AP Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 2 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 2 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. తోడంబుట్టువులందరు ………………. గృపాధుర్యాత్మకావింపవే.
జవాబు
తోడంబుట్టువులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం
పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా
ర్దోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్ల నా
తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే
భావం : అంతట ధర్మరాజు ఇంద్రునితో మహాత్మా ! నా తోబుట్టువులందరూ మరణించారు. సుకుమారి ద్రౌపది అలసి దప్పికతో చనిపోయింది. ఆ దుఃఖం నా మనసును కలచివేస్తోంది. వారందరూ నాతో బయలుదేరి వచ్చారు. వారు లేకుండా నేను రాలేను. కనుక వారు కూడా నాతో వచ్చేట్లుగా తాము నాపై దయతో అనుమతింతురు గాక అని ధర్మరాజు అన్నాడు.

2. ఓ సామీ యిటువంటి ……………….. నీకిందేటికే లింగమా !
జవాబు:
ఓసామీ ! యిటువంటి కొండ దరిలో నొంటిం బులుల్ సింగముల్
గాసింబెట్టెడి కుట్ర నట్టడవిలోఁ, గల్గువ్వి క్రీనీడ, నే
యాసంగట్టితి వేటిగడ్డ నిలు ? నీ వాఁకొన్నచో కూడు నీ
ళ్ళేసుట్టంబులు దెచ్చిపెట్టెదరు ? నీకిందేటికే లింగమా !
భావం ఓ స్వామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన నది ఒడ్డున, ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్న పానీయములు తెచ్చి యిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా అని భావం.
తిన్నడి ప్రశ్నలలో అతనిలోని నిర్మలత్వం, అమాయకత్వం అతనిలోని ముగ్ధ భక్తిని తెలియజేస్తున్నాయి.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలను వివరించండి.
జవాబు:
పాండవులు, ద్రౌపది మరియు కుక్క హిమాలయాన్ని దాటి అడవులు, భూములు, నదులు, కొండలు పేక్కింటిని దృఢమైన యోగంలో, నిరాకుల మనస్సుతో, శోకాన్ని విడిచి, ఆయాసమన్నది లేక మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

అలా ఆ ఏడుగురూ (పాండవులు, ద్రౌపది, కుక్క) స్థిరయోగ సాధనపరులై అత్యంత వేగంగా నడుస్తుండగా ద్రౌపది నేలపై పడిపోయింది. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! ద్రౌపది నేలకు ఒరిగిపోయింది. ఈమె వలన ఏనాడు కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు కదా ? మరి ఈమె పడుటకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని చెప్పి స్థిరమైన మనస్సుతో ఆమె శవాన్ని అక్కడే విడిచి ముందుకు సాగిపోయాడు.

అలా వెళ్ళగా వెళ్ళగా సహదేవుడు ప్రాణాలు కోల్పోయి నేలకూలాడు. అది చూసిన వాయుపుత్రుడు భీముడు అన్నకు ఈ విషయం చెప్పి, సహదేవునికి అహంకారమన్నది లేదు. మిమ్మల్ని ఎంతో భక్తితో సేవించాడు. మీ అందరిలో ఎంతో సన్మార్గుడు. అట్టి సహదేవునకు ఈ స్థితి ఎందుకు సంభవించింది ? అని అడుగగా, ఇతడు లోకంలో తనకంటే సమర్ధుడు ఎవడూ లేడని భావిస్తూ తనకు తాను చాలా గొప్పవాడినని భావించుకుంటూ ఉండేవాడు. అందువలన అతనికి ఈ దుస్థితి సంభవించింది అని నిర్వికార భావంతో ధర్మరాజు ముందుకు సాగిపోయాడు.

భీమార్జున, నకులుడు, కుక్క తనను అనుసరిస్తుండగా ధర్మరాజు మనసు స్థిరం చేసుకుని ముందుకు పోతున్నాడు. అంతలో ద్రౌపది, తన సోదరులు సహదేవుడు ప్రాణాలు కోల్పోవడం చూసిన నకులుడు ధైర్యం కోల్పోయి ప్రాణాలు విడిచాడు. దుఃఖించిన మనసుతో భీముడు అన్నగారిని అడిగాడు. అందం, శౌర్యం, ధైర్యం, సుజనత్వంలో కురువంశంలోనేకాక, లోకంలోనే ఇటువంటి గుణశ్రేష్ఠుడు లేడు. అలాంటి పుణ్యమూర్తికి ఇలాంటి దురవస్థ సంభవించిందేమి, అనగా ఇతనికి లోకంలో తనను మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ అహంకారమే అతనిని ఈ గతికి తెచ్చింది అని నకులుని పట్టించుకొనక ముందుకు సాగాడు.

ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచివేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

భీమునికి సోదరులు, ద్రౌపది అందరూ అలా నేలకొరిగిపోవడం మనసును కలిచివేసింది. ఆయన్ను దైన్యం వహించింది. ధైర్యం దిగజారిపోయింది అతనిలో. అంతే అతడు నేలకొరిగిపోయాడు. అలా ఒరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేల వాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే దయతో చెప్పండి అన్నాడు. దానికి ఆయన నీకు తిండి మీద ఆసక్తి అధికం, అతిగా ఆరగిస్తావు. అదిగాక నీకు గల భుజశక్తి వలన గర్వం అధికం. ఎవరినీ లెక్కచేయని తత్త్వం. పనికిమాలిన మాటలు అనేకం ఎపుడూ మాట్లాడేవాడివి. అందుకే నీకు ఈ స్థితి కలిగిందని ధర్మరాజు పాండవుల మరియు ద్రౌపదిల మరణానికి కారణాలను తెలిపాడు.

2. తిన్నని చూసి బోయలు ఏవిధంగా దుఃఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.

నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దుఃఖిస్తారు.

వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూ మూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.

ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు. మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.

అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మరచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా దుఃఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి మా మనస్సు అంగీకరించడం లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగి రాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప దనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.

ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.

నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దు:ఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
హాసమునకు కారణ భూతమైనది హాస్యం, నవ్వించేది హాస్యం. సహృదయుడు, ఆరోగ్య వంతుడు, నాగరికుడు అయిన వానిని నవ్వించేది ఉత్తమ హాస్యం. అయితే, అనాగరికులను నవ్వించే విషయాలు కూడ ఉన్నాయి.
ఉదాహరణకు:
మనిషికి సహజంగా కుంటితనము, గుడ్డితనము, అనాకారితనము, ముక్కు వంకర, మూతివంకర వంటి అంగవైకల్యాలు ఉంటాయి. వీటిని చూసి నవ్వటం సభ్యత అనిపించుకోదు. అది నాగరిక లక్షణం కాదు. అయితే, కుంటిగా నడవాలని చూసే నటుణ్ణి చూసి నవ్వవచ్చు. కాలు జారి పడ్డ వాణ్ణి చూసి నవ్వటం సభ్యత కాదు. కడుపు నొప్పితో బాధపడుతూ ముఖం వికృతంగా పెట్టిన వాణ్ణి చూసి నవ్వేవాడు సంస్కారి కాడు.

ఒక విషయంలో వుండే అసహజత్వం నవ్వుకు కారణమవుతుంది. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా విరగబడి నవ్వాలనిపిస్తుంది.
పత్నియే పతికి దైవం అంటే అందులోని అసహజత్వానికి తప్పక నవ్వువస్తుంది.
అర్థరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు అనే సామాన్య విషయానికి అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట! దొంగలు! అందులో కన్నంలో నుంచి! అని ఒక మనిషి అంటే అతని అత్యాశ్చర్యాన్ని చూసి నవ్వుతాము.

ఒక కథకు ముగింపు మనం ఒక విధంగా ఊహిస్తే, దానికి భిన్నంగా ఆశ్చర్యకరంగా వేరే ముగింపు వుంటే ఆ ఆశ్చర్యంలో నుంచి హాస్యం పుడుతుంది. అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా గొప్పగా పాఠం చెప్పి చివరకు, ‘ఆయన ఏం చేశారంటే’ అని ఒక్కక్షణం ఆగిపోతే విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్పపని చేసివుంటాడని ఆశ్చర్యంతో చూస్తూ వుంటే అధ్యాపకుడు ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ఢాం అని చచ్చాడు’ అని చెప్పేటప్పటికి క్లాసంతా గొల్లుమంది హాస్యం పుట్టించే పద్ధతుల్లో ఇది ఒకటి.

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా ‘అంటే దూడకు పచ్చగడ్డి కోసం’ అంటే వెంటనే నవ్వువస్తుంది. శుభంగా పెళ్ళి జరుగుతున్న సమయంలో వచ్చిపోయెడివారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణమేడ్వ వంటి అవాకులు, చవాకులూ వింటే నవ్వు రాకుండా ఉండదు. సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడటం వల్ల ఇలా హాస్యం పుడుతుంది.

తన ఊళ్ళో భూకంపాలు తరచుగా వస్తున్నప్పుడు, ఒక ఆసామి పిల్లలను మరోగ్రామంలోని స్నేహితుని ఇంటికి పంపాడు. నాలుగు రోజుల తరువాత ఆ స్నేహితుడు నీ పిల్లలను పంపిస్తున్నాను. భూకంపాలను మా ఊరు తోలేసెయ్యి, అని టెలిగ్రాం ఇచ్చాడట. ఇందులోని హాస్యం మనకు స్పష్టమే! పిల్లలను భరించటం కన్న భూకంపాలను భరించటం నయమని ఉద్దేశం. ఎంతో అప్రియమైన విషయాన్ని సున్నితంగా చెప్పాడా స్నేహితుడు.

ఒకామె నల్లని నలుపు. ఎంత నలుపంటే ఆమెకు చెమట పోసినపుడు గుడ్డతో అద్ది గాజు బుడ్డిలో పిండి కావలసినంత సిరా తయారు చేసుకోవచ్చునట’ ఇది అతిశయోక్తి. అభూతకల్పన, విషయం అతిశయోక్తి అయితే హాస్యం పుడుతుంది. నవ్వు వస్తుంది. ఇవి హాస్యానికి కొన్ని ఉదాహరణలు.

2. కలవారి కోడలు కలికి కామాక్షిలోని సారాంశాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి ఒక జానపదగేయం. ఉమ్మడి కుటుంబంలోని కట్టుబాట్లు నమ్మకాలు, ఆచారాలు అలవాట్లు ఈ పాటలో చక్కగా ప్రతిబింబించాయి.

కామాక్షి కలవారి కోడలు అనటంలో ఆమె పుట్టింటి వారు పేదవారై వుంటారని సులభంగానే అర్థమవుతుంది. కామాక్షి అత్తగారువాళ్ళు చాలా సంస్కార వంతులు. లేనింటి పిల్ల అని తక్కువగా చూడలేదు. ఆమె అందాన్ని చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని, ఆస్తులు, అంతస్తులు చూసి కాదు.
కామాక్షికి వాడిన కలికి అనే విశేషణం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తోంది.

పురిటి మంచం చూడటానికి, కామాక్షి పెద్దన్నయ్య ఆమెను పుట్టింటికి తీసుకువెళ్ళటానికి వస్తాడు. అప్పుడు కామాక్షి పప్పు కడుగుతోంది. గబగబా చేతులు కడుక్కుని అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. నీళ్ళిస్తుంటే ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి అన్న గమనించాడు. ఆ కన్నీళ్ళకెన్నో అర్థాలు.

చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండె కరిగింది. పేద యింటిపిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. తన ఉత్తరీయపు కొంగుతో కళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకి తెచ్చాడు. ఇంట్లో అందరూ తలో విధంగా కామాక్షి అన్నను పలకరించారు. వియ్యంకుడు అంటే కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.

కామాక్షి అన్న తను వచ్చిన పని చెప్తాడు. ఆచారాన్ని పాటించటం కోసం అతను రావటం చూసి అందరూ సంతోషించారు.
కామాక్షి వినయంగా అత్తగారిని తన అన్న వచ్చాడు పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. ఆమె మనసులో మురిసిపోతూ మామగారిని అడగమంది అలా అనటంలో ఆమె అనుమతి, అంగీకారం కామాక్షికి ఆనందాన్ని కలిగించాయి.

