TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

Telangana SCERT 6th Class Telugu Study Material Telangana ఉపవాచకం 1st Lesson సోమనాద్రి Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide Upavachakam 1st Lesson సోమనాద్రి

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
హనుమప్పనాయుణ్ణి గురించి సొంతమాటల్లో రాయండి. (లేదా) హనుమప్పనాయుడి స్వామిభక్తిని తెలపండి.
జవాబు.
హనుమప్పనాయుడు గద్వాలకు పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘బొచ్చెంగన్నపల్లి’ నుంచి వచ్చి సోమనాద్రి సైన్యంలో చేరిన బోయసర్దారు. అతడు గొప్ప స్వామిభక్తి పరాయణుడు. స్వామికార్యం నెరవేర్చటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయనట్టివాడు. సోమనాద్రి గుర్రాన్ని నిజాం నవాబు వశపరచుకున్నప్పుడు ఆ గుర్రాన్ని తెల్లవారే లోపల తేవడానికి సిద్ధపడినట్టివాడు. శత్రువులకు అనుమానం రాకుండా ఉండటానికై జొన్న చొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించినట్టి వివేకవంతుడు.

ఒక సిపాయి పాతిన గూటం తన అరచేతిని చీల్చుకొని భూమిలోకి పాతుకు పోయినా ఓర్పు వహించినట్టి వాడు హనుమప్పనాయుడు. స్వామికార్యం కోసం తన చేతిని తానే నరుక్కుని గుర్రంతో సహా సోమనాద్రి ఎదుట ప్రత్యక్షమైన వాడు హనుమప్పనాయుడు. అతడు స్వామికార్యం నెరవేర్చి సోమనాద్రి గుర్రం ఒక దినం తిరిగినంత భూమిని ఇనాముగా పొందినట్టివాడు.

ప్రశ్న 2.
సోమనాద్రి గొప్ప వీరుడే కాకుండా, సమయస్ఫూర్తి కలిగినవాడని ఎలా చెప్పగలరు?
జవాబు.
సోమనాద్రి మొదట ‘పూడూరు’ రాజధానిగా పాలించాడు. గద్వాల అరణ్య ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమైందిగా భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. ‘ఉప్పేడు’ కోట అధిపతి దావూద్ మియా సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని, అందువల్ల కోట కట్టడానికి వీలులేదని అడ్డు చెప్పాడు.

అప్పుడు కార్యసాధకుడు, సమయస్ఫూర్తి గల సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తికాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. సోమనాద్రి కోటను నిర్మించి కప్పం చెల్లించకుండా దావూర్పై యుద్ధానికి సిద్ధపడ్డాడు.

మరోసారి ‘నిడుదూరు’ యుద్ధరంగంలో కూడా సోమనాద్రి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. కర్నూలు కోటలోపలికి ప్రవేశించినపుడు సోమనాద్రి కొద్దిసైన్యంతోటే అల్లకల్లోలం సృష్టించి తప్పించుకున్నాడు. తెల్లవారితే ఇంకేం చేస్తాడో అని సయ్యద్ దావూద్ మియా పక్షం వారంతా భయపడిపోయారు. సోమనాద్రితో సంధి చేసుకోవడం మంచిదని నిజాం నవాబుకు అందరూ నచ్చచెప్పారు.

ఆయన కూడా మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి వద్దకు రాయబారిని పంపాడు. సోమనాద్రి సమయస్ఫూర్తితో ఆ సంధికి అంగీకరించాడు. కాబట్టి సోమనాద్రి గొప్ప వీరుడే కాకుండా, సమయస్ఫూర్తి కలిగినవాడని చెప్పవచ్చు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

ప్రశ్న 3.
సోమనాద్రి గుణశీలాలు రాయండి.
జవాబు.
సోమనాద్రి గద్వాల కోటకు అధిపతి, మహావీరుడు. గద్వాల కోట నిర్మాత. సోమనాద్రి ఆరడుగుల ఎత్తు గల గంభీర విగ్రహం. దృఢమైన నల్లని శరీరం కలవాడు. సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగిన వాడు. మిత్రులకు గంభీరంగా, శత్రువులకు ప్రళయకాల రుద్రుని లాగా కనిపించేవాడు. అతని ప్రత్యేక వాహనం ఒక గొప్ప తెల్లని గుర్రం. అతడు దానిపై స్వారీ చేస్తూ, యుద్ధరంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.

సోమనాద్రి గద్వాల అరణ్య ప్రాంతంలో కోట నిర్మాణం చేపట్టాడు. అప్పుడు ‘ఉప్పేడు’ కోట అధిపతి దావూద్ మియా అడ్డుచెప్పగా, అతనికి కప్పమిస్తానని చెప్పి తన కార్యాన్ని నేర్పుగా ముగించిన కార్యసాధకుడు సోమనాద్రి. కోట నిర్మాణం పూర్తయిన తరువాత కప్పం చెల్లించకుండా యుద్ధాన్ని ప్రకటించి దావూద్ మియాను వశపరచుకొన్నవాడు.

