AP Inter 2nd Year Telugu Model Paper Set 5 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 5 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 5 with Solutions

గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము
వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
జవాబు:
ప్రతిపదార్థం :
తులన్ = ఒక త్రాసులో
వెలయంగన్ = అమరేటట్లు
వేయునున్ = వేయి
అశ్వమేధంబులు = అశ్వమేధయాగాలు ఒకవైపుగా
ఒక్క సత్యమును = ఒక్క సత్యాన్ని మాత్రమే ఒకవైపుగా
ఇరుగజలన్ = రెండు తక్కెడలలోనూ
ఇడి = ఉంచి
తూఁపగన్ = తూచగా
గౌరవంబున = బరువు యొక్క
పేర్మిన్ = ఆధిక్యంతో
సత్యము వలనన = సత్యంవైపు మాత్రమే
ములు + చూపున్ = మొగ్గు చూపుతుంది (సత్యమే గొప్పదని భావం)

తాత్పర్యం : ఓ రాజా ! ఒక త్రాసులోని రెండు తక్కెడలలోనూ వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, ఒక్క సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉండేటట్లు అమర్చి తూచగా సత్యం గొప్పదనం వల్ల ముల్లు సత్యం ఉన్న తక్కెడ వైపే మొగ్గు చూపుతుంది. అనగా సత్యమే గొప్పదని నిరూపణ జరుగుతుందని తాత్పర్యం.

2. జనకునిభంగి రామనృపచంద్రుని నన్నును దల్లిమాఱుగాఁ
గని కొలువంగ నేర్చుగుణగణ్యుని లక్ష్మణు నీతిపారగున్
వినఁ గన రానిపల్కు లవివేకము చేతను బల్కినట్టి యా
వినుతమహాఫలం బనుభవించితి నంచునుఁజాటి చెప్పుమా.
జవాబు:
ప్రతిపదార్థం :
రామనృపచంద్రునిన్ = రాజశ్రేష్ఠుడైన శ్రీరాముని
జనకుని భంగిన్ = తండ్రి గానూ
నన్నును = నన్ను
తల్లి మాఱుగాన్ = తల్లికి బదులు గానూ
కని = చూచి
కొలువంగన్ = మమ్మల్ని సేవించడానికి
నేర్చు = ఇష్ట
గుణగణ్యునిన్ = సద్గుణములచే లెక్కింపదగినవాడునూ
నీతి పారగున్ = నీతి పండితుడునూ అయిన
లక్ష్మణున్ = లక్ష్మణుడిని
వినన్ = వినడానికిని
కనన్ = చూడ్డానికినీ
రాని = తగని
పల్కులు = మాటలు
అవివేకముచేతను = అజ్ఞానము చేత
పల్కి నట్టి = మాట్లాడిన
ఆ = ఆ
వినుత మహాఫలంబు = ప్రసిద్ధమైన గొప్ప ఫలితాన్ని
అనుభవించితిన్ = నేను అనుభవించాను
అంచును = అని
చాటి చెప్పుమా = చాటించి చెప్పుము

తాత్పర్యం : లక్ష్మణుడు, శ్రీరామచంద్రుని తండ్రి వలెనూ, నన్ను తల్లివలెనూ చూసి మమ్ము సేవించడానికి ఇష్టపడే సుగుణవంతుడు. నీతిపండితుడు. అటువంటి లక్ష్మణుని నేను అవివేకంతో అనరాని, వినరాని మాటలు అన్నాను. ఆ విధంగా లక్ష్మణుడిని అన్నందుకు, మహాఫలితాన్ని నేను అనుభవించాను అని చాటించి చెప్పు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. భట్టు రాయబారానికి వచ్చిన కారణాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ క్రీ.శ. 12వ శతాబ్దంలో జరిగిన ఒక చారిత్రక గాథ. ‘పల్నాటి వీరచరిత్ర’ నుంచి గ్రహించిన ప్రస్తుత పాఠ్యభాగం ‘శాంతి కాంక్ష’లో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు భట్టు రాయబారిగా వెళ్ళి సంధికోసం చేసిన చివరి ప్రయత్నం వర్ణించబడ్డది.

అనుగురాజు : అనుగురాజు గురజాలను రాజధానిగా చేసుకొని పల్నాటి రాజ్యాన్ని పాలించేవాడు. అతనికి మైలమాదేవి, విద్యలదేవి, భూరమాదేవి అని ముగ్గురు భార్యలు. అనుగురాజు వల్ల మైలమాదేవికి నలగాముడు, విద్యలదేవికి పెదమలిదేవుడు, పిన మలిదేవుడు, బాల మలిదేవుడు అనే ముగ్గురు, భూరమాదేవికి కామరాజు, నరసింగరాజు, ఘట్టిరాజు, పెరుమాళ్ళరాజు అనే నలుగురు కుమారులు జన్మించారు. ఈ ఎన మండుగురిలో నలగామరాజు పెద్దవాడు.

బ్రహ్మదేవుడు : అనుగురాజు మంత్రియైన దొడ్డనాయని కుమారుడే బ్రహ్మనాయుడు. అనుగురాజు పెద్దవాడైన నలగామునికి పట్టాభిషేకం చేశాడు. ఎనిమిది మంది అన్న దమ్ములూ ఐకమత్యంతో కలిసిమెలసి ఉండేటట్లు చూసే బాధ్యతను అనుగురాజు బ్రహ్మనాయనికి అప్పజెప్పాడు.

