TS 8th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download వ్యాసాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకున్నారో తెలియజేస్తూ, మాతృభాష ప్రాముఖ్యత – ప్రయోజనాలు వివరిస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

జనగామ,
ది. XX.XX.XXXX.

మిత్రుడు మదన్కు !

మీ పాఠశాలలో మాతృభాషా దినోత్సవం జరుపుకున్నట్లు రాశావు.

మా పాఠశాలలో కూడా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం జరుపుకున్నాము. ఆ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యగారు మాతృభాష గొప్పదనం గూర్చి చాలా చక్కగా మాట్లాడారు.

తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకు, పోతపాలు తాగి పెరిగిన బిడ్డకు ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విద్య నేర్చుకుంటున్నవారికీ, ఇతర భాషలో విద్య నేర్చుకుంటున్నవారికీ అంతే తేడా ఉంటుంది.

మాతృభాష అంటే చిన్నప్పటినుండి మన పెద్దలనుండి, మన పరిసరాలనుండి నేర్చుకునే భాష. నేర్చుకుంటున్నాము అనే విషయం కూడా తెలియకుండా నేర్చుకునే భాష, అలవడే భాష. మాతృభాషలో ఉండే నుడికారాలు, జాతీయాలు తేలికగా పట్టుబడతాయి. వాటిని సందర్భానుసారంగా ఉపయోగిస్తూ, నలుగురినీ మెప్పించవచ్చు. అదే పరాయి భాష అయితే అంత తేలికగా నుడికారాలు, జాతీయాలు పట్టుబడవు. అవి పట్టుబడినట్లు అనిపించినా, మాతృభాషలోని పదాలు ఉపయోగించినంత సహజంగా వాటిని ఉపయోగించలేము.

నేడు ఆంగ్లభాషను నేర్చుకున్నవారు, అందులో చదువుకుంటున్నవారు, ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు గొప్ప అనీ, మాతృభాషలో మాట్లాడేవాడు తక్కువ అనే న్యూనతాభావం పెరిగిపోతోంది. ఇది సరైందికాదు. ఏ విషయాన్నయినా మాతృభాషలో చెపితే, అర్థం చేసుకోవడం తేలిక. మాతృభాషలో పట్టు చిక్కాక, ఇతర భాషలను నేర్చుకోవడం తేలిక. మాతృభాష పునాది వంటిది. పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తుల భవనాన్నయినా కట్టవచ్చు. మాతృభాష బాగా నేర్చుకుంటే ఇతర భాషలెన్నయినా నేర్చుకోవచ్చు.

నీ అభిప్రాయాలు రాయకోత్తూ

ఇట్లు
మీ మిత్రుడు
హరి గోవింద్

చిరునామా :
G. మదన్,
C/o G. వెంకటశేఖర్,
దీనదయాళ్ పురం,
పర్కాల,
వరంగల్ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 2.
వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా కోరుతూ ప్రధానోపాధ్యాయునకు లేఖ రాయండి.
జవాబు.

కాజీపేట,
ది. XX.XX.XXXX.

గౌ. ప్రధానోపాధ్యాయుల వారికి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
కాజీపేట.

నమస్కారాలు. నేను మన పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారు ప్రభుత్వోద్యోగి. వారికి ఈ వూరు నుండి నల్గొండకు బదిలీ అయినది. మేము ఒక వారం రోజుల్లో అక్కడికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి నేను అక్కడ పాఠశాలలో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ సర్టిఫికెట్లను ఇప్పించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఇప్పించిన యెడల తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయించమని విన్నవిస్తూ ……

మీ విధేయ విద్యార్థి
బి. రాజేష్,
8వ తరగతి.

చిరునామా :
ప్రధానోపాధ్యాయులు,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, కాజీపేట.

ప్రశ్న 3.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు.

దేవరకొండ,
ది. XX.XX.XXXX.

