలిపోయారు. డబ్బు – పని ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అదే జీవితం.

మన సంస్కృతికి వారి సంస్కృతి చుక్కెదురు. అక్కడ తెల్లవారిన దగ్గర నుండి కాలంతో పోటీపడుతూ పరుగుల జీవితం జీవించాలి. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది. పిల్లల దారి పిల్లలది. సాయంత్రం వాడిన ముఖాలతో ఇల్లు చేరడం, విశ్రాంతి తీసుకోవడం ఎవరికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు భోజనం చేయడం. ఇదంతా చూసిన ఆ తండ్రి అక్కడ జైలు జీవితాన్ని ఇష్టపడలేదు. ఇరుగూ లేదు పొరుగూ లేదు. ఇటు అటు తిరగడానికి లేదు. మాట మంతీ లేదు. గది ఒక బందిఖానా. ఇలా ఎంతకాలం అని భార్య రానని అన్నా ఇక్కడ గాలికోసం, స్వేచ్ఛ కోసం, ఈ మట్టి కోసం వెనుదిరిగి వచ్చేశాడు. ఒక ఏడాదికి పైగా ఏటికి ఎదురీది బాగా అలసిపోయాడు. ఇక ఈదడం తన వల్ల కాని పని అని ఆలోచిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు.

వంట మనిషి వచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి వెళుతుంది. వ్యాయామానికి రోజు రెండు కిలోమీటర్లు నడుస్తాడు, ఆయన దినపత్రిక చదువుతాడు. కాలకృత్యాలు తీర్చుకొనేసరికి ఆకలి వేస్తుంది. ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించుకుంటాడు. కనీసం లోట మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని బాధపడతాడు. అందరూ ఉన్నా ఏకాకి జీవితం. అందులోనూ అరవై నిండిన వృద్ధాప్యం. మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై నలిగిపోతుంటాడు. పుట్టిన రోజు కానుకగా తన బిడ్డలు పంపించిన ‘ఊతకర్ర’ ను చూసి ఆనందించాడు. ఆ కర్ర చేతపట్టుకొని మనసులేని మనుషులు పంపించిన ఈ కట్టెలో ఆత్మీయతలు అనుబంధాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఇంకెన్నాళ్లో ఈ కట్టే అని అనుకుంటూ ఓ కన్నీటి చుక్క రాల్చాడు. అది ఆ ఊతకర్రపై పడి జారిపోయింది.

4. ‘అంపకం’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటి నుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో. అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.

పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన ‘బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు. పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ? తన ప్రాణంలో ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు. బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు. శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరు పెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురుమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ఆనుకొని ఉంది పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ధి కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధ పడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.

ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు కాని ముద్ద గొంతులో దిగలేదు దుఃఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. సవతి బిడ్డల పోరు మనకేలా.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు ప్రాంతాల మధ్య ఐకమత్యం ఉంటే అభివృద్ధి సాధిస్తామని, మనలో మనకు గొడవలేమిటని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : సవతి తల్లి బిడ్డలలా ఈ గొడవలు మనకెందుకు.
భావము : మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలలో మనకు గౌరవం, పేరు, ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగోడా మనందరికీ తల్లి ఒక్కటే. మనము తెలుగుజాతి వారము. సవతి తల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము అని భావము.

2. వానికై వగవడొక్కడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : శ్మశానంలో పొరలుతున్న పేదవాని ప్రేతాత్మను గురించి వర్ణించే సందర్భం లోనిది.
అర్థం : అతనికై ఎవరూ దుఃఖించరు.
భావము : చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం ఏ ఆకలి బాధతో దుఃఖించి నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిది అయ్యుంటుంది కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు.

3. మనమున నాశ్చర్య రస నిమ్మగ్నుండగుచున్
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : స్వప్నములో జంగమదేవర అదృశ్యమవగా అదిరిపడి మేల్కొన్న తిన్నడు ఆశ్చర్యానికి గురియైన సందర్భంలోనిది.
అర్థం : మనసులో ఆశ్చర్యంలో మునిగితేలాడు.
భావము : మాయా జంగముడైన శివుడు కలలో కేతకీ నది ఒడ్డునున్న శివుని పూజింపమని చెప్పి అదృశ్యమవగా, ఉలికిపడి నిద్ర నుండి లేచి నలుదిక్కులూ వెతుకుతూ ఆశ్యర్య భావనలో తిన్నడు మునిగిపోయాడని భావము.

