TS 10th Class Telugu Model Paper Set 3 with Solutions

Reviewing TS 10th Class Telugu Model Papers Set 3 can help students identify areas where they need improvement.

TS SSC Telugu Model Paper Set 3 with Solutions

‘సమయం: 3 గం.
మార్కులు : 80

విద్యార్థులకు సూచనలు :

  1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
  2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

అ) కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1, 2 వాక్యాలలో రాయండి.

అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.

బ్రహ్మ దేవతలతో “రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకనభావం. అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని” అన్నాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
దేవతలంతా తమ కష్టాలను ఎవరికి చెప్పుకున్నారు ?
జవాబు:
దేవతలు తమ కష్టాన్ని బ్రహ్మకు చెప్పారు.

ప్రశ్న 2.
బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది ఎవరు ?
జవాబు:
రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నాడు.

TS 10th Class Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 3.
రావణుడి భయం వల్ల ఎవరు తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారు ?
జవాబు:
రావణుడి భయం వల్ల సూర్యుడు, సముద్రుడు, వాయువు తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారు.

ప్రశ్న 4.
ఎవరివల్ల రావణాసురుడికి మరణంలేదు ?
జవాబు:
గంధర్వ, యక్ష, దేవ, దానవుల వల్ల రావణుడికి మరణం లేదు.

ప్రశ్న 5.
గోడు వెళ్ళబోసుకోవడం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
గోడు వెళ్ళబోసుకోవడం అంటే బాధలు చెప్పుకోవడం.

ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి.

ప్రశ్న 6.
నిరయంబైన, నిబంధమైన, ధరిణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో ;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ ; వినుమా ! ధీవర్య ! వేయేటికిన్ ?
జవాబు:
ప్రతిపదార్థం :

ధీవర్య ! = బుద్ధి శ్రేష్ఠుడవైన ఓ శుక్రాచార్యా !
నిర్ణయంబు + ఐనన్ = నాకు నరకం దాపురించినా
నిబంధము + ఐనన్ = చెరలో బంధీ అయినా
ధరణీ = భూమండలం (రాజ్యం)
నిర్మూలనంబు+ఐనన్ = పూర్తిగా నశించినా
దుర్మరణంబు+ఐనన్ = కష్టమైన మరణం సంభవించినా
కుల+అంతము+ఐనన్ = వంశం అంతరించినా
నిజమున్ = నిజంగా
రానిమ్ము = రానీ
కానిమ్ము పో = ఏది జరిగితే అది జరగనీ
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుఁడు + ఐనన్ = శివుడైనా
హరి + ఐనన్ = విష్ణువైనా
నీరజభవుడు+ఐనన్ = బ్రహ్మదేవుడైనా
ఔన్ = అగుగాక
వేయి + ఏటికిన్ = వేయి మాటలు ఎందుకు?
వినుమా ! = వినవయ్యా!
నాదు జిహ్వ = నా నాలుక
తిరుగన్ నేరదు = ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను

(లేదా)

తెలగాణా ! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైష్ణవ్య సం
చలనమ్మూరక పోవలేదు ! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా !
జవాబు:
తెలంగాణా ! = అమ్మా తెలంగాణా !
భవదీయ = నీ యొక్క
పుత్రులలో = పిల్లలలో
తీండ్రించు = రగిలే
వైష్ణవ్యసంచలనమ్ము = విప్లవ చైతన్యము
ఊరక పోవలేదు = వృథా కాలేదు
వసుధా చక్రమ్ము = భూమండలాన్నంతటినీ
సారించి = సవరించి
ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన
వైభౌతిక = కాంతివంతమైన
భానునిన్ = సూర్యుణ్ణి
పిలిచి = ఆహ్వానించి
దేశంబు + అంతటన్ = దేశమంతా
కాంతివార్ధులు = కాంతి సముద్రాలు

ఇ) కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులే శత్రులగుట తథ్యము సుమతీ !

