Telangana SCERT 7th Class Telugu Guide Telangana Download 11th Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Textbook Questions and Answers.
TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ
చదువండి – ఆలోచించండి- మాట్లాడండి. (TextBook Page No.106)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై వాక్యాలు దేనిగురించి చెప్తున్నాయి ?
జవాబు.
పై వాక్యాలు భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాయి.
ప్రశ్న 2.
దేశం పట్ల ఎటువంటి భావనతో ఉండాలి ?
జవాబు.
దేశంపట్ల మనం జాతీయతా భావనతో ఉండాలి. భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి అవగాహన కలిగియుండాలి.
ప్రశ్న 3.
‘జాతి గౌరవం నిలుపడం’ అంటే మీరు ఏమనుకుంటున్నారు ?
జవాబు.
మనదేశపు గౌరవాన్ని మనము నిలబెడితే మనం జాతి గౌరవాన్ని పెంచినట్లు అవుతుంది అనుకుంటున్నాను.
ప్రశ్న 4.
ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు ?
జవాబు.
ఈ గేయాన్ని గురజాడ అప్పారావుగారు రచించి ఉండవచ్చు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.108)
ప్రశ్న 1.
కవి భారత భూమిని ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ అనడంలో
జవాబు.
మన భారతావని సంపదలతో తులతూగుతున్న దేశం. పాడిపంటలతో ధాన్యరాశిని కురిపిస్తుంది. శ్రమశక్తితో కనకరాశులను వర్షిస్తుంది. ఇటువంటి మనదేశ వైభవాన్ని కొనియాడటానికే కవి దేశాన్ని శ్రీలు పొంగిన జీవగడ్డ అని చెప్పాడు.
ప్రశ్న 2.
భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా కీర్తించబడింది?
జవాబు.
పవిత్ర భారతావనిలో వాల్మీకి వంటి ఋషులు జన్మించారు. గంగ, కృష్ణా, గోదావరి వంటి పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. సకల వేదవాఙ్మయం, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కావ్యాలు ఇక్కడే పుట్టాయి. వీటితో మనదేశ భూమి పావనమైంది. అందుకే కవి భారతావనిని పుణ్యభూమిగా పేర్కొన్నాడు.
ప్రశ్న 3.
మన దేశం గొప్పతనమేమిటి?
జవాబు.
మన దేశం ప్రపంచ దేశాలలోనే ఉత్తమమైనది. భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశాలలో ముఖ్య మైనది. సిరిసంపదలతో అలరారుచున్నది. ధాన్యరాశు లకు, పరాక్రమానికి, సాహిత్యానికి, సంస్కృతికి తక్కువ లేదు. పవిత్రమైన నదులు ఇక్కడే ప్రవహిస్తున్నాయి. వేదవాఙ్మయం ఇక్కడే వెలసింది. అందువలన మన దేశాన్ని ప్రపంచ దేశాలలో ఉత్తమమైనదిగా పేర్కొనవచ్చు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.109)
ప్రశ్న 1.
చెవులకు విందుచేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు ?
జవాబు.
శ్రావ్యమైన సంగీతం వినిపించినప్పుడు, మధురమైన పాటను గానం చేసినప్పుడు చెవులారా విని మానవుడు తన్మయత్వం పొందుతాడు. చెవులకు వింటానికి యోగ్యమైనదాన్నే ‘చెవులకు విందుచేయడం’ అని గ్రహించవచ్చు.
ప్రశ్న 2.
ఎటువంటి పనులు చేసినవారు ధీరపురుషులుగా కీర్తించబడ
జవాబు.
సమాజంలో అసాధారణమైన, అనితర సాధ్యమైన పనులను చేసి, కార్యాలను సాధించినవారినే ధీర వంతులుగా కీర్తిస్తారు. అట్టి ధీరపురుషులు మాత్రమే సమాజంలో ఆదర్శంగా నిలుస్తారు.
ప్రశ్న 3.
భారత వైభవాన్ని ఎందుకు పాడుకోవాలి ?
జవాబు.
మన రాజుల పరాక్రమ చరిత్రలు, మన బానిసత్వం వల్ల నశించాయి. కిన్నెర మీటుతూ, రాళ్ళను కరిగించే రాగంతో, భావి భారతదేశ భాగ్యాన్ని గూర్చి పాడు కోవాలి. నవరసాలతో వీనుల విందుగా కవిత్వం చెప్పిన కవులను గౌరవించాలి.
