Reviewing TS 10th Class Telugu Model Papers Set 8 can help students identify areas where they need improvement.
TS SSC Telugu Model Paper Set 8 with Solutions
‘సమయం: 3 గం.
మార్కులు : 80
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
అ) కింది పేరాను చదవండి. (5 × 1 = 5 మా.)
సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశమున్నది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. అయోధ్యా అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీనిని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మ పరాయణుడు. ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకొనేవాడు. వసిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజల ధర్మ వర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
కింద ఇచ్చిన వాక్యాలలో సరైన దానికి (✓) గుర్తు పెట్టి సూచించండి.
ప్రశ్న 1.
అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు.
ఆ) సూర్యవంశానికి చెందినవాడు కాదు దశరథుడు.
జవాబు:
అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. ( ✓ )
ప్రశ్న 2.
అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి.
ఆ) సుమంత్రుడు దశరథుని కొలువులో లేడు.
జవాబు:
అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. ( ✓ )
ప్రశ్న 3.
అ) యోధులు జయించటానికి శక్యమైన నగరం కోసల.
ఆ) అయోద్య యోధులు జయించటానికి శక్యం కానిది.
జవాబు:
ఆ) అయోద్య యోధులు జయించటానికి శక్యం కానిది. ( ✓ )
ప్రశ్న 4.
అ) కోసలదేశపు రాజ పురోహితులలో వసిష్ఠుడు ఒకరు.
ఆ) దశరథుడి పురోహితులు వసిష్ఠుడు, వాసుదేవుడు కారు.
జవాబు:
అ) కోసలదేశపు రాజ పురోహితులలో వసిష్ఠుడు ఒకరు. ( ✓ )
ప్రశ్న 5.
అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు.
ఆ) శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేసినట్లు పై గద్యంలో ఉంది.
జవాబు:
అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. ( ✓ )
ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. (1 × 5 = 5 మా.)
ప్రశ్న 6.
సిరిలేకైన …………………… నీతి వాచస్పతీ !
జవాబు:
సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా ! నీతివాచస్పతీ !
భావం : నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ “సురభిమల్ల భూపాలా”! శిరస్సుకు గురుపాదాలకు నమస్కరించే గుణం, చేతులకు దానగుణం, చెవులకు శాస్త్రశ్రవణం, నోటికి సత్య వాక్కును పలికే లక్షణమూ, బాహువులకు విజయమూ, మనస్సునకు మంచి సౌజన్యమూ అనే లక్షణాలు గల పండితుడు ఐశ్వర్యం లేకపోయినా ప్రకాశిస్తాడు.
(లేదా)
ఆకంఠంబుగ …………. తాపసుల్ !
జవాబు:
ఆకంఠంబుగ నిఫ్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే!
నీ కంటెన్ మతిమీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపముల్ !
భావం : ఇప్పుడు గొంతుదాకా తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ! ఇది మంచి పనియేనా ? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవేనా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారూ, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకొనే వాళ్ళూ, వరిమళ్ళలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళూ, రోళ్ళ వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించే వాళ్ళూ అయిన మునులు, నీ కంటె తెలివి తక్కువ వారా ?
ఇ) కింది పేరాను చదువండి. (5 × 2 = 10 మా.)
బొగ్గు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు, భూగోళాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తూ జీవరాసుల మనుగడకు ముప్పు తెస్తున్నాయి. ఈ విపత్తును నివారించాలంటే మనిషి ప్రకృతి వనరులను నిర్మాణాత్మకంగా సృజనశీలంగా ఉపయోగించుకోవాలి. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనాలి. మోటారు వాహనాలను నడపడానికి డీజిల్ ఇంజిన్ను సృష్టించిన జర్మన్ శాస్త్రవేత్త సర్ రుడాల్ఫ్ డీజిల్ ఈ సంగతి ముందే చెప్పడమే గాదు, చేసి చూపించారు కూడా. 1893 ఆగస్టు 10న వేరుసెనగ నూనెను ఇంధనంగా వాడి ఒక ఇంజన్ ను పనిచేయించారు. భవిష్యత్లో మోటారు వాహనాలు ఇలాంటి జీవ ఇంధనాలతోనే నడుస్తాయని సూచించారు. అందుకే ఏటా ఆగస్టు పదవతేదీనాడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని పాటిస్తున్నారు.