ప్రశ్నలు :

ప్రశ్న 7.
కమలాలకు ఆప్తుడు మిత్రుడు ఎవరు ?
జవాబు:
సూర్యుడు

TS 10th Class Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 8.
నీటబాసినవి ఏవి ?
జవాబు:
నీటబాసినవి కమలములు

ప్రశ్న 9.
“తమ స్థానములు కోల్పోతే” అనే అర్థం వచ్చే పాదం ఏది ?
జవాబు:
3వ పాదం

ప్రశ్న 10.
మిత్రులు శత్రువలెప్పుడు అవుతారు ?
జవాబు:
తమ స్థానం తప్పినప్పుడు మిత్రులు శత్రువులవుతారు

ప్రశ్న 11.
పై పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
సుమతీశతకం

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 12.
జీవనభాష్యం పాఠ్యభాగం రాసిన కవి గురించి తెల్పండి.
జవాబు:
రచయిత : రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించారు.
విశేషాంశాలు : ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి ప్రముఖ కవి. గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.
రచనలు : నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతగరతి మందహాసం, ద్విపదలు, ప్రపంచపదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. సినిమా పాటలకు సాహితీ గుబాళింపులను అద్దిన రసహృదయుడు సినారె. “ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు” అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం.
అవార్డులు : భారత ప్రభుత్వం వారిచే “పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన ‘జ్ఞానపీఠ అవార్డు’ను అందుకున్నాడు.
శైలి : శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కలానికీ, గళానికీ ఉన్న ప్రత్యేకత.

ప్రశ్న 13.
దానము చేయడానికి సిద్ధపడ్డ బలితో శుక్రాచార్యుడు ఏమన్నాడు ?
జవాబు:
వామనుడికి మూడు అడుగుల దానం ఇవ్వడానికి సిద్ధపడ్డ బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు ఇలా అన్నాడు :
“ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్ని, రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వచ్చిన వాడు శ్రీమహా విష్ణువు, కొంచెం తీసుకొని పోయేవాడు కాదు. మూడు అడుగులతో ముల్లోకాలు ఆక్రమించగల త్రివిక్రముడు. కనుక నా మాట విని ఈ దానము గీనము చేయకు.”

ప్రశ్న 14.
‘నెల్లూరి కేశవస్వామి కథలు, ఊహాజనిత కథలు కావు’ అని రచయిత ఎందుకన్నాడు .?
జవాబు:
గడిచిన కాలంలోని అవిస్మరణీయ ఘట్టాల సమాహారమే చరిత్ర.. 1944 నుండి 1951 మధ్య జరిగిన అనేక సంఘటనలను కళ్ళారా చూసి, అనుభవించి, స్పందించి, పరిష్కారం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన కేశవస్వామి అనుభవాలలో నుంచి, అనుభూతి నుంచి పుట్టినాయి.

ఇవి గతానికి సజీవ సాక్ష్యాలు. ముఖ్యంగా యుగాంతం, కేవలం మనుషులం, భరోసా, ఆఖరికానుక కథలు ఆనాటి పరిస్థితులను, సంఘటనలనూ కళ్ళ ముందుంచుతాయి. కేశవస్వామి ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా వాస్తవ జీవితాలను సామాజిక పరిణామాలను, చరిత్రను కథలరూపంలో నిక్షిప్తం చేశాడు.

ప్రశ్న 15.
‘భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన పనులలోకెల్లా మరపురానిది దేవదాసి, ముర్లీ, వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం.’ ఈ విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
భాగ్యరెడ్డి వర్మ నిమ్నకులాల చైతన్యం కోసం నిరంతరం కృషిచేసిన మహనీయుడు. మూఢనమ్మకాలు, అవిద్య, దారిద్ర్యం నుండి పుట్టినవే దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలు.

