Reviewing TS 10th Class Telugu Model Papers Set 7 can help students identify areas where they need improvement.
TS SSC Telugu Model Paper Set 7 with Solutions
‘సమయం: 3 గం.
మార్కులు : 80
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1, 2 వాక్యాలలో రాయండి.
అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దయిన జటాయువుని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.
రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు. దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరి పరి విధాల దూషించింది. ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానరముఖ్యులను సీత చూసింది. ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశ.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
జటాయువు రావణుణ్ణి ఎందుకు ఎదిరించాడు ?
జవాబు:
సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు. అందువల్ల జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
ప్రశ్న 2.
జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు ఎప్పుడు వినబడినాయి ?
జవాబు:
అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి.
ప్రశ్న 3.
సీతాదేవి ఎందుకు ఆక్రందించింది ?
జవాబు:
రక్తంతో తడిసి ముద్దయిన జటాయువుని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.
ప్రశ్న 4.
సీత తన ఆభరణాలను మూటగట్టి వదలడానికి కారణమేమిటి ?
జవాబు:
శ్రీరాముడు తనను వెదకుతూ వస్తే, వానరులు తన గురించి రామునికి తెలియచేస్తారనే ఆశతో ఆభరణాలను మూటగట్టి వదిలింది సీత.
ప్రశ్న 5.
సీతకు ఎవరు కనబడ్డారు ?
జవాబు:
ఐదుగురు వానరముఖ్యులు.
ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి.
ప్రశ్న 6.
తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు ! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా !
జవాబు:
ప్రతిపదార్థం :
తెలంగాణా! = అమ్మా తెలంగాణా !
భవదీయ = నీ యొక్క
పుత్రకులలో = పిల్లలలో
తీండ్రించు = రగిలే
వైష్ణవ్యసంచలనమ్ము = విప్లవ చైతన్యము
ఊరక పోవలేదు = వృథా కాలేదు
వసుధా చక్రమ్ము = భూమండలాన్నంతటినీ
సారించి = సవరించి
ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన
వైభాతిక = కాంతిమంతమైన
భానునిన్ = సూర్యుణ్ణి
పిలిచి = ఆహ్వానించి
దేశంబు+అంతటన్ = దేశమంతా
కాంతివార్డులు = కాంతి సముద్రాలు
నిండించిరి = నింపారు
వీరు = వీరు
వీరులు = వీరులు
పర + అర్థుల్ = పరోపకారులు
తెల్గుజోదుల్ = తెలుగు యోధులు
బళా! = సుమా !
(లేదా)
వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము.
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మనిపిల్చె హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్
జవాబు:
వేద = శ్రుతుల యందలి (నాలుగు వేదముల యందలి)
పురాణ = పురాణముల యందలి (పదునెనిమిది పురాణముల యందలి)
శాస్త్ర = నియమన గ్రంథముల యందలి (అణు శాస్త్రముల యందలి)
పదవీన్ = అధికర (స్థాన)ము చేత
అదవీయసి+ఐన = మిక్కిలి దగ్గరైనదైన
పెద్దముత్త+ఐదువ = మిక్కిలి ముదుసలియైన పుణ్యస్త్రీ
కాశికావగర = కాశీ పట్టణమనెడి
హాటక = ‘సువర్ణమయమైన
పీఠ = ఆసనము యొక్క
శిఖా = శిఖరము (చివరి భాగము) ను అత్యున్నత స్థానమును
అధిరూఢ = అధిరోహించిన (ఎక్కిన)దైన
ఆ+ఆదిమశక్తి = (విశ్వమునకు) మొదటి శక్తి అయిన ఆ పార్వతీదేవి
హస్త = చేతితోడి
సంజ్ఞా = సైగతో
ఆదర = గౌరవముతో (నిండిన) కూడిన
లీలన్ = ఆకారముతో, విలాసముతో
రత్న = మణులచే
ఖచిత = పొదుగబడిన
ఆభరణంబులు = అలంకారములు, నగలు
ఘల్లుఘల్లు+అనన్ = గల్లు గల్లుమని మ్రోయుచుండగా
సంయమివరా = = ఓ మునిశ్రేష్ఠుడా ! (ఓ వ్యాస మునీ !)
