AP 10th Class Telugu Model Paper Set 5 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 5 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 5 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.

బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
మించి మించి దిశలు ముంచిముంచి
యభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచే.

ప్రశ్నలు :

అ) పద్యంలో ఏది వ్యాపించినట్లుగా వర్ణించారు ?
జవాబు:
పద్యంలో వెన్నెల వ్యాపించినట్లుగా వర్ణించారు.

ఆ) అధికంగా పెరిగిన వెన్నెల వేటిని ముంచివేసింది ?
జవాబు:
అధికంగా పెరిగిన వెన్నెల దిక్కులన్నీ ముంచివేసింది.

ఇ) ‘వెన్నెల అనెడి సముద్రము’ అనే అర్థాన్నిచ్చే పదము ఏది ?
జవాబు:
‘వెన్నెల అనెడి సముద్రము’ అనే అర్థాన్నిచ్చే పదము ‘చంద్రికాంభోధి’

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
చంద్రుడు సమస్తాన్నీ ఏ నీటితో నింపుతూ ఆవిర్భవించాడు ?

(లేదా)

ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు నొక్క రూపన్న రీతి
యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి; యివ్వీటి మీఁద నాగ్రహము దగునె?

ప్రశ్నలు:

ఉ) పై పద్యంలో మాటలు ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు:
పై పద్యంలోని మాటలు పార్వతీదేవి వేదవ్యాసునితో అన్నది.

ఊ) ఉన్న ఊరు ఎవరితో సమానం అని పార్వతీదేవి చెప్పింది ?
జవాబు:
ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అని పార్వతీదేవి చెప్పింది.

ఋ) శివుని అర్ధాంగలక్ష్మిగా చెచెప్పిన నగరం ఏది ?
జవాబు:
శివుని అర్ధాంగలక్ష్మిగా చెప్పిన నగరం కాశీనగరం.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
కాశీనగరంపైన ఏది చూపించడం సరైనది కాదని పార్వతి చెప్పింది?

AP 10th Class Telugu Model Paper Set 5 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.

రాత్రి ఏడుగంటల ప్రాంతంలో గంట కొడతారు. గంట శబ్దం చెవిని పడడంతో పిల్లలందరు బిలబిలా వచ్చి గుమిగూడుతారు. ఒక్కొక్కడి చేతిలో ఓ కంచం, మంచినీళ్ళుకు లోటా ఉంటాయి. అందరు అక్కడ చేరేసరికి ఆయన ఉయ్యాలపీటమీద నుండి లేచి నిలబడతారు. ఆయన నిలబడే పిల్లలందరు వరసగా నిలబడతారు. అందరు కలిసి గొంతెత్తి పాడుకొంటూ ముందుకు కదులుతారు. ఒక్కొక్కరుగా ముందుకు నడుస్తూంటే ఓ చోట కంచంలో అన్నం వేస్తారు. మరోచోట పులుసు పోస్తారు. ఇంకొక చోట మజ్జిగ అన్నం వడ్డిస్తారు. చెవులకింపుగా పాడుకొంటూ ఆ పిల్లలందరు అన్నం వడ్డించుకొనే దృశ్యం – కనుల పండువుగా ఉంటుంది.

ప్రశ్నలు :

అ) గంటశబ్దం విని పిల్లలందరూ ఏం చేస్తారు ?
జవాబు:
గంటశబ్దం విని పిల్లలందరూ బిలబిలావచ్చి గుమిగూడుతారు.

ఆ) పిల్లలందరూ ముందుకు ఎలా కదులుతారు ?
జవాబు:
పిల్లలందరూ కలిసి గొంతెత్తి పాడుకొంటూ ముందుకు కదులుతారు.

