TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 8th Lesson చెరువు Textbook Questions and Answers.

TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి. (TextBook Page No. 74)

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు 1

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి ?
జవాబు.
పై బొమ్మలో నాకు పెద్ద చెరువు కనిపిస్తున్నది. చెరువు గట్టున ఇండ్లు, చెట్లు, పర్వతాలు కనిపిస్తున్నాయి.

ప్రశ్న 2.
ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి ?
జవాబు.
చెరువులు ప్రజల నీటి అవసరాలను తీరుస్తాయి. పశువుల దాహాన్ని తీరుస్తాయి. తీవ్ర కరవు పరిస్థితులలో కూడా ఏదో ఒక పంటను కొంతమేర పండించుకోడానికి సహాయపడతాయి.

ప్రశ్న 3.
ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది ?
జవాబు.
ప్రస్తుతం చెరువులు ఎండిపోయి వాటిని పట్టించుకొనేవారే కరువయ్యారు. చెరువులలో పూడిక తీయడం. మరమ్మతులు చేయడం సక్రమంగా జరగడం లేదు. ప్రజలు కూడా చెరువు భూమిని ఇండ్ల నిర్మాణానికో, వ్యవసాయానికో ఉపయోగిం చడం ప్రారంభించారు.

ప్రశ్న 4.
చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి.
జవాబు.
చెరువులు అవసరమైన సమయంలో పొలాలకు నీరందించి సారవంతం చేస్తాయి. వర్షాలు అధికంగా పడినపుడు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. చెరువులు నదుల వరదలను నివారించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడతాయి.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 77)

ప్రశ్న 1.
‘మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవి కెక్కుతాయి.’ అనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు.
ఒకరు చెప్పే విషయం మనం శ్రద్ధగా వినాలంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే అవతలివారు ఎంత చెప్పినా మన మనసుకెక్కవు. కాబట్టి ‘మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి’ అనడంలో ఆంతర్యం ఇదే.

ప్రశ్న 2.
భూగర్భజలానికి నేను ‘శ్రీరామరక్ష’ అని చెరువు అనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు.
భూగర్భంలో జలం ఉంటేనే వ్యవసాయ బావులు కాని, ఊరిలోని మంచినీళ్ళ బావులు కాని కళకళలాడేది. అలాంటి భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడేవి చెరువులు. అందువల్ల “భూగర్భజలానికి నేను శ్రీరామరక్ష అని చెరువు అన్నది.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 79)

ప్రశ్న 1.
‘రామసక్కని’ దృశ్యం చెరువు దగ్గర ఏయే సందర్భాలలో కనిపిస్తుంది ?
జవాబు.
పిల్లలు బోకె పెంకలను తీసుకొని చెరువు నీటిపై విసిరినపుడు, చెరువు అలుగు పారినపుడు ‘రామసక్కని’ దృశ్యం కనిపిస్తుంది.

ప్రశ్న 2.
చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగింది. ఎందుకు ?
జవాబు.
చెరువులో నీటిని నిల్వ చేయాలంటే ఎంతో శ్రమపడాలి. చెరువు పూడికను తీయాలి. చెరువు కట్టకు గండి లేకుండా చూసుకోవాలి. శ్రమజీవులు. చెమట కారుతున్నా లెక్కచేయక చెరువు నీటి నిల్వకోసం కష్టపడి పనిచేస్తారు. అందుకే చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగింది.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 80)

ప్రశ్న 1.
చెరువులు కలుషితం కాకుండా ఉండాలంటే మనమేం చెయ్యాలి ?
జవాబు.
చెరువులు కలుషితం కాకుండా ఉండాలంటే మనం పొలాల్లో రసాయనిక ఎరువులు వాడకూడదు. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థపదార్థాలు చెఱువు నీటిలో కలవకుండా చూడాలి. ప్లాస్టిక్ వంటి వ్యర్థపదార్థాలు చెరువుల్లో పడవేయకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, రసాయనిక రంగులతో తయారుచేసిన వినాయక మూర్తుల వంటివి చెరువుల్లో నిమజ్జనం చేయ
కూడదు.

ప్రశ్న 2.
‘చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి’ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
పూర్వకాలంలో రాజులు చెరువుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించారు. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించారు. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాలచెరువు, లక్నవరం చెరువు నేటికీ చెక్కుచెదరలేదు. మంథనిలో ‘శిల సముద్రం’ అని చెరువుంది. వనపర్తి రాజులు చెరువులకు “సప్త సముద్రాలు” అని పేరు పెట్టుకున్నారు. దీన్నిబట్టి ‘చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి’ అని చెప్పవచ్చు.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
బడిలో ఉపన్యాసపోటీ నిర్వహిస్తున్నారు. మీరు కింది అంశాల్లో దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో దాని గురించి చెప్పండి.
అ) చెరువులే జీవనాధారం
ఆ) చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత
ఇ) చెరువులు మన సంస్కృతి కేంద్రాలు
జవాబు.
అ) చెరువులే జీవనాధారం :
‘నీరే ప్రాణాధారం’ అన్నాడు ఒక కవి. అన్నిటికీ నీరు కావలసిందే. “నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు” ఉండాల్సిందే. చెరువు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందిస్తుంది. చెరువుల వల్లనే వ్యవసాయ బావులు, ఊరిలోని మంచినీళ్ళ బావులు కళకళలాడుతాయి. తీవ్ర కరవు పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంటను కొంతమేరకు పండించుకోడానికి చెరువులు సహాయపడతాయి. ‘అన్ని వృత్తులూ కొనసాగడానికి ఆధారం చెరువులే. కాబట్టి చెరువులే జీవనాధారమని చెప్పవచ్చు.

