AP 10th Class Telugu Model Paper Set 3 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 3 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 3 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.

ఆ పరమ పురంధ్రులయం
దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా!
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో?

ప్రశ్నలు :
అ) వ్యాసునికి ఏ నగరంలో భిక్ష దొరకలేదు ?
జవాబు:
కాశీనగరంలో వ్యాసునికి భిక్ష దొరకలేదు.

ఆ) భిక్ష సమర్పించనిది ఎవరు ?
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు భిక్ష సమర్పించలేదు.

ఇ) భిక్ష దొరకలేదని వ్యాసుడు ఏమనుకున్నాడు ?
జవాబు:
భిక్ష దొరకలేదని వ్యాసుడు “ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఏ నగరంలోని స్త్రీలు భిక్ష ఇవ్వలేదు?

(లేదా)

వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పుకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!

ప్రశ్నలు :

ఉ) పొలాన్ని ఎప్పుడు దున్నకూడదు ?
జవాబు:
వరద వచ్చినప్పుడు పొలాన్ని దున్నకూడదు

ఊ) కరువు పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళకూడదు ?
జవాబు:
కరువు పరిస్థితులలో బంధువుల వద్దకు వెళ్ళకూడదు.

ఋ) పిరికివానికి ఏది ఇవ్వకూడదు ?
జవాబు:
పిరికివానికి సేనానాయకత్వం ఇవ్వకూడదు.

ౠ) ఈ పద్యానికి మకుటం ఏమిటి?
జవాబు:
ఈ పద్యానికి మకుటం ‘సుమతీ’

AP 10th Class Telugu Model Paper Set 3 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు. సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు. దాన్ని స్త్రీల ఉద్యమం ప్రశ్నిస్తూనే ఉంది. దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకూ, పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వాళ్ళ సామూహిక ఉనికి తునాతునకలైపోతుంది. దానితో కొన్ని విజయాలు సాధించిన స్త్రీలను ఒక్కొక్కరుగా తల్చుకుని వాళ్ళశక్తికి ఆశ్చర్యపడతారు. అట్లాంటి శక్తిమంతులరుదుగా ఉంటారని, వారిని అసామాన్య ఉదాహరణలుగా మాత్రమే గుర్తుంచుకుంటారు.

ప్రశ్నలు :

అ) సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా గుర్తింపు దొరకనిది ఎవరికి?
జవాబు:
సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా, స్త్రీలకు గుర్తింపు దొరకదు.

ఆ) స్త్రీల ఉద్యమం దేనిని ప్రశ్నిస్తుంది?
జవాబు:
సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దడాన్ని స్త్రీల ఉద్యమం ప్రశ్నిస్తుంది.

ఇ) స్త్రీల సామూహిక ఉనికి ఎలా తునాతునకలైపోతుంది?
జవాబు:
చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద స్త్రీల సామూహిక ఉనికి తునాతునకలైపోతుంది.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఎవరి శక్తికి ఆశ్చర్యపడతారు?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)

అ) కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు.
జవాబు:
కిష్కింధాకాండ

ఆ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.
జవాబు:
బాలకాండ

ఇ) అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకమహోత్సవం జరిగింది.
జవాబు:
యుద్ధకాండ

ఈ) శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు.
జవాబు:
అయోధ్యాకాండ

4) క్రింది కరపత్రాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (8 మా)

అయ్యంకి వెంకట రమణయ్య స్మారక గ్రంథాలయం ప్రారంభోత్సవ ఆహ్వానం

మిత్రులారా !

గ్రంథాలయాలు జాతి నాగరికతా సంస్కృతులకు ప్రతీకలు, విజ్ఞాన సంపదకు నిలయాలు. పౌరులను మేధావులుగా, చైతన్యవంతులుగా, వివేకులుగా తీర్చిదిద్దే సాధనాలు. గ్రంథ పఠనం ద్వారా ధారణశక్తి పెరుగుతుంది. విరామకాల సద్వినియోగం జరుగుతుంది. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పుస్తక పఠనాభిలాషను పెంపొందించేందుకు, పాఠశాల స్థాయి నుండే “చదవడమంటే మా కిష్టం” అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది.

54వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఊళ్ళపాళెం పూర్వ విద్యార్ధులమైన మేము విద్యార్థులు, యువకులలో విజ్ఞానాభివృద్ధిని పెంపొందించే సంకల్పంతో గ్రంథాలయాన్ని నిర్మించాము. గ్రంథాలయోద్యమ

పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య పేరుతో ఈ గ్రంథాలయానికి నామకరణం చేశాము. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము.