దేశ గౌరవాన్నీ, దేశ చరిత్రను విస్తరింపచేసిన వీరుపురుషులను కీర్తించాలి. పాండవుల కురుక్షేత్ర యుద్ధాన్ని గూర్చి చక్కని తెలుగు మాటలతో పాడుకోవాలి. కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. చెక్కుచెదరని విజయనగర రాజుల చరిత్రలను పాడుకోవాలి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
ఈ గేయం దేని గురించి చెపుతున్నది ? ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశాలు ఏమేమున్నాయి?
జవాబు.
ఈ గేయము మనదేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చెస్తోంది. భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, వీరులైన రాజుల గూర్చి, భారతదేశం గురించి గానం చేయాలని ఈ గేయం చెస్తోంది.
ప్రశ్న 2.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
మన భారతదేశం సంపదలు, పాడిపంటలు గల భాగ్యదేశం. ఇది వేదాలు, రామాయణం, భారతం, వేదవ్యాసుడు పుట్టిన పుణ్యభూమి. ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి. ఇక్కడ విశాలమైన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ జీవనదులు ప్రవహిస్తున్నాయి.
రాజుల కాలం నాటి మన పరాక్రమ చరిత్రలు, బానిసతనం వల్ల అడుగంటాయి. కిన్నెర మీటుతూ, రాళ్ళను కరిగించే రాగంతో భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. నవరసాలతో వీనులవిందుగా కవితలు అల్లిన కవులను గౌరవించాలి.
దేశ గౌరవాన్నీ, దేశ చరిత్రనూ విస్తరింపజేసిన వీరపురుషులను గూర్చి కీర్తించాలి. పాండవులు భారత యుద్ధాన్ని గూర్చి చక్కని, చిక్కని తెలుగు మాటలతో పాడుకోవాలి. కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని కీర్తించాలి. చెక్కుచెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను పాడుకోవాలి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
ప్రశ్న 1.
ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు.
భరతఖండము, జీవగడ్డ, భాగ్యసీమ, విమలతలము.
ప్రశ్న 2.
ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
అ) మన దేశం వేదాలకు పుట్టినిల్లు
జవాబు.
వేదశాఖలు వెలిస్తె నిచ్చట
ఆ) కాకతీయుల యుద్ధ నైపుణ్యం
జవాబు.
కాకతీయుల కదన పాండితి
ఇ) లేత మాటలు చెవుల కింపుగ
జవాబు.
చివురు పలుకులు చెవుల విందుగ
ఈ) ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
జవాబు.
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
ఉ) నవరసాలు నాట్యమాడాయి.
జవాబు.
నవరసమ్ములు నాట్యమాడగ
III. స్వీయరచన.
ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరులను గురించి తెలుపండి.
జవాబు.
- రాణీ రుద్రమదేవి
- శ్రీకృష్ణదేవరాయలు
- ప్రతాపరుద్రుడు
- పృథ్వీరాజు
- ఝాన్సీ లక్ష్మీబాయి
- శివాజీ.
ఆ) “బానిసతనం” అంటే ఏమిటి ?
జవాబు.
పరాయి వారి పాలనలో జీవించడాన్ని బానిసతనం అంటారు.
ఇ) “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలుపండి.
జవాబు.
‘భరత ఖండం’ సిరులు పొంగిన, జీవమున్న భూమి, పాడిపంటలు పుష్కలంగా కలిగినటువంటిది. వేదాలు, వేదాంగాలు, రామాయణం, మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలగు మహామునులు ఇక్కడే పుట్టారు. కావున ‘భరత ఖండం’ భాగ్యసీమ అని పిలువబడుతోంది.
ఈ) రాయప్రోలు సుబ్బారావుగారిని మీ మాటల్లో పరిచయం చేయండి.
జవాబు.
తెలుగులో దేశభక్తి కవిత్వానికి గురజాడ ఆద్యుడు. అయినా భారతదేశం గొప్పతనాన్ని వర్ణించి చెప్పి మనకు భారత జాతీయాభిమానాన్ని రాయప్రోలు వారు ప్రబోధించారు. మన వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సూత్రాల గొప్పదనాన్ని గూర్చి గుర్తు చేశారు. మన కవుల గొప్పతనాన్ని కీర్తించారు. మనకు మనదేశంపై గౌరవం కలిగించారు.
ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పదేసి పంక్తులలో సమాధానం రాయండి.
అ) భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి ?
జవాబు.
మన భారతదేశం ఎందరో వీరులు, ఋషులు, కవులు, సంగీత విద్వాంసులు, సూత్రకారులు పుట్టిన పుణ్యసీమ. ఇది పాడిపంటలకు నిలయమైనది.
మనదేశం గొప్పదనాన్ని తెలుసుకుంటే మనం కూడా మన పూర్వీకుల వలె ధర్మబద్ధంగా జీవిస్తాము, ధైర్య సాహసాలను చూపి దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటాము. కవిత్వాన్ని, కళలను ఆరాధిస్తాము. జాతీయ భావాలను పెంపొందించుకొని దేశాన్ని ప్రేమిస్తాము. మన దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అందుకోసం భారతదేశ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి.
(లేదా)
ఆ) శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి.
జవాబు.
మన భారతదేశం సంపదలు, పాడిపంటలు గల భాగ్యదేశం. ఇది వేదాలు, రామాయణం, భారతం, వేదవ్యాసుడు పుట్టిన పుణ్యభూమి. ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి. ఇక్కడ విశాలమైన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ జీవనదులు ప్రవహిస్తున్నాయి.
మనదేశంలో వేదాలు, వేదాంగాలు వెలిశాయి. ఆదికావ్యమయిన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొ॥న ఎందరో మునులు ఇక్కడ జన్మించారు.
మనదేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు మనదేశంలోనే ఉన్నాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించబడింది. అందువల్లనే మనదేశం పవిత్రభూమిగా పేరుపొందింది.
IV. సృజనాత్మకత / ప్రశంస.
అ) ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.
జవాబు.
భారతమాత ఆత్మకథ
నేను భారతమాతను. సిరిసంపదలు, పాడిపంటలు గల దానను. నా నేలపైనే వేదవేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది మహాఋషులు నావద్దనే పుట్టారు. నాపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైనే పుట్టాయి.
నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, ప్రజల బానిసతనం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నాపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగురాజుల చరిత్రను గానం చేయాలి.
(లేదా)
ఆ) మనదేశం గొప్పతనం గురించిన గేయం గురించి తెల్సుకున్నారు కదా ! అట్లాగే మీ ఊరు గొప్పదనం గురించి ఒక గేయం రాయండి.
జవాబు.
మా ఊరు గురించి గేయం
సిరులు పొంగిన సీమరాయది
పాడిపంటల భాగ్యసీమది
పూలవనముల పొంగురాయది
కన్నతల్లిర “కడియమూ”
“జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లెపూవులు మొల్ల తోటలు
నిండియున్నవి దండిగా”
“గలగలలతో కాల్వ జలములు
గాలి కూగె కలమ సస్యము
విందు చేసే ప్రేమపాటలు
కలసి యుండెడి కడియము”
కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతయు
వర్తకమ్మున భాగ్యసంపద
మరపురానిది “మాపురం”
V. పదజాల వినియోగం.
1. కింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి.
అ) ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తుంటారు.
జవాబు.
అడవులు
ఆ) మనందరం భూతలం మీద నివసిస్తున్నాం.
జవాబు.
పైభాగం
ఇ) ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
జవాబు.
కలయిక, కూర్పు
ఈ) తేనెటీగలు మధువును ఇస్తాయి.
జవాబు.
తేనె
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలను గేయం నుంచి తీసి రాయండి.
అ) అధిక సంపదలు కలిగినవారి కంటే గుణవంతులే గొప్ప.
జవాబు.
శ్రీలు
ఆ) మనదేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది.
జవాబు.
దాస్యము
ఇ) మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి.
జవాబు.
క్రాంత హృదయులు
ఈ) వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది.
జవాబు.
కాక
3. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి.
అ) విపినాలలో- క్రూర జంతువులుంటాయి. ఆ అరణ్యాలలోనే మునులు నివసిస్తారు.
