TS 10th Class Telugu Model Paper Set 2 with Solutions

Reviewing TS 10th Class Telugu Model Papers Set 2 can help students identify areas where they need improvement.

TS SSC Telugu Model Paper Set 2 with Solutions

‘సమయం: 3 గం.
మార్కులు : 80

విద్యార్థులకు సూచనలు :

  1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
  2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

కింది పేరాను చదవండి. (5 × 1 = 5 మా.)

హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకొన్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత. నిజంగా రామదూతవే అయితే రాముణ్ణి గురించి వినిపించమంది. సీత కోరిక మైన హనుమంతుడు శ్రీరాముడి రూపగణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి పరమానందభరితురాలైంది. సీత. తనదైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెరనుండి తనను విడిపించమని చెప్పమని మారుతికి చెప్పింది.

అంతదాకా ఎందుకు ? తన వీపుమీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్ళగలవని ప్రశ్నించింది సీత. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.

“అమ్మా ! నా వెంట రావడం నీకు అంగీకారయోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు. తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సీత హనుమంతునితో కలసి రాముని దగ్గరకు ఎందుకు రాలేనన్నది ?
జవాబు:
పర పురుషుని తాకనన్నది.

ప్రశ్న 2.
రాముని స్థాయికి సరిపోయేది ఏది ?
జవాబు:
రావణుని సంహరించి తనను తీసుకుపోవడమే.

TS 10th Class Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 3.
హనుమంతుడు సీతకు ఏమిచ్చాడు ?
జవాబు:
శ్రీరాముడి ముద్రికను.

ప్రశ్న 4.
హనుమంతుడు తాను రామదూతనే అని ఎలా నిరూపించుకున్నాడు ?
జవాబు:
శ్రీరాముని రూపగణాలు వివరించి.

ప్రశ్న 5.
శ్రీరాముడికి తన గురించి ఏమని చెప్పమని అడిగింది సీత ?
జవాబు:
తన దైన్యాన్ని వివరించి, శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెరనుండి తనను విడిపించమని చెప్పమంది సీత.

ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి.

ప్రశ్న 6.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
దలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁదే మాన్ప నొకండు ? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం, బనువుమా వర్ణిన్ వదాన్యోత్తమా !
జవాబు:
ప్రతిపదార్థం :

వదాన్య + ఉత్తమా ! = గొప్పదాతలయందు శ్రేష్ఠుడవైన ఓ బలిచక్రవర్తీ !
కులమున్ = (మీ రాక్షస) వంశాన్ని
రాజ్యమున్ = (మీ) దొరతనాన్ని
తేజమున్ = (మీ) పరాక్రమాన్ని
నిలుపుము (నిలుచు +ము) = కాపాడుము
ఈ కుబ్జుండు = ఈ పొట్టివాడు (ఈ వామనుడు)
విశ్వంభరుడు = సర్వమును భరించువాడు (విష్ణుమూర్తే)
అలతిన్ = (ఇంత) తక్కువతో
పోడు = తృప్తినొందడు
త్రివిక్రమ = ముల్లోకాలను ఆక్రమించువాడి యొక్క (విష్ణువు యొక్క).
స్ఫురణ వాడు + ఐ = ప్రకాశం కలవాడై
బ్రహ్మ + అండమున్ = (ఈ) భువన గోళాన్ని అంతటినీ
నిండున్ = వ్యాపిస్తాడు
మాన్పన్ = నివారించుటకు, తప్పించుటకు
కలడు + ఏ = సమర్థుడగునా ? (సమర్థుడు కాడు)
నా = నా యొక్క
పలుకులు = మాటలు, సత్యవచనాలు
కర్ణంబులన్ = చెవులతో
ఆకర్ణింపు = విను (ము)
ఈ దానము గీనమున్ = ఈ దానం గీనం వంటివి
వలదు = వద్దు
వర్జిన్ = (ఈ) బ్రహ్మచారిని
పసుపు + ము + ఆ =
పనుపుమా = పంపించవయ్యా !

