AP 10th Class Telugu Model Paper Set 2 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 2 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 2 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

 1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
 2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
 3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
 4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (32 మా)

గాడ్పు వేల్పుపట్టి గట్టెక్కి యుక్కునఁ
జూచె సూటి నేటిజోటిమగని
భావిసేతు వచ్చుపడ లంకకడకును
సూత్రపట్టుమాడ్కిఁ జూడ్కి వెలుఁగ

ప్రశ్నలు : (8 మా)

అ) గాడ్పువేల్పు పట్టి అంటే ఎవరు ?
జవాబు:
గాడ్పువేల్పు పట్టి అంటే వాయుపుత్రుడైన హనుమంతుడు.

ఆ) కొండపైకి ఎక్కిన ఆంజనేయుడు ఎలా చూశాడు?
జవాబు:
కొండపైకి ఎక్కిన ఆంజనేయుడు సూటిగా చూశాడు.

ఇ) హనుమంతుడి చూపును దేనితో పోల్చారు?
జవాబు:
హనుమంతుడి చూపును సేతువు నిర్మాణానికి కొలత తీసుకున్న దారంతో పోల్చారు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
హనుమంతుడి చూపు ఎక్కడికి దారం పట్టినట్లుగా ఉంది?

(లేదా)

నెట్టుకొని కాయ బీటెండ పట్టపగలు
తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండం
గాశికా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.

ప్రశ్నలు :

ఉ) పద్యంలో చెప్పిన విద్యాగురుడు ఎవరు?
జవాబు:
పద్యంలో చెప్పిన విద్యాగురుడు ‘వేదవ్యాసుడు’.

ఊ) వ్యాసుడు ఏ నగరంలో నివసిస్తున్నాడు?
జవాబు:
వ్యాసుడు కాశీనగరంలో నివసిస్తున్నాడు.

ఋ) దేనికోసం వ్యాసుడు తన శిష్యులతో కలిసి ఇల్లిల్లు తిరుగుతున్నాడు?
జవాబు:
వ్యాసుడు తన శిష్యులతో కలిసి భిక్షకోసం ఇల్లిల్లు తిరుగుతున్నాడు.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
కాశీనగరంలో వ్యాసుడు, తన శిష్యులు ఏ సమయంలో భిక్షాటన చేస్తున్నారు?

AP 10th Class Telugu Model Paper Set 2 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

చంపకవతియను పట్టణము గలదు. అందు సన్న్యాసులు పెక్కండ్రు వాసము చేయుచుండుదురు. అందుఁజూడాకర్ణుండను పరివ్రాజకుఁడు గలఁడు. అతఁడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలోఁబెట్టి చిలుక కొయ్య మీఁద నుంచి నిద్రపోవును. నేను సద్దుచేయక దానిమీఁదికెగిరి ప్రతిదిన మావంటకము భక్షించి పోవుచుందును. ఒకనాఁడు చూడాకర్ణుడు తన స్నేహితుఁడు వీణాకర్ణుఁడను సన్న్యాసితో మాటలాడుచుండ మాటిమాటికి మీఁదివంక చూచి తన గిలుకకఱ్ఱతో నేలమీఁద గొట్టి నన్ను వెఱపించుచు వచ్చెను.

ప్రశ్నలు

అ) సన్న్యాసులు ఎక్కడ నివసిస్తున్నారు ?
జవాబు:
సన్న్యాసులు చంపకవతి పట్నంలో నివసిస్తున్నారు.

ఆ) భోజనాన్ని చిలుకకొయ్యపై పెట్టినది ఎవరు ?
జవాబు:
భోజనాన్ని చూడాకర్ణుడు చిలుక కొయ్యమీద పెట్టాడు.

ఇ) చూడాకర్ణుడి మిత్రుడు ఎవరు ?
జవాబు:
చూడాకర్ణుడి మిత్రుడు వీణాకర్ణుడు.

