AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 6 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 6 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

పవనజజంఘాసంభవ
పవనము వడిఁగడలిఁ బాయవడ నడఁచి మహా
వివరమునకు జొరంబడి
పవనాశనకోటి నాశపఱచి గమించెన్

ప్రశ్నలు :

అ) హనుమంతుడి పిక్కల నుండి ఏమి పుట్టింది ?
జవాబు:
హనుమంతుడి పిక్కల నుండి గాలి పుట్టింది.

ఆ) గాలి దేనిని చీల్చుకుంటూ లోతుకు ప్రవేశించింది ?
జవాబు:
గాలి సముద్రాన్ని చీల్చుకుంటూ లోతుకు ప్రవేశించింది.

ఇ) సముద్రం లోపలికి చేరిన గాలి ఎవరికి ఆశ కలిగించింది ?
జవాబు:
సముద్రం లోపలికి చేరిన గాలి పాములకు ఆశ కలిగించింది.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పై పద్యంలో ‘సముద్రం’ అనే అర్థం వచ్చే పదం ఏది ?

(లేదా)

అట్టి యెందఱో భరతాంబ యాఁడుబిడ్డ
లమల పతిదేవతాత్వ భాగ్యములు వోసి
పుట్టినిలు మెట్టినిలుఁ బెంచు పుణ్యసతులు
గలరు, భారతావని భాగ్యకల్పలతలు

ప్రశ్నలు :

ఉ) భారతీయ పతివ్రతలుగా శివాజీ ఎవరిని ఉదాహరణగా చెప్పాడు?
జవాబు:
భారతీయ పతివ్రతలుగా అనసూయ, సావిత్రి, సీత, సుమతిలను శివాజీ ఉదాహరణగా చెప్పాడు.

ఊ) పుట్టినింటికీ, మెట్టినింటికీ కీర్తి పెంచేది ఎవరు ?
జవాబు:
పుట్టినింటికీ, మెట్టినింటికీ కీర్తి పెంచేది భారతీయ స్త్రీలు.

ఋ) స్త్రీలు భారతదేశానికి ఎటువంటివారు ?
జవాబు:
స్త్రీలు భారతదేశానికి అదృష్టకల్పలతలు.

ౠ) పద్యంలో స్త్రీల గొప్పతనాన్ని చెప్పింది ఎవరు ?
జవాబు:
పద్యంలో స్త్రీల గొప్పతనాన్ని చెప్పింది శివాజీ.

AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

క్రిస్టమసు వస్తూంది. క్రిస్టమసుకూ, సంక్రాంతికీ కలిపి కాలేజీ సెలవులు ఇస్తారు. నేను ఈ ఏడు చదువు సాగిస్తే నిన్ను మా ఊరు తీసుకొని రావాలి అనుకొన్నాను. కాని పురిటిలోనే సంధి కొట్టింది నా చదువుకు.
డబ్బులేని చదువు ఇబ్బందుల చేటు. వచ్చే ఏడైనా చదువుతానో చదవనో, కాలం జరిగిపోయేకొద్దీ స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి. కొత్త పరిచయాలు కలిగేకొద్దీ పాతపరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. ఇది ప్రపంచ స్వభావం. కనుక ఈ సెలవులకు మా ఊరు వస్తావనే అనుకొంటున్నాను. నీవంటి ఆర్ద్రహృదయుడు పల్లెటూళ్ళు వచ్చి ఇక్కడ ప్రజలు పడే కష్టాల్నీ – కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు మానవసంఘానికి ఈయగల ఆనందాన్నీ చూస్తే ఎప్పటికైనా మంచిది.

ప్రశ్నలు :

అ) ఏ రెండు పండుగలకు కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు ?
జవాబు:
క్రిస్టమసుకూ, సంక్రాంతికీ కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు.

ఆ) కాలం గడిచిపోయే కొద్దీ స్నేహాలు ఏమవుతాయి ?
జవాబు:
కాలం జరిగిపోయేకొద్దీ స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి.