ఆ) చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత :
చెరువులు ప్రజావసరాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్షి, మృగ కీటకాలకు నివాసాలు. వృత్తులకు ఉనికిపట్టు. తాగునీటికి, సాగునీటికి చెరువులే ఆధారం. “నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు” అన్నారు. చెరువు నీరే కాదు, ఒండ్రుమట్టి కూడా ఎంతో సారవంతమైనది.

వానాకాలంలో చెరువులు నిండి పంటలు పండటానికి సహాయపడతాయి. వెన్నెల కాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మనల్ని పరవశింపజేస్తాయి. ఎండాకాలంలో మత్స్యకారులు ఆర్థికబలాన్ని పెంచుతాయి. ఈ విధంగా ఎందరికో ఎన్నో విధాల సహాయపడే చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత.

ఇ) చెరువులు మన సంస్కృతి కేంద్రాలు :
చెరువుది సంస్కృతితో ముడివడ్డ జీవితం. కళలు, పండుగలు, వినోదాలు మొదలైనవి సంస్కృతిలో భాగాలే. చెరువు కళలకు ప్రేరణ. పండుగలకు కాణాచి. వినోదాన్ని పంచే వేదిక. సంస్కృతిని ప్రతిబింబించే అద్దం.

బతుకమ్మ పండుగకు చెరువు వైభోగం ఇంతింతనరానిది. చెరువులోని అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులను చెరువు ఒడిలోకే చేరుస్తారు. చెరువుకు ఎట్లాంటి నష్టం కలుగవద్దని కట్ట మైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. కవులు, గాయకులు, కళాకారులు తమ ఆటపాటలతో చెరువుకు సంతోషాన్ని కలుగజేస్తారు. ఈ విధంగా చెరువులు మన సంస్కృతి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
పాఠంలోని 4, 8, 14, 20 పేరాలు చదివి, వాటికి శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని 4, 5 కీలకపదాలు రాయండి.
జవాబు.
4వ పేరా ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గువోయాలె. నాకట్ట గట్టివడ్డంకనే ఇండ్లగోడలు పైకి లేస్తయి. “నీరే ప్రాణాధార” మన్నడు ఒక కవి. అన్నిటికీ నీరు కావలసిందే కదా ! “నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు” ఉండవల్సిందే. నీరు లేక ఊరు ఎట్ల బతుకుతది ? మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు తాగునీరు, పంటపొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావులేకాదు ఊరిలోని మంచినీళ్ళ బావులు కూడా కళకళలాడేది నావల్లే. భూగర్భజలానికి నేను శ్రీరామరక్ష. నేనుంటే వండిన కుండున్నట్లే.
శీర్షిక : ‘నీరే ప్రాణాధారం’
కీలకపదాలు : తాగునీరు, సాగునీరు, భూగర్భజలం, శ్రీరామరక్ష.

8వ పేరా : కవులు, కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో ! కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంత చైతన్యం ! ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలేసుకుంట. ఎందరో చిత్రకారులు నా దృశ్యాలను చిత్రించి భేషనిపించుకున్నారు. భజనబృందాలు, కోలాటాల గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బడిముబ్బడి చేస్తరు.
శీర్షిక : ‘కవులు – కళాకారులు’
కీలకపదాలు : కవులు, కళాకారులు, చైతన్యం, ఆనందం.

14వ పేరా : నాకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డారు? మనసున్నవారికి నా నీళ్ళు శ్రమజీవుల చెమట తీరుగ కనిపిస్తయి. నా నీళ్ళను తమ పొలాలకు పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమైతరు రైతులు. నాకు గండిపడినప్పుడు కలిసికట్టుగా కష్టపడి నన్ను బాగుచేస్తరు. ఈ ఐకమత్యమే నేను కోరుకునేది. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్నారు కదా! మన పెద్దలు.
శీర్షిక: ‘ఐకమత్యం’
కీలకపదాలు : ప్రాణప్రతిష్ఠ, శ్రమజీవులు, కలిసికట్టుగ, ఐకమత్యం.

20వ పేరా : కాలమేదైనా, నాకేమైనా మీకొరకే జీవిస్తున్నా. వానకాలంలో నేను నిండి, పంటలు పండటానికి సహాయపడుతున్న. నా నీళ్ళనే కాదు మీకళ్ళకు, మనసుకు ఆనందాన్నీ పంచుతున్న. వెన్నెలకాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్ములను పరవశింపజేస్తున్న. ఎండాకాలంలో మత్స్యకారులు ఆర్థికబలాన్ని పెంచుతున్న. ఇంతగా మీకు సహాయపడే నన్ను చిన్నచూపు చూడడం న్యాయమా ? ఇప్పటికైనా మీకు సోయిరావాలె. నన్ను రక్షించడమంటే మిమ్ములను మీరు రక్షించుకోవడమే. అందుకే చివరిగా మీ గదువవట్టి చెపుతున్న ! చెట్లను పెంచండి. తద్వారా వర్షాలను ఆహ్వానించండి. నేను నిండేటట్లు మీ బతుకు పండేటట్లు చూసుకొండి.
శీర్షిక : ‘జల సంరక్షణ’
కీలకపదాలు : వానకాలం, వెన్నెలకాలం, ఎండాకాలం, సోయిరావాలె.

