These TS 8th Class Telugu Bits with Answers 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు will help students to enhance their time management skills.
TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు
చదువండి ఆలోచించి చెప్పండి.
చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా సీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో
బీరలు పూసే బారలు కాసే తీగో నాగో ఉయ్యాలో
బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో
ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది ?
జవాబు.
ఈ గేయం తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను గురించి చెప్తుంది.
ప్రశ్న 2.
ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా ?
జవాబు.
తెలుసు. ఈ గేయాన్ని జానపదగేయం అంటారు.
ప్రశ్న 3.
ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.
జవాబు.
గోగులు పూచే గోగులు కాసే తీగో నాగో ఉయ్యాలో
నారలు తియ్యా ఎవ్వరు లేరూ తీగో నాగో ఉయ్యాలో
నారలు తీయా వీరులు లేరా తీగో నాగో ఉయ్యాలో
వాగులు పొంగే వంకలు పొంగే తీగో నాగో ఉయ్యాలో
దారులు చెయ్యా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
దారులు ఇయ్యా ఏరులు లేవా తీగో నాగో ఉయ్యాలో
ప్రశ్న 4.
ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
ఇట్లాంటి గేయాలు తెలుగువారి ఆచార సంప్రదాయాలనూ, చరిత్రను, గొప్పదనాన్ని తెలియజేస్తాయి.
పాఠ్యభాగ ఉద్దేశం:
తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పతనం, వాటి వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.
కవి పరిచయం:
ప్రశ్న.
బిరుదురాజు రామరాజుగారి పరిచయం రాయండి. (లేదా) బిరుదురాజు రామరాజుగారి జీవిత విశేషాలు తెల్పండి.
జవాబు.
తెలుగు జానపద సాహిత్యమనగానే మనకు గుర్తుకువచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. పూర్వపు వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు.
కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్ గా పనిచేశాడు.
“తెలుగు జానపద గేయ సాహిత్యం” ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ – తెలుగు నిఘంటువు, 08-02-2010 తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
గమనిక : పరీక్షలో గీత గీసిన వాక్యాలు రాస్తే జవాబు సరిపోతుంది.
ప్రవేశిక:
జానపద సాహిత్యమనగానే గుర్తుకు వచ్చేది గేయమే. పదాలని, పాటలని జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం.
కఠినపదాలకు అర్థాలు:
దర్పణం = అద్దం
ఇతివృత్తం = తీసుకున్న విషయము (content), కథా సారాంశం, కథా వస్తువు.
గాథ = కథ, చరిత్ర లేదా విషయం
చేవ = బలం
దళం = సమూహం
ప్రజాబాహుళ్యం = ఎక్కువ మంది ప్రజలలో
శాఖ = విభాగం, కొమ్మ
మార్ధవం = మృదుత్వం
విశ్వాసం = నమ్మకం, కృతజ్ఞతాభావం
ఉచ్ఛ్వాస, విశ్వాసాలు = గాలి పీల్చి వదలటం
నిష్కపటము = కపటం లేని (మోసం లేని)
జీవనోపాధి = జీవితానికి ఆధారం, బ్రతుకుతెరువు, మనుగడ, జరుగుబాటు, పొట్టకూడు.
ఆలోచించండి – చెప్పండి:
ప్రశ్న 1.
ఈ తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం ? (టెక్స్టపేజి నెం. 59)
జవాబు.
మానవ సమాజం తాము పడే శ్రమను మరచిపోవడానికి సృష్టించుకొన్న కళే గేయం. ఈ గేయ సాహిత్యం భాష పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది. రాసే పనిలేకుండా నోటి ద్వారానే ఒకతరం నుంచి మరొక తరానికి జానపదులు పాడుకుంటున్న ఈ గేయాల చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. భాష పుట్టిన చాలా ఏళ్ళకు కానీ దాన్ని రాయడానికి అవసరమైన లిపి పుట్టదు. అందువల్ల లిపి అవసరం లేకుండా ఆనోటా ఆనోటా ప్రచారం అవుతున్న జానపద గేయచరిత్ర ప్రాచీనమైనదని చెప్పవచ్చు.
ప్రశ్న 2.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి భావం ఎట్లాంటిది ? (టెక్స్టపేజి నెం. 59)
జవాబు.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి మెచ్చుకోదగినది. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలు అన్నీ ఉండటం వారి భక్తికి నిదర్శనం. రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను జానపదులు గేయాలలో తమకు నచ్చిన విధంగా మలచుకున్నారు.
ప్రశ్న 3.
“ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే” – దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు? (టెక్స్టపేజి నెం. 61)
జవాబు.
తెలుగు వారు నివసించే ప్రాంతం వీరులకు నిలయమనే విషయాన్ని చెబుతున్న సందర్భంలో దీనిని వాడారు. తెలుగు భూమి మీద పుట్టిన చిగురు కొమ్మ కూడా బలంగా ఉంటుంది అని దీని అర్థం. అంటే పని పిల్లలకు కూడా పౌరుషం ఉంటుంది అని భావం. దేశక్షేమం కోసం, తమ జాతి రక్షణ కోసం పసిపిల్లలు కూడా పోరాటానికి వెనకాడరని తాత్పర్యం.
ప్రశ్న 4.
వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు. దీనిని వివరించండి. (టెక్స్ట్ పేజి నెం. 61)
జవాబు.
వీరగీతాలు వీరత్వాన్ని, దేశభక్తిని చాటుతాయి. వీటిలో వీర రసం ప్రధానంగా ఉంటుంది. కనుకనే వీటిని వీరగీతాలు అని అంటారు. వీటినే చారిత్రక గేయాలు అని పిలుస్తారు. ఈ వీరగీతాలకు సంబంధించిన సన్నివేశాలను కనులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో గానం చేసి వినిపిస్తాడు. ఇలా వీరగేయాలు జానపదగేయాలు అవుతాయి. జానపదగేయాల్లో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు కూడా భాగాలే. వీరగేయాల్లో కేవలం వీరరసమే ప్రధానం.
ప్రశ్న 5.
భక్తిగీతాలు కొందరికి జీవనోపాది. ఎట్లాగో చెప్పండి. (టెక్స్టపేజి నెం. 61)
జవాబు.
తెలుగునాట భక్తిపాటలలో భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇటువంటి భక్తిగీతాలు పాడుకుంటూ జంగంవారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.
ప్రశ్న 6.
ఈ ‘నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం. 62)
జవాబు.
