AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 3 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ ! యీ పుత్ర గా
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్ర గా
త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
జవాబు:
ప్రతిపదార్థం :
ఉర్వీనాథ ! = భూమికి నాధుడవైన ఓ రాజా!
విపరీత ప్రతిభాషలు = విరుద్ధమైన సమాధానాలు
ఏమిటి = ఎందుకు ?
ఈ = ఈ
పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు
పుత్ర = కుమారుని యొక్క
గాత్ర = శరీరాన్ని
పరిష్వంగ సుఖంబు = కౌగిలించుకోవటం ద్వారా కలిగే సుఖాన్ని
చేకొనుము = ఆస్వాదించు
ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు
ముక్తాహార = ముత్యాల హారాలుగా
కర్పూర = పచ్చకర్పూరం యొక్క
సాంద్ర = దట్టమైన
పరాగ = పొడియొక్క
ప్రసరంబు = వ్యాపనమూ
చందనమున్ = మంచి గంధమూ
చంద్ర జ్యోత్స్నయున్ =
జీవులకున్ = ప్రాణులకు
పుత్రగాత్ర పరిష్వంగమునట్లు పుత్ర
పుత్ర = పుత్రుని యొక్క
గాత్ర = శరీరాన్ని
పరిష్వంగము + అట్లు = కౌగిలించుకొన్నట్లు
హృద్యంబు + ఏ = మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయా ?
కడున్ = మిక్కిలి
శీతమే = చల్లదనంతో ఉంటాయా ? (ఉండవని భావం)

తాత్పర్యం : ఓ రాజా ! విరుద్ధమైన మాటలు ఎందుకు ? ఈ కుమారుణ్ణి కౌగిలించుకొని ఈతని కౌగిలివల్ల కలిగే సుఖాన్ని ఆస్వాదించు. ముత్యాలహారాలూ, పచ్చకర్పూరపు దట్టమైన పొడి సువాసనలూ, మంచిగంధమూ, వెన్నెలా మొదలైనవేవీ జీవులకు పుత్రుని కౌగిలిని మించిన – సుఖాన్నీ, మంచి చల్లదనాన్ని కలిగించలేవు అని తాత్పర్యం.
విశేషాంశాలు : నవమాసాలు మోసి కని పెంచి పోషించే తల్లులకు బిడ్డలే సర్వస్వం. తన కుమారుడైన భరతుడిని కేవలం స్పర్శించటం వల్లనే కలిగే సాటిలేని అనుభూతిని ఆస్వాదించ మని శకుంతల దుష్యంతుణ్ణి కోరింది.

2. ‘ఉరుతరాటవిలోన మహోగ్రతపము
వాయుదేవుని గుఱియించి వరుసఁ జేసి
యంజనాదేవి గనియె నన్నర్థతోడ
నర్కజుని మంత్రి హనుమంతుఁడండ్రు నన్ను.
జవాబు:
ప్రతిపదార్థము :
అంజనాదేవి = అంజనాదేవి
ఉరుతరాటవిలోనన్;
ఉరుతర + అటవిలోనన్ = గొప్ప అడవిలో
మహోగ్రతపమున్ తోడ = గొప్ప భయంకరమైన తపస్సును
అర్థితోడన్ = భక్తితో
వాయుదేవుని గుఱియించి = వాయుదేవుని గురించి
వరుసన్ + చేసి = చాలాకాలం చేసి
నన్నున్ = నన్ను
కనియెన్ = పుత్రుని కన్నది
అరజుని మంత్రిన్ = (నేను) సుగ్రీవునికి మంత్రిని
నన్నున్ = నన్ను
హనుమంతుడు = హనుమంతుడు
అండ్రు = అంటారు

తాత్పర్యము : అంజనాదేవి గొప్ప అరణ్యములో వాయుదేవుడిని గురించి చాలాకాలం భక్తితో గొప్ప తపస్సును చేసి నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని, నన్ను ‘హనుమంతుడు’ అని పిలుస్తారు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. గృహస్థ ధర్మం గొప్పతనాన్ని, గృహిణీ ప్రాధాన్యాన్ని గురించి శకుంతల తెలిపిన తీరును వివరించండి.
జవాబు:
పరిచయం : భారతీయులకు ఎంతో పవిత్రమైన వేదాల సారాన్ని ఆకట్టుకొనే కథల రూపంలో అందించిన మహాభారతం పంచమవేదంగా (్రసిద్ధి చెందింది. మహాభారతంలో భారతీయ జీవన విధానంలో ప్రాముఖ్యం కలిగిన ఎన్నో అంశాలు ముఖ్యంగా బ్రహ్మచర్ల, గృహస్థ, వానప్రస్థ మొదలైన ధర్మాలు అపూర్వంగా వర్డించబడ్డాయి. ‘సత్య ప్రాశస్త్యము’ అనే ప్రస్తుత పాఠ్యభాగంలో నన్నయ గృహస్థధర్మం గొప్పదనాన్ని గృహిణి ప్రాధాన్యాన్ని శకుంతల చేత హృద్యంగా చెప్పించాడు.

శకుంతలా దుష్యంతులు : వేటాడటానికి అరణ్ంలో సంచరిస్తూ దుష్యంత మహారాజు కణ్వమహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ శకుంతల సౌందర్యాన్ని చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. దుష్యంతుని వల్ల గర్భవతి అయిన శకుంతల కొంతకాలానికి భరతుడికి జన్మనిచ్చింది. శకుంతల పుట్టింట్లో ఎక్కువకాలం ఉండకూడదని భావించిన కణ్వమహర్షి శకుంతలను డుష్యంతుడి దగ్గరకు పంపించాడు. రాజసభలో దుష్యంతుడు శకుంతల ఎవరో తనకు తెలియదు పొమ్మన్నాడు. అపుడు శకుంతల గృహస్థ ధర్మం గొప్పదనాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని ఇట్లా వివరించింది.

గృహస్థ ధర్మం : పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్లను తిరస్కారభావంతో చూసే దుష్టుిని ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం ఉండదు. అనుకూలవతి అయిన భార్య కలవాడు ఎన్నో కర్మలు ఆచరించగలుగుతాడు, ఇంద్రియాలను వశం చేసుకోగలుగుతాడు, పుత్రసంతానాన్ని పొందగలుగుతాడు, గృహస్థు పొందే ఫలాన్ని అంతటినీ పొందగలుగుతాడు.

