Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 1 allows students to familiarize themselves with different question patterns.
AP Inter 2nd Year Telugu Model Paper Set 1 with Solutions
గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.
I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)
1. నుతజల పూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత .
వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్రతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
సూనృతవ్రత ! = సత్యం మాట్లాడటమే నియమంగా కలిగిన ఓ రాజా !
నుతజల పూరితంబులగు –
నుతజల = మంచినీటి చేత
పూరితంబులు + అగు = నిండినవైన
నూతులు = చేదుడు బావులు
నూఱిటికంటెన్ = వంద కంటే
ఒక బావి = ఒక దిగుడు బావి
మేలు = ఉత్తమమైనది
మఱి = అంతేకాక
బావులు = దిగుడుబావులు
నటి కంటెన్ = వంద కంటే
ఒక్క = ఒక
సత్ + క్రతువు + అది = మంచి యజ్ఞం
మేలు = ఉత్తమమైనది
తత్ + క్రతుశతంబున
కంటెన్ = అటువంటి నూరు యజ్ఞల కంటే
సుతుండు = ఒక్క కొడుకు
మేలు = మేలు
తత్, సుతశతకంబుకంటెన్ = అటువంటి కొడుకులు వందమంది కంటే
చూడఁగన్ = పరిశీలించగా
ఒక = ఒక
సూనృత వాక్యము = సత్యవాక్యం
మేలు = ఉత్తమమైనది
తాత్పర్యం : సత్య వాక్పాలనమే వ్రతంగా కలిగిన ఓ రాజా ! మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరింటికంటే ఒక దిగుడుబావి మేలు. అంతేకాక నూరు దిగుడుబావులకంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి నూరు, యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమందికంటే ఒక సత్యవాక్యం మేలైనది అని తాత్పర్యం.
2. ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁడిదె కపులఁగూడి, యురుగతి రానై
యున్నాడు, నిన్ను గొని పో
నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీతనయా !
జవాబు:
ప్రతిపదార్థము :
ఉర్వీ తనయా = ఓ సీతాదేవీ !
ఉన్నాడు లెస్స = క్షేమంగా ఉన్నాడు
రాఘవుడు = శ్రీ శ్రీరాముడు
ఇ కుల + కూడి = వానరములతో కలసి
ఉరుగతి = వేగంగా
రానై యున్నాడు = రావటానికి సిద్ధంగా ఉన్నాడు.
నిన్నున్ + కొని = నిన్ను తీసుకొని వెళ్ళటానికి
ఉన్నాడు = రానున్నాడు.
ఇది = ఇలా జరుగుట
నిజము = సత్యము
నమ్ము = విశ్వసించు
తాత్పర్యము : ఓ సీతాదేవీ ! శ్రీరామచంద్రుడు వానరసేనతో కలిసి నిన్ను రక్షించటానికి ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడి నుండి నిన్ను తీసుకొని వెళ్ళడం నిజము. నా మాటలను నమ్ము తల్లీ !
II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. ‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే కావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు రాయబారిగా వెళ్ళిన భట్టు పలికిన శాంతి వచనాలను వర్ణించబడ్డాయి. కలిసి ఉంటే కలిగే మేలు, యుద్ధం వల్ల కలిగే కీడులను కవి హృద్యంగా వర్ణించాడు.
నలగామరాజుకు ప్రశంస: భట్టు గుర్రం మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజును ఇట్లా ప్రశంసించాడు. ఓ రాజా ! నీవు రాజులలో కెల్లా గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజవేశ్యలను రంజింప జేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. ధైర్యంలో మేరు పర్వతాన్ని జయించినవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు, వైభవంలో దేవేంద్రుడవు.
యుద్ధానికి సిద్ధం: రాయబారం కోసం మలిదేవరాజు మీ దగ్గరకు పంపించిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. తన తమ్ములు, బంధువులు, వీరులు అయిన నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణులు మొదలైన రాక్షసులు సంహరించబడిన శ్రీశైల ప్రాంతంలో గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు.
రాజనీతి : ఓ రాజా ! అలరాజుతోపాటే వీరమరణం పొందాలని వీరులైన నాయకులు ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే దుష్టులేకానీ అణచివేసే నిపుణులు ఈ భూమిమీద లేరు, కనుక మీ తమ్ముడైన నరసింహరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒక్కటై ఈ పగను నశింపజేయండి. పల్నాడు మొత్తాన్ని ఎదురులేకుండా కలిసిమెలసి ఏలండి. కనుక మలిదేవునితో సఖ్యత కోసం నరసింగరాజును పంపించు అని భట్టు రాజుకు సూచించాడు.
పోరునష్టం : భూమిమీద ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం మంచిది కాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతోమంది ప్రజలు మరణిస్తారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది. సైన్యానికి కూడా యుద్ధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురు తిరుగుతారు. తమ జీతపు బకాయిల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు, సేవకులు చెప్పిన మాట వినరు.
అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించజూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టడం కష్టమౌతుంది. మీలో మీరే కొట్లాడుకుంటే చూసేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ. రహస్యాలను పసిగడతారు. దుష్టులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచి పోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. కీర్తి, పరాక్రమం కూడా నశిస్తాయి. రాజ్యం సర్వనాశనమౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
పారతంత్ర్యం : యుద్ధం వల్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దుల వాడు ముకుతాడు పొడిచి పొగరు అణఛిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.
బానిస బతుకు : మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మొదటిదైన మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రువుల పాలనలో మాట (వాక్కు) శరీరం (కాయం) – రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఉండదు. ప్రయోజనం లేని జీవనం కన్నా మరణమే మేలు. మంచి పనులు చేయకపోతే క్రిమి కీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్ని సార్లు పుట్టి ఎంతో పుణ్యం వల్ల లేకలేక పొందిన కష్టసాధ్యమైన మానవజన్మ నిందలపాలౌతుంది. కనుక ఓ రాజా ! ఇటువంటి బానిస బతుకు పగవారికి కూడా వద్దు.
పొందులాభం : మల్లెపూలు, తెల్లతామర, చంద్రుడు, తారలు, నురుగు, మంచు, చందనం, రాజహంస మొదలైన వాటి కాంతులను మించే గొప్పకీర్తి సైతం పగ వల్ల వేగంగా నశిస్తుంది. లోకంలో అపకీర్తి పెరిగిపోతుంది. రెండు పక్షాలవారూ ఒక్క టైతే అన్ని కార్యాలు సమకూర్చుకోవచ్చు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. . రెండు పక్షాల వారూ కలసిమెలసి సంపదలు పెంచుతూ ఉంటే సేవకులంతా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారు. బలం పెరగటం వల్ల శత్రురాజ్యాలపై దండెత్తి అమిత ధనరాశులను సాధించవచ్చు. ఆ ధనంతో ధర్మబద్ధ పాలన సాగించవచ్చు. అప్పుడు మీ కీర్తి లోకంలో శాశ్వతమై నిలుస్తుంది.