ఈ) ఏదేని ఒక అర్ధవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
చిలుకకొయ్య మీదికి ఎగిరి వంటకాన్ని తింటున్నది ఎవరు?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)

అ) శ్రీరాముని ఆజ్ఞమేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు.
జవాబు:
అరణ్యకాండ

ఆ) హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణిపై ఒక్క దెబ్బవేశాడు.
జవాబు:
సుందరకాండ

ఇ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది.
జవాబు:
బాలకాండ

ఈ) దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు.
జవాబు:
అయోధ్యాకాండ

4. క్రింది లేఖను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (8 మా)

పెడన
ది: XXXX

ప్రియమైన మిత్రుడు నరేంద్రకు,

నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు కూడా బాగున్నావని తలుస్తాను. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో గుంటూరు జిల్లాస్థాయిలో మొదటిస్థానంలో ఉన్నానని చెప్పావు. ‘జగనన్న ఆణిముత్యాలు’లో భాగంగా 50,000/- నగదు బహుమతి సాధించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నీ వంటి మిత్రుడు ఉన్నందుకు గర్వంగా ఉంది. నువ్వు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు బహుమతి అందుకున్న వీడియో చూసి చాలా ఆనందించాను. నీ ప్రతిభకు తగిన పురస్కారం లభించింది. నువ్వు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకోవాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
నీ మిత్రుడు
అవినాష్

చిరునామా :
ఎ. నరేంద్రబాబు
s/o. వేంకటేశ్వరరావు
టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ దగ్గర
తెనాలి, గుంటూరు జిల్లా

ప్రశ్నలు :

అ) లేఖను ఎవరు ఎవరికి రాస్తున్నారు ?
జవాబు:
లేఖను అవినాష్ తన మిత్రుడు నరేంద్రకు రాస్తున్నాడు.

ఆ) నరేంద్ర ఏ జిల్లాలో మొదటి స్థానం సాధించాడు ?
జవాబు:
నరేంద్ర గుంటూరు జిల్లాలో మొదటి స్థానం సాధించాడు.

ఇ) నరేంద్ర ఎవరి నుండి బహుమతి అందుకున్నాడు ?
జవాబు:
నరేంద్ర ముఖ్యమంత్రి నుండి బహుమతి అందుకున్నాడు.

ఈ) లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘జగనన్న ఆణిముత్యాలు’లో భాగంగా నరేంద్ర అందుకున్న నగదు బహుమతి ఎంత ?

విభాగము – II
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: (36 మా)

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

5. “మాతృభావన” పాఠ్యభాగకవి ‘శ్రీ గడియారం వేంకటశేష శాస్త్రి’ గురించి రాయండి.
జవాబు:

 1. రచయిత : ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు, శతావధాని డా॥ గడియారం వేంకటశేషశాస్త్రి.
 2. తల్లిదండ్రులు : నరసమాంబ, రామయ్యలు.
 3. కాలం : 1894 – 1980 (20వ శతాబ్దం)
 4. రచనలు ‘శ్రీ శివభారతము’, ‘మురారి’, ‘పుష్పబాణ విలాసము’
  ‘శ్రీనాథ కవితా సామ్రాజ్యము’ (విమర్శ) వీరి రచనలు.
 5. బిరుదులు : ‘కవితావతంస’, ‘కవిసింహ’, ‘అవధాన పంచానన’ అనే బిరుదులను అందుకున్నారు.
 6. పాఠం గ్రహింపబడిన గ్రంథం : శ్రీ శివభారతం – తృతీయాశ్వాసం
 7. శైలి : సరళమైన వ్యవహారశైలి
 8. రచనల విశిష్టత : గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతము” కావ్యం గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం ఇది.
 9. ప్రత్యేకత : సాహిత్య భాస్కర, కవితా మంజూష వంటి మరెన్నో బిరుదులు పొందిన శతావధాని. నవ్య సంప్రదాయ పంచకావ్యాలలో ఒకటైన శ్రీ శివభారతంలో శివాజీ జీవితం ఆధునిక పద్య కావ్యంగా మలచిన మహాకవి. జానపదుని జాబు పాఠ్యాంశం లేఖా రూపంలో ఉంది.

6. “లేఖ” రచనా ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
“జానపదుని జాబులు” పేరుతో డా॥ బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠాన్ని ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖా రచన సాగింది.

మనకు దూరంగా ఉన్నవారితో మనోభావాలను పంచుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ లేఖ. లేఖలను మిత్రులకు, బంధువులకు, అధికార్లకు రాస్తారు. లేఖల్లో అధికారిక లేఖలు, ఆత్మీయ లేఖలు, విజ్ఞప్తులు – ఇలా చాలా రకాలు ఉన్నాయి.

