Telangana SCERT 7th Class Telugu Guide Telangana 2nd Lesson నాయనమ్మ Textbook Questions and Answers.
TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి: (TextBook page No.10)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో ఒక వృద్ధురాలు, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రశ్న 2.
బొమ్మలో ఏం జరుగుతున్నది ?
జవాబు.
బొమ్మలో వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆ సమయంలో భార్యాభర్తలు ఆ వృద్ధురాలికి సపర్యలు చేస్తున్నారు. పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రశ్న 3.
ముసలమ్మకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు ?
జవాబు.
ముసలమ్మకు సేవలు చేస్తున్నది ఆమె కుమారుడు, కోడలు అయి ఉంటారు.
ప్రశ్న 4.
మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు ?
జవాబు.
మా ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉన్నారు. వారు వృద్ధులు. వారికి నేను సేవ చేస్తాను. వారికి అవసరమైన మందులు అందిస్తాను. బయటకు తీసుకొని వెళ్తాను. అల్పాహారం, భోజనం పెడతాను. కాళ్ళు నొప్పులు వస్తే మర్దన చేస్తాను.
ఆలోచించండి – చెప్పండి: (TextBook page No.12)
ప్రశ్న 1.
“సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు” ఎందుకు ?
జవాబు.
నాయనమ్మ పిల్లలను ఆప్యాయంగా పలుకరిస్తుంది. ఆట వస్తువులు కొని ఇస్తుంది. మంచి కథలు చెబుతుంది. నీతిమాటలు చెబుతుంది. అనారోగ్యం వస్తే దగ్గరుండి సేవలు చేస్తుంది. అందుకే పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు.
ప్రశ్న 2.
“ఏం కాదులే అవ్వా! అన్నింటికీ ఆ దేవుడున్నడు” అని ఇంటికి వచ్చినవారు అనటంలో ఆంతర్యమేమిటి ?
జవాబు.
రోగం వచ్చినప్పుడు బాధపడకూడదు. దిగులు చెందుతూ ఉంటే రోగం పెరుగుతుంది. సకాలంలో మందులు వేసుకుంటూ నయం చేసుకోవాలి. ‘అన్నింటికి దేవుడున్నాడు’. నువ్వు బాధపడవద్దు. అంతా దైవమే చూచుకుంటుంది అని చెప్పడం ద్వారా రోగిలో ధైర్యాన్ని నింపడమే ప్రధాన ఉద్దేశం.
ప్రశ్న 3.
‘సల్లగుండు బిడ్డా’ అని ఏయే సందర్భాలలో అంటారు?
జవాబు.
పెద్దలకు నమస్కరించినపుడు వారు దీవించే సందర్భంలోను, తమకు సేవలు చేసినపుడు సంతోషంగా వృద్ధులు దీవించే సందర్భంలోనూ “సల్లగుండు బిడ్డా” అనేదాన్ని వాడతారు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook page No.13)
ప్రశ్న 1.
మీరు ఏయే ఆటలు ఆడుతారు ?
జవాబు.
నేను కబడ్డీ, చదరంగం, బిల్లంగోడి, క్యారమ్స్ మొదలైన ఆటలు ఆడతాను.
ప్రశ్న 2.
మీతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది ?
జవాబు.
నాతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే నాకు ఎంతో విచారంగా ఉంటుంది. ఆటలు ఆడాలని అనిపించదు. ఏదో కొరతగా ఉంటుంది. పరధ్యానంగా ఉంటాను.
ప్రశ్న 3.
కలసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది ?
జవాబు.
కలసి ఆడడంలో ఉన్న ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. పరస్పర సహకారం, ఐక్యత, సోదరభావం పెరుగుతాయి. సహనం, నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. అందువల్ల కలసి ఆడడంలో ఉన్న ఆనందం మాటలతో చెప్పనలవి కానిది.
ప్రశ్న 4.
మీరు ఎవరికైనా, ఎప్పుడైనా సహాయం చేశారా ? ఎలాంటి సహాయం చేశారో చెప్పండి.
జవాబు.
నేను ఎన్నోసార్లు ఇతరులకు సహాయం చేశాను. ఇటీవల మా ప్రాంతంలో వరదలు వచ్చాయి. పేదలు నిరాశ్రయులైనారు. ఆ సమయంలో వారికి ఆహారం, నీరు అందించాను. అట్లే వికలాంగులకు ధన సహాయం చేశాను. అసుపత్రిలోని రోగులకు పండ్లను ఇచ్చి సహాయం చేశాను.
ఆలోచించండి – చెప్పండి: (TextBook page No.14)
ప్రశ్న 1.
జ్వరం వచ్చినపుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు కదా ! దీనివల్ల నీవు ఏమి గ్రహించావు?
జవాబు.
ఇంట్లో వృద్ధులు ఉన్నప్పుడు వారికి సేవ చేయాలి. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి మరింత సేవ చేయాలి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూచుకోవాలి. వారి కళ్ళల్లో ఆనందం కలిగేటట్లుగా చూచుకోవాలని అర్థం అయింది.
ప్రశ్న 2.
శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు?
జవాబు.
శేఖర్కు రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. బంధువులతో కలిసి రవి ఇంటికి వచ్చాడు. కాని రవి నాయనమ్మతోనే ఉండేవాడు. రవి అలా చేయడం ఇష్టం లేదు. దీనికి కారణం నాయనమ్మే అని భావించాడు. దాంతో నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు.
ప్రశ్న 3.
నీకు ఎప్పుడైనా ఎవరిమీదైనా కోపం వచ్చిందా ? ఏ సందర్భంలో వచ్చిందో తెలుపండి ?