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు రాయండి.

నేలపై కురిసే వర్షం నిలువ చేయడానికి అనువైన చెరువులు, కుంటలు, ఆనకట్టలు లేకపోవడం వల్ల మనకు వర్షపు నీరు ఉపయోగపడకుండా వృథాగా సముద్రంలోకి పోతున్నది. చెరువుల పునర్నిర్మాణం ప్రజల మనుగడతో ముడిపడిన కీలకాంశం. ప్రకృతి ప్రసాదంగా మన ప్రాంతంలో ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి, వాటికి పూర్వవైభవం తెచ్చే పనిని ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రభుత్వం స్వీకరించింది.

రాజుల కాలంలో తవ్వించిన చెరువులే ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారం. నీటి లభ్యత కొరవడకుండా చూసుకోవడం ప్రతి తరం బాధ్యత. స్థానిక ప్రజలను నీటిని పరిరక్షించటంలో భాగస్వాములను చేయాలి. నీటికొరత ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. చెరువులు, నదుల, భూగర్భవనరుల నుంచి మనం తోడే ప్రతి లీటరు నీటికి రెట్టింపు ప్రయోజనం కలిగేటట్లు వ్యవహరించాలి.
జవాబు.

ప్రశ్నలు :

  1. వర్షపు నీరు ఎందుకని వృథాగా సముద్రంలోకి పోతున్నది ?
  2. ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రభుత్వం ఏమి స్వీకరించింది ?
  3. తెలంగాణలో జీవనాధారం ఏది ?
  4. నీటిని పరిరక్షించటంలో ఎవరిని భాగస్వాములను చేయాలి ?
  5. నీటికొరత దేన్ని దెబ్బతీస్తుంది ?

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి ? నిండుగా ఉండడానికి మనం ఏం చేయాలి ?
జవాబు.
చెరువులు వానకాలంలో నిండుగా ఉంటాయి. చెరువులు నిండుగా ఉండటానికి నేలపై కురిసే వర్షపు నీరు నిలువ చేసుకోవాలి. చెరువులకు గండిపడకుండా చూసుకోవాలి. వంకలు, వాగుల ద్వారా కిందికి ప్రవహించే నీటిని, వర్షపు నీటిని చెరువులలోకి మళ్లించడం ద్వారా చెరువులు నిండుగా ఉంటాయి.

ఆ) ‘ చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళలో వెలుగులు ఎందుకు వస్తాయి ?
జవాబు.
చెరువుల అలుగులు పారినప్పుడు నీరు ఉరకలు వేస్తూ ముందుకు సాగుతుంది. ఆ నీరు కాలువల ద్వారా పంట పొలాలకు వ్యాపిస్తుంది. పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే కావలసినంత ఆదాయం లభిస్తుంది. అప్పుడు తమ జీవితాలు సుఖంగా గడుస్తాయి. అందువల్ల చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళలో వెలుగులు వస్తాయి.

ఇ) ` మీ ఊరి చెరువు కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి?
జవాబు.
చెరువులకు చుట్టుపక్కల గల పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థపదార్థాలు చెరువు నీటిలో కలువకుండా చూడాలి. ప్లాస్టిక్ వంటి వ్యర్థపదార్థాలు చెరువుల్లో పడవేయరాదు. చెరువుల్లో బట్టలు ఉతకరాదు. పశువులను కడుగరాదు. రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయరాదు.

ఈ) చెరువుల వలన కలుగు లాభాలను రాయండి.
జవాబు.
చెరువుల వలన మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు తాగునీరు, పంటపొలాలకు సాగునీరు లభిస్తుంది. చెరువు నీరే కాదు మట్టికూడా మనకెంతగానో ఉపయోగపడుతుంది. చెరువులోని ఒండ్రుమట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువు. దీనిని రైతులు పొలాలకు తోలుకుంటారు. ఇందులో ఔషధ గుణాలున్నాయి. చెరువు ఒండ్రుమట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మాయమైపోతాయి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు తాగునీరు, పంటపొలాలకు సాగునీరు అందించేది చెరువులే. వ్యవసాయ బావులు, మంచినీటి బావులు కళకళలాడాలంటే చెరువుల నిండా నీరుండాలి. భూగర్భజలానికి చెరువే శ్రీరామరక్ష.

గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యవసాయానికి ఆధారం చెరువులే. చెరువులు నిండితే ప్రజల కడుపులు నిండుతాయి. అవి ఎండితే ప్రజల కడుపులు ఎండుతాయి. చెరువులు నిండాలంటే వానలు కురవాలి. వానలు కురిసి చెరువులు నిండితే మన బతుకులు పండుతాయి. అపుడు గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

IV. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
చెరువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయండి.
జవాబు.

చెరువు

ఓ చెరువా !
సమాజానికి కల్పతరువు నీవు
వ్యవసాయానికి ప్రధాన వనరు నీవు
వినోదాన్ని పంచే వేదిక నీవు
సంస్కృతిని ప్రతిబింబించే అద్దానివి నీవు

ఓ చెరువా !
సకల ప్రాణికోటిని సమాదరించే సమతా కేంద్రానివి నీవు
తరతరాల చరిత్రకు మౌనసాక్షివి నీవు
నీ కడుపు నిండేటట్లు చేస్తే
మా బతుకులు పండేటట్లు చేస్తావు.

(లేదా)
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా ‘చెరువు’ మాట్లాడుతున్నట్లుగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు.
ఉపాధ్యాయుని సూచనలను పాటించండి.

