AP Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 8 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. నాకుం జుట్టము ………………. బొంకన్నిజం చింతయున్.
జవాబు:
నాకుం జుట్టము తల్లిదండ్రులు జెలు థుల్నాథుండు నీ దైవమే,
మీ కిచ్చోఁ బనిలేదు కస్తిపడఁగా మీ పల్లెకుం బొందు; కా
రా కూరంబులు చేసినం, గదలి నే రా; నిచ్చటం బ్రాణముల్
పోకార్తుందుది నాదు వేలుపునకై; బొంకన్నిజం బింతయున్.

భావము : నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అధిపతి ఈ దేవుడే. మీరు ఈ అడవిలో కష్టపడే అవసరం లేదు. మీరు గూడేనికి వెళ్ళండి. మీరు ఒత్తిడి కలిగించినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను, ఇదంతా నిజం అని తిన్నడు పలికెను.

2. తొడంబుట్టవు ……………. గృపాధుర్యాత్మ కావింపవే.
జవాబు:
తోడంబుట్టువులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం
పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా
ర్దోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్ల నా
తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే.

భావము : అంతట ధర్మరాజు ఇంద్రునితో మహాత్మా ! నా తోబుట్టువులందరూ మరణించారు. సుకుమారి ద్రౌపది అలసి దప్పికతో చనిపోయింది. ఆ దుఃఖం నా మనసును కలచివేస్తోంది. వారందరూ నాతో బయలుదేరి వచ్చారు. వారు లేకుండా నేను రాలేను. కనుక వారు కూడా నాతో వచ్చేట్లుగా తాము నాపై దయతో అనుమతింతురు గాక అని ధర్మరాజు అన్నాడు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలను రాయండి.
జవాబు:
పాండవులు, ద్రౌపది మరియు కుక్క హిమాలయాన్ని దాటి అడవులు, భూములు, నదులు, కొండలు పెక్కింటిని దృఢమైన యోగంలో, నిరాకుల మనస్సుతో, శోకాన్ని విడిచి, ఆయాసమన్నది లేక మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

అలా ఆ ఏడుగురూ (పాండవులు, ద్రౌపది, కుక్క) స్థిరయోగ సాధనపరులై అత్యంత వేగంగా నడుస్తుండగా ద్రౌపది నేలపై పడిపోయింది. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! ద్రౌపది నేలకు ఒరిగిపోయింది. ఈమె నలన ఏనాడు కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు కదా ? మరి ఈమె పడుటకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని చెప్పి స్థిరమైన మనస్సుతో ఆమె శవాన్ని అక్కడే విడిచి ముందుకు సాగిపోయాడు.

అలా వెళ్ళగా వెళ్ళగా సహదేవుడు ప్రాణాలు కోల్పోయి నేలకూలాడు. అది చూసిన వాయుపుత్రుడు భీముడు అన్నకు ఈ విషయం చెప్పి, సహదేవునికి అహంకారమన్నది లేదు. మిమ్మల్ని ఎంతో భక్తితో సేవించాడు. మీ అందరిలో ఎంతో సన్మార్గుడు. అట్టి సహదేవునకు ఈ స్థితి ఎందుకు సంభవించింది ? అని అడుగగా, ఇతడు లోకంలో తనకంటే సమర్ధుడు ఎవడూ లేడని భావిస్తూ తనకు తాను చాలా గొప్పవాడినని భావించుకుంటూ ఉండేవాడు. అందువలన అతనికి ఈ దుస్థితి సంభవించింది అని నిర్వికార భావంతో ధర్మరాజు ముందుకు సాగిపోయాడు.

భీమార్జున, నకులుడు, కుక్క తనను అనుసరిస్తుండగా ధర్మరాజు మనసు స్థిరం చేసుకుని ముందుకు పోతున్నాడు. అంతలో ద్రౌపది, తన సోదరులు సహదేవుడు ప్రాణాలు కోల్పోవడం చూసిన నకులుడు ధైర్యం కోల్పోయి ప్రాణాలు విడిచాడు. దుఃఖించిన మనసుతో భీముడు అన్నగారిని అడిగాడు. అందం, శౌర్యం, ధైర్యం, సుజనత్వంలో కురువంశంలోనే కాక, లోకంలోనే ఇటువంటి గుణశ్రేష్ఠుడు లేడు. అలాంటి పుణ్యమూర్తికి ఇలాంటి దురవస్థ సంభవించిందేమి, అనగా ఇతనికి లోకంలో తనను మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ అహంకారమే అతనిని ఈ గతికి తెచ్చింది అని నకులుని పట్టించుకొనక ముందుకు సాగాడు.

ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

భీమునికి సోదరులు, ద్రౌపది అందరూ అలా నేలకొరిగిపోవడం మనసును కలిచి వేసింది. ఆయన్ను దైన్యం వహించింది. ధైర్యం దిగజారిపోయింది అతనిలో. అంతే అతడు నేలకొరిగిపోయాడు. అలా ఒరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేల వాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే దయతో చెప్పండి అన్నాడు. దానికి ఆయన నీకు తిండి మీద ఆసక్తి అధికం, అతిగా ఆరగిస్తావు. అదిగాక నీకు గల భుజశక్తి వలన గర్వం అధికం. ఎవరినీ లెక్కచేయని తత్త్వం. పనికిమాలిన మాటలు అనేకం ఎపుడూ మాట్లాడేవాడివి. అందుకే నీకు ఈ స్థితి కలిగిందని ధర్మరాజు పాండవుల మరియు ద్రౌపదిల మరణానికి కారణాలను తెలిపాడు.

2. ‘శ్మశానవాటి’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శ్మశానవాటి జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు స్వాగతించే మహాప్రస్థానం.
అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ? ఎంతకాలము నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భ శోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయాయి. ఇది నిజం.

ఆకాశంలో నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు, దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేటట్లు ఘోషిస్తున్నాయి. గాలి వీచడం లేదు. ఆకులు కూడా కదలడం లేదు. సుఖం ఇక్కడ ఆనందిస్తూ ఆటలాడుకుంటుంది కదా.