నలగామరాజు, మలిదేవరాజు : అనుగురాజు చేరదీసిన నాగమ్మ అనే స్త్రీ రాజ్య విషయాలలో జోక్యం చేసుకుంటూ నాయకురాలుగా ఎదిగింది. తనను లెక్కచేయని బ్రహ్మనాయుడి మీద ఆమె పగ పెంచుకుంది. నలగామునికి ప్రధానిగా బ్రహ్మనాయుడి వైభవాన్ని ఆమె సహించలేకపోయింది. నలగామునికి లేనిపోనివి నూరిపోసింది. నాగమ్మ చెప్పుడు మాటలు నమ్మి నలగామరాజు తమ్ములైన మలిదేవాదులను చెరలో బంధించాడు. కుటుంబ కలహాలను నివారించటానికి మధ్యవర్తిత్వం చేసి రాజ్యాన్ని రెండుగా విభజించాడు. నలగాముని భాగానికి గురజాల రాజధాని, మలిదేవుని భాగానికి మాచర్ల రాజధాని.

నాగమ్మ : నలగామునికి నాగమ్మ మంత్రి, మలిదేవునికి బ్రహ్మనాయుడు మంత్రి. బ్రహ్మనాయుడికీ నాగమ్మకూ మధ్య పుట్టిన ఈర్ష్య అసూయలే పల్నాటి మత ద్వేషానికీ, యుద్ధానికీ దారితీశాయి. బ్రహ్మనాయుడి మంత్రిత్వంలో సిరిసంపదలతో తులతూగే మలిదేవుడి రాజ్యాన్ని చూసి నాగమ్మ ఓర్వలేకపోయింది. ఆమె ప్రేరణతోనే నలగామరాజు మలిదేవాదులను కోడిపందేల కోసం గురజాల పిలిపించాడు.

కోడిపందెం : బ్రహ్మనాయుడికీ, నాగమ్మకూ మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది. పందెంలో ఓడిపోయినవారు ఐదు సంవత్సరాలు వనవాసం చేయాలి. ఒప్పందం ప్రకారం మలిదేవాదులు వనవాసానికి వెళ్ళారు.

అలరాజు రాయబారం : ఇక రెండేళ్ళలో వనవాసం పూర్తికావస్తోంది. కనుక మలిదేవాదులు రాజ్య భాగం కోసం అలరాజును నలగామరాజు దగ్గరకు రామబారిగా పంపారు. రాయబారిగా వెళ్ళిన అలరాజు చంపబడ్డాడు.

భట్టు రాయబారం : అల్లుడైన అలరాజు చంపబడటంతో మలిదేవాదులు అగ్రహోద గ్రులయి యుద్ధానికి సిద్ధమయ్యారు. కార్యమపూడి (కారెంపూడి) యుద్ధభూమికి సైన్యంతో చేరుకున్నారు. సంధికోసం చివరి ప్రయత్నంగా నలగామరాజు దగ్గరకు భట్టును రాయబారిగా పంపించారు.

ముగింపు : ఇట్లా మలిదేవాదుల తరపున రాయబారిగా నలగామరాజు కొలువుకు వచ్చిన భట్టు యుద్ధం ఆపటం కోసం, సంధి కోసం ఎంతో ప్రయత్నించాడు.

2. రాజును కన్యక ప్రతిఘటించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం :- ‘కన్యక’ అనే కవితాఖండికలో గురజాడ అప్పారావు ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టటానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు వర్ణించ బడ్డాయి.

రాజు దౌర్జన్యం : సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఆమె ఒకసారి బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి, నుదుటున కుంకుమ పెట్టుకొని పూజ కోసం గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది. చుక్కల్లో చంద్రుని లాగా వెలుగుతున్న ఆమెవంటి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు. ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరు పొందాలని భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించ బోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది. సెట్టి ఎన్ని రకాలుగా వేడుకున్నా రాజు తన అహంకారాన్ని వీడలేదు. పైగా తాను కూడా ఆలయానికి బయలుదేరాడు.

కన్యక ప్రాణత్యాగం : గుడిలో కన్యక దుర్గాదేవిని పూజించింది. తన నగలు అన్నీ దుర్గాదేవికి సమర్పించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలను ఉద్దేశించి రాజులకే రాజులుగా బతకాలని హితబోధ చేసింది. తర్వాత కన్యక రాజు ముందుకు నడిచింది. పట్టపగలు, నడివీధిలో విటులు, దొంగలు అయినా స్త్రీలను పట్టుకోరు కదా ! నువ్వు మాత్రం పట్టణానికి రాజువై ఉండి కూడా ఒక స్త్రీని నడివీధిలో పట్టబోయావు. నువ్వు ఒక రాజువేనా ! అధికార మదంతో నువ్వు చేసిన ఈ దౌర్జన్యాన్ని చూసిన దేవుడు నిన్ను దండించకుండా ఉండడు. ఇదిగో ! మా కులం పెద్దలు వచ్చారు. వివాహానికి సాక్షిగా అగ్ని ఉన్నది. నువ్వు కన్నేసిన కన్యను నేను నీ ఎదురుగానే ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు ? నువ్వు నిజంగా రాజువే అయితే నన్ను పట్టుకో ! అంటూ రాజుతో పలికి కన్యక అగ్నిగుండంలో దూకింది.

రాజుకు అపకీర్తి : కన్యక ప్రాణత్యాగంతో రాజు గర్వం నశించింది. అతని అధికారం మట్టిలో కలిసిపోయింది. కోటమేడలు కూలిపోయి, నక్కలకు నిలయమయ్యాయి. కన్యక ఆత్మాహుతి చేసుకున్న చోట ఒక పెద్ద మేడ వెలసింది. ఈ ఘటనలో రాజుకు మాత్రం శాశ్వతంగా అపకీర్తి మిగిలిపోయింది.
ముగింపు : ఈ విధంగా కన్యక రాజును ప్రతిఘటించింది.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. పూర్వకాలంలో వేడుకలు, వినోదాల గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. తెలుగు సంస్కృతిలో భాగాలైన వివిధ రకాల ఆటలు, వేడుకలను ఈ వ్యాసం ద్వారా యువతకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్పవేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరము లకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలం నుండి మంచి ప్రాచుర్యం వచ్చింది. ఇక వసంతోత్సవం తరువాత చెప్పదగిన వేడుక శరదుత్సవం. దీనిని మహాలక్ష్మీపండుగలని, దేవీ నవరాత్రులని పిలిచేవారు. మన పండుగలు, వేడుకలు మత సంబంధమైనవే! గ్రామాలలోని దేవుని కళ్యాణం, గ్రామదేవతల జాతరలు దీనికి ఉదాహరణలు. మనకున్న పండుగలలో వసంతోత్సవం శరదుత్సవాలతోపాటుగా మకర సంక్రమణం (సంక్రాంతి) పండుగ కూడా ఒకటి. దీనిని ‘పెద్ద పండుగ’ అని పేరు.

