Telangana SCERT 7th Class Telugu Guide Telangana 5th Lesson పల్లె అందాలు Textbook Questions and Answers.
TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు
బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి: (TextBook Page No.42)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి ?
జవాబు.
పై బొమ్మలో సూర్యుడు, కొండలు, పెంకుటిండ్లు, చెట్లు, వాహనాలు, ఎగురుతున్న పక్షులు కనిపిస్తున్నాయి.
ప్రశ్న 2.
మీరు చూసిన పల్లెకు, బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి ?
జవాబు.
నేను చూసిన పల్లెలో ఎక్కువగా పూరిండ్లు, పాకలు కనిపించేవి. పై బొమ్మలో ఎక్కువగా పెంకుటిండ్లు, చెట్లు చేమలు కనిపిస్తున్నాయి.
ప్రశ్న 3.
పల్లెల్లో ఏమేమి ఉంటాయి ?
జవాబు.
పల్లెల్లో ఎక్కువగా పొలాలు, చెరువులు, గేదెలు, ఆవులు, ప్రశాంత వాతావరణాన్ని కలిగించే చెట్లు ఎక్కువగా ఉంటాయి.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.44)
ప్రశ్న 1.
కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా ! ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు?
జవాబు.
చెరువులను గంగాళంతోపాటు నిండుకుండ, నిశ్చల సాగరంతోను పోల్చవచ్చు.
ప్రశ్న 2.
“చెరువులు పద్మాలకు నిలయాలు” అని కవి అన్నాడు. కదా ! ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు ?
జవాబు.
ఇప్పుడు చెరువులు ఆక్రమణాలకు నిలయాలుగా మారాయి. చెరువులను కొంతమంది భూ ఆక్రమణదారులు ఆక్రమించి అక్రమంగా ఇళ్ళ నిర్మాణాలు చేస్తున్నారు. 3. సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది? జవాబు. సూర్యోదయ సమయంలో చెరువు ప్రసన్నంగాను, ఆకర్షణీయంగాను ఉంటుంది. సూర్యుని లేలేత కిరణాలతో పద్మాలు వికసిస్తాయి. తెల్లని పద్మాలతో, నీలిరంగు ఆకులతో నయనమనోహరంగా ఉంటుంది.
ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.45)
ప్రశ్న 1.
పూవులను ఏయే సందర్భాలలో అలంకరణకు వాడుతారు?
జవాబు.
పూలను వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, వ్రతము మొదలైన ఉత్సవాల్లోను, దైవసంబంధమైన ఊరేగింపుల లోను, జాతరలలోను, నూతన వాహనములకు అలంకరణగాను వాడుతారు. పూల అలంకరణ కను విందుగా ఉంటుంది.
ప్రశ్న 2.
ఏయే ఋతువులో ఏయే పూలు దొరుకుతాయి ?
జవాబు.
వసంత ఋతువులో మల్లెలు, జాజులు ఎక్కువగా దొరుకుతాయి. శరదృతువులో బంతులు, చామంతులు దొరుకుతాయి. గులాబీలు, తామరలు మొదలైనవి అన్ని ఋతువుల్లోను ప్రస్తుతం దొరుకుతున్నాయి.
ప్రశ్న 3.
మీ గ్రామ ప్రత్యేకతలు ఏమిటి ?
జవాబు.
మా గ్రామం మా జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అందరు కష్టపడి పనిచేస్తారు. మా గ్రామంలోని యువకుల్లో అరవైశాతంపైగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇరవైమంది వేరే ఊళ్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. మా గ్రామం కుటుంబ నియంత్రణలో అగ్రగామిగా ఉంది. రక్షిత మంచినీటి సౌకర్యాన్ని గ్రామ ప్రజలే ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మా గ్రామం నుంచి ఒక్క పోలిసుకేసు నమోదు కాలేదు. అన్ని రకాల పండుగలను ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకుంటాము. ఇదే మా ఊరి ప్రత్యేకత.
ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.46)
ప్రశ్న 1.
పల్లె జీవితం నుండి పశుసంపద ఎందుకు దూరం అయింది?
జవాబు.
ప్రస్తుతం పల్లెలో వాతావరణం మారిపోయింది. గ్రామాల్లో అనావృష్టి ఎక్కువగా ఉంది. పచ్చగడ్డి దొరకడం లేదు. వలసలు ఎక్కువైనాయి. పశుపోషణ భారంగా మారింది. దాంతో పల్లెజీవితం నుండి పశుసంపద దూరం అయింది.
ప్రశ్న 2.
పల్లెలోని వ్యాపారులు ఎట్లాంటి వ్యాపారం చేసేవారు? మీ గ్రామంలోని వ్యాపారులకు, వీరికి భేదం తెలుపండి.
జవాబు.
పల్లెలోని వ్యాపారులు పాలవ్యాపారం, ధాన్యం కొనుగోలు వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. మా గ్రామంలో నేతి వ్యాపారం, అద్దకం వస్త్రాల వ్యాపారం, రంగు బొమ్మల వ్యాపారం చేస్తారు. మా గ్రామంలోని ప్రజలు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తారు. ఇతర గ్రామాల్లో మాదిరిగా బయటకు వెళ్ళరు. గ్రామ వికాసం కోసం కృషి చేస్తారు.
ప్రశ్న 3.
మీ ఊరిలో అంగడి ఎట్లా జరుగుతుంది ?
జవాబు.
మా ఊరిలోని అంగడి పెద్దదిగా ఉంటుంది. మా ఊరిలో మూడు అంగళ్ళు ఉన్నాయి. ప్రజలందరు తమ నిత్యావసర వస్తువులను అంగట్లో కొంటారు. వ్యాపారులు కూడా నీతిగా ఉంటారు. కల్తీ సరుకులు అమ్మరు. అందువల్ల ఇతర గ్రామాల్లోని వారు కూడా మా అంగళ్ళకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల ద్వారా ఊరు గురించి తెలుసుకున్నారు కదా ! మీరు చూసిన ఊరుతో దీన్ని పోల్చి మాట్లాడండి.
జవాబు.
నేను చూసిన ఊరు కూడా పాఠంలో చెప్పిన ఊరువలె ఉంటుంది. ఇంచుమించు పల్లెలలోని ఊర్లు అన్నీ అలాగే ఉంటాయి.
ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలను రాగంతో చదువండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు.
