AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 9 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. ‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో’నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్.
జవాబు:
ప్రతిపదార్థం :
గొనకొని = అతిశయించి
వీఁడు = = ఈ భరతుడు
నీకును = నీకూ
శకుంతలకున్ = శకుంతలకూ పుట్టిన
ప్రియనందనుండు = ముద్దుబిడ్డడు
ఈతనిన్ = ఈ పుత్రుణ్ణి
చేకొని = స్వీకరించి
భరియింపుము = పోషించు
సాధ్వి = ఇల్లాలు
సత్ + వినుత = ఉత్తములచేత కీర్తింపబడిన
మహాపతివ్రత = గొప్ప పతివ్రత అయిన
శకుంతల = శకుంతల
వివేకముతోన్ = వివేకంతో
సత్యము + పల్కెన్ = నిజం చెప్పింది
అని = అని
తత్, సభాసదుల్ = ఆ సభలో ఉన్నవారు
విస్మయము + అందఁగన్ = ఆశ్చర్యపడగా
దివ్యవాణి = ఆకాశవాణి
ధరా + అధినాదునకున్ = ఆ దుష్యంత మహారాజుకు
వినిచెన్ = వినిపించింది.

తాత్పర్యం : ‘ఓ రాజా ! ఈ భరతుడు నీకూ శకుంతలకూ ముద్దు బిడ్డ. ఈతణ్ణి స్వీకరించి పోషించు. ఇల్లాలు, ఉత్తమ కీర్తి కలిగినది, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజమే చెప్పింది’ అంటూ ఆకాశవాణి ఆ సభలోనివారంతా విని ఆశ్చర్యపడేటట్లు దుష్యంత మహారాజుకు చెప్పింది.

2. ‘ఉరుతరాటవిలోన మహోగ్రతపము
వాయుదేవుని గుఱియించి వరుసఁ జేసి
యంజనాదేవి గనియె నన్నర్థతోడ
నర్కజుని మంత్రి హనుమంతుఁడండ్రు నన్ను.
జవాబు:
ప్రతిపదార్థము :
అంజనాదేవి = అంజనాదేవి
ఉరుతరాటవిలోనన్;
ఉరుతర + అటవిలోనన్ = గొప్ప అడవిలో
మహోగ్రతపమున్ తోడ = గొప్ప భయంకరమైన తపస్సును
అర్థితోడన్ = భక్తితో
వాయుదేవుని గుఱియించి = వాయుదేవుని గురించి
వరుసన్ + చేసి = చాలాకాలం చేసి
నన్నున్ = నన్ను
కనియెన్ = పుత్రుని కన్నది
అరజుని మంత్రిన్ = (నేను) సుగ్రీవునికి మంత్రిని
నన్నున్ = నన్ను
హనుమంతుడు = హనుమంతుడు
అండ్రు = అంటారు

తాత్పర్యము : అంజనాదేవి గొప్ప అరణ్యములో వాయుదేవుడిని గురించి చాలాకాలం భక్తితో గొప్ప తపస్సును చేసి నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని, నన్ను ‘హనుమంతుడు’ అని పిలుస్తారు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. సత్యప్రాశస్త్యాన్ని గురించి శకుంతల ఏమని పలికింది ?
జవాబు:
పరిచయం : పవిత్రమైన వేదార్పాలను ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో ఆకట్టుకొనే కథల రూపంలో రచించబడ్డ మహాభారతం పంచవేదంగా ఖ్యాతి పొందింది. భారతంలో రాజధర్మాలు, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు మొదలైన ఎన్నో అంశాలు మనోహరంగా వర్ణించబడ్డాయి. వేదం అంటే సత్యం అని కూడా అర్థం. ప్రస్తుత సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలో సత్యము గొప్పదనాన్ని శకుంతలచేత అపూర్వంగా చెప్పించాడు నన్నయ.

శకుంతలా దుష్యంతులు : వేటకోసం అడవికి వెళ్ళిన దుష్యంత మహారాజు కణ్వమహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ శకుంతల సౌందర్యాన్ని చూసి మోహించాడు. ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేడు. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకున్నాడు. దుష్యంతుని వల్ల గర్భం దాల్చిన శకుంతల భరతుడికి జన్మనిచ్చింది. కణ్వమహర్షి శకుంతలనూ, భరతుణ్ణి దుష్యంతుడి దగ్గరకు పంపించాడు. కానీ నిండు సభలో దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియదు పొమ్మన్నాడు. అబద్ధమాడ సాహసించిన దుష్యంతుడికి శకుంతల సత్య ప్రాశ్యస్త్యాన్ని గురించి ఇట్లా వివరించింది.

సత్య ప్రాశస్త్యం : ‘ఓ రాజా ! అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియనివాడిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు ? నేను తప్ప ఇతరులు ఎవరూ. సాక్షులు లేరని ధర్మాత్ములైనవారు అబద్ధమాడకూడదు. ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే నాలుగు వేదాలూ, నింగి, నేల, – నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలూ ; ధర్మం, ఉదయం, సాయంత్రం అనే రెండు సంధ్యలూ, హృదయం, యముడు, చంద్రసూర్యులు, రాత్రీపగలూ అనే మహా పదార్థాలు మనిషి నడవడికను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. ఆ మహా పదార్థాలు ఉండగా సత్యాన్ని ఎవరూ దాచలేరు.

సత్యమే వ్రతంగా గలిగిన ఓ రాజా ! నూరు మంచి నీటి బావులకంటే ఒక దిగుడు బావి మేలు. నూరు దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి నూరుగురు పుత్రులకంటే ఒక సత్య వాక్యం మేలైనది. అంతేకాక ఒక త్రాసులోని తక్కెడలలో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉంచి తూచితే ముల్లు సత్యంవైపే మొగ్గుచూపుతుంది.

తీర్థాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటంకానీ సత్య వ్రతానికి సాటిరావు. ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు.

ముగింపు : ఇట్లా సత్య ప్రాశస్త్యం గురించి ఎన్ని విశేషాలు చెప్పినా దుష్యంతుడు శకుంతలను భార్యగా అంగీకరించలేదు. పైగా ఆమెను తిరిగి ఆశ్రమానికి పొమ్మన్నాడు. శకుంతల దుఃఖంతో వెనుదిరుగుతున్న వేళ ఆకాశం నుంచి దివ్యవాణి మాటలు వినిపించాయి. సత్యమే జయించింది. · శకుంతలను పట్టమహిషిగా స్వీకరించాడు. దుష్యంతుడు భరతుణ్ణి వెత్తుకొని ముద్దాడాడు. యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. పరమసాధ్విగా, కీర్తిమంతురాలుగా, మహాపతివ్రతగా శకుంతల దేవతలచే ప్రశంసించ బడింది.