సంక్రాంతి పండుగ దినాలలో జరుపుకొనే వేడుకలలో కోడిపందెములు ఒకటి. కోడిపందాలు వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వపు సంస్థానాధీశులకు కోడిపందాలు ఒక వేడుకగా ఉండేవి. పల్నాటి యుద్ధమునకు కారణం ఈ కోడి పందాలేనని చరిత్ర వలన తెలుస్తుంది. పూర్వ గ్రంథాలైన క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథాల వలన తెలుగు నేలపై వృషభపోరు, మేషయుద్ధము, దున్నపోతుల పోరు, గజయుద్ధము, పొట్టేళ్ళ పోరు మొదలగు ప్రజావినోదపు వేడుకలున్నట్లు తెలుస్తుంది. కుంతలదేశరాజైన సోమేశ్వర భూపతి తాను రచించిన ‘అభిలషితార్థ చింతామణి’ అను మారు పేరుతో ఉన్న ‘మానసోల్లాసం’ అనే విజ్ఞానకోశంలో ఈ వినోదవర్ణలకు ఒక ప్రకరణాన్నే వ్రాశాడు. దానిలో మల్లయుద్ధము, గజయుద్ధము, అశ్వయుద్ధాలు, ఆబోతుల దున్నపోతుల పోరాటములు, పొట్టేళ్ళ, కోళ్ళ పోరాటాలను వర్ణించాడు. పూర్వకాలంలో ‘వేట’ కూడా ఒక క్రీడ వేడుక వలె ఉండేది. దీనిలో పాదివేట, విడివేట, తెరవేట, దామెనవేట అని పలు రకములు ఉండేవి. పూర్వకాలమున ఈ వేడుకలు వినోదములు నేడు చాలా వరకు అంతరించిపోయాయి.

2. తెలుగులో వచ్చిన జాతీయోద్యమ కవిత్వాన్ని వివరించండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.

సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని ‘జాతీయోద్యమం’ అంటారు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు పలురూపాలలో జరిగాయి. తెలుగు నేలపై జాతీయోద్యమ ప్రభావం వందేమాతర ఉద్యమ ప్రచారానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రాంతానికి వచ్చిన నాటి నుండి ప్రారంభమయింది. ఆయన ఆంగ్ల ఉపన్యాసాలకు తెలుగు అనువాదంగా “భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
“తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”
ఇది వందేమాతరం గురించి రాసింది కాదు. బ్రిటీషువారి దోపిడీని ప్రజలకు తెలియ జేయటానికి వ్రాసింది. చిలకమర్తి కవితల స్ఫూర్తితో సామ్రాజ్యవాదుల దోపిడీ మీద, భారత ప్రజలు అనుభవిస్తున్న దారిద్య్రం మీద తెలుగు కవులు పద్యాలు గేయాలు వ్రాశారు. చెన్నాప్రగడ భానుమూర్తి ‘డ్రెయిను’ సిద్ధాంతం గురించి, చిదంబరరావు మితవాద రాజకీయాలను గురించి వ్రాశారు.

“మేలుకొనుమీ భరత పుత్రుడ.
మేలుకొనుమీ సుజన పుత్రుడ
ఇలా మితవాద, వందేమాతరం, హోంరూల్ ఉద్యమాల మీద కవితలు వెల్లువలా వచ్చాయి.
సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, శాశనోల్లంఘనం వంటి గాంధీ పోరాట రూపాలన్నీ తెలుగు పాటలు గాను గేయాలుగాను, కవితలుగాను వెలువడ్డాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, ఖిలాఫత్ ఉద్యమం మీద, రాట్నం మీద, మద్యపాన నిషేధం మీద తెలుగు కవుల పద్యాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.
జలియన్ వాలాబాగ్ ఉదంతానికి బ్రిటీషువారు డయ్యరును అభినందించినపుడు
“దయ్యమునకు నిముడు
అలడయ్యరు అధముడని గరిమెళ్ళ
పశుబలమునకు భక్తుండొకడు బడాయి ఓ” డయ్యరు
అని చిల్లరిగె శ్రీనివాసరావు విమర్శల వర్షం కురిపించారు. “మా కొద్దీ తెల్లదొరతనం”, జాతీయోద్యమ తెలుగు కవితలలో ప్రజాదరణను పొందింది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. ‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెల్పండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో ‘లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు.

న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా ? చచ్చినట్లా ? అని తన ఆవేదనను పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు. ‘ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించ మని చెప్పింది.

దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని తెలియజేయండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళులేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు. కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్బారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లోపడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.

తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్ డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.

విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను. భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు సత్యాన్ని సుదర్శన్.