కింది వివరణలను సూచించే పదాలను గద్యంలో గుర్తించి రాయండి.
ప్రశ్న 7.
ఒకదానికి బదులుగా మరొకటి అనే అర్థం ఇచ్చే పదం
జవాబు:
ప్రత్యామ్నాయం
ప్రశ్న 8.
పై గద్యంలో వాడిన ‘జాతీయం’
జవాబు:
నిప్పుల కుంపటి
ప్రశ్న 9.
అనేక జీవుల, నిర్జీవుల సమూహ నివాసస్థానం
జవాబు:
భూగోళం
ప్రశ్న 10.
రాబోయే కాలంలో” అని సూచించడానికి వాడిన పదం
జవాబు:
భవిష్యత్
ప్రశ్న 11.
పై గద్యంలో సూచించి విపత్తు
జవాబు:
జీవరాశుల మనుగడకు ముప్పు
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 3 = 12 మా.)
ప్రశ్న 12.
ధూర్జటి మహాకవిని పరిచయం చేసి, ఆయన రచనలు పేర్కొనండి.
జవాబు:
ధూర్జటి మహాకవి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవలలలో ఒకడు. ఇతడు మహాశివభక్తుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందిన మహాకవి. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకముతోపాటు, శ్రీకాళహస్తి మహాత్యము అనే ప్రబంధాన్ని కూడా రాశాడు. ఈ మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా “రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు” అని చెప్పిన ధీశాలి.
ప్రశ్న 13.
“తెలంగాణ ప్రజల బ్రతుకు దుర్భరమైనా ఆంధ్రత్వమును పోనాడలేదు” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ ఐదు వాక్యాలు రాయండి.
జవాబు:
నిజాం నవాబు కాలంలో తెలంగాణ ప్రజలు మత పిశాచి కోరలలో చిక్కుకొని విలవిలలాడారు. బలవంతంగా తెలంగాణలోని హిందువులందరినీ, ముసల్మానులుగా మార్చాలని ఆనాడు నవాబు ప్రయత్నించాడు. ఆయన హిందువులను ఎన్నో బాధలు పెట్టాడు. తెలంగాణలో తెలుగు చదువుకొనే సదుపాయాలు లేకుండా చేశాడు. పాఠశాలల్లో, కళాశాలల్లో అంతా ఉర్దూ మీడియంలో విద్యా సదుపాయం’ కొనసాగించాడు.
అయినా తెలంగాణ ప్రజలూ, నాయకులూ తమ తెలుగుభాషను తాము రక్షించుకొన్నారు. తమ తెలుగు సంస్కృతిని వారు కాపాడుకున్నారు. మహమ్మదీయ మతంలోకి ప్రజలను బలవంతంగా మార్చడానికి నవాబు ప్రయత్నించినా, ప్రజల పీకలను కోసినా, ప్రజల బ్రతుకు దుర్భరమైనా, తెలంగాణ ప్రజలు తమ తెలుగుదనాన్ని కోల్పోలేదన్నది సత్య కథనము.
ప్రశ్న 14.
‘భూమిక’ పాఠం రచయితను గురించి రాయండి.
జవాబు:
‘భూమిక’ పాఠాన్ని ‘గూడూరి సీతారాం’ గారు వ్రాశారు. గూడూరి సీతారాం గారు, 1936లో రాజన్న సిరిసిల్లా జిల్లా దగ్గర ఉన్న ‘హనుమాజీ పేట’ గ్రామంలో జన్మించారు. ఈయన, సుమారు 80 కథలు వ్రాశారు. ఈయన
- మారాజు,
- లచ్చి,
- పిచ్చోడు,
- రాజమ్మ రాజీ రకం వంటి ప్రసిద్ధి కథలు వ్రాశారు.
