Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 6 allows students to familiarize themselves with different question patterns.
AP Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions
గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.
I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)
1. నుతజలపూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్రతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
సూనృతవ్రత ! = సత్యం మాట్లాడటమే నియమంగా కలిగిన ఓ రాజా!
నుతజల పూరితంబులగు
నుతజల = మంచినీటి చేత
పూరితంబులు + అగు = నిండినవైన
సూదులు = చేదుడు బావులు
నూఱిటికంటెన్ = వంద కంటే
ఒక బావి = ఒక దిగుడు బావి
మేలు = ఉత్తమమైనది
మఱి = = అంతేకాక
బావులు = దిగుడుబావులు
నూఱిటి కంటెన్ = వంద కంటే
ఒక్క = ఒక
సత్ + క్రతువు + అది = మంచి యజ్ఞం
మేలు = ఉత్తమమైనది
తత్ + క్రతుశతంబున
కంటెన్ = అటువంటి నూరు యజ్ఞాల కంటే
సుతుండు = ఒక్క కొడుకు
మేలు = మేలు
తత్, సుతశతకంబుకంటెన్ = అటువంటి కొడుకులు వందమంది కంటే
చూడగ = పరిశీలించ
ఒక = ఒక్క
సూనృత వాక్యము = సత్యవాక్యం
ఉత్తమమైనది = మేలు
తాత్పర్యం : సత్య వాక్పాలనమే వ్రతంగా కలిగిన ఓ రాజా ! మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరింటికంటే ఒక దిగుడుబావి మేలు. అంతేకాక నూరు దిగుడుబావులకంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమందికంటే ఒక సత్యవాక్యం మేలైనది అని తాత్పర్యం.
2. ఉరుతరాటవిలోన మహోగ్రతపము
వాయుదేవుని గుఱియించి వరుసఁ జేసి
యంజనాదేవి గనియె నన్నర్థతోడ
నర్కజుని మంత్రి హనుమంతుఁడండ్రు నన్ను
జవాబు:
అంజనాదేవి = అంజనాదేవి
ఉరుతరాటవిలోనన్;
ఉరుతర + అటవిలోనన్ = గొప్ప అడవిలో
మహోగ్రతపమున్ తోడ = గొప్ప భయంకరమైన తపస్సును
అర్థితోడన్ = భక్తితో
వాయుదేవుని గుఱియించి = వాయుదేవుని గురించి
వరుసన్ + చేసి = చాలాకాలం చేసి
నన్నున్ = నన్ను
కనియెన్ = పుత్రుని కన్నది
అరజుని మంత్రిన్ = (నేను) సుగ్రీవునికి మంత్రిని
నన్నున్ = నన్ను
హనుమంతుడు = హనుమంతుడు
అండ్రు = అంటారు
తాత్పర్యము : అంజనాదేవి గొప్ప అరణ్యములో వాయుదేవుడిని గురించి చాలాకాలం భక్తితో గొప్ప తపస్సును చేసి నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని, నన్ను ‘హనుమంతుడు’ అని పిలుస్తారు.
II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. శాంతి కాంక్ష పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
పరిచయం : ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే కావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు రాయబారిగా వెళ్ళిన భట్టు పలికిన శాంతి వచనాలను వర్ణించబడ్డాయి. కలిసి ఉంటే కలిగే మేలు, యుద్ధం వల్ల కలిగే కీడులను కవి హృద్యంగా వర్ణించాడు.
నలగామరాజుకు ప్రశంస : భట్టు గుర్రం’ మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజును. ఇట్లా ప్రశంసించాడు. ఓ రాజా ! నీవు రాజులలో కెల్లా గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజవేశ్యలను రంజింప జేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. ధైర్యంలో మేరు పర్వతాన్ని జయించినవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు, వైభవంలో దేవేంద్రుడవు.
‘యుద్ధానికి సిద్ధం: రాయబారం కోసం మలిదేవరాజు మీ దగ్గరకు పంపించిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. తన తమ్ములు, బంధువులు, వీరులు అయిన నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణులు మొదలైన రాక్షసులు సంహరించబడిన శ్రీశైల ప్రాంతంలో గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు.
రాజనీతి : ఓ రాజా ! అలరాజుతోపాటే వీరమరణం పొందాలని వీరులైన నాయకులు ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే దుష్టులేకానీ అణచివేసే నిపుణులు ఈ భూమిమీద లేరు. కనుక మీ తమ్ముడైన నరసింహరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒక్కటై ఈ పగను నశింపజేయండి. పల్నాడు మొత్తాన్ని ఎదురులేకుండా కలిసిమెలసి ఏలండి. కనుక మలిదేవునితో సఖ్యతకోసం నరసింగరాజును పంపించు అని – భట్టు రాజుకు సూచించాడు.
పోరునష్టం : భూమిమీద ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం మంచిదికాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతోమంది ప్రజలు మరణిస్తారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది. సైన్యానికి కూడా యుద్ధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురు తిరుగుతారు. తమ జీతపు బకాయిల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు. సేవకులు చెప్పిన మాట వినరు.
అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించజూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టడం కష్టమౌతుంది. మీలో మీరే కొట్లాడుకుంటే చూసేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ రహస్యాలను పసిగడతారు. దుష్టులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచి పోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. కీర్తి, పరాక్రమం కూడా నశిస్తాయి. రాజ్యం సర్వనాశనమౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
పారతంత్ర్యం : యుద్ధం వల్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దుల వాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.
బానిస బతుకు : మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మొదటిదైన మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రువుల పాలనలో మాట (వాక్కు) శరీరం (కాయం) . రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఉండదు. ప్రయోజనం లేని జీవనం కన్నా మరణమే మేలు. మంచి పనులు చేయకపోతే క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్ని సార్లు పుట్టి ఎంతో పుణ్యం వల్ల లేకలేక పొందిన కష్టసాధ్యమైన మానవజన్మ నిందలపాలౌతుంది. కనుక ఓ రాజా ! ఇటువంటి బానిస బతుకు పగవారికి కూడా వద్దు.