ఈ శ్మశానవాటిలోనే గొప్ప కవి యొక్క మధురమైన రచనలు నిప్పులతో కలిసి పోయాయి. ఇక్కడే దేశాలను పాలించే రాజశ్రేష్ఠుల రాజచిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు మాంగల్య సౌభాగ్యం నీటిలో కలిసిపోయింది. ఇక్కడే ప్రసిద్ధికెక్కిన చిత్రకారుని కుంచె నశించిపోయింది. ఈ శ్మశానం దెయ్యాలతో శివుడు గజ్జెకట్టి నర్తించి ఆడే రంగస్థలం. ఈ శ్మశానం యమదూతల కఠిన చూపులతో సమస్త భూమండలాన్ని పరిపాలించే భస్మ సింహాసనం.

చిక్కని చీకటిలో, కొత్తగా కట్టిన ఒక సమాధి గూటిలో ప్రమిదలో ఆముదం అయిపోయినా, ఆరిపోక మిణుగురు పురుగులాగా వొత్తి కాలుతూనే ఉంది. దానిని దీపం అందామా ? చనిపోయిన కుమారుని శ్మశానంలో పెట్టి ఏడుస్తూ పోయిన ఒక దురదృష్టవంతురాలైన తల్లి హృదయమందామా ?

ఈ శ్మశానంలో ఎందరో కవులు, గాయకులు ధూళిగా మారి నడిచేవారి కాళ్ళతో తొక్కబడుతున్నాయి. ఒకానొకనాడు ప్రసిద్ధికెక్కిన కాళిదాసు, భారవుల వంటి మహాకవుల శరీరాలు ప్రకృతి అనే ఈ రంగస్థలంలో చిన్న ధూళికణాలుగా మారి ఏ కుమ్మరివాని చక్రంపైనున్న మట్టిలో కలిసాయో కదా !

ఈ పిల్లల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడి పోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి. ఇక్కడ అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో ప్రాణాలు తీసి మట్టిలో కలిసిపోయేటట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్వికమైన మేకను పక్కపక్కనే చేర్చి, జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుడు వంటి భేదభావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం, ఏ ఆకలి బాధతో దుఃఖించి, నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిదో కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు. ఈ విధంగా మానవుడి అంతిమ గమ్యస్థానం గురించి జాషువా తాత్వికంగా వర్ణించాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హాస్యం యొక్క లక్షణాలను తెలపండి.
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలిసిన సహృదయునికి నవ్వు పుట్టించేది నిజమైన హాస్యం. హాస్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి :
అసహజత్వం : ఒక విషయంలో వుండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజము. ఒంటికాలుతో నడవటం అసహజం. మనుషులు గుఱ్ఱాలను ఎక్కితే బాగుంటుంది. కాని, గుఱ్ఱం మనుషులపైకెక్కితే విపరీతంగా నవ్వువస్తుంది. పత్నికి పతి దైవ సమానం అనే మాట సహజం. పత్నియే పతికి దైవం అంటే నవ్వుకు కారణమవుతుంది.
ఇలాంటివే చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటి వాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, పానుగంటి వారి బధిర విధవా ప్రహసనం అసహజత్వ హాస్యానికి ఉదాహరణలు.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.

ఆశ్చర్యము (Surprise) : ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా వుంటుంది అని మనం ఊహిస్తే, ‘అందుకు భిన్నంగా వేరేగా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తద్వారా హాస్యం పుడుతుంది. స్వల్ప విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరొక అర్థాన్ని స్ఫురింపజేస్తూ మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సృష్టించటం అసహజ హాస్యం లోకే వస్తుంది.

అసందర్భ శుద్ధి లేకపోవటం : సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (Impropriety) నవ్వు తెప్పిస్తుంది. ఆ నవ్వు నిర్మలంగా ఉండదు. అయినా అదీ హాస్యమే.

అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్ని మెత్తని మాటలతో చెప్పటం వల్ల హాస్యం పుడుతుంది. అసత్యాన్ని సత్యంగాను, దుఃఖాన్ని సుఖంగాను, సుఖాన్ని దుఃఖంగాను, అప్రియ విషయాన్ని ప్రియమైన దానిగాను మలచటం, నేర్పుతో హాస్యాన్ని సృష్టించట మవుతుంది. దీన్ని distortion అంటారు.

అతిశయోక్తి : అతిశయోక్తి (Exaggaration) కూడ ఒక ముఖ్య హాస్య లక్షణం. అయితే విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస జనకం అవుతుంది. పరమ సత్యం అయితే నవ్వురాదు. అతిశయోక్తుల్లా కనపడేవి నిజంగా అతిశయోక్తులా సత్యమైన గాథలా అని నిశిత దృష్టితో పరీక్షించాలి.
అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది. ఇవి ముఖ్యమైన హాస్యలక్షణాలు.

2. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెల్పండి.
జవాబు:
కందుకూరి వారి సంఘ సంస్కరణ కార్యకలాపాలన్నీ స్త్రీల సమస్యలతో ముడిపడి వున్నవే. తన వనరులను శక్తి యుక్తులను అంటే మానసిక భౌతిక శక్తులను, ద్రవ్యాన్ని చివరకు ప్రాణాన్ని సైతం స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని వారు సత్యవాది పత్రికలో ప్రకటించారు. బాల వితంతువుల దీన స్థితి, అవిద్య, మూఢ విశ్వాసాల నిర్మూలన, స్త్రీలు సభలలోకి రాకూడదు వంటి సాంఘిక నియమాలు లాంటి సమస్యలను పరిష్కరించటానికి ఆయన పూనుకున్నారు.

కందుకూరి సంస్కరణల్లో శాశ్వత చరిత్ర గలది స్త్రీ జనోద్ధరణ. అందుకే వారిని మహిళోద్యమ జనకులు, మహిళాభ్యుదయ పితామహుడు అని అభినందించటం అతిశయోక్తి కాదు. వారు కన్యాశుల్కాన్ని వ్యతిరేకించారు. ఆనాడు అతినిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను బలపరచారు. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలోను బాలికా పాఠశాలలను స్థాపించారు. ముందుగా తన భార్యకు విద్య నేర్పి ఆమెనొక ఉపాధ్యాయినిగా తయారు చేశాడు. ఆచరించి ప్రబోధం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

శాస్త్రాల ఆధారంతో బాల్య వివాహాలను నిరసించాడు. బాల్య వివాహ నిషేధ శాసనం కావాలని ఆందోళన జరిపించాడు. కందుకూరి వితంతువులకు వివాహాలు చేయటానికి అయిదుగురు అనుచరులతో 1879లో రాజమండ్రిలో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు ఆశ్రమాలు నెలకొల్పాడు. పునర్వివాహితులకు పురుళ్ళు పోశాడు.

