AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 1 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. అన్నకుఁ దండ్రికిన్ ……………….. కృతార్థుఁ డెయ్యెడన్.
జవాబు:
అన్నకుఁ దండ్రికిన్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁ గ
నొన్న మహోగ్రపాతక మగున్ దనువస్థిరమృత్యు వెప్పుడున్
సన్నిహిత స్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశంబటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుఁ డెయ్యెడన్.
భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ఎవ్వరైతే కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి భయంకరమైన పాపము కలుగుతుంది. ఈ శరీరము అస్థిరము మరణము వెనువెంట పొంచి ఉంటుంది. కలిమి పూర్వకతము వలన సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ మనసులో తలచుకొని ధర్మమార్గమున అనుసరించు వాడే కృతార్థుడు, ధన్యుడు.

2. ఎన్నో యేండ్లు …………………… నిక్కం బిందు పాషాణముల్.
జవాబు:
ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశాన స్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుఁ డొఁకడైనన్ లేచిరాఁ డక్కటా
యెన్నాళ్ళీ చలనంబు లేని శయనం బే తల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్.
భావం : అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ! ఎంత కాలం నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భశోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయినవి. ఇది నిజం.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నడు శివలింగముతో తన ఊరికి రమ్మని పిలచిన తీరును తెలపండి.
జవాబు:
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనెడి కవచంతో కూడిన శరీరం కలవాడై ఆనందం వలన కలిగిన కన్నీరు. హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి సమీపించాడు.

ఓ సామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన, నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయములు తెచ్చియిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా !

కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క, పెద్దక్క రుచికరంగా వండుతారు. పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు ? ఓ శివ లింగమా ! నాకు మరొకమాట ఎదురుచెప్పక ఉడుమూరుకి రమ్ము.

ఓ శివలింగమా ! ఆలకించు అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునకై నివ్వరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను (జుంటితేనె), తొఱ్ఱతేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి, పొడుములాగా రాలే నింజెట్లు అనే జాతి దుంపలు కలవు.

నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మిబరివెంక, చిటముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలిసి మెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య.

ఇల్లా ? వాకిలా ? ఇష్టమయిన స్నేహితులా ? వయసులో ఉన్నా బంధువులా ? యిల్లాలా ? కొడుకా ? ఎవరున్నారు ? (ఎవరు లేరు), ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా ? (కాదు) ; మా బోయపల్లెలో నీకు కావలసిన వన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా మా బోయపల్లెకు విచ్చేయుమా.

శివుని మూడవ కంటిచూపుకు దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంతో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను. నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమై నపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు శివునితో పలికి శివభక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

2. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు ‘తెలుగోడి’ వైభవాన్ని వివరించండి.
జవాబు:
మహోన్నతమైన చరిత్ర గల తెలుగోడా ! నీ జాతి ఔన్నత్యానికి చేయెత్తి జైకొట్టు. సమవుజ్జీయే లేని జాతి, జయించడానికి సాధ్యం కాని కోటలు కలిగి ఓటమిని అంగీకరించని జాతి నేడు తన పూర్వీకుల పౌరుషాన్ని, శౌర్యాన్ని మరచిపోయి నివురుగప్పిన నిప్పులాగా నిద్రాణ స్థితిలో ఉంది. అట్టి జాతిని తట్టి లేపగల ఘనచరిత్ర గలిగిన తెలుగోడా. మన వీరుల రక్తపు ధారలు కొరత లేకుండా మాతృభూమికి అర్పించిన పలనాడు, వెలనాడు ప్రాంతాలు నీవే కదా. ఆ త్యాగస్ఫూర్తి, వీరత్వానికి నీవే కదా వారసుడివి. మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే.

వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపర చాణక్య మేధాసంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలి కోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బొబ్బిలి పాలకుడు రాజారంగారావు ధర్మపత్ని, వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తన కవితా ప్రావీణ్యంతో రామాయణాన్ని రచించి ప్రసిద్ధి చెందిన కవయిత్రి మొల్ల యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసి కూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల వీరంతా నీ తోడపుట్టిన సోదర, సోదరీమణులే కదా. ఈ తెలుగు నేల ఎందరో వీరనారీమణులకు కన్నతల్లి. ఎందరో వీరులను కన్న మాతృమూర్తులకు జనని ఈ తెలుగుతల్లి.