పొందులాభం : మల్లెపూలు, తెల్లతామర, చంద్రుడు, తారలు, నురుగు, మంచు, చందనం, రాజహంస మొదలైన వాటి కాంతులను మించే గొప్పకీర్తి సైతం పగవల్ల వేగంగా నశిస్తుంది. లోకంలో అపకీర్తి పెరిగిపోతుంది. రెండు పక్షాలవారూ ఒక్కటైతే అన్ని కార్యాలు సమకూర్చుకోవచ్చు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. రెండు పక్షాల వారూ కలసిమెలసి సంపదలు పెంచుతూ ఉంటే సేవకులంతా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారు. బలం పెరగటం వల్ల శత్రురాజ్యాలపై దండెత్తి అమిత ధనరాశులను సాధించవచ్చు. ఆ ధనంతో ధర్మబద్ధ పాలన సాగించవచ్చు. అప్పుడు మీ కీర్తి లోకంలో శాశ్వతమై నిలుస్తుంది.
ముగింపు: ఓ రాజా ! కలహం వల్ల పూర్వం కౌరవులు నాశనమై పడిన కష్టాల గురించి విన్నాం కదా ! కనుక పగ పెరిగేటట్లు చేయటం భావ్యం కాదు. మీ రెండు పక్షాలవారూ అన్నదమ్ములే కనుక పరిష్కార మార్గం చెప్పాను. నామాట వినండి అంటూ మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు సంధికోసం శాంతివచనాలు వినిపించాడు.
2. రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు ?
జవాబు:
పరిచయం : గురజాడ అప్పారావు రచించిన ‘కన్యక’ అనే కవితాఖండికలో ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టడానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు వర్ణించబడ్డాయి.
రాజు దౌర్జన్యం : ఒక సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఒకసారి ఆమె బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి నుదుటున కుంకుమ పెట్టుకొని పూజ కోసం గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పాలు, పండ్లు, పూలు మొదలైన పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది. చుక్కల్లో చంద్రునిలాగా వెలుగుతున్న ఆమెవంటి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు. ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరుపొందాలని భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించబోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది.
సెట్టి వేడుకోలు : రాజు దౌర్జన్యాన్ని గమనించిన కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు. “రాజా! నువ్వు నా కూతుర్ని బలవంతం చేయవలసిన పనిలేదు. నువ్వు ఈ దేశానికి రాజువు. కనుక ఈ కన్యక కూడా నీ సొత్తే. నా కూతుర్ని నువ్వు కోరుకోవటం కంటే నాకు అదృష్టం ఏముంటుంది ? నువ్వు దయతో మా మనవి ఆలకించాలి. మా కులం వారికి ఒక ధర్మం ఉన్నది. నువ్వు ఆ ధర్మాన్ని గౌరవించాలి. అగ్నిసాక్షిగా నా కూతుర్ని పెళ్ళి చేసుకో. నీకు కావలసినన్ని కానుకలు సమర్పించుకుంటాను. మా జాతి ధర్మాన్ని కాపాడు” అని సెట్టి రాజును వేడుకున్నాడు.
రాజు అహంకారం : సెట్టి మాటలు విని రాజు ఎగతాళిగా నవ్వి ఇట్లా అన్నాడు. “రాజ్యాన్ని పాలించే రాజుకు ధర్మశాస్త్రాన్ని ఒక సెట్టి నేర్పించడమా ? అసలు రాజు అనుకున్నదే ధర్మం. రాజు చెప్పినదే శాస్త్రం. గాంధర్వం అనే వివాహ పద్ధతి రాజకుమారులకు ఆమోద యోగ్యమైనదేననే విషయం తెలియదా ? కనుక ఆలస్యం వద్దు. బాధపడనూ వద్దు. ఇవాళ,
రేపు అంటూ గడువులు పెట్టవద్దు. నీకు ఇష్టమైతే నీ కూతుర్ని ఇవ్వు. లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ తాను పట్టిన పిట్టను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా నీ కూతుర్ని విడిచిపెట్టను. ఆమె ఇక నీ ఇంటికి తిరిగిరాదు. నువ్వు ఇస్తానన్న కానుకలను ఇక్కడికే తీసుకొని రా ! నువ్వు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను” అని రాజు తన అహంకారాన్ని ప్రదర్శించారు. అపుడు సెట్టి “రాజు పనికంటే దేవుని పూజ ముఖ్యమైనది కదా ! మీరు దయచూపితే నేను మా కులదైవమైన వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళి పూజ పూర్తిచేసుకొని వస్తాను” అని రాజును అనుమతి కోరాడు. అపుడు “మేము కూడా నీతోపాటు గుడికి వస్తాం” అక్కడే అగ్నిసాక్షిగా కన్యకను స్వీకరిస్తాం” అంటూ రాజు కూడా గుడికి బయలుదేరాడు.
ముగింపు : ఈ విధంగా రాజు కన్యకను చెరపట్టడానికి ప్రయత్నించాడు.
III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)
1. తెలుగులో వచ్చిన జాతీయోద్యమ కవిత్వాన్ని వివరించండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని ‘జాతీయోద్యమం’ అంటారు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు పలురూపాలలో జరిగాయి. తెలుగు నేలపై జాతీయోద్యమ ప్రభావం వందేమాతర ఉద్యమ ప్రచారానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రాంతానికి వచ్చిన నాటి నుండి ప్రారంభమయింది. ఆయన ఆంగ్ల ఉపన్యాసాలకు తెలుగు అనువాదంగా
“భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు ..
