Reviewing TS 10th Class Telugu Model Papers Set 9 can help students identify areas where they need improvement.
TS SSC Telugu Model Paper Set 9 with Solutions
‘సమయం: 3 గం.
మార్కులు : 80
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
అ) కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1, 2 వాక్యాలలో రాయండి. (5 × 1 = 5 మా.)
దశరథుడు పుత్రకామేష్టి చేసినపుడు యజ్ఞకుండం నుండి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో అందులో దివ్య పాయసముంది. దాన్ని దశరథునకందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటికీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది.
దివ్యపాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. సంవత్సరకాలం గడిచింది. చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమినాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనందసంద్రమైంది.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో, నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టైనారు. (ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి.) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచీ అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిఃప్రాణం. భరతశత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
దివ్య పురుషుడు ఎలా ఆవిర్భవించాడు ?
జవాబు:
యజ్ఞకుండం నుండి
ప్రశ్న 2.
బ్రహ్మ పంపగా వచ్చింది ఎవరు ?
జవాబు:
దివ్య పురుషుడు
ప్రశ్న 3.
దివ్య పాయసం విశేషమేమిటి ?
జవాబు:
దివ్య పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది.
ప్రశ్న 4.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేవి ?
జవాబు:
విద్యలో నైపుణ్యం సాధించడం, సద్గుణాలు కలిగి ఉండటం.
ప్రశ్న 5.
బహిఃప్రాణం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
బయటి ప్రాణం. కనిపించకుండా ఉంటే మనలోని ప్రాణం కాక, కనిపించే లక్ష్మణుడు బయటి ప్రాణం అని అర్థం.
ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. (1 × 5 = 5 మా.)
ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
జన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !
జవాబు:
ప్రతిపదార్థం :
అన్నా = తండ్రీ!
విశ్వనాథ+ఈశ్వరా = విశ్వనాథుడు అను పేరుగల శంకరుడా!
వేడు = ఎవడైతే
త్యాగమయ = త్యాగముతో నిండిన
దీక్షన్ + పూని = పట్టుదల వహించి
సర్వం సహా = సమస్తమైన భూమండల మందలి
జన = ప్రజల యొక్క
దైన్యస్థితిన్ = దీనమైన పరిస్థితిని
పోన్ + అడంచి = పోగొట్టి
సకల + ఆశా = అన్నిదిక్కుల యందు
పేశల = చక్కని
ఆనంద = ఆనందముతో నిండిన
జీవన = = జీవనము యొక్క
సంరంభంబు = ఉత్సాహమును
పెంచి = వృద్ధి చేసి
దేశ జననీ = దేశమాత యొక్క
ప్రాశస్త్యమున్ = గొప్పతనమును
పంచునో = అందరికీ తెలియజేస్తాడో
ఆ + వాడు = అటువంటి వాడు
ఘనుడు + అగున్ = గొప్పవాడౌతాడు
న + ఇదం పూర్వ
(అనిదంపూర్వ) = ఇంతకుముందు ఎవరికీ లేని
యశస్వి = కీర్తి కలవాడు
అతడు + అగున్ = అతడే ఔతాడు.
(లేదా)
ఆకంఠంబుగ నిఫ్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే? లెస్స ! ‘శాంతుండవే !
నీ కంటెన్ మతిమీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ !
జవాబు:
ఇప్పు = ఈ సమయమున
ఆ కంఠంబుగన్ = గొంతువఱకు (కుత్తుక బంటిగా)
మాధుకర = తేనెటీగను పోలిన (మధుకర సంబంధమైన)
భిక్షా+అన్నంబు = బిచ్చపు తిండి
భక్షింపన్’ + కాన్ = తినుటకు
లేక+ఉన్నన్ = ఉండక పోవుట వలన
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = బాధపడెదవు, దుఃఖపడెదవు
మేలు + ఏ = మంచిదా? న్యాయమా?
లెస్స = ఉత్తమమా ! శ్రేష్ఠమా !
శాంతుండవు + ఏ! = శాంతి కలవాడవే !
కటకటా = అయ్యయ్యో !
నీవారముష్టింపచుల్ = పిడికెడు నివ్వరి బియ్యమును మాత్రమే వండుకొను వారును
శా+ఆహారులున్ = కూరలు మాత్రము తినువారును
కంద భోజులున్ = కంద గడ్డలు తినువారును, దుంపలు తిరువారును
శిల+ఉంఛప్రక్రముల్ = పంట తీసికొనిపోయిన తరువాత పొలమున జాఱిపడిన కంకులను, రాలిన గింజలను ఏఱికొని బతికే వారును అయిన
తాపసుల్ = మునులు
నీ కంటెన్ = నీ కంటె
మతిహీనులు + ఏ = తెలివి తక్కువవారా ?