జవాబు.
సాధారణంగా ఎవరిపైనా కోపం రాదు. కాని వికలాంగులను చులకనగా చూచినప్పుడు, వారిని చూచి హేళన చేసినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది.
ఆలోచించండి – చెప్పండి: (TExtBook Page No.15)
ప్రశ్న 1.
శేఖర్ పశ్చాత్తాపపడ్డాడు కదా! మీరు ఏయే సందర్భాల్లో పశ్చాత్తాపపడ్డారో చెప్పండి ?
జవాబు.
తాను చేసిన తప్పు గుర్తించినప్పుడు, తప్పును పెద్దలు గుర్తించి మందలించినప్పుడు, తన తప్పుల వల్ల ఇతరులకు హాని కలిగినప్పుడు పశ్చాత్తాపం చెందుతాడు.
ప్రశ్న 2.
శేఖర్ అందరితోని మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి.
జవాబు.
శేఖర్ అందరితోని మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉన్నాడు. శేఖర్ తాను చేసిన తప్పును గుర్తించాడు. దీన్ని అందరూ గుర్తించి తనను మందలిస్తారనే భయం ఎక్కువైంది. అందుకోసమే శేఖర్ ముభావంగా ఉన్నాడు.
ప్రశ్న 3.
నాయనమ్మ క్షమించినా శేఖర్ ఎందుకు ఏడ్చాడు ?
జవాబు.
నాయనమ్మ శేఖర్ను క్షమించింది. అయినా శేఖర్ ఏడ్చాడు. దానికి కారణం తాను చేసింది పెద్ద తప్పు. తన తప్పు కారణంగా నాయనమ్మ బాధపడింది. ఆమెకు కాలు విరిగింది. ఇది గుర్తించి తట్టుకోలేక ఏడ్చాడు.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారు కదా ! వీరిద్దరిలో ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు?
జవాబు.
రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నాను. వీరిలో అందరు రవిలాగా ఉండాలనుకుంటారు. ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉంటారు. వారు వృద్ధులు. వారికి సేవలు చేయాలి. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. వారి దీవెనలు పొందాలి. నాయనమ్మకు పిల్లలపై మమకారం ఉంటుంది. పిల్లలకు కూడా తాతయ్య, నాయనమ్మలంటే బాగా ఇష్టపడతారు. అందువల్ల అందరు రవిలాగా ఉండాలని అనుకుంటారు.
ప్రశ్న 2.
నాయనమ్మ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
వృద్ధులపట్ల సానుకూలవైఖరిని ప్రదర్శించాలి. ఇది మన ధర్మం. ఇంట్లో నాయనమ్మ జ్వరంతో బాధపడుతున్నది. కొడుకు, కోడలు సేవచేస్తున్నారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా నాయనమ్మను ఓదారుస్తున్నారు. మనమడు కూడా నాయనమ్మకు సపర్యలు చేస్తున్నాడు. అతని పేరు రవి. నాయనమ్మకు తన మనుమడంటే ఎంతో అభిమానం.
ఒకసారి బంధువులు ఊరి నుండి వచ్చారు. వారిలో శేఖర్ అనేవాడు రవితో సమానమైన వయసు కలవాడు. రవితో బాగా ఆడుకుందామని అనుకున్నాడు. కాని రవి నాయనమ్మ సేవలో నిమగ్నమయ్యాడు. ఇది శేఖర్కు నచ్చలేదు. దాంతో శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మంచం పక్కన ఉన్నట్టి వస్తువులను తారుమారు చేశాడు. దాంతో ఆమె వస్తువులను అందుకుంటూ కింద పడింది. కాలు విరిగింది. కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉంది. శేఖర్లో పశ్చాత్తాపం మొదలైంది. తనవల్లే నాయనమ్మకు కాలు విరిగిందని భావించాడు. నాయనమ్మకు జరిగినదంతా చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు. నాయనమ్మ కూడా అతడిని ఓదార్చింది. తప్పును మన్నించింది.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
ప్రశ్న 1.
కింది పేరా చదువండి. ముఖ్యమైన పదాలు రాయండి.
ఒక శివరాత్రినాడు శివుడిని దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదుటిమీద దెబ్బతోని అవ్వ స్పృహతప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. అందరూ శివుడిని చూడడానికి ఎగబడ్డారు. కాని ఇద్దరు ఆడపిల్లలు చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. చల్లని నీళ్ళు తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. “బంగారుతల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారు” అని అవ్వ ఆనందబాష్పాలు రాలుస్తూ ఆ పిల్లల్ని దీవించింది.
ఉదా : జనసమ్మర్థం, దీవించటం
- స్పృహతప్పింది
- ఎగబడ్డారు
- కట్టుకట్టారు
- దుమ్ముధూళి
- బంగారుతల్లులు
- ఆనందబాష్పాలు
2. కింది వాక్యాలు చదువండి. వీటిలో మీరు ‘అవును’ అని అనుకొనే వాటికి (✓) లేకుంటే (✗) గుర్తు పెట్టండి.
అ) నాకు ముసలివాళ్ళంటే బాగా ఇష్టం.
జవాబు.
✓
ఆ) నేను ముసలివాళ్ళకు ఎప్పుడైనా పనులను చేసిపెడుతాను.
జవాబు.
✓
ఇ) ఎవరి వస్తువులనైనా నాకిష్టమైతే తీసుకొంటాను.
జవాబు.
✗
ఈ) ఇంటికి వచ్చిన చుట్టాలు, పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను.
జవాబు.
