TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 1st Lesson చదువు Textbook Questions and Answers.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

చదువండి – ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.2)

తేగీ॥ ఆటలాడు వేళలయందు నాడవలయు
జదువుకొనఁదగు వేళలఁ జదువ వలయు
నట్లుకాకున్న నారోగ్య మంతరించు
దాన, మేధస్సు బలహీన మౌను సుమ్ము.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆటలు ఎందుకు ఆడుకోవాలి ? ఎప్పుడు ఆడుకోవాలి ?
జవాబు.
శారీరక సంబంధమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకొనేందుకు, బుద్ధివికాసం కలుగడానికి ఆటలు ఆడాలి. ఈ ఆటలను సాయంత్రం వేళలోను, చదువుకున్న తరువాత తీరిక సమయాల్లోను ఆడుకోవాలి.

ప్రశ్న 2.
ఏ సమయంలో చదువుకోవాలి ? ఎందుకు ?
జవాబు.
సూర్యోదయానికి ముందు, పాఠశాలల్లోను, రాత్రి పది గంటలలోపు చదువుకోవాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, వ్యవహార జ్ఞానం పొందడానికి, సమాజంలో గౌరవాన్ని, ఉద్యోగాన్ని పొందడానికి చదవాలి.

ప్రశ్న 3.
ఆటలు ఆడకుండా టీ.వీ. చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది ?
జవాబు.
ఆటలు ఆడకుండా టీ.వీ. చూస్తూ కూర్చుంటే అనారోగ్యం వస్తుంది. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. పొట్ట పెరుగుతుంది. బుద్ధివికాసం కలుగదు. రక్తప్రసరణ సరిగ్గా ప్రసరించదు.

ప్రశ్న 4.
చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది ?
జవాబు.
చదువు సరిగ్గా చదువుకోకుంటే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. విజ్ఞానం సిద్ధించదు. ఆలోచనా శక్తి పెరగదు. ఉద్యోగం రాదు. ఆర్థిక పరిపుష్టిని సాధించలేడు. సమాజంలో గౌరవం దొరకదు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 4)

ప్రశ్న 1.
అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
అజ్ఞానము. అహంకారము, ధనమదము, కోపము, అసూయ, ద్వేషము, పరుషముగా మాట్లాడడం వంటివి అజ్ఞాని (అవివేకి) లక్షణాలుగా ఉంటాయి.

ప్రశ్న 2.
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా ! ఇట్లా అనడం తగినదేనా ? ఎందుకు ?
జవాబు.
కవి అలా అనడం సబబే. ఎందుకనగా చదువు లేకుంటే బుద్ధి మండగిస్తుంది. చురుకుదనము తగ్గి మనిషి జడపదార్థం అవుతాడు. అనగా మానసికంగా, శారీరకంగా కదలలేని స్థితిని పొందుతాడు. వివేకం నశిస్తుంది. అందువల్లనే చదువుకోని కమలాకరుడిని జడాశయుడు అని చెప్పాడు.

ప్రశ్న 3.
“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు. కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
‘వేరుపురుగు చేరి వృక్షంబు చేఱచు’ అని వేమన చెప్పాడు. చదువురాని పిల్లల వల్ల వంశనాశనం జరుగుతుంది. చదువురాని పుత్రులు మూర్ఖులుగా మారుతారు. దురలవాట్లకు లోనౌతారు. విశృంఖలంగా ఎదుగుతారు. పెద్ద చిన్న తారతమ్యాలు తెలియవు. వారి అవివేకపు, దుర్మార్గపు చేష్టలు సమాజానికే కాదు తమ వంశానికి కూడా మచ్చ తెస్తాయి. సమాజంలో నవ్వులపాలు అవుతారు. అందువల్లనే కవి చదువురాని పిల్లలను వంశానికి చీడపురుగుల వంటివారని చెప్పాడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.5)

ప్రశ్న 1.
తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు ?
జవాబు.
చదువు ఎంత నేర్పితే అంతగా వృద్ధి పొందుతుంది. ఇది అక్షరసత్యం. బోధన ద్వారా విద్య వికాసాన్ని పొందుతుంది. వచ్చిన చదువును దాచుకుంటే క్రమంగా తగ్గుతుంది. ఉపాధ్యాయుడిగా సమాజంలో బాగా రాణిస్తున్నారంటే దానికి కారణం వారు తాము నేర్చిన చదువును విద్యార్థులకు బోధించడం వల్ల విద్యలో నిష్ణాతులు అవుతున్నారు.

ప్రశ్న 2.
“చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.
జవాబు.
విద్య అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. జ్ఞానము అనగా బుద్ధి. ఇది అంతఃకరణము. కాబట్టి ఇతరులకు కనిపించదు. బాహ్యవస్తువులను తస్కరించిన విధముగా విద్యను దొంగిలించుటకు వీలుకాదు. జ్ఞానాన్ని దొంగిలించలేరు. అందుకే కవి “చదువు దొంగలకు కనిపించదు” అని అన్నాడు.

ప్రశ్న 3.
అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి ?
జవాబు.
అందరూ మెచ్చుకోవాలంటే మనం పరులకు మేలు కలిగించేటటువంటి చదువులు చదవాలి. లోకాభివృద్ధిని కోరేటటువంటి సంస్కారవంతమైనటువంటి, జ్ఞానాన్ని పెంపొందించే వివేకవంతమైనటువంటి చదువులు చదవాలి.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ఆలోచించండి చెప్పండి: (TextBook Page No.5)

ప్రశ్న 1.
పశువులకు, మనుషులకు తేడాలేమిటి?
జవాబు.
పశువులకు జ్ఞానం ఉండదు. మనిషికి జ్ఞానంతోపాటు విచక్షణ ఉంటుంది. అంతేగాక పశువులు మాట్లాడలేవు. కానీ మనిషికి భాషించే గుణం ఉంది. కాబట్టి మనిషి శాస్త్రజ్ఞుడు కాగలడు.

ప్రశ్న 2.
కమలాకరుని తీరుగా మీరెప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు ?
జవాబు.
లేదు. ఎందుకంటే మేము మా తల్లిదండ్రుల మాట
విని చక్కగా చదువుకుంటున్నాము. గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వారి ఉపదేశాలను ఆచరిస్తున్నాము.

ప్రశ్న 3.
కమలాకరుడు గురువుకు సేవచేస్తూ విద్యను నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏయే సేవలు చేస్తారు ?
జవాబు.
గురు దర్శనం కాగానే వారి పాదాలకు నమస్కారం చేస్తాము. అర్ఘ్యపాద్యాలతో వారిని పూజిస్తాము. వారి ఆజ్ఞలను శిరసావహిస్తాము. వారు చేసిన ఉపదేశాలను మనసునందు నిలుపుకొని వాటిని తప్పక పాటిస్తాము.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా ! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడం లేదు. దీనివల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు? వాళ్ళు కూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి?
జవాబు.
మన సమాజంలో ఎందరో అనాథలుగా జీవిస్తున్నారు. కొందరు పిల్లలు నిరక్షరాస్యులై తిరుగుతున్నారు. జీవనాన్ని గడపడానికి పరిశ్రమల్లోను, పెద్దల ఇళ్ళలోను కూలీపని చేస్తున్నారు. అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. పాలు త్రాగాల్సిన బాల్యంలో పాలకవర్లను అమ్ముకొని జీవిస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆర్థిక భారంతోను, కుటుంబాన్ని పోషించడానికి చదువులు మానేసి పనులు చేస్తున్నారు.

చదువుకోకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి అవకాశాలను వదులుకుంటున్నారు. అందువల్ల మనమంతా అలాంటి పిల్లలను తిరిగి బడిలో చేర్పించడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులతోను, పెద్దలతోను ఒప్పించాలి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేర్పించాలి. ధనవంతులు ఉదారంగా అటువంటి పిల్లలకు సహాయ సహకారాలను అందించాలి. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. వారి జీవితాల్లో వెలుగులను నింపాలి.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.

అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
జవాబు.
చదువుల్ గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మీ.

ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
జవాబు.
ఎవ్వరి కిచ్చినఁ గోటిగుణో
త్తర వృద్ధి భజించు విద్య

ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా ?
జవాబు.
ధరలో మఱి విద్యఁ బోల ధనములు గలవే.

ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
యే విద్యలు నేరఁడేనిఁ పశువే యగుఁ గాదె గణించి చూచినన్.

2. ఈ కింది పద్యాన్ని చదువండి. భావం రాయండి.

కం॥ చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,.
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ ! – (పోతన భాగవతం)
జవాబు.
భావం :
నాయనా ! కుమారా ! చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. చదువుకుంటే మంచి చెడుల తేడా తెలుస్తుంది. మాటల్లో నేర్పు కలుగుతుంది. అందువల్ల అందరు తప్పక చదువుకోవాలి. నీవు శ్రేష్ఠులైన గురువుల వద్ద చదువుము.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు ?
జవాబు.
చదువు నేర్వని వారిని సువాసనలు వెదజల్లలేని మోదుగు పూవుతో కవి పోల్చాడు. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగుపూవు సువాసనలను ‘వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన వంశంలో జన్మించినా, ఎంతటి అందం ఉన్నా చదువుకొనకపోతే అతడు కుటుంబంలో వెలుగును నింపలేడు. కుటుంబానికి తెగులు వంటివాడు.

ఆ) త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి ?
జవాబు.
త్రివిక్రమునికి చదువుపట్ల గల భావాలు ఎంతో సమున్నతమైనవి. చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులను పిల్లలు చదవాలి. విద్య పూర్తిగా స్వాధీనమై ఉండాలి. విద్యను అన్నదమ్ములుగాని, రాజులుగాని పంచుకోలేరు. విదేశాలకు వెళ్ళినప్పుడు దొంగలు దోచుకోలేరు. విద్య మనిషికి భారం కాదు. ఎవ్వరికి ఎంత ఎక్కువగా ఇచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందువల్ల విద్యకు సాటియైన ధనం ఈ లోకంలో లేదని త్రివిక్రముడు భావించాడు.

ఇ) కమలాకరుని స్వభావం ఎటువంటిది ?
జవాబు.
‘కమలాకరం’ అంటే జలాశయం. జలాశయం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. కదలదు మెదలదు. అట్లే కమలాకరుడు ఎప్పుడూ స్తబ్దంగా ఉంటాడు. చదువు లేని కారణంతో మంచి చెడుల ఆలోచన లేదు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో అర్థంకాదు. ఎవరేమని నిందించినా అచేతనంగా ఉంటాడు. అందువల్లనే కమలాకరుడిని కవి జలాశయంతో పోల్చాడు.

ఈ) చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
జవాబు.
మానవులకు చదువు ఉత్తమమైన సాధనం. మంచిచెడులను గూర్చి ఆలోచించే శక్తి చదువు వల్ల సిద్ధిస్తుంది. చదువు రాకపోతే బుద్ధి మాంద్యం కలుగుతుంది. విశాలమైన ఆలోచనా దృక్పథం నశిస్తుంది. సమాజంలో గౌరవం ఉండదు. తల్లిదండ్రులకు, వంశానికి కీడు కలుగుతుంది. జీవన భృతి దొరకదు. ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నీచమైన స్థితి కలుగుతుంది. చదువు రానివారి వల్ల దేశప్రగతి, ఆర్థిక ప్రగతి క్రమంగా కుంటుపడుతుంది. అందువల్ల అందరు చదువుకోవాలి.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

2. క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ప్రశ్న 1.
చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని మంత్రి భట్టి. విక్రమార్కుని ఆస్థానంలో ‘త్రివిక్రముడు’ అనే పేరుగల పురోహితుడు ఉన్నాడు. అతని కుమారుని పేరు కమలాకరుడు. ఇతడు అజ్ఞాని. జలాశయం వలె స్తబ్ధంగా ఉంటాడు. ఇది త్రివిక్రమునికి బాధ కలిగించింది. ఒకరోజు త్రివిక్రముడు కమలాకరుడిని ఈ విధంగా మందలించాడు.

నాయనా ! బంధువులకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువును పిల్లలు చదవాలి. చదువులేని పుత్రుడు వంశానికి చీడపురుగువంటివాడు. చదువురానివాడు మోదుగుపూవులాంటి వాడు. ఎంతటి గొప్ప వంశంలో జన్మించినా, చదువు లేకపోతే రాణించడు.

విద్యాధనం చాలా గొప్పది. దాన్ని అన్నదమ్ములు, రాజులు పంచుకోలేరు. ఎంతమందికి ఇచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యను దొంగిలించలేరు. పద్య, గద్య వాక్యాలు చదవాలి. సంగీత, నాట్య శాస్త్రాలు చదవాలి. మంచి మాటలు మాట్లాడాలి. లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవేవి చేయనివాడు, ఏ చదువు నేర్వనివాడు పశువుతో సమానం అని త్రివిక్రముడు మందలించాడు.

కమలాకరుడు తండ్రి మాటలను విని బాధపడ్డాడు. తాను బాగా చదువుకొని తిరిగి తండ్రి ముఖం చూస్తానని ప్రతిజ్ఞ చేసి, కాశ్మీరు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణుని సమీపించాడు. అతడిని సేవించాడు. కొంతకాలంలోనే వేదాలను, వేదాంగాలను, ధర్మములను, శాస్త్రాలను చదువుకున్నాడు. జ్ఞానాన్ని పొంది, గురువు అనుమతి తీసుకొని తిరిగి తన దేశానికి ప్రయాణం అయ్యాడు.

IV. సృజనాత్మకత / ప్రశంస:

ప్రశ్న 1.
బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు.

లేఖ

ఆదిలాబాద్,
X X X X X.