ఇ) కింది పేరాను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 2 = 10 ‘మా.)
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లా అర్మూర్ లో 39.54 సెంటీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వేలాది చెరువులు నిండి అలుగులు పోస్తుండగా, 71 చెరువులకు గండ్లు పడ్డాయి.
గోదావరి బేసిన్లోని ఎస్సారెస్సీ, సింగూరు, ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ సైన్యం రంగంలోకి దిగింది. కలెక్టర్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు. అత్యవసర సరుకులను అందుబాటులో ఉంచారు. అంటువ్యాధులు సోకకుండా బ్లీచింగ్ పౌడర్ జల్లిస్తున్నారు. వైద్యసిబ్బందిని సిద్ధం చేశారు.
ప్రశ్నలు :
ప్రశ్న 7.
ఎక్కువ వర్షపాతం నమోదైన పట్టణం
జవాబు:
ఆర్మూర్
ప్రశ్న 8.
“నీటితో నిండిన రెండు ప్రాజెక్టులు
జవాబు:
ఎస్సారెస్సీ, సింగూరు, కడెం, గడ్డెన్నవాగు, ఎల్లంపల్లి
ప్రశ్న 9.
సహాయక చర్యలు చేపట్టింది
జవాబు:
ఎన్టీ ఆర్ ఎఫ్-సైన్యం
ప్రశ్న 10.
వర్షం కురవడానికి కారణం ………………….
జవాబు:
అల్పపీడనము
ప్రశ్న 11.
’71’ అను సంఖ్య సూచిస్తున్నది…………………
జవాబు:
71 చెఱువులకు గండ్లు పడ్డాయి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (4 × 3 = 12 మా.)
అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 12.
‘నగర గీతం’ కవిని గురించి రాయండి.
జవాబు:
‘కవి : అలిశెట్టి ప్రభాకర్
జననం : 12-1-1954
మరణం : 12-1-1993
జన్మస్థలం : జగిత్యాల
జీవనం : మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి దృశ్యాలు, సినీనటుల బొమ్మలు వేశాడు. తరువాత జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించాడు.
రచనలు : ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం. మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్గా “సిటీలైఫ్” పేరుతో హైదరాబాదు నగరంపై వ్రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు.
శైలి : తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.
ప్రశ్న 13.
బలి చక్రవర్తి భార్య వింధ్యావళి గురించి రాయండి.
జవాబు:
వింధ్యావళి రాక్షస రాజైన బలిచక్రవర్తి భార్య. ఆమె అందగత్తె. భర్త మాట జవదాటని పతివ్రత. ఆమె ముఖము చంద్రబింబంలా స్వచ్ఛమైనది, ప్రశాంతమైనది. ఆమె నడకలు మదించిన రాజహంస నడకలలాగా వయ్యారమైనవి. సుకుమారమైనవి. దానం ఇవ్వడానికి బలి నిశ్చయించుకున్నప్పుడు మరో ఆలోచన లేకుండా భర్తను అనుసరించింది. తన భర్త సైగను గ్రహించి మహారాణి అయినప్పటికీ బంగారు చెంబుతో నీళ్ళు తెచ్చింది.
ప్రశ్న 14.
“వారీ రామచంద్రా! ఇగపటు” అనడం రచయితకు ఎందుకు వింతగా అనిపించింది ?
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు ఒకసారి తిరుపతి వెళ్ళివచ్చారు. అక్కడనుండి తెచ్చిన లడ్డూని ప్రాకృత, సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్రగారికి ఇచ్చారు. లడ్డూ ఇస్తూ వారు ప్రాంతీయ భాషాభిమానం వల్ల “వారీ రామచంద్రా ! ఇగపటు తిరుపతి లడ్డూ” అని ఇచ్చిన సందర్భాన్ని, ఆ విషయాన్ని వారు యాది చేసుకున్నారు. “ఇగపటు”. అనే అచ్చ తెనుగుపదాన్ని “యాది” అనే వ్యాసంలో ప్రత్యేకించి వివరించడం రచయితకు గల భాషాభిమానం, సాహిత్య గౌరవాన్ని తెలియచేస్తున్నాయి.
ప్రశ్న 15.
‘ఈ ఒక్క కథ రాసి మరేమి రాయకపోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒక్కడుగా కీర్తించబడేవాడు’ – ఆ ఒక్క కథ ఏది ? దానికున్న ప్రాధాన్యాన్ని తెలుపండి.