✓
ఉ) ముసలివాళ్ళకు మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను.
జవాబు.
✓
ఊ) అమ్మానాన్నలకు పనులలో సహాయం చేస్తాను.
జవాబు.
✓
ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది.
జవాబు.
✗
ఏ) నావల్ల ఎవరికైనా బాధకలిగితే, నేనుకూడా బాధపడుతాను.
జవాబు.
✓
ఐ) నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను.
జవాబు.
✓
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) రవి, శేఖర్ మంచిమిత్రులు కదా! నీకున్న మంచి మిత్రుడెవరు ? ఎందుకు?’
జవాబు.
రవి, శేఖర్ మంచిమిత్రులే. అయితే శేఖర్కు ఎప్పుడు రవి తనతో ఆడుకోవాలనే కొద్దిపాటి స్వార్థం ఉంది. కాని చివరకు శేఖర్ తప్పు తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. నాకు బడిలో ఎంతోమంది మిత్రులున్నారు. సుమారు ఇరవైకిపైగా మిత్రులున్నారు. వారంతా నాతో కలిసి ఉంటారు. నేను వృద్ధులకు సేవచేస్తున్నా బాధపడరు. సమాజసేవలో నాతో కలిసి పనిచేస్తారు. మాలో మాకు అభిప్రాయభేదాలు ఎప్పుడు రావు. అందరం ఒక్కటిగా ఉంటాం. ఆదర్శంగా నిలుస్తాం.
ఆ) మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి.
జవాబు.
వృద్ధులు నిద్ర లేచింది మొదలు మరలా రాత్రి నిద్రపోయే వరకు వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను. వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చూస్తాను. వారికి అల్పాహారం, భోజనం వంటివి ఒక నియమిత కాలంలో అందేటట్లు చూస్తాను. విశ్రాంతి తీసుకోవడానికి కానీ, నిద్రపోవడానికి కానీ తగిన ఏర్పాట్లు చేస్తాను. వారి కాలక్షేపానికి పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ వంటివి అందుబాటులో ఉంచుతాను.
వారు తమ బంధువులకు ఉత్తరాలు రాయాలనుకుంటే పోస్టాఫీసు నుంచి కార్డులు, కవర్లు తెచ్చి పెడతాను. ఉత్తరాలు రాసిపెడతాను. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంట ఉండి జాగ్రత్తగా తీసుకువెళ్తాను. రోడ్డు దాటేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు సహాయపడతాను. మరల జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను.
ఇ) “కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి”. ఎందుకో రాయండి.
జవాబు.
భారతీయ సంస్కృతిలో కుటుంబవ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మ మొదలైనవారంతా ఒక్కటిగా ఉండేవారు. ఇలా ఉండడం మంచిది. ఇలా అందరూ కలిసి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబసభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సంస్కృతీ సంప్రదాయాలు అంతరించకుండా ఉంటాయి. మన వారసత్వ సంపద పరిపుష్టిని పొందుతుంది. అందువల్ల కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఉండాలి.
ఈ) “ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది” దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
మానవునికి ఈర్ష్య శత్రువు వంటిది. ఇది మనలోని సద్గుణాలను దూరం చేస్తుంది. ఎదుటివారి అభివృద్ధిని సహించనివ్వదు. కోపం ఎక్కువగా వస్తుంది. ఎప్పుడూ తనకు ఇబ్బందికరంగా ఉండేవారికి కీడును చేపట్టే మనస్తత్వం అలవడుతుంది. చదువు, సంస్కారం దూరమౌతాయి. మమతానుబంధాలను, మానవీయ విలువలను అంతం చేస్తుంది. అందువల్ల ఈర్ష్యను మానవుడు దూరం చేసుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏమిటి ? నేటి కాలంలో కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణాలు వివరించండి.
జవాబు.
రవి, శేఖర్ ఇద్దరు మంచి స్నేహితులు. రవికి నాయనమ్మకు సేవచేయడమంటే ఎంతో ఇష్టం. శేఖర్కు రవితో ఆడుకోవడం అంటే ఇష్టం. రవి తనతో ఆడుకొనకపోవడానికి నాయనమ్మే ప్రధాన కారణమని గ్రహించాడు. ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. దీని ఫలితంగా ఒకసారి నాయనమ్మకు కాలు విరిగింది. దీంతో శేఖర్కు భయం పట్టుకుంది. నాయనమ్మ శేఖర్ను ఆదరించింది. మంచి మాటలు చెప్పింది. అన్నం తినిపించింది. నాయనమ్మలోని ఆప్యాయత శేఖర్ లో మార్పు తెచ్చింది. తప్పు ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. ఈ రకంగా శేఖర్ మారి, మంచి మనిషిగా అయ్యాడు.
ఆధునిక కాలంలో ఎంతోమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి :
- పిల్లలు ఉద్యోగాలతో దూరప్రాంతాల్లో ఉండటం.
- కుటుంబ తగాదాలు, ఆర్థిక సమస్యలు.
- నేటి యువతకు వృద్ధులపట్ల చులకన భావన.
- సమాజంలో మానవీయ విలువలు లోపించడం.
- ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గిపోవడం.
IV. సృజనాత్మకత / ప్రశంస:
ప్రశ్న 1.
వృద్ధులకు సేవచేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
సిద్ధిపేట,
X X X X X.
ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు,
శుభాకాంక్షలు. నేను బాగానే చదువుతున్నాను నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన సమాజంలో ప్రస్తుతం వృద్ధుల జీవితం ఎంతో దుర్భరంగా ఉంది. వివిధ కారణాలతో అనాథలుగా వృద్ధాశ్రమంలో చేరుచున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలు కుటుంబ కారణాలతో వృద్ధులను పట్టించుకోవడం లేదు. వృద్ధాశ్రమాల్లో దింపి బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. మనం వృద్ధులను సేవించాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూచుకోవాలి. వారి దీవెనలు పొందాలి. అది మన కర్తవ్యంగా భావించాలి. నీవు కూడా వృద్ధులను ఆదరించి, సేవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికి నమస్కారాలు
తెలుపగలవు.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఎ. వరప్రసాద్.
చిరునామా :
పి. రాధాకృష్ణ,
7వ తరగతి,
బూర్గంపహాడ్ ఉన్నత పాఠశాల,
మధిర,
ఖమ్మం జిల్లా.
IV. పదజాల వినియోగం:
1. ఈ కింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి.
అ) అంధులు, ద్వేషం, జ్ఞాపకం, తుంటరి, జపమాల, ఆతృత
జవాబు.
1. అంధులు = గుడ్డివారు
2. ద్వేషం = పగ
3. జ్ఞాపకం = గుర్తు
4. తుంటరి = అల్లరి చేసేవాడు
5. జపమాల = జపం చేసుకునే మాల
6. ఆతృత = తొందరపడు
2. పాఠాన్ని చదువండి. పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి.
జవాబు.
ఆటకు సంబంధించినవి | ఆసుపత్రికి సంబంధించినవి | కుటుంబ పదాలు | అన్యభాషా పదాలు |
ఆటస్థలం, కబడ్డి, చిర్రగోనె, దాగుడుమూతలు | పరీక్షలు, తొడఎముక, దవాఖానా, గోలీలు, మందులు | నాయనమ్మ, నాన్న, అమ్మ, బంధువులు | ఎక్స్‌రే, ఆపరేషన్, డాక్టర్ |
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.
అ) నాయనమ్మ ____________ మందులు వేసుకోవడం చాతనవుతుంది.
జవాబు.
కు
ఆ) కోపం ____________ ఇట్లా జరిగింది.
జవాబు.
వలన
ఇ) శేఖర్ ____________ రవి ఎదురుచూశాడు.
జవాబు.
కొరకు
ఈ) అందరి ____________ కలసి ఆడుకో !
జవాబు.
తో
2. ఈ కింది వాక్యాల్లో క్రియలు గుర్తించి పక్కనే రాయండి.
అ) రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. ____________
జవాబు.
వెళ్ళాడు.
ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. ____________
జవాబు.
చదివి, నిద్రపోయింది
ఇ) మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు. ____________
జవాబు.
పరిగెత్తుతున్నాడు
ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. ____________
జవాబు.
చేసి, వెళ్ళాడు
పై వాక్యాల్లో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి ? ఆ రెండు క్రియల్లో భేదం గమనించారా ?
ఆ. చదివి, నిద్రపోయింది
ఈ. చేసి, వెళ్ళాడు
ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తి అయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను “సమాపక క్రియలు” అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తికానట్లు తెలిపే క్రియలను “అసమాపక క్రియలు” అంటారు.
3. కింది వాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.
అ) చెంబుతో నీళ్ళు ముంచుకొని, తాగుతుంది.
అసమాపక క్రియ ముంచుకొని సమాపక క్రియ తాగుతుంది.
ఆ) ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
అసమాపక క్రియ ఆపివేసి సమాపక క్రియ వెళ్ళిపోయాడు.
ఇ) పరీక్ష చేసి, కాలు విరిగిందని చెప్పాడు.
అసమాపక క్రియ చేసి సమాపక క్రియ చెప్పాడు.
ఈ) దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
అసమాపక క్రియ తీసుకొని సమాపక క్రియ తుడిచింది.
ప్రాజెక్టు పని:
మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. ఏయే పనులవల్ల వారికి సంతోషం కలుగుతుందో తెలుసుకుని నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
వృద్ధులకు ఇష్టమైన పనుల్లో ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం, పూల మొక్కలను పెంచడం, కథలను పిల్లలకు చెప్పడం మొదలైనవి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
వృద్ధులు నాతో ఈ సమయంలో తమ బిడ్డలు తమకు దగ్గరగా ఉండాలని, తమ బాగోగులను చూచుకోవాలని కోరారు. తమకు తమ పిల్లలు ఆర్థికంగా సహాయపడవలసిన అవసరం లేదని, తమను జాగ్రత్తగా చూచుకుంటే సరిపోతుందని వాళ్ళు నాతో అన్నారు. పిల్లలు దూరంగా ఉంటే పడే బాధ చెప్పనలవికాదని కూడా చెప్పారు.
(లేదా)
మీ ప్రాంతంలోని తాత, నాయనమ్మలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని కలిసి, వారితో మాట్లాడండి. మీకెట్లా అనిపించిందో నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
నేను సంక్రాంతి సెలవులకు మా స్నేహితునితో కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళాను. వారిది ఉమ్మడికుటుంబం. ఆ కుటుంబం నాకు బాగా నచ్చింది. ఆ ఊరి ఆత్మీయతలు బాగా ఆకట్టుకున్నాయి. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో సీత ఇంటర్ మొదటి సంవత్సరము, రమణ 7వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు ఇద్దరూ చైతన్య జూనియర్ కాలేజీలో, స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఆ ఇంట్లో రఘునాథ్ గారి తండ్రి వెంకట్రావుగారు, తల్లి శేషమ్మగారు కూడా ఉన్నారు.