తెలంగాణ సాహిత్యంలో పేద కులాల జీవితాలనూ, అట్టడుగు వర్గాల భాషనూ, ఈయన అక్షరబద్ధం చేశాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ తొలిరకం కథలకు, ఈయన దిక్సూచిగా నిలబడ్డాడు.
తెలంగాణ భాషనూ, యాసనూ ఒలికించడం, ఈయనకు గల ప్రత్యేకత.
ప్రశ్న 15.
మరాఠీ పురోహితుని తెలుగుభాష ముచ్చటను గూర్చి వివరించండి.
జవాబు:
సదాశివగారి గ్రామంలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన పూజలు చేయిస్తూ, “మొదలు మీ కండ్లకు నీళ్ళు పెట్టుకోండి” అనేవాడు. సదాశివగారు ఆ పూజారిని అలా అనవద్దనీ, శుభం అని పూజ చేస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అన్న మాట, ఆశుభంగా ఉంటుందని పూజారికి చెప్పేవారు, పూజారిని అందరికీ తెలిసిన మరాఠీలో చెప్పమనేవారు.
తరువాత పూజారి “కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి” అని ‘కు’ ప్రత్యయం చేర్చి చెప్పేవాడు. పూజారి కళ్ళను నీటితో తుడుచుకోండి అన్న అర్థంలో అలా చెప్పేవాడు. కాని వినేవారికి ‘వారిని కన్నీరు కార్చండి’ అని చెప్పినట్లు అర్థం వచ్చేది. అది తప్పుగా ఉండేది.
ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)
ప్రశ్న 16.
బలి చక్రవర్తి వంటి దాతలు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకు ? బలిచక్రవర్తి వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని కారణాలను వివరించండి.
జవాబు:
మనం తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు మన వెంట ఏ ధనాన్నీ తీసుకురాలేదు. చనిపోయేటప్పుడు మన వెంట ఏమీ తీసుకుపోము. బలి చక్రవర్తి తన గురువు వద్దన్నా వినకుండా, ఆడినమాట తప్పకుండా, దానం చేశాడు. దాత అన్నవాడికి, మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టం అన్నాడు. అందువల్లే బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి వంటి దాతలు చరిత్రలో నిలిచిపోతారు.
బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు, విరోచనుని కుమారుడు. బలి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని జయిస్తాడు. దేవతలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. బలి నర్మదా తీరంలో యాగం చేస్తుండగా అక్కడకు వామనుడు వచ్చి మూడు అడుగులు దానం అడుగుతాడు. సరే అంటాడు బలి. ఇంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు వచ్చినవాడు రాక్షస కులాంతకుడు, కనుక దానం ఇవ్వద్దంటాడు.
తనకు చెడు జరుగుతుందని తెలిసినపుడు ఎవరైనా సరే చేసే పని ఆపడమో, ఇచ్చిన మాట తప్పడమో మామూలుగా మనం చేసే పని. చరిత్రలో నిలిచిపోయేలా చేసిన పని బలిది. మానధనులు మాటకు కట్టుబడి సత్యంతోనే బ్రతుకుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది.
అది – అక్రమ సంపాదనలతో లోక కంటకులైన వారిని లోకం నేటికీ నిందిస్తోంది. కాబట్టి కీర్తి సంపాదన ముఖ్యమన్న బలిచక్రవర్తిని మనం సమర్థించాలి.
ఈ రోజుల్లో మంచివారి పేరును తలచుకోవడం పాపంగా భావించడం పరిపాటి. కాని బలి తన కన్నా పూర్వికుడైన శిబి చక్రవర్తి వంటి వారలను స్మృతి పథంలో ఉంచుకొని వారి బాటలో నడవాలనుకోవడం ఎంతో ఉత్తమం. తనకు తానే సరైన మార్గ నిర్దేశనం చేసుకొన్న బలి చక్రవర్తిని ఆ కాలంలో పంచభూతాలు బళి, బళి అని పొగిడాయి. ఇప్పటికీ ఆ మాటలు మన చెవులలో మారు మ్రోగుతున్నాయి.
