AP Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 10 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. కపివదనుండనైన ………………….. యడంగెడు రాక్షసాధమా.
జవాబు:
కపివదనుండనైన ననుఁ గల్గిని నీవ మాన దృష్టితో
నిపుడు హసించినాఁడ విట నీ దృశవక్త్రముఖుల్ నఖాయుధుల్
కపు లిఁక నీ కులం బడపఁ గల్గెద రంతటఁ గండగర్వమున్
దపమునఁ బుట్టు బెట్టిదముఁ దామె యడంగెడు రాక్షసాధమా.

భావం : ఓ రాక్షసాధమా ! రావణా ! కోతిముఖము కలిగినవాడనైన నన్ను చూసి అవమానించావు. ఇదే విధమైన ముఖములు కలిగిన కోతులు తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ కులమును, కండబలముచే తపఃఫలముచే వచ్చిన గర్వము అణచివేస్తారు.

2. ఇట నస్పృశ్యత ………………… ధర్మంబిందు గారాడెడిన్
జవాబు:
ఇట నస్పృశ్యత సంచరించుటకుఁ దావే లేదు, విశ్వంభరా
నటనంబున్ గబళించి, గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేఁక నొఁక ప్రక్కన్ జేర్చి జోకొట్టి, యూ
అంటఁ గల్పించునభేద భావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్.

భావం : ఈ శ్మశానంలో అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో, ప్రాణాలు తీసి భూగర్భంలో (మట్టిలో) కలిసిపోయేట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్విక మేకను పక్కప్రక్కనే చేర్చి జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుల వంటి భేద భావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నని చూసి బోయలు ఏవిధంగా దుఃఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.

నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దుఃఖిస్తారు.

వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూమూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.

ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు.

మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.
అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మరచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా దు:ఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి మా మనస్సు అంగీకరించడం లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగి రాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప ధనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.

ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.

నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దుఃఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.

2. దశకంఠుడు మాయాయుద్ధంలో ధనదుణ్ణి గెలిచిన విధానాన్ని తెలపండి.
జవాబు:
నందీశ్వరుని శాపము అని పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయా శ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ చేత వరాలను పొందిన రావణుడు లోకములన్నింటిలోని వారిని బాధలకు గురిచేస్తుండగా రావణుని అన్న అయిన కుబేరుడు అతనికి నీతులు చెప్పమని దూతని పంపాడు. రావణుడు కోపముతో ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు.

రావణుని మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, ధూమ్రాక్షులు కుబేరుని ముందు నిలువలేకపోవటం వలన రావణుడే స్వయంగా కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు. రావణుడు వాడియైన బాణములను కుబేరునిపై ప్రయోగించాడు. కుబేరుడు కోపముతో గదాయుధమును చేపట్టి రావణుని పది తలలపై ఉన్న కిరీటములు కొట్టి సింహనాదం చేశాడు. రావణుడు కోపించి వాడియైన బాణములు కుబేరుని వక్షస్థలంపై గుచ్చునట్లు ప్రయోగించాడు. అపుడు కుబేరుడు రావణునిపై ఆగ్నేయాస్త్రమును వేశాడు. దానికి విరుగుడుగా రావణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ కుబేరులు ఒకరికొకరు తీసిపోకుండా పోరాడు రెండు సింహములవలే యుద్ధము చేశారు. వారిద్దరి పోరాటమును చూసి దేవతలు పొగడ్తలతో ముంచెత్తారు.

అపుడు రావణుడు అష్ట సిద్ధులను పొందినవాడై మాయా యుద్ధమును చేయ ప్రారంభించాడు. ఒకసారి మేఘము వలే ఆకాశ మార్గమునుండి పిడుగులను కురిపించాడు. ఒకసారి సింహ రూపమును, ఒకసారి కొండ రూపమును మరొకసారి సముద్ర రూపమును, అలా పులి రూపమును, అడవిపంది రూపమును, హానికరమైన పాము రూపమును ధరించి యుద్ధము చేశాడు.

అలా మాయాయుద్ధము చేస్తూ రావణుడు గదను ధరించి కుబేరుని తలపై కొట్టాడు. ఆ దెబ్బకు కుబేరుడు పూచిన అశోక వృక్షము గాలికి కూలినట్లు రధముపై కూలాడు. ఆ విధంగా నేలకూలిన కుబేరుని రధమును, సారధి నందానదీ తీరమునకు తీసుకొని పోయాడు. రావణుడు మాయా యుద్ధమున గాని కుబేరుని గెలవలేకపోయాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. పంతులుగారు పత్రికల ద్వారా సంఘ చైతన్యానికి చేసిన కృషిని తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగంగారు సత్యవాది, చింతామణి, వివేక వర్ధని అనే మూడు పత్రికలను స్థాపించి తద్వారా సంఘంలో చైతన్యానికి దోహదం చేశారు.
తన శక్తి యుక్తులను, భౌతిక మానసిక శక్తులను ద్రవ్యాన్ని చివరకు తన ప్రాణాన్ని స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని కందుకూరి వారు ‘సత్యవాది’ పత్రికలో ప్రకటించారు.
‘స్త్రీలు విద్యకు తగరు’ అని వ్యతిరేకులు అన్నప్పుడు ‘పురుషులు విద్యకు తగరు’ అని ఎగతాళి చేస్తూ వీరు ‘వివేక వర్ధని’ లో రాశారు.