శత్రువుల అధీనంలో ఉన్న తన గుర్రాన్ని తీసుకొని వచ్చిన హనుమప్పనాయుడికి, తాను అన్నమాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత భూమిని ఇనాముగా ఇచ్చిన గొప్పదాత సోమనాద్రి.

ప్రశ్న 4.
సోమనాద్రి గద్వాల కోటను ఎట్లా నిర్మించాడు ?
జవాబు.
సోమనాద్రి ‘పూడూరు’ను రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేటి గద్వాల పట్టణం ఆ కాలంలో అరణ్యంలా ఉండేది. ఒకసారి సోమనాద్రి వేటకు పోయి ఆ ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అనుకూలమైందని భావించాడు. వెంటనే అక్కడ కోట కట్టడం ప్రారంభించాడు.

ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న ‘ఉప్పేడు’ కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అతడు నిజాం నవాబుకు ఆప్తుడు. దావూద్ మియా, సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని, అందువల్ల కోట కట్టడానికి వీలు లేదని అడ్డు చెప్పాడు. సోమనాద్రి కార్యసాధకుడు. అతడు దావూద్ మియాతో కోట కట్టిన తరువాత కప్పం చెల్లిస్తానని చెప్పి, అతనిని ఒప్పించి కోటను నిర్మించాడు.

చదువడం – అవగాహన చేసుకోవడం

I. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సోమనాద్రికి ‘పెద్ద సోమభూపాలుడు’ అనే ప్రసిద్ధ నామం కూడా ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ, పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ, గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను పొందినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని.

గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. ఈ విధంగా గద్వాల సంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తు గల గంభీరవిగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు గంభీరంగా, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రం మీద స్వారిచేస్తూ, యుద్ధరంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.

ప్రశ్నలు.

ప్రశ్న 1.
సోమనాద్రికి గల ప్రసిద్ధ నామము ఏది ?
జవాబు.
సోమనాద్రికి గల ప్రసిద్ధ నామము ‘పెద్ద సోమభూపాలుడు’.

ప్రశ్న 2.
సోమనాద్రి కాలాన్ని తెలపండి.
జవాబు.
సోమనాద్రి క్రీ.శ. 1750 ప్రాంతంవాడు.

ప్రశ్న 3.
గద్వాల కోటను నిర్మించింది ఎవరు ?
జవాబు.
గద్వాల కోటను నిర్మించింది సోమనాద్రి.

ప్రశ్న 4.
గద్వాల సంస్థానం దేనికి చేయూతనిచ్చింది ?
జవాబు.
గద్వాల సంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది.

ప్రశ్న 5.
సోమనాద్రి దేని మీద స్వారి చేస్తుండేవాడు ?
జవాబు.
సోమనాద్రి తెల్లని గొప్ప జాతి గుర్రం మీద స్వారి చేస్తుండేవాడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

II. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని లొంగదీసుకొనే ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడొక సర్దారు, “సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది, దాన్ని వశం చేసుకొంటేగాని అతడు వశం కాడు,” అని వివరించాడు.. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు. “తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు ఇస్తను” అని ప్రకటించాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
సోమనాద్రి పరాక్రమాన్ని చూసి కలవరపడింది ఎవరు ?
జవాబు.
సోమనాద్రి పరాక్రమాన్ని చూసి నిజాం నవాబు కలవరపడ్డాడు.

ప్రశ్న 2.
నిజాం నవాబు దర్బారు చేసి ఏం చెప్పమన్నాడు ?
జవాబు.
నిజాం నవాబు దర్బారు చేసి సోమనాద్రిని లొంగదీసుకొనే ఉపాయం చెప్పమన్నాడు.

ప్రశ్న 3.
సోమనాద్రి శక్తి ఎందులో ఉన్నది ?
జవాబు.
సోమనాద్రి శక్తి అతని గుర్రంలో ఉన్నది.

ప్రశ్న 4.
నిజాం నవాబు ఏమని ఆలోచించాడు ?
జవాబు.
నిజాం నవాబు ఎట్లాగైనా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు.

ప్రశ్న 5.
నిజాం నవాబు ఏమని ప్రకటించాడు ?
జవాబు.
“తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని చ్చేవారికి జాగీరు ఇస్తను” అని ప్రకటించాడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

III. కింది పేరాను చదువండి. అయిదు ప్రశ్నలు తయారుచేయండి.

గద్వాలకు పదిమైళ్ళ దూరంలో ‘బొచ్చెంగన్నపల్లి’ అనే గ్రామం ఉన్నది. అక్కడినుంచి వచ్చిన బోయపడ్డారు హనుమప్పనాయుడు ఈ విషయం తెలుసుకొన్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్నచొప్పను ఒక మోపు కట్టి నెత్తిన పెట్టుకొని “జాం డేరాలను సమీపించాడు. ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేకానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రం కోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్పు. ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది. గుర్రం కూడా హనుమప్పను చూసి సకిలించింది.