(లేదా)
పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషములో వ్యాసునితో అన్న మాటలను వివరించండి.
జవాబు:
ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు, కాశీనగరాన్ని శపించాలని చూస్తున్న సమయంలో, ఒక బ్రాహ్మణ భవనం దగ్గర సామాన్య స్త్రీ వేషంలో పార్వతీదేవి కనబడి, వ్యాసుడితో ఇలా చెప్పింది.
పార్వతీదేవి పలుకులు : ఓ మునీశ్వరా ! ఇలారా ! నీ గొంతు వరకు భిక్షాన్నము ఇప్పుడు తినడానికి దొరకలేదని నీవు ఛిందులు వేస్తున్నావు. ఇది మంచిపనియేనా ? నీవు శాంత స్వభావుడవేనా ? పిడికెడు వరిగింజలతో కొందరు కాలము వెళ్ళదీస్తున్నారు. కొందరు శాకాహారంతోనూ, దుంపలతోనూ సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో పండిన ధాన్యం కంకులు ఏరుకొనీ, వాటితో బ్రతుకుతున్నారు.
కొందరు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని, వాటితో జీవిస్తున్నారు. అటువంటి మునీశ్వరులు నీ కంటె తెలివి తక్కువవారా ! చెప్పు.
ఓ మునీశ్వరా ! ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. ఆ మాట నీవు వినలేదా ? కాశీనగరం శివునకు భార్య.. అందువల్ల కాశీ నగరం మీద నీవు ఇంతగా కోపించడం తగదు అని పార్వతీదేవి వ్యాసుని మందలించింది.
ప్రశ్న 17.
ఇబ్రహీం కుతుబ్షా సాహిత్య పిపాస గూర్చి వివరించండి.
జవాబు:
గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులు హిందూ, మహ్మదీయులు ఉండేవారు. విద్యాగోష్ఠి ఎప్పుడూ జరుగుతుండేది. ఈయన పండితులను బాగా సన్మానించేవాడు. ఇబ్రహీం కుతుబ్షా విజయనగరంలో రాజాదరణలో పెరగడం వల్ల తెలుగుభాషా మాధుర్యాన్ని రుచి చూశాడు. అందుకే తెలుగుభాషపై అభిమానంతో తెలుగు కవులను సత్కరించేవాడు.
ఇతడు అద్దంకి గంగాధర కవిచే ‘తపతీ’ సంవరణోపాఖ్యానం’ కావ్యం రాయించి అంకితం తీసుకొన్నాడు. ఇబ్రహీం పాదుషా మహాబాబునగరు జిల్లా నివాసియైన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వహాటకాంబర చతురంతయాన” అగ్రహారాలను ఇచ్చి సత్కరించారు.
ఈ విధంగా ఇబ్రహీం కుతుబ్షా సాహిత్యం పట్ల మిక్కిలి ఇష్టం కలవాడని గ్రహించవచ్చు.
(లేదా)
తిరుమల రామచంద్రగారిని గూర్చి సదాశివగారు చెప్పిన విషయాలు ఏవి ?
జవాబు:
తిరుమల రామచంద్రగారు ప్రాకృత, సంస్కృత, ఆంధ్రభాషలలో మంచి పండితులు. వీరు ఆ రోజుల్లో ఆంధ్రప్రభ వారపత్రికలో చివరిపేజీ రాసేవారు. దాని పేరు “హైదరాబాదు నోటుబుక్కు” ఏ పత్రికకు అయినా, చివరి పేజీయే అందాన్ని తెస్తుంది.
ఒకవారం హైదరాబాదు నోటుబుక్కులో, రామచంద్రరావు తమ బాల్యమిత్రులయిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారిని ఇలా గుర్తు చేసుకున్నారు.
