TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 6 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి.

1. సీ॥ ఎవరు తనాత్మను యేకంబుగా జేసి
సర్వభూతాలని సమము జూచి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము దానతపములన్
చేయుచుండిన ముక్తి చెందగలరు
తామరాకులు నీళ్ళ దడువకుండిన యట్లు
నుందురు సుజ్ఞానులుర్విలోన
నలసియుందురు చూడకళలేని విధముగ
గానవత్తురుధవ కాంతిబొందు
తే.గీ॥ నొకరి దూషించి భూషింపరొకరి నెపుడు
సుఖము దుఃఖమొక పదము జూతురయ్య
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడీ కరమొప్ప కవికుప్ప కనకమప్ప
జవాబు:
ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎవరు = ఎవరైతే
తన + ఆత్మను = తన ఆత్మను
యేకంబుగా జేసి = పరమాత్మతో సమానంగా చేసి
సర్వభూతాలని = అన్ని జీవుల
సమము జూచి = సమానంగా చూసి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము = జ్ఞానము, వైరాగ్యము అనే యజ్ఞం
దాన, తపములన్ = దానాలు తపస్సులు
చేయుచుండిన = చేస్తే
ముక్తి చెందగలరు = మోక్షాన్ని పొందుతారు
తామరాకులు = తామర ఆకులు
నీళ్ళ = నీటిలో
తడువకుండిన యట్లు = తడవకుండా ఉన్నట్లు
ఉందురు = ఉంటారు
సుజ్ఞానులు + ఉర్విలోన = భూమిపై జ్ఞానం ఉన్నవారు
అలసి యుందురు = అలసిపోయి ఉంటారు
కళలేని విధముగ = మొఖంలో కళ లేకుండా
చూడ = చూస్తే
గానవత్తురు = కనిపిస్తారు.
అధవ = తరువాత
కాంతిబొందు = కాంతి వస్తుంది
నొకరి దూషించి = ఒకరిని తిట్టి
భూషింపరు + ఒకరిని = మరొకరిని మెచ్చుకోరు
ఎపుడు = ఎల్లప్పుడు
సుఖము = సుఖాన్ని
దుఃఖము = దుఃఖాన్ని
ఒక పదము = ఒకే విధంగా
చూతురయ్య = చూస్తారు

తాత్పర్యం : నాయనలారా ! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారు.

2. చ॥ కదలెడు పూరిపుల్లకు గకావికలై భయమొంది డప్పితో
బొదలిన జింక దుప్పి కదుపుల్ జలముల్గొన నిన్నుజేరి క్రీ
బెదవుల ముట్టువేళ గని పెంపగు చేపల బల్లటీ ల్గొనం
గదిమి తృష్ణార్తతన్ వెరవు గల్గియు దిక్కుల బార జూతువా ?
జవాబు:
ప్రతిపదార్థం :

కదలెడు = కదులుతున్న
పూరిపుల్లకు = గడ్డిపోచకు కూడా
భయమొంది = భయపడి
కకావికలై = చెల్లాచెదురై
పొదలిన = తిరిగి అలసిన
డప్పితో = దాహంతో
జింక, దుప్పి కదుపుల్ = జింకల దుప్పుల గుంపులు
జలముల్ + గొనన్ = నీరు తాగడానికి
నిన్ను + చేరి = నీ దగ్గరికి వచ్చి
క్రీ = కింది
పెదవుల = పెదవులతో
ముట్టువేళన్ = నీటిని తాకుతుండగా
కని = చూసి
కదిమి = స్వార్ధంతో
పెంపు + అగు = పెరిగిన
చేపల పల్లటీల్ = చేపలు గంతులు
కొనన్ = వేస్తుంటే
తృష + ఆర్తతన్ = దాహం తీరక కలిగే బాధతో
దిక్కులన్ = దిక్కులు పట్టుకొని
వెరవు గల్గియు = ఉపాయంతో
పారన్ + చూతువా ? = వెళ్ళడం చూస్తావా ?

తాత్పర్యం : కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా ?

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘ఆడపిల్లలంటెనే’ పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశం తెలియజేయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠ్యభాగం ద్వారా నిసార్ మహిళాలోకానికి సందేశాన్ని ఇచ్చాడు. ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగుమని సలహా ఇచ్చాడు. పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి. అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు. తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు. ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన భర్త మాత్రం ఆడవారిమీద ఎగిరిఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు. పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్లజాలి చూపాడు.

స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు సందేశం ఇచ్చాడు.

ప్రశ్న 2.
కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని సమాజానికి కలిగిస్తుంది. పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్ లో ఎవరో కోటిమందిలో ఒకడు తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం. ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి.

ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. కోకిల శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు.

కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదనే విషయం నాకు తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది.

మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిలకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తుంది.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు.

అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు. పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో కోకిలతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన “మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన. ఇలా కోకిలకు సమాజానికి సంబంధం ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు వివరించాడు.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కర రామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి.

దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ . పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు.

వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ. ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి.

బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు.

ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.)

అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 2.
కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి.
జవాబు:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను.