జవాబు.
ప్రశ్నలు తయారుచేయుట :
1. ‘బొచ్చెంగన్నపల్లి’ అనే గ్రామం ఎక్కడ ఉన్నది?
2. గద్వాల నుండి వచ్చిన బోయసర్దారు పేరేమిటి ?
3. అతడు డేరాలను ఎలా సమీపించాడు ?
4. మోపును ఎంతకు అమ్మదలచాడు ?
5. గుర్రం ఎవరిని చూసి సకిలించింది ?

IV. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ‘నిడుదూరు’కు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న ‘కలుగోట్ల’ గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టంలేని సోమనాద్రే మొదట తన సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు భయంకరంగా యుద్ధం చేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దాటి ‘కలుగోట్ల’ ను చేరి విశ్రమించాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
నిజాం సైన్యం ఎక్కడ విడిది చేసింది ?
జవాబు.
నిడుదూరు

ప్రశ్న 2.
సోమనాద్రి సైన్యం ఎక్కడ విడిది చేసింది ?
జవాబు.
కలుగోట్ల

ప్రశ్న 3.
ఆ గ్రామాల్లో వేటి ఆనవాళ్ళు ఇప్పటికీ దర్శనమిస్తాయి ?
జవాబు.
ఆనాటి యుద్ధపు ఆనవాళ్ళు

ప్రశ్న 4.
నిజాం సైన్యాన్ని ముట్టడించిందెవరు ?
జవాబు.
సోమనాద్రి

ప్రశ్న 5.
సోమనాద్రి తన సైన్యాన్ని మరల్చి, ఎక్కడ విశ్రమించాడు ?
జవాబు.
కలుగోట్ల

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

V. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

గుర్రాన్ని చూసిన హనుమప్పనాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంతసేపటికి ఒక వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగా (అశ్వశాల)లో ఉన్న గడ్డికుప్ప కిందికి దూరాడు. వెల్లకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్ళకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్పనాయుడి అరచేతిని చీల్చుకుని ఆ గూటం భూమిలోకి పాతుకుపోయింది. నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామికార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు హనుమప్ప.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
చొప్పను విక్రయించిందెవరు ?
జవాబు.
హనుమప్పనాయుడు

ప్రశ్న 2.
గుర్రం దేనిని ఊడబెరికింది ?
జవాబు.
గూటం

ప్రశ్న 3.
సిపాయి పాతిన గూటం హనుమప్ప శరీరంలో ఏ భాగంలో దిగింది ?
జవాబు.
అరచేతిలో

ప్రశ్న 4.
గుర్రం ఎందుకు గూటం ఊడబెరికింది ?
జవాబు.
హనుమప్ప కనబడకపోవడం చేత

ప్రశ్న 5.
హనుమప్ప ఆ బాధను ఎందుకు ఓర్చుకున్నాడు ?
జవాబు.
స్వామి కార్యానికి భంగం కలుగుతుందని భావించడం చేత

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

సారాంశం:

సోమనాద్రి మొదట ‘పూడూరు’ ను రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత దావూద్ మియాకు సంబంధించిన అరణ్య ప్రాంతంలో గద్వాల కోటను నిర్మించాడు. దావూద్ మియాకు కప్పం చెల్లిస్తానని చెప్పి చెల్లించకుండా యుద్ధాన్ని ప్రకటించాడు. ‘ఆరగిద్ద’ వద్ద ఉభయ సైన్యాలకూ గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమనాద్రిని ఎదుర్కోలేక భయపడి దావూద్ మియా అతనిని శరణు కోరాడు. తన యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించాడు.

సోమనాద్రి గద్వాల కోటపై పచ్చజెండా ఎగురవేశాడు. దాన్ని చూడగానే దావూద్ మియాకు కోపం మండిపోయింది. ఎలాగైనా తన యుద్ధ చిహ్నాలను వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. నిజాం నవాబు సహాయంతో సోమనాద్రిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. ‘నిడుదూరు’ యుద్ధరంగం. సోమనాద్రి విజయానికి కారణం అతని గుర్రమని నిజాం నవాబు తెలుసుకొని దానిని అపహరింపజేశాడు. కానీ సోమనాద్రి హనుమప్పనాయుని పంపి తన గుర్రం తిరిగి తెచ్చుకున్నాడు. ఆ సాహసకార్యంలో చేయి పోగొట్టుకొన్న హనుమప్పనాయునికి సోమనాద్రి ఉదారంగా తన గుర్రం ఒకరోజు తిరిగినంత భూమిని ఇనాముగా ఇచ్చాడు.

గుర్రం తిరిగి వచ్చిన ఉత్సాహంతో సోమనాద్రి తన సైన్యాన్ని వెంట బెట్టుకొని నిజాం సైన్యం మీద విరుచుకు పడ్డాడు. చివరికి సోమనాద్రి పరాక్రమానికి భయపడిపోయి నిజాం నవాబు ఒక రాయబారిని పంపి సోమనాద్రితో సంధి కుదుర్చుకున్నాడు. యుద్ధ పరిహారంగా ‘ఎల్లమ్మ’ ఫిరంగిని ‘రామ, లక్ష్మణ’ అనే రెండు ఫిరంగులను, కర్నూలులోని కొంత భాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. సోమనాద్రి విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.

Leave a Comment