ప్రియమైన మిత్రునకు,

నీ మిత్రుడు రాంబాబు వ్రాయునది. ఒక ముఖ్యవిషయం గురించి తెలియజేస్తున్నాను. రక్తం యొక్క ఉపయోగాలు నీకు కూడా తెలుసుగదా ! రోగులకు రక్తం ప్రాణదాత. అనారోగ్యవంతునకు శరీరంలో రక్తం తగ్గిపోతోంది. ఆపరేషన్ల సమయంలో రోగి చాలా రక్తాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో శరీరంలోకి పంపేందుకు రక్తం చాలా అవసరం. ఎవరో ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే రోగి మరల బ్రతుకుతాడు. అంటే రక్తదానం చాలా గొప్పది. ఒక జీవికి ప్రాణం పోస్తుంది.

ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా రక్తదానం చేయడం అవసరం అని పెద్దలు చెబుతారు. రెడ్ క్రాస్ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఉంచి, అవసరమైన రోగులకు ఉపయోగిస్తున్నాయి. విద్యార్థులమైన మనం ఈ విషయాల్ని తెలుసుకొని, ఆచరించాలని నీకు వ్రాస్తున్నాను. పరీక్షలు కాగానే సెలవులకు ఇక్కడకు రాగలవు.

నీ మిత్రుడు,
రాంబాబు

చిరునామా :
ఎ. జగదీష్ కుమార్,
8వతరగతి,
వివేకానంద మెమోరియల్ హైస్కూల్,
చిట్యాల,
నల్గొండ (జిల్లా).

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 4.
మీ పాఠశాలలో ‘గ్రంథాలయ వసతి’ కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు.

తాడిమళ్ళ,
ది. XX, XX, XXXX.

గ్రంథాలయాధికారి గారికి,
గ్రంథాలయాల కార్యాలయం,
కరీంనగర్.

ఆర్యా,

నేను తాడిమళ్ళ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతున్నాను. మా పాఠ్యపుస్తకాలలోని పాఠాలకు సంబంధించి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలేకాక అదనంగా సమాచారం సేకరించవలసి వస్తోంది. మా పాఠశాలలో గ్రంథాలయం లేదు. మా ఊళ్ళో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళేందుకు వారి పనివేళలు మాకు అనుకూలంగా లేవు.

అందువలన దయచేసి మా పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడేలా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. గ్రంథాలయానికి దినపత్రికలు కూడా వచ్చే ఏర్పాటు చేస్తే మాకు ప్రతిరోజూ వార్తా విశేషాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయించవలసిందిగా మరొక్కమారు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇట్లు,
విధేయుడు,
బి. గోపాల్.
పదవ తరగతి
ప్రభుత్వ పాఠశాల, తాడిమళ్ళ.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

బీబీనగర్,
ది. XX.XX.XXXX.

ప్రియ మిత్రుడు ఆనందు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు డా॥ రాధాకృష్ణ గారి జీవిత విషయాలను మాకు తెలిపారు. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాము. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు
నీ మిత్రుడు,
హరి.

చిరునామా :
ఎస్. ఆనంద్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
భువనగిరి,
నల్గొండ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 6.
‘కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణం’ గురించి సోదరికి లేఖ రాయండి.
జవాబు.

హైదరాబాద్,
ది. XX.XX.XXXX.

ప్రియమైన సోదరి లక్ష్మికి రాయు జాబు,

ఉభయకుశలోపరి. నేను బాగానే చదువుకుంటున్నాను. నువ్వు ఎలా చదువుకుంటున్నావు ? నీ ఉత్తరం అందింది. మన పల్లెటూరిలో కనిపించే ప్రకృతి అందాలు నగరాలలో మచ్చుకైనా కనబడవు.

పొద్దస్తమానం రోడ్లవెంట తిరిగే రకరకాల వాహనాలు కలిగించే రణగొణధ్వనులకు చెవులు చిల్లులు పడతాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మేం కళాశాలకు వెళ్ళేటప్పుడు ఈ రొద విపరీతంగా ఉంటుంది.

