Telangana SCERT 7th Class Telugu Guide Telangana 4th Lesson అమ్మ జ్ఞాపకాలు Textbook Questions and Answers.
TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి : (TextBook Page No.32)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో అమ్మ, బాబు, పాప, పిల్లి ఉన్నారు.
ప్రశ్న 2.
అమ్మ ఏం చేస్తున్నది ?
జవాబు.
అమ్మ పిల్లవాడికి గోరుముద్దలు తినిపిస్తున్నది.
ప్రశ్న 3.
పిల్లల కోసం అమ్మ ఏయే సేవలు చేస్తుంది ?
జవాబు.
పిల్లలకు అమ్మ స్నానం చేయిస్తుంది, తల దువ్వుతుంది, అన్నం తినిపిస్తుంది.
ప్రశ్న 4.
మీరు మీ అమ్మకోసం ఎప్పుడెప్పుడు, ఎటువంటి సేవలు చేశారు ?
జవాబు.
మేము మా అమ్మకు సెలవులు వచ్చినపుడు ఇంటి పనులలో సాయం చేశాము. అమ్మకు జ్వరం వచ్చినపుడు తలనొప్పికి మందు రాసి, మందుబిళ్ళలు వేశాము.
ప్రశ్న 5.
మీరు మీ అమ్మకోసం ఏమైనా చేసినపుడు ఎట్లా అనిపించింది ?
జవాబు.
మేము మా అమ్మకోసం సేవలు చేసినపుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. తల్లికి సేవ చేస్తున్నాము అనే భావన కలిగింది.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.34)
ప్రశ్న 1.
“అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరలా ఉందనడంలో” కవి ఆంతర్యమేమిటి ?
జవాబు.
అద్దకం చీర మీద ఎన్నోరకాల అద్దకాలు చూడముచ్చటగా ఉంటాయి. రంగురంగుల్లో ఉంటాయి. అట్లే అమ్మ వేసిన ముగ్గు కూడా చీరపై ఉన్న అద్దకం మాదిరిగా కనువిందు చేసిందని ఆశయం.
ప్రశ్న 2.
అమ్మను నర్సు అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
అమ్మ తన బిడ్డకు రోగం వచ్చినపుడు సేవలు చేస్తుంది. ఇంటినే ఆసుపత్రిగా మారుస్తుంది. ఆయుర్వేదపు మందులను ఇస్తుంది. మంచం చుట్టూ తిరుగుతూ సపర్యలు చేస్తుంది. ఏమాత్రం కోపగించదు. విసుక్కోదు. అందుకనే అమ్మను కవి ఒక నర్సు అని చెప్పాడు.
ప్రశ్న 3.
ఇంటిని హాస్పిటల్గా మార్చటం అంటే మీకేమర్థమైంది ?
జవాబు.
అమ్మ తన పిల్లలకు రోగం వస్తే ఇంటినే ఒక హాస్పిటల్గా మారుస్తుంది. తాను ఒక నర్సులాగా పిల్లలకు సపర్యలు చేస్తుంది. ఆయుర్వేదపు మందులను అందిస్తుంది. విసుగు విరామం లేకుండా సేవలను చేస్తుంది.
ప్రశ్న 4.
ఆస్థానపు తెల్లకుందేళ్ళు అని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు ? ఎందుకు ?
జవాబు.
ఆస్థానపు తెల్లకుందేళ్ళుగా దొరబిడ్డలను పోల్చాడు. వాళ్ళు దూడలమూతులకు గుడ్డలు కట్టి గేదెల దగ్గర పాలు త్రాగేవారు. మూగజీవాలకు పాలను ఉంచేవారు కాదు. వారు అంతటి కఠినాత్ములు. అందుకే కవి దొరబిడ్డలను ఆస్థానపు తెల్లకుందేళ్ళతో పోల్చాడు.
II. ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.35)
ప్రశ్న 1.
అమ్మ పొద్దంతా ఎవరి కోసం కష్టపడుతుంది ? మీకెట్లాంటి సేవలు చేస్తుంది?
జవాబు.