(లేదా)

పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోధించు మిత్రుండు, సం
విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
యత్తంబైన కృపాణమై యరులు నాహారించు మిత్రుండు, ప్రో
చ్ఛిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వరా !
జవాబు:
జ ప్రతిపదార్థము :

శ్రీ లొంకరామేశ్వరా = శోభాయుతుడైన, లొంకలోని రామేశ్వర స్వామీ !
మిత్రుండు = స్నేహితుడు
పొత్తంబు + ఐ = పుస్తకము వలె
కడున్ = మిక్కిలి
నేర్పుతో = చాతుర్యముతో
హితమునున్ = మంచిని
ఉద్బోధించున్ = ఉపదేశించును
మిత్రుండు = స్నేహితుడు
సంవిత్తంబు + ఐ = మంచి సంపదలవలె
ఒక కార్య సాధనమునన్ = ఒక పనిని పూర్తి చేయుటలో
వెల్లు + ఒందున్ = ప్రకాశించును
మిత్రుండు = స్నేహితుడు
స్వ + ఆయత్తంబు + ఐన = తన ఆధీనములో ఉన్న
కృపాణము + ఐ = కత్తివలె
అరులన్ = శత్రువులను
ఆహారించున్ = నాశనం చేస్తాడు
మిత్రుడు = స్నేహితుడు
తగన్ = చక్కగా
ప్ర+ఉత్+చిత్తంబు+ఐ = గొప్ప మనసు కలవాడై
సుఖము + ఇచ్చున్ = సుఖమును కలిగించును.

ఇ) కింది పేరాను చదవండి. (5 × 2 = 10 మా.)

అజంతా గుహలలోని ఒక కొండ చివరి మిలికే వాఘోరా జన్మస్థానం. ఇది ఏడు కొలనుల నుండి పుట్టి, 250 అడుగుల ఎత్తునుంచి పెద్ద ధారగా దిగువకు దూకుతుంది. కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, చివరకు తపతి నదిలో కలుస్తుంది. ఒకప్పుడు రెండు కొండల మధ్య జలజల ప్రవహించేది. అప్పుడు నడవడానికి దారి ఉండేది కాదు. ఇప్పుడు కొండను త్రవ్వి, నదిగట్టున రోడ్డు వేశారు.

వర్షాలు విపరీతంగా కురిస్తే నదిలో నీళ్ళు మోకాళ్ళ దాకా వస్తాయి. వాఘోరానది పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుండగా, రెండవ వంపుపైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని ‘వ్యూ పాయింట్’ అంటారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలన్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది.

మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి, ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా, ఎదురుగా గుబురుచెట్ల సందునుంచి ఏదో – చెక్కడపు పని అతడి దృష్టిని ఆకర్షించిందట. సాహిసించి అతడు కొండ దిగి వాఘోరానదిని దాటి, తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా, తనకు అల్లంత దూరంలో చెట్లసందుగా కానవచ్చింది. అజంతా గుహలలో పదహారవదాని శిరోభాగమని తేలిందట. లోకం మరచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే “వ్యూపాయింట్”.

ప్రశ్నలు :

ప్రశ్న 7.
వాఘోరా జన్మస్థానం …………….
జవాబు:
అజంతా గుహలలోని ఒక కొండ చివరి మెలిక.

ప్రశ్న 8.
వాఘోరా కలిసే నది
జవాబు:
తపతీ నది

ప్రశ్న 9.
బ్రిటీష్ మిలటరీ ఆఫీసర్ .
జవాబు:
మేజర్ గిల్

TS 10th Class Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 10.
వ్యూపాయింట్ అని పిలిచేది
జవాబు:
అజంతా గుహలను మేజర్ గిల్ ఎక్కడ నుండి తొలిసారిగా చూశాడో దానినే వ్యూపాయింట్ అంటారు.

ప్రశ్న 11.
గద్యభాగంలో చర్చించిన గుహలు
జవాబు:
అజంతా గుహలు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (4 × 3 = 12 మా.)

అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 12.
దానశీలము పాఠ్యాంశ కవిని గురించి రాయండి.
జవాబు:

  • కవి : బమ్మెర పోతన
  • కాలము : క్రీ.శ. 15వ శతాబ్దం
  • తల్లిదండ్రులు : లక్కమాంబ, కేసన
  • బిరుదులు : సహజ పాండిత్యుడు
  • రచనలు : శ్రీమదాంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం, భోగినీదండకం, నారాయణశతకం
  • రచనల విశిష్టత : ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం ఘట్టాలలోని పద్యాలు నేటికీ తెలుగువారి నోట శాశ్వతంగా ఉన్నాయి.

ప్రశ్న 13.
“తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని దాశరథి ఎందుకన్నాడు ?
జవాబు:
తెలంగాణను పరిపాలించే రాజు దుర్మార్గ పాలనను, దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు పోరాటం చేశారు. ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో బాలల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ పాలుపంచుకున్నారు. తెలుగు జాతి అంతా ఏకమై ఐకమత్యంతో అపూర్వమైన చైతన్యంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి విజయం సాధించింది. గడ్డిపోచ అంటే బలహీనమైనదని అర్థం. అలా గడ్డిపోచలా బలహీనంగా కనబడేవారు కూడా తెలంగాణ విముక్తి కోసం కత్తులు చేపట్టారని దాశరథి అన్నారు.

