AP 10th Class Telugu Model Paper 2024 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers and AP 10th Class Telugu Board Model Paper 2024 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper 2024 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు : 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన: (32 మా)

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

యవన పుణ్యాంగనామణి వగుదుగాక
హైందవుల పూజ తల్లియట్లందరాదె?
నీదురూపము నాయందు లేద యైనఁ
గనని తల్లివిగా నిన్ను గారవింతు

ప్రశ్నలు :

అ) పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు:
పై పద్యంలోని మాటలు శివాజీ యవన స్త్రీతో అన్నాడు.

ఆ) శివాజీ యవన కాంతను ఏమని ప్రార్థిస్తున్నాడు ?
జవాబు:
“నువ్వు యవన జాతికి చెందిన పుణ్యస్త్రీవి అయినప్పటికీ మా హైందవుల పూజను స్వీకరించు తల్లీ!” అని ప్రార్థిస్తున్నాడు.

ఇ) శివాజీ యవనకాంతను ఎలా గౌరవిస్తున్నాడు ?
జవాబు:
శివాజీ యవనకాంతను కనని తల్లిగా గౌరవిస్తున్నాడు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యంలో శివాజీ తల్లీ అని సంబోధించినది ఎవరిని?

(లేదా)

వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!

ప్రశ్నలు :

ఉ) ఎప్పుడు పొలాన్ని దున్నరాదు ?
జవాబు:
వఱదలు వచ్చిన సందర్భంలో పొలాన్ని దున్నరాదు.

ఊ) ఏ సమయంలో బంధువుల వద్దకు వెళ్ళకూడదు ?
జవాబు:
కరవుకాటకాలు సంభవించిన సమయంలో బంధువుల వద్దకు వెళ్ళకూడదు.

ఋ) రహస్యాలను ఎవరికి చెప్పకూడదు ?
జవాబు:
ఇతరులకు రహస్యాలను చెప్పకూడదు.

ౠ) సుమతీ శతకం ఎవరు రాశారు?
జవాబు:
సుమతీ శతకాన్ని ‘బద్దెన’ రాశాడు.

AP 10th Class Telugu Model Paper 2024 with Solutions

2) కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

అర్థములు నిత్యములు గావు. యౌవనము ఝరీవేగ తుల్యము. జీవనము బుద్బుదప్రాయము. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరము ధర్మము సమాచరింపవలెను. అట్లు సమాచరింపనివాడు పశ్చాత్తాపముఁ బొంది శోకాగ్ని సంతప్తుడగును. నీవతిసంచయము చేసితివి. దాని దోషమిది. కాబట్టి అతి సంచయేచ్ఛ తగదు. ఒరులకిచ్చి భుజించినదే తన సొత్తు. పరులకీక తాను గుడువక కూడబెట్టిన ద్రవ్యము చచ్చిన తఱి వెంట రాబోదు.

ప్రశ్నలు :

అ) అర్థములు ఎటువంటివి ?
జవాబు:
అర్థములు శాశ్వతమైనవి కాదు.

ఆ) జీవనము ఎటువంటిది ?
జవాబు:
జీవనము నీటిబుడగ వంటిది.

ఇ) బుద్ధిమంతుడేమి చెయ్యాలి ?
జవాబు:
బుద్ధిమంతుడు వేగంగా ధర్మాన్ని ఆచరించాలి.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఏది మాత్రమే తన సొత్తు అని చెప్పాడు ?

రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి.

3. అ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. (8 మా)
జవాబు:
సుందరకాండ

ఆ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబు:
బాలకాండ

ఇ) దండకారణ్యంలో మునులు ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామలక్ష్మణులు.
జవాబు:
అరణ్యకాండ