ఇట్లు
పూర్వ విద్యార్థి సంఘం, ఊళ్ళపాళెం.

ముఖ్య అతిథి మరియు ప్రారంభకులు : జిల్లా కలెక్టర్ గారు
సమయం: ఉదయం 10 గం॥లకు
తేదీ : 15-10-2023
వేదిక : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం.

చినిగిన చొక్కానైనా తొడుక్కో – మంచి పుస్తకం కొనుక్కో – కందుకూరి వీరేశలింగం

ప్రశ్నలు :

అ) పఠనాభిలాషను పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది ?
జవాబు:
పఠనాభిలాషను పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో ప్రభుత్వం ‘చదవడమంటే మాకిష్టం’ అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది.

ఆ) ఎవరి పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు ?
జవాబు:
గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు.

ఇ) పై కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ?
జవాబు:
పై కార్యక్రమం ‘పూర్వ విద్యార్థి సంఘం, ఊళ్ళపాళెం’ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.

ఈ) కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
కరపత్రంలో ఉన్న సూక్తిని తెల్పండి.

విభాగము II (36 మా)
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : (3 × 4 = 12 మా)

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

5. “సముద్ర లంఘనం” పాఠ్యభాగ కవి గురించి రాయండి.
జవాబు:
కవి : ‘సముద్ర లంఘనం’ పాఠ్యభాగ కవి అయ్యలరాజు రామభద్రుడు. రామాభ్యుదయం కావ్యంలోని ఆరో ఆశ్వాసంలోనిది ఈ పాఠం.
కాలం : క్రీ॥శ॥ 16వ శతాబ్దివాడు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు.
బిరుదులు : ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాదిమదగజ పంచానన’ అనే బిరుదులు ఉన్నాయి.
ఇతర విశేషాలు : ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. రామభద్రకవి రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఇతని మరొక రచన ‘సకల కథాసార సంగ్రహం’. శ్రీరామ కథను ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా మలచాడు. ప్రతి పద్యంలో కల్పనాచాతుర్యం కనిపిస్తుంది. రామభద్రుని కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమౌతుంది.

AP 10th Class Telugu Model Paper Set 3 with Solutions

6. “మా ప్రయత్నం” పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:

  • ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలియజేసేదే ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ‘ముందుమాట’ను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
  • దీనికి ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. పీఠిక వలన పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది.

7. ‘భరతుడు’ పాత్ర స్వభావాన్ని గురించి రాయండి.
జవాబు:

  • దశరథుని మూడవ భార్యయైన కైక కుమారుడు. కపటం తెలియని ధర్మమూర్తి. శ్రీరామునిపై అమితమైన ప్రేమానురాగాలు కలవాడు.
  • పెద్దవాడైన శ్రీరామునికే రాజ్య పాలనాధికారం ఉందని ప్రకటించి తనకు రాజ్యకాంక్ష లేదని నిరూపించుకొన్న త్యాగశీలి.
  • శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టిన ధర్మాత్ముడు. శ్రీరాముడిని రాజ్యానికి తిరిగి రావలసినదిగా ప్రాధేయపడిన వినయశీలి.
  • శ్రీరాముడు రాజ్యపాలనాధికారం చేపట్టడానికి నిరాకరించడంతో పాదుకలను ఇమ్మని అభ్యర్థించి వాటికి పట్టాభిషేకం చేసిన నిస్స్వార్థపరుడు.
  • శ్రీరాముని లాగే తానూ వనవాస నియమాలను పాటించిన ఆదర్శసోదరుడు. 14 సంవత్సరాల తరువాత శ్రీరామదర్శనం కాకపోతే తాను ప్రాయోపవేశం ద్వారా ప్రాణత్యాగం చేస్తానని ప్రతినబూనిన మహనీయుడు.

కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24 మా)

8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు?
(లేదా)
“స్త్రీ రత్నములు పూజ్యలు” అన్న శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి.
జవాబు:
అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానం వర్ణిస్తూ సముద్ర లంఘనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపడంకోసం సందర్భానికి తగిన పదాలను, అలంకారాలను ఎన్నుకోవడం కవి చేసిన చమత్కారం. ‘హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరాడు. తన శరీరాన్ని పెద్దదిగా పెంచాడు. అతడడుగులు వేసిన చోట పిడుగు పడ్డట్టు కొండరాళ్ళు పగిలిపోయాయి. చేతితో చరచినపుడు ఏనుగులు, సింహాలు బెదరి పారిపోయాయి. హనుమంతుడు చేసిన ఈ చేష్టల వర్ణన స్వభావోక్తి అలంకారంలో ఉంది.