అంతేకాక పరిశ్రమల పొగ గొట్టాలనుంచి, వాహనాల నుంచి వెలువడే పొగలు ఊపిరి ఆడనీయక ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంకా ఇళ్లనుంచి వెలువడే వ్యర్థాలు, పరిశ్రమల వ్యర్థాలు, రోగకారక వ్యర్థరసాయనాలు మొదలైన వాటితో నిండి కాలువలు, చెరువులు, నదులు కలుషితమైపోయి చూడడానికే భయం గొలుపుతాయి.

ఈ విధంగా హెూరెత్తించే శబ్దాలు, కలుషితమైన గాలి, నీరుల వల్ల నగర వాతావరణం జీవించడానికి దుర్భరంగా తయారవుతున్నది. ఈ కాలుష్య నియంత్రణకు ఇప్పటినుండే చర్యలు చేపట్టకపోతే రాబోవు కాలంలో ఇక్కడ జీవనం దుర్లభమయ్యే ప్రమాదం ఉన్నది. మన ఊరి విశేషాలతో వెంటనే జవాబు రాయగలవు. ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

ఇట్లు
నీ సోదరి,
పార్వతి.

చిరునామా
లీలావతుల లక్ష్మి,
D/o భాస్కరాచార్యులు,
మహాలక్ష్మీ గుడి వీధి,
యడవల్లి గ్రామం,
కరీంనగర్ జిల్లా.

ప్రశ్న 7.
చూసిన యాత్రాస్థలమును వివరిస్తూ, ఇతర ప్రాంతములో చదువుతున్న నీ సోదరికొక లేఖ వ్రాయుము.
జవాబు.

సూర్యాపేట,
ది. XX.XX.XXXX.

ప్రియమైన సోదరికి,

నీ అన్నయ్య వ్రాయునది. సంక్రాంతి సెలవులకు మా పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని విహారయాత్రలకు తీసుకొని వెళ్ళారు. మన రాష్ట్రంలో విహారయాత్రకు స్థలంగా పేరుపొందిన నాగార్జున సాగరు వెళ్ళాము. పూర్వము బౌద్ధపండితుడైన నాగార్జునుడు ఇక్కడే నివసించాడట. ఈయన తత్త్వవేత్తయేగాక, ఆయుర్వేద పండితుడు కూడా. కృష్ణానదిపై ఇక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టబడింది. రెండు కొండల మధ్య ఇది నిర్మించబడినది. ఆనకట్ట వెనుక సరోవరం కలదు.

సరోవరం నీటిలో చారిత్రక శిథిలాలు మునిగిపోకుండా వాటిని కొండపై నిర్మించిన మ్యూజియంలో ప్రభుత్వం భద్రపరిచింది. మ్యూజియంలో అనేక పాలరాతి శిల్పాలు, బౌద్ధవిగ్రహాలు, పనిముట్లు మొదలైనవి చాలా చూశాము. చుట్టూ గల ప్రకృతి దృశ్యాలు కూడా రమణీయంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు అన్ని వివరాలు తెలియజేశారు. ప్రకృతి దృశ్యాలు – చారిత్రక ప్రసిద్ధి గల స్థలాలన్నీ నీవు కూడా తప్పక చూడాలని కోరుతున్నాను. అమ్మానాన్నలకు నా నమస్కారాలు చెప్పగలవు.

ఇట్లు
నీ ప్రియమైన అన్నయ్య,
కె. గంగాధర్.

చిరునామా :
కె. సుజాత,
8వ తరగతి,
రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్,
కోదాడ.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 8.
పుస్తక విక్రేతకు లేఖ.
జవాబు.

తిమ్మారెడ్డిపల్లె,
ది. XX.XX.XXXX.