జవాబు.
విపినాలు = అరణ్యాలు
ఆ) ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ నేలమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
జవాబు.
ధరణి = గడ్డ, వీరులు పౌరుషవంతులు
ఇ) గొప్పవారి సేవలు చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
జవాబు.
కలకాలం = ఎల్లప్పుడూ
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది వాక్యాలను చదువండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
ఉదా : ఈ శిల్పం ఎంత అందంగా ఉందో ! – ఆశ్చర్యార్థక వాక్యం
అ) పనిని త్వరగా పూర్తిచేయాలి.
జవాబు.
విధ్యర్థక వాక్యం
ఆ) చుట్టాలు ఎప్పుడు వస్తారు.
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఈ పుస్తకం వెల ఎంత.
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం
ఈ) పాఠం అందరూ చదువుకొని రండి.
జవాబు.
విధ్యర్థక వాక్యం
ఉ) మీరు నానుండి తెలుసుకోండి.
జవాబు.
విధ్యర్థక వాక్యం
కింది వాక్యాలను చూద్దాం.
- వారు చదువుకోవాలని నేను వేడుకొంటున్నాను.
- మిమ్ములను నేను ప్రార్థిస్తున్నాను.
- దయచేసి మీరు రావాలి.
ఈ మూడు వాక్యాల్లో ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లు ఉన్నది. ఇట్లా ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యం ‘ప్రార్థనార్థక వాక్యం’.
- నేను ఉన్నత చదువు చదువగలను.
- నడిచి వెళ్ళగలను.
- భయం లేకుండా మాట్లాడగలను.
ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనబడుతున్నాయి. సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యం ‘సామర్థ్యార్థక వాక్యం’.
- అతడు వస్తాడో ? రాడో ?
- రేపు వర్షం పడవచ్చు.
- ఈ రోజు ఎండ కాస్తుందో ? లేదో ?
ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది. పని జరుగుతుందో లేదో అనే ‘సందేహం’ కలిగేటట్లున్న వాక్యం “సందేహార్థక వాక్యం”.
- లోపలికి రావచ్చు.
- కొద్దిసేపు టీవీ చూడవచ్చు.
- మీరు వెళ్ళవచ్చు.
అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి ‘అనుమత్యర్థక వాక్యాలు’.
ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం ‘అనుమత్యర్థక వాక్యం’.
- ఇతరులను ఎగతాళి చేయవద్దు.
- నీటిని వృథా చేయవద్దు.
- ఎక్కువసేపు నిద్రపోవద్దు.
ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెబుతున్నవి (నిషేధిస్తున్నవి). కనుక ఇవి ‘నిషేధార్థక వాక్యాలు’.
ఒక పనిని చేయవద్దనే (నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం ‘నిషేధార్థక వాక్యం’.
2. కింది వాక్యాలను చదువండి. అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
అ) అట్లా అనుకోకండి.
జవాబు.
నిషేదార్థక వాక్యం
ఆ) నేను చెప్పింది విన్నారో ! లేదో !
జవాబు.
సందేహార్థక వాక్యం
ఇ) ఈ సంవత్సరం వర్షాలు పడుతాయో ! లేదో !
జవాబు.
సందేహార్థక వాక్యం
ఈ) మీరెప్పుడైనా రావచ్చు.
జవాబు.
అనుమత్యర్థక వాక్యం
ఉ) అనుమతి లేకుండా లోనికి రావద్దు.
జవాబు.
నిషేదార్థక వాక్యం
ఊ) మీరు భోజనానికి వెళ్ళవచ్చు.
జవాబు.
అనుమత్యర్థక వాక్యం
ఋ) అబ్బ ! ఎంత వర్షం కురిసింది.
జవాబు.
ఆశ్చార్యార్థక వాక్యం
ౠ) మనసు పెట్టి వినండి.
జవాబు.
సామాన్యర్థక వాక్యం
ప్రాజెక్టు పని:
భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
1. ‘వందేమాతరం’ గేయం (బెంగాలీ భాషలో బంకించంద్ర ఛటర్జీ వ్రాసినది)
వందేమాతరం, వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం; వందేమాతరం
శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
2. ‘జనగణమన’ ఇది మన జాతీయ గీతం (రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసినది)
జనగణమన అధినాయక జయహే !