పూజ్యులైన డేవిడ్ రాజుగారి పాదారవిందములకు,

నమస్కారములు. నేను బాగా చదువుతున్నాను. నేను నా చిన్నతనంలో బడికి వెళ్ళకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని. చదువకుండా తరగతికి రాకుండా తిరిగేవాడిని. ఆ సమయంలో మీరు నా స్థితిని గమనించారు. నన్ను తిరిగి బడిలో చేర్పించాలనుకున్నారు. ‘స్వయంగా మీరు మా ఇంటికి వచ్చారు. మా తల్లిదండ్రులతో మాట్లాడారు. వారికి నచ్చ చెప్పారు. నాకు పుస్తకాలు, పెన్నులు స్వయంగా కొని ఇచ్చారు. బడిలో చేర్పించారు. నన్ను శ్రద్ధగా పట్టించుకున్నారు. మీరు ఆ విధంగా పట్టించుకున్నందువల్లే నేను ఈరోజు 7వ తరగతి చదువగలుగుతున్నాను. మంచిగా మార్కులు పొందగలుగుతున్నాను. లేకపోతే ఎక్కడో ఏదో పనీపాటా చేసుకుంటూ బ్రతికేవాడిని. నా జీవితాన్ని మలుపుతిప్పిన గురువులైన మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను.

మిమ్ములను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను.

ఇట్లు
మీ శిష్యుడు,
కె. రవీంద్ర.

చిరునామా :
పి. డేవిడ్ రాజుగారు,
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,
ఉట్నూరు,
ఆదిలాబాద్ జిల్లా.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

(లేదా)

ప్రశ్న 2.
చదువు ఆవశ్యకత తెలిపేటట్లు కొన్ని నినాదాలు రాయండి.
జవాబు.
నినాదాలు:

  1. చదువురాని మొద్దు – కదలలేని ఎద్దు.
  2. ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు.
  3. నేటి విద్యార్థులే భావిభారత నిర్మాతలు.
  4. శ్రద్ధగలవాడే జ్ఞానాన్ని పొందుతాడు.
  5. వినయం లేని విద్య రాణించదు.
  6. విద్యలేని వాడు వింత పశువు.
  7. బడిబాట పట్టు – పని వదలిపెట్టు.
  8. బడి ముద్దు – పనికి వద్దు.

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.

అ) పశువులు శృంగాలతో పొడుస్తాయి.
జవాబు.
శృంగాలతో = కొమ్ములతో

ఆ) శ్రీకృష్ణుని వక్త్రము చిరునవ్వుతో శోభిస్తుంది.
జవాబు.
వక్త్రము = ముఖము

ఇ) తృణము తిని ఆవు పాలిస్తుంది.
జవాబు.
తృణము = గడ్డి

ఈ) ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు.
జవాబు.
పుత్రుడు = కుమారుడు

2. కింది పదాలను వివరిస్తూ రాయండి.

అ) మృదుభాషలు :
జవాబు.
మంచి మాటలను మృదుభాషలు అంటారు. మృదు భాషణ వలన ఎవ్వరైనా హితులవుతారు.

ఆ) సారస్వతము :
జవాబు.
సరస్వతీ సంబంధమైనది. రసమయమైన శబ్దార్థముల విన్యాసమే సారస్వతం. సారస్వతం విశిష్టమై ‘సత్యం, శివం, సుందరం’ అయిన తన వెల్గులతో అమృత జీవన సౌందర్యాన్ని అందిస్తున్నది. కవి సృష్టియే సారస్వతం. దీనికే సాహిత్యం, కావ్యమని నామాంతారాలు కలవు.

ఇ) సౌజన్యభావం :
జవాబు.
మంచితనంతో ప్రకాశించే భావం. సౌజన్య స్వభావులు లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను పొందుతారు.

ఈ) సత్సాంగత్యం :
జవాబు.
మంచివారితో స్నేహాన్ని సత్సాంగత్యం అంటారు. దీనివలన మంచి బుద్ధులు, మృదుభాషలు, సత్యవాక్కు, కీర్తిప్రతిష్టలు పెంపొందుతాయి.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

3. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) ధర = _______________
జవాబు.
భూమి, ధరణి, ఇల

ఆ) ఆత్మజుడు = _______________
జవాబు.
కుమారుడు, పుత్రుడు, తనయుడు

ఇ) వనం = _______________
జవాబు.
అరణ్యం, విపినం, అడవి

ఈ) శోకం = _______________
జవాబు.
దుఃఖం, ఏడుపు, బాధ

VI. భాషను గురించి తెలుసుకుందాం:

భాషాభాగాల గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా ! కింది పేరాను చదువండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికను పూరించండి.

మా ఊరి చెరువు గట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి రెండుకండ్లు చాలవు. అబ్బో! ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. ఆహా ! ఆ కథనాలు చదువుతూంటే మనస్సు ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా !

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు 1

జవాబు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు 2

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
చదువు ప్రాముఖ్యత తెలిపే పద్యాలు / పాటలు సేకరించి, నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి.

1. శ్రద్ధలేని యెడల చదువు సాములు రావు
శ్రద్ధయున్న రాని చదువు లేదు
శ్రద్ధ కలిగెనేని చంద్రమండల యాత్ర
సులభ సాధ్యమెయగు తెలుగుబిడ్డ

2. పుస్తకముల నీవు పూవువోలెను చూడు
చింపఁబోకు మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల ఎరువు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ !.

3. దొంగపాలు కాదు, దొడ్డ కీర్తిని దెచ్చు
పరమ సౌఖ్యమిచ్చు భద్రమిచ్చు
యాచకునకు నీయ నావంత తరుగదు
విద్యబోలు ధనము పృథివి గలదె !

4. కడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు
కాలమూరకెపుడు గడుపబోకు
దీపమున్నయపుడె దిద్దుకోవలె నిల్లు
విలువదెలిసి చదువు తెలుగుబిడ్డ

5. చదువురాని వాని జనులు మెచ్చరు సుమ్మి
చదువనేర్చువాని జగముమెచ్చు
దేశకాలగతులు తెలియగా వచ్చును
తెలియు మంచిచెడ్డ తెలుగుబిడ్డ

గేయం
చదువు బుద్ధినిచ్చు సంపదనిచ్చును
గౌరవంబు యొసగు ఘనతనిచ్చు ||చదువ||
అందుకే మనము చదువవలయు
తెలివి గలిగి మసలవలెను ||చదువ||

చదువుకొన్న కొలది చదువు చక్కగ వచ్చు
వ్రాయుచున్న కొలది వ్రాత బాగుగ వచ్చు
పాడుచున్న కొలది పాట చక్కగ వచ్చు
తెలివిగలిగి మసలు నీవు తెలుగుబాల ||చదువు||

విశేషాంశాలు:

  1. సారస్వతం : సరస్వతీ సంబంధమైనది సారస్వతం. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతమని వ్యవహరిస్తున్నాం.
  2. ధ్రువా ప్రబంధం : ప్రబంధ విశేషం. గీత ప్రబంధ కావ్యం. (సంగీత నాట్య సాహితీ విశేషం)
  3. కళలు : మానవ జీవన పరిణామంలో నైపుణ్యంతో, సౌందర్యదృష్టితో సాధించిన ప్రజ్ఞావిశేషమే కళ. ఇది మానసిక ఆనందాన్నిస్తుంది. కళలు అరవై నాలుగు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

TS 7th Class Telugu 1st Lesson Important Questions చదువు

I. అవగాహన – ప్రతిస్పందన:

అపరిచిత పద్యాలు:

1. క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను, పూరించండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

ఖాళీలు:

ప్రశ్న 1.
పాముకు విషం _______________ లో ఉంటుంది.
జవాబు.
తల

ప్రశ్న 2.
వృశ్చికమనగా _______________
జవాబు.
తేలు.