దేవదాసీల గురించి వ్యభిచార వ్యక్తిని గురించి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించటం వల్ల ఈ వృత్తి పై ప్రజలలో జు ఎప్స కలిగింది. ఆయన స్థాపించిన వివేక వర్ధని చాలా కాలం నిరాటంకంగా పని చేసింది.

తను స్థాపించిన పత్రికలను సంఘ చైతన్యం కోసమే వీరేశలింగం వినియోగించారు. తరతరాలుగా ప్రజల మనసుల్లో మూఢ నమ్మకాల రూపంలో పాతుకుపోయిన భావాలను పత్రికలలో తన వ్యాసాల ద్వారా మార్చటానికి వీరేశలింగంగారు ఎంతో కృషి చేశారు. పత్రికలను నడపటానికి ఎన్నో వ్యయ ప్రయాసలు కోరారు.

కందుకూరి మహా నిరాడంబర జీవి తన కోసం ఖర్చుల విషయంలో ఆయనది పిసినారి దృష్టి. తనకున్నదంతా పత్రికల నిర్వహణ, సంఘ సంస్కరణ కార్యక్రమాలకే వినియోగించిన వితరణ శీలి.
వీరు తన పత్రికల్లోనే కాక ఇతర పత్రికల్లోను అనేక వ్యాసాలు రచించారు. తన పత్రికలను సంఘ సంస్కరణకు ప్రధాన సాధనంగా చేశారు. పత్రికలలో సృజనాత్మక రచనలు చేశారు. చర్చా వేదికలు నిర్వహించారు.
వీరేశలింగం గారు తాను పత్రికలలో రాసిన వ్యాసాలను ఉపన్యాసం అనే పేరుతో పిలిచారు. అయితే తరవాత ఈ పదం ఎక్కువ కాలం వ్యవహారంలో లేదు.

పత్రికలను సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలో, పత్రికల ద్వారా సంఘ చైతన్యం ఎలా తీసుకురావచ్చో వీరేశలింగం తన పత్రికల ద్వారా తెలియబరిచారు.

2. కలవారి కోడలు కలికి కామాక్షిలోని గ్రామీణ సంస్కృతిని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి అన్నది జానపద బాణీలో సాగిన పాట. ఇది ఒకనాటి గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. అత్తాకోడళ్ళు, తోటికోడళ్ళు, వదినా మరదళ్ళు వారి మధ్య పెను వేసుకున్న బంధాలు, చిన్న చిన్న ఆరళ్ళు, అలకలు, చతురోక్తులు, ఒదిగి వుండటాలు, ఎగిరి పడటాలు ఇలాంటివన్నీ ఎంతో హృద్యంగా ఉండేవి. ఇవన్నీ నాటి తరానికీ నేడు మిగిలిన మధుర జ్ఞాపకాలు.

ఈ పాటలో పాతకాలపు సంపన్నమైన తెలుగు ఉమ్మడి కుటుంబం తాలూకా కట్టుబాట్లు, నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, చిత్రించబడి ఉన్నాయి. వెనకటి రోజుల్లో కలవారంటే పంటచేలు, పైరుపచ్చ, గొడ్డు గోదా ఎడతెగని పాడి ఉన్న

గ్రామీణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన చుట్టానికి గుమ్మంలోనే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళివ్వటం ఆచారం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న కోడలిని చూడటానికి ఆమె పుట్టింటివారు అరుదుగా వస్తారు. ఇప్పటిలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవటం, పుట్టింటి వారు వచ్చెయ్యటం నాడు లేదు. అన్నను చూడగానే కామాక్షి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

బిడ్డ పుట్టాక ఏడాది లోపల పురిటి మంచాన్ని చూడటం ఒక ఆచారం పుట్టింట్లో పురుడు పోసుకుని, అత్తవారింటికి బిడ్డతో వచ్చిన స్త్రీని, ఏడాది లోపల తండ్రో, అన్నలో వచ్చి పురిటి మంచం చూడటానికి పుట్టింటికి తీసుకువెళ్ళాలి. కామాక్షి అన్నయ్య ఇందుకోసమే వస్తాడు. వస్తూ పల్లకి కూడ తెస్తాడు.

అత్తవారింట్లో, ఉమ్మడి కుటుంబంలో ఉన్న స్త్రీ, పుట్టింటికి వెళ్ళాలంటే అది తేలికైన విషయం కాదు. ముందు అత్తగారిని అనుమతి అడగాలి. మామగారిని కాదు. తెలుగు వారిలో అత్తవారిల్లు అంటాం కాని మామగారిల్లు అనం. ఇంటి పెత్తనం, యజమానిగా ఉండటం అంతా మామగారిదే అయినా అత్తగారిల్లే అంటాం. కోడళ్ళను ఆరళ్ళు పెట్టినా, అవసరమైనపుడు అనునయించినా అత్తగారే చేస్తుంది. ముందు అత్తగారి అనుమతి తీసుకున్నాక, మామగారినడగాలి. తరవాత బావగారిని, తోటికోడలుని అడగాలి. ఆ తరవాత చివరగా భర్త అనుమతి పొందాలి. ఇంకా ఆడబడుచులు, మరుదులు ఉంటే వారి అనుమతి పొందాలి. కామాక్షి అందరినీ, పుట్టింటికి పంపమని అనుమతి అడుగుతుంది.