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”
ఇది వందేమాతరం గురించి రాసింది కాదు. బ్రిటీషువారి దోపిడీని ప్రజలకు తెలియజేయటానికి వ్రాసింది. చిలకమర్తి కవితల స్ఫూర్తితో సామ్రాజ్యవాదుల దోపిడీ మీద, భారత, ప్రజలు అనుభవిస్తున్న దారిద్ర్యం మీద తెలుగు కవులు పద్యాలు గేయాలు వ్రాశారు. చెన్నాప్రగడ భానుమూర్తి ‘డ్రెయిను’ సిద్ధాంతం గురించి, చిదంబరరావు మితవాద రాజకీయాలను గురించి వ్రాశారు.
“మేలుకొనుమీ భరత పుత్రుడ
మేలుకొనుమీ సుజన పుత్రుడ
…………. …………
ఇలా మితవాద, వందేమాతరం, హోంరూల్ ఉద్యమాల మీద కవితలు వెల్లువలా వచ్చాయి.
సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, శాశనోల్లంఘనం వంటి. గాంధీ పోరాట రూపాలన్నీ తెలుగు పాటలు గాను గేయాలుగాను, కవితలుగాను వెలువడ్డాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, ఖిలాఫత్ ఉద్యమం మీద, రాట్నం మీద, మద్యపాన నిషేధం మీద తెలుగు కవుల పద్యాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.
జలియన్ వాలాబాగ్ ఉదంతానికి బ్రిటీషువారు డయ్యరును అభినందించినపుడు
“దయ్యమునకు నిముడు
అలడయ్యరు అధముడని గరిమెళ్ళ.
పశుబలమునకు భక్తుండొకడు బడాయి ఓ” డయ్యరు
అని చిల్లరిగె శ్రీనివాసరావు విమర్శల వర్షం కురిపించారు. “మా కొద్దీ తెల్లదొరతనం”, జాతీయోద్యమ తెలుగు కవితలలో ప్రజాదరణను పొందింది.
2. చాటు పద్యాలలో ప్రజా జీవనాన్ని వివరించండి.
జవాబు:
“దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మాసిన కుండలున్” అని వర్ణించాడు. పడమటి సీమ వ్యాపారుల వస్త్రాలను, మసి బుర్రలను, కలములను, చింతంబళులను, చెమటపట్టిన నీరావులను, భయంకరమైన గడ్డాల వర్ణించటమే కాకుండా “వస్తూ చూస్తిమి రోస్తిమి అంటూ ఆ భావాలకు యాసను కూడా కూర్చాడు.
శ్రీనాథుడు తాను దర్శించిన ప్రాంతాలలోని ఒక్కొక్క ప్రాంతపు వనితలను వారి సొగసును కులాసాగా వర్ణించాడు. చివరకు తమిళ స్త్రీలను వర్ణించిన చాటువులు కూడా మనకు లభిస్తున్నాయి.
IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)
1. ‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెల్పండి.
జ.
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు.
న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా? చచ్చినట్లా? అని తన ఆవేదనను సందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ `ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు. ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించ మని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.
2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు కళ్ళను సత్యం తెరిపించిన విధానం వివరించండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రముఖ నేత్రవైద్యుడు. జయపురం రాజావారికి నేత్రవైద్యం చేయడానికి జయపురం బయలుదేరాడు సుదర్శన్. అసిస్టెంట్ డాక్టర్ సత్యం తోడుగా ప్రయాణ మయ్యాడు. తనకు కొంతవరకైనా విద్యను నేర్పితే సహాయంగా ఉండే వాడినని ఎంతగానో ప్రాధేయపడతాడు సత్యం. తన వారసులకు తప్ప ఇతరులకు ఆ వైద్య విద్యలో నైపుణ్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడడు డాక్టర్ సుదర్శన్.
రైలులో ప్రయాణిస్తూ కిటికీ తీయమని సత్యానికి చెప్పాడు సుదర్శన్. కిటికీలో నుండి నిప్పురవ్వలు కంట్లోపడి ఏదో మంటగా ఉందని అరుస్తాడు సుదర్శన్. బ్యాగ్ చుక్కల మందు వెయ్యమంటాడు. ఆ మందు వేసినా కళ్ళ మంట తగ్గలేదు. గట్టిగా అరుస్తూ తనకేమీ కనబడటం లేదని అంటాడు సుదర్శన్. విద్యంతా తన సొత్తు అని అహంకారంతో అహంభావానికి లోనయ్యాను. భగవంతుడు తగిన శిక్ష వేసాడని బాధపడతాడు సుదర్శన్.
నా విద్యంతా ఎవరికి కావాలి ? నాకే ప్రయోజనం లేదు. శాశ్వతంగా గుడ్డివాడిని అయ్యాను అని బాధపడ్డాడు. జీవితాంతం కళ్ళులేని బ్రతుకేనా అని భార్య బాధపడింది.
సత్యం డాక్టర్ గారిని క్షమించమని అడిగి, ఆపరేషన్ చేస్తానని అంటాడు. “నువ్వా నాకు ఆపరేషన్ ఎలా చేస్తావు ? మీకేం భయంలేదు నన్ను నమ్మండి. మీకు కళ్ళు బాగుచేస్తానని ఆపరేషన్ చేశాడు. సుదర్శన్ ఆశ్చర్యపోతూ సత్యం ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు. తాను డాక్టర్ గారికి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సులు చదివి తెలియకుండా చిన్న రంధ్రంలోంచి చూసి ఒకసారి; నర్సు వేషంలో ఒకసారి సుదర్శన్ చేసే ఆపరేషన్ చూసి నేర్చుకుంటాడు. ఆ విధంగా తెలియకుండా నేర్చు కున్నందుకు క్షమించమని డాక్టరుని మన్నించమంటాడు. అలాగైనా నేర్చుకున్న విద్యతో తిరిగి డాక్టర్కు చూపునిచ్చినందుకు సత్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు సుదర్శన్. సత్యాన్ని ధన్యుడని ప్రజాసేవ సార్థకమవుతుందని కొనియాడతాడు. పోయిన కళ్ళతో పాటు అజ్ఞానంగా, స్వార్థంగా విద్యను దాచిపెట్టిన తనకు మనోనేత్రం కూడా తెరిపించాడు సత్యం అని సంతోషిస్తాడు.