ప్రశ్న 3.
శరీరమంత విషం _______________ ఉంటుంది.
జవాబు.
ఖలునకు

ప్రశ్న 4.
పై పద్య మకుటం _______________
జవాబు.
సుమతీ

ప్రశ్న 5.
పై పద్యాన్ని రచించిన కవి _______________
జవాబు.
బద్దెన

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది?
జవాబు.
కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.

ప్రశ్న 2.
ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు.
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రువులౌతారు.

ప్రశ్న 3.
తామరలకు మిత్రుడెవరు?
జవాబు.
తామరలకు మిత్రుడు సూర్యుడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.

ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది సుమతీ శతకంలోని పద్యం.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినురవేమ!

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పూజకంటే ముఖ్యమైనది ఏది ?
జవాబు.
పూజకంటె ముఖ్యమైనది బుద్ధి.

ప్రశ్న 2.
మాటకంటె దృఢమైనది ఏది?
జవాబు.
మాటకంటె దృఢమైనది మనస్సు.

ప్రశ్న 3.
కులముకంటే ప్రధానమైనది ఏది?
జవాబు.
కులముకంటె ప్రధానమైనది గుణం.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘దేనికంటె ఏది ప్రధానం?

ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగా
బాల చవిఁ జెరచుఁ గావున
బాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ!

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పాలతో కలిసిన నీరు ఎలా ఉంటుంది?
జవాబు.
పాలతో కలిసిన నీరు పాలలాగానే ఉంటుంది.

ప్రశ్న 2.
పాల రుచిని చెడగొట్టేది ఏది?
జవాబు.
పాల రుచిని చెడగొట్టేది అందులో కలిసిన నీరు.

ప్రశ్న 3.
ఎవరితో స్నేహం చేయగూడదు?
జవాబు.
చెడ్డవారితో స్నేహం చేయగూడదు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జన స్నేహం’.

ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది సుమతీ శతకంలోని పద్యం.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.

మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పిరికివాడు దేనితో పోల్చబడినాడు ?
జవాబు.
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

ప్రశ్న 2.
మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది ?
జవాబు.
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

ప్రశ్న 3.
మేడిపండు లోపల ఎలా ఉంటుంది ?
జవాబు.
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి ?
జవాబు.
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.
“విద్యను మించిన ధనం లేదు” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు. భర్తృహరి ‘సుభాషిత త్రిశతి’ లోని విద్యా ప్రశంసలో “ఓ సరస్వతీ ! నీ వద్ద ఉన్న విద్య అనే ధనం అపూర్వమైనది. సహజంగా ధనం దాచుకుంటే వృద్ధి అవుతుంది. కానీ నీ విద్యాధనం పంచే కొద్దీ వృద్ధి అవుతుంది” అని చెప్పారు. ధనం పంచే కొలదీ తగ్గిపోతుంది. కానీ విద్య పంచే కొలదీ పెరుగుతుంది. కనుక విద్యను మించిన ధనం లేదు అని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
చదువు యొక్క ఉపయోగాలు రాయండి.
జవాబు.
‘విద్యా దదాతి వినయం’ అన్నారు పెద్దలు. విద్య నేర్వడం వల్ల వినయం కలుగుతుంది. కనుక మానవులకు చదువు ఉత్తమమైన సాధనం. మంచి చెడులను గూర్చి ఆలోచించే శక్తి చదువు వల్ల సిద్ధిస్తుంది. విద్య వలన బుద్ధి వికాసం కలుగుతుంది. విశాలమైన ఆలోచనా దృష్టి కల్గుతుంది. సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. జీవన భృతి దొరుకుతుంది. ఇతరులపై ఆధారపడకుండా జీవించవచ్చు. తల్లిదండ్రులకు, వంశానికి కీర్తి కలుగుతుంది. చదువుకోవడం వల్ల దేశ ప్రగతి, ఆర్థికప్రగతి క్రమంగా వృద్ధి అవుతుంది. ‘చదివిన సదసద్వివేక చతురత గల్గున్’ – చదువు వల్ల ఏది మంచిదో, ఏదికాదో తెలుస్తుందని పోతన మహాశయుడు ఆనాడు చెప్పారు.

చదువు మనిషిలోని వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుడిని చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి.

ప్రశ్న 3.
విద్య ఎప్పుడు ‘మన సొంత ధనం’ ఎలాగో వివరించండి.
జవాబు.
“ఖ్యాతినిచ్చు విద్య కల్పవృక్షంబురా” – అని కరుణశ్రీ అన్నారు. విద్య నేర్చినవారు బుద్ధి వికాసం పొంది సమాజంలో
గుర్తింపు పొందుతారు. విద్య ద్వారా వినయం తద్వారా పాత్రత, దీని ద్వారా ధనం, దాని ద్వారా సుఖాన్ని పొందవచ్చు. కనుక విద్య ద్వారా అన్నింటిని పొందవచ్చు. దీనిని బట్టి విద్య అనేది మన నుండి వేరు చేయలేని “సొంత ధనం” అని తెలుస్తున్నది.

ప్రశ్న 4.
కవి చదువు నేర్వని వానినేమన్నాడు ? ఎందుకు? (లేదా) చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు ?
జవాబు.
చదువు నేర్వని వారిని సువాసనలు వెదజల్లలేని మోదుగు పూవుతో కవి పోల్చాడు. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగుపూవు సువాసనలను వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన వంశంలో జన్మించినా, ఎంతటి అందం ఉన్నా చదువుకొనకపోతే అతడు కుటుంబంలో వెలుగును నింపలేడు. కుటుంబానికి తెగులు వంటివాడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1.
చదువుకుంటే కలిగే ప్రయోజనాలను గురించి రాయండి.
(లేదా)
చదువుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో మీ పాఠ్యభాగం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు.
చదువు వల్ల మనిషి ‘మనీషి’ అవుతాడు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. చదువు మనిషిలోని సంస్కారానికి దారి చూపేది. అందుకే పెద్దలు “విద్యా దదాతి వినయం” అన్నారు. వినయ విధేయతలు ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. ‘చదువు గొప్పదనాన్ని తెలియజేస్తూ పోతన తన భాగవతంలో ‘చదువని వాడజ్ఞుండగు” అని హిరణ్యకశిపునిచే పలికించాడు. ఏ సంపద అయిన, బంధుత్వాలైనా మన నుండి దూరం అవుతాయి. కాని విద్యా సంపద దొంగలు దోచలేరు. ప్రళయకాలంలో సైతం మన నుండి దూరం కాదు. అందుకే –

దొంగపాలు కాదు, దొడ్డకీర్తిని దెచ్చు
పరమ సౌఖ్యమిచ్చు, భద్రమిచ్చు
యాచకునకు నీయ నావంత తరుగదు
విద్యబోలు ధనము పృథివి గలదె!