ఇ) పాత పరిచయాలు ఎప్పుడు అడుగున పడిపోతాయి ?
జవాబు:
కొత్త పరిచయాలు కలిగేకొద్దీ పాతపరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
‘పని ప్రారంభించగానే ఆగిపోవడం’ అనే అర్థంలో ఉపయోగించే జాతీయాన్ని గుర్తించండి ?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి.

అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్చార్చుకున్నాడు.
జవాబు:
సుందరకాండ

ఆ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేసాడు.
జవాబు:
అరణ్యకాండ

ఇ) శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు.
జవాబు:
కిష్కింధాకాండ

ఈ) కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామలక్ష్మణులు ధరించారు.
జవాబు:
అయోధ్యాకాండ

4. క్రింది లేఖ చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

గన్నవరం
తేదీ : XX.XX.XXXX.

ప్రియమైన శారదకు,

నీ సోదరి అమృత వ్రాయు లేఖ.

ఇక్కడ అంతా క్షేమం. అక్కడ మీరంతా కుశలమని తలుస్తాను. ముఖ్యంగా రాయునది ;

ఒక ప్రాంతంలో మాట్లాడే భాష అక్కడివారికి చాలా ఇష్టంగా ఉంటుంది. అదే మాతృభాష. మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా తీయనైన భాష, తెలుగును పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అంటారు. మన భాషలో అనేక సామెతలు, జాతీయాలు, పదబంధాలు ఉన్నాయి. తెలుగులో చాలామంది కవులు, రచయితలు ఉన్నారు. విదేశీయులు కూడా మెచ్చుకొన్న భాష మన తెలుగు భాష. ఎంతో మంది చక్రవర్తులు, రాజులు, జమీందారులు ఆదరించి, అభిమానించిన భాష మన తెలుగు భాష.

తెలుగు భాషలో ఎవరి ప్రాంతపు మాండలికం వారికిష్టం. ఎవరి ప్రాంతపు యాస వారికిష్టం. ఎవరి ప్రాంతపు నుడికారాలు, పదబంధాలు, సామెతలు వారికి మక్కువ. ఎవరు ఎలా మాటలాడినా అది మధురమైన మన తెలుగు భాషే! అందుకే మన భాషాభివృద్ధికి మనమందరం పాటుపడదాం!

సెలవు తీసుకుంటాను. మీ పెద్దలకు నమస్కారాలు. తప్పక ఉత్తరం రాయగలవు.

ಇಲ್ಲು
నీ సోదరి,
అమృత.

ప్రశ్నలు :

అ) తెలుగు భాషను పాశ్చాత్యులు ఏమన్నారు ?
జవాబు:
తెలుగు భాషను పాశ్చాత్యులు “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అని అన్నారు.

ఆ) పై లేఖ ఎవరు ఎవరికి రాశారు ?
జవాబు:
పై లేఖ అమృత శారదకు వ్రాసింది.

AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions

ఇ) తెలుగు భాషలో ఏమి ఉన్నాయి?
జవాబు:
తెలుగు భాషలో సామెతలు, జాతీయాలు, పదబంధాలు ఉన్నాయి.

ఈ) పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.’
జవాబు:
మనమందరం దేనికై పాటుపడాలి ?

విభాగము – II
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత:

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

5. చంద్రోదయాన్ని అత్యంత మనోహరంగా వర్ణించిన “వెన్నెల” పాఠ్యభాగ ‘కవి పరిచయం’ వ్రాయండి.
జవాబు:

  1. కవి, కాలము : ఎఱ్ఱన, 14వ శతాబ్దము. అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.
  2. రచనలు : నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొ||నవి.
  3. బిరుదు : ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు.
  4. ఎఱ్ఱన రచనలలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయి.