3. ‘ఆశ ఖరీదు అణా’ నాటిక సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రదేశం అది. దాదాపు 22 కుటుంబాలున్న ఆ లోగిలిలో అందరికి సమస్యలు. ఎవరి సమస్యలు వారివి. ఉద్యోగ విరమణ చేసిన తాతగారు గంపెడు సంసారంతో బాధపడుతుంటాడు. కొత్తగా అద్దెకు దిగిన యువకుడు నిరుద్యోగి, అవివాహితుడు. ఏవో బొమ్మలు గీస్తూ తన మనోభావాలను వాటి ద్వారా బహిర్గతం చేస్తుంటాడు. ఇందిర, ఆనందలక్ష్మి అక్కాచెల్లెళ్ళు. క్రింది వాటాలో ఉంటారు. జబ్బుతో మంచానపడిన తల్లి, అకారణంగా జైలుకెళ్ళిన తండ్రి, నిరుద్యోగి అయిన అన్నయ్య పైగా అమాయకంతో తల్లిదండ్రుల గూర్చి బాధపడుతుంటాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ తల్లినీ, అన్నయ్యను అభిమానంగా చూసుకుంటుంది. ఆత్మన్యూనతా భావంతో అన్నయ్య ఎప్పుడూ కృష్ణవేణితో గొడవపడుతుంటాడు. తనకు ఒక ఉద్యోగం వస్తే చెల్లెల్ని ఉద్యోగం మానిపించేయాలనుకుంటూ ఉంటాడు.
కృష్ణమూర్తి అనే ఆయన బ్యాంకు ఉద్యోగి. తనవరకు తాను అన్నట్లు చిన్న ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన యువకునితో పరిచయం చేసుకుంటూ. మీకు బ్యాంకు ఎకౌంటు ఉందా ? ఉంటే ఏ బ్యాంకు అని ఆరాలు తీస్తాడు. దానికి సమాధానంగా నా ఎకౌంటు నా జేబులోనే ఉంది అయినా ఖాళీగానే ఉందని అంటాడు. బహుశా బ్యాంకు ఎకౌంటు లేనివాళ్ళు నచ్చరేమో అని తనలో తాను అనుకుంటాడా యువకుడు. పైన ఉండే ఆడపిల్లలను చులకన చేసి మాట్లాడటం ఆ యువకునికి నచ్చలేదు.
ఇందిరా, ఆనందలక్ష్మిలను గూర్చి ఆలోచిస్తాడు. పరిచయమైన అమ్మాయి పేరు ఏమిటో అని అనుకుంటాడు. ఇంతలో కృష్ణవేణి లక్ష్మీ దగ్గరకు వచ్చి తన అన్నయ్య గురించి తన బాధను చెప్తుంది. ఉద్యోగం కోసం వెళ్ళిన అన్నయ్య ఎప్పటికీ రాకపోయేసరికి ఇందిర, లక్ష్మీలు కంగారుపడతారు. ఆకలితో యువకునికి నిద్ర పట్టదు. సమస్యలతో తాతగారు పచార్లు చేస్తుంటాడు. తొమ్మిదిమంది సంతానం. వచ్చే పింఛను చాలీచాలదు. పెళ్ళి చేసిన ఇద్దరి కొడుకులకు ఉద్యోగాలు లేవు. పెద్ద కోడలి ప్రసవం. ఇన్ని సమస్యలతో నిద్రరాక బయట తిరుగుతుంటాడు. యువకుడు ఒంటరిగా తిండిలేక తిరుగుతుంటాడు. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లలో పడి మాట్లాడుకుంటూ ఉండగా బ్యాంకు ఉద్యోగి తన భార్యకు తుమ్ములు ఆగటం లేదని మందుల దుకాణం తెరిచి ఉంటుందా అని కంగారుగా వస్తాడు.
అన్నయ్య మాటలు పడలేక కృష్ణవేణి ఇందిర, లక్ష్మిల దగ్గరకు వస్తుంది. బ్రతుకంటే విరక్తి చెందిన వ్యక్తీ కృష్ణవేణి. ఉద్యోగ వేటలో ఎక్కడో తిరుగుతున్న ఇందిర, లక్ష్మీల అన్నయ్య ఇంకా రాలేదని కంగారుపడతారు. ఎవరూ లేని ఒంటరి జీవితం ఎందుకనుకొని యువకుడు ప్రాణత్యాగం చేయాలనుకుంటూ రోడ్డుమీదకు వస్తాడు. ఇంతలో కారుప్రక్కగా పడిన నీడలా కనిపించిన వ్యక్తిని చూస్తారు లక్ష్మీ, ఇందిరలు. అన్నయ్యా అంటూ అరుస్తారు. తాతగారు దగ్గరగా వెళ్ళి చూసి లేవదీస్తాడు. కారుక్రింద పడి చనిపోదాం అనుకున్నది అంతా చెడిపోయిందని బాధపడతాడు. వెంటనే తాతగారు మీరంతా దగాపడ్డ తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూను చావడానికి లక్ష కారణాలుంటే, బ్రతకటానికి కోటి కారణాలుంటాయి. నా సమస్యల ముందు మీ సమస్యలు ఏ మాత్రం. .బ్రతకటంలో ఉండే మాధుర్యం మీకు తెలియదు. ముందు మీరందరూ ధైర్యంతో బ్రతకండి.
