AP Inter 1st Year Telugu Question Paper May 2019

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers and AP Inter 1st Year Telugu Question Paper May 2019 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Question Paper May 2019

Time : 3 Hours
Max. Marks : 100

సూచన : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. ఎన్నోయేండ్లు గతించి ……………….. నిక్కంబిందు పాషాణముల్.
జవాబు:
ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశాన స్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుఁ డొఁకడైనన్’ లేచిరాఁ డక్కటా
యెన్నాళ్ళీ చలనంబు లేని శయనం బే తల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్.

భావం : అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ! ఎంత కాలం నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భశోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయినవి. ఇది నిజం.

2. నాకుంజుట్టము …………………. బొంకన్నిజం బింతయున్.
జవాబు:
నాకుం జుట్టము తల్లిదండ్రులు జెలు ధుల్నాథుండు నీ దైవమే,
మీ కిచ్చోఁ బనిలేదు కస్తిపడఁగా మీ పల్లెకుం బొందు; కా
రా కూరంబులు చేసినం, గదలి నే రా; నిచ్చటం బ్రాణముల్
పోకార్తుందుది నాదు వేలుపునకై; బొంకన్నిజం బింతయున్.

భావం : నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అధిపతి ఈ దేవుడే. మీరు ఈ అడవిలో కష్టపడే అవసరం లేదు. మీరు గూడేనికి వెళ్ళండి. మీరు ఒత్తిడి కలిగించినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను, ఇదంతా నిజం అని తిన్నడు పలికెను.

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలను వివరించండి.
జవాబు:
పాండవులు, ద్రౌపది మరియు కుక్క హిమాలయాన్ని దాటి అడవులు, భూములు, నదులు, కొండలు పెక్కింటిని దృఢమైన యోగంలో, నిరాకుల మనస్సుతో, శోకాన్ని విడిచి, ఆయాసమన్నది లేక మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

అలా ఆ ఏడుగురూ (పాండవులు, ద్రౌపది, కుక్క) స్థిరయోగ సాధనపరులై అత్యంత వేగంగా నడుస్తుండగా ద్రౌపది నేలపై పడిపోయింది. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! ద్రౌపది నేలకు ఒరిగిపోయింది. ఈమె వలన ఏనాడు కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు కదా ? మరి ఈమె పడుటకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని చెప్పి స్థిరమైన మనస్సుతో ఆమె శవాన్ని అక్కడే విడిచి ముందుకు సాగిపోయాడు.

అలా వెళ్ళగా వెళ్ళగా సహదేవుడు ప్రాణాలు కోల్పోయి నేలకూలాడు. అది చూసిన వాయుపుత్రుడు భీముడు అన్నకు ఈ విషయం చెప్పి, సహదేవునికి అహంకారమన్నది లేదు. మిమ్మల్ని ఎంతో ‘భక్తితో సేవించాడు. మీ అందరిలో ఎంతో సన్మార్గుడు. అట్టి సహదేవునకు ఈ స్థితి ఎందుకు సంభవించింది ? అని అడుగగా, ఇతడు ‘లోకంలో తనకంటే సమర్ధుడు ఎవడూ లేడని భావిస్తూ తనకు తాను చాలా గొప్పవాడినని భావించుకుంటూ ఉండేవాడు. అందువలన అతనికి ఈ దుస్థితి సంభవించింది అని నిర్వికార భావంతో ధర్మరాజు ముందుకు సాగిపోయాడు.

భీమార్జున, నకులుడు, కుక్క తనను అనుసరిస్తుండగా ధర్మరాజు మనసు స్థిరం చేసుకుని ముందుకు పోతున్నాడు. అంతలో ద్రౌపది, తన సోదరులు సహదేవుడు ప్రాణాలు కోల్పోవడం చూసిన నకులుడు ధైర్యం కోల్పోయి ప్రాణాలు విడిచాడు. దుఃఖించిన మనసుతో భీముడు అన్నగారిని అడిగాడు. అందం, శౌర్యం, ధైర్యం, సుజనత్వంలో కురువంశంలోనేకాక, లోకంలోనే ఇటువంటి గుణశ్రేష్ఠుడు లేడు. అలాంటి పుణ్యమూర్తికి ఇలాంటి దురవస్థ సంభవించిందేమి, అనగా ఇతనికి లోకంలో తనను మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ అహంకారమే అతనిని ఈ గతికి తెచ్చింది అని నకులుని పట్టించుకొనక ముందుకు సాగాడు.

ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

భీమునికి సోదరులు, ద్రౌపది అందరూ అలా నేలకొరిగిపోవడం మనసును కలిచి వేసింది. ఆయన్ను దైన్యం వహించింది. ధైర్యం దిగజారిపోయింది అతనిలో. అంతే అతడు నేలకొరిగిపోయాడు. అలా ఒరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేల వాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే దయతో చెప్పండి అన్నాడు. దానికి ఆయన నీకు తిండి మీద ఆసక్తి అధికం, అతిగా ఆరగిస్తావు. అదిగాక నీకు గల భుజశక్తి వలన గర్వం అధికం. ఎవరినీ లెక్కచేయని తత్త్వం. పనికిమాలిన మాటలు అనేకం ఎపుడూ మాట్లాడేవాడివి. అందుకే నీకు ఈ స్థితి కలిగిందని ధర్మరాజు పాండవుల మరియు ద్రౌపదిల మరణానికి కారణాలను తెలిపాడు.