లక్ష్మణశాస్త్రిగారు ఒకసారి తిరుపతికి వెళ్ళి వచ్చారట. అక్కడ నుండి తెచ్చిన ఒక లడ్డూను శాస్త్రిగారు తన బాల్యమిత్రులయిన రామచంద్రగారికి ఇచ్చారట. ఆ లడ్డును శాస్త్రిగారు రామచంద్రగారికి ఇస్తూ, “వారీ రామచంద్రా ! ఇగపటు తిరుపతి లడ్డూ” అన్నారట. ఇదిగో తిరుపతి లడ్డూ తీసుకో అని దాని అర్థము. ఈ విధంగా లక్ష్మణశాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో మంచి పండితులయినా, తన ప్రాంతపు తెలుగు యాసపై మమకారంతో, ఆ ప్రాంతపు తెలుగులోనే బాల్యమిత్రునితో మాట్లాడారని తెలుస్తోంది.
ప్రశ్న 18.
రామాయణం ఆధారంగా గురుశిష్యుల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
పూర్వకాలంలో ‘గురుముఖతః’ విద్య నేర్చుకొనేవారు. గురుసేవలు చేసి, వాళ్ళ అనుగ్రహాన్ని పొంది విద్యలను అభ్యసించేవారు. రామాయణాన్ని పరిశీలించినట్లయితే రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రునికి సేవలు చేసి ఆయన వద్ద అనేక విద్యలను అభ్యసించినట్లు తెలుస్తోంది. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం బాలకులైన రామలక్ష్మణులను తనతో అడవికి తీసుకొనిపోయి ‘బల’, ‘అతిబల’ వంటి విద్యలను బోధించాడు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పుల వంటివి ఉండవు. దీన్నిబట్టి శిష్యుల బాగోగులను చూడటం తమ బాధ్యతగా గురువులు గ్రహించేవారని తెలుస్తోంది.
రామాయణం ఆధారంగా పరిశీలిస్తే గురుశిష్యుల సంబంధం ఎంతో విశిష్టమైనదిగా తోస్తుంది. శిష్యులు గురువు ఆజ్ఞను పాటించడం తమ కర్తవ్యంగా భావించేవారు. తాటక వధ గావించిన రాముని చూసి సంతోషించి విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది లేదని, శిష్యుడు పొందలేనిది లేదని రామాయణాన్ని బట్టి గ్రహించవచ్చు.
శిష్యులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంతో నిష్ఠ ఉండాలి. సమర్థులైన శిష్యులను చూసి గురువు ఎంతో సంతోషిస్తాడు. పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో గంగావతరణం కథ ద్వారా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బోధించాడు. గురువు శిష్యుల పట్ల వాత్సల్యంలోను, శిష్యులు గురువు వినయ విధేయతలతోను, మెలగుతుండేవారు.
(లేదా)
‘ఉత్తమ ధర్మాలను అనుసరిస్తే మనిషి మనిషిగా ఎదుగగలడని’ రామాయణం ఆధారంగా వివరించండి.
జవాబు:
రామాయణము మనకు ఎన్నో ఉత్తమ ధర్మాలను నేర్పుతుంది. అటువంటి ఉత్తమ ధర్మాలను పాటిస్తే, ఆ మనిషి, తప్పక ‘మనిషి’ అవుతాడు. అనగా మంచి బుద్ధిమంతుడు అవుతాడు.
రామాయణములోని ‘శ్రీరాముడు’ పితృవాక్య పరిపాలకుడు. రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. రాముడు తండ్రి మాటకు కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు. రాముడు మాటకు కట్టుబడి ఉండేవాడు. భరతుడు వచ్చి అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పరిపాలించుమని అడిగినా, రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసం చేశాడు.
రాముడు, స్నేహధర్మాన్ని పాటించి సుగ్రీవునితో స్నేహం చేసి అతనికి ఇచ్చిన మాట ప్రకారము, సుగ్రీవుని అన్న వాలిని చంపి, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు.
రాముడు శరణు అని వచ్చిన విభీషణునికి ఆశ్రయమిచ్చి అతణ్ణి రక్షించి, అతని అన్న రావణుడిని చంపి, స్నేహధర్మంతో విభీషణుడిని లంకా నగరానికి రాజును చేశాడు.