ముగింపు ఓ రాజా ! కలహం వల్ల పూర్వం కౌరవులు నాశనమై పడిన కష్టాల గురించి విన్నాం కదా ! కనుక పగ పెరిగేటట్లు చేయటం భావ్యం కాదు. మీ రెండు పక్షాలవారూ . అన్నదమ్ములే కనుక పరిష్కార మార్గం చెప్పాను. నామాట వినండి అంటూ మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు సంధికోసం శాంతివచనాలు వినిపించాడు.
2. సమాజంలో వచ్చిన మార్పుల పట్ల అద్దేపల్లికి కలిగిన ఆవేదనను తెల్పండి.
జవాబు:
‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. అద్దేపల్లి అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని సామ్రాజ్యవాద ప్రపంచీకరణపై విరుచుకు పడ్డాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నీరాజనం పట్టాడు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలు భాష ఎలా నిరాదరణకు లోనవుతున్నాయోనని అద్దేపల్లి ఆవేదనకు గురిఅయ్యాడు. మేథావులు, సినిమాతారలు, చివరకు తెలుగు అధ్యాపకులు కూడా బియ్యంలో రాళ్ళలా తెలుగు ఇంగ్లీషు పదాలను కలగలిపి మాట్లాడుతున్నారు. జాతికి భాష ప్రాణం. ఆ ప్రాణాన్ని మేధావులు నమిలి మింగేస్తున్నారు. విద్యాలయాల ద్వారా వ్యాపారం సాగిస్తూ విద్యను వ్యాపార వస్తువుగా మారుస్తున్నాయి. ఇంగ్లీషు కాన్వెంట్లు పిల్లలకు రైమ్లను నేర్పుతూ సాంస్కృతిక పరమైన గేయాలను, పాటలను మ్రింగేస్తున్నాయి. చెవులు పగిలేలా శబ్దాలు చేస్తున్న పాప్పాటలు డాన్సులు శాస్త్రీయతకు ముప్పు తెస్తున్నాయి.
సంప్రదాయం, ఆధునికత సంస్కారం అనే మూడింటిని నాశనం చేస్తూ పంచకోళ్ళ రసాయనం తాగుతున్న కొత్తమనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయి కన్నీటితో దర్శనమిస్తున్నాడు. అంతర్జాతీయ వ్యాపారంలో సొంతముద్రను చెరిపేసుకొని విదేశీ వస్తువులను వాడుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. చివరకు తనకు తానే ప్రాపంచీకరణ మత్తులో అమ్ముడు పోతున్నాడు. నేటి మానవుడు అనుభూతులను వదిలిపెట్టి ప్రకృతి చెట్టును పెంచి, కంప్యూటర్లోకి ప్రకృతిని తీసుకువచ్చి ఆకుల కంటే ఇంకా పచ్చని హైకూలను సృష్టిస్తున్నాడు.
మన సంస్కృతీపరమైన ఆటలైన కత్తిపడవలు, నెమలికన్నులు, ఇసుక గూళ్ళు, బువ్వాటలు, కొమ్మ ఉయ్యాలలు, కోతి కొమ్మచ్చులు వంటి ఆటలను వీడియో గేమ్స్ మార్చుకొని కాలు కదపకుండా లోకం చుట్టివస్తున్నాడు. నేటి మానవుడు ఎక్కడికి పోతున్నాడు వాస్తవాన్ని వదలి కృత్రిమ జీవితంలో బ్రతుకుతున్నాడన్న అద్దేపల్లి ఆవేదనను, “ఈ దారి ఎక్కడికి పోతుంది” అన్న కవిత ద్వారా తెలియజేశాడు.
III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. పూర్వపు తెలుగు వారి ఆటలను వివరించండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. ఈ వ్యాసం ప్రాచీన కాలంలో తెలుగువారి సంస్కృతిలో భాగమైన ఆటలు, వేడుకలను గురించి చక్కగా వివరిస్తుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయటమే ఈ వ్యాసంలోని విషయం.
ఆంగ్లేయులకు క్రికెట్ మొదలగు ఆటలున్నట్లు తెలుగువారికి జాతీయ క్రీడలు తక్కువ. వయసు వచ్చిన యువజనులు ఆడు ఆటలు చాలా అరుదు. మన ప్రబంధాలలో బాలబాలికలు ఆడు ఆటలు వర్ణించబడ్డాయి. మనదేశంలోని బాలబాలికలు ఏడెనిమిది సంవత్సరముల వయస్సు వచ్చేవరకు కలిసిమెలిసి ఆడుకునేవారు. ఆంగ్ల విద్యావిధానం వలన ఆ ఆటలు మూలనపడ్డాయి. అందువలన ప్రబంధాలలోని ఆటలు ఎలా ఆడేవారో ఎవరికి తెలియదు. ఈ ఆటలను గురించి అయ్యలరాజు నారాయణామాత్యుడు తన ‘హంస వింశతి’ కావ్యంలో వివరించాడు.
తెలుగు నేలపై ఆడు ఆటలలో కొన్ని ఇంటిలోను కొన్ని ఇంటి వెలుపల మరికొన్ని ఇంట్లోను, బయటను ఆడుకొనే ఆటలున్నాయి. అచ్చనగళ్ళు కేవలం బాలికల క్రీడ. కోతికొమ్మచ్చి బాలుర ఆట. కుందికట్టు, కంబాలాట, పుట్టచెండు, దాగుడుమూతలు మొదలగునవి బాలబాలికలు ఇద్దరూ ఆడే ఆటలు. ఈ ఆటలతోపాటు పాటలు కూడా ఉంటాయి. ఒకే ఆట వేరువేరు తెలుగు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుచుకునేవారు. కోతికొమ్మచ్చిని, క్రోత క్రోతులని, కందికట్టుకు కుందికాళ్ళని కుందెనగిరి అని, కుందెన గుడి అని వ్యవహరించేవారు.
2. అర్థ సంకోచ, అర్థ వ్యాకోచాల గురించి తెల్పండి.
జవాబు:
భాషలో రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం, రెండు అర్థం. ఆ రెండింటిలో పరిణామాలు వస్తుంటాయి. ఇలా పదాలలోని అర్థాలలో కాలక్రమంగా వచ్చే మార్పులను “అర్థ విపరిణామం” అంటారు.
ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం వుంది. తరువాత ఆ అర్థంలో మార్పు రావచ్చు. వాటిలో ఒకటి అర్థవ్యాకోచము, రెండు అర్థసంకోచము, మూడు గ్రామ్యత్వము, నాలుగు సౌమ్యత, ఐదు సంకేతము.
1. అర్థ వ్యాకోచము .: అర్థము వ్యాకోచించటమే అర్థవ్యాకోచము. మొదట పరిమిత అర్థాన్ని బోధించే పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించటాన్ని అర్థవ్యాకోచమంటాము.
ఉదా : పూర్వము ‘తైలమను’ పదం తిలలు అంటే నువ్వుల నుండి తీసే నూనె అను అర్థంలో చెప్పబడింది. తరువాత కాలంలో అధి మందార తైలము, బృంగామలక తైలము మాషతైలము అని విస్తృతార్థంలో వాడబడుతున్నది.
‘దీపపు సెమ్మె’ అను మాట తెలుగున వాడుకలో ఉంది. దీనికి దీపము పెట్టుకొనటానికి వాడే స్తంభము అని అర్థం. పారశీక భాషలో ‘శమా’ అంటే దీపమని అర్థం. అదే తెలుగున సెమ్మె అని మారింది. అచట ఆధేయమునకు వాచకమైనది, ఇచ్చట ఆధారవాచకమైనది.
2. అర్థ సంకోచము : అర్థం సంకోచం చెందడమే అర్థసంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితమై పరిమిత అర్థాన్ని ఇవ్వటం.
ఉదా : పూర్వము ‘చీర’ అను శబ్దము వస్త్రము అన్న విస్తృతార్థంలో వాడబడేది. సీతారాములిర్వురును నారచీరలు ధరించిరి, అన్నపుడు ‘చీర’ వస్త్రము అన్న సామాన్య వాచకంగా వాడబడింది. ఈనాడు అది స్త్రీలు ధరించే వస్త్రంగా సంకుచితార్థంలో వాడబడుతున్నది.
పూర్వం ‘వ్యవసాయము’ అంటే ‘పని’ అన్న విస్తృతార్థం అది ఇపుడు ‘సేద్యము’ అన్న అర్థానికి పరిమితమైపోయింది. దీనితో సమానార్థకమైన ‘కృషి’ అను పదము పూర్వము ‘శ్రమపడు’ అర్ధంలో వాడబడినది. అది ఇపుడు ‘వ్యవసాయం’ గా మారిపోయింది. అలానే ‘ఉద్యోగమను’ పదము ‘ప్రయత్న’ మన్న విస్తృతార్థంలో పూర్వము వాడబడింది. అది ఇపుడు ఆంగ్లంలోని ‘Job’ అను పదముగా మారి ‘ఉద్యోగము’ అను అర్థాన్నిస్తున్నది. ఉద్యోగపర్వము నాటి ‘ఉద్యోగము’ గా నేడు వాడబడుట లేదు. ఇలా పూర్వం విస్తృతార్థంలో ఉండి సంకుచితార్థంగా మారటాన్ని అర్థ సంకోచమంటాము.
IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)
1. ‘గవేషణ’ నాటిక సారాంశాన్ని తెల్పండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతన్ని యమలోకం తీసుకొని వెళుతుంటారు. మానవుడు తానింకా బ్రతికే ఉన్నానని ఎంత వాదించినా వినకుండా మృత్యుదూతలు న్యాయమూర్తికి అప్పగిస్తారు. న్యాయమూర్తి అతని జీవితపు కాగితాన్ని· పరిశీలించి ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహిస్తాడు. తిరిగి భూలోకం వెళ్ళిపో, ఇంకా 5 సంవత్సరాల ఆయష్షు ఉందని చెప్తాడు ధర్మమూర్తి. తిరిగి భూలోకం చేరుకున్న మానవునికి తన శరీరం కనబడలేదు. అప్పటికే బంధువులు కళేబరాన్ని దహనం చేశారు. ఈ శరీరం లేని ఆత్మతో ఎలా జీవించాలో అర్థం కాక తిరిగి ధర్మమూర్తి దగ్గరకు వెళదామని నిర్ణయించుకుంటాడు. తిరిగి మరో ప్రపంచపు సొరంగాల దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక నవ్వు వినబడుతుంది.
ఎవరు ఎందుకు నవ్వుతున్నావని మానవుడు .ఆ నవ్విన వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఎందుకొచ్చావని తిరిగి మానవుణ్ణి నవ్విన వ్యక్తి ప్రశ్నించగా తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు. నవ్విన వ్యక్తి సానుభూతితో మానవునికి సహాయం చేయాలనుకుంటాడు. న్యాయమూర్తి దర్శనం. కలిగిస్తాడు. ధర్మదేవత తిరిగి వచ్చిన మానవునికి పూర్ణ ఆయుర్ధాయం కలిగేలా వరం ఇస్తుంది. జన్మరాహిత్యాన్ని ఇవ్వలేను. కాని తిరిగి ఏదైనా శరీరంలో ప్రవేశించి బ్రతకమంటుంది. కాని మానవుడు తన 35 ఏళ్ళ జీవితంలో ఎలా ఉన్నాడో అలా ఉండే శరీరం ఎక్కడ లభిస్తుంది అని బాధపడతాడు.
దేవతల మీద నమ్మకం లేకపోయినా ఫర్వాలేదు కాని మానవత్వం పై నమ్మకాన్ని వదులుకోవద్దని అయినా దేవతల వల్ల జరిగిన పొరపాటుని నేనే ధర్మదేవతను క్షమించమని.. కోరుతున్నానని మానవుని చేతులు పట్టుకుంటుంది. ఈ అల్ప మానవులు దేవతలను క్షమించటమా అంతమాట అనవద్దని మానవుడు తిరిగి భూలోకానికి వెళ్ళిపోతానని సెలవు తీసుకుంటాడు. తనకు తనలాగా బ్రతికే అవకాశం లేనప్పుడు ఏ బ్రతుకైతేనేం ? అని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. తనని ఓ అమ్మ కడుపులో పడేయమని ప్రార్థిస్తాడు. “నేను తిరిగి సృష్టించలేనని ధర్మదేవత భూలోకంలో ఇప్పుడే ఒక అమ్మాయి ప్రసవించింది. శిశువు మృతుడయ్యాడు. ఆ శిశువులో నీ ఆత్మని ప్రవేశపెట్టుకో. నీకు పూర్ణ ఆయుర్ధాయం ఇస్తున్నానని చెప్పింది. మానవుడు ఆ వైద్యశాల చేరుకొని శిశువు శరీరంలో ప్రవేశించాడు. అంతవరకు అష్టకష్టాలు పడ్డ వైద్యులు శిశువు క్యారు మనడంతో ఊపిరి పీల్చుకున్నారు. మృత శిశువని ఏడ్చిన తల్లి ఆనందంతో బిడ్డను చూసుకుంది.