దయచేసి ‘నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది.

ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి నక్క ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది.

అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన ‘మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను.

నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు. కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు.

అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం.

ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదోఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు.

నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఉపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి. కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను. నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో ! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు. ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు.

ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్ గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రిని తిట్టేవారు. ఆ మాటల బాధకు ‘ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు.

విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B. చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు.

ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

ప్రశ్న 3.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ?
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫు చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు. కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు.

అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు. చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు.

పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.

రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు. రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు.

కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది. ఈ విషయాన్ని సురేశ్ బాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్లు డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఎవరికుందే నీ పాట వినే తీరిక
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? అని కవి కోకిలను అడిగిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : నీ కమ్మని పాట వినే తీరిక ఎవరికి ఉంది ? అని అర్థం.
వ్యాఖ్య : ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

ప్రశ్న 2.
విమలభాస్వద్రూప శైవాలినీ
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.
వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు
జవాబు:
కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.
సందర్భం : ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా . తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చునని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : గురువును మనస్సులో నిలిపితే మనకు గుర్తింపు వస్తుందని అర్థం.
వివరణ : గురువును నమ్ముకుంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసి పేరు పొందవచ్చునని భావం.

ప్రశ్న 4.
సుచరితక్రమమిప్పుడు తప్పనేటికిన్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి భరతవంశ ప్రాశస్త్యాన్ని వివరిస్తున్న సందర్భంలోనిది.
అర్థం : మంచి వంశ క్రమాన్ని ఇప్పుడు ఎందుకు తప్పుతారు ?
వివరణ : మహారాజా ! మీ భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు గలిగి కీర్తి పొందింది. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ, సద్గుణాలయందు శ్రేష్టులు, మరి నీ కుమారులూ కీర్తి భారం వహించ జాలినవారు. కళ్యాణ స్వభావులు. ఇంత మంచి నడవడిగల వంశ సంప్రదాయం ఇప్పుడు కూడా తప్పించడం ఎందుకు ? అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు. సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.
వ్యాఖ్య : దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 2.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.
వ్యాఖ్య : 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

ప్రశ్న3.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం: పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.
వ్యాఖ్య : రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

ప్రశ్న 4.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.
వ్యాఖ్య : తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది ?
జవాబు:
సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు. భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజునునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు. ఆ మాంసపు ముద్దను ముక్కలు చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు జన్మించారు.

వీరు పెరిగి ప్రజలను కష్టపెట్టసాగారు. వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో పాతాళానికి వెళ్ళారు. అక్కడ తమ యాగాశ్వాన్ని చూశారు. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న కపిలమహర్షిని చూశారు. ఆ మహర్షే తమ యాగాశ్వాన్ని అక్కడ దాచిపెట్టాడని అతని తపస్సును భగ్నం చేయ ప్రయత్నించారు. అలా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 2.
కుటుంబ ప్రగతిలో స్త్రీ పాత్రను వివరించండి.
జవాబు:
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. ఇలా కుటుంబ ప్రగతిలో స్త్రీపాత్ర కీలకం అని నిసార్ తెలిపాడు.

ప్రశ్న 3.
శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చానన్నాడు ?
జవాబు:
ధృతరాష్ట్రుని సభలో ఉన్న వారందరూ శ్రద్ధగా వింటుండగా పాండవులు పంపిన సంధి సమాచారాన్ని ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు. “ఓ జననాథ ! నీకు తెలియని విషయాలు ఏమున్నాయి ? ఐనప్పటికీ, భరతవంశం సంతోషించేటట్లు నా ఇరు కుటుంబాల వారికి న్యాయమూ, పరమహితమూ చెప్పటం ఉచితమని నేనిక్కడికి వచ్చాను అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఇందులో జననాథ అనడం ద్వారా కేవలం నీ కొడుకుల గురించి మాత్రమే కాకుండా సమస్త ప్రజల గురించి ఆలోచించాలి అనే విషయాన్ని గుర్తు చేశాడు.

నీకు తెలియని విషయాలు ఏమున్నాయి అనడం ద్వారా. తన విషయాన్ని ప్రదర్శించాడు. ఇరు కుటుంబాల వారికి అనడం ద్వారా కౌరవ పాండవులు ఇరువురు తనకు కావలసిన వారే అని చెప్పాడు. న్యాయము, పరమ హితము చెప్పడానికి వచ్చాననడం లోకకళ్యాణాన్ని సూచిస్తుంది. కావున శ్రీకృష్ణుడు కోసం యుద్ధాన్ని మాన్పించడానికి వచ్చానని చెప్పాడు.

ప్రశ్న 4.
శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు ?
జవాబు:
నాలుక నాకు తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అన్నాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని కవి భావం.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపౌకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది.

ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నం చేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

ప్రశ్న 2.
బలమైన సంకల్పంతో చేసే కృషి ఎలాంటి ఫలితమిస్తుంది ?
జవాబు:
ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగరాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి. ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు (ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన నమ్మకాలకు) నిస్సందేహంగా ఎదురీదగలమని కలాం ప్రబోధించాడు.