పిల్లల చదువుల గురించి వెంకట్రావుగారు మంచి శ్రద్ధ తీసుకుంటారు. శేషమ్మగారు ఇంటి పనులు అన్నీ చూస్తారు. ఆ కుటుంబంలో సభ్యులందరూ చక్కగా కలసిమెలసి ఉంటారు. తల్లిదండ్రుల యోగక్షేమాల్ని రఘునాథ్ గారు చక్కగా చూస్తారు. వెంకట్రావుగారు, శేషమ్మగారు సాయంత్రం పార్కుకు వెళ్ళి నడుస్తారు. వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి వస్తారు. సాయంత్రం అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు. భోజనాలయ్యాక ఒక గంట టి.వి. చూస్తారు. పిల్లలకు భారత, భాగవత, రామాయణ కథలు వాళ్ళ తాత, మామ్మలు చెపుతూ ఉంటారు. వారి ఏకతను చూసి నాకు సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం అన్యోన్యత నాకు చూడముచ్చటగా ఉంటుంది.
TS 7th Class Telugu 2nd Lesson Important Questions నాయనమ్మ
I. అవగాహన – ప్రతిస్పందన:
అపరిచిత గద్యాలు:
1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకు లోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలు అవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను, అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద,మాత్సర్యాలు) నుండి ఎలా బయటపడగలను ?
ప్రశ్నలు :
ప్రశ్న 1.
ఏనుగు దేనివల్ల బందీ అవుతున్నది ?
జవాబు.
తన మేని దురద వల్ల
ప్రశ్న 2.
నోటికి రుచి ఆశించి ఏది బందీ అయింది ?
జవాబు.
చేప
ప్రశ్న 3.
రాగానికి లొంగినది ఏది ?
జవాబు.
పాము
ప్రశ్న 4.
వేటికై మైమరచినవి తుమ్మెదలు ?
జవాబు.
పూలవాసనకు
ప్రశ్న 5.
అరిషడ్వర్గాలు ఏవి ?
జవాబు.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జానపదులు అనగా పల్లె ప్రజలు, పల్లెల్లో ఉన్న కళలను జానపద కళలంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, చిందు భాగోతాలు, చిరుతల రామాయణం, కోలాటం, భజన, తుపాకి రాముడు, పిట్టలదొర మొ||నవి జానపద కళలకు ఉదాహరణలు. భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు మొదలైన వీరుల కథలు ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు చదువుకోనివారు. అట్లాంటి కాలంలో వాళ్ళకు వినోదంతో పాటు నీతి సూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడ్డాయి.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
జానపదులు అనగా ఎవరు ?
జవాబు.
పల్లె ప్రజలు
ప్రశ్న 2.
జానపదుల కళలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు.
బుర్రకథ, యక్షగానం
ప్రశ్న 3.
చదువుకోని వాళ్ళకు జానపద కళలు ఎలా ఉపయోగపడతాయి?
జవాబు.
వినోదంతో పాటు నీతి సూత్రాల ఆలోచనను కలిగించేందుకు
ప్రశ్న 4.
‘ఏండ్లకేండ్లుగా’ విడదీయండి.
జవాబు.
ఏండ్లకు + ఏండ్లు
ప్రశ్న 5.
‘పల్లె ప్రజలు’ విగ్రహవాక్యం రాయండి.
జవాబు.
పల్లెలందు ప్రజలు
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
రవి వాళ్ళ అమ్మనాన్నలు నాయనమ్మను ఎలా చూసుకుంటారు ?
జవాబు.
నాయనమ్మ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయిస్తారు. రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నొసలు మీద ముద్దు పెట్టుకుంటుంది. సమయానికి మందులు అందిస్తారు.
ప్రశ్న 2.
ఇంట్లో అవ్వను అందరూ బంగారం లెక్క చూసుకుంటారు. ఈ వాక్యాన్ని బట్టి బంగారం లెక్క చూసుకోవడమంటే మీకేమి అర్థమైంది ? రాయండి.
జవాబు.
ఇంట్లో అందరికీ అవ్వ ఇష్టం. అందుకే ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. బంగారం లెక్క చూసుకోవడం అంటే బీరువాలో పెట్టి తాళం వేసి భద్రంగా చూడడం కాదు. బంగారం అనేదానికి అపురూపంగా చూడడం అనే అర్థం కూడా ఉంది. కనుక అవ్వను ఇంటిలోని వారందరూ అపురూపంగా, చాలా ఇష్టంగా చూసుకొనేవారని నాకు అర్థమైంది.
ప్రశ్న 3.
అయ్యో నాయనమ్మకు ఈ కష్టం కలగటానికి కారణం నేనే కదా! అని పశ్చాత్తాపపడ్డ శేఖర్ ఆలోచనలో మీరేం గ్రహించారో రాయండి.
జవాబు.
శేఖర్కు రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కాని రవి నాయనమ్మతోనే ఉండేవాడు. దాంతో నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. కాని తాను చేసిన పని వల్ల నాయనమ్మ నెలరోజులు దవాఖానాలోనే ఉంది. అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్కు కూడా గుబులైంది. తాను చేసిన తప్పును గుర్తించాడు. తన తప్పు వల్ల నాయనమ్మకు ప్రమాదం కలిగిందని పశ్చాత్తాపంతో ఉన్నాడని గ్రహించాను.
ప్రశ్న 4.
మీ పెద్దలకు మీరు ఎలాంటి సేవలు చేస్తారో తెల్పండి. (లేదా)
మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి.
జవాబు.