కొండమీదినుండి హనుమంతుడు ఒక్క ఊపున పైకెగరగానే చూసే వాళ్ళందరికీ హనుమంతుడు కాక కొండే ఆకాశానికెగిరిందేమో అనిపించింది.

హనుమంతుడు ఎగురుతున్నప్పుడు వచ్చిన తీవ్రమైన గాలికి సముద్రం రెండు పాయలుగా చీలి పాతాళ లోకం తలుపులు తెరుచుకున్నట్లయింది. ఆ పాయ రాబోయే కాలంలో రాముడు కట్టబోయే సేతువుకు దారంతో కొలుస్తున్నట్లున్నది. రాముడి కోపం లంకవరకు పారడానికి తవ్విన కాలువలాగా ఉన్నది. భూమికి కొత్త వస్త్రమిచ్చి పాత నల్లని వస్త్రము చించినట్లున్నది. ఇవి ఉత్ప్రేక్షలు. రామభద్రకవి ఊహాశక్తి అద్భుతం.

(లేదా)

తల్లిగా, చెల్లిగా, అక్కగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, గురువుగా, భార్యగా స్త్రీమూర్తి అందించే సేవలు చాలా గొప్పవి.

భారతావనిలో ఎందరో స్త్రీ రత్నాలు జన్మించి ఎన్నో రంగాలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎయిర్ హెూస్టెస్ నుంచి ఎవరెస్టు శిఖరం ఎక్కడం వరకు, క్రీడాకారిణి నుంచి రక్షణాధికారి వరకు, టీచరు నుంచి సి.ఇ.ఓ స్థాయి వరకూ, సంగీతం నుంచి సాహిత్యరంగం వరకు స్త్రీ ప్రభావం లేని రంగం అంటూ ఏదీ లేదు.

  • తెలుగు సాహిత్య చరిత్రలో తాళ్ళపాక తిమ్మక్క, రామాయణాన్ని రచించిన మొల్ల గొప్ప విదుషీమణులు. వారి రచనలు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొన్నాయి. నేటి తరంలో ఓల్గా, కాత్యాయనీ విద్మహే, చిల్లర భవానీ దేవి, మెహజబీన్, మృణాలిని వంటి రచయిత్రులు తెలుగు కవితామ తల్లికి సేవలందిస్తున్నారు.
  • క్రీడారంగంలో పి.వి. సింధూ, వీణా మాలిక్, పి.టి.ఉష, కరణం మల్లీశ్వరి, మిథాలి రాజ్, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలా, కోనేరు హంపి, హారిక వంటి వారు విజయాలను సాధించి, మన దేశకీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పారు.
  • కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి మహిళామణులు అంతరిక్ష రంగంలో ఘన విజయాలు సాధించి ‘స్త్రీ అబల కాదు – సబలే’ అని నిరూపించుకున్నారు.

ఈ విధంగా ఎంతో మంది స్త్రీ రత్నాలు వారి వారి రంగాలలో విజయాలు సాధించి మన దేశ గౌరవ ప్రతిష్ఠలు ప్రపంచానికి చాటి చెప్పారు.

9. శ్రీరామ సుగ్రీవులకు మైత్రి ఎలా ఏర్పడిందో రాయండి.
(లేదా)
రామాయణ ప్రాశస్త్యాన్ని వివరించండి.
జవాబు:

  • కిష్కింధను పరిపాలించిన వానరరాజు వాలి. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు.
  • వాలి రాజ్యం నుండి బహిష్కరించగా, సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తలదాచుకొని ఉంటాడు.
  • రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ, సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు.
  • సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, తన అన్న వాలి తనను చంపడానికి పంపిన వీరులేమో అని భయపడ్డాడు.
  • వారి గురించి తెలుసుకోమని తన మంత్రియైన హనుమంతుణ్ణి పంపాడు.
  • హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు.
  • హనుమంతుడు రామలక్ష్మణులకు సుగ్రీవుని గురించి, అతనికి వాలి వలన జరిగిన అన్యాయం గురించి చెప్పి, తాను సుగ్రీవుని మంత్రినని, తన పేరు హనుమంతుడని పరిచయం చేసుకున్నాడు.
  • హనుమంతుని మాటల్లో నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమంతుడితో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు.
  • హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు.
  • అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవులు స్నేహితులయ్యారు.
  • సుగ్రీవుడు శ్రీరామునితో “ప్రాణమిత్రులుగా, ఉందాం” అని చెప్పి, తనకు ‘వాలి భయం లేకుండా అభయం’ కావాలని అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు.