6. “మా ప్రయత్నం” పాఠ్యభాగ నేపథ్యం తెల్పండి.
జవాబు:
ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలియజేసేదే ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ‘ముందుమాట’ను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

7. రావణుడు పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
రావణుడు గొప్ప శివభక్తుడు, లంకానగరానికి రాజు, రాక్షసుడు. శూర్పణఖకు జరిగిన అవమానానికి శ్రీరామునిపై పగబట్టాడు. ప్రతీకారంగా సీతను ఎత్తుకుపోయి లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంచాడు. అతడు ఎంత భక్తుడైనా, బలవంతుడైనా సీతను చెరబట్టి అధర్మం ఆచరించాడు. అందుకే సమూలంగా నాశనమైనాడు. శ్రీరాముడు వానర సైన్యం సహాయంతో, లంకపై విరుచుకుపడి రావణుని ససైన్యంగా ‘నేలగూల్చాడు. ‘రామరావణుల యుద్ధానికి రామరావణుల యుద్ధమే సాటి’ అని ఈ నాటికీ చెప్పుకోగల మేటి యోధుడు రావణుడు. కాని పరస్త్రీ వ్యామోహంతో పతనమైనాడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి.

8. ‘వెన్నెల’ పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
మహాప్రస్థానంలో కళ,కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా! దీనినెలా సమర్థిస్తావు ?
జవాబు:
వర్ణనలకు ఆద్యుడని పేరు పొందిన ఎఱ్ఱన వెన్నెలను ఎంతో మనోహరంగా వర్ణించాడు. దిక్కులు అనే కొమ్మలతో, వెలుగులీనే చుక్కలు అనే పూలతో ఆకాశం పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది. ఆ పూలను అందుకోడానికి కిరణాలు అనే తన చేతులను పొడవుగా జాపుతూ చంద్రుడు పైపైకి వచ్చాడు.

పాల సముద్రం నుంచి పుట్టిన వెన్నెల ఉప్పొంగి దిక్కులన్నిటినీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం శేషపానుపులాగా ఉన్నది. చంద్రునిలోని మచ్చ ఆ పాన్పుమీద పడుకున్న విష్ణువులాగా ఉన్నది.

వెన్నెలలో కలువ పూలు రేకులు విచ్చుకొని వాలిపోయిన కేసరాలు తిరిగి బలంగా నిలుచున్నాయి. పుప్పొడి మీద తేనెలు పొంగిపొరలి తుమ్మెదలకు విందుచేశాయి. కమ్మని సువాసనలు చుట్టూ వ్యాపించాయి.

వెన్నెల వర్షంలో చంద్రకాంత శిలలు కరిగిపోయాయి. ఎగిరే చకోర పక్షుల రెక్కలను తాకుతూ కలువపూలపై వ్యాపించింది వెన్నెల. స్త్రీల మనోహరమైన చిరునవ్వులను అధికం చేస్తూ దిక్కులను ముంచెత్తుతూ అంతటా వ్యాపించింది వెన్నెల.

అందంగా, గంభీరంగా, సమున్నతంగా విస్తరించింది వెన్నెల. రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి ఎక్కడా కనబడవీయక కళ్ళకు అమృతపు జల్లులాగా, శరీరానికి మంచి గంధం పూతలాగా, మనసుకు ఆనంద తరంగంలాగా వెన్నెల హాయిని కలిగించిందని వర్ణిస్తూ కవి ఎఱ్ఱన వెన్నెలను చూసి స్పందించాడు.

(లేదా)

పరిచయం : మేధావి అయిన మానవుడు భౌతిక సౌఖ్యాల కోసం, బహువిధ సౌకర్యాల కోసం వివిధ శాస్త్ర విజ్ఞానాలను తయారుచేసుకున్నాడు. అలాగే మానసిక సౌఖ్యం కోసం, ఆనందోల్లాసాల కోసం కళ, కవిత విజ్ఞానాలను సృష్టించుకున్నాడు. ఇవి మానవ జీవనంలో విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి.

ప్రకృతి – కళలు : మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. నాటి నుంచి ప్రకృతిని తన కనుసన్నల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. కాలికి గజ్జె కట్టి పాటకు అనుగుణంగా లయాత్మకంగా చిందులు వేశాడు. ఆదిమానవుడు ప్రకృతి ఒడినే పాఠశాలగా చేసుకొని కళాభినివేశాన్ని అలవరచుకొన్నాడు.