ఉపాధ్యాయులను అనుసరించి చెప్పండి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు. గలగలపారే సెలయేరు, ఉదయించే అరుణ కిరణాల సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని కొంగేసినట్లున్న వనసీమలు ఒకటేమిటి ? ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుగొమ్మ. పల్లె అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం.
అ) అమూల్య సంపదలు అంటే ఏమిటి ?
జవాబు.
అమూల్య సంపదలు అంటే లెక్కింపలేనటువంటి సంపదలు.
ఆ) ఆనందానికి నెలవు అంటే ఏమిటి ?
జవాబు.
ఆనందానికి నెలవు అంటే ఆనందానికి స్థానం అని అర్థం.
ఇ) అక్కున చేర్చుకోవటం అంటే మీకేం అర్థమయింది ?
జవాబు.
అక్కున చేర్చుకోవటం అంటే కౌగలించుకోవటం (దగ్గరకు తీసుకోవటం) అని అర్థమయింది.
ఈ) అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి ?
జవాబు.
అనురాగాలకు పట్టుగొమ్మ అంటే అనురాగాలకు స్థానం వంటిది.
ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు.
పల్లె అందాలు
2. పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్యపాదాలను వెతికి రాయండి.
అ) అలుగుల గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి.
జవాబు.
రెండు చెఱువులొక్కటేయని చెప్పుచునుండె నడుమ గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.
ఆ) సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
జవాబు.
అరుణకిరణాల దేవత కర్ఘ్యమిచ్చు.
ఇ) దంపతుల వలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి.
జవాబు.
మాయూరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.
ఈ) జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి.
జవాబు.
జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్నివేళలందు.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు కదా ! మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా ? వివరించండి.
జవాబు.
కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు. అలాగే మా ఊరిలోని అంగడిలో కూడా అన్నీ వస్తువులు ఉంటాయి. మనం నిత్యం వాడుకునే సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు అన్నీ అక్కడే దొరుకుతాయి. అందువలననే అంగడిని కవి బహుళ వస్తు ప్రధానం అన్నాడు.
ఆ) గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు ? వీరి వల్ల ఊరివాళ్ళకేం లాభం కలుగుతుంది ?
జవాబు.
గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా కుమ్మరివారు, మంగలివారు, చాకలివారు ఉంటారు. కుమ్మరివారు ఊరిలో కావలసిన వారికి కుండలు తయారుచేసి ఇస్తారు. శుభకార్యాలలో కుమ్మరివారు బాగా సాయపడతారు. మంగలివారు గడ్డాలు తీయటానికి, గుండ్లు కొట్టడానికి సాయపడతారు. చాకలివారు గ్రామంలోని వారి బట్టలను ఉతికి పెడతారు.
ఇ) ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు ?
జవాబు.
ఆదర్శగ్రామం అంటే గ్రామంలోని ప్రతిఒక్కరూ ఒకరికొకరు సహాయపడాలి. వీధులను, ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సిమెంట్ రోడ్లను వేసి ఉండాలి. మంచినీటి పంపులు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరా ఎప్పుడూ ఉండాలి. అలాంటి ఆదర్శగ్రామం ఉండాలని నేను అనుకుంటున్నాను.
ఈ) ఊరుకు, చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది ?
జవాబు.
ఊరుకు, చెరువుకు బాగా దగ్గరి బంధం ఉంటుంది. ఊరిలోని ప్రతి ఇంటివారు చెరువు నుండి నీరు తెచ్చుకుంటారు. చెరువులో బట్టలు ఉతుక్కుంటారు. గేదెలను, ఆవులను శుభ్రపరుచుకుంటారు. ఇలా ఊరికి, చెరువుకు బాగా బంధం ఉంటుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) ఊరికీ అందాన్నిచ్చే అంశాలేవి ? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా ? మీ అభిప్రాయాలను సొంతమాటలలో రాయండి.
జవాబు.
ఊరికి అందాన్నిచ్చే అంశాలు ముఖ్యంగా ఇండ్లు, పచ్చని పొలాలు, పచ్చని చెట్లు. పల్లెలలో ఇండ్లు పెంకుటిల్లుగా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటిచుట్టూ పూలమొక్కలు, కూరగాయల మొక్కలు విరివిగా ఉంటాయి. అలాగే ఊరి వెలుపల పచ్చని పొలాలు, ప్రతి ఇంటిముందు పచ్చని చెట్లు ఉంటాయి.
కాని ప్రస్తుతము పల్లెటూర్లలో కూడా పట్టణ వాతావరణం ఎక్కువగా కనిపిస్తున్నది. పెంకుటిల్లు, డాబా ఇల్లు బదులు అపార్ట్మెంట్ సంస్కృతి అక్కడక్కడా ఎక్కువగా కనిపిస్తున్నది. అలాగే పచ్చని పొలాలు కూడా ఇప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, వ్యాపారస్తుల చేతులలో చిక్కుకుపోతున్నాయి. పచ్చని చెట్లు, నీడనిచ్చే చెట్లు కూడా ఇప్పుడు గ్రామాలలో ఎక్కువగా కనిపించటం లేదు. ఇవి నా అభిప్రాయాలు.
IV. సృజనాత్మకత / ప్రశంస:
ప్రశ్న 1.
పాఠంలోని 3వ, 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా ! మీరు చూసిన / మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి.
జవాబు.
మా ఊరి అందాలు వర్ణనాతీతము. మా ఊరిలో సూర్యోదయ సమయంలో చెరువు దగ్గరకు వెళితే అక్కడి అందాలు మనలను పరవశింపచేస్తాయి. చెరువులోని ఎర్ర కలువలు, తెల్ల కలువలు సూర్య భగవానునికి స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లు వికసిస్తుంటాయి.
పైన పక్షుల కిలకిలారావాలు కూడా ఎంతో హాయిని ఇస్తాయి. పొలాలలో విరబూసిన బంతిపూలు, చేమంతిపూలు, కనకాంబరాలు ఎంతో అందాన్ని ఇస్తాయి. సూర్యకిరణాలతో చెరువులోని నీరు రంగులను వెదజల్లుతూ అలరారుతుంటాయి. మా ఊరి చెరువులోని అందాలు చెప్పనలవికాదు. చెరువు గట్టున కూర్చొని ఒయ్యారంగా దుస్తులు ఉతుక్కుంటున్న ఆడవారు ఎంతో రమణీయంగా కనిపిస్తారు.