రాముడు అరణ్యంలో ఆశ్రమ ధర్మాలను పాటించాడు. మునులను రక్షించడానికి తాటక, కబందుడు, విరాధుడు, ఖర ధూషణులు, మారీచ సుబాహులు వంటి రాక్షసులను వధించాడు.
రాముడు గురువు విశ్వామిత్రుని వెంట వెళ్ళి అతణ్ణి సేవించి, రాక్షసులను చంపి, ఆయన యజ్ఞాన్ని కాపాడాడు. రాముడు మంచి సోదర ప్రేమ కలవాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులను రాముడు ఎంతో ఆదరించాడు. రాముడు తల్లిదండ్రుల యందు మంచి భక్తిని చూపించాడు. గురువులయిన వశిష్ఠ విశ్వామిత్రుల యందు మంచి భక్తి భావాన్ని చూపాడు.
సుగ్రీవుడు మిత్రధర్మానికి కట్టుబడి, తన వానర సైన్యంతో రామునికి తోడుగా నిలబడ్డాడు. విభీషణుడు కూడా మిత్రధర్మాన్ని పాటించి, రావణుని చంపడంలో రాముడికి సాయం చేశాడు.
లక్ష్మణుడు అన్న వెంట అడవులకు వెళ్ళి అన్నకు సేవచేసి వినయ విధేయతలతో మెలిగాడు. రామలక్ష్మణుల సోదరప్రేమ చాలా గొప్పది. సీతారాముల అన్యోన్య దాంపత్యము, లోకానికి ఆదర్శమైనది.
కాబట్టి చేప్పిన రామాయణంలోని ఉత్తమ ధర్మాలను పాటిస్తే తప్పక ఆ మనిషి “మనీషి” కాగలడు అని చెప్పవచ్చు.
ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)
ప్రశ్న 19.
మీ గ్రామానికి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తను ఇంటర్వ్యూ చేయడానికి పది ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
- సార్ ! భూసార పరీక్ష ద్వారా నేల ఏ పంటకు అనుకూలమో చెప్పడం దేని ద్వారా తెలుస్తుంది ?
- మెట్ట పంటలు, మాగాణి పంటలు నేలను బట్టి వేరు చేస్తారా ? లేక నీటి వసతిని బట్టి వేరు చేస్తారా ?
- వ్యవసాయ శాస్త్రవేత్త కావడానికి ఏ చదువు చదవాలి ?
- భూసార పరీక్షలు సత్ఫలితాలే ఇస్తాయా ?
- రసాయన ఎరువులు నష్టాన్ని కలిగిస్తాయని ఇప్పుడు చెబుతున్నారు ? అలాంటి వాటిని తయారు చేసి రైతులకు ఎందుకు ఇస్తున్నారు ?
- సేంద్రియ ఎరువుల వాడకం మీద ప్రచారం ప్రభుత్వమే బాధ్యతగా చేయవచ్చు కదా ?
- వరి పంటలలో రకరకాల పేర్లతో (సన్నాలు, BPTL, 92 ……….. ఇలా) ఎలా తయారు చేస్తారు ?
- మీరు ఏదైనా ప్రయోగం చేశారా ?
- యువకులకు, విద్యార్థులకు, రైతులకు మీరిచ్చే సందేశం ?
(లేదా)
మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు లేవు. వ్యవసాయపనులు లేవు. చదువుకున్న ఉద్యోగం రాలేదు. నగరంలో బాగా సంపాదించవచ్చుననే ఆశతో హైదరాబాదుకు ‘దస్తగిరి’ అనే యువకుడు వచ్చాడు. అతడు నగరంలో పడిన కష్టాలను, అతని తోడివారి కష్టాలను తల్లిదండ్రులకు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:
లేఖ
హైదరాబాదు,
XXXXXXX.