3. ‘ఆశ ఖరీదు అణా’ నాటిక పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రదేశం అది. దాదాపు 22 కుటుంబాలున్న ఆ లోగిలిలో అందరికి సమస్యలు. ఎవరి సమస్యలు వారివి. ఉద్యోగ విరమణ చేసిన తాతగారు గంపెడు సంసారంతో బాధపడుతుంటాడు. కొత్తగా అద్దెకు దిగిన యువకుడు నిరుద్యోగి, అవివాహితుడు. ఏవో బొమ్మలు గీస్తూ తన మనోభావాలను వాటి ద్వారా బహిర్గతం చేస్తుంటాడు. ఇందిర, ఆనందలక్ష్మి అక్కాచెల్లెళ్ళు. క్రింది వాటాలో ఉంటారు. జబ్బుతో మంచానపడిన తల్లి, అకారణంగా జైలుకెళ్ళిన తండ్రి, నిరుద్యోగి అయిన అన్నయ్య పైగా అమాయకంతో తల్లిదండ్రుల గూర్చి బాధపడుతుంటాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ తల్లినీ, అన్నయ్యను అభిమానంగా చూసుకుంటుంది. ఆత్మన్యూనతా భావంతో అన్నయ్య ఎప్పుడూ కృష్ణవేణితో గొడవపడుతుంటాడు. తనకు ఒక ఉద్యోగం వస్తే చెల్లెల్ని ఉద్యోగం మానిపించేయాలనుకుంటూ ఉంటాడు.

కృష్ణమూర్తి అనే ఆయన బ్యాంకు ఉద్యోగి. తనవరకు తాను అన్నట్లు చిన్న ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన యువకునితో పరిచయం చేసుకుంటూ మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఉంటే ఏ బ్యాంకు అని ఆరాలు తీస్తాడు. దానికి సమాధానంగా నా ఎకౌంటు నా జేబులోనే ఉంది అయినా ఖాళీగానే ఉందని అంటాడు. బహుశా బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు నచ్చరేమో అని తనలో తాను అనుకుంటాడా యువకుడు. పైన ఉండే ఆడపిల్లలను చులకన చేసి మాట్లాడటం ఆ యువకునికి నచ్చలేదు.

ఇందిరా, ఆనందలక్ష్మిలను గూర్చి ఆలోచిస్తాడు. పరిచయమైన అమ్మాయి పేరు ఏమిటో అని అనుకుంటాడు. ఇంతలో కృష్ణవేణి. లక్ష్మీ దగ్గరకు వచ్చి తన అన్నయ్య గురించి తన బాధను చెప్తుంది. ఉద్యోగం కోసం వెళ్ళిన అన్నయ్య ఎప్పటికీ రాకపోయేసరికి ఇందిర, లక్ష్మీలు కంగారుపడతారు. ఆకలితో యువకునికి నిద్ర పట్టదు. సమస్యలతో తాతగారు పచార్లు చేస్తుంటాడు. తొమ్మిదిమంది సంతానం. వచ్చే పింఛను చాలీచాలదు. పెళ్ళి చేసిన ఇద్దరి కొడుకులకు ఉద్యోగాలు లేవు. పెద్ద కోడలి ప్రసవం. ఇన్ని సమస్యలతో నిద్రరాక బయట తిరుగుతుంటాడు. యువకుడు ఒంటరిగా తిండిలేక, తిరుగుతుంటాడు. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లలో పడి మాట్లాడుకుంటూ ఉండగా బ్యాంకు ఉద్యోగి ” తన భార్యకు తుమ్ములు ఆగటం లేదని మందుల దుకాణం తెరిచి ఉంటుందా అని కంగారుగా వస్తాడు.

అన్నయ్య మాటలు పడలేక కృష్ణవేణి ఇందిర, లక్ష్మిల దగ్గరకు వస్తుంది. బ్రతుకంటే విరక్తి చెందిన వ్యక్తి కృష్ణవేణి. ఉద్యోగ వేటలో ఎక్కడో తిరుగుతున్న ఇందిర, లక్ష్మీల అన్నయ్య ఇంకా రాలేదని కంగారుపడతారు. ఎవరూ లేని ఒంటరి జీవితం ఎందుకనుకొని యువకుడు ప్రాణత్యాగం చేయాలనుకుంటూ రోడ్డుమీదకు వస్తాడు. ఇంతలో కారుప్రక్కగా పడిన నీడలా కనిపించిన వ్యక్తిని చూస్తారు లక్ష్మీ, ఇందిరలు. అన్నయ్యా అంటూ అరుస్తారు. తాతగారు దగ్గరగా వెళ్ళి చూసి లేవదీస్తాడు. కారుక్రింద పడి చనిపోదాం అనుకున్నది అంతా చెడిపోయిందని బాధపడతాడు. వెంటనే తాతగారు మీరంతా దగాపడ్డ తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూను చావడానికి లక్ష కారణాలుంటే, బ్రతకటానికి కోటి కారణాలుంటాయి. నా సమస్యల ముందు మీ సమస్యలు ఏమాత్రం.

బ్రతకటంలో ఉండే మాధుర్యం మీకు తెలియదు. ముందు మీరందరూ ధైర్యంతో బ్రతకండి. ఏ కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉంది. అంతమాత్రాన మనల్ని మనమే అసహ్యించుకోకూడదు. జీవితంలో ఆనందాన్ని పోల్చుకోండి. దేనికి భయపడకండి. మీకందరికి బ్రతకడం నేర్పిస్తానని అంటాడు తాతగారు. ఇంతలో లాంతరు వెలుగులో కాఫీ తలా ఓ గ్లాసు తాగమంటాడు తాతగారు. వారందరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. గ్లాసు కాఫీ అణా. అలాగే వారందరిలో ఆశ ఖరీదు అణాగా పాత జ్ఞాపకాలు, ఆశలు చిగురిస్తాయి. అందరూ తాతగారి గొప్పతనానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

4. ‘తెరచిన కళ్ళు’ నాటిక ద్వారా రచయిత అందించిన సందేశం ఏమిటి ?
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.
విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి. మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.

ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో . సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయ పడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడతాడు. ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్ కి. విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.

చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొందమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే నాకీ అవస్థ. వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.

భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే డాక్టర్కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినందించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు. డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.