సూర్యాస్తమయ సమయంలో కూడా చెరువు చివరన కొండలపై నుండి కిందకు వాలుతున్న సూర్యుని కిరణాలతో అక్కడి వాతావరణం అంతా పచ్చదనం, అరుణ కిరణాలతో అలరారుతూ కనిపిస్తాయి.
(లేదా)
మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయండి.
జవాబు.
కవిత
నేను పుట్టిన మా ఊరు
అదే నాపాలిట హరివిల్లు
ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు
పల్లె జీవితం ఆరోగ్యానికి శుభప్రదం.
నా పల్లెలో అందమైన చెరువు
చెరువులోని నీరు ప్రాణాధారం
నిర్మలమైన జలం అదే మాకుబలం
అక్కడి తామరలు కమనీయం
విరబూసిన అరవిందాలు
చేనులకు అదే కమనీయాలు
లేలేత ప్రభాకరుని కిరణాలు
చూడటానికి రెండుకళ్ళు చాలవు
చెరువులు కళకళలాడాలి
ప్రభుత్వ ఆశయ సాధన సిద్ధించాలి
V. పదజాల వినియోగం:
1. కింద గీత గీసిన పదాలకు అదే అర్థాన్నిచ్చే పదాలు రాయండి.
ఉదా : సంపదతో గర్వపడకూడదు. (కలిమి, ధనము)
అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి. (__________, __________)
జవాబు.
(చెరువు, గుంట)
ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం. (__________, __________)
జవాబు.
(దుస్తులు, వస్త్రాలు)
ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది. (__________, __________)
జవాబు.
(గ్రామం, ఊరు)
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
జవాబు.
అలలు
ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది.
జవాబు.
ఏరు
ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి.
జవాబు.
పశువులపాక
3. పాఠం ఆధారంగా కింది వాటికి కారణాలు పట్టికలో రాయండి.
జవాబు.
అ) ఊరు పసుపు అద్దినట్లుండటానికి కారణం | బంతి, చేమంతి పూలు |
ఆ) ఎర్రని పారాణి అద్దినట్లుండటానికి కారణం | గోరింటాకు |
ఇ) కుంకుమబొట్టు పెట్టినట్లు ఉండటానికి కారణం | పట్టుకుచ్చుల పూలు |
ఈ) పండు ముత్తైదువగా ఉండటానికి కారణం | అన్నీ కలిసిన ఊరు |
4. భావనాచిత్రమంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే ! ఒక గ్రామానికి చెందిన భావనాచిత్రం గీయుమన్నపుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం.
జవాబు.
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1) కింది పదాలను కలిపి రాసి, సంధిని గుర్తించండి.
ఉదా : నీవు + ఎక్కడ = నీవెక్కడ – (ఉత్వసంధి)
అ) భీముడు + ఇతడు = __________ – (__________)
జవాబు.
భీముడితడు – (ఉత్వసంధి)
ఆ) అతడు + ఎక్కడ = __________ – (__________)
జవాబు.
అతడెక్కడ – (ఉత్వసంధి)
ఇ) ఇతడ + ఒకడు = __________ – (__________)
జవాబు.
ఇతడెక్కడ – (ఉత్వసంధి)
ఈ) ఆటలు + ఆడు = __________ – (__________)
జవాబు.
ఆటలాడు – (ఉత్వసంధి)
2) కింది పదాలను కలిపి రాయండి.
అ. ఏమి + అది = __________
జవాబు.
ఏమది
ఆ. ఎవరికి + ఎంత = __________
జవాబు.
ఎవరికెంత
ఇ. మరి + ఇప్పుడు = __________
జవాబు.
మరెప్పుడు
ఈ) అవి + ఏవి = __________
జవాబు.
అవేవి
పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.
మొదటి పదం చివరి అచ్చు “ఇకారం (ఇత్తు). రెండవ పదం మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’కారానికి (ఇత్తునకు అచ్చు పరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్నిచోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యే = ఏమయ్యే – సంధి జరిగింది.
ఏమి + అయ్యే = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.
ఒకసారి సంధి (నిత్యం) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు.
“ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుంది కదా ! దీనినే ఇత్వసంధి అంటారు.
‘ఏమ్యాదులయందు ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.
3. ఈ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : రావాలని = రావాలి + అని (ఇత్వసంధి)
అ. చెప్పాలంటే = __________ + __________
జవాబు.
చెప్పాలి + అంటే – (ఇత్వసంధి)
ఒక్కటే = __________ + __________
జవాబు.
ఒక్కటి + – (ఇత్వసంధి)
ఇ) రానిదని = __________ + __________
జవాబు.
రానిది + అని – (ఇత్వసంధి)
ఈ) నీటినిసుమంత = __________ + __________
జవాబు.
నీటిని + ఇసుమంత – (ఇత్వసంధి)
ఉ) చెప్పినదియేమి = __________ + __________
జవాబు.
చెప్పినది + ఏమి – (ఇత్వసంధి)
ఊ) వచ్చినపుడు = __________ + __________
జవాబు.
వచ్చిరి + అపుడు – (ఇత్వసంధి)
ఋ) ఎన్నియేని = __________ + __________
జవాబు.
ఎన్ని + ఏని – (ఇత్వసంధి)
ప్రాజెక్టు పని:
మీ ఊరిలో ఉన్న చెట్లను, పూలను, జరిగే వ్యాపారాలను, చేతివృత్తులవారిని పరిశీలించండి. పట్టికలో నమోదు చేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
TS 7th Class Telugu 5th Lesson Important Questions పల్లె అందాలు
I. అవగాహన-ప్రతిస్పందన:
అపరిచిత పద్యాలు:
1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మానవుని రక్షించేది ఏది ?
జవాబు.
శాంతం
ప్రశ్న 2.
మానవునకు శత్రువు ఏది ?
జవాబు.
కోపం
ప్రశ్న 3.
స్వర్గనరకాలు ఎవరి చేతిలో ఉన్నాయి ?
జవాబు.
మనచేతిలోనే ఉన్నాయి.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
సుమతీ శతకంలోనిది
ప్రశ్న 5.
ఈ పద్యాన్ని బట్టి మానవులు ఎలా ఉండాలి ?