వీరు, 11-12-1880 సం॥లో రాజమండ్రిలో అర్ధరాత్రి వధువును రహస్యంగా తెచ్చి ప్రథమ వితంతు వివాహాన్ని జరిపించారు. సనాతనులు కందుకూరిని బహిష్కరించారు. పీఠాధిపతులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో, మద్రాసులో వితంతు వివాహ వ్యతిరేక సంఘాలు వెలిశాయి. అయినా మొక్కవోని ధైర్యంతో కందుకూరి వారు పైడా రామకృష్ణయ్య ఆర్థిక తోడ్పాటుతో 1884 నాటికి 10పెళ్ళిళ్ళు చేశారు.

భోగం మేళాల నిషేధానికి కందుకూరి ఎన్నో పాట్లు పడి మార్గ దర్శకులయ్యారు. సంస్కృతి పేరుతో భోగం మేళాలను, భోగపు స్త్రీలను ఆదరించిన పెద్దలపై తన హాస్యాన్ని కుమ్మరిస్తూ ఎగతాళి చేశారు.
19వ శతాబ్దంలో మహిళా ఉద్యమం స్త్రీలకు న్యాయం కావాలనే భావంతో ఉదయించింది. కందుకూరి కృషితో బాల వితంతువుల పట్ల జాలి, కరుణ, స్త్రీ విద్య పట్ల అభిమానం ఆనాడు వెల్లివిరిశాయి. ఆ కాలంలో ప్రజల మానసిక క్షేత్రాలలో ఈ భావాల విత్తనాలు నాటిన మహనీయుడు. మహిళోద్యమ జనకుడు కందుకూరి వీరేశలింగం.

ఈనాడు సభలలో – స్త్రీ పురుషుల సభలలో మహిళలు పాల్గొంటున్నారంటే దానికి కారణ భూతుడు కందుకూరి. తను ఏర్పాటు చేసిన సభలలో పురుషులు తమ సతీమణులతో, తల్లులతో, అక్కచెల్లెళ్ళతో రావాలని నియమం పెట్టారు. అది ఆనాటికి గొప్ప విప్లవ చర్య. ఆయన మాటననుసరించి పురుషులు అలాగే స్త్రీలతో వచ్చేవారట. కందుకూరి జనోద్ధరణ పందొమ్మిదో శతాబ్దం అని గుర్తు పెట్టుకుంటే గాని దాని ప్రాముఖ్యం గోచరించదు.

IV. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ‘అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటి నుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. వీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

2. కుంకుడాకు కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
పారమ్మ, గవిరి ఇద్దరూ ఒకే వయసున్న పల్లెటూరి పిల్లలు. పారమ్మ అప్పలనాయుడు కూతురు. గవిరి చినదేముడు కూతురు. అప్పలనాయుడు పలుకుబడిగల మోతుబరి రైతు. చినదేవుడు కూలి పని చేసుకునేవాడు. వారి మధ్య అంతరమే వాళ్ళ పిల్లల మధ్య ఉంటుంది. పారమ్మ ఊరగాయ రుచిగా ఉందని అనగానే గవిరి రొయ్యలు తిన్నానని అబద్ధం ఆడుతుంది. మీరు రాత్రి వండుకోలేదని పారమ్మ ఎత్తిపొడుస్తుంది.

గవిరి తండ్రి కూలి చేసి ఏమైనా తెస్తేనే వారికి ఆపూట గంజి అయినా తాగి కడుపు నింపుకుంటారు ఆ కుటుంబం. తల్లిదండ్రి గవిరి కష్టపడితే గాని తిండికి కూడా గడవని ఇల్లు అది. ప్రతిరోజు కోనేటికి పోయి ఇంటికి సరిపడా నీళ్ళు మొయ్యాలి. కర్రా కంపా, ఆకు అలము ఏరి పొయ్యిలోకి వంట చెరకు తేవాలి ఇదీ గవిరి పరిస్థితి. పారమ్మ బడికి పోతానన్నప్పుడు కూలిచేసే వాళ్ళ చదువెందుకని గవిరి నిరాశగా అంటుంది. గవిరితోపాటు పొలాల్లోకి వెళ్ళి పారమ్మ పొలాల్లో దొరికే పెసరకాయలు చింతకాయలు ధైర్యంగా తీసుకొని తింటుంది. గవిరి కడుపు కాలుతున్నా సాహసం చేయలేదు. పేదరికం వల్ల ధైర్యం చాలదు గవిరికి డబ్బులేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరమౌతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తే అది కప్పిపుచ్చుకోగలరు. అందుకే పారమ్మకు నిర్భయం. ఎవరైనా చూస్తే మాడు పగులుతుందని గవిరి హెచ్చరిస్తే “నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారు” ? అని తిరిగి సమాధానం ఇస్తుంది.

తట్టనిండా కుంకుడాకులు ఏరుకొని కాంభుక్త గారి కళ్ళం వైపు నడుస్తారు ఇద్దరూ. అక్కడ చింతకాయలు చూసి పారమ్మ రాయితో కొడుతుంది. మూడు కాయలు పడతాయి. తీసి పరికిణిలో దోపుకొని తింటూ ఉంటుంది. గవిరి ఒక కాయ అడిగినా ఇవ్వదు. కావాలంటే నువ్వూ రాయితో కొట్టు అని అంటుంది. గవిరి ఒక రాయి తీసి వేస్తుంది. క్రింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక రాయివేస్తే కొమ్మ విరిగి పడుతుంది. పొయ్యిలోకి చాలా మంచి సాధనం అని చితుకులు తట్టలో వేసుకుంటుంది. ఎదురుగా కాంభుక్తగారు ఎవరది అని గద్దిస్తాడు. కోపంగా ఉన్న కాంభుక్తని చూసి గవిరి భయపడిపోతూ పొయ్యిలోకి చితుకులు అని అంటుంది. కాంభుక్త కోపంగా తట్టని ఒక తన్ను తంతాడు. ఆకులన్నీ చెల్లాచెదురైపోతాయి. వాటిని పోగు చేసుకోవాలనుకున్న గవిరి నడుంమీద చేతికర్రతో ఒక్క దెబ్బవేసాడు. అంతేకాదు ఆ తుప్పవార ఏందాచావంటూ దొంగతనం అంటగట్టాడు. తాను దొంగ కాదు కాబట్టి ధైర్యంగా నేనేమి దాచలేదు అంటూ ఎదురు తిరిగింది గవిరి. నిజం చెప్పినా కొట్టడానికి వచ్చిన భుక్త గారిని బూతులు తిట్టింది గవిరి. అది సహించలేని భుక్తగారు పాంకోడు విసిరాడు. గవిరి కాలికి తగిలి క్రిందపడింది. ఏడ్చిఏడ్చి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయ్యింది. `ఆ చింత కంప తనకి అక్కరలేదని అక్కడే వదిలేసి కుంకుడాకులు తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. కాలు నొప్పితో మంటగా ఉన్నది. కాలు దెబ్బని చూసుకొంది. బొప్పికట్టి ఎర్రబడింది. తన నిస్సహాయతకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.