పుట్టుకతోనే కొందరు ఆడపిల్లలను దేవుని పేరుతో గుడిలో సేవలు చేయడానికి అంకితం చేసేవాళ్ళు. జీవిత కాలమంతా వాళ్ళు ఆ చాకిరీతోనే వెళ్ళదీసేవాళ్ళు. క్రమంగా పెత్తందార్లు వాళ్ళను తమ ‘ఇంటి’ మనుషులుగా వాడుకునేవారు. ముర్లీ వ్యవస్థ కూడా అటువంటిదే. ఇక వేశ్యావృత్తి అంటే పడుపువృత్తి. పేదరికంతో కుటుంబాలను సాదుకోలేక కొందరు స్త్రీలు శరీరాన్ని అమ్ముకునే దయనీయమైన వృత్తిలోకి దిగబడటం అంటే మానవత్వాన్ని డబ్బుకు తాకట్టు పెట్టడమే.

ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని చేరదీసి, మంచీచెడు వివరించి, మంచి మార్గం చూపించి, సగౌరవంగా సభ్య సమాజంలో తలెత్తుకొని తిరగగలిగే పరిస్థితులను నిర్మించిన భాగ్యరెడ్డి వర్మ నిత్యస్మరణీయుడు.

ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)

ప్రశ్న 16.
‘భర్తసన్నయెరిగి నడుచుకోవడం’ అంటే ఏమిటి ? ఈ సన్నివేశం ఆధారంగా భార్యాభర్తల అనుబంధాన్ని ఎట్లా విశ్లేషిస్తారు ?
జవాబు:
బలిచక్రవర్తి తన సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డా, అతని భార్య వింధ్యావళి అతని మనసెరిగి ఆనందంగా సహకరించింది. ఎంతో ఉదారగుణంతో ఒక గొప్పకార్యం నెరవేర్చడానికి ‘పూనుకున్నప్పుడు అతి తన మహాభాగ్యంగా భావించి మనఃపూర్వకంగా, పూర్తిగా తోడ్పాటునందించడం. పూర్వకాలంలో సాధారణంగా జరిగేది. హరిశ్చంద్రుని ‘ భార్య చంద్రామతి, శ్రీరాముని భార్య సీత ఇటువంటి మహాసాధ్వీమణులే.

భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండవలసింది పరస్పర నమ్మకం. ఒకరిపట్ల ఒకరికి అభిమానం. ఒకరికోసం మరొకరు త్యాగం చేయగలిగే ఆలోచన కలిగి ఉండాలి. భారతీయ సాంప్రదాయంలో భార్యాభర్తల బంధాన్ని జన్మజన్మల బంధంగా భావిస్తారు.

యోగ్యుడైన భర్త, కార్యసాధకుడై, ఆదర్శజీవనం సాగిస్తూ, తనకోసం కాక పదిమంది మేలుకోసం జీవించడం భార్యకు ఆనందాన్ని, గౌరవాన్ని కల్గిస్తుంది. ఆత్మగౌరవానికి మించిన సంపద లేదు. అందుకే ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు, అన్నమాట తప్పకుండా నడుచుకు నేందుకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. భర్త భార్య తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేవారు. అవసరమైతే తమ ప్రాణాన్ని, జీవితాన్ని, సర్వస్వాన్నీ వదులుకొనేందుకు సిద్ధపడేవారు.

ఇదే కుటుంబ జీవనం – ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది. భార్యాభర్తలు ఉత్తమజీవనాన్ని అవలంభిస్తూ, ఒకరికోసం ఒకరు జీవిస్తూ నలుగురితో మంచివారు, ఉత్తములు అనిపించుకోవడమే సార్థకజీవనం అనిపించుకుంటుంది.

(లేదా)

కవి సి. నారాయణరెడ్డి చెప్పిన ‘జీవన భాష్యం’ సారాంశమేమిటి ?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయి. లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది అని కవి డా. సి. నారాయణరెడ్డి జీవన భాష్యంలో ప్రేరణ కలిగించే సందేశం ఇచ్చారు.

బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నాలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవితంచడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల ఏర్పడుతుంది అని కవి డా. సి. నారాయణరెడ్డి జీవన భాష్యంలో ప్రేరణ ఇచ్చారు.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా, ఇక నాకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, ఎలాంటి పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరుకారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని కవి సి. నారాయణరెడ్డి జీవన భాష్యంలో ప్రేరణ కలిగించే సందేశం ఇచ్చారు.