గతకాలాలలోని మన ధైర్య, శౌర్య పరాక్రమాలను కథలు, కథలుగా చెప్పారు. మన పూర్వకులలోని ఆ సత్తువ ఎక్కడ దాచావు తెలుగోడా ? ఈ భారత భూమిలో మన ఉనికే లేకపోయింది. అనగా ఒక ప్రత్యేక జాతిగా మన అస్తిత్వాన్నే కోల్పోయాము. ఘనచరిత్ర గల ఆంధ్రులు నేడు బ్రతుకే ఎంతో భారంగా గడుపుతున్నాడు. వంద రకాలుగా పోరాడైనా సరే అన్ని రంగాలలో మొదటి స్థానంలో మనం నిలవాలి.

ఎన్నో చారిత్రక విషయాలు తెలియజెప్పే నాగార్జున కొండ, అమరావతి స్థూపాలపై ఉన్నా శిల్పాలలో సజీవ చైతన్యం నింపావు. అవి శిల్పాలా సజీవ మూర్తులా అన్నట్లుగా మలచిన ఘనఖ్యాతి మనది. మేమెవరికీ తక్కువకాము. అని మన ఆంధ్ర శిల్పులు తమ ఖ్యాతిని చాటారు. ఇది కదా శిల్పకళ అని దేశదేశాలవారు మన శిల్పకళా సంపదను ప్రస్తుతించారు. లండన్ మ్యూజియానికి తరలించబడిన అమరావతీ శిల్పాలు మన ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి.

రాజ్యం వీరులు పౌరుష, పరాక్రమాలతో సంపాదించుకునేది అని చాటి చెప్పిన తిక్కన మహాకవి వాక్కు. సదా ఆచరణీయం. మన పూర్వీకుల పరాక్రమ గాధలను తెలుసుకుని, ఆ స్ఫూర్తితో అభివృద్ధి పథంలోకి సాగాలి.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హాస్యం యొక్క లక్షణాలను తెలపండి.
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలిసిన సహృదయునికి నవ్వు పుట్టించేది నిజమైన హాస్యం. హాస్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి :
అసహజత్వం :
ఒక విషయంలో వుండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజము. ఒంటికాలుతో నడవటం అసహజం. మనుషులు గుఱ్ఱాలను ఎక్కితే బాగుంటుంది. కాని, గుఱ్ఱం మనుషులపైకెక్కితే విపరీతంగా నవ్వువస్తుంది. పత్నికి పతి దైవ సమానం అనే మాట సహజం. పత్నియే పతికి దైవం అంటే నవ్వుకు కారణమవుతుంది.
ఇలాంటివే చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటి వాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, పానుగంటి వారి బధిర ‘విధవా ప్రహసనం అసహజత్వ హాస్యానికి ఉదాహరణలు.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.

ఆశ్చర్యము (Surprise) :
ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా వుంటుంది అని మనం ఊహిస్తే, అందుకు భిన్నంగా వేరేగా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తద్వారా హాస్యం పుడుతుంది. స్వల్ప విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరొక అర్థాన్ని స్ఫురింపజేస్తూ మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సృష్టించటం అసహజ హాస్యంలోకే వస్తుంది.

అసందర్భ శుద్ధి లేకపోవటం :
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (Impropriety) నవ్వు తెప్పిస్తుంది. ఆ నవ్వు నిర్మలంగా ఉండదు. అయినా అదీ హాస్యమే.

అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్ని మెత్తని మాటలతో చెప్పటం వల్ల హాస్యం పుడుతుంది. అసత్యాన్ని సత్యంగాను, దుఃఖాన్ని సుఖంగాను, సుఖాన్ని దుఃఖంగాను, అప్రియ విషయాన్ని ప్రియమైన దానిగాను మలచటం, నేర్పుతో హాస్యాన్ని సృష్టించట మవుతుంది. దీన్ని distortion అంటారు.

అతిశయోక్తి :
అతిశయోక్తి (Exaggaration) కూడ ఒక ముఖ్య హాస్య లక్షణం. అయితే విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస జనకం అవుతుంది. పరమ సత్యం అయితే నవ్వురాదు. అతిశయోక్తుల్లా కనపడేవి నిజంగా అతిశయోక్తులా సత్యమైన గా థలా అని నిశిత దృష్టితో పరీక్షించాలి.
అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది. ఇవి ముఖ్యమైన హాస్యలక్షణాలు.