తోటికోడళ్ళు మధ్య సూయలు, పనుల విషయంలో వంతులు ఉండటం సహజం. కాని, వారి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు కూడ ఉంటాయి. ఇంటికి పెద్దకోడలు అయిన స్త్రీ, తరువాత కోడళ్ళుగా వచ్చిన వాళ్ళకు ఇంట్లో వారి స్వభావాలు, ఎవరెవరితో ఎలా మాట్లాడవలసి ఉంటుంది వంటి విషయాలు తన అనుభవంతో చెపుతుంది. కామాక్షికి వాళ్ళ తోటికోడలు అలాగే చెపుతుంది.

ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రతి యింటా వ్యవసాయమే ప్రధానంగా ఉండేది. ఇంటికి పెద్ద అయిన వ్యక్తి పిల్లలు ఎదిగి వచ్చే దాకా వ్యవసాయం చేసి, తరువాత బాధ్యతలు వారికి అప్పజెప్పేసి అవసరమైన సలహాలు ఇస్తూ వుంటాడు. ఇప్పుడు లేవుగాని ఆ రోజుల్లో సంపన్ను ‘ వారి ఇళ్ళలో పట్టెమంచాలు ఒకటో రెండో సాధారణంగా ఉండేవి. అవి ఠీవికి, సంపదకూ, గౌరవానికి గుర్తుగా భావించబడేవి.
జానపద గేయాల్లో ఎంతో గ్రామీణ సంస్కృతి వ్యక్తమవుతుంది.

IV. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. దహేజ్ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండ పైకి వచ్చి వధూవరుర్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య

కూర్చున్నాడు. వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు. ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్ పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

2. ‘ఏచ్చరిక’ పాఠ్యభాగం ద్వారా భూస్వాముల దౌర్జన్యాన్ని వివరించండి.
జవాబు:
నర్సిరెడ్డి పటేలు దగ్గర పెంటయ్య పని చేస్తూ ఉంటాడు. నిజాం పాలనలో పటేలు, పట్వారీ వ్యవస్థ ఉండేది. పెంటయ్య కొడుకు రాములు 20 సంవత్సరాల యువకుడు. రాత్రి బడిలో వయోజన విద్య ద్వారా చదువుకుంటాడు. తరతరాలుగా పటేలు దగ్గర పనిచేయడాన్ని ఇష్టపడడు రాములు. పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు ఇక్కడ జీతానికి ఉండనంటున్నాడట మరి బాకీ ఎవరు తీరుస్తారు? మా బాకీ తీర్చి ఎక్కడికైనా పొండి అని అంటాడు పటేలు. అప్పటివరకు మేపిన బర్రెను కొట్టంలో కట్టి దూడకి కాస్త గడ్డి వేసి వస్తాడు రాములు. ఏమిరా జీతానికి ఉండనని అంటున్నావట అని రాములుని పటేలు ప్రశ్నించాడు మారు మాటాడలేదు రాములు. చేతిలో కాని ఉంటే ఎవరైనా వస్తారు. మా అప్పు చెల్లగొట్టి ఎటైనా పోవచ్చునని అన్నాడు పటేలు.

అప్పుడే వచ్చిన పెంటయ్యతో ఆ సాతాని పంతుల్ని పిలిపించి కాగితాలతో పటేలు వస్తాడు. పంతులు పెంటయ్య ముందు కాగితాలు పెడతాడు. కాస్త లెక్కలు చూడండి వీళ్ళు తొందర చేస్తున్నారని అంటాడు. పెంటయ్య తాత పెళ్ళికి చేసిన అప్పు ఒక కాగితం. పెంటయ్య తండ్రి పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం, పెంటయ్య పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం ఇలా మూడు తరాలుగా వాళ్ళ ఇంట్లో పెళ్ళి పేరంటం అయినా పురుడు అయినా తీసుకున్న దానికి వాళ్ళ జీవితాంతం వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయాలనేది ఆనాటి భూస్వాముల అభిప్రాయం. పెంటయ్య కూడా చిన్ననాటి నుండి పటేలు ఇంట్లో చాకిరీ చేస్తూనే ఉన్నాడు. వారి కష్టాన్ని వడ్డీ కింద జమచేసి అసలు అప్పు అలాగే ఉంచేవారు. వాళ్ళు బయటకు వెళ్ళి బ్రతకకూడదు. వాళ్ళకు జబ్బు చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గరే అప్పు తీసుకోవాలనే వాళ్ళు ఆనాటి పటేళ్ళు. వీళ్ళ కష్టం వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులు పెరుగుతాయి గాని వీళ్ళ అప్పు తీరదు. ఇది అన్యాయ మనిపించే రాములు పటేలు దగ్గర పనిచేయనని చెప్పాడు. పంతులు లెక్కగట్టి 2 వేల రూపాయిలు దాకా అప్పు ఉన్నట్లు చెప్పగానే రాములు ఈ కాగితాలు ఎందుకు దాచిపెట్టారు? మా పాడి ఆవును తీసుకున్న దానికి అప్పులో తగ్గించలేదా ? మేకపోతును కోసుకుని తిన్నదానికి అయిన పైసలు అప్పులోనుండి తగ్గించలేదా ? అని రాములు అడుగుతాడు. కూలి పనిచేయించుకునే వారు వాళ్ళను బానిసల్లా చూడడమే తెలుసు ఆనాటి భూస్వాములకు.

