TS 8th Class Telugu Grammar వ్యాసాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download వ్యాసాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 1.
‘మాతృభాష ప్రాముఖ్యం’ ను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష, తల్లిఒడిలోని శిశువు మాతృస్తన్యముతో పాటే మాతృభాషామృతాన్ని కూడా పానం చేస్తుంది. మానసికమైన భాషపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియజేసుకోవడానికి ఉపయోగించే వాగ్రూపమైన సాధనమే భాష. బాల్యం నుండియే తెలుసుకోవడానికి అనువైనది మాతృభాష, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి తొలి ఆధారం మాతృభాష. అయిదేండ్ల ప్రాయం విద్యార్థికి మాతృభాషలోనే విద్యాభ్యాసం ప్రారంభించడం మన సంప్రదాయం. విద్యను బాలబాలికలు మాటలు వచ్చినది మొదలు ఏ భాషను ఉపయోగించుకొనుటకు అలవాటుపడతారో దానిలోనే నేర్చుకోవడం సులభం.

ప్రాచీన కాలము నుండి మన విజ్ఞానమంతయు సంస్కృతమునందే కలదు. మెకాలే విద్యావిధానం అమలు జరగడంతో ఆంగ్లభాష దేశంలో నిర్బంధ విద్య అయింది. అది ప్రపంచ భాష అయినందున, దాన్ని నేర్చుకోవాలనే తపన స్వదేశీయులలో కూడా పెరిగింది. ఆంగ్లభాష ప్రాబల్యం పెరిగి మాతృభాష నిర్లక్ష్యం కావడం జరిగింది. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలలోని “స్వభాష” అనే వ్యాసంలో జంఘాల శాస్త్రి మాతృభాష మాట్లాడలేని వారిని వ్యంగ్యంగా పరిహసించాడు. బోధన, పరిపాలన మాతృభాషలోనే జరగడం తల్లిపాలవంటిది అని, పరాయిభాషలో జరగడం పోతపాలవంటిదని 1913లో దేశభక్తి కొండా వెంకటప్పయ్యగారు అన్న మాటలు మనం జ్ఞప్తియందుంచుకోవాలి.

1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత స్థాయి విద్య మాతృభాషలోనే జరుపబడుచున్నది. కాని ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంకనూ ఆంగ్లంలోనే నడుస్తున్నవి. విశ్వవిద్యాలయ స్థాయిలో పూర్తిగా మాతృభాషా బోధన జరగడం లేదు. కారణం మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే. రష్యా వంటి పెద్ద దేశములలో భాషలనేకం ఉన్నను రష్యన్ భాషకే ప్రాధాన్యత. చైనా, జర్మన్, ఫ్రాన్సు దేశాలు ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిస్తూ మాతృభాషలోనే బోధనా, పాలనలు జరుపుకొంటున్నందున అవి పురోగతిని సాధిస్తున్నాయనే సత్యాన్ని మనం గుర్తించాలి.

మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులభమగును. ఎక్కువ శ్రద్ధతో నేర్చుకోవచ్చును. సంభాషణ, విషయ విశ్లేషణ చేయడం తేలిక, జ్ఞానార్జన, అవగాహన, మూర్తిమత్వ వికాసాలకు మాతృభాషా బోధన తోడ్పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో మాతృభాషా విద్యాబోధన, పాలనలకు ఎక్కువ స్థానం కలిగించి, నేర్చినవారికి ఉద్యోగావకాశాలు రాష్ట్రస్థాయిలో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

అధికార భాషా సంఘం, ప్రభుత్వం, విద్యాధికులు మాతృభాషలో విద్యాబోధనకు మరింతగా కృషి చేయాలి. మాతృభాషలో విద్యాబోధన చేయడం ఇంగ్లీషును నిర్బంధంగా ఒక స్థాయి వరకు నేర్పించడం చాలా అవసరం. మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చే విద్యార్థికి సమాధానాలు వ్రాసే భాషను ఎన్నుకొనే స్వేచ్ఛను కల్పించాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 2.
పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్న నేటి మనిషి జీవన విధానంలో “పర్యావరణ పరిరక్షణ” కు ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : భూమి, గాలి, నీరు మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. ప్రకృతిని మనిషి చాలా విధాలుగా కలుషితం చేస్తున్నాడు. పర్యావరణం అంటే పరిసరాల ‘వాతావరణం’ అని అంటారు. మన పరిసరాలు శుభ్రంగా ఉండటం వల్లనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ అనబడుతుంది.

విషయవిశ్లేషణ : సృష్టిలో ఏ ప్రాణికైనా ప్రాణాధారమైంది నీరు. మనదాహాన్ని తీర్చడానికి, పంటలు పండించుకోవడానికి నీటిని ఉపయోగిస్తున్నాం. చెట్లు స్వచ్ఛమైన గాలినిస్తూ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి. అయితే రానురాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజు వల్లను, మన చుట్టు వున్న ప్రదేశాలను మనమే పాడుచేసుకుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి వాతావరణం కాలుష్యంతో నిండిపోతున్నది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కల్గించేలా భయానక మార్పులు ఏర్పడుతున్నాయి. ఉన్న అడవులను నరికి వేయడం అంటే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం. దీనివల్ల ప్రకృతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

పరిరక్షణ చర్యలు : పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకునే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఇంటిలోని చెత్తను ఇంటి ముందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకొని అందులో పారవేయాలి. నీటి కుళాయిల వద్ద, మురికి కాల్వల వద్ద చెత్తా చెదారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా, టైఫాయిడ్, రోగకారకమైన దోమలు విజృంభించకుండా డి.డి.టి వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడలకు శుభ్రత గూర్చి తెలియజేయాలి.

ప్రజలను చైతన్య పరచాలి. ప్రతి ఇంటి దగ్గర చెట్లను నాటాలి, ఇంకుడు గుంతలు ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. పరిశుభ్రతతోనే మనందరి ఆరోగ్యం, అభివృద్ధి ఉందని ప్రతి ఒక్కరు గ్రహించాలి. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. వాటి వాడకం వల్ల ప్రజలకు జరిగే నష్టాలను వారికి వివరించాలి. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంగా పాటింపచేయాలి. పర్యావరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలి.

ప్రశ్న 3.
‘చలనచిత్రాలు – సమాజంపై వాటి ప్రభావం’ గురించి వ్యాసం రాయండి.
జవాబు.
పరిచయం : సగటు మనిషి ఆశలను, ఊహలను ప్రభావితం చేసే శక్తిమంతమైన ఆధునిక మాధ్యమం చలన చిత్రం. కష్టజీవులు కాయకష్టాన్ని మరచిపోవడానికి ప్రాచీన కాలంలో సృష్టించుకున్న ఆటపాటలతో కూడిన తోలుబొమ్మలాటలవంటి కళారూపాలే యక్షగానాలుగా, నాటకాలుగా, సినిమాలుగా పరిణతి చెందాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యలోకాలను, నవ్యభావాలను కళ్ళకు కడుతున్న చలన చిత్రాలు సమాజంపై కలిగించే ప్రభావం అంతా ఇంతా కాదు.