2. వేములపల్లి శ్రీకృష్ణ ఏవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్నాడు ?
జవాబు:
విజయనగర రాజులు పాలించిన రతనాలకు నిలయమైన ఈ రాయలసీమ ప్రాంతంపై కక్షగట్టిన శత్రువులు కత్తి దూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించరా సీమకు చెందినోడా, నాటి రాయల పాలనా కాలంలోని వైభవాన్ని తిరిగి సాధించడానికి అంకితమవుదాం. తన ప్రవాహంతో ఎగిసిపడే గౌతమీ గోదావరితల్లి, వరదలతో ఉప్పొంగే కృష్ణవేణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి ప్రవహిస్తే చాలు. ధాన్యరాసులు పండే ఈ ప్రాంతాలలో కూడు, గుడ్డకు కొరత ఉండదు.

నీ తెలుగు ప్రాంతము బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుపోయారయ్యా తెలుగోడా. ఆ మోసాన్ని గ్రహించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.

తెలుగువారి మధ్య ప్రాంత భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతముతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మనలను ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులమవ్వాలి.

మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మనకి గౌరవం, పేరుప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగు బిడ్డ మనందరికీ తల్లి ఒకటే. మనం తెలుగుజాతి వారము సవతితల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము.

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమనే హోరుగాలి ఉధృతంగా వచ్చింది. క్రమంగా ఆ హోరు తగ్గిపోయింది. ఉద్యమం నీరసించింది. తెలుగుజాతి అనే నావ కష్టాలు అనే సముద్రం మధ్యన దిశానిర్దేశం చేసేవారు లేక నిలుచుండిపోయింది. ఆ ఉద్యమం అనే నావ చుక్కాని బట్టి ఒడ్డుకు చేర్చరా మొనగాడా, తెలుగు వీరుడా.
ఈ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని కవి ఆకాంక్షించాడు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. యార్లగడ్డ తెలియజేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి.
జవాబు:
యార్లగడ్డ వారి ‘మాటతీరు’ గ్రంథంలో 200 పదాలకు శాస్త్రీయ విశ్లేషణ ఉంది. అందులో నుంచి స్వీకరించిన ఈ పాఠ్యభాగంలో నాలుగు ముఖ్యమైన పదాలు :
ఏరువాక పున్నమి :
జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అంటారు. ఏరు వాక పదాల కలయిక ఏరువాక ఏరు అంటే నది. వాక అంటే వాగు. వర్షాలు పడడం వలన జ్యేష్ఠ పౌర్ణమి నాటికి ఏరులు, వాగులు ప్రవహిస్తాయి. ఇదే తొలకరి. తొలికారు అంటే వ్యవసాయ సంబంధంగా మొదటి ఋతువు. ఈ పౌర్ణమికి రైతులు కవుళ్ళు నిర్థారించుకోవటం, పాలేర్లను నియమించుకోవటం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల వారికి తొలకరి శ్రావణ పౌర్ణమి. శాసనాల్లో దీనిని పేరామణి పున్నమి అంటారు. ‘పేర్’ అంటే విత్తులు విత్తటం. ఆమణి అన్నది శ్రావణం నుంచి వచ్చింది. ఇరాంబరము అంటే ‘వడగల్లు. తొలకరి వర్షాలప్పుడే వడగళ్ళు పడతాయి.

కొంగు బంగారం :
అనాయాసంగా కావలసింది లభిస్తే ఈ పదబంధాన్ని వాడతారు. వివాహిత స్త్రీల విషయంలో మాత్రమే వాడే పదబంధమిది.
ప్రథమ సమాగమం సమయంలో వరుడు వధువు కొంగుకు ఒక కాసు బంగారు నాణాన్ని కడతాడు. అది వరుడు వధువుకు చెల్లించే కట్నం. దానిని వాడుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉంటుంది. దానిని తిరిగి ఆమె తన కోడలుకు కట్టటానికి కుమారునికి ఇస్తుంది. అలా అది పరంపరగా వెళుతుంది. కుమారులు ఒకరికన్న ఎక్కువుంటే, వేరే కొని ఇస్తారు. ఆచారం ఇంత కఠినంగా ఉన్నా, ఒక్కొక్కప్పుడు విధిలేని స్థితిలో ఆమెకు ఆర్థికావసరం కలుగవచ్చును. అప్పుడు ఇబ్బంది పడకుండా ఉపయోగించుకొవటానికి వీలవుతుంది. అందుబాటులో ఉన్న ధనంగా కొంగు బంగారమనే మాట వాడుకలోకి వచ్చింది.
ఇప్పుడు పురుషుల విషయంలో కూడ కొంగు బంగారమనే మాట రెడీ మనీ అనే భావనలో వాడుకలోకి వచ్చింది.