1. ఒక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.
సందర్భం : ఈ మాటలు సత్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భంలోనిది.
భావం : నూరుగురు కుమారుల కంటే ఒక్క సత్యవాక్యము మేలైనది అని భావం.
వ్యాఖ్య : నూరు చేదుడు బావులు కంటే ఒక దిగుడు బావి మేలు. అటువంటి నూరు దిగుడు బావులకన్నా ఒక్క గొప్ప యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకన్నా గుణవంతుడైన ఒక్క కుమారుడు మేలు. అటువంటి నూరుగురు కుమారులు కన్నా ఒక్క సత్యవాక్యం మేలైనది.

2. పోరు మంచిది కాదు భూమి నెక్కడను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నలగామరాజుతో భట్టు పలికిన సందర్భంలోనివి.
భావము : ఈ భూమిమీద ఎక్కడైనా సరే యుద్ధం మంచిది కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! అన్నదమ్ములైన మీరిరువురూ కలిసిమెలసి ఉంటే రాజ్యానికి ఎంతో లాభం. కనుక స్నేహం కోసం నీ తమ్ముడైన మలిదేవరాజు దగ్గరకు నీకు ఉంతో నమ్మకస్తుడైన నరసింగరాజును పంపించు. ఈ భూమిమీద ఎక్కడైనా సరే కలహం ఎప్పటికీ మంచిది కాదు అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.

3. కోకిల మేధం సాగుతున్నది.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము : అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న కవి ఈ గేయం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భంలోనిది.
భావము : ఆడదానికంటే అడవిలో మానుకే విలువనిస్తున్న సమాజం మనది. కట్నం కోసం కోడలి బ్రతుకును నాశనం చేసిన అత్తమామలు రాక్షసులా? పిశాచాలా? ఆకలి తీర్చుకోవటానికి లేళ్ళను చంపే పులులున్న ఈ దేశంలో, కట్నం కోసం కోకిలల వంటి కోడళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారని ఇందలి భావం.

4. నా ముందు నిలబడ్డాడు కొత్త మానవుడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా॥ అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ‘ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగుదనం యొక్క నిలకడ కోసం సముద్రమంత కన్నీటితో వున్న ఆధునిక మానవుని స్థితిని కవి చెప్పిన సందర్భంలోనిది.
భావము : తెలుగు నేలపై సంప్రదాయము, ఆధునికత, సంస్కారము అనే మూడింటిని కలగలిపిన కషాయాన్ని జీర్ణించుకోలేక చక్కని తెలుగుదనాన్ని ఆస్వాదించలేక సముద్రమంత ‘ కన్నీటితో నా ముందు కొత్త మానవుడు నిలబడ్డాడని ఇందలి భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

1. సత్య వాక్యం వేటికంటే గొప్పది ?
జవాబు:
నూరు మంచినీటి బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమంది కంటే ఒక సత్యవాక్యం మేలైనది. అంతేకాక ఒక త్రాసులో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉంచి తూచగా ముల్లు సత్యంవైపే మొగ్గుచూపుతుంది. తీర్థాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటంకానీ సత్యవ్రతానికి సాటిరావు. అందువల్లనే ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

2. సీతాదేవి హనుమంతుని ఏమని దీవించింది ?
జవాబు:
సీతాదేవికి నమ్మకము కలిగించుట కొరకు హనుమ తన నిజ స్వరూపమును చూపించి, మరల సూక్ష్మరూపము ధరించి నమస్కరించి నిలబడగా, సీతాదేవి హనుమంతునికి తన శిరోరత్నమును ఇచ్చి ఇలా దీవెనలు పలికినది.
సూర్యవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు శ్రీరాముని యోగక్షేమాలను నీ వలన తెలుసుకొన్నాను.
నేను అనేక విధాలుగా ఇక్కడ పడుతున్న కష్టాలను నీ ద్వారా ఆయనకు తెలుపుకో గలిగాను. నీ సహాయానికి తగిన విధంగా నేను ఏమి ఇవ్వగలను ? నీవు ఈ భూమండలము. నందు బ్రహ్మకల్పముల పర్యంతము చిరంజీవిగా వర్థిల్లు ! అని దీవించెను.

3. మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనమవుతున్నాయి ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అను పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

మనుషుల అనుబంధాలు ప్రపంచీకరణం వలన నాశనమౌతున్నాయి. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. తూర్పున ఉన్న భారతదేశంపై పశ్చిమ దేశాల నీడ పడుతున్నది. అది మన అనుబంధాలకు విఘాతం కల్గిస్తుంది. బహుళ జాతి సంస్థల రాజ్యాల సంబంధాల వలన మన ఉనికిని మనం కోల్పోతున్నాం. సంస్కృతిపరమైన మన హస్తకళలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ప్రపంచీకరణ వ్యాపార లావాదేవీల వలన మన వ్యాపారం వైకుంఠ పాళీలో పెద్ద పాము కరచిన విధంగా నాశనమౌతుంది. ఇటువంటి వికృత స్థితిగతుల వలన మనుషుల మధ్య అనుబంధాలు విమాన రెక్కల మీద నుండి సముద్రంలోకి జారిపోతున్నాయి. ఇక అనుభవాలు, యంత్రాలనే అద్దాల ముందు నిలబడి బట్టతలను దువ్వుకోవలసిందేనని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

4. స్వాతంత్య్ర హీనులు ఎలా ఉంటారని భట్టు తెలిపాడు ?
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో స్వాతంత్ర్యహీనుల దైన్యస్థితిని ఇట్లా వర్ణించాడు.

స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతక వలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించబడ్డ పక్షులలాగా బతకాలి. పాములు వాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దులవాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి అని స్వాతంత్ర్య హీనుల గురించి భట్టు తెలిపాడు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. గెలుపెద్దుల మాన్యమును గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది.