జవాబు:
‘నెల్లూరి కేశవస్వామి గొప్పకథకులు. ఆయన ఉర్దూ, హిందీలలో ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో సరిపోల్చదగినవారు. కేశవస్వామి ‘యుగాంతం’ అనే కథ ఒక్కటే రాసిన, భారతదేశం గర్వించదగిన కథకుల్లో ఒకరుగా కీర్తింపబడేవారు. కథ సామాజిక, రాజకీయ, చారిత్రక ఘట్టాలకు అడ్డంగా నిలిచింది. అంతేకాదు, అప్పటి సంక్షుభిత స్థితిలో మనుషుల మానసిక స్థితిని కూడా అద్భుతంగా ఆవిష్కరించింది. దేశ విభజన, హైదరాబాద్లో జరిగిన పరిమాణాలు, సామాజిక చరిత్రను ‘యుగాంతం’ కథ ఒక డాక్యుమెంటరీలాగా చూసిస్తుంది.
ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)
ప్రశ్న 16.
‘వీర తెలంగాణము’ పాఠం ఆధారంగా తెలంగాణ పౌరుష, పరాక్రమాలు తెలపండి.
జవాబు:
పరిచయం : తెలంగాణలో దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించడానికి, వారి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రజలు చేసిన పోరాటం అపూర్వమైనది. పోరాటంలో పాల్గొంటూనే త్యాగవీరుల గొప్పదనాన్ని, నేల ప్రత్యేకతలను వర్ణిస్తూ డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన స్ఫూర్తిదాయక పదాలే’ ఈ పాఠ్యభాగం.
దాశరథి ఈ పాఠ్యాంశంలో తెలంగాణ తల్లి, స్వాతంత్య్ర సాధన, తెలుగు పిల్లల పరాక్రమం, తెలుగు నేల గొప్పదనం, తెలుగుదనం, చారిత్రక వైభవం అనే అంశాలను వర్ణించాడు.
తెలంగాణ తల్లి : “మాతృమూర్తి, మాతృదేశం స్వర్గం కంటే గొప్పవి” అని పెద్దలు అన్నారు. ఇందులో దాశరథి తన మాతృభూమి అయిన తెలంగాణను మాతృమూర్తితో పోల్చడం ముదావహం. తెలంగాణ తల్లి తన పెదవులతో ఊదిన శంఖం నుంచి పుట్టిన ధ్వనులే అంటే ఉద్యమ నినాదాలే లోకమంతా ప్రతిధ్వనించాయి. ఉదయించే సూర్యకిరణాల వల్ల విచ్చుకుంటున్న పద్మాల చేత మొదలైన ఆకాశగంగలోని అలలు అన్ని దిక్కులనూ తెల్లవారేటట్లు చేశాయి.
స్వాతంత్య్ర సాధన : తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకూ దుర్మార్గుల చేతులలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రజలకు బతుకు తెరువుపై భరోసా ‘ కలిగించాయి. స్వేచ్ఛ అనే తొలి పొద్దు పొడిచింది.
తెలుగు పిల్లల పరాక్రమం : అప్పుడే ఊహతెలిసిన, వయసువచ్చిన పిల్లలు కూడా కత్తులు చేతబట్టి ఉద్యమంలోకి ‘దూకారు. ఎంతో బలవంతుడైన రాజుతో తలపడ్డారు. వారి చైతన్యం వృథా కాలేదు. స్వాతంత్య్రం సాధించి దేశంలో కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారు పరోపకారులైన తెలుగు వీరులు.
తెలంగాణ నేల గొప్పదనం : తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. బలవంతుడైన రాజు గర్వాన్నే అణచివేసింది. మునుపెన్నడూ ఎవరూ ఎరుగని ఈ ఘటనకు లోకమంతా భయపడిపోయింది. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రం లాగా ఉప్పొగింది. నవాబుల అధికారాలకు కాలం చెల్లిపోయింది.
తెలుగుదనం : తెలంగాణ ప్రజలు మతం అనే పిశాచి వల్ల ఎన్నో హింసలు అనుభవించారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. బ్రతకడమే భారమైపోయింది. అయినా వారు తెలుగుదనాన్ని కోల్పోలేదు. తెలుగు వీరులు జగజ్జేతలని చాటారు. చిట్టచివరికీ విజయం సాధించారు.