2. రాజు కన్యకను చెరపట్టటానికి ఎలా ప్రయత్నించాడు ?
జవాబు:
పరిచయం : గురజాడ అప్పారావు రచించిన ‘కన్యక’ అనే కవితాఖండికలో ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టడానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు వర్ణించబడ్డాయి.

రాజు దౌర్జన్యం : ఒక సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఒకసారి ఆమె బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి నుదుటున కుంకుమ పెట్టుకొని పూజ కోసం గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పాలు, పండ్లు, పూలు మొదలైన పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది. చుక్కల్లో చంద్రునిలాగా వెలుగుతున్న ఆమెవంటి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు. ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరుపొందాలని భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించబోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది.

సెట్టి వేడుకోలు : రాజు దౌర్జన్యాన్ని గమనించిన కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు. “రాజా ! నువ్వు నా కూతుర్ని బలవంతం చేయవలసిన పనిలేదు. నువ్వు ఈ దేశానికి రాజువు. కనుక ఈ కన్యక కూడా నీ సొత్తే. నా కూతుర్ని నువ్వు కోరుకోవటం కంటే నాకు అదృష్టం ఏముంటుంది ? నువ్వు దయతో మా మనవి ఆలకించాలి. మా కులం వారికి ఒక ధర్మం ఉన్నది. నువ్వు ఆ ధర్మాన్ని గౌరవించాలి. అగ్నిసాక్షిగా నా కూతుర్ని పెళ్ళి చేసుకో. నీకు కావలసినన్ని కానుకలు సమర్పించుకుంటాను. మా జాతి ధర్మాన్ని కాపాడు” అని సెట్టి రాజును వేడుకున్నాడు.

రాజు అహంకారం : సెట్టి మాటలు విని, రాజు ఎగతాళిగా నవ్వి ఇట్లా అన్నాడు. “రాజ్యాన్ని పాలించే రాజుకు ధర్మశాస్త్రాన్ని ఒక సెట్టి నేర్పించడమా ? అసలు రాజు అనుకున్నదే ధర్మం. రాజు చెప్పినదే శాస్త్రం. గాంధర్వం అనే వివాహ పద్ధతి రాజకుమారులకు ఆమోదయోగ్య మైనదేననే విషయం తెలియదా? కనుక ఆలస్యం వద్దు. బాధపడనూ వద్దు. ఇవాళ, రేపు అంటూ గడువులు పెట్టవద్దు. నీకు ఇష్టమైతే నీ కూతుర్ని ఇవ్వు. లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ తాను పట్టిన పిట్టను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా నీ కూతుర్ని విడిచిపెట్టను. ఆమె ఇక నీ ఇంటికి తిరిగిరాదు. నువ్వు ఇస్తానన్న కానుకలను ఇక్కడికే తీసుకొని రా ! నువ్వు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను” అని రాజు తన అహంకారాన్ని ప్రదర్శించారు. అపుడు సెట్టి “రాజు పనికంటే దేవుని పూజ ముఖ్యమైనది కదా ! మీరు దయచూపితే నేను మా కులదైవమైన వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళి పూజ పూర్తిచేసుకొని వస్తాను” అని రాజును అనుమతి కోరాడు. అపుడు “మేము కూడా నీతోపాటు గుడికి వస్తాం” అక్కడే అగ్నిసాక్షిగా కన్యకను స్వీకరిస్తాం” అంటూ రాజు కూడా గుడికి బయలుదేరాడు.

ముగింపు : ఈ విధంగా రాజు కన్యకను చెరపట్టడానికి ప్రయత్నించాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. వేమన పద్యాలలో హాస్యాన్ని వివరించండి?
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు” అను ఏడవ ఉపన్యాసమునకు సంక్షిప్త రూపం.

వేమన కవిత్వానికి బలము, భాగ్యము హాస్యము. హాస్యాన్ని పండించటం చేత వేమన కవితకు ప్రజాదరణ లభించింది. పూర్వము హాస్యాన్ని పండించే పాత్రగా విదూషకుడుండేవాడు. ఆ హాస్యం అసహ్యానికి ప్రతీకగా ఉండేది. తెలుగు భాషకు హాస్యరసాన్ని అద్భుతంగా అందించిన వాడు గురజాడ. కన్యాశుల్కం దానికి ఉదాహరణ.

వేమన గొప్ప బోధకుడు, సంఘసంస్కర్త అక్కడక్కడా హాస్యం పండించటంలో అసభ్యత కన్పించినా మిగిలిన చోట్ల స్వచ్ఛమైన హాస్యరచన చేశాడు.
“పాలసాగరమున పవ్వళించువాఁడు
గొల్లయిండ్ల పాలు కొరనేల”
అని ప్రశ్నవేసి ఇవి బూటక పురాణాలని తేల్చేశాడు. అలాంటి భావనకు కొద్దిగా హాస్యాన్ని జోడించి “ఎదుటివారి సొమ్ము లెల్లవారికి తీపు” అని కొట్టి వేశాడు. ఇది విన్నప్పుడు ఎంతటి కృష్ణ భక్తుడైనా నవ్వకుండా ఉండడు. వేమన రచనలలో సునిసితమైన హాస్యం తొంగి చూస్తుంది. శ్రోతలకు, పాఠకులకు నవ్వు కలిగించటానికే కొన్ని కొసరు మాటలను చేర్చి హాస్యాన్ని పండించాడు.

“గొడ్డుటావును పితికినట్లు, మేక మెడ చన్ను గుచినట్లు” అని చెప్పిన లోభివాని గుణాలను అర్థం చేసుకోవచ్చు కాని హాస్యాన్ని జోడించాలి కదా! అందుకే “పండ్లు రాలదన్ను పాలనీదు” అని కొసరు మాటలను చేర్చి హాస్యాన్ని పండించ వేమన ప్రయత్నించాడు.

2. పాకుడు రాళ్ళు నవల గురించి వ్రాయండి ?
జవాబు:
‘నా జీవిత యాత్ర’ పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తరూపం.
భరద్వాజ అంతగా చదువుకోలేదు. ఆయన 8వ తరగతిలోనే చదువుకు కుటుంబ దారిద్ర్యం వల్ల స్వస్తి చెప్పాడు. తనకు తన వూరిలో జరిగిన అవమానం వలన చదువుపై శ్రద్ధపెట్టి తన వూరి గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాలను ఔపోసన పెట్టారు. తనకు గ్రంథాలయంలో చదువుకునేందుకు సహాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లు గారి ఋణం తీర్చుకోవటం కోసం 1965సం||లో ‘పాకుడు రాళ్ళు’ నవల వ్రాసి ఆయనకు అంకితం చేశాడు.