నిష్కపటం అంటే మోసం చేయాలనే ఆలోచనలు లేకపోవటం. నిర్మలం అంటే చెడు ఆలోచనలు లేకపోవడం. నిష్కపటము, నిర్మలము అయిన హృదయం కలిగి ఉండడం అంటే మోసం చేయాలనే ఆలోచనగానీ, చెడ్డ ఆలోచనలుగానీ లేని ‘స్వచ్ఛమైన మనసు’ కలిగి ఉండడం అని అర్థం.
ప్రశ్న 7.
జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. (టెక్స్టపేజి నెం. 62)
జవాబు.
జానపదగేయాలు వేల సంవత్సరాల నుంచీ ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తూ ఆనోటా ఆనోటా ప్రచారం అవుతూ ఉంటాయి. పని పాటలు చేసుకొని జీవించే చదువుకోని వారిని ఈ జానపదగేయాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య జాగ్రత్తలు మొదలైన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఈ జానపద గేయాలు ఎంతో ఉపకరిస్తాయి.
ప్రశ్న 8.
జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ? (టెక్స్టపేజి నెం. 62)
జవాబు.
జానపదగేయం సంపదపై విస్తృతంగా వివిధ కోణాలలో పరిశోధనలు జరగాలి. అమూల్యమైన గేయాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలి. జానపదగేయాల గొప్పదనాన్ని ప్రచారం చేయాలి. సేకరించిన వాటిని తగిన రీతిలో భద్రపరచాలి. వాటికోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గేయ సాహిత్యాన్ని, వాటికి సంబంధించిన విశేషాలను అందరికీ అందుబాటులోకి తేవాలి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
“జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం” – చర్చించండి.
జవాబు.
పండితులైన కవులు దీక్ష పూని చేసే కావ్యం, శతకం, ప్రబంధం వంటి రచనలు శిష్టరచనలు. గ్రామీణ ప్రాంత ప్రజలు రోజంతా పనులు చేసుకుంటూ ఆ పని వల్ల కలిగే శ్రమను మరచిపోవడానికి అప్పటికప్పుడు తామే రచించుకొని లయబద్ధంగా పాడుకొనే పాటలే జానపదగేయాలు. శిష్ట రచనల్లాగే ఈ గేయాలన్నీ దాదాపుగా రామాయణం, భారతం, భాగవతం మొదలైన గ్రంథాలలోని ప్రసిద్ధ కథలకు సంబంధించినవే. శిష్ట సాహిత్యాన్ని చదువుకున్న వారు మాత్రమే చదువుకో గులుగుతారు.
కానీ జానపదుల గేయాలు లయాత్మకంగా ఉండి పండితులనూ, పామరులనూ అలరిస్తాయి. ఈ గేయాలలో తెలుగు వారి దైనందిన జీవితం కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయలతో ఈ గేయాలు నిండి ఉంటాయి. అందువల్ల తెలుగువారి నాలుకలపై నిత్యం నర్తించే జానపదగేయాలు తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణాలు అని చెప్పవచ్చు.
ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.
జవాబు.
“చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు కట్టను చాతగాదు ఊరుకోండు!”
“రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు తొడగను చాతకాదు ఊరుకోండు!”
“పూవులొచ్చినాయి మామ కట్టమిందికి!
మల్లెపూవు లొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు ముడవను చాతకాదు ఊరుకోండు!”
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య. ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.
అంశం-పేరా సంఖ్య-కీలక (ముఖ్యమైన) విషయాలు
పౌరాణిక గేయాలు-58వ పుటలో 4వ పేరా-జానపద గేయాలలో ప్రసిద్ధ పౌరాణిక గాథలు
చారిత్రక గేయాలు-59వ పుటలో 2వ పేరా-వీర గీతాల స్వరూప స్వభావాలు
శ్రామిక గేయాలు-61వ పుటలో 1వ పేరా-జానపదగేయాల పుట్టుక నేపథ్యం
పిల్లల పాటలు-61వ పుటలో 2వ పేరా-పిల్లల పాటల్లోని స్వచ్ఛత, మార్దవ గుణాలు
2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి.
పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.
అ. జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి ?
జవాబు.
జానపదులు సహజంగా నేర్చుకున్నది శారీరక శిక్షణ.
ఆ. పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి ?
జవాబు.
పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది.
ఇ. పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ ?
జవాబు.
పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది సమాజం నుంచే.
ఈ. జానపద సాహిత్యం దేనికి హేతువు ?
జవాబు.
జానపద సాహిత్యం జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు.
ఉ. పొడుపు కథలు, ముక్తపదగ్రస్త్రాలు – వీటి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాల్లా పదజ్ఞానానికి సాటి అయింది మరొకటి లేదు.
III. స్వీయరచన.
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ?
జవాబు.
ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన జానపద గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది.
జానపదగేయాలకు సాహితీపరమైన విలువ మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువుల్లో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనుపిస్తాయి. అంతేకాక వాటిలో రమణీయమైన స్థానిక గాథలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల జానపద గేయాలను భద్రపరచాలి.
ఆ. జానపదగేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
భారతీయ సంస్కృతికి తలమానికమైన రామాయణ మహాకావ్యం ముఖ్యమైనది. ప్రాచీనమైనది. తెలుగువారి జానపద గేయాలలో కథా వస్తువులలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలే ఎక్కువ. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను చదువుకుని అర్థం చేసుకోలేని గ్రామీణులు వాటిని జానపద గేయాలుగా మలుచుకొని నేర్చుకుంటారు. విద్యావంతుల రచనలలో లాగానే జానపదుల గేయాలలో కూడా రామాయణ సంబంధ గేయాలే ఎక్కువగా ఉన్నాయి.
అంతేకాక ఈ రామాయణ సంబంధ కథలను జానపదులు తమ తమ అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం కూడా గమనించవచ్చు. అన్నదమ్ముల అనుబంధం, పిల్లలకు తల్లిదండ్రుల మాటపై గౌరవం, భార్యాభర్తల అనురాగం, రాజు ప్రజల అనుబంధం మొదలైన ఎన్నో కుటుంబ అనుబంధాలు, రాజ్యపాలన అనుభవాలు కలిగిన కథలు ఉండటం వల్ల జానపదగేయాల్లో రామాయణ సంబంధ గేయాలు ఎక్కువ ఉన్నాయి.
