TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download కరపత్రాలు / నినాదాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 1.
నగర, గ్రామాలలో కాలుష్య నివారణను పోగొట్టి స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలంటే ప్రజల బాధ్యత ఏమిటో తెలియజేస్తూ “కరపత్రం” తయారు చేయండి.
జవాబు.

కాలుష్య నివారణ – మనందరి బాధ్యత

  1. నేడు ఎక్కడ చూసినా మురికి, కాలుష్యం నాట్యం చేస్తున్నాయి.
  2. నా ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలు, వీధులు, ఊరూ ఎట్లా ఉంటే నాకేమిటి అనే ధోరణి పెరిగిపోతోంది.
  3. మన ఇంటినే కాదు మన వీథిని, మన ఊరును / పల్లెను శుభ్రంగా ఉంచుకోకపోతే రోగాలబారిన పడేది మనమే.

కాలుష్య నివారణకు నేడే నడుం బిగిద్దాం

  • ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. నేలలో త్వరగా కలిసిపోయే నార, కొబ్బరి వంటి వాటితో చేసే వస్తువులు వినియోగిద్దాం.
  • వీలైనంతవరకు నడక ద్వారాను లేదా సైకిలు ఉపయోగించడం ద్వారాను పెట్రోలు, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గిద్దాం.
  • పర్యావరణ హానికరం కాని వ్యర్థాలను, పర్యావరణానికి హానిచేసే వ్యర్థాలను విడివిడి డబ్బాలు / బుట్టలతో నిల్వచేసి, మున్సిపల్ సిబ్బందికి అందచేద్దాం.
  • హానికర రసాయనాలతో తయారయ్యే సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు, షాంపూలు వంటి వాటిని ఉపయోగించడం తగ్గించుకుందాం.
  • చెట్లను పెంచుదాం. ఉన్న చెట్లను కొట్టి వేయకుండా కాపాడుదాం.
  • రోడ్ల ప్రక్కన, ఆరు బయలు ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన మానివేద్దాం.
  • మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం మున్సిపల్ కార్మికుల బాధ్యతేకాదు. మనందరి బాధ్యత.
  • వారంలో ఒకసారి మన వీథుల్ని మనమే శుభ్రం చేసుకుందాం. ‘స్వచ్ఛభారత్’ ఉద్యమాన్ని ముందుకు తీసికెళదాం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 2.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు.

నీరు – పొదుపు

మిత్రులారా!

‘నీరే ప్రాణాధారం’ – అనే సంగతి అందరికీ తెలిసిందే. తాగేందుకు మాత్రమే కాక మన దినసరి కార్యక్రమాల్లో ఎన్నో పనులకు నీరు అవసరం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నీటి లభ్యత క్రమక్రమంగా తగ్గిపోతోంది.

భూమిపైన జనాభా పెరగటంతో నీటి వాడుక పెరిగిపోతోంది. ఇదివరకటి కంటె ఇప్పుడు ఇళ్ళలో నీటికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటం సులభమయింది. మోటార్ల సహాయంతో ఇంట్లో ప్రతిచోటా పంపులు ఏర్పాటు చేసుకొంటున్నారు. దీనితో అవసరానికి మించిన వాడకం జరుగుతోంది. ఇది ఇలాగే జరిగితే భావితరాలవారికి నీరే మిగలదు. కాబట్టి ప్రతీవారు నీటిని అవసరమైనంతవరకే వాడాలి. నీటి పంపులను వృథాగా వదిలెయ్యకూడదు. పిల్లలు అవసరమైనంతవరకే నీరు వాడేలా చూడాలి. ఇంట్లో వాడిన నీరు భూమిలోకి ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుని నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.

మీరు నీటిని అవసరమైనంతవరకే వాడుతూ ప్రతివారికీ ఈ విషయం చెప్పి తెలిసేలా చేయండి. నీటిని పొదుపు చేసేలా చూడండి.

ఇట్లు
జలరక్షక మండలి సభ్యులు

ప్రశ్న 3.
‘వందేమాతరానికి వందేళ్ళు” పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు.
వందేమాతరానికి వందేళ్ళు

మిత్రులారా !