TS 10th Class Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 17.
‘గోలకొండ పట్టణము చూడచక్కనిది’ – దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి.
జవాబు:
గోలకొండ పట్టణము యొక్క అంద చందాలను, పట్టణ వైభవాన్ని, విశిష్టతను ఆదిరాజు వీరభద్రరావు గారు చక్కగా వర్ణించారు.
నిర్మాణం : గోలకొండ పట్టణం చరిత్ర ప్రసిద్ధి గాంచిన అద్భుతమైన పట్టణం. ఆ కాలంలో పట్టణం అంటే గోలకొండ పట్టణం అనే దక్షిణ భారతాన ప్రసిద్ధి. దానికి కారణం ఆ పట్టణ నిర్మాణంలోని గొప్పదనం. దీనిని నిర్మించడానికి ఆజంఖాన్ అనే గొప్ప ఇంజనీరు రూపకల్పన చేశాడు.
విశిష్టత : విశాలమైన పట్టణ వీధులు. రథాలు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు తిరగడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఒకవైపు రాజుల భవనాలు, మరొకవైపు జనుల నివాసాలు – తీర్చిదిద్దినట్లు అందమైన చిత్రాన్ని చూస్తున్నట్లు ఉంటాయి. భటులకు ప్రత్యేకమైన బారకాసులున్నాయి.
అందచందాలు : భవనాల పై భాగాన తోటలు ఏర్పాటుచేసి వాటికి నీటివసతి కల్పించడం అద్భుతమైన ఆకర్షణ. జలాశయాలు, జలపాతాలు, కేళాకూళులు, నీటికాలువలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. స్వర్గంలోని నందనవనమే నేమో అనిపిస్తుంది. నగీనాబాగ్, దిల్కుషా భవనం రాజమందిరాల అందాలు వర్ణానాతీతం.
వైభవం : వర్తకులు విదేశీ వ్యాపారం చేసేవారు. గోలకొండ వజ్రాలకు పుట్టినిల్లు. మంత్రి మీర్ జుమ్లా దగ్గర ఇరవై మణుగుల బరువుగల. వజ్రాలుండేవట. ఇక్కడి వర్తకుల వైభవానికి కుబేరుడు కూడా సాటిరాలేడు.
ఇంతేకాక కుతుబ్ షాహీలు కవిపండితులను ఆదరించి సాహిత్యాన్ని ప్రోత్సహించారు. కళలను అభివృద్ధి చేశారు. ఇది గోలకొండ పట్టణ విశిష్టత.

(లేదా)

‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది’. ఎందుకో వివరించండి.
జవాబు:
ఏ భాష అయినా పూర్తిగా అర్థమయితేనే అందులోని ‘మజా’ను ఆస్వాదిస్తాం. పూర్తిగా అర్థం కావడం అంటే ప్రతి పదంలోని అర్థం, వ్యంగ్యం, రసం, భావం వింటుండగానే గ్రహింపునకు రావడం. అప్పుడే అది ఆస్వాదయోగ్యమై, గుండెకు తాకి రసప్రసారం చేస్తుంది, స్పందింపజేస్తుంది. భాషలోని పలుకుబడి, నుడికారం, జాతీయాలు మనసును ఆనందింపజేస్తాయి. పలుకుబడి అంటే ఉచ్చారణలో ఉండే ప్రత్యేకత. దీన్నే ‘యాస’ అంటున్నాం. ఒకే మాటను, ఒకే అర్థాన్ని ప్రకటించే మాటను వేర్వేరు ప్రాంతాల వాళ్ళు పలికేతీరు వేరువేరుగా ఉంటుంది. దీన్నే ‘మాండలికం’ అనీ అంటున్నాం.

ఇక ‘నుడికారం’ అనేది మాట చమత్కారం ఇది స్థానికంగా ఉపయోగించే ప్రత్యేక పదం. ఉదా : పసందు, ఇజ్జత్, పైలం, మోతెపరి లాంటి మాటలు తెలంగాణలో సహజంగా ఉపయోగిస్తాం. ఇక జాతీయాలు జనం అనుభవంలో నుంచి వచ్చిన ప్రత్యేకమైన అర్థంలో ఉపయోగించే పదాలు / పదబంధాలు.