చారిత్రక వైభవం : కాకతీయుల కంచుగంటల మోతలకే శత్రురాజులు భయపడిపోయారు. రుద్రమదేవి పరాక్రమంతో తెలుగు కీర్తి అన్ని దిక్కులకూ వ్యాపించింది. కాపయ్య నాయకుడు ఎదురులేని మొనగాడిగా కీర్తి పొందాడు. చాళుక్యరాజు పాలనాకాలంలో అన్ని జయజయధ్యానాలే వినిపించాయి. నాటి నుండి నేటివరకూ తెలంగాణం శత్రువుల దొంగదెబ్బలకు ఓడిపోలేదు. గంభీర మేఘ గర్జనలతో ముందుకు సాగుతూనే ఉన్నది.
ముగింపు : ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎందరు ఎన్ని సమస్యలు కల్పించినా అన్నింటినీ కలిసికట్టుగా ఎదుర్కోవడం విజయం సాధించడం తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య.
(లేదా)
నేటి నగరం జీవితంలో గల అనుకూల, ప్రతికూల అంశాలను వివరించండి.
జవాబు:
నగర జీవితంలోని అనుకూల అంశాలు : 1. సౌకర్యవంతం, విలాసవంతమైన జీవితం, 2. విద్యా వైద్యావకాశాలు అధికం, 3. ఉపాధి సమృద్ధిగా లభించడం, 4. పర్యటన క్షేత్రం కావడం.
నగరం సకల సౌకర్యాలకు నిలయం. విలాసవంతంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. హోటళ్ళు, వేల విలువ చేసే ఆహార పదార్థాలు, నౌకర్లు – చాకర్లు, సినిమాలు – షికార్లుతో నిండి వుంటుంది.
ఉన్నత విద్య, ఖర్చు పెట్టుకోగల స్థోమత ననుసరించి కార్పొరేట్ బడులు, కళాశాలలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, కోరుకున్న కోర్సులు – ఇక్కడ చదువుకునే అవకాశాలు పుష్కలం.’ వైద్యానికి కొరత ఉండదు, ఎంతటి శారీరక, మానసిక రుగ్మతను అయినా తగ్గించడానికి అవసరమైన అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం, అంతర్జాతీయ స్థాయి వైద్యులు ఇక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అభివృద్ధి చెందిన రవాణా వ్యవస్థ అనుకూలం.
నగరానికి వచ్చేవాళ్ళలో అత్యధికులు ఉపాధికోసమే వస్తుంటారు. చాలామంది రకరకాల పనులు వెతుక్కుంటూ వస్తారు. యోగ్యతను బట్టి, శక్తిని బట్టి పని / ఉపాధి / ఉద్యోగం నగరంలో దొరుకుతుంది. నిరంతరం పనుల కోసం పట్నానికొచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
వీళ్ళుగాక రోజువారీ నగరాన్ని దర్శించేవాళ్ళు వేలల్లో ఉంటారు. నగరంలో దర్శనీయ స్థలాలకు కొదువ ఉండదు. వీటిని చూసి వెళ్ళేవాళ్ళు, రోజుల తరబడి చూస్తుండి పోయేవాళ్ళకూ కొరత లేదు.
నగర జీవితంలోని ప్రతికూల అంశాలు : కానీ నేడు ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. జనాభా పెరగడంతో రవాణా సౌకర్యాలు పెరగడం, పరిశ్రమలు పెరగడంతో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రజలు రోగాలకు గురవుతున్నారు. వారికి కావలసిన మంచినీరు, చదువుకోవడానికి పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్డు, రవాణా సౌకర్యాలు సరిపోవడం లేదు. మంచిగాలి, వెలుతురు ప్రవేశించని ఇరుకుగదులలో ఊపిరాడని బ్రతుఉలు ప్రజలవి. బతుకుతెరువు కోసం నిరంతరం పోరాడుతూ ఉండే మనిషికి సాయపడకపోయినా కనీసం పట్టించుకునేవారు కూడా ఉండరు. సంక్లిష్ట జీవితం గడుపుతూ, స్వచ్ఛమైన, ప్రశాంత జీవితానికి దూరమౌతున్నారు.
ప్రశ్న 17.
“మూడు తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళీ సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి.” -సమర్థించండి.
జవాబు:
ఈ మాట తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తొలినాడు 2 జూన్ 2014న నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటించిన సంపాదకీయ వ్యాసంలోనిది.
తెలంగాణా ప్రాంతంలో తాతల తరం, తండ్రుల తరం, కొడుకుల తరం’ ………….. మూడు తరాలూ అణచివేత పాలనలో వెతలననుభవించింది. వేయికి పైగా బిడ్డలను రాష్ట్ర సాధనకు బలిచేసింది. అట్లా అణచివేతలో మగ్గిన సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి, తప్పదు మరి !