ఇ) కనులు పండువుగా ఉండే దృశ్యం ఏది ?
జవాబు:
చెవులకింపుగా పాడుకొంటూ ఆ పిల్లలందరూ అన్నం వడ్డించుకొనే దృశ్యం కనులపండువుగా ఉంటుంది.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఒక్కొక్కడి చేతిలో ఏమేమి ఉంటాయి?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)

అ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.
జవాబు:
అయోధ్యకాండ

ఆ) ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణుకోరాడు విభీషణుడు.
జవాబు:
యుద్ధకాండ

ఇ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
జవాబు:
బాలకాండ

ఈ) శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
జవాబు:
కిష్కింధకాండ

4. క్రింది అపరిచిత గద్యాన్ని (ప్రకటనను) చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

కరోనా భూతాన్ని తరుముదాం – భరోసా గల జీవితాన్ని గడుపుదాం

ప్రజలందరికీ విజ్ఞప్తి !

చైనా దేశంలో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన మహమ్మారి కరోనా వైరస్. దీనికి ఇంతవరకు టీకా మందును కనుగొనలేదు. వృద్ధుల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇది తుమ్ము, దగ్గుల ద్వారా, కరచాలనాల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఏదైనా వస్తువును ముట్టకునేముందు, ముట్టుకున్న తరువాత, చేతులను శానిటైజర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే ఇది మీ దరికి రాదు. కరచాలనాలు ఇవ్వక పోవడం, భౌతికదూరం పాటించడం, మాస్కులను ధరించడం, ప్రభుత్వ ఆదేశాలను తప్పకపాటిస్తూ బయట ఎక్కువగా తిరగకుండా, ఇంట్లోనే ఉండడం మొదలగు నియమాలు పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

కనుక, ప్రజారోగ్య శాఖవారి సూచనలను అనుసరించి నడుచుకొంటూ, కరోనా వైరస్ నిర్మూలనకు సహకరించవలసిందిగా కోరుచున్నాము.

స్థలం : అమరావతి
తేది : 25.12.2023

ప్రజారోగ్యశాఖ

ఆంధ్రప్రదేశ్

ప్రశ్నలు :

అ) కరోనా వైరస్ ఏ దేశంలో పుట్టింది ?
జవాబు:
చైనా దేశంలో పుట్టింది

ఆ) కరోనా వైరస్ ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటోంది ?
జవాబు:
వృద్ధుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

AP 10th Class Telugu Model Paper Set 5 with Solutions

ఇ) ఈ ప్రకటన జారీచేసింది ఎవరు ?
జవాబు:
ప్రజారోగ్యశాఖ, ఆంధ్రప్రదేశ్

ఈ) ప్రకటన ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి ?

విభాగము II (36 మా) (3 × 4 = 12 మా)
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత:

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

5. ధూర్జటి కవి రచించిన శతకమేది ? ఆయన గురించి రాయండి.
జవాబు:
కవి : ‘ధూర్జటి’ కవి శ్రీకాళహస్తీశ్వరశతకం రచించాడు.
కాలం : 16వ శతాబ్దం.
ఇతర విశేషాలు : ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడిగా ఉండి అనేక సత్కారాలను పొందాడు. కాళహస్తి మాహాత్మ్యమును ప్రబంధశైలిలో రచించాడు. ధూర్జటి పరమ శివభక్తుడు. శుద్ధ శైవుడు.

6. జానపదుని జాబు పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జవాబు:
గ్రామాల్లోని దళితులు, పేదల జీవితాలను చిత్రిస్తూ “పల్లెటూరి లేఖలు” అనే పేరుతో 1932లో ‘జనవాణి’ పత్రికలోనూ, 1933లో ‘జానపదుని జాబులు’ అనే పేరుతో ‘ప్రజామిత్ర’లోనూ బోయి భీమన్న ప్రచురించాడు. చదువుకొని, బీదతనంవల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన ‘జానపదుడు’ పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను ‘లేఖల’ రూపంలో రాస్తాడు.