వినోదదాయకాలు : ప్రతిరోజు తమ దినచర్యలతో తలమునకలయ్యే సగటు మనిషికి విశ్రాంతిని, వినోదాన్ని అందించే సాధనంగా చలనచిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా రెక్కాడితేగానీ డొక్కాడని నగర జీవులకూ, విలాసవంత జీవితాన్ని గడిపేవారికీ కూడా అందుబాటులో ఉండి వినోదాన్నందించే కళారూపం చలనచిత్రం.

విజ్ఞానదాయకాలు : పండితుల నుంచి పామరుల వరకు కోట్లాది మందిని ఆకర్షించే ఈ కళారూపం విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలలో కూడా ముందంజలో ఉన్నది. సామాన్యులకు కొరుకుడుపడని శాస్త్రీయ అంశాలను సైతం ఆసాంతం కట్టిపడేసే కల్పనా చాతుర్యంతో సులభంగా అర్థమయ్యేట్లు చెప్పగలిగే ఏకైక మాధ్యమం సినిమా. దుష్ప్రభావాలు : చలనచిత్ర మాధ్యమానికి వినోదాన్ని, విజ్ఞానాన్ని కలిగించడం ఒక పార్శ్వమైతే దానివల్ల సమాజంపై పడే దుష్ప్రభావాలు రెండవ పార్శ్వం. మితిమీరిన కల్పనలు, హద్దు మీరిన హింసాప్రవృత్తి, విశృంఖలత్వం, విచక్షణలేని సన్నివేశాలు, బాధ్యతలేని కళాకారులు, కేవలం వ్యాపార ధోరణి మొదలైన అంశాల వల్ల సమాజంలో ముఖ్యంగా యువతీ యువకులలో కలిగే చెడ్డ అలవాట్లు చెప్పలేనన్ని.

ముగింపు : ఏ కళారూపమైనా సామాజిక బాధ్యతను విస్మరిస్తే దాని వల్ల సమాజానికి కలిగే మేలు కంటే కీడే ఎక్కువ. అది తోలుబొమ్మలాటైనా, డిజిటల్ సినిమా అయినా లక్ష్యాత్మకంగా ఉంటేనే సమాజానికి మేలు.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 4.
‘బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న బాధ్యతను గురించి వ్యాసం రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : ఐదు నుండి పద్నాలుగేళ్ళలోపు వయసు వారిని బాలలు అంటారు. చదువుకుంటూ, ఆడుకుంటూ గడపాల్సిన పిల్లలు కార్మికులుగా మారటమే బాల కార్మిక సమస్య.

బాలల బ్రతుకులు : అసలు చిన్నపిల్లల్లో అంతమంది కార్మికులుగా ఎందుకు మారుతున్నారన్న విషయాన్ని పరిశీలించాల్సి వుంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ పొట్టలను నింపుకోడానికి నిరేపేద కుటుంబాలవారు తమ పిల్లలను వ్యవసాయ కూలీలుగా మారుస్తున్నారు. పసిప్రాయంలోనే పల్లెల నుండి పట్టణాలకు ఇంటి పనివాళ్ళుగా వెళ్తున్నారు. విధి లేక స్వీట్ షాపులలో, బీడీ కంపెనీలలో తక్కువ జీతానికే పని చేస్తున్నారు.

ఆ పిల్లలు ఆయా సంస్థల్లో ఉదయం ఆరు గంటలనుండి రాత్రి 10 గంటల వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటారు. ఇలా వాళ్ళ బ్రతుకులు ఆటపాటలకు దూరమై రాను రాను మరీ దుర్భరమౌతున్నాయి. ఈ డబ్బును అనుభవిస్తున్న తల్లిదండ్రులు తాము ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నామో తెలుసుకోలేకపోతున్నారు.

ప్రభుత్వ – ప్రజల కర్తవ్యం : సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు బాలకార్మిక వ్యవస్థను దారుణమని ఉపన్యసిస్తున్నప్పటికీ దానికి మూలకారణాన్ని తెలుసుకునేందుకు, తెలిసినా నిర్మూలించేందుకు ఆసక్తిని చూపించడంలేదు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ మహెూద్యమాన్ని విజయవంతం చేయాలి. బాలకార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక విద్యా కార్యక్రమాలను అమలుచేయాలి. కుటుంబ నియంత్రణ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. కుటుంబ నియంత్రణ విషయంలో భారత్ చైనా మాదిరిగా కఠినంగా వ్యవహరించాలి. భారతీయులందరూ మతంతో సంబంధం లేకుండా, ఒకే బిడ్డను కలిగియుండేలా నిబంధనలు విధించి అమలుచేయాలి.

జనాభాను నియంత్రించనంతవరకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి ఫలవంతం కావు. ప్రజలు కూడా తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కృషి చేయాలి. తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్తును బలి చేయడం మానుకోవాలి. కుటుంబ భారం వారిపై పడకుండా చూసుకోవాలి. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే బాలల జీవితాల్లో వెలుగు రేఖల్ని సమీప భవిష్యత్తులోనే చూడగలుగుతాం. ఇది మన కర్తవ్యంగా భావించాలి. లక్ష్య సాధనలో భాగంగా ప్రతి సంవత్సరం ఏప్రియల్ 30న బాలకార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ప్రశ్న 5.
మన సంస్కృతి గొప్పదనాన్ని చెప్పే అంశాల్ని విశ్లేషిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ఒక జాతికాని, ఒక దేశం కాని తనదైన వైలక్షణ్యంతో భౌతికంగాను, మానసికంగాను దైనందిన జీవితం లోను, శాశ్వత జీవితంలోనూ సాధించిన ప్రగతిని, సంభవించే మూల్యాలను నాగరికత అనీ, సంస్కృతి అనీ పండితులు అంటున్నారు.

మన సంస్కృతిలో భాగమైన నమ్మకాలు, అభిరుచులు, ఆచార వ్యవహారాలు, నీతి నియమాలు, లలిత కళలు రాజకీయంగా, సామాజికంగా ఎన్ని మార్పులు వచ్చినా అంత తొందరగా మారవు. ఇది మన సంస్కృతి గొప్పతనం. మన సంస్కృతి గొప్పదనాన్ని చాటే అంశాలు మన ప్రార్థనా మందిరాలు, పండుగలు, పెళ్ళిళ్ళు, ఆహార విహారాలు, కట్టుబాట్లు.