భరద్వాజ 1956లో మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా నేర్చుకున్నారు. వందలాది మంది రచయితలతో కవులతో పత్రికా సిబ్బందితో, సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఊహకు అందని విషయాలను కూడా అక్కడ ఆయన, ఎదుర్కొన్నారు. ఆ సినీరంగం ఆధారంగా చేసికొని అక్కడ ఉండే ప్రతి మనసును అర్థం చేసుకుని “పాకుడు రాళ్ళు” నవలను రచించారు. ఆ నవలలోని అన్ని పాత్రలు ఆయనకు పరిచయం అయినవే. అన్ని సంఘటనలు ఆయనకు తెలిసిన వారి జీవితాలలో నుండి ఎన్నుకున్నవే! చివరకు ఆ నవలే ఆయనకు జ్ఞానపీఠ అవార్డును అందించింది. దురదృష్ట మేమంటే ఆయన ఆ మెమెంటోను కళ్ళారా చూసుకోక మందే అక్టోబరు 18, 2013న కాలం చేశారు.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. ‘గవేషణ’ నాటికలో న్యాయమూర్తికి, మరణించిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ తెలుపండి ?
జవాబు:
మరణించిన. మానవుని ఆత్మను మరో ప్రపంచపు న్యాయస్థానానికి చేర్చారు మృత్యుదూతలు. అక్కడ రక్షకభటులు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి సమక్షంలో హాజరు పరిచారు ఆ మానవుణ్ణి. న్యాయమూర్తి వయస్సులేని, నేత్రాలు లేని ఒక స్త్రీ మూర్తి. ఎదురుగా ఉన్న మానవున్ని, ఉద్దేశించి “నాకు కళ్ళు లేవు అయినా చూడగలను. భూలోకంలో నీకింకా ఐదు సంవత్సరాల ఆయుర్ధాయం ఉంది. మా కార్యాలయంలో ఉన్న చిన్న ఉద్యోగి తప్పు లెక్కవల్ల మృత్యుదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు” అని అనగా “మీరు ధర్మప్రభువులు దేవతల పొరపాటువల్ల మానవులు బాధ పడుతున్నారు నేను బ్రతికున్నట్టా ? చనిపోయినట్టా? ఈ సందేహం నన్ను బాధిస్తోంది” అని మానవుడు ప్రశ్నించాడు. “మృత్యురాజ్యపు చట్ట ప్రకారం నీవు మృతి చెందావు. కనుకనే మా మృత్యుదూతలు నీ శరీరం నుండి ఆత్మను తొలగించారు. నీ కాగితాలు తెప్పించి పై అధికారులతో నీ విషయమై వాదించాను. ఇక్కడ వ్యవస్థలో ఏదో పొరపాటు జరిగిందనే అందరూ అనుకుంటున్నారు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయదలిచాను. నువ్వింక భూలోకానికి వెళ్ళిపోవచ్చు. జరిగిన పొరపాటుకు సిగ్గు పడుతున్నాను” అని న్యాయమూర్తి అన్నాడు. భగవంతుడు కూడా నీకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఉంటాడని అన్నాడు న్యాయమూర్తి. మీరు ధర్మదేవతను చూడలేదా అన్నాడు మానవుడు. భగవంతుడు కూడా ధర్మానికి అతీతుడు అయినా ఈ చర్చ అవసరం అని న్యాయమూర్తి సభ చాలించాడు.

పల్లెటూల్లో మానవుని ఆత్మను దిగవిడిచారు మృత్యుదూతలు. తన శరీరం కనిపించక ఆ మానవుని ఆత్మ అల్లాడిపోయింది. తిరిగి మరో ప్రపంచంలో తన శరీరం గురించి అడగడానికి నిశ్చయించుకుంది ఆత్మ. మరో ప్రపంచపు గోడల దగ్గర తచ్చాడుతున్న ఆత్మను అక్కడ ఒక

భటుడు చూస్తాడు. ఆ ఆత్మ వివరాలడిగి సాయం చేయదలచి న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళతాడు. తిరిగి ఎందుకొచ్చావని న్యాయమూర్తి మానవుని ఆత్మను ప్రశ్నించాడు. ధర్మదేవత నా జీవితం `ప్రసాదించినా నా శరీరాన్ని నా బంధువులు దహనం చేశారు. ఏ చెట్టు కొమ్మనో పట్టుకొని వేలాడలేను. నిన్న రాత్రంతా చాలా యాతనపడ్డాను. గబ్బిలం శరీరంలో ప్రవేశించాను. కాని గబ్బిలం బ్రతుకు దుర్భరం అనిపించింది. ఒక కప్పలో ప్రవేశించాను కాని బావిలో కప్ప జీవితం ఉక్కిరిబిక్కిరి అనిపించింది. మీరిచ్చిన ఐదేళ్ళు మీరే తీసుకోండి అని మానవుడు న్యాయదేవతకు విన్నవించుకున్నాడు. కొత్త జీవితం ప్రారంభిస్తావా ? అని అడిగాడు న్యాయమూర్తి తిరిగి భూలోకానికి ప్రయాణమయ్యాడు.

మృత్యుదూతలు తిరిగి మానవుణ్ణి పల్లెటూరికి తీసుకొనివెళ్ళారు. కాని అప్పటికే బంధువులు అతని శరీరాన్ని దహనం చేశారు. ఇంకా ఐదు సంవత్సరాలు ఆత్మకి శరీరం లేకుండా ఎలా జీవించాలో అర్థం కాలేదు. మళ్ళీ ధర్మదేవత దర్శనం అయితే బాగుండుననిపించింది. కాని ఈ లోకంలో ఉన్నతాధికారుల దర్శనం కావాలంటే ఎన్నెన్నో తిప్పలు పడాలి. ఇంక ఆ లోకంలో అధికారుల దర్శనం అంటే మాటలా ? ఇదేమిటీ ఉపద్రవం ? అని బాధపడ్డాడు మానవుడు. అయినా ఎక్కడో ఎవరో చేసిన పొరపాటుకి తానెందుకు బాధపడాలి ? మరల తన శరీరాన్ని తిరిగి ఇప్పించమని న్యాయమూర్తికి ఫిర్యాదు చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.

జీవన్మరణాల మధ్య అల్లాడుతున్న ఆత్మగా మిగిలిపోయానే అని దుఃఖిస్తూ మరో ప్రపంచం దగ్గరకు చేరుకుంది ఆత్మ. ఆ మానవుని దీనావస్థతో న్యాయమూర్తీ అన్న పిలుపుకి ఒక వ్యక్తి నవ్వు వినబడింది. ఆ నవ్విన వ్యక్తి ఎవరవయ్యా నీవు. అనగా ఇంకా 5 ఏళ్ళు ఆయుర్ధాయం ఉన్న ఆత్మను అని సమాధానం ఇచ్చాడు మానవుడు. సరే నీకేం సాయం కావాలి అన్నాడు నవ్విన వ్యక్తి. న్యాయమూర్తి చేసేది లేక మానవునికి పూర్ణ ఆయుష్షుని ఇచ్చాడు.