ఏ కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉంది. అంతమాత్రాన మనల్ని మనమే అసహ్యించుకోకూడదు. జీవితంలో ఆనందాన్ని పోల్చుకోండి. దేనికి భయపడకండి. మీకందరికి బ్రతకడం నేర్పిస్తానని అంటాడు తాతగారు. ఇంతలో లాంతరు వెలుగులో కాఫీ తలా ఓ గ్లాసు తాగమంటాడు తాతగారు. వారందరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. గ్లాసు కాఫీ అణా. అలాగే వారందరిలో ఆశ ఖరీదు అణాగా పాత జ్ఞాపకాలు, ఆశలు చిగురిస్తాయి. అందరూ తాతగారి గొప్పతనానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
4. ‘తెరచిన కళ్ళు’ నాటిక ద్వారా రచయిత అందించిన సందేశాన్ని వివరించండి.
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను, తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.
విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.
ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం.. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయ పడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడతాడు.
ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్కి. విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.
చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొందమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే నాకీ అవస్థ వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.
భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే డాక్టర్కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినందించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు. డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.
V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)
1. దుర్మతి కిహముం బరముఁ గలదె.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.
సందర్భం : : ఈ మాటలు పతివ్రత అయిన భార్యను అవమానించకూడదని చెబుతూ శకుంతల దుష్యంతుడితో పలికిన సందర్భంలోనిది.
భావం : భార్యను గౌరవించని దుష్టుడికి ఇహపర సుఖాలు ఉండవని భావం.
వ్యాఖ్య : దుష్యంత మహారాజు గాంధర్వ పద్ధతిలో వివాహం వల్ల భార్య అయిన శకుంతలనూ, ‘పుత్రుడైన భరతుణ్ణి గుర్తించలేదు. అపుడు శకుంతల దుష్యంతుడికి గార్హస్థ్య ధర్మాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని వివరించింది. పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టుడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం ఉండదని శకుంతల దుష్యంతుడికి వివరించింది.
2. కౌరవులెల్ల గతి చెడి పడినట్టి కష్టముల్ వినమె !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కలహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సంధర్భంలోనిది.
భావము : పూర్వం యుద్ధం వల్ల కౌరవులంతా నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! అన్నదమ్ములైన మీరు ఇరువురూ కలసిమెలసి ఉంటే ఎంతో లాభం. గొప్పకీర్తి సాధించవచ్చు. యుద్ధం వల్ల అంతా నష్టమే జరుగుతుంది. పూర్వం కౌరవులంతా యుద్ధం వల్ల నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.
3. పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కన్యక ప్రాణత్యాగం తరువాత రాజుకు శాశ్వతమైన అపకీర్తి కలిగిందని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోవి.
భావం : కథలు కథలుగా చెప్పుకొనే కన్యక కీర్తి, రాజు అపకీర్తి పదాలలోనూ, పద్యాలలోనూ, శాశ్వతంగా నిలిచిపోయాయి అని భావం.
వ్యాఖ్య : కన్యక ప్రాణత్యాగం చేసిన చోట ఆమె కీర్తికి గుర్తుగా ఒక ఆకాశసౌధం వెలిసింది. తర్వాత పట్టణాన్ని ఏలే రాజు మరణించాడు. అతని కోటపేటలు మట్టిలో కలిసి పోయాయి. సాహిత్యంలో పదాలుగా, పద్యాలుగా కథలు కథలుగా కన్యక, కీర్తి, రాజు అపకీర్తి శాశ్వతంగా నిలిచిపోయాయి.
4. కోకిల మేధం సాగుతున్నది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము : అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న కవి ఈ గేయం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భంలోనిది.
భావము : ఆడదానికంటే అడవిలో మానుకే విలువనిస్తున్న సమాజం మనది. కట్నం కోసం కోడలి బ్రతుకును నాశనం చేసిన అత్తమామలు రాక్షసులా? పిశాచాలా? ఆకలి తీర్చుకోవటానికి లేళ్ళను చంపే పులులున్న ఈ దేశంలో, కట్నం కోసం కోకిలల వంటి కోడళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారని ఇందలి భావం.
VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
1. పురుషుని కార్యాలను ఎల్లప్పుడు చూసేవి ఏవి ?
జవాబు:
ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే వేదాలు; నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలు; ధర్మం; ఉదయం, సాయంత్రం అనే రెండు సంధ్యలూ; హృదయం; యముడు; చంద్రుడు; సూర్యుడూ; రాత్రీ; పగలూ అనే మహాపదార్థాలు పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాయి.
2. మొల్లను గురించి వ్రాయండి.
జవాబు:
తేనె నోట్లో వేసుకుంటే తియ్యగా అనిపించే విధంగా తేట మాటలతో తెలుగులో రామాయణం రాసిన గొప్ప కవయిత్రి మొల్ల. మొల్ల రామాయణము తెలుగులో బహుళ ప్రజాదరణను పొందింది. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. కాలం క్రీ.శ. 16వ శతాబ్ది. తండ్రి ఆతుకూరి కేసన.
ఈమె గోపవరపు శ్రీకంఠమల్లేశుని వరప్రసాదంతో కవిత్వం నేర్చుకొంది. మొల్ల తన రామాయణాన్ని శ్రీరామునికే అంకితం చేసిన ధన్యజీవి, కవయిత్రి మొల్ల.
3. కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి ?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!. అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.
ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులు పోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయేమోనన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి బావితరాలకుండకూడదని, స్త్రీ జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.
4. మనిషి జీవితం వస్తువులా ఎలా మారిపోతుంది ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడకు పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. నేటి కాలంలో మనిషి జీవితం ఒక వస్తువులా మారిపోయిందని అద్దేపల్లి వారు ఆవేదన చెందారు.
ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. ప్రతి రోజూ ఎన్నో వస్తువులు విదేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. వీటి వలన మన సంస్కృతి సంపద, సొంతముద్రలు చెరిగిపోతున్నాయి. మనం స్వదేశీ ఉత్పత్తులను వదిలేసి విదేశీ వస్తువుల మోజులో టి.వి., ఏ.సి. మొదలగు వస్తువులపై శ్రద్ధపెడుతున్నాము. విదేశీ వస్తువులను ఆదరించినట్లుగా స్వదేశీ వస్తువులను ఆదరించటం లేదు. పూర్వం మన వారు అవసరమైన వస్తువులనే కొనేవారు. ఇప్పుడు తన స్థాయిని సంఘంలో పెంచుకోవాలన్న తాపత్రయంతో విదేశీ వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా హోదా కోసం కొంటున్నారు. ఆ వస్తువులు తమ ఇంట్లో లేకపోతే పరువుపోతుందన్న భావనతో నేటి మనిషి ఉంటున్నాడు. ఇలా మనిషి జీవితం వస్తువులా మారిపోయే ప్రమాదం ఉందని అద్దేపల్లి వారు భావించారు.
VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
1. చదరంగం గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వములు అను సంపుటం నుండి గ్రహించబడింది.
చదరంగం భారత జాతీయక్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించినది భారతదేశమే ! పూర్వం దీనిని అష్టాపదమని పిలిచేవారు. మనదేశం నుండి ఈ ఆట పర్షియా, అరేబియా, తూర్పు చైనా దేశాలకు వ్యాపించింది. 10వ శతాబ్దం చివరిలో అరబ్బులు ఈ ఆటను స్పెయిన్ దేశానికి తీసుకుపోయారు. 11వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం అయింది. ఈ ఆటను పూర్వం ఉన్నత కులాలవారు మాత్రమే ఆడేవారు. విజయనగర ప్రభువు కృష్ణదేవరాయలు ఈ ఆటను అమితంగా ప్రేమించారు. ఆయన బొడ్డుచర్ల తిమ్మనతో ప్రతిరోజూ ఆడేవారట. రాయల తరపున ఎందరు ఆడినా ఒక్కడే ఉండి తిమ్మన విజయం సాధించేవాడట. పూర్వం యుద్ధమునకు వెళ్ళే సమయాన ఈ ఆటను ఆడి ఎత్తులకు పై ఎత్తులు వేసేవారని చరిత్ర తెలియజేస్తుంది. ఈనాడు చదరంగం ప్రపంచ క్రీడలలో చేరింది. ఇప్పటికి కూడా ముందుగానే చెప్పి ఆట కట్టించగల క్రీడాకారులు తెలుగుదేశాన ఎందరో ఉన్నారు.
2. స్ఫూరిశ్రీ సాహిత్య కృషిని తెల్పండి.
జవాబు:
అర్థ విపరిణామము అను పాఠ్యభాగం స్ఫూర్తి శ్రీ చే రచించబడిన తెలుగు భాషా చరిత్రలోని అర్థప్రకరణం నుండి గ్రహించబడింది. వీరు శాస్త్ర గ్రంథాలను సరళతరం చేసి తెలుగు జాతికి అందించారు. స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకల భాస్కరరావు. స్ఫూర్తిశ్రీ జనవరి 5, 1928న కాకినాడలో వీరాయమ్మ, బుచ్చిరాజులకు జన్మించారు. కాకినాడ పిఠాపురం రాజావారి విద్యా సంస్థలలో పాఠశాల కళాశాల చదువును పూర్తిచేసి ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి బి.ఏ ఆనర్స్ చేశారు.
స్ఫూర్తిశ్రీ రచనలు : భోజుని సరస్వతీ కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానం మూడు భాగాలు, జయదేవుని చంద్రాలోక సమున్మేషణానికి తెలుగులో, అర్థవివరణము. క్షేమేంద్రుని ఔచిత్య సంప్రదాయానికి చారిత్రక సమీక్ష, బాల పౌఢ వ్యాకరణాల వ్యాఖ్య, తెలుగు భాషా చరిత్రను వ్రాశారు. ఇవేకాక స్ఫూర్తిశ్రీ ‘స్ఫూర్తిశ్రీ వ్యాసావళి’ అను పేర రెండు సాహితీ సంపుటాలను రచించారు. వీరి సరళ సులభమైన గ్రంథాలను చదివి విద్యావంతులైన వారెందరో తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. తెలుగు భాషను సులభతరం చేసి విశేష కృషిచేసిన సాహితీ వేత్త స్ఫూర్తి.
3. ఖడ్గ తిక్కనకు సంబంధించిన చాటు వృత్తాంతాన్ని తెలపండి..
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా. సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని చాటువుల నుండి గ్రహించబడింది.
కవి ఎవరో తెలియని ఖడ్గ తిక్కనకు సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. ఖడ్గ తిక్కన మనుమసిద్ధి పక్షాన నిలిచి కాటమరాజు నెదిరించిన మహావీరుడు. అతడు యుద్ధంలో -భీకరంగా పోరాడి తన సేనలు చెల్లాచెదురై పారిపోగా యుద్ధాన్ని విరమించి ఇంటిముఖం పట్టాడు. అతడి భార్య నులకమంచాన్ని అడ్డుగా పెట్టి దానిమీద పసుపుముద్ద నుంచి ప్రక్కన నీళ్ళ చెంబు పెట్టిందట. ఇదేమిటని అడగ్గా
“పగరకు వెన్నిచ్చినచో
నగరేనిను మగతనంపు నాయకు లెందున్
ముగురాడు వార మైతిమి.
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.”
అని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడింది. ఆ తరువాత ఖడ్గతిక్కన తల్లి అన్నంలో విరిగిన పాలు పోసిందట. ఇదేమిటని ప్రశ్నిస్తే
కసవున్ మేయగ బోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్
అని ఆక్షేపించింది. ఆ మాటలకు సిగ్గుపడి లేచి యుద్ధమునకు పోయి వీర స్వర్గము నలంకరించాడు. ఈ చాటు పద్యాల వలన చరిత్రను తెలుసుకునే వీలు కలిగింది.