మనకు బడిలేని ఊరైనా ఉంటుందేమో కాని గుడిలేని ఊరు ఉండదు. ప్రతి ఊరిలో ప్రసిద్ధి చెందిన శైవ, వైష్ణవ గుడులేకాక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతల గుడులు కూడా ఉండేవి. ఒక ఊరిలోని గ్రామదేవత ఉత్సవానికి, జాతరకు ప్రక్క గ్రామాలవారు, దూర ప్రదేశాల వాళ్ళు వస్తారు.

ఆటవికుల మేడారం సమ్మక్క జాతరలో, కీసలాపురం భీమదేవుని జాతరలో గ్రామీణులు, నాగరికులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ముస్లింల మొహర్రం పండుగలో హిందువులు సమధికోత్సాహంతో పాల్గొంటారు.

హైదరాబాదు నగరం వెలుపల జహంగీరు పీరీల దర్గా, ఉర్సు, కాజీపేట దర్గా, హన్మకొండ రెడ్డి నవాబు దర్గా, కరీంనగరం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక దర్గాలకు పోయి మ్రొక్కులు చెల్లిస్తారు.
పెండ్లిళ్ళ విషయానికి వస్తే, పేద, ధనిక భేదాలు చూడకుండా, ఒక యింట్లో పెండ్లి జరిగితే వాడవాళ్ళు, బంధువులు పనిపాటల్లో పాలుపంచుకునేవారు.

గ్రామాలన్నీ దాదాపు స్వయం సమృద్ధంగా ఉండేవి. పొట్టకై, బట్టకై ఇతర ప్రాంతాల మీద ఆధారపడడం తక్కువ. ఆయా ఋతువుల్లో ప్రకృతి మాత ప్రసాదించే పండ్లు తినడం, ఏయే కాలాలలో, ఋతువులలో వాతావరణానికి అనుగుణంగా శరీరానికి పోషకాలందుతాయో ఆ ఆహారపదార్థాలనే తినడం మన సంస్కృతి విశేషం. ఇలా తినే ఆహార పదార్థాలకు, ఆరోగ్యానికి, జీవన విధానానికి సంబంధం ఏర్పరచడం మన సంస్కృతి ప్రత్యేకత.

అందుకే రకరకాల భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు, మతాలు ఉన్నా మన సంస్కృతి గొప్పదనం భిన్నత్వంలో ఏకత్వం.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 6.
‘స్త్రీలందరూ విద్యావంతులైతే, వరకట్న నిర్మూలన జరుగుతుంది’ – దీనిపై మీ అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసం
రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : స్త్రీ విద్యావ్యాప్తికి జరిగిన ప్రచారం వల్ల, సమాజంలో వచ్చిన చైతన్యం వల్ల స్త్రీలలో విద్యావంతుల శాతం బాగా పెరిగింది.

విషయ విశ్లేషణ : స్త్రీ విద్యావంతురాలైతే వరకట్న నిషేధ చట్టాలపై అవగాహన ఏర్పడుతుంది. ‘వరకట్నం’ ఇవ్వడం హేయమైన చర్య అనే చైతన్యం స్త్రీకి ఏర్పడుతుంది. చట్టప్రకారం వరకట్నం ఇవ్వడం నేరమనే విషయం తెలుస్తుంది. ఈ చైతన్యం కొంతవరకు వరకట్న నిర్మూలనకు దోహదపడుతుంది.

వరకట్న దురాచారం ఏర్పడడానికి ఒక ముఖ్యకారణం మన సమాజవిధానం. పెళ్ళయ్యాక స్త్రీని పోషించాల్సిన బాధ్యత మగవాడిదనేది అనాదిగా ఏర్పడిన ఆచారం. స్త్రీ తాను విద్యావంతురాలై మగవాడికి ఆర్థికంగా అండగా నిలిచినప్పుడు వరకట్నం తీసుకోవడానికి మగవాడు వెనుకంజ వేస్తాడు.

స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబ సమస్యల పరిష్కారంలో పురుషునికి అండగా నిలబడుతుంది. అలాంటి విద్యావంతురాలిని వివాహం చేసుకొనేటప్పుడు పురుషులు వరకట్నం గురించి ఆలోచించరు. స్త్రీ తాను విద్యావంతురాలైతే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. సమాజంలో ఉన్న కొన్ని గుడ్డి అభిప్రాయాలను తోసివేయగలుగుతుంది. వరకట్నం ఎక్కువ ఇవ్వకపోతే, నలుగురూ తనను, తన కుటుంబాన్ని తక్కువగా చూస్తారు, గేలిచేస్తారు వంటి పిచ్చి అభిప్రాయాన్ని తోసివేయగలుగుతుంది.

ముగింపు : స్త్రీ విద్యావంతురాలైతే, ఆర్థికంగా తన కాళ్ళమీద తాను నిలబడగలుగుతుంది. తనను పోషించే బాధ్యతకోసం మగవాడు వరకట్నం అడిగే సంప్రదాయాన్ని అడ్డుకోగలుగుతుంది. అందువల్ల స్త్రీ విద్య వ్యక్తిగా ఆమెకు, సమాజానికి చాలా అవసరం.

ప్రశ్న 7.
చక్కని నీతులు చెప్పిన కొందరు శతకకవుల గొప్పదనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : శతక కవులు తమ జీవితానుభవాలను సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేట్లు తేలిక పదాల్లో వివరించారు. సంఘంలోని దురాచారాలను, కుళ్ళును ఎత్తి చూపడానికి వెనకాడలేదు. ఏ విషయాన్ని వివరించినా, ఉదాహరణ చెప్పి, అందులోని నీతిని వివరించారు. మానవ జీవిత ధ్యేయాన్ని వివరించడానికి ప్రయత్నించారు. సమాజంలో సుఖశాంతులతో బతకడానికి కావలసిన నీతి నియమాలను వివరించారు.

విశ్లేషణ : వేమన శతకంలో మన నిత్యజీవితానికి ఉపయోగపడే ఎన్నో నీతులు చెప్పబడినవి. అడుగడుగునా అవి మన ప్రవర్తనను తీర్చి దిద్దుతాయి. చంపదగిన శత్రువు చేతికి చిక్కినా కూడా చంపకుండా విడిచిపెడితే అది అతనికి తగిన శిక్ష అని, కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ఇలా ఎన్నో నీతులు బోధించాడు వేమన.