గౌరవనీయులైన మేనేజరు గార్కి,
శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్,

ఆర్యా!
మీరు ప్రచురించిన గ్రంథాలు విద్యార్థులకు విజయసోపానాలుగా ఉపయోగపడుతున్నవనడంలో సందేహం లేదు. కనుక మాకు అవసరమైన గ్రంథములను మీరు వి.పి.పి. ద్వారా పంపించినచో మేము డబ్బు చెల్లించి తీసుకొనగలము. ప్రస్తుతం రూ. 200/-లు అడ్వాన్సుగా మనియార్డరు ద్వారా పంపుతున్నాము. కనుక వెంటనే ఈ క్రింద తెలియచేసిన గ్రంథములను పంపించగలరు.
1. వ్యాససుధ 10 కాపీలు.
2. ఇంగ్లీషు – హిందీ – తెలుగు నిఘంటువు 5 కాపీలు.
3. 8వ తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంక్ 5 కాపీలు.

ఇట్లు
తమ విశ్వాసపాత్రుడు,
పి. భగవాన్ తిమ్మారెడ్డిపల్లె,
మెదక్ జిల్లా.

చిరునామా
మేనేజరుగారికి,
శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్,
హైదరాబాద్.

ప్రశ్న 9.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లె గొప్పదనాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

భైంసా,
ది. XX.XX.XXXX.

ప్రియమిత్రుడు గోపీ,

నేనిక్కడ బాగా చదువుకుంటున్నాను. నీ చదువెట్లా సాగుతోంది. బాగానే చదువుతున్నావనుకుంటాను. ఈ మధ్యే బోయి భీమన్న గారు రాసిన జానపదుని జాబు పుస్తకం చదవడం జరిగింది.

పచ్చని వరి చేలు, ఆ చేలకు నీరు అందించే కాలువలు, చల్లని గాలులు, పచ్చని చెట్లు వీటన్నింటితో పల్లెటూరి వాతావరణం ఎంతో బావుంటుంది. చల్లనిగాలికి జోరుమంటూ పైరుచేలు ఎంతో ఆనందాన్ని కూరుస్తాయి. నీటి బోదెలు, ఆ బోదెలుకు తీసే పిల్లబోదెలు, ఆ మట్టి వాసన మనసును ఆకర్షిస్తాయి.

అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపరచేది ఆ పల్లె మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు. కులం, మతం పట్టింపు లేకుండా ఒకర్నొకరు బాబాయి, మామయ్య, అబ్బాయి, ఆయా, అమ్మా, అత్తమ్మ, అక్క, తమ్ముడు, బావా వంటి పిలుపులతో పలకరించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ ఇంట్లో ఏ పెండ్లీ, పేరంటం జరిగినా, అది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని వేడుకగానే భావించడం, బాధ్యత పంచుకోవడం ఆనందించాల్సిన విషయం.

నీ అభిప్రాయాలు తెలియచేయకోరతాను.

ఇట్లు
నీ ప్రియమిత్రుడు
భగవాన్

చిరునామా :
బొబ్బా గోపీ
C/o. బొబ్బా రమణరావు,
సాలెవీధి,
చిట్యాల,
నల్గొండ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 10.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించ వలసిందిగా సంపాదకునికి లేఖ.
జవాబు.

కాచిగూడ,
ది. XX.XX.XXXX,

గౌరవనీయులైన ‘వార్త’,
ప్రధాన సంపాదకుల వారికి,

ఆర్యా!
“సర్వేంద్రియాణాం నయం ప్రధానమ్” అన్న సూక్తి అందరికీ తెలిసిందే. మానవునికి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కళ్ళు కనిపించకపోతే అతని జీవితం అంధకార బంధురమవుతుంది. కనుక మిగిలిన అన్ని అవయవాల కంటే కళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

మనిషి మరణించిన కొన్ని గంటలలోపు అతని కన్నులను అతని శరీరం నుండి వేరు చేసి వేరొకరికి వాటిని అమర్చుట ద్వారా వారికి చూపు తెప్పించవచ్చునని, ఆ కళ్ళు మరల చక్కగా పనిచేయునని నేటి విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. కనుక ప్రతి వ్యక్తి నేత్రదానం చేయుటకు ముందుకు రావాలి.