పులిహోర :
పుల్లని ఆహారాన్ని పులిహోర అన్నారు. రాయలసీమలో దీన్నే చిత్రాన్నమంటారు. కన్నడంలో పులియోదర. ఆహారానికి వికృతి ఓగిరం. ‘గ’ కారం దకారమై పులిఓదర అయింది. ఇది నిజానికి ప్రత్యేకమైన వంట కాదు. రుచిని బట్టి ప్రత్యేకతను సంతరించుకుంది. మిగిలిపోయిన అన్నాన్ని చెడిపోకుండా నిలువ చేసుకోవటానికి చింతపండు పులుసు కలిపాము. దాని వలన కలిగే దోషాన్ని నివారించటానికి పసుపు వినియోగించాము. రుచికొరకు తాలింపు. పులిహోర సిద్ధమైంది. అన్నం వృధా చేయకూడదని పెద్దల భావన. నిలువ చేయడం వలన రోగకారకం కారాదు. అందుకని పసుపు, నూనెలు వినియోగించారు. పుల్లని ఆహారం పులిహార వ్యవహారంలో పులిహోర అయింది.

పేదా సాదా :
పేదసాదల పట్ల మన్నన కలిగి ఉండాలి అని పెద్దలు చెపుతారు. సాధారణంగా ఆర్థికశక్తి లోపించిన వారిని పేదలంటారు. ఈ పదబంధం ఈ అర్థంలోనే వాడుతున్నాము ‘పేద’ అనే పదానికి ఇంకా చాలా అర్థాలున్నాయి. వాటికి ఈ పదబంధంతో సంబంధం లేదు. తమిళంలో పదేళ్ళలోపు ఆడపిల్లలను కూడ పేద శబ్దంతో చెపుతారు.

ఇక్కడ మాత్రం ‘పేదశబ్దం’ ఆర్థిక సంబంధమే ! దీనితో జోడించిన శబ్దం ‘సాద’. ఇది సంస్కృత శబ్దం ‘సాధు’ నుంచి వచ్చింది. వీరి జీవితం సంఘం వితరణపై ఆధారపడి ఉంది. కాబట్టి సాధు శబ్దానికి శాంతము అని కూడ అర్థం ఉంది. సాధు జంతువు అన్నప్పుడు క్రూర స్వభావం కానిది అని చెపుతాము. వాడు పరమ సాధువు అంటే కోపం రాని, లేని వ్యక్తి అన్నమాట.

తిక్కనగారి విరాదిపర్వంలో సాధు శబ్దానికి శాంతమనే అర్థం చెప్పడం జరిగింది. నిజానికక్కడ ఉన్నది ‘సాతు’ అనే పదం. సాతు అనేది ఒక రకం కలుపుమొక్క కనుక పదాల అర్థాల విషయంలో చాలా మెలకువ వహించాలి.

2. పంతులుగారు పత్రికల ద్వారా సంఘ చైతన్యానికి చేసిన కృషిని వివరించండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగంగారు సత్యవాది, చింతామణి, వివేక వర్ధని అనే మూడు పత్రికలను స్థాపించి తద్వారా సంఘంలో చైతన్యానికి దోహదం చేశారు.
తన శక్తి యుక్తులను, భౌతిక మానసిక శక్తులను ద్రవ్యాన్ని చివరకు తన ప్రాణాన్ని స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని కందుకూరి వారు ‘సత్యవాది’ పత్రికలో ప్రకటించారు.
‘స్త్రీలు విద్యకు తగరు’ అని వ్యతిరేకులు అన్నప్పుడు ‘పురుషులు విద్యకు తగరు’ అని ఎగతాళి చేస్తూ వీరు ‘వివేక వర్ధని’ లో రాశారు.

దేవదాసీల గురించి వ్యభిచార వ్యక్తిని గురించి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించటం వల్ల ఈ వృత్తి పై ప్రజలలో జుగుప్స కలిగింది. ఆయన స్థాపించిన వివేక వర్ధని చాలా కాలం నిరాటంకంగా పని చేసింది.

తను స్థాపించిన పత్రికలను సంఘ చైతన్యం కోసమే వీరేశలింగం వినియోగించారు. తరతరాలుగా ప్రజల మనసుల్లో మూఢ నమ్మకాల రూపంలో పాతుకుపోయిన భావాలను పత్రికలలో తన వ్యాసాల ద్వారా మార్చటానికి వీరేశలింగంగారు ఎంతో కృషి చేశారు. పత్రికలను నడపటానికి ఎన్నో వ్యయ ప్రయాసలు కోరారు.

కందుకూరి మహా నిరాడంబర జీవి తన కోసం ఖర్చుల విషయంలో ఆయనది పిసినారి దృష్టి. తనకున్నదంతా పత్రికల నిర్వహణ, సంఘ సంస్కరణ కార్యక్రమాలకే వినియోగించిన వితరణ శీలి.
`వీరు తన పత్రికల్లోనే కాక ఇతర పత్రికల్లోను అనేక వ్యాసాలు రచించారు. తన పత్రికలను సంఘ సంస్కరణకు ప్రధాన సాధనంగా చేశారు. పత్రికలలో సృజనాత్మక రచనలు చేశారు. చర్చా వేదికలు నిర్వహించారు.