ఇ. “గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటె ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది” – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. భారతీయ కుటుంబ జీవనంలో ఇంటి యజమాని అయిన పురుషుడు కుటుంబ పోషణకోసం పొలంలోనో, పరిశ్రమలోనో, కొలువులోనో శ్రమచేసి సంపాదిస్తాడు. ఇల్లాలైన స్త్రీ భర్త శ్రమ చేసి తెచ్చిన సంపదను జాగ్రత్త చేస్తుంది. అర్థశాస్త్రవేత్తలా వాటిని అవసరాలకు వినియోగిస్తుంది. ఉత్తమ గృహిణిగా భర్త బాగోగులను చూసుకుంటుంది. బిడ్డలను కనిపెంచి పోషించి ప్రయోజకులను చేస్తుంది. పెద్దలను సాకుతుంది.
ఇంటిల్లిపాది ఆరోగ్యాలనూ కాపాడుతుంది. అయిన వాళ్ళను ఆదరిస్తుంది. అతిథులను గౌరవిస్తుంది. అవసరమైతే భర్తకు చేదోడుగా ఉంటూ తాను కూడా శ్రమపడి సంపాదిస్తుంది. తప్పని పరిస్థితులలో కుటుంబ భారాన్ని తానొక్కతే మోయడానికి సిద్ధమవుతుంది. అందువల్ల కుటుంబంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించే స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.
ఈ. శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు. కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుండి కూనిరాగాలు, మాటలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు మాటలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి.
పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం, నాగలి దున్నడం మొదలైన పనులు ఈ పాటలు పాడుతూ చేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. “స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది.” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు రచించిన తెలుగు జానపదగేయాలు అనే పాఠ్యభాగంలో అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధమైన తెలుగువారి జానపదగేయాల గురించి అపూర్వంగా వివరించారు. జానపద గేయాలలోని రకాలు వివరిస్తూ స్త్రీల పాటల ప్రత్యేకతలను వర్ణించారు.
స్త్రీల పాటలు : గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు స్త్రీలే ఆలంబనం. వీటిని స్త్రీ పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.
సాంఘిక, సాంస్కృతిక జీవనం : స్త్రీలకు జరిపే ఆయా వేడుకలలో పాడే స్త్రీల పాటలు అన్నింటిలో తెలుగు వారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. వీటిని పెళ్ళిపాటలు, ఇతర వేడుకల పాటలు అని రెండు అంశాలుగా తెలుసుకోవచ్చు.
పెళ్ళి పాటలు : స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంచనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, తలుపు దగ్గరపాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే.
ఇతర వేడుకల పాటలు : సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైన ఆయా సందర్భాలలో పాడే పాటలు అతి రమణీయమైనవి. ముగింపు : ఈ విధంగా స్త్రీ జీవిత కాలంలో జరిపే వివిధ వేడుకలలో పాడే సందర్భోచితమైన ఆయా పాటలలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం అద్దంలా కనిపిస్తుంది.
ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” దీన్ని వివరిస్తూ రాయండి. (లేదా)
జానపద గేయాల గొప్పతనం వివరించండి.
జవాబు.
పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు ‘తెలుగు జానపద గేయాలు’ అనే పాఠ్యభాగంలో జానపదగేయాలలో ప్రతిబింబించే మన సంస్కృతీ సంప్రదాయాలను అపూర్వంగా వివరించారు. మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు మొదలైన అంశాలతో తెలుగు ప్రజల జీవితమంతా జానపదగేయాలలో ప్రతిధ్వనిస్తుంది. ఈ గేయాలను పౌరాణిక, చారిత్రక, పారమార్థిక గేయాలు, స్త్రీలపాటలు, శ్రామిక గేయాలు, పిల్లలపాటలు, కరుణరసగేయాలు అనే విభాగాలలో రచయిత వివరించారు.
పౌరాణిక గేయాలు : ప్రసిద్ధ రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని గాథలన్నీ జానపద గేయాలలో ఉన్నాయి.
ఉదా : శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట మొదలైనవి.
చారిత్రక గేయాలు : వీరరసం ప్రధానంగా ఉండటం వల్ల వీటిని వీరగీతాలు అని కూడా అంటారు. ఇవి వీరత్వాన్ని, దేశభక్తిని బోధిస్తాయి. ఉదాహరణకు మియాసాబ్కథ, సోమనాద్రికథ, రామేశ్వరరావుకథ మొదలైనవి. పారమార్థిక గేయాలు : పారమార్థిక గేయాలకు భక్తిగీతాలని పేరు. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు మొదలైనవి.
స్త్రీల పాటలు : గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్త్రీల పాటలలో లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు, వివిధ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు తెలిపే మొదలైనవి ఉంటాయి. ఉదాహరణకు కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు మొదలైనవి.
శ్రామిక గేయాలు : పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం మొదలైన పనులకు, ఆయా వృత్తులకు సంబంధించి శ్రామికులు గేయాలు పాడుకుంటారు.
పిల్లల పాటలు : వీటిలో పిల్లల కోసం పెద్దలు రచించినవి కొన్ని కాగా పిల్లలు తమకు తామే సమకూర్చుకున్నవి మరి కొన్ని. ఉదాహరణకు చెమ్మచెక్క, కోతికొమ్మచ్చి మొదలైన ఆటలలో పాడే పాటలు.
కరుణరస గేయాలు : ఎరుకల నాంచారమ్మకథ, రాములమ్మపాట, సరోజనమ్మపాట మొదలైనవి.
ముగింపు : ఈ విధంగా జానపదగేయాలలో గ్రామీణుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయలు, వారి మనోభావాలు మృదుహృదయం ప్రతిబింబిస్తుంది.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
పిల్లల పాటల గురించి రాయండి. (లేదా) పిల్లల పాటలు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
జానపదగేయాలలో పిల్లల పాటల దొక ప్రత్యేకశాఖ. పసిపిల్లల లేత హృదయం లాగానే వారి పాటలు కూడా నిష్కపటంగానూ, నిర్మలంగానూ, స్వచ్ఛంగానూ, మార్దవంగానూ ఉంటాయి. ఈ గేయాలు అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి ఆ) పిల్లలు రాసినవి అని రెండు విధాలు.
అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి : వీటిలో లాలిపాటలు, జోలపాటలు ముఖ్యమైనవి. పిల్లలను లాలించేందుకు జోలపాడి నిద్రపుచ్చేందుకు ఇవి రచించబడ్డాయి. ఈ పాటలలోని భావాలు పిల్లలకు అర్థం కాకపోయినా వాటిలోని సంగీతం, లయ పిల్లలను లాలించి నిద్రపుచ్చుతాయి.