కామాక్షి మామగారిని అడిగింది. ఆయన బావగారిని అడగమన్నాడు. అంటే మామగారి అనుమతి లభించినట్లే! కామాక్షి బావగారిని అడిగింది. అడుగుతున్నప్పుడు తల్లిలాంటి తోటికోడలు గుర్తు వచ్చి గొంతు గద్గదమైంది. ఆమె, కామాక్షి చేసిన చిన్న చిన్న పొరపాట్లు కప్పి పుచ్చి, రహస్యంగా తనకు బుద్ధులు చెప్పిన తల్లి. ఆమె కామాక్షితో నీ భర్త నడుగమంటుంది. స్నేహితుల మధ్యలో ఉన్న భర్తను సైగ చేసి పిలిచి అడిగింది. అతడు చాలా సరదా మనిషి. నగలు పెట్టుకుని, సుఖంగా పుట్టింటికి వెళ్ళుమంటాడు. కామాక్షి పల్లకిలో వెళుతుంటే ఎల్లుండీ పాటికి నేను మీ పుట్టింట్లో
ఉంటాను ఎందుకు బెంగ అని కూడ అనుంటాడు.

ఈ పాటలో చెప్పిన విషయాలెన్నో వున్నాయి. చెప్పకుండా మన ఊహకు వదిలినవీ ఉన్నాయి. చెప్పినవి క్లుప్తంగా, అందంగా చెప్పటమూ ఉంది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. అంపకం ఆధారంగా తండ్రీకూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటినుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

2. కుంకుడాకు కథా సారాంశాన్ని వివరించండి.
జవాబు:
పారమ్మ, గవిరి ఇద్దరూ ఒకే వయసున్న పల్లెటూరి పిల్లలు. పారమ్మ అప్పలనాయుడు కూతురు. గవిరి చినదేముడు కూతురు. అప్పలనాయుడు పలుకుబడిగల మోతుబరి రైతు. చినదేవుడు కూలి పని చేసుకునేవాడు. వారి మధ్య అంతరమే వాళ్ళ పిల్లల మధ్య ఉంటుంది. పారమ్మ ఊరగాయ రుచిగా ఉందని అనగానే గవిరి రొయ్యలు తిన్నానని అబద్ధం ఆడుతుంది. మీరు రాత్రి వండుకోలేదని పారమ్మ ఎత్తిపొడుస్తుంది.

గవిరి తండ్రి కూలి చేసి ఏమైనా తెస్తేనే వారికి ఆపూట గంజి అయినా తాగి కడుపు నింపుకుంటారు ఆ కుటుంబం. తల్లిదండ్రి గవిరి కష్టపడితే గాని తిండికి కూడా గడవని ఇల్లు అది. ప్రతిరోజు కోనేటికి పోయి ఇంటికి సరిపడా నీళ్ళు మొయ్యాలి. కర్రా కంపా, ఆకు అలము ఏరి పొయ్యిలోకి వంట చెరకు తేవాలి ఇదీ గవిరి పరిస్థితి. పారమ్మ బడికి పోతానన్నప్పుడు కూలిచేసే వాళ్ళకి చదువెందుకని గవిరి నిరాశగా అంటుంది. గవిరితోపాటు పొలాల్లోకి వెళ్ళి పారమ్మ పొలాల్లో దొరికే పెసరకాయలు చింతకాయలు ధైర్యంగా తీసుకొని తింటుంది. గవిరి కడుపు కాలుతున్నా సాహసం చేయలేదు. పేదరికం వల్ల ధైర్యం చాలదు గవిరికీ. డబ్బులేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరమౌతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తే అది కప్పిపుచ్చుకోగలరు. అందుకే పారమ్మకు నిర్భయం. ఎవరైనా చూస్తే మాడు పగులుతుందని గవిరి హెచ్చరిస్తే “నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారు” ? అని తిరిగి సమాధానం ఇస్తుంది.

తట్టనిండా కుంకుడాకులు ఏరుకొని కాంభుక్త గారి కళ్ళం వైపు నడుస్తారు ఇద్దరూ. అక్కడ చింతకాయలు చూసి పారమ్మ రాయితో కొడుతుంది. మూడు కాయలు పడతాయి. తీసి పరికిణిలో దోపుకొని తింటూ ఉంటుంది. గవిరి ఒక కాయ అడిగినా ఇవ్వదు. కావాలంటే నువ్వూ రాయితో కొట్టు అని అంటుంది. గవిరి ఒక రాయి తీసి వేస్తుంది. క్రింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక రాయివేస్తే కొమ్మ విరిగి పడుతుంది. పొయ్యిలోకి చాలా మంచి సాధనం అని చితుకులు తట్టలో వేసుకుంటుంది. ఎదురుగా కాంభుక్తగారు ఎవరది అని గద్దిస్తాడు. కోపంగా ఉన్న కాంభుక్తని చూసి గవిరి భయపడిపోతూ పొయ్యిలోకి చితుకులు అని అంటుంది.

కాంభుక్త కోపంగా తట్టని ఒక తన్నుతంతాడు. ఆకులన్నీ చెల్లాచెదురైపోతాయి. వాటిని పోగు చేసుకోవాలనుకున్న గవిరి నడుంమీద చేతికర్రతో ఒక్క దెబ్బవేసాడు. అంతేకాదు ఆ తుప్పవార ఏందాచావంటూ దొంగతనం అంటగట్టాడు. తాను దొంగ కాదు కాబట్టి ధైర్యంగా నేనేమి దాచలేదు అంటూ ఎదురు తిరిగింది గవిరి. నిజం చెప్పినా కొట్టడానికి వచ్చిన భుక్త గారిని బూతులు తిట్టింది గవిరి. అది సహించలేని భుక్తగారు పాంకోడు విసిరాడు. గవిరి కాలికి తగిలి క్రిందపడింది. ఏడ్చిఏడ్చి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయ్యింది. ఆ చింత కంప తనకి అక్కరలేదని అక్కడే వదిలేసి కుంకుడాకులు తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. కాలు నొప్పితో మంటగా ఉన్నది. కాలు దెబ్బని చూసుకొంది. బొప్పికట్టి ఎర్రబడింది. తన నిస్సహాయతకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.

3. ఊతకర్ర కథ ఆధారంగా రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవితంలో అందరూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో వారితో ఇమడలేక తన ఇంట్లో ఒంటరి బ్రతుకు బ్రతుకున్న వ్యక్తి. జీవన పోరాటంలో తన బిడ్డల కోసం తాపత్రయంతో బ్రతికాడాయన. ఎవరైనా తన బిడ్డల గురించి ఆలోచిస్తారే కాని వారు ఒకరికి బిడ్డలమేనన్న స్పృహ ఉండదు. అందుకే తనవంటి అభాగ్యులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనిలా మిగిలిపోతున్నారు.

ఇలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్న అతను ఒకరోజు బయటకు వచ్చాడు. ఎంతదూరం నడిచాడో అతనికి తెలియదు. ఒంట్లో ఓపిక లేదు. బాట ప్రక్కన ఒక పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ చెట్టు నీడన సేదతీరాలని చేరబడ్డాడు ఆ వృద్ధుడు. ఇంతలో అతనికి కొంతదూరంలో ఓ దృశ్యం కంటపడింది. తనను అది బాగా ఆకట్టుకుందని రచయిత భావించాడు.

అక్కడకు కనుచూపుమేరలో ఒక పల్లె అంత ఎండలో అంతదూరం ఎలా వెళ్ళాడో అతనికే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు చేరాలంటే గుండె గుభేలుమన్నది. కాసేపు అక్కడే కూర్చునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ చెట్టు పక్కనే బాట. ఆ బాటకు కాస్త దగ్గరలో కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇల్లు దూలాల మధ్య ఎండుగడ్డితో కప్పుతున్నాడు ఓ వ్యక్తి. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు ధారాపాతంగా కారుతున్నా పనిలో నిమగ్నమయ్యాడు. అది ఆ వ్యక్తి తండ్రి చూశాడు. కన్నపేగు మెలిపడింది. ముసలాడు ఊతకట్టెపై ఆనుకొని తలపైకెత్తి చూశాడు. సూర్యకాంతికి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తూ పొద్దు తిరిగాక కట్టవచ్చు కదా ! ఇప్పుడు కాస్త అన్నం తిని పడుకోరాదు అని అన్నాడు. పని అయిపోతుంది కాస్తంత కోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి అంటూ తండ్రి మాటను పెడచెవిని పెట్టాడు.

కన్నతండ్రి మాటను పెడచెవిని పెట్టినందుకు మనసు చివుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళి మూడేళ్ళ పసివాడిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి. పాలుగారే పసివాడి పాదాలు చుర్రుమనగానే కెవ్వుమన్నాడు. ఇంటి పైకప్పు పని చేస్తున్న తండ్రి చెవుల్లో పడిందా కేక. అయ్యయ్యో ! పసివాణ్ణి ఇలా వదిలేసారేమిటని గబగబా దిగాడు. బిడ్డను ఎత్తుకున్నాడు. ఇదే విషయాన్ని రచయిత చెప్పాలనుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లే కదా ! ఈ సంగతి ఎవరూ గుర్తించరేమని రచయిత అభిప్రాయం. ఈ తండ్రీబిడ్డ సంఘటన అనుబంధానికి ఒక చక్కని నిదర్శనం. ఈ సంఘటనే ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధునికి ఉపదేశ వాక్యమయ్యింది. ఈ ఘటన ద్వారా రచయిత తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించారు.

4. సౌందర్యం కథ ద్వారా మనుష్యుల స్వభావాన్ని వివరించండి.
జవాబు:
బస్సులో పుట్టింటికి ప్రయాణమౌతుంది రేఖ భర్తతో సహ, తన ఐదేళ్ళ కొడుకుని తీసుకొద్దామని బస్సులో ముగ్గురు కూర్చొనే సీటులో రేఖ తన భర్త సుందర్రావు ఉండగా చంద్రం అనే వ్యక్తి ఆ సీటులోకి వస్తాడు. సుందర్రావు రేఖ సర్దుకుంటారు. చంద్రం కూర్చుంటాడు. బస్సు బయలుదేరగానే నిద్రలోకి జారుకుంటాడు సుందర్రావు. నిద్రపట్టగానే తెలియకుండానే గురక పెడతాడు. బస్సులో అది అందరికి ఇబ్బందిగా ఉంటుందేమోనని రేఖ సిగ్గు పడుతుంది. బస్సు ఎక్కగానే ఈ నిద్ర ఏమిటి ? అంటుంది. ప్రక్కనే ఉన్న చంద్రాన్ని చూసి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో నని ఆలోచిస్తుంది. ఇది సాధారణంగా అందరిలో ఉండే సహజగుణమే. తమను చూసి ఎదుటివారు ఏమనుకుంటారోనని మన సహజత్వాన్ని దాచిపెట్టి కృత్రిమ స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. చాల మందిలో ఈ రకమైన స్వభావమే ఉంటుంది.

ఈ కథలో రేఖ తన భర్తని చూసి చంద్రం ఏమనుకుంటాడోనని ఆలోచిస్తుంది. అలాగే భర్తను కిటికీ వైపు కూర్చోమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా చూసినా ప్రక్కనున్న చంద్రం భార్య అనుకుంటారని తృప్తిపడుతుంది. దీనిని బట్టి భర్త అందంగా లేడని బాధ పడే మనుషులు ఈ సమాజంలో ఉన్నారని రచయిత్రి అభిప్రాయం. పెళ్ళి సమయానికి సుందర్రావుకు బట్టతల లేదు. తర్వాత సంపాదన కోసం ఎండనక వాననక కష్టపడి నల్లగా లావుగా బట్టతలతో మార్పులు వస్తాయి. ఆ మార్పుని కూడా అంగీకరించలేని మనుషులు చాలా మంది ఉంటారని ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.

బస్సులో నిద్రపోయే సుందర్రావును విసుక్కుంటుంది రేఖ. గురక పెట్టే వ్యక్తిని సహించలేకపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఇలా తన మానసిక భావాలతో సంఘర్షణ పడుతుంది. బస్సులో అరటి పళ్ళు తినడం పాన్ వేసుకోవడాన్ని ఇష్టపడదు. అది ఒక అనాగరికుల అలవాటు అనుకునే వారు ఉంటారు. ఎవరికి నచ్చినట్లు వారు తినడం కూడ నచ్చదు. అరటి పళ్ళన్నీ తిన్న సుందర్రావును చూసిన రేఖ అసహ్యించుకుంటుంది. నిద్రపోతూ గురక పెట్టిన భర్త ఎలుగు బంటిలా కనబడతాడు. ముందు సీట్లో చిన్న పిల్లవాడు సుందర్రావును చూసినప్పుడు జూలో జంతువులను చూసిన కొడుకును గుర్తుచేసుకుంటుంది. రేఖ అవస్తను గ్రహిస్తూ ఉంటాడు చంద్రం.