AP 10th Class Telugu Model Paper Set 2 with Solutions

7. “మంథర” పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
మంథర దశరథుని చిన్న భార్య కైకేయికి దాసి. కైక వెంట పుట్టింటి నుంచి వచ్చిన అరణపుదాసి. అందుకని తన రాణి కుమారుడైన `భరతుడు రాజు కావాలని, కైక పట్టమహిషి కావాలని ఆశపడింది. కైకతో “రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, అప్పుడు మాతోపాటు నీవు దాసివవుతావని, రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుందని, కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని” ఎన్నో దుర్బోధలు చేసి రాముని మీద ప్రేమ విరిచింది. కైక దశరథుని వరాలు కోరి రాముని వనవాసం పంపేట్లు చేసింది.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 32మా)

8. వెన్నెల పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
నైతిక విలువలంటే ఏమిటి? మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి.
జవాబు:
వర్ణనలకు ఆద్యుడని పేరు పొందిన ఎఱ్ఱన వెన్నెలను ఎంతో మనోహరంగా వర్ణించాడు. దిక్కులు అనే కొమ్మలతో, వెలుగులీనే ‘చుక్కలు’ అనే పూలతో ఆకాశం పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది. ఆ పూలను అందుకోడానికి కిరణాలు అనే తన చేతులను పొడవుగా జాపుతూ చంద్రుడు పైపైకి వచ్చాడు.

పాల సముద్రం నుంచి పుట్టిన వెన్నెల ఉప్పొంగి దిక్కులన్నిటినీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం శేషపానుపులాగా ఉన్నది. చంద్రునిలోని మచ్చ ఆ పాన్పు మీద పడుకున్న విష్ణువులాగా ఉన్నది.

వెన్నెలలో కలువ పూలు రేకులు విచ్చుకొని వాలిపోయిన కేసరాలు తిరిగి బలంగా నిలుచున్నాయి. పుప్పొడి మీద తేనెలు పొంగిపొరలి తుమ్మెదలకు విందుచేశాయి. కమ్మని సువాసనలు చుట్టూ వ్యాపించాయి.

వెన్నెల వర్షంలో చంద్రకాంత శిలలు కరిగిపోయాయి. ఎగిరే చకోర పక్షుల రెక్కలను తాకుతూ కలువపూలపై వ్యాపించింది వెన్నెల. స్త్రీల మనోహరమైన చిరునవ్వులను అధికం చేస్తూ దిక్కులను ముంచెత్తుతూ అంతటా వ్యాపించింది వెన్నెల.

అందంగా, గంభీరంగా, సమున్నతంగా విస్తరించింది వెన్నెల. రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి ఎక్కడా కనబడనీయక కళ్ళకు అమృతపు జల్లులాగా, శరీరానికి మంచి గంధం పూతలాగా, మనసుకు ఆనంద తరంగంలాగా వెన్నెల హాయిని కలిగించిందని వర్ణిస్తూ కవి ఎఱ్ఱన వెన్నెలను చూసి స్పందించాడు.

(లేదా)

 1. నీతితో కూడుకొన్న విలువలను నైతిక విలువలు అంటారు.
 2. అందమైన మణిని పడగమీద ధరించినప్పటికీ పాము ఎంత ప్రమాదకరమైనదో, అట్లాగే ఎంతటి విద్యావంతులైనా నైతిక విలువలు లేకపోతే సమాజానికి ప్రమాదకారులౌతారు.
 3. అబద్ధాలాడక పోవడం, ఇతరుల సొమ్మును ఆశించకపోవడం, హద్దు మీరి ప్రవర్తించకపోవడం, మంచి నడవడి కలిగి ఉండడం, గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం ఇవన్నీ నైతిక విలువలే.
 4. ఇలాంటి నైతిక విలువలు లేకుండా కేవలం ఆలయాల చుట్టూ తిరగడం వృథా. నైతిక విలువలు నేర్పని చదువు వ్యర్థమే.
 5. రాముడు, హరిశ్చంద్రుడు, గాంధీజీ వంటి వారి జీవితాల ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మబద్ధంగా జీవించడం, నిజం చెప్పడం అనేవి నైతిక విలువల ద్వారానే సాధ్యమయ్యాయి.