ప్రపంచంలో మిగతాదేశాలు నాగరికత నేర్వకముందే వేదవిజ్ఞానం ద్వారా మనదేశం సర్వతో ముఖాభివృద్ధి చెందింది. ఎంతోమంది చక్రవర్తులు మనదేశాన్ని ప్రజానురంజకంగా పరిపాలించారు. అలాంటి మనదేశానికి వర్తకం పేరుతో వచ్చిన బ్రిటిష్వారు మనరాజుల మధ్య తగవులు పెట్టి మనదేశాన్ని హస్తగతం చేసుకున్నారు. పరిపాలన వారిదైంది. వారి నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించేందుకు మన నాయకులు వంద సంవత్సరాలు (1857 నుండి) పోరాడాల్సి వచ్చింది. గాంధీజీ నాయకత్వంలో అహింసా పద్ధతిలో పోరాటం చేసి మనం స్వాతంత్ర్యం దక్కించుకున్నాం.

ఆ సమయంలో ఎందరో కవులు ప్రజలకు ఉత్తేజం కలిగేలా, దేశభక్తి రగుల్కొనేలా ఎన్నో గీతాలు రాశారు. ఆ సమయంలో బంకించంద్ర ఛటర్జీ రాసిందే వందేమాతరం గీతం. అప్పట్లో ఆ గీతం మనదేశంలో నింపిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ‘వందేమాతరం’ అనేది నినాదంగా మారి ప్రజల కంఠాల్లో మారుమ్రోగి బ్రిటీష్వాళ్ళని తరిమేసేందుకు స్ఫూర్తినిచ్చింది. అలాంటి వందేమాతరం గీతం రాయబడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో ఉ త్సవాలు జరుగుతున్నాయి. మనందరం కూడా మన ఊళ్ళో ఉత్సవాలు చేద్దాం. ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుందాం. మరొక్కమారు స్ఫూర్తిని పొందుదాం.

గొంతెత్తి నినదిద్దాం, వందేమాతరం అని,
రండి, తరలిరండి, అందరూ రండి. కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి.

ఇట్లు,
ఐక్యప్రజావేదిక.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 4.
మనదేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడడానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారు చేసి ప్రదర్శించండి.
జవాబు.

భారతీయ విలువలు కాపాడుకుందాం !

మిత్రులారా !

అఖండ సౌభాగ్య సంపదలు కలిగినది మన భారతదేశం. శాంతికి నిలయం. సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం. ప్రపంచానికే తలమానికం. మహాత్ముడు నేర్పిన అహింసను తప్పక పాటించాం. అన్నదమ్ములమన్న మధుర భావంతో జీవించాం.

ఇప్పుడు జాతి, కుల, మత వివక్షలు మనలను పిశాచాల్లాగా పీడిస్తున్నాయి. అవినీతి, లంచగొండితనం సమాజంలో వేళ్ళూనుకుపోయాయి. ఈ సామాజిక రుగ్మతలను (రోగాలను) తొలగించి ప్రజలలో మానవత్వపు విలువలను కాపాడడానికి మనమందరం చేయి చేయి కలిపి ముందడుగు వేద్దాం.

మిత్రులారా ! కలిసి రండి.

యువ మిత్ర మండలి,
మహబూబ్ నగర్.

ప్రశ్న 5.
బహుళ ప్రయోజనాలను చేకూర్చే నదుల ప్రాముఖ్యం వివరిస్తూ, ఆ నదులు కాలుష్యం బారిన పడకుండా చూడడానికి ప్రజలను చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు.

నదులను కాపాడుకుందాం !

ప్రజలారా !

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో నదులతో భారతదేశం పవిత్రమవుతోంది. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగ, భద్ర మొదలైన నదులున్నాయి. నదులకు మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నది.

నదుల మీద కడుతున్న ఆనకట్టలతో, నీటిని నిల్వచేసి వ్యవసాయానికి నీరు అందించుకోగలుగుతున్నాం. నదుల్లో చేపల వంటి విలువైన జలసంపదను పెంచుకోగలుగుతున్నాం. విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. కానీ మన స్వార్థంతో నేడు మనకు ప్రాణాధారమైన నదులను కలుషితం చేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాం. ఇక మీద పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి కలపకుండా చూడాలి.