నేత్రదానాన్ని చేయవలసిందిగా ప్రజలను ప్రోత్సహిస్తూ నేను రాసిన ఈ లేఖను మీ పత్రికలో ప్రచురించుట ద్వారా అందరికీ తెలియజేయవలసినదిగా నా మనవి.

ఇట్లు
S.M. పూర్ణ,
కామకోటినగర్,
కాచిగూడ.

చిరునామా
ప్రధాన సంపాదకులు,
వార్త దినపత్రిక,
హైదరాబాద్.

ప్రశ్న 11.
కంప్యూటర్ విద్య ఆవశ్యకాన్ని వివరిస్తూ నీ మిత్రునికొక లేఖ వ్రాయుము.
జవాబు.

పరకాల,
ది. XX, XX, XXXX.

మిత్రుడు రమణకు,
ఉభయకుశలోపరి. నేను పరీక్షలు బాగానే వ్రాస్తున్నాను, పరీక్షలు పూర్తికాగానే కంప్యూటర్ కోర్సులో చేరుతాను. ఎందుకంటే నేడు కంప్యూటర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ లేదు అనే సందేహమే లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమౌతూ, ఇరవై ఒకటో శతాబ్దాన్ని కంప్యూటర్ శాసిస్తోంది. మన నిత్యజీవితంలోని ప్రతి విషయంపై కంప్యూటర్ ప్రభావముంటుంది. సమాచార విప్లవానికి ఈ కంప్యూటర్ ద్వారాలు తెరిచింది. ప్రస్తుతం కంప్యూటర్పై అవగాహన లేనిదే సమర్థవంతంగా రాణించలేం.

వస్తున్న మార్పులను ఆకళించుకొని ముందుకు పోవాలంటే కంప్యూటర్ విద్య తప్పనిసరి. అందుచే అన్ని విధాలుగా నేను ఆలోచించి గుర్తింపు పొందిన కంప్యూటర్ కోర్సులో చేరాలనుకుంటున్నాను. నీవు కూడా కంప్యూటర్ విద్యను అభ్యసించి భవిష్యత్తుకు మంచి పునాదిని వేసుకొనగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు
నీ మిత్రుడు,
రఘునాథ్.

చిరునామా :
సాకేటి వెంకట రమణ,
10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మహబూబాబాద్,
వరంగల్ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 12.
పారిశుధ్య సమస్యను గురించి పురపాలక సంఘ ఆరోగ్య శాఖాధికారి గారికి లేఖ.
జవాబు.

సూర్యాపేట,
ది. XX.XX.XXXX.

ఆరోగ్య శాఖాధికారి గారికి,
పురపాలక సంఘ కార్యాలయం,
సూర్యాపేట.

అయ్యా!
మాది రజక వీధి. మా ఇంటి పరిసరాలలో ఎక్కడా పురపాలక సంఘంవారు చెత్తకుండీలను ఏర్పాటు చేయలేదు. అందుచే ఇక్కడివారు తమ ఇండ్లలోని చెత్తను తెచ్చి వీథుల్లో పారవేస్తున్నారు. ఆ చెత్త అంతా గాలికి రోడ్లమీదికి, ఇండ్లలోనికి వచ్చి చేరుతున్నది. కుక్కలు, పందులు, చెత్తకుప్పలను కదల్చి రోడ్డంతా చెత్తతో నిండేట్లుగా చేస్తున్నాయి. ఇక వాన కురిస్తే పరిస్థితి భరించలేని విధంగా ఉంటున్నది. రాత్రిపూట దోమలు విపరీతంగా ప్రజలను బాధిస్తున్నాయి.

వాటివలన మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నది. కనుక మీరు వెంటనే శ్రద్ధ తీసుకొని తగిన సిబ్బంది నేర్పాటుచేసి రోడ్లను శుభ్రపరచండి. రోడ్డుపై రెండు చివరలందు రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేయండి. దోమల మందు చల్లించండని కోరుతున్నాను.