4. శుభగమనం బెడ సేఁత కృత్యమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రునికి, ధర్మరాజుకు మధ్య శునకాన్ని గూర్చి చర్చ జరిగి శునకాన్ని వదలమన్న సందర్భంలోనిది.
అర్థం : శుభం ప్రాప్తిస్తున్నపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసం కాదు.
భావం :- ధర్మరాజా ! పంతం వీడు, ఎందుకంటే అది ధర్మాన్ని హరించివేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు విడిచిపెడితే నీవు కఠినంగా ఉన్నట్లు కాదు. శుభం జరిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా చెప్పు అని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. పార్థుని మరణానికి గల కారణాలేవి ?
జవాబు:
ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటీ పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

2. వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలపండి.
జవాబు:
మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య, ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే. వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపరచాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన బొబ్బిలి పాలకుడి ధర్మపత్ని వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి. రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసికూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల. వీరంతా మన తోడబుట్టిన వీర సోదర, సోదరీమణులు వీరి పరాక్రమ గాధలను కథలు కథలుగా చెప్పారు.

3. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్ర్య వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

4. శ్మశానంలోని అభేద భావాన్ని తెలుపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6. తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్థ్వలోకములు.
1) అతల 2) వితల 3) సుతల 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు. ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతలమయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

2. సూర్యకాంతమ్మగారిని గురించి తెలపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసుగారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో వివాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు. సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.
ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

3. ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయండి.
జవాబు:
ద్విపద తెలుగువారి చిరంతనమైన ఆస్తి. తెలుగువారి పల్లెపదాలూ, ‘స్త్రీల పదాల వంటివి ద్విపద గణాలను అటూ ఇటూ మారిస్తేనో, ముందూ వెనకా కొన్నిటిని కత్తిరిస్తేనో, మరికొన్ని చేరిస్తేనో పుట్టేవే. దేశి కవితకు ఒరవడి దిద్దటంలో పాల్కురికి సోమనాథుడు ద్విపదనే అపురూపంగా ఎన్నుకున్నాడు. ద్విపద సామాన్యులకు కూడ సులభంగా అర్థమయ్యే చక్కని ఛందస్సు. చిరకాలంగా తెలుగువారు తమ సంతోషాలు, కష్టాలు, ఆనందాలు కన్నీళ్ళు ద్విపదలోనే చెప్పుకున్నారు. కలవారి కోడలు కలికి కామాక్షి పాటలో కూడ ద్విపద ఛందస్సే ఉంది.

4. కందుకూరి సంస్కరణలను వివరించండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.

కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.

కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. కొడవటిగంటి కుటుంబరావు గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల్యం జరిగింది. స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం. ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్ధిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్నఅంశాలకు సంబంధించి రాశారు కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.

2. వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా తెలపండి.
జవాబు:
వేములపల్లి శ్రీకృష్ణ గిరీశం, సాక్షి అనే కలం పేర్లతో కాగడా, నగారా పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’, ‘జాయేంగే కయ్యూరు’, ‘చెంచుపాట’, ‘రెడ్ ఆర్మీ’, ‘రండీ దేశసేవకు’, ‘అన్నాచెల్లెలు’, ‘రావోయి’ అనే గీతాలు శ్రీకృష్ణ రచించారు. ఇవన్నీ అరుణ గీతాలు అనే సంకలనంలో ఉన్నాయి.

వీరు బాపట్ల (1952), మంగళగిరి (1962, 1972) నియోజక వర్గాల నుండి మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సమర్ధుడైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు.

3. యస్వీభుజంగరాయ శర్మ జీవిత విశేషాలను తెలపండి.
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి. ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటిలోను విద్యనభ్యసించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.

4. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. కళాశాల ప్రధానాచార్యులు గారికి సెలవు గురించి విజ్ఞప్తి.
జవాబు:

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ప్రధానాచార్యులుగారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
ప్రాంతం : …………………

మహోదయులకు !
నేను మీ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈ నెల 30న మా అన్నయ్య పెళ్ళి జరగబోతోంది. పెళ్ళికి మా బంధుమిత్రులంతా వస్తారు. అయితే ఆ పెళ్ళికి మా ఇంట్లో మా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి నేను తప్ప ఎవరూ లేరు. పెళ్ళికి వారం రోజులు ముందుగా రమ్మని మా తల్లిదండ్రులు ముందే నాకు చెప్పారు. అందువల్ల నేను కళాశాలకు మరుసటి వారం హాజరుకాలేను. ఈ కారణంగా 24-7-2013 నుండి 31-7-2013 వరకు సెలవు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను.
నమస్కారాలతో,

చిరునామా :
XXXXXX,
XXXXX.