అమ్మ ఎప్పుడూ పొద్దంతా పిల్లలకోసం, తన భర్తకోసం కష్టపడుతుంది. మా అమ్మ నాకు ఎన్నో సేవలు చేస్తుంది. బట్టలు ఉతుకుతుంది. రుచిగా, శుభ్రంగా అన్నం వండిపెడుతుంది. రోగం వస్తే సేవలు చేస్తుంది. కష్టం తెలియకుండా నాకు సేవలు చేస్తుంది.
ప్రశ్న 2.
మీరు కేరింతలు కొడుతూ ఏయే సందర్భాల్లో ఆనందంగా ఉంటారు ?
జవాబు.
వినాయకచవితి, దసరా, బతుకమ్మ ఉత్సవాల్లోను, హోళి పండుగరోజున, నూతన సంవత్సరం రోజు రాత్రిపూట మిత్రులతో కలసి కేరింతలు కొడతాను.
ప్రశ్న 3.
“అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ముసురుతాయి” అనడంలో కవి ఆంతర్యమేమిటి ?
జవాబు.
తేనెటీగలు ఎల్లప్పుడూ పూలమకరందంపై వాలుతాయి. అట్లే అమ్మ జ్ఞాపకాలు విడదీయరానివిగా ఉంటాయి. మరచిపోదామన్నా మరచిపోలేము. అమ్మ జ్ఞాపకాలు మధురానుభూతిని అందిస్తాయి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
‘అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా ! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు.
మా అమ్మ కూడా మా కోసం ఎన్నో సేవలు చేసింది. మాకు జ్వరం వచ్చినపుడు దవాఖానాకు తీసుకువెళ్ళేది. ఆకలి వేసినపుడు గోరుముద్దలు తినిపించేది. బడికి తీసుకొని వెళ్ళేది. మమ్మల్ని ప్రతిరోజూ సాయంత్రం బాగా చదివించేది. రాత్రివేళలలో మంచిమంచి కథలు చెపుతూ మమ్మల్ని నిద్రపుచ్చేది.
ప్రశ్న 2.
మీరు మీ అమ్మను సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు ?
జవాబు.
మేము మా అమ్మను సంతోషపెట్టడానికి ఇంట్లో చిన్నచిన్న పనులలో సహాయం చేస్తాము. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళము. చిన్నచిన్న బహుమతులను అమ్మకు తెచ్చి అమ్మను ఆనందింప చేస్తాము.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. పాఠం చదువండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.
జవాబు.
అంశం | పోలిక |
ముగ్గులేసిన ప్రాంగణం | అద్దకపు చీర |
పండ్లు | పాల బలపాలు |
దొరల బిడ్డలు | తెల్ల కుందేళ్ళు |
వరాహావతారం | ముట్టె మీద ఎత్తిన భూగోళం |
అమ్మఒడి | గుమ్మి |
2. కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తనతల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.
ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచచరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.
అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది ?
జవాబు.
సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.
ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి ?
జవాబు.
ఆదిశంకరుల తల్లి పేరు ఆర్యాంబ.
ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది ?
జవాబు.
శివాజీని జిజియాబాయి వీరుడుగా, శూరుడుగా పెంచింది.
ఈ) గాంధీని మహాత్ముడిగా తీర్చిదిద్దింది ఎవరు ?
జవాబు.
గాంధీని మహాత్ముడిగా తీర్చిదిద్దింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి.
ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు ?
జవాబు.
జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు మాతృమూర్తులు.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.
సామాన్యుని ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి, సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రచించిన సామాజిక కవి. ఆయన కవిత్వాలలో గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ ఎక్కువగా కనిపిస్తాయి. సరళమైన వచనాభివ్యక్తి.
ఆ) ‘కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
అమ్మ పొద్దున్నే లేచి కొట్టంలో పెండ తీసేది. వాకిట్లో ముగ్గులేసేది. జ్వరము వచ్చినపుడు ఇంటినే దవాఖానాగా మార్చి ఒక నర్సుగా మారి మందుబిళ్ళలు వేసేది అంటే ఎవరికి ఏ పనులు కావాలన్నా అమ్మ ఒక కార్యకర్తగా ఆ పనులన్నీ చేసిపెట్టేది అనే ఉద్దేశంలో అని ఉంటారు.