ఐదేళ్ళ కాలపరిమితిని తొలగిస్తూ నీ ఇష్టం వచ్చిన శరీరంలో ప్రవేశించి బ్రతక మంటాడు న్యాయమూర్తి. నన్ను జన్మదుఃఖపు చెర విడిపించండి అని వేడుకుంటాడు మానవుడు. తనకు జన్మరాహిత్యం గాని సృష్టించడంగాని తెలియవని అశక్తుడనని అంటాడు దేవతలే తమ అశక్తతను మానవుని దగ్గర తెలియజేస్తుంటే ఏమనాలో అర్థం కాలేదు మానవునికి. జరిగిందేదో జరిగింది ఏదో ఒక బ్రతుకు, ఎలాగో ఒక లాగా బ్రతుకుతాను భూలోకానికి వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాను. నేను మీ చేతిలో ఆటవస్తువును. మీరు మరొకరిచేతిలో ఆటవస్తువులు. ఇది అంతం లేనిది అంటాడు మానవుడు. ఇదే సృష్టి రహస్యం అని తెలియజేస్తాడు న్యాయమూర్తి.

దేవతల్లోను మానవులపైనా నాకు నమ్మకం పోతోందని మానవుడంటే దేవతలపై నమ్మకం శేకపోయినా మానవులపై, మానవత్వంపై విశ్వాసం సడలనీయకు అని న్యాయమూర్తి అంటూ జరిగిన షూ పొరపాటుకు క్షమించమని మానవుణ్ణి కోరుకుంటాడు. ఇక భూలోకంలో ఒక స్త్రీ అప్పుడే ప్రసవించిన శిశువును చూపిస్తాడు. ఆ మృతశిశువు శరీరంలో ప్రవేశిస్తాడు మానవుడు. అంతవరకు ఆరాటపడ్డ డాక్టర్లు, చనిపోయిన శిశువుని చూసి బోరుమన్న తల్లి తిరిగి శిశువు క్యారుమనడంతో ఆనందిస్తారు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని వ్రాయండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రఖ్యాత నేత్రవైద్యుడు. ఎంతోమంది కళ్ళులేనివారికి చూపును ప్రసాదించిన ప్రముఖ వైద్యుడు. పుట్టుగుడ్డి అయిన పాపకు ఆపరేషన్ చేసి వెలుగును ప్రసాదించాడు. ప్రమాదవశాత్తు పెళ్ళిలో కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి కళ్ళకు ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు.. తనవద్ద ఏళ్ళ తరబడి పనిచేస్తున్న డాక్టర్ సత్యం. విద్య నేర్పించమని ప్రాధేయపడతాడు. కాని తన వారసులకు మాత్రమే తన విజ్ఞానం అందాలనుకునే సంకుచిత మనస్కుడు సుదర్శన్. తనకు వారసుడు రాబోతున్నాడు అని తన విద్యను తన వారసునికే అందిస్తానని నిర్మొహమాటంగా సత్యానికి తెలియ జేస్తాడు. జయపురంలో రాజావారి దర్భారులో రాజుగారికి ఆపరేషన్ చేయాలని సత్యంతో సహా రైలులో బయలుదేరాడు. గాలికోసం కిటికీలు తెరిచాడు. అంతలో నిప్పురవ్వలు ఎగిరి కంట్లోపడి కళ్ళు పోగొట్టుకుంటాడు సుదర్శన్.

తన విద్యను ఇంకొకరికి నేర్పించి ఉంటే ఎంత బాగుండేదో అని చింతిస్తాడు సుదర్శన్. ఎంతోమంది మంది జీవితాల్లో వెలుగులు నింపిన తనకే బ్రతుకు చీకటి అయినందుకు డాక్టర్ డాక్టర్ భార్య విచారిస్తుండగా సత్యం ఆపరేషన్ చేస్తానని ధైర్యం చెప్తాడు. సత్యం నీకిది ఎలా సాధ్యం అని డాక్టర్ అడుగుతాడు. డాక్టర్కి తెలియకుండా ఆయన వ్రాసుకున్న నోట్సు దొంగతనంగా చదివినట్లు అదే విధంగా ఆపరేషన్ సమయంలో నర్సు వేషంలో ఒకసారి కిటికీ రంధ్రం ద్వారా మరొకసారి మీరు నిర్వహించే ఆపరేషన్ చూశాను. ఈ విధంగా మీ వద్ద విద్యను దొంగిలించినందుకు క్షమించమని అంటాడు సత్యం.

విద్య నా ఒక్కడి సొత్తు అని విర్రవీగాను. ఎంత ప్రాధేయపడినా నీకు నేర్పించడానికి నిరాకరించాను. అహంభావం, అహంకారంతో నా వారసులకే నా విద్య దక్కాలనుకున్నాను. భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు. సత్యం నీవు ధన్యుడవు. ప్రజల కొరకు సేవ చేయాలనే తపన గలవాడివి. నాకు ఈ నేత్ర చికిత్స చేసి చూపును ప్రసాదించడమే కాదు. ‘ అజ్ఞానంతో మూసుకుపోయిన నా మనోనేత్రాన్ని తెరిపించావు. నీ సంస్కారానికి కృతజ్ఞతలు అని అభినందించాడు సత్యాన్ని సుదర్శన్.

3. ‘ఆశ ఖరీదు అణా’ తాత పాత్ర స్వభావం.
జవాబు:
ఆశ ఖరీదు అణాలో తాత ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి. 33 సంవత్సరాలు సర్కారీ -నౌకరీ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఏదో చాలీచాలని పింఛను వస్తుంది. సంసారం చూస్తే గంపెడు. తొమ్మిదిమంది పిల్లలు. వారిలో ఇద్దరి అబ్బాయిలకు వివాహాలు అయినా నిరుద్యోగులుగా ఉంటారు. నలుగురు వివాహానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పిల్లల చదువులకు స్తోమత లేదు. కాలక్షేపంగా కొత్తగా వచ్చిన యువకునితో బాతాఖానీ వేస్తాడు. తాతగార్ని చూస్తే ఒక రకంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా ఏవో సమస్యలు ఉంటాయి. సమస్యలతో నిద్రరాక మేడపైకి వెడతాడు. ఇంకా నిద్రపోలేదా తాతగారు అని అడగ్గానే నువ్వు

ఎందుకు నిద్రపోలేదు నిద్రలో హాయిగా ఉంటుంది మెలకువలోనే భయాలు, బెంగలూ అని తనకున్న దిగుళ్ళను తెలియజేస్తాడు. యువకుని ఉద్యోగ వివరాలు అడిగి ఉద్యోగం చేయక పోవడమే మంచిదని తెలియజేస్తాడు. ఈ మాయాలోకంలో ఉద్యోగం లేకుండా ఉంటేనే నయం. ఏ పనైనా కష్టపడితే ఫలితం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల లేని బ్రతుకు. చాలీచాలని జీతం అని తన అనుభవాలను తెలియజేస్తాడు. ఇప్పుడు విచారిస్తున్నారా ? అని యువకుడు అడిగితే తన జీవితంలో విచారం అనే పదం లేదని జరిగిన అనుభవాన్ని చెప్పానని అంటాడు తాత. లాటరీ వేశాం ఓడిపోయాం అని ఆలోచనతోనే ఉంటాడు తాత.