3. ‘ఊతకర్ర’ కథలో రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి.
జ.
జీవితంలో అందరూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో వారితో ఇమడలేక తన ఇంట్లో ఒంటరి బ్రతుకు బ్రతుకున్న వ్యక్తి. జీవన పోరాటంలో తన బిడ్డల కోసం తాపత్రయంతో బ్రతికాడాయన. ఎవరైనా తన బిడ్డల గురించి ఆలోచిస్తారే కాని వారు ఒకరికి బిడ్డలమేనన్న స్పృహ ఉండదు. అందుకే తనవంటి అభాగ్యులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనిలా మిగిలిపోతున్నారు.

ఇలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్న అతను ఒకరోజు బయటకు వచ్చాడు. ఎంతదూరం నడిచాడో అతనికి తెలియదు. ఒంట్లో ఓపిక లేదు. బాట ప్రక్కన ఒక పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ చెట్టు నీడన సేదతీరాలని చేరబడ్డాడు ఆ వృద్ధుడు. ఇంతలో అతనికి కొంతదూరంలో ఓ దృశ్యం కంటపడింది. తనను అది బాగా ఆకట్టుకుందని రచయిత భావించాడు.

అక్కడకు కనుచూపుమేరలో ఒక పల్లె అంత ఎండలో అంతదూరం ఎలా వెళ్ళాడో అతనికే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు చేరాలంటే గుండె గుభేలుమన్నది. కాసేపు అక్కడే కూర్చునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ చెట్టు పక్కనే బాట. ఆ బాటకు కాస్త దగ్గరలో కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇల్లు దూలాల మధ్య ఎండుగడ్డితో కప్పుతున్నాడు ఓ వ్యక్తి. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు ధారాపాతంగా కారుతున్నా పనిలో నిమగ్నమయ్యాడు. అది ఆ వ్యక్తి తండ్రి చూశాడు. కన్నపేగు మెలిపడింది. ముసలాడు ఊతకట్టెపై ఆనుకొని తలపైకెత్తి చూశాడు. సూర్యకాంతికి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తూ పొద్దు తిరిగాక కట్టవచ్చు కదా ! ఇప్పుడు కాస్త అన్నం తిని పడుకోరాదు అని అన్నాడు. పని అయిపోతుంది కాస్తంత కోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి అంటూ తండ్రి మాటను పెడ చెవిని పెట్టాడు.

కన్నతండ్రి మాటను పెడచెవిని పెట్టినందుకు మనసు చివుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళి మూడేళ్ళ పసివాడిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి. పాలుగారే పసివాడి పాదాలు చుర్రుమనగానే కెవ్వుమన్నాడు. ఇంటి పైకప్పు పని చేస్తున్న తండ్రి చెవుల్లో పడిందా కేక. అయ్యయ్యో ! పసివాణ్ణి ఇలా వదిలేసారేమిటని గబగబా దిగాడు. బిడ్డను ఎత్తుకున్నాడు. ఇదే విషయాన్ని రచయిత చెప్పాలనుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లే కదా ! ఈ సంగతి ఎవరూ గుర్తించరేమని రచయిత అభిప్రాయం. ఈ తండ్రీబిడ్డల సంఘటన అనుబంధానికి ఒక చక్కని నిదర్శనం. ఈ సంఘటనే ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధునికి ఉపదేశ వాక్యమయ్యింది. ఈ ఘటన ద్వారా రచయిత తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించారు.

4. ‘సౌందర్యం’ కథ ద్వారా మనుషుల స్వభావాలను విశ్లేషించండి.
జ.
బస్సులో పుట్టింటికి ప్రయాణమౌతుంది రేఖ భర్తతో సహ, తన ఐదేళ్ళ కొడుకుని తీసుకొద్దామని బస్సులో ముగ్గురు కూర్చొనే సీటులో రేఖ తన భర్త సుందర్రావు ఉండగా చంద్రం అనే వ్యక్తి ఆ సీటులోకి వస్తాడు. సుందర్రావు రేఖ సర్దుకుంటారు. చంద్రం కూర్చుంటాడు. బస్సు బయలుదేరగానే నిద్రలోకి జారుకుంటాడు సుందర్రావు. నిద్రపట్టగానే తెలియకుండానే గురక పెడతాడు. బస్సులో అది అందరికి ఇబ్బందిగా ఉంటుందేమోనని రేఖ సిగ్గు పడుతుంది. బస్సు ఎక్కగానే ఈ నిద్ర ఏమిటి ? అంటుంది. ప్రక్కనే ఉన్న చంద్రాన్ని చూసి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో నని ఆలోచిస్తుంది. ఇది సాధారణంగా అందరిలో ఉండే సహజగుణమే. తమను చూసి ఎదుటివారు ఏమనుకుంటారోనని మన సహజత్వాన్ని దాచిపెట్టి కృత్రిమ స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. చాల మందిలో ఈ రకమైన స్వభావమే ఉంటుంది.