ఇటు = ఇటు వైపు
రమ్ము + అని = రావలయునని
పిల్చెన్ = పిలిచినది (ఆహ్వానించినది)
ఇ) కింది పేరాను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)
50వ దశకపు రెండవభాగం నుంచీ డెబ్భైయవ దశాబ్దం వరకూ రచయిత్రులు ఒక వెల్లువలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. పాకాల యశోదరెడ్డి, భండారు అచ్చమాంబ, ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లత, శ్రీదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యద్దనపూడి సులోచనారాణి, ఆనందారామం, మొదలైన రచయిత్రుల పేర్లు ఇంటింటా వినిపించే పేర్లయ్యాయి.
రచయిత్రుల నవలలతో నవలా సాహిత్యానికి తెలుగులో విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1980వ దశకం తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా చెప్పవచ్చు. నవలా సాహిత్యంలో అరవయ్యవ దశాబ్దంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రలు 80వ దశాబ్దంలో కవిత్వంలో, కథలలో తమ ముద్ర వేశారు. అంతవరకు కవిత్వం తనదనుకునే పురుషులు భ్రమలను బద్దలు కొట్టారు. కవిత్వం రాయడమేకాదు. అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలుకోణాలను తమ కవితావస్తువుగా స్వీకరించారు.
ప్రశ్నలు :
ప్రశ్న 7.
తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఏ కాలంలో వెల్లువలా వచ్చారు ?
జవాబు:
50వ దశాబ్దపు రెండవభాగం నుంచీ డెబ్భైయవ దశాబ్దం వరకూ తెలుగు సాహిత్యంలో రచయిత్రలు వెల్లువలా వచ్చారు.
ప్రశ్న 8.
80వ దశకం స్త్రీల దశాబ్దమని ఎలా చెప్పగలవు ?
జవాబు:
60వ దశాబ్దంలో నవలా సాహిత్యంలో తిరుగులేని స్థానం సంపాదించిన స్త్రీలు, 80వ శతాబ్దంలో కవిత్వంలోనూ, కథలలోనూ తమ ముద్ర వేసుకొని, కవిత్వం తమదని భావించే పురుషులు భ్రమలను బద్దలు కొట్టడమే కారణం.
ప్రశ్న 9.
స్త్రీవాద కవయిత్రులు సాధించిన, విజయాలు ఏమిటి ?.
జవాబు:
నవలా సాహిత్యంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రులు 80వ దశాబ్దంలో కవిత్వంలో, కథలలో తమ ముద్రవేశారు. కవిత్వం తమదనుకునే పురుషుల భ్రమలను బద్దలుకొట్టారు. స్త్రీవాద కవితా సంకలనాన్ని ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదాన్ని స్థిరపరిచారు.
ప్రశ్న 10.
స్త్రీవాద సాహిత్యంలో ఏ వస్తువులు ప్రాధాన్యం వహించాయి ?
జవాబు:
స్త్రీల అణచివేతలోని పలుకోణాలను, స్త్రీల శరీర రాజకీయాలనూ, కుటుంబ అణచివేతను తమ కవితా వస్తువుగా స్వీకరించి కొత్త పద్ధతిలో పరిచయం చేశారు.
ప్రశ్న 11.
పై పేరాకు అర్థవంతమైన శీర్షికను పెట్టండి.
జవాబు:
‘మహిళాభ్యుదయం’ (లేదా) ‘తెలుగు సాహిత్యంలో స్త్రీలపాత్ర’
II. వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 12.
గోలకొండ పట్టణం గురించి రాసిన ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి రాయండి.
జవాబు:
కవి : ఆదిరాజు వీరభద్రరావు
జన్మస్థలం : చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మంజిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డాడు.
రచనలు : చరిత్ర రచనాకళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయిచెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు.
జీవిత విశేషాలు : తన పాండిత్యం, పరిశోధనలతో ‘తెలంగాణ భీష్ముడి’గా పేరు తెచ్చుకున్నాడు.
ప్రశ్న 13.
నరసింహ శతకం రాసిన కాకుత్థ్సం శేషప్ప గురించి రాయండి.
జవాబు:
నరసింహ శతకం రాసిన కాకుత్థ్సం శేషప్ప కవి జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి. నరహరి, నృకేసరి శతకాలతోపాటు ధర్మపురి రామాయణమనే యక్షగానం రాశాడు. ఈతని రచనల్లో భక్తి తత్పరతతోబాటు తాత్విక చింతన, సామాజికస్పృహ కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహశతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు.