ఇట్లు
తమ విధేయురాలు,
అంజలి బొబ్బా.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
సూర్యాపేట.

ప్రశ్న 13.
మాతృభాషా ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునికి లేఖ వ్రాయుము.
జవాబు.

నకిరేకల్,
ది. XX.XX.XXXX.

ప్రియమైన మిత్రుడు సోమరాజుకు,
ఉభయకుశలోపరి. ఇటీవల మన ప్రభుత్వం “తెలుగువారమందరం – తెలుగే మాట్లాడదాం” అనే నినాదం ఇచ్చింది. అది చూసి చాలా ఆనందం కలిగింది. జనని, జన్మభూమిలాగే మాతృభాష కూడ ఎంతో గొప్పది. మన మాతృభాష తెలుగును గురించి తేటతేటతెలుగనీ, తేనెలొలుకు తెలుగనీ ఎంతోమంది ఎన్నోరకాల కీర్తించారు. మమ్మీ, డాడీ ఆనండంలో కంటె అమ్మా – నాన్న అనడంలో ఉన్న ఆనందం మనకు తెలియంది కాదు. మాతృభాషలో ఎవరేం చెప్పినా, ఏం చదివినా వెంటనే అర్థమై, బాగా గుర్తుండిపోతాయి. ఎవరైనా సరే మాతృభాషలో భావగ్రహణ, భావవ్యక్తీకరణ చేసినంత చక్కగా మరే భాషలోనూ చేయలేరు.

ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. మన భాషమీద మనకి గౌరవం ఉంటేనే ఇతర భాషల వారూ మనభాషని గౌరవిస్తారు. అందుకు గుర్తుగా ఈ రోజునే మా పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. అందుకే ఎన్ని భాషలైనా నేర్చుకుందాం – తెలుగులోనే మాట్లాడదాం. మన మాతృభాషపై నీ అభిప్రాయాలు తెలుపుతూ లేఖవ్రాయి. మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలని చెప్పు.

ఇట్లు
నీ ప్రియమైన మిత్రుడు,
రమేష్.

చిరునామా :
కె. సోమరాజు,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
చిట్యాల,
నల్గొండ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 14.
నీవు చదివిన ఒక మంచి పుస్తకాన్ని గురించి, నీ స్నేహితునికి లేఖ రాయుము.
జవాబు.

ఆదిలాబాద్,
ది. XX.XX.XXXX.

ప్రియమైన మిత్రుడు రవికి నీ స్నేహితుడు వ్రాయునది,
ఉభయకుశలోపరి, ఇటీవల మా పాఠశాలలోని గ్రంథాలయమున “నీతి చంద్రిక” అనే పుస్తకాన్ని చూసి తీసుకొని సంపూర్ణంగా చదివాను. నాకా పుస్తకము చాలా నచ్చింది. పరవస్తు చిన్నయసూరి గారిచే రచింపబడిన ఆ గ్రంథములో నీతికథలు సులభశైలిలో పఠనాసక్తిని కలిగిస్తాయి. అందలి పాత్రలన్నియు జంతువులు, పక్షులయినను మానవ స్వభావాలను తెల్పుతాయి. రాజకుమారులను విజ్ఞానవంతులుగా చేయటానికి విష్ణుశర్మ అను పండితుడా కథలను చెప్పాడు. నీతిచంద్రికను ఆమూలాగ్రంగా చదివిన విద్యార్థి నీతిమంతుడై విజ్ఞానాభివృద్ధిని పొందుతాడనడంలో అతిశయోక్తి లేదు. నువ్వుకూడా ఓసారి ఆ గ్రంథమును సంపాదించి చదువు.

ఇట్లు
నీ మిత్రుడు,
సంతోష్.

చిరునామా :
కె. రవి,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
బెల్లంపల్లి.
పిన్ : ……………..

Leave a Comment