ఈ) ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
జవాబు:
కిష్కింధాకాండ

4. క్రింది వార్తను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

ప్రభాతవార్త (పుంగనూరు) : (25-06-2023)
పుంగనూరు సమీపంలోని “సదుం”ప్రాంతానికి చెందిన “ఇర్ల నారాయణ” అనే రైతు సాధించిన అద్భుత విజయాన్ని అధికారులు, ప్రజలు, అందరూ అభినందిస్తున్నారు. గత ఐదేళ్ళుగా తన ఎనిమిదెకరాల పొలంలో పత్తి, వరి, చెఱకు సాగు చేస్తూ దిగుబడి, ఆదాయం సరిగాలేక అప్పులపాలైన నారాయణ ప్రత్యామ్నాయ పంటల కోసం కొత్తగా ఆలోచించాడు. మార్కెట్లో ఎప్పుడూ ధర నిలకడగా ఉంటూ ఎక్కువ దిగుబడినిస్తున్న పి.కె. ఎం-2 మునగ సాగుపై దృష్టి సారించాడు. తక్కువ నీటి వినియోగంతో ఎకరాకు 40 వేల రూపాయల ఖర్చుతో సాగు చేసిన మునగ ఆరు నెలల్లో దిగుబడి నిచ్చింది. ఎకరాకు 50 నుండి 60 క్వింటాళ్ల దిగుబడి రావడంతో, ఖర్చులు పోగా ఎకరాకు రెండు లక్షల వంతున ఎనిమిదెకరాలకు 16 లక్షల రూపాయల ఆదాయం సాధించి నారాయణ అప్పుల బారి నుండి విముక్తుడయ్యాడు. ఒక సాధారణ రైతు సాధించిన ఈ విజయం రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

ప్రశ్నలు:

అ) ఈ వార్తలో పేర్కొన్న రైతు ఎవరు?
జవాబు:
ఈ వార్తలో పేర్కొన్న రైతు ‘ఇర్ల నారాయణ’

ఆ) రైతు ఏ పంటలు సాగుచేసి నష్టపోయాడు? ఎందుచేత?
జవాబు:
రైతు పత్తి, వరి, చెఱకు పంటలు సాగుచేసి నష్టపోయాడు.

ఇ) “మునగ” ద్వారా రైతు సాధించిన ఆదాయమెంత?
జవాబు:
మునగ ద్వారా రైతు 16 లక్షల ఆదాయం సాధించాడు.

ఈ) పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మునగ’ ఎన్ని నెలల్లో దిగుబడి నిచ్చింది ?

విభాగము – II
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత:

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

5. ‘మాణిక్యవీణ’ పాఠ్యభాగకవి ‘విద్వాన్ విశ్వం’ గురించి రాయండి.
జవాబు:
పరిచయం : ‘మాణిక్య వీణ’ కవి విద్వాన్ విశ్వం. సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖీన దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు జన్మించాడు.
కాలం : 1915 – 1987
రచనలు : మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలుగ్రంథాల్ని తెలుగులోకి అనువదించాడు. పత్రికా సంపాదకునిగా ‘అవి ఇవి’, ‘తెలుపు నలుపు’, ‘మాణిక్యవీణ’ వంటి శీర్షికలను భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు, ‘ప్రేమించాను’’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు.
బిరుదులు : డి.లిట్., కళాప్రపూర్ణ.
రచనా విధానం : చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితలు రచించాడు.

AP 10th Class Telugu Model Paper 2024 with Solutions

6. “గోరంత దీపాలు” పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:
సమాజంలో ఎవరూ పట్టించుకోని’ అనాథబాలలు ఎంతో మంది ఉన్నారు. తిండి, బట్ట, చదువు దేనికీ నోచుకోని అభాగ్యులు వీరు. వీరిని చేరదీసి చేయూతనిచ్చి ఆదరించి విద్యాబుద్ధులు చెప్పిస్తే మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తారు. సమాజానికి సేవచేసే గొప్ప మనసున్న వ్యక్తులు, తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే గోరంత దీపాలు పాఠం కథ.

రైలు ప్రయాణంలో తటస్థపడిన ఓ బాలుణ్ణి చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం, వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలు తెలియజెప్పడమే “గోరంత దీపాలు” పాఠం ఉద్దేశం.

7. “హనుమంతుడు” పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
హనుమంతుడు :

  1. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి, రాముని దూత.
  2. గొప్ప పరాక్రమవంతుడు. విచక్షణా జ్ఞానసంపన్నుడు.
  3. అసాధ్యమైన పనిని కూడా సాధించగల సమర్థుడు.
  4. లక్ష్మణుని ప్రాణాలను నిల్పిన ప్రాణదాత.
  5. నూరు యోజనాల సముద్రందాటి లంకలో సీతను దర్శించాడు.
  6. లంకను దహింపచేసి, రావణుని గుండెల్లో వణుకుపుట్టించినవాడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి.