నీళ్ళు, నిధులు, నియామకాలు, భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు ………. అన్ని రంగాల్లో వివక్షకు గురి అయిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. అంతకంటే ముందు సాధారణ సౌకర్యాలన్నీ కల్పించి, జీవితానికి భరోసా ఇవ్వాలి. అందుకు పరిష్కారం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే. భృతిలేని వాళ్ళకు, గతిలేని వాళ్ళకు,. దిక్కులేని వాళ్ళకు, అన్యాయానికి, ఉపేక్షకు గురి అయిన వాళ్ళకు ఆత్మవిశ్వాసం కలిగించాలి. వాళ్ళకు ఆదుకోవాలి. రైతులకు రుణాల మాఫీ, నేతన్నలకు చేయూత, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, వృద్ధులకు, దేవాంగులకు, వితంతువులకు సాయపడాలి. నిరుద్యోగులకు ఉద్యోగాల భరోసానివ్వాలి.
పేద ఇంటి ఆడపడుచుల వివాహానికి చేయూతనివ్వాలి. పరిపాలనా రంగంలో సంస్కరణలు చేపట్టాలి. సంక్షేమ పథక ఫలాలు అందరికీ సులభంగా, తొందరగా చేరాలంటే పాలన వికేంద్రీకరణ జరగాలి. జిల్లాల పునర్విభజన వల్ల ఒనగూడే సత్వర ప్రయోజనం రెండుపడక గదుల ఇండ్లు, పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, పెన్షనులు మొత్తాలను పెంచడంతో పాటు తాగునీటిని అందించే మిషన్ భగీరథ, సాగునీటి నందించే మిషన్ కాకతీయ వంటి పథకాలు సత్వరమే పూర్తికావాలి. అప్పుడు స్వరాష్ట్ర సాధనతో లభించిన అమృత ఫలాలు అందరి కన్నుల్లో ఆనందాన్ని వెలిగించగల్గుతాయి.
(లేదా)
పూర్వం యువకులు సాహిత్య చర్చలతో కాలక్షేపం చేసేవారని గూడూరి సీతారాం రచన వల్ల తెలుస్తున్నది. ఇప్పుడా పరిస్థితి కనిపించకపోవడానికి కారణాలు తెల్పండి.
జవాబు:
1950-60 మధ్యకాలంలో మనుషుల్లో (సమాజంలో) ఇంకా ‘లుక్ కల్చర్’ (చూసే సంస్కృతి) పెరగలేదు. అప్పటి వాళ్ళదంతా బుక్ కల్చర్ (పఠన సంస్కృతి). సినిమాలు కూడా ఇంతగా విజృంభించలేదు. టీవీల గురించిన ఆలోచన లేదు. అందరికీ అందుబాట్లోకి అప్పటికింకా రానేలేదు. పుస్తకపఠనం, రేడియో వినడం అందరికీ ముఖ్యమైన వ్యాపకాలుగా ఉండేవి. తాము చదివిన పుస్తకాల గురించి యువకులు తరచూ చర్చించుకునేవాళ్ళు. ఎన్నో సాహితీ సంస్థలు, గ్రంథాలయాలు వెలిసి యువకుల పఠనశీలతను, సృజనాత్మకతను ప్రోత్సహించాయి. పుస్తకాలు పుంఖానుపుంఖాలుగా వెలవడేవి.
చదువుకున్న ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం కోసం తపించేవారు. మొబైల్ గ్రంథాలయాలు, కిరాయిలకు పుస్తకాలనిచ్చే సంస్థలు అధికమైనాయి. మాస, పక్ష, వార, దినపత్రికలు పాఠకుల దాహం తీర్చేవి. యువకుల భాషా, సాహిత్యాభిమానం వాళ్ళను సాహిత్యచర్చలకు, గోష్ఠులకు, అనేకరకాల సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికీ ప్రోత్సహించేది.
దీని ద్వారా వాళ్ళలోని సృజనశక్తి కూడా బహిర్గతమయ్యే పరిస్థితులు పుష్కలంగా ఉండేవి. ఇప్పుడంతా లుక్ కల్చర్. టెక్నాలజీ వివరీతంగా పెరిగిపోయి ఛానళ్ళ సముద్రాలు దాటి ఫేస్బుక్లలు, గూగుల్ ద్వీపాల్లో మనుషులు ఒంటరిగా పరుగెత్తుతూ, ఏకాంత జీవితానికి అలవాటు పడిపోయారు. లక్షలమంది మధ్య జీవిస్తూ కూడా తన చుట్టూ ఏం జరుగుతున్నదో గ్రహించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పుస్తకాలు చదవడం కాదు సరికదా పాఠ్యపుస్తకాలైనా సక్రమంగా చదవలేకపోతున్నారు.