ఇ) మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
మా అమ్మకు ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం చాలా ఇష్టం. మా అమ్మకు మేము అంతా బాగా చదువుకోవాలి అనే కోరిక ఎక్కువ. ఇంటిని చక్కగా డెకరేట్ చేయటం ఇష్టం. నాన్నకు, మాకు ఇష్టమైన వంటలను చేసిపెట్టడం చాలా ఇష్టం. అమ్మకు కాటన్ చీరలంటే కూడా చాలా ఇష్టం.
ఈ) అమ్మ చేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి ?
జవాబు.
అమ్మ చేసే పనుల్లో మనం కూడా చిన్నచిన్న పనులు చేయాలి. ఎందుకంటే అమ్మ అన్ని పనులు తానేచేస్తే అలసిపోతుంది. మనం కూడా సహాయం చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. అమ్మకు విశ్రాంతి దొరుకుతుంది. అమ్మ మనతో కలసి కబుర్లు చెప్పుకునే సమయం దొరుకుతుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అమ్మ గొప్పతనాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
మనము ఒకసారి ప్రపంచచరిత్రను సునిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయము వెల్లడి అవుతుంది. మన భారతజాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులే.
అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులద్దిన చీరలా కనిపించేది. అమ్మ ఇంట్లో ఏ పనిచేసినా తన వారికోసం పరితపిస్తుంది. బిడ్డ బాధపడితే తాను బాధపడుతుంది. బిడ్డ నవ్వితే తాను నవ్వుతుంది. తాను తినకపోయినా ఎదుటివారికి కడుపునిండా పెడుతుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మే మనకు ప్రత్యక్షదైవం. తన రక్తాన్ని ధారపోసి మనకు జన్మనిస్తుంది.
అమ్మ అనే పదములో ఉన్న ఆనందం మరి దేనిలో ఉండదు. అందువలన మనమందరము అమ్మను ప్రేమగా, అభిమానంగా చూడాలి. తల్లి మనసు ఎప్పుడూ కష్టపెట్టకూడదు.
IV. సృజనాత్మకత / ప్రశంస:
అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.
జవాబు.
కవిత
పేగుబంధం అమ్మ
మనల్ని లాలించేది అమ్మ జోకొట్టేది అమ్మ
గోరుముద్దలు పెట్టేది అమ్మ
మనకీ ఆకారం ఇచ్చేది అమ్మ
సంస్కారాన్ని నేర్పేది అమ్మ
కష్టం కలిగితే వెన్నుతట్టేది అమ్మ దెబ్బతగిలితే మనం అరిచేది అమ్మ
లక్ష్యాన్ని ఇచ్చేది అమ్మ
గొప్పవాడైతే ఆనందపడేది అమ్మ
అలాంటి అమ్మను మరువకు సుమా!
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి.
ప్రశ్న 1.
జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
అ) బయట
ఆ) లోపల
ఇ) ముంగిలి
ఈ) ఇంటిలో
జవాబు.
ఇ) ముంగిలి
ప్రశ్న 2.
మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు.
అ) గోడకు వేసే సున్నం
ఆ) బట్టలకు రంగు వేసే విధానం
ఇ) రంగు వేయడం
ఈ) రంగు తీసివేయడం
జవాబు.
ఇ) రంగు వేయడం
ప్రశ్న 3.
బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది.
అ) కట్ట
ఆ) గోడ
ఇ) తీరం
ఈ) దూరం
జవాబు.
ఇ) తీరం
2. ఈ కింద గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) కంచు మోగునట్లు కనకంబు మోగునా ?
జవాబు.
కనకంబు = బంగారం, పుత్తడి, హేమం, సువర్ణం
ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
జవాబు.
కుందేలు – శశకము, చెవులపిల్లి, శరభం
ఇ) ఆవు అంబా అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.
జవాబు.
దూడ – పెయ్య, లేగ, క్రేపు
3. ఈ కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
జవాబు.
కుల్య (ప్ర) – కాలువ (వి)
ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
జవాబు.