8. “శివాజీ వ్యక్తిత్వాన్ని” విశ్లేషించి రాయండి.
(లేదా)
హనుమంతుడు “సముద్ర లంఘనం” ఎలా చేశాడో రాయండి.
జవాబు:
డా॥ గడియారం వేంకటశేషశాస్త్రి రచించిన ‘మాతృభావన’ పాఠంలో శివాజీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

భారతీయ సంస్కృతి – పరమత సహనం :
వ్యక్తిత్వం అంటే మాటలకూ, చేతలకూ తేడా లేనితనం. శివాజీకి హిందూమతం పట్ల, మనదేశ సంప్రదాయాల పట్ల గౌరవం ఎక్కువ. ఇతర మతాల వారినీ, వారి ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించేవాడు. పరమత సహనం కలవాడు. సైనికులకు ఆజ్ఞలను జారీ చేసి, వాటిని సక్రమంగా నిర్వహించేటట్లు చూసేవాడు. ఇతరులకు అపకారం తలపెట్టేవాడు కాదు. తోటివారిపట్ల ప్రేమాదరాలతో మెలిగేవాడు. తన సైనికులు గానీ, అధికారులు గానీ తప్పు చేస్తే సహించేవాడుకాదు.

పరస్త్రీ కూడా కన్నతల్లి లాంటిదే :
స్త్రీల విషయంలో శివాజీ ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. పరస్త్రీలను కన్నతల్లిగా భావించేవాడు. ఒకసారి సోన్దేవుడు పుణ్యస్త్రీని బీజాపురం నుండి బందీగా పట్టి తెచ్చినందుకు ఆయనపై కోపాన్ని ప్రదర్శించాడు. దానికి సోన్దేవుడు తన తప్పును క్షమించమని ప్రార్థించగా, మన్నించిన శాంతస్వభావుడు. స్త్రీల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. స్త్రీలు పుణ్యదేవతలనీ, వారిని అవమానించడం మన హిందూ సంప్రదాయం కాదని గట్టిగా చెప్పాడు.

స్త్రీలు భారతావని కల్పలతలు :
అనసూయ, సావిత్రి, సీత, సుమతి మొదలైనవారు పతివ్రతలనీ, భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన కల్పలతలని కొనియాడాడు. స్త్రీలను అవమానించినవారు వంశంతో సహా నాశనమయ్యారని వివరించాడు.

(లేదా)

అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానం వర్ణిస్తూ సముద్ర లంఘనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపడంకోసం సందర్భానికి తగిన పదాలను, అలంకారాలను ఎన్నుకోవడం కవి చేసిన చమత్కారం.

హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరాడు. తన శరీరాన్ని పెద్దదిగా పెంచాడు. అతడడుగులు వేసిన చోట పిడుగు పడ్డట్టు కొండరాళ్ళు పగిలిపోయాయి. చేతితో చరచినపుడు ఏనుగులు, సింహాలు బెదరి పారిపోయాయి. హనుమంతుడు చేసిన ఈ చేష్టల వర్ణన స్వభావోక్తి అలంకారంలో ఉంది.

కొండమీదినుండి హనుమంతుడు ఒక్క ఊపున పైకెగరగానే చూసే వాళ్ళందరికీ హనుమంతుడు కాక కొండే ఆకాశానికెగిరిందేమో అనిపించింది.

హనుమంతుడు ఎగురుతున్నప్పుడు వచ్చిన తీవ్రమైన గాలికి సముద్రం రెండు పాయలుగా చీలి పాతాళ లోకం తలుపులు తెరుచుకున్నట్లయింది. ఆ పాయ రాబోయే కాలంలో రాముడు కట్టబోయే సేతువుకు దారంతో కొలుస్తున్నట్లున్నది. రాముడి కోపం లంకవరకు పారడానికి తవ్విన కాలువలాగా ఉన్నది. భూమికి కొత్త వస్త్రమిచ్చి పాత నల్లని వస్త్రము చించినట్లున్నది. ఇవి ఉత్ప్రేక్షలు. ‘ రామభద్రకవి ఊహాశక్తి అద్భుతం.

9. “సీతారామ కల్యాణం” గురించి రాయండి.
(లేదా)
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
మిథిలానగర ప్రవేశం : విశ్వామిత్ర రామలక్ష్మణులు అహల్యాశాపవిముక్తి తరువాత మిథిలానగరానికి చేరుకున్నారు. మిథిలానగర ప్రభువు జనకమహారాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు.