ఈ కథలో రేఖ తన భర్తని చూసి చంద్రం ఏమనుకుంటాడోనని ఆలోచిస్తుంది. అలాగే భర్తను కిటికీ వైపు కూర్చోమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా చూసినా ప్రక్కనున్న చంద్రం భార్య అనుకుంటారని తృప్తిపడుతుంది. దీనిని బట్టి భర్త అందంగా లేడని బాధ పడే మనుషులు ఈ సమాజంలో ఉన్నారని రచయిత్రి అభిప్రాయం. పెళ్ళి సమయానికి సుందర్రావుకు బట్టతల లేదు. తర్వాత సంపాదన కోసం ఎండనక వాననక కష్టపడి నల్లగా లావుగా బట్టతలతో మార్పులు వస్తాయి. ఆ మార్పుని కూడా అంగీకరించలేని మనుషులు చాలా మంది ఉంటారని ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.

బస్సులో నిద్రపోయే సుందర్రావును విసుక్కుంటుంది రేఖ. గురక పెట్టే వ్యక్తిని సహించలేకపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఇలా తన మానసిక భావాలతో సంఘర్షణ పడుతుంది. బస్సులో అరటి పళ్ళు తినడం పాన్ వేసుకోవడాన్ని ఇష్టపడదు. అది ఒక అనాగరికుల అలవాటు అనుకునే వారు ఉంటారు. ఎవరికి నచ్చినట్లు వారు తినడం కూడ నచ్చదు. అరటి పళ్ళన్నీ తిన్న సుందర్రావును చూసిన రేఖ అసహ్యించుకుంటుంది. నిద్రపోతూ గురక పెట్టిన భర్త ఎలుగు బంటిలా కనబడతాడు. ముందు సీట్లో చిన్న పిల్లవాడు సుందర్రావును చూసినప్పుడు జూలో జంతువులను చూసిన కొడుకును గుర్తుచేసుకుంటుంది. రేఖ అవస్తను గ్రహిస్తూ ఉంటాడు చంద్రం.

బస్సులో ముందు సీటులో భార్య భర్త 5 ఏళ్ళ ఒక పిల్లవాడు కూర్చుంటారు. ఆ భర్త అందంగానే ఉన్నాడు. భార్య ఓ మోస్తరుగా ఉంటుంది. ఆమెను బస్సు ఎక్కినప్పటి నుండి సతాయిస్తూనే ఉంటాడు. ఆమె తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఒక యాస్ప్రిన్ మాత్ర తెమ్మంటే క్రూరంగా నవ్వి నీకు కాఫీలు మోయాలా ? ఇంటికెళ్ళాక తాగవచ్చులే అని అంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటుంది రేఖ. రేఖ భర్త కాఫీ, టిఫెన్ తెచ్చి తినమని ప్రాధేయపడితే విసుక్కుంటుంది. అప్పుడు ముందు సీటులో ఉన్న ఆమె రేఖను చూసి నీవు చాలా అదృష్టవంతురాలవి. తినమని చెప్పే భర్తలు ఎంతమందికి దొరుకుతారు ? భార్యను ప్రేమగా చూసే భర్త దొరకడం నీ అదృష్టం అని అంటుంది. దూరంగా చిన్న బుచ్చుకున్న మొహంతో వస్తున్న సుందర్రావుని చూసి జాలి పడుతుంది. తన భర్త ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. అమృత హృదయుడు అమాయకుడు ఇటువంటి భర్తను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడుతుంది రేఖ. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వికృతంగా అనిపించింది రేఖకు. భార్య ప్రశాంతంగా ఉండటం చూసి సంతోషించాడు సుందర్రావు. ఇప్పుడు సుందర్రావు గురక అసహ్య మనిపించలేదు రేఖకు. దీనిని బట్టి బట్టతల నల్లగా ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా భర్త అందంగా లేడని బస్సులో నిద్రపోతాడని ఆ నిద్రలో గురక పెడుతుండడం వల్ల చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచించే వాళ్ళు చాల మందే ఉంటారు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. శుభగమనం బెడ సేఁత కృత్యమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రునికి, ధర్మరాజుకు మధ్య శునకాన్ని గూర్చి చర్చ జరిగి శునకాన్ని వదలమన్న సందర్భంలోనిది.
అర్థం : శుభం ప్రాప్తిస్తున్నపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసం కాదు.
భావం : ధర్మరాజా ! పంతం వీడు, ఎందుకంటే అది ధర్మాన్ని హరించివేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు విడిచిపెడితే నీవు కఠినంగా ఉన్నట్లు కాదు. శుభం జరిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా చెప్పు అని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.

2. తల్లియు దండ్రియున్నఱుగరే యుల్లంబులో.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : శివలింగం వద్ద తన్మయుడై ఉన్న తిన్నడిని వెతుకుతూ వచ్చిన చెంచులు తిన్నడితో ఇంటికి తిరిగి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.
అర్థం : తల్లి, తండ్రి మనసులో దుఃఖించరా !
భావము : నాయనా నిన్ను అలసిపోయేలా చేసి ఇక్కడ వరకు వచ్చేలా చేసిన ఆ అడవి పంది ఎటుపోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంటే మేము ఏమి పలికినను, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో వేటాడుటకు వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనసులో ఎంతో దుఃఖిస్తారు అని బోయలు పలికారని భావము.

3. మార్కొని నిలువగ లేక చనిరి కోచ తనమునన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణుని అనుచరులు యుద్ధమునందు కుబేరుని ధాటికి ఆగలేక పారిపోయారని చెప్పిన సందర్భంలోనిది.
భావము : తమ రాజైన రావణుని తిట్టినాడని మారీచ ప్రహస్తాదులు కుబేరునితో యుద్ధమున అతని ధాటికి ఆగలేక పారిపోయారని ఇందలి భావం.

4. సౌఖ్యంబెంత క్రీడించునో.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : శ్మశానంలోని సుఖాన్ని గురించి కవి వర్ణించిన సందర్భంలోనిది.
అర్థం : సౌఖ్యం ఎంతో ఆనందిస్తుంది.
భావము : మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్య, అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది (ఆటలాడుకుంటుంది) అని జాషువా గారు అన్నారు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. సహదేవుడెట్టివాడు ?
జవాబు:
సహదేవుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన సంతానం. పాండవులందరిలో చివరివాడు. సహదేవునికి అహంకారమనేది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడని భీముడు కూడా స్తుతించాడు. తన అన్నగారైన ధర్మరాజును తండ్రితో సమానంగా భక్తి ప్రపత్తులతో సేవించేవాడు. భీముడు సహదేవుని మరణ కారణం అడుగగా, సహదేవుడు లోకంలో తనకంటే ప్రాజ్ఞుడు ఎవడూ లేడని భావిస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. అందుకే ఈ దురవస్థ సంభవించింది అని ధర్మరాజు సహదేవుని గురించి చెప్పాడు.