(లేదా)

  • ప్రపంచ సాహిత్యంలో ఆదికావ్యం రామాయణం. వాల్మీకి దీనిని గురించి “ఆదికవి”గా కీర్తి పొందారు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి.
  • రామాయణం మానవ జీవితాలను సంస్కరించగల మహాకావ్యం. మానవ హృదయం నుండి ఎప్పటికీ చెరగని కథ.
  • అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహబంధం, ధర్మబలం, వినయంతో ఒదగటం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్యభావన, ప్రకృతి లాలన – ఇలా జీవితంలోని భాగాలను ఎన్నింటినో రామాయణం పట్టి చూపిస్తుంది.
  • రామాయణాన్ని చదవటం అంటే జీవితాన్ని చదవడమే. ఇది పారాయణ గ్రంథం మాత్రమే కాదు ; ఆచరణ ప్రధానమైన గ్రంథం కూడా.
  • ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది.
  • “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే హితోక్తిని మారీచుని నోటివెంట పలికించాడు వాల్మీకి మహర్షి.
  • రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం “నభూతో న భవిష్యతి” మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది.
  • మనదేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ రామాయణ కథ మనకి వినిపిస్తుంది. ఇన్ని విశిష్టతలున్న రామాయణం భారతీయ జీవన విధానానికి మార్గదర్శకం అని చెప్పవచ్చు.

10. మీరు చూసిన పర్యాటక క్షేత్ర విశేషాలు తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
(లేదా)
మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలను తిలకించడానికి వచ్చిన ఒక ప్రముఖ శతక కవిని ఇంటర్వ్యూ చేయడానికి అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:

చేబ్రోలు,
తేది. XX.XX.XXXX.

ప్రియమిత్రుడు సిద్ధార్థకు,
మిత్రమా !

బాగున్నావా ? నేను ఇక్కడ బాగానే చదువుకుంటున్నాను. నువ్వు పరీక్షలకు బాగా చదువుతున్నావా? నేను మొన్న దసరా సెలవులలో మా తరగతి విద్యార్థులతో కలిసి పర్యాటక ప్రాంతమైన అమరావతి వెళ్ళాను. అక్కడ నేను బౌద్ధస్తూపపు పునాదులు, మ్యూజియంలోని శిల్పకళాసంపదను చూసి ఎంతో ఆనంధించలెను.

రెండువేల నాలుగు వందల సంవత్సరాల కిందట మన పూర్వీకులు అంతపెద్ద కట్టడాలు నిర్మించారంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఒళ్ళు పులకరిస్తుంది.

జీవకళ ఉట్టిపడే అక్కడి శిల్పాలను చూస్తే ఆనాటి శిల్పుల నైపుణ్యానికి శిరసు వంచి నమస్కరించాలని అనిపిస్తుంది. చాలా శిల్పాలలో మాట్లాడటం, ఆజ్ఞాపించటం మొదలైన చేష్టలు’ తెలిసేటట్లుగా శిల్పులు మలిచారు. అలాగే సంతోషం, విషాదం, కరుణ, దయ, వీరత్వం, భక్తి మొదలైన భావాలుకూడా శిల్పాల ముఖాలలో ప్రస్ఫుటమయ్యేటట్లు చిత్రించారు.

మిత్రమా ! నువ్వు కూడా పరీక్షలు పూర్తయ్యాక ఒక్కసారి అమరావతి వెళ్ళి అక్కడి శిల్పసంపదను చూసి తీరాలి. విశేషాలతో వెంటనే జవాబు రాయగలవు.

ఇంతే సంగతులు

ಇట్లు,
నీ మిత్రుడు,
నాగార్జున,
చేబ్రోలు, గుంటూరు జిల్లా.

చిరునామా :
కె. సిద్ధార్థ
S/o. రామయ్య,
ఘంటసాల, కృష్ణాజిల్లా.