సుమతి శతకంలో ఎవరు చెప్పినా వినాలి కాని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని, కండబలం కంటే బుద్ధి బలం గొప్పది అని ఇలా ఎన్నో నీతులు బోధించాడు బద్దెన కవి.
సుభాషిత రత్నాలలో ఏనుగు లక్ష్మణ కవి విద్య యొక్క గొప్పదనాన్ని చెప్తూ, పవిత్రమైన వాణి పురుషుని సుభాషితుని చేస్తుందని, వాగ్భూషణమే సుభూషణం అని, మిగిలిన భూషణాలన్నీ నశిస్తాయని ప్రస్తావించాడు.

భాస్కర శతకంలో మారద వెంకయ్య కవి అనేక సూక్తులను వివరించాడు. దానం చేయాలి అనే సంకల్పం ఉంటే ఏదో ఒక విధంగా ప్రయత్నించి దానం చేస్తాడు అని, అర్థం చేసుకోకుండా చదివే చదువు ఎంత గొప్పదైనా వ్యర్థం అవుతుంది అని, గొప్పవారు తమ గురించి ఆలోచించకుండా ఇతరుల సుఖం కోసం ప్రయత్నిస్తారు అని ప్రస్తావించాడు. ముగింపు : ఇలా ఎందరో శతక కవులు ఎన్నో సూక్తులను మనకందించారు. వాటన్నిటినీ తెలుసుకుంటూ, ఆచరిస్తూ మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 8.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పతనాన్ని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు.
పరిచయం : నగర జీవితంతో పోలిస్తే పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పైరగాలులతో, పిల్లకాలువలతో భూలోక నందనవనంలా భాసించే పల్లెటూళ్ళు ప్రకృతి రమణీయతకూ సుఖసంతోషాలకూ పుట్టిళ్ళు.

పాడిపంటలు : పల్లెటూళ్ళలో పక్షుల కిలకిలా రావాలతో, కోడి కూతలతో తెల్లవారుతుంది. పాడిపంటలతో కళకళలాడే పల్లెలు పచ్చని పొలాలతో అలరారుతూ ఉంటాయి. ఆవులు, గేదెలు, ఎడ్లు మొదలైన పాడిపశువులతో; కోళ్ళు, కుక్కలు, పావురాళ్ళు వంటి పెంపుడు జంతువులు, పక్షులతో కలిసి మెలిసి ఉండే పల్లె ప్రజల జీవితం ఎంతో ఆహ్లాదంగా
గడిచిపోతుంది.

పల్లెసొగసులు: “అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం” అని ఒక కవి చెప్పినట్లు పల్లెల్లో ప్రకృతి సౌందర్యం పరమ రమణీయంగా ఉంటుంది. ఆయా ఋతువులలో పూచే గులాబి, బంతి, మందార వంటి రంగు రంగుల పువ్వులతో; విరగకాచే జామ, అరటి, మామిడి, పనస వంటి రకరకాల పళ్ళతోటలతో మనోహరంగా ఉంటాయి. కొబ్బరి తోటలు, చెరకు తోటలు ఉన్న పల్లెల సొగసులు వర్ణించడానికి మాటలు చాలవు. పిల్ల కాలువల హెుయలు, సెలయేళ్ళ గలగలలూ, కనులకు ఇంపుగా, వీనులకు సొంపుగా ఉంటాయి. కాలుష్యం లేని వాతావరణం, చక్కని గాలి, వెలుతురు, ప్రశాంత జీవనం పల్లెవాసుల సొంతం.

ముగింపు : ఈ విధంగా ప్రకృతి ఒడిలో సహజ సుందర దృశ్యాల నడుమ పల్లె జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి స్వచ్ఛమైన గాలులు, రంగురంగుల దృశ్య చిత్రాలూ ఆకలి దప్పులను మరిపిస్తాయి.

ప్రశ్న 9.
అవయవదానం విశిష్టత
జవాబు.
ఉపోద్ఘాతం : పుట్టుకతోనే అవయవలోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే.

విషయ విశ్లేషణ : మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు చేతులు తప్పనిసరి. ఇవేకాదు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవభాగాలు ముఖ్యమైనవే. రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్యమున్నదే.

కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తంవంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండడానికి మార్గం అవయవదానం.

తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందుకొస్తున్నారు. అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం.

అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరిని జీవించగలిగేట్లు చేశాయి.
ముగింపు : ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 10.
స్వచ్ఛ భారత్
జవాబు.
పరిచయం : వ్యక్తిగత శుభ్రత వ్యక్తి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, మన పరిసరాల పరిశుభ్రత సమాజ ఆరోగ్యానికీ అంతే ముఖ్యం.

దురదృష్టవశాత్తు మన దేశ ప్రజల్లో సరైన అవగాహనలేక వీధులు, పేటలు, గ్రామాలు, పట్టణాలు అన్నీ అపరిశు భ్రతకు చిరునామాగా తయారయ్యాయి. దీనివల్ల అనేక కాలుష్యాలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సురక్షిత మంచినీటి సౌకర్యాలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. దేశంలోని 120 కోట్ల జనాభాలో అధికశాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు.

పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్ళల్లోనే పారిశుద్ధ్య సమస్య ఎక్కువ. ఈ సమస్యవల్ల పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల పెనుప్రమాదంలో పడిపోతున్నాయి.

ఈ దుస్థితిని తొలగించేందుకు గ్రామ ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. 1986లోనే మనదేశంలో కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకం రూపుదిద్దుకున్నది. దానిని 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకంగా మార్చారు. తరువాత అదే పథకం ‘నిర్మల్ భారత్ అభియాన్’గా మారింది. ఇలా ఎన్ని పేర్లు మారినా, పాలకులు ఎంతమంది మారినా పరిస్థితి ఆశించినంత మెరుగుపడలేదు.

స్వచ్ఛభారత్కు గాంధీజీనే ఆదర్శం అంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని అక్టోబరు 2, 2014న దిల్లీలోని గాంధీసమాధి అయిన రాజాట్ నుంచి ప్రారంభించారు. నాటి నుంచి ఈ ఉద్యమంలో సామాన్యుడి నుంచి వివిధరంగాల్లో అగ్రశ్రేణిలో ఉన్న ప్రముఖులు ఎంతోమంది పాల్గొంటున్నారు. ఇంట్లో ఉన్న చెత్తను ఊడ్చి రోడ్డు మీద పోసి చేతులు దులుపుకోవడం కాకుండా మన ఇల్లు వంటిదే మన వీధికూడా, దానిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అనే స్ఫూర్తితో భారతీయులు అందరూ చేతులు కలుపుతున్నారు.