ప్రశ్న 14.
ఊళ్ళో ఎంత పెద్ద మనుషుల పెండ్లికైనా మ్యాన పల్లకీలు రాకూడదని కట్టడి చేసుకోవడంపై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
డా. పి. యశోదరెడ్డి రచించిన కథ కొత్తబాటలో పల్లెలో వచ్చిన మార్పులను చక్కగా చెప్పారు.

ఒకప్పుడు పల్లెల్లో వెట్టి చాకిరీ ఉండేది. సమాజంలో ధనమున్నవారు బీదలను, అణగారిన వర్గాలను బానిసల్లా చూసేవారు. ధనవంతుల ఇళ్ళల్లో పనులకు, అగౌరమైన పనులు చేయడానికి అణగారిన వర్గాలను పురమాయించేవారు. ధనవంతుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు పల్లకీలను పెట్టి, మనుషుల్తో మోయించేవారు. సాటి మనుషులే, మరో మనిషిని మోయడం చాలా జుగుప్స కలిగించే విషయం.

కానీ ధనవంతులు ఇలా పల్లకీ మోయించుకోవడం తమ హోదాకు గుర్తుగా భావించేవారు. కాలంతోపాటు చాలా మార్పులు జరిగాయి. ఒక మనిషిని మరికొంతమంది మనుషులు మోసే అవమానకరమైన పద్ధతి పోయింది. సాటి మనిషిని గౌరవిస్తున్నారు. ఎంత ధనవంతుడి పెండ్లికైనా మనుషులు పల్లకీ మోయరాదనే కట్టుబాటు చేసుకున్నారు. ఇది స్వాగతించదగ్గ మార్పు.

ప్రశ్న 15.
భాగ్యరెడ్డివర్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
భాగ్యరెడ్డి వర్మ తన నాయకత్వ పటిమతో అణగారిన వర్గాలవారి వికాసం కోసం తన సమస్తాన్ని అర్పించాడు. స్వార్థం లేకుండా తమ కోసం పనిచేసే భాగ్యరెడ్డి వర్మను తిరుగులేని నాయకుడుగా అందరూ భావించేవారు. ఆయన చిత్తశుద్ధి, నిజాయితి, పట్టుదలతో మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేశాడు.

వ్యసనాలను మాన్పించాడు. వేశ్యా సంప్రదాయం లేకుండా చేయగలిగాడు. మనుషులంతా ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించాడు. అంకితభావంతో పనిచేసి అంటరానివర్గాలు అనుభవిస్తున్న అవస్థలను పోగొట్టడమే తన జీవితధ్యేయంగా పెట్టుకున్నాడు.

తాగుడువల్ల కలిగే కష్టనష్టాలు తెల్పి ప్రజలను మంచిమార్గంలో నడిపించడానికి కృషిచేశాడు. దళితుల ఉద్ధరణ కోసం చదువు అందరికీ అవసరమని ఉపన్యాసాల ద్వారా చైతన్యం కలిగించాడు. ఆది హిందూ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకై తన సర్వస్వం అర్పించాడు. ‘సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వ భావనను నెలకొల్పడానికి, మార్పు తీసుకురావడానికి తన జీవితాన్ని – ధారపోసిన మహనీయుడు, సామాజిక సేవకుడు, నిస్వార్థ నాయకుడు భాగ్యరెడ్డివర్మ.”

ఆ) క్రింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)

ప్రశ్న 16.
బలి చేసిన దానము, భువనము ఆశ్చర్యపోయేంత విశిష్టమైంది. విశ్లేషించి రాయండి.
జవాబు:
బలిచక్రవర్తి, శిబిచక్రవర్తి, కర్ణుడు, రంతిదేవుడు మొదలగు దాతలు ‘ఆడిన మాట తప్పకపోవడం’, దాన గుణం కలిగి ఉండడం వంటి మంచి గుణాల ద్వారా చరిత్రలో నిలిచిపోయారు.

ఇచ్చిన మాట కోసం తన గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినకుండా వామనుడికి మూడడుగుల నేలను దానం చేసిన గొప్ప దాత బలిచక్రవర్తి. ధనము, కీర్తి, కామం, జీవనాధారంలలో ఏది అడిగినా ఇస్తానని చెప్పినవాడు. ‘ధనం’ మీద దురాశతో వచ్చిన అతిథిని తిప్పి పంపనివాడు.

ఆడిన మాట తప్పినవాడిని భూదేవి మోయలేదని బ్రహ్మతో చెప్పిన విషయాన్ని గుర్తించినవాడు. దాతకు కావలసింది తగినంత ధనం, దానిని గ్రహించడానికి ఉత్తమమైన వ్యక్తి దొరకటం అదృష్టంగా భావించినవాడు బలిచక్రవర్తి.