వృద్ధులు నిద్ర లేచింది మొదలు మరలా రాత్రి నిద్రపోయే వరకు వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను. వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చూస్తాను. వారికి అల్పాహారం, భోజనం వంటివి ఒక నియమిత కాలంలో అందేటట్లు చూస్తాను. విశ్రాంతి తీసుకోవడానికి కానీ, నిద్రపోవడానికి కానీ తగిన ఏర్పాట్లు చేస్తాను. వారి కాలక్షేపానికి పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ వంటివి అందుబాటులో ఉంచుతాను.
వారు తమ బంధువులకు ఉత్తరాలు రాయాలనుకుంటే పోస్టాఫీసు నుంచి కార్డులు, కవర్లు తెచ్చి పెడతాను. ఉత్తరాలు రాసి పెడతాను. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంట ఉండి జాగ్రత్తగా తీసుకువెళ్తాను. రోడ్డు దాటేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు సహాయపడతాను. మరల జాగ్రత్తగా ఇంటికి తీసుకునివస్తాను.
ప్రశ్న 5.
పిల్లలకు అమ్మమ్మలు, నాయనమ్మలంటే ఎందుకిష్టం? కారణాలు రాయండి.
జవాబు.
అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లలను ఆప్యాయంగా పలుకరిస్తుంటారు. ఆట వస్తువులు కొని ఇస్తుంటారు. మంచి కథలు నీతిమాటలు చెబుతారు. అనారోగ్యం వస్తే దగ్గరుండి సేవలు చేస్తారు. అందుకే పిల్లలకు అమ్మమ్మ, నాయనమ్మలంటే ఇష్టం.
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
శేఖర్ తాను తప్పు చేశానని నాయనమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్చాడు. ఎందుకు ?
(లేదా)
నాయనమ్మ ఓదార్పుతో శేఖర్ కలిగిన ఆలోచనలు ఊహించి రాయండి.
జవాబు.
రవి, శేఖర్లు మంచి స్నేహితులు. రవి తనతో ఆటలాడకుండా వాళ్ళ నాయనమ్మకు సేవలు చేయడం శేఖర్కు నచ్చలేదు. తనతో రవి ఆడకపోవడానికి నాయనమ్మే కారణమని, ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. దీని ఫలితంగా ఆమెకు కాలు విరిగింది. అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్కు కూడా గుబులైంది. తన వల్లే ఆమెకు ఈ కష్టం వచ్చింది. అదే అనుకోనిది జరిగి ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించే సరికి శేఖర్కు చాలా ఏడుపు వచ్చింది.
పొరపాట్లు అనేవి అందరూ చేస్తారు. అలాగే ఇక్కడ శేఖర్ చేసింది అదే. తన తప్పు తెలుసుకొని బాధపడుతున్న శేఖర్ని పిలిచి అవ్వ పళ్ళు తినమని ఇచ్చేది. దానివల్ల ఆమెపై శేఖర్కి ఇంకా ఇష్టం పెరిగింది. నాయనమ్మకు తాను చెడు చేసినా తన పట్ల ఆమె చూపే ప్రేమకు కరిగిపోయి ఆమె పాదాల చెంతకు చేరాడు. తనలోని ఈర్ష్య నాయనమ్మ ప్రేమకు తొలగిపోయింది. అందుకే నాయనమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్చాడు.
ప్రశ్న 2.
‘వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు’ ఇది సబబేనా ? ఎందుకో వివరించండి.
(లేదా)
నాయనమ్మ లాంటి పెద్దవాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో రాయండి.
(లేదా)
నేటికాలంలో ఇంటాబయట వృద్ధుల పరిస్థితి ఎలా ఉంది ? దానికి కారణాలు ఏమిటి?
(లేదా)
నేటికాలంలో కొంతమంది కొడుకులు ముసలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్నున్నారు. కారణాలు తెల్పండి.
జవాబు.
“అమృతం తాగినవాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం పంచేవాళ్ళు అమ్మానాన్నలు” అని ఓ సినీ కవి అన్నాడు. అమృతాన్నే చనుపాలుగా చేసి పట్టిన తల్లిని వయసు మీరిన తరువాత భారంగా భావించే బిడ్డలున్నంతవరకు తల్లులు వృద్ధాశ్రమాల్లో బాధ పడవల్సిందే. ఇక్కడ ఆ బిడ్డలు గ్రహించలేదో లేక కావాలని తెలియనట్లున్నారో కాని రేపు తాము కూడా యౌవనం దాటి వృద్ధులు అయినపుడు తమ లక్షణాలే కల తమ బిడ్డల వల్ల తాము కూడా ఇలాగే చూడబడతామని, నేటి యౌవనం గల తల్లిదండ్రులు రేపటి వృద్ధులని గ్రహించకపోవడం విచారకరం.
వృద్ధులు గతకాలపు అనుభవపు సారాలు. వారి అనుభవాలను గ్రహించి భావి జీవితాన్ని పూబాటగా మలచుకోవలసిన బాధ్యత బిడ్డలుగా మనందరి బాధ్యత. వారి మాటలు చాదస్తంగా, అయిష్టంగా ఉంటాయని భావించి మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటున్నాము. ‘వృద్ధ’ శబ్దానికి అర్థం ‘పెద్ద’ అని “పెద్దల మాట చద్దిమూట” అంటే బలాన్నిచ్చేది అని అర్థం. దీనిని ప్రస్తుత సమాజం మాటగా మాత్రమే స్వీకరించడం, ఆచరణ శూన్యం కావడం వల్ల పెద్ద అనర్థం జరుగుతోంది. ఇంట్లో గొడవలయినపుడు సర్ది చెప్పే పెద్దదిక్కు లేనపుడు బిడ్డల జీవితం కూడా ఏకాకి జీవితం అవుతుంది.