ఆ) పిల్లలు రాసినవి : పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరొకొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినవి ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలను అర్థంతో పనిలేకుండా గ్రహిస్తారు. వాటిని అర్థంలేని పాటలు అని కూడా అంటారు. బాలబాలికలు ఆడే చెమ్మచెక్క, బిత్తి, కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజరేకులు, గొబ్బిళ్ళు, చిట్టిచిట్టి చిర్ర మొదలైన ఆటలలో పాడే పాటలు ఇందుకు ఉదాహరణలు.
ప్రశ్న 2.
జానపదగేయాలలో పారమార్థిక గేయాల ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
భక్తి, కర్మ, జ్ఞానం – అనే మూడు మోక్ష సాధనాలలో భక్తిమార్గం సులభమైనదని భారతీయులు నమ్ముతారు. ఈ భక్తిని ప్రబోధించే గేయాలే భక్తిగేయాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు వేల సంఖ్యలో ప్రచారం పొందాయి. భక్తిగీతాలు ప్రాచీనకాలం నుంచే ఉన్నట్లు తెలుస్తున్నది. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.
అంటే భక్తిగీతాలు వీరికి జీవనోపాధిని కల్పిస్తున్నాయన్నమాట. ఈ గీతాలలో భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు మొదలైనవి తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దారువులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావళులు నామావళులు కూడా కీర్తనల కిందకే వస్తాయి.
ప్రశ్న 3.
స్త్రీల పాటలలో కనిపించే తెలుగువారి వేడుకలను తెలపండి. (లేదా) స్త్రీల పాటల్లో సంపూర్ణ జీవనం కనిపిస్తుంది. ఎలాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల సంసార సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. కనుక వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ. శిశువు పుట్టినప్పటి నుంచి వివాహం వరకూ జరిపే ప్రతి వేడుకకు సంబంధించిన పాటలు గమనించవచ్చు. పిల్లల్ని ఉయ్యాలలో ఉంచి పాడే లాలిపాటలు, జోలపాటలు ఎంతో ప్రసిద్ధమైనవి.
కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొదలైన పాటల ద్వారా కట్నాలు, నలుగులు, అలుకలు, బంతులు, అప్పగింతలు మొదలైన తెలుగువారి వేడుకలు తెలుస్తాయి. అంతేకాక సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి కూడా తరతరాల తెలుగు వారి వేడుకలను తెలిపేవే.
ప్రశ్న 4.
పనికి, పాటకి దగ్గర సంబంధం ఉంది అని శ్రామిక గేయాల ఆధారంగా తెల్పండి.
జవాబు.
పాటలు పాడుతూ పనిచేయటంవల్ల తాము చేసే కాయకష్టాన్ని మరిచి, హృదయంలోను మనసులోను ఉండే బాధ తొలగిపోవటమేకాక, శారీరక శ్రమ కూడా తెలియదు.
శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటూ ఉంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రామికగేయాలకు, గీతాలకు తాళలయలు సమకూరి ఉంటాయి.
ఉదా :- తిరుగలి పాటలు, దంపుడు పాటలు, పల్లకీ పాటలు, దుక్కి పాటలు, పడవలాగేటప్పుడు పాడే పాటలు (హైలెస్సో పాటలు) మొ||వి. దీనినిబట్టి చేసే పనికి, పాడే పాటకి దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
జానపదాలను ఏయే సందర్భాలలో పాడటాన్ని నీవు గమనిస్తున్నావు ?
జవాబు.
1) పౌరాణిక గేయాలను పురాణేతిహాసాలపైన మక్కువగల గ్రామీణులు రామాయణం, భారతం, భాగవతాది పురాణాలలో కథలకు సంబంధించిన పాటలు మనోల్లాసానికి పాడుతారు.
ఉదా :- ఊర్మిళాదేవి నిద్ర, శ్రీరామ పట్టాభిషేకం.
2) చారిత్రక గేయాలను దేశభక్తిని కల్గించి వినోదాన్ని, ఉల్లాసాన్ని కల్గించి వీరరసంలో పాడుతారు.
ఉదా :- కాటమరాజు కథ, బొబ్బిలికథ, అల్లూరి సీతారామరాజు కథ.
3) పారమార్థిక గేయాలను భక్తి జ్ఞాన కర్మ మార్గాలలో భక్తి మార్గం ద్వారా మోక్షప్రాప్తి కోసం ఈ గేయాలు పాడుతారు.
ఉదా :- భద్రాచల రామదాసు కీర్తనలు, లాలిపాటలు, తత్త్వాలు, బతుకమ్మ పాటలు మొ||వి.
4) స్త్రీల పాటలను ఇంట్లో జరిగే విభిన్న వేడుకలలో సందర్భాన్ననుసరించి పాడుతారు.
ఉదా :- వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొ||వి.
5) శ్రామిక గేయాలను కాయకష్టం చేసుకొనేవారు తమ కష్టం మరిచి పనిచేసుకోవడానికి పాడేవారు.
ఉదా :- తిరుగలి పాటలు, ఊడ్పు పాటలు, దంపుడు పాటలు.
6) పిల్లల పాటలను నిష్కపటంగా, నిర్మలముగా, మార్దవంగా ఉండే ఈ పాటలు పిల్లలకు పాడి, ఆటలు ఆడించేవారు.
ఉదా :- గుడిగుడిగుంచెం, గొబ్బిళ్ళు, కోతికొమ్మచ్చి మొ॥ వి.
7) కరుణరస గేయాలను విషాద సమయాలలో పాడి వినిపించేవారు. సందర్భాన్ని బట్టి పాడేవారు.
ఉదా :- ఎరుకల నాంచారి కథ, రాములమ్మ పాట.
ఈ విధంగా విభిన్న సందర్భాలలో సందర్భానికి తగిన జానపదగేయాలను పాడి వినోదం పొంది గ్రామీణులు ఆనందించేవారు.
IV. సృజనాత్మకత/ప్రశంస.
ప్రశ్న 1.
వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు, ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారుచేయండి.
జవాబు.
ఆహ్వానం
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పక్షంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన కళాప్రదర్శన వారోత్సవాలకు అందరికీ ఇదే సాదర ఆహ్వానం. ది. 10-10-2019 నుంచి 16-10-2019 వరకూ వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో దిగువ తెలిపిన కళారూపాలు వివిధ వేదికలపై ప్రదర్శించబడతాయి.