ఏదో ఒక సమస్యతో జీవితంపై ఆశలు పోగొట్టుకున్న కృష్ణవేణి, యువకుడు, ఇందిరా, లక్ష్మీల అన్నయ్యలను చూసి బ్రతుకులో ఉండే ఆనందాన్ని చూడమని ధైర్యం చెప్తాడు. లోకంలో ఉండే మంచినీ, మమతల్నీ చిత్రాలుగా గీయమంటాడు. బ్రతుకులో మాధుర్యాన్ని పొందమని వాళ్ళలో నూతన చైతన్యం కలిగిస్తాడు. ఎవరికి వారే జీవితాన్ని చాలించాలని రోడ్డుమీదకు వచ్చిన వారందరిలో ఆశలు కలిగించి నూతన జీవితాలను ప్రారంభించమని తన అనుభవాలను జతచేసిన వారిలో ధైర్యాన్ని కలిగిస్తాడు. అందరికి తలా ఓ గ్లాసు కాఫీ తాగించి వారిలో `. నూతనోత్సాహం కలిగిస్తాడు తాత.

4. ‘తెరచిన కళ్ళు’ నాటిక ద్వారా రచయిత అందించిన సందేశాన్ని వివరించండి ?
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.

విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.

ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్ఛిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయ పడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడతాడు. ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్కి. విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.

చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొంధమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే నాకీ అవస్థ వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.

భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే. డాక్టర్కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినందించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు. డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే. ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. కౌరవులెల్ల గతిచెడి పడినట్టి కష్టముల్ వినమె.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కలహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : పూర్వం యుద్ధం వల్ల కౌరవులంతా నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని భావం.
వ్యాఖ్య : ‘ఓ రాజా ! అన్నదమ్ములైన మీరు ఇరువురూ కలసిమెలసి ఉంటే ఎంతో లాభం. గొప్పకీర్తి సాధించవచ్చు. యుద్ధం వల్ల అంతా నష్టమే జరుగుతుంది. పూర్వం కౌరవులంతా యుద్ధం వల్ల నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.

2. వసుధాస్థలి వర్థిల్లు బ్రహ్మకల్పముల్,
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : : హనుమంతుడు తనకు చేసిన ఉపకారానికి బదులుగా, సీత హనుమంతుడిని చిరంజీవిగా వర్థిల్లమని ఆశీర్వదించి దీవిస్తూ హనుమంతునితో పలికిన పలుకులివి.
భావం : శ్రీరాముని యోగక్షేమాలను తెలియజేస్తూ, భర్త శ్రీరాముని రత్నపుటుంగరాన్ని తెచ్చి యిచ్చిన హనుమంతుడిని వాత్సల్యంతో ఈ భూమి మీద మరణం లేకుండా చిరకాలం బ్రహ్మకల్పముల పర్యంతము జీవించుమని సీత దీవెనలిచ్చినదని భావం.

3. పదం పద్యం పట్టినిలచెను కీర్తులపకీర్తుల్.
జవాబు:
కవి పరిచయం `: ‘ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కన్యక ప్రాణత్యాగం తరువాత రాజుకు శాశ్వతమైన అపకీర్తి కలిగిందని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోవి.
భావం : కథలు కథలుగా చెప్పుకొనే కన్యక కీర్తి, రాజు అపకీర్తి పదాలలోనూ, పద్యాల లోనూ, శాశ్వతంగా నిలిచిపోయాయి అని భావం.
వ్యాఖ్య : కన్యక ప్రాణత్యాగం చేసిన చోట ఆమె కీర్తికి గుర్తుగా ఒక ఆకాశసౌధం వెలిసింది. తర్వాత పట్టణాన్ని ఏలే రాజు మరణించాడు. అతని కోటపేటలు మట్టిలో కలిసి పోయాయి. సాహిత్యంలో పదాలుగా, పద్యాలుగా కథలు కథలుగా కన్యక కీర్తి, రాజు అపకీర్తి శాశ్వతంగా నిలిచిపోయాయి.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

4. అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుంది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా॥ అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ప్రపంచీకరణ విషబీజాలు మన సంస్కృతీ సంప్రదాయాలపై ఎలా ప్రభావం చూపిస్తున్నదో కవి’ తెలియజేసిన సందర్భంలోనిది.
భావము : ప్రపంచీకరణ ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోవలసిన సమయం వచ్చింది. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలి. అప్పుడే అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుందని ఇందలి భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. స్వాతంత్ర్యహీనులు ఎలా ఉంటారని భట్టు తెలిపాడు.
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో స్వాతంత్య్రహీనుల దైన్యస్థితిని ఇట్లా వర్ణించాడు.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతక వలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించబడ్డ పక్షులలాగా బతకాలి. పాముల వాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దులవాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి అని స్వాతంత్ర్య హీనుల గురించి భట్టు తెలిపాడు.

2. శ్రీరాముని రూపాన్ని హనుమ ఏవిధంగా వర్ణించాడు ?
జవాబు:
హనుమంతుడు సీతాదేవితో శ్రీరాముని రూపాన్ని ఈ విధంగా వర్ణించాడు.
అమ్మా ! శ్రీరాముని శరీరము నీలమేఘచ్ఛాయలో ఉంది. ఆయన కన్నులు తెల్లని పద్మపు రేకుల వలె ఉన్నాయి. కంఠము శంఖము వలే ఉంది. అందమైన ఎత్తైన ఎద కలవాడు, తిన్నని పెద్దవైన పెద్ద భుజములు కలవాడు, భేరీ శబ్దము వంటి కంఠస్వరము గలవాడు, పద్మపు రేకుల వంటి పాదములు కలవాడు. కపటము ఎరుగని సత్య వాక్యములను పలికేవాడు. అమ్మా ! సీతాదేవీ శ్రీరాముడు ఇట్టి శుభలక్షణములు గలవాడు. శరీరము బంగారము వలే మెరిసిపోతోంది అని హనుమ వివరించాడు.