చేతికి ఎముక లేకపోవడం, కొట్టినపిండి, గొడ్డలిపెట్టు, తలపండిన, నిమ్మకునీరెత్తు, బెల్లంకొట్టినరాయి వంటివి. ఇవి ప్రత్యేకార్థంలో సందర్భోచితంగా ప్రయోగిస్తారు. వాటి అర్థం గ్రహించగానే మనసు హరివిల్లుగా మారుతుంది. ఈ అంశాలన్నీ ప్రతి భాషలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఉంటాయి.

నిరంతరం వినడం, మాట్లాడటం వల్ల ఆ భాష పట్ల ప్రత్యేక మమకారం ఏర్పడుతుంది. ఆత్మీయభావం కలుగుతుంది. భాషలో కమ్మదనంతోపాటు అమ్మతనం కనిపిస్తుంది. అందుకే అది వినసొంపుగా అనిపిస్తుంది.

ప్రశ్న 18.
విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణులు అతని యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి.
జవాబు:
విశ్వామిత్రుని ఆగమనం : దశరథుని పుత్రులైన రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు పెద్దవారవుతున్నారు. వేదశాస్త్రాలు అభ్యసించారు. విలువిద్యలో ఆరితేరారు. విశ్వామిత్రమహర్షి ఒకరోజు దశరథుని వద్దకు వచ్చాడు. తాను యజ్ఞాన్ని చేస్తున్నానని, దానికి రాక్షసబాధ ఎక్కువగా ఉందని చెప్పాడు, యజ్ఞదీక్షలో ఉన్నందున రాక్షసులను శపించకూడదని అన్నాడు. యాగరక్షణకై తన వెంట రాముని పదిదినాలు పంపమన్నాడు. దశరథుడు వశిష్ఠుని సలహాపై తనకిష్టం లేకపోయినా, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపించాడు.

గురుసేవ : రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడిచారు. విశ్వామిత్రుడు దారిలో వారికి బల, అతిబల విద్యలు నేర్పాడు. ఆ విద్యవలన అలసట, నిద్రరాదు. రాముడు విశ్వామిత్రునికి అనేకరకాల సేవలు చేశాడు.

తాటక వధ : గురుశిష్యులు మలద, కరూశ అనే ప్రాంతాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి పంటలను ధ్వంసం చేస్తోంది. విశ్వామిత్రుని ఆదేశం మేరకు రాముడు తాటకను చంపాడు.

యాగరక్షణ : విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరాడు. యజ్ఞదీక్ష చేపట్టాడు. రామలక్ష్మణులు ఆరురోజులు జరిగే ఆ యజ్ఞాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఆరవరోజు మారీచుసుబాహులు వచ్చి యాగాన్ని ధ్వంసం చేయాలని చూశారు. రాముడు శీతేషువు అనే మానవాస్త్రంతో మారీచుణ్ణి సముద్రం ఒడ్డునపడేటట్లు కొట్టాడు. సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో చంపాడు. మహర్షియజ్ఞం పూర్తయింది. ‘

ఇలా రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రుని యాగరక్షణ కర్తవ్యాన్ని, సమర్థులైన శిష్యులుగా నిర్వహించారు.

(లేదా)

లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్తించిన విధానమును తెలపండి.
జవాబు:
హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద నుండి త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోకి అడ్డువచ్చిన లంకిణిని సంహరించి లంకలోకి ప్రవేశించాడు.
లంకలో ప్రవేశించిన మారుతి (హనుమంతుడు) సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడా సీత జాడ కనిపించలేదు.

అప్పటివరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు. అనువణువునా వెదికాడు. ఎత్తైన శింశుపా వృక్షాన్ని ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షసస్త్రీలు ఉన్నారు. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె సీతే అని అనిపించింది. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోయాయి. ఆమె సీత అని ధృవపరచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని తలచుకొని నమస్కరించాడు.