మనిషి మేధస్సు : చక్రాన్ని, లిపిని, కనుగొని తన ప్రస్థానంలో విజ్ఞానంవైపు అడుగులు వేశాడు. చక్రం మానవ చలనానికి దోహదపడగా లిపి భావ సంచలనానికి దోహదపడింది. వాటి సహాయంతో మానవుడు రాతియుగపు చీకటిని చీల్చుకొంటూ నవీన విజ్ఞానంవైపు ప్రస్థానం సాగించాడు. నిప్పును కనుగొనడం, వ్యవసాయం ప్రారంభించడం, కళలను ఆవిష్కరించడం మొదలైనవన్నీ అతని ప్రస్థానంలోని గొప్ప సంఘటనలు.

ముగింపు : కళలు, విజ్ఞాన కాంతులతో జీవన ప్రయాణంలో నేల నుండి నింగికెగిరిన మానవుడే శాశ్వతుడయ్యాడు. మనిషి కాలగర్భంలో కలిసిపోయినా అతని మేధస్సులో నుంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికీ ఎట్లా జీవించాలో. చూపించాయి. మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేస్తున్నాయి.

9. రామ రావణ యుద్ధాన్ని వర్ణించండి.
(లేదా)
వాలికి, రాముడికి జరిగిన సంభాషణను బట్టి నీవేమి గ్రహించావు ?
జవాబు:
1. లంకలో నాలుగువైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. దీనిని గమనించిన రావణుడు దీర్ఘాలోచనలో పడగా, యుద్ధం మొదలైనది. అంగదుని చేతిలో ఓడిన ఇంద్రజిత్తు కపట యుద్ధం చేసి నాగాస్త్రంతో రామ, లక్ష్మణులను మూర్ఛపోయేలా చేశాడు. గరుత్మంతుని రాకతో రామ, లక్ష్మణులు దాని ప్రభావం నుండి విముక్తులై తేరుకున్నారు.

2. హనుమంతుని కోరిక మేరకు శ్రీరాముడు అతని భుజాలపై కూర్చుని, రావణునితో పోరాడాడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు, కిరీటం దాసోహమయ్యాయి. అవమాన భారం సహింపలేని రావణుడు కుంభకర్ణుడిని నిద్రలేపించి యుద్ధానికి పురమాయించాడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సు ఖండించి, అంతం చేశాడు. లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తును నేలకూల్చాడు.

3. యుద్ధం చివరి అంకానికి చేరుకుంది. రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రమైనది. రావణుడు ప్రయోగించిన ‘శక్తి’ అనే ఆయుధంతో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. హనుమంతుడు తెచ్చిన ఓషధుల ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో శ్రీరాముని వద్దకు వచ్చాడు.

4. శ్రీరాముడు ఆ రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి సాగిపోయాడు. రామరావణులు మిగిలిన రోజులకన్నా భిన్నంగా ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించి పోరాడుతున్నారు. శ్రీరాముడిదే పైచేయి కావడం గమనించిన రావణుని సారథి రథాన్ని ప్రక్కకు మళ్ళించగా అవమానంగా భావించిన రావణుడు సారధిపై నిప్పులు చెరిగాడు.

5. యుద్ధభూమికి వచ్చిన అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలుతూ మరలా మొలుస్తున్నాయి. “ఆకాశానికి ఆకాశం, సముద్రానికి, సముద్రం సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి” యన్నట్లుగా యుద్ధం సాగుతోంది. మాతలి సూచనతో శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుని అంతమొందించాడు.

(లేదా)

1. రాముడు విసరిన బాణం వక్షస్థలంలో నాటుకుని, వాలి నేల మీదకి వాలిపోయాడు. రాముడు అధర్మంగా ప్రవర్తించాడని, తనను దొంగదెబ్బ తీశాడని నిందించాడు. తాను తమ్ముడు సుగ్రీవునికి చేసిన తప్పును మరచి, వాలి మాట్లాడిన తీరును బట్టి, వాలి తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం కనబడుతోంది.