2. ‘కలవారి కోడలు కలికి కామాక్షి’లోని గ్రామీణ సంస్కృతిని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి అన్నది జానపద బాణీలో సాగిన పాట. ఇది ఒకనాటి గ్రామీణ సంస్కృతికి అద్దం. పడుతుంది. అత్తాకోడళ్ళు, తోటికోడళ్ళు, వదినా మరదళ్ళు వారి మధ్య పెను వేసుకున్న బంధాలు, చిన్న చిన్న ఆరళ్ళు, అలకలు, చతురోక్తులు, ఒదిగి వుండటాలు, ఎగిరి పడటాలు ఇలాంటివన్నీ ఎంతో హృద్యంగా ఉండేవి. ఇవన్నీ నాటి తరానికీ నేడు మిగిలిన మధుర జ్ఞాపకాలు.

ఈ పాటలో పాతకాలపు సంపన్నమైన తెలుగు ఉమ్మడి కుటుంబం తాలూకా కట్టుబాట్లు, నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, చిత్రించబడి ఉన్నాయి. వెనకటి రోజుల్లో కలవారంటే పంటచేలు, పైరుపచ్చ, గొడ్డు గోదా ఎడతెగని పాడి ఉన్నవారని లెక్క

గ్రామీణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన చుట్టానికి గుమ్మంలోనే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళివ్వటం ఆచారం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న కోడలిని చూడటానికి ఆమె పుట్టింటివారు అరుదుగా వస్తారు. ఇప్పటిలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవటం, పుట్టింటి వారు వచ్చెయ్యటం నాడు లేదు. అన్నను చూడగానే కామాక్షి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

బిడ్డ పుట్టాక ఏడాది లోపల పురిటి మంచాన్ని చూడటం ఒక ఆచారం పుట్టింట్లో పురుడు పోసుకుని, అత్తవారింటికి బిడ్డతో వచ్చిన స్త్రీని, ఏడాది లోపల తండ్రో, అన్నలో వచ్చి పురిటి మంచం చూడటానికి పుట్టింటికి తీసుకువెళ్ళాలి. కామాక్షి అన్నయ్య ఇందుకోసమే వస్తాడు. వస్తూ పల్లకి కూడ తెస్తాడు.

అత్తవారింట్లో, ఉమ్మడి కుటుంబంలోఉన్న స్త్రీ, పుట్టింటికి వెళ్ళాలంటే అది తేలికైన విషయం కాదు. ముందు అత్తగారిని అనుమతి అడగాలి. మామగారిని కాదు. తెలుగు వారిలో అత్తవారిల్లు అంటాం కాని మామగారిల్లు అనం. ఇంటి పెత్తనం, యజమానిగా ఉండటం అంతా మామగారిదే అయినా అత్తగారిల్లే అంటాం. కోడళ్ళను ఆరళ్ళు పెట్టినా, అవసరమైనపుడు అనునయించినా అత్తగారే చేస్తుంది. ముందు అత్తగారి అనుమతి తీసుకున్నాక, మామగారినడగాలి. తరవాత బావగారిని, తోటికోడలుని అడగాలి. ఆ తరవాత చివరగా భర్త అనుమతి పొందాలి. ఇంకా ఆడబడుచులు, మరుదులు ఉంటే వారి అనుమతి పొందాలి. కామాక్షి అందరినీ, పుట్టింటికి పంపమని అనుమతి అడుగుతుంది.

తోటికోడళ్ళు మధ్య అసూయలు, పనుల విషయంలో వంతులు ఉండటం సహజం. కాని, వారి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు కూడ ఉంటాయి. ఇంటికి పెద్దకోడలు అయిన స్త్రీ, తరువాత కోడళ్ళుగా వచ్చిన వాళ్ళకు ఇంట్లో వారి స్వభావాలు, ఎవరెవరితో ఎలా మాట్లాడవలసి ఉంటుంది వంటి విషయాలు తన అనుభవంతో చెపుతుంది. కామాక్షికి వాళ్ళ తోటికోడలు అలాగే చెపుతుంది.

ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రతి యింటా వ్యవసాయమే ప్రధానంగా ఉండేది. ఇంటికి పెద్ద అయిన వ్యక్తి పిల్లలు ఎదిగి వచ్చే దాకా వ్యవసాయం చేసి, తరువాత బాధ్యతలు వారికి అప్పజెప్పేసి అవసరమైన సలహాలు ఇస్తూ వుంటాడు. ఇప్పుడు లేవుగాని ఆ రోజుల్లో సంపన్నులైన వారి ఇళ్ళలో పట్టెమంచాలు ఒకటో రెండో సాధారణంగా ఉండేవి. అవి ఠీవికి, సంపదకూ, గౌరవానికి గుర్తుగా భావించబడేవి. జానపద గేయాల్లో ఎంతో గ్రామీణ సంస్కృతి వ్యక్తమవుతుంది.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ‘అంపకం’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటినుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.

పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు. పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ?

తన ప్రాణంలో ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు. బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు. శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరు పెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురుమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ‘ఆనుకొని ఉంది పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ధి కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధపడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.

ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు. కాని ముద్ద గొంతులో దిగలేదు దుఃఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.

2. దహేజ్ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రానురాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండపం పైకి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు. వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు. ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా

ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

3. కుంకుడాకు కథలోని సామాజిక ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించు కుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ‘ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.

పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.

కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.

4. రేఖ పాత్ర ఆలోచనా విధానాన్ని వివరించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు. దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది. బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు. చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

నార్కేటుపల్లిలో అరటిపళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది. ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసుకొంటుంది. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందని పించింది రేఖకు. దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. శునక మధిక భక్తి విడువక చనఁగన్.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : భీముని మరణానంతరం ముందుకు వెళుతున్న ధర్మరాజు వెనుకనే విశ్వాసంతో అనుసరిస్తున్న కుక్కను గురించి పేర్కొన్న సందర్భంలోనిది.
అర్థం : శునకం ఎంతో భక్తి విశ్వాసాలతో అతనిని (ధర్మరాజును) వదలకుండా అనుసరిస్తున్నది.
భావం : చనిపోయేముందు భీముడు అడిగినమీదట అతని పతనానికి కారణాలను తెలిపి అక్కడ ఆగకుండా ధైర్యంతో, స్థిరచిత్తంతో గొప్పవాడైన ధర్మరాజు ముందుకు సాగాడు. ధర్మరాజుని వెనుకే కుక్క కూడా అధికమైన విశ్వాసంతో అతనిని వదలక వెంబడిస్తూనే ఉంది.

2. బరికించి దశాననుండు పకపక నగియెన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణుడు నందీశ్వరుని చూసి నవ్విన సందర్భంలోనిది.
భావము : నందీశ్వరుడు పెద్దదయిన శూలమును చేతితో పట్టుకొని అపర శివునివలే వానర ముఖముతో ఉన్నాడు. రావణుడు శివుని నిందించినందుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. రావణుడు నందీశ్వరుని రూపమును చూసి పకపక నవ్వాడని ఇందలి భావం.

3. సవతి బిడ్డలపోరు మనకేలా.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు ప్రాంతాల మధ్య ఐకమత్యం ఉంటే అభివృద్ధి సాధిస్తామని, మనలో మనకు గొడవలేమిటని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : సవతి తల్లి బిడ్డలలా ఈ గొడవలు మనకెందుకు.
భావము : మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలలో మనకు గౌరవం, పేరు, ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగోడా మనందరికీ తల్లి ఒక్కటే. మనము తెలుగుజాతి వారము. సవతి తల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము అని భావము.

4. మానవ రూపం దాల్చింది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది.
సందర్భం : కవి శివుని నేత్రాగ్ని భగత్సింగ్ జన్మించింది అని తెలిపే సందర్భంలోనిది.
అర్థం : : మానవ జన్మ ఎత్తింది.
భావం : నదీమతల్లి గంగ ఎద పాలపోటుతో తొట్రుపడింది. సింధునది గర్భంలో, గంగ కడుపులో, సముద్రపు లోతుల్లో దాగిన శివుని నేత్రాగ్ని భారతవీరుడు భగత్సింగ్ జన్మించింది. ఆ తేజస్సుకు ఈ నేల జ్వలించింది. ఆకాశమంతా పొగచూరింది అని భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. నకులుని గుణాలను తెలుపండి.
జవాబు:
నకులుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన కవల సంతానం. సహదేవునికి అన్న. తన సోదరుడి మరణం చూసి ధైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. శౌర్యం, ధైర్యం, సుజనత్వం మున్నగు విషయములలో మేటి. ఎంతో అందగాడు. మన కురువంశంలోనే కాక, లోకంలోనే ఇంతటి గుణశ్రేష్ఠుడు లేడు అని భీముడు నకులుని గురించి పేర్కొనగా, దానికి ధర్మరాజు లోకంలో తనని మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ గుణం వలనే అతకి దురవస్థ కలిగిందని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
జవాబు:
ధూర్జటి అడవులలో దొరికే అనేక రకాల ఫలాల వివరాలను మనకందించాడు. నేరేడు, నెలయూటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి బరివెంక, చిటిముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు, బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి ఫలములను తిన్నడు శివునకిస్తానన్నాడు.

3. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం. రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్ర్య వీరుడు భగత్ సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

4. శ్మశానంలోని అభేద భావాన్ని తెలుపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. మాటతీరు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
మాటతీరు అంటే మనం మాట్లాడే విధానం. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడే వారిని ఎక్కువమంది ఇష్టపడతారు. వారికి ఎక్కువ స్నేహితులుంటారు. ఎప్పుడూ చిరాకు పడుతూ, పరుషంగా మాట్లాడే వారితో ఎవరూ కలవరు వారితో దూరంగా ఉంటారు. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే విధానం పైనే ఆధారపడి ఉంటాయి. సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు చాలా బలమైన అంశం. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు. జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఇవి భాషా సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే ఇంకా కొంత విశిష్టంగా ఉంటుంది.

సమాచారాలను చేరవేయటానికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి భాషలో మనం అనేక పదాలను ‘అలవోకగా ప్రయోగిస్తూ వుంటాం. అవి మన వ్యవహారంలో కలిసిపోయి వుంటాయి. ఈ పదాలు మన సామాజిక సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో ముడిపడి వుంటాయి. వీటిని ప్రయోగిస్తూ మాట్లాడుతున్నపుడు మన మాటతీరు ఎటువంటిదో తెలుస్తుంది.

2. కందుకూరి వారి సంస్కరణలను తెలుపండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.

కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.

కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.

3. అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అపహాస్యం అంటే వెక్కిరింత. సహృదయుడు, ఆరోగ్యవంతుడు అయినవాణ్ణి నవ్వించేది ఉత్తమహాస్యం. కానిది అపహాస్యం. మనిషిలో సహజంగా ఉండే అంగవైకల్యం-కుంటితనం, గుడ్డితనం, అనాకారితనం, ముక్కువంకర, మూతివంకర వంటి వానిని చూసి నవ్వటం సభ్యత అన్పించుకోదు. ఇది అపహాస్యం చేయటమే అవుతుంది.
కాలు జారి పడ్డ వాడిని చూసి జాలిపడాలి కాని నవ్వి అపహాస్యం చేయకూడదు. కడుపు నొప్పితో బాధపడుతూ వికృతంగా ముఖం పెట్టి మెలికలు తిరుగుతున్న వ్యక్తిని చూసి నవ్వితే అపహాస్యం చేయటమే !
నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలుసుకున్న వారే సహృదయులు. వారు ఎవరినీ అపహాస్యం చేయరు.

4. బాలమురళి మొదటి సంగీత కచేరి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి ఉత్సవాలు జరపటానికి నిశ్చయమయింది. కార్యక్రమానికి పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ చేర్చారు. ఆ రోజు తొలి ఏకాదశి బాలమురళి తొమ్మిదవ పుట్టినరోజు. ఉదయం 8 నుంచి బాలమురళి ఏ గంట సేపో పాడనిచ్చి, తరవాత భోజనాల వేళ దాకా ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికథా కాలక్షేపం అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటలసేపు పక్కా పాటకచేరీ చేసాడు. ఆలాపనా, కీర్తనా, స్వరకల్పనా సమస్త హంగులతో పాడాడు. వింటున్న పండితులకు మతులు పోయాయి.

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఆనందాశ్రువులు రాల్చి తన గురుత్వాన్ని కొనసాగించారు. తన దగ్గర సంగీతం నేర్చుకున్న పిల్లవాడు తనతో సమానంగా కచేరీ చేస్తే మరొక గురువైతే ఆగ్రహించటానికి ఎన్ని కారణాలైనా ఉండవచ్చు. కాని, పారుపల్లివారి గొప్ప మనసును మెచ్చుకోవాలి. బాలమురళి ఒక వంకపాట కచేరీలు చేస్తూ, శిష్యరికం చేసి కీర్తనలు నేర్చుకున్నాడు. మా గురువు లాంటి గురువు ‘నభూతో నభవిష్యతి’ అంటాడు బాలమురళి.
ఈ విధంగా అణుబాంబు పేల్చినట్టు బాలమురళి మొదటి పాట కచేరీ చేసినపుడు కుర్తాలం స్వాములవారు విన్నారు.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. ధూర్జటి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

2. మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని తనకు తాను గర్వంగా ప్రకటించుకున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఈమె ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నేతగాను ప్రసిద్ధి కెక్కారు. ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఈమె చురుకుగా పాల్గొన్నారు. సారాను నిషేధించే వరకూ వీరు విశ్రమించలేదు. ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ ను స్థాపించి ఆమె తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ఆ ట్రస్టుకు రాసిచ్చారు.

సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే వివాహం జరిగిన మల్లాది సుబ్బమ్మ అటువంటి వాతావరణం నుంచి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తనను తాను మలచుకోవటం విశేషం తన ఆస్తినంతా సామాజిక సేవకు అంకితం చేశారు.

మల్లాది సుబ్బమ్మగారికెప్పుడైనా మనస్తాపం కలిగితే వీరేశలింగంగారి ఆత్మకథ చదువుతారట. ఒంటరివాడు, అనారోగ్యవంతుడు, కేవలం బడి పంతులు ఒక్కడు అన్ని ఘనకార్యాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడంటే మనం ఇలా ఇన్ని సౌకర్యాలుండి ఇలా వ్యధ చెందటం ఎందుకు ? అని అడుగు ముందుకేస్తారట. వీరేశలింగం సంస్కరణల స్ఫూర్తితో వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

3. శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.

నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.

4. దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి తెలియజేయండి.
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ భావకవి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర వున్న రామచంద్రపాలెంలో 1-11-1897న జన్మించారు. సీతమ్మ, తమ్మన్నశాస్త్రి వీరి తల్లిదండ్రులు.

వీరి విద్యాభ్యాసం పిఠాపురంలోను, విజయనగరంలోను జరిగింది. కొంతకాలం రవీంద్రుని శాంతినికేతన్లో గడిపారు. వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు. రఘుపతి వెంకయ్యనాయుడు ప్రోత్సాహంతో సంఘసంస్కరణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. సంఘసంస్కరణాభిలాషి, హరిజనాభ్యుదయ గీతాలను ప్రచారం చేశారు. 1930లో పిఠాపురంలో వేశ్యావివాహ సంస్థను స్థాపించారు. కొందరు వేశ్యలకు వివాహాలు కూడా జరిపించారు.

కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి వంటి అనేక ఖండకావ్యాలను. దేవులపల్లి రచించారు. కొన్ని యక్షగానాలను, భక్తి నాటకాలను ఇంకొన్ని గేయ నాటికలను కూడా కృష్ణశాస్త్రిగారు రచించారు. కేవలం కవిగానే గాక, విమర్శా వ్యాసాలను రచించి విమర్శకునిగా కూడా ప్రసిద్ధిపొందారు.

దేవులపల్లివారు సినిమా కవి కూడా. వారు రచించిన ఎన్నో సినిమా పాటలు బహుళప్రచారం పొందాయి. తెలుగు వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయాయి.
వీరు ఆంధ్రా షెల్లీగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, బిరుదునూ, భారతప్రభుత్వం పద్మభూషణ్న ఇచ్చి ఈ కవిని సత్కరించాయి.
భావకవిత్వానికి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి 24-2-1980లో పరమపదించారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. మీ ఇంటర్మీడియట్ చదువు గురించి స్నేహితులకు లేఖ రాయండి.
జవాబు:
స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

ప్రియమైన విద్యకు,
నేను క్షేమం. నువ్వెలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? నేను బాగా చదువుతున్నాను. మా కళాశాలలో కమల, విమల అనే ఇద్దరు ఈమధ్యనే స్నేహితులయ్యారు. ముగ్గురం కలసి బాగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటాం; కలిసే చదువుకుంటాం. మా కళాశాలలో ప్రతి శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటాం. నువ్వు చెప్పినట్లుగా ఎన్.సి.సి.లో చేరాను. మా కళాశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వక్తృత్వపోటీలో ప్రథమ బహుమతి లభించింది. క్రీడలలో కూడా 200 మీ. పరుగు పందెంలో రెండవ స్థానం లభించింది. జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఈ బహుమతులు ఇస్తామని ప్రధానాచార్యులు చెప్పారు. ఇటీవలే క్షేత్ర పర్యటనలో భాగంగా మా అధ్యాపకులు ‘అమరావతికి’కి తీసుకువెళ్ళారు. అక్కడ నూతన రాజధాని నిర్మాణం, అమరావతిలోని చారిత్రక ప్రదేశాలను చూసి చాలా విషయాలు తెలుసుకున్నాను.

మనం ఉన్నత విద్య చదవాలని లక్ష్యం పెట్టుకున్న విషయం గుర్తు ఉంది కదా. నేను బాగా కష్టపడుతున్నాను. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. నేను బాగా చదివి నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను. నేను చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకొస్తాను. నీవు కూడా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించగలవని నా నమ్మకం.
ఈ మధ్య మన ఊరికి వెళ్ళావా? మన స్నేహితులు లక్ష్మీ, సరస్వతి ఎలా ఉన్నారు? మీ అమ్మా, నాన్నలను అడిగినట్లు చెప్పు, మీ కళాశాల విశేషాలతో నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటాను.