ఏది ఏమైనా అప్పు తీర్చి ఎటైనా పొండి అని పటేలు తండ్రీ కొడుకులతో అంటాడు. పెదపటేలు ఈ పటేలు తండ్రి అప్పుడు రెండు దున్నలు, ఒక బర్రె ఉన్న సంసారం వారిది. ఇప్పుడు మూడు దొడ్ల పశువులు అయినాయి. ఇరవై ఎకరాల భూమి ఇప్పుడు ఏభై ఎకరాలు అయింది. ఇలా వాళ్ళ ఆస్తి పాస్తులు పెంచుకోవడమే గాక, పనివాళ్ళను వదిలిపెట్టకుండా వాళ్ళ అవసరాలకు కొంత డబ్బు ఇచ్చి వడ్డీలు వేసి చాకిరి చేయించుకుని వాళ్ళు స్థితిమంతులయ్యే వాళ్ళు ఆనాటి పటేళ్ళు.

3. ‘ఊతకర్ర’ కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
జవాబు:
ఏ మనిషికైనా అరవైయేండ్లు పై బడటమంటే ఊతకర్ర చేతికి రావటమనే అర్థం. జీవిత చరమాంకంలో అడుగుపెట్టినట్లే. ఆ సమయంలో వారికి ఆలనాపాలనా కరువైతే జీవితం దుర్లభం. ప్రేమానురాగాలు కరువైతే ఒంటరితనం ఒక నరకం. నిస్సహాయత, నిస్సత్తువ దెయ్యంలా పీడిస్తుంటే దినదిన గండమే. అటువంటి వారి జీవితం ఏటికి ఎదురీదుతున్నట్లే.

ఓ తండ్రి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. సుదూర తీరాల్లో పిల్లలు, భార్య కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు వారికి పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఆ తండ్రి ఒంటరివాడిగా జీవితాన్ని గడుపుతాడు. తనకంటూ ఓ ఇల్లు ఉంది. భద్రతకు, వంటావార్పుకు సదుపాయాలున్నాయి. అన్నింటికి వేర్వేరు గదులున్నాయి. కాని అవి అన్నీ దుమ్ముతో నిండి పీడ కళ కనబడుతోంది.

గుండె అట్టడుగు పొరల్లోని పుట్టేభావం అది అక్కడే ఆగిపోదు. గొంతుదాటి రాదు. అందరిలాగే ఆ తండ్రి కూడా ఈ దేశంలో మేధావిగా పుట్టడం ఒక శాపం అనుకున్నాడు. తన లాగా తన పిల్లలగతి కారాదని తలచాడు. బాగా చదివించాడు కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు. ఆ తండ్రి ఆశయం నెరవేరిందని సంతోషించాడు. కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా తలచాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కోరిక మేరకు అమెరికా వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసింది దూరపు కొండలు నునుపని. వాళ్ళు అక్కడ కేవలం యంత్రాలుగా మిగిలిపోయారు. డబ్బు – పని ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అదే జీవితం.

మన సంస్కృతికి వారి సంస్కృతి చుక్కెదురు. అక్కడ తెల్లవారిన దగ్గర నుండి కాలంతో పోటీపడుతూ పరుగుల `జీవితం జీవించాలి. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది. పిల్లల దారి పిల్లలది. సాయంత్రం వాడిన ముఖాలతో ఇల్లు చేరడం, విశ్రాంతి తీసుకోవడం ఎవరికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు భోజనం చేయడం. ఇదంతా చూసిన ఆ తండ్రి అక్కడ జైలు జీవితాన్ని ఇష్టపడలేదు. ఇరుగూ లేదు పొరుగూ లేదు. ఇటు అటు తిరగడానికి లేదు. మాట మంతీ లేదు. గది ఒక బందిఖానా. ఇలా ఎంతకాలం అని భార్య రానని అన్నా ఇక్కడ గాలికోసం, స్వేచ్ఛ కోసం, ఈ మట్టి కోసం వెనుదిరిగి వచ్చేశాడు. ఒక ఏడాదికి పైగా ఏటికి ఎదురీది బాగా అలసిపోయాడు. ఇక ఈదడం తన వల్ల కాని పని అని ఆలోచిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. వంట మనిషి వచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి వెళుతుంది. వ్యాయామానికి రోజు రెండు కిలోమీటర్లు నడుస్తాడు, ఆయన దినపత్రిక చదువుతాడు. కాలకృత్యాలు తీర్చుకొనేసరికి ఆకలి వేస్తుంది. ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించుకుంటాడు. కనీసం లోట మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని బాధపడతాడు. అందరూ ఉన్నా ఏకాకి జీవితం. అందులోనూ అరవై నిండిన వృద్ధాప్యం. మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై నలిగిపోతుంటాడు. పుట్టిన రోజు కానుకగా తన బిడ్డలు పంపించిన ‘ఊతకర్ర’ ను చూసి ఆనందించాడు. ఆ కర్ర చేతపట్టుకొని మనసులేని మనుషులు పంపించిన ఈ కట్టెలో ఆత్మీయతలు అనుబంధాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఇంకెన్నాళ్లో ఈ కట్టె అని అనుకుంటూ ఓ కన్నీటి చుక్క రాల్చాడు. అది ఆ ఊతకర్రపై పడి జారిపోయింది.