2. సుగ్రీవుణ్ణికాక తనను కోరి ఉంటే, రావణుని బంధించి, సీతాదేవిని తెచ్చి అప్పచెప్పేవాడినని పలికిన మాటలను బట్టి వాలి ఎంత బలవంతుడో, గర్వం ఉన్నవాడో తెలుస్తోంది.

3. తమ్ముని భార్యను చెరబట్టడం వంటి అధర్మానికి ఒడిగట్టినందువల్లే వాలికి మరణదండన విధించానని రాముడు చెప్పిన మాటలను బట్టి, అధర్మం చేసినవాడు ఎంతటి బలవంతుడయినా, శిక్షకు గురికాక తప్పదని తెలుస్తోంది.

4. వాలి వానరుడు కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదని రాముడు చెప్పడం వల్ల, అది ధర్మబద్ధమైనదని తెలుస్తోంది.

పై అంశాలను బట్టి శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమైనదని చెప్పవచ్చు.

AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions

10. ప్రగతికి మూలం నిరంతర కృషి అని తెలియచేసే నినాదాలు రాయండి.
(లేదా)
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

  1. విజయానికి దగ్గర దారి నిరంతర కృషి, శ్రమ
  2. నిప్పులో కాల్చనిదే బంగారం మెరవదు.
  3. ఏ రాపిడీ లేనిదే వజ్రం ఎలా మెరుస్తుంది ?
    కష్టపడనిదే ప్రగతి ఎలా వస్తుంది ?
  4. అవకాశం తలుపు తడుతుందని ఎదురుచూడకు. అవకాశం తలుపు నీవే తట్టు.
  5. పతనంలో కాదు పడిపోయిన ప్రతిసారి పైకి లేవడంలో గొప్పదనం ఉంది.
  6. చీమలా కష్టపడు – చక్కెర దొరకక మానదు.
  7. అతి పెద్ద ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే
  8. ఒక లక్ష్యంతో కృషి చేస్తే మొదలౌతుంది – నేడు కాకపోయినా, రేపైనా విజయం వచ్చి తీరుతుంది.
  9. సోమరితనం అన్నింటికీ కష్టాలు కలిగిస్తే, శ్రమ అన్నింటిని తేలిక చేస్తుంది.
  10. ఏదీ తానంత తానై నీ దరికి రాదు – శోధించి సాధించాలి.
  11. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా !
    విజయానికి దారి నిరంతర కృషి అని మరవకుమా !

(లేదా)

బాలికల చదువు – భవితకు తెలుగు

సోదర సోదరీమణులారా!

సమాజాభివృద్ధికి ముఖ్యమైనది బాలికల విద్య. వారికి తప్పకుండా చదువు నేర్పాలి.

విద్య జ్ఞానమును కలుగజేస్తుంది. చదువుకున్నచో మంచిచెడులు గ్రహించే జ్ఞానం పెంపొందుతుంది. చదువు దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర కలిగి ఉంది. ఈనాడు దేశంలో అందరికీ చదువుకోవడానికి అవకాశాలు కల్పించబడ్డాయి. వాటిని వినియోగించుకోవాలి.

ఒక పురుషుడు చదువుకుంటే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించగలడు. అదే, ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబంలో అందరూ చదువుకునేలా చేయగలదు. కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం, సమాజాభివృద్ధి వలన దేశం అభివృద్ధి చెందుతాయి. బాలికలు చదువుకుంటే సమాజంలోని దురాచారాలు తెలుసుకొని భవిష్యత్తులో వాటిని సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. తన కాళ్ళ మీద తను నిలబడాలంటే, ఒక వ్యక్తిగా గౌరవించబడాలంటే బాలికలు విద్య నేర్చుకోవాలి. బాలికల విద్య వ్యక్తిగా ఆమెకు, సమాజానికి చాలా అవసరం. కావున మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివించండి.