నదుల్లో మల, మూత్రాదులను వదిలి కలుషితం చేస్తున్నాం. మల, మూత్రాదులను నదుల్లో కలపకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
పశువులను, బట్టలను నదులలో కడగడం, ఉతకడం వంటి నదులను కలుషితం చేసే పనులను ఆపాలి.

ఇకనైనా చైతన్యవంతులమవుదాం. నదుల కాలుష్యాన్ని అరికడదాం.
రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 6.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వదాన్యులకు ఒక ‘కరపత్రం’ ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు.

మనవి

మనదేశంలో ఎంతోమంది అనాథలైన బాలబాలికలు, ముసలివారు, పేదవాళ్ళు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం లోతుగా పరిశీలించి, హృదయం కరిగిపోయి, బాగా డబ్బున్న ఒక యువకుడు ఎంతో ఉన్నత విద్యను అభ్యసించినవాడే. తన వాటాకు వచ్చిన 50 ఎకరాల పొలంలో అనాథశరణాలయాన్ని, వృద్ధాశ్రమాన్ని స్థాపించాడు. అనాథలైన బాలబాలికలను, వృద్ధులను, పేదవారిని చేరదీసి వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగిస్తూ పోషిస్తున్నాడు. ఇటువంటి బరువు మోయడం, ఒక్కరివల్ల అయ్యే పనికాదు. “గడ్డిపరకలు అన్నీ కలిసి పెద్దతాడై ఏనుగును” కూడా బంధించవచ్చు. మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది. అటువంటి వారిని మనకు తోచిన విధంగా ఆదుకోవడం మన కర్తవ్యం. మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ యువకుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవడమే కాదు తమవంతు సహాయాన్ని కూడా అందిస్తున్నారు.

నేను ఈ మధ్య అక్కడకు వెళ్ళాను. అక్కడున్న బాలబాలికలను, వృద్ధులను, పేదవారిని చూశాను. నా హృదయం కరిగి పోయింది. బాధతో నిండిపోయింది. నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఆశ కలిగింది. – “భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు” అని మనం ప్రతిరోజూ పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం.

కాబట్టి మనం కూడా మన పాఠశాల విద్యార్థుల పక్షాన కొంత డబ్బును, దుస్తులను, దుప్పట్లను, సబ్బులను, తలనూనెను, ఇంకా ఇతరములైన వస్తువులను సేకరించి వారికి అందించుదాం. మనం కూడా సమాజసేవలో పాలుపంచుకొందాం. సమాజ శ్రేయస్సే మన శ్రేయస్సు.

నేను ప్రేమతో వ్రాసిన ‘కరపత్రాన్ని’ చదివి బాలబాలికలేగాక, ధనవంతులు, ప్రముఖ వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందించగలరని ప్రార్థించుచున్నాను.

“తోటి వారికి చేయూతనిద్దాం. మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం”
పేదరికంలేని సమాజాన్ని స్థాపిద్దాం.

ప్రశ్న 7.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారు చేయండి.
జవాబు.

శాంతి

స్నేహితులారా!

శాంతి అందమైన, ప్రశాంతమైన, ప్రకాశవంతమైన చల్లని తెల్లని కాంతులు విరజిమ్మే పండువెన్నెల వంటిది. అనంతమైన నీలాకాశంలో నిర్భయంగా రెక్కలు పరచుకొని ఎగిరే తెల్లపావురం వంటిది. ‘తనశాంతమె తనకు రక్ష’ అని సుమతీ శతకంలో చెప్పారు.

విరోధం మంచిదికాదు. విరోధం పెరిగినపుడు అన్నీ ప్రమాదాలే. పాము విషజంతువు. అది కాటువేస్తే ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఎవరైనా పాము వద్దకు వెళతారా? విరోధం కూడా పాములాంటిదే. అందుకే ఎవరితోనూ విరోధం పెంచుకోకండి.

స్నేహం, సోదరభావం పెంచుకుందాం. అందరం కలిసి మెలిసి శాంతియుతంగా జీవిద్దాం. జీవితాలు సుఖమయం చేసుకుందాం.

రండి. అందరూ శాంతిని పాటించండి.