7. ‘లక్ష్మణుడు’ పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
సోదరప్రేమకు సరియైన ఉదాహరణ లక్ష్మణుడు. అన్నతోపాటు అరణ్యవాసం చేశాడు. తన జీవితాన్ని రామునిసేవకే అంకితం చేసిన మహనీయమూర్తి. లక్ష్మణుని బ్రహ్మచర్యం నిరుపమానము. అతడు గొప్ప ధైర్యశాలి. అసమాన పరాక్రమవంతుడు. అంతకుమించి జితేంద్రియుడు, సరళ స్వభావం కలవాడు, సహనశీలి, కపటం లేనివాడు. తపస్సంపన్నుడు, త్యాగి, సేవాభావం కలవాడు. శ్రీరాముని యందు సాటిలేని ప్రేమగలవాడు. రాముని సేవలో తనను తానే మరిచిపోతాడు. సీతను తల్లిగా భావించి గౌరవించాడు. యుద్ధంలో రామునికి అండగా నిలచిన మహనీయుడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24 మా)

8. మాణిక్యవీణ కవితాసారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
పరిచయం : ‘మాణిక్య వీణ’ అనే పాఠ్యభాగం విద్వాన్ విశ్వం రచించిన ‘మాణిక్య వీణ’ అనే వ్యాసాల, కవితల సంపుటి లోనిది. మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధన సంపత్తిని, తాత్త్వికతను కవి ఈ వచన కవితా ఖండికలో ఎంతో హృద్యంగా వర్ణించారు.

కవితా సారాంశం

వాస్తవిక దృష్టి అవసరం : మంత్రాలతో చింతకాయలు రాలవు. అట్లాగే పద్య రచనలు చింతలను దూరం చేయలేవు. సామాజిక సమస్యలు వాస్తవిక దృష్టి, నిబద్ధత, అంకితభావంతో కూడిన కార్యాచరణతో మాత్రమే పరిష్కారమౌతాయి.

సామాజిక అసమానతలు ప్రమాదకరం : మనిషి తన మేధస్సుతో అంతరిక్షంలో ప్రయాణించే స్థితికి చేరినా కడుపులో రాచపుండులా సామాజిక అసమానత రోజురోజుకీ పెరుగుతూ ఉండడం విచారించదగినది. అసమానతలు తొలగించకుండా విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా ప్రయోజనం ఉండదు.

ప్రకృతి – కళలతో సంబంధం : తాను కన్ను తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి దానిని తన వశం చేసుకొనే ప్రయత్నం కూడా ప్రారంభించాడు. మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే గోడలపై జంతువుల బొమ్మలు . గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జె కట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు. కళలను తన జీవితంలో ఒక భాగంగా చేసుకొన్నాడు.

మానవ మేధస్సు – ఆవిష్కరణలు : చక్రం కనుగొన్న రోజు, లిపిని కనుగొన్న రోజు చాలా గొప్ప రోజులు. వినూత్న ఆవిష్కరణల కారణంగానే మనిషి రాతియుగపు చీకటి నుంచి నవీన విజ్ఞానం అనే వెలుతురులోకి ప్రవేశించాడని కవి భావన.

ముగింపు : మనిషి కాలగర్భంలో కలిసిన అతని మేధస్సులో నుంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికీ దిశా నిర్దేశం చేస్తాయి. మానవుణ్ణి శాశ్వత యశస్కుణ్ణి చేస్తున్నాయి.

(లేదా)

డా॥ గడియారం వేంకటశేషశాస్త్రి రచించిన ‘మాతృభావన’ పాఠంలో శివాజీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

భారతీయ సంస్కృతి – పరమత సహనం : వ్యక్తిత్వం అంటే మాటలకూ, చేతలకూ తేడా లేనితనం. శివాజీకి హిందూమతం పట్ల, మనదేశ సంప్రదాయాల పట్ల గౌరవం ఎక్కువ. ఇతర మతాల వారినీ, వారి ఆచారాలను; సంప్రదాయాలను గౌరవించేవాడు. పరమత సహనం కలవాడు. సైనికులకు ఆజ్ఞలను జారీ చేసి, వాటిని సక్రమంగా నిర్వహించేటట్లు చూసేవాడు. ఇతరులకు అపకారం తలపెట్టేవాడు కాదు. తోటివారిపట్ల ప్రేమాదరాలతో మెలిగేవాడు. తన సైనికులు గానీ, అధికారులు గానీ తప్పు చేస్తే సహించేవాడుకాదు.