ప్రశ్న 3.
చిందుల ఎల్లమ్మ ప్రదర్శనలు, పురస్కారాలు తెలుపండి.
జవాబు:
చిందు ఎల్లమ్మ ఇచ్చిన ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో కొన్ని వేల ప్రదర్శనలిచ్చింది. ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది. 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్లో జాతీయ ప్రదర్శన ఇచ్చింది.

ఎల్లమ్మ పొందిన అవార్డులు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది. 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది. 2004లో అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

ప్రశ్న 4.
తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.
జవాబు:
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
కౌరవపాండవులు వేటిలాగా కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు ?
జవాబు:
పాలు నీళ్ళు లాగ

ప్రశ్న 2.
‘భగీరథ ప్రయత్నం’ ఏ కావ్యం లోనిది ?
జవాబు:
శ్రీమత్ పండరీనాథ రామాయణం

ప్రశ్న 3.
బతుకమ్మలాగ నీటిలో మునిగి ముగిసేది ఏది ?
జవాబు:
తొమ్మిది రంధ్రాల మానవ శరీరం

ప్రశ్న 4.
దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?
జవాబు:
చందమామ

ప్రశ్న 5.
కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు ?
జవాబు:
కవులు

ప్రశ్న 6.
ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ?
జవాబు:
ఆడవారు, స్త్రీలు

ప్రశ్న 7.
గంగను శిరస్సుపై ఎవరు ధరించారు ?
జవాబు:
శివుడు

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 8.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో.

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు ?
జవాబు:
ప్రధర్శన ముగిసిన తరువాత హారతి తీసుకున్న తరువాత.

ప్రశ్న 2.
సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
జవాబు:
నూతన ఆలోచనలకు.

ప్రశ్న 3.
చిన్నయసూరి రాసిన లక్షణ గ్రంథమేది ?
జవాబు:
శబ్ద లక్షణ సంగ్రహం

ప్రశ్న 4.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 5.
భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి.
జవాబు:
తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్.

ప్రశ్న 6.
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది ?
జవాబు:
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది.

ప్రశ్న 7.
ధర్మశాస్త్రములు ఏమని బోధిస్తున్నవి ?
జవాబు:
అహింసా పరమోధర్మః

ప్రశ్న 8.
రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఉత్పలమాల
జవాబు:
ఉత్పలమాల లక్షణము :

  1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి ’20’ అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో, 10వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 6 with Solutions 1
యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘, టా‘ లకు యతిమైత్రి చెల్లుతుంది.

2. కందం
జవాబు:
కందం లక్షణము :

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
  3. కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
  4. బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
  5. ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
  6. 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
  7. రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
  8. ప్రాసనియమం ఉండాలి.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 6 with Solutions 2
యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.

3. చంపకమాల
జవాబు:
చంపకమాల లక్షణము :

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 6 with Solutions 3

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 2.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 3.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 4.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 5.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 6.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 7.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 8.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’ లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఛేకానుప్రాస
జవాబు:
ఛేకానుప్రాస : రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థ భేదంతో మళ్ళీ వచ్చినట్లయితే అది ‘ఛేకానుప్రాస’ అలంకారము.
ఉదా : పాప సంహరుడు హరుడు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, మొదటి ‘హరుడు’ అనగా, హరించేవాడు అని, రెండవ ‘హరుడు’ అనే పదానికి, ‘శివుడు’ అని అర్థం. మొత్తం వాక్యానికి “పాపాలను హరించేవాడు శివుడు” అని అర్థం. ఈ విధంగా ఒకే పదం, అనగా ‘హరుడు’ అనే పదం, అర్థభేదంతో వెంటవెంటనే వచ్చింది. కాబట్టి ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.

2. స్వభావోక్తి
జవాబు:
స్వభావోక్తి లక్షణము : జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి’. – ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.

3. రూపకాలంకారం
జవాబు:
రూపకాలంకార లక్షణము : ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది’
‘రూపకాలంకారం’.
ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్” వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 2.
ఉపమావాచకాలు ఏవి ?
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

ప్రశ్న 3.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.

ప్రశ్న 4.
ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు ?
జవాబు:
దీనిని ‘అంత్యానుప్రాస అలంకారం అంటారు.

ప్రశ్న 5.
‘ఉపమేయం’ అనగానేమి ?
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’)

ప్రశ్న 6.
‘అతిశయోక్తి’ అనగానేమి ?
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.

ప్రశ్న 7.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

ప్రశ్న 8.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది

XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.
జవాబు:
విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.

XVI.

(అ) పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ.. (1 × 5 = 5)
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం – ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన : నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ : నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన : అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ : ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా!
వందన : నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ : అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన : మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ : బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా !
వందన వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ : ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన : ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ : తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన : ధన్యవాదాలు సర్ !

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ?
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు,

ప్రశ్న 2.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

TS Inter 2nd Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 4.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

ప్రశ్న 5.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

Leave a Comment