పత్రికలు కొనుక్కున్నా దృష్టిమాత్రం టీవీ తెరలను వదలడం లేదు. సంపాదన మీదున్న యావ జ్ఞానార్జనమీద లేదు. మనశ్శాంతి మార్గం వదిలి, సుఖాల కోసం, సౌకర్యాల కోసం ఆరాటపడుతున్నారు. ప్రతి పనిలో యాంత్రికత పెరిగి, మనుషుల్లో సహన సౌజన్యాలు అడుగంటుతున్నాయి. అందుకే యువకులకు ఇప్పుడు సాహిత్య చర్యలు అంటేనే తెలియని పరిస్థితి దాపురించింది.
ప్రశ్న 18.
‘శ్రీరామ పాదుకలు రామరాజ్యాన్ని పాలించాయి’ దీన్ని సమర్థించండి.
జవాబు:
భరతుడు అడవికి బయలుదేరుట : భరతుడు అయోధ్యావాసులతో కలసి బయలుదేరి శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుని అనుమానించాడు. కాని విషయం తెలిసి భరతునికి స్వాగతం పలికాడు. భరతుడు గుహుని సహకారంతో భరద్వాజుని ఆశ్రమం చేరాడు. భరద్వాజుని సత్కారాలు పొంది చిత్రకూటం వైపుకు వెళ్ళాడు.
లక్ష్మణుని తొందరపాటు : రాముడు అడవిలో మృగాల అలజడి విని, కారణం తెలుసుకొమ్మని లక్ష్మణునికి చెప్పాడు. లక్ష్మణుడు చెట్టు ఎక్కి చూశాడు.
సైన్యంతో వస్తున్న భరతుడు కనిపించాడు. వెంటనే చెట్టుదిగి శ్రీరాముని దగ్గరకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో సైన్యాన్ని తీసుకొస్తున్నాడు. మనం ధనుర్బాణాలను సిద్దంచేద్దామని అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణా ! నీవు ఆలోచిస్తున్నది తప్పు. భరతుడు అలాంటివాడు కాదు అని అన్నాడు.
శ్రీరాముని శోకం : భరతుడు పర్ణశాలకు వచ్చాడు. భరత శత్రుఘ్నులు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు. రాముడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. భరతుని కుశల ప్రశ్నలు వేశాడు. రాజనీతి ధర్మాలను భరతునికి బోధించాడు. రాముడు తండ్రి మరణ వార్తవిని ఎంతగానో విలపించాడు. భరతుడు రాముణ్ణి అయోధ్యకు రమ్మన్నాడు. రాజువుకమ్మన్నాడు. రాముడు అంగీకరించలేదు. తండ్రిమాట జవదాటనని అన్నాడు.
పాదుకా పట్టాభిషేకం : రాముడు భరతుని అభ్యర్థన మేరకు తన పాదుకలను ఇచ్చాడు. భరతుడు అన్నా! నీబదులు నీ పాదుకలే రాజ్యాన్ని పాలిస్తాయి. నువ్వు వచ్చేవరకు నేను జడలు ధరించి నంది గ్రామంలో ఉంటాను… అని చెప్పి భరతుడు నందిగ్రామం చేరి పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
(లేదా)
ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికివస్తుంది. జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించడం వల్ల ఎలా సముద్రలంఘనానికి సిద్ధపడ్డాడో రాయండి.
జవాబు:
అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైనవాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు. . సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమ వాళ్ళు నిరాశ పడకుండా జాగ్రత్తపడ్డాడు అంగదుడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించినా ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఒక పెద్దసముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సముద్రాన్ని ‘మహోదధి’ అంటారు. ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది.
సముద్రతీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చెయ్యాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదనుకున్నారు.
వానర వీరులు బలపరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమౌతుందన్న నిశ్చయానికి వచ్చారు. కాని వందయోజనాల దూరం అన్న లంకకు వెళ్ళి రాగలవారెవ్వరని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతుడొక్కడేనని, నిగ్గుదేల్చాడు జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒకచోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు.
జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. వానరులతో తాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను. గ్రహ నక్షత్రాలను అధిగమించగలను, పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలను. మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది అన్నట్లు హనుమంతునిలో శక్తిని జాంబవంతుడు ప్రేరేపించాడు. హనుమంతుడు సముద్ర లంఘనానికి సిద్ధపడేలా చేశాడు.