గృహిణీ ప్రాధాన్యం : లోకంలో పురుషుడికి భార్యకంటే ప్రధానమైనది ఏదీ లేదు. ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి తగిన సాధనం గృహిణి మాత్రమే. అంతేకాక గృహనీతి అనే విద్యకు ఆమె నెలవైనది. నిర్మలమైన శీలాన్ని నేర్పించే గురుస్థానము కూడా వంశం నిలవటానికి ఆమె ఆధారం. పురుషుడు ఉత్తమగతులు పొందడానికి ఆమె ఊతకర్ర వంటిది. గౌరవానికి ముఖ్య హేతువు కూడా గృహిణియే. అందరికీ ఆమె ఆదర్శం. ఆమె కలకాలం వెలిగే మణులవంటి గుణాలకు నెలవైనది. ఫర్తకు హృదయానందాన్ని కలిగించేది భార్య మాత్రమే. భర్తకు భార్య కంటే ప్రియమైనది మరొకటి. లేదు. అందువల్ల భార్యబిడ్డల పట్ల అనురాగం కలవారికి ఎక్కడైనా, ఎప్పుడైనా ఆపదలన్ని తొలగిపోతాయి.

భార్య భర్తలో సగభాగం. కనుకనే ముందుగా మరణించిన భార్య పరలోకంలో కూడా తన భర్త రాకకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకవేళ భర్త ముందుగా మరణిస్తే తాను కూడా వెనువెంట వెళ్ళి భర్తతో కలిసి ఉండాలనుకుంటుంది భార్య. అటువంటి భార్యను అవమానించటం ధర్మవిరోధం. అంతేకాక భర్తే భార్య గర్భంలోకి ప్రవేశించి వసించి పుత్రుడిగా జన్మిస్తాడు, ‘అంగాత్ అంగాత్ సంభవసి’ అనే వేదవాక్యం వల్ల తండ్రీకొడుకులకు భేదం లేదు.

ముగింపు : గృహిణికి ఉండవలసిన గొప్ప లక్షణాలు అన్నీ కలిగినది కనుకనే ఆకాశవాణి చేత శకుంతల సాధ్వీమతల్లి. సద్వినుత, మహాపతివ్రత అని ప్రశంసించబడింది. ధర్మానికి కట్టుబడి సత్యంతో దేవతలను మెప్పించింది. పరమసాధ్వి అయిన శకుంతల చేత నన్నయ పలికించిన ఈ మాటలు తెలుగు సాహిత్యంలో అమూల్యములు అజరామరములు.

2. మనిషిలో ఏ విధంగా చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుందన్న’ పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. మన సమాజంలో చైతన్యం రావాలంటే ప్రతి మనిషి ప్రపంచీకరణ విషబీజాల ప్రభావం నుండి ముందుగా బయటపడాలి. తూర్పుదేశాలపై పడమర దేశాల నీడ పడకుండా చూసుకోవాలి. బహుళజాతి జనులతో వ్యాపార లావాదేవీలు తగ్గించు కోవాలి. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను కొనాలి. స్వదేశీ హస్త కళలను ఆదరించాలి. నిన్నమొన్న స్వాతంత్య్రం సాధించిన మనం మన పసిపాపవంటి దేశాన్ని కాపాడుకోవాలంటే స్వదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించుకోవాలి. లేకపోతే స్వాతంత్ర్యం సాధించి విదేశీయులకు మనలను మనం అమ్ముకున్నట్లు అవుతుంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగే వ్యాపారం వైకుంఠపాళీ లాంటిది. వైకుంఠ పాళీలో పెద్దపాము కరిస్తే ఎలా పాతాళానికి పడిపోతామో విదేశీ వ్యాపారం వలన కూడా అలా నష్టపోతాము. భారతీయులు ఆత్మీయ అనుబంధాలను పెంపొందించు కోవాలి. లేకపోతే మన అనుబంధాలు ఆత్మీయతలు విమాన రెక్కల నుండి జారిపడి సముద్రంపాలౌతాయి. మన సంస్కృతీపరమైన అనుభవాలను పరిశ్రమలను ప్రోత్సహించు కోకపోతే మన అనుభవాలు యంత్రాల అద్దాల ముందు తమ బట్టతలలను దువ్వు కోవాల్సి వస్తుంది.

ఇప్పుడు మనమేమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అలా తెలుసుకోని వాడు చాలా నష్టపోవలసివస్తుంది. మన పురోభివృద్ధికి అడ్డుగా ఉన్న ముళ్ళను రాళ్ళను మనమే అడ్డు తొలగించుకొని కొత్తదారులను వేసుకోవాలి. అప్పుడే మనజాతి సగర్వంగా ప్రపంచం. ముందు తల ఎత్తుకుని నిలబడగలుగుతుంది. మనదేశం చెయ్యి చాపితే సూర్యబింబం మన చేతిలోకి వచ్చి వాలుతుంది. దేశమే ఒక ఎజెండాలా మన గుప్పిట్లో నిలుస్తుంది. అప్పుడే మనం చైతన్యవంతం అయినట్లు ఆ చైతన్యం ద్వారా మనం కొత్త బాటలు వేసినట్లుగా భావించాలని అద్దేపల్లి వారి ఆకాంక్ష.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. చాటువులు గురించి వివరించండి ?
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా. సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటిలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.

చాటువులంటే కవులు సరదాగా ఎప్పటికప్పుడు చెప్పుకునే పద్యాలు. వీటిలో చమత్కారాలు, హాస్యాలు మాత్రమే కాకుండా, జీవిత వాస్తవాలు కూడా ఉంటాయి. చాటువులు సాహిత్యంలో ప్రత్యేక ప్రక్రియ కానప్పటికి కావ్యాలలో కన్నా భిన్నమైన సాహిత్య సృష్టి ఉంటుంది. ఆ చాటువులలోని ప్రత్యేకతలను నేటి యువతకు అందజేయటమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

చాటువు అంటే ప్రియమైన మాట. ఇది అచ్చమైన సంస్కృత శబ్దం. చాటువు అన్న పదాన్ని తెలుగువారు చదరచాప అన్న ధోరణిలో వ్యవహరిస్తారు. ఒక భోగిచేత సీత్కరింప బడినపుడో, ఒక లోభిచేత సత్కరింపబడినప్పుడో, ఒక అందమైన దృశ్యం కనపడినపుడో, డెందము (మనసు) గాయపడినపుడో, హాస్యం లాస్యం చేసినపుడో ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకువచ్చే కవితా రూపాలే ఈ చాటుపద్యాలు. తెలుగు సాహిత్యంలో ఒకవైపు గంగానది ప్రవాహంలా మహాకావ్యాలు వస్తుంటే మరోవైపు సెలయేళ్ళ లాంటి చాటుపద్యాలు గలగలా ప్రవహించాయి. నైషధం లాంటి విద్వ దౌషధాన్ని అందించిన శ్రీనాథుడంతటి మహాకవే “చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు”, అని చిట్టిపొట్టి చాటువులను అల్లాడు. ఈ చాటువులను వెలుగులోకి తెచ్చినవాడు కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రి.