బస్సులో ముందు సీటులో భార్య భర్త 5 ఏళ్ళ ఒక పిల్లవాడు కూర్చుంటారు. ఆ భర్త అందంగానే ఉన్నాడు. భార్య ఓ మోస్తరుగా ఉంటుంది. ఆమెను బస్సు ఎక్కినప్పటి నుండి సతాయిస్తూనే ఉంటాడు. ఆమె తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఒక యాస్ప్రిన్ మాత్ర తెమ్మంటే క్రూరంగా నవ్వి నీకు కాఫీలు మోయాలా ? ఇంటికెళ్ళాక తాగవచ్చులే అని అంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటుంది రేఖ. రేఖ భర్త కాఫీ, టిఫెన్ తెచ్చి తినమని ప్రాధేయపడితే విసుక్కుంటుంది. అప్పుడు ముందు సీటులో ఉన్న ఆమె రేఖను చూసి నీవు చాలా అదృష్టవంతురాలవి. తినమని చెప్పే భర్తలు ఎంతమందికి దొరుకుతారు ? భార్యను ప్రేమగా చూసే భర్త దొరకడం నీ అదృష్టం అని అంటుంది. దూరంగా చిన్న బుచ్చుకున్న మొహంతో వస్తున్న సుందర్రావుని చూసి జాలి పడుతుంది. తన భర్త ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. అమృత హృదయుడు అమాయకుడు ఇటువంటి భర్తను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడుతుంది రేఖ. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వికృతంగా అనిపించింది రేఖకు. భార్య ప్రశాంతంగా ఉండటం చూసి సంతోషించాడు సుందర్రావు. ఇప్పుడు సుందర్రావు గురక అసహ్యమనిపించలేదు రేఖకు. దీనిని బట్టి బట్టతల నల్లగాఉన్న వ్యక్తి పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా భర్త అందంగా లేడని బస్సులో నిద్రపోతాడని ఆ నిద్రలో గురక పెడుతుండడం వల్ల చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచించే వాళ్ళు చాల మందే ఉంటారు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీడ్య చరిత.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ద్రౌపది ఎందుకు నేలకూలింది అని భీముడు అడిగితే ధర్మరాజు బదులిచ్చిన సందర్భంలోనిది.
అర్థం : ద్రౌపదికి అందుకే ఇటువంటి దురవస్థ వాటిల్లింది.
భావం : పాండవులు, ద్రౌపది, కుక్క అలా వేగంగా వెళుతుండగా ద్రౌపది నేలకూలింది. అది చూసిన భీముడు అన్నగారితో ద్రౌపది వలన ఏనాడూ కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనగా ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం. అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. వనచరులు చనిరి వలసిన రీతిన్.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : తిన్నని విడిచి బోయలు పల్లెకు తిరిగి వెళ్ళచూ దు:ఖించే సందర్భంలోనిది.
అర్థం : ఆ బోయలు బాధతో తమ ద్రోవను తాము వెళ్ళారు.
భావము : సుఖులను గూడెమునకు పొమ్మని తిన్నడు మరలా శివుని మనసులో నిలుపుకొని శరీరాన్ని మరచిన స్థితిలో మనుపటివలె ఉండగా ఆటవికులు దు:ఖిస్తూ వెళ్ళవలసిన దారిలో వెళ్ళారు.

3. ధర్మము వహించు జనుండు కృతార్థుడెయ్యెడన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : కుబేరుడు రావణునకు నీతులు చెప్తున్న సందర్భంలోనిది.
భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ద్రోహము చేసిన వాని ముఖము చూసిన మహా పాపములు వస్తాయి. శరీరము అశాశ్వతము. సంపదలు పుణ్యముల వలన వస్తాయి. కావున ధర్మమును ఆచరించువాడు కృతార్థుడని ఇందలి భావం.

4. ధీరమాతల జన్మభూమేరా !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : కవి ఆంధ్రుల వీరత్వాన్ని, శౌర్య ప్రతాపాలను గురించి వర్ణిస్తున్న సందర్భంలోనిది.
అర్థం : వీరులను కన్న వీరమాతలకు జన్మభూమి ఈ తెలుగుతల్లి.
భావం : వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పొందిన అపరచాణక్య మేధాసంపన్నత గల నాయకురాలు నాగమ్మ, బొబ్బిలి యుద్ధంలో ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన రాణీ మల్లమ్మ, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసి కూడా భర్తను ధైర్యంగా పంపిన మగువ మాంచాలా ఇలా ఎందరో వీరవనితలకు, బాలచంద్రుడు, తాండ్రపాపారాయుడు ఇలా ఎందరో వీరులను కన్న తల్లులకు ఈ తల్లి పుట్టినిల్లు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. సహదేవుడెట్టివాడు ?
జవాబు:
సహదేవుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన సంతానం. పాండవులందరిలో చివరివాడు. సహదేవునికి అహంకారమనేది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడని భీముడు కూడా స్తుతించాడు. తన అన్నగారైన ధర్మరాజును తండ్రితో సమానంగా భక్తి ప్రపత్తులతో సేవించేవాడు. భీముడు సహదేవుని మరణ కారణం అడుగగా, సహదేవుడు లోకంలో తనకంటే ప్రాజ్ఞుడు ఎవడూ లేడని భావిస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. అందుకే ఈ దురవస్థ సంభవించింది అని ధర్మరాజు సహదేవుని గురించి చెప్పాడు.

2. ఇంటికి రమ్మని పిలిచిన బోయలకు తిన్నడిచ్చిన సమాధానాన్ని తెలపండి.
జవాబు:
ఈ శివలింగానికి నా ప్రాణాన్ని మరణించేవరకు ఓడ నడచుటకు కట్టిన దూలం వలె పెనవేశాను. మీరు బాధపడవద్దు. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి ఇప్పుడు నేను వస్తాను. లేనిచో శివుడే దిక్కులో ఉన్నాడో ఆ స్థలంలోనే అనుక్షణం అతనిని అంటిపెట్టుకొని నివసిస్తాను. నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దేవుడే. మీరు ఈ అడవిలో కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఒత్తిడి చేసినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను ఇది నిజం అని తిన్నడు పలికాడు.