ప్రశ్న 14.
సభలు/సమావేశాలు/ ఆటల పోటీల వల్ల సమాజానికి ఒకగూడే ప్రయోజనాలేమిటి ?
జవాబు:
సభలు/సమావేశాలు/ ఆటల పోటీలు మనుష్యుల మధ్య అంతరం తగ్గించి, ఆత్మీయతను పెంచే ఉత్తమ సాధనాలు. ఒక లక్ష్యం కోసం, ఒక మంచి భావనను పెంపొందిచేందు కోసం, ఒక ఉత్సవం నిర్వహించుకునేందుకు లేదా ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు సభలూ సమావేశాలు నిర్వహిస్తారు. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం ప్రత్యక్ష (నేరుగా లభించే ప్రయోజనం. ఇది గాక మనుషుల మధ్య భేదభావాన్ని తొలగించి మనమంతా ఒక్కటేనన్న అనుభూతినిస్తుంది. మనిషి మనుగడకు ఇది చాలా ముఖ్యం. అకారణ వైరాలను, వైషమ్యాలను తగ్గిస్తాయి. గొప్పవాళ్ళతో పరిచయాలను పెంచుతాయి. మెరుగైన జీవనానికి బాటలువేస్తాయి. ఆటలపోటీల్లో కొంచెం వైరభావం (ఆడేటప్పుడు) పొడసూపినా పై ప్రయోజనాలన్నీ ఉంటాయి. శారీరకారోగ్యం, మానసికారోగ్యం పెంపొందటం అదనపు ప్రయోజనం.
ప్రశ్న 15.
“చెరువు – పల్లె అభివృద్ధికి దోహదకాకి” సమర్థిస్తూ రాయండి.
జవాబు:
సాధారణంగా నీటి వసతి ఉన్నచోట గ్రామాలు ఏర్పడతాయి. భూగర్భజలాలు పుష్కలంగా ఉంటే నీటి వసతికి లోటు ఉండదు. వ్యవసాయం, త్రాగునీటికి ప్రజలు ఇబ్బందిపడవలసిన అవసరం లేదు. చేపల పెంపకం ద్వారా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. వానాకాలంలో నీటికుంటలు, చెరువులు చూడటానికి నీళ్ళతో కళకళలాడుతూ ఉంటాయి. పశువులకి, జంతుజలానికి త్రాగునీటికి లోటుండదు. పశువుల మేత. సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి చెరువులు పల్లె. అభివృద్ధికి ఎంతో దోహదకారి అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)
ప్రశ్న 16.
నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
రసాయనశాలల్లో రకరకాల రసాయన ద్రవ్యాలు ఉంటాయి. అవి రకరకాల రంగుల్లో ఉంటాయి. అన్నీ ద్రవాలే అయినా వాటి ధర్మాలు అందరికీ అర్థం అయ్యేటట్లుగా ఉండవు. నగరజీవులు కూడా అందరూ మనుష్యులే అయినా అందరి జీవితాలు అర్థం చేసుకోగలిగేటంత సులువుగా ఉండవని కవి ఉద్దేశం.
పద్మవ్యూహం అంటే ప్రాచీన కాలంలో ఒక యుద్ధ వ్యూహం. పద్మవ్యూహంలో రకరకాలుగా సేనలను మోహరిస్తారు. అందులోకి వెళ్ళినవారు బయటకు రావటం కష్టం.
ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారు నిరాశ ఎదురైనా నగరం విడిచి వెళ్ళలేరు. ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు. ఆకర్షించే సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు ఒకవైపు, నిరుద్యోగం, జీవన వ్యయం మరోవైపు ఆశాజీవుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాలుష్యం, ట్రాఫిక్ జామ్ల వల్ల ఇబ్బందులెదురైనా విడిచివెళ్ళనీయదు నగరం. అందువల్లనే చిక్కు విడదీయలేని పద్మవ్యూమం లాంటిదిగా నగరాన్ని వర్ణించారు కవి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతాయని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పాఠ్యాంశాల్లో శతక పద్యాలను చేర్చడంలోని ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడమే. అవి తప్పకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఉదాహరణకు 10వ తరగతిలోని ‘శతకమధురిమ’ పాఠంలోని పద్యాలవల్ల ……………..