V. పదజాల వినియోగం.

1. కింది పదాలు, వాక్యాలు చదువండి.

చెవినిల్లు గట్టుకొని
ఉర్కబోయి బోర్లపడ్డట్టు
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
కుండబద్దలుకొట్టినట్లు
వండినకుండ
గాలం వేయడం
గుండెచెరువైంది
తామరతంపర
కన్నెర్ర
పై వాటిలో ఉన్న తేడాలు ఏమిటి ? వాటిని ఏమంటారు ?
జవాబు.
జాతీయం : ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది.
ఉదా : చెవినిల్లుగట్టుకొని, గుండెచెరువైంది.
సామెత : సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా
ఉంటాయి.
ఉదా : కుండబద్దలు కొట్టినట్లు; ఉర్కబోయి బోర్లపడ్డట్టు.

ప్రశ్న 2.
కింది వాటిలోని జాతీయాలను గుర్తించండి. వాటిని ఏ అర్థంలో వాడుతారో తెలుపండి.
కోరిక
పండ్లుకొరుకు
కొట్టినపిండి

మొసలికన్నీరు
మాధుర్యం
తలలో నాలుక

కలుగు
పూసల్లో దారము
చెరువు

నిండుకుండోలె
జాతర
చల్లగాలి
జవాబు.
1. మొసలికన్నీరు : లేని బాధ ఉన్నట్లు నటించే సమయంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
2. నిండుకుండోలె : గంభీరంగా ఉండే విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
3. పండ్లుకొరుకు : ‘కసితో ఉండు’ లేదా ‘కక్ష కలిగి ఉండు’ విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
4. పూసల్లో దారము : ‘బయటికి కనిపించకుండా’ లేదా ‘అంతర్లీనంగా’ అనే విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
5. కొట్టినపిండి : ‘బాగా తెలిసిన విషయం’ అని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
6. తలలో నాలుక : ‘మిక్కిలి అణకువ కలిగి ఉండడం’ అనే విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : విద్య = వి, + ద్ + య్ + అ
అ) అక్క = అ, + క్ + క్ + అ
ఆ) ముగ్ధ = మూ + గ్ + ధ్ + అ
ఇ) మూర్ఛ = మూ, + ర్ + ఛ్ + అ

కింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి.

అ. ఇప్పటికైనా జాగ్రత్తపడుతారని ఆశ.
ఆ. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధిచెందుతుంది.
ఇ. అవి ఎక్కడుంటాయో తెలియదు.

పై వాక్యాల్లో ఇప్పటికైనా అనే మాటలో – మొదటిపదం – ఇప్పటికి, రెండవపదం – ఐనా
నీళ్ళెంత అనే మాటలో – మొదటిపదం – నీళ్ళు, రెండవపదం – ఎంత
ఎక్కడుంటాయో అనే మాటలో మొదటిపడం – ఎక్కడ, రెండవపడం – ఉంటాయో
పై వాటిని ఇట్లా విడదీయవచ్చు.

ఇప్పటికైనా = ఇప్పటికి + ఐనా
నీళ్ళెంత = నీళ్ళు + ఎంత
ఎక్కడుంటాయో = ఎక్కడ + ఉంటాయో
ఇట్లా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు.

2. కింది పదాలను విడదీసి రాయండి.

అ. ప్రజలెంత = _________ + _________
జవాబు.
ప్రజలు + ఎంత – ఉత్వసంధి

ఆ. నేనెవరిని = _________ + _________
జవాబు.
నేను + ఎవరిని – ఉత్వసంధి

ఇ. పోరేమిటి = _________ + _________
జవాబు.
పోరు + ఏమిటి – ఉత్వసంధి

ఈ. నాకింకా = _________ + _________
జవాబు.
నాకు + ఇంకా – ఉత్వ సంధి

ఉ. ఇవన్నీ = _________ + _________
జవాబు.
ఇవి + అన్నీ – ఇత్వ సంధి

ఊ. సోమనాద్రి = _________ + _________
జవాబు.
సోమన + అద్రి – సవర్ణదీర్ఘ సంధి

ప్రాజెక్టు పని:

ప్రశ్న .
వివిధ పత్రికల్లో వచ్చిన (పర్యావరణ) ప్రకృతిని వర్ణించే గేయాలు/వ్యాసం/కవితలను సేకరించండి. నివేదిక రాసి తరగతి గదిలో చదివి వినిపించండి.
జవాబు.
విద్యార్థి కృత్యం

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

TS 6th Class Telugu 8th Lesson Important Questions చెరువు

I. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
కింది కవితను చదవండి. భావం రాయండి.

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట
ఎంత పరిమళమోయి ఈ తోటపూలు
ఏ నందనము నుండి ఈనారు తెచ్చిరో !
ఏ స్వర్నదీ జలములీ మడుల కెత్తిరో
ఇంత వింతల జాతులీ తోటలో పెరుగు !
ఈ తోట యేపులో నింత నవకము విరియు.
జవాబు.
భావం :
తెలుగు తోట చాలా బాగుంది. తెలుగు తోటలోని పూలు (కావ్యాలు) సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈ మొక్కలు నందన వనం నుండి తెచ్చారేమో ! ఆకాశగంగా జలంతో ఈ మొక్కలను పెంచారో ? చాలారకాల జాతుల మొక్కలు ఈ తోటలో పెరుగుతున్నాయి. చాలా బలంగా పెరుగుతోంది ఈ తెలుగుతోట.