తేదీ సమయం |
ప్రదర్శించబడే కళారూపం |
వేదిక
|
1. 10-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లు |
గుసాడినృత్యం |
తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్ |
2. 11-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లు |
కొండరెడ్ల మామిడి నృత్యం |
తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్ |
3. 12-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు |
బతుకమ్మ ఆటలు పాటలు |
రవీంద్ర భారతి |
4. 13-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు |
తోలుబొమ్మలాట |
త్యాగరాయ గాన సభ |
5. 14-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు |
వీధి భాగవతాలు |
ఎ.వి. కళాశాల ప్రాంగణం |
6. 15-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లు |
యక్షగానాలు |
నెక్లెస్ రోడ్డు |
7. 16-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లు |
కాటి పాపలు |
హరికళాభవనం, సికిందరాబాదు |
కనుక ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం.
స్థలం : హైదరాబాదు,
తేదీ : 5-10-2019.
ఇట్లు
ఆహ్వాన కమిటి,
భాగ్యనగర్ దసరా ఉత్సవ సంఘం.
V. పదజాల వినియోగం:
కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.
ఉదా : కవితా సౌరంభం వెదజల్లుతుంది.
సౌరభం = సువాసన, పరిమళం
అ) గృహజీవనానికి స్త్రీలే ఆలంబనం.
జవాబు.
ఆలంబనం = ఆధారం, ఆశ్రమం
ఆ) భక్తి మార్గం మోక్ష సాధనం.
జవాబు.
మోక్షం = కైవల్యం, ముక్తి
ఇ) కాయ కష్టం చేసేవారు కొందరు. తినేది అందరూ.
జవాబు.
కష్టం = ఇక్కట్టు, శ్రమ
2. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
ఆ) పురోగతి
జవాబు.
ప్రజలంతా శక్తి వంచన లేకుండా కృషిచేసినప్పుడే జాతి పురోగతి సాధ్యం అవుతుంది.
ఆ) రూపురేఖలు
జవాబు.
మనిషికి రూపురేఖలు కంటే మంచి గుణమే ముఖ్యం.
ఇ) కూనిరాగాలు
జవాబు.
కూనిరాగాలు తీస్తూ గొప్ప గాయకులమని ఊహించుకోకూడదు.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జవాబు.
మావయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.
ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
జవాబు.
కొమ్మ విరిగిపోయి కింద పడింది.
ఇ) శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
జవాబు.
శత్రువులు భయపడి పారిపోయారు.
2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు.
శివ అన్నము, రాజు పండ్లు తిన్నారు.
ఆ) ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరికాయ తెచ్చింది.
జవాబు.
ఆమె పూలు, కొబ్బరికాయ తెచ్చింది.
ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. వర్షం పడలేదు.
జవాబు.
నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి కానీ వర్షం పడలేదు.
తత్పురుష సమాసం:
3. కింది వాక్యం చదువండి.
‘రాజభటుడు వచ్చాడు.’
పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.
తిండి గింజలు తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి
పై రెండు వాక్యాలను కూడ గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.
పూర్వ పదాలు |
ఉత్తర పదాలు |
రాజు |
భటుడు |
తిండి |
గింజలు |
పాప |
భీతి |
సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.
కింది పట్టికను చూడండి. చదువండి.
తత్పురుష సమాసం రకాలు |
విభక్తులు |
ఉదాహరణ |
ప్రథమా తత్పురుషం |
డు, ము, వు, లు |
మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య భాగం (సమాసంలోని మొదటి పదం ప్రథమా విభక్తిలో ఉన్నది కనుక ప్రథమా తత్పురుషం. ‘యొక్క’ వచ్చింది అని షష్ఠీతత్పురుషంగా పొరపాటు పడకూడదు) |
ద్వితీయా తత్పురుషం |
ని, ను, ల, కూర్చి గురించి |
జలధరం – జలమును ధరించినది. |
తృతీయా తత్పురుషం |
చేత, చే, తోడ, తో |
బుద్ధిహీనుడు – బుద్ధి చేత హీనుడు. |
చతుర్థీ తత్పురుషం |
కొరకు, కై |
దూడగడ్డి – దూడకొరకు గడ్డి |
పంచమీ తత్పురుషం |
వలన (వల్ల), కంటె, పట్టి |
దొంగభయం- దొంగవలన భయం |
షష్ఠీ తత్పురుషం |
కి, కు, యొక్క, లో, లోపల |
రామబాణం – రాముని యొక్క బాణం |
సప్తమీ తత్పురుషం |
అందు, న |
దేశభక్తి – దేశము నందు భక్తి |
కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (న అంటే వ్యతిరేకార్థం)
4. కింది పదాలు చదువండి. వాటి విగ్రహ వాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
సమాసపదం-విగ్రహవాక్యం-సమాసం పేరు
అ) గదాధరుడు = గదను ధరించినవాడు = ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) అగ్నిభయం = అగ్ని వలన భయం = పంచమీ తత్పురుష సమాసం
ఇ) గుణహీనుడు = గుణముల చేత హీనుడు = తృతీయా తత్పురుష సమాసం
ఈ) ధనాశ = ధనము నందలి ఆశ = సప్తమీ తత్పురుష సమాసం
ఉ) దైవభక్తి = దైవము నందలి భక్తి = సప్తమీ తత్పురుష సమాసం
ఊ) అజ్ఞానం = జ్ఞానం కానిది = నఞ తత్పురుష సమాసం
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
పెండ్లిళ్ళలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలను సేకరించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
- ప్రాజెక్టు పని పేరు : పెండ్లిళ్ళు మరియు శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు
- సమాచారాన్ని సేకరించిన విధానం : ఇంటిలో పెద్దవాళ్ళ ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా
ఆ) నివేదిక :
1. పెండ్లిళ్ళలో పాడే పాటలు :
1) నూతన వధువు గృహ ప్రవేశము :
పల్లవి : మహాలక్ష్మి రావమ్మా శ్రీలక్ష్మి రావమ్మ
మా ఇంట కొలువుండ రావమ్మ
మంగళ హారతులు గొనుమమ్మ
చరణాలు :
1. అష్టలక్ష్మీ నీకు స్వాగతము పలికేము
ఇష్టముగ మా ఇంటి సౌభాగ్యములు కలుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా ………….. || మంగళ ||
2. పదము పెట్టిన చోట సిరిసంపదలు గలుగ
కరము తాకిన వెనుక ధనధాన్య రాశులుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా ……… || మంగళ ||
3. పతి భక్తితో నీవు పతివ్రతగా వర్ధిల్లు
పదికాలములు పిల్లపాపలతో రాజిల్లు
గృహలక్ష్మివై నీవు రావమ్మా ………… ॥మంగళ ॥
4. సకల సుఖశాంతులతో సంసారమును నడుప
తులసిదాసుడు నీకు శుభ మంగళము పలుక
గృహలక్ష్మివై నీవు రావమ్మా ………….. ॥మంగళ ॥
2) అప్పగింతల పాట :
పల్లవి : కోటి శుభములు కలుగు నీకు పోయిరావమ్మ
ముక్కోటి వేల్పుల దీవెలనతో వెలయు మాయమ్మ ॥కోటి॥
చరణాలు :
1. కీర్తికాంతుల భాగ్యరాశుల శోభ నీదమ్మా
పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తేవమ్మా
2. అత్తమామలె తల్లిదండ్రులు ఈ క్షణము నుండి
ఉత్తమ ఇల్లాలిగా నువు మసలుకోవమ్మా
3. మగని మనసెరిగి నీవు నడుచుకోవమ్మా
ప్రేమ మీరగ భర్త సేవలు చేసుకోవమ్మా
4. మరిది బావల ఆడపడచుల కలిసిమెసలమ్మా
బంధుమిత్రులు సేవకులను ఆదరించమ్మా.