4. అంపకం ఆధారంగా తండ్రీ, కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్యభాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటినుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. పల్కొక్కటి సేత యొకటి యగుట చాలదోషము.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : అర్జునుని మరణ కారణాన్ని అడిగిన భీమునికి ధర్మరాజు సమాధానం చెబుతున్న సందర్భంలోనిది.
అర్థం : మాట ఒక విధంగా, చేత ఒక విధంగా ఉండుట దోషము.
భావం : సోదరులు ద్రౌపది మరణాలు చూసిన అర్జునుడు నేల కూలగా, భీముడు అన్నగారితో, అర్జునుడెంతో పుణ్యశాలి, ఋజువర్తనుడు మరి ఇలా ఎందుకు జరిగింది అని అడుగగా, ధర్మరాజు, భారత యుద్ధంలో కౌరవులందరినీ ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి, చేత ఒకటి ఉండుట మహాదోషం. అంతేకాక దనుర్థారులందరిని ఈసడించేవాడు. కనుక ఇట్టి దురవస్థ వాటిల్లింది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు.

2. బరికించి దశాననండు పకపక నగియెన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణుడు నందీశ్వరుని చూసి నవ్విన సందర్భంలోనిది.
భావము : నందీశ్వరుడు పెద్దదయిన శూలమును చేతితో పట్టుకొని అపర శివునివలే వానర ముఖముతో ఉన్నాడు. రావణుడు శివుని నిందించినందుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. రావణుడు నందీశ్వరుని రూపమును చూసి పకపక నవ్వాడని ఇందలి భావం.

3. మోసాన్ని గుర్తెరిగి కాపాడవోయ్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు జాతికి పరులతో జరుగుతున్న అన్యాయాన్ని గురించి కవి తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం : మోసాన్ని గుర్తించి కాపాడవయ్యా.
భావము : మన తెలుగు ప్రాంతం బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుని పోయారయ్యా. ఆ మోసాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.

4. మంటల్లోనే పెరిగాడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది. సందర్భం : కవి భగత్సింగ్ జన్మించిన కాలం నాటి దేశ పరిస్థితులను తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం : తీవ్ర సంఘర్షణ వాతావరణంలో ఎదిగాడు.
భావం : భగత్సింగ్ జన్మించిన నాటికి భారతదేశం బ్రిటీష్వారి కిరాతక పాలనలో అల్లాడిపోతోంది. ఆ వాతావరణంలో జన్మించిన భగత్ సింగ్ దేశ స్వాతంత్య్రం కోసం చిన్నతనం నుంచి తపించిపోయాడు. జలియన్ వాలాబాగ్ వంటి హింసాత్మక ఘటనలు చూసినవాడు. అటువంటి వాతావరణంలో ఎదిగి పెద్దవాడయ్యాడు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. పార్థుని మరణానికి కారణాలేవి ?
జవాబు:
ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

4. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్య్ర వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. పెద్దనగారి భార్యను గురించి రాయండి.
జవాబు:
పెద్దనగారి భార్య అణకువ, గర్వము మూర్తీభవించినట్లుండే ఇల్లాలు. తన భర్తకు రాయలవారి నుండి లభిస్తున్న గౌరవాదరాలను చూస్తుంటే ఆమెకు అమితమైన సంతోషము. రాయలవారు నిండు సభలో మను చరిత్ర నందుకున్నప్పటి విశేషాలన్నీ ఆ సాయంకాలం పెద్దన్నగారింట్లో కూర్చున్నవారందరికీ పింగళి సూరన మరీమరీ వివరించి చెపుతుంటే, ఆ ఇల్లాలు అటు ఇటు తిరుగుతూ, ఆగుతూ ఆనందంగా వింటుంది.