2. కింది పేరా చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

వ్యవసాయభూముల్ని ఎలా ఉపయోగించుకుంటామో జీవనోపాధికోసం బీడు భూముల్ని కూడా ఒక క పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలూ ఉన్నాయి. గుజరాత్లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తికులాల వాళ్ళు అనేకమంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇచ్చే పెత్తందారులకు, దళారులకు, కులపెద్దలకు లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది.

ప్రశ్న 1.
గుజరాత్లోని ప్రయోగం పేరేమిటి ?
జవాబు.
గుజరాత్లోని ప్రయోగం పేరు అముల్.

ప్రశ్న 2.
వృత్తికులాల వాళ్ళేమి మార్చుకుంటారు ?
జవాబు.
తమ వృత్తులు మార్చుకొంటారు.

ప్రశ్న 3.
పేదవారికి ఏమి కావాలి ?
జవాబు.
పేదవారికి తిండి కావాలి.

ప్రశ్న 4.
పేదలను ఏ విషయంలో చైతన్యపరచాలి ?
జవాబు.
భూములు లీజుకు తీసుకొనే విషయంలోనూ, విద్యా వైద్య సౌకర్యాల విషయంలో పేదలను చైతన్యపరచాలి.

ప్రశ్న 5.
వ్యవసాయభూములను దేనికి ఉపయోగించుకొంటాం ?
జవాబు.
వ్యవసాయ భూములను వ్యవసాయానికి ఉపయోగించుకొంటాం.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘చెరువును సమాజానికి కల్పతరువు’ అనడాన్ని సమర్థించండి.
జవాబు.
కల్పతరువు దేవతావృక్షం. కోరిన కోరికలు తీరుస్తుంది. అన్నిటినీ ప్రసాదిస్తుంది. కల్పతరువును ఆశ్రయిస్తే దేనికీ లోటుండదు. చెరువు కూడా సమాజానికి తాగడానికి, అవసరాలు తీర్చుకొనేందుకు నీరునిస్తుంది. వ్యవసాయానికి నీరివ్వడం వలన సమాజానికి ఆహారం అందిస్తోంది. ఆ పంటను అమ్ముకొంటే డబ్బు వస్తుంది. అంటే సంపదనిస్తోంది. డబ్బుంటే సమస్త వైభవాలు అనుభవించవచ్చు కదా ! అంటే సమాజానికి భోగభాగ్యాలను చెరువు కల్పిస్తోంది. అందుచేత చెరువును సమాజానికి కల్పతరువన్నారు.

ఆ) నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు’ అన్న కవి మాటలలోని అంతరార్థమేమిటి ?
జవాబు.
తరువు అంటే చెట్టు, చెట్టు మనకు నీడనిస్తుంది. ఆకులు రాలిపోయి, ఎండిపోయినా, ఇంటికి కలప రూపంలో ఉపయోగపడుతుంది. ఆ విధంగా శాశ్వతమైన నీడను ఇస్తుంది.
కాని, ఎన్నోరకాలుగా మనకుపయోగపడే చెట్టు పెరగాలంటే నీరు కావాలి. ఆ నీటిని నిలువచేసేది చెరువు. కాలువలలో నీరు నిలబడదు. అది ప్రవహించేటపుడే ఉపయోగించుకోవాలి. కానీ చెరువు మాత్రం నీటిని నిలువ ఉంచుతుంది. మనకు అవసరమైనపుడు ఉపయోగపడుతుంది. అందుచేత కవిగారు ‘నిలువ నీడకై తరువు, నిలవ నీటికై చెరువు’ అన్నారు.

ఇ) ‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే వివరించండి.
జవాబు.
అతి అంటే మితిమీరడం అని అర్థం. సర్వత్రం అంటే అన్ని విషయాల్లోనూ, వర్జయేత్ అంటే విడిచిపెట్టడం. అంటే ఎక్కువగా ఉండడం అనేది విడిచిపెట్టాలి. మితిమీరిన ప్రేమ పనికిరాదు. అలాగే మితిమీరిన ద్వేషం పనికిరాదు. మితిమీరిన మంచితనం పనికిరాదు. మితిమీరిన చెడ్డతనం పనికిరాదు.

చెరువంటే మనకు చాలా ఇష్టం. మన చెరువు కల్పతరువు వంటిదే, కాని మన చెరువే కదా ! ఈత కొడదామని చెరువులోకి దిగితే ప్రాణాలకు ప్రమాదం. చెరువులలో దిగడాన్ని విడిచిపెట్టాలి. అంటే చెర్లో దిగకూడదు. నీటితో, నిప్పుతో చెలగాటం ఆడితే ప్రమాదం. అతి సర్వత్ర వర్జయేత్ అంటే ఏ విషయంలోనూ హద్దుమీరకూడదు అని అర్థమయింది. 2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఎండాకాలంలో చెరువెలా ఉంటుంది? ఏమవుతుంది ?
జవాబు.
ఎండాకాలంలో చెరువులో నీరు తగ్గుతుంది. నీరు తగ్గినపుడు చెరువులోని కప్పలు, చేపలు మొదలైనవి చాలా ఇబ్బంది పడతాయి. ప్రజలకు, పక్షులకు, పశువులకు కూడా తాగడానికి నీరు దొరకదు. చాలా ఇబ్బంది పడతారు. చెరువులో నీరు లేకపోతే గ్రామంలో వాతావరణంలో వేడి పెరుగుతుంది. మొక్కల పెంపకానికి కూడా నీరు దొరకదు. ఎక్కడకో దూరంగా పోయి నీరు తెచ్చుకోవలసి వస్తుంది. చెరువులో తామరలు కూడా ఉండవు.