భవదీయ,
XXXXXX.

2. నీవు చూచిన వైజ్ఞానిక ప్రదర్శన గురించి నీ మిత్రునికి లేఖ.
జవాబు:

స్థలం : XXXXXX,
తేది : XXXXXX

ప్రియ మిత్రునకు,
నీ స్నేహితుడు ప్రేమతో వ్రాయునది. గత మాసములో విజయవాడలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన విశేషాలను నీకు తెలుపుతున్నాను. వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఏర్పాటు చేసి, విద్యార్థుల ఆసక్తిని, ప్రతిభను పెంపొందింపజేయుట జరుగుచుండును. విజయవాడలో ప్రతి సంవత్సరము జరుగు విధముగనే వైజ్ఞానిక ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. వ్యవసాయము, విద్య, ఆరోగ్యము, కళలు, శాస్త్రాది రంగములకు సంబంధించిన ఇట్టి ప్రదర్శనలు ప్రజలకు వినోద, విజ్ఞానములను కలిగించును. ఇటువంటివే రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగినచో దేశ ప్రగతితోపాటు ప్రజలు విజ్ఞాన సంపన్నులగుటకు అవకాశము కలుగును. మన ప్రభుత్వము వైజ్ఞానిక ప్రదర్శనల విషయములో మరింత చొరవను ప్రదర్శించవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, ఈ లేఖను ముగించుచున్నాను.

ఇట్లు
నీ మిత్రుడు
XXXXXX

చిరునామా :
XXXXXXXXX,
XXXXXXX,

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. అత్యంత
2. చిగురొత్తు
3. కదిలించియాడు
4. శిఖరాంచలము
5. అల్లిసెప్పారు
6. తోడబుట్టిన
7. హితోక్తులు
8. మునీంద్ర
జవాబు:
1. అత్యంత – అతి + అంత – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అవసర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఏకాదేశమగును.

2. చిగురొత్తు – చిగురు + ఒత్తు – ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధియగు.

3. కదిలించియాడు. కదిలించి + ఆడు – యడాగమసంధి.
సూత్రం : సంధిలేని చోట స్వరంబున కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

4. శిఖరాంచలము శిఖర + అంచలము – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదశమగు.

5. అల్లిసెప్పారు – అల్లి + చెప్పారు – గ, స, డ, ద, వా దేశసంధి.
సూత్రం : ప్రధమ మీది పురుషములకు గ, స, డ, ద, వ ళు బహుళముగానగు.

6. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన – సరళాదేశసంధి.
`సూత్రం : అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఆ) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు, -బిందు సంశ్లేషలు విభాషణగు.

7. హితోక్తులు – హిత + ఉక్తులు – గుణసంధి.
సూత్రం : ‘అ’కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ అనునవి ఏకాదేశమగు.

8. మునీంద్ర – ముని + ఇంద్ర – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు, పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. ముల్లోకములు
2. పెనుగాలి
3. ప్రకృతిరంగము
4. కాళిదాస భారవులు
5. ధనాధిపుడు
6. రజనీచరులు
7. ఇగురుబోండ్లు
8. ధైర్యలత
జవాబు:
1. ముల్లోకములు : మూడైన లోకములు – ద్విగు సమాసం.
2. పెనుగాలి : పెదదైన గాలి – విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం.
3. ప్రకృతిరంగము : ప్రకృతి అనెడి రంగము – రూపక సమాసం.
4. కాళిదాసభారవులు : కాళిదాసు మరియు భారవి – ద్వంద సమాసం.
5. ధనాధిపుడు : ధనముచేత అధిపుడు – తృతియాతత్పురుష సమాసం.
6. రజనీచరులు : రాత్రియందు చరించేవారు సప్తమి తత్పురుష సమాసం.
7. ఇగురుబోండ్లు : ఇగురువంటి మేను కలది. – బహువ్రీహి సమాసం.
8. ధైర్యలత : ధైర్యమనెడి లత – రూపక సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి.

1. సిద్ధ సాధ్యులు
2. దైర్యము
5. స్మశానము
6. క్రుషి
9. త్రుతీయ
10. ప్రదమ
3. బావం
4. ప్రక్రుతి
7. పాట్యము
8. దాన్యం
జవాబు:
1. సిద్ద సాద్యులు – సిద్ధ సాధ్యులు
2. దైర్యము – ధైర్యము
3. బావం – భావం
4. ప్రక్రుతి – ప్రకృతి
5. స్మశానము – శ్మశానము
6. క్రుషి – కృషి
7. పాట్యము – పాఠ్యము
8. దాన్యం – ధాన్యము
9. త్రుతీయ – తృతీయ
10. ప్రదమ – ప్రథమ

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Have satsang of Mahatma.
జవాబు:
మహాత్ముల సాంగత్యంలో జీవించు.