3. కన్యక ప్రజలకిచ్చిన సందేశం ఏమిటి ?
జవాబు:
గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు ఇట్లా సందేశం ఇచ్చింది. “అన్నలారా ! తండ్రులారా ! నా విన్నపాన్ని వినండి. మీరు మీ భార్యాబిడ్డలను రక్షించుకోలేరా ? రాజ్యాన్ని ఏలడానికి రాజు ఉంటే ఆ రాజును ఏలడానికి దైవం లేదా ?’ మీ పరువును నిల్పుకొనే పౌరుషం మీకు లేదా ? చదువుకున్నవాడే బ్రాహ్మణుడు. వీరత్వం కలవాడే క్షత్రియుడు అనే పెద్దల మాట మరిచారా ? పనవుల మీద ఆశపడడం, సంపదలను చూసుకొని మురిసిపోవడం సరికాదు. చదువుకోకుండా, పరాక్రమం లేకుండా తెలివి తక్కువగా ఉన్నవారికి కష్టాలు తప్పవు. ఇప్పటికైనా మేల్కొనండి. దైవబలంతో రాజులకే రాజులుగా బతకండి” అంటూ కన్యక ప్రజలకు హితబోధ చేసింది.

4. అద్దేపల్లి దర్శించిన కొత్త మానవుడు ఎలా ఉన్నాడు ?
జవాబు:
‘ఈ దారి ఎక్కడకు పోతుంది’ అన్న పాఠ్యభాగం డా॥ అద్దేపల్లి రామమోహనరావుచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
అద్దేపల్లి దర్శించిన కొత్త మానవుడు నేల విడచి సాము చేస్తున్నట్లుగా ఉన్నాడు. బియ్యంలో రాళ్ళలాగా తెలుగు భాషకు ఆంగ్లపదాలను జోడించి కొత్తకొత్తగా మాట్లాడు తున్నాడు. ముఖ్యంగా నాయకులు, మేధావులు, సినిమా తారలు, తెలుగు ఉపాధ్యాయులు ఇలా చేయటం సమర్థనీయం కాదంటారు అద్దేపల్లి. విద్యను వ్యాపారంగా భావించటం ధర్మం కాదన్నాడు. కాన్వెంట్లలో రైములు నేర్పుతూ మన సంస్కృతిని నాశనం చేయటం సరైన పని కాదంటారు. చెవులు పగిలేలా ధ్వనులు చేస్తూ కాబరే, పాప్ సాంగ్స్ మన గేయాలను గీతాలను మింగేస్తున్నాయని బాధపడ్డారు. సంప్రదాయం, ఆధునికత సంస్కారం అనే వాటిని కలిపి పంచకోళ్ళ రసాయనం తాగుతున్న మాటలతో మన అస్తిత్వాన్ని కోల్పోతున్న కొత్త వ్యక్తులను వ్యక్తిత్వాలను గల కొత్తమనుషులను అద్దేపల్లి వారు దర్శించారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. గ్రామ సమూహ మాన్యమును వివరించండి ?
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడింది. ఇది ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వము అను సంపుటం నుండి గ్రహించబడింది.
పూర్వము తెలుగుదేశంలో ప్రతి గ్రామములోను ‘గ్రామ సమూహ మాన్యం’ అని ఒక మాన్యం ఉండేది. అది గ్రామంలోని వారందరి సొత్తు. దానిమీద వచ్చు ఆదాయం గ్రామంలోని వారందరి ప్రయోజనాల కోసం వినియోగించేవారు. గ్రామానికి వచ్చి పోయే కళాకారులకు, భాగవత మేళాలకు, తోలుబొమ్మల వారికి వేడుకలను వినోదాలను అందించే కళాకారులకు పంచేవారు. అలా పంచటాన్ని ‘వర్తన’ అని అనేవారు. అదే చివరకు ‘వతన’గా మారింది. విద్యావంతులకు ఆటపాటలవారికి ఈ వతనను ‘గ్రామ సమూహ మాన్యము’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచటం ఒక రివాజుగా మారింది.

2. అర్థ విపరిణామంలో వ్యాకోచాన్ని గురించి వ్రాయండి ?
జవాబు:
భాషకు రెండు ప్రధానాంగాలుంటాయి. ఒకటి శబ్దం రెండు అర్థం. ఈ రెండింటిలో కాలక్రమంలో మార్పులు వస్తుంటాయి. పదాలలోని అర్థాలలో వచ్చే మార్పులను ‘అర్థ విపరిణామం’ అంటాము. భాషాశాస్త్రం ఈ మార్పులను ఐదు విధాలని చెప్పింది.
1. అర్థ సంకోచము 2. అర్థ వ్యాకోచము 3. గ్రామ్యత 4. సౌమ్యత్వము 5. సంకేతం
అర్థ వ్యాకోచము : అర్థం సంకోచించటమే అర్థ సంకోచమంటారు. మొదట ఒక పదం పరిమితార్థాన్ని చెప్తూ కాల క్రమంలో విస్తృతార్థాన్ని బోధించిన దానిని అ మంటారు.
గోచ
ఉదా : పూర్వము తిలల (నువ్వుల) నుండి తీసిన నూనెనే తైలమని వ్యవహరించేవారు. కాలక్రమంలో తైలమను పదం విస్తృతార్థంగా పరిణామం చెందీ మందార తైలము, బృంగామలక తైలము అని వ్యవహారములోనికి వచ్చింది.

అలాగే’ ‘దీపపు సెమ్మె’ అన్న మాట దీపము పెట్టుకొను స్తంభము’ అని పూర్వార్థము. `పారశీక భాషలో ‘శమా’ అనగా దీపమని అర్థము. అదే తెలుగున ‘సెమ్మె’ అయింది. ఈ పదం పూర్వం ఆదేయమునకు ఇప్పుడు ఆధారమునకు వాచకం అయింది.
“‘మాఘము చదువు చుంటిని’, భారవిని పూర్తిచేసి తిని అన్న వాక్యాలు భారవి వ్రాసిన కిరాతార్జునీయాన్ని, మాఘుడు వ్రాసిన శిశుపాలవధను పఠించినట్లు విస్తృతార్థమును చెప్తున్నాము. ఇలా పరిమితార్థం గల పదాలు వాక్యాలు విస్తృతార్థాన్ని పొందడాన్ని అర్థవ్యాకోచ మంటారు.