శాంతి మిత్ర మండలి,
గాంధీనగర్,
కొత్తగూడెం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 8.
వరకట్నానికి రోజూ ఎంతోమంది బలైపోతున్నారు. వీటిని గురించి పత్రికల్లో, టీ.వి.ల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “కరపత్రం” తయారు చేయండి.
జవాబు.

వరకట్నం – ఒక పెనుభూతం

యువతీయువకులారా ! మేల్కొనండి. వరకట్న పిశాచాన్ని తరిమి కొట్టండి. ఈనాడు వరకట్నం యువతులపాలిట జీవన్మరణ సమస్య అయింది. ఈ సమస్యకు ఎంతోమంది స్త్రీలు బలైపోతున్నారు. ఆ విధంగా బలైన ఆడపడుచు మన అక్కగాని, చెల్లిగాని అయితే మన గుండెలు ఎంత ఆక్రోశిస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ భయంకరమైన దురాచారాన్ని రూపుమాపకపోతే ఎంతో విజ్ఞానాన్ని సాధించినా మానవజాతికే సిగ్గుచేటు. మనం సంతలోని పశువులం కాదు. “చదువులేని వాడిని వింతపశువు” అన్నారు. చదువుకున్నవారు వెఱపశువులు కాకూడదు. వివాహం అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో, పురుషులకూ అంతే ముఖ్యం. వివాహం స్త్రీ, పురుషుల పవిత్రబంధం. ఆడంబరాలకు పోవద్దు. నిరాడంబరంగా పెండ్లి చేసుకోండి. “కట్నం వద్దు, కన్యయే ముఖ్యం” అని భావించండి.

సంస్కారవంతమైన విద్య నేర్వండి.
సాంఘిక దురాచారమైన “వరకట్న సమస్య” కు సమాధికట్టండి.

ప్రశ్న 9.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు.

మహిళలపై వివక్ష ఇంకానా? – ఇకపై సాగదు

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించిందని ప్రతిదినం మనం అనుకునే మాటల్లో ఒకటి. అభివృద్ధి అంటే కేవలం సాంకేతికంగానే కాదు. విలువలతో కూడిన అభివృద్ధి కావాలి. దేశ జనాభాలో సగం మంది స్త్రీలున్నారు. సమాజాభివృద్ధిలో స్త్రీలది కీలకమైన పాత్ర. ఎంత చదువుకున్నా నేటికీ స్త్రీలు ఇంటా బయటా కూడా వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు.

ఈనాడు స్త్రీలపై జరుగుతున్న దాడులు సభ్యసమాజానికే సిగ్గుచేటుగా ఉన్నాయి. ఎంతోకాలంగా ఈ దాడులు జరుగుతున్నాయి. మహిళాసంఘాలు, ప్రభుత్వాలు, యువకులు దీనిని ఖండిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. దేశరాజధాని నడిరోడ్డులో నిర్భయపై జరిగిన అత్యాచారంగానీ, నిన్నగాకమొన్న ముంబాయిలో అనూహ్యపైన జరిగిన అత్యాచారంగానీ చూస్తుంటే ప్రపంచం ముందు భారతదేశం సిగ్గుతో తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇటువంటి సంఘటనలు చూసి స్త్రీ సమాజం భయపడాల్సిన అవసరం లేదు. నేడు స్త్రీలు ఉన్నత విద్యను చదువుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నారు. రాజకీయంగా ఎదిగారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, హెూంమినిష్టర్లు, కలెక్టర్లు, డాక్టర్లు ఇలా ఎన్నోరంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. మహిళల్లో చైతన్యం రావాలి. చట్టాలు తీసుకురావాలి. వాటిని గట్టిగా అమలుపరచాలి. చట్టాలు చేయడంలో స్త్రీల భాగస్వామ్యం ఉండాలి.

ఎందరో స్త్రీలు లాయర్లుగా, న్యాయమూర్తులుగా కూడా ఉన్నారు. ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. వీరంతా కూడా సంఘాలుగా ఏర్పడి మహిళాలోకానికి ధైర్యం చెప్పాలి. పురుషులు కూడా మహిళలకు ధైర్యాన్ని కలుగజేయాలి. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలిగానీ, అధైర్యపడి ఎదుటివాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు.