2. This is the India of my dreams.
జవాబు:
ఇది నా స్వాప్నిక భారతదేశం.

3. The villages are the back bone.
జవాబు:
గ్రామాలు దేశానికి వెన్నముక వంటివి.

4. God has ocean of mercy.
జవాబు:
భగవంతుడు కరుణాసాగరుడు.

5. Mahatma Gandhi was born a porbandar.
జవాబు:
మహాత్మాగాంధి పోర్బందరులో జన్మించారు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

ఏదైనా ఒక పద్యాన్ని, కవితని లేదా కావ్యాన్ని అధిక్షేపిస్తూ, హేళనగా, హాస్యంతో తిరిగి రాయడాన్ని పేరడీ అంటారు. పరిహాస దృష్టి ప్రధానంగా ఉండాలి. తెలుగులో వినుకొండ వల్లభరాయుడు వ్రాసిన క్రీడాభిరామంలో మొదటిసారిగా పేరడీ లక్షణాలు కనిపిస్తాయి. కాకతీయుల నాటి ఏకశిలానగరంలోని సమస్త పౌర జీవితాన్ని ‘సెల్యులాయిడ్’పై చూపిన హాస్య, అధిక్షేప సాంఘిక కావ్యం – క్రీడాభిరామం. ఇది తెలుగులో తొలి కల్పిత కావ్యం కూడా. కాసల్నాటి గోవింద మంచనశర్మ, టిట్టిభసెట్టి అనే ఇద్దరు యువమిత్రులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఓరుగల్లు నగరంలో చూసిన వింతలు, విశేషాలు, వినోదాలను సుందరంగా చిత్రించిన కావ్యం.

ప్రశ్నలు :
1. దేనిని పేరడీ అంటారు ?
జవాబు:
ఏదైనా ఒక పద్యాన్ని, కవితని లేదా అధిక్షేపిస్తూ, హేళనగా హాస్యంతో తిరిగి రాయడాన్ని.. పేరడీ అంటారు.

2. తెలుగులో మొదటగా ఏ గ్రంథంలో పేరడీ లక్షణాలు కనిపిస్తాయి ?
జవాబు:
తెలుగులో “క్రీడాభిరామం”లో మొదటి సారిగా పేరడి లక్షణాలు కనిపిస్తాయి.

3. క్రీడాభిరామాన్ని రచించింది ఎవరు ?
జవాబు:
క్రీడాభిరామాన్ని రచించింది వినుకొండ వల్లభరాయుడు.

4. ఏ నగరానికి చెందిన పౌర జీవితం క్రీడాభిరామంలో వర్ణించారు ?
జవాబు:
ఏకశిలా నగరంలోని పౌరజీవితం క్రీడాభిరామంలో వర్ణింపబడింది.

5. తెలుగులో తొలి కల్పిత కావ్యం ఏది ?
జవాబు:
తెలుగులో తొలి కల్పితకావ్యం క్రీడాభిరామం.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. ధర్మ పరీక్ష పాఠ్య భాగ రచయిత ఎవరు ?
జవాబు:
తిక్కన

2. ధూర్జటి అనగా అర్థమేమి ?
జవాబు:
శివుడు

3. సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత

4. కుబేరునితో మాయాయుద్ధం ఎవరు చేసారు ?
జవాబు:
రావణాసురుడు.

5. నిటాలేక్షణుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

6. స్వాహావల్లభుడు ఎవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.

7. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

8. ఈశ్వరుని మూడవ కంటికి దగ్ధమైనది ఎవరు ?
జవాబు:
మన్మథుడు.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. హాసము అనగా ఏమిటి ?
జవాబు:
హసమనగా నవ్వు.

2. నారదుని వీణ పేరేమిటి ?
జవాబు:
మహతి.

3. రాయలతో చదరంగం ఆడినది ఎవరు ?
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన.

4. దేశికవితకు ఒరవడి దిద్దిన దెవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాధుడు.

5. మాట తీరు గ్రంధ రచయిత ఎవరు ?
జవాబు:
యార్లగడ్డ బాలగంగాధర రావుగారు.

6. కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెలపండి ?
జవాబు:
వివేక వర్ధిని.

7. భారత ప్రభుత్వం కృష్ణశాస్త్రిని ఏ బిరుదుతో సత్కరించింది ?
జవాబు:
పద్మభూషణ్.

8. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

Leave a Comment