రండి! బాలికల విద్యను ప్రోత్సహిద్దాం. సమాజాభివృద్ధికి పాటుపడదాం!

కాపీలు : 1000
తేది : XXXXX.

ఇట్లు,
స్త్రీ విద్య ప్రోత్సాహక సమితి,
పల్లిపాడు.

III. భాషాంశాలు :
విభాగము- III

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (32 మా)

11. మానవా ! నీ ప్రయత్నం మానవా ? – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
యమకాలంకారం

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి.
“ఉరుగుణవంతుఁడొడ్లు తన కొండపకారము సేయునప్పుడుం”
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions 1
ఈ పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలున్నాయి కాబట్టి ఇది చంపకమాల పద్యము.

13. అ) భారతదేశ ఘనత హిమాలయాలంత ఎత్తైనది – గీతగీసిన పదానికి అర్థం రాయండి.
జవాబు:
గొప్పదనం

ఆ) పసిపిల్లల స్మితకాంతి అందరినీ ఆకట్టుకుంటుంది. – గీతగీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి.
అ) చిరునవ్వుల వెలుగు
ఆ) వెన్నెల వెలుగు
ఇ) అడుగుల వెలుగు
ఈ) మాటల వెలుగు
జవాబు:
అ) చిరునవ్వుల వెలుగు

14. అ) ప్రతి విద్యార్థి ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణులగుటకు కృషిచేయాలి. (గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు రాయండి.) (1 మా)
జవాబు:
పంక్తి, వరుస

ఆ) రోజురోజుకు పసిడి ధర పెరుగుతున్నది. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి.)
అ) బంగారం, కాంచనం.
ఆ) పుత్తడి, ఇత్తడి
ఇ) వెండి, పుత్తడి
ఈ) హిమం, హేమం
జవాబు:
అ) బంగారం, కాంచనం.

15. అ) చందురుడు వెన్నెలను కలుగజేస్తాడు. (గీతగీసిన పదానికి ప్రకృతి పదం రాయండి.)
జవాబు:
చంద్రుడు.

ఆ) ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. (గీతగీసిన పదానికి వికృతి గుర్తించి విడిగా రాయండి.)
అ) శంతోషం
ఆ) సంతుసం
ఇ) సంతసం
ఈ) సంత
జవాబు:
ఇ) సంతసం

16. అ) చిరిగిన వాసముతో పేదవాడైన రామయ్య ఈ వాసములో నివసిస్తున్నాడు. (1 మా)
(గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి.)
జవాబు:
వస్త్రం, ఇల్లు

ఆ) మా గురువుగారు నాకు పద్యాలు నేర్పించారు. మా ఇంటి గురువుగారు పూజ చేయించారు.
(గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
అ) ఉపాధ్యాయుడు, పురోహితుడు
ఆ) పురోహితుడు, సూర్యుడు
ఇ) ఉపాధ్యాయుడు, ఇంద్రుడు
ఈ) పురోహితుడు, ప్రభువు
జవాబు:
అ) ఉపాధ్యాయుడు, పురోహితుడు

AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions

17. అ) క్షీరసాగరమథనంలో అమృతం పుట్టింది. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.)
జవాబు:
మరణం పొందింపనిది (సుధ)

ఆ) మిత్రుడు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. (గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని. గుర్తించండి.)
అ) మౌనందాల్చి ఉండేవాడు (ఋషి)
ఆ) పవనుని వలన పుట్టినవాడు (హనుమంతుడు)
ఇ) స్వభావంచేతనే ఐశ్వర్యం కలవాడు (శివుడు)
ఈ) సర్వభూతాలపట్ల స్నేహం కలవాడు (సూర్యుడు)
జవాబు:
ఈ) సర్వభూతాలపట్ల స్నేహం కలవాడు (సూర్యుడు)

18. దొంగలు పడి వాళ్ళ సొమ్మును ఉన్నదంతా ఊడ్చుకుపోవడం వలన వాళ్ళు చాలా బాధపడ్డారు.
(ఈ వాక్యంలో గల జాతీయాన్ని గుర్తించి రాయండి.)
జవాబు:
ఉన్నదంతా ఊడ్చుకుపోవడం

19. కనువిప్పు (ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.) (2 మా)
జవాబు:
జ్ఞానోదయం అయింది, తెలిసివచ్చింది అని చెప్పడానికి ఈ జాతీయం ఉపయోగిస్తాము.