3. పుష్పకవిమాన విశేషాలేమిటి ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. పుష్పక విమానమును బ్రహ్మదేవుడు కుబేరునకు కానుకగా ఇచ్చాడు. ఆ విమానమును రావణుడు -కుబేరుని యుద్ధములో జయించి తాను పొందాడు. అది వేలవేల బంగారు స్తంభములు కలిగి ఉన్నది. వైడూర్య తోరణముల సమూహములతో ముత్యాలతో చాందినీలు కలిగి ఉన్నది. చంద్రకాంత శిలలతో వేదికలు, వజ్రాల సోపానాలు ఉన్నాయి. కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షములున్నాయి. మనోవేగాన్ని మించిన వేగం పుష్పక విమానానికున్నది. దానికి కోరిన చోటికి తీసుకుపోగల మహిమ ఉన్నది. కామరూపాన్ని ధరించి, మహిమ గల కాంతితో వెండి రంగులో ప్రకాశవంతంగా పుష్పక విమానమున్నది. ఎంతమంది ఎక్కినా, మరొకరికి చోటు ఉంటుందని పెద్దలన్నారు.

4. సౌఖ్యంబెంత క్రీడించునో అని జాషువా ఎందుకన్నాడు ?
జవాబు:
ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, గుడ్లగూబలు, దయ్యాలు ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ శ్మశానంలో ఆకు కూడా కదలడం లేదు అని జాషువా గారు వర్ణిస్తారు. ఇవన్నీ మానవుడి నిత్యజీవితంలో కష్టాలని, పోరాటాలని కవి ఇలా పోల్చాడు. మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా అనుభవిస్తుంటాడు. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండదు. అక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది అని జాషువా అన్నారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. హాస్యమునకు ఒక ముఖ్య కారణం “ఆశ్చర్యం” వివరించండి.
జవాబు:
స్వల్ప విషయాన్ని అద్భుతమైన విషయంగా, గొప్ప విషయంగా చెప్పటం వల్ల కలిగే ఆశ్చర్యం నుండి హాస్యం పుడుతుంది. ఒక అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా పాఠం చెప్పి చివరలో ఆ చక్రవర్తి ఏం చేశాడంటే అని ఆపేటప్పటికి విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్ప పని చేసివుంటాడని అనుకుంటారు. ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ‘ఢాంం అని చచ్చాడు’ అని అధ్యాపకుడు చెప్పే సరికి ఆశ్చర్యంతో క్లాసంతా గొల్లుమంటుంది. ప్రసంగంలో పూర్వ భాగానికి భిన్నమైన ముగింపు ఆశ్చర్యాన్ని కలిగించి నవ్వు పుట్టిస్తుంది.

క్షురకుడు క్షవరం చేస్తున్నప్పుడు గాట్లు పడుతుంటే ఆ వ్యక్తి బాధ తగ్గించటానికి మాటల్లోకి దించుతూ ‘ఇదివరకు ఈ షాపుకు వచ్చారా” అంటాడు. ఆ వ్యక్తి లేదు, ఆ చెయ్యి యుద్ధంలో తెగిపోయిందయ్యా అన్నాడు. ఈ సమాధానం క్షురకుడికి తలవంపులు కలిగించినా, అనుకోని ఆ సమాధానం ఆశ్చర్యం కలిగించి నవ్వు పుట్టిస్తుంది.
ఆశ్చర్యం కూడ హాస్యానికి ఒక ముఖ్యకారణమే !

2. పెద్దనగారి భార్యను గురించి వ్రాయండి.
జవాబు:
పెద్దనగారి భార్య అణకువ, గర్వము మూర్తీభవించినట్లుండే ఇల్లాలు. తన భర్తకు రాయలవారి నుండి లభిస్తున్న గౌరవాదరాలను చూస్తుంటే ఆమెకు అమితమైన సంతోషము. రాయలవారు నిండు సభలో మను చరిత్ర నందుకున్నప్పటి విశేషాలన్నీ ఆ సాయంకాలం పెద్దన్నగారింట్లో కూర్చున్నవారందరికీ పింగళి సూరన మరీమరీ వివరించి చెపుతుంటే, ఆ ఇల్లాలు అటు ఇటు తిరుగుతూ, ఆగుతూ ఆనందంగా వింటుంది.

మరునాడు అల్లసాని పెద్దన ఇంట్లో కవులందరికీ విందు. పెద్దన భార్య అనుకూలవతి. ఆమెను చూసి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ముద్దియౌ నతని గృహిణి’ అని ఆమె అతిథి మర్యాదను తెనాలి రామకృష్ణకవి ప్రశంసిస్తాడు. అక్క అని ఆమెను సంబోధిస్తాడు. ఆ అక్కగారు మను చరిత్రలో ప్రవరుని గృహిణి వంటిదని’ ప్రశంసిస్తాడు. అవునా’ అన్నట్లు పెద్దన ఆమెవైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తూనే ఉంటుంది. ఆదర్శ గృహిణి పెద్దన గారి భార్య !

3. కందుకూరి రచనలను తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొనిపోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.

కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధిని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.

తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్యతిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.

4. కలవారి కోడలు కలికి కామాక్షిలోని అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేయండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షిలోని అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఆదర్శవంతం స్ఫూర్తివంతం.
కామాక్షి అన్నయ్య గుమ్మం దాటి లోపలికి వచ్చేదాకా కామాక్షి చూడనేలేదు. ఆమె పప్పు కడుగుతోంది. అన్నను చూసీ చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. గబగబ వచ్చి అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. ఆమెకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అన్నకు కనబడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది అన్న చెల్లెలిని గమనించాడు.

కన్నీళ్ళలో ఎన్ని భావాలు దాగివున్నాయో మన ఊహకందవు. తాను బిడ్డ నెత్తుకు అత్తవారింటికి వచ్చి ఇన్ని నెలలైనా వచ్చి చూడలేదేమనే నిష్ఠూరము ఆ కన్నీళ్ళలో ఉంది. ఇంత కాలానికైనా వచ్చాడనే నిస్సహాయమైన తృప్తి కూడ కన్నీళ్ళలో ఉంది. ఏడాది లోపల పురిటి మంచం చూడాలి. కాబట్టి తననిప్పుడు తీసుకువెళ్ళటానికి వచ్చాడు కాని లేకపోతే ఇప్పుడు వస్తాడా అనే కోపం కళ్ళలో ఉంది. ఏవో పనులుండి నాన్న రాలేకపోయినా చిన్నన్నయ్యలను పంపించకుండా పెద్దన్నయ్యను పంపించటంలోని గౌరవమూ, నిండుతనమూ, అర్థం చేసుకోవటం వల్ల కలిగిన సంతోషమూ కన్నీళ్ళుగా మారింది. ఆ కన్నీటికి కొన్ని అర్థాలున్నాయి.