పరస్త్రీ కూడా కన్నతల్లి లాంటిదే : స్త్రీల విషయంలో శివాజీ ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. పరస్త్రీలను కన్నతల్లిగా భావించేవాడు. ఒకసారి సోన్దేవుడు పుణ్యస్త్రీని బీజాపురం నుండి బందీగా పట్టి తెచ్చినందుకు ఆయనపై కోపాన్ని ప్రదర్శించాడు. దానికి సోన్దేవుడు తన తప్పును క్షమించమని ప్రార్థించగా, మన్నించిన శాంతస్వభావుడు. స్త్రీల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. స్త్రీలు పుణ్యదేవతలనీ, వారిని అవమానించడం మన హిందూ సంప్రదాయం కాదని గట్టిగా చెప్పాడు.

స్త్రీలు భారతావని కల్పలతలు : అనసూయ, సావిత్రి, సీత, సుమతి మొదలైనవారు పతివ్రతలనీ, భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన కల్పలతలని కొనియాడాడు. స్త్రీలను అవమానించినవారు వంశంతో సహా నాశనమయ్యారని వివరించాడు.

9. వాలి సుగ్రీవుల విరోధానికి కారణాలు వివరించండి.
(లేదా)
మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం “రామాయణం” – దీని ప్రాశస్త్యాన్ని గురించి రాయండి.
జవాబు:
వాలీ, సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. పెద్దవాడు కనుక తండ్రి తరువాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే రాక్షసుడికీ, వాలికి వైరం. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఎవరెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు. మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు. మాయావి ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. సుగ్రీవుని బిలద్వారం దగ్గరే ఉండమని మాయావిని చంపి వస్తానని వెళ్లాడు. సంవత్సరమైంది. వాలి జాడేలేదు. ఇంతలో నురుగుతోకూడిన రక్తం గుహలో నుంచి బయటకు వచ్చింది.

మాయావిచేతిలో వాలి చనిపోయాడనుకుని, రాక్షసుడు బయటకు వస్తాడేమోనని, సుగ్రీవుడు కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాడు. కిష్కింధకు వచ్చాడు. మంత్రులు బలవంతంగా సుగ్రీవుని రాజును చేశారు. కొంతకాలానికి వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుని రాజ్యభ్రష్టుణ్ణి చేయడమేకాక, అతని భార్య రుమను అపహరించాడు. ప్రాణభీతితో సుగ్రీవుడు సమస్త భూమండలం తిరిగాడు. చివరకు ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాడు. మతంగముని శాపం కారణంగా వాలి అక్కడకు రాలేడు. వాలి దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటినుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలుపెడితే వాలి మరణిస్తాడని శపించాడు. ఇలా వాలీ, సుగ్రీవుల మధ్య వైరం ఏర్పడింది.

(లేదా)

  1. తల్లిదండ్రుల పట్ల పుత్రులు వ్యవహరించాల్సిన విధానం, అన్నదమ్ముల మధ్య గల అనురాగం రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల పాత్రలు తెలియజేస్తాయి.
  2. సీతారాముల పాత్ర ద్వారా ఆదర్శ దంపతుల అనుబంధం సమాజానికి తెలియజేయబడింది.
  3. గురుశిష్యుల మధ్య ఉండే ప్రగాఢమైన అనుబంధం విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల పాత్రల ద్వారా తెలుస్తుంది.
  4. ప్రభుభక్తి, సేవాతత్పరత, కార్యనిర్వహణా సామర్థ్యం మొదలైన అంశాలు హనుమంతుని వ్యక్తిత్వం ద్వారా గ్రహింపవచ్చు.
  5. చెప్పుడు మాటలను వినడం ద్వారా కుటుంబానికి కలిగే అనర్థాలను కైక, మంథర పాత్రల ద్వారా అవగతం అవుతుంది.
  6. ధర్మతత్పరత, ఆశ్రిత జనసంరక్షణ, దుష్టజన శిక్షణ మొదలైన అంశాలు శ్రీరాముని వ్యవహారశైలి ద్వారా గ్రహింపవచ్చు.
  7. దుర్జనులను వీడి సజ్జనులను ఆశ్రయించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయనే విషయం సుగ్రీవ, విభీషణుల పాత్రల ద్వారా తెలుస్తుంది.
  8. ఉత్తమ మైత్రీ బంధం రామ సుగ్రీవుల మైత్రి ద్వారా సమాజానికి తెలుస్తుంది.
  9. పరస్త్రీల పట్ల వ్యామోహంతో ప్రవర్తించేవానికి దుర్గతులు పొందడంతోపాటు, సర్వనాశనం కలుగక తప్పదనే విషయం రావణుని పాత్ర ద్వారా తెలుస్తుంది.
  10. ఇలా మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం.

10. పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
(లేదా)
‘పల్లె సంరక్షణ మన బాధ్యత’ అని వివరిస్తూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కందుకూరు,
తేది : XXXX.XXXX.

మిత్రమా రమణా!

నీవు బాగా చదువుకుంటున్నావనుకుంటున్నాను. ఈ మధ్యే మా తెలుగు ఉపాధ్యాయులు శతక మధురిమ పాఠం వివరించారు. అందులోని పద్యాలు ఎన్నో మంచి విషయాలను చెప్పాయి.

పేదలకు దానం చేయడం వలన మనం పొందే మేలును గురించి తెలియజేసిన పట్టుగనీశ్వరుండు అనే పద్యం నన్నెంతో ఆకట్టుకుంది. అనాథలను, నిరుపేదలను కసరుకోక ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెట్టాలని, అలా పేదలకు సాయం చేసేవారికి మంచి జరుగుతుందని ఆ పద్యం భావం.

దానం అనే పెద్దమాట వాడకూడదు కానీ మనం ఇతరులకు చేసే సాయం పరోక్షంగా మనకు సాయపడుతుంది. ఈ సమాజంలో ఒకరు మరొకరి మీద ఆధారపడి ఉన్నారని, మిడిసిపాటు, అహంభావం పనికిరాదని తెలియచేయడానికే దానాలు చేయాలి, పరోపకారం చేయాలి అని మన పెద్దలు సంప్రదాయం ఏర్పరచారేమో అనిపిస్తుంది.

నీ అభిప్రాయం తెలియచేయకోరాను.
మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియచేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
హరి జగదీష్.

చిరునామా:
సాకేటి వెంకట రమణ,
S/o సాకేటి అప్పలనాయుడు,
11-25-119,
మరియాపురం,
కడప,
Y.S.R. కడప జిల్లా.

(లేదా)

పల్లె సంరక్షణ – మన బాధ్యత

సోదర సోదరీమణులారా!

పల్లె తల్లి వంటిది. కడుపునిండా. అన్నం పెడుతుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆత్మీయంగా ఆదరిస్తుంది. ఎంత పెద్ద పట్టణాలలో నివసిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరి పూర్వీకుల మూలాలూ ఏదో ఒక పల్లెలోనే ఉంటాయి. కనుక తల్లి లేని బిడ్డలేనట్లే పల్లెతో అనుబంధం లేని మనిషి ఉండడు. పంట కాలవలు, పచ్చని పైరులూ, మామిడి తోపులు, ధాన్యం రాశులూ, ఎడ్లపందాలు, ఈతసరదాలు, జొన్నచేలు, వంగతోటలు, నారుమళ్ళు, కావడి కుండలు, మొదలైన ఎన్నో మనోహర దృశ్యాల సమాహారమే పల్లెటూరు. పల్లెటూళ్ళలో నేల, నీరు, గాలి, చేలూ ప్రతి ఒక్కటీ మనల్ని పలకరిస్తున్నట్లు ఉంటాయి. మన శరీరాన్ని ఆపాదమస్తకం పులకరింపజేస్తాయి. చిలకకొట్టిన జామపళ్ళు మహారుచిగా ఉంటాయి. లేత బొండాల కొబ్బరినీళ్ళు మన దాహం తీరుస్తాయి. పల్లె అంటే మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ ప్రకృతి సర్వాంగసుందరంగా సప్తవర్ణాలతో శోభిల్లే నిలయం. అటువంటి పల్లెను మనమంతా సంరక్షించుకోవాలి.
కాపీలు : 500
తేది : XXXXXXXX.