మహిళలపై దాడులను ఖండిద్దాం. మహిళలపై వివక్షను ఎదిరిద్దాం.
మహిళల్లారా! మేల్కొనండి. ధైర్యంతో ముందడుగు వేయండి.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 10.
మన పరిసరాల్లో జీవించే పశు పక్ష్యాదుల పట్ల మనం ఏ విధంగా మసలు కోవాలో తెలుపుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు.

కరపత్రం

ప్రియమైన స్నేహితులారా !

మనం సంఘజీవులం. మనతోబాటు సమాజంలో ఎన్నో ఇతర ప్రాణులు కూడా జీవిస్తున్నాయి. ఆ ప్రాణులకు కూడా సుఖం, దుఃఖం, బాధ, ప్రేమ వంటి భావాలు ఉంటాయి. వాటికీ, మనకూ ప్రధానమైన భేదమల్లా మనం మాట్లాడగలం. అవి మాట్లాడలేవు. అంతే.

అటువంటిది మనం ఆ మూగజీవాలను పట్టించుకోకపోవటం అమానుషం. మన సంతోషం కోసం, సుఖం కోసం వాటిని బలితీసుకోవడం రాక్షసత్వం. జీవహింస చెయ్యొద్దు. మనలో కొంతమంది రకరకాల జంతువుల్ని పక్షుల్ని తెచ్చి సరదా కోసం ఇంట్లో బంధించి పెంచుతుంటారు. ఇది కూడా చాలా అన్యాయమే. వాటి స్వేచ్ఛను మనం హరించకూడదు.

జంతువులను పెంచుతున్నామనుకుంటాంగాని వాటికి తగిన వసతి కల్పించటం లేదు. వాటిని ఉంచే చోటునుగాని, వాటినిగాని శుభ్రంగా ఉంచటం మన కర్తవ్యం. వాటికి వేళప్రకారం తగినంత ఆహారం పెడితేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి. వాటిచేత మనకు కావలసిన పనులు చేయించుకుంటున్నాం. వాటి కనీస అవసరాలు తీర్చడం మన కర్తవ్యం.

అందుకే అందరం ఒక్కటై జంతువులను, పక్షులను, ఇతర జీవాలను కాపాడుదాం. వాటిని హింసించకుండా ప్రేమగా చూసుకుందాం. వాటిని మన నేస్తాలుగా, కుటుంబ సభ్యులుగా ఆదరించుదాం. మనతోపాటూ వాటికికూడా జీవించే హక్కును కల్పించుదాం.

ఇట్లు
జీవావరణ పరిరక్షణ సమితి.

ప్రశ్న 11.
నగరంలో ప్రధాన సమస్య అయిన అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరచేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు.

అధిక జనాభా సమస్యను అధిగమిద్దాం

మిత్రులారా!

పొట్టచేత పట్టుకొని, జీవనోపాధికోసం, బ్రతుకు తెరువుకోసం పల్లెల నుండి నగరాలకు వలస వస్తున్న జనం రోజు రోజుకూ ఎక్కువయిపోతున్నారు.

ఉండటానికి నీడ దొరకక, నగర శివార్లలో, మురికి కాలువల ప్రక్క రోడ్ల ప్రక్క ఎక్కడపడితే అక్కడ నీడ వెతుక్కుంటున్నారు. ఫలితంగా మురికి వాడలు పెరుగుతున్నాయి. రోగాలు ముసురుకుంటున్నాయి.

అందరికీ ఉద్యోగాలు దొరకక నిరుద్యోగం పెరిగిపోతోంది.
భవనాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వీటి నిర్మాణంతో నగర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జల, వాయు, కాలుష్యాలు పెరిగిపోతున్నాయి.

ప్రజలందరి రాకపోకలతో విపరీతమైన రద్దీ పెరిగి, వాహనాల వాడకం పెరిగి శబ్దకాలుష్యం పెరిగిపోతోంది. ఏ వస్తువు ధరా సామాన్యుడికి అందుబాటులో లేదు.
ఇప్పుడు నగరాలు కాంక్రీటు అడవులయిపోయాయి. ఎక్కడా పచ్చని చెట్టు కనబడే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, శాంతిభద్రత సమస్య పెరిగిపోతుంది.