పూర్వం ఎందరో రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలున్నాయి, వారు గర్వంతో విర్రవీగారు కానీ, వారు సిరిసంపదలను మూటగట్టుకపోలేదని, చివరికి వారి పేర్లు కూడా భూమిపైన మిగులలేదని, శిబిచక్రవర్తి వంటివారు ప్రీతితో ప్రజల కోర్కెలను తీర్చారని, వారిని ఈ కాలంలో కూడా మరచిపోలేదని గుర్తించినవాడు బలిచక్రవర్తి.

నరకం వచ్చినా, బంధనాలు ప్రాప్తించినా, రాజ్యం పోయినా, వంశం నశించినా, చివరకు మరణం సంభవించినా సరే, మాట తప్పని గుణం కలవాడు బలి చక్రవర్తి. తాను నశిస్తానని తెలిసికూడా ఆడిన మాట తప్పని మానధనుడు బలిచక్రవర్తి.

అందుకే బలిచేసిన దానము భువనము ఆశ్చర్యపోయేంత విశిష్టమైంది.

(లేదా)

వీరతెలంగాణ పాఠం ఆధారంగా తెలంగాణ వీరుల ఘనతను వర్ణించండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యులు రచించిన వీరతెలంగాణ పాఠం తెలంగాణ వీరుల ఘనతను చాటి చెబుతున్నది.

తెలంగాణ బిడ్డలు పౌరుషధనులు. నిరంకుశ నిజాం పాలనను ఎదిరించి, ముల్లోకాలు దర్శించే విధంగా వజ్ర సమానమైన భుజబలం చూపించినారు. ఇక్కడి గడ్డిపోచకూడా కత్తిపట్టి రణరంగంలో దూకింది. దిక్కులన్నీ ఒక్కటయ్యే రీతిగా యుద్ధం చేశారు. స్వాతంత్య్రకాంతులను ఈ నేలమీద ప్రసరింప జేయడానికి ఇక్కడి వీరులు సాహసంతో పోరాటం చేసినారు.

తెలుగుయోధులు పరోపకార గుణ సంపన్నులు. మతపిశాచి భయంకరమైన కోరలతో కరాళనృత్యం చేసినప్పుడు, నిర్దాక్షిణ్యంగా అమాయకులను బలిగొంటున్నప్పుడు కూడా సంయమనం వహించి, తెలుగుతనం ఉట్టిపడేటట్లుగా నిలబడి యుద్ధం చేసినారు. అది చూసి రుద్రులు (ప్రమథలు) సైతం ఆశ్చర్యపోయి ప్రశంసించినారు.

కాకతీయుల పౌరుషం చూసి శత్రువులు తత్తరపడ్డారు. రుద్రమదేవి వీరవిక్రమాన్ని తెలుగు జెండాలు రెపరెపలాడించినాయి. కాపయ్యనాయకుని విజృంభణం వైరి గుండెలను గుబగుబలాడించింది. పశ్చిమ చాళుక్యుల పాలనలో ఈ నేల పచ్చగా వెలిగిపోయింది. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణ శత్రువుల దొంగదాడికి ఓడిపోలేదు. శ్రావణమాసంలోని మేఘంలా గర్జిస్తూ, పౌరుషంతో ముందుకు సాగుతూనే ఉన్నది. ఈ నేలలోనే ఆ విక్రమదీప్తి ఉన్నది. అదే ఈనాడు స్వతంత్ర తెలంగాణను కూడా సాధించుకున్నది.

TS 10th Class Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 17.
ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను. “ఏ తెలుగు, ఎక్కడి తెలుగు” అని, ఈ మాటలను సామల సదాశివగారు అనడం వెనుక కారణాలు ఏమై ఉంటాయో విశ్లేషించండి.
జవాబు:
టీవీ చానెళ్ళలోని ఒక ప్రకటనకు సామల సదాశివగారి స్పందన అది. ఈ వ్యాసం ప్రకటింపబడే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నది. కాని మూడు ప్రాంతాలుగా (తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర) – ఆయా ప్రాంతాల్లోని భాషా సంస్కృతులూ వేర్వేరుగా పరిగణింపబడుతుండేవి. ఈ విషయం గుర్తుకు వచ్చి ఆ మాటలకు సదాశివగారు బాధతో ఆ మాట అని ఉంటారు.