అనేక కారణాలవల్ల కలుషితమైపోయిన భారతీయుల పవిత్రనది గంగను ప్రక్షాళన చేయడానికి మనదేశం వేలకోట్లు వెచ్చిస్తున్నది. 2019 నాటికి స్వచ్ఛభారత్ కోసం 62 వేలకోట్లను మన ప్రభుత్వాలు ఖర్చు పెట్టబోతున్నాయి. ఈ ఖర్చును 3 : 1 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అంతేకాక స్వచ్ఛభారత్కు నిధుల సమీకరణకోసం ప్రత్యేకంగా 2 శాతం స్వచ్ఛభారత్ పన్ను విధిస్తున్నట్లు భారత ఆర్థికమంత్రి ప్రకటించారు కూడా. స్వచ్ఛభారతినిధిని ఏర్పాటు చేసి అందుకు ఇచ్చే విరాళాలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీ కూడా మంత్రి ప్రకటించారు. ముగింపు : ఎన్నో రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతున్న మనదేశం పరిశుభ్రతకు మారుపేరుగా రూపొంది అందరి ప్రశంసలూ పొందేరోజు ఎంతోదూరంలో లేదనడంలో సందేహం లేదు.

ప్రశ్న 11.
ఆరోగ్యమే మహాభాగ్యం
జవాబు.
పరిచయం : ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే స్థితి. మనిషి జీవన పోరాటంలో నిత్యం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాడు. బతుకుదెరువు కోసం రకరకాల అగచాట్లు పడతాడు. అట్లా కష్టపడే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే తాను కష్టపడి సాధించినదంతా ఆరోగ్య రక్షణకే వెచ్చించవలసి వస్తుంది. అందువల్లనే ఆరోగ్యాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు అంటారు పెద్దలు.

ఉద్దేశ్యం : ప్రాచీన కాలంలో మానవులు శరీరశ్రమ ఉన్న పనులే ఎక్కువ చేసేవారు. రాను రానూ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నకొద్దీ శరీరశ్రమ తగ్గిపోతున్నది. నిప్పుపుట్టించడానికి గంటల తరబడీ తిప్పలుబడ్డ దశ నుండి మీటనొక్కితే వేల ‘వాట్ ‘ల శక్తితో సెకన్లలో కొండలనైనా పిండిచేయగల యంత్రాలను కనిపెట్టే దశకు మనిషి ఎదిగాడు. రోజువారీ పనుల ద్వారా గానీ, వృత్తి ఉద్యోగాల ద్వారాగానీ తగిన వ్యాయామం శరీరానికి అందడంలేదు. మానవ శరీర నిర్మాణం ఒక అద్భుత వ్యవస్థ. శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే తిన్న అన్నం తేలికగా జీర్ణం అవుతుంది.

అంతేగాక పరిసరాల పరిశుభ్రత, శుచిగా ఉండడం, శుభ్రం చేసిన ఆహారాన్ని తీసుకోవడం మొదలైన అంశాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రోగం వచ్చాక నయం చేసుకొనే ప్రయత్నం చేసుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తలు పాటించడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరిశుభ్రత పాటించడం, మితాహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, భోజనం నిద్రలకు వేళలు పాటించడం మొదలైన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. మన వైద్య విధానం ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ముగింపు :
ఎంత సంపన్నుడైనా ఆరోగ్యం సరిగా లేకపోతే అతడూ పేదవాడే. ఎంత పేదవాడైనా ఆరోగ్యవంతుడైతే అతడు సంపన్నుడే. అందువల్లనే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి నిత్య సత్యం.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 12.
అవినీతి నిర్మూలన కర్తవ్యం
జవాబు.
ఉపోద్ఘాతం:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అన్ని రంగాల్లోనూ దేశం బాగా అభివృద్ధి చెందింది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావాల వల్ల కూడా మనదేశం పురోగమిస్తుంది. కాని దురదృష్టవశాత్తు అవినీతి కూడా పెచ్చు పెరిగింది. అక్రమ సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడం వల్ల అన్ని కోణాల్లోనూ అవినీతి విశృంఖల విహారం చేస్తున్నది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులలో అవినీతి జాడ్యం బాగా విస్తరించింది. చిన్న పంచాయితీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకూ అవినీతి ఆరోపణలకు గురి అవుతున్నారు.

రాజకీయ నాయకులు తమ పార్టీల నిధుల కోసం ఎంతటి అవినీతి పనులకు పాల్పడుతున్నారో మనం తెలుకుంటూనే ఉన్నాం. దేశ రక్షణశాఖకు సంబంధించిన ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో ఒక దేశ ప్రధానిపైనే ఆరోపణలు రావడం ఎంతో విచారకరం. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తల అక్రమ సంపాదనలు దేశ, విదేశీ బ్యాంకుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలుంటాయన్న వాస్తవం మనకు తెలిసిందే.

అన్ని రంగాల్లో అవినీతి :
అంతేగాదు, బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్న అధికారులు తమ స్వార్థసంకుచిత ప్రయోజనాల కోసం లంచాలు స్వీకరించడం పరిపాటి అయింది. నేడు ప్రజలు కూడా తమ పనులు త్వరగా ముగియడం కోసం అధికారులకు ముడుపులు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. చౌకధరల దుకాణాల్లో సరుకులను దాచి అక్రమ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విధంగా అవినీతి అన్ని రంగాల్లోనూ తాండవిస్తుంది.

అందరి కర్తవ్యం :
ఈ అవినీతిని అన్ని రంగాల్లోనూ అరికట్టడానికి అందరూ, ముఖ్యంగా విద్యార్థులు, యువత ముందుకు రావాలి. అవినీతి నిరోధక శాఖ మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అవినీతిపరులైన ఉద్యోగులను, అధికారులను, నాయకులను నిర్ధాక్షిణ్యంగా శిక్షించే విధంగా చట్టంలో మార్పులు రావాలి. అవినీతిపరులైన రాజకీయ నాయకులు ముఖ్య పదవులను నిర్వహించకుండా ఉండాలి. అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. ఉద్యోగుల్లో పనిపట్ల అంకితభావం పెరగాలి. లేకపోతే ఈ దేశం నైతికంగా పతనమౌతుంది.

“అవినీతిని దూరంచేయాలి – ప్రగతిని సాధించాలి”.

ప్రశ్న 13.
నదులు – ప్రయోజనాలు
జవాబు.
ఉపోద్ఘాతం :
సాధారణంగా నదులన్నీ పర్వతాలలో చిన్న సెలయేరులుగా పుట్టి ప్రవహించి దారిలో అనేక నీటి కాలువలను తనలో కలుపుకుంటూ రానురాను విస్తరించి మహానదులుగా ప్రవహిస్తాయి. మన దేశంలో నదులు ఎక్కువగా ఉన్నాయి. గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, కావేరి, యమున, తుంగభద్ర మొదలైనవి మన దేశమున గల ముఖ్యమైన నదులు. సాధారణంగా నదులన్నీ పశ్చిమం నుండి తూర్పునకు ప్రవహిస్తాయి.