2. ‘ఆశ ఖరీదు అణా’ నాటిక సారాంశాన్ని రాయండి.
జవాబు:
మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రదేశం అది. దాదాపు 22 కుటుంబాలున్న ఆ లోగిలిలో అందరికి సమస్యలు. ఎవరి సమస్యలు వారివి. ఉద్యోగ విరమణ చేసిన తాతగారు గంపెడు సంసారంతో బాధపడుతుంటాడు. కొత్తగా అద్దెకు దిగిన యువకుడు నిరుద్యోగి, అవివాహితుడు. ఏవో బొమ్మలు గీస్తూ తన మనోభావాలను వాటి ద్వారా బహిర్గతం చేస్తుంటాడు. ఇందిర, ఆనందలక్ష్మి అక్కాచెల్లెళ్ళు. క్రింది వాటాలో ఉంటారు. జబ్బుతో మంచానపడిన తల్లి, అకారణంగా జైలుకెళ్ళిన తండ్రి, నిరుద్యోగి అయిన అన్నయ్య పైగా అమాయకంతో తల్లిదండ్రుల గూర్చి బాధపడుతుంటాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ తల్లినీ, అన్నయ్యను అభిమానంగా చూసుకుంటుంది. ఆత్మన్యూనతా భావంతో అన్నయ్య ఎప్పుడూ కృష్ణవేణితో గొడవపడుతుంటాడు. తనకు ఒక ఉద్యోగం వస్తే చెల్లెల్ని ఉద్యోగం మానిపించేయాలనుకుంటూ ఉంటాడు.
కృష్ణమూర్తి అనే ఆయన బ్యాంకు ఉద్యోగి. తనవరకు తాను అన్నట్లు చిన్న ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన యువకునితో పరిచయం చేసుకుంటూ మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఉంటే ఏ బ్యాంకు అని ఆరాలు తీస్తాడు. దానికి సమాధానంగా నా ఎకౌంటు నా జేబులోనే ఉంది అయినా ఖాళీగానే ఉందని అంటాడు. బహుశా బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు నచ్చరేమో అని తనలో తాను అనుకుంటాడా యువకుడు. పైన ఉండే ఆడపిల్లలను చులకన చేసి మాట్లాడటం ఆ యువకునికి నచ్చలేదు. ఇందిరా, ఆనందలక్ష్మిలను గూర్చి ఆలోచిస్తాడు. పరిచయమైన అమ్మాయి పేరు ఏమిటో అని అనుకుంటాడు. ఇంతలో కృష్ణవేణి లక్ష్మీ దగ్గరకు వచ్చి తన అన్నయ్య గురించి తన బాధను చెప్తుంది.
ఉద్యోగం కోసం వెళ్ళిన అన్నయ్య ఎప్పటికీ రాకపోయేసరికి ఇందిర, లక్ష్మీలు కంగారుపడతారు. ఆకలితో యువకునికి నిద్ర పట్టదు. సమస్యలతో తాతగారు పచార్లు చేస్తుంటాడు. తొమ్మిదిమంది సంతానం. వచ్చే పింఛను చాలీచాలదు. పెళ్ళి చేసిన ఇద్దరి కొడుకులకు ఉద్యోగాలు లేవు. పెద్ద కోడలి ప్రసవం. ఇన్ని సమస్యలతో నిద్రరాక బయట తిరుగుతుంటాడు. యువకుడు ఒంటరిగా తిండిలేక తిరుగుతుంటాడు. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లలో పడి మాట్లాడుకుంటూ ఉండగా బ్యాంకు ఉద్యోగి తన భార్యకు తుమ్ములు ఆగటం లేదని మందుల దుకాణం తెరిచి ఉంటుందా అని కంగారుగా వస్తాడు.
అన్నయ్య మాటలు పడలేక కృష్ణవేణి ఇందిర, లక్ష్మిల దగ్గరకు వస్తుంది. బ్రతుకంటే విరక్తి చెందిన వ్యక్తి కృష్ణవేణి. ఉద్యోగ వేటలో ఎక్కడో తిరుగుతున్న ఇందిర, లక్ష్మీల అన్నయ్య ఇంకా రాలేదని కంగారుపడతారు. ఎవరూ లేని ఒంటరి జీవితం ఎందుకనుకొని యువకుడు ప్రాణత్యాగం చేయాలనుకుంటూ రోడ్డుమీదకు వస్తాడు. ఇంతలో కారుప్రక్కగా పడిన నీడలా కనిపించిన వ్యక్తిని చూస్తారు లక్ష్మీ, ఇందిరలు. అన్నయ్యా అంటూ అరుస్తారు.
తాతగారు దగ్గరగా వెళ్ళి చూసి లేవదీస్తాడు. కారుక్రింద పడి చనిపోదాం అనుకున్నది అంతా చెడిపోయిందని బాధపడతాడు. వెంటనే తాతగారు మీరంతా దగాపడ్డ తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూను చావడానికి లక్ష కారణాలుంటే, బ్రతకటానికి కోటి కారణాలుంటాయి. నా సమస్యల ముందు మీ సమస్యలే మాత్రం. బ్రతకటంలో ఉండే మాధుర్యం మీకు తెలియదు. ముందు మీరందరూ ధైర్యంతో బ్రతకండి. ఏ కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉంది. అంతమాత్రాన మనల్ని మనమే అసహ్యించుకోకూడదు. జీవితంలో ఆనందాన్ని పోల్చుకోండి. దేనికి భయపడకండి. మీకందరికి బ్రతకడం నేర్పిస్తానని అంటాడు తాతగారు. ఇంతలో లాంతరు వెలుగులో కాఫీ తలా ఓ గ్లాసు తాగమంటాడు తాతగారు. వారందరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. గ్లాసు కాఫీ అణా. అలాగే వారందరిలో ఆశ ఖరీదు అణాగా పాత జ్ఞాపకాలు, ఆశలు చిగురిస్తాయి. అందరూ తాతగారి గొప్పతనానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
3. ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని తెలియజేయండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళులేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు. కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్బారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు, తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లోపడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.
తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన `తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్ డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ, రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.
విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను. భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు సత్యాన్ని సుదర్శన్.