మరునాడు అల్లసాని పెద్దన ఇంట్లో కవులందరికీ విందు. పెద్దన భార్య అనుకూలవతి. ఆమెను చూసి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ముద్దియౌ నతని గృహిణి’ అని ఆమె అతిథి మర్యాదను తెనాలి రామకృష్ణకవి ప్రశంసిస్తాడు. అక్క అని ఆమెను సంబోధిస్తాడు. ఆ అక్కగారు మను చరిత్రలో ప్రవరుని గృహిణి వంటిదని’ ప్రశంసిస్తాడు. అవునా’ అన్నట్లు పెద్దన ఆమెవైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తూనే ఉంటుంది. ఆదర్శ గృహిణి పెద్దన్న గారి భార్య !

2. మాటతీరు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
మాటతీరు అంటే మనం మాట్లాడే విధానం. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడే వారిని ఎక్కువమంది ఇష్టపడతారు. వారికి ఎక్కువ స్నేహితు లుంటారు. ఎప్పుడూ చిరాకు పడుతూ, పరుషంగా మాట్లాడే వారితో ఎవరూ కలవరు వారితో దూరంగా ఉంటారు. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే విధానం పైనే ఆధారపడి ఉంటాయి. సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు చాలా బలమైన అంశం. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు. జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఇవి భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే ఇంకా కొంత విశిష్టంగా ఉంటుంది.

సమాచారాలను చేరవేయటానికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి భాషలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ వుంటాం. అవి మన వ్యవహారంలో కలిసిపోయి వుంటాయి. ఈ పదాలు మన సామాజిక సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో ముడిపడి వుంటాయి. వీటిని ప్రయోగిస్తూ మాట్లాడు తున్నపుడు మన మాటతీరు ఎటువంటిదో తెలుస్తుంది.

3. ప్రాడిజీలను గురించి వివరించండి.
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీ’ లంటారు. గానం, గణితం, చిత్రలేఖనం, కవిత్వం మొదలైన విద్యలలో ప్రాణిజీలు కన్పిస్తారు. పూర్వజన్మలో విశ్వాసం ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తులు సంచితమంటారు.

అయితే, చిన్నతనంలో ఉండే ఈ ప్రజ్ఞాపాటవాలు యుక్తవయస్సు వచ్చేసరికి కనిపించక ప్రాడిజీలు చాలా మామూలుగా తయారవుతారు. ఇంగ్లండులోని రాయల్ ఎకాడమిలో 14 ఏళ్ళ లోపు పిల్లలు వేసిన అద్భుత చిత్రాలు ఉన్నాయట. ఆ చిత్రకారులలో కొందరు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లి బొమ్మ కూడ వేయలేక పోయారట !

బాలమురళి మాత్రం ఈ రకం ప్రాడిజీకాదు. అందుకే తన నలభయ్యవ ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నాడు.

4. సందర్భశుద్ధి లేకపోవడం వల్ల కలిగే హాస్యం గురించి తెలపండి.
జవాబు:
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (impropriety) హాస్యానికి కారణ మవుతుంది.
‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా’ అంటే దూడ గడ్డి కోసం అన్నాడుట’. ఇక్కడ సందర్భ శుద్ధి లేదు. ప్రశ్నకు సమాధానానికి పొంతన లేదు. ఇది వింటే తప్పక నవ్వువస్తుంది.
శుభమైన పెళ్ళి జరుగుతున్న సమయంలో ‘వచ్చిపోయెడు వారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణంబు ఏడ్వ’ వంటి సందర్భ శుద్ధి లేని అవాకులు, చవాకులు వింటే నవ్వువస్తుంది.
ఈ నవ్వు నిర్మలము కాదు. అయినా అదీ హాస్యమే. సందర్భ శుద్ధి లేకపోవటం, అసందర్భంగా మాట్లాడటం ఇక్కడ – హాస్యానికి కారణం.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటిపేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

2. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం. ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు ఔషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

3. మునిమాణిక్యం నరసింహారావును గురించి రాయండి.
జవాబు:
ముని మాణిక్యం నరసింహారావు గారు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్యరచయిత. వీరి ‘కాంతం కథలు’ తెలుగు సాహిత్యంలో ఒక మణిహారం.
వీరు గుంటూరుజిల్లా తెనాలి దగ్గర వున్న సంగం జాగర్లమూడిలో 15-03-1898 లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణలు. ఇంటరు విద్య తెనాలిలో చదివారు. డిగ్రీ, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి సహాయంతో చదివారు. ఉపాధ్యాయుడుగాను, ఆకాశవాణిలోను ఉద్యోగాలు చేశారు.

దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, తెలుగు హాస్యం, రుక్కుతల్లి, తిరుమాళిగ, కాంతం కైఫీయత్తు వంటివి వీరి రచనలు. ‘టీ కప్పులో తుఫాను’ వీరి మొదటి నవల.
కాంతం కథలకు వీరి భార్యే స్ఫూర్తి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ఆధారంగా రచించిన ‘కాంతం కథలు’ నేటికీ నిత్య నూతనంగా ఉన్నాయి. నిత్యజీవితంలో హాస్యం అవసరాన్ని వీరు తమ రచనలలో హృద్యంగా చెప్పారు.
ముని మాణిక్యం నరసింహారావుగారు 4.2.1973లో కీర్తిశేషులయ్యారు.

4. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. మునిసిపల్శాఖకు మురికి నీటి కాలువల నిర్మాణానికి అర్జి.
జవాబు:

విజయవాడ,
4.10.2018.

X X X X X,
ఇంటి నెం. 1-6-11,
శాంతినగర్ కాలనీ,
విజయవాడ 10.

శ్రీయుత మున్సిపల్ కమీషనర్ గారికి,
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్,
విజయవాడ.
ఆర్యా!
విజయవాడ బెంజి కంపెనీ దగ్గర ఉన్న బ్యాంక్ కాలనీకి దగ్గరగా ఉన్నటువంటి శాంతినగర్ లో నేను నివాసం ఉంటున్నాను. చుట్టుప్రక్కల ప్రాంతం అంతా నివాసిత ప్రాంతంగా బాగా అభివృద్ధి చెందింది. అయితే గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లు గాని, మురుగు నీటి పారుదల సౌకర్యం గాని ఏ మాత్రము అభివృద్ధి చెందలేదు. ఇళ్ళల్లో వాడిన నీరంతా రోడ్ల మీదకు వస్తున్నాయి. దుర్గంధము, దోమలతో ఈ ప్రాంతం అంతా అసౌకర్యంగా ఉంది. అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది.
గతంలో మా కాలనీ తరపున మీకు విజ్ఞాపన పత్రం అందచేశాము. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. కనుక దయచేసి ఈ ప్రాంతంలో ముందర మురుగునీటి కాలువలు, నిర్మించవలసిందిగా కోరుచున్నాము. చుట్టుప్రక్కల ఏడు పాఠశాలలు కూడా ఉన్నాయి. చిన్నారి పిల్లల ఆరోగ్య దృష్ట్యా కూడా ఇక్కడ మురుగునీటి కాలువల నిర్మాణం వెంటనే జరుగవలసి ఉంది. కాబట్టి తగు చర్య తీసుకోవలసినదిగా కోరుచున్నాను. కృతజ్ఞతలతో …..

ఇట్లు,
X X X X X.

2. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు ఉన్నతాధికారికి లేఖ.
జవాబు:

కొత్తపేట,
గుంటూరు,
22-10-2018.

X X X X X,
ఇంటి నెం. 6-9-2,
మెయిన్ బజార్,
కొత్తపేట, గుంటూరు.
మహారాజశ్రీ గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంటు గారికి,
ఆర్యా!
గుంటూరు పట్టణములో ఇటీవల శాంతిభద్రతలు కరువైనాయి. పట్టపగలే అరాచక శక్తుల స్వైర్య విహారము చేస్తున్నాయి. దుష్టశక్తులకు అండగా కొందరు రాజకీయ వాదులున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుటకు భయపడుతున్నారు. అక్కడక్కడ గృహ దహనాలు, లూటీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకై ప్రభుత్వం సత్వర చర్యలు తీసికొనవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
విధేయుడు,
X X X X X.

చిరునామా :
మహారాజశ్రీ గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంటు గారికి,
గుంటూరు,
గుంటూరు జిల్లా.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. చిగురొత్తు
2. కృతార్థుడు
3. మహోగ్ర
4. అత్యంత
5. తోడబుట్టిన
6. వహ్న్యస్త్రము
7. బలివెట్టి
8. వేడుకెల్ల
జవాబు:
1. చిగురొత్తు – చిగురు + ఒత్తు – ఉత్వసంధి.
సూత్రం : ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధియగు.

2. కృతార్థుడు – కృత + అర్థుడు – సవర్ణదీర్ఘ సంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశంగా వస్తాయి.

3. మహోగ్ర – మహా + ఉగ్ర – గుణసంధి.
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైతే క్రమముగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

4. అత్యంత – అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అవసర్జములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశమగును.

5. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన – సరళాదేశ సంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

6. వాహ్న్యస్త్రము – వహ్ని + అస్త్రము – యణాదేశ సంధి.
సూత్రము : ఇ, ఉ, ఋ లకు అవసరములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశముగా వచ్చును.

7. బలివెట్టి – బలి + పెట్టి – గసడదవాదేశ సంధి.
సూత్రము : ప్రథము మీది పరుషములకు గ, స,డ,ద,వ లు బహుళముగానగు.