5. అల్లుడా మా ముద్దు పట్టిని ఒప్పగించేము
మనసుదీరగ మురిపెమారగ ఏలుకోవయ్యా
6. కల్ల కపటము లేని పిల్లను మీకు ఇచ్చేము
కంటి పాపగ వెంట నుండి చూసుకో వదినా ॥కోటి॥
3) బెస్తవాళ్ళ పాట :
ఏలియాల – ఏలియాల – ఏలియాల
ఐలేసా జోరిసెయ్యి – ఐలేసా బారుసెయ్యి
గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ
కాళిందికి తెల్ల కల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి ……….. జోర్సెయ్యి బార్సెయ్యి || ఏలియాల ॥
గోదారి తల్లికి ……….. గొజ్జంగి పూదండ
సరస్వతికి ……….. సన్నజాజి దండ
కృష్ణవేణమ్మకు ……….. గౌదంగి పూదండ
కావేరికి చంద్రకాంత దండా
ఐలేసా జోరుసెయ్యి – ఐలేసా బారుసెయ్యి || ఏలియాల ॥
ఇ) ముగింపు : ఈ విధంగా పెండ్లిళ్ళ పాటలలో వరుడికి నలుగు పెట్టేప్పుడు పాట, వధువుకు నలుగు పెట్టేటపుడు పాట, అప్పగింతల పాట, నిశ్చయ తాంబూలం పాట, నూతన వధువు గృహప్రవేశం పాట.. ఇలా ఎన్నో పాటలు ఆయా సందర్భాలను బట్టి ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని పాడేవాళ్ళు బహు అరుదు.
అదే విధంగా కర్షకులు పొలం పని చేసేప్పుడు, శ్రామికులు ఆయా పనులు చేస్తున్నప్పుడు, తమ శ్రమను మరచి పోవడానికి అనేక జానపద గీతాలను పాడుతుంటారు. జానపదం అంటే జనం నోటితో పాడుకుంటూ, ఒక తరం నుండి మరొక తరానికి అందించే పాటలు. వీటికి లిఖిత రూపం ఉండదు. ఇలా సంస్కృతి వారసత్వంగా వస్తున్న ఈ పాటలను పరిరక్షించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇతర అంశాలు:
పర్యాయపదాలు:
హృదయం = ఎద, మది, మనస్సు, గుండె
గేయం = గీతం, పాట, కీర్తన, సంకీర్తన
ప్రజలు = జనం, పౌరులు, పాలితులు, మనుషులు
భాష = మాట, వాక్కు
సాహిత్యం = వాఙ్మయం, సారస్వతం
తొలి = ముందు, తొల్లి, పూర్వం
పెక్కు = చాలా, అనేక
పండితులు = విద్వాంసులు, విద్యావంతులు, చదువుకున్నవారు, శిష్టులు
నానార్థాలు:
అర్థం = శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు
కాలం = నల్లని, సమయం, మరణం, ఇనుము
పదం = మాట, పాట
కవి = కవిత్వం చెప్పేవాడు, హంస, శుక్రాచార్యుడు, పండితుడు
వృత్తి = పని, జీవనోపాయము, స్థితి, పద్ధతి
అమూల్యం = వెలలేనిది, మిక్కిలి వెలగలది
వృత్తాంతం = సంగతి, కథ, విధం, అవసరం, ఉదాహరణం
వ్యుత్పత్త్యర్థాలు:
అదృష్టం = దైవకృతమగుట వలన కనబడనిది (భాగ్యము)
సాహిత్యం = హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది (సారస్వతం)
కృష్ణుడు = కృష్ణ (నలుపు) వర్ణము కలవాడు (విష్ణువు)
గ్రామము = ప్రాణుల చేత అనుభవించబడునది (ఊరు)
పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (విద్వాంసుడు)
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
అగ్ని – అగ్గి
శక్తి – సత్తి, సత్తు
కవిత – కైత, కయిత,
కథ – కత, కద
స్నానం – తానం
ముఖం – మొకం, మొగం
సంధులు:
ప్రాంతమంతటా = ప్రాంతము + అంతటా = ఉత్వసంధి
దేశమంతటా = దేశము + అంతటా = ఉత్వ సంధి
ఆవిష్కృతమవుతుంది = ఆవిష్కృతము + అవుతుంది = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఎంతైనా = ఎంత + ఐనా = అత్వసంధి
ప్రాచీనమైనట్టిది = ప్రాచీనమైన + అట్టిది = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
ప్రేమాభిమానాలు = ప్రేమ + అభిమానాలు = సవర్ణదీర్ఘసంధి
నాదామృతం = నాద + అమృతం = సవర్ణదీర్ఘసంధి
రామాయణాదులు = రామాయణ + ఆదులు = సవర్ణదీర్ఘసంధి
భాగవతాది = భాగవత + ఆది = సవర్ణదీర్ఘసంధి
అభీష్టానుగుణం = అభీష్ట + అనుగుణం = సవర్ణదీర్ఘసంధి
వైష్ణవాది = వైష్ణవ + ఆది = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
పురాణేతిహాసాలు = పురాణ + ఇతిహాసాలు = గుణసంధి
విమోచనోద్యమం = విమోచన + ఉద్యమం = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.
అత్యుత్తమ = అతి + ఉత్తమ = యణాదేశసంధి
అత్యంత = అతి + అంత = యణాదేశసంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, ర లు ఆదేశమవుతాయి.