నదులు – ఉపయోగాలు :
భారతదేశం వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల దేశం. ఈ దేశంలో ఎక్కువ భాగం వ్యవసాయం నదులందించు నీటిపై ఆధారపడియున్నది. నదీ ప్రవాహం కొంత దూరం ప్రయాణించిన తరువాత కొన్ని పాయలుగా చీలి డెల్టా నేలలను ఏర్పరుస్తున్నాయి. అందువల్ల నేడు మానవుడు ఆ నదీ ప్రవాహములపై ఆనకట్టలు కట్టి నీటిని వృధాగా సముద్రంలో కలువకుండా ఆపి ఆ నీటిని కాలువల ద్వారా సరఫరా చేసికొని లక్షల ఎకరాలలో పంట పండించుటకు ఉపయోగిస్తున్నాడు. అంతే కాక నీటినుండి విద్యుదుత్పత్తి కూడా చేసుకోగలుగుతున్నాడు. ఈ విధంగా నేడు నదీజలం త్రాగునీటి నివ్వటమే గాక, పంటలు పండించుటకు, విద్యుదుత్పత్తికి కూడా ఉపయోగపడుచున్నది.

పూర్వము ప్రవహించు నదులను పుణ్యతీర్థములుగా భావించెడివారు. అందులో స్నానం చేసిన వారి పాపములు తొలగిపోవునను నమ్మకము కలిగియుండుటచే స్థానికులే కాక దూరప్రాంతముల నుండి కూడా యాత్రికులు వచ్చి నదులలో స్నానం చేసేవారు. ప్రవాహజలం ఆరోగ్యప్రదంగా ఉండేది. పూర్వం నదులను సరకుల రవాణాకు రహదారులుగా కూడా ఉపయోగించుకునేవారు.

ముగింపు :
ఇలా బహుళ ప్రయోజనములను కలిగించు నదులకు వరదలు వచ్చినచో సమీప ప్రాంతాలకు నష్టం కలుగుతుంది. కనుక తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 14.
పరిసరాల పరిశుభ్రత
జవాబు.
ఉపోద్ఘాతం :
మన చుట్టూ ఉన్న చెట్టు, చేమ, గాలి, వెలుతురు, నీరు వగైరాలే పరిసరాలు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంవల్లే మనం ఆరోగ్యంగా బతకగలం. నీరు ప్రాణధారణకు, దాహాన్ని తీర్చటానికి, పంటలు పండటానికి ఉపయోగపడుతోంది. చెట్లు శుభ్రమైన గాలినిస్తూ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి.

కాలుష్యాలు – నష్టాలు :
రాను రాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజువల్లను మన పరిసరాలను మనమే పాడుచేసుకుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి వాతావరణం కాలుష్యంతో నిండిపోతోంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కలిగించేలా దురదృష్టకర మార్పులు ఏర్పడుతున్నాయి. అడవులను నరికివేయటం వల్ల వరదలేర్పడి జననష్టం, పంటనష్టం ఏర్పడుతోంది.

పరిసరాల పరిశుభ్రతకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు తీవ్రచర్యలు తీసుకుంటున్నాయి.

ప్రజల కర్తవ్యం :
ఇళ్ళలోని చెత్తను ఇంటిముందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకుని అందులో పారవేయాలి. కుళాయిలవద్ద, మురికి కాల్వలవద్ద చెత్తనిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా, టైఫాయిడ్ వ్యాప్తిచేసే రోగకారకమైన దోమలు విజృంభించకుండా డి.డి.టి. వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడల వాసులకు శుభ్రత గూర్చి తెలియచేయాలి. చెట్లను నాటాలి. పారిశుద్ధ్య కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. గాలి, వెలుతురులు వచ్చేలా ఇళ్ళు నిర్మించుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరం ఉద్యమించాలి.

ప్రశ్న 15.
ఉగ్రవాదం – దుష్ఫలితాలు
జవాబు.
ఉపోద్ఘాతం: మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఎదుటివాళ్ళ మీద బలప్రయోగం చేయడం, భయోత్పాతం పుట్టించడం, చంపడం వంటి చర్యలతో తమ కోరికల్ని, ఆశయాల్ని లక్ష్యాల్ని సాధించటమే ‘ఉగ్రవాదం’ అని చెప్పవచ్చు. ఉగ్రవాదం నేడు మనదేశంలో అన్ని మూలలా విస్తరిస్తోంది. ఒక ముఠా, ఒక సంఘం, ఒక వర్గం సాయుధ పోరాటానికి దిగడం అధికమైపోయింది.

దుశ్చర్యలు : ఉగ్రవాదులు ఆధునిక మారణాయుధాలను, తుపాకులను, చేతిబాంబులను, డైనమైట్లను, విష రసాయనాలను, రకరకాల వాహనాలను సమకూర్చుకుని రహస్య స్థావరాల్లో ఉండి, తమ లక్ష్యసాధనలో అడ్డంగా నిలిచే వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. నేడు ఉగ్రవాదులు రహస్య స్థావరాల్లో సైనిక శిక్షణ కూడా పొందుతున్నారు. మన దేశంలో ఉగ్రవాదం ఈ రకంగా పెరిగిదంటే దానికి ప్రధాన కారణం మన పొరుగున ఉన్న మతోన్మాద దేశాలు. ఈ దేశాలు ఉగ్రవాదులకు అన్ని రకాలుగా సహకరిస్తూ, మరొక పక్క శాంతి వచనాలను పలకటం వింతగా తోస్తుంది. తమను ఎదిరించిన వారిని చంపటం, ప్రతీకార చర్యలకు పాల్పడటం ఉగ్రవాదుల ఉన్మాదచర్యలుగా రూపుదాలుస్తున్నాయి.

ప్రభుత్వ – ప్రజల కర్తవ్యం : మిజోరంలో, పంజాబులో, అసోంలో నిత్యం ఉగ్రవాదుల కిరాతక చర్యలు సాగుతున్నాయి. హైదరాబాదు, ముంబయి, బెంగుళూరులో జరిగిన బాంబు పేలుళ్ళ ఘటనలు ఉగ్రవాదుల దుశ్చర్యలే. మన పార్లమెంటు మీద కూడా దాడి చేసి నాయకులను హతమార్చటానికి ప్రయత్నించడం సిగ్గుచేటు, ఛత్తీస్ ఘడ్లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగానే ఉంది. వారు తమ లక్ష్యసాధన కోసం ఎంతోమంది అమాయక ప్రజలను, అధికారులను బలి తీసుకుంటున్నారు.