ఇట్లు
నీ స్నేహితురాలు
XXXXXX.

చిరునామా :
XXXXXX,
XXXXX
XXXXX
XXXXX.

2. విద్యుత్ కోత సమస్యను గురించి సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:
స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

స్థానిక డివిజనల్ ఇంజనీర్ గారికి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ,
కర్నూలు.

విషయం : ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో విద్యుత్ కోత నివారణ గురించి.

ఆ / అయ్యా / అమ్మా !
నమస్కారాలు. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మార్చి నెలలో మాకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవబోతున్నాయి. ఇప్పుడే విద్యుత్ కోతలు ప్రారంభించారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మార్చిలో విద్యుత్ కోతలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలప్పుడు విద్యుత్ లేకపోవడం వల్ల చదువుకి అంతరాయం కల్గింది. కనీసం ఈ సారైనా విద్యుత్ కోత లేకుండా చూడగలరు. రాత్రి పూట అయినా కోతలేకుండా ఉంటే చదువుకోగల్గుతాము. నాలాంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకోగలరని మనవి.

ఇట్లు తమ విధేయుడు
XXXXXX.

చిరునామా :
XXXXXXXXX,
XXXXXXX,
XXXXXX.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. అత్యంత
2. సూడిదవెట్టిన
3. మహోగ్ర
4. కవీంద్రుడు
5. నోరెత్తి
6. చేరఁబోయి
7. తూలినయట్లు
8. ఆత్మైక
జవాబు:
1. అత్యంత = అతి + అంత – యణాదేశసంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశముగా వచ్చును.

2. సూడిదవెట్టి – సూడిద + పెట్టి – గసడదవాదేశసంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగును.

3. నోరెత్తి – నోరు + ఎత్తి – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరంబైనప్పుడు సంధియగు.

4. మహోగ్ర – మహా + ఉగ్ర – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశముగా వచ్చును.

5. కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

6. చేరఁబోయి – చేరన్ + పోయ – సరళాదేశసంధి
సూత్రము : 1) ద్రుతపకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

7. తూలినయట్లు తూలిన + అట్లు – యడాగమసంధి
సూత్రము : సంధి లేని చోట స్వరంబునకంటే పరంబైన స్వరంబునకు యడాగమంబు అగు.

8. అత్మైక – ఆత్మ + ఏక – వృద్ధిసంధి
సూత్రము : అకారమునకు ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశముగా వస్తాయి.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. భక్ష్య భోజ్యములు
2. కార్యశూరులు
3. రాక్షసాధముడు
4. బ్రహ్మకపాలం
5. నలుదిక్కులు
6. హిమాచలము
7. నల్లపూసలు
8. వేటకుక్కలు
జవాబు:
1. భక్ష్యభోజ్యములు : భక్ష్యములును, భోజ్యములును – ద్వంద్వ సమాసం
2. కార్యశూరులు : కార్యము నందు శూరులు – సప్తమీ తత్పురుష సమాసం
3. నలుదిక్కులు : నాలుగైన దిక్కులు – ద్విగు సమాసం
4. రాక్షసాధముడు : అధముడైన రాక్షసుడు – విశేషణా ఉత్తరపదకర్మధారయ సమాసం
5. బ్రహ్మకపాలం : బ్రహ్మ యొక్క కపాలం – షష్ఠీ తత్పురుష సమాసం
6. హిమాచలం : హిమ అనుపేరు గల అచలం సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం
7. నల్లపూసలు : నల్లనైన పూసలు విశేషణా పూర్వపదకర్మధారయ సమాసం
8. వేటకుక్కలు : వేట కొరకు కుక్కలు – చతుర్థీ తత్పురుష సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. క్రుతయుగం
2. స్మశానం
3. వుడుత
4. ద్రుశ్యం
5. సనివారం
6. బేదం
7. ఎనక
8. బాష
9. భాద
10. క్రుష్ణుడు
జవాబు:
1. క్రుతయుగం – కృతయుగం
2. స్మశానం – శ్మశానం
3. వుడుత – ఉడుత
4. ద్రుశ్యం – దృశ్యం
5. సనివారం – శనివారం
6. బేదం – భేదం
7. ఎనక – వెనుక
8. బాష – భాష
9. భాద – బాధ
10. క్రుష్ణుడు – శ్రీకృష్ణుడు

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Mount Everest is the highest peak in the world.
జవాబు:
మౌంట్ ఎవరెస్టు ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం.