- ‘సత్యం, దయ, ఏకాగ్రతతో కూడిన పూజనే భగవంతుడు’ స్వీకరిస్తాడు’ అని చెప్పడం వల్ల – ఈ మూడు గుణాలతోనే విద్యార్థి ఉత్తమ ఫలితాలను, చక్కని గుర్తింపును పొందుతాడని గ్రహిస్తాము.
- ‘స్వశక్తిని నమ్ముకుని, నిరాడంబరంగా బతకాలి. నశ్వరమైన భోగభాగ్యాలకోసం రాజులను/పాలకులను యాచించరాదు అని తెలుసుకోవడం – స్వతంత్ర జీవనాన్ని ప్రోత్సహిస్తుంది.
- సంపదలు లేకున్నా గురుసేవ, దాతృత్వం, శ్రద్ధ, సత్యవాక్కు, సహృదయతల వల్ల మనిషి రాణిస్తాడు అనే అంశాలు తెలుసుకొని ఉత్తమ గుణాలనలవరచుకుంటారు.
- భక్తులను నిందించరాదు, దానాన్ని అడ్డుకోరాదు, మోసం చేయరాదు, దురాక్రమణలు చేయరాదు, ఇతరుల కష్టఫలాన్ని దోచుకోరాదు – వంటి విషయాలు గ్రహించడం ద్వారా చెడు లక్షణాలకు దూరంగా ఉంచుతుంది.
- త్యాగబుద్ధితో దీనులకు అండగా నిలిచి మేలు చేయాలని తెలుసుకోవడం వల్ల దేశభక్తిని, బాధ్యతను పెంచుతుంది.
- మిత్రుడు మంచిని బోధిస్తాడు, ధనం వలె సాయపడ్డాడు, ఖడ్గమై శత్రువులను సంహరిస్తాడని అవగాహన చేసుకోవడం. వల్ల మంచి మిత్రుడుగా తనను తాను మలచుకుంటాడు.
- అబద్ధం, మోసం, దోపిడి, దుర్మార్గం, లంచగొండితనం, వావి వరుసలు పాటించకపోవడం, కుతంత్రం, తల్లిదండ్రుల పట్ల నిర్దయ వంటివి రాక్షస లక్షణాలని తెలుసుకోవడం వల్ల విద్యార్థి తనలోని చెడును తొలగించుకొని ఉత్తముడుగా తనను తాను మలచుకుంటాడు.
ఈ విధంగా శతక పద్యాలలోని నీతులు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర వహిస్తాయి.
ప్రశ్న 17.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు ?
జవాబు:
తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ. మహమ్మదీయ, నిజాం వలస పాలకులతో 1969 నుండి ప్రారంభమైన స్వరాష్ట్ర పోరాటం 2014 సంవత్సరానికి గాని విజయం సాధించలేదు. ఈ విజయం తేలికగా రాలేదు. మూడు తరాలుగా పోరాటమే జీవితం అన్నట్లు బ్రతికిన బ్రతుకులు వారివి. వారి పోరాట పటిమకు అందిన పురస్కారం రాష్ట్రం ఏర్పాటు.. జూన్ 2, 2014న బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైన దినం. ఇలాంటి అదృష్టం చరిత్రలో ఒక్కసారే వస్తుంది. భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించటం భారత జాతి చరిత్రలో నిజంగా ఒక అద్భుతమైన ఘట్టమే.
(లేదా)
‘చార్మినార్’ కథలను ఎందుకు చదవాలి ?
జవాబు:
చార్మినార్ కథల్లో 11వ శతాబ్దం నుంచి మన దేశంలో కొనసాగిన ముస్లింల వలసలు, వాటి వల్ల వచ్చిన పాలన, జీవన విధానాలు, సంస్కృతి, వాటివల్ల హిందూముస్లిం స్త్రీల ఆలోచనలలో కలిగిన ఇచ్చి పుచ్చుకోవడాలు మొ||వి రచయిత చిత్రించారు. అంతేకాక ముస్లిం పాలకుల సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మధ్య ఆసియా దేశాల సంస్కృతిని వర్ణించారు. ఈ కథలు హైదరాబాదులో అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం ఎలా ఉండేదో తెలుపుతాయి. అందుకని చార్మినార్ కథలను చదవాలి.
ప్రశ్న 18.
‘శ్రీరాముడు మర్యాద పురుషుడు’, ‘శ్రీరాముడు ధర్మానికి ప్రతీక’ – వివరించండి.