3. ఖడ్గ తిక్కనకు సంబంధించిన చాటు వృత్తాంతాన్ని తెలుపండి ?
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని చాటువుల నుండి గ్రహించబడింది.
కవి ఎవరో తెలియని ఉన్న ఖడ్గ తిక్కనకు సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. ఖడ్గ తిక్కన మనుమసిద్ధి పక్షాన నిలిచి కాటమరాజు నెదిరించిన మహావీరుడు. అతడు యుద్ధంలో, భీకరంగా పోరాడి తన సేనలు చెల్లాచెదురై పారిపోగా యుద్ధాన్ని విరమించి ఇంటిముఖం పట్టాడు. అతడి భార్య నులకమంచాన్ని అడ్డుగా పెట్టి దానిమీద పసుపుముద్ద నుంచి ప్రక్కన నీళ్ళ చెంబు పెట్టిందట. ఇదేమిటని అడగ్గా
“పగరకు వెన్నిచ్చినచో
నగరేనిను మగతనంపు నాయకు లెందున్
ముగురాడు వార మైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.
అని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడింది. ఆ తరువాత ఖడ్గతిక్కన తల్లి అన్నంలో విరిగిన పాలు పోసిందట. ఇదేమిటని ప్రశ్నిస్తే
కసవున్ మేయగ బోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.
అని ఆక్షేపించింది. ఆ మాటలకు సిగ్గుపడి లేచి యుద్ధమునకు పోయి వీర స్వర్గము నలంకరించాడు. ఈ చాటు పద్యాల వలన చరిత్రను తెలుసుకునే వీలు కలిగింది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

4. చిలకమర్తి తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించిబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం,
వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. బ్రిటీషువారు భారతీయులను ఎలా దోపిడీ చేస్తున్నారో “భరత ఖండంబు చక్కని పాడియావు” అన్న పద్యం ద్వారా వివరించారు. బ్రిటీషు ప్రభుత్వం ప్రజలపై విధించే వివిధ పన్నులను గురించి కూడా వివరించారు.

నేల దున్నటానికి జాలతరము పన్ను, నీటికోసం నీటి పన్ను వ్యాపారం చేస్తే రాబడి మీద పన్ను, సరుకులు అమ్ముకుంటే సంత పన్ను, కట్టెలు అమ్ముకుంటే దానిపై మరొక పన్ను, పట్టణాలలో మునిసిపాలిటీ పన్ను, పారిపోదామంటే బండి హాసీల్పన్ను, ఇంటిని అమ్ముకుందా మంటే స్టాంపు పన్ను, తృప్తిగా తిందామంటే ఉప్పు పన్ను ఇలా ఎన్నో విధాలుగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలను పన్నుల బాధతో పీడించేదని చిలకమర్తి వారు వివరించారు.

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. శకుంతలను పెంచిన తండ్రి ఎవరు ?
జవాబు:
కణ్వ మహర్షి

2. శాంతికాంక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
శ్రీనాథుడు.

3. తన గుర్తుగా సీతాదేవి హనుమకు ఏమిచ్చింది ?
జవాబు:
విరోరత్నమునిచ్చింది.

4. గురజాడ ప్రసిద్ధ నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం.

5. పంచకోళ్ళ రసాయనం అంటే ఏమిటి ?
జవాబు:
చిత్రమూలము, పిప్పిలి, పిప్పిలి మూలము, చర్యము, సొంటి వంటి ఐదు పదార్థములతో చేసే కషాయం.

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. తెలుగువారి పెద్దపండగ అని దేనిని అంటారు ?
జవాబు:
సంక్రాంతి పండుగను.

2. మాఘ కవి రచించిన గ్రంథమేది ?
జవాబు:
శిశుపాల వధ.

3. చిన్ని చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు పద్యం ఎవరిది ?
జవాబు:
శ్రీనాథునిది.

4. కాంతం కథలు ఎవరు వ్రాశారు ?
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావుగారు.

5. బెంగాల్ విభజనను చేసిన వాడెవరు ?
జవాబు:
లార్డ్ కర్జన్.

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి – క్రియ ఏది ?
జవాబు:
‘రూపుమాపాలి’ అన్నది క్రియాపదం.

2. అవ్యయం అంటే ఏమిటి ?
జవాబు:
లింగ, వచన; విభక్తులు లేని పదాలు అవ్యయాలు.

3. విశేషణం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచక సర్వనామముల యొక్క గుణాలను తెలిపేవి.

4. మీరు మంచి విద్యార్థులు – దీనిలో సర్వనామం ఏది ?
జవాబు:
‘మీరు’ ఈ వాక్యంలో సర్వనామం.

5. నామవాచకమంటే ఏమిటి ?
జవాబు:
పేర్లను తెలియజేసే పదాలు నామవాచకాలు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. సామాన్య వాక్యమంటే ఏమిటి ?
జవాబు:
ఓకే సమాపక క్రియ కలిగియున్న వాక్యము.

2. వాక్యానికి ఉండే లక్షణాలేమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి.

3. వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
అర్థవంతమైన పదముల సమూహం.

4. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు ఇది ఎటువంటి వాక్యం.
జవాబు:
ఇది సంక్లిష్ట వాక్యం.

5. రెండు సమాన ప్రాధాన్యంగల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏ. వాక్యం ?
జవాబు:
సంయుక్త వాక్యం.

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. మత్తేభము
జవాబు:
మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా అంటారు. మత్తేభం అంటే మదించిన ఏనుగు అని అర్థం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1 – 14 అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions 1
యతి మైత్రి : 1వ అక్షరమైన ‘క’ లోని అ కు 14వ అక్షరమైన ‘క్ష’ లోని క కు యతి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘డ’ కారం ప్రాసగా ఉంది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

2. ముత్యాల సరాలు
జవాబు:
గురజాడ అప్పారావు 1910లో ముత్యాలసరాలు అనే ఖండికను ‘ముత్యాల సరాలు’ అనే ఛందస్సులో రాశాడు. ఒక ఫారసీ గజల్ విని స్ఫూర్తిపొంది ముత్యాలసరాలు ఛందస్సును కూర్చినట్టు గురజాడ చెప్పుకున్నారు. వృషభగతి రగడ, భామినీ షట్పది వంటి ఛందస్సులలోనూ ముత్యాలసరాలకు మూలాలు కన్పిస్తున్నాయి. ముత్యాల సరాలు మాత్రా ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ.
లక్షణాలు :
1. ఇది మాత్రా గణాలతో ఏర్పడుతుంది.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలోనూ 3 + 4; 3 + 4 క్రమంలో మొత్తం 14 మాత్రలుంటాయి.
4. 4వ పాదంలో మాత్రం 7 నుంచి 14 మాత్రలు దాకా ఉండవచ్చు.
5. నాల్గవ పాదంతో భావం పూర్తి కావాలి.
6. నాలుగు పాదాలలో భావం పూర్తికానపుడు ఒకొక్కసారి ఐదవ పాదం దాకా పెరుగుతుంది.
దీనిని తోక ‘ముత్యాల సరము’ అని వ్యవహరిస్తారు. ‘కన్యక, ఖండికలోనూ ఈ తోక ముత్యాలసరాలు కొన్ని ఉన్నాయి. గమనించవచ్చు.
ఉదాహరణ : ముత్యాల సరం
AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions 2
AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions 3
ఉదాహరణ : తోక ముత్యాల సరం
AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions 4