9. “సీతారామ కల్యాణం” గురించి రాయండి.
(లేదా)
“సేతువు నిర్మాణం” గురించి రాయండి.
జవాబు:
మిథిలానగర ప్రవేశం : విశ్వామిత్ర రామలక్ష్మణులు అహల్యాశాపవిముక్తి తరువాత మిథిలానగరానికి చేరుకున్నారు. మిథిలానగర ప్రభువు జనకమహారాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు.

శివధనుర్భంగం : జనకుడు మరునాడుదయం విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో ‘వీరు దశరథుని పుత్రులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది’ అని అన్నాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం పొలం దున్నుతుండగా నాగలిచాలులో తన కూతురు సీత దొరికిందని చెప్పాడు. శివధనుస్సును . ఎక్కుపెట్టినవాడికే సీతనిచ్చి పెళ్ళిచేస్తానని చెప్పాడు. ఎందరో రాజులు శివధనుస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నంచేశారు కాని కనీసం కదపలేకపోయారని చెప్పాడు. ఐదువేల మంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు వంగింది. రాముడు అల్లెతాడును చెవివరకు లాగేసరికి ధనుస్సు పెద్దశబ్దం చేస్తూ విరిగిపోయింది.

కల్యాణం : జనకుడు అన్నమాటప్రకారం సీతారాముల వివాహం జరపడానికి సిద్ధమయ్యాడు. దశరథుడు జనకుని వర్తమానంతో సకుటుంబంగా వచ్చాడు. సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది.

(లేదా)

సముద్రాన్ని దాటి లంకను చేరడం కోసం శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ప్రత్యక్షంకాలేదు. శ్రీరాముని కన్నులు ఎర్రబడ్డాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకొన్నాడు. సముద్రంలోని నీరంతా ఇంకిపోయేటట్లు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతి అంతా అల్లకల్లోలం అయింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. బాణం ప్రయోగించాలని భావించాడు శ్రీరాముడు. దానితో సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళానిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు చెప్పాడు. ఆ సేతువును తాను భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఇచ్చాడు శ్రీరాముడు. మహారణ్యం నుండి చెట్లను, బండరాళ్ళను మోసుకువస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిరిపడుతోంది. నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతునిర్మాణం జరుగుతోంది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పుగల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి చేశారు.

10. “కోపం తగ్గించుకోవడం మంచిది” అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
(లేదా)
‘విద్యాలయం’ ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా ! మీ పాఠశాల గురించి వర్ణించి రాయండి.
జవాబు:

రాజమండ్రి,
తేది. xx.xx.xxxx.

ప్రియమిత్రుడు వంశీకి,
మిత్రమా!

ఎలా ఉన్నావు? ఇక్కడ మేమంతా బాగున్నాము. రాబోయే పదవతరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నేను బాగానే చదువుతున్నాను.

ఈ మధ్యే తెలుగు పాఠ్య పుస్తకంలోని ‘భిక్ష’ పాఠం చదివాను. అందులో వ్యాసమహర్షి కోపం పట్టలేక కాశీ నగరప్రజలను శపించబోవు సందర్భం చదివాను. కోపం ఎంతటి అపకారం చేస్తుందో కదా! అనిపించింది. కోపం వివేకాన్ని, విచక్షణని పోగొట్టి మనిషికి ఆవేశం కలిగిస్తుంది. ఆ ఆవేశంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు. తరువాత ఆలోచించి తొందరపడ్డామని, అలా చేయకుండా ఉండాల్సిందనీ అనుకుంటారు. పశ్చాత్తాపపడతారు. ఎవరైనా కోపం రాగానే పది అంకెలు లెక్కపెట్టో ఒక గ్లాసు మంచినీళు త్రాగో ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటో తెలియజెయ్యి, చిన్నలందరినీ అడిగానని, పెద్దలందరికీ నమస్కారాలనీ చెప్పు. నీ జవాబు కోసం ఎదురుచూస్తుంటాను.

ఇట్లు
నీ ప్రియమిత్రుడు
రాజేష్.
10వ తరగతి
కందుకూరి వీరేశలింగం
ఉన్నత పాఠశాల,
కోటగుమ్మం,
రాజమండ్రి.