భారత భాగ్య విధాతా !
పంజాబ సింధ్ గుజరాత మరాఠా,
ద్రావిడ ఉత్కళ వంగా !
వింధ్య హిమాచల యమునా గంగా,
ఉచ్ఛల జలధి తరంగా !
తవ శుభనామే జాగే !
తవ శుభ ఆశిష మాగే !
గాహే తవ జయ గాథా !
జనగణ మంగళదాయక జయహే !
భారత భాగ్య విధాతా !
జయహే ! జయహే ! జయహే !
జయ జయ జయ జయహే !
TS 7th Class Telugu 11th Lesson Important Questions శ్రీలు పొంగిన జీవగడ్డ
II. స్వీయరచన
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
‘తెలుంగు నాథుల పాట పాడవె చెల్లెలా !’ అని ఆ కవి అన్నారు కదా ! మన ఆంధ్రదేశాన్ని పాలించిన తెలుగురాజుల వంశాల పేర్లు మీకు తెలిసినవి రాయండి.
జవాబు.
తెలుగుదేశం తేనెలొలుకు తియ్యని భాష కల్గిన దేశం. ఈ నేల ఎందరో రాజవంశాల రాజులు పరిపాలించి చరిత్ర సృష్టించారు. వారిలో ప్రధానంగా శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్యులు, విష్ణుకుండినులు, పల్లవులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు ఇలా ఎన్నో వంశాలు మనదేశాన్ని పాలించాయి.
ప్రశ్న 2.
వేదాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు.
వేదాలు నాలుగు. అవి :
- ఋగ్వేదం
- యజుర్వేదం
- సామవేదం
- అధర్వణ వేదం
ప్రశ్న 3.
పాండవులు ఎవరు ? వారి పేర్లేమిటి ?
జవాబు.
పాండురాజు కుమారులు పాండవులు. వీరు ఐదుగురు. వారు :
- ధర్మరాజు
- భీముడు
- అర్జునుడు
- నకులుడు
- సహదేవుడు
ప్రశ్న 4.
నవరసాలు ఏవి ?
జవాబు.
నవ అనగా తొమ్మిది. తొమ్మిది రసాలు. అవి :
- శృంగార రసం
- హాస్య రసం
- కరుణ రసం
- వీర రసం
- అద్భుత రసం
- భయానక రసం
- బీభత్స రసం
- రౌద్ర రసం
- శాంత రసం
IV. భాషాంశాలు:
పదజాలం:
నానార్థాలు:
ప్రశ్న 1.
శ్రీ = ______________
జవాబు.
సంపద, సాలెపురుగు, విషం
ప్రశ్న 2.
పాలు = ______________
జవాబు.
క్షీరం, భాగం, వంశం
ప్రశ్న 3.
శాఖి = ______________
జవాబు.
చెట్టు, వేదం
ప్రశ్న 4.
బాదరాయణుడు = ______________
జవాబు.
వ్యాసుడు, నిష్ప్రయోజకుడు, వెట్టివాడు
ప్రశ్న 5.
పదము = ______________
జవాబు.
అడుగు, శబ్దము, కాలి అడుగుజాడ, పద్యపాదం
ప్రశ్న 6.
రసము = ______________
జవాబు.
కషాయాది రుచి, అనురాగం, పసరు
ప్రశ్న 7.
తేజము =
జవాబు.
ప్రకాశం, పరాక్రమం, బలం, అగ్ని
ప్రశ్న 8.
భంగము = ______________
జవాబు.
అల, మోసం, చెల్లాచెదరు
వ్యుత్పత్త్యర్థాలు:
ప్రశ్న 1.
శ్రీ = ______________
జవాబు.
విష్ణువును ఆశ్రయించునది (లక్ష్మి)
ప్రశ్న 2.
కావ్యం = ______________
జవాబు.
కవి యొక్క కర్మము (గ్రంథం)
ప్రశ్న 3.
ఉపనిషత్తు = ______________
జవాబు.
(ఉప – ని – సత్) గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినది (బ్రహ్మ విద్య) ప్రతిపాదకములు, బ్రహ్మజ్ఞానోపదేశ సర్వస్వం.
ప్రశ్న 4.
పాండవేయులు = ______________
జవాబు.