ఇప్పుడే మేల్కొందాం.
నగరాల వలస వ్యామోహం నుండి ప్రజలు బయటపడాల్సిన సమయం వచ్చింది.
నగర జీవనాన్ని విలువల జీవనంగా నడుపుకోనిదే భవిష్యత్తు లేదు.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ముఖాముఖి (ఇంటర్వూలు) / నినాదాలు / సంభాషణలు

ప్రశ్న 1.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు.
పాఠశాల వార్షికోత్సవానికి యం.యల్.ఏ గారు వస్తే ఇంటర్వ్యూకు వేసే ప్రశ్నలు :

  1. మీరు రాజకీయాలలోకి ఎలా వచ్చారు ?
  2. మీకు చిన్నప్పటినుండీ రాజకీయాలంటే ఆసక్తి ఉందా ?
  3. మీరు పోటీ చేసినప్పుడు ఏ విధంగా ప్రచారం చేసారు ?
  4. మీరు గెలిచినపుడు మీకు ఏమనిపించింది ?
  5. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు మీ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు ?
  7. విద్యార్థులకు రాజకీయాలు అవసరమా ?
  8. ఒకవేళ మీరు విద్యామంత్రి అయితే పాఠశాలల అభివృద్ధికి ఏం చేస్తారు ?