కలకలలాడిన చెరువు వెలవెలపోతూ కన్పిస్తుంది. నిండుకుండలా ఉండే చెరువు ఎండుమోడులా కన్పిస్తుంది. నిజానికి వేసవికాలంలోనే చెరువు నీటి అవసరం ఎక్కువ. కనుక వేసవిలో కూడా చెరువులో నీరుండేలా పంచాయితీ వారు చర్యలు తీసుకోవాలి.

ఆ) జల కాలుష్యం గురించి రాయండి. దానివల్ల ఏమవుతుంది ?
జవాబు.
చెరువులలో పూడిక తీయక చెరువు నీరు కలుషితం అవుతోంది. పొలాల్లో వాడే రసాయనిక ఎరువులు పొలాలకు వాడతారు. వర్షాలు వచ్చినపుడు ఆ ఎరువులు కలిసిన నీరు చెర్లోకి వెడుతుంది. చెరువు కలుషితం అవుతుంది. పశువులను చెరువులో కడిగితే చెరువు నీరు కలుషితం అవుతుంది. ఫ్యాక్టరీలు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థ పదార్థాలు చేరడం వల్ల కూడా చెరువు నీరు కలుషితం అవుతుంది. మురికినీరు చేరడం వల్ల కలుషితం అవుతుంది.

దానివల్ల భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. అవి తాగిన పశువులు, మనుషులు, పక్షులు వంటివి రోగాలు బారినపడతాయి. మరణిస్తాయి. ఆ నీటితో సాగుచేసిన కాయగూర్తలు మొదలైనవి కూడా విషతుల్యమౌతాయి. అందుకే చెరువు నీరు కలుషితం కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

III. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
చెరువు నీటిపై ఆధారపడిన పదబంధాలు, జాతీయాలు, సామెతలు రాయండి.
జవాబు.

  1. నీరే ప్రాణాధారం.
  2. నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు.
  3. చెరువు మట్టిని మించిన గట్టి వైద్యుడు లేడు.
  4. తామర తంపర.
  5. నీటికొలది తామర.
  6. కప్పల కచేరీ.
  7. చెరువెండితేనే చేపల రంగుతేలేది.
  8. చెర్లో బర్లను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు.
  9. గుండె చెరువైంది.
  10. గాలం వేయడం.
  11. గండికొట్టడం.
  12. గంగాళమంత ఉండేది తాంబాళమంతయింది.
  13. చెరువును పొమ్మనడమంటే కరవును రమ్మనడం.
  14. చెరవు మీద కోపం వచ్చి కడుక్కోవడం మానేసినట్లు.
  15.  కుండంత చెరువు కొండంత ఆసరా.
  16. మా తాతలు ఈదిన చెరువని నువ్వు దిగకు.

ప్రశ్న 2.
మీ గ్రామంలో బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారో వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

మంచిర్యాల,
x x x x x.

ప్రియ మిత్రుడు జస్వంత్కు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమమని తలుస్తాను. ఇటీవల జరిగిన బతుకమ్మ పండుగ మా ప్రాంతంలో ఆనందోత్సవాలతో జరుపుకున్నాం. దసరా పండుగ జరిగే దినాలకు రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. ఈ పండుగ తొమ్మిదిరోజులు జరుగుతుంది. తొమ్మిదో రోజు జరిపే పండుగలను సద్దులు అంటారు. రంగు రంగుల పూలను ముందుగా ముక్కోణపు ఆకారంలో నిలువుగా పేర్చుతారు. ఆ పువ్వులపైన గౌరమ్మ బొమ్మను భద్రంగా పెడతారు. ఆ పువ్వుల పళ్ళాన్ని వాకిట ముందుంచి స్త్రీలు, బాలికలు చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాడతారు. చివరిరోజున కూడా బతుకమ్మకు అలంకారాలు చేసి, ప్రత్యేక వంటకాలు, సద్దులతో చెరువు వద్దకు వెళ్ళి పాటలు పాడుతూ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

ఈ పండుగనే పూబోడుల పండుగ అంటారు. అంటే మహిళల పండుగ అని అర్థం. మీరు ఈ పండుగను ఎలా చేసుకున్నారో ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
సి.హెచ్. కౌశిక్.

చిరునామా :
కె. జస్వంత్,
S/o ఫణిరామ్,
జూబ్లిహిల్స్,
హైదరాబాద్.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

IV. భాషాంశాలు.

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
బ్రధ్న – పొద్దు
ఆహారము – ఓగిరము
ప్రాణము – పానము
చతుర్థి – చవితి
ఆకాశం – ఆకసం
శిఖ – సిగ
నీరము – నీరు
పక్షి – పక్కి
శక్తి – సత్తి
పద్యము – పద్దెము
పశువు – పసరము
భూమి – బూమి

వ్యతిరేకపదాలు:

ఆధారం x నిరాధారం
ప్రత్యక్షం x పరోక్షం
నష్టం x లాభం
వెలుగు x చీకటి
ప్రయత్నం x అప్రయత్నం
ఆదాయం x వ్యయం
ప్రధానం x అప్రధానం
కష్టం x సులభం
ఆనందం x విచారం
నవ్వు x ఏడుపు
సుఖం x దుఃఖం
ఉదయం x సాయంత్రం