బాల్యంలో ఉన్నప్పుడు మనం మన పనులు. చేసుకోవడానికి కుదరదు అంటే వయసు చాలదు. ముసలితనంలో పనులు చేసుకోవడానికి వయసు సహకరించదు. అంటే వారికి మరల బాల్యం వచ్చినట్లే. చిన్నపిల్లలను సాకినట్లుగా వారికి మనం సేవ చేసి చిన్నప్పుడు వారు మనకు చేసిన సేవలు గుర్తు చేసుకోవాలి.
భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబాల వల్ల మానవీయ విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు అంతరించకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. కనుక పెద్దలను గౌరవించడం మనందరి విధి. రేపటి తరాలకు ఇది వారధి.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
వృద్ధులకు సేవ చేయవల్సిన అవసరాన్ని వివరిస్తూ, కరపత్రం రాయండి.
జవాబు.
వృద్ధుల సంరక్షణ సమితి
యువతా నీ పయనమెటూ !
మేల్కోండి ! గమనించండి !
సోదర సోదరీమణులారా !
“నేటి వృద్ధులు – నిన్నటి యువకులు, నేటి యువకులు రేపటి వృద్ధులు” అన్న సంగతి మరచి ప్రవర్తించడం దురదృష్టకరం. పిన్న వయసులో మనం సేవలు చేయించుకొని పెరిగి పెద్దయి, వాళ్ళు పెద్దవారయ్యే సరికి బాధ్యత మరచి ఇంటి నుండి గెంటేస్తున్నాం. ఇది న్యాయమేనా ? చర్మం ముడతలు పడి, జుట్టు రాలిపోయి, కళ్ళు కనబడక, చెవులు వినబడక, పట్టు తప్పుతున్న కాళ్ళు చేతులతో పనులు చేసుకోలేని వృద్ధులైన తల్లిదండ్రులను అందరూ ఉండీ అనాథలను చేయడం కలవరపెడుతున్న విషయం.
వృద్ధాశ్రమాలు ఉన్నది అనాథలైన వారికి మేమున్నామంటూ ఆసరా, అండగా ఉండడానికే తప్ప అందరూ ఉన్న వారికి కాదు. కానీ వారిని చూడటానికి కూడా ఆశ్రమ నిర్వాహకులు దాతృత్వాన్ని చాటుతున్నారు. ఇది మనందరం. సిగ్గుతో తల దించుకోవలసిన విషయం. మీరు ఈ రోజు చేసిన పని రేపు మీ పిల్లలు మీ పట్ల ప్రవర్తిస్తే అప్పుడు మీ మానసిక స్థితి ఏమిటో ఒకసారి ఊహించుకోండి.
అమృతం తాగిన వారు దేవతలైతే, అనురాగామృతాన్ని పంచేవారు మన తల్లిదండ్రులు. అటువంటివారు వృద్ధులైనారని వారిపట్ల హీనంగా ప్రవర్తించడం మంచిది కాదు. వారే నీకు తోడుంటే నీ పిల్లలకు చక్కని బుద్ధులు నేర్పుతారు. తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని కథల రూపంలో మీ పిల్లలకు అందించి, వారి బంగారు జీవితానికి బాటలు వేస్తారు.
వృద్ధుల పట్ల పిల్లల తీరు బాగుండాలనే ఉద్దేశ్యంతో Xxxxన ఆదివారం 6 గం॥ ‘భద్రాచలం’ ఆలయ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.
ఇట్లు,
వృద్ధుల సంరక్షణ సమితి.
XXXX,
భద్రాచలం.
ప్రశ్న 2.
తాతయ్య, నాన్నమ్మ, అమ్మా, నాన్న, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటి కాలంలో ఎంతోమంది వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
జవాబు.
‘శంఖారావం’
‘తాతా – మామ్మా’ ముద్దు – వృద్ధాశ్రమం వద్దు
సోదరసోదరీమణులారా! . ఒక చిన్న విన్నపము. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖసంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.
ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదం కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోటల్లేదనే బెంగతో వారు క్రుంగిపోతారు.
మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి, ఆదరంగా చేరదీసే తాతా మామ్మలు వారికి దొరకరు. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వారిని ఉంచుకోండి. వృద్ధాశ్రమాలకు పంపకండి, మరువకండి. లేదా మీకూ మీ పెద్దల గతే అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
వివేకానంద యువజన చైతన్య సమితి.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
అమ్మ = ____________
జవాబు.
జనని, తల్లి, మాత
ప్రశ్న 2.
రవి = ____________
జవాబు.
సూర్యుడు, దివాకరుడు, ప్రభాకరుడు
ప్రశ్న 3.
ఇచ్ఛ= ____________
జవాబు.
వాంఛ, ఈప్స, కోరిక
ప్రశ్న 4.
నాన్న = ____________
జవాబు.
తండ్రి, జనకుడు, పిత
ప్రశ్న 5.
స్నేహం = ____________
జవాబు.
నెయ్యం, మైత్రి
నానార్థాలు:
ప్రశ్న 1.
వృద్ధులు = ____________
జవాబు.
ముసలివారు, పెద్దలు
ప్రశ్న 2.
సేవ = ____________
జవాబు.
శుశ్రూష, అనుసరణ, పూజ
ప్రశ్న 3.
పెద్ద = ____________
జవాబు.
వృద్ధుడు, జ్యేష్ఠుడు, గొప్పవాడు.
ప్రశ్న 4.
కాలం = ____________
జవాబు.
సమయం, నలుపు, చావు
ప్రశ్న 5.