సామల సదాశివగారి దృష్టిలో ప్రాంతాలు వేరైనా, భాషలోని యాసలు వేరైనా అన్ని ప్రాంతాల యాసలు, అందరి మాండలికాలూ అందమైనవే. అన్నిటినీ ఆదరించాలి, గౌరవించాలి. ప్రాంతీయ భాషలను సరిచేసుకోవాలి. సరిచేసుకోవాలంటే తొలగించడమో, దిద్దుకోవడమో కాదు, కలుపుకోవడం. ఒక భాష సమృద్ధిని అందులోని పదజాలం తెలుపుతుంది. మనం మాట్లాడేదే సరైంది. ఇతరులు మాట్లాడే భాష లోపభూయిష్టమైంది అనే సంకుచిత భావం నుంచి ముందు బయటపడాలి.

ఆదిలాబాద్లో మాట్లాడేదైనా, శ్రీకాకుళంలో మాట్లాడేదైనా, నల్లగొండదైనా, మహబూబ్నగర్ దైనా ఏ భాష సౌందర్యం దానిది. ఆయా ప్రాంతాల్లో మాట్లాడే ప్రత్యేకమైన పదజాలం, యాసలోని వైవిధ్యాన్ని గ్రహించి ప్రామాణికమనుకునే సాధారణ భాషలో కలుపుకోవాలి. అప్పుడు భాష సమృద్ధి కావడమే గాక ఇతర ప్రాంతాలపట్ల గల తేలికభావం తొలగిపోతుంది. ఇక ‘ఏ తెలుగు ?’ ‘ఎక్కడి తెలుగు’ అనే ప్రశ్నలకు తావే ఉండదు కదా ! సామల సదాశివగారు బాధపడటం వెనుక గల అసలు కారణాలు ఇవే.

(లేదా)

సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి. దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
సంపాదకీయాలంటే ఆయా వార్తల, సంఘటనల రూపాన్ని వివరిస్తూ, జరిగిన, జరగబోయే విషయాలను విశ్లేషించేది అని అర్థం. ఒక సంఘటన లేదా వార్త అకస్మాత్తుగా జరగదు. అవి జరగడానికి చాలా ముందే వాటి బీజం ఏర్పడి ఉంటుంది. ఉదాహరణకు సారాయి, గుడుంబా లేదా ఇతర మాదకద్రవ్యాల్లో కల్తీ జరిగి, అవి తాగినవారు ఆకస్మికంగా మరణిస్తే, ఆ సంఘటనలు ఎట్లా ఆరంభమై, ఏయే శాఖలు చూసీ చూడనట్లుగా, పట్టించుకోకుండా, ఉండటం వల్ల, ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయో, ఆ మహమ్మారి ఆటకట్టించడానికి ప్రభుత్వమూ, సమాజమూ ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ వివిధ పత్రికలు సంపాదకీయాలను ప్రచురిస్తాయి.

అలాగే సమకాలీన సమస్యలైన అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి వాటి మీద, మహిళల మీద, బడుగు, బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాలను, దాడులను నిరసిస్తూ సంపాదకీయాలు వస్తూ ఉంటాయి. అలాగే సమకాలీన రాజకీయాల్లో వచ్చే వార్తల మీద సంపాదకీయాలు వస్తూ ఉంటాయి.

ప్రపంచదేశాలు ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులపై సదస్సు నిర్వహించాయి. అయితే ప్రపంచ కాలుష్యంలో ఎక్కువ భాగానికి కారణం అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, ఇంగ్లండ్ దేశాలే. కానీ, తప్పంతా వర్ధమాన దేశాలదే అన్నట్లు ఆ సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు వ్యవహరించాయి. చాలా పత్రికలు అభివృద్ధి చెందిన దేశాల పెత్తందారీతనాన్ని విమర్శిస్తూ సంపాదకీయాలు ప్రచురించాయి.

ఇలా పత్రికల సంపాదకీయాలు తమ చురుకైన వ్యాఖ్యలతో సమకాలీన అంశాలను ప్రతిబింబించడంవల్లే ప్రభుత్వాలు, అధికారులు బుద్ధి దగ్గర పెట్టుకొని, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ప్రశ్న 18.
శివధనుర్భంగ ఘట్టాన్ని వివరించండి.
జవాబు:
మిథిలానగర ప్రవేశం : విశ్వామిత్ర రామలక్ష్మణులు అహల్యశాపవిముక్తి తరువాత మిథిలానగరానికి చేరుకున్నారు. మిథిలానగర ప్రభువు జనకమహారాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు. మిథిలలో అహల్యా గౌతమమహర్షిల కుమారుడు శతానందుడు రాముని దర్శించుకున్నాడు. తనతల్లికి శాపవిమోచనం కలిగించినందుకు రామునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

శివధనుర్భంగం : జనకుడు మరునాడుదయం విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో ‘వీరు దశరథుని పుత్రులు, నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది’ అని అన్నాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం పొలం దున్నుతుండగా నాగలిచాలులో తన కూతురు సీత దొరికిందని చెప్పాడు.

శివధనుస్సును ఎక్కుపెట్టినవాడికే సీతనిచ్చి పెళ్ళిచేస్తానని చెప్పాడు. ఎందరో రాజులు శివధనుస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నంచేశారు కాని కనీసం కదపలేకపోయారని చెప్పాడు. ఐదువేల మంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు వంగింది. రాముడు అల్లెతాడును చెవివరకు లాగేసరికి ధనుస్సు పెద్దశబ్దం చేస్తూ విరిగిపోయింది.

కల్యాణం : జనకుడు అన్నమాటప్రకారం సీతారాములవివాహం జరపడానికి సిద్ధమయ్యాడు. దశరథుడు జనకుని వర్తమానంతో సకుటుంబంగా వచ్చాడు. సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. వారితోపాటు ఊర్మిళను లక్ష్మణునకు, మాండవిని భరతునకు, శ్రుతకీర్తిని శత్రుఘ్నునకిచ్చి పెళ్ళిచేశారు. ఈ విధంగా శివధనుస్సు విరిగింది, సీతారామకళ్యాణం జరిగింది.

(లేదా)

“చెప్పుడు మాటలు చేటుకు కారణం” వివరించండి.
జవాబు:
మంథర దుర్భుద్ధి : రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యను అందంగా అలంకరిస్తున్నారు. మంథర అనే దాసి అది చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంది. ఆమె కైకేయి అరణపుదాసి. మంథర రాముని పట్టాభిషేకవార్తను కైకకు చెప్పింది. కైక ఆనందించింది, కాని మంథర కైక మనసు మార్చివేసింది. రాముడు రాజైతే భరతుడు సేవకుడవుతాడని, నువ్వు దాసివవుతావని అంది. మంథర చెప్పుడు మాటలు విని కైక మనసు మారింది. మంథరను ఉపాయం చెప్పమంది. మంథర గతంలో దశరథుడిచ్చిన రెండు వరాలను ఉపయోగించుకోమని కైకేయికి చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు రాగానే రెండు వరాలు కోరింది. అవి

  1. రాముని 14 సంవత్సరాల వనవాసం
  2. భరతునికి పట్టాభిషేకం.

దశరథుని (ఆక్రందన) విలాపం రాముని అడవులకు పంపవద్దని దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక మారలేదు. రాముని పిలిచి వనవాస విషయం చెప్పింది. ‘తండ్రి మాటను తీరుస్తాను, అడవులకు వెళ్తాను’ అని రాముడు అన్నాడు. కౌసల్య, లక్ష్మణుడు రాముని అడవులకు వెళ్ళవద్దని బతిమాలారు. కాని రాముడు వినలేదు. తండ్రిమాటనే గౌరవిస్తానన్నాడు. కౌసల్య రామునితో తానూ వస్తానంది.

రాముడు భర్తను వదలి రావడం ధర్మం కాదని అన్నాడు. సీత పతిని అనుసరించడమే సతికి ధర్మం అంటూ రామునివెంట అడవులకు బయలుదేరింది. లక్ష్మణుడు కూడా అడవులకు బయలుదేరారు. సీతారామలక్ష్మణులు దశరథుని దగ్గరకు వెళ్ళారు. కైకేయి ఇచ్చిన నారచీరలను ధరించి అడవులకు బయలుదేరారు. ఇలా మంథర చెప్పుడు మాటలవలన కైక బుద్ధి చెడింది. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి లోకానికి తెలిసింది.

ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)

ప్రశ్న 19.
“స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ, వారిని గౌరవించాలని తెలుపుతూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
సోదర సోదరీమణులారా !
స్త్రీలు మనిషి పుట్టుకకు మూలం. స్త్రీ పురుషుడు ఇద్దరూ సమాజ నిర్మాణంలో ముఖ్యులు. తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబంలో స్త్రీ పోషించే పాత్ర, నిస్వార్థంగా మమతానుబంధాలతో చేసే సేవ అమూల్యం. స్త్రీలే పురుషుడికి స్ఫూర్తి ప్రదాతలు.

ప్రాచీనకాలం నుంచి విజ్ఞానరంగంలో స్త్రీలు పురుషుడితో పోటీపడుతూనే ఉన్నారు. నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. చదువులో పురుషుడి కంటే ముందుంటున్నారు. ఇట్లా సమాజంలో క్రియాశీలమైన స్త్రీలపై పశుబలంతో, కామవాంఛతో అత్యాచారాలు జరగడం సిగ్గుచేటు. స్త్రీని గౌరవించే మంచి సంప్రదాయం ఉన్న మన దేశానికి అవమానకరం.

క్షణికమైన ఆవేశంతో స్త్రీలపై అత్యాచారాలు చేయడం వల్ల మన జాతి నిర్మాతలైన సోదరీమణుల ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. విలువైన ప్రాణాలు పోతున్నాయి. జాతి పరువు మంట గలుస్తున్నది. కనుక – స్త్రీలను గౌరవించాలి. వారి ఆత్మగౌరవానికి ఆటంకాలు కలిగించకూడదు. వారి స్వేచ్ఛను హరించకూడదు. వారి హక్కులను కాపాడాలి.

తేది: XX.XX.XXXX
కాపీలు : 500

ఇట్లు,
జాగృతి మహిళా సంఘం, నిజామాబాద్

(లేదా)

మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా రాయండి
జవాబు:
ఒక రోజు నేను బడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఒక అబ్బాయి కనిపించాడు. అతడికి సుమారు నా వయసే ఉంటుంది. అతనికి ఎవరూ లేరు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. తల వెంట్రుకలు మాసిపోయి, మాసిన దుస్తులతో చాలా అపరిశుభ్రంగా ఉన్నాడు. అతని భుజంపై ఓ సంచి ఉంది. అతడు చెత్త ఏరుకుంటున్నాడు. అది చూసిన నాకు చాలా బాధ కలిగింది. ఇతన్ని ఎలాగైనా బడిలో చేర్పించాలని నిర్ణయించుకున్నాను.
నేను : ఓ అబ్బి ! నీ పేరేంటి ?
అతడు : చెంచయ్య ! అని పిలుస్తారు.
నేను : నువ్వుండేదెక్కడ ?
అతడు : నాకు ఇల్లు లేదు. పగలంతా ఈ చెత్త ఏరుకుంటా, రాత్రిపూట ఇగో ఈ ఫుట్పాత్మద పండుంటా.
నేను : ఈ చెత్తనేం చేస్తావు ?
అతడు : గాసావుకారుకమ్ముతా. అతనిచ్చిన పైసల్తోటి దొరికింది తింటాను.
నేను : చక్కంగా బడికొచ్చి చదువుకోరాదూ !
అతడు : నన్నెవరు సదివిత్తారక్కా ? బువ్వెవరు పెడతారు ?
నేను : ప్రభుత్వ పాఠశాలలో చేరితే పుస్తకాలు, బట్టలూ వాళ్ళే యిస్తారు. చదువు చెబుతారు, మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు.
అతడు : నిజంగానా అక్కా ! మరి పండడానికో ?
నేను : నిజమే, పండడానికి కూడా హాస్టలు ఉంటుంది.
అతడు : అయితే నేనూ నీలాగా చదువుకుంటానక్కా! కాని నన్నెవరు బడిలో చేరుస్తారు ?
నేను : నాతో మా ఇంటికి రా ! మా నాన్నతో చెప్పి అన్నీ ఏర్పాటు చేయిస్తాను.
అతడు : నువెంత మంచిదానివక్కా! పద నీతోవస్తాను.
అలా అతడిని నాతో తీసుకెళ్ళి నాన్నగారితో చెప్పి బడిలో చేరిపించాను. నాకెంత సంతోషంగా ఉందో ! ఇలాగే అందరూ ఎవరికి చేతనైనది వారు చేస్తే మన దేశంలో బాలలందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది.

పార్ట్ – B

సమయం : 30 ని.లు
మార్కులు : 20

సూచనలు :

  1. విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
  2. పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.

I. భాషాంశాలు

అ) పదజాలం :

కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2 మా.)

ప్రశ్న 1.
యశఃకాములు : ……………………….
జవాబు:
యశఃకాములు : యశఃకాములు ఎంత కష్టమైన పనినైనా ఓర్పుతో చేస్తారు.

ప్రశ్న 2.
తత్తరపాటు : ……………….
జవాబు:
తత్తరపాటు : తత్తరపాటు పడకుండా పరీక్ష పత్రాన్ని నిదానంగా చదవాలి.

TS 10th Class Telugu Model Paper Set 2 with Solutions

కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
పాపాత్ములకు నిర్ణయం తప్పదు. (గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి)
A) శిక్ష
B) నరకం
C) మరణం
D) జైలు
జవాబు:
B) నరకం

ప్రశ్న 4.
‘మగ్దూరు’ అనే మాటకు అర్థం (గీత గీసిన పదానికి గుర్తించండి)
A) సహకారం
B) పంచాయితీ
C) అభివృద్ధి
D) నియమం
జవాబు:
D) నియమం

ప్రశ్న 5.
అవని మన భరతావని ధరిణియై అందరిని మోస్తూ వసుంధరగా ఓర్పు వహించింది. (గీత గీసిన పదాలకు పర్యాయపదం గుర్తించండి)
A) ధర
B) వర
C) చెర
D) సొర
జవాబు:
A) ధర

ప్రశ్న 6.
తెలంగాణ మాండలికం మకరంద మాధుర్యమే. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ?
A) మరందము, మామిడి
B) మధువు, మకరం
C) తేనె, మధువు
D) మరందకము, మృదువు
జవాబు:
C) తేనె, మధువు

ప్రశ్న 7.
వనం అనే పదానికి నానార్థాలు
A) జలం, సముద్రం, ఆకాశం
B) నది, తోట, ఓడ
C) అడవి, ఆకాశం, భూమి
D) తోట, అడవి, మృదువు
జవాబు:
B) నది, తోట, ఓడ

ప్రశ్న 8.
సమయం, నలుపు అనే నానార్థాలు కల్గిన పదం
A) ఆకాశం
B) వరుస
C) కాలుడు
D) కాలం
జవాబు:
D) కాలం

ప్రశ్న 9.
సిరి తనంతట తానే వస్తుంది. శ్రీ ని తక్కువ భావంతో చూడకూడదు. ఈ వాక్యంలోని ప్రకృతులు, వికృతులు ?
A) సరి, శీరి
B) శ్రీ, సిరి
C) శిరి, సీరి
D) సారె, శీరి
జవాబు:
B) శ్రీ, సిరి

ప్రశ్న 10.
‘సంతోషింపచేయువాడు’ అనే పదానికి వ్యుత్పత్తి
A) సూర్యుడు
B) చంద్రుడు
C) ఇంద్రుడు
D) గురువు
జవాబు:
B) చంద్రుడు

ఆ) వ్యాకరణాంశాలు :

కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)

ప్రశ్న 11.
వజ్రపుగనులు – విడదీసి రాస్తే
A) వజ్రము + గని
B) వజ్ర + గని
C) వజ్రము + గనులు
D) వజ్రపు + గని
జవాబు:
C) వజ్రము + గనులు

ప్రశ్న 12.
యడాగమ సంధికి ఉదాహరణ
A) ఉన్నయూరు
B) కమలాక్ష
C) దేశౌన్నత్యం
D) సూర్యోదయం
జవాబు:
A) ఉన్నయూరు

ప్రశ్న 13.
వీరులకు విశిష్టమైన స్థానం ఉంది – ఈ విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందినది ?
A) ద్వంద్వ సమాసం
B) ద్విగు సమాసం
C) బహువ్రీహి సమానం
D) విశేషణపూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
D) విశేషణపూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 14.
‘ముక్కంటి’ ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) బహువ్రీహి సమాసం
D) రూపక సమాసం
జవాబు:
C) బహువ్రీహి సమాసం

ప్రశ్న 15.
నజభజజజర అనే గణాలు వరుసగా వచ్చే పద్యము.
A) ఉత్పలమాల
B) కందం
C) చెంపకమాల
D) ఆటవెలది
జవాబు:
C) చెంపకమాల

ప్రశ్న 16.
నెట్టుకొని కాయ బీతెండ పట్టపగలు – ఈ పద్యపాదం ఏ ఛందస్సుకు చెందినది ?
A) తేటగీతి
B) సీసం
C) శార్దూలం
D) ఆటవెలది
జవాబు:
A) తేటగీతి

ప్రశ్న 17.
హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా ! – ఇందులోని అలంకారం
A) ఛేకానుప్రాస
B) అంత్యానుప్రాస
C) అర్థాంతరన్యాసం
D) అతిశయోక్తి
జవాబు:
C) అర్థాంతరన్యాసం

TS 10th Class Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 18.
ఛేకానుప్రాసాలంకారానికి ఉదాహరణ
A) నీకు వంద వందనాలు
B) ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది
C) కన్నీరు కార్చింది
D) మతపిశాచిని దునుమాడాలి
జవాబు:
A) నీకు వంద వందనాలు

ప్రశ్న 19.
కర్తరి వాక్యానికి ఉదాహరణ
A) దయచేసి నే చెప్పేది వినండి
B) నాచే పుస్తకం చదువబడింది
C) సినారె గజల్స్ రాశాడు
D) ఇక్కడ ఆడకండి
జవాబు:
C) సినారె గజల్స్ రాశాడు

ప్రశ్న 20.
ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే అది
A) ఉపమాలంకారం
B) యమకాలంకారం
C) రూపకాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
C) రూపకాలంకారం

Leave a Comment