పాండు రాజు కుమారులు (పాండవులు)
ప్రశ్న 5.
బాదరాయణుడు = ______________
జవాబు.
బదరీవనం నివాసంగా కలవాడు (వ్యాసముని)
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
శ్రీ – సిరి
పీఠం – పీట
గౌరవం – గారవం
కవి – కయి
పురము – ప్రోలు
నాట్యం – నట్టువ
భక్తి – బత్తి
ఋషి – రుసి
యుగము – ఉగము
దాస్యము – దవనం (కొలువు)
చిత్రం – చిత్తరువు
హృదయం – ఎద, ఎడద
కథా – కద, కత
గర్వము – గరువము
కిన్నరా – కిన్నెర
కవిత – కైత
చిత్రం – చిత్తరువు
భంగము – బన్న (మోసం)
భాగ్యం – బాగ్గెం
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
భాగ్యసీమ = ______________
జవాబు.
భాగ్యసీమ = సంపన్న దేశం
భారతదేశం పాడిపంటలు గల భాగ్యసీమ.
ప్రశ్న 2.
కలకాలం = ______________
జవాబు.
కలకాలం = అన్ని కాలాలు
కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే చేవగల పలుకులతో పాడుకోవాలి.
వ్యాకరణాంశాలు:
సంధులు:
ప్రశ్న 1.
దేశము + ఏగినా = ______________
జవాబు.
దేశమేగినా = ఉత్త్వసంధి
ప్రశ్న 2.
కాలు + ఇడినా = ______________
జవాబు.
కాలిడినా = ఉత్త్వసంధి
ప్రశ్న 3.
విద్య + ఆలయం = ______________
జవాబు.
విద్యాలయం = సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 4.
దేశము + అరసన = ______________
జవాబు.
దేశమరసిన = ఉత్త్వసంధి
ప్రశ్న 5.
రాగము + ఎత్తీ = ______________
జవాబు.
రాగమెత్తీ = ఉత్త్వసంధి
ప్రశ్న 6.
లోకము + అంతకు = ______________
జవాబు.
లోకమంతకు = ఉత్త్వసంధి
సమాసాలు:
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
ఉస్మానియా విశ్వవిద్యాలయం | ఉస్మానియా అనుపేరు గల విశ్వవిద్యాలయం | సంభావనా పూర్వపద కర్మధారయ |
వేదశాఖలు | వేదము యొక్క శాఖలు | షష్ఠీ తత్పురుష సమాసం |
ఆదికావ్యం | ఆదిదైన కావ్యం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
పదునుకత్తులు | పదునైన కత్తులు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
దేశచరితం | దేశము యొక్క చరితం | షష్ఠీ తత్పురుష సమాసం |
ఉపనిషన్మధువు | ఉపనిషత్తులు అనే తెనె | రూపక సమాసం |
శుద్దవాసన | శుద్ధమైన (నిర్మల) పరిమళం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
1. భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
దేశం పట్ల మనం జాతీయతా భావనతో ఉండాలి.
జవాబు.
సర్వనామం
ప్రశ్న 2.
పాల తీయని భావి భారత పదము పాడరా తమ్ముడా !
జవాబు.
విశేషణం
2. సమాపక, అసమాపక క్రియలను గుర్తించండి.
ప్రశ్న 1.
అనితర సాధ్యమైన పనులు చేసి, కార్యాలను సాధించిన వారు ధీరవంతులు.
జవాబు.
అసమాపక క్రియ = చేసి
ప్రశ్న 2.
నవరసాలతో వీనులవిందుగా కవిత్వం చెప్పిన కవులను గౌరవించాలి.
జవాబు.
సమాపక క్రియ = గౌరవించాలి.
గేయానికి అర్థాలు – భావాలు:
I.
1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా!
అర్థాలు :
శ్రీలు = సంపదలు
పొంగిన = ఉప్పొంగిన
జీవగడ్డయి (జీవగడ్డ + అయి) = చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమియై
పాలు పారిన = పాలు ప్రవహించిన
భాగ్యసీమయి (భాగ్యసీమ + అయి) = భాగ్యభూమిఅయి
ఈ భరత ఖండము = ఈ మన భారతదేశం
వరలినది = వర్ధిల్లింది
తమ్ముడా = సోదరా
భక్తి పాడర = ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో గానం చెయ్యి
భావం :
తమ్ముడా ! మన భారతదేశం సిరులు పొంగిన జీవభూమి. ఇది పాడిపంటలు గల భాగ్యసీమ. ఇటువంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.