4. ‘ఆశ ఖరీదు అణా’ లో. కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
కృష్ణవేణి ఈ నాటికలో మధ్యతరగతి అమ్మాయి. ఇంటిని పోషించడం కోసం ఉద్యోగం చేస్తుంటుంది. తల్లి, అన్నయ్యలను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది. తెల్లారి లేస్తూనే ఇంట్లో చాకిరీ, తరువాత ఆఫీసులో పని, తిరిగి ఇంటికి వచ్చాక వంట మొదలైన పనులతో నిరంతరం విసుగు లేకుండా పనిచేస్తూ ఉంటుంది.
ధైర్య సాహసాలు గల వ్యక్తిగా కనబడినా ఎక్కడో ఆడపిల్లనని గుర్తుచేసే సందర్భాల వల్ల కొంత బెరుకుతనం గల స్త్రీమూర్తి.
మేడమీద అద్దెకు దిగిన వ్యక్తి మీరేనా అంటూ పరిచయం చేసుకుంటుంది. గోడకు – మేకులు కొట్టి మాకు నిద్రాభంగం కలిగించారని నిర్మొహమాటంగా చెప్తుంది. ఇంటిగలాయన మేకులు కొడితే ఊరుకోడు. బంగారు గోడలు పాడయిపోతాయని బాధ పడతాడని అంటుంది. చల్లగాలికి ఆహ్లాదంగా సినిమాకు వెళ్ళితే బాగుంటుందని మనసులో మాట బయటకే అనేస్తుంది. పాటలంటే మీకు ఇష్టమా ? అయితే మా ఇందిర బాగా పాడుతుందని యువకునితో అంటుంది. గల్లీలో ఎవరో పోయిన సందర్భంలో శవాలంటే భయం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పేరు అడగలేదని యువకుడు అనుకుంటూ అంత ధైర్యంలోనూ పిరికితనం ఇదే మానవ నైజం అని అనుకుంటాడు.
పై గదిలో అద్దెకు వచ్చిన అబ్బాయి పేరేమిటని అన్నయ్యను అడుగుతుంది. అందుకు అన్నయ్య విసుక్కుంటాడు. పనిపాట లేక వాళ్ళ పేరేమిటి ? వీళ్ళ పేరేమిటి అని ఇటువంటి ఆలోచనలు ఎందుకు. తనకే గనక ఉద్యోగం దొరికితే ముందు చెల్లెల్ని ఉద్యోగం మానిపించేస్తానని అంటాడు. అందుకు చాలా బాధపడుతుంది. నా ఉద్యోగం మానిపించేంత వరకు నీకు మనశ్శాంతి ఉండదా ? ఏం మనుషులో ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నా సహించలేరు. అదంతా అభిమానమే అని అనుకుంటారు. అంత ప్రేమ లేకపోయినా కాస్త సుఖపడేదాన్ని అని బాధపడుతుంది.
కృష్ణవేణి. నిద్రపట్టక కృష్ణవేణి ఇందిర, ఆనందలక్ష్మిల ఇంటికి వస్తుంది. ఇంత రాత్రివేళ వచ్చావేంటి అంటుంది ఇందిర. పగలంతా ఆఫీసులో పని. ఇంట్లో మళ్ళీ వండి వార్చినా నీకు నిద్ర రాకపోవటం ఏమిటి అని లక్ష్మీ అడుగుతుంది. మా అన్నయ్య రెండు వందల ఏళ్ళ క్రిందట పుట్టవలసినవాడు. వాడికి ఉద్యోగం దొరకటం లేదన్న కసితో నా ఉద్యోగాన్ని మానిపించేయాలని అంటూ ఉంటాడు. నా జీతం మీద ప్రేమే మళ్ళీ. ఎంత అభిమానంగా చేసినా ఈ మాటలు పడలేకపోతున్నాను. ఎంతకాలం మాటలు పడను చెప్పు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ త్యాగం అని స్నేహితురాళ్ళతో తన బాధనంతటినీ చెప్పుకుంటుంది. జీవితంపై విరక్తిని పెంచుకొని నిరాశలో బ్రతుకుతుంది. చివరకు తాతగారి ఉపదేశం వల్ల మళ్లీ కొత్త ఆశలతో ధైర్యంగా తన పని ఏదో తాను చేసుకోగలుగుతుంది కృష్ణవేణి.
V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)
1. దొంగిలి కొనిపోవదగునె దొరలకు నెందున్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : రాజు అన్నవాడు శత్రువును పూర్తిగా సంహరించి విజయము సాధించాలని సీత పలికిన సందర్భంలోనిది.
భావం : సీత హనుమంతుని వీపు మీద కూర్చొని, లంక నుండి హనుమంతునితో’ వెడితే, రాముని దొంగ అని అంటారు. అదీకాక సీత తాను రాముని తప్ప, ఇతరుల శరీరాన్ని అంటుకోధు. కాబట్టి హనుమంతునితో తాను వెళ్లడం కుదరదు. అదీకాక సీతను దొంగిలించి తెచ్చిన రావణుని, అతని స్నేహితులనూ, సాహసంతో యుద్ధంలో ముందు చంపాలి. అంతేకాని దొంగతనంగా తీసుకువెళ్ళడం, రాజులకు తగదని, సీత హనుమంతునితో చెప్పిందని భావం.
2. పోరు మంచిది గాదు భూమి నెక్కడను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
`సందర్భం : ఈ మాటలు యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నలగామరాజుతో భట్టు పలికిన సందర్భంలోనివి.
భావము : ఈ భూమిమీద ఎక్కడైనా సరే యుద్ధం మంచిది కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! అన్నదమ్ములైన మీరిరువురూ కలిసిమెలసి ఉంటే రాజ్యానికి ఎంతో లాభం. కనుక స్నేహం కోసం నీ తమ్ముడైన మలిదేవరాజు దగ్గరకు నీకు ఉంతో నమ్మకస్తుడైన నరసింగరాజును పంపించు. ఈ భూమిమీద ఎక్కడైనా సరే కలహం ఎప్పటికీ మంచిది కాదు అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.
3. కోకిల మేధం సాగుతున్నది.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము : అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న కవి ఈ గేయం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భంలోనిది.
భావము : ఆడదానికంటే అడవిలో మానుకే విలువనిస్తున్న సమాజం మనది. కట్నం కోసం కోడలి బ్రతుకును నాశనం చేసిన అత్తమామలు రాక్షసులా? పిశాచాలా? ఆకలి తీర్చుకోవటానికి లేళ్ళను చంపే పులులున్న ఈ దేశంలో, కట్నం కోసం కోకిలల వంటి కోడళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారని ఇందలి భావం..
4. రాజునేలే దైవముండడొ ?
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాల సరాలు’ అనే కవితా సంపుటి నుంఛి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు సందేశం ఇస్తూ కన్యక పలికిన సందర్భంలోవి.