నేడు ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద దుష్ఫలితాల్ని గ్రహించి బందోబస్తు చర్యలు తీవ్రతరం చేస్తున్నాయి. మన భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదంపై ఉక్కుపాదాన్ని మోపాలని ఆశిస్తోంది. ప్రపంచ దేశాల పరస్పర సహకారం పెంపొంది త్వరలో ఉగ్రవాదం తెరమరుగు కాగలదన్న ఆశ చిగురుతోంది.

“ఉగ్రవాదాన్ని నిర్మూలించు – దేశాన్ని ప్రగతి పథంలో నడిపించు”

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 16.
జనాభా సమస్య
జవాబు.

ఈనాటి భారతదేశం సమస్యల విషవలయం. వాటిలో ప్రధానమైనది జనాభా సమస్య. ఇది అన్ని సమస్యలకు మూలం. అన్ని అనర్థాలకు ప్రధాన కారణం.

ఈ జనాభా సమస్య ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఉంది. కానీ మన దేశంలో ఈ సమస్య విపరీతంగా ఉంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశాలలో మనదేశం రెండవది. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ జనాభా సుమారు నలభై కోట్లు. ఈనాడు దేశ జనాభా సుమారు నూట ఇరవై ఒక్క కోట్లకు చేరుకొన్నది. మనం వైద్య రంగంలో సాధించిన ప్రగతికి ఫలితంగా మరణాల సంఖ్య తగ్గిపోయింది. జననాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. మరియు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో నుండి లక్షలాది మంది కాందిశీకులు మనదేశానికి రావడంతో జనాభా సమస్య మరింత విషమించింది.

ఈ జనాభా సమస్య వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్య వంటి క్లిష్ట పరిస్థితులెన్నో దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. దేశంలో కోట్లాదిమంది ప్రజలు కడుపునిండా రోజుకు ఒక్కపూటయినా అన్నం దొరకని దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దారిద్ర్యం వారిని పట్టిపీడిస్తున్నది.

స్వాతంత్ర్యానంతరం మనదేశం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తున్నాం. ఎన్నో ప్రణాళికలను చేపడుతున్నాం. ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. పంటలు సమృద్ధిగా పండిస్తున్నాం. అయినా ఆహార సమస్యను పరిష్కరించ లేకపోతున్నాం. ఎన్ని ఉద్యోగాలు కల్పించినా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక పోతున్నాం. దానికి కారణం జనాభా పెరుగుదల.

ఈ విషయాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ దేశాధినేతలు జనాభా పెరుగుదలను అదుపు చేయడానికి ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించాలని, తద్వారా పరిమిత కుటుంబాలు, చింతలు లేని కుటుంబాలు కావాలని చాటి చెప్పారు. ప్రతిపౌరునకు పరిమిత కుటుంబ అవసరం తెలియాలి. పరిమిత కుటుంబాన్ని కలిగియుండాలి.
కాబట్టి ప్రజలు మూఢనమ్మకాలను వదిలి జనాభా పెరుగుదలను అరికట్టి ప్రభుత్వానికి సహకరించినప్పుడే, ఈ దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా విరాజిల్లుతుంది.

ప్రశ్న 17.
విద్యార్థులు – సంఘసేవ
జవాబు.
ఉపోద్ఘాతం : విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండవలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకొని రాగలరు.

సంఘ సేవలో విద్యార్థుల విధులు – పాత్ర : విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలలయందు జాతీయ సేవా పథకం (N.S.S) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహవంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చు. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.

విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవ చేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అక్కడి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.

ముగింపు : ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.

“దేశ సేవ కంటే దేవతార్చన లేదు. సానుభూతికంటే స్వర్గంబు లేదు”. – కరుణశ్రీ

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 18.
ప్రపంచ శాంతి
జవాబు.
ఉపోద్ఘాతం : శాంతి అంటే “ఓర్పు” అని అర్థం. ప్రపంచంలో అనేకచోట్ల ప్రజలు ప్రకృతి వైపరీత్యాలవల్ల, అలజడుల వల్ల, ఉగ్రవాదం వల్ల అల్లకల్లోల పరిస్థితుల్లో కూడు, గూడు, గుడ్డ కోల్పోయి విలవిలలాడుతున్నారు. భూమిపై ఉన్న ఈ ప్రాణాలు ఇలాంటి కష్టనష్టాలు పాలు కాకుండా సుఖసంతోషంగా జీవించడమే ప్రపంచశాంతి.

విషయ వివరణ : ప్రకృతి వైపరీత్యాలను ముందుగా ఊహించి, నివారించడానికి శాస్త్రజ్ఞులు ఒకప్రక్క కృషిచేస్తున్నారు. మరొకప్రక్క శాస్త్ర విజ్ఞానాన్ని అణ్వస్త్రాలుగా మార్చి మరియు మారణాయుధాలతో ఉగ్రవాదం మొదలైన అహంకారధోరణులతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా సంభవించినవే రెండు ప్రపంచ యుద్ధాలు, వాటివల్ల ఎన్నో దేశాలు, ప్రజలు, సంపద నశించి పోవడం జరిగింది. కోలుకునేందుకు ఎంతో సమయం పట్టింది.

మానవతా ధోరణి పెరగలవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచశాంతి సాధనకై నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించి, ప్రపంచశాంతికై అహరహం పాటుబడడం జరిగింది. శ్రీలంక తమిళుల సమస్య, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు పలుదేశాల శాంతికి విఘాతం కల్గిస్తున్నాయి. వీటిని నివారించాలి.

ప్రపంచశాంతి సాధన ప్రయత్నాలు :
అగ్రరాజ్యాలు వగైరా అన్ని రాజ్యాలవారు అణ్వాయుధాలను విసర్జించాలి. అణు పరిజ్ఞానాన్ని అభివృద్ధికే వినియోగించాలి. శాంతి, సౌభాగ్యం ప్రాతిపదికగా అన్ని దేశాలు ముందుగా సాగాలి. అందరిలో విశ్వమానవ సౌభ్రాతృత్వ భావం పెంపొందే ప్రయత్నం సాగాలి. అహంకార ధోరణులు విసర్జించాలి. రెండు ప్రపంచ యుద్ధాలు కల్గించిన నష్టాలను పరిగణనలోనికి తీసుకొని, మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే మానవ మనుగడయే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది.

పట్టు విడుపులు ప్రదర్శించి, అగ్ర రాజ్యాలు, వర్థమాన రాజ్యాలు మానవతా విలువలు ప్రదర్శించడానికి ముందుకు సాగితే ప్రపంచశాంతి అలవోకగా సాధ్యమవుతుంది. ప్రపంచశాంతి అవశ్యకత పాఠశాల స్థాయినుండే బాల్య హృదయాలలో నిలచిపోయే పాఠ్యాంశాలు తీసుకొని రావాలి. అప్పుడే శాస్త్రవిజ్ఞాన అభివృద్ధి ఫలాలు మానవాళికి అందుతాయి.