(లేదా)

ప్రశ్నావళి:

  1. మీ రచనలలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు?
  2. కొంత మంది సంఘంలోని దురాచారాలను, చెడును ఎత్తి చూపడానికి ప్రాధాన్యమిస్తారు. ఇలా రాయడం వల్ల సంఘంలో ఏమైనా మార్పు వస్తుందా ?
  3. మీరు వృత్త పద్యాల్లో శతకం రాశారా? లేక తేటగీతి, ఆటవెలది వంటి ఉపజాతుల్లో రాశారా?
  4. చదివే వారికి తేలికగా అర్థమవడానికి మీరు ఏం చేశారు?
  5. మేము కూడా శతకాలు రాయాలంటే ఎలాంటి సాహిత్యం చదవాలి ?
  6. శతకాల్లో అలంకారాలు, జాతీయాలు, సామెతలు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది?
  7. నేటి కాలంలో శతకాలు చదివేవారు తగ్గిపోయారు. ఎందుకు ?
  8. పోతన పద్యాలు, వేమన పద్యాలు, సుమతి శతకం పద్యాలు ఇప్పటికీ జనం చదువుతూ ఉంటారు. మరి నేటి కాలం పద్యాలు ఎందుకని గుర్తుండడం లేదు ? జనంలో ఎందుకు ప్రసిద్ధం కావడం లేదు ?

విభాగము III (32 మా)
భాషాంశాలు : (పదజాలం వ్యాకరణాంశాలు) (9 × 2 = 18 మా)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

11. “రాజు కువలయానందకరుడు” (ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి) (2 మా)
జవాబు:
ఈ వాక్యంలో శ్లేషాలంకారము కలదు.
(అలంకారాన్ని గుర్తించి పేరు రాస్తే చాలు. లక్షణం రాయనవసరంలేదు.)

AP 10th Class Telugu Model Paper Set 3 with Solutions

12. కింది పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి. (2 మా)
నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 3 with Solutions 1
పై పద్యపాదం “ఉత్పలమాల” కు చెందినది.

13. అ) నిర్జన ప్రదేశము లో సంచరించుట ప్రమాదకరము. (గీతగీసిన పదానికి అర్థం రాయండి) (1 మా)
జవాబు:
జనసంచారం లేని ప్రదేశం

ఆ) కుటుంబ మర్మములను ఇతరులతో పంచుకోకూడదు. (గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించి, విడిగా రాయండి) (1 మా)
అ) విషయము
ఆ) రహస్యము
ఇ) భాగము
ఈ) పొలము
జవాబు:
ఆ) రహస్యము

14. అ) వ్యక్తిగత పరిశుభ్రత వల్ల రుగ్మతలు రావు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.) (1 మా)
జవాబు:
జబ్బు, రోగం, వ్యాధి, జాడ్యం (ఇలాంటి పర్యాయపదాలు రెండు రాస్తే చాలు)

ఆ) శివాజీ కన్నులు కోపంతో ఎర్రబారాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించి, విడిగా రాయండి.) (1 మా)
అ) చక్షువు – నయము
ఆ) నేత్రము, గాత్రము
ఇ) నయనము కుక్షి
ఈ) అక్షి – చక్షువు
జవాబు:
ఈ) అక్షి – చక్షువు

15. అ) కోటి విద్దెలు కూటికొరకేనని పెద్దల మాట. (గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి) 1 మా
జవాబు:
విద్య

ఆ) హనుమంతుడు సముద్రమును లంఘించాడు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) 1 మా
అ) సంగరం
ఆ) సాగరం
ఇ) సంద్రం
ఈ) సమయం
జవాబు:
ఇ) సంద్రం

16. అ) దేశభాషలందు తెలుగు లెస్స యని రాయలు లెస్సగా బలికెను. (గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి) (1 మా)
జవాబు:
శ్రేష్ఠం, యుక్తం

ఆ) కన్ను మనకు ప్రధాన అవయవం. కన్ను ఉండటం వలన బండి వేగంగా వెళ్ళగలదు. (1 మా)
(గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
అ) నేత్రము, బండిచక్రము
ఆ) వంశం, జాతి
ఇ) ఇల్లు, వస్త్రం
ఈ) కోరిక దిక్కు
జవాబు:
అ) నేత్రము, బండిచక్రము

17. అ) యవనజాతికి చెందిన అంగనను సోన్దేవుడు బంధించాడు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి) (1 మా)
జవాబు:
శ్రేష్ఠమైన అవయవములు కలది (స్త్రీ)