ఆకాశం (ప్ర) – ఆకసం (వి)
ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది.
జవాబు.
మొగము (వి) – ముఖము (ప్ర)
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. ఈ కింది పదాలను విడదీయండి.
అ) అతడెక్కడ = _______ + _______
జవాబు.
అతడు + ఎక్కడ
ఆ) బొమ్మనిచ్చెను = _______ + _______
జవాబు.
బొమ్మను + ఇచ్చెను
ఇ) మనిషన్నవాడు = _______ + _______
జవాబు.
మనిషి + అన్నవాడు
2. ఈ కింది పదాలను కలపండి.
అ) మేన + అల్లుడు = _______
జవాబు.
మేనల్లుడు
ఆ) పుట్టిన + ఇల్లు = _______
జవాబు.
పుట్టినిల్లు
ఇ) ఏమి + అంటివి = _______
జవాబు.
ఏమంటివి
ఉత్త్వ సంధి:
ఈ కింది పదాలను గమనించండి.
అ) రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
ఆ) సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
ఈ) అతడు + ఎక్కడ = అతడైక్కడ = ఉ + ఎ = ఎ
మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం.
‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు.
ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.
3. ఈ కింది పదాలను కలిపి రాయండి.
అ) చెట్టు + ఎక్కి = ________________
జవాబు.
చెట్టెక్కి
ఆ) వాడు + ఎక్కడ = ________________
జవాబు.
వాడెక్కడ
ఇ) ఎదురు + ఏగి = ________________
జవాబు.
ఎదురేగి
4. ఈ కింది పదాలను విడదీయండి.
అ) నూకలేసుకొని = _______ + _______
జవాబు.
నూకలు + ఏసుకొని
ఆ) చూరెక్కి = _______ + _______
జవాబు.
చూరు + ఎక్కి
ఇ) ఎట్లున్నది = _______ + _______
జవాబు.
పెట్లు + ఉన్నది
ప్రాజెక్టు పని:
ప్రశ్న 1.
ఒక రోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అమ్మను గమనించండి. ఏమేమి పనులు చేసింది ? ఆయాపనులు చేసేటప్పుడు ఆమె ఎట్లా ఉన్నది ? మీకేమనిపించింది ? ఈ వివరాలతో నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
ఉదయాన్నే లేస్తూనే అమ్మ వాకిట్లో ముగ్గులేసింది. తరువాత ఇంటి పరిసరాలన్నింటిని శుభ్రం చేసింది. స్నానం చేసి పూజాదికాలు అన్నీ పూర్తి చేసింది. నాకు, చెల్లికి స్నానం చేయించింది. మమ్మల్ని బడికి తయారుచేసింది. మాకు పాలు త్రాగించింది. నాన్నకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది.
నాన్న ఆఫీసుకు వెళ్ళగా ఇంట్లో వంటపని అంతా పూర్తి చేసింది. కాసేపు టీ.వీ. చూసి, విశ్రాంతి తీసుకుంది. సాయంత్రం మరలా మేము బడి నుండి రాగానే మాకు టిఫిన్ చేసిపెట్టి మమ్మల్ని తయారుచేసింది. మేము ఆడుకున్న తరువాత నన్ను, చెల్లిని కాసేపు చదివించింది. రాత్రి అందరము కలసి భోంచేశాము.
ఆమె పైన చెప్పిన పనులు అన్నింటిని చేసేటపుడు చాలా ఆనందంగా కనిపించింది. తన వారికి కావలసిన సదుపాయాలు అన్నీ తానే చేస్తున్నాను అనే తృప్తి ఆమెలో కనిపించింది.
TS 7th Class Telugu 4th Lesson Important Questions అమ్మ జ్ఞాపకాలు
I. అవగాహన – ప్రతిస్పందన:
అపరిచిత గద్యాలు:
1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుకొమ్మలు. ఆట, పాట, భాష, యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు వివిధ వృత్తుల వారు ఒకరినొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఊరు మీది చెఱువుతో, ఊరి కింది వాగుతో వారు సహజీవనం చేసేవారు. వివిధ వృత్తులవారు తమ వృత్తికి సంబంధించిన వస్తువులు తయారుచేసేవారు. వస్తుమార్పిడి జరిగేది. పండించిన పంటలో అందరికీ భాగం దక్కేది. ప్రతి పండుగలో పాట ఒక భాగమై పోయేది. పాట లేని పండుగలు, వేడుకలు తెలంగాణలో లేనేలేవు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పల్లెలు దేనికి పట్టుకొమ్మలు ?