చిరునామా :
ఎ. వంశీ
ఇంటి నెం. 12-4-7,
చిన్నంవారి వీధి,
ఫత్తేబాద్, ఏలూరు.

(లేదా)

మాది జిల్లా పరిషత్ హైస్కూలు. మా పాఠశాల చాలా చక్కగా ఉంటుంది. ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించింది. మా పాఠశాలలో చుట్టూ తరగతి గదులు (క్లాసు రూములు), మధ్యలో ఖాళీ స్థలముంటుంది. ఆ ఖాళీ స్థలంలో అనేక పూల మొక్కలు, చెట్లు కనువిందు చేస్తాయి. తరగతి గదులన్నిటినీ కలుపుకొని వరండా ఉంటుంది. మా ఉపాధ్యాయులు విద్యార్థులను కన్నబిడ్డల్లా చూస్తారు. మాకు కూడా వారంటే ఎంతో ఇష్టం.

మా పాఠశాలలో వెనుక వైపు పెద్ద క్రీడా స్థలం కూడా ఉంది. చుట్టూ ప్రహరీ గోడలా పొడుగైన పెద్ద పెద్ద చెట్లను నాటారు. వాలీబాల్, క్రికెట్, ఆడపిల్లల ఆటలకు సంబంధించిన గ్రౌండ్లు వేరువేరుగా ఉంటాయి. మా పాఠశాల మాకిచ్చిన క్రమశిక్షణ ఎలాంటిదంటే, ఏ విద్యార్థి కూడా పాఠశాలలో ఎక్కడా ఏ కాగితం ముక్క కూడా వేయరు. అందరూ చెత్తబుట్టల్లోనే వేస్తారు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కాగితం ముక్క కనిపిస్తే, దాన్ని చూసినవారు వెంటనే తీసి చెత్తబుట్టలో వేస్తారు. అందుకే మా పాఠశాలంటే మాకేకాదు, మా తల్లిదండ్రులకూ చాలా ఇష్టం.

విభాగము – III
III. భాషాంశాలు : (పదజాలం-వ్యాకరణాంశాలు) 

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (9 × 2 = 18 మా)

11. “సుదతీ నూతన మదనా ! మదనాగతురంగ పూర్ణమణిమయ సదనా !”
– ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
ముక్తపదగ్రస్తాలంకారం

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి గణవిభజన చేసి, ఏ పద్యపాదమో రాయండి.
మునివర! నీవు శిష్యగణముం గొని చయ్యన రమ్ము విశ్వనా
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 2 with Solutions 1
ఈ పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలున్నాయి కాబట్టి ఇది చంపకమాల పద్యము.

AP 10th Class Telugu Model Paper Set 2 with Solutions

13. అ) పరిశుభ్రతను పాటిస్తే రుగ్మతలు తొలగిపోతాయి. – గీతగీసిన పదానికి అర్థం రాయండి. (1 మా)
జవాబు:
జబ్బులు

ఆ) అనృతము లాడుట వలన నవ్వుల పాలౌతాం. -గీతగీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించి విడిగా రాయండి.(1 మా)
అ) గర్వము
ఆ) అబద్ధం
ఇ) కోపం
ఈ) అహంకారం
జవాబు:
ఆ) అబద్ధం

14. అ) పసిడి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. – గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి. (1 మా)
జవాబు:
కనకము, బంగారం

ఆ) మిన్ను విరిగి మీద పడినా చలించనివాడే ధీరుడు.
– గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) అడవి, వనం
ఆ) కొండ, అద్రి
ఇ) ఆకాశం నింగి
ఈ) సముద్రం, కడలి
జవాబు:
ఇ) ఆకాశం నింగి

15. అ) ఐదారేళ్ళ వయస్సులోని పిల్లలు అన్నెము పున్నెము ఎరుగని అమాయకులు – గీతగీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. (1 మా)
జవాబు:
పుణ్యము

ఆ) గరుడ పక్షి చాలా ఎత్తు ఎగరగలదు. – (గీతగీసిన పదానికి వికృతిపదం గుర్తించండి.)
అ) పచ్చి
ఆ) పక్కి
ఇ) పాక్షి
ఈ) పషి
జవాబు:
ఆ) పక్కి