ఆ) శివుడు కాశీలో విశ్వేశ్వరుడుగా వెలిశాడు. (గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.) (1 మా)
అ) పున్నామ నరకం నుండి రక్షించేవాడు (కుమారుడు)
ఆ) సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు (ఈశ్వరుడు)
ఇ) అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు. (ఉపాధ్యాయుడు)
ఈ) పవనుని వలన పుట్టినవాడు (హనుమంతుడు)
జవాబు:
ఆ) సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు (ఈశ్వరుడు)

18. ప్రతీజీవి కాలధర్మం చెందాల్సిందే (వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి) (2 మా)
జవాబు:
కాలధర్మం

19. ‘పురిటిలోనే సంధికొట్టుట’ ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
ప్రారంభంలోనే ఆటంకం కలగడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

20. ఆహాహా ! ఇది ఎంత విచిత్రం ! (గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి)
జవాబు:
ఆహా + ఆహా

21. పల్లె+ ఊరు (ఈ సంధి పదాలను కలిపి రాయండి.)
జవాబు:
పల్లెటూరు

22. హనుమంతుడు కూటాగ్ర వీథి పై వాలాడు. (1 మా)
(గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి, విడిగా రాయండి.)
అ) టుగాగమ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) సవర్ణ దీర్ఘ సంధి
ఈ) త్రిక సంధి
జవాబు:
సవర్ణదీర్ఘ సంధి

23. చిక్కని పాలు పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. (1 మా)
(గీత గీసిన పదానికి విగ్రహ వాక్యాన్ని రాయండి.)
జవాబు:
చిక్కనైన పాలు / చిక్కవైన పాలు

24. చిత్రగ్రీవం తల్లి రెండుగుడ్లు పెట్టింది. (గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
అ) ద్వంద్వ సమాసం
ఆ) అవ్యయీభావ సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ద్విగు సమాసం

25. మా యింటికి గుడువ రమ్ము
– ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనమును గుర్తించి విడిగా రాయండి.
అ) మా యింటికీ తినుటకు రండి.
ఆ) మా యింటికి తినడానికి రండి.
ఇ) మీ యింటికి తినడానికి వస్తాను.
ఈ) మా యింటికి తినుటకు రమ్ము.
జవాబు:
ఆ) మా యింటికి తినడానికి రండి.

26. అమ్మ, నాన్న ఊరికి వెళ్ళారు. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి) (1 మా)
జవాబు:
అమ్మ, నాన్న ఊరికి వెళ్ళలేదు.

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి, రాయండి. (1 మా)
అ) లాలించి
ఆ) లాలిస్తూ
ఇ) లాలిస్తే
ఈ) లాలించక
జవాబు:
ఈ) లాలించక

AP 10th Class Telugu Model Paper Set 3 with Solutions

28. వైద్యుడు ప్రథమ చికిత్స చేశాడు. వైద్యుడు మందులు ఇచ్చాడు. (1 మా)
(ఈ సామాన్య వాక్యాలను సంక్లిష్టవాక్యంగా రాయండి)
జవాబు:
వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు

29. శ్రీరాం పాట పాడాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.). (1 మా)
అ) పాటచేత శ్రీరాం పాడబడ్డాడు
ఆ) పాటపాడటం చేత శ్రీరాం అయ్యాడు
ఇ) శ్రీరాం పాటచేత పాడాడు.
ఈ) శ్రీరాం చేత పాట పాడబడింది
జవాబు:
ఈ) శ్రీరాం చేత పాట పాడబడింది

30. ఆహా ! ఈ శిల్పమెంత బాగున్నదో ! (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి) (1 మా)
జవాబు:
ఆశ్యర్యార్థక వాక్యం

31. ఇక్కడ మీరు భోజనం చేయవచ్చు. (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) నిశ్చయార్థక వాక్యం
ఆ) ప్రార్థనార్థక వాక్యం
ఇ) అనుమత్యర్థక వాక్యం
ఈ) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
అనుమత్యర్ధకవాక్యం

32. తేజశ్రీ కవితలు రాయగలదు. (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి) (1 మా)
జవాబు:
సామర్థ్యార్థకవాక్యం

33. మీకు శుభము కలుగు గాక !
(ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి, విడిగా రాయండి) (1 మా)
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశీరర్థకం
ఇ) సందేహార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఆ) ఆశీరర్థకం

Leave a Comment