2. He speaks Telugu as well as English.
జవాబు:
అతడు ఆంగ్లము కంటే తెలుగు బాగా మాట్లాడగలడు.

3. Ramayana was written by Valmiki.
జవాబు:
రామాయణము వాల్మీకిచే రచింపబడింది.

4. Amaravathi is the capital of Andhra Pradesh.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.

5. The train had left before I reached the station.
జవాబు:
నేను స్టేషనుకి చేరుకునే లోపలే రైలు వెళ్ళిపోయింది.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1=5)

తెలుగు భాషకు ఆంధ్రభాష, తెనుగు భాష అనే పేర్లు కూడా ఉన్నాయి. మన తెలుగు కవులు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తెలుగును ప్రస్తుతించారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మన తెలుగును ‘సుందర తెలుంగు’ అని కొనియాడారు. క్రీ.శ. 15వ శతాబ్దపు ఇటలీ అంజంత భాష, కాబట్టి నాద సౌష్ఠవం కలిగి, సంగీతానికి అనుకూలంగా ఉంది. ఈ విధంగా వేనోళ్ళ ప్రస్తుతించబడిన మధురమైన మన తెలుగు భాషను పరభాషా ప్రభావాలతో మనవారే చిన్నచూపు చూడడం చాలా దురదృష్టకర విషయం. తెలుగు భాషను రక్షించుకొని దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం తెలుగువారందరి ప్రథమ కర్తవ్యం.

ప్రశ్నలు :
1. నికోలో డి కాంటే ఎవరు ?
జవాబు:
ఇటలీ యాత్రికుడు.

2. తెలుగు భాషకు గల ఇతర పేర్లేవి ?
జవాబు:
తెనుగు, ఆంధ్రభాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.

3. తెలుగు భాషను నికోలో డి కాంటే ఏమని కీర్తించాడు ?
జవాబు:
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించాడు.

4. ‘సుందర తెలుంగు’ అని తెలుగును ఎవరు ప్రశంసించారు ?
జవాబు:
సుబ్రహ్మణ భారతి సుందర తెలుంగు అని ప్రస్తుతించారు.

5. తెలుగువారి ‘ప్రథమ కర్తవ్యం ఏమిటి ?
జవాబు:
తెలుగు పూర్వ వైభవాన్ని రక్షించడం తెలుగు వారి ప్రథమ కర్తవ్యం.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1= 5)

1. ధూర్జటి రచించిన శతకం పేరేమిటి ?
జవాబు:
కాళహస్తీశ్వర శతకం.

2. నంది ఎవరి వాహనం ?
జవాబు:
నంది ఈశ్వరుని వాహనం.

3. కాంతం కథలు రాసిందెవరు ?
జవాబు:
ముని మాణిక్యం నరసింహరావు.

4. విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన గేయం ఏది ?
జవాబు:
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.

5. తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
మనుమసిద్ది ఆస్థాన కవి.

6. లాహోర్ కుట్రకేసులో ఉరితీయబడిన దేశభక్తుడు ఎవరు ?
జవాబు:
భగత్సింగ్.

7. నిటాలేక్షణుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

8. సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మ దేవత.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1= 5)

1. ‘నామ విజ్ఞానం’పై ప్రత్యేక అధ్యయనం చేసిన వారెవరు ?
జవాబు:
యార్లగడ్డ బాలగంగాధరరావు గారు.

2. దేశి కవితకు ఒరవడి దిద్దింది ఎవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాధుడు.

3. త్యాగరాజస్వామి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి ?
జవాబు:
తిరువాయూరులో జరుగుతాయి.

AP Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

4. రాయలవారి సాహితీ భవనం పేరేమి ?
జవాబు:
భువన విజయము.

5. నారదుని వీణ పేరు ఏమిటి ?
జవాబు:
మహతి.

6. గద్యతిక్కన అని కందుకూరిని ఎవరు శ్లాఘించారు ?
జవాబు:
కందుకూరిని గద్య తిక్కన అని ఆరుద్ర శ్లాఘించారు..

7. మంగళంపల్లి నటించిన చలనచిత్రం ఏది ?
జవాబు:
మంగళంపల్లి నటించిన చిత్రం ‘ప్రహ్లాద’.

8. మొత్తం లోకాలెన్ని ?
జవాబు:
మొత్తం లోకాలు 14 (పద్నాలుగు).

Leave a Comment