చెట్టుపై ఉన్న హనుమంతుడు సీతాదేవిని కాపాడటానికి సరైన మార్గం రామకథాగానం అని నిర్ణయించుకున్నాడు. సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు. చెట్టు దిగి హనుమంతుడు సీతాదేవికి నమస్కరించాడు. అమ్మా నీవెవరు ? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక. దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపింది. హనుమంతుడు నేను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.. రాముని రూపగణాలను వివరించి, శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. లంకకు వచ్చి రాక్షసులు చెరనుండి తనను విడిపించమని చెప్పుమని చెప్పింది హనుమంతుడితో. శ్రీరాముడు గుర్తించడానికి ఆనవాలుగా కాకాసురుని కథ చెప్పి, కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది సీత.

పై విధంగా లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్తించాడు.

ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)

ప్రశ్న 19.
ఆది హిందువుల మేలు కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మను ‘ఇంటర్వ్యూ చేయడానికి తగిన ‘ప్రశ్నావళి’ని తయారు చేయండి.
జవాబు:
భాగ్యరెడ్డి వర్మ విద్యార్థులు

విద్యార్థులు : నమస్కారమండి.
భాగ్యరెడ్డి వర్మ : శుభాభినందనలు పిల్లలూ
విద్యార్థులు : సమాజాన్ని చైతన్యపరచడానికి మీరు చేసిన, చేస్తున్న కృషి బాగుంది సార్ ! మీకెందుకు సమాజ సేవ చేయాలనిపించింది ?
భాగ్యరెడ్డి వర్మ : మనుషులంతా పుట్టుకతో సమానులు. ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే మన సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు వేళ్ళూనుకు పోయాయి. ఆ మూఢనమ్మకాలను తొలగించకపోతే సమాజం బాగుపడదు. మన తోటి మానవులను అణగదొక్కుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా ! ఒక బాధ్యత గల పౌరుడిగా సమాజంలోని చెడును వ్యతిరేకించాను. మీరూ అలాగే సమాజంలోని చెడును వ్యతిరేకించాలి.
విద్యార్థులు : మీరు సంఘంలో చూసిన దూరాచారాలేవి ?
భాగ్యరెడ్డి వర్మ : దేవదాసి, ముర్లీ వేశ్యా సంప్రదాయాలు, తాగుడు, కులవ్యవస్థ, ఆడ, మగ పిల్లలను దేవుడికి వదిలేయడం.
విద్యార్థులు : ఈ సమాజాన్ని బాగుచేయడానికి మీరెలాంటి కార్యక్రమాలు చేపట్టారు ?
భాగ్యరెడ్డి వర్మ : అనేక సభలు నిర్వహించాను. ప్రతియేట జరిగే మత, సాంఘిక సభలకు హాజరయ్యాను. ప్రతి సభలోను అణగారిన వర్గాలు, అది హిందూ సమాజం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరించి చెప్పాను.
విద్యార్థులు : మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చి ఉంటారు ?
భాగ్యరెడ్డి వర్మ : 3348 ఉపన్యాసాలు ఇచ్చి ఉంటాను. అణగారిన వర్గాల్లో చైతన్యం తెచ్చాను.
విద్యార్థులు : మీ కృషివల్ల ఎలాంటి మార్పులు జరిగాయి ?
భాగ్యరెడ్డి వర్మ : నా కృషి ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం పాఠశాలలు నెలకొల్పింది. అంటరాని వర్గాలకు ఆది హిందువులుగా జనాభా లెక్కలలో నమోదు చేయించారు. ఆది హిందువులు దగ్గరయ్యేలా చేశాను. హిందూ సమాజం చీలికలు, పేలికలు కాకుండా ఆపాను.
విద్యార్థులు : చాలా సంతోషం సార్. మీలాంటి నాయకులు అరుదుగా పుడతారు. మీలాంటివారు మాలాంటి వారికి ప్రేరణ, ఆదర్శం.