వీరేశలింగం గారు తాను పత్రికలలో రాసిన వ్యాసాలను ఉపన్యాసం అనే పేరుతో పిలిచారు. అయితే తరవాత ఈ పదం ఎక్కువ కాలం వ్యవహారంలో లేదు.
పత్రికలను సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలో, పత్రికల ద్వారా సంఘ చైతన్యం ఎలా తీసుకురావచ్చో వీరేశలింగం తన పత్రికల ద్వారా తెలియబరిచారు.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. దహేజ్ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు.. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ

మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండపం పైకి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు. వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు. ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు.

కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

2. ఎచ్చరిక పాఠ్యభాగం ద్వారా భూస్వాముల దౌర్జన్యాన్ని వివరించండి.
జవాబు:
నర్సిరెడ్డి పటేలు దగ్గర పెంటయ్య పని చేస్తూ ఉంటాడు. నిజాం పాలనలో పటేలు, పట్వారీ వ్యవస్థ ఉండేది. పెంటయ్య కొడుకు రాములు 20 సంవత్సరాల యువకుడు. రాత్రి బడిలో వయోజన విద్య ద్వారా చదువుకుంటాడు. తరతరాలుగా పటేలు దగ్గర పనిచేయడాన్ని ఇష్టపడడు రాములు. పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు ఇక్కడ జీతానికి ఉండనంటున్నాడట మర్తి బాకీ ఎవరు తీరుస్తారు? మా బాకీ తీర్చి ఎక్కడికైనా పొండి అని అంటాడు పటేలు. అప్పటివరకు మేపిన బర్రెను కొట్టంలో కట్టి దూడకి కాస్త గడ్డి వేసి వస్తాడు రాములు. ఏమిరా జీతానికి ఉండనని అంటున్నావట అని రాములుని పటేలు ప్రశ్నించాడు మారు మాటాడలేదు రాములు. చేతిలో కాని ఉంటే ఎవరైనా వస్తారు. మా అప్పు చెల్లగొట్టి ఎటైనా పోవచ్చునని అన్నాడు` పటేలు.

అప్పుడే వచ్చిన పెంటయ్యతో ఆ సాతాని పంతుల్ని పిలిపించి కాగితాలతో పటేలు వస్తాడు. పంతులు పెంటయ్య ముందు కాగితాలు పెడతాడు. కాస్త లెక్కలు చూడండి వీళ్ళు తొందర చేస్తున్నారని అంటాడు. పెంటయ్య తాత పెళ్ళికి చేసిన అప్పు ఒక కాగితం. పెంటయ్య తండ్రి పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం, పెంటయ్య పెళ్ళికి చేసిన అప్పు . మరొక కాగితం ఇలా మూడు తరాలుగా వాళ్ళ ఇంట్లో పెళ్ళి పేరంటం అయినా పురుడు అయినా తీసుకున్న దానికి వాళ్ళ జీవితాంతం వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయాలనేది ఆనాటి భూస్వాముల అభిప్రాయం.

పెంటయ్య కూడా చిన్ననాటి నుండి పటేలు ఇంట్లో చాకిరీ చేస్తూనే ఉన్నాడు. వారి కష్టాన్ని వడ్డీ కింద జమచేసి అసలు అప్పు అలాగే ఉంచేవారు. వాళ్ళు బయటకు వెళ్ళి బ్రతకకూడదు. వాళ్ళకు జబ్బు చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గరే అప్పు తీసుకోవాలనే వాళ్ళు ఆనాటి పటేళ్ళు. వీళ్ళ కష్టం వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులు పెరుగుతాయి గాని వీళ్ళ అప్పు తీరదు. ఇది అన్యాయ మనిపించే రాములు పటేలు దగ్గర పనిచేయనని చెప్పాడు. పంతులు లెక్కగట్టి 2 వేల రూపాయిలు దాకా అప్పు ఉన్నట్లు చెప్పగానే రాములు ఈ కాగితాలు ఎందుకు దాచిపెట్టారు? మా పాడి ఆవును తీసుకున్న దానికి అప్పులో తగ్గించలేదా ? మేకపోతును కోసుకుని తిన్నదానికి అయిన పైసలు అప్పులోనుండి తగ్గించలేదా ? అని రాములు అడుగుతాడు. కూలి పనిచేయించుకునే వారు వాళ్ళను బానిసల్లా చూడడమే తెలుసు ఆనాటి భూస్వాములకు.

ఏది ఏమైనా అప్పు తీర్చి ఎటైనా పొండి అని పటేలు తండ్రీ కొడుకులతో అంటాడు. పెదపటేలు ఈ పటేలు తండ్రి అప్పుడు రెండు దున్నలు, ఒక బర్రె ఉన్న సంసారం వారిది. ఇప్పుడు మూడు దొడ్ల పశువులు అయినాయి. ఇరవై ఎకరాల భూమి ఇప్పుడు ఏభై ఎకరాలు అయింది. ఇలా వాళ్ళ ఆస్తి పాస్తులు పెంచుకోవడమే గాక, పనివాళ్ళను వదిలిపెట్టకుండా వాళ్ళ అవసరాలకు కొంత డబ్బు ఇచ్చి వడ్డీలు వేసి చాకిరి చేయించుకుని వాళ్ళు స్థితిమంతులయ్యే వాళ్ళు ఆనాటి పటేళ్ళు.