జవాబు:
శ్రీరాముడు మంచిగుణాలు కలవాడు. ఆపదల్లో తొణకనివాడు. ధర్మమూర్తి ఆశ్రితులను ఆదుకొనేవాడు. ఆడిన మాట తప్పనివాడు. వీరుడు, సౌందర్యమూర్తి. తండ్రిమాట జవదాటనివాడు. పెద్దలయెడ గౌరవం, దేవతలు – ఋషులు మునులపట్ల భక్తి కలవాడు.
అధర్మాన్ని అనుసరించిన వాలిని, రావణుని, రాక్షసగణాలను మట్టుపెట్టి ధర్మాన్ని స్థాపించాడు. రావణుని అవినీతిని వ్యతిరేకించి వచ్చిన విభీషణునికి ఆశ్రయమిచ్చి లంకకు రాజును చేశాడు.
తన పినతల్లి కైకేయికి, తండ్రి ఇచ్చిన వరాలను నెరవేర్చడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. సీతను రావణుని చెరనుండి విడిపించిన తరువాత ఆమె పవిత్రురాలు అని తనకు తెలిసినా ప్రపంచానికి వెల్లడించడానికి అగ్నిపరీక్ష పెట్టాడు.
వనవాస సమయంలో ఋషులందరిని దర్శించుకొని వారి ఆశీస్సులను, వారిచ్చిన దివ్యశక్తులను పొందాడు. ఇది అతని భక్తి ప్రపత్తులకు నిదర్శనం. ఈ విధంగా శ్రీరాముడు మర్యాదాపురుషుడని, ధర్మానికి ప్రతీక అని చెప్పవచ్చు.
(లేదా)
హనుమంతుడి మాటతీరు రాముని ఎలా ఆకట్టుకుంది ?
జవాబు:
ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయిపడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు.
సుగ్రీవుని ఆనతిమీద రామలక్ష్మణుల దగ్గరికి సన్న్యాసివేషంలో హనుమంతుడు వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు. హనుమంతుడు వారితో వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతణ్ణి ఆయన అన్న వాలి వంచించాడు. రక్షణకోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను ‘హనుమంతుడంటారు. నేను వాయుపుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తిగలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీదగ్గరికి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు. ‘అని చాకచక్యంగా మాట్లాడాడు.
విషయాన్ని చెప్పే పద్దతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. లక్ష్మణుడితో ‘ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా, తప్పులు పలకుండా, సరైన స్వరంతో చెప్పదలచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరుచూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు’ అని మెచ్చుకున్నాడు. ఈ సన్నివేశం వల్ల మాటకున్న శక్తి, ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు తెలుస్తుంది.
ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)
ప్రశ్న 19.
అవయవదానం ఆవశ్యకతను తెల్పుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:
చనిపోయినా జీవించి ఉండవచ్చు … ఆలోచించండి !
ప్రియమైన మానవతామూర్తులారా !
ఒక్కక్షణం ఆలోచించండి !
మానవ జీవితం క్షణకాలంలో నశించే నీటిబుడగ వంటిదని, అశాశ్వతమని అందరికీ తెలుసు. ఎవరి ప్రానం వాళ్ళకు అత్యంత ప్రియం! ఈ దేహానికి ఒక చిన్న సూది గుచ్చుకున్నా భరించలేం ! చుక్క రక్తం బయటికొచ్చినా తట్టుకోలేం ! కాని, చనిపోయిన తర్వాత ఈ శరీరం దేనికీ పనికిరాదని కాల్చేయడమో, పూడ్చేయడమో తప్పదు. అట్లా నిరుపయోగంగా శరీర అవయవాలు వృథాచేయడం కంటె, వీటివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమో ఎప్పుడైనా ఆలోచించారా ?
ప్రస్తుతం మనం విజ్ఞానశాస్త్ర యుగంలో ఉన్నాం. మృత్యుముఖంలో ఉన్నవాళ్ళకు కృత్రిమశ్వాస అందించి ఆగిన గుండెను ఆడించి వారిని తిరిగి బ్రతికించే గొప్ప వైద్య విజ్ఞానం మానవజాతి సొంతం చేసుకున్నది. ఇంత చేసినా బతికించగలిగే పరిస్థితిలేనప్పుడు ఆ శరీరం ఎవరికీ పనికి రాకుండా మట్టిలోనో, గాలిలోనో కలిసిపోయేటట్లు చేస్తున్నాం. ఈ పరిస్థితిలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రాణం కోల్పోయిన శరీరంలోని కొన్ని అవయవాలు సకాలంలో తీయగలిగితే.. అవి ఇతరుల ప్రానాలను నిలబెట్టగల్గుతాయి. ఇతరుల జీవితాల్లో వెలుగులను విరజిమ్మగల్గుతాయి ! అవును! ఇది నిజం ! ఇది ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన గొప్ప విజయం !
ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించి చూడండి. పుట్టిన ప్రతిఒక్కరూ మరణించక తప్పదు. కానీ చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలోని అవయవాలు మరికొందరికి ప్రాణంపోస్తాయి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచించండి! ‘మతం కన్న మానవత్వం మిన్న’ అన్న సత్యాన్ని గ్రహించండి! దానాలన్నింటిలోనూ అవయవదానం అతి విశిష్టమైందని తెలుసుకోండి ! మీరు స్వచ్ఛందంగా మరణానంతరం అవయవదానం చేసే నిర్ణయం తీసుకోండి ! పదిమందీ ఈ మార్గంలో నడిచే ప్రేరణనివ్వండి !
శరీరం అశాశ్వతం ! కీర్తి శాశ్వతం ! శాశ్వతకీర్తిని సాధించే సాధనం అవయవదానం ! ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి !
తేది : XXXXXX
ప్రతులు : 500
ఇట్లు
Z.P.H.S. వరంగల్ విద్యార్థులు
తెలంగాణ రాష్ట్రం.
(లేదా)
తెలుగుభాష గొప్పతనంపై స్వంతంగా 5 నినాదాలు తయారుచేయండి.
జవాబు:
- తెలుగు భాష నేర్వరా వెలుగుబాట నడువరా
- తెలుగు మన మాతృభాష అదే మన ఆరాధ్య భాష.
- ‘అమ్మా’ అన్న రెండక్షరాలే తెలుగు భాషా ప్రేమకు ప్రతీక.
- భాషలెన్ని నేర్చినా, తెలుగు భాష మరువకురా !
- తేట తెలుగు నేర్వరా ! మరర తెలుగువాడిగా.
- తెలుగు భాష నేర్వరా, అది తేనె లొలుకు భాషరా.
- దేశ భాషలందు తెలుగులెస్స.
- సరస్వతి మెడలోని హారం – తెలుగు భాష.
పార్ట్ – B
సమయం : 30 ని.లు
మార్కులు : 20
సూచనలు :
- విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
- పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.
I. భాషాంశాలు
అ) పదజాలం :
కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2 మా..)
ప్రశ్న 1.
కోలాహలం : ………………..
జవాబు:
కోలాహలం : తిరుపతి ప్రతిరోజు భక్తులతో కోలాహలంగా కిటకిటలాడుతూ ఉంటుంది.
ప్రశ్న 2.
వెనుకాడు : ………………….
జవాబు:
వెనుకాడు : కార్యసాధకులైన వారు పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వెనుకాడరు.
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
హాటకపీఠం పై అమ్మవారు అందంగా ఉంది. (గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి)
A) బంగారం
B) రాగి
C) ఇత్తడి
D) కంచు
జవాబు:
A) బంగారం
ప్రశ్న 4.
ఇరుగుపొరుగువారితో సఖ్యత కల్గి ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం)
A) వైరం
B) హరి
C) స్నేహం
D) అరి
జవాబు:
C) స్నేహం
ప్రశ్న 5.
‘వెన్నెల’ అనే అర్థాన్నిచ్చే పదాలు
A) కౌముది, వినోదిని
B) జ్యోత్స్న, ఆర్ఘ్యం
C) జలధి, కౌముది
D) జ్యోత్స్న, కౌముది
జవాబు:
D) జ్యోత్స్న, కౌముది
ప్రశ్న 6.
రైతులు వానలు పడక నీటికోసం పంట కోసం పరితపిస్తున్నారు. “రైతు” పదానికి పర్యాయపదాలు
A) కృషీవలుడు, భూమిపుత్రుడు
B) రైతు, మోతుబరి
C) కృషి, సేద్యకుడు
D) భూమీశుడు, కృషికుడు
జవాబు:
A) కృషీవలుడు, భూమిపుత్రుడు
ప్రశ్న 7.