కవిపేరు తెలియని పలు చాటుపద్యాలు లోకవ్యవహారంలో ఉన్నాయి. పిల్లల మొదటి వాచకంలో సాధారణంగా కనిపించే “చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ” ఆబాల గోపాలానికి తెలిసిందే. ఈ చాటుపద్యాన్ని ఎవరు వ్రాశారో తెలియదు. అలాగే సామెతల్లాగా చెప్పే పద్యాలు “వాసన లేని పువ్వు, బుధవర్గము లేని గృహంబు” మొదలగునవి వ్రాసిన వారు ఎవరో గాని ఈ చాటుపద్యాలు అక్షరాస్యులు నిత్య జీవితంలో అల్లుకుపోయాయి. ఈ చాటువుల ద్వారా ఆయా కాలాలలో ఉండే జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు, ఆహారవిషయాలు, వేషభాషలు, రాజుల పటాతోపాలు అన్నీ తెలుస్తున్నాయి.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

2. జాతీయోద్యమం అనగానేమిటి ? అది భారతదేశంలో ఏ విధంగా వ్యాపించింది.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.

సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటాము. ఆధునిక ప్రపంచ చరిత్రలో సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటాలు అనేక రూపాలలో జరిగాయి. సామ్రాజ్య వాదము జాతీయ వాదము అను ఈ రెండూ. ఆధునిక భావాలే! 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆంగ్లేయులు సంస్థానాధీశుల అధికారాలను రద్దు చేశారు. సిక్కుల రాజ్యాన్ని బలవంతంగా కలుపుకున్నారు. సైనికులలో, చాలా తక్కువ స్థాయి ఉద్యోగాలలో భారతీయులు నియమించబడ్డారు. ఆవు కొవ్వును పంది కొవ్వును తూటాలకు వినియోగించారు. సిపాయిల తిరుగుబాటుకు బర్హంపూరు, బారప్పూరు, మీరట్, ఢిల్లీ, కాన్పూరులు వేదికలయ్యాయి.

భారతదేశాన్ని ఒక మార్కెట్గా చేసే క్రమంలో ముడిపదార్థాలను కొల్లగొట్టటానికి సామ్రాజ్యవాదులు చేసిన ఆధునికీకరణంతో దేశంలో జాతీయ భావం వ్యాపించింది. ఉద్యోగాలు, పారిశ్రామిక సౌకర్యాలు, నీటి పారుదల సౌకర్యాలను కల్పించటం సామ్రాజ్య వాదుల ప్రయోజనాలు భారతీయ మేధావులను కలవరపరచాయి. గ్రామీణ ప్రాంతంలో దారిద్ర్యం తారాస్థాయికి చేరింది. కరువు కాటకాలు విజృంభించాయి. సంస్కరణ వాదులైన మరాఠీ. బెంగాలీ మేధావులు బ్రిటీషువారి విధానాలను బాహాటంగా విమర్శించటం చేశారు. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్లు ‘ఇండియన్ అసోసియేషన్’ ను స్థాపించారు. ప్రభుత్వ చట్టాల మీద దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సయోధ్యను కుదర్చటానికి ఎ.ఓ.హ్యూమ్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించాడు. ఈ వేదికే చివరకు జాతీయోద్యమానికి కేంద్రంగా పనిచేసింది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. గవేషణ నాటిక సారాంశాన్ని తెలుపండి ?
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతన్ని యమలోకం తీసుకొని వెళుతుంటారు. మానవుడు తానింకా బ్రతికే ఉన్నానని ఎంత వాదించినా వినకుండా మృత్యుదూతలు న్యాయమూర్తికి అప్పగిస్తారు. న్యాయమూర్తి అతని జీవితపు కాగితాన్ని పరిశీలించి ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహిస్తాడు. తిరిగి భూలోకం వెళ్ళిపో ఇంకా 5 సంవత్సరాల ఆయష్షు ఉందని చెప్తాడు ధర్మమూర్తి. తిరిగి భూలోకం చేరుకున్న మానవునికి తన శరీరం కనబడలేదు. అప్పటికే బంధువులు కళేబరాన్ని దహనం చేశారు.

ఈ శరీరం లేని ఆత్మతో ఎలా జీవించాలో అర్థంకాక తిరిగి ధర్మమూర్తి దగ్గరకు వెళదామనీ నిర్ణయించుకుంటాడు. తిరిగి మరో ప్రపంచపు సొరంగాల దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక నవ్వు వినబడుతుంది. ఎవరు ఎందుకు నవ్వుతున్నావని మానవుడు ఆ నవ్విన వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఎందుకొచ్చావని తిరిగి మానవుణ్ణి నవ్విన వ్యక్తి ప్రశ్నించగా తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు. నవ్విన వ్యక్తి సానుభూతితో మానవునికి సహాయం చేయాలనుకుంటాడు. న్యాయమూర్తి దర్శనం కలిగిస్తాడు. ధర్మదేవత తిరిగి వచ్చిన మానవునికి పూర్ణ ఆయుర్ధాయం కలిగేలా వరం ఇస్తుంది. జన్మరాహిత్యాన్ని ఇవ్వలేను. కాని తిరిగి ఏదైనా శరీరంలో ప్రవేశించి బ్రతకమంటుంది. కాని మానవుడు తన 35 ఏళ్ళ జీవితంలో ఎలా ఉన్నాడో అలా ఉండే శరీరం ఎక్కడ లభిస్తుంది అని

బాధపడతాడు. దేవతల మీద నమ్మకం లేకపోయినా ఫర్వాలేదు కాని మానవత్వం పై నమ్మకాన్ని వదులుకోవద్దని అయినా దేవతల వల్ల జరిగిన పొరపాటుని నేనే ధర్మదేవతను క్షమించమని కోరుతున్నానని మానవుని చేతులు పట్టుకుంటుంది. ఈ అల్ప మానవులు దేవతలను క్షమించటమా అంతమాట అనవద్దని. మానవుడు తిరిగి భూలోకానికి వెళ్ళిపోతానని సెలవు తీసుకుంటాడు. తనకు తనలాగా బ్రతికే అవకాశం లేనప్పుడు ఏ బ్రతుకైతేనేం ? అని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. తనని ఓ అమ్మ కడుపులో పడేయమని ప్రార్థిస్తాడు. నేను తిరిగి సృష్టించలేనని ధర్మదేవత భూలోకంలో ఇప్పుడే ఒక అమ్మాయి ప్రసవించింది. శిశువు మృతుడ య్యాడు. ఆ శిశువులో నీ ఆత్మని ప్రవేశపెట్టుకో. నీకు పూర్ణ ఆయుర్ధాయం ఇస్తున్నానని చెప్పింది. మానవుడు ఆ వైద్యశాల చేరుకొని శిశువు శరీరంలో ప్రవేశించాడు. అంతవరకు అష్టకష్టాలు పడ్డ వైధ్యులు శిశువు క్యారు మనడంతో ఊపిరి పీల్చుకున్నారు. మృత శిశువని ఏడ్చిన తల్లి ఆనందంతో బిడ్డను చూసుకుంది.