కింది ప్రశ్నలను సూచించిన విధంగా జవాబులు రాయండి.

20. దేవుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. (గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి.) (1 మా)
జవాబు:
అతి + అంత

21. రాట్ + మణి – సంధి పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
రాణ్మణి

22. సజ్జనుడు చెడ్డవారికి దూరంగా నడుచుకుంటాడు. (గీతగీసిన పదంలోని సంధిని గుర్తించండి.) (1 మా)
అ) శ్చుత్వసంధి
ఆ) గుణసంధి
ఇ) అత్వసంధి
ఈ) అనునాసిక సంధి.
జవాబు:
అ) శ్చుత్వసంధి

23. పల్లె జీవితం ఎంతో మనోహరమైంది. (గీత గీసిన సమాసపదానికి విగ్రహవాక్యం) (1 మా)
జవాబు:
పల్లెయందలి జీవితం

24. చూడాకర్ణుడు చంపకవతి పట్టణంలో నివసించేవాడు. (గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
అ) షష్ఠీతత్పురుష సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధార సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

25. సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు. (1 మా)
(ఈ వాక్యానికి సరియైన ఆధునిక భాషాపరివర్తనమును గుర్తించి రాయండి.)
అ) సత్సంగతి కంటే లోకంలో మేలేదియు లేదు.
ఆ) మంచివారితో స్నేహం కన్నా లోకంలో మేలు ఏదీ లేదు.
ఇ) సత్సంగతి కంటె లోకంలో మంచిది అనేది వేరే లేదు
ఈ) ప్రపంచమున సత్సంగముకన్న మేలొనరించునది వేరులేదు.
జవాబు:
ఆ) మంచివారితో స్నేహం కన్నా లోకంలో మేలు ఏదీ లేదు.

26. ““వాడు రేపు రావచ్చు” (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి).
జవాబు:
వాడు రేపు రాకపోవచ్చు

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి. (1 మా)
అ) చదివితే
ఆ) చదివినా
ఇ) చదవక
ఈ) చదువుతూ
జవాబు:
చదవక

28. రంగారావుకు పాడటమంటే ఆసక్తి, రంగారావుకు వినడమంటే విరక్తి. (1 మా)
(ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
రంగారావుకు పాడటమంటే ఆసక్తి, వినడమంటే విరక్తి.

29. బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని బోధించాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (1 మా)
అ) బుద్ధుడు బౌద్ధ ధర్మంచేత బోధించాడు
ఆ) బుద్ధునిచేత బౌద్ధధర్మం బోధించబడింది
ఇ) బుద్ధుడు బౌద్ధధర్మాన్ని బోధించాలని అనుకున్నాడు
ఈ) బౌద్ధధర్మం చేత బుద్ధుడు బోధించాడు
జవాబు:
ఆ) బుద్ధునిచేత బౌద్ధధర్మం బోధించబడింది

AP 10th Class Telugu Model Paper Set 6 with Solutions

30. ‘దయచేసి నన్ను కాపాడు’. (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
ప్రార్థనార్థకం

31. మీరు రావద్దు. (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) అనుమత్యర్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఇ) నిషేధార్థకం

32. ఆ పూలు అందంగా ఉన్నాయా? (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.)
జవాబు:
ప్రశ్నార్థకం

33. “నాన్న పుట్టిన రోజుకు కొత్తబట్టలు తెస్తాడో, లేదో”
(ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి.)
అ) సందేహార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
అ) సందేహార్థకం

Leave a Comment