2. ఇంటికి రమ్మని పిలిచిన బోయలకు తిన్నడిచ్చిన సమాధానాన్ని తెలపండి.
జవాబు:
ఈ శివలింగానికి నా ప్రాణాన్ని మరణించేవరకు ఓడ నడచుటకు కట్టిన దూలం వలె పెనవేశాను. మీరు బాధపడవద్దు. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి ఇపుడు నేను వస్తాను. లేనిచో శివుడే దిక్కులో ఉన్నాడో ఆ స్థలంలోనే అనుక్షణం అతనిని అంటిపెట్టుకొని నివసిస్తాను. నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దేవుడే.
మీరు ఈ అడవిలో కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఒత్తిడి చేసినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను ఇది నిజం అని తిన్నడు పలికాడు.

3. రావణుడు ఏవిధంగా కైలాసానికి వెళ్ళాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ నుండి వరాలను పొందిన రావణుడు గర్వముతో లోకములలోని వారినందరిని బాధించసాగాడు. అపుడు రావణుని అన్న కుబేరుడు అతనికి నీతిని చెప్పమని దూతను పంపాడు. రావణుడు ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధం చేసి కుబేరుని ఓడించి అలకాపురం చేరి అక్కడున్న పుష్పకము తీసుకున్నాడు. రావణుడు ఆ పుష్పక విమానము ఎక్కి తన మంత్రి సామంతులైన మారీచ, దూమ్రాక్ష, ప్రవాస్త, శుక మొదలగు వారిని దానిలో ఎక్కించుకొని కైలాస పర్వతమును చేరుకున్నాడు. కైలాసమున ప్రవేశింపబోగా ఆ పుష్పకము కైలాస వాకిట పొగడచెట్టు నీడలో ఆగిపోయినది. కారణము తెలియక శివుని నిందించి నందీశ్వరునిచే శాపము పొందాడు.

4. ‘సౌఖ్యంబెంత క్రీడించునో’ అని జాషువా ఎందుకన్నాడు ?
జవాబు:
ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, గుడ్లగూబలు, దయ్యాలు ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ శ్మశానంలో ఆకు కూడా కదలడం లేదు అని జాషువా గారు వర్ణిస్తారు. ఇవన్నీ మానవుడి నిత్యజీవితంలో కష్టాలని, పోరాటాలని కవి ఇలా పోల్చాడు. మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా అనుభవిస్తుంటాడు. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండదు. అక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది అని జాషువా అన్నారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. మాటతీరు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
మాటతీరు అంటే మనం మాట్లాడే విధానం. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడే వారిని ఎక్కువమంది ఇష్టపడతారు. వారికి ఎక్కువ స్నేహితులుంటారు. ఎప్పుడూ చిరాకు పడుతూ, పరుషంగా మాట్లాడే వారితో ఎవరూ కలవరు వారితో దూరంగా ఉంటారు. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే విధానం పైనే ఆధారపడి ఉంటాయి. సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు చాలా బలమైన అంశం. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు. జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఇవి భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే ఇంకా కొంత విశిష్టంగా ఉంటుంది.

సమాచారాలను చేరవేయటానికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి భాషలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ వుంటాం. అవి మన వ్యవహారంలో కలిసిపోయి వుంటాయి. ఈ పదాలు మన సామాజిక సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో ముడిపడి వుంటాయి. వీటిని ప్రయోగిస్తూ మాట్లాడుతున్నపుడు మన మాటతీరు ఎటువంటిదో తెలుస్తుంది.

2. కందుకూరి రచనలను తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొని పోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.
కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధిని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.
తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్యతిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.

3. అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అపహాస్యం అంటే వెక్కిరింత. సహృదయుడు, ఆరోగ్యవంతుడు అయినవాణ్ణి నవ్వించేది ఉత్తమ హాస్యం. కానిది అపహాస్యం. మనిషిలో సహజంగా ఉండే అంగవైకల్యం- కుంటితనం, గుడ్డితనం, అనాకారితనం, ముక్కువంకర, మూతివంకర వంటి వానిని చూసి నవ్వటం సభ్యత అన్పించుకోదు. ఇది అపహాస్యం చేయటమే అవుతుంది.
కాలు జారి పడ్డ వాడిని చూసి జాలిపడాలి కాని నవ్వి అపహాస్యం చేయకూడదు. కడుపు నొప్పితో బాధపడుతూ వికృతంగా ముఖం పెట్టి మెలికలు తిరుగుతున్న వ్యక్తిని చూసి నవ్వితే అపహాస్యం చేయటమే !
నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలుసుకున్న వారే సహృదయులు. వారు ఎవరినీ అపహాస్యం చేయరు.

4. హాస్యమునకు ఒక ముఖ్య కారణం ‘ఆశ్చర్యం’ వివరించండి.
జవాబు:
స్వల్ప విషయాన్ని అద్భుతమైన విషయంగా, గొప్ప విషయంగా చెప్పటం వల్ల కలిగే ఆశ్చర్యం నుండి హాస్యం పుడుతుంది. ఒక అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా పాఠం చెప్పి చివరలో ఆ చక్రవర్తి ఏం చేశాడంటే అని ఆపేటప్పటికి విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్ప పని చేసివుంటాడని అనుకుంటారు. ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ‘ఢాంం అని చచ్చాడు’ అని అధ్యాపకుడు చెప్పే సరికి ఆశ్చర్యంతో క్లాసంతా గొల్లుమంటుంది. ప్రసంగంలో పూర్వ భాగానికి భిన్నమైన ముగింపు ఆశ్చర్యాన్ని కలిగించి నవ్వు పుట్టిస్తుంది.

క్షురకుడు క్షవరం చేస్తున్నప్పుడు గాట్లు పడుతుంటే ఆ వ్యక్తి బాధ తగ్గించటానికి మాటల్లోకి దించుతూ ‘ఇదివరకు ఈ షాపుకు వచ్చారా’ అంటాడు. ఆ వ్యక్తి లేదు, ఆ చెయ్యి యుద్ధంలో తెగిపోయిందయ్యా అన్నాడు. ఈ సమాధానం క్షురకుడికి తలవంపులు కలిగించినా, అనుకోని ఆ సమాధానం ఆశ్చర్యం కలిగించి నవ్వు పుట్టిస్తుంది.
ఆశ్చర్యం కూడ హాస్యానికి ఒక ముఖ్యకారణమే!