జవాబు.
సంతోషంతో, శాంతంగా ఉండాలి.
2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచియతుకవచ్చు క్రమము గాను
మనసు విరిగెనేని మరియంట వచ్చు నా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దేనిని అతకవచ్చు ?
జవాబు.
ఇనుమును
ప్రశ్న 2.
దేనిని అతకలేము ?
జవాబు.
మనసును
ప్రశ్న 3.
మనసు ఎప్పుడు విరుగుతుంది ?
జవాబు.
ఇతరుల ప్రవర్తన వల్ల చాలా బాధ కలిగినపుడు.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
వేమన శతకంలోనిది
ప్రశ్న 5.
“ముమ్మారు” అనగా అర్థమేమిటి ?
జవాబు.
మూడుసార్లు
3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
“కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ”!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కమలాప్తుడు అనగా
ఎ) చంద్రుడు
బి) సూర్యుడు
సి) ఇంద్రుడు
జవాబు.
బి) సూర్యుడు
ప్రశ్న 2.
నీట బాసినవి.
ఎ) కమలములు
బి) పుస్తకములు
సి) మిత్రులు 75
జవాబు.
ఎ) కమలములు
ప్రశ్న 3.
“తమ స్థానములు కోల్పోతే” అనే అర్థం వచ్చేపాదం.
ఎ) 3 వ పాదం
బి) 2 వ పాదం
సి) 4వ పాదం
జవాబు.
ఎ) 3 వ పాదం
ప్రశ్న 4.
మిత్రులు శత్రువులెప్పుడు అవుతారు?
ఎ) తమ స్థానం తప్పనప్పుడు
బి) తమ స్థానం తప్పినప్పుడు
సి) స్థానమే లేనప్పుడు
జవాబు.
బి) తమ స్థానం తప్పినప్పుడు
ప్రశ్న 5.
పై పద్యం ఏ శతకంలోనిది?
ఎ) సుమతీ శతకం
బి) వేమన శతకం
సి) దాశరథీ శతకం
జవాబు.
బి) వేమన శతకం
4. క్రింది పద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి?
జవాబు.
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.
ప్రశ్న 2.
‘కమలిన భంగిన్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు.
వాడిపోయిన విధంగా అని అర్ధము.
ప్రశ్న 3.
తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది?
జవాబు.
‘తమ తమ నెలవులు దప్పిన’ అనే మూడోపాదం.
ప్రశ్న 4.
మిత్రులు శత్రువులెందుకవుతారు?
జవాబు.
తమ తమ స్థానాలు కోల్పోతే మిత్రులు శత్రువులవుతారు.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం?
జవాబు.
ఇది సుమతీ శతకంలోని పద్యం.
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
మీ గ్రామం అందాలను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
మా ఊరి అందాలు వర్ణనాతీతము. మా ఊరిలో సూర్యోదయ సమయంలో చెరువు దగ్గరకు వెళితే అక్కడి అందాలు మనలను పరవశింపచేస్తాయి. చెరువులోని ఎర్ర కలువలు, తెల్ల కలువలు సూర్య భగవానునికి స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లు వికసిస్తుంటాయి. పైన పక్షుల కిలకిలారావాలు కూడా ఎంతో హాయిని ఇస్తాయి.
పొలాలలో విరబూసిన బంతిపూలు, చేమంతిపూలు, కనకాంబరాలు ఎంతో అందాన్ని ఇస్తాయి. సూర్యకిరణాలతో చెరువులోని నీరు రంగులను వెదజల్లుతూ అలరారుతుంటాయి. మా ఊరి చెరువులోని అందాలు చెప్పనలవికాదు. చెరువు గట్టున కూర్చొని ఒయ్యారంగా దుస్తులు ఉతుక్కుంటున్న ఆడవారు ఎంతో రమణీయంగా కనిపిస్తారు.
‘సూర్యాస్తమయ సమయంలో కూడా చెరువు చివరన కొండలపై నుండి కిందకు వాలుతున్న సూర్యుని కిరణాలతో అక్కడి వాతావరణం అంతా పచ్చదనం, అరుణ కిరణాలతో అలరారుతూ కనిపిస్తాయి.
ప్రశ్న 2.
నీ దృష్టిలో ఆదర్శగ్రామం అంటే ఎలా ఉండాలి ? (లేదా) ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు ?
జవాబు.
ఆదర్శగ్రామం అంటే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయపడాలి. వీధులను, ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సిమెంట్ రోడ్లను వేసి ఉండాలి. మంచినీటి పంపులు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరా ఎప్పుడూ ఉండాలి. అలాంటి ఆదర్శగ్రామం ఉండాలని నేను అనుకుంటున్నాను.
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
మీ ఊరి అందాలను రాయండి.
జవాబు.
మా ఊరి అందాలు వర్ణనాతీతము. మా ఊరిలో సూర్యోదయ సమయంలో చెరువు దగ్గరకు వెళితే అక్కడి అందాలు మనలను పరవశింపచేస్తాయి. చెరువులోని ఎర్ర కలువలు, తెల్ల కలువలు సూర్య భగవానునికి స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లు వికసిస్తుంటాయి. పైన పక్షుల కిలకిలారావాలు కూడా ఎంతో హాయిని ఇస్తాయి.
పొలాలలో విరబూసిన బంతిపూలు, చేమంతిపూలు, కనకాంబరాలు ఎంతో అందాన్ని ఇస్తాయి. సూర్యకిరణాలతో చెరువులోని నీరు రంగులను వెదజల్లుతూ అలరారుతుంటాయి. మా ఊరి చెరువులోని అందాలు చెప్పనలవికాదు. చెరువు గట్టున కూర్చొని ఒయ్యారంగా దుస్తులు ఉతుక్కుంటున్న ఆడవారు ఎంతో రమణీయంగా కనిపిస్తారు.
సూర్యాస్తమయ సమయంలో కూడా చెరువు చివరన కొండలపై నుండి కిందకు వాలుతున్న సూర్యుని కిరణాలతో అక్కడి వాతావరణం అంతా పచ్చదనం, అరుణ కిరణాలతో అలరారుతూ కనిపిస్తాయి.
ప్రశ్న 2.
మీ ఊరికి (గ్రామం) అందానిచ్చే చెరువులు, ప్రకృతి, పంటపొలాల గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా)
‘పల్లెటూరు దాని పరిసరాలవల్లనే అందంగా ఉంటుంది’ దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు.