2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
ఇచ్చట = ఈ భారతదేశంలో
వేదశాఖలు = వేదాంగములు
వెలిసెన్ = వెలిశాయి
ఇచ్చట = ఈ భారతదేశంలోనే
ఆదికావ్యంబు = మొదటి కావ్యమైన వాల్మీకి రామాయణము
అలరెన్ = పుట్టింది.
బాదరాయణ = వ్యాసుడు మొదలయిన
పరమ ఋషులకు = గొప్పవారయిన ఋషులకు
ఇది = ఈ భారతదేశము
పాదు సుమ్ము = మూలము సుమా !
భావం:
చెల్లెలా ! వేదములు వేదాంగాలు ఈ దేశంలోనే వెలిశాయి. ఆదికావ్యము అయిన రామాయణము ఇక్కడే పుట్టింది. మహాభారతము, భాగవతము రచించిన వేదవ్యాసుడు మొదలయిన మహర్షులు ఈ పుణ్యభూమిలోనే జన్మించారు.
3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమలతల మిదె తమ్ముడా !
అర్థాలు :
ఇచ్చట = ఈ భరత భూమిలో
విపిన = అడవులతో
బంధుర = దట్టమైన
వృక్షవాటిక = చెట్లతోటలు
ఇచ్చట = ఇక్కడ
ఉపనిషత్ + మధువు = ఉపనిషత్తులు అనే తేనె
ఒలికెన్ = చిందింది
తమ్ముడా = ఓ సోదరా
ఇదె = ఇది
విపుల = విస్తారమైన
తత్త్వము = తత్త్వజ్ఞానము
విస్తరించిన = వ్యాపించిన
విమల = నిర్మలమైన
తలము = చోటు
భావం :
తమ్ముడా ! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలు ఉన్నాయి. మధురమైన ఉపనిషత్తులు . ఇక్కడే పుట్టాయి. ఇది వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రభూమి.
4. సూత్రయుగముల శుద్దవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్రదాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెను చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
సూత్రయుగముల = నీతి ధర్మములను బోధించే సూత్ర గ్రంథములు రచించిన కాలము నాటి
శుద్ధవాసన = నిర్మలమైన పరిమళము
క్షాత్రయుగముల = మహారాజులు పాలించిన కాలము నాటి
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత
చిత్ర దాస్యముచే = మనం పరాయి రాజుల వద్ద చేసిన బానిసతనముచే
చరిత్రల = చరిత్రల నుండి
చెఱిగిపోయెను = అంతరించి పోయాయి
భావం:
ధర్మసూత్ర గ్రంథాలు చెప్పిన కాలం నాటి గొప్పతనం, రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలూ పరదేశీయుల క్రింద ‘బానిసతనము వల్ల అంతరించిపోయాయి.
5. మేలికిన్నెర మేళవించీ
కిన్నెర మేళవించే
రాలు కరగగ రాగమెత్తి
పాలతీయని భావిభారత
పదము పాడర తమ్ముడా!
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
మేలి = శ్రేష్ఠమైన
కిన్నెర = కిన్నెరల వీణ వంటి వీణను
మేళవించే = జతపరిచి
రాలు = రాళ్ళు
కరుగగ = కరిగేటట్లు
రాగము + ఎత్తీ = సంగీతరాగము బిగ్గరగా తీసి
పాలతీయని = పాలవలె తియ్యని
భావిభారతపదము = రాబోయే కాలంలోని భారతదేశ భాగ్యాన్ని గూర్చి
పాడర = పాడవోయి
భావం :
సోదరా ! కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో, బిగ్గరగా గొంతెత్తి, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాట పాడు.
II
6. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన క్రాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
అర్ధాలు:
చెల్లెలా = సోదరీ !