పూజ్యులైన తల్లిదండ్రులకు,
అమ్మా ! నాన్నా ! నమస్కారములు. నేను హైదరాబాదు నగరానికి క్షేమంగా వచ్చాను. నేను ఇక్కడ పడుతున్న కష్టాలు మీకు రాస్తే మీరు బాధపడతారు.
నేను సికిందరాబాదు స్టేషను దగ్గర ఉంటున్నాను. పగలు ప్రయాణీకులకు సామాన్లు మోయడానికి వారికి సాయం చేస్తూ, వారు ఇచ్చిన కొద్దిపాటి డబ్బులుతో, చౌకరకం టిఫిన్లు అక్కడ కొనుక్కొని తింటున్నాను. రాత్రి స్టేషను ప్లాట్ఫారమ్పై పడుకుంటున్నాను.
ఇళ్ళు కట్టే తాపీమేస్త్రీల వద్ద అప్పుడప్పుడు పనిచేస్తున్నాను. వాళ్ళు యజమానులు ఇచ్చే దానిలో సగమే నా వంటి. చిన్న కూలీలకు ఇస్తారు. మన ఊరి నుండి నా కంటె ముందు వచ్చిన నా మిత్రులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. వారు పిల్లలకు చదువులు లేవు. అద్దెలు, ఎక్కువ ఇవ్వలేక వారు మురికివాడల్లో రేకులషెడ్లలో ఎలాగో బతుకుతున్నారు.
ఇక్కడ రోడ్లు మహా రద్దీగా ఉంటాయి. ఏ వైపు నుంచి అయినా ప్రమాదం రావచ్చు. పిల్లలను చదివించాలంటే కాన్వెంట్లు వారికి పెద్దగా ఫీజులు ఇవ్వాలి. ఈ నగరం, ఒక పద్మవ్యూహం. ఇది చిక్కుల నిలయం. ఎవ్వరూ నగరాలకు వలస రాకూడదు. తల్లి లాంటి మన పల్లెల్లోనే ఏదోరకంగా చల్లగా జీవించాలి. ఉంటా ………..
ఇట్లు
నీ ప్రియకుమారుడు, దస్తగిరి.
కందుల పుల్లయ్యగారు,
రామాపురం,
సీతానగరం మండలం, మహబూబ్ నగర్ జిల్లా.
పార్ట్ – B
సమయం : 30 ని.లు
మార్కులు : 20
సూచనలు :
- విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
- పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.
I. భాషాంశాలు
అ) పదజాలం :
కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి: (2 × 1 = 2 మా.)
ప్రశ్న 1.
అనుమాన బీజాలు : ………………………
జవాబు:
అనుమాన బీజాలు : రాజకీయ నాయకుల పరస్పర విమర్శలతో ప్రజల్లో అనుమాన బీజాలు మొలకెత్తాయి.
ప్రశ్న 2.
పాటుపడడం : …………………….
జవాబు:
పాటుపడడం : సైనికులు దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతుంటారు.
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/ B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వవైభవం వచ్చింది.
(గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి)
A) నది
B) సముద్రం
C) చెరువు
D) వాగు
జవాబు:
C) చెరువు
ప్రశ్న 4.
‘క్షేత్రము’ అనే మాటకు అర్థం.
A) పొలము
B) జలము
C) బలము
D) రణము
జవాబు:
A) పొలము
ప్రశ్న 5.
శిష్యులు అన్న మాటకు సమానార్థకాలు
A) ఛాత్రులు, అంతేవాసులు
B) గురువులు, చట్టులు
C) పరిజనులు, శిశువులు
D) స్నేహితులు, హితులు
జవాబు:
B) గురువులు, చట్టులు
ప్రశ్న 6.
గుడి, దేవాలయం అనే పర్యాయపదాలున్న మాట
A) వెన్నెల
B) కోవెల
C) సదనం
D) మహీరుహము
జవాబు:
B) కోవెల
ప్రశ్న 7.
కొలము, పాఱుడు, అచ్చెరువు, మృత్యువు, యశము, భూమి వీనిలో ప్రకృతి పదాలను గుర్తించండి.