పల్లెలు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు. ప్రేమానురాగాలకు కోవెలలు. పచ్చని ప్రకృతికి ఆలవాలు. పల్లె సీమలు సౌందర్య నిలయాలు. జాలువారే సెలయేళ్లు, చెరువులు, నీటిలో తేలియాడే తామరలు, రకరకాల పూలు, చెట్లు ఒకటేమిటి ? అడగకుండానే అన్నీ ఇచ్చే పల్లెతల్లి ఎంతో స్వచ్ఛమైంది. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుకొమ్మ. ఊరికి అందాన్నిచ్చేవి చెరువులు, పంటపొలాలు, దాని పరిసరాలే.
మా ఊరికి ప్రధానంగా అందాన్ని, ఆనందాన్ని కలిగించేవి చెరువులు. ఊరిలోని చిన్నా పెద్ద, ఆడమగ అందరికీ వాళ్ల అవసరాలు తీరుస్తాయి చెరువులు. ఆ చెరువులు తామరాకులతో, పద్మాలతో నిండి ప్రకృతి శోభను కలిగిస్తాయి. చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని పెద్దలు ఊరికే అన్నారా ! ప్రతి వాకిట ముందు బంతి, చేమంతి పూలు పసుపు దిద్దుకొన్న స్త్రీలలాగా అలరిస్తాయి. గోరింట చెట్లు ఊరికి పారాణి అద్దినట్లుంటాయి. పట్టుకుచ్చుల పూలు ఊరికి కుంకుమబొట్టులా ఉండి, చూపరులకు మా ఊరు పండు ముత్తైదువు వలె శోభిల్లుతున్నది. కాలానుగుణంగా పూసే పూలను, పండే పండ్లను మా ఊరిలో చెట్లు మాకు కానుకలుగా సమర్పించాయి.
మా ఊరిలోని రైతులు పశువులన్నింటిని తమ బిడ్డలవలె పోషిస్తారు. ప్రతి పంటకాలంలో భూమిని దున్ని, పంటలు పండిస్తూ పాడిని సమకూరుస్తూ సంతోషంగా జీవిస్తారు. పచ్చని పొలాలతో పల్లె సీమలు భరతమాత మెడలో పచ్చల హారంలా శోభిల్లుతాయి. మా ఊరిలోని అంగళ్ళు అన్నివేళలా అనేక వస్తువులతో నిండి వాటికై వచ్చే జన సందోహంతో సందడి వాతావరణంతో కమనీయంగా, కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
పల్లెలోని చెరువు దాని చుట్టూ ఉన్న పరిసరాలను వర్ణించండి..
జవాబు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పల్లె తల్లి వంటిది. పట్నం ప్రియురాలి వంటిది. పల్లె రమ్మంటుంది. పట్నం తెమ్మంటుంది. పల్లెను దైవం సృష్టిస్తే, పట్నాన్ని మానవుడు నిర్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెల గొప్పదనం అంతా ఇంతా కాదు, ఎంతో! పల్లెలకు అందానిచ్చేవి ప్రధానంగా చెరువులే. వాటి నీటితోనే నిత్యావసరాలు తీరుతాయి. పంటపొలాలకు ఈ నీరే
ఆధారం.
అలాంటి చెరువులు నీటితో కళకళలాడుతుంటే ఆ ఊరు సిరులతో తుళ్ళుతుంటుంది. చెరువు గొప్పతనం నీరున్నప్పుడు కన్నా, నీరు ఇంకినపుడు బాగా తెలుస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు నీటితో చెరువులు నింపుకోవాలి. “తెప్పలుగ చెఱువు నిండినఁగప్పలు పదివేలు చేరు ….” అంటూ కవులు కూడా చెరువుల నిండుదనం ప్రస్తుతించారు. పల్లెలకు చెరువులే ఆయువుపట్టు. పచ్చని తామరాకులతో, పద్మాలతో సమ్మోహనంగా ఉండే చెరువులు పల్లెలకు జీవనాధారం. చెరువులు మనుష్యులకు, జంతువులకు, పక్షులకు ప్రాణాధారం.
పచ్చని పొలాలతో పల్లెలు భరతమాత మెడలో హారంలా విలసిల్లుతాయి. ఒక ప్రక్క పొలాలకు, మరో ప్రక్క పాడి పశువులకు ఆధారమైన ఆలంబన కలిగిస్తూ ఉండే చెరువులు మన పాలిట కల్పతరువులు.
ప్రశ్న 2.
మీరు జరుపుకునే ఒక పండుగను గూర్చి వివరిస్తూ, మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
జగ్గయ్యపేట,
X X X X X.
ప్రియమైన మిత్రుడు కిరణ్కుమార్కు,
శుభాకాంక్షలు. ఉభయ కుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. ఇటీవల జరిగిన ‘సంక్రాంతి’ పండుగను మేము బాగా జరుపుకొన్నాము. ఈ పండుగ పండుగలలో కెల్లా పెద్ద పండుగ. ప్రధానంగా ‘భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు జరుపుకుంటాము. ఈ కాలంలోనే రైతులకు పంటలు ఇంట చేరుతాయి. అందువల్ల ఈ పండుగను పల్లెటూళ్ళలో విశేషంగా జరుపుతారు.
‘భోగి’ భోగభాగ్యాలను కల్గించాలని, పాతదిపోయి కొత్తదనాన్ని కోరుతూ భోగిమంటలు వేస్తారు. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన కాలం మకర సంక్రాంతి. కనుమనాడు పశుపూజ చేసి, బంధువులతో కలసి విందు భోజనాలు చేస్తారు. ఈ పండుగ శాస్త్రీయత కలది. భోగిరోజున పిల్లలకు రేగిపండ్లు పోయడం ద్వారా ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉంటాయి.
శుభదాయకం, సంతోషకరమైన సంక్రాంతి పండుగ అందరికీ శుభాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీవు ఈ పండుగ ఎలా జరుపుకున్నావో తెలియజేయి. మీ పెద్దలందరికి నా నమస్కారాలు.
ఇట్లు
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.
చిరునామా :
కె. కిరణ్ కుమార్,
7వ తరగతి,
కుర్మేడు,
నల్గొండ జిల్లా.