తెలుగుదేశం వ్యవసాయం ప్రధానవృత్తిగా అనుసరించటం వలన ప్రజల జీవనం పాడిపంటలపై, పశుసంపదపై ఆధారపడింది. వ్యవసాయమునకు బలిష్ఠమైన ఎద్దుల అవసరం ఉన్నది. అందుకు మేలుజాతి ఎద్దులను తయారుచేయుటకు గ్రామస్థులు ఒక మాన్యమును ఏర్పాటు చేసుకునేవారు. దీనినే గెలు పెద్దుల మాన్యం అంటారు. కనుమపండుగనాడు పశుప్రదర్శన ఎడ్ల పందెములు జరిగేవి. ఆ పందెములో ఎవరి ఎద్దు గెలుస్తుందో ఈ గెలుపెద్దుల మాన్యం ఆ ఏడాది ఆయన ఆధీనంలో ఉంటుంది. ఇది ఈనాటి ‘రోలింగ్ కప్’ వంటిది. అలా అని అన్ని గ్రామాలలోనూ గెలుపెద్దుల మాన్యాలుండవు. కనుమనాడు పశువులతో వేడుకలను జరుపుకొనుట మాత్రం ప్రతి గ్రామంలో ఉండేవి.

2. అర్థ విపరిణామ సంకేతార్థం గురించి వ్రాయండి.
జవాబు:
భాషకు రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం రెండు అర్థం. ఈ రెండింటిలో కాలక్రమంలో మార్పులు. వస్తుంటాయి. అలా పదాల యొక్క అర్థాలలో వచ్చే మార్పులను “అర్థ విపరిణామం” అంటారు. భాషా శాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలుగా చెప్పింది.
1. అర్థ సంకోచం 2. అర్థ వ్యాకోచం 3. గ్రామ్యత 4. సౌమ్యత్వము 5. సంకేతం.
సంకేతము : కొందరు కొన్ని సంకేతములను కల్పించుకొని మాట్లాడుతారు. ఇట్టి సంకేతములు వృత్తులను బట్టి కులములను బట్టి కూడా ఏర్పడతాయి. ఒక జన సమూహములో మాట్లాడు సాంకేతికాలు రెండవ సమూహము వారికి పూర్తిగా ముసుగు మాటలుగా ఉంటాయి. ఉదాహరణకు వైదికుల పరిభాషలో ‘ఇంద్రాణి’ అంటే ‘వితంతువు’ అని అర్థం. తగవుల మారి స్వభావము కలిగిని వారిని ‘చండిక’ అని విశ్వామిత్రుడని, దుర్వాస మహర్షి అని పలువిధములైన పదాలు వాడబడుతున్నాయి. కారణం లేకుండా తగవులను పెట్టువానిని ‘నారదుడని’ అంటుంటారు. చండశాసనుడైన అధికారికి వీడు యముడురా అని, మంచి వానికి ‘ధర్మరాజని’ పేర్లు పెట్టుట మనకు తెలిసినదే! అబద్ధాలు మాట్లాడువానిని హరిశ్చంద్రుడని పిలుచుట మనం వింటుంటాం. స్వభావాలకు బదులు కొన్ని సంకేత పదాలను కల్పించుకొని మాట్లాడటాన్ని సంకేత మంటారు.

3. వేములవాడ భీమకవిని గురించి వ్రాయండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
“చాటుపద్యాలు చెప్పిన ప్రాచీనాంధ్ర కవులలో భీమకవి ఒకరు. వేములవాడ భీమకవి తెలుగు సాహిత్యంలో కేవలం చాటువుల వలననే ఇప్పటికీ బతికి ఉన్నాడు. ఇతడి పేర చలామణిలో ఉన్న చాటువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చారిత్రక వృత్తానికి ఒక గుప్త సత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.

“గడియ లోపల తడి గడగి ….. వేములవాడ భీమకవిని అన్న పద్యంలో తిట్టుకవుల పట్టిక ఉంది. మేధావి భట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడభాగ్ని భట్టు ఈ నలుగురూ ఒకరిని మించిన వారింకొకరు. భీమకవి ఇతర చాటువులలో పేర్కొన్న సాగి పోతరాజు, మైలమ భీముడు, కళింగ గంగు లాంటి వ్యక్తులు కూడా చారిత్రక పరిశోధనాంశాలుగా మిగిల్చాడు.

4. బలిజేపల్లి వారి స్వరాజ్య కాంక్షను తెల్పండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం ‘త్రిపురనేని మధుసూదనరావు’ గారిచే రచించబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” అను, గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
జాతీయోద్యమ కాలంలో తెలుగు సాహిత్యంలో రచనలు చేయని కవులు లేరంటే లేరు. వారిలో చిలకమర్తి, చన్నా ప్రగడ భానుమూర్తి, బలిజేపల్లి వార్లు ముఖ్యులు.
“వడకు నూలు వలువలు నేసి
చేతివృత్తులు లేవదీసి
కల్లు సారా లెల్లరోసి
జైళ్ళలోకెళ్ళి వద్దాం”
అని స్వరాజ్య ఉద్యమానికి ప్రజా సంఘాలను ఉసిగొలిపారు. ఆంగ్లేయుల పాఠశాలలను పాడు’ పెట్టమని, వారి కోర్టులను కూలదోయమని, సీమ గుడ్డలను చింపివేసి స్వదేశీ బట్టలను ధరించమని, అందుకోసం జైలుకైనా వెళ్ళాలని స్వరాజ్య కాంక్షను బలిజేపల్లి వారు ప్రజలలో రేకెత్తించారు.

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. నన్నయ ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
రాజరాజ నరేంద్రుని.

2. బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి ?
జవాబు:
మలిదేవరాయల మంత్రి.

3. హనుమంతుని తల్లి పేరేమిటి?
జవాబు:
అంజనాదేవి.

4. మనిషికి, మనిషికి మధ్య సంబంధాలు ఏమయ్యాయి ?’
జవాబు:
మార్కెట్లో సరుకులయ్యాయి.

5. అద్దేపల్లి రచించిన తొలి పద్యకావ్యం ఏది ?
జవాబు:
మధు జ్వాల.

6. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా! రచయిత ఎవరు ?
జవాబు:
కలేకూరి ప్రసాద్.