జవాబు.
సంస్కృతికి
ప్రశ్న 2.
పల్లె జీవనం దేనిమీద ఆధారపడింది ?
జవాబు.
వ్యవసాయం
ప్రశ్న 3.
తెలంగాణ సంస్కృతిలో పాట స్థానమేంటి ?
జవాబు.
పాట లేని పండుగలు, వేడుకలు లేవు (ప్రథమ స్థానం)
ప్రశ్న 4.
పల్లె ప్రజలు వేటితో సహజీవనం చేసేవారు?
జవాబు.
చెరువు, వాగులతో
ప్రశ్న 5.
పల్లెల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నవి ఏవి ?
జవాబు.
ఆట, పాట, భాష, యాస.
2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూర్వకాలంలో ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి. ఏ శుభకార్యాలైనా, ఏ ఇతర కార్యక్రమాలైనా ప్రజలను వారి వారి గమ్యాలకు పదిలంగా చేర్చేది ఎడ్లబండే. ఈ ఎడ్లబండ్ల తయారీలో వడ్రంగుల, కమ్మరుల శ్రమను వెలకట్టలేం. సుమారు నెలా పదిహేను రోజులు కష్టపడితే కాని బండి తయారు కాదు. నేడు కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. ఈ దశలో ఎడ్లబండ్ల పరిరక్షణకై మెదక్ జిల్లా పస్తాపూర్ గ్రామంలోని “దక్కన్ సొసైటీ” వారు ఎడ్లబండ్లను అలంకరించి, రైతులను చైతన్యపరచడానికి వివిధ గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం అన్ని జిల్లాలలోను జరిగితే, మన పూర్వీకులు మనకిచ్చిన ఈ అపురూప రవాణా సాధనం అంతరించి పోకుండా ఉంటుంది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎడ్లబండి వల్ల ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు.
గమ్యానికి చేర్చుతుంది.
ప్రశ్న 2.
ఎడ్లబండి పరిరక్షణకు పూనుకున్నది ఎవరు ?
జవాబు.
దక్కన్ సోసైటీవారు
ప్రశ్న 3.
ఎడ్లబండి తయారీలో ఎవరి శ్రమ వెలకట్టలేనిది ?
జవాబు.
వడ్రంగులు, కమ్మరులు
ప్రశ్న 4.
ఎడ్లబండిని ఎలా కాపాడుకోవాలి ?
జవాబు.
రైతులను చైతన్యపరచడం, కులవృత్తులను కాపాడటం ద్వారా
ప్రశ్న 5.
పై పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు.
అపురూప రవాణా సాధనం – ఎడ్లబండి
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
కృష్ణమూర్తి యాదవ్ కవిత్వంలో కనిపించేదేమిటి ? ఆయన శైలిలోని ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
కృష్ణమూర్తి యాదవ్ కవిత్వంలో గ్రామీణ జీవితానుభవాలు, మధ్య తరగతి జీవన చిత్రణ ప్రధానంగా కనిపిస్తాయి. సామాన్యుని ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను అక్షరాలుగా పొదిగి, సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రచించిన సామాజిక కవి ఈయన. సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.
ప్రశ్న 2.
“అమ్మ జ్ఞాపకాలు” పాఠ్యాంశ కవిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు.
కవి : టి. కృష్ణమూర్తి యాదవ్
కాలం : 1914 – 1985
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
అమ్మ గొప్పతనాన్ని మీ పాఠం ద్వారా వివరించండి.
(లేదా)
అమ్మ గొప్పతనాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
మనము ఒకసారి ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయము వెల్లడి అవుతుంది. మన భారతజాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులే.
అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులద్దిన చీరలా కనిపించేది. అమ్మ ఇంట్లో ఏ పనిచేసినా తన వారికోసం పరితపిస్తుంది. బిడ్డ బాధపడితే తాను బాధపడుతుంది. బిడ్డ నవ్వితే తాను నవ్వుతుంది. తాను తినకపోయినా ఎదుటివారికి కడుపునిండా పెడుతుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మే మనకు ప్రత్యక్షదైవం. తన రక్తాన్ని ధారపోసి మనకు జన్మనిస్తుంది.
అమ్మ అనే పదములో ఉన్న ఆనందం మరి దేనిలో ఉండదు. అందువలన మనమందరము అమ్మను ప్రేమగా, అభిమానంగా చూడాలి. తల్లి మనసు ఎప్పుడూ కష్టపెట్టకూడదు.
ప్రశ్న 2.
మీ అమ్మ మీకు ఎందుకు గొప్పదో సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఒక రోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అమ్మను గమనించండి. ఏమేమి పనులు చేసింది ? ఆయా పనులు చేసేటప్పుడు ఆమె ఎట్లా ఉన్నది ? మీకేమనిపించింది ? ఈ వివరాలతో నివేదిక రాయండి.
జవాబు.
ఉదయాన్నే లేస్తూనే అమ్మ వాకిట్లో ముగ్గులేసింది. తరువాత ఇంటి పరిసరాలన్నింటిని శుభ్రం చేసింది. స్నానం చేసి పూజాదికాలు అన్నీ పూర్తి చేసింది. నాకు, చెల్లికి స్నానం చేయించింది. మమ్మల్ని బడికి తయారుచేసింది. మాకు పాలు త్రాగించింది. నాన్నకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది.
నాన్న ఆఫీసుకు వెళ్ళగా ఇంట్లో వంటపని అంతా పూర్తి చేసింది. కాసేపు టీ.వీ. చూసి, విశ్రాంతి తీసుకుంది. సాయంత్రం మరలా మేము బడి నుండి రాగానే మాకు టిఫిన్ చేసిపెట్టి మమ్మల్ని తయారుచేసింది. మేము ఆడుకున్న తరువాత నన్ను, చెల్లిని కాసేపు చదివించింది. రాత్రి అందరము కలసి భోంచేశాము.
ఆమె పైన చెప్పిన పనులు అన్నింటిని చేసేటపుడు చాలా ఆనందంగా కనిపించింది. తన వారికి కావలసిన సదుపాయాలు అన్నీ తానే చేస్తున్నాను అనే తృప్తి ఆమెలో కనిపించింది. ఇలా కష్టాన్ని కూడా ఇష్టపడే మా అమ్మ అంటే మాకు ఎంతో ఇష్టం.
ప్రశ్న 3.
“అమ్మ జ్ఞాపకాలు” పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అమ్మంటే ప్రేమ. అమ్మంటే ఆత్మీయత, అనురాగాల కలబోత. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబం కోసం అమ్మపడే తపన, ఆరాటం అనితర సాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి టి. కృష్ణమూర్తి గారు చక్కగా వర్ణించారు.
అమ్మ వాకిటిలో ముగ్గులేస్తే రంగులేసిన చీరలా కనిపించేది. స్వచ్ఛమైన నవ్వులతో బిడ్డలను పలకరించేది. పిల్లలకు అనారోగ్యం కలిగితే ఇంటినే ఆసుపత్రి చేసి, సపర్యలు చేస్తూ నర్సును తలపిస్తుంది. అమ్మ పొద్దున్నే లేచి కొట్టంలో పెండ తీసేది. ఇక్కడ అమ్మను ‘కాలుష్య నిర్మూలన కార్యకర్త’ అనువచ్చు. అమ్మ ఒక అవతారమూర్తిగా మనకు దర్శనమిస్తుంది.
సూరీడు కన్నా ముందే లేచి పనులన్నీ చేసుకుంటూ, సూరీడు అస్తమించిన తర్వాత గాని విశ్రాంతి తీసుకొనే అమ్మ ముమ్మూర్తులా దేవతే. అమ్మ ఒడిలోని పల్లికాయలు, పెసరకాయలు తీసుకొని పిల్లలు సంతోషంగా ఉండడం ఆ తల్లి మనసుకు ఎంతో సంతోషం. అందుకే కవి అమ్మ ఒడిని గుమ్మితో పోల్చాడు.