భావం : పట్టణాన్ని ఏలడానికి రాజు ఉంటే ఆ రాజును ఏలడానికి దైవం ఉండడా ? అని భావం.
వ్యాఖ్య : కన్యక గుడిలో అమ్మవారిని పూజించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసింది. అన్నలారా ! తండ్రులారా ! ఒక్కమాట వినండి. ప్రజలకు తమ భార్యాబిడ్డలను కాపాడుకొనే ఆశ లేదా ? పట్టణాన్ని పాలించడానికి రాజు ఉంటే ఆ రాజును పాలించడానికి దైవం ఉండడా ? అని కన్యక పలికింది.
VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
1. స్వాతంత్య్ర హీనులు ఎలా ఉంటారని భట్టు తెలిపాడు ?
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో స్వాతంత్య్రహీనుల దైన్యస్థితిని ఇట్లా వర్ణించాడు.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతక వలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించబడ్డ పక్షులలాగా బతకాలి. పాముల వాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దులవాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి అని స్వాతంత్ర్య హీనుల గురించి భట్టు తెలిపాడు.
2. కన్యక ప్రజలకిచ్చిన సందేశమేమిటి ?
జవాబు:
గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు ఇట్లా సందేశం ఇచ్చింది. “అన్నలారా ! తండ్రులారా ! నా విన్నపాన్ని వినండి. మీరు మీ భార్యాబిడ్డలను రక్షించుకోలేరా ? రాజ్యాన్ని ఏలడానికి రాజు ఉంటే ఆ రాజును ఏలడానికి దైవం లేడా? మీ పరువును నిల్పుకొనే పౌరుషం మీకు లేదా ? చదువుకున్నవాడే బ్రాహ్మణుడు. వీరత్వం కలవాడే క్షత్రియుడు అనే పెద్దల మాట మరిచారా ? పదవుల మీద ఆశపడడం, సంపదలను చూసుకొని మురిసిపోవడం సరికాదు. చదువుకోకుండా, పరాక్రమం లేకుండా తెలివి తక్కువగా ఉన్నవారికి కష్టాలు తప్పవు. ‘ ఇప్పటికైనా మేల్కొనండి. దైవబలంతో రాజులకే రాజులుగా బతకండి” అంటూ కన్యక ప్రజలకు హితబోధ చేసింది.
3. సత్యవాక్యం వేటికంటే గొప్పది ?
జవాబు:
నూరు మంచినీటి బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమంది కంటే ఒక సత్యవాక్యం మేలైనది. అంతేకాక ఒక త్రాసులో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉంచి తూచగా ముల్లు సత్యంవైపే మొగ్గుచూపుతుంది. తీర్థాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటంకానీ సత్యవ్రతానికి సాటిరావు. అందువల్లనే ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.
4. మనిషి జీవితం వస్తువులా ఎలా మారిపోతూ ఉంది ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడకు పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. నేటి కాలంలో మనిషి జీవితం ఒక వస్తువులా మారిపోయిందని అద్దేపల్లి వారు ఆవేదన చెందారు.
ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. ప్రతి రోజూ ఎన్నో వస్తువులు విదేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. వీటి వలన మన సంస్కృతి సంపద, సొంతముద్రలు చెరిగిపోతున్నాయి. మనం స్వదేశీ ఉత్పత్తులను వదిలేసి విదేశీ వస్తువుల మోజులో టి.వి., ఏ.సి. మొదలగు వస్తువులపై శ్రద్ధపెడుతున్నాము. విదేశీ వస్తువులను ఆదరించినట్లుగా స్వదేశీ వస్తువులను ఆదరించటం లేదు. పూర్వం మన వారు అవసరమైన వస్తువులనే కొనేవారు. ఇప్పుడు తన స్థాయిని సంఘంలో పెంచుకోవాలన్న తాపత్రయంతో విదేశీ వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా హోదా కోసం కొంటున్నారు. ఆ వస్తువులు తమ ఇంట్లో లేకపోతే పరువుపోతుందన్న భావనతో నేటి మనిషి ఉంటున్నాడు. ఇలా మనిషి జీవితం వస్తువులా మారిపోయే ప్రమాదం ఉందని అద్దేపల్లి వారు భావించారు.
VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
1. ఖడ్గ తిక్కనకు సంబంధించిన చాటు వృత్తాంతాన్ని తెల్పండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా. సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని చాటువుల నుండి గ్రహించబడింది.
కవి ఎవరో తెలియని ఉన్న ఖడ్గ తిక్కనకు సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. ఖడ్గ తిక్కన మనుమసిద్ధి పక్షాన నిలిచి కాటమరాజు నెదిరించిన మహావీరుడు. అతడు యుద్ధంలో .భీకరంగా పోరాడి తన సేనలు చెల్లాచెదురై పారిపోగా యుద్ధాన్ని విరమించి ఇంటిముఖం పట్టాడు. అతడి భార్య నులకమంచాన్ని అడ్డుగా పెట్టి దానిమీద పసుపుముద్ద నుంచి ప్రక్కన నీళ్ళ చెంబు పెట్టిందట. ఇదేమిటని అడగ్గా
“పగరకు వెన్నిచ్చినచో
నగరేనిను మగతనంపు నాయకు లెందున్
ముగురాడు వార మైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.
అని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడింది. ఆ తరువాత ఖడ్గతిక్కన తల్లి అన్నంలో విరిగిన పాలు పోసిందట. ఇదేమిటని ప్రశ్నిస్తే
కసవున్ మేయగ బోయిన
పసులున్ విరిగినవి తిక్క! పాలున్ విరిగెన్.
అని ఆక్షేపించింది. ఆ మాటలకు సిగ్గుపడి లేచి యుద్ధమునకు పోయి వీర స్వర్గము నలంకరించాడు. ఈ చాటు పద్యాల వలన చరిత్రను తెలుసుకునే వీలు కలిగింది.
2. చిలకమర్తి తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించిబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. బ్రిటీషువారు భారతీయులను ఎలా దోపిడీ చేస్తున్నారో “భరత ఖండంబు చక్కని పాడియావు” అన్న పద్యం ద్వారా వివరించారు. బ్రిటీషు ప్రభుత్వం ప్రజలపై విధించే వివిధ పన్నులను గురించి కూడా వివరించారు.
నేల దున్నటానికి జాలతరము పన్ను, నీటికోసం నీటి పన్ను వ్యాపారం చేస్తే రాబడి మీద పన్ను, సరుకులు అమ్ముకుంటే సంత పన్ను, కట్టెలు అమ్ముకుంటే దానిపై మరొక పన్ను, పట్టణాలలో మునిసిపాలిటీ పన్ను, పారిపోదామంటే బండి హాసీలన్ను, ఇంటిని అమ్ముకుందాము అంటే స్టాంపు పన్ను, తృప్తిగా తిందామంటే ఉప్పు పన్ను ఇలా ఎన్నో విధాలుగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలను పన్నుల బాధతో పీడించేదని చిలకమర్తి వారు వివరించారు.