ఇ) సృజనాత్మకత
ప్రశ్న 19.
‘ప్రసారమాధ్యమాలు (టీ.వి., సినిమాలు) వినియోగం పై నినాదాలు రాయండి.
జవాబు:
- టీవీలు అతిగా చూడకు – కళ్ళకు చేటు తెచ్చుకోకు.
- టీవీలో సినిమా వినోదమే – అదే పనిగా చూస్తే ఆరోగ్యం విషాదమే.
- టీవీలో సీరియల్స్ కల్పనే – అవి నిజమనుకోవడం భ్రమే.
- టీవీతో కాలక్షేపం చేయకు – పని ముఖ్యమని మరవకు.
- ప్రసారమాధ్యమాలకు ఉంది పరిమితి – ఏదీ చేయకు అతి
- ప్రపంచానికి కిటికీలు ప్రసారమాధ్యమాలు – కావు అవి వినోధ కాలక్షేపాలు
- ప్రసార మాధ్యమాలు – విజ్ఞానం పెంచాలి – అజ్ఞానం తుంచాలి.
(లేదా)
వరకట్నానికి రోజూ ఎంతో మంది బలైపోతున్నారు. వీటిని గురించి పత్రికల్లో, టీ.వి.ల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “కరపత్రం” తయారుచేయండి.
జవాబు:
వరకట్నం – ఒక పెనుభూతం
యువతీయువకులారా ! మేల్కొనండి. వరకట్న పిశాచాన్ని తరిమి కొట్టండి. ఈనాడు వరకట్నం యువతులపాలిట జీవస్మరణ సమస్య అయింది. ఈ సమస్యకు ఎంతోమంది స్త్రీలు బలైపోతున్నారు. ఆ విధంగా బలైన ఆడపడుచు మన అక్కగాని, చెల్లిగాని అయితే మన గుండెలు ఎంత ఆక్రోశిస్తాయో ఒకసారి ఆలోచించండి. ఈ భయంకరమైన దురాచారాన్ని రూపుమాపకపోతే ఎంతో విజ్ఞానాన్ని సాధించినా మానవజాతికే సిగ్గుచేటు.
మనం సంతలోని పశువులం కాదు. “చదువులేని వాడిని వింతపశువు” అన్నారు. చదువుకున్నవారు వెళ్లిపశువులు కాకూడదు. వివాహం అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో, పురుషులకూ అంతే ముఖ్యం. వివాహం స్త్రీ, పురుషుల పవిత్రబంధం. ఆడంబరాలకు పోవద్దు. నిరాడంబరంగా పెండ్లి చేసుకోండి. “కట్నం వద్దు, కన్యయే ముఖ్యం” అని భావించండి.
సంస్కారవంతమైన విద్య నేర్వండి. సాంఘిక దురాచారామైన “వరకట్న సమస్య” కు సమాధి కట్టండి.
తేది : X X X X X
ఇట్లు,
వరకట్న నిర్మూలన సంఘం, ఆదిలాబాద్.
పార్ట్ – B
సమయం : 30 ని.లు
మార్కులు : 20
సూచనలు :
- విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
- పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.
I. భాషాంశాలు
అ) పదజాలం :
కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2 మా.)
ప్రశ్న 1.
కుటిలవాజితనం : …………………………….
జవాబు:
కుటిలవాజితనం : కుటిలవాజితనం వల్ల ఎవరైనా సమాజంలో అపకీర్తి పాలవుతారు.
ప్రశ్న 2.
పఠనీయ గ్రంథం : ………………………..
జవాబు:
పఠనీయ గ్రంథం : మహానుభావుల ఆత్మకథలు ప్రతి ఒక్కరికీ పఠనీయ గ్రంథాలు.
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
హనుమంతుడు వార్ధిపై సాగిపోతున్నాడు. (గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి)
A) ఆకాశం
B) నది
C) పర్వతం
D) సముద్రం
జవాబు:
D) సముద్రం
ప్రశ్న 4.
రైతు పుడమిని తల్లిలాగా ప్రేమిస్తాడు. – (గీతగీసిన పదానికి అర్థం)
A) భూమి
B) భామిని
C) నాగలి
D) ఆవు
జవాబు:
A) భూమి
ప్రశ్న 5.
యుద్ధం అనే పదానికి పర్యాయ పదాలు
A) మరణం, కలహం
B) రణం, సమరం
C) పోరు, సముద్రం
D) భూమి, కత్తి
జవాబు:
B) రణం, సమరం
ప్రశ్న 6.