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.

నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.

2. యస్వీ బుజంగరాయశర్మ జీవిత విశేషాలను తెలపండి.
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి.ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటిలోను విద్యనభ్య సించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.
తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతికి సంబంధించి వీరు అనేక వ్యాసాలు, కవితలు, నృత్య నాటికలు రచించారు. వీరు 7-8-1997న కన్ను మూశారు.

3. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు ‘జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

4. కంకంటి పాపరాజు రచనలను, కవితాశైలిని తెలపండి.
జవాబు:
కంకంటి పాపరాజు 17వ శతాబ్దమునకు చెందిన కవి. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరి పట్టణమునకు చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు నరసమాంబ, అప్పయ్య మంత్రి. పాపరాజు చతుర్విధ కవితా నిపుణుడు. యోగ, గణితశాస్త్ర ప్రావీణ్యుడు. సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు. “పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే యెట్టి వారికిన్” అని నమ్మినవాడు పాపరాజు. వాల్మీకి రామాయణములోని ఉత్తరకాండను గ్రహించి ఒక స్వతంత్ర ప్రబంధంలా ఉత్తర రామాయణాన్ని వ్రాశాడు. ఇది ‘8’ ఆశ్వాసాల ప్రబంధం. రాజనీతిని ఈ కావ్యంలో చక్కగా వివరించాడు. ఉత్తర రామాయణంతో పాటుగా ఈయన “విష్ణు మాయా విలాసము” అని యక్షగానాన్ని రచించాడు. ఈ రెండింటిని మదనగోపాల స్వామికి అంకితం చేశాడు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. సదుపాయాలను కల్పించమని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్కు లేఖ.
జవాబు:
స్థలం : కడప
తేది : 20-9-2022.

మహారాజశ్రీ గవర్నమెంట్ కాలేజి ప్రిన్సిపాల్ గారికి,
కడప.
ఆర్యా!
మన కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూర్చొనుటకు తగినన్ని బెంచీలు లేవు. ఎండలు ఎక్కువగా ఉన్నందున క్లాసులోని విద్యార్థులకు ఉక్కపోసి చికాకు కలుగుతున్నది. అర్థశాస్త్రము బోధించు అధ్యాపకులు లేనందున ఆయా తరగతుల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయములో విద్యార్థులు కూర్చొనుటకు మరికొన్ని బెంచీలు, చదువుకోడానికి మరికొన్ని వార్తాపత్రికలు, పుస్తకాల ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉన్నది. మా అభ్యర్థనను మన్నించి క్లాసులలో అవసరమైన బెంచీలు, ఫ్యానులు ఏర్పాటు చేయుటకు, అధ్యాపకుల నియామకం జరుగుటకు తగిన కృషి చేయవలసినదిగా కోరుతున్నాను.

ఇట్లు
విధేయుడు,
XXXXXX.
సెక్షన్ నెం. XXXXX,
నెం. XXXXX.

చిరునామా :
ప్రిన్సిపాల్,
గవర్నమెంటు కాలేజీ,
కడప.

2. అధికార తెలుగు భాష అమలుకై లేఖ.
జవాబు:
స్థలం : వరంగల్,
తేది : 26-9-2022.

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
ఆర్యా!
నమస్కారములు,
భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న రెండవ భాషగా తెలుగు భాషకు ప్రఖ్యాతి ఉంది. కానీ, మన రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషు భాషలోనే జరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సహాయాలు, సరాసరి ప్రజలకు చేరటం లేదు. తెలుగును అధికార భాషగా చేసి, అభివృద్ధి సాధించాలన్న దృష్టితో ఏర్పాటు చేసిన అధికార భాషా సంఘానికి సరైన సహకారం లభించడం లేదు. కనుక అధికార భాషగా తెలుగును అమలు చేయటానికి తగు చర్యలు తీసికోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇట్లు
భవదీయులు
XXXXXX,
XXXXXX,
XXXXXX.
ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం.

చిరునామా :
గౌరవనీయులైనర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
సచివాలయం,
హైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1. డప్పింగూలె
2. దుర్యాత్ము
3. తారాద్రి
4. అట్లుగావున
5. జగతినెందు
6. కపాలమొక్కటి
7. ఆత్మైక
8. నీయనుజులు
జవాబు:
1. డప్పింగూలె – డప్పిన్ + కూలె – సరళాదేశసంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

2. దుర్యాత్మ – దురి + ఆత్మ – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, ర లు ఏకాదేశమగును.

3. తారాద్రి తార + అద్రి – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములు పరమైనప్పుడు వాటి దీర్ఘము లేకాదేశమగును.

4. అట్లుగావున – అట్లు + కావున – గసడదవాదేశసంధి .
సూత్రం : ప్రథమమీది పరుషములకు గసడవదవలు బహుళముగానగు.

5. జగతినెందు జగతిని + ఎందు – ఇత్వసంధి.
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి బహుళము.

6. కపాలమొక్కటి – కపాలము + ఒక్కటి – ఉత్త్వసంధి.
సూత్రము : ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధియగు.

7. ఆత్మైక – ఆత్మ + ఏక – వృద్ధిసంధి.
సూత్రము : అకారమునకు ఏ, ఐ లు పరమైనప్పుడు ఐ కారము ఓ, ఔ లు పరమైనప్పుడు ఔ కారము ఏకాదేశమగును.