ప్రశ్న 2.
బడిఈడు పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలనే సందేశమిచ్చేలా నినాదాలు రాయండి.
జవాబు.
ఎ) పిల్లలందరూ బడికెళ్ళాలి – పెద్దలందరూ పనికెళ్ళాలి.
బి) ఆటపాటలు పిన్నవయస్సులో – పనిపాటలు పెద్దవయసులో.
సి) పిల్లల భవితకు చదువే మూలం చదవని పిల్లలు జాతికి భారం.
డి) బడిఈడు పిల్లలను పనికి పంపడం నేరం వారి కష్టంపై ఆధారపడి బతకడం ఘోరం.
ఇ) బాలలందరినీ బడికి పంపడం పెద్దల మొక్కు – ఆటపాటలతో చదువుకోవడం బాలల హక్కు.
ఎఫ్) బడిఈడు పిల్లలందరూ బడిలోనే.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 3.
వరకట్న దురాచారంపై ఇద్దరు మిత్రుల సంభాషణ రాయండి.
జవాబు.
లలిత, కవిత అనే స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు.
లలిత : కవితా ! ఏం చేస్తున్నావు ? పేపర్లో ఏమిటి తదేకంగా చదువుతున్నావు ?
కవిత : ఏమీ లేదు. వరకట్నానికి మరొక స్త్రీ బలైపోయిందట, దాని గురించి.
లలిత : ఓ ! అదా ! పేపరులో ఇటువంటి వార్తలు మనకు రోజూ మామూలేగా.
కవిత : అవును. ఈ వరకట్నం దురాచారం ఎట్లా అవుతుంది?
లలిత : అదేమిటి ? నీకు తెలియదా ?
కవిత : విన్నాను. కానీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నా.
లలిత : అయితే, ముందు వరకట్నం అంటే ఏమిటో చెప్పు.
కవిత : ఆ, తెలుసులే, తమ కూతురును పెళ్ళిచేసుకుంటున్నందుకు ఆడపిల్ల తల్లిదండ్రులు మగపెళ్ళి వారికిచ్చే కట్నకానుకలు.
లలిత : మరి తెలిసి కూడా అడుగుతున్నావేమిటి ?
కవిత : నాకు వరకట్నం అంటే ఏమిటో తెలుసుగానీ అది దురాచారం ఎట్లా అవుతుందో అంతు బట్టడంలేదు.
లలిత : ఇప్పుడు నువ్వేకదా వరకట్నానికి మరొక స్త్రీ బలి అని చదివావు. దాని కారణంగా ఎంతోమంది స్త్రీలు బలైపోతున్నారు. దురాచారమని చెప్పడానికి ఇది చాలదా.
కవిత : మరి కట్నాలూ, కానుకలూ మన సంప్రదాయం కదా !
లలిత : కొన్ని సంప్రదాయాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి, వైరుధ్యం కనిపిస్తుంది. ఉద్దేశ్యం, లక్ష్యం పూర్తిగా నాశనమవుతాయి.
కవిత : అంటే వరకట్న సంప్రదాయం మంచిదనేగా నీ ఉద్దేశ్యం.
లలిత : అగ్ని సాక్షిగా జరిగే పెళ్ళి ఒక పవిత్రకార్యం. భగవంతుని కల్యాణం వంటిది. ఆ కల్యాణంలో ఎవరికి తోచిన కట్నకానుకలు వారు సమర్పించుకోవచ్చు. కానీ మీరు ఇంత చెల్లించకపోతే ఊరుకోం అంటూ నిర్బంధాలు విధించడంతోనే సమస్యలు మొదలవుతాయి. అట్లా మొదలైన వరకట్నం సమస్య ఇప్పుడు ఒక పెద్ద దురాచారమై ఎంతో విలువైన మన అక్కాచెల్లెళ్ళ ధన మాన ప్రాణాలను హరించి వేస్తోంది.
కవిత : నాకు అర్థమైంది. వరకట్నం ముమ్మాటికీ దురాచారమే.
లలిత : అదిగో బెల్లు కొట్టారు. వరకట్న దురాచారాన్ని ఆపడానికి మనమేం చేయాలో మరొకసారి మాట్లాడుకుందాం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 4.
‘ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు’ – దీనిపై రాము – సోము మధ్య జరిగిన సంభాషణను ఊహిస్తూ 10 వాక్యాలలో రాయండి.
జవాబు.
బళ్ళో భోజన విరామంలో ఒక చోట కూర్చొని అన్నం తింటూ రాము – సోము మాట్లాడుకుంటున్నారు.
రాము : సోమూ ! ఏవిట్రా ! ఇవాళ నువ్వు బాక్సులో పచ్చడి మాత్రమే తెచ్చుకున్నావు ?
సోము : అవున్రా. మా అమ్మకు వంట్లో బాగాలేదు. నాకేమో వంట చేయడం రాదు. మా అక్క చేస్తుంటే బడికి ఆలస్యమవుతుందని తొందరగా వచ్చేశా.
రాము : మీ అమ్మ ఏమి చదువుకున్నారు ? ఉద్యోగం చేస్తారా ?
సోము : మా అమ్మ ఎంఏ చదువుకున్నది. ఉద్యోగం రాలేదు. నాకు ఇంటి దగ్గర హెూంవర్క్ అంతా మా అమ్మే దగ్గరుండి చేయిస్తుంది.
రాము : మరి మీ అక్క ఏమి చదువుతుంది ?
సోము : మా అమ్మ అంత చదువుకున్నా ఉద్యోగం రాలేదని మా అక్కను ఇంటర్ పూర్తయ్యాక పై చదువులకు పంపలేదు.
రాము : అదేమిటి ? చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేయాలని ఏముంది ? అయినా మీ కుటుంబ సభ్యులందరికీ ఏ లోటు లేకుండా చూసుకోవడంలో మీ అమ్మ పడే శ్రమ ముందు ఏ ఉద్యోగం పనిచేస్తుంది ? పైగా ఆమె చదువుకోవడం వల్లనే కదా నువ్వు రోజూ నిశ్చింతగా హెూంవర్క్ చేయగలుగుతున్నావు.
సోము : నిజమేరా ! అయితే చదువు ఉద్యోగం కోసం కాదంటావా ?
రాము : చదువు కేవలం ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలడం కోసం మాత్రమే కాదు. వ్యక్తిత్వం కోసం ప్రపంచ జ్ఞానం కోసం, సాధారణ పరిజ్ఞానం కోసం. ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు దానికి మీ అమ్మను మించిన గొప్ప ఉదాహరణ ఏముంది ?
సోము : నువ్వు చెప్పింది బాగుందిరా రాము. నేను ఈ రోజే మా నాన్నతో మాట్లాడి మా అక్కను పై చదువులకు పంపమని గట్టిగా పట్టుబడతాను.
రాము : సరే ! సరే! అదిగో గంట కొట్టే వేళయింది., ఇదిగో నా బాక్సులో ఉన్న కూరను చెరి సగం చేసుకుందాం తీసుకో. (ఇద్దరూ అన్నం తిని తరగతికి వెళతారు)

Leave a Comment