2. తెరచిన కళ్ళు నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని తెలియజేయండి ?
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళులేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు. కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్బారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లోపడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.

తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్, డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.

విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను. భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు. సత్యాన్ని సుదర్శన్.

3. ఆశ ఖరీదు అణా కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి ?
జవాబు:
కృష్ణవేణి ఈ నాటికలో మధ్యతరగతి అమ్మాయి. ఇంటిని పోషించడం కోసం ఉద్యోగం చేస్తుంటుంది. తల్లి, అన్నయ్యలను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది. తెల్లారి లేస్తూనే ఇంట్లో చాకిరీ, తరువాత. ఆఫీసులో పని, తిరగి ఇంటికి వచ్చాక వంట మొదలైన పనులతో నిరంతరం విసుగు లేకుండా పనిచేస్తూ ఉంటుంది.

ధైర్య సాహసాలు గల వ్యక్తిగా కనబడినా ఎక్కడో ఆడపిల్లనని గుర్తుచేసే సందర్భాల వల్ల కొంత బెరుకుతనం గల స్త్రీమూర్తి.

మేడమీద అద్దెకు దిగిన వ్యక్తి మీరేనా అంటూ పరిచయం చేసుకుంటుంది. గోడకు మేకులు కొట్టి మాకు నిద్రాభంగం కలిగించారని నిర్మొహమాటంగా చెప్తుంది. ఇంటిగలాయన మేకులు కొడితే ఊరుకోడు. బంగారు గోడలు పాడయిపోతాయని బాధ పడతాడని అంటుంది. చల్లగాలికి ఆహ్లాదంగా సినిమాకు వెళ్ళితే బాగుంటుందని మనసులో మాట బయటకే అనేస్తుంది. పాటలంటే మీకు ఇష్టమా ? అయితే మా ఇందిర బాగా పాడుతుందని యువకునితో అంటుంది. గల్లీలో ఎవరో పోయిన సందర్భంలో శవాలంటే భయం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పేరు అడగలేదని యువకుడు అంటూ అంత ధైర్యంలోనూ పిరికితనం ఇదే మానవ నైజం అని అనుకుంటాడు.

పై గదిలో అద్దెకు వచ్చిన అబ్బాయి పేరేమిటని అన్నయ్యను అడుగుతుంది. అందుకు అన్నయ్య విసుక్కుంటాడు. పనిపాట లేక వాళ్ళ పేరేమిటి ? వీళ్ళ పేరేమిటి అని ఇటువంటి ఆలోచనలు ఎందుకు. తనకే గనక ఉద్యోగం దొరికితే ముందు చెల్లెల్ని ఉద్యోగం మానిపించేస్తానని అంటాడు. అందుకు చాలా బాధపడుతుంది. నా ఉద్యోగం మానిపించేంత వరకు నీకు మనశ్శాంతి ఉండదా ? ఏం మనుషులో ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నా సహించలేరు. అదంతా అభిమానమే ననుకుంటారు. అంత ప్రేమలేక పోయినా కాస్త సుఖపడేదాన్ని అని బాధపడుతుంది కృష్ణవేణి. నిద్రపట్టక కృష్ణవేణి ఇందిర, ఆనందలక్ష్మిల ఇంటికి వస్తుంది. ఇంత రాత్రివేళ వచ్చావేంటి అంటుంది ఇందిర. పగలంతా ఆఫీసులో పని. ఇంట్లో మళ్ళీ వండి వార్చినా నీకు నిద్ర రాకపోవటం ఏమిటి అని లక్ష్మీ అడుగుతుంది. మా అన్నయ్య రెండు వందల ఏళ్ళ క్రిందట పుట్టవలసినవాడు. వాడికి ఉద్యోగం దొరకటం లేదన్న కసితో నా ఉద్యోగాన్ని మానిపించేయాలని అంటూ ఉంటాడు. నా ‘జీతం మీద ప్రేమే మళ్ళీ. ఎంత అభిమానంగా చేసినా ఈ మాటలు పడలేకపోతున్నాను. ఎంతకాలం మాటలు పడను చెప్పు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ త్యాగం అని స్నేహితురాళ్ళతో తన బాధనంతటినీ చెప్పుకుంటుంది. జీవితంపై విరక్తిని పెంచుకొని నిరాశలో బ్రతుకుతుంది. చివరకు తాతగారి ఉపదేశం వల్ల మళ్లీ కొత్త ఆశలతో ధైర్యంగా తన పని ఏదో తాను చేసుకోగలుగుతుంది కృష్ణవేణి.

4. గవేషణ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెలుపండి ?
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు..

న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా ? చచ్చినట్లా ? అని తన ఆవేదనను సందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు.

ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించమని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ. ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.

1. ఒక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.
సందర్భం : ఈ మాటలు సత్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భంలోనిది.
భావం : నూరుగురు కుమారుల కంటే ఒక్క సత్యవాక్యము మేలైనది అని భావం.
వ్యాఖ్య : నూరు చేదుడు బావులు కంటే ఒక దిగుడు బావి మేలు. అటువంటి నూరు దిగుడు బావులకన్నా ఒక్క గొప్ప యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకన్నా గుణవంతుడైన ఒక్క కుమారుడు మేలు. అటువంటి నూరుగురు కుమారులు కన్నా ఒక్క సత్యవాక్యం మేలైనది.

2. విన్నవింపుము సత్వసంపన్న నీవు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : శ్రీరాముని సందేశమును తెచ్చి ఉంగరము నిచ్చిన హనుమంతునితో సీత తన సందేశాన్ని శ్రీరామునికి అందజేయమని చెప్పిన సందర్భములోనివీ పలుకులు. క్రూరులైన రాక్షసుల మధ్యలో బాధలనుభవిస్తూ శ్రీరాముని గూర్చి తపస్సు చేయు చున్నాను. శ్రీరాముడిని ప్రత్యక్షము కమ్మని చెప్పవయ్యా హనుమా ! అని సీత పలుకుచున్నది.
భావం : నా భర్తను గూర్చి తపస్సు చేస్తున్నాను. సత్వరము నా సమక్షంలో ప్రత్యక్షము – కమ్మని ‘శ్రీరామునికి తెలియజేయి అని సీత హనుమతో పలికినదని భావము.

3. పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కన్యక ప్రాణత్యాగం తరువాత రాజుకు శాశ్వతమైన అపకీర్తి కలిగిందని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోవి.
భావం : కథలు కథలుగా చెప్పుకొనే కన్యక కీర్తి, రాజు అపకీర్తి పదాలలోనూ, పద్యాలలోనూ, శాశ్వతంగా నిలిచిపోయాయి అని భావం.
వ్యాఖ్య : కన్యక ప్రాణత్యాగం చేసిన చోట ఆమె కీర్తికి గుర్తుగా ఒక ఆకాశసౌధం వెలిసింది. తర్వాత పట్టణాన్ని ఏలే రాజు మరణించాడు. అతని కోటపేటలు మట్టిలో కలిసి పోయాయి. సాహిత్యంలో పదాలుగా, పద్యాలుగా కథలు కథలుగా కన్యక కీర్తి, రాజు అపకీర్తి శాశ్వతంగా నిలిచిపోయాయి.

4. నాముందు నిలబడ్డాడు కొత్త మానవుడు.
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అను పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

మనుషుల అనుబంధాలు ప్రపంచీకరణం వలన నాశనమౌతున్నాయి. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. తూర్పున ఉన్న భారతదేశంపై పశ్చిమ దేశాల నీడ పడుతున్నది. అది మన అనుబంధాలకు విఘాతం కల్గిస్తుంది. బహుళ జాతి సంస్థల రాజ్యాల సంబంధాల వలన మన ఉనికిని మనం కోల్పోతున్నాం. సంస్కృతిపరమైన మన హస్తకళలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ప్రపంచీకరణ వ్యాపార లావాదేవీల వలన మన వ్యాపారం వైకుంఠ పాళీలో పెద్ద పాము కరిచిన విధంగా నాశనమౌతుంది. ఇటువంటి ‘వికృత స్థితిగతుల వలన మనుషుల మధ్య అనుబంధాలు విమాన రెక్కల మీద నుండి సముద్రంలోకి జారిపోతున్నాయి. ఇక అనుభవాలు, యంత్రాలనే అద్దాల ముందు. నిలబడి బట్టతలను దువ్వుకోవలసిందేనని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

1. భట్టు నలగామరాజును ఏమని స్తుతించాడు ?
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజు కొలువులోకి ప్రవేశించాడు. రాజు ఎదుట వినయంగా నిలబడి నమస్కరించాడు. నలగామరాజును ఇట్లా స్తుతించాడు.

ఓ రాజా! నీవు రాజులందరిలో గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజ వేశ్యలను రంజింపచేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. దానగుణంలో గొప్పవాడివి. మేరు పర్వతాన్ని తలదన్నే ధైర్యం కలవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుని వంటివాడివి. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్దకుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు. వైభవంలో దేవేంద్రుడవు అంటూ భట్టు నలగామరాజును స్తుతించాడు.

2. మొల్లను గురించి వ్రాయండి ?
జవాబు:
తేనె. నోట్లో వేసుకుంటే తియ్యగా అనిపించే విధంగా తేట మాటలతో తెలుగులో రామాయణం రాసిన గొప్ప కవయిత్రి మొల్ల. మొల్ల రామాయణము తెలుగులో బహుళ ప్రజాదరణను పొందింది. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. కాలం క్రీ.శ. 16వ శతాబ్ది. తండ్రి ఆతుకూరి కేసన.
ఈమె గోపవరపు శ్రీకంఠమల్లేశుని వరప్రసాదంతో కవిత్వం నేర్చుకొంది. మొల్ల తన రామాయణాన్ని శ్రీరామునికే అంకితం చేసిన ధన్యజీవి, కవయిత్రి మొల్ల.

3. రాజుగర్వం ఏమైంది ?
జవాబు:
గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసిన కన్యక తరువాత రాజుతో ఇట్లా అన్నది.. పట్టపగలు, నడివీధిలో విటులు, దొంగలు కూడా స్త్రీలను పట్టుకోరు కదా ! నువ్వు మాత్రం పట్టణానికి రాజువై ఉండి కూడా ఒక స్త్రీని నడివీధిలో పట్టబోయావు. నువ్వూ ! ఒక రాజువేనా ! అధికార మదంతో నువ్వు చేసిన ఈ దౌర్జన్యాన్ని చూసిన దేవుడు – నిన్ను దండించకుండా ఉండడు. ఇదిగో మా కులం పెద్దలు వచ్చారు. వివాహానికి సాక్షిగా అగ్ని అదిగో. నువ్వు కన్నేసిన కన్యను నేను నీ ఎదురుగానే ఉన్నాను చూడు. ఇంకా ఆలస్యం ఎందుకు ? నువ్వు నిజంగా రాజువే అయితే నన్ను పట్టుకో ! అంటూ పలికి కన్యక అగ్నిగుండం లోకి దూకింది.

కన్యక ప్రాణత్యాగంతో రాజు గర్వం నశించింది. అతని అధికారం మట్టిలో కలిసి పోయింది. కోటపేటలు కూలిపోయి నక్కలకు నిలయమయ్యాయి. కన్యక ఆత్మాహుతి చేసుకున్న చోట ఒక పెద్ద మేడ వెలిసింది. ఈ ఘటనలో రాజుకు మాత్రం శాశ్వతంగా అపకీర్తి మిగిలి పోయింది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

4. మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనమవుతున్నాయి ?
జవాబు:
ఈ దారి ఎక్కడికి పోతుంది’ అను పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