ముద్రణాలయంలో అచ్చులతో అక్షరాల అచ్చులు తయారుచేస్తారు.
ఇందులో అక్షరం పదానికి నానార్థాలు తెలపండి.
A) వర్ణం, మోక్షం
B) హల్లులు, అచ్చులు
C) అంతస్థాలు, ఊష్మాలు
D) ప్రాణులు, ప్రాణాలు
జవాబు:
A) వర్ణం, మోక్షం
ప్రశ్న 8.
గోత్రము, వంశం అనే నానార్థాలు కల్గిన పదం
A) కులము
B) వర్గము
C) కాలము
D) కనకం
జవాబు:
A) కులము
ప్రశ్న 9.
యాత్రల వలన జ్ఞానము పెరుగుతుంది. (గీత గీసిన పదానికి వికృతి పదం)
A) యాతర
B) జాతర
C) జైత్ర
D) యాతర
జవాబు:
B) జాతర
ప్రశ్న 10.
‘చేపల వంటి కన్నులు కలది’ అనే వ్యుత్పత్తి కల్గిన పదం
A) ముక్కంటి
B) మృగనేత్రి
C) మచ్చెకంటి
D) అభినయి
జవాబు:
C) మచ్చెకంటి
ఆ) వ్యాకరణాంశాలు:
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/ B / C / D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
అచ్చికమంటే
A) అచ్చ తెలుగు పదం
B) సంస్కృత పదం
C) ద్రావిడ పదం
D) గ్రామ్యపదం
జవాబు:
A) అచ్చ తెలుగు పదం
ప్రశ్న 12.
ఆ + ఆదిమశక్తి – కలిపి రాయండి.
A) అయ్యాదిమశక్తి
B) ఆదిమశక్తి.
C) అయాదిమశక్తి
D) ఆయాదిమశక్తి
జవాబు:
A) అయ్యాదిమశక్తి
ప్రశ్న 13.
సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ
A) ధీరురాలు
B) పుణ్యాంగన
C) దేశౌన్నత్యం
D) సూర్యోదయం
జవాబు:
B) పుణ్యాంగన
ప్రశ్న 14.
కందములను భుజించువారు – ఈ విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందినది ?
A) ద్వంద్వ సమాసం
B) ద్విగు సమాసం
C) బహువ్రీహి సమాసం
D) ద్వితీయాతత్పురుష సమాసం
జవాబు:
D) ద్వితీయాతత్పురుష సమాసం
ప్రశ్న 15.
‘మోక్షలక్ష్మి’ ఏ సమాసం?
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) బహువ్రీహి సమాసం
D) రూపక సమాసం
జవాబు:
D) రూపక సమాసం
ప్రశ్న 16.
1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యము ఏది ?
A) తేటగీతి
B) ఆటవెలది
C) సీసము
D) మత్తేభం
జవాబు:
A) తేటగీతి
ప్రశ్న 17.
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!
ఈ పద్య పాదం ఏ ఛందస్సుకు చెందినది ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
A) ఉత్పలమాల
ప్రశ్న 18.
వచ్చుగాక లేమి వచ్చుగాక – ఇందులో ఉన్న అలంకారం
A) అంత్యానుప్రాస
B) ఉపమ
C) శ్లేష
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) అంత్యానుప్రాస
ప్రశ్న 19.
రూపకాలంకారానికి ఉదాహరణ
A) అరణ్య హోరు
B) కొందరికి రెండు కాళ్ళు – రిక్షావానికి మూడుకాళ్ళు
C) తెల్లకలువ
D) వానజోరు ఆడింది వయ్యారంగా
జవాబు:
B) కొందరికి రెండు కాళ్ళు – రిక్షావానికి మూడుకాళ్ళు
ప్రశ్న 20.
“నాకు నగరజీవితం ఇష్టం” అని రవి అన్నాడు. పరోక్షవాక్య రూపం గుర్తించండి.
A) నాకు నగరజీవితం ఇష్టమని రవి అన్నాడు.
B) నాకు నగరజీవితం ఇష్టం అవుతుందని రవి అన్నాడు.
C) నాకు నగరజీవితం ఇష్టంలేదని రవి అన్నాడు.
D) తనకు నగరజీవితం ఇష్టమని రవి అన్నాడు.
జవాబు:
D) తనకు నగరజీవితం ఇష్టమని రవి అన్నాడు.