చెల్లెలి కంటతడి చూసి అన్న గుండె కరిగింది. పేద ఇంటి పిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతున్నదో అని ఆరాటపడుతూ చెల్లెల్ని దగ్గరకు తీసుకుని తన ఉత్తరీయపు కొంగుతో కన్నీళ్ళు తుడిచాడు. ఓదార్చి పుట్టింటికి ప్రయాణం అవమన్నాడు. పల్లకి తెచ్చాడు.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటి పేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

2. కంకంటి పాపరాజు రచనలను, కవితాశైలిని వివరించండి.
జవాబు:
కంకంటి పాపరాజు 17వ శతాబ్దమునకు చెందిన కవి. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరి పట్టణమునకు చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు నరసమాంబ, అప్పయ్య మంత్రి. పాపరాజు చతుర్విధ కవితా నిపుణుడు. యోగ, గణితశాస్త్ర ప్రావీణ్యుడు. సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు. “పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే యెట్టి వారికిన్” అని నమ్మినవాడు పాపరాజు. వాల్మీకి రామాయణములోని ఉత్తరకాండను గ్రహించి ఒక స్వతంత్ర ప్రబంధంలా ఉత్తర రామాయణాన్ని వ్రాశాడు. ఇది ‘8’ ఆశ్వాసాల ప్రబంధం. రాజనీతిని ఈ కావ్యంలో చక్కగా వివరించాడు. ఉత్తర రామాయణంతో పాటుగా ఈయన “విష్ణు మాయా విలాసము” అని యక్షగానాన్ని రచించాడు. ఈ రెండింటిని మదనగోపాల స్వామికి అంకితం చేశాడు.

3. కొడవగంటి కుటుంబరావు గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల జరిగింది. స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం. ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్థిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్నఅంశాలకు సంబంధించి రాశారు కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.

4. యార్లగడ్డ బాలగంగాధరరావు విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.

ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తు.
జవాబు:

విజయవాడ,
1.5.2018

మేనేజింగ్ డైరెక్టర్,
అగ్రిగోల్డ్ ప్రైవేటు లిమిటెడ్,
లబ్బీపేట, విజయవాడ

విషయం : కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికై దరఖాస్తు.
నమస్కారములు,
ఇటీవల “ఈనాడు” పత్రికలో తమ ప్రకటన చూసి ఈ దరఖాస్తు పంపుకొంటున్నాను. దయచేసి పరిశీలించగలరు. విద్యార్హతలు :
1. నేను బి.యస్.పి. కంప్యూటర్స్ పాసయినాను.
2. ఈ క్రింది లాంగ్వేజేస్ కూడా నేర్చుకున్నాను. C, C<sup>++</sup>, SqL, VC<sup>++</sup>.
3. కె.బి.యన్ కళాశాలలో రెండేళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం ఉన్నది.
4. నా వయస్సు 24 సంవత్సరాలు.
నా డిగ్రీ జిరాక్స్ కాపీ, అనుభవం సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాపీ పంపుతున్నాను.
నా అనుభవం, అర్హతలు దృష్ట్యా తమ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించ ప్రార్థన.

విధేయురాలు,
అనూరాధ.

చిరునామా :
శ్రీమతి అనూరాధ,
అద్దంకి వారి వీధి, రామకృష్ణాపురం, విజయవాడ 3.

2. నీవు చదివిన పుస్తకాన్ని గూర్చి స్నేహితునికి లేఖ.
జవాబు:
బాపట్ల,
6.3.2018.

ప్రియమైన స్నేహితునకు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. ఇటీవల మా తెలుగు మాష్టారుగారి ప్రోత్సాహముతో కందుకూరి వీరేశలింగము పంతులుగారు రచించిన “రాజశేఖర చరితము” అను నవలను చదివితిని. కథానాయకుడు రాజశేఖరుడు మితిమీరిన దానధర్మములు చేసి, ఒక భాగ్యవంతుడు ఏ విధముగా పేదవాడయ్యెనో ఈ నవల వలన మనకు తెలియును. ఆనాడు సంఘములో పాతుకుపోయిన మూఢాచారములు, మూఢనమ్మకాలు, మంత్రతంత్రములను గురించి రచయిత కళ్ళకు కట్టినట్లు పర్ణించినారు. కందుకూరి అపూర్వ సృష్టి ఈ నవల అని నా అభిప్రాయము. నీవు కూడా ఆ నవలను ఒక్కసారి చదివి, నీ అభిప్రాయములను తెలుపవలసినదిగా కోరుతున్నాను.

ఇట్లు, నీ మిత్రుడు,
XXXXXX.

చిరునామా :
ఎన్. బాలకృష్ణ,
జూనియర్ ఇంటర్ (సి.ఇ.సి.),
ఎస్.వి. జూనియర్ కాలేజి,
తిరుపతి – 517 502.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. రూపాతిశయము
2. ఇట్లనియె
3. మహోగ్ర
4. లేదిచట
5. బలివెట్టి
6. నీయనుజులు
7. మధ్వరి
8. కవీంద్రుడు
జవాబు:
1. రూపాతిశయము – రూప + అతిశయము – సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును.

2. ఇట్లనియె – ఇట్లు + అనియె – ఉత్త్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరంబైనపుడు సంధి అగు.

3. మహోగ్ర – మహా + ఉగ్ర – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.

4. లేదిచట – లేదు + ఇచట – ఉత్త్వసంధి
స్తూత్రం : ఉత్తునకు అచ్చుపరంబైనపుడు సంధి అగు.

5. బలివెట్టి – బలి + పెట్టి – గసడదవాదేశసంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

6. నీయనుజులు – నీ + అనుజులు యడాగమసంధి
సూత్రము : సంధిలేని చోట స్వరంబుకంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

7. మధ్వరి – మధు + అరి – యణాదేశసంధి
సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమగునపుడు క్రమంగా య, వ, ర లు ఆదేశముగా వచ్చును.