అమ్మ తానెప్పుడూ పట్టుచీరలు, పట్టు పరుపులు కోరలేదు. నేతచీరలు, నులక మంచం అమ్మ నేస్తాలు. “బిడ్డలకు అమ్మ తేనెతుట్టె చుట్టూ ముసిరే తేనెటీగలు” అని కవి ఎంతో మధురంగా చెప్పాడు. అంటే తేనెటీగలు తేనె కోసం పూల చుట్టూ తిరిగినట్లు అమ్మ జాష్ఠకాల మాధుర్యం మనసు చుట్టూ ముసురుతుంది.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
అమ్మ గొప్పతనాన్ని తెలిపే విధంగా ఐదు ‘నినాదాలు’ రాయండి.
జవాబు.
- సృష్టిలో తీయనైనది ‘అమ్మ’ అనే పిలుపు.
- తల్లి మేలుకోరని చెడ్డ కుమారుడు ఉండవచ్చుగాని, కుమారుని మేలు కోరని చెడ్డ తల్లి ఉండదు.
- అసలైన అమ్మకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది.
- అమ్మ ఒడి ఒక బడి, ఒక గుడి.
- అమ్మంటే జన్మకే తొలి పలుకు.
- ఉత్తములైన తల్లులనివ్వండి, మీకు ఉత్తమ జాతినిస్తాను.
- అలుపెరుగని యంత్రం అమ్మ.
- నిన్ను కన్న అమ్మను వదిలి రాతిబొమ్మలోని అమ్మను కొలవడం వృథా.
- కన్నతల్లి ఘనత కలనైన మరువకు.
- అమ్మంటే ఓర్పు ? ఓదార్పు ? నేర్పు? లేక వీటన్నిటి కూర్పు ?
IV. భాషాంశాలు:
పదజాలం:
నానార్థాలు:
ప్రశ్న 1.
అర్థం = _______
జవాబు.
శబ్దార్థం, కారణం, ధనం
ప్రశ్న 2.
కవి = _______
జవాబు.
కావ్యకర్త, శుక్రుడు, వాల్మీకి
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
జ్ఞాపకం = _______
జవాబు.
జ్ఞాపకం = గుర్తు
తల్లిదండ్రులు దైవంతో సమానమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
ప్రశ్న 2.
గోరుముద్దలు = _______
చిన్నముద్దలు (ఆప్యాయంగా, ప్రేమతో పెట్టే చిన్నముద్దలు)
జవాబు.
మారాం చేసే పిల్లలకు చందమామ కథలు చెబుతూ తల్లి గోరుముద్దలు పెడుతుంది.
వ్యాకరణాంశాలు:
భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
జవాబు.
నామవాచకం
ప్రశ్న 2.
శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది.
జవాబు.
విశేషణ
ప్రత్యయాలు : విభక్తులు
ప్రశ్న 1.
ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
జవాబు.
లో (షష్ఠి)
ప్రశ్న 2.
శివాజీని జిజియాబాయి వీరుడుగా, శూరుడుగా పెంచింది.
జవాబు.
ని (ద్వితీయా)
సమాపక – అసమాపక క్రియ:
ప్రశ్న 1.
కాలువలో కాగితపు పడవలు వేసి, పిల్లలు ఆడుకుంటున్నారు.
జవాబు.
సమాపక క్రియ : ఆడుకుంటున్నారు, అసమాపక క్రియ : వేసి.
ప్రశ్న 2.
గింజలు తిని, పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
జవాబు.
సమాపక క్రియ : ఎగురుతున్నాయి, అసమాపక క్రియ : తిని.