కోవెల లో దేవుడు కొలువై ఉంటాడు. – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు)
A) ఆలయం, విగ్రహం
B) కోవెల, కావలి
C) గుడి, దేవళం
D) గుడి, వీథి
జవాబు:
C) గుడి, దేవళం
ప్రశ్న 7.
ఘనము అనే పదానికి నానార్థాలు
A) మేఘము, గొప్పది
B) గాలి, ప్రాణం
C) గొప్పది, చీకటి
D) దిక్కు, దిశ
జవాబు:
A) మేఘము, గొప్పది
ప్రశ్న 8.
పందెం, కూలి అనే నానార్థాలు కల్గిన పదం
A) ప్రాణం
B) పణం
C) జూదం
D) వ్యాపారం
జవాబు:
B) పణం
ప్రశ్న 9.
వినయంగా ఉండటం మంచివారి సహజ లక్షణం, సహజమైన లక్షణం ఎవరూ మార్చలేరు. ఈ వాక్యంలోని ప్రకృతి వికృతులు
A) వినయం, సాజా
B) వినయం, లక్షణం
C) సహజం, సాజం
D) సహజా, మంచి
జవాబు:
C) సహజం, సాజం
ప్రశ్న 10.
‘ఈశ్వరుడు’ అనే పదానికి వ్యుత్పత్తి కల్గిన పదం
A) స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు
B) సుఖాన్ని కలుగచేసేవాడు
C) దయగలవాడు
D) ఈశాన్య దిక్కున ఉండేవాడు
జవాబు:
A) స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు
ఆ) వ్యాకరణాంశాలు:
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
సత్యోక్తి – ఈ పదాన్ని విడదీసి రాస్తే …………..
A) సత్య + ఓక్తి
B) సతయ + ఉక్తి
C) సత్య + ఉక్తి
D) సత + యోక్తి
జవాబు:
C) సత్య + ఉక్తి
ప్రశ్న 12.
సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ
A) ధీరురాలు
B) కమలాక్ష
C) దేశౌన్నత్యం
D) సూర్యోదయం
జవాబు:
B) కమలాక్ష
ప్రశ్న 13.
దైన్యమైన స్థితి – ఈ విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందినది ?
A) ద్వంద్వ సమాసం
B) ద్విగు సమానం
C) విశేషణ పూర్వపద కర్మధారయం
D) రూపక సమాసం
జవాబు:
C) విశేషణ పూర్వపద కర్మధారయం
ప్రశ్న 14.
గరుడని రూపము కలవాడు – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) బహువ్రీహి సమాసం
D) రూపక సమాసం
జవాబు:
C) బహువ్రీహి సమాసం
ప్రశ్న 15.
ఒకటి, మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు, రెండు, నాలుగు పాదాల్లో ఐదు సూర్య గణాలు వచ్చే పద్యము
A) ఉత్పలమాల
B) కందం
C) సీసం
D) ఆటవెలది
జవాబు:
D) ఆటవెలది
ప్రశ్న 16.
దుష్ట సంహార! నరసింహ! దురిత దూర – ఈ పద్య పాదం ఏ ఛందస్సుకు చెందినది ?
A) తేటగీతి
B) సీసం
C) శార్దూలం
D) ఆటవెలది
జవాబు:
A) తేటగీతి
ప్రశ్న 17.
నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష – దీనిలోని అలంకారం
A) రూపకాలంకారము
B) అంత్యానుప్రాస
C) శ్లేష
D) అతిశయోక్తి
జవాబు:
A) రూపకాలంకారము
ప్రశ్న 18.
ఛేకానుప్రాసాలంకారానికి ఉదాహరణ …………..
A) తెలంగాణ రాష్ట్రం
B) తమ్మునికి చెప్పు, చెప్పుతెగిపోకుండా నడుపుమని
C) తెల్లకలువ
D) మా భవనం ఆకాశాన్ని తాకుతుంటుంది.
జవాబు:
B) తమ్మునికి చెప్పు, చెప్పుతెగిపోకుండా నడుపుమని
ప్రశ్న 19.
‘నేను సినిమాకు రాను’ అని రాహుల్ అన్నాడు. ఈ వాక్యం ?
A) ప్రత్యక్ష
B) పరోక్ష
C) అనుమత్యర్థక
D) విధ్యర్థక
జవాబు:
A) ప్రత్యక్ష
ప్రశ్న 20.
ఒక మిత్రుడివలె అదనంగా చేరడం
A) ఆగమం
B) ఆదేశం
C) వైకల్పికం
D) యడాగమం
జవాబు:
B) ఆదేశం