ప్రశ్న 19.
కంప్యూటర్
జవాబు.
ఉపోద్ఘాతం:
ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి నిలువుటద్దంగా నిలిచింది కంప్యూటర్ అనబడే గణనయంత్రం. గణనను అతివేగంగా నిర్వహించే ఎలక్ట్రానిక్ సాధనం కంప్యూటర్.
పనినిబట్టి, అవసరాన్ని బట్టి ఒక్కొక్క కంప్యూటర్ను ఒక్కొక్క విధంగా తయారుచేస్తారు. వాటిలోని యాంత్రిక వ్యవస్థ వేరువేరుగా ఉంటుంది.

భాగాలు : 1) కంట్రోల్ యూనిట్, 2) ఇమీడియట్ యాక్షన్ స్టోర్, 3) అర్థమెటిక్ యూనిట్ మరియు 4) రిజిస్టర్స్. ఈ నాలుగు భాగాలను కలిపి “సెంట్రల్ కంట్రోలింగ్ యూనిట్” అంటారు.

ఇన్పుట్ యూనిట్, బ్యాంకింగ్ స్టోర్, ఔట్పుట్ యూనిట్ అనేవి కంప్యూటర్లోని ఇతర ముఖ్య భాగాలు. వివిధ కోర్సులు : పాస్కల్, కోబాల్, ఒరాకిల్, జావా, సి,సి + + మొదలగు అభివృద్ధి చెందే కోర్సులు ఎన్నో వచ్చాయి.

ఉపయోగాలు :
కూడిక, తీసివేత, భాగహారం వంటి మౌళిక అంకగణిత ప్రక్రియలను, విలువలను పోల్చడం వంటి పనులను కంప్యూటర్ సులభంగా చేస్తుంది. అపరిమితమైన దత్తాంశ వివరాలను అవసరమైనపుడు వాడుకోవడానికి వీలుగా భద్రపరచి ఉంచుతుంది. నేడు వీటిని వాడని రంగం లేదు. అకౌంట్ల నిర్వహణ, జీతాల మదింపు, ఇతర అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇది చేతి వ్రాతలను యథాతథంగా సృష్టిస్తుంది. కర్మాగారాలలో యంత్రాల పనిని సమన్వయపరుస్తుంది. వీటి వాడకం వలన శ్రామిక శక్తి వినియోగం తగ్గిపోతుంది.

తప్పులు, ఆలస్యాలకు అవకాశం ఉండదు. నాణ్యత పెరుగుతుంది. అమెరికా వంటి దేశాలలో కంప్యూటర్ల ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. వైద్యరంగంలో నేడు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మామూలు ఎక్స్రేలో చూడలేని శరీర భాగాల్ని కంప్యూటర్నుపయోగించి స్కానింగ్ పద్ధతి ద్వారా వైద్యులు పరిశీలించగలరు.

సూచనలు :
కంప్యూటర్ టెక్నాలజి నిపుణులు దేశీయ వనరులతో చక్కటి కంప్యూటర్ నిర్మాణానికి దీక్ష వహించాలి. కంప్యూటర్లలో వాడే పరికరాల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.

ముగింపు :
కంప్యూటర్ లేని జీవితాన్ని నేడు ఊహించలేము. కావున కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రతి విద్యార్థి కంప్యూటర్ జ్ఞానం కచ్చితంగా పొందాలి. సమాచార విప్లవానికి వెన్నెముకగా నిలుస్తున్న కంప్యూటర్ విద్యను అభ్యసించి మనమందరం అభివృద్ధి సాధించాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 20.
మతసామరస్యం
జవాబు.
ఉపోద్ఘాతం : సమాజంలోని మానవులకు మతం పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మత ప్రభావం ప్రతి వ్యక్తిపై పుట్టుక నుండి మరణించేంత వరకూ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలో ఎవరి మతం వారికి గొప్పగా కనిపిస్తుంది. ఒకప్పుడు సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి ‘మతాన్ని’ మన పెద్దలు ప్రవేశపెట్టారు.

వివిధ మతాలు : మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. హిందూ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధం, సిక్కు మొదలైన మతాలను ప్రముఖంగా చెప్పవచ్చు. ఇంకా ఎన్నో మతాలు ఉన్నాయి.

పరమార్థం-లక్ష్యాలు : ప్రపంచంలో మతాలు ఎన్ని ఉన్నా అవన్నీ ధర్మాన్ని, సత్యాన్ని, అహింసనూ, విశ్వప్రేమనూ బోధిస్తుంటాయి. అయితే ఆయా మతాల ఆచార వ్యవహారాల్లో మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. దేశంలో ఎన్నో మతాల వారు జీవిస్తున్నారు. అయినా వారందరూ ఐకమత్యంగానే జీవిస్తున్నారు. సహజీవనాన్ని సాగిస్తున్నారు. ఇందువల్లే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం భాసిల్లింది. మనదేశం లౌకికవాదానికి కట్టుబడి ఉంది. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. ప్రభుత్వం ఏ మతాన్ని ప్రచారం చేయదు.

మతకలహాలు : రాను రాను దేశంలోను, ప్రపంచంలోను పాలకుల్లో స్వార్థచింతన బాగా పెరిగింది. లౌకికవాదం నేతిబీరకాయ వంటిదిగా తయారైంది. మతానికి రాజకీయరంగు పులుముతున్నారు. మతం పేరుతో పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి. నాయకులు మతప్రమేయంతో యాత్రలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. కొన్ని సందర్భాలలో మనదేశంలో ఎన్నో మతకలహాలు ఏర్పడ్డాయి. “బాబ్రీమసీదు విధ్వంసం” జరిగి ఇంతకాలమైనా దాని తీవ్రపరిణామాలు ఇంకా చల్లారలేదు. గుజరాత్లో కూడా మతకలహాలు జరిగాయి. మారణహోమం జరిగింది. కొంతమంది మతఛాందసులు దేశంలో మతం పేరుతో ప్రజలమధ్య చిచ్చుపెడుతున్నారు.

నివారణ చర్యలు : ప్రభుత్వాలు మతసామరస్యానికి తీవ్రంగా కృషిచేయాలి. మతాలమధ్య చిచ్చు పెట్టేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలి. మతాలమధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. ప్రజలు కూడా మతం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. రెచ్చగొట్టే చర్యలకు లోనుకాకూడదు. అరాచకశక్తులను అణచివేసే విధంగా చట్టాలు ఉండాలి. మతసామరస్యంతో అందరూ కలసి మెలసి జీవితాన్ని అలవరచుకోవాలి.

Leave a Comment