IV. భాషాంశాలు:
పదజాలం:
ప్రకృతి – వికృతి:
1. ప్రేమ – పేర్మి, ప్రేముడి
2. కోష్ట – కొట్టము (పశువుల పాక)
3. పురీ, పురం – ప్రోలు
4. సేమంతి – చేమంతి
5. పుండ్రమ్ – బొట్టు
6. నిత్యము – నిచ్చలు
7. కుడ్యం – గోడ
8. పుష్పం – పూవు
9. పుణ్యెం – పున్నెం
10. పల్లీ – పల్లె, పల్లియ
11. స్నానం – తానం
12. కుఙ్కమమ్ – కుంకుమ
13. మల్లి – మొల్ల
14. చిత్రం – చిత్తరువు
15. పుత్రీ – బిడ్డ
16. అక్షరం – అక్కరం
17. సరము – చెరువు
18. పట్టణం – పట్టం, పట్నం
19. సముద్రం – సంద్రం
20. సంతోష – సంతసం
21. సౌందర్యం – చందు
22. ప్రకృతి – పగిది
నానార్థాలు:
ప్రశ్న 1.
అంబరం = __________
జవాబు.
వస్త్రం, ఆకాశం, పాపం
ప్రశ్న 2.
ప్రకృతి = __________
జవాబు.
ప్రత్యయం చేరక ముందున్న శబ్దం, ముఖ్యం, ప్రాణి, తల్లి, పరమాత్మ
ప్రశ్న 3.
ఊరు = __________
జవాబు.
గ్రామం, జనించు, లోపలి నుండి (ద్రవం) పైకివచ్చు, వృద్ధినొందు
ప్రశ్న 4.
అక్షరం = __________
జవాబు.
అక్కరం, నాశనం లేనిది, పరబ్రహ్మం
ప్రశ్న 5.
అంగడి = __________
జవాబు.
దుకాణం, రచ్చ, న్యాయస్థానం
ప్రశ్న 6.
లీల = __________
జవాబు.
వినోదం, క్రీడ, విలాసం
ప్రశ్న 7.
వర్ణం = __________
జవాబు.
అక్షరం, రంగు, కులం
ప్రశ్న 8.
రుచి = __________
జవాబు.
కాంతి, ఆఁకలి, రంగు, కోరిక
ప్రశ్న 9.
పద్మం = __________
జవాబు.
కమలం, పాము
ప్రశ్న 10.
పశువు = __________
జవాబు.
గొట్టె, బలి ఇచ్చే మృగం
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
నిలయం = __________
జవాబు.
నిలయం = ఉండే చోట
పల్లెటూళ్ళు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు.
ప్రశ్న 2.
కానుక = __________
జవాబు.
కానుక = బహుమానం
పెళ్ళిలో దంపతులకు బంధువులు కానుకలు ఇస్తారు.
ప్రశ్న 3.
పరిమళం = __________
జవాబు.
పరిమళం = సువాసన
పూల పరిమళాలతో మా ఇల్లు ఆహ్లాదంగా ఉంది.
ప్రశ్న 4.
పుణ్యం = __________
జవాబు.
పుణ్యం = మంచి, శుభం
గోవులను పూజించడం పుణ్యం.
వ్యుత్పత్త్యర్థాలు:
ప్రశ్న 1.
ముత్తైదువ : __________
జవాబు.
ముదుసలి సుమంగళియగు స్త్రీ (వృద్ధ పుణ్యస్త్రీ).
ప్రశ్న 2.
దంపతులు : __________
జవాబు.
జాయాపతులు = భార్యాభర్తలు
వ్యాకరణాంశాలు:
భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
ఆహా ! ఏమి రుచి.
జవాబు.
అవ్యయం
ప్రశ్న 2.
‘సర్వనామానికి’ ఉదాహరణలివ్వండి.
జవాబు.
అతడు, ఆమె
ప్రశ్న 3.
పనిని తెలిపేది.
జవాబు.
క్రియ
పద్యాలకు అర్థాలు – భావాలు:
I.
1వ పద్యం:
తే.గీ. ఊరిప్రక్కన గన్నట్టు వొదుగు లేని
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ
గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.
అర్థాలు :
మా ఊరి = మా ఊరి
ప్రక్కన = ప్రక్కన
కన్నట్టు = చూచినట్లు (చూచిన)
ఒదుగులేని = కదలిక లేని
నిండు గంగాళం = నిండైన గంగాళం
వంటి = వంటి
రెండు చెఱువులు = రెండు చెరువులు
ఒక్కటేయని = ఒక్కటే అని
కలసియున్నట్టి = కలసి ఉన్న
అలుగులు = అలుగులు
నడుమ = నడుమున
గడుసుదనము = గడుసుదనం
చెప్పుచునుండె = చెప్పుచున్నాయి
భావం :
మా ఊరి చెరువులు నిండు గంగాళమువలె పూర్తిగా నిండి ఉన్నాయి. వాటి అలుగులు రెండూ కలవడంతో, ఆ గడుసుదనం వలన అవి ఒకే చెరువువలె ఉన్నాయి.
2వ పద్యం:
తే.గీ. నీటి నిసుమంత గనుపడనీక మొదటి
వరకు వ్యాపించి వలగొను పద్మలతల
సాదుకొను చుండె ప్రేమ రసాల నొలికి
మా తటాకాలు లలితపద్మాకరాలు.
అర్థాలు :
మా = మా ఊరి
తటాకాలు = చెరువుల
లలిత పద్మాకరాలు = అందమైన చెరువులు
నీటి = నీటిని
ఇసుమంత = కొంచెం కూడా
కనుపడనీక = కన్పించనీయకుండా
మొదటి వరకు = మొదటి వరకు
వ్యాపించి = వ్యాప్తి చెంది
ప్రేమరసాల నొలికి = ప్రేమామృతాన్ని చూపిస్తూ
వలగొని = ఆకట్టుకొని
పద్మలతలు = పద్మాలను
సాదుకొను చుండె = సాదుకుంటున్నాయి.
భావం :
మా ఊరి అందమైన చెరువులు, తమలోని నీటిని కొంచెం కూడా కన్పించనీయకుండా మొదళ్ళ వరకు వ్యాపించిన పద్మాలను ప్రేమతో సాదుకుంటున్నాయి.