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

సమాసాలు:

సమాసపదం విగ్రహ వాక్యం సమాస నామం
ఆటపాటలు ఆటలూ, పాటలూ ద్వంద్వ సమాసం
ఆటస్థలం ఆటల కోసం స్థలం చతుర్థీ తత్పురుష
చేపల వేట చేపల కోసం వేట చతుర్థీ తత్పురుష
సాగునీరు సాగు కోసం నీరు చతుర్థీ తత్పురుష
తరతరాల చరిత్ర తరతరాల యొక్క చరిత్ర షష్ఠి తత్పురుష
సప్త సముద్రాలు సప్తసంఖ్య గల సముద్రాలు ద్విగు సమాసం

పర్యాయపదాలు:

ఊత : ఆసరా, అండ
చైతన్యం : తెలివి, జ్ఞానం
పోరు : పీడ, బాధ
స్వస్తి : ముగింపు, వదలి, మాని

నానార్థాలు:

ఎరుక = పరిచయం, తెలివి
పోరు = యుద్ధం, పీడ
గండి = రంధ్రం, పగులు
భాగ్యం = అదృష్టం, సంపద

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
చైతన్యం = _________
జవాబు.
చైతన్యం = తెలివి, జ్ఞానం
మద్యం విషయంలో ప్రజలు చైతన్యవంతులు కావాలి.

ప్రశ్న 2.
జాతర = _________
జవాబు.
జాతర = ఉత్సవం
మేడారం జాతరకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తారు.

ప్రశ్న 3.
సహనం = _________
జవాబు.
సహనం = ఓర్పు
మన దేశంలో కుటుంబ వ్యవస్థ ద్వారా శాంతి, సహనం నేర్చుకుంటాము.

వ్యాకరణాంశాలు:

భాషాభాగాలు గుర్తించండి.

ప్రశ్న 1.
పొలాల్లో రసాయనిక ఎరువులు వాడరాదు.
జవాబు.
క్రియ

ప్రశ్న 2.
మైసమ్మను పూజిస్తారు.
జవాబు.
నామవాచకం

ప్రశ్న 3.
కాకరకాయ చేదు.
జవాబు.
విశేషణం

వాక్యాలు గుర్తించండి.

ప్రశ్న 1.
రాము ఇంటికి వెళ్ళి, అమ్మకు సాయం చేశాడు – ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 2.
కమల పాట పాడి, నాట్యం చేసింది ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 3.
రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఏ వాక్యం ?
జవాబు.
సంయుక్త వాక్యం

ప్రశ్న 4.
పూర్వం పెద్ద చెరువులను సముద్రాలు అనేవారు. వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.
జవాబు.
పూర్వం పెద్ద చెరువులను సముద్రాలు అనేవారు కాదు.

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

కింది వానిని గుర్తించండి.

ప్రశ్న 1.
వర్గయుక్కులు ( )
అ) క చ ట త ప
ఆ) ఘ ఝ ఢ ధ భ
ఇ) గ జ డ ద బ
ఈ) అ ఆ ఇ ఈ
జవాబు.
ఆ) ఘ ఝ ఢ ధ భ

ప్రశ్న 2.
అంతస్థాలు ( )
అ) య ర ల వ
ఆ) శ ష స హ
ఇ) ఋ, ౠ
ఈ) ఙ ఞ ణ న మ
జవాబు.
అ) య ర ల వ

ప్రశ్న 3.
అనునాసికాలు ( )
అ) అ నుండి ఔ
ఆ) క ఖ గ ఘ
ఇ) ఙ ఞ ణ న మ
ఈ) ఏదీకాదు
జవాబు.
ఇ) ఙ ఞ ణ న మ

ప్రశ్న 4.
బహువచనం ( )
అ) రాజుగారు
ఆ) సమూహం
ఇ) జనం
ఈ) మేము
జవాబు.
ఈ) మేము

ప్రశ్న 5.
పుంలింగం ( )
అ) శివుడు
ఆ) రమ
ఇ) రాణి
ఈ) ఎద్దు
జవాబు.
అ) శివుడు

ప్రశ్న 6.
వ్యతిరేకార్థం ( )
అ) అవును
ఆ) నిజమే
ఇ) ఎందుకు
ఈ) చేయను
జవాబు.
ఈ) చేయను

సంబంధం లేని పదాలు గుర్తించండి.

ప్రశ్న 1.
సంతోషం, ఆనందం, సులభం, నవ్వు
జవాబు.
సులభం

ప్రశ్న 2.
ఉదయం, ఋతువు, మధ్యాహ్నం, రాత్రి
జవాబు.
ఋతువు

ప్రశ్న 3.
సమీరం, సముద్రం, సాగరం, అబ్ధి
జవాబు.
సమీరం

ప్రశ్న 4.
పట్టణం, నగరం, పల్లె, నది
జవాబు.
నది

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

పదాలు – అర్థాలు:

I.