మనుషుల అనుబంధాలు ప్రపంచీకరణం వలన నాశనమౌతున్నాయి. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. తూర్పున ఉన్న భారతదేశంపై పశ్చిమ దేశాల నీడ పడుతున్నది. అది మన అనుబంధాలకు విఘాతం కల్గిస్తుంది. బహుళ జాతి సంస్థల రాజ్యాల సంబంధాల వలన మన ఉనికిని మనం కోల్పోతున్నాం. సంస్కృతిపరమైన మన హస్తకళలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ప్రపంచీకరణ వ్యాపార లావాదేవీల వలన మన వ్యాపారం వైకుంఠ పాళీలో పెద్ద పాము కరిచిన విధంగా నాశనమౌతుంది. ‘ఇటువంటి వికృత స్థితిగతుల వలన మనుషుల మధ్య అనుబంధాలు విమాన రెక్కల మీద నుండీ సముద్రంలోకి జారిపోతున్నాయి. ఇక అనుభవాలు, యంత్రాలనే అద్దాల ముందు నిలబడి బట్టతలను దువ్వుకోవలసిందేనని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. గ్రామ సమూహ మాన్యమును గురించి వ్రాయండి ?
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడింది. ఇది ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వము అను సంపుటం నుండి గ్రహించబడింది.
పూర్వము తెలుగుదేశంలో ప్రతి గ్రామములోను ‘గ్రామ సామూహి మాన్యం’ అని ఒక మాన్యం ఉండేది. అది గ్రామంలోని వారందరి సొత్తు. దానిమీద వచ్చు ఆదాయం గ్రామంలోని వారందరి ప్రయోజనాల కోసం వినియోగించేవారు. గ్రామానికి వచ్చి పోయే కళాకారులకు,

భాగవత మేళాలకు, తోలుబొమ్మల వారికి వేడుకలను వినోదాలను అందించే కళాకారులకు పంచేవారు. అలా పంచటాన్ని ‘వర్తన’ అని అనేవారు. అదే చివరకు ‘వతన’గా మారింది. విద్యావంతులకు ఆటపాటలవారికి ఈ వతనను ‘గ్రామ సామూహి మాన్యము’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచటం ఒక రివాజుగా మారింది.

2. అడిదము సూరకవి చాటుపద్యాన్ని వివరించండి ?
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
కొన్ని కొన్ని చాటుపద్యాలు వెలలేని చారిత్రక సత్యాలకు నిలువుటద్దాల్లాగా నిలిచి పోయినవి. అడిదము సూరకవి చెప్పిన ఈ క్రింది పద్యం అందుకు ఒక ఉదాహరణ. “మెత్తనైయున్న అరటాకు మీదగాక
“మంటమీదను చెల్లునే ముంటివాడి
బీదలైయున్న మా బోంట్ల మీదగాక
కలదె క్రొవ్వాడి బాదుల్ల ఖాను మీద”
అడిదము సూరకవి పూసపాటి విజయరామరాజు యొక్క ఆస్థానకవి. ఆ రాజు సూరకవిపై ఆగ్రహించి ఆస్థానం నుండి సూరకవిని తొలగించాడు. ఆ రాజుగారు ఒకసారి మహమ్మదీయ రాజైన బాదుల్లా భానుతో యుద్ధము చేసి ఓడిపోయాడు. తన మనస్సులోని కోపాన్ని సూరకవి ఈ చాటుపద్యం ద్వారా విజయరామరాజుకు చురకలంటించాడు. ఈ చారిత్రక వృత్తం ఈ చాటుపద్యం ద్వారా లోకానికి తెలిసింది. అంతకు పూర్వం విజయరామరాజు బాదుల్లాఖానును యుద్ధంలో ఓడించిన వృత్తాంతాన్ని కూడా సూరకవిని “ఢిల్లీ లోపల గోలకొండ పురినిండన్ నీ ప్రశంసల్” అను పద్యం ద్వారా కీర్తించటం కూడా జరిగింది. ఇలా చాటుపద్యాలు చారిత్రక సత్యాలను ప్రపంచానికి చాటుతున్నాయి.

3. పాకుడురాళ్ళు నవల గురించి వ్రాయండి ?
జవాబు:
‘నా జీవిత యాత్ర’ పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తరూపం.
భరద్వాజ అంతగా చదువుకోలేదు. ఆయన 8వ తరగతిలోనే చదువుకు కుటుంబ దారిద్ర్యం వల్ల స్వస్తి చెప్పాడు. తనకు తన వూరిలో జరిగిన అవమానం వలన చదువుపై శ్రద్ధపెట్టి తన వూరి గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాలను ఔపోసన పెట్టారు. తనకు గ్రంథాలయంలో చదువుకునేందుకు సహాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లు గారి ఋణం తీర్చుకోవటం కోసం 1965సం||లో ‘పాకుడు రాళ్ళు’ నవల వ్రాసి ఆయనకు అంకితం చేశాడు. భరద్వాజ 1956లో మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా నేర్చుకున్నారు. వందలాది

మంది రచయితలతో కవులతో పత్రికా సిబ్బందితో, సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఊహకు అందని విషయాలను కూడా అక్కడ ఆయన ఎదుర్కొన్నారు. ఆ సినీరంగం ఆధారంగా చేసికొని అక్కడ ఉండే ప్రతి మనసును అర్థం చేసుకుని “పాకుడు రాళ్ళు” నవలను రచించారు. ఆ నవలలోని అన్ని పాత్రలు ఆయనకు పరిచయం అయినవే. అన్ని సంఘటనలు ఆయనకు తెలిసిన వారి జీవితాలలో నుండి ఎన్నుకున్నవే! చివరకు ఆ నవలే ఆయనకు జ్ఞానపీఠ అవార్డును అందించింది. దురదృష్ట మేమంటే ఆయన ఆ మెమెంటోను కళ్ళారా చూసుకోక మందే అక్టోబరు 18, 2013న కాలం చేశారు.

4. గరిమెళ్ళ సత్యనారాయణ ప్రజలలో ఎలా స్వాతంత్ర్య చైతన్యాన్ని కలిగించాడు ?
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
గురజాడ నుండి 1947 వరకు జాతీయోద్యమ సాహిత్యమే తెలుగు సాహిత్య ప్రధాన చరిత్ర. 1947 తరువాత కూడా జాతీయోద్యమ దశలను తీసుకొని తెలుగు సాహిత్యం. వచ్చింది అలా వ్రాసిన వారిలో గరిమెళ్ళ సత్యనారాయణ ఒకరు. ఆయన “మా కొద్దీ తెల్లదొరతనం” అన్న గేయం ప్రజల హృదయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రౌలట్ చట్టం మీద, ఖిలాపత్ ఉద్యమం మీద, రాశుల కొద్దీ కవిత్వాన్ని కవులు ఆవేశంగా వ్రాశారు. రాట్నం మీద, విదేశీ వస్తు బహిష్కరణమీద, మద్యపాన నిషేధం మీద ఎందరో కవులు తమ కలాలను ఝళిపించారు. జైళ్ళ మీద భయాన్ని పోగొట్టారు.
“దయ్యమునకు నిముడు
అలడయ్యరను నధముడు
ఆంగ్లసీమ కెల్ల వాడయ్యెను
ప్రియతముడు …………..”
జనరల్ డయ్యరు జలియన్ వాలాబాగ్ కిరాతకుడు. అతడు దయ్యంతో సమానుడు. ఆంగ్లేయులకు వాడు ఎంతో ప్రియతముడని గరిమెళ్ళ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. నన్నయ ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి.