అంటూ ఎందరో మహనీయులు విద్య ఔన్నత్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకు వేసి “విద్య లేని వాడు వింత పశువు” అని తెగిడారు.
చదువు వల్ల మంచిచెడుల తారతమ్యం తెలుస్తుంది. విశాలమైన దృక్పథం ఏర్పడుతుంది. జీవన భృతి దొరుకుతుంది. తల్లిదండ్రులకు, వంశానికి కీర్తి కలుగుతుంది. పరోపకార బుద్ధి కలుగుతుంది.

III. సృజనాత్మకత:

ప్రశ్న 1.
చదువు ఆవశ్యకత తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

జూబ్లిహిల్స్,
X X X X X

ప్రియమైన మిత్రుడు విష్ణుకు,

శుభాకాంక్షలు. నేను ఇక్కడ బాగా చదువుతున్నాను. అక్కడ నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయునది – మన సమాజంలో ప్రస్తుతం చదువుకోవడం అనే మాట కన్నా చదువుకొనడం అన్నమాట బాగా వినిపిస్తుంది. డబ్బున్న వాళ్ళకే చదువులు, కూలీనాలీ చేసుకొనే వాళ్ళమైన మనకెందుకని పేదవాళ్ళు భావిస్తున్నారు.

వాళ్ళ పిల్లలు బాలకార్మికులుగా, కూలీ పని వారిగా జీవితాలు గడుపుతున్నారు. చదువు మనిషిలోని వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవితం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. అందుకే పోతన తన భాగవతంలో “చదువనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గల్గున్” అంటాడు. కనుక అందరూ విద్యను పొందాలని కోరుకుంటున్నాను. మీ పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు,
కె. సాయి శ్రీ ప్రసాద్.

చిరునామా :
యస్. విష్ణు,
S/o నాగలక్ష్మణ శర్మ,
X X X X X,
X X X X.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ప్రశ్న 2.
మీ బడిని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు.
భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుంది. విద్యాలయాలు వెలుగుకు, స్వేచ్ఛకు, విజ్ఞానానికి నిలయాలు. అటువంటి బడులు పిల్లలకు వరాలిచ్చే గుడులు. ఇక మా బడి గురించి చెప్పాలంటే ………………..

ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన ఆవరణ చుట్టూ అందమైన పూల మొక్కలు, చెట్లు; చూడముచ్చటైన విద్యార్థులతో మా బడి చూపరులకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. ఉ॥ 9 గం॥ 45 ని॥లకు ప్రార్థనా గీతంతో ప్రారంభమై సాయంత్రం 5 గం॥ జనగణమనతో ముగుస్తుంది. పాఠ్యాంశాలు బోధించేటప్పుడు మా గురువులు అపర సరస్వతులు, బృహస్పతులే. వక్తృత్వ పోటీలు, వ్యాస రచనలు మాలోని జిజ్ఞాసను మెరుగుపరుస్తాయి.

వ్యాయామ తరగతులు మా దేహదారుఢ్యాన్ని పెంచుతున్నాయి. స్వచ్ఛభారత్ వంటి సామాజిక కార్యక్రమాలు మా గ్రామంలో విద్యార్థులంతా నిర్వహించి మా ప్రత్యేకతను చాటాము. గ్రామస్థులను చైతన్యపరిచాము. పాఠ్యాంశాలను కేవలం మార్కుల కోసమే కాకుండా మాలో మంచి మార్పును తెచ్చేవిధంగా చెప్పే మా ఉపాధ్యాయులు సాక్షాత్ గురుబ్రహ్మలే. అమ్మ ఒడిని తలపించే మా బడి స్వర్గమే.

IV. భాషాంశాలు:

పదజాలం:

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
భాగ్యం = __________
జవాబు.
అదృష్టం, సంపద, ఐశ్వర్యం

ప్రశ్న 2.
ఆత్మ = __________
జవాబు.
మనస్సు, బుద్ధి, మది

ప్రశ్న 3.
కరుణ = __________
జవాబు.
దయ, జాలి, సహృదయం

ప్రశ్న 4.
ఆసక్తి = __________
జవాబు.
కోరిక, వాంఛ, ఈప్సితము

ప్రశ్న 5.
ఆత్మజుడు = __________
జవాబు.
కుమారుడు, తనయుడు, పుత్రుడు

ప్రశ్న 6.
వక్త్రము = __________
జవాబు.
ముఖం, వదనం, మోము

ప్రశ్న 7.
తస్కరుడు = __________
జవాబు.
దొంగ, చోరుడు

ప్రశ్న 8.
ద్విజుడు = __________
జవాబు.
బ్రాహ్మణుడు, బాపడు, భూసురుడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

నానార్థాలు:

ప్రశ్న 1.
కులం = __________
జవాబు.
వంశం, శరీరం, ఊరు

ప్రశ్న 2.
నేర్పు = __________
జవాబు.
నైపుణ్యం, పనితనం, సామర్థ్యం

ప్రశ్న 3.
వాలం = __________
జవాబు.
తోక, తలవెంట్రుక, కత్తి

ప్రశ్న 4.
ప్రియం = __________
జవాబు.
ఇష్టం, ఖరీదు

ప్రశ్న 5.
ధనం = __________
జవాబు.
విత్తం, ఆస్తి, ఆవులమంద

ప్రశ్న 6.
ఉత్తరం = __________
జవాబు.
లేఖ, సమాధానం, ఒక దిక్కు

ప్రశ్న 7.
గుణం = __________
జవాబు.
స్వభావము, అల్లెత్రాడు

వ్యుత్పత్యరాలు:

ప్రశ్న 1.
కమలాకరం = __________
జవాబు.
కమలములకు ఆకరం (సరస్సు)

ప్రశ్న 2.
పుత్రుడు = __________
జవాబు.
పున్నామ నరకమునుండి రక్షించువాడు (పుత్రుడు)

ప్రశ్న 3.
గురువు = __________
జవాబు.
అజ్ఞానము అనెడి అంధకారమును తొలగించువాడు (ఉపాధ్యాయుడు)

ప్రశ్న 4.
సౌజన్య = __________
జవాబు.
మంచితనముతో కూడిన స్వభావము.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
1. విద్య – విద్దె
2. పశువు – పసువు
3. భాగ్యము – బాగెము
4. రూపం – రూపు
5. ఆశ – ఆస
6. రాజు – ఱేడు
7. శాస్త్రం – చట్టం
8. కావ్యము – కబ్బము
9. కుమారుడు – కొమరుడు
10. కథ – కత
11. ఆసక్తి – ఆసత్తి
12. పద్యము – పద్దెము

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
ప్రతిజ్ఞ =
జవాబు.
ప్రతిజ్ఞ = ప్రమాణం
దేశం కోసం ప్రతి ఒక్కరు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయాలి.

ప్రశ్న 2.
హితవు =
జవాబు.
హితవు = మేలు
పిల్లలు తప్పులు చేయకుండా గురువులు హితవు పలకాలి.