3. అంపకం ఆధారంగా తండ్రీకూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటినుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు.

కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

4. కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించు కుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.

పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.

కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట, చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.

V. క్రింది వాటిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. కపులిక నీ కులంబడప గల్గెదరంతట గండ గర్వమునన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : నందీశ్వరుడు రావణుని శపించిన సందర్భంలోనిది.
భావము : వానర ముఖముతోనున్న నన్ను చూసి అవమానించావు. అదే ముఖముతో నున్న వానరులు వారి గోళ్ళను ఆయుధములుగా చేసుకొని నిన్ను, నీ కులమును నాశనం చేస్తారు అని నందీశ్వరుడు రావణుని శపించాడని ఇందలి భావం.

2. ఏ ముద్దు నిద్రించెనో.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : తమ చిన్నారులను కోల్పోయిన మాతృమూర్తుల గర్భశోకాన్ని కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది.
అర్థం : ఏ ముద్దు ముచ్చట్లు నిదురిస్తున్నాయో !
భావము : తమ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లులు గర్భశోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా జీవిస్తున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఎన్ని విద్యలు అల్లాడిపోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగిపోయాయి అని భావము.

3. కార్యశూరులు నేడు కావాలోయ్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగువారు అభివృద్ధి పధంలోకి పయనించాలి అని చెప్పే సందర్భంలోనిది.
అర్థం : కార్యసాధకులు నేటి కాలానికి అవసరం.
భావము : రాజ్యం వీరులు పరాక్రమంతో సంపాదించుకునేది అని చెప్పిన మహాకవి తిక్కన వాక్కులు వీరులకు మార్గంవంటిది. మన పూర్వీకుల పరాక్రమాన్ని తెలుసుకుని ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి. నేడు మనకి వట్టి మాటలు చెప్పేవారు కాకుండా పనిచేసి చూపే కార్యసాధకులు కావాలి అని భావం.

4. మంటల్లోనే పెరిగాడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది.
సందర్భం : కవి భగత్సింగ్ జన్మించిన కాలం నాటి దేశ పరిస్థితులను తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం : : తీవ్ర సంఘర్షణ వాతావరణంలో ఎదిగాడు.
భావం : భగత్సింగ్ జన్మించిన నాటికి భారతదేశం బ్రిటీష్వారి కిరాతక పాలనలో అల్లాడిపోతోంది. ఆ వాతావరణంలో జన్మించిన భగత్ సింగ్ దేశ స్వాతంత్య్రం కోసం చిన్నతనం నుంచి తపించిపోయాడు. జలియన్ వాలాబాగ్ వంటి హింసాత్మక ఘటనలు చూసినవాడు. అటువంటి వాతావరణంలో ఎదిగి పెద్దవాడయ్యాడు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానములు రాయండి. (2 × 3 = 6)

1. తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
జవాబు:
ధూర్జటి అడవులలో దొరికే అనేక రకాల ఫలాల వివరాలను మనకందించాడు. నేరేడు, నెలయూటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి బరివెంక, చిటిముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు, బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి ఫలములను తిన్నడు శివునకిస్తానన్నాడు.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు, నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. “సౌఖ్యంబెంత క్రీడించునో” అని జాషువా ఎందుకన్నాడు ?
జవాబు:
ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, గుడ్లగూబలు, దయ్యాలు ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ శ్మశానంలో ఆకు కూడా కదలడం లేదు అని జాషువా గారు వర్ణిస్తారు. ఇవన్నీ మానవుడి నిత్యజీవితంలో కష్టాలని, పోరాటాలని కవి ఇలా పోల్చాడు. మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా అనుభవిస్తుంటాడు. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండదు. అక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది అని జాషువా అన్నారు.

4. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్ర్య వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

VII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. పంచామృతాల గురించి తెలియజేయండి.
జవాబు:
పంచామృతాలు అంటే అయిదు అమృతాలు. దేవతలకి, రాక్షసులకి యుద్ధం. మరణం లేకుండా ఉండటానికి అమృతం కావలసి వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు. అమృతం పుట్టింది. అదలా వుంచితే, రుచిపరంగా, ఏదైనా చాలా రుచిగా ఉంది అని చెప్పటానికి అమృతం లాగా వుంది అని చెపుతాము.

ఏదైనా మధురమైన దానికి సంకేతంగా అమృతమనే మాటను ఉపయోగించటం మన అలవాటు. అలాంటి అయిదు మధుర పదార్థాలను కలిపి పంచామృతాలు అంటారు. అవి పాలు, పెరుగు, పంచదార, నేయి, తేనెలు. దేవతారాధనలో, అభిషేకంలో ఇవి ముఖ్యం. పంచామృతాలు ఆరోగ్యాన్నిస్తాయి. కేవలం నేయి, తేనెల మిశ్రమం విషంతో సమానం.