3. కందం
జవాబు:
కందం చిన్న పద్యమైనా ఎక్కువ లక్షణాలు గలది. అందుకే ‘కందం రాసినవాడే కవి’ అనే నానుడి వచ్చింది. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒకటి, మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు ఐదేసి గణాలు ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, మూడు నాలుగు పాదాలను ఒక భాగంగాను పేర్కొంటారు. కంద పద్యంలో ‘భ, జ, స, న, ల, గ, గౌ’ అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడాలి. బేసి సంఖ్య గల గణాలలో (1, 3, 5, 7 గణాలలో) ‘జ’ గణం రాకూడదు. ఆరవ గణం ‘జు’ గణం కానీ ‘నల’ కానీ ఉండాలి. యతి మైత్రి రెండు, నాలుగు పాదాలలో 1 – 4 గణాల మొదటి అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. రెండు, నాలుగు పాదాల చివరి అక్షరం విధిగా గురువై ఉండాలి. మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ గురువుతోనే ప్రారంభం కావాలి. లేదా మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ లఘువుతోనే ప్రారంభం కావాలి.
AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions 5
యతి మైత్రి : రెండో పాదంలో ‘న’ అనే అక్షరం లో సంధితంగా ఉన్న ‘అ’ కారానికీ, నాలుగో గణంలో సంధిగతంగా ఉన్న ‘య’లోని ‘అ’ కారానికీ చెల్లింది.
ప్రాసాక్షరం : ‘క్క’ అనే అక్షరం అంటే ద్విత్వ కకారం ప్రాసగా ఉంది.

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను చెప్పే శాస్త్రాన్ని ఛందస్సంటారు.

2. ఉత్పలమాలలో గణాలేవి ?
జవాబు:
భ, ర, న, భ, భ, ర, వ

3. ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు ?
జవాబు:
ప్రాస నియమం ఉండదు.

4. తేటగీతిలో గణాలేవి ?
జవాబు:
1. సూర్య గణం, 2. ఇంద్రగణాలు మరల 2 సూర్యగణాలు.

5. శార్దూలంలో యతిస్థానం ఎంత ?
జవాబు:
13వ అక్షరం.

6. ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్యపాదంలోని 2వ అక్షరం.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. అంత్యానుప్రాస : ‘అంత్య’ అంటే చివర అని అర్థం. పాదం చివరలో లేదా పదం చివరలో అనుప్రాస ఉన్నట్లైతే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.

1. ఆ లలన గట్టె ఱోలన్
లీలన్, నవనీత చౌర్య లీలున్, ప్రియ వా
గ్జాలున్ బరి విస్మిత గో
పాలున్, ముక్తా లలామ ఫాలున్, బాలున్
పై పద్యంలో అంత్యానుప్రాసను గమనించవచ్చు.

2. పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ …..
ఈ పాఠ్య పుస్తకంలోని శ్రీనాథుడు రచించిన ద్విపదలో అంత్యానుప్రాస చోటు చేసుకుంది గమనించగలరు.
అరుగు భూపతి పుత్ర
అంచిత గాత్ర
వీరకామ నరేంద్ర
విభవ దేవేంద్ర

2. ఉత్ప్రేక్ష : ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లైతే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ :
1.’ ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను. ఇక్కడ చీకటి నలుపు. దృష్టి నిరోధకం. పొగ నలుపు. దృష్టి నిరోధకం. కాబట్టి ఈ సమాన ధర్మాలవల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకొన్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
2. ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది.
3. ఆమె ముఖము పద్మమేమో – అను వాటిల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.

3. అర్థాంతరన్యాసం : ఉపమేయానికీ, ఉపమానానికీ అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేదని చెప్పినట్లయితే అది రూపకాలంకారం.
‘అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాడు’.
ఈ ఉదాహరణలో, అతడు తప్పుచేసి, చేసిన తప్పును తెలిసికొని, పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలిపోతున్నాడు. ‘ఇక్కడ పశ్చాత్తాపాగ్ని అనే సమాసంలో, పశ్చాత్తాపము అనేది ఉపమేయం. అగ్ని అనేది ఉపమానం. రెండింటికీ భేదం లేదని చెప్పడం వల్ల ఇది రూపకాలంకారం.
1. రుద్రమ్మ చండీశ్వరీ దేవి.
2. సంసార సాగరం.

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి – దీనిలో అలంకారమేది ?
జవాబు:
అతిశయోక్తి అలంకారం.

2. వలె, పోలె, అట్లు, లాగ ఈ పదాలను ఏమంటారు ?
జవాబు:
ఉపమావాచకాలంటారు.

3. ఉపమేయం అంటే ఏమిటి ?
జవాబు:
వర్ణించబడే వస్తువును ఉపమేయమంటారు.

4. శబ్దాలంకారమంటే ఏమిటి ?
జవాబు:
శబ్ద ప్రాధాన్యంగల అలంకారమని అర్థం.

5. నీలమేఘచ్ఛాయ బోలు దేహములాడు ఈ పద్యంలో అలంకారమేది ?
జవాబు:
స్వభావోక్తి అలంకారం:

6. సామాన్యమును విశేషంచేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్థించే అలంకారమేది ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారము.

AP Inter 2nd Year Telugu Model Paper Set 9 with Solutions

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడు డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్. భారతరత్నగా, భారత క్షిపణి పితామహుడుగా, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలామ్. విద్యార్థి దశలో సగటు విద్యార్థి. మంచి అలవాట్లతో, కచ్చితమైన క్రమశిక్షణను పాటించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక, స్త్రీలను, గురువులను ఇతర పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందిన వాడైనా హిందూ, క్రైస్తవ, సిక్కు వంటి సర్వమతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలామ్ ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని; చిన్న చిన్న లక్ష్యాలు నేరమని విద్యార్థులకు సందేశమిచ్చాడు. వీరి జన్మదినమైన అక్టోబరు 15వ తేదీని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
జవాబు:
డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత క్షిపణి పితామహుడు. మనదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగటానికి ఆయనే కారకుడు. రాష్ట్రపతిగా దేశ విలువలను కాపాడారు. మంచి అలవాట్లతో క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం తెలిసివారు. గొప్ప లౌకికవాది. ఆయనకు పుస్తకమంటే ఇష్టం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు కలాం. వీరి జన్మదినం అక్టోబరు 15, ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

 

Leave a Comment