3వ పద్యం : (కంఠస్థ పద్యం)
తే.గీ. చిన్ని కెరటాల స్నానాలు జేసి వార్చి
తరుణ పేశల కమల పత్రాలనెత్తి
అరుణ కిరణాల దేవత కర్క్ష్యమిచ్చు
బ్రత్యుషస్సున మాయూరి పద్మలతలు
అర్థాలు :
మా ఊరి = మా ఊరి
పద్మలతలు = అందమైన చెరువులోని పద్మాలు
ప్రతి = ప్రతిరోజూ
ఉషస్సున = సూర్యోదయ సమయంలో
చిన్ని కెరటాల = చిన్న అలలతో
స్నానాలు జేసి = స్నానం చేసి
తరుణ పేశల = నిగనిగలాడే
కమల పత్రాల నెత్తి = రేకులను ఎత్తి
అరుణ కిరణాల దేవత = ఎర్రని కిరణాలను ప్రసరించే
అర్ఘ్యమిచ్చు = సంధ్యవారుస్తున్నాయా అనిపిస్తున్నాయి.
భావం:
మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి, నిగనిగలాడే సుకుమారమైన తమ రేకులను ఎత్తి సూర్యునికి అర్ఘ్యమిస్తూ, సంధ్య వారుస్తున్నాయా అన్నట్లున్నాయి.
II.
4వ పద్యం:
తే.గీ. బంతి, చేమంతి భక్తితో బసవు దిద్ద
రంగు గోరంట జాతి పారాణులద్ద
పట్టు కుచ్చులు కుంకుమ బొట్టుబెట్ట
నలరు మాయూరు పెద్ద ముత్తైదువట్లు.
అర్థాలు :
బంతి = బంతిపూలు
చేమంతి = చేమంతిపూలు
భక్తితో = భక్తితో
పసవు దిద్ద = పసుపు దిద్దినట్లున్నాయి
గోరంట రంగు = ఎఱ్ఱని గోరింటాకు
జాతి = మా ఊరికి
పారాణులద్ద = పారాణి అద్దినట్లున్నది
పట్టుకుచ్చులు = పట్టు కుచ్చుల పూలు
కుంకుమ బొట్టు = కుంకుమ బొట్టు
పెట్టనలరు = పెట్టినట్లున్నాయి
ఈ = వీటివల్ల
మా యూరు = మా ఊరు
పెద్ద ముత్తైదువ = పండు ముత్తైదువు వలె
అలరు = పండు ముత్తైదువు వలెశోభిల్లుతుంది
భావం : బంతి, చేమంతిపూలు మా ఊరికి పసుపు దిద్దినట్లు న్నాయి. ఎర్రని గోరింటాకు మా ఊరికి పారాణి అద్దినట్లుంది. పట్టుకుచ్చుల పూలు మా ఊరికి కుంకుమబొట్టు పెట్టినట్లున్నాయి. వీటివల్ల మా ఊరు పండు ముత్తైదువువలె శోభిల్లుతుంది.
5వ పద్యం:
ఉ. మారెడు అల్లనేరడులు మామిడి రేగులు జామ నిమ్మలం
జూరల నంట్లు దాడిమల సోగగులాబులు మల్లె మొల్ల గ
న్నేరులు దాసనల్ వెలసి నిశ్చలతన్ దమకార్తులందు నిం
పార ఫలాల పూవులను నంచెలవారిగ సంతరించి మా
యూరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.
అరాలు:
మా ఊరుకిన్ = మా ఊరుకి
నిత్యము = ఎల్లప్పుడూ.
మారేడు = మారేడుకాయలు
అల్ల నేరడులు = అల్లనేరేడులు
మామిడి = మామిడి కాయలు
రేగులు = రేగిపండ్ల
జామ = జామకాయలు
నిమ్మ = నిమ్మకాయలు
అంజూర = అంజూర
అంట్లు = అరటి
దాడిమలు = దానిమ్మ వృక్షాలు మొ||గు
సోగ గులాబులు = అందమైన గులాబీలు
మల్లె = మల్లెలు
మొల్ల = మొల్లలు
గన్నేరులు = గన్నేరులు
దాసనల్ = దాసనలు
నిశ్చలతన్ = నిశ్చింతగా
తమకార్తులందు = తమ వాసనలను (కాలాలందు)
నింపార = నింపగా
ఫలాల, పూవులను = ఫలాలను, పూవులను
అంచెలవారిగ = అంచెలంచెలుగా
సంతరించి = కనిపించి
ఉపాయనం = కానుకగా
దంపతులట్లు = భార్యాభర్తలవలె
బిడుచునుండును = సమర్పిస్తుంటాయి
భావం :
ఆయా కాలాలలో మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొ||న వృక్షాలు వివిధ ఫలాలనూ ; అందమైన గులాబీ, మల్లె, మొల్ల, గన్నేరు, దాసన మొదలైన మొక్కలు వివిధ పుష్పాలనూ దంపతులవలె మా ఊరికి ఎల్లవేళలా కానుకగా సమర్పిస్తుంటాయి.
6వ పద్యం : (కంఠస్థ పద్యం)
తే.గీ. మావులున్నవి – మధురముల్ మంచినీటి
బావులున్నవి, అందాలు పరిమళించు
తావులున్నవి, పుణ్యాల ప్రోవులైన
యావులున్నవి, మాయూర నతిశయముగ.
అర్ధాలు :
మా ఊర = మా ఊరిలో
అతిశయముగా = ఎక్కువగా
మావులు = మామిడి తోటలు
ఉన్నవి = ఉన్నాయి
మధురమైన = తీయనైన
మంచినీటి బావులు = మంచినీటి బావులు
ఉన్నవి = ఉన్నాయి
అందాలు = అందాల పూల
పరిమళించు = పరిమళం వెదజల్లే
తావులు = సువాసనలు.
ఉన్నవి = ఉన్నాయి
పుణ్యాల = పుణ్యాలచే
ప్రోవులైన = రాశులైన
ఆవులున్నవి = ఆవులు ఉన్నాయి
భావం :
మా ఊరిలో ఎన్నో మామిడి తోటలు ఉన్నాయి. తీయని మంచినీటి బావులు అనేకం ఉన్నాయి. అందాల పూల పరిమళము వెదజల్లే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పుణ్యరాశులైన ఆవులు అసంఖ్యాకంగా ఉన్నాయి.
III.
