TS 7th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson ఆరుట్ల కమలాదేవి

Telangana SCERT 7th Class Telugu Guide Answers Telangana ఉపవాచకం 5th Lesson ఆరుట్ల కమలాదేవి Textbook Questions and Answers.

TS 7th Class Telugu Guide Upavachakam 5th Lesson ఆరుట్ల కమలాదేవి

పాఠం ఉద్దేశం:

కొందరు అతి సామాన్య కుటుంబంలో జన్మిస్తారు. కాని వారికి ఆశయాలు చాలా ఉంటాయి. అందులో కొందరు మాత్రమే అందరికోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. అటువంటి వారి గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠం నేపథ్యం:

తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్య్ర సమరయోధురాలు, ఉన్నత ఆశయాలు కల్గిన కమ్యూనిస్టు, ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతరం కృషి చేసిన ధీరవనితలలో ఒకరైన ఆరుట్ల కమలాదేవి గురించి వివరించడమే ఈ పాఠం నేపథ్యం.

పాఠం ప్రత్యేకత:

  1. అక్షరాస్యతకై పోరాటం
  2. ఉద్యమంలో కాళిక
  3. రాజకీయ చైతన్యం
  4. విశిష్ట వ్యక్తిత్వం

TS 7th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson ఆరుట్ల కమలాదేవి

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆరుట్ల కమలాదేవి కాలం నాటి తెలంగాణ పరిస్థితులను తెల్పండి.
జవాబు.
కమలాదేవి కాలంలో తెలంగాణలో నిజాం రాచరిక పాలన ఉండేది. బ్రిటీష్ వారి ఆలోచనల ప్రకారం పాలన సాగేది. భూస్వామ్య వ్యవస్థ నడిచేది. భూస్వాములు, పెత్తందార్ల కింద ప్రజలు, రైతులు కష్టాలు పడేవారు. వెట్టిచాకిరీ ఉండేది. తిరగబడితే దండన. కుక్కనో, కోడినో చంపినట్లు చంపినా చట్టం లేదు. తెలుగుభాష చదివే అవకాశం లేదు. పాఠశాలలు, గ్రంథాలయాల స్థాపనకు అనేక అడ్డంకులుండేవి.

ప్రశ్న 2.
రామచంద్రారెడ్డి షరతులను బట్టి నీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
రామచంద్రారెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడు. అతడు ప్రజాఉద్యమాలలో జీవితం గడపాలనుకున్నాడు. అందుకే ఆంధ్రమహాసభ సభ్యుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, వందేమాతరం ఉద్యమకారుడిగా వన్నెకెక్కాడు. వివాహం దానికి అడ్డంకి కాకూడదు అనుకున్నాడు. కాబట్టే తనకు కాబోయే సతీమణి కూడా రాజకీయాలలో పాల్గొనాలనుకున్నాడు. అప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని దేశసేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించాడు. వివాహాన్ని ఆడంబరాలు లేకుండా జరగాలని కోరుకున్నాడు.

ప్రశ్న 3.
అక్షరాస్యతకోసం కమలాదేవి చేసిన ప్రయత్నాన్ని వివరించండి.
జవాబు.
కమలాదేవి జాతీయభావాలను కలిగివుంది. ప్రజలకు ఏదైనా సాయం చేయాలనిఎప్పుడూ తపనపడేది. ఊరి జనులంతా తనలాగే చదువుకోవాలనుకున్నది. ఊరిలో బడిపెట్టాలనుకున్నది. కానీ బడి పెట్టాలన్నా, గ్రంథాలయం నడపాలన్నా ఆంక్షలుండేవి. వంటశాల పేరుతో తలుపులు, కిటికీలు లేని స్థలంలో బడిని, గ్రంథాలయాన్ని నడిపింది. కొంతకాలానికి జాగీర్దారులకు విషయం తెలిసి వాటిని మూసివేశారు. కొలనుపాకలో జైన దేవాలయంలో బడినడిపి వయోజనులను అక్షరాస్యులుగా మార్చింది.