2. శాంతి కాంక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
శ్రీనాథుడు.

3. శ్రీరాముడు ఉన్న పర్వతం పేరేమిటి ?
జవాబు:
మాల్యవంతం.

4. గురజాడ రాసిన కొత్త ఛందస్సు పేరేమిటి ?
జవాబు:
ముత్యాలసరాలు.

5. సగటు మనిషి దేని కోసం వస్తువులు కొంటున్నాడు ?
జవాబు:
స్థాయి హోదాలకోసం.

6. కలేకూరి ప్రసాద్ కలం పేర్లేమిటి ?
జవాబు:
యువక, శబరి, సంఘమిత్ర, నవత.

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 =6)

1. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించిన దేశం ఏది ?
జవాబు:
భారతదేశం.

2. శ్రీనాథుడు ఏ విజయనగరరాజును దర్శించాడు ?
జవాబు:
పౌఢ దేవరాయలు.

3. పాకుడురాళ్ళు నవలకు వచ్చిన అత్యున్నత పురస్కారమేది ?
జవాబు:
జ్ఞానపీఠ పురస్కారం.

4. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఎప్పుడు స్థాపించారు ?
జవాబు:
1885లో స్థాపించబడింది.

5. వేమన పద్యాలలో ఛందస్సు ఏది ?
జవాబు:
ఆటవెలది.

6. నేటికాలమున నారదుడు అంటే అర్థమేమిటి ?
జవాబు:
తగవులు పెట్టే స్వభావం కలవాడని అర్థం.

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామానికి బదులుగా వాడునది సర్వనామం.

2. భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి – క్రియ ఏది ?
జవాబు:
రూపుమాపాలి అన్నది ఇందులోని క్రియాపదం.

3. గులాబి అందమైన పువ్వు – ఇందులో విశేషణం ఏది ?
జవాబు:
అందమైన ఇందులోని విశేషణం.

4. ఆహా ! తెలుగు భాష ఎంత బాగుందో – దీనిలో అవ్యయాన్ని గుర్తించండి.
జవాబు:
ఆహా !

5. తెలుగులో భాషాభాగాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు:
తెలుగులో భాషాభాగాలు 5. నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము.

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. యోగ్యత అంటే ఏమిటి ?
జవాబు:
యోగ్యత అంటే ఒక వాక్యానికి సమర్థత ఉండటం అంటే సరైన అర్థాన్ని ఇచ్చేదిగా ఉండటం

2. సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గాంధీజీ మనకు ‘స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు.

3. వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు.
జవాబు:
1. సామాన్య వాక్యం, 2. సంక్లిష్ట వాక్యం, 3. సంయుక్త వాక్యం అని వాక్యాలు 3 రకాలు.

4. నేను ఉదయాన్నే లేచి ఒక గంటసేపు. చదువుతాను. ఇది ఏరకమైన వాక్యం.
జవాబు:
సంక్లిష్ట వాక్యం.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

5. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ వ్రాయండి ?
జవాబు:
రాజు అహంకారి.

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ముత్యాల సరాలు
జవాబు:
గురజాడ అప్పారావు 1910లో ముత్యాలసరాలు అనే ఖండికను ‘ముత్యాల సరాలు’ అనే ఛందస్సులో రాశాడు. ఒక ఫారసీ గజల్ విని స్ఫూర్తిపొంది ముత్యాలసరాలు ఛందస్సును కూర్చినట్టు గురజాడ చెప్పుకున్నారు. వృషభగతి రగడ, భామినీ షట్పది వంటి ఛందస్సులలోనూ ముత్యాలసరాలకు మూలాలు కన్పిస్తున్నాయి. ముత్యాల సరాలు మాత్రా ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ.
లక్షణాలు :
1. ఇది మాత్రా గణాలతో ఏర్పడుతుంది.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలోనూ 3 + 4; 3. + 4 క్రమంలో మొత్తం 14 మాత్రలుంటాయి.
4. 4వ పాదంలో మాత్రం 7 నుంచి 14 మాత్రలు దాకా ఉండవచ్చు.
5. నాల్గవ పాదంతో భావం పూర్తి కావాలి.
6. నాలుగు పాదాలలో భావం పూర్తికానపుడు ఒకొక్కసారి ఐదవ పాదం దాకా పెరుగుతుంది.
దీనిని ‘తోక ‘ముత్యాల సరము’ అని వ్యవహరిస్తారు. ‘కన్యక’ ఖండికలోనూ ఈ తోక ముత్యాలసరాలు కొన్ని ఉన్నాయి. గమనించవచ్చు.
ఉదాహరణ :
ముత్యాల సరం
AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions 1

ఉదాహరణ : తోక ముత్యాల సరం
AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions 2

2. మత్తేభము
జవాబు:
మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా అంటారు. మత్తేభం అంటే మదించిన ఏనుగు అని అర్థం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1 – 14 అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions 3
యతి మైత్రి : 1వ అక్షరమైన ‘క’ లోని అ కు 14వ అక్షరమైన ‘క్ష’ లోని క కు యతి
ప్రాసాక్షరం : ‘డ’ కారం ప్రాసగా ఉంది.

3. ఆటవెలది
జవాబు:
ఆటవెలది ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది.
ప్రాసనియమం లేదు. ప్రాసయతిని పాటించవచ్చును.
AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions 4
పై ఉదాహరణలో మొదటి పాదంలో మొదట 3 సూర్య గణాలూ, తరువాత రెండు ఇంద్ర గణాలూ వచ్చాయి. రెండో పాదంలో ఐదూ సూర్య గణాతలు వచ్చాయి. కాబట్టి ఇది ఆటవెలది పద్యం.
యతి మైత్రి మొదటి పాదంలో ‘ఉ’ అనే అచ్చుకు, నాలుగో గణం మొదటి అక్షరం ‘నొ’ లో గల ‘ఒ’ అనే అచ్చుకు చెల్లింది. రెండో పాదంలో 1-4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లలేదు. కాబట్టి ప్రాసయతిని కవి పాటించాడు. 1వ గణం ప్రాసాక్షరమైన ‘డ’, నాలుగో గణం ప్రాసాక్షరమైన ‘డ’ లకు ప్రాసయతి సరిపోయింది. (చూడ – జాడ)

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. చంపకమాలలోని గణాలు ఏవి ?
జవాబు:
న, జ, భ, జ, జ, జ, ర.

2. ఉపజాతులలో ఏ నియమం ఉండదు ?
జవాబు:
ప్రాస నియమం ఉండదు..