(లేదా)

గోలకొండ పట్టణాన్ని చూడడానికి మీరు మీ తోటి విద్యార్థులతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. దాని కోసం అనుమతి కోరుతూ మీ ప్రధానోపాధ్యాయులకు ‘లేఖ’ రాయండి.
జవాబు:

సూర్యాపేట,
తేదీ : XXXX.XXXX’

శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులగారికి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
అయ్యా !
విషయం : గోలకొండ పట్టణం వెళ్ళుటకు అనుమతి గురించి.
X X X X

పై విషయానుసారం తమరితో చేయు మనవి. మేము మీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాం. గోలకొండ పట్టణము చూచుటకు హైదరాబాదు వెళ్ళాలనుకుంటున్నాం. ఆ పట్టణము యొక్క నిర్మాణము, శైలి, అందచందాలను ప్రత్యక్షంగా వీక్షించుట ద్వారా మేము చాలా విషయాలను తెలుసుకోగలుగుతాము. కావున దయచేసి మాకు గోలకొండ పట్టణము వెళ్ళుటకు అనుమతించగలరు.
కృతజ్ఞతలతో …………………
ఇట్లు,

మీ విద్యార్థులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
సూర్యాపేట.

పార్ట్ – B

సమయం : 30 ని.లు
మార్కులు : 20

సూచనలు :

  1. విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
  2. పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.

I. భాషాంశాలు

అ) పదజాలం : (2 × 1 = 2 మా.)

కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.

ప్రశ్న 1.
చమత్కారం : ……………………….
జవాబు:
చమత్కారం : సంభాషణను చమత్కారంగా మాట్లాడటం కళ.

ప్రశ్న 2.
రొమ్మున ఎముకలు లెక్కబెట్టు : …………………………..
జవాబు:
రొమ్మున ఎముకలు లెక్కబెట్టు: ప్రతి వ్యక్తినీ రొమ్మున ఎముకలు లెక్కబెట్టినట్లు పరిశీలించకూడదు.

TS 10th Class Telugu Model Paper Set 3 with Solutions

కింది వానికి సరైన జవాబును గుర్తించి’ ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి సంస్కృతాంధ్ర భాషల్లో ఉద్దండ పండితుడు. (ఈ వాక్యంయ ‘ఉద్దండ’ అనే పదానికి అర్థం)
A) గొప్ప
B) తక్కువ
C) అతితక్కువ
D) మామూలు
జవాబు:
A) గొప్ప

ప్రశ్న 4.
ఎంత రాత్రయిన పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేదని తల్లిదండ్రుల్లో గుబులు మొదలయ్యింది. (ఈ వాక్యంలో ‘గుబులు’ అనే పదానికి అర్థం)
A) సంతోషం
B) భయం
C) ఆనందం
D) సంబురం
జవాబు:
B) భయం

ప్రశ్న 5.
‘బ్రాహ్మణుడు’ అనే పదానికి సరైన పర్యాయ పదాలు
A) విప్రుడు, పొట్టివాడు
B) భూసురుడు, పొడుగువారు
C) భూసురుడు, విప్రుడు
D) ఏదీకాదు
జవాబు:
C) భూసురుడు, విప్రుడు

ప్రశ్న 6.
జ్ఞాపకం, గుర్తు అనే పదాలకు సరైన పర్యాయ పదం
A) మరుపు
B) నిద్ర
C) యాది
D) మది
జవాబు:
C) యాది

ప్రశ్న 7.
‘అంబరం’ అనే పదానికి నానార్థాలు
A) కన్నీరు, ఆవిరి
B) వంశం, జాతి
C) కోరిక, దిక్కు
D) వస్త్రం, ఆకాశం
జవాబు:
D) వస్త్రం, ఆకాశం

ప్రశ్న 8.
‘నామధేయం, కీర్తి, హారం’ అనే నానార్థాలను చెప్పే పదం
A) కవి
B) హరి
C) ఆహారం
D) పేరు
జవాబు:
D) పేరు