శివధనుర్భంగం : జనకుడు మరునాడుదయం విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో ‘వీరు ‘దశరథుని పుత్రులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది’ అని అన్నాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం పొలం దున్నుతుండగా నాగలిచాలులో తన కూతురు సీత దొరికిందని చెప్పాడు. శివధనుస్సును ఎక్కుపెట్టినవాడికే సీతనిచ్చి పెళ్ళిచేస్తానని చెప్పాడు. ఎందరో రాజులు శివధనుస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నంచేశారు కాని కనీసం కదపలేకపోయారని చెప్పాడు. ఐదువేల మంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు వంగింది. రాముడు అల్లెతాడును చెవివరకు లాగేసరికి ధనుస్సు పెద్దశబ్దం చేస్తూ విరిగిపోయింది.

కల్యాణం : జనకుడు అన్నమాటప్రకారం సీతారాముల వివాహం జరపడానికి సిద్ధమయ్యాడు. దశరథుడు జనకుని వర్తమానంతో సకుటుంబంగా వచ్చాడు. సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది.

(లేదా)

సముద్రాన్ని దాటి లంకను చేరడం కోసం శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ప్రత్యక్షంకాలేదు. శ్రీరాముని కన్నులు ఎర్రబడ్డాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకొన్నాడు. సముద్రంలోని నీరంతా ఇంకిపోయేటట్లు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతి అంతా అల్లకల్లోలం అయింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. బాణం ప్రయోగించాలని భావించాడు శ్రీరాముడు. దానితో సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళానిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు చెప్పాడు. ఆ సేతువును తాను భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. మహారణ్యం నుండి చెట్లను, బండరాళ్ళను మోసుకువస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని, నీరు ఆకాశానికి ఎగిరిపడుతోంది. నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతునిర్మాణం జరుగుతోంది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పుగల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి చేశారు.

AP 10th Class Telugu Model Paper 2024 with Solutions

10. స్త్రీలపై దాడులను, వివక్షతను ఖండిస్తూ “కరపత్రం” రూపొందించండి.
(లేదా)
కోపం వలన కలిగే అనర్థాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
మహిళల్లారా! లేవండి! ధైర్యంగా జీవించండి

మహాజనులారా !
దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించిందని ప్రతి దినం మనం అనుకునే మాటల్లో ఒకటి. అభివృద్ధి అంటే కేవలం సాంకేతికంగానే కాదు. విలువలతో కూడిన అభివృద్ధి కావాలి. దేశ జనాభాలో సగం మంది స్త్రీలున్నారు. సమాజాభివృద్ధిలో స్త్రీలది కీలకమైన పాత్ర. ఎంత చదువుకున్నా నేటికీ స్త్రీలు ఇంటా బయటా కూడా వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు.

దేశరాజధాని నడిరోడ్డులో నిర్భయపై జరిగిన అత్యాచారంగానీ, నిన్నగాక మొన్న ముంబయిలో అనూహ్యపైన జరిగిన అత్యాచారంగానీ చూస్తుంటే ప్రపంచం ముందు భారతదేశం సిగ్గుతో తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇటువంటి సంఘటనలు చూసి స్త్రీ సమాజం భయపడాల్సిన అవసరం లేదు. నేడు స్త్రీలు ఉన్నత విద్యను చదువుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నారు. రాజకీయంగా ఎదిగారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, హెూంమినిష్టర్లు, కలెక్టర్లు, డాక్టర్లు – ఇలా ఎన్నోరంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. మహిళల్లో చైతన్యం రావాలి. చట్టాలు తీసుకురావాలి. వాటిని గట్టిగా. అమలుపరచాలి. చట్టాలు చేయడంలో స్త్రీల భాగస్వామ్యం ఉండాలి. ఎందరో స్త్రీలు లాయర్లుగా, న్యాయమూర్తులుగా కూడా ఉన్నారు. ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. వీరంతా కూడా సంఘాలుగా ఏర్పడి మహిళాలోకానికి ధైర్యం చెప్పాలి. పురుషులు కూడా మహిళలకు ధైర్యాన్ని కలుగజేయాలి. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలిగానీ, అధైర్యపడి ఎదుటివాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు.

మహిళల్లారా! లేవండి! ధైర్యంతో ముందడుగు వేయండి

ముద్రణ : ఎస్.ఆర్. ప్రింటర్స్, ఒంగోలు.
ప్రతులు : 500

ఇట్ల
ఆంధ్ర మహిళా సమాఖ్య
ఒంగోలు

(లేదా)

రాజమండ్రి,
తేది. xx.xx.xxxx.