8. కవీంద్రుడు – కవీ + ఇంద్రుడు – సవర్ణదీర్ఘసంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1. నాకలోకసుఖములు
2. ధర్మహాని
3. నలుదిక్కులు
4. ఘనకీర్తి
5. అసత్యము
6. మహాలింగము
7. ధనాధిపుడు
8. నల్లపూసలు
జవాబు:
1. నాకలోకసుఖములు : నాకలోకము నందు సుఖములు – సప్తమీ తత్పురుష సమాసం
2. ధర్మహాని : ధర్మమునకు హాని – షష్ఠీ తత్పురుష సమాసం
3. నలుదిక్కులు : నాలుగైన దిక్కులు – ద్విగు సమాసం
4. ఘనకీర్తి : ఘనమైన కీర్తి – విశేషణా పూర్వపదకర్మధారయ సమాసం
5. అసత్యము : సత్యము కానిది – నజ్ తత్పురుష సమాసం
6. మహాలింగము : గొప్పదైన లింగము – విశేషణా పూర్వపదకర్మధారయ సమాసం
7. ధనాధిపుడు : ధనముచేత అధిపుడు – తృతీయా తత్పురుష సమాసం
8. నల్లపూసలు : నల్లనైన పూసలు – విశేషణా పూర్వపదకర్మధారయ సమాసం

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. సివుడు
2. భాధ
3. ప్రబందము
4. శబ్ధం
5. ఎంకమ్మ
6. కౄరుడు
7. దృతం
8. జంభుకం
9. యెలుక
10. వున్నది
జవాబు:
1. సివుడు – శివుడు
2. భాధ – బాధ
3. ప్రబందము – ప్రబంధము
4. శబ్ధం – శబ్దం
5. ఎంకమ్మ – వెంకమ్మ
6. కౄరుడు – క్రూరుడు
7. దృతం – ద్రుతం
8. జంభుకం – జంబుకం
9. యెలుక – ఎలుక
10. వున్నది – ఉన్నది.

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. God is the ocean of virtues.
జవాబు:
భగవంతుడు సద్గుణ సాగరుడు.

2. Take care of your health.
జవాబు:
నీ ఆరోగ్యము జాగ్రత్త.

3. Speak kind and sweet words.
జవాబు:
మృదువుగా, తియ్యగా మాట్లాడు.

4. I met my grandmother yesterday.
జవాబు:
మా నాన్నమ్మను నిన్న కలిశాను.

5. Never try to board a running bus.
జవాబు:
కదులుతున్న బస్సును ఎక్కే ప్రయత్నం చేయకూడదు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

సోమన ఒకసారి శ్రీశైల క్షేత్రమును దర్శించినపుడు భక్త గణముల వలన బసవేశ్వరుని దివ్యచరితమును, మహిమలను -విని ఆకర్షితుడై బసవపురాణమును రచించెను. ఇందు నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు అతినాయకుడని చెప్పవచ్చును. ఇందులో బసవని చరిత్రతో పాటు ప్రాసంగికముగా 75గురు భక్తుల కథలు అనుసంధింపబడినవి. కావ్యమునందు సోమనాథుని కథాకథన నైపుణ్యము ప్రశంసనీయము. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నప్పకథ, మడివేలు మాచయ్య కథలు మనోజ్ఞ కళాఖండములు, రసనిర్భరములు. సోమనాథుని రచనారీతిలోని ఆంత్యమప్రాసల ప్రభావము బమ్మెరపోతనపై చాలకలదు. (శ్రీ గడియారం రామకృష్ణ శర్మ).

ప్రశ్నలు :
1. సోమనాథుడు దర్శించిన క్షేత్రము పేరేమి ?
జవాబు:
శ్రీశైల క్షేత్రము.

2. సోమనాథుడు రచించిన గ్రంథమేమి ?
జవాబు:
సోమనాథుడు బసవపురాణమను గ్రంథమును రచించినాడు.

3. బసవపురాణ కథలో ప్రతినాయకుడెవరు ?
జవాబు:
బసవపురాణం కథలో ప్రతినాయకుడు బిజ్జలుడు.

4. బసవేశ్వరుడు ఎవరి అవతారము ?
జవాబు:
నందికేశ్వరుని అవతారము.

5. బసవపురాణంలోని రెండు మనోజ్ఞమైన కథల పేర్లు వ్రాయుము ?
జవాబు:
బెజ్జమహాదేవి కథ, కన్నప్ప కథ.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. కంకంటి పాపరాజు ఏ శతాబ్దానికి చెందినవాడు ?
జవాబు:
17వ శతాబ్దానికి చెందినవాడు.

2. జాషువా జన్మస్థలం ఏది ?
జవాబు:
వినుకొండ.

3. సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత.

4. శ్రీరంగం నారాయణబాబుకి శ్రీశ్రీ ఏమౌతాడు ?
జవాబు:
తమ్ముడు వరస.

5. తిన్నని గ్రామం పేరేమిటి ?
జవాబు:
ఉడుమూరు.

6. నంది ఎవరి వాహనము ?
జవాబు:
శివుని వాహనము.

7. నిటాలేక్షణుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

8. మానవరూపం దాల్చిందేమిటి ?
జవాబు:
శివుని నేత్రాగ్ని.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద /వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. హాసము అనగా ఏమిటి ?
జవాబు:
హాసము అనగా నవ్వు.

2. కందుకూరిని గద్యతిక్కన అని ఎవరు శ్లాఘించారు ?
జవాబు:
ఆరుద్ర శ్లాఘించారు.

3. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ఏది ?
జవాబు:
క్రీ.శ. 1509 1529 మధ్యకాలం.

4. దేశికవితకు ఒరవడి దిద్దింది ఎవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు.

5. మంగళంపల్లి నటించిన చలన చిత్రం పేరేమిటి ?
జవాబు:
ప్రహ్లాద.

6. ప్రాడిజీ అంటే ఏమిటి ?
జవాబు:
చిన్నవయస్సులో అసాధారణ ప్రజ్ఞ, పాటవాలు ప్రదర్శించేవారిని ‘ప్రాడిజీ’ అంటారు.

7. కామాక్షి పెద్దన్నయ్య తనతోపాటు దేనిని వెంటపెట్టుకొని వచ్చాడు ?
జవాబు:
మేనాని వెంటబెట్టుకుని వచ్చాడు.

8. నారదుని వీణ పేరు ఏమిటి ?
జవాబు:
మహతి.

Leave a Comment