సమాసములు:
ఇతర భాషలు = ఇతరమైన భాషలు – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం
మృదుహృదయం = మృదువైన హృదయం – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం
లేత హృదయం = లేతదైన హృదయం – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం
భాషా సంస్కృతులు = భాషయునూ సంస్కృతియునూ – ద్వంద్వ సమాసం
ఉచ్ఛ్వాస నిశ్వాసలు = ఉచ్ఛ్వాసయునూ నిశ్వాసయునూ – ద్వంద్వ సమాసం
తాళలయలు = తాళమునూ లయయునూ – ద్వంద్వ సమాసం
దైవ సమానుడు = దైవముతో సమానుడు – తృతీయ తత్పురుష సమాసం
వీరపూజ = వీరుల యొక్క పూజ – షష్ఠీ తత్పురుష సమాసం
జానపద గేయాలు = జానపదుల యొక్క గేయాలు – షష్ఠీ తత్పురుష సమాసం
శిష్ట సాహిత్య = శిష్టుల యొక్క సాహిత్యం – షష్ఠీ తత్పురుష సమాసం
సీతా కళ్యాణం = సీత యొక్క కళ్యాణము – షష్ఠీ తత్పురుష సమాసం
కాటమరాజు కథ = కాటమరాజు యొక్క కథ – షష్ఠీ తత్పురుష సమాసం
మోక్ష సాధనాలు = మోక్షము యొక్క సాధనాలు – షష్ఠీ తత్పురుష సమాసం
అగ్ని ప్రవేశం = అగ్ని యందు ప్రవేశం – సప్తమీ తత్పురుష సమాసం
వేదాంత సత్యాలు = వేదాంతము నందలి సత్యాలు – సప్తమీ తత్పురుష సమాసం
ఎసైన్మెంట్:
పదజాలం :
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
జీవనోపాధి : _____________
జవాబు.
ప్రతి ఒక్కరి జీవనోపాధి నిజాయితీగా సాగాలి.
ప్రశ్న 2.
మార్దవం : _____________
జవాబు.
పసిపిల్లల మనసు ఎంతో మార్దవంగా ఉంటుంది.
ప్రశ్న 3.
ఇతివృత్తం : _____________
జవాబు.
ఇతివృత్తం బాగుంటే దానిని అందరూ ఆదరిస్తారు.
కింది వాటిలో గీతగీసిన పదాలకు అర్థం గుర్తించండి.
ప్రశ్న 4.
చిన్న చిన్న నీటి కుంటలు బహుళంగా ఏర్పాటు చేసుకోవడం మేలు. ( )
A) మిక్కిలి
B) తక్కువ
C) లోతు
D) విశాలం
జవాబు.
A) మిక్కిలి
ప్రశ్న 5.
రమణీయములైన అర్థాన్ని ఇచ్చే శబ్దాల కూర్పే కవిత్వం. ( )
A) ఎక్కువ
B) తక్కువ
C) సొగసు
D) సొంత
జవాబు.
C) సొగసు
ప్రశ్న 6.
నేడు దేశంలో మేధావుల కొరత ఉన్నదనేది వాస్తవం. ( )
A) చెప్పుడు మాట
B) సత్యం
C) అబద్ధం
D) విన్నమాట
జవాబు.
B) సత్యం
ప్రశ్న 7.
విద్యావంతులు పూనుకుంటే దేశాభివృద్ధి పెద్ద కష్టంకాదు. ( )
A) అధికారులు
B) నాయకులు
C) పేదవారు
D) పండితులు
జవాబు.
D) పండితులు
పర్యాయపదాలు:
కింది వాటిలో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు గుర్తించండి.
ప్రశ్న 8.
పసివారి హృదయం పువ్వుల్లా మృదువైనది. ( )
A) శరీరం, తనువు
B) ఎద, తల
C) మనసు, మది
D) ఎద, తలపు
జవాబు.
C) మనసు, మది
ప్రశ్న 9.
కాళిదాసు భారతీయ సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహాకవి. ( )
A) సారస్వతం, వాఙ్మయం
B) సంస్కృతం, వంశం
C) జాతి, వెల
D) నాగరికత, సంస్కృతి
జవాబు.
A) సారస్వతం, వాఙ్మయం
ప్రశ్న 10.
భారతీయ తత్త్వశాస్త్ర అనే గొప్ప గ్రంథాన్ని రచించిన రాధాకృష్ణ పండితుడు మనదేశానికి తొలి ఉపరాష్ట్రపతి. ( )
A) అధికారి
B) విద్వాంసుడు, విద్యావంతుడు
C) మంత్రి
D) రాయబారి
జవాబు.
B) విద్వాంసుడు, విద్యావంతుడు
ప్రశ్న 11.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు. ‘ప్రజలు’ పర్యాయపదాలు. ( )
A) జనులు, పౌరులు
B) సురలు, దానవులు
C) లోకులు, దాతలు
D) నాయకులు, అసురులు
జవాబు.
A) జనులు, పౌరులు
నానార్థాలు:
కింది వాటిలో గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.
ప్రశ్న 12.
ఉదయ కాలంలో ముసిరిన కాల మేఘాలు కురవకుండా పోవు. ( )
A) సమయం, సంధ్య
B) సంధ్య, తెల్లని
C) సమయం, నల్లని
D) సూర్యుడు, తెల్లని
జవాబు.
C) సమయం, నల్లని
ప్రశ్న 13.
నాగేశభట్టు అనే గొప్ప పండితుడు సంస్కృత వ్యాకరణానికి వృత్తి రచించడమే వృత్తిగా జీవించాడు. ( )
A) జీవనం, పౌరుషం
B) వివరణ గ్రంథం, జీవనోపాయం
C) అనువాదం, వివరణం
D) జీతం, భత్యం
జవాబు.
B) వివరణ గ్రంథం, జీవనోపాయం
ప్రశ్న 14.
కవి కుమార్తె అయిన దేవయాని కథను నన్నయ కవి చక్కగా చిత్రించాడు. ( )
A) శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు
B) పండితుడు, హంస
C) హంస, శుక్రుడు
D) హంస, రాజు
జవాబు.
A) శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు
ప్రకృతులు – వికృతులు:
కింది గీత గీసిన పదాలకు ప్రకృతులు – వికృతులు గుర్తించండి.
ప్రశ్న 15.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – వికృతి పదం ( )
A) మంట
B) ఆగ్నేయం
C) విఘ్నం
D) అగ్గి
జవాబు.
D) అగ్గి
ప్రశ్న 16.
లోకంలో శక్తితో సాధ్యం కాని పనులను యుక్తితో సాధించాలి. – వికృతి పదం ( )
A) సత్తు
B) ఆసక్తి
C) భక్తి
D) సకితి
జవాబు.