2. ప్రాడిజీలను గురించి వివరించండి.
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీ’ లంటారు. గానం, గణితం, చిత్రలేఖనం, కవిత్వం మొదలైన విద్యలలో ప్రాడిజీలు కన్పిస్తారు. పూర్వజన్మలో విశ్వాసం ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తులు సంచితమంటారు.
అయితే, చిన్నతనంలో ఉండే ఈ ప్రజ్ఞాపాటవాలు యుక్తవయస్సు వచ్చేసరికి కనిపించక ప్రాడిజీలు చాలా మామూలుగా తయారవుతారు. ఇంగ్లండులోని రాయల్ ఎకాడమిలో 14 ఏళ్ళ లోపు పిల్లలు వేసిన అద్భుత చిత్రాలు ఉన్నాయట. ఆ చిత్రకారులలో కొందరు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లి బొమ్మ కూడ వేయలేకపోయారట!
బాలమురళి మాత్రం ఈ రకం ప్రాడిజీకాదు. అందుకే తన నలభయ్యవ ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నాడు.

3. అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అపహాస్యం అంటే వెక్కిరింత. సహృదయుడు, ఆరోగ్యవంతుడు అయినవాణ్ణి నవ్వించేది ఉత్తమహాస్యం. కానిది అపహాస్యం. మనిషిలో సహజంగా ఉండే అంగవైకల్యం – కుంటితనం, గుడ్డితనం, అనాకారితనం, ముక్కువంకర, మూతివంకర వంటి వానిని చూసి నవ్వటం సభ్యత అన్పించుకోదు. ఇది అపహాస్యం చేయటమే అవుతుంది.
కాలు జారి పడ్డ వాడిని చూసి జాలిపడాలి కాని నవ్వి అపహాస్యం చేయకూడదు. కడుపు నొప్పితో బాధపడుతూ వికృతంగా ముఖం పెట్టి మెలికలు తిరుగుతున్న వ్యక్తిని చూసి నవ్వితే అపహాస్యం చేయటమే !
నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలుసుకున్న వారే సహృదయులు. వారు ఎవరినీ అపహాస్యం చేయరు.

4. పెద్దన భార్యను గురించి రాయండి.
జవాబు:
పెద్దనగారి భార్య అణకువ, గర్వము మూర్తీభవించినట్లుండే ఇల్లాలు. తన భర్తకు రాయలవారి నుండి లభిస్తున్న గౌరవాదరాలను చూస్తుంటే ఆమెకు అమితమైన సంతోషము. రాయలవారు నిండు సభలో మను చరిత్ర నందుకున్నప్పటి విశేషాలన్నీ ఆ సాయంకాలం పెద్దన్నగారింట్లో కూర్చున్నవారందరికీ పింగళి సూరన మరీమరీ వివరించి చెపుతుంటే, ఆ ఇల్లాలు అటు ఇటు తిరుగుతూ, ఆగుతూ ఆనందంగా వింటుంది.

మరునాడు అల్లసాని పెద్దన ఇంట్లో కవులందరికీ విందు. పెద్దన భార్య అనుకూలవతి. ఆమెను చూసి ‘వండ సలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి’ అని ఆమె అతిథి మర్యాదను తెనాలి రామకృష్ణకవి ప్రశంసిస్తాడు. అక్క అని ఆమెను సంబోధిస్తాడు. ఆ అక్కగారు మను చరిత్రలో ప్రవరుని గృహిణి వంటిదని’ ప్రశంసిస్తాడు. అవునా’ అన్నట్లు పెద్దన ఆమెవైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తూనే ఉంటుంది. ఆదర్శ గృహిణి పెద్దన్న గారి భార్య !

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు /రచయితలు) (2 × 3 = 6)

1. కొడవటిగంటి కుటుంబరావు గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల్యం జరిగింది. స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం. ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్ధిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్న అంశాలకు సంబంధించి రాశారు కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.

2. కంకంటి పాపరాజు రచనలను, కవితాశైలిని తెలపండి.
జవాబు:
కంకంటి పాపరాజు 17వ శతాబ్దమునకు చెందిన కవి. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరి పట్టణమునకు చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు నరసమాంబ, అప్పయ్య మంత్రి. పాపరాజు చతుర్విధ కవితా నిపుణుడు. యోగ, గణితశాస్త్ర ప్రావీణ్యుడు. సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు. “పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే యెట్టి “వారికిన్” అని నమ్మినవాడు పాపరాజు. వాల్మీకి రామాయణములోని ఉత్తరకాండను గ్రహించి ఒక స్వతంత్ర ప్రబంధంలా ఉత్తర రామాయణాన్ని వ్రాశాడు. ఇది ‘8’ ఆశ్వాసాల ప్రబంధం. రాజనీతిని ఈ కావ్యంలో చక్కగా వివరించాడు. ఉత్తర రామాయణంతో పాటుగా ఈయన “విష్ణు మాయా విలాసము” అని యక్షగానాన్ని రచించాడు. ఈ రెండింటిని మదనగోపాల స్వామికి అంకితం చేశాడు.

3. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.
ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

4. కందుకూరి రచనలను తెల్పండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు. ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొని పోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.
కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.
తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్యతిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.