క్షమ = ____________
జవాబు.
ఓర్పు, భూమి, ఇష్టం
ప్రశ్న 6.
మిత్రుడు = ____________
జవాబు.
స్నేహితుడు, సూర్యుడు
వ్యుత్పత్త్యర్థాలు:
ప్రశ్న 1.
మిత్రుడు : ____________
జవాబు.
సర్వభూతములయందు స్నేహయుక్తుడు – స్నేహితుడు, సూర్యుడు
ప్రశ్న 2.
దిశ : ____________
జవాబు.
అవకాశమునిచ్చునది, ప్రార్ధక్షిణాది భేదములచే వ్యపదేశింపబడునది – దిక్కు.
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. సింహం- సింగం
2. సహాయం – సాయం
3. నిద్ర – నిదుర
4. యత్నం – జతనం
5. స్వామి – సామి
6. స్నానం – తానం
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
ఆందోళన : ____________
జవాబు.
వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందారు.
ప్రశ్న 2.
ఆరోగ్యం : ____________
జవాబు.
ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు.
ప్రశ్న 3.
ఆదుకోవడం : ____________
జవాబు.
పేద ప్రజలను ఆదుకోవడం మన ధర్మం.
ప్రశ్న 4.
సహాయం : ____________
జవాబు.
వరద బాధితులకు విద్యార్థులు సహాయం చేశారు.
వ్యాకరణాంశాలు:
సంధులు:
ప్రశ్న 1.
నాయనమ్మ =
జవాబు.
నాయన + అమ్మ – అత్వసంధి
ప్రశ్న 2.
మందులిస్తు =
జవాబు.
మందులు + ఇస్తు – ఉత్వసంధి
ప్రశ్న 3.
తెలియనట్లు =
జవాబు.
తెలియని + ఇట్లు – ఇత్వసంధి
సమాసాలు:
సమాసపదం | విగ్రహ వాక్యం | సమాస నామం |
అమ్మానాన్న | అమ్మయును, నాన్నయును | ద్వంద్వ సమాసం |
తొడఎముక | తొడ యొక్క ఎముక | షష్ఠీ తత్పురుష సమాసం |
పెద్ద వయసు | పెద్దదైన వయసు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
ప్రతిరోజు | రోజు రోజు | అవ్యయీభావ సమాసం |
రెండురోజులు | రెండు సంఖ్యగల రోజులు | ద్విగు సమాసం |
భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
మా ఊరి ప్రక్కనే గోదావరి నది ఉన్నది.
జవాబు.
నామవాచకం
ప్రశ్న 2.
మామిడిపండు తియ్యగా ఉంది.
జవాబు.
విశేషణం
ప్రశ్న 3.
అతడు చాలా మంచివాడు.
జవాబు.
సర్వనామం
సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
ప్రశ్న 1.
పరీక్ష చేశాడు. కాలు విరిగిందని చెప్పాడు.
జవాబు.
పరీక్ష చేసి, కాలు విరిగిందని చెప్పాడు.
ప్రశ్న 2.
దగ్గరకు తీసుకున్నది. కన్నీళ్ళు తుడిచింది.
జవాబు.
దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
కఠిన పదాలకు అర్థాలు:
I.
దూప = దప్పిక
నొసలు = నుదురు
గోలీలు = మందులు (టాబ్లెట్లు)
II.
అర్థాలు :
చుట్టాలు = బంధువులు
సంబురం = ఆనందం
III.
అర్థాలు :
ఆందోళన = కలవరం
విషయం = సంగతి
IV.
అర్థాలు:
దవాఖానా = ఆసుపత్రి
ముభావం = ఏమీ పట్టనితనం
ఈర్ష్య = అసూయ, ఓర్వలేనితనం
పాఠం ఉద్దేశం:
వృద్ధులపట్ల సానుకూలవైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మనవల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారిపట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘కథానిక’ ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది.
ప్రవేశిక:
కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబవ్యవస్థ నిలిచి ఉన్నది. “అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితం” అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మ… ఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్న పిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం….
పాఠ్యభాగ సారాంశం:
వృద్ధులపట్ల సానుకూలవైఖరిని ప్రదర్శించాలి. ఇది మన ధర్మం. ఇంట్లో నాయనమ్మ జ్వరంతో బాధపడుతున్నది. కొడుకు, కోడలు సేవచేస్తున్నారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా నాయనమ్మను ఓదారుస్తున్నారు. మనమడు కూడా నాయనమ్మకు సపర్యలు చేస్తున్నాడు. అతని పేరు రవి. నాయనమ్మకు తన మనుమడంటే ఎంతో అభిమానం.
ఒకసారి బంధువులు ఊరి నుండి వచ్చారు. వారిలో శేఖర్ అనేవాడు రవితో సమానమైన వయసు కలవాడు. రవితో బాగా ఆడుకుందాముని అనుకున్నాడు. కాని రవి నాయనమ్మ సేవలో నిమగ్నమయ్యాడు. ఇది శేఖర్కు నచ్చలేదు. దాంతో శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మంచం పక్కన ఉన్నట్టి వస్తువులను తారుమారు చేశాడు.
దాంతో ఆమె వస్తువులను అందుకుంటూ కింద పడింది. కాలు విరిగింది. కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉంది. శేఖర్లో పశ్చాత్తాపం మొదలైంది. తనవల్లే నాయనమ్మకు కాలు విరిగిందని భావించాడు. నాయనమ్మకు జరిగినదంతా చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు. నాయనమ్మ కూడా అతడిని ఓదార్చింది. తప్పును మన్నించింది.
నేనివి చేయగలనా?