A) సత్తు
ప్రశ్న 17.
కథా నిలయం స్థాపించిన కాళీపట్నం రామారావు గొప్ప కథకుడు. – ‘కథ’ వికృతి పదం ( )
A) కద
B) నవల
C) కత
D) కదము
జవాబు.
C) కత
భాషాంశాలు :
సరియైన సమాధానాన్ని గుర్తించండి.
ప్రశ్న 18.
దేశమంతటా ఏ సంధి ? ( )
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) యడాగమసంధి
జవాబు.
C) ఉత్వసంధి
ప్రశ్న 19.
ఎంతైనా – విడదీసిన రూపం ( )
A) ఎంతై + నా
B) ఎంత + అయినా
C) ఎంతో + ఐనా
D) ఎంత + ఐనా
జవాబు.
D) ఎంత + ఐనా
ప్రశ్న 20.
భాగవతాది – ఏ సంధి ? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) అత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు.
A) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 21.
అకారానికి ఇ ఉ ఋలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్ లు ఏకాదేశమవుతాయి – ఇది ఏ సంధి ? ( )
A) అత్వసంధి
B) గుణసంధి
C) ఉత్వసంధి
D) వృద్ధిసంధి
జవాబు.
B) గుణసంధి
ప్రశ్న 22.
కింది వాటిలో యణాదేశసంధికి ఉదాహరణ. ( )
A) వైష్ణవాది
B) పురాణేతిహాసాలు
C) అత్యంత
D) దేశమంతటా
జవాబు.
C) అత్యంత
సమాసాలు:
సరియైన సమాధానాన్ని గుర్తించండి.
ప్రశ్న 23.
కింది వాటిలో విశేషణ పూర్వపదకర్మధారయ సమాసానికి ఉదాహరణ ? ( )
A) సీతాకళ్యాణం
B) ఉచ్ఛ్వాసనిశ్వాసలు
C) మృదుహృదయం
D) అగ్నిప్రవేశం
జవాబు.
C) మృదుహృదయం
ప్రశ్న 24.
వేదాంత సత్యాలు – ఏ సమాసం ? ( )
A) షష్ఠీ తత్పురుష
B) సప్తమీ తత్పురుష
C) ద్వంద్వ
D) బహువ్రీహి
జవాబు.
B) సప్తమీ తత్పురుష
ప్రశ్న 25.
కింది వాటిలో షష్ఠీ తత్పురుష సమాసం కానిది ఏమిటి ? ( )
A) తాళలయలు
B) శిష్టసాహిత్యం
C) కాటమరాజు కథ
D) మోక్ష సాధనాలు
జవాబు.
A) తాళలయలు
ప్రశ్న 26.
కింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ( )
A) వీరపూజ
B) జానపద గేయాలు
C) లేత హృదయం
D) ఉచ్ఛ్వాసనిశ్వాసలు
జవాబు.
D) ఉచ్ఛ్వాసనిశ్వాసలు
వాక్యాలు – రకాలు:
క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
ప్రశ్న 27.
ఆహా! ఆ పాటలు ఎంత బాగున్నాయో. ( )
A) ఆశ్చర్యార్థకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు.
A) ఆశ్చర్యార్థకం
ప్రశ్న 28.
గీతాలు గేయాలు ఒకటేనా ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) హేత్వర్థకం
జవాబు.
C) ప్రశ్నార్థకం
ప్రశ్న 29.
అందరూ జానపద గేయాలు పాడగలరు. ( )
A) ప్రశ్నార్థకం
B) సామర్ధ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
B) సామర్ధ్యార్థకం
ప్రశ్న 30.
మీరు రావచ్చు. ( )
A) ప్రశ్నార్థకం
B) సామర్థ్యార్థకం
C) నిషేధార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
D) అనుమత్యర్థకం
క్రియను గుర్తించుట:
క్రింది గీతగీసిన పదాలు ఏ క్రియా పదమో గుర్తించండి.
ప్రశ్న 31.
పాటలు విని ఆనందించండి. ( )
A) క్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్వార్థం
ప్రశ్న 32.
శ్రామికులు పనిచేస్తూ పాటలు పాడుతారు. ( )
A) కార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) శత్రర్థకం
ప్రశ్న 33.
పాటలు వింటే అందులో మాధుర్యం తెలుస్తుంది. ( )
A) క్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం
సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:
సరియైన సమాధానాన్ని గుర్తించండి.
ప్రశ్న 34.
జానపద గేయాలు వినోదాన్నిస్తాయి, చైతన్యాన్నిస్తాయి.- సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) జానపద గేయాలు వినోదానిస్తూ చైతన్యాన్నిస్తాయి.
B) జానపద గేయాలు వినోదాన్నీ మరియు చైతన్యాన్నిస్తాయి.
C) జానపద గేయాలు వినోదంతో పాటు చైతన్యాన్నిస్తాయి.
D) వినోదం, చైతన్యం ఇస్తాయి జానపద గేయాలు.
జవాబు.
B) జానపద గేయాలు వినోదాన్నీ మరియు చైతన్యాన్నిస్తాయి.
ప్రశ్న 35.
పిల్లలను లాలిపాటలు లాలిస్తాయి. బుజ్జగిస్తాయి. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) పిల్లలను లాలిపాటలు లాలించి బుజ్జగిస్తాయి.
B) పిల్లలను లాలిపాటలు లాలించాలని బుజ్జగిస్తాయి.
C) లాలించి బుజ్జగిస్తాయి పిల్లల్ని లాలిపాటలు.
D) పిల్లలను లాలిపాటలు లాలిస్తూ బుజ్జగిస్తాయి.
జవాబు.
A) పిల్లలను లాలిపాటలు లాలించి బుజ్జగిస్తాయి.
ప్రశ్న 36.
భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు. జానపద గాయకులకు పుట్టినిల్లు. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) భారతదేశం తత్త్వవేత్తలకేగాక జానపద గాయకులకు పుట్టినిల్లు.
B) తత్త్వవేత్తలకు, జానపద గాయకులకు పుట్టినిల్లు భారతదేశం.
C) తత్త్వవేత్తలకు, జానపద గాయకులకు భారతదేశం పుట్టినిల్లు.
D) భారతదేశం తత్త్వవేత్తలకు మరియు జానపద గాయకులకు పుట్టినిల్లు.
జవాబు.
D) భారతదేశం తత్త్వవేత్తలకు మరియు జానపద గాయకులకు పుట్టినిల్లు.