నవరసమ్ములు = శృంగారము మొదలయిన తొమ్మిది రసములు
నాట్యము + ఆడగ = చిందులు వేసేటట్లు
చివురు పలుకులు = చిగుళ్ళ వంటి మాటలు
చెవుల విందుగ = వినడానికి సంతోషంగా ఉండేటట్లు
కవితలు + అల్లిన = కవిత్వములు రచించిన
క్రాంత + హృదయములన్ = ఇంద్రియములకు గోచరము కాని వాటిని మనస్సుతో గ్రహించగల (సర్వజ్ఞులను)
గారవింపవె = గౌరవింపుము
భావం :
నవరసాలతో నిండిన, చిగుళ్ళవంటి మృదువైన తేటతెలుగు మాటలతో చెవులకు ఇంపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.
7. దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
దేశ గర్వము = దేశము యొక్క గర్వము
దీప్తి చెందగ = ప్రకాశించేటట్లుగా
దేశ చరితము = దేశము యొక్క చరిత్ర
తేజరిల్లగ = విస్తరించేటట్లుగా
దేశము + అరసిన = దేశాన్ని కాపాడిన
ధీరపురుషుల = వీరులయిన వ్యక్తులను గురించి
తెలిసి = తెలుసుకొని
పాడర = పాడుము
భావం :
దేశ గౌరవం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా, దేశాన్ని కాపాడిన వీర పురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి.
8. పాండవేయుల పదును కత్తులు
మండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
పాండవేయుల = పాండురాజు కుమారులైన
పదును కత్తులు = పాండవుల పదునైన కత్తులు
మండి మెఱసిన = ప్రజ్వలించి తళతళలాడిన
మహిత = ప్రసిద్ధికెక్కిన
రణకథ = భారతయుద్ధ గాథను
కండగల = సారవంతమైన
చిక్కని = గట్టి
తెలుంగులన్ = తెలుగు పలుకులతో
కలసి = అందరూ కలసి
పాడవె = పాడుకోవాలి
భావం :
సోదరీ ! పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్రంలో జరిగిన భారత యుద్ధాన్ని గురించి, చక్కని, చిక్కని తెలుగు పదాలతో అందరూ కలసి పాడుకోవాలి.
9. లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా !
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
లోకము + అంతకు = ప్రపంచానికి అంతటికీ
కాక పెట్టిన = వేడి పుట్టించిన
కదన పాండితి = యుద్ధ నైపుణ్యాన్ని
చీకిపోవని = చితికిపోని
చేవపదములన్ = శక్తిగల మాటలతో
చేర్చి = కలిపి
పాడర = పాడుకోవాలి
భావం :
ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే చేవగల పలుకులతో పాడుకోవాలి.
10. తుంగభద్రాభంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడనీ తెలుంగునాథుల
పాట పాడవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
తుంగభద్రా = తుంగభద్రా నది యొక్క
భంగములతో = అలలతో
పొంగి = ఉప్పొంగి
నింగిని = ఆకాశాన్ని
పొడిచి = తాకి
త్రుళ్ళి = చెక్కు చెదరి
భంగపడని = చెల్లా చెదరు కాని
తెలుంగు నాథుల = తెలుగు ప్రభువులైన విజయనగర చక్రవర్తులకు సంబంధించిన
పాట = పాటను
పాడవె = పాడు
భావం :
తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి, ఆకాశాన్ని అంటినా చెక్కుచెదరని ధైర్యంగల తెలుగు రాజులయిన విజయనగర ప్రభువుల చరిత్రలను గానం చేయాలి.
పాఠం ఉద్దేశం:
భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత. మన దేశగౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం. మనదేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘గేయ’ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రాఛందస్సులో, రాగయుక్తంగా, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
కవి పరిచయం:
పాఠ్యభాగ కవి : శ్రీ రాయప్రోలు సుబ్బారావు
కాలం : 13.03.1892 – 30.6.1984(జననం – మరణం)
జన్మస్థలం : గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం
రచనలు : తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలయినవి భావ కవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు. ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు.
ఇతర విశేషాంశాలు : ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ తొలి ఆచార్యులుగా పనిచేశారు.
ప్రవేశిక:
భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాఙ్మయం ఉపనిషత్తులు సమాజానికి దివ్యమార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీసంపద, కవిత్వం, నాట్యరీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మన దేశపు ఘనత ఎంతో విశిష్టమైనవి.
నేనివి చేయగలనా?