A) కొలము, పాఱుడు, మృత్యువు
B) మృత్యువు, యశము, భూమి
C) పాఱుడు, భూమి, మృత్యువు
D) అచ్చెరువు, కొలము, యశము
జవాబు:
B) మృత్యువు, యశము, భూమి
ప్రశ్న 8.
”కంబం’ అనే పదానికి ప్రకృతి
A) రమ్యం
B) కావ్యం
C) స్తంభం
D) కయ్యం
జవాబు:
C) స్తంభం
ప్రశ్న 9.
‘మూడు’ అనే పదానికి నానార్థాలు
A) ఒక సంఖ్య, కాలంచెల్లు.
B) ఒక సంఖ్య, ఒక అంకె
C) ఒక అంకె, ఒక రాశి
D) ఒక పదం, ఒక అంకె
జవాబు:
A) ఒక సంఖ్య, కాలంచెల్లు.
ప్రశ్న 10.
‘చేపల వంటి కన్నులు కలది’ అనే వ్యుత్పత్తి కల్గిన పదం
A) ముక్కంటి
B) మృగనేత్రి
C) మచ్చెకంటి
D) అభినయి
జవాబు:
C) మచ్చెకంటి
ఆ) వ్యాకరణాంశాలు:
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/ B / C / D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
‘జగమెల్ల’ – దీనిలో గల సంధి
A) ఇత్వసంధి
B) ఉత్వ సంధి
C) అత్వ సంధి
D) పుంప్వాదేశ సంధి
జవాబు:
B) ఉత్వ సంధి
ప్రశ్న 12.
‘వర్ణ+ఆశనము’ ఈ పదాల్ని కలిపి రాయగా………. అవుతుంది.
A) వర్ణశసనము
B) వర్ణోశనము
C) వర్ణేశనము
D) వర్ణాశనము
జవాబు:
D) వర్ణాశనము
ప్రశ్న ’13.
‘యుద్ధభీతి’ అనుమాటకు విగ్రహవాక్యం
A) యుద్ధము వలన భీతి
B) యుద్ధము అనెడి భీతి
C) యుద్ధమునకు భీతి
D) యుద్ధము వంటి భీతి
జవాబు:
A) యుద్ధము వలన భీతి
ప్రశ్న 14.
‘పాపాత్ముడు’ లో గల సంధి
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 15.
‘దాశరథి అను పేరు గల శతకం’ అనే విగ్రహవాక్యానికి సమాస పదం.
A) దాశరథి రాసిన శతకం
B) దాశరథి శతకం
C) దాశరథి కోసం రాసిన శతకం
D) దాశరథి మెచ్చిన శతకం
జవాబు:
B) దాశరథి శతకం
ప్రశ్న 16.
‘శ్లేషాలంకారము’ అంటే
A) నానార్థాలను కలిగి ఉండే అలంకారం
B) ఉన్నది ఉన్నట్లు వర్ణించడం
C) అతిశయంగా వర్ణించడం
D) ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి కావడం
జవాబు:
A) నానార్థాలను కలిగి ఉండే అలంకారం
ప్రశ్న 17.
స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరుసగా ఉండే పద్యం
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) చంపకమాల
D) శార్దూలం
జవాబు:
B) మత్తేభం
ప్రశ్న 18.
అద్దంకి గంగాధర కవిచే తపతీ సంవరణోపాఖ్యానం రచించబడింది. ఈ వాక్యం
A) ప్రత్యక్ష వాక్యం
B) పరోక్ష వాక్యం
C) కర్మణి వాక్యం
D) కర్తరి వాక్యం.
జవాబు:
C) కర్మణి వాక్యం
ప్రశ్న 19.
11వ అక్షరం యతిస్థానం గల పద్యము
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
A) చంపకమాల
ప్రశ్న 20.
“నగర మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి” – ఈ వాక్యంలోని అలంకారం
A) రూపకము
B) ఉపమ
C) అతిశయోక్తి
D) వృత్త్యనుప్రాసము
జవాబు:
A) రూపకము