3. చదరంగం గురించి రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వములు అను సంపుటం నుండి గ్రహించబడింది.
చదరంగం భారత జాతీయక్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించినది భారతదేశమే ! పూర్వం దీనిని అష్టాపదమని పిలిచేవారు. మనదేశం నుండి ఈ ఆట పర్షియా, అరేబియా, తూర్పు చైనా దేశాలకు వ్యాపించింది. 10వ శతాబ్దం చివరిలో అరబ్బులు ఈ ఆటను స్పెయిన్ దేశానికి తీసుకుపోయారు. 11వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం అయింది.
ఈ ఆటను పూర్వం ఉన్నత కులాలవారు మాత్రమే ఆడేవారు. విజయనగర ప్రభువు కృష్ణ దేవరాయలు ఈ ఆటను అమితంగా ప్రేమించారు. ఆయన బొడ్డుచర్ల తిమ్మనతో ప్రతిరోజూ . ఆడేవారట, రాయల తరపున ఎందరు ఆడినా ఒక్కడే ఉండి తిమ్మన విజయం సాధించేవాడట. పూర్వం యుద్ధమునకు వెళ్ళే సమయాన ఈ ఆటను ఆడి ఎత్తులకు పై ఎత్తులు వేసేవారని చరిత్ర తెలియజేస్తుంది. ఈనాడు. చదరంగం ప్రపంచ క్రీడలలో చేరింది. ఇప్పటికి కూడా ముందుగానే చెప్పి ఆట కట్టించగల క్రీడాకారులు తెలుగుదేశాన ఎందరో ఉన్నారు.
4. రావూరి భరద్వాజకు చదువు పట్ల ఆసక్తిని కల్గించిన సంఘటనను తెల్పండి.
జవాబు:
నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న- ‘నా గురించి ‘నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్త రూపం.
రావూరి భరద్వాజ 8వ తరగతిలోనే చదువు మానేశారు. దానికి ఒక కారణం స్కూలు . హెడ్మాస్టారైతే రెండవ కారణం ఆ కుటుంబాన్ని ముసిరిన దరిద్రం. స్కూలు ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చిన రోజు చిరిగిన దుస్తులు ధరించినందుకు మాష్టారు చితక బాదాడు. దానితో చదువుకు స్వస్తి చెప్పాడు. తరువాత రావూరికి జరిగిన అవమానం ఆయనలో చదువు పట్ల ఆసక్తిని కలిగించింది. ఆయనకన్నా చిన్నవాడు ఒకడు మనుచరిత్ర పద్యాన్ని అప్పగించాడు. అందరూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు. భరద్వాజ నాన్నగారి స్నేహితుడు శేషయ్య ఆ కుర్రాడితో పోలుస్తూ ఆయనను తిట్టాడు. నాటినుండి పగలంతా కూలి పని చేసుకొని రాత్రిపూట శివాలయంలోని ప్రమిద దగ్గర చదువు కొనేవాడు. ఈయనకు గ్రంథాలయంలో పుస్తకాలు చదవటానికి సహాయపడిన వారు కొల్లూరి వెంకటేశ్వరరావు గారు.
VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
1. బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి ?
జవాబు:
మలిదేవాదుల మంత్రి బ్రహ్మనాయుడు.
2. గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం పేరేమిటి ?
జవాబు:
గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం ‘కన్యాశుల్కం’,
3. శకుంతలను పెంచిన తండ్రి ఎవరు ?
జవాబు:
శకుంతలను పెంచిన తండ్రి ‘కణ్వ మహర్షి’.
4. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! పాట రచయిత ఎవరు ?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! పాట రచయిత ‘కలేకూరి ప్రసాద్’.
5. అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది ?
జవాబు:
అమ్మతనం ముందు అమ్మకంతనం ఓడిపోతుంది.
6. హనుమంతుని తల్లి పేరేమిటి ?
జవాబు:
హనుమంతుని తల్లి పేరు ‘అంజనా దేవి’.
IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
1. ప్రాచీన నాటకాలలోని హాస్య పాత్ర ఏది ?
జవాబు:
ప్రాచీన నాటకాలలోని హాస్య పాత్ర విదూషకుడు.
2. చాటువులను వెలుగులోకి తెచ్చిన వారెవరు ?
జవాబు:
వేటూరి ప్రభాకర శాస్త్రి.
3. గుర్రపు స్వారీలో ఉద్దండుడైన రెడ్డి రాజు ఎవరు ?
జవాబు:
గుర్రపు స్వారీలో ఉద్దండుడైన రెడ్డి రాజు ‘దొడ్డారెడ్డి’.
4. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమేది ?
జవాబు:
వందేమాతరం ఉద్యమం.
5. స్ఫూర్తిశ్రీ అసలు ఫేరేమిటి ?
జవాబు:
తోకల భాస్కరరావు.
6. ‘పాకుడురాళ్ళు’ నవలా రచయిత ఎవరు ?
జవాబు:
రావూరి భరద్వాజ.
X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)
1. నైలునది ప్రపంచంలో పొడవైన నది
జవాబు:
నైలునది.
2. అవ్యయం అంటే ఏమిటి ?
దీనిలోని నామవాచకాన్ని గుర్తించండి.
జవాబు:
లింగ వచన విభక్తులు లేని పదాలు. ఆహా, మీద మొదలగునవి.
3. దేవదత్తుడు వంట చేశాడు – ఇందులో క్రియ ఏది ?
జవాబు:
చేశాడు.
4. విశేషణానికి ఉదాహరణ రాయండి.
జవాబు:
నలుపు.
5. సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి బదులుగా ‘వాడబడేది. అది, ఇది, ఇవి మొదలగునవి.
XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)
1. వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు ?
జవాబు:
వాక్యాలు సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యమని మూడు రకాలు.
2. అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
ఇది సంక్లిష్ట వాక్యము..
3. సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించాడు.
4. రెండు సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం ?
జవాబు:
సంయుక్త వాక్యం.
5. వాక్యానికి ఉండే లక్షణాలేమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి.
XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)
1. చంపకమాల
జవాబు:
1. చంపకమాల :
1) నాలుగు పాదములుంటాయి.
2) ఒక్కొక్క పాదానికి 21 అక్షరాలు ఉంటాయి.
3) ప్రతి పాదము నందు వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అను గణములంటాయి.