వ్యాకరణాంశాలు :

ప్రత్యయాలు : విభక్తులు
కింది వాక్యాలలో ప్రత్యయాలు గుర్తించండి.

ప్రశ్న 1.
ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు.
జవాబు.
రాజ్యానికి (షష్ఠి)

ప్రశ్న 2.
చదువు నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
పశువుతో (తృతీయా)

ప్రశ్న 3.
తండ్రి మాటలను విని బాధపడ్డాడు.
జవాబు.
మాటలను (ద్వితీయా)

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

సమాపక – అసమాపక క్రియ:

కింది వానిలో అసమాపక క్రియలను గుర్తించండి.

ప్రశ్న 1.
అమ్మ వంట చేసి, వడ్డించింది.
జవాబు.
చేసి

ప్రశ్న 2.
అర్చన బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
జవాబు.
వెళ్ళి

సంయుక్త వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
నవ్య బడికి వెళ్ళింది. కీర్తి బడికి వెళ్ళింది.
జవాబు.
నవ్య, కీర్తి బడికి వెళ్ళారు.

ప్రశ్న 2.
పద్య వాక్యాలు చదవాలి. గద్య వాక్యాలు చదవాలి.
జవాబు.
పద్య, గద్య వాక్యాలు చదవాలి.

సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
శాస్త్రాలను చదివాడు. జ్ఞానాన్ని పొందాడు.
జవాబు.
శాస్త్రాలను చదివి, జ్ఞానాన్ని పొందాడు.

ప్రశ్న 2.
పేద పిల్లలు చదువులు మానేశారు. కూలీ పనులు చేస్తున్నారు.
జవాబు.
పేద పిల్లలు చదువులు మానేసి, కూలీ పనులు చేస్తున్నారు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

సంధులు:

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
ఆ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును.
ఉదా : కమలాకరం
కమల + ఆకరం – సవర్ణదీర్ఘ సంధి

2. గుణసంధి సూత్రం:
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
ఉదా : లోకోద్యమం = లోక + ఉద్యమం
గుణోత్తరం = గుణ + ఉత్తరం = గుణసంధి

3. ఉత్వ సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
ఉదా :
ఉత్తమమగు : ఉత్తమము + అగు – ఉత్వ సంధి
చూడననుచు : చూడను + అనుచు – ఉత్వ సంధి
భాగ్యంబిచ్చట : భాగ్యంబు + ఇచ్చట – ఉత్వ సంధి

సమాసాలు:

సమాసపదం విగ్రహ వాక్యం సమాసం పేరు
పద్యగద్యములు పద్యమును, గద్యమును ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం
సంగీత నాట్య సాహిత్యాలు సంగీతమును, నాట్యమును, సాహిత్యమును బహుపద ద్వంద్వ సమాసం
మృదుభాష మృదువైన భాష విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉత్తమపుట్టుక ఉత్తమమైన పుట్టుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పరభూమి పరులయొక్క భూమి షష్ఠీ తత్పురుష సమాసం
విద్యాధనం విద్య అనెడి ధనం రూపక సమాసం
కాశ్మీరదేశం కాశ్మీరము అను పేరుగల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ
కావ్య నాటకములు కావ్యమును, నాటకమును ద్వంద్వ సమాసం
గురునానతి గురువు యొక్క ఆనతి షష్ఠీ తత్పురుష సమాసం

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

పద్యాలకు అర్థాలు – భావాలు:

I.

1వ పద్యం
ఆ.వె॥ భట్టి మంత్రి ; సైన్యపాలి గోవింద చం
ద్రుఁడు; త్రివిక్రముడు పురోహితుండు;
నప్పురోహితునకు నాత్మజుండగు కమ
లాకరుండన నవివేకి గలఁడు.

అర్థాలు :
భట్టి = భట్టి
మంత్రి = విక్రమార్కునికి మంత్రి
సైన్యపాలి = సేనా నాయకుడు,
గోవిందచంద్రుడు = గోవిందచంద్రుడు.
త్రివిక్రముడు = త్రివిక్రముడు,
పురోహితుడు = పురోహితుడు
ఆ + పురోహితునకు = ఆ పురోహితునికి,
ఆత్మజుండు + అగు = కుమారుడైన
కమలాకరుండు + అన = కమలాకరుడనే
అవివేకి = అజ్ఞాని
కలడు = ఉన్నాడు.

భావం :
విక్రమార్క మహారాజు యొక్క మంత్రి భట్టి. ఆ రాజు. వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడున్నాడు. విక్రమార్కుని పురోహితుడే త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి,

2వ పద్యం:

కం॥ ఆ కమలాకరుఁ డా కమ
లాకర సాదృశ్యముగ జడాశయుఁడై నన్
శోకము మదిఁ బొదలంగ వి
వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూతెన్.

అర్థాలు :
ఆ కమలాకరుడు = ఆ కమలాకరుడు
కమలాకర = కొలనుతో
సాదృశ్యముగ = సమానముగా
జడాశయుడు + ఐనన్ = జడమైన మనస్సు కలవాడు కాగా
శోకము = దుఃఖము
మది = మనస్సు
పొదలంగ = కలుగగా
వివేకము = జ్ఞానము
పుట్టింపన్ = పుట్టించడానికి
తండ్రి = తండ్రి
వెరవున = ఈ విధంగా
దూఱెన్ = పలికాడు.

భావం :
కమలాకరం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు జడాశయుడు. ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్ధంగా ఉన్నాడు. కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొడుకును వివేకిని చేయాలని ఈ విధంగా మందలించాడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

3వ పద్యం:

కం॥ చుట్టములకుఁ దలిదండ్రుల
కెట్టి యెడం బ్రియము నెఱపనెడపని చదువుల్
గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు
పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మీ.

అర్థాలు :

చుట్టములకు = బంధువులకు
తలిదండ్రులకు = తల్లిదండ్రులకు
ఎట్టి యెడం = ఎల్లప్పుడు
ప్రియము = ఆనందమును
నెఱపను + ఎడపని = కలిగించనటువంటి
చదువుల్ = చదువులు
గట్టిగ = పటిష్టముగా
ఎరుగని = చదువని
పుత్రుఁడు = కుమారుడు
పుట్టుట = జన్మించుట
కులమునకు = వంశానికి
తెవులు = తెగులు
పుట్టుట సుమ్మీ = పుట్టుట వంటిది సుమా !

భావం :
చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటివారు.

4వ పద్యం:

కం॥ విను ముత్తమమగు పుట్టువు
గనుపట్టెడు నట్టిరూపు గల మోదుగుఁ బూ
వును మూర్ఖుండును బ్రబలెడు
వనమున భవనమునఁ దగిన వాసన గలదే.