8. నీయనుజులు – నీ + అనుజులు – యడాగమసంధి.
సూత్రము : సంధి లేని చోట స్వరంబున కంటే పరంచైన స్వరంబునకు యడాగమంబగు.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 3 = 12)

1. రాజాజ్ఞ
2. మధ్యాహ్నము
3. ఆనంద బాష్పములు
4. యక్షరాక్షసులు
5. కోదండధరుడు
6. భక్తియుక్తుడు
7. అసాధ్యము
8. కౌర్య శూరులు
జవాబు:
1. రాజాజ్ఞ : రాజు యొక్క ఆజ్ఞ – షష్ఠీ తత్పురుష సమాసం.
2. మధ్యాహ్నము : అహ్నము మధ్య భాగము – ప్రథమ తత్పురుష సమాసం.
3. ఆనంద బాష్పములు : ఆనందంతో కూడిన బాష్పములు – తృతీయా తత్పురుష సమాసం.
4. యక్ష రాక్షసులు : యక్షులు, రాక్షసులు – ద్వంద్వ సమాసం.
5. కోదండ ధరుడు : కోదండమును ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం.
6. భక్తి యుక్తుడు : భక్తి చేత యుక్తుడు – తృతీయా తత్పురుష సమాసం.
7. అసాధ్యము : సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం.
8. కార్య శూరులు : కార్యమునందు శూరులు – సప్తమీ తత్పురుష సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (4 × 2 = 8)

1. సనివారం
2. దృతం
3. శబ్ధం
4. బాద
5. ప్రబందం
6. క్రుష్ణుడు
7. ద్రుశ్యం
8. వుడు
9. ఇనాయక
10. యెలుక
జవాబు:
1. సనివారం – శనివారం
2. దృతం – ద్రుతం
3. శబ్ధం – శబ్దం
4. బాద – బాధ
5. ప్రబందం – ప్రబంధము
6. క్రుష్ణుడు – కృష్ణుడు
7. ద్రుశ్యం – దృశ్యం
8. సివుడు – శివుడు
9. ఇనాయక – వినాయక
10. యెలుక – ఎలుక

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. A friend in need is a friend indeed.
జవాబు:
ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు.

2. Aditya is a famous doctor in our state.
జవాబు:
మన రాష్ట్రంలో ఆదిత్య ప్రసిద్ధి చెందిన డాక్టరు.

3. These mangoes are very sweet.
జవాబు:
మామిడి పళ్ళు చాలా తియ్యగా ఉంటాయి.

4. Ramanujan was a genious in mathe- matics.
జవాబు:
గణిత శాస్త్రంలో రామానుజం దిట్ట.

5. If you work hard you are sure to pass.
జవాబు:
నీవు కష్టపడి చదివితే తప్పకుండా పరీక్షలలో ఉత్తీర్ణుడవు అవుతావు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

ప్రాణాలను కాపాడేందుకు లేదా పరిశోధనల నిమిత్తం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శరీర భాగాలను అమరుస్తారు. బ్రతికి ఉన్న వారి నుంచి కొన్ని శరీర భాగాలను తీయడం ఒక పద్ధతి; చనిపోయిన వారి ను చి కొన్ని శరీర భాగాలను వెలికితీసి మరొకరికి అమర్చడం ఇంకో పద్ధతి. అవయవ దానం ప్రక్రియ కుటుంబ సభ్యుల ఆమోదంతో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ప్రపంచంలో తొలిసారిగా 1954లో అవయవ దానం చేసిన దాత ‘రొనాల్డ్ లీ హెరిక్’. అతి వృద్ధ అవయవ దాతగా స్కాట్లాండ్ దేశానికి చెందిన 107 సంవత్సరాల మహిళ తన కంట్లోని కార్నియాను దానం చేయడం ద్వారా చరిత్రలో నిలిచారు. అవయవ దానాన్ని వ్యాపారంగా నిర్వహించడం చట్టప్రకారం నేరం. ఆగష్టు 13వ తేదీన అవయవ దాన దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు :
1. ప్రపంచంలో తొలి అవయవ దాత ఎవరు ?
జవాబు:
రోనాల్డ్ లీ హెరిక్.

2. అవయవ దానానికి ఎవరి అనుమతి తప్పనిసరి ?
జవాబు:
కుటుంబ సభ్యుల అనుమతి.

3. అతివృద్ధ అవయవ దాత ఏ దేశానికి చెందినవారు ? వారి వయస్సు ఎంత ?
జవాబు:
స్కాట్లాండ్ – 107

4. అవయవ దానాన్ని ఏ విధంగా నిర్వహించరాదు ?
జవాబు:
వ్యాపారంగా నిర్వహించరాదు.

5. ఏ రోజును అవయవ దాన దినంగా ప్రకటించారు ?
జవాబు:
ఆగష్టు – 13.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. కేతన దశ కుమార చరిత్రను ఎవరికి అంకిత మిచ్చాడు ?
జవాబు:
తిక్కనకు అంకితమిచ్చాడు.

2. అస్పృశ్యత సంచరించుటకు తావులేని స్థలమేది ?
జవాబు:
స్మశానం.

3. విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తి నిచ్చిన గేయం ఏది ?
జవాబు:
చెయెత్తి జై కొట్టు తెలుగోడా.

4. మానవ రూపం దాల్చినది ఏమిటి ?
జవాబు:
శివుని నేత్రాగ్ని.

5. ధూర్జటి రచించిన శతకం పేరేమిటి ?
జవాబు:
శ్రీకాళ హస్తీశ్వర శతకం.

6. ధర్మ పరీక్షను ఏ గ్రంథం నుండి స్వీకరించారు ?
జవాబు:
ఆంధ్రమహా భారతం.

7. వేముల పల్లి పేర్కొన్న అమర కవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

8. నంది ఎవరి వాహనం ?
జవాబు:
శివుని.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏకపద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. కలవారి కోడలు కలికి కామాక్షి పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
యస్వీ భుజంగ రాయశర్మ.

2. పాల్కూరికి సోమనాధుడు ఏ కవితా ప్రక్రియను ఆదరించాడు ?
జవాబు:
ద్విపద.
3. హాస్యము అనగా ఏమిటి ?
జవాబు:
నవ్వు పుట్టించేది.

4. చేమకూర వేంకట కవి రచించిన కావ్యమేది ?
జవాబు:
విజయ విలాసము.

5. రాయలవారి విజయనగరం ఏ నదీ తీరాన ఉన్నది?
జవాబు:
తుంగభద్రానది

6. మొత్తం లోకాలెన్ని ?
జవాబు:
14 లోకాలు

7. బాలమురళి ఎన్ని మేళకర్తల మీద కీర్తనలు రాసాడు ?
జవాబు:
72 మేళకర్తల పైన.

8. నేను ఫెమినిష్టుని, హ్యూమనిష్టుని అని ప్రకటించుకొన్నది ఎవరు ?
జవాబు:
మల్లాది సుబ్బమ్మ.

Leave a Comment