7వ పద్యం:
ఉ. నేయుదురెన్నియేవి కమనీయపు నాగరికాంబరమ్ములన్
వేయుదు రద్దకంబులతి వేల పురాతన చిత్రవర్ణముల్
పోయగమైన నేతపని సొంపుల నేర్పరులైన పద్మశా
లీయ కుటుంబముల్ రుచిరలీల వసించును మా పురమ్మునన్.
అర్థాలు :
మా పురమ్మునన్ = మా గ్రామంలో ఉండే
పద్మశాలీయ = పద్మశాలీ
కుటుంబముల్ = కుటుంబాల వాళ్ళు
నాగరికా = నేటి నాగరికతకు సరిపోయే
అంబరమ్ములన్ = అందమైన వస్త్రాలను
ఎన్నియేని = ఎన్ని అయినను
నేయుదురు = నేస్తారు
అతివేల పురాతంబులైన = అతి పురాతనమైన
చిత్రవర్ణముల్ = బొమ్మలను కూడా రంగులతో
అద్దకంబు = అద్దకం
వేయుదురు = వేస్తారు
సోయగమైన = అందమైన
నేతపని = నేతపనిలో
సొంపుల = నేర్పరులైన
పద్మశాలీ = పద్మశాలీ కుటుంబాలు
అచిరలీల = ఎన్నో కాలాల నుండి
వసించును = నివసిస్తున్నాయి
భావం:
మా ఊరిలో ఉండే పద్మశాలీ కుటుంబాలవాళ్ళు నేటి నాగరికతకు సరిపోయే అందమైన ఎన్నో వస్త్రాలను చక్కగా నేస్తారు. అతి పురాతనమైన బొమ్మలను కూడా ఎన్నో ఆకర్షణీయమైన రంగులతో అద్దకం వేస్తారు. అందమైన నేతపనిలో నేర్పురులైన ఈ పద్మశాలీ కుటుంబాలు మా గ్రామంలో ఎన్నో ఉన్నాయి.
8వ పద్యం:
ఉ. గోదలు’పాడిగేదెలును కొట్టము ఎండుగ దుక్కిటెద్దులన్
భేదము లేక సాకుచును బిడ్డల బోలెను – కారు కారు కిం
పాదిక భూమిదున్నుకొని హాయిగ నుందురు పాడిపంట లా
హ్లాదము గూర్పు మాపురము వందలి కాపు కుటుంబముల్ తగన్.
అర్థాలు :
మా పురము = మా గ్రామము
అందలి = అందు
కాపు కుటుంబముల్ = కాపు కుటుంబాల వారు
గోదలు = ఎడ్లు
పాడి గేదెలు = పాలిచ్చే బర్రెలు
దుక్కిటెద్దులన్ = దున్నే ఎడ్లులనే
భేదము లేక = తేడా లేకుండా
బిడ్డల పోలెన్ = బిడ్డలవలె
కొట్టం నిండుగ = పశువుల పాకలోని పశువులను
సాకుచును = పోషిస్తారు.
కారు కారు = ప్రతి పంటకాలంలో
ఇంపాదిగా = నెమ్మదిగా
భూమి దున్నుకొని = భూమిని దున్నుకొని
పాడిపంటలు = పాడిపంటలతో
ఆహ్లాదంగా = సంతోషముగా
కూర్పున్ = జీవిస్తారు.
భావం :
మా ఊరి కాపు కుటుంబాల వారు, ఎడ్లు, పాలిచ్చే బర్రెలు, దున్నే ఎడ్లు అనే భేదం లేకుండా పశువులనన్నింటిని తమ బిడ్డలవలె పోషిస్తారు. ప్రతి పంటకాలంలో భూమిని దున్ని, పంటలు పండిస్తూ, పాడిని సమకూరుస్తూ సంతోషంగా జీవిస్తారు.
9వ పద్యం : (కంఠస్థ పద్యం)
తే.గీ. బహుళ వస్తు ప్రధాన సంపన్నమగుచు
నెలమి క్రయ విక్రయార్థి సంకులమునగుచు
జనగతాగత కల్లోల సాంద్రమగుచు
వెలయు మా యంగడులు నన్నివేళలందు.
అరాలు:
మా = మా ఊరిలోని
అంగడులు = అంగళ్ళు
అన్ని వేళలయందు = అన్ని వేళలలో
బహుళ = అనేకమైన
వస్తు ప్రధాన = వస్తువులతో సంపన్నమై
నెలమి = కూడిన
క్రయ = అమ్మకానికి
విక్రయార్థి = కొనడానికి
సంకులమునగుచు = గుమికూడుతూ వచ్చిన
జనగతాగత = జనంతో కిక్కిరసి
కల్లోల సాంద్రమగుచు = అల్లకల్లోలమైన సముద్రం లాగా
వెలయు = కనిపిస్తుంటాయి
భావం:
మా ఊరిలోని అంగళ్ళు అన్నివేళలా అనేక వస్తువులతో సంపన్నమై, అమ్మకానికి, కొనడానికి వచ్చిన జనంతో క్రిక్కిరిసి, జనం రాకపోకల సందడితో వెలుగొందుతాయి.
పాఠం ఉద్దేశం:
పల్లెటూర్లు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు. ప్రేమానురాగాల కోవెలలు. పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె. అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
పద్యప్రక్రియలో గ్రామీణ సౌందర్య చిత్రణతోపాటు, పల్లె సోయగాలు ఎక్కువగా ఉంటాయి.
కవి పరిచయం:
కవి : ఆచ్చి వేంకటాచార్యులు.
కాలం : 1914 – 1985వ సం॥
జన్మస్థలం : నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాదు మండలం, ఆవునూరు గ్రామం.
రచనలు : బుర్రకథ, రాగమాల, మా ఊరు.
విశేషాలు : ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.
ప్రవేశిక:
పల్లెటూర్లో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుంది. పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది. పల్లెసీమలు సౌందర్య నిలయాలు. జాలువారే సెలయేళ్ళు, చెరువులు, నీటిలో తేలియాడే తామరలు, రకరకాల పుష్పాలు, వృక్షాలు, ఒకటేమిటి ? అడుగకుండానే అన్నీ ఇచ్చే పల్లెతల్లి ఎంతో స్వచ్ఛమైంది. గ్రామసీమల సుందరదృశ్యాలు, అక్కడి వ్యాపార విధానాలు, వివిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం !
నేనివి చేయగలనా?