IX. క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. మీ విద్యాభ్యాసాన్ని గురించి తెలియజేస్తూ తల్లిదండ్రులకు లేఖ రాయండి.
జవాబు:

తల్లిదండ్రులకు లేఖ

స్థలం : XXXXX
తేది : XXXXXX.

పూజ్యులైన అమ్మకీ, నాన్నకీ,
నమస్కారాలు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగా చదువుకుంటున్నాను. చెల్లెలు ఎలా చదువుతుంది ?
మా గురువులు చెప్పే పాఠాలు క్షుణ్ణంగా చదువుకుంటున్నాను. ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్ళి దినపత్రికలు చూసిన తరువాత, అక్కడే కూర్చొని మూడు గంటల పాటు తరగతి పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తున్నాను. మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఎక్కువసేపు కష్టపడుతున్నాను. నాకు మిమ్మల్ని చూడాలనుంది. పరీక్షలు ప్రారంభమయ్యేలోపు -మీరు తప్పకుండా రావాలి. నాయనమ్మ, తాతయ్యలకు నా నమస్కారాలు తెలియజేయగలరు. నా స్నేహితులు రాజు, కస్తూరిలను అడిగినట్లు చెప్పగలరు. మీ రాకకోసం ఎదురు చూస్తుంటారు.
నమస్సులతో

మీ కుమారుడు,
XXXXXX.

చిరునామా :
XXXXXXXX,
XXXXXX,
XXXXX,
XXXX.

2. విద్యార్థులు రాజకీయములను గూర్చి మిత్రునికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
12.2.2018.

ప్రియమైన మిత్రునకు,
నీ స్నేహితుడు వ్రాయునది. నేను క్షేమముగా ఉన్నాను. నీవు క్షేమమని తలుస్తాను. మా కళాశాలలో విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగినవి. ప్రజాస్వామ్యములో ఎన్నికల విధానమును తెలుసుకొనుటకై విద్యార్థి సంఘ ఎన్నికలు జరుగుతున్నవి. కానీ, దురదృష్టవశాత్తు కొందరు రాజకీయవాదులు విద్యార్థులను పావులుగా చేసుకొని తమ స్వార్థమునకై వారిని బలిచేయుచున్నారు. విద్యార్థుల ప్రధాన లక్ష్యం విద్యార్జన. రాజకీయ పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమే కాని, రాజకీయములయందు ప్రత్యక్షముగా పాల్గొనుట ఉచితం కాదని నా అభిప్రాయం. కానీ, పౌరులైన విద్యార్థులు కలుషిత రాజకీయాలందు ప్రవేశించి ధన, ప్రాణ నష్టాలకు గురియగుచుండుట మిక్కిలి విచారకరం. ఈ విషయంలో నీ అభిప్రాయములు తెలియజేవలసినదిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :
ఎ. నాగార్జున,
జూనియర్ ఇంటర్ (బై.పి.సి.),
సిద్ధార్ధ కళాశాల, విజయవాడ.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి సంధి పేరు, సూత్రము వ్రాయండి. (4 × 3 = 12)

1. తాల్మిఁజేసి
2. నీయనుజులు
3. రూపంబు దాల్చి
4. మృగాదులు
5. కపాలమొక్కటి
6. ఒకానొక
7. జగతినెందు
8. వనౌషధి.
జవాబు:
1. తాల్మిఁజేసి – తాల్మిన్ + జేసి – సరళాదేశసంధి.
సూత్రం : 1) ద్రుతపకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు, సంశ్లేషలు విభాషనగు.

2. నీయనుజులు – నీ + అనుజులు యడాగమసంధి.
సూత్రం : సంధిలేని చోట స్వరంబునకంటై పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

3. రూపంబుదాల్చి – రూపంబు + తాల్చి – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

4. మృగాదులు · మృగ + ఆదులు – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగు.

5. కపాలమొక్కటి – కపాలము + ఒకటి – ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధిఅగు.

6. ఒకానొక – ఒక + ఒక – అత్త్వసంధి.
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

7. జగతినెందు – జగతిన్ + ఎందు – ఇత్త్వసంధి.
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

8. వనౌషధి – వన + ఔషధి – వృద్ధిసంధి.
సూత్రం : అకారమునకు ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారము ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహ వాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 2)