ఇట్లు,
గ్రామసీమల పరిరక్షణ సంఘం,
తూర్పుగోదావరి జిల్లా శాఖ,
ఆంధ్రప్రదేశ్.

III. భాషాంశాలు: (32 మ)
విభాగము – III (9 × 2 = 18 మా)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

11. దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి” – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. (1 × 2 = 2 మా)
జవాబు:
పై వాక్యంలో గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువచేసి చెప్పడం జరిగింది కదా! అంటే అతిశయంగా చెప్పడం జరిగింది ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. (1 × 2 = 2 మా)
వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేఁకదనంబునఁ బేర్చి దిక్కులన్
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 5 with Solutions 1
పై పద్యపాదం ఉత్పలమాలకు చెందినది.

AP 10th Class Telugu Model Paper Set 5 with Solutions

అ) ఉపాధ్యాయునికి చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. గీతగీసిన పదానికి అర్థం రాయండి. (1 మా)
జవాబు:
దగ్గర, సమీపం

ఆ) రుగ్మత లు గలవారు తప్పక చికిత్సలు చేయించుకోవాలి. – గీతగీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి.
అ) డబ్బు
ఆ) జబ్బు
ఇ) అధికారం
ఈ) అవసరం
జవాబు:
ఆ) జబ్బు

14. అ) కరోనా కేసుల నిర్థారణ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గొప్ప ఖ్యాతి గాంచింది. (1 మా)
– గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
జవాబు:
పేరు, కీర్తి, యశము

ఆ) పసిడి ధర నిలకడగా ఉండటం లేదు.’- గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి.
అ) పుత్తడి – బంగారం
ఆ) పుత్తడి – కంచు
ఇ) పుత్తడి – ఇత్తడి
ఈ) పుత్తడి – వెండి
జవాబు:
అ) పుత్తడి – బంగారం

15. అ) అమ్మ బాసలోనే నేను మాట్లాడతాను – గీతగీసిన పదానికి ప్రకృతి రాయండి. (1 మా)
జవాబు:
భాష

ఆ) మంచి పుస్తకం చదవడం వలన జ్ఞానం కలుగుతుంది. (1 మా)
– గీతగీసిన పదానికి వికృతిపదం గుర్తించి విడిగా రాయండి.
అ) మస్తకము
ఆ) బొత్తము
ఇ) బెత్తము
ఈ) పొత్తము
జవాబు:
ఈ) పొత్తము

16. అ) మంచి గుణం కలిగిన శ్రీరాముడు శివధనుస్సు గుణాన్ని లాగి ఎక్కుపెట్టాడు. (1 మా)
(గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి..)
జవాబు:
స్వభావం, వింటినారి

ఆ) రాజు ప్రజలను ఫాలిస్తాడు. రాజు కలువలకు ఆనందం కలిగిస్తాడు. (1 మా)
(గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
అ) కోతి, ఇంద్రుడు
ఆ) ప్రభువు, చంద్రుడు
ఇ) పద్యపాదము, కిరణము
ఈ) స్నేహితుడు, సూర్యుడు
జవాబు:
ఆ) ప్రభువు, చంద్రుడు

17. అ) పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తున్నది. (గీతగీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.) (1 మా)
జవాబు:
పక్షములు కలది (పిట్ట)

ఆ) భవాని మారువేషంలో వ్యాసుడి దగ్గరకు వచ్చింది. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.) (1 మా)
అ) భవుని భార్య (పార్వతి)
ఆ) తపస్సు చేసేవాడు (ముని)
ఇ) దేహము కలవాడు (ప్రాణి)
ఈ) తొండం కలది (ఏనుగు)
జవాబు:
అ) భవుని భార్య (పార్వతి)

18. పంటపొలాలను తుఫాను నాశనం చేయడంతో రైతుల గుండెలు బరువెక్కాయి
(ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయండి.) (2 మా)
జవాబు:
గుండెలు బరువెక్కుట