అరాలు:
ఉత్తమము + అగు = ఉత్తమమైనటువంటి
పుట్టువు = పుట్టుక
కనుపట్టెడు నట్టి = మిక్కిలి అందమైనట్టి
రూపముగల = అందము కలిగినట్టి
మోదుగుపూవు = మొగలిపువ్వు
మూర్ఖుండు = అజ్ఞాని
వనము = అడవిలోన
భవనము = మేడపైన
తగిన = తగినట్టి
వాసన = సువాసన

భావం :
చక్కని రూపం ఉన్నా కూడా మోదుగుపువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎంత మంచి రూపమున్న వాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

5వ పద్యం : (కంఠస్థ పద్యం)

పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధన మెపుడున్.

అర్థాలు :
పరులకు = ఇతరులకు
సోదరులకు = అన్నదమ్ములకు
భూవరులకు = రాజులకు
కొనరాదు = తీసుకొన వీలులేనిది
సర్వవశ్యము = అంతా తానె అధీనము
తాన్ = తాను
ఎవ్వరికిన్ = ఎవరికైనా
ఇచ్చినన్ = ఇచ్చినా
కోటిగుణ + ఉత్తర = కోటిరెట్లు
వృద్ధి = అభివృద్ధిని
భజించు = పొందుతుంది
విద్య = చదువు
ఎపుడున్ = ఎల్లప్పుడు
తన = తన యొక్క
ధనము = సంపద

భావం :
పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్న దమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.

6వ పద్యం : (కంఠస్థ పద్యం)

* కం॥ పరభూమికిఁ జనుచోఁ ద
స్కరులకు నగపడదు వ్రేగుగా దెచ్చట నె
వ్వరినైన హితులఁ జేయును
ధరలో మఱి విద్యఁ బోల ధనములు గలవే.

అర్థాలు :

భూమికి = విదేశానికి
జనుచో = వెళ్ళినచో
తస్కరులకు = దొంగలకు
ఎచ్చటన్ = ఎక్కడను
అగపడదు = కనిపించదు.
వ్రేగుకాదు = భారము కాదు
ఎవరిని + ఐన = ఎటువంటివారినైనా
హితులన్ = మంచివారినిగా
చేయును = చేస్తుంది.
ధర = భూమిపై
విద్యన్ + పోలు = చదువును పోలునట్టి
ధనములు = సంపదలు
కలవే = ఉన్నాయా ?

భావం :
వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యాధనం దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడనైనా, ఎవ్వరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

7వ పద్యం:

ఉ॥ గద్యముఁ బద్యముం బెమపఁ గైకొను టొండె, ధ్రువాప్రబంధసం
పద్యుతుఁ డౌట యొండె, మృదుభాషలఁ బ్రొద్దులు పుచ్చుటొండె, లో
కోద్యమ లక్షణం బెఱుఁగు టొండె, గడువ్భజియించుఁగాక యే
విద్యలు నేరఁడేనిఁ పశువే యగుఁ గాదె గణించి చూచినన్.

అర్థాలు :
గద్యమున్ = గద్య కావ్యాలను
పద్యమున్ = పద్య కావ్యాలను
బెనుపన్ = అతిశయించునట్లుగా
గైకొనుటన్ = గ్రహించవలెను
ఒండె = లేదా (అలా కానిచో)
ధ్రువాప్రబంధసంపద్యుడు + ఔట = సంగీత సాహిత్య జ్ఞానాన్ని పొందాలి.
ఒండె = అట్లు కానిచో
మృదుభాషలన్ = మంచిమాటలతో
ప్రొద్దులు = పొద్దు (కాలాన్ని)
పుచ్చుట = గడుపుట
ఒండె = లేదా
లోక + ఉద్యమలక్షణం = = లోకాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నాన్ని
పెఱుగున్ = పొందాలి.
ఒండె = లేదా
కడున్ = మిక్కిలి
భజించుచున్ + గాక = సేవించినప్పటికినీ
విద్యలు = చదువులు
నేరడు + ఏని = పొందకపోయినట్లైతే
గణించి = లెక్కించి
చూచినన్ = చూసిన
పశువు + అగు + కాదె = పశువు వంటివాడే కదా !

భావం :
వచనకావ్యాలు, పద్యకావ్యాలు చదువాలి. లేదా ధ్రువాప్రబంధ సంపదను (సంగీత నాట్య సాహిత్య జ్ఞానాన్ని) పొందాలి. లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లేదా లోకజ్ఞానమైనా పొందాలి. ఇవి ఏవీ చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులూ నేర్చుకోనివారు పశువు వంటివారే.

III.

8వ పదయం : (కంఠస్థ పద్యం)

శా॥ సంగీతంబుఁ గవిత్వ తత్త్వముమ సౌజన్యంబు భావంబు స
త్సాంగత్యంబు నెఱుంగడేవి భువి వాశ్చర్యంబుగా వాలమున్
శృంగ ద్వంద్వము లేని యెద్దతఁడనం జెల్లుం దృణం బాతఁడ
య్యాంగీకంబున మేయఁ డాపసుల భాగ్యం బిచ్చటం గల్గుటన్.

అర్థాలు :

సంగీతంబున్ = సంగీతాన్ని
కవిత్వతత్త్వమును = కవిత్వంలో సారాన్ని
సౌజన్యంబు = మంచితనము
భావంబు = మంచి మనసు
సత్ + సాంగత్యము = సజ్జనులతో సహవాసం
ఎఱుంగడు + పని = తెలియకపోయినట్లైతే
భువిన్ = భూమిపై
ఆశ్చర్యంబుగా = ఆశ్చర్యం పొందే విధంగా
వాలమున్ = తోకను
శృంగ ద్వంద్వము = రెండు కొమ్ములు
లేని = లేనట్టి
చెల్లుం = తిరుగాడే
ఎద్దు + అతడు = ఎద్దు అతడు
అతడు = అట్టివాడు
ఇక్కడన్ = ఇక్కడ
తృణంబు = డ్డిని
మేయడు = మేయకుండుట
ఆపసులన్ = ఆ పశువులను
కల్గుటన్ = కలిగినట్టి
భాగ్యము = అదృష్టము

భావం :
సంగీతం, కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనుల తోడి స్నేహం వీటిని గ్రహించలేని వాడిని భూమిపై తోక, కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటివాడు గడ్డిమేయకపోవడం అనేది పశువుల పాలిటి అదృష్టమని చెప్పాలి.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

9వ పద్యం:

అనుచు నెగ్గించిన నా కమలాకరుండభిమానియై తన యాత్మలోన
విద్యలు నేర్చి వివేకినై కాని యీజనకు వక్త్రము చూడననుచు వెడలి
కాశ్మీర దేశంబు కడ కేఁగి యొక యోర జంద్రకేతుండను సంజ్ఞఁ బరఁగు
నుత్తమ ద్విజుఁ గొల్చియుండగా నాతండు క్రమమున సిద్ధ సారస్వతంబు

తే.గీ॥ కరుణ నొసఁగిన నతఁడు సాంగంబు గాఁగ
నాల్గు వేదములును గావ్య నాటకములు
దర్శనంబులు నీతిశాస్త్రములు దివిరి
కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి

అర్థాలు :
అనుచు = ఈ విధంగా పలుకుచు
ఎగ్గించినన్ = వ్యంగ్యముగా మాట్లాడగా
ఆ కమలాకరుండు = ఆ కమలాకరుడు
అభిమానియై = అభిమానంతో కూడినవాడై
తన = తన యొక్క
ఆత్మలోన = మనస్సులో
విద్యలు = చదువులు
నేర్చి = నేర్చుకొని
వివేకినై కాని = వివేకవంతుడినై కాని
ఈ జనకున్ = ఈ తండ్రి యొక్క
వక్త్రము = ముఖమును
చూడను = దర్శింపను
అనుచు = అంటూ
వెడలి = వెళ్ళి
కాశ్మీర దేశంబు = కాశ్మీర దేశము యొక్క
కడకు = సమీపానికి
ఏగి = వెళ్ళి
చంద్రకేతుండను సంజ్ఞ = చంద్రకేతుడు అనే పేరుగల
ఉత్తమ = ఉత్తముడైన
ద్విజున్ = బ్రాహ్మణుని
కొల్చియుండగానే = సేవింపగా
ఆతండు = అతడు
క్రమమున = క్రమంగా.
సిద్ధ సారస్వతంబు = ప్రసిద్ధి వాఙ్మయాన్ని
కరుణ = దయతో
ఒసగినన్ = అనుగ్రహింపగా
సాంగంబు = వేదాంగాలతో కూడిన
నాల్గు వేదములు = నాలుగు వేదాలు
కావ్య నాటకములు = కావ్యాలు, నాటకాలు
దర్శనంబులు = ఆరు దర్శనాలు
నీతిశాస్త్రములు = నీతిశాస్త్రాలు
దివిరి = చదివి
కలయ సంగీత సాహిత్య కళలు = సమస్త సంగీత సాహిత్య కళలు
నేర్చి = నేర్చుకొని

భావం :
తండ్రి వ్యంగ్యపు మాటలకు కమలాకరుడు అభిమాన పడ్డాడు. విద్య నేర్చుకొని వివేకియైన తరువాత కాని తండ్రి ముఖం చూడనని మనసులో అనుకున్నాడు. కాశ్మీర దేశంలోని చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువును చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా నాలుగు వేదాలు, వేదాంగాలు, కావ్యనాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలు నేర్చుకున్నాడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

విశేషాంశాలు:

1. వేదాలు : వేదాలు 4.

  1. ఋగ్వేదము,
  2. యజుర్వేదము,
  3. సామవేదము,
  4. అధర్వణవేదము.

2. వేదాంగాలు : వేదాంగాలు 6.

  1. శిక్ష
  2. వ్యాకరణం
  3. ఛందస్సు
  4. నిరుక్తం
  5. జ్యోతిషం
  6. కల్పము.

3. దర్శనాలు : దర్శనాలు 6.

  1. న్యాయం
  2. వైశేషికం
  3. సాంఖ్యము
  4. యోగం
  5. మీమాంస
  6. వేదాంతం.

10వ వచనం
వచనం : అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విశేషంబులం జూడంజరియించుచు ……

అరాలు:
అభిజ్ఞుండై = ప్రావీణ్యం కలవాడై
గురునానతిన్ = గురువు అనుమతిని
పడసి = పొంది
తిరిగి = తిరిగి
దేశవిశేషంబులు = దేశంలోని విశేషాలను
చూడ = చూడటానికి
చరియించుచు = తిరుగుతూ

భావం :
ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరాడు. (ఈ విధంగా తల్లి దండ్రులు, గురువులు, పెద్దలు, ఎవ్వరు నిందించినా కోపాన్ని తెచ్చుకోరాదు. దానిని ప్రేరణగా తీసుకొని ఎదగాలి అని పాఠ్యాంశ భావం.)

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

పాఠం నేపథ్యం /ఉద్దేశం:

ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువుపట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. తండ్రి మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉన్నది.

చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం “కథాకావ్యం” ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహారకావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమగుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి.

కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలోనిదీకథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.

కవి పరిచయం:

కవిపేరు : కొఱవి గోపరాజు
పాఠ్యభాగం పేరు : చదువు
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం
రచన : సింహాసన ద్వాత్రింశిక
తల్లిదండ్రులు : తండ్రిపేరు కొఱవి కసవరాజు, తల్లిపేరు కామాంబిక
విశేషాంశాలు : నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

విద్యార్థులకు సూచనలు:

  • పాఠంలోని బొమ్మలు చూడండి. పారం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠాన్ని చదువండి. అర్థంకాని పదాల కింద గీతలు గీయండి.
  • అర్థంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. .
  • పాఠ్యపుస్తకం చివరన ఉన్న “పదాలు – అర్థాలు” పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.

ప్రవేశిక:

చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుడిని చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకారబుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శజీవనం వంటి ఉత్తమగుణాలు అలవడుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువుపట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు పురోహితుడైన త్రివిక్రముడు, తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మథనపడ్డాడు. కొడుకుకు ఎట్లా హితవు పలికాడో పాఠం ద్వారా తెలుసుకుందాం !

పాఠ్యభాగ సారాంశం:

ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని మంత్రి భట్టి. విక్రమార్కుని ఆస్థానంలో ‘త్రివిక్రముడు’ అనే పేరుగల పురోహితుడు ఉన్నాడు. అతని కుమారుని పేరు కమలాకరుడు. ఇతడు అజ్ఞాని. జలాశయం వలె స్తబ్ధంగా ఉంటాడు. ఇది త్రివిక్రమునికి బాధ కలిగించింది. ఒకరోజు త్రివిక్రముడు కమలాకరుడిని ఈ విధంగా మందలించాడు.

నాయనా ! బంధువులకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువును పిల్లలు చదవాలి. చదువులేని పుత్రుడు వంశానికి చీడపురుగువంటివాడు. చదువురానివాడు మోదుగుపూవులాంటి వాడు. ఎంతటి గొప్ప వంశంలో జన్మించినా. చదువు లేకపోతే రాణించడు.

విద్యాధనం చాలా గొప్పది. దాన్ని అన్నదమ్ములు, రాజులు పంచుకోలేరు. ఎంతమందికి ఇచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యను దొంగిలించలేరు. పద్య, గద్య వాక్యాలు చదవాలి. సంగీత, నాట్య శాస్త్రాలు చదవాలి. మంచి మాటలు మాట్లాడాలి. లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవేవి చేయనివాడు, ఏ చదువు నేర్వనివాడు పశువుతో సమానం అని త్రివిక్రముడు మందలించాడు.

కమలాకరుడు తండ్రి మాటలను విని బాధపడ్డాడు. తాను బాగా చదువుకొని తిరిగి తండ్రి ముఖం చూస్తానని ప్రతిజ్ఞ చేసి, కాశ్మీరు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణుని సమీపించాడు. అతడిని సేవించాడు. కొంతకాలంలోనే వేదాలను, వేదాంగాలను, ధర్మములను, శాస్త్రాలను చదువుకున్నాడు. జ్ఞానాన్ని పొంది, గురువు అనుమతి తీసుకొని తిరిగి తన దేశానికి ప్రయాణం అయ్యాడు.

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu Guide 1st Lesson చదువు 3

Leave a Comment