ప్రశ్న 9.
‘పొన్నగంటి తెలగన ‘యయాతి చరిత్ర’ అనే కావ్యం రాసి, ఆ కబ్బాన్ని అమీర్ ఖాన్కు అంకితం ఇచ్చాడు’. (ఈ వాక్యంలో ప్రకృతి – వికృతులు వరుసగా)
A) చరిత్రం – అంకితం
B) తెలగన – యయాతి
C) కావ్యం – కబ్బం
D) యయాతి – అంకితం
జవాబు:
C) కావ్యం – కబ్బం

ప్రశ్న 10.
‘జలధి’ అనే పదానికి వ్యుత్పత్తి
A) జలములు దీనిచే ధరించబడును
B) బంగారము గర్భమందు కలది
C) ప్రకాశించువాడు
D) దయను పోగొట్టునది
జవాబు:
A) జలములు దీనిచే ధరించబడును

ఆ) వ్యాకరణాంశాలు :

కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)

ప్రశ్న 11.
మహా + ఐశ్వర్యం అనే పదాలను కలిపితే ఏర్పడే రూపం
A) మహాశ్చర్యం
B) మహాశ్వర్యం
C) మహైశ్వర్యం
D) మహీశ్వర్యం
జవాబు:
C) మహైశ్వర్యం

ప్రశ్న 12.
‘ఇక్కాలము’ అనేది ఏ సంధికి ఉదాహరణ ?
A) త్రికసంధి
B) ఉత్త్వ సంధి
C) ఇత్త్వ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) త్రికసంధి

ప్రశ్న 13.
మూడు నేత్రములు కలవాడు అనేది ఏ సమాసానికి చెందినది ?.
A) ద్వంద్వ
B) బహువ్రీహి
C) రుగాగమ
D) ద్విగు
జవాబు:
B) బహువ్రీహి

TS 10th Class Telugu Model Paper Set 3 with Solutions

ప్రశ్న 14.
కింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) రామబాణము
B) జలధారలు
C) నాలుగు వేదాలు
D) ధనధాన్యాలు
జవాబు:
D) ధనధాన్యాలు

ప్రశ్న 15.
గురువు, లఘువు, గురువు వరుసగా వస్తే అది …………..
A) మ గణం
B) ర గణం
C) స గణం
D) య గణం
జవాబు:
B) ర గణం

ప్రశ్న 16.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు …… ఈ పద్యం ఏ ఛందస్సుకు చెందినది ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
D) మత్తేభం

ప్రశ్న 17.
‘వర్ష వర్షములో ఆడుకొంటున్నది’ – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) వృత్త్యనుప్రాసాలంకారం
B) ఛేకానుప్రాసాలంకారం
C) అంత్యానుప్రాసాలంకారం
D) యమకాలంకారం
జవాబు:
B) ఛేకానుప్రాసాలంకారం

ప్రశ్న 18.
కింది వాటిలో అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ
A) తరుణ్ తాటిచెట్టంత పొడవున్నాడు.
B) సీత ముఖం’ చంద్రబింబంలా అందంగా ఉన్నది
C) చీకటి కాటుక వర్షమా ! అన్నట్లు ఉన్నది
D) కోతులు కిచకిచలాడుతూ ఎగురుతూ, దుంకుతూ అల్లరి చేస్తున్నాయి
జవాబు:
A) తరుణ్ తాటిచెట్టంత పొడవున్నాడు.

ప్రశ్న 19.
కింది వాటిలో ప్రత్యక్ష కథనానికి సరైన ఉదాహరణ
A) తన పుస్తకాలు వెతికి పెట్టుమని మాలతి అడిగింది
B) ‘తనకు అన్నం పెట్టుమని’ లలిత అడిగింది
C) నేను పొలానికి పోతున్న’ అని రాజయ్య భార్యతో అన్నాడు
D) తనకు ఆటలు ఆడుకోవడమంటే ఇష్టమని తన్మయి చెప్పింది.
జవాబు:
C) నేను పొలానికి పోతున్న’ అని రాజయ్య భార్యతో అన్నాడు

ప్రశ్న 20.
హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా రావడమనేది. ఏ అలంకార లక్షణం
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) యమకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) ఛేకానుప్రాస

Leave a Comment