4) పాదములోని మొదటి అక్షరమునకు, 11వ అక్షరముతో యతి చెల్లును.
5) ప్రాస నియమం కలదు.
ఉదా :
ఒకటవ అక్షరం ‘ను’ కి, 11వ అక్షరం ‘నూ’ కి యతి చెల్లును.
‘త’ అక్షరం ప్రాసాక్షరం.
2. ముత్యాలసరం
జవాబు:
ముత్యాలసరం.
1) ముత్యాలసరం మాత్రా గణాలతో వస్తుంది.
2) ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3) ప్రతి పాదంలోను 3 + 4, 3 + 4 మొత్తం 14 మాత్రలుంటాయి.
4) నాల్గవ పాదంలో 7 నుండి 14 మాత్రల వరకు ఉండవచ్చు.
5) నాల్గవ పాదంతో భావం పూర్తి కావాలి.
6) అలా పూర్తి కానపుడు ఐదవ పాదం వస్తుంది.
7) ఇలా రావటాన్ని తోక ముత్యాలసరం అంటారు.
ఉదా :
3. తేటగీతి
జవాబు:
తేటగీతి
1) ఇది ఉపజాతి పద్యం.
2) నాలుగు పాదాలుంటాయి.
3) ప్రతి పాదంలోను వరుసగా ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
4) ప్రతి పాదంలోని 14 గణాల మొదటి అక్షరానికి ‘యతి మైత్రి’ ఉంటుంది.
5) ప్రాస నియమం ఉండదు.
6) ప్రాస యతి పాటించవచ్చు.
ఉదా :
XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)
1. మత్తేభంలోని గణాలు ఏవి ?
జవాబు:
స, భ, ర, న, మ, య, వ.
2. ఉత్పలమాల పద్యంలో ఎన్నో అక్షరానికి యతి స్థానం ఉంటుంది ?
జవాబు:
10వ అక్షరానికి.
3. సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు ?
జవాబు:
ఆటవెలది గాని, తేటగీతి గాని,
4. కంద పద్యంలో వాడే గణాలేవి ?
జవాబు:
గగ, భ, జ, స, నలములు,
5. ఇంద్ర గణాలేవి ?
జవాబు:
గగ, నగ, సల, భ, ర, త.
6. ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. ఇది ఒకే హల్లుతో ఉంటుంది.
XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)
1. వృత్త్యనుప్రాస :
జవాబు:
ఒకే హల్లు పలుమార్లు వచ్చిన అది వృత్త్యను ప్రాసాలంకారమగును.
ఉదా : చిటపట చినుకులు పటపట కురిసెను.
ఈ ఉదాహరణలో ‘ట’ వర్ణము పలుమార్లు వచ్చినది కావున వృత్త్యను ప్రాసాలంకార మగును.
2. అర్థాంతరన్యాస :
జవాబు:
సామాన్యాన్ని విశేషణంతో గాని, విశేషణాన్ని సామాన్యంతో గాని సమర్థించిన ఎడల అర్థాంతరన్యాసాలంకార మగును.
ఉదా : హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యము కానిది లేదు. గదా !
ఇక్కడ హనుమంతుడు సముద్రమును దాటుట విశేషం. మహాత్ములకు సాధ్యము కానిది లేదు గదా ! అన్నది సామాన్యం. ఒకదానితో మరొకటి సమర్థింపబడినది కావున అర్థాంతరన్యాసాలంకారం అయింది.
3. ఉపమాలంకారం :
జవాబు:
ఉపమానోపమేయములకు సామ్యరూపమైన సౌందర్యమును సహృద రంజకముగా చెప్పిన యెడల ఉపమాలంకారమగును.
ఉదా : ఓ కృష్ణా ! నీ కీర్తి ఆకాశ గంగలో హంసవలె తేలియాడుచున్నది.
ఉపమాలంకారమందు నాలుగు భాగాలుంటాయి.
1. ఉపమానము
2. ఉపమేయము
3. ఉపమావాచకము
4. సమాన ధర్మము.
పై ఉదాహరణలో శ్రీ కృష్ణుని కీర్తి ఉపమేయం. ఆకాశగంగలో హంస ఉపమానం.
‘వలె’ అన్నది ఉపమావాచకము, తేలియాడుచున్నది సమానధర్మం. ఇక్కడ ఉపమాన ఉపమేయములకు పోలిక చెప్పబడినది కావున ఉపమాలంకారమైనది.
XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
1. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ – ఇందులోని అలంకారమేది ?
జవాబు:
లాటానుప్రాసాలంకారము.
2. ఉపమేయం అంటే ఏమిటి ?.
జవాబు:
వర్ణించబడే వస్తువును ఉపమేయమంటారు.
3. అంత్యానుప్రాసకు ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగాని కంతా సౌఖ్యం నిండగ.
4. ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి – దీనిలోని అలంకారమేది ?
జవాబు:
అతిశయోక్తి అలంకారము.
5. శబ్దాలంకారం అంటే ఏమిటి ?
జవాబు:
శబ్ద ప్రాధాన్యత గలిగిన అలంకారాన్ని శబ్దాలంకారమంటారు.
6. వలె, పోలె, అట్లు, లాగ ఈ పదాలను ఏమంటారు ?
జవాబు:
ఉపమావాచకములంటారు.
XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)
భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడు డా॥ ఎ.పి.జె అబ్దుల్ కలామ్. భారతరత్నగా, భారత క్షిపణి పితామహుడిగా, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలామ్ విద్యార్థి దశలో సగటు విద్యార్థి. మంచి అలవాట్లతో,.కచ్చితమైన క్రమశిక్షణను పాటించటం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక స్త్రీలను, గురువులను, ఇతర పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందినవాడైనా; హిందూ, క్రైస్తవ, సిక్కు వంటి సర్వమతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలామ్ ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని; చిన్న చిన్న లక్ష్యాలు నేరమని విద్యార్థులకు సందేశమిచ్చాడు. వీరి జన్మదినమైన అక్టోబరు 15వ తేదీని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
జవాబు:
భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ భారతదేశం అణ్వస్త్రాలు, క్షిపణులు తయారు చేయటానికి మూలకారకుడు. తాను సగటు విద్యార్థి అయినా, మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఉంటే మంచిస్థాయికి చేరవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవించాడు. తాను ముస్లిం అయినా, మత సామరస్యాన్ని చూపాడు. మంచి పుస్తక ప్రియుడు. గ్రంథ రచయిత. విద్యార్థులు ఉన్నతమైన కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని అన్నారు. కలామ్ పుట్టినరోజు అక్టోబర్ 15ను “ప్రపంచ విద్యార్థుల దినోత్సవం” గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.