ప్రశ్న 4.
కమలాదేవి చేసిన ఉద్యమాలను తెల్పండి.
జవాబు.
చిన్నప్పటినుంచే ఉద్యమాలవైపు నడిచింది కమలాదేవి. తన బిడ్డకు ‘విప్లవం’ అని పేరుపెట్టింది. జాగీర్దారులకు తెలియకుండా వయోజన పాఠశాల నడిపింది. మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరంలో సైనిక శిక్షణ తీసుకున్నది. భర్తతో కలిసి తెలంగాణ సాయుధ సమరంలో అడుగుపెట్టింది. రజాకార్లతోను, నిజాం పోలీసులతోను ప్రత్యక్ష పోరాటం చేసింది. చల్లూరుగుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాళికవలె విజృంభించింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళాన్ని కాపాడింది.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson ఆరుట్ల కమలాదేవి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కమలాదేవి బాల్యం-విద్యాభ్యాసాలను గురించి రాయండి.
జవాబు.
కమలాదేవి నల్గొండజిల్లా ఆలేరు తాలూకా మంతపురి గ్రామంలో పుట్టింది. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు రుక్మిణి. నిజాంల నిరంకుశ పాలనలో ఆమె బాల్యం ఇంటికే పరిమితమైంది. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం. పౌరహక్కులకు స్వేచ్ఛలేని కాలం. సనాతన ఆచారాలు, మూఢవిశ్వాసాలు, మొదలైన కట్టుబాట్లు ఉన్న రోజులు కనుక 11 సంవత్సరముల వయస్సుకే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహమైంది. కమలాదేవిగా మారింది.

అతడు ఉద్యమకారుడు కనుక కమలాదేవిని చదివించాలనుకున్నాడు. ఆ వార్త విని సంతోషించి హనుమంతరావుగారి బాలికల పాఠశాలలో చేరింది, రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డిగారు నెలకొల్పిన బాలికల హాస్టల్లో ప్రథమ విద్యార్థిగా చేరింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసింది. రాజకీయాలను అర్థం చేసుకొని ఉద్యమాలలో పాల్గొన్నది.

ప్రశ్న 2.
కమలాదేవిని గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.
కమలాదేవి తెలంగాణ సాయుధపోరాట నాయకురాలు. స్వాతంత్ర్య సమరయోధురాలు. ఉన్నత ఆశయాలు కల్గిన కమ్యూనిస్టు. ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతరం కృషి చేసిన ధీరవనిత. నిజాం పాలనను అంతమొందించడానికి నిస్వార్థంగా, అంకితభావంతో పోరాటం చేసిన వీరవనిత.

ఆమె నల్గొండజిల్లా ఆలేరు తాలూకా మంతపురి గ్రామంలో సామాన్య రైతుకుటుంబంలో జన్మించింది. ఆనాటి ఆచారాల ప్రకారం చదువుకునే అవకాశం లేకుండా 11సం॥లకే మేనమామ కొడుకైన ఆరుట్ల రామచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నది. వివాహానంతరం మెట్రిక్ వరకు చదువుకుంది. ఉద్యమకారుడైన భర్తతోపాటు ప్రజాఉద్యమాలలో పాల్గొని వయోజనవిద్య నేర్చింది.

తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నది. అరణ్య, అజ్ఞాతవాసాలు గడిపింది. జైళ్ళలో హక్కులకోసం పోరాడింది. భూస్వాముల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన అగ్నిజ్వాల. 1952 నుండి ఆలేరు శాసనసభకు ప్రాతినిధ్యం వహించింది. 1964లో శాసనసభ ప్రతిపక్షనాయకురాలైంది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్రకెక్కింది.

ప్రశ్న 3.
కమలాదేవి వ్యక్తిత్వం గురించి రాయండి.
జవాబు.
కమలాదేవిది సహృదయం. సత్యాన్వేషి. కష్టజీవుల కడగండ్లు చూస్తూ కన్నీరు పెట్టే దయామయి. కష్టాల నుండి శాశ్వత విముక్తి పొందేవరకు నిద్రపోయేదికాదు. ఆమె ధన్యజీవి. తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి. గొప్ప మానవతావాది.

కమలాదేవి కార్యశీలతలో నాయకత్వ లక్షణాలు అడుగడుగునా కనిపించేవి. ఆమె చూపులోను, నడుముకు చుట్టిన కొంగులోను, కత్తిలాగా పట్టుకునే కలంలోనూ అవి కనిపిస్తాయి. ఆమె ఒక గృహిణిగా, మాతృమూర్తిగా, సాధారణ మధ్యతరగతి మహిళగా కనిపించేది. ఆమె ఎవ్వరితోనూ మహానాయకురాలిగా ప్రవర్తించలేదు. ఉన్నతాశయాలతో ఉత్తమ వ్యక్తిత్వముతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన కమలాదేవి తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వుల్లో బతికే ఉన్నది.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson ఆరుట్ల కమలాదేవి

I. అవగాహన – ప్రతిస్పందన:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అప్పుడు తెలంగాణలో నిజాం రాచరిక పాలన ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారం నిజాంపాలన సాగేది. సంస్థానాధీశులు, దేశముఖు లక్షల ఎకరాల భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. భూస్వాములు, గ్రామీణ పెత్తందార్ల క్రింద గ్రామ ప్రజలు, రైతులు కష్టాలు పడ్డారు. అన్ని కులాలవారు అణిగి ఉండాల్సిందే. వెట్టిచాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇండ్లలో పనిచేయాలి. తిరగబడితే దండన. ఇంటిలో పెంచుకున్న కోడినో, కుక్కనో చంపినట్లుగా పేదలను చంపినా అడిగేవారు లేరు. చట్టం లేదు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
నిజాం పాలన ఎవరి ఆలోచనల ప్రకారం సాగేది ?
జవాబు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల

ప్రశ్న 2.
లక్షల ఎకరాల భూమి ఎవరి అధీనంలో ఉండేది ?
జవాబు.
సంస్థానాధీశులు, దేశముఖ్ అధీనంలో

ప్రశ్న 3.
ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇండ్లలో పని చేయడాన్ని ఏమంటారు ?
జవాబు.
వెట్టిచాకిరి

ప్రశ్న 4.
తిరగబడిన పేదలను ఎలా చంపేవారు ?
జవాబు.
ఇంటిలో పెంచుకున్న కోడినో, కుక్కనో చంపినట్లు

ప్రశ్న 5.
‘చట్టం’ ప్రకృతి పదం ఏది ?
జవాబు.
శాస్త్రం

2. క్రింది గద్యం చదివి, దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆరుట్ల కమలాదేవి నల్లగొండజిల్లా ఆలేరు తాలూకా మంతపురి గ్రామంలో పుట్టింది. తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరుపెట్టారు. మధ్యతరగతి రైతుకుటుంబం వారిది. అది నిజాం పాలనలో పౌరహక్కులకు స్వేచ్ఛలేని కాలం. సనాతన ఆచారాలు, మూఢవిశ్వాసాలు, కులమతతత్వం, అంటరానితనం వ్యవస్థని శాసిస్తున్న రోజులవి. పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవి కావు. ఆ రోజులలో ఆడపిల్లలకి చదువులు ఊహించడం కూడా తప్పే. అందువల్ల రుక్మిణి బాల్యం ఇంటికే పరిమితమయ్యింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఆరుట్ల కమలాదేవిగారి ఊరేది?
జవాబు.
ఆరుట్ల కమలాదేవిగారి ఊరు మంతపురి.

ప్రశ్న 2.
కమలాదేవి పూర్వపు పేరేమి?
జవాబు.
కమలాదేవి పూర్వపు పేరు రుక్మిణి.

ప్రశ్న 3.
ఆనాటి కొన్ని దురాచారాలు రాయండి.
జవాబు.
ఆనాడు మూఢవిశ్వాసాలు, కులమతతత్వం, అంటరానితనం వంటి దురాచారాలు ఉండేవి.

ప్రశ్న 4.
ఆడపిల్లలు ఆ రోజుల్లో చదువుకోవడానికి ఎందుకు వీలులేదు?
జవాబు.
ఆడపిల్లలు ఆ రోజుల్లో చదువుకోకపోవడానికి పల్లెటూర్లలో పాఠశాలలు లేకపోవడమే కారణం.

ప్రశ్న 5.
కమలాదేవి చిన్నతనంలో తెలంగాణ ఎవరి పాలనలో ఉండేది?
జవాబు.
కమలాదేవి చిన్నతనంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండేది.

3. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులవి. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు, రెండవవైపు తెలంగాణలో ప్రజోద్యమజ్వాలలు, ఆంధ్రమహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని భావించింది కమలాదేవి. కమ్యూనిస్టుపార్టీవారు నిర్వహించిన “మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరం”లో సైనిక శిక్షణ పొందింది. తుపాకి పట్టింది. భర్తతోపాటు తెలంగాణ సాయుధసమరంలో అడుగుపెట్టింది. రజాకార్లతో, నిజాం పోలీసులతో జరిగిన ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాళికవలె విజృంభించింది. పరాక్రమాన్ని ప్రదర్శించింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళానికి నష్టం వాటిల్లకుండా కాపాడింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కమలాదేవి సైనిక శిక్షణ ఎక్కడ పొందింది?
జవాబు.
కమలాదేవి సైనిక శిక్షణ ‘మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరం’లో పొందింది.

ప్రశ్న 2.
భర్తతో కలిసి చేసిన ఉద్యమం ఏది?
జవాబు.
భర్తతో కలిసి చేసిన ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం.

ప్రశ్న 3.
ఆమె నేరుగా పాల్గొన్న పోరాటం ఏది?
జవాబు.
ఆమె నేరుగా పాల్గొన్న పోరాటం రజాకార్లతో, నిజాం పోలీసులతో జరిగిన ప్రతిఘటన.

ప్రశ్న 4.
చారిత్రక పోరాటం ఎక్కడ జరిగింది?
జవాబు.
చారిత్రక పోరాటం చల్లూరు గుట్టల్లో జరిగింది.

ప్రశ్న 5.
ఆమె వాడిన ఆయుధం ఏది?
జవాబు.
ఆమె వాడిన ఆయుధం అమెరికన్ రైఫిల్.

Leave a Comment