3. శార్దూలంలోని యతిస్థానమెంత ?
జవాబు:
1వ అక్షరంతో 13వ అక్షరానికి యతి చెల్లుతుంది.

4. కంద పద్యంలో వాడే గణాలు ఏవి ?
జవాబు:
కందపద్యంలో వాడే గణాలు ఏవి ?

5. ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను చెప్పే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు.

6. ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్య పాదములోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఉత్ప్రేక్ష
జవాబు:
ఉత్ప్రేక్ష : ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లైతే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ :
1. ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను. -ఇక్కడ చీకటి నలుపు. దృష్టి నిరోధకం. పొగ నలుపు. దృష్టి నిరోధకం. కాబట్టి ఈ సమాన ధర్మాలవల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకొన్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
2. ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది..
3. ఆమె ముఖము పద్మమేమో – అను వాటిల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

2. అర్థాంతరన్యాసం
జవాబు:
అర్థాంతరన్యాసం : సామాన్యాన్ని విశేషంతో గాని, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పినట్లయితే అది అర్థాంతరన్యాసాలంకారం.
ఉదాహరణకు
‘హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదు’ ఈ వాక్యాన్ని పరిశీలించండి.
హనుమంతుడు సహజంగా వానరం. అతడు సముద్రాన్ని లంఘించడం ఆశ్చర్యం గొలిపే విషయం. కాబట్టి ఇది విశేషం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు – ఈ వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇది సామాన్యం.
పైన తెలిపిన విశేషాన్ని సామాన్య వాక్యం చేత సమర్థిస్తే అది అర్థాంతర న్యాసాలంకారం. మరో ఉదాహరణ చూద్దాం.
ఈ పాఠ్య పుస్తకంలోని నన్నయ పాఠ్యభాగంలో క్రింది పద్యాన్ని గమనించండి.
ఏల యెఱుకలేని యితరుల యట్ల నీ
వెఱుగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేనకాని దీని నెఱుఁగరిన్ దొరులని
తప్పఁ బలుకనగునె ధార్మికులకు
శకుంతల దుష్యంతునితో అంటున్నది – ‘అన్నీ బాగా తెలిసి కూడా నేనెవరో తెలియదని ఇతరుల వలె ఎందుకు మాట్లాడుతావు ? ఇతరులకు తెలియదనే మిషతో ధర్మాత్ములైనవారు అసత్యం పలుకవచ్చునా ?’ ఇక్కడ గొప్పవాడైన దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియదని అబద్ధమాడడం విశేషం. ధర్మాత్ములు అబద్ధాలు ఆడకూడదు – అనేది సాధారణ లోక ధర్మం. ఇది సామాన్యం.

3. లాటానుప్రాస
జవాబు:
లాటానుప్రాస : అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదం కలిగిన పదాలు వెనువెంటనే “వస్తే అది లాటాను ప్రాసాలంకారం. అర్థం అంటే పదానికి ఉన్న సామాన్యమైన అర్థం. తాత్పర్యం అంటే ఆ పదానికి సందర్భానుసారంగా మనం విశేషంగా తీసుకొనే అర్థం. ఈ క్రింది ఉదాహరణలను చూడండి.
‘అమ్మ చూపించే ప్రేమ ప్రేమ !”
మొదటి వాక్యంలో ‘ప్రేమ’ అనే మాట రెండు సార్లు వచ్చినప్పటికీ, మొదటిసారి వచ్చిన ప్రేమ అనే మాటకు ‘ప్రేమ, వాత్సల్యం’ అని అర్థాలు. అదే పదం వెనువెంటనే వచ్చినప్పటికీ, దాన్ని మనం ‘నిజమైన ప్రేమ’ అనే తాత్పర్యాన్ని తీసుకుంటాం. ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థం వేరు, తాత్పర్యం వేరు. దీన్నే మనం లాటానుప్రాసం అని పిలుస్తున్నాం.
మరికొన్ని ఉదాహరణలు :
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
………… ……………. …………..
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి!

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. ఉపమేయమంటే ఏమిటి ?
జవాబు:
వర్ణించబడే వస్తువు ఉపమేయం.

2. సంసార సాగరం – దీనిలో అలంకారమేది ?
జవాబు:
రూపకాలంకారం.

3. నీలమేఘచ్ఛాయ బోలుదేహము వాడు దీనిలో అలంకారమేది ?
జవాబు:
స్వభావోక్తి.

4. రెండు హల్లులు వెంటవెంటనే వస్తే, వాటి మధ్య అర్థభేదం ఉంటే ఏ అలంకారం.
జవాబు:
ఛేకానుప్రాస.

5. అర్థాలంకారమంటే ?
జవాబు:
అర్థభేదం కలిగిన అలంకారాలను అర్థాలంకారాలంటారు.

6. ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ? దీనిలో అలంకారం ఏది ?
జవాబు:
అతిశయోక్తి.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

భారత జాతికి జీవగఱ్ఱలైన రామాయణ, మహాభారతాలలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. మెగస్తనీసు, మార్కోపోలో, పేయస్ వంటి అనేక మంది విదేశీయాత్రికులు తెలుగువారి గొప్పదనాన్ని ప్రశంసించారు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి తెలుగు రాజులు శాతవాహనులు. వీరి తరువాత ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్షాహీలు, నిజాం పాలకులు వరుసగా తెలుగుదేశాన్ని పాలించారు. రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప పాలకులు ; నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, వేమన లాంటి కవులు ఆంధ్రదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయ సంగీతజ్ఞులు తెలుగువారి సొత్తు. గోదావరి, కృష్ణా వంటి గొప్ప జీవనదులతో, సారవంతమైన భూములతో పునీతమైన తెలుగు నేలలో జన్మించడం మన అదృష్టం.
జవాబు:
ఆంధ్రుల యొక్క ప్రశస్తి భారత, రామాయణ కావ్యాలలో ఉంది. మన గొప్పతనాన్ని విదేశీయులైన మెగస్తనీస్, పేయస్ వంటివారు మెచ్చుకున్నారు. తెలుగు నేలను శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు మొదలగువారు పాలించారు. రాణి రుద్రమదేవి, కృష్ణదేవరాయలు వంటి పాలకులు నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతనలాంటి కవులు మనకున్నారు. అన్నమయ్య, త్యాగయ్య వంటి సంగీత విద్వాంసులున్నారు. జీవనదులైన కృష్ణా, గోదావరులు మన నేలను పునీతం చేస్తున్నాయి. ఈ నేలపై పుట్టటం మన అదృష్టం.

Leave a Comment