కఠిన పదాలకు అర్థాలు:
ప్రాంగణము = ముంగిలి (వాకిలి)
పడిషం = జలుబు
బర్రె = గేదె
కాలుష్యం = మలినం
కొట్టం = పశువుల పాక
కుందెన = రోలు
దరువు = శబ్దము
వరాహం = పంది
పెండ్యూలం = లోలకం
పాఠం ఉద్దేశం:
అమ్మంటే ప్రేమ. అమ్మంటే ఆప్యాయత. అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను సృష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ, సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువను తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. పద్యగేయాలలో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. వచన శైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తాము. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన “శబ్నం” కవితా సంపుటిలోనిది.
కవి పరిచయం:
కవి : టి. కృష్ణమూర్తి యాదవ్.
కాలం : 1914 1985.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి.
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.
ప్రవేశిక:
అమ్మంటే ఆత్మీయత, అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబంకోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితరసాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునేవిధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం.
పాఠ్యభాగ సారాంశం:
అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులద్దిన చీరలా కనిపించేది. అమ్మ నవ్వినప్పుడు పళ్ళు పాలబలపాల్లా (తెల్లగా) కనిపించేవి. పిల్లలకు జలుబు చేసినపుడు, జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే దవాఖానాగా మార్చి మంచాల చుట్టూ తిరుగుతూ ఒక నర్సుగా మారి మందుబిళ్ళలు వేసేది.
అయ్య పొద్దున్నే దొరల బర్లకాడికి పోయి పాలు పిండేవాడు. దొర కొట్టంలో అమ్మ పెండ తీసేది. లేగదూడలు తాగకుండా వాటి నోళ్ళు కట్టి పితికిన పాలు దొరల బిడ్డలు తాగేవాళ్ళు. అమ్మ పెట్టుకున్న ముక్కుపోగు ఆకాశానీకి హత్తుకున్న నెలవంకలా అర్థచంద్రాకారంగా ఉండేది. భూస్వాముల ఇండ్లముందు కుందెనలో పోసి వడ్లను దంచుతున్నప్పుడు ఆ చప్పుడు మద్దెల మోతగా వినిపించేది. అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టుకొని ఇంటికి వచ్చేది. అమ్మ వచ్చేసరికి పిల్లలు ఇంటిముందు ఆడుకునేవాళ్ళు. అమ్మ పెట్టుకున్న ముక్కుపుల్ల వరాహావతారంలో ముట్టెమీద ఎత్తిన భూగోళంలా కనిపించేది.
అంటే కవి అమ్మను అవతారమూర్తిగా భావించాడని, అమ్మపెట్టుకున్న గెంటీలు గడియారంలో లోలకంలాగ ఊగేవని చెప్పడం కవి నిశిత పరిశీలనకు దర్పణం లాంటిది. అమ్మ అంబలి తాగి, కొడవలి ఫట్టుకొని, కోతలకు పోయి మళ్ళీ వచ్చేటప్పుడు కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని పొద్దంతా చేసిన కష్టాన్ని మరచిపోయి, ఊళ్ళోకి వచ్చేది. అమ్మ వస్తుంటే పిల్లలు ఎగురుతూ, దుంకుతూ అరుపులతో ఎదురేగేవాళ్ళు. అమ్మ ఒడిలోని పల్లికాయలు, పెసరకాయలు తీసుకొని పిల్లలు సంతోషంగా తినేవాళ్ళు. కవి అమ్మ ఒడి గుమ్మితో పోల్చాడు. అంటే గుమ్మిలో ఎప్పుడూ ధాన్యం నిల్వ ఉంటుంది.
అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడూ పట్టుచీరలు కట్టలేదు, పరుపుల్లో నిద్రపోలేదు. నేత చీరలు కట్టేది. నులకమంచం మీద నిద్రపోయేది. సెలవులకు ఊళ్లోకి వచ్చినపుడు తేనెతుట్టె చుట్టూ ముసిరే తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు ముసురుతున్నాయి. ఇట్లా అనడంలో కవి ఉద్దేశం తేనెటీగలు మధురసం కోసం పూలచుట్టూ తిరిగినట్లు అమ్మ జ్ఞాపకాల మాధుర్యం మనసు చుట్టూ ముసురుతుంది. ఈ కవిత “అమ్మను ఎప్పటికీ మరచిపోలేం” అని తెలియచేస్తున్నది.
నేనివి చేయగలనా?