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 =6)

1. చదరంగం ఆటను పూర్వం ఏమని పిలిచేవారు ?
జవాబు:
అష్టపదం.

2. చాటువులు పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
డా|| సి. నారాయణ రెడ్డి.

3. తెలుగు భాషకు మొదటిగా హాస్య రచనను అందించిందెవరు ?
జవాబు:
గురజాడ.

4. కాంతం కథల రచయిత ఎవరు ?
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావు.

5. తెలుగు కవులు ‘ఎలిజీ’ లను ఎప్పుడు వ్రాశారు ?
జవాబు:
గాంధీజీ మరణించినపుడు.

6. అగస్త్య భ్రాత అంటే అర్థం ఏమిటి?
జవాబు:
మూర్ఖుడని అర్థం.

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. నైలునది ప్రపంచంలో పొడవైన నది – దీనిలో నామవాచకాన్ని గుర్తించండి.
జవాబు:
నైలునది నామవాచకము.

2. అవ్యయం అంటే ఏమిటి ?
జవాబు:
లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు.

3. విశేషణానికి ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
మంచి చెడు, నలుపు – తెలుపు.

4. క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని సూచించే పదాన్ని క్రియ అంటారు.

5. మీరు మంచి విద్యార్థులు – దీనిలో సర్వనామమేది ?
జవాబు:
‘మీరు’ అన్నది సర్వనామం.

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. వాక్యానికి ఉండే లక్షణాలేమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి.

2. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ.
జవాబు:
రాజు అహంకారి.

3. సామాన్య వాక్యానికి ఉదాహరణ.
జవాబు:
గాంధీజీ మనకు స్వాతంత్య్రం తెచ్చాడు.

4. వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
అర్థవంతమైన పదముల సముదాయం.

5. అరుణ్ ఇంటికి వెళ్ళి, వంట చేశాడు ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఉత్పలమాల
జవాబు:
ఉత్పలమాల: ఉత్పలమాల అంటే కలువపూల మాల అని అర్థం. ఈ పద్యం నడక అంత సుకుమారంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు.
లక్షణాలు : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటె ఎక్కువ పాదాలు రాస్తే దానిని ‘ఉత్పలమాలిక’ అంటారు). ప్రతి పాదంలోను వరుసగా ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 10వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే నాలుగు పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
Img 1
యతి మైత్రి : 1 – 10 అక్షరాలైన ‘వి – వి’ లకు యతి పాటించబడింది.
ప్రాసాక్షరం : ‘ద్య’ అనే సంయుక్తాక్షరం ప్రాసగా ఉంది.

2. శార్దూలం
జవాబు:
శార్దూలం: శార్దూలాన్ని ‘శార్దూల విక్రీడితం’ అని కూడా అంటారు. శార్దూలం అంటే పెద్దపులి అని అర్థం. ఈ ఛందస్సు నడక పెద్ద పులి అరుపులాగా రౌద్రంగా ఉంటుంది. అందువల్ల దీనికాపేరు పెట్టారు. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి. ప్రతిపాదంలో మొత్తం 19 అక్షరాలు ఉంటాయి.
యతి మైత్రి 1 – 13 అక్షరాలకు ఉంటుంది. ప్రాసనియమం ఉంటుంది.
Img 2
యతి మైత్రి : 1వ అక్షరం ‘ఏ’ అనే అచ్చుకు, 13వ అక్షరం ‘నీ’ లో గల ‘ఈ’ అనే అచ్చుకు చెల్లింది. దీనిని స్వరమైత్రి అంటారు.
ప్రాసాక్షరం : ‘న్న’ అనే అక్షరం. ద్విత్వ నకారం ప్రాసగా ఉంది.

3. కందం
జవాబు:
కందం: కందం చిన్న పద్యమైనా ఎక్కువ లక్షణాలు గలది. అందుకే ‘కందం రాసినవాడే కవి’ అనే నానుడి వచ్చింది. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒకటి, మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు ఐదేసి గణాలు ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, మూడు నాలుగు పాదాలను ఒక భాగంగాను పేర్కొంటారు. కంద పద్యంలో ‘భ, జ, స, న, ల, గ, గ’ అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడాలి. బేసి సంఖ్య గల గణాలలో (1, 3, 5, 7 గణాలలో) ‘జ’ గణం రాకూడదు. ఆరవ గణం ‘జ’ గణం కానీ ‘నల’ కానీ ఉండాలి. యతి మైత్రి రెండు, నాలుగు పాదాలలో 1 – 4. గణాల మొదటి అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. రెండు, నాలుగు పాదాల చివరి అక్షరం విధిగా గురువై ఉండాలి. మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ గురువుతోనే ప్రారంభం కావాలి. లేదా మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ లఘువుతోనే ప్రారంభం కావాలి.
Img 3
యతి మైత్రి : రెండో పాదంలో ‘న’ అనే అక్షరం లో సంధిగతంగా ఉన్న ‘అ’ కారానికీ, నాలుగో గణంలో సంధిగతంగా ఉన్న ‘య’లోని ‘అ’ కారానికీ చెల్లింది.
ప్రాసాక్షరం : ‘క్క’ అనే అక్షరం అంటే ద్విత్వ కకారం ప్రాసగా ఉంది.

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరమును ‘ప్రాస’ అంటారు.

2. చంపకమాల గణాలేవి ?
జవాబు:
న, జ, భ, జ, జ, జ, ర.

3. మత్తేభమునకు యతిస్థాన మెంత ?
జవాబు:
14వ అక్షరం.

4. సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యాన్ని వ్రాస్తారు ?
జవాబు:
తేటగీతి గాని ఆటవెలది గాని.

5. ఉపజాతులలో ఏ నియమం ఉండదు ?
జవాబు:
ప్రాస నియమం ఉండదు.

6. ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను చెప్పే శాస్త్రం.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. లాటానుప్రాస
జవాబు:
లాటానుప్రాస: అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదం కలిగిన పదాలు వెనువెంటనే వస్తే అది లాటాను ప్రాసాలంకారం. అర్థం అంటే పదానికి ఉన్న సామాన్యమైన అర్థం. తాత్పర్యం అంటే ఆ పదానికి సందర్భానుసారంగా మనం విశేషంగా తీసుకొనే అర్థం. ఈ క్రింది ఉదాహరణలను చూడండి.
‘అమ్మ చూపించే ప్రేమ ప్రేమ !’
మొదటి వాక్యంలో ‘ప్రేమ’ అనే మాట రెండు సార్లు వచ్చినప్పటికీ, మొదటిసారి వచ్చిన ప్రేమ అనే మాటకు ‘ప్రేమ, వాత్సల్యం’ అని అర్థాలు. అదే పదం వెనువెంటనే వచ్చినప్పటికీ, దాన్ని మనం ‘నిజమైన ప్రేమ’ అనే తాత్పర్యాన్ని తీసుకుంటాం. ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థం వేరు, తాత్పర్యం వేరు. దీన్నే మనం లాటానుప్రాసం అని పిలుస్తున్నాం.

మరికొన్ని ఉదాహరణలు :
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!

2. ఉపమాలంకారం
జవాబు:
ఉపమాలంకారం: ఉపమాలంకారాన్ని ఉపమానాలంకారం అని కూడా అంటారు. ఉపమ అంటే సామ్యం లేదా పోలిక అని అర్ధం. ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైన పోలిక చెపితే అది ఉపమాలంకారం. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చడం. ఇందులో నాలుగు భాగాలుంటాయి.
1. ఉపమేయం : మనం దేన్నయితే వర్ణిద్దామనుకుంటామో ఆ వస్తువు. అంటే వర్ణింపబడే వస్తువు.
2. ఉపమానం : ఉపమేయాన్ని వర్ణించడానికి దేన్నయితే పోలికగా తీసుకొస్తామో అది ఉపమానం.
3. సమానధర్మం : పై రెండింటిలో అంటే ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మం లేదా గుణం సమాన ధర్మం.

3. అతిశయోక్తి
జవాబు:
అతిశయోక్తి : ఒక వస్తువు యొక్క స్థితిని, గుణాన్ని లేదా స్వభావాన్ని ఉన్నదాని కంటే ఎక్కువగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ : ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగంలో కవయిత్రి మొల్ల ఒక చక్కని అతిశయోక్తిని ప్రయోగించింది. సీతాదేవి కోరిక మేరకు హనుమంతుడు తన చిన్న వానర దేహాన్ని విపరీతంగా పెంచిన సందర్భంలోనిది ఈ పద్యం.
చుక్కలు తలపూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదమునొందె నాత్మ స్థితికిన్
నక్షత్రాలే తన తలపూవులగునట్లుగా, ఆకాశవీధిలో ఆశ్చర్యంగొలిపే విధంగా తన శరీరాన్ని పెద్దది చేసి సీతాదేవికి ఆనందం కలుగజేశాడు హనుమంతుడు. ఇది అతిశయోక్తి అలంకారం.
1. ఆలయగోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
2. మా వీధిలో ఒకాయన తాటిచెట్టంత పొడవు.

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. సంసార సాగరం దీనిలో అలంకారం ఏది ?
జవాబు:
రూపకాలంకారం.

2. శబ్దాలంకారమంటే ఏమిటి ?
జవాబు:
శబ్ద ప్రాధాన్యం గల అలంకారాన్ని శబ్దాలంకారమంటారు.

3. అంత్యానుప్రాసకు ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
పొలాలన్నీ
హలాల దున్ని
ఇలా తలంలో హేమం పండగ
జగాని కంతా సౌఖ్యం నిండగ

4. ఊహ ప్రధానంగా ఉండే అలంకారమేది ?
జవాబు:
ఉత్ప్రేక్షాలంకారం.

5. ఉపమేయమంటే ఏమిటి ?
జవాబు:
వర్ణింపబడే వస్తువు.

6. నీలమేఘచ్ఛాయబోలు దేహము వాడు ‘దీనిలో అలంకారమేది ?
జవాబు:
స్వభావోక్తి.

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

భారత జాతికి జీవగఱ్ఱలైన రామాయణ, మహాభారతాలలో ఆంధ్రుల ప్రశస్తి ఉంది. మెగస్తనీసు, మార్కోపోలో, పేయస్ వంటి అనేక మంది విదేశీయాత్రికులు తెలుగువారి గొప్పదనాన్ని ప్రశంసించారు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి తెలుగు రాజులు శాతవాహనులు. వీరి తరువాత ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్షాహీలు, నిజాం పాలకులు వరుసగా తెలుగుదేశాన్ని పాలించారు. రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప పాలకులు ; నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, వేమన లాంటి కవులు ఆంధ్రదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయ సంగీతజ్ఞులు తెలుగువారి సొత్తు. గోదావరి, కృష్ణా వంటి గొప్ప జీవనదులతో, సారవంతమైన భూములతో పునీతమైన తెలుగు నేలలో జన్మించడం మన అదృష్టం.
జవాబు:
ఆంధ్రుల యొక్క ప్రశస్తి భారత, రామాయణ కావ్యాలలో ఉంది. మన గొప్పతనాన్ని విదేశీయులైన మెగస్తనీస్, పేయస్ వంటివారు మెచ్చుకున్నారు. తెలుగు నేలను శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు మొదలగువారు పాలించారు. రాణి రుద్రమదేవి, కృష్ణదేవరాయలు వంటి పాలకులు నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతనలాంటి కవులు మనకున్నారు. అన్నమయ్య, త్యాగయ్య వంటి సంగీత విద్వాంసులున్నారు. జీవనదులైన కృష్ణా, గోదావరులు మన నేలను పునీతం చేస్తున్నాయి. ఈ నేలపై పుట్టటం మన అదృష్టం.

Leave a Comment