4. పాకుడు రాళ్ళు నవలను గురించి వ్రాయండి.
జవాబు:
‘నా జీవిత యాత్ర’ పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తరూపం.
భరద్వాజ అంతగా చదువుకోలేదు. ఆయన 8వ తరగతిలోనే చదువుకు కుటుంబ దారిద్ర్యం వల్ల స్వస్తి చెప్పాడు. తనకు తన వూరిలో జరిగిన అవమానం వలన చదువుపై శ్రద్ధపెట్టి తన వూరి గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాలను ఔపోసన పెట్టారు. తనకు గ్రంథాలయంలో చదువుకునేందుకు సహాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లు గారి ఋణం తీర్చుకోవటం కోసం 1965సం||లో ‘పాకుడు రాళ్ళు’ నవల వ్రాసి ఆయనకు అంకితం చేశాడు. భరద్వాజ 1956లో మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా నేర్చుకున్నారు. వందలాది మంది రచయితలతో కవులతో పత్రికా సిబ్బందితో, సినీరంగ ప్రముఖులతో పరిచయాలు. ఏర్పడ్డాయి. ఊహకు అందని విషయాలను కూడా అక్కడ ఆయన ఎదుర్కొన్నారు. ఆ సినీరంగం ఆధారంగా చేసికొని అక్కడ ఉండే ప్రతి మనసును అర్థం చేసుకుని “పాకుడు రాళ్ళు” నవలను రచించారు. ఆ నవలలోని అన్ని పాత్రలు ఆయనకు పరిచయం అయినవే. అన్ని సంఘటనలు ఆయనకు తెలిసిన వారి జీవితాలలో నుండి ఎన్నుకున్నవే ! చివరకు ఆ నవలే ఆయనకు జ్ఞానపీఠ అవార్డును అందించింది. దురదృష్ట మేమంటే ఆయన ఆ మెమెంటోను కళ్ళారా చూసుకోక మందే అక్టోబరు 18, 2013న కాలం చేశారు.
VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
1. నన్నయ రచించిన వ్యాకరణ గ్రంధం పేరేమిటి ?
జవాబు:
ఆంధ్ర శబ్దచింతామణి.
2. ఖర దూషణాదులు హతమైన చోటేది ?
జవాబు:
కార్యమపూడి.
3. అర్క సంభవుడెవరు ?
జవాబు:
సుగ్రీవుడు.
4. సమ సమాజం కావాలంటే ఏం చేయాలి ?
జవాబు:
స్త్రీలలో చైతన్యం తీసుకురావాలి.
5. ప్రపంచ వ్యాపారం ఎలాంటిది ?
జవాబు:
వైకుంఠ పాళీ ఆటలాంటిది.
6. బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి ?
జవాబు:
మలిదేవరాజు మంత్రి.
IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
1. కృష్ణదేవరాయల ఆస్థానంలో చదరంగ ప్రావీణ్యుడెవరు ?
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన.
2. భోజుని రచన ఏది ?
జవాబు:
సరస్వతీ కంఠాభరణము.
3. సినారేకి జ్ఞానపీఠ అవార్డును అందించిన కావ్యమేది ?
జవాబు:
విశ్వంభర.
4. ప్రాచీన నాటకాలలో హాస్య పాత్ర ఏది ?
జవాబు:
విదూషకుడు.
5. పాకుడు రాళ్ళు నవల ఎవరికి అంకితం చేశారు ?
జవాబు:
కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి.
6. ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అన్న గేయ రచయిత ఎవరు ?
జవాబు:
చిలకమర్తి లక్ష్మీకాంతం.
X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)
1. తెలుగులో భాషాభాగాలు ఎన్ని ?
జవాబు:
తెలుగులో భాషాభాగాలు 5. అవి : 1) నామవాచకము 2) సర్వనామము 3) విశేషణము 4) క్రియ 5) అవ్యయము.
2. క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని సూచించే పదాన్ని క్రియ అంటారు.
3. తిరుపతి గొప్ప యాత్రా స్థలం – విశేషణాన్ని గుర్తించండి.
జవాబు:
‘గొప్ప’ ఈ వాక్యంలోని విశేషణం.
4. అవ్యయం అంటే ఏమిటి ?
జవాబు:
లింగ, వచన, విభక్తులు లేని పదాలు.
5. సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి బదులుగా వాడబడే పదాన్ని సర్వనామం అంటారు.
XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)
1. సామాన్య వాక్యానికి ఉదాహరణ.
జవాబు:
గాంధీజీ మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు.
2. వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
అర్థవంతమైన పదముల సముదాయం.
3. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు. ఇది ఎటువంటి వాక్యం ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.
4. పాపాలరావు అవినీతిపరుడు. పాపాలరావు నీతి గురించి మాట్లాడుతాడు. సంయుక్త వాక్యం వ్రాయండి.
జవాబు:
పాపాలరావు అవినీతిపరుడు కాని, నీతిని గురించి మాట్లాడతాడు.
5. క్రియా రహిత వాక్యానికి ఉదాహరణ రాయండి.
జవాబు:
రాజు అహంకారి.
XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)
1. మత్తేభము
జవాబు:
మత్తేభము: మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా అంటారు. మత్తేభం అంటే మదించిన ఏనుగు అని అర్థం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1 – 14 అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
యతి మైత్రి : 1వ అక్షరమైన ‘క’ లోని అ కు 14వ అక్షరమైన ‘క్ష’ లోని క కు యతి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘డ’ కారం ప్రాసగా ఉంది.
2. చంపకమాల
జవాబు:
చంపకమాల అంటే సంపెంగ పూలమాల అని అర్థం. ఈ పద్యం అంత హృదయంగమంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు.