స్పర్శ = తాకుట
స్వస్తిపలుకు = ముగింపు చెప్పు, మానుకొను, వదలివేయు
బిరబిర = అతి త్వరగా
కల్పతరువు = కల్పవృక్షం, అడిగినది లేదనకుండా ఇచ్చేది, దేవతా వృక్షం
ఉత్పాదకం = కలిగించునది
ఊత = ఆసరా, అండ
వనరు = సొత్తు
సమత = సమత్వం
పరోపకారం = ఇతరులకు మేలు
పోరు = పీడ, బాధ
చెవికెక్కు = వినపడు
తరువు = చెట్టు
మత్స్యకారులు = చేపలు పట్టేవాళ్ళు
ప్రత్యక్షం = కంటికి గోచరమైనది
పరోక్షం = కంటియెదుట లేనిది
ఎరుక = పరిచయం, తెలివి
మటుమాయం = అదృశ్యం
ముక్కునవేలేసుకొను = ఆశ్చర్యపోవు
ముడివడ్డ = పెనగొన్న, అతిశయించిన
సింగారించిన = అలంకరించిన
విరాటపర్వం = భారతంలోని 18 పర్వాలలో ఒకటి
చైతన్యం = తెలివి, జ్ఞానం
మహిళలు = స్త్రీలు
ఇబ్బడిముబ్బడి = అధికం, ఎక్కువ
“పరోపకారార్థమిదం శరీరమ్” = పరోపకారం కొరకే యీ శరీరం

II.

బోకెపెంకులు = కుండపెంకులు
దుంకుతూ = దూకుతూ
ఒడుపు = ఉపాయం
అతిసర్వత్రవర్జయేత్ = అంతటను అతిని విడిచిపెట్టాలి (శక్తికి మించిన దాన్ని విడిచి పెట్టాలి)
చెవినిల్లుగట్టుకొని చెప్పటం = ఎప్పుడూ అదే పనిగా చెప్పటం
జాతర = శక్తి ఉత్సవం
నవ్వులపాలౌట = అప్రతిష్ఠపాలగుట
అలుగు పారు = అధికంగా ప్రవహించు
సిగ = జుట్టు
తామర తంపర = సమృద్ధి, తామరవలే వృత్తిగా నుండుట

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడే బంధువులు వత్తురది యెట్లన్నన్
తెప్పలుగ చెరువునిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ !

అర్థాలు :

సుమతీ = మంచిబుద్ధి గలవాడా !
ఎప్పుడు = ఏ సమయమందు
సంపద = భాగ్యము
కలిగినన్ = కలుగునో
అప్పుడె = ఆ సమయముననె
బంధువులు చుట్టములు
వత్తురు = వచ్చెదరు
అది + ఎట్లన్నన్ = అది ఎట్లాగంటే
తెప్పలుగన్ = తెప్పలు తేలునట్లు, పుష్కలంగా
చెరువు = చెరువు
నిండినన్ = నీటితో నిండగా
కప్పలు పదివేలు = లెక్కలేనన్ని కప్పలు
చేరున్ కదరా = చేరును కదరా

భావం:
సుమతీ ! చెఱువులో నిండుగా నీళ్ళు ఉన్నట్లయితే కప్పలు చాలా చేరుతాయి. అదేవిధంగా ఎప్పుడు సంపదలు కలిగితే అప్పుడే చుట్టాలు వస్తారు.

గుండె చెరువగు = మిక్కిలి బాధపడు
గాలం వేయడం = దొరకపుచ్చుకోవాలనే ప్రయత్నం
గండికొట్టడం = ఆటంకపరచడం
గాలిస్పర్శ = గాలి తగలడం
పిచ్చాపాటి = కాలక్షేపం కబుర్లు
ఉభయతారకంగ = ఇద్దరికీ ప్రయోజనంగా
సహనం = ఓర
గుట్టు = రహస్యం
గండి = రంధ్రం, పగులు

III.

గంగాళం = లోహంతో చేయబడిన మూతి వెడల్పైన నీళ్ళపాత్ర
తాంబాళం = లోహంతో చేయబడిన పెద్దపళ్ళెం లేక తట్ట
విలవిలలాడు = గిజగిజలాడు
నానాటికి తీసికట్టు నాగంబొట్లు = రోజురోజుకు తగ్గిపోవడం
గండం = అపాయం
కండ్లలో నిప్పులు వోసుకోడం = మండిపడటం, చూసి ఓర్వలేక ఈర్ష్యతో ఉండడం
కలుషితం చేయు = మురికి చేయు
అనిత్యాని శరీరాణి = శరీరాలు అశాశ్వతమైనవి.
మనుగడ = జీవనోపాయం
కన్నెర్ర చేయు = కోపపడు
శానతనం = ఆధిక్యం
సోయిరావాలె = మనసు అదుపులోకి రావాలి

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోను చెరువులున్నాయి. అవి ప్రజావసరాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు. వృత్తులకు ఉనికిపట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకొంటే అవి మనను సంరక్షిస్తాయని తెల్పడము, తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలుపడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటివారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమపురుష కథనంలో ఉంటుంది.

ప్రవేశిక:

నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును. వ్యవసాయానికి ప్రధాన వనరును. బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకునిమ్మని నాలో చేర్చుకుంటాను. “మళ్ళీ రా ! వినాయకా” అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆటవిడుపును. పశుపక్ష్యాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకూ నేనెవరో చెప్పులేదు కదా ! పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును. నా హృదయాంతరంగ భావాన్ని చెబుతా వినండి ….

TS 6th Class Telugu Guide 8th Lesson చెరువు

నేనివి చేయగలనా?

  • చెరువు గురించి మాట్లాడగలను. – అవును/ కాదు
  • అపరిచితమైన పేరాను చదివి ప్రశ్నలు తయారుచేయగలను. – అవును/ కాదు
  • చెరువుల అవసరాన్ని వివరిస్తూ రాయగలను. – అవును/ కాదు
  • ‘చెరువు’ ను ప్రశంసిస్తూ కవిత/పాట రాయగలను. – అవును/ కాదు

Leave a Comment