16. అ) శరము త్రాగుతున్న వ్యక్తికి శరము గుచ్చుకున్నది. (గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి.) (1 మా)
జవాబు:
నీరు, బాణము

ఆ) రాజు పొలంలో కృషి చేయాలని చాలా కృషి చేశాడు. (గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) (1 మా)
అ) పండు, ప్రయోజనం
ఆ) దోషము, రంధ్రము
ఇ) సేద్యము, యత్నము
ఈ) నేత్రము, చూపు
జవాబు:
ఇ) సేద్యము, యత్నము

17. అ) మౌని తపస్సు చేస్తున్నాడు. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.) (1 మా)
జవాబు:
మౌనం దాల్చి ఉండేవాడు (ఋషి) వర్ణాలతో కూడిన కంఠం కలది

ఆ) ఆ ఊరిలో ఉన్న పక్షుల్లో చిత్రగ్రీవం ప్రత్యేకమైనది. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)
అ) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది. (పావురం)
ఆ) చిత్ర విచిత్రంగా అరిచేది (పావురం)
ఇ) వేగంగా ఎగరగలిగేది (పక్షి)
ఈ) వార్తలను సేకరించేది (పావురం)
జవాబు:
ఆ) చిత్ర విచిత్రంగా అరిచేది (పావురం)

18. దురలవాట్లు కబంధ హస్తాల వంటివి. (వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.) (2 మా)
జవాబు:
కబంధహస్తాలు

19. ‘నిమ్మకు నీరెత్తినట్లు’ ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
ఏమీ పట్టించుకోకుండా స్పందన లేకుండా ఉన్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

20. `బజారు నుండి ఏమేమి తెచ్చావని రాధ లతను అడిగింది. గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి. (1 మా)
జవాబు:
ఏమి + ఏమి

21. రామ + అయ్య – ఈ సంధి పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
రామయ్య

22. ఈ సహస్రాబ్దంలో స్త్రీలు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు.
– గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) గుణ సంధి
ఆ) వృద్ధి సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
ఇ) సవర్ణదీర్ఘ సంధి

23. మానవ చరిత్రలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకొన్నాయి. (1 మా)
– గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
మానవుని యొక్క చరిత్ర

24. ముప్పయి సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. (గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.) (1 మా)
అ) ద్వంద్వసమాసం
ఆ) రూపకసమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) ద్విగుసమాసం
జవాబు:
ఈ) ద్విగుసమాసం

25. చంపకవతియను పట్టణము గలదు.
– ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) చంపకవతి అనే పట్టణం ఉంది.
ఆ) చంపకవతి అనెడు పట్టణము కలదు
ఇ) చంపకవతి అనే పట్టణము ఉండెను
ఈ) చంపకవతి అనెడు పట్టణము గలదు
జవాబు:
అ) చంపకవతి అనే పట్టణం ఉంది.

26. తాత నిద్రపోయాడు. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి).
జవాబు:
తాత నిద్రపోలేదు.

AP 10th Class Telugu Model Paper Set 2 with Solutions

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) చూచి
ఆ) చూస్తూ
ఇ) చూస్తే
ఈ) చూడక
జవాబు:
ఈ) చూడక

28. అక్క టివి చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది.
(ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
అక్క టివి చూస్తూ నృత్యం చేస్తున్నది.

29. పోతన భాగవతాన్ని రచించాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)
అ) పోతనచేత భాగవతం రచింపబడింది.
ఆ) భాగవతం రచించింది పోతన
ఇ) పోతన భాగవతం చేత రచించబడెను
ఈ) పోతన చేత భాగవతం రచించెను.
జవాబు:
అ) పోతనచేత భాగవతం రచింపబడింది.

30. మీరు రావచ్చు – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం.

31. ఆహా! ఎంత బాగుందీ! (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) నిషేధార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఇ) ఆశ్చర్యార్థకం

32. రాజు బొమ్మలు బాగా గీయగలడు. – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం.

33. ఈ రోజు వర్షం కురుస్తుందో, కురవదో. – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి.
అ) అనుమత్యర్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఇ) సందేహార్థకం

Leave a Comment