8. వేడుకెల్ల – వేడుక + ఎల్ల – అత్వసంధి.
సూత్రము : అత్తునకు సంధి బహుళము.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. నాకలోకసుఖములు
2. పుష్పవర్షము
3. ఉగ్రశరంబు
4. దశాననుండు
5. కమ్మనికలము
6. మృగశ్రేణి
7. తల్లితండ్రులు
8. కంఠేకాలుడు
జవాబు:
1. నాకలోక సుఖములు : నాక లోకము నందలి సుఖములు – సప్తమీ తత్పురుష సమాసం.
2. పుష్పవర్షము : పుష్పములతో కూడిన వర్షము – తృతీయా తత్పురుష సమాసం.
3. ఉగ్రశరంబు : ఉగ్రమైన శరంబు – విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం.
4. దశాననుండు : పదిముఖములు గలవాడు – బహువ్రీహి సమాసం.
5. కమ్మని కలము : కమ్మనైన కలము – విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం.
6. మృగశ్రేణి : మృగముల యొక్క శ్రేణి – షష్ఠీ తత్పురుష సమాసం.
7. తల్లిదండ్రులు : తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసము.
8. కంఠేకాలుడు : కంఠమునందు విషము గలవాడు – బహువ్రీహి సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. మేదావి
5. ఆదారం
9. అస్వస్తత
2. సృతి
6. గనితం
10. అదికారం
3. చివరిదస
4. దు:కం
7. వర్నం
8. పరాకాష్ట
జవాబు:
1. మేదావి – మేధావి
2. సృతి – శృతి
3. చివరిదస – చివరిదశ
4. దు:కం – దుఃఖం
5. ఆదారం – ఆధారం
6. గనితం – గణితం
7. వర్నం – వర్ణం
8. పరాకాష్ట – పరాకాష్ట
9. అస్వస్తత – అస్వస్థత
10. అధికారం – అధికారం

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. The Sun rises in the East.
జవాబు:
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

2. My brother bought Telugu books at the book fair.
జవాబు:
మా అన్నయ్య పుస్తక ప్రదర్శనశాలలో తెలుగు పుస్తకాలు కొన్నాడు.

3. Speak kind and sweet words.
జవాబు:
దయతో, మృదువుగా తీయగా మాట్లాడు.

4. Health is the basis of success.
జవాబు:
ఆరోగ్యం విజయానికి ఆధారం.

5. Be on the alert, speak little.
జవాబు:
ఏమరపాటు వద్దు తక్కువగా మాట్లాడు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

వేదాంతం అనగా ఉపనిషత్తులు. పరమేశ్వరతత్వం తెలుపునవి ఉపనిషత్తులు. ఆత్మ, పరమాత్మలను గురించి తెలుసుకొనుటయే జ్ఞానం. దీనికి భక్తియే ఏకైక మార్గం అని ధూర్జటి అభిప్రాయం. జ్ఞానమునకు చదువులు హేతువులు కాజాలవు అని ధూర్జటి అభిప్రాయం. సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు అనువారు ఏ వేద శాస్త్రములు పఠించిరి ? ఏ మంత్రములు జపించిరి ? ప్రాణులకు జ్ఞాన సాక్షాత్కారమునకు మీ పాద సేవాభిరుచియే కారణం కాని మరొకటి కాదు అని ధూర్జటి వివరించాడు ? శాస్త్ర జ్ఞానము కన్నా భక్తి జ్ఞానమే మిన్నయని కవి నమ్మకము. అందువల్లనే పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించి ఆత్మజ్ఞానం పొందాడని ధూర్జటి ప్రబోధించినాడు.
ప్రశ్నలు:

1. వేదాంతం అనగానేమి ?
జవాబు:
వేదాంతం అనగా ఉపనిషత్తులు.

2. ఉపనిషత్తులు దేనిని తెలియజేస్తాయి ?
జవాబు:
పరమేశ్వర తత్వం.

3. జ్ఞానం తెలుసుకోవడం అంటే ఏమిటి ?
జవాబు:
ఆత్మ, పరమాత్మలను తెలసుకొనుటయే జ్ఞానం.

4. చదువులోక్కటే జ్ఞానం కాదని ఎవరు అన్నారు ?
జవాబు:
ధూర్జటి.

5. శాస్త్ర జ్ఞానం కన్నా ఏ జ్ఞానం ఎక్కువ ?
జవాబు:
ఆత్మజ్ఞానం.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. నంది ఎవరి వాహనము.
జవాబు:
శివుని.

2. సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత.

3. స్వాహా వల్లభుడెవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.

4. విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్పూర్తినిచ్చిన గేయం ఏది ?
జవాబు:
చేయెత్తి జై కొట్టు తెలుగోడా.

5. జాషువా జన్మస్థలం ఏది ?
జవాబు:
వినుకొండ.

6. పాపరాజు రాసిన యక్షగానం పేరేమిటి ?
జవాబు:
విష్ణుమాయా విలాసము.

7. ధూర్జటి రచించిన శతకం పేరేమిటి ?
జవాబు:
కాళహస్తీశ్వర శతకం.

8. రావణుడు మాయాయుద్ధం ఎవరితో చేసాడు ?
జవాబు:
కుబేరునితో.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. బాలమురళి తల్లిదండ్రుల పేర్లేమి ?
జవాబు:
సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య.

2. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

3. కలవారంటే అర్థం ఏమి ?
జవాబు:
పంటసిరి ఉన్నవారు.

4. పాల్కురికి సోమనాథుడు ఏ కవితా ప్రక్రియను అనువదించాడు ?
జవాబు:
ద్విపద ప్రక్రియ.

5. కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
రాజ్యలక్ష్మి.

6. శ్రీకృష్ణ దేవరాయల పాలనాకాలం ఏది ?
జవాబు:
క్రీ॥శ॥1509 – 1529.

7. హాస్యము అనగా ఏమిటి ?
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము.

8. నారదుని వీణ పేరేమిటి ?
జవాబు:
మహతి.

Leave a Comment