లక్షణాలు : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటె ఎక్కువ పాదాలు రాస్తే దానిని చంపకమాలిక అంటారు) ప్రతి పాదంలోను వరుసగా ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే అన్ని పాదాలు ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
యతి మైత్రి : 1-11 అక్షరాలైన ‘జ’ లోని అ కు ప్రాసాక్షరం : ‘న’ అనే హల్లు ప్రాసగా ఉంటుంది.
3. తేటగీతి
జవాబు:
తేటగీతి ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు ఉండాలి. ప్రతి పాదంలోను 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రాసనియమం లేదు..
యతి మైత్రి : 1 – 4 గణాలు మొదటి అక్షరాలైన ‘ప’, ‘బా’ లకు సరిపోయింది.
XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)
1. శార్దూలంలో గణాలు ఏవి ?
జవాబు:
మ, స, జ, స, త, త, గ.
2. ఉత్పలమాలలో యతిస్థానం ఎంత ?
జవాబు:
10వ అక్షరం.
3. ఇంద్రగణాలేవి ?
జవాబు:
నల, నగ, సల, భ, ర, త.
4. కందపద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ?
జవాబు:
‘జ’ గణం.
5. ఉపజాతులలో ఏ నియమం ఉండదు ?’
జవాబు:
ప్రాస నియమం ఉండదు.
6. చంపకమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
21 అక్షరాలుంటాయి.
XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)
1. రూపకము
జవాబు:
రూపకము: ఉపమేయానికీ, ఉపమానానికీ అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేదని చెప్పినట్లయితే అది రూపకాలంకారం.
‘అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాడు’.
ఈ ఉదాహరణలో, అతడు తప్పుచేసి, చేసిన తప్పును తెలిసికొని, పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలిపోతున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపాగ్ని అనే సమాసంలో, పశ్చాత్తాపము అనేది ఉపమేయం. అగ్ని అనేది ఉపమానం. రెండింటికీ భేదం లేదని చెప్పడం వల్ల ఇది రూపకాలంకారం. 1. రుద్రమ్మ చండీశ్వరీ దేవి. 2. సంసార సాగరం.
2. స్వభావోక్తి
జవాబు:
స్వభావోక్తి: జాతి గుణ క్రియాదుల చేత ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం.
‘ఒడలందెల్ల విభూతిపూత, పులితోలొడ్డాణ, మల్లాడు కెం
జడ, లాత్మైక విచార నిశ్చల దృగఙ్ఞాతంబు, లచ్చైన క
చ్చడ మంసంబున, రుండమాల, గళదేశ స్థాణువుం గ్రాలగా …..
పై పద్యంలో పరమశివుని రూపం యథాతథంగా వర్ణించబడింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.
ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగాల్లో ఈ క్రింది పద్యాలలో గల స్వభావోక్తులను గమనించండి.
1. ‘నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు – ధవళాబ్జ పత్ర నేత్రములవాడు’
ఈ పద్యంలో కవయిత్రి మొల్ల శ్రీరాముని అత్యంత సహజంగా అద్భుతంగా వర్ణించింది.
2. ‘నిడుద పెన్నెరి వేణి జడలుగా సవరించి మలిన జీర్ణాంబరంబొలియగట్టి ఈ పద్యంలో సీతాదేవి స్థితి అత్యంత సహజంగా చిత్రించబడింది.
3. వృత్త్యనుప్రాస
జవాబు:
వృత్త్యనుప్రాస: ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం.
ఇలా ఒకే హల్లు పలుమార్లు రావడాన్ని ‘ఆవృత్తి’ అంటారు.
ఉదాహరణ :
‘విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు’
ఇందులో ‘ష్ణు’ అనే సంయుక్తాక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాస.
అలాగే
ఉదాహరణలు :
1) ‘కాలువలన్నియు గలగల పారెను’ (ల అనే హల్లు ఆవృత్తి అయ్యింది)
2) ‘చిటపట చినుకులు పటపట కురిసెను’ ! – ”ట’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.
XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)
1. ఊహ ప్రధానంగా ఉండే అలంకారమేది ?
జవాబు:
ఉత్ప్రేక్షాలంకారం.
2. రెండు హల్లులు వెంటనే వస్తూ అర్థభేదం కలిగి ఉండే అలంకారమేది ?
జవాబు:
ఛేకానుప్రాస.
3. ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి – దీనిలో అలంకారమేది ?
జవాబు:
అతీశయోక్తి.
4. సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్థించే అలంకారమేది ?
జవాబు:
‘అర్థాంతరన్యాస’ అలంకారం.
5. అలంకార ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
అందంగా అర్థమయ్యేటట్లు చెప్పటం.
6. వలె, పోలె, అట్లు, లాగ
జవాబు:
ఉపమావాచకాలు అంటారు.
XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)
భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడు డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్. భారతరత్నగా, భారత క్షిపణి పితామహుడుగా, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలామ్. విద్యార్థి దశలో సగటు విద్యార్థి. మంచి అలవాట్లతో, కచ్చితమైన క్రమశిక్షణను పాటించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక, స్త్రీలను, గురువులను ఇతర పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందిన వాడైనా హిందూ, క్రైస్తవ, సిక్కు వంటి సర్వమతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలామ్ ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని; చిన్న చిన్న లక్ష్యాలు నేరమని విద్యార్థులకు సందేశమిచ్చాడు. వీరి జన్మదినమైన అక్టోబరు 15వ తేదీని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
జవాబు:
డా|| ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత క్షిపణి పితామహుడు. మనదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగటానికి ఆయనే కారకుడు. రాష్ట్రపతిగా దేశ విలువలను కాపాడారు. మంచి అలవాట్లతో క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం తెలిసివారు. గొప్ప లౌకికవాది. ఆయనకు పుస్తకమంటే ఇష్టం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు కలాం. వీరి జన్మదినం అక్టోబరు 15, ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.