ప్రియమిత్రుడు వంశీకి,
మిత్రమా!
ఎలా ఉన్నావు ? ఇక్కడ మేమంతా బాగున్నాము. రాబోయే పదవతరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నేను బాగానే చదువుతున్నాను. ఈ మధ్యే తెలుగు పాఠ్య పుస్తకంలోని ‘భిక్ష’ పాఠం చదివాను. అందులో వ్యాసమహర్షి కోపం పట్టలేక కాశీ నగరప్రజలను శపించబోవు సందర్భం చదివాను. కోపం ఎంతటి అపకారం చేస్తుందో కదా! అనిపించింది. కోపం వివేకాన్ని, విచక్షణని పోగొట్టి మనిషికి ఆవేశం కలిగిస్తుంది. ఆ ఆవేశంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు. తరువాత ఆలోచించి తొందరపడ్డామని, అలా చేయకుండా ఉండాల్సిందనీ అనుకుంటారు. పశ్చాత్తాపపడతారు. ఎవరైనా కోపం రాగానే పది అంకెలు లెక్కపెట్టో ఒక గ్లాసు మంచినీళ్ళుత్రిగో ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటో తెలియజెయ్యి చిన్నలందరినీ అడిగానని, పెద్దలందరికీ నమస్కారాలనీ చెప్పు. నీ జవాబు కోసం ఎదురుచూస్తుంటాను.

ಇట్లు,
నీ ప్రియమిత్రుడు
రాజేష్.
10వ తరగతి,
కందుకూరి వీరేశలింగం
ఉన్నత పాఠశాల,
కోటగుమ్మం, రాజమండ్రి.

చిరునామా:
ఎ. వంశీ
ఇంటి నెం. 12-4-7,
చిన్నంవారి వీధి,
ఫత్తేబాద్, ఏలూరు.

విభాగము – IIII
III. భాషాంశాలు : (పదజాలం వ్యాకరణాంశాలు) (32 మా)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

11. నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము. – (పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.) (2 మా)
జవాబు:
పై వాక్యంలో ‘క్ష’ అనే అక్షరం పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస అలంకారము.

12. మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వానా
(గురులఘువులు గుర్తించి గణవిభజన చేసి, పద్యం పేరు రాయండి.)
జవాబు:
AP 10th Class Telugu Model Paper 2024 with Solutions 1
‘న జ భ జ జ జ ర’ అనే గణాలు వరుస వచ్చింది కాబట్టి ఇది ‘చంపకమాల’ పద్యం.

13. అ) అపరిశుభ్రత వలన రుగ్మతలు వస్తాయి. గీతగీసిన పదానికి అర్థం రాయండి.
జవాబు:
రోగాలు

ఆ) రచయితకు కపోతములను పెంచుకోవడమంటే చాలా ఇష్టం.
(గీతగీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.)
అ) ఏనుగు
ఆ) పిల్లి
ఇ) పావురం
ఈ) కుక్క
జవాబు:
ఇ) పావురం

AP 10th Class Telugu Model Paper 2024 with Solutions

14. అ) శిరీష కుసుమం మెత్తగా ఉంటుంది. (గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.)
జవాబు:
పువ్వు, పుష్పం

ఆ) తమం అంతటా అలుముకుంది. (గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి.)
అ) మబ్బు, మేఘం
ఆ) చీకటి, అంధకారం
ఇ) రంగు, వర్ణం
ఈ) భయం, భీతి
జవాబు:
ఆ) చీకటి, అంధకారం

15. అ) జాతరకు ఇసుకవేస్తే రాలనంతగా జనం వచ్చారు.
(గీతగీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి) (1 మా)
జవాబు:
యాత్ర

ఆ) విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. (గీతగీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) (1 మా)
అ) విన్నపం
ఆ) వినతి
ఇ) వినయం
ఈ) విన్నాణము
జవాబు:
ఈ) విన్నాణము

16. అ) వీడువీడ్లు వాడో కదా! (గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి.) (1 మా)
జవాబు:
ఇతడు, పట్టణము

ఆ) సీతాఫలం తినటం వలన ఎన్నో ఫలములు ఉన్నాయి. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.)
అ) పండు, ప్రయోజనం
ఆ) పండు, నష్టం
ఇ) కాయ, పిందె
ఈ) పూత, పిందె
జవాబు:
అ) పండు, ప్రయోజనం