19. ‘పురిటిలోనే సంధికొట్టడం’ (ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.) (2 మా)
జవాబు:
మొదట్లోనే అంతం కావడం అని అర్థం. ఏదైనా పని ప్రారంభించినప్పుడే ముగిసిపోయే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ పదబంధాన్ని వాడతారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1= 14 మా)

20. మనం ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. (గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి.) (1 మా)
జవాబు:
అత్యంత – అతి + అంత

21. రామ + అయ్య – సంధి పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
రామ + అయ్య – రామయ్య

22. శివాజీ యవన పుణ్యాంగనను సత్కరించాడు. (గీతగీసిన పదంలోని సంధిని గుర్తించి విడిగా రాయండి.)
అ) సవర్ణదీర్ఘసంధి
ఆ) గుణసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘసంధి

పుణ్యాంగన = పుణ్య + అంగన – సవర్ణదీర్ఘసంధి

23. వ్యాసుడు తన శిష్యులతో కలసి గంగానదికి వెళ్ళాడు. (గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.)
జవాబు:
గంగానది – గంగ అను పేరుగల నది – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

24. సూర్యచంద్రులు మనకు ప్రత్యక్షదైవాలు. (గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.) (1 మా)
అ) ద్విగు సమాసం
ఆ) కర్మధారయ సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) ద్వితీయా తత్పురుష సమాసం
జవాబు:
ఇ) ద్వంద్వ సమాసం

25. ఇక నాకిక్కడ వసింపఁదగదు (ఈ వాక్యానికి సరియైన ఆధునిక భాషాపరివర్తనమును గుర్తించి రాయండి.) (1 మా)
అ) ఇచ్చోట వసించతగదు
ఆ) ఇక నాకు వసించయుక్తం కాదు
ఇ) ఇంక నేనిక్కడ నివసించడం మంచిది కాదు
ఈ) ఇక్కడ వసించడం తగినది
జవాబు:
ఇ) ఇంక నేనిక్కడ నివసించడం మంచిది కాదు

26. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తున్నారు. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.)
జవాబు:
ప్రజలందరూ భౌతికదూరం పాటించడంలేదు

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) చదివి
ఆ) చదవక
ఇ) చదువుతూ
ఈ) చదివితే
జవాబు:
ఆ) చదవక

28. శ్రీను బడికి వచ్చాడు. జాన్ రెడ్డి బడికి వచ్చాడు. హస్మత్ బడికి వచ్చాడు.
(ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
శ్రీను, జాన్రెడ్డి, హస్మత్ బడికి వచ్చారు

29. జానపదుడు తన మిత్రునికి ఉత్తరం రాశాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)
అ) తన మిత్రునిచేత జానపదునికి ఉత్తరం రాయబడింది
ఆ) జానపదుడు తన మిత్రునికి ఉత్తరం రాయాలనుకున్నాడు.
ఇ) జానపదునిచేత తన మిత్రునికి ఉత్తరం రాయబడింది
ఈ) ఈ జానపదుడు తన మిత్రునికి ఉత్తరం రాస్తున్నాడు.
జవాబు:
ఇ) జానపదునిచేత తన మిత్రునికి ఉత్తరం రాయబడింది.

30. “మీరు రావద్దు” ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.
జవాబు:
నిషేధార్థకవాక్యం

31. దయచేసి ఒక పుస్తకాన్ని నాకు ఇవ్వు. (ఇది ఏరకమైన సామాన్యవాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) విద్యర్థక వాక్యం
ఆ) అనుమత్యర్థక వాక్యం
ఇ) నిషేధార్థక వాక్యం
ఈ) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
ఈ) ప్రార్థనార్థక వాక్యం

32. “ఆహా ! ఈ సంగీతం ఎంత వీనులవిందుగా ఉంది.” – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. (1 మా)
జవాబు:
ఆశ్చర్యార్థకవాక్యం

33. “మీకు శుభం కలుగుగాక” – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) చేదర్థకం
ఆ) శత్రర్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఈ) ఆశీరర్థకం

Leave a Comment