1. పూర్వకాలము
2. ధనాధిపుడు
3. ఆరుకోట్లు
4. ధైర్యస్థైర్యములు.
5. తుంగభద్రానది
6. శార్దూలక్రోడములు
7. ప్రకృతి రంగము
8. ముఖ కమలము.
జవాబు:
1. పూర్వకాలము : కాలము యొక్క పూర్వభాగం – ప్రథమ తత్పురుష సమాసం.
2. ధనాధిపుడు : ధనము చేత అధిపుడు – తృతీయా తత్పురుష సమాసం.
3. ఆరుకోట్లు : ఆరు అను సంఖ్య గల కోట్లు – ద్విగు సమాసం.
4. ధైర్యస్థైర్యములు : ధైర్యమును స్థైర్యమును – విశేషణా ఉభయపదకర్మధారయ సమాసం.
5. తుంగభద్ర : తుంగభద్ర అనుపేరు గల నది – సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం.
6. శార్ధూల క్రోడములు : శార్దూలమును, క్రోడమును – ద్వంద సమాసం.
7. ప్రకృతి రంగము : ప్రకృతి అనెడి రంగము రూపక సమాసం.
8. ముఖ కమలము : కమలము వంటి ముఖం – ఉపమాన ఉత్తరపదకర్మధారయ సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పద దోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. దృతం
2. ఎనక
3. వున్నది
4. వూరు
5. శబ్ధం
6. స్మశానం
7. బేదం
8. ఉచ్ఛారణ
9. భాధ
10. ప్రబందము
జవాబు:
1. దృతం – ద్రుతం
2. ఎనక – వెనుక
3. వున్నది – ఉన్నది
4. వూరు – ఊరు
5. శబ్ధం – శబ్దం
6. స్మశానం – శ్మశానం
7. బేదం – భేదం
8. ఉచ్ఛారణ – ఉచ్చారణ
9. భాధ – బాధ
10. ప్రబందము – ప్రబంధము

XIII. క్రింది ఆంగ్ల వాక్యములను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Indian constitution was written by Dr. B. R. Ambedkar.
జవాబు:
భారత రాజ్యాంగ నిర్మాత డా॥ అంబేద్కర్.

2. C.P. Brown Library is located at Kadapa.
జవాబు:
సి.పి. బ్రౌన్ గ్రంథాలయం కడపలో ఉంది.

3. Peacock is our national bird.
జవాబు:
నెమలి మన జాతీయ పక్షి.

4. Dams are built to reserve water.
జవాబు:
నీటిని నిలువ చేయటానికి ఆనకట్టలు నిర్మిస్తారు.

5. Honesty is the best policy.
జవాబు:
నిజాయితీ చాలా ఉత్తమ గుణం.

XIV. ఈ క్రింది గద్యాన్ని చదివి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను “జానపదకళలు” అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళారూపాలు. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది.
చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లతిత కళలు భావం మనస్సుకు హత్తుకొనేరకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనులవిందుగా ఉండి గానకళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనకు అందించేకళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటలవెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేది కవిత్వం.

ప్రశ్నలు :
1. జానపదం అంటే ఏమిటి ?
జవాబు:
జానపదం అంటే గ్రామం.

2. జానపదులనగా ఎవరు ?
జవాబు:
జనపదంలో నివసించే వాళ్లు జానపదులు.

3. జానపద కళలను రెండింటిని తెలపండి.
జవాబు:
యక్షగానం, వీధి నాటకం.

4. లలిత కళలేవి ?
జవాబు:
సంగీతము, చిత్రలేఖనం, శిల్పం, నృత్యం, కవిత్వం.

5. కవిత్వం అంటే ఏమిటో వివరించండి ?
జవాబు:
ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక, మరుగుపరచి మనసుకు ఉల్లాసాన్ని కలిగించే విధంగా, పదాలను కూర్చి చెప్పెదే కవిత్వం.

XV. క్రింది వానిలో ఐదింటికి ఏకవాక్య / పద సమాధానం రాయండి. (5 × 1 = 5)

1. తిక్కన ఎవరి ఆస్థాన కవి.
జవాబు:
మనుమసిద్ధి.

2. ఖండకావ్యాలకు అఖండ ఖ్యాతిని తెచ్చిన కవి ఎవరు ?
జవాబు:
జాషువా.

3. కపాలమోక్షం పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు.

4. పాంచాల రాజకుమార్తె ఎవరు ?
జవాబు:
ద్రౌపది.

5. కాళము అంటే అర్థమేమి ?
జవాబు:
పాము.

6. ఉత్తర రామాయణం ఎన్ని ఆశ్వాసాల కావ్యం.
జవాబు:
ఎనిమిది ఆశ్వాసాలు.

7. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గేయం ఏ చిత్రంలో ఉంది ?
జవాబు:
పల్లెటూరు.

8. త్రివిష్టపం అంటే ఏమిటి ?
జవాబు:
స్వర్గం.

XVI. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (5 × 1 = 5)

1. రాయలవారి సాహితీ భవనం పేరేమిటి ?
జవాబు:
భువన విజయం.

2. కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
జవాబు:
వివేక వర్ధిని.

3. మల్లాది సుబ్బమ్మగారు ఎక్కడ జన్మించారు ?
జవాబు:
పొతర్లంకలో జన్మించారు.

4. రాయలువారు రాసిన నాటకం పేరేమిటి ?
జవాబు:
జాంబవతీ కళ్యాణం.

5. చేమకూర వేంకటకవి రచించిన కావ్యం ఏది ?
జవాబు:
విజయ విలాసం.

6. కుర్చీపీట మీద కూర్చున్న వారెవరు ?
జవాబు:
కామాక్షి అత్తగారు.

7. నామవిజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం ఎవరు చేశారు ?
జవాబు:
యార్లగడ్డ బాలగంగాధర రావు.

8. త్యాగరాజు ఆరాధనోత్సవాలు ఎక్కడ జరుగుతాయి ?
జవాబు:
తిరువాయురు.

Leave a Comment