17. అ) పార్వతి శివుని అర్ధాంగి. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.) (1 మా)
జవాబు:
అ) హిమవంతుడనే పర్వతరాజు కూతురు (పార్వతి)

ఆ) హిరణ్యకుడు ఒక మూషికం. (గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థం రాయండి.)
అ) అన్నాదులను దొంగిలించేది (ఎలుక)
ఆ) పాలను దొంగతనంగా తాగేది (పిల్లి)
ఇ) బట్టలను కొట్టివేసేది (చిమట)
ఈ) పురుగులను తినేది (బల్లి)
జవాబు:
అ) అన్నాదులను దొంగిలించేది (ఎలుక)

18. గురువుల ఆదేశాలను సుగ్రీవాజ్ఞగా భావించాలి. (వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.) (2 మా)
జవాబు:
సుగ్రీవాజ్ఞ

19. “కాలధర్మం చెందడం” ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
మరణించడం’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1 = 14 మా)

20. పల్లెటూరు ప్రకృతి అందాలకు నిలయం. (గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.)
జవాబు:
పల్లె + ఊరు

21. భక్త + ఆలు (సంధి పదాలను కలిపి రాయండి.)
జవాబు:
భక్తురాలు

22. జీవనోపాధికై పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారు. (1 మా)
(గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.)
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణసంధి
ఇ) విసర్గసంధి
ఈ) వృద్ధి సంధి
జవాబు:
ఆ) గుణసంధి

23. మానవ చరిత్ర ఎన్నో పరిణామాలకు నిలయం. (గీతగీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.)
జవాబు:
మానవుల యొక్క చరిత్ర

24. చిత్రగ్రీవం పెంపకంలో రెండుదృశ్యాలు అతి మనోహరమైనవి. (1 మా)
(గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
అ) ద్వంద్వ సమాసం
ఆ) అవ్యయీభావ సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఇ) ద్విగు సమాసం

25. ఏ నే పాపాత్ముని ముఖంబునీక్షించితినో ? (ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (1 మా)
అ) ఏను ఏ పాపాత్ముడి ముఖం ఈక్షించానో ?
ఆ) నేను ఏ పాపాత్ముడి ముఖం వీక్షించెదనో ?
ఇ) నేను ఏ పాపాత్ముని ముఖంబును ఈక్షించెదనో ?
ఈ) నేను ఏ పాపాత్ముడి మొహాన్ని చూశానో ?
జవాబు:
ఈ) నేను ఏ పాపాత్ముడి మొహాన్ని చూశానో ?

26. పార్వతీదేవి వ్యాసుణ్ణి మందలించింది. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.) (1 మా)
జవాబు:
పార్వతీదేవి వ్యాసుణ్ణి మందలించలేదు

27. కింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి. (1 మా)
అ) చూసి
ఆ) చూస్తే
ఇ) చూడక
ఈ) చూస్తూ
జవాబు:
ఇ) చూడక

AP 10th Class Telugu Model Paper 2024 with Solutions

28. వర్షాలు కురిసినా పంటలు పండలేదు. (ఇది ఏ రకమైన సంక్లిష్టవాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
అప్యర్థక వాక్యం

29. వృద్ధుడు విద్యాలయాన్ని నెలకొల్పాడు. (సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) ( ) (1 మా)
అ) విద్యాలయంచే వృద్ధుడు నెలకొల్పాడు
ఆ) విద్యాలయం వృద్ధునిచే నెలకొల్పబడింది
ఇ) విద్యాలయంచే వృద్ధుడిని నెలకొల్పారు
ఈ) వృద్ధుడు విద్యాలయంలో నెలకొల్పబడ్డాడు
జవాబు:
ఆ) విద్యాలయం వృద్ధునిచే నెలకొల్పబడింది

30. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం

31. ఆహా! ఈ బొమ్మ ఎంత బాగుందో! (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) ఆశీరర్థకం
ఆ) నిశ్చయార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఈ) ఆశ్చర్యార్థకం వాక్యం.

32. మీరు మాతో రావద్దు. (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
నిషేధార్థక వాక్యం.

33. ‘నేను తప్పక వస్తాను. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) ఆశ్చర్